కాశీమజిలీకథలు/అయిదవ భాగము/53వ మజిలీ
మీరును జీవపరమాత్మ భేదమును దేవతాభేదమును విడిచి శుద్దాద్వైతబ్రహ్మోపాసనఁ జేయుడు. ముక్తులయ్యెదరని యుక్తియుక్తముగా నుపదేసించినఁ దెలిసికొని కాంచీతామ్రపర్ణీ దేశవాసులగు బ్రాహ్మణులెల్ల నద్వైతజ్ఞానభూయిష్ఠులైయొప్పిరి.
అట్లాచార్యవర్యుండు నిజపాదసేవాపరాయణులై నానాదేశములనుండి యరుదెంచిన బ్రాహ్మణుల సద్వైతజ్ఞానబోధచేఁ గృతార్థులంగావించి యచ్చటనుండి వేంకటాచలమున కరిగి యందు వేంకటేశ్వరునిచే నారాధించి పదంపడి విదర్భరాజధానికింజని కథకై శివకేశ్వరునిచే నర్చితుండై శిష్యులతోఁగూడ నప్పట్టణంబునఁ గొన్ని దినంబులు వసించెను.
శ్రీరస్తు
కాశీమజిలీ కథలు
53 వ మజిలీ
షష్ఠోల్లాసము
క్రకచుని కథ
గీ. మానవ కపాల మొకకేలఁ బూనిభూరి
శూలమింకొక కేలఁ దాల్పుచు శ్మశాన
భసితలిప్తాంగుఁడై జటాపటల మొప్పఁ
గ్రకచనామక కాపాలిక ప్రభుండు.
స్వతుల్యవేషులగు కాపాలికులు పెక్కండ్రు సేవింపఁ గర్ణాటదేశంబున నోలగంబుండి యొకనాఁ డాప్తులతో నిట్లు సంభాషించెను.
క్రకచుఁడు - వయస్యా ! విద్యుజ్జిహ్వ! శంకరుండను దాంభిక సన్యాసి గగనపుష్పసమానమగు క్రొతమత మొకటి కల్పించి యెల్లమతస్థులం బరిభవించుచు మిగుల జంఝాటముతో రామేశ్వరాది క్షేత్రములఁ దిరుచుగున్నాఁడని మనము వింటిమి గదా.
విద్యుజ్జిహ్వుఁడు — స్వామి! వినుటయే కాక వానిమీద దండెత్తుటకై యస్మన్మిత్రులగు క్షపణజైనబౌద్ధాదిమతస్థులకు వార్తలనంపి వారినందఱను రప్పించితిమి. వారందరు వానితోఁ బోరెప్పుడు గలుగునని యుఱ్రూటలూరుచున్నారు.
క్రకచుఁడు — ఆ మాయావి వృత్తాంత మరసి రమ్మని పంపిన కౌక్షేయకుఁ దరిగివచ్చెనా ?
విద్యు - ఇదిగో ! వాడిప్పుడే వచ్చెను. ఆ కథవినిపించుటకే వాని మీ యొద్దకుఁ దోడ్కొనివచ్చితిని. (అని వానిముందరికిఁ ద్రోయుచున్నాఁడు.)
క్రకచుఁడు —— కౌక్షేయకా ! యిప్పుడా కుక్షింభరి యెందున్నవాఁడు ? వానిచర్య లెట్లున్నవి? ఎవ్వరేని వానిం బరిభవించిరా ?
కౌక్షేయకుఁడు — స్వామి! దేవరగాక యాసన్న్యాసిని బరిభవించువాఁ డీపుడమిఁలేడు. వాని ప్రభుత్వము నిరాటంకముగా సాగుచున్నది. వినుండు నేను వానిఁ గాంచీపురంబులో నుండఁగలసికొంటి.
క్రకచకుఁడు — అచ్చటి విశేషములేమి?
గౌక్షేయ — చెప్పెద నాకర్ణింపుఁడు.
సీ. ఒకవంకలోక నాయకులోలి సకలంక
నుతిఁదత్పదార్చనా రతిభజింప
నొకచాయసువినేయ నికరమామ్నాయాంత
సంప్రదాయార్ధముల్ చర్చ సేయ
నొక క్రేవయుక్తి ప్రయుక్తులబద్ధులై
కుమతవాదులు తదంఘ్రులనుబఁడగ
నొకమూలమూల వాక్యోపదేశజ్ఞాత
తత్త్వులై జనులు నృత్యములు సేయ.
గీ. నందఱకు నెన్ని రూపులై యాత్మబోధ
నాచరింపుచు విప్ర సభాంతరమునఁ
బ్రమథ వితుఁడగు భావభవవిరోధి
కరణి నొప్పారి నప్పారికాంక్షియెపుడు.
దేవా ! యా సన్యాసి బ్రాహ్మణసభాంతరాళంబున వసించి యుపన్యసింపు చుండ నతనితేజము దుర్నిరీక్ష్యంబై యుండుఁగదా.
క్రకచుఁడు:— మూర్ఖా ! యీ స్తోత్రపాఠములు నాదగ్గరఁజేసెద వేమిటికి చాలు. చాలు. తరువాత నచ్చట నతండు గావించిన చర్యలం జెప్పుము. కౌక్షేయకు — చిత్తము. అతండా కాంచీపురంబున హరిహరులకు నద్భుతమైన యాలయప్రాకార మంటపాదులఁ గట్టించి యందందనేక భూసురసమాజముల నివసింపఁజేసెను.
క్రకచు - తరువాత.
కౌక్షెయ — పదివేలమంది శిష్యులతో నచ్చటినుండి కదలి వేంకటాచలమునకు వచ్చి యందు మూడుదినములుండి తరువాత విదర్భ రాజధానిం జేరిరి.
క్రకచు — ఓహో? మేకపిల్ల పులియున్న పొదదాపునకే వచ్చుచున్నదే. తరువాత తరువాత.
కౌక్షేయ — అయ్యతిశేఖరుండు సపరివారముగా నావిదర్భ నృపాలునిచే నర్చితుండై తద్దేశజనుల కామోదము గలుగఁజేయుచు నందుఁ బదిదినములు వసించెను.
క్రకచుఁడు — వానిదాంభికము చక్కగా సాగుచున్నదే. తరువాత తరువాత.
కౌక్షేయకు — అప్పుడు దేవరయౌద్ధత్యంబు శంకరుని కర్ణగోచరమగుటయు మన దేశమునకు రాఁ బ్రయాణమగుచున్న యతని యుద్యమము వారించుచు విదర్భ నృపాలుండు.
క్రకచుడు — ఏమి వాని సాహసము. రానిమ్ము. రానిమ్ము.
చ. అకట మదీయతాంత్రిక మహత్త్వము తెల్లముగాఁగ వాని మ
స్తకమురుశూలధారదళితంబుగఁ జేసి సురన్ ఘటించి యం
దకలుషప్రవృత్తిభైరవున కాహుతిగా నొనరింపఁకుండినన్
గ్రకచుఁడటంచు నన్బిలువ గాఁదగదింకిట మీరలెవ్వరున్.
కానిమ్మట్టితరి నా నృపాలుం డాబోడి సన్యాసితో నేమని చెప్పెను ?
కౌక్షేయకు — వినుండు.
ఉ. భైరవతంత్రపారగులు పాపమతుల్ దురితక్రియారతుల్
క్రూరులు బాలిశుల్కల హ కోవిదు లచ్చటివారు భీకరా
కారులు వేదదూషకులు గావున మీరటకేఁగరాదు తే
జోరహితుల్ యశస్కరులఁ జూచి సహింపరుగా ధరిత్రిలోన్.
క్రకచుఁడు — ఏమేమీ ! విదర్భ నృపాలుండు మనలఁ గ్రూరులగాను, తేజోరహితుల గాను వర్ణించి యాడాంబికుని నుత్తమునిగాఁ గొనియాడెనా ? కానిమ్ము! భైరవతంత్రప్రభావం బెరింగిన పిమ్మట నిట్లనఁడులే. తరువాత. తరువాత.
కౌక్షేయకు — ఆ మాటలు విని శంకరసన్యాసి యందొకవంక ధనుర్ధరుండై సేవించుచున్న సుధన్వుండను నృపాలు మొగముపరిక్షించెను.
క్రకచ్చు - ఆ మహావీరుండతని సహాయుండా యేమి ? కౌక్షేయకుఁడు — అగుంగాబోలు. వినుం డప్పుడా వీరుండు కేలనున్న కోదండంబు దీటుచు
మ. భయమేలా ? యతిపాలసేవకుఁడ నీ భక్తుండ నేనుండ వి
స్మయమేపార మదీయబాహుగధ నుజ్జ్యాముక్తబాణావళిన్
లయమొందింతుఁ గపాలిసంఘముల నెల్లంబట్టి తద్భీకరా
వయవంబుల్గుతుకంబుతో ఖగకుల వ్రాతంబు భక్షింపఁగాన్.
క్రకచుఁడు — అన్నా ! యన్నీచుఁ కండకావరమెట్లు ప్రేలించుచున్నది. కానిమ్ము తదీయమస్తకరుధిర మాధుర్యంబు భగవంతుఁడగు భైరవుండెరుగనున్నాఁడులే. తరువాత తరువాత.
కౌక్షేయకుడు — అన్నరపతి మాటలు విని యయ్యతిపతి మందహాసము చేయుచుఁ గాపాలికులం జయింపఁ గర్ణాటదేశంబునకుఁ బయనంబు సాగింపుఁడని శిష్యులకానతిచ్చెను.
క్రకచుఁడు — మేలు మేలు. సాధు. సాధు. కౌక్షేయకా! మంచివార్త చెప్పితివిగదా ఆ ప్రయాణ సన్నాహము తుదముట్టసాగినదా నడుమ విఘ్న మేదియైన రాదుగద
కౌక్షేయకుఁడు — రాదు. రాదు. వారు బయలుదేరి పెక్కుదూరము వచ్చు వరకు నేనక్కడనే యుంటిని. పదివేల బ్రాహ్మణులతోఁ జతురంగబలసమేతుఁడగు సుధన్వుఁడను నరపాలుఁడు సేవింప నా సన్యాసి మనదేశమునకు వచ్చుచున్నాఁడు. తరువాతి కృత్యము విచారించుకొనుఁడు. అందరివలె నయ్యతి శేఖరుని సామాన్యముగా దలంపవలదు సుఁడీ.
క్రకచుఁడు - కౌక్షేయకా ! నీ వతని స్తోత్రములు చేయుచు నాకు వెరపుఁ జూ పెదవేల ? చాలు. చాలు. పోపొమ్ము. విద్యుజ్జిహ్వా ! ఆ సన్యాసి మనదేశమునకే వచ్చుచున్నాఁడఁట. వింటివా?
విద్యుజ్జిహ్వుఁడు - వింటిని. ఆ బ్రాహ్మణుల యాయువులు మూడినవి కాఁబోలు. పాపము వాండ్రు మనతో విద్యావాదములు చేయు తలంపుతో వచ్చు చున్నారు. ఆ సంగరహితులతో మనము సంగరమా ప్రసంగమా చేయునది ?
క్రకచుఁడు -- -వారు సంగరహితులని నీవే చెప్పుచున్నావు. ప్రసంగములు మనకేల ? సంగరము చేయుదము. మన కాపాలికుల నెల్ల యుద్ధసన్నద్ధులై యుండుఁ డని యాజ్ఞాపింపుము.
గీ. బోడిబాపనయ్య లీడకువచ్చిన
తోడమూగిమనము తొడలు మెడలు
విరుగనరికినవారి శిరముల సురనిడి
భైరవుని దృప్తి పరుపవలయు.
శంకరాచార్యులట్లు కాంచీపురంబున విచిత్రగోపురమంట పాలయ ప్రాకారాదులం గట్టించి యచ్చటనుండి వేంకటాచలముమీదుగ విదర్భరాజధాని నలంకరించి యందుండి కాపాలిక కులసంబగు కర్ణాటదేశంబునకుం జనిరి.
అందొక దేవాగారంబున వసియించి తద్దేశవాస్తవ్యులనెల్ల నద్వైతమతావలంబకులం గావింప బోధించి యా సమయంబున సుధన్వప్రేషితుం డై శంకరాచార్యుని శిష్యుఁడొకఁడు క్రకచు నొద్దకు బోయి సావలేపముగా !
సీ. కుమతవాద్యున్మత్త కుంభికంఠీరవుం
దాగమశీర్ష తత్త్వార్ధవేది
దర్శితాద్వైత విద్యా రహస్యవిశేషుఁ
డఖిలదిక్చయతట వ్యాప్తకీర్తి
యంగభూగర్వ ప్రభంగపావనమూర్తి
ప్రౌడార్ధయుతసూత్ర భాష్యకర్త
ఘనవాదజి తపంకజ భూకళత్రుండు
సమధికకారుణ్య సాగరుండు.
గీ. సకలవేదపురాణ శాస్త్రప్రసంగ
చతురమతిశంకరాచార్య చక్రవర్తి.
యిందువిచ్చే సెఁ గకచ ! వాదేచ్చనీకుఁ
గలిగెనేనిఁ బ్రసంగింపఁ గదలిరమ్ము.
అని చదువునంత నక్కుటిలుండు కటకటంబడి కటంబులదరి జటుల భ్రుకుటీ వికటముఖుండై శూలకపాలంబులు గేలందాలిచి యతిరయంబున నయ్యతిపతి నికటంబున కరుదెంచి యుల్లసమాడుచు నిట్లనియె.
పురుషాధమా! నీవు కపటమతంబొకటి కల్పించి లోకులవంచించుచున్నావని యాకర్ణించి నీదర్పంబడంప నీ కడకు రానుంటిని లోకం నగ్నిజ్వాలంబడు మిడుత చందంబున నీవే నా యొద్ద కరుదెంచితివి.
నీవుభసితంబుదాల్చితి విదిమాకు సమ్మతమే కాని పరమపవిత్రంబగు నరశిరః కపాలము విడిచి యీమట్టిపాత్ర దాల్చితివేల ? భైరవార్బ నేమిటికిజేయవు? రుధిరాక్తములగు కపాలకుశేశయములచే భైరవు నారాధింప నీకు మోక్షము దొరకునా? యీచెడు మతమువిడిచి మాకాపాలికమతము స్వీకరింపుము. ముక్తుండవయ్యెదవని పలుకుచుండఁగా విని సుధన్వుండు తనయధికారులచే నాక్రకచుని నాసభనుండి దూరముగా ద్రోయించెను. అప్పు డయ్యభినవపరాభవంబు సైపరింపక యక్కా పాలికుం డోష్ఠంబులు చలింప వికటముఖుండై పటుకోపంబునఁ బరశ్వధంబు గిరగిరంద్రిప్పుచు మీ శిరస్సు లన్నియు నరికి భైరవునర్చింపకుండిన నేను క్రకచుండఁగానని శపథముచేసి తటాలునం జని బ్రహ్మణబ్రువుల వధించిరండని కపాలిలోకంబుల నియమించెను.
ప్రళయమేఘగర్జారావములతో గపాలిసంఘంబులు పెక్కులొక్కసారి నానావిధాయుధంబులంబూని యాబ్రాహ్మణ బృందమును ముట్టడించుటయు సుధన్వుండు రధికుండై కోదండంబుదాల్చి కాండవర్షంబు గురిపించుచు నక్కా. పాలిక తండంబులతో భండనంబు సేయుచున్న సమయంబున.
క. కక్రచునియుక్తులు కాపా
లికులొకపదివేలు భువి చలింపంగా వే
ఱొకత్రోవవచ్చి విప్ర
ప్రకరములను జుట్టిబెట్టు బాధించె వెసన్.
సీ. జపతపోనుష్ఠాన సత్క్రియల్గాక బ్రా
హ్మణుల కేటికియుద్ధ మనెడివారు
సకలసంగత్యాగి సన్యాసికేటికి
ఘనదిగ్విజయయాత్ర యనెడువారు
సాధులబోధింపఁ జనుఁగాని యతికి దు
ర్జనభర్జనంబేటి కనెడివారు
అటనుండియింటి కేగుటమాని యిటకేల
వచ్చితిమనిచింతఁ జొచ్చువారు.
గీ. నైమహీసురులెల్ల భయంబుతోడ
బ్రహ్మసూత్రములూడ దోవతలువీడ
పారి శంకర ! మాంపాహి పాహియనుచు
శరణుజొచ్చిరి యతినాధు చరణయుగము
అట్లు శమనకింకర నీకాళములగు కాపాలికానీకములుగావించు రాయిడికోడి బాడబులెల్ల నయ్యతితల్లజుని పాదపల్లవముల మరుగుఁ జొచ్చుటయు నాదయాళుండు వారినెల్ల నాదరింపుచుఁ బ్రళయకాలవారి వాహనిర్ఘోష భయంకరమగు హుంకారము గావించె. దానంజేసి చటచ్చటారావముటతో విస్ఫులింగము లురుల నావిర్భవించిన వీతిహోత్రుండు త్రుటికాలములో నాకాపాలికులనెల్ల భస్మానశేషులుఁ గావించెను. ఆత్మీయులు మడియుటయు భూసురులు మురియుఁచుండుటయు జూచి క్రకచుం డవిదూయమాన మానసుండై శంకరు నంతికంబున కరుదెంచి, వంచకుఁడా! దీనికిఫలం బనుభవించెదు. చూడుము మదీయ ప్రభావంబని పలుకుచు మానవకపాలంబు చేతులందాల్చి కన్నుల మూసికొని యించుక వెనుకకువంగి భైరవుని ధ్యానించెను. తదీయ మంత్రప్రభావంబెట్టిదో యంతలో నాకపాలము మద్యప్రపూరితంబై యొప్పుటయు నాక్రకచుండు దానిలో సగముగ్రోలి వెండియు భైరవుని ధ్యానించెను. అట్టి సమయమున నక్కపాలాంతరమునుండి.
మ. జ్వలనజ్వాలల సజ్ఞటాపలితో శస్త్రాస్త్రశూలావళీ
విలసద్భాహువుతోఁగ పాలరచిత స్పీతప్రదామాళితోఁ
బ్రళయాంభోదరవాట్టహాసములతో బ్రహ్మాండ మెల్లన్ భయా
కులమైతొట్రుపడంగ భైరవుఁడు బల్కోపంబుతో ముంగిటన్.
ఆవిర్భవించుటయుంగాంచి క్రకచుండు కేలుదోయి ఫాలంబున గీలించి, స్వామీ ! మీ భక్తజనులకు ద్రోహంబుగావించు నీనీచుంబరిమార్పుము. ఇదియే మదీయ వాంఛితంబని శంకర యతీంద్రునిపైఁ బ్రయోగించుటయు నమ్మహాత్ముం డౌరా ! క్రూరాత్మా మదీయాత్మస్వరూపుండగు శంకరునియందే ద్రోహముచేయఁ బూనితివా ? చాలు చాలు. నీపాతంబు నిన్నే చెందెడుంగాక యని పలుకుచుఁ గ్రకచుని శిరంబే తునుమాడి నాట్యము గావింపఁదొడంగెను. అప్పుడు శంకరాచార్యుండయ్యార్యమూర్తి ననేక ప్రకారంబులఁ గొనియాడుచు స్వామీ ! సంహారభైరవ! వేదశాస్త్రపురాణముల యందు బ్రతిపాదితమగుకర్మ బ్రాహ్మణులకవశ్యకర్తవ్యము. అట్టికర్మచేయుటవలన ధర్మమభివృద్ధినొందునని నా యభిప్రాయము. ధర్మంబునం బాపనాశనంబగు పాప నాశనమగుడు మనశ్శుద్ధిగలుగును. మనశ్శుద్ధివలన నాత్మ సాక్షాత్కారమగును. అని యీరీతి నేను బ్రాహ్మణసభయందుపన్యాసముఁ జెప్పుచుండగా విని నీభక్తుండా క్షేపించుచుఁ గర్మవలనఁ బ్రయోజనములేదనియు వేదశాస్త్రాదుల సంగతార్ధావబోధకములనియు జాతులతో నిమిత్తములేదనియుఁ భాషండధర్మముల యుక్తియుక్తముగా నాసభ యందు వక్కాణించెను.
అప్పుడు మదీయశిష్యులు వానింబట్టికొని దూరముగా గెంటివైచిరి. దాన గోపించి వాఁడు నిన్ను మంత్రబద్ధుంజేసి రప్పించెను. అటుపిమ్మట నందలి సత్యా సత్యంబుల నిరూపింప నీవే ప్రమాణమని పలికి శంకరాచార్యుడూరకుండెను.
అప్పుడు భైరవుండయ్యతిపుండరీకుఁ గొనియాడుచు, శంకరా ! నీవు సర్వజ్ఞుండవు. పూజ్యుండవు. వేదపదార్ధముల నెఱింగిన విజ్ఞాత నీకంటె మఱియొకఁ డెందునులేఁడు. నీచెప్పిన యుపన్యాసంబు నాక కాదు త్రిలోకములకు సమ్మతియై యున్నది. అదియే యదార్థంబు ఈ గాపాలికులనెల్ల బ్రాహ్మణాచారతత్పరులం గావింపుము. వాండ్రకు నేను మంత్రబద్దుండనగుటచేఁ బ్రత్యక్షమైతినికాని ధర్మముచేతఁ గాదు సుమీ యని పలుకుచు నద్దేవుండంతర్హి తుండయ్యెను.
అప్పలుకు లాకర్ణించి వటుకప్రముక కాపాలికులు విస్మయము నొందుచు శంకరాచార్యుపాదంబులఁబడి మహాత్మా! మూఢమతులమగు మమ్ము రక్షింపుము రక్షింపుము కరుణాహృదయా! మాకు నిష్కృతిఁ గావింపుమని ప్రార్ధించినంత నప్పుణ్యాత్ముండు వారినెల్ల బ్రాహ్మణాచార తత్పరులం గావింపుఁడని పద్మపాదాది శిష్యుల కాజ్ఞాపించెను.
కాపాలిక మతము
అప్పుడు వృద్దకాపాలికుఁడొకడవ్వార్త నాలించి వటుకాదుల నాక్షేపించుచు శంకరాచార్యునెదుటకువచ్చి నమస్కరింపుచు స్వామీ! మీకు మమ్ము బలత్కారముగా మతభ్రష్టుల జేయుట యుచితముకాదు తగుసమాధానముఁజెప్పి యొప్పించవలయును. మామకమత ప్రవృత్తి లెస్సగా వినిన పిమ్మట నాక్షేపించినను సమంజసమగును నీశిష్యుల మూలమున నేమాటజెప్పుటకు నవకాశములేకున్నది. నోరెత్తువఱకు మొత్తుచుందురు. ఇది ప్రసంగపద్ధతికాదు దౌష్ట్యమని చెప్పుకొనుచున్నాను. ఇప్పుడు నేను మీఁతో నెంతయోచెప్పవలసివచ్చితిని నా యుపన్యాసము ముగియువఱకు మీ శిష్యుల నాటంకము సేయకుండ నాజ్ఞాపింపుడు. ఇదియే నా కోరిక యని చెప్పుకొనియెను.
ఆ మాటలు విని యతీంద్రుండు మందహాసము సేయుచుఁ గాపాలిక ! మా శిష్యులనియమించితిని. నీయుపన్యాసమేదియో వినిపించుమని యానతిచ్చినంత నాకాపాలికుం డిట్లనియె.
మీరు మనుష్యులలో జాతిభేదములం జెప్పుచు బ్రాహ్మణజాతి యెక్కుడని వాదించుచున్నారు. అందులకు మేముసమ్మతింపము. సర్వదేహములు భౌతికవికారము లగుటచే జాతిభేద మెట్లు చెప్పఁదగినది. శరీరమునుఁజూచి మీరు జాతినిర్ణయింపఁగలరా? స్వకల్పితములగు నీజాతిభేదములకుఁ బ్రమాణము గానిపించదు. స్త్రీపురుష జాతులుఁ రెండే యొప్పుకొనదగినవి. దేనిసంసర్గవలన నెక్కుడు సంతోషము గలుగుచున్నదో, యట్టిస్త్రీజాతి పురుషజాతికన్న శ్రేష్ఠతమమని చెప్పకయే తేలుచున్నదిగదా. ఇది స్వీయ ఇది పరకీయ దీనింగూడవచ్చును. దానిఁ గూడరాదను భేదవాదము మా మతములో లేదు. అందఱిని దనవారిగా నెంచి యిష్టమైన యానంద మనుభవింపవచ్చును.
సంతసముకొఱకు గావించెడు చరమయదేహముల సంయోగమువలన జీవిఁ డేమియనర్ధమునఁ బొందెడిని? అట్టి యానందము గలుగఁజేయు స్త్రీపురుషసంయోగము కన్న మోక్షమనునది మరియొకటి కలదా! జీవునియొక్క తృప్తియే మోక్షమనఁబడుచున్నది. సంయోగంబున నానందరూపమగు నెట్టివ్యక్తిగలుగుచున్నదో యట్టివ్యక్తి యే భగవంతుఁడగు భైరవుండు దేహపాతంబున జీవులకుఁ గలుగఁజేయుచుండును. సర్వజనసులభ సాధ్యమగు నిట్టిముక్తి మామతమందకాక మఱియొక మతమం దెందేనింగలదా? యని యుపన్యసించిన విని శంకరాచార్యులు.
ఓరీ ! కాపాలిక. నీవు స్త్రీజాతియంతయు గమ్యయేయని చెప్పుచున్నావు. సంతసించితిమి. కాని నీతల్లియెవ్వనికూఁతురో చెప్పుము.
కాపాలికుఁడు - దీక్షితుని కూఁతురు.
శంకరా — దీక్షితుండన నెవ్వడు.
కాపా - మా తండ్రియే.
శంకరా - ఎట్లయ్యెను?
కాపాలి — తాళవృక్షసంజాతమగు మద్యమును ద్రాగటచే తద్రసంబుఁ గ్రోలుటచే విశేషంబు ప్రత్యక్షముగాఁ గనంబడుచుండలేదా? జ్ఞానులు సైతముఁ బానము చేయుదురనుట మా సుప్రసిద్ధము కాదా ? సేవించినవారి నానందసాగరమున ముంచు సురాపానలాభంబునంజేసి యెదీక్షితుం డగుచున్నాఁడు. మద్యగంధవిముఖులు మా మతమున నిషేధింపఁబడుచున్నారు.
శంకరుఁడు — ఓహో! కాపాలికా! నీమతము సర్వోత్తమమైనది మీకు వెలఁదియుఁ బానము నిషేధములుకావు. నీవు నీ యిష్టము వచ్చినట్లు సంచరింపుము. మేము బ్రాహ్మణులను దండించి సుబుద్ధులంజేయ గంకణము గట్టికొంటిమి కాని యితరులగొడవ మాకేల ? పోపొమ్ము సంభాషణార్హుండవు కావని పలుకుచుండగఁనే శిష్యులు వానిం బట్టికొని దూరముగా గెంటి విడిచిపెట్టిరి.
చార్వాకాది మతఖండనము
అట్టిసమయమునఁ జార్వాకసౌగతక్షపణకాదు లొకచో సభజేసి యొండొరు సంభాషించుకొనిరి.
చార్వాకుఁడు — సౌగతా! జగంబంతయు మూర్ఖజనులచే నెట్లు వ్యాపింపఁ బడినదో చూచితివా? ఈ సన్న్యాసియాత్మను దేహాద్యతీతమైనదానిఁగా వక్కాణించుచు లోకుల మోసపుచ్చుచుండ వానినే యెల్లరును సేవింపుచున్నారు. న్యాయవాదులమైన మనలను జూచువాఁ డొక్కడుఁను గనంబడఁడేమి?
సౌగతు - లోకము మూఢబాహుళ్య మగుటచేతనే వీనిమాటలయందు విశ్వాసముకలదై యున్నది. పంచభూతవికారంబగు శరీరములకు స్నానదానాదికర్మ వలన శుద్ధియగునని చెప్పుచుండెడి వీని వచనములెంత సత్యములైనవో విచారించితివా?
క్షపణకుఁడు — అతం డెంత వంచకుండైనను దైవబలసంపన్నుండగుటచే వానియాటలు సాగుచున్నవి. కానిచోఁ గాపాలిక కులనాయకుండైన క్రకచు నెదురఁబడి యెవ్వండైన బ్రతికివచ్చెనా? అట్టివానిని సకుటుంబముగా నిర్మూలించిన యతనియెదుర మనబోటివారము నిలువబఁడి వాదింపలేము.
జైనుఁడు — క్రకచునిచే నాహూయమానుండగు భైరవుండు క్రకచుని శిరంబే హరించెనఁట ఇది యేమిచిత్రము ? తత్పురస్సరముగా మన మాశంకరునిఁ బరిభవించవలయునని తలంచితిమి. యేదియును లేకపోయెనే.
బౌద్ధులు — మంత్రబలంబున సన్యాసి క్రకచునికన్న నధికుండగుటచే నట్లు జరిగినది. కానిండు మనమీమూలఁ గూర్చుండి యాలోచింపనేల? యెదురఁబడి యడుగుదము రండు. అతండు పరమశాంతుండఁట. మనమాటలకు సదుత్తరము లీయక మానఁడు.
జైనులు — అతఁడు మంచివాఁడేకాని శిష్యులు కడు క్రూరులు వృద్ధకాపాలికు నెట్లు కావించిరో చూచితిరా?
బౌద్ధులు — వాని నేమి చేసిరి?
జైనులు - అతండు తన మతప్రవృత్తి యంతయుం జెప్పుకొనుటకు నవకాశమిమ్మని సన్యాసిని కోరికొనియెను.
బౌద్ధులు — సన్న్యాసి యందుల కంగీకరించెనా?
జైనుడు — వానిమాటలన్నియు జిరునవ్వుతో నాకర్ణించి చివర నెక్క సక్కెములాడి పొమ్మని పలుకునంతలో వాఁడు మొఱపెట్టుచుండఁ దదీయశిష్యజనంబులు సారమేయతండంబులు వరాహపోతంబునుంబోలెఁ బట్టికొనికరపదప్రహరణంబుల బాధింపుచు దూరముగాఁ దోలివచ్చిరి.
బౌద్ధులు — అది యసహ్యమే యెద్దియో యుపాయంబున మనము వారి బారిఁ బడకుండ వాదించి రావలయును.
జైనులు - వినయమునుం జూపిన వారేమియుంజేయును.
బౌద్ధులు — వ్యతిరేకము దోచినప్పు డాలాగుననే చేయుదము.
జైనులు - చార్వాకుఁడు వాచాలుండగుట మొదట వాని బ్రసంగింపఁ జేయుదమని యొండొరు లాలోచించుకొని యందరు నయ్యతిపురందరుని చెంతకుంజని నమస్కరింపుచుఁ దమతమ మతలక్షణంబుల వక్కాణింతుమని చెప్పి తదనుజ్ఞ వడసిన పిమ్మట.
చార్వాకుఁడు - స్వామీ ! మీరు తత్త్వవేత్తలుగదా ! ముక్తి లక్షణమెట్టిదో యెరింగితిరేని వక్కాణింపుఁడు. మరణానంతరమున ముక్తిగలుగునని మీరు చెప్పు చుందురు. అది యేమియు సత్యముకాదు. దేహముతో జీవునికి విడుపుగలుగుటయే ముక్తియని చెప్పఁదగినది. సముద్రమందు లయమైన నదులు తిరిగి వచ్చుట దటస్థించెనేని మరణము నొందినవారికి మోక్షముగులుగు. మృతినొందినవారిని శ్రాద్ధాదికమువలన దృష్తినొందించుట అనిన దీపమును జమురుబోసి వృద్ధినొందించునట్టిదే. అంతకన్న యవివేకి మెందైనం గలదా ? మరియుఁ బరంబున స్వర్గనరకంబులున్నవని పుణ్యపాపములచే నాయా యీ లోకంబులకుంజని యందందు సుఖదుఃఖము లనుభవించి తిరుగ భూలోకంబున జనియించుచుందురనియుం జెప్పుదురు. ఆ మాట వట్టిబూటకము. ప్రమాణశూన్యమైనది. యేమిటికంటిరేని వినుండు.
సుఖదుఃఖానుభూతి యైహికమునందేయున్నది. తదుభయమున స్వర్గనరకములనిపేరు. సుఖభోక్త స్వర్గియనియు దుఃఖభోక్త నిరయస్థుండనియుం జెప్పఁబడుచుందురు. ఇట్టి ప్రత్యక్షానుభూతి విడిచి పరోక్ష కల్పనలుచేసి లోకులను వంచించుట దౌష్ట్యము కాదా ! దేహేంద్రియాదిభూతములిచ్చటనే నష్టములగుచుండఁగాఁ బరంబున కరుగువాఁడెవ్వఁడు. జీవుండంటివేని ఘటనాశనమందు ఘటాకాశమువలెనే రూపహీనునికి గమనంబెప్పుడును సంభవింపదు. కావున మా మతమే లెస్సయైనది. మీ మతము ప్రత్యక్షవిరోధమైనదని పలికినవిని శంకరాచార్యులిట్లనిరి.
మూఢుఁడా ! చార్వాకుఁడా ! నీ మతము శ్రుతిబాహ్యమైనదగుట మన్నింపఁదగినదికాదు. చెడుబుద్ధివిడిచి మంచిమతంబెరింగించెద నాకర్ణింపుము. ఆత్మస్వరూపుండగు నా జీవుండు దేహాదులకు భిన్నుండై పరమాత్మయని చెప్పఁబడును. అప్పరమాత్మ అప్రభోధవలన విముక్తుండై జ్ఞాసలాభంబున దేహపాతము నొందక పోవుటయే ముక్తియని చెప్పఁదగినది. అంతియకాని నీవు చెప్పినది ముక్తికాదు. నీవు భ్రమపడి యట్లనుచున్నావు. నిశ్చయము. శ్రుతి జ్ఞానము వలననే ముక్తియని చెప్పుచున్నది.
శ్లో. జ్ఞానాగ్ని దగ్దకర్మాణో
యాంతి బ్రహ్మసనాతనం॥
జ్ఞానాగ్నిచే దహింపఁబడిన కర్మలు కలవారు అనగా బ్రహ్మవేత్తలు సనాతనమగు బ్రహ్మను బొందుచున్నారని శ్రుతివాక్యములు గలవు.
శ్రుతిప్రమాణము సమ్మతింపనంటివేని నీ మాటలే నమ్మదగినవియా? కుత్సితదేహంబు వహ్నిచే దగ్ధంబగుచుండగా జీవుండు లింగశరీరముతోఁ గూడుకొని పరలోకంబున కరుగును. జ్యోతిప్టోమాది వాక్యములే యిందులకుఁ బ్రమాణములు. జీవుడు జలగవలెనే యీ దేహమునుండి దేహాంతరమును స్వీకరించి పరలోకమున కరుగునని శ్రుతి వాదించుచున్నది. మరియు మృతుని ప్రేతత్వవిముక్తి కొరకుఁ దత్పుత్రాదులు శ్రాద్ధాదికము చేయవలయును. గయాదులయందుఁ బిండదానాదికముచే బితరులు పుణ్యలోకము నొందుదురనియు ననేక పురాణములలో జెప్పఁబడియున్నది. కావున జీవుండు మరణావసానంబున లింగశరీరము నాశ్రయించి పక్షి వలెనే యరుగునని శ్రుతసిద్ధాంతమైయున్నది. నీ మూఢత్వమును విడువుము. నా మాటల విశ్వాసముంచి యాశ్రయింపుము. మరుమాట పలికితివేని గెంటించెదసుమీ యని బలికినఁ జర్వాకుండు తదుపదేశాలాభంబునంజేసి యాత్మీయ వేషభాషల విడిచి పుస్తకముల మోయుపనిఁబూని యతిని నాశ్రయించెను.
తరువాత నయ్యతిపురందరుం డెదుర నిలువంబడియున్న పీనకాయుండగు సౌగతుంజూచి నీవెవ్వండవు ఏమి చెప్పెదవని యడిగిన ననుస్కరింపుచు నిట్లనియె. స్వామీ ! మూఢభావంబునంజేసి కర్మశీలురగువారు స్నానదానాదికములచే శరీరమును క్లేశపరచుచుందురు భౌతిక శరీరము స్నానాదులవలన శుద్ధియగునా? జీవుండు దేహపాతంబున వెండియు కర్మఋణాపనయనార్ధమై జనియించునని చెప్పుదురు. ఇదియు మరియు మూర్ఖతగదా. దేహాంతరమున నేమియు లేకపోవుటచేత ఋణమైనంజేసికొని ఘృతము త్రాగవలయునని మా సిద్ధాంతము.
శ్లో. దేహాంతేవాక్షణాభావాదృణం
కృత్వాఘృతంపిబేత్ .
ఇత్యాది ప్రమాణ వాక్యంబులవలన సర్వదా దేహపుష్టి చేసికొనఁదగినది. బుద్ధిమంతుఁడైనవాఁడు అక్కడక్కడ ధనము సంపాదించుకొని సుఖముగాఁ దినుచుండ వలయును సర్వరక్షణశీలుఁడే నేర్పరి. దనభోగమే స్వర్గమని తలంపవలయును. నియమంబుల దేహమును బాధింపఁగూడదు. ఒక దేహము కష్టపడి మరియొక దేహమును సుఖపెట్టు టెట్టు తటస్థించెడిని కర్మ బూటకమని పలికినవిని శంకరాచార్యులు నవ్వుచు నిట్లనిరి. మూర్ఖుఁడా! దానంజేసియేకాఁబోలు నీవిట్లు శరీరమును బోషించు కొని బలసియుంటివి చాలు. చాలు. నీ మతము కడువిపరీతము శ్రుతిష్మృతీతిహాసాదులయందుఁ గర్మభోగము కొఱకుఁ బరిలోకగమనాదికము కడుసారులు వర్ణింపఁబడియున్నది. కావున పూణాదికము చేయఁగూడదు చేసెనేని తదనుభవమునకు జన్మమెత్తవలయును. నీవీ యజ్ఞానబుద్ధివిడిచి సన్మార్గమవలంబింపుమనుటయు వాఁడు మరల నిట్లనియె. అయ్యా మహర్షియైనసుగతుండు భూమినంతయుం జూచి విస్మయము నొందుచుఁ బ్రాహ్మణ్యుపాసన తత్పరుండై జగద్దితముగా నెల్లరకు నిట్లుపదేశించెను.
శ్లో. అహింసా పరమోధర్మః అని యెల్లప్పుడు స్మరించుకొను చుండ వలయును. అహింసకన్న పుణ్యకర్మ మెందునులేదు భూతదయయే సర్వధర్మములును. అహింస వలననే ముక్తినొందెదరని యానతిచ్చెను. కావున నేనును తద్వచనమేనమ్మి జీవహింసకు వెఱచుచు నియమముగా వర్తింపుచుంటిని.
వైదికులు యాగాదులయందు, బశుహింస గావింపుచుందురు అది మహా పాతకము. మా మతమే పరమధర్మస్థానమైనది. మీరు సైతము దీనిం గైకొనుడని పలికిన శంకరుండిట్లనియె. సౌగతా ! యూరక ప్రేలెదవేల ? దుష్టుడా ! నీకు ధర్మ సూక్ష్మమేమి తెలియును ? యాగంబులం జెప్పఁబడిన హింస పరమధర్మమని నిగమంబునఁ జెప్పఁబడియున్నది అగ్నిష్టోమాదిక్రతువులయందుఁ గావించిన పశుహింస వలన స్వర్గము వచ్చునని చెప్పఁబడియున్నది. తద్వాక్యముల నాక్షేపించువారు వేదబాహ్యులగు పాషండులని చెప్పఁబడుచున్నారు.
శ్లో॥ వేదనిందాపరాయేతు సదాచారవివర్జితాః।
తేసర్వెనరకంయాంతి యద్యపిబ్రహ్మవీర్యజాః॥
పూర్వాచారములను విడిచి వేదనింద గావించుచుండెడివారు బ్రాహ్మణబీజ సంభూతులైనను నరకమును బొందుదురని మనువు చెప్పియున్నాఁడు కావున బ్రాహ్మణాదివర్ణ ములు వేదమందుఁ జెప్పఁబడిన యాచారములు చేయవలయును. నీవు చెప్పిన ధర్మములు తద్విరుద్ధములగుటచే నింద్యములైనవి. మరియొకసారి ప్రయాణశూన్యముగా సంభాషించితి యేని దండింపఁజేయుదునని పలికినంత వాఁడు సంతుష్టినొంది తత్పాదు కావాహకుండై తిరుగుచుండెను.
తరువాతఁ గౌపీన మాత్రధారియై క్షపణకుండు గొలయంత్ర మొకచేతను, దురీయంత్రమొకచేతను ధరించి శంకరుని మ్రోలనిలువంబడి స్వామీ! నా మతము కడువిచిత్రమైనది. మంగళప్రదమైనది వినుండు కాలప్రవర్తకుఁడగు సూర్యుని నీయంత్ర ద్వయమునుచేతను గట్టివైచి సమయజ్ఞాన కౌశల్యమునంజేసి త్రిలోకములకు శుభాశభ ఫలంబుల చెప్పఁగలను కాలమే పరమాత్మయని మా మత సిద్ధాంతము. ఇట్టి మతమును నిరాకరింప నీ తరమా? పరేశుండైన సమర్థుండువాడు. అనుటయు శంకరాచార్యులు "ఓరీ క్షపణక ! లెస్సగాఁ బలికితివి. నీవు కాలవేదివని యెఱుంగుదును. నీవు నన్నాశ్రయించి యుండుము. పరీక్షాకాలము వచ్చినప్పుడు పరీక్షించుదు" నని పలికిన వాఁడందులకు సమ్మతించి యది మొదలయ్యతి నాశ్రయించి తిరుగుచుండెను.
పిమ్మట జైనుండు కౌపీనము ధరియించి యొడలంతయు మలముఁ బూసికొని బిందువులే పుండ్రముగా ధరియించి భయంకర వేషముతోఁ బిశాచమువలె నొప్పుచుఁ బెక్కండ్రు శిష్యులు సేవింప శంకరుని మ్రోలకు వచ్చి అర్హన్‌నమోయని పలుకుచు నిట్లనియె.
మ. జినదేవుండెసమగ్రము క్తిదుఁడు నర్చింపంగనర్హాత్ముఁడా
యనయే ప్రాణులహృత్సరోజముల జీవాత్మస్వరూపంబునం
దనరారున్నతతంబు తద్వసతినం తర్బుద్ధిధ్యానించుటే
ఘనవిజ్ఞానమనంబడున్ గలుగుము క్తత్వంబుతత్ప్రాప్తిచేన్.
స్వామీ! జినదేవుండు సమస్తప్రాణుల హృదయంబున వసియించి జ్ఞానప్రదుండై దేహపాతంబున జీవునిఁ బరిశుద్దునింజేసి ముక్తునిం గావింపుచుండును. దానం జేసి జీవుండు శుద్ధుఁడగును. దేహము మలపిండసదృశమైనది. స్నానాదిక్రియలవలన నెప్పుడు నిది శుద్ధముకానేరదు. కావున స్నానాదికము చేయఁగూడదు. మాలిన్యదేహముతోనే తిరుగుచుండవలయును. ఇట్లుండ జినదేవుని కరుణవలన దేహపాతంబున శుద్ధత్వము గలుగు. నిదియే మా మత సిద్ధాంతమని పలికిన శంకరుం డిట్లనియె. జైనుఁడా ! జీవునికి స్థూలసూక్ష్మకారణ భేదములచే మూడుదేహములు గలిగియున్నవి. ఆశరీరత్రయము క్రమముగా లయమైన పిమ్మట జీవుండు సచ్చిదానందస్వరూపుండగును. నేనీశ్వరుని కంటె భిన్నుండనని పలుకుట యజ్ఞానము. కావున నభేదబుద్ధితో హృదయస్థుండైన యీశ్వరుందెలుసుకొనుము. ముక్తుండ వయ్యెదవు. అంతియకాని దేహపాతమేమోక్షమని పలుకుట యవివేకము. మోక్షము కడుదుర్లభమైనది . యద్వైతజ్ఞానము సంపాదించు కొనుము. ముక్తుండవయ్యెదవని పలికిన వాని శిష్యసహితముగా సంస్కరింప పద్మపాదాది శిష్యులకు శిష్యునిం గావించెను.
తరువాత శబలుండను బౌద్ధుండువచ్చి శంకరునితో నీ బోధవలన బ్రయోజన మేమియును లేదు. నరశృంగ సమంబగు నీయభేదజ్ఞానము సర్వోత్తమమని వాదించుచు లోకుల వంచించుచున్నావు ప్రత్యక్షఫలమును విడిచి నీవు కడుదూరమైన యదృష్టఫలమును గోరుచున్నావు. దృష్టద్రోహివైతివి. శూన్యమగు పరోక్షము ఫలంబెట్లీయ జాలెడిని. ఆహా ! నిర్జీవమగుట నీమతమపార్థమైనది. మామతమందు హృదయప్రేరకుండై సుఖాత్మయై జీవుండు నిత్యముక్తుండగుచున్నాడు. మఱియు నేనే కర్తను నేనే పరానంద స్వరూపుండనని తలంచుచు నెంతవఱకు నీదేహక్రీడా యిష్టమగునో యంతకాలం మీ దేహంబునఁ గ్రీడించుచుఁ బిమ్మట శరీరమును విడిచిపోవును అదియే ముక్తియని మా మతసిద్ధాంతము. అన విని శంకరుం డిట్లనియె. బౌద్ధుండా !
శ్లో॥ సత్యశౌచపరోయస్తు దేవకాతిథిపూజకః
సయాతిబ్రాహ్మణో లోకం యావదింద్రా శ్చతుర్దళ॥
అగ్నిష్టోమం దేవతాప్రీతిదం చేత్కుర్యాదన్మా దింద్రలోకం సయాతి
సత్యాఖ్యం సత్పౌండరీకా త్ప్రయాతి తత్తద్దేవోపాసకాస్తంతమేవ
యోయోయాంయాంతనుంభక్తశ్శ్రద్ధయార్చితుమిచ్చతి
తస్యతస్యాచలాంశ్రద్ధాంతామేవవిదధ్యామ్యహం.
ఈ మొదలైన పురాణవచనములంబట్టి పరలోక గమనాదికమును ప్రసిద్ధమై యున్నది. అన్నమయదేహపాత మాత్రముననే ముక్తియని చెప్పుట యవివేకము. ప్రమాణశూన్యమైనది. జ్ఞానమునగాని మోక్షము సిద్ధించదని వేదము చెప్పుచున్నది. కావున బరమాత్మను దెలిసికొని ముక్తుండవగుము.
అనర్ధప్రదాయియై కల్పితమైన జీవితభ్రాంతిని విడువుము. సచ్చిదానంద స్వరూపమముగాఁ దెలిసికొనుము మూఢభావమును విడిచి స్వస్థుఁడవై యద్వైతజ్ఞానము సంపాదించుకొనుమని బోధించిన విని యా బౌద్ధుండు శంకరాచార్యుం గొనియాడుచు వందిమాగధ సూతవేషములలో నమ్మహాత్ముని సేవింపుచుండెను. అట్లు శంకరాచార్యులు కర్ణాటదేశంబునఁ బ్రబలియున్న కాపాలిక చార్వాక జైనాది కుమతంబుల ఖండించి యందుండి శిష్యులతోఁ గూడ ననుమల్లమను పట్టణమున కరిగిరి.
అందు మల్లాసురహరుండగుట మల్లారియను పేరుతోనున్న వేల్పుంపూజింపుచు నందున్నవారు తద్వాహనమైన కుక్కల ననుదినము సేవింపుచుందురు. వారు గవ్వలపేరుల గంఠంబుల దాల్తురు. మూడుకాలములయందును నాట్యవాద్యాదికములచే నా మల్లారి నర్చించుచు నతఁడే ముక్తిప్రదుండని వాదింపుచుందురు.
శ్రుతి॥ శ్వభ్యశ్శ్వపతిభశ్చవోనమః॥ అను శ్రుతివలన శ్వాసములె వందనీయములని ప్రమాణములు చూపుదురు. శంకరాచార్యులాగ్రామమున నిరువదిదినములు వసియించి తన్మతమును ఖండించి వారినెల్ల ప్రాయశ్చిత్తపూర్వకముగా సన్మార్గ ప్రవర్తకులఁ గావించెను.
పిమ్మట నగ్గురువరుండు శిష్యసహితముగా నచ్చటినుండి పశ్చిమ మార్గమున నరిగి మరుంథ మను గ్రామమునకరిగెను. అందు విచిత్ర గోపురమండితంబైన విష్వక్సేనుని యాలయమొకటి గట్టించి దానికిఁ దూరుపుగాఁ బానీయశాలను నిర్మించి యాచార్యుండా యాలయములోనికింజని స్వామిని సేవించెను.
మరియు నందు గల విష్వక్సేన మతస్థులకు సాధుబోధగావించి పాషండ చిహ్నశూన్యులంగావింపుచు నాత్మభక్తులంజేసికొనియెను. అచ్చటనుండి యుత్తరమార్గముగా మాగథమను పట్టణమునకరిగి యందు నింద్రకుబేరమతస్థుల యజ్ఞానంబుఁ బోగొట్టి పంచపూజాపరాయణులం గావింపుచు శంకరుండచ్చటినుండి యమప్రస్థపురంబున కరిగెను. అప్పురంబున మాసము వసించి యందు యమతస్థులఁ బాదాక్రాంతులం గావించుకొని కృతార్థులంజేసి పిమ్మట నచ్చటనుండి ప్రయాగ కరిగి యందు వాయు వరుణ మతస్థుల వినేయులం జేసికొని కొన్నిదినములు వసియించి త్రివేణీతీర్ధ సేవ గావింపుచుండెను.
అందొకనాఁడు శూన్యవాడి శంకరాచార్యు నెదుటకువచ్చి నిలువంబడుటయు నాజగద్గురుండు నీవెవ్వండవని యడిగెను అప్పుడు వాఁడు స్వామీ! నేను నిరాలంబన నామధేయుఁడ. మాతండ్రిపేరు క్లుప్తుఁడు. నేనిప్పుడు వచ్చుచుండ దారిలో మృగతృష్ణా జలంబున స్నానముఁజేసి యాకాశకుసుమ మాలికలం జుట్టికొని శశశృంగవిరచితమగు కోదండంబుధరియించి వంధ్యాపుత్రుండొకఁ డెదురుపడియెను. వాని జూచి సంతసించుచు దేవభావము వహించి నమస్కరించి యిప్పుడే తమదర్శనముఁ గావింపఁజనుదెంచితిని. వాడెవ్వఁడో యెరింగింపుడనుటయు శంకరాచార్యు లిట్లనిరి. శూన్యవాదీ! నీ యభిప్రాయము నే నెరుంగుదును. శూన్యమగుట నీమతము నింద్యమైయున్నది.
శ్రుతి॥ తమేన భారతమను భాతిసర్వం॥ అను శ్రుతివలన బ్రహ్మము శూన్యముకాని యట్లు స్పష్టపడలేదా? మూఢత్వమును విడచి యద్వైతవిద్యను గ్రహింపు మని పలికిన విని వాఁడు మఱల నిట్లనియె.
స్వామీ! ఖంబ్రహ్మా॥ అను శ్రుతివలన ఆకాశమే బ్రహ్మయని విశదమగు చున్నయదిగదా!
శ్లో॥ ఆకాశస్సర్వభూతేషు జ్యాయాన్సోస్తిపరాయణం
తంప్రత్యేవా స్తమాయాంతీత్యేవంహిశ్రుతిరబ్రవీత్॥
సర్వభూతములలో ఆకాశమే శ్రేష్ఠమైనది. తచ్చిహ్నముగలదగుటచే ఆకాశమునకుఁ బ్రహ్మత్వము చెప్పుచున్నాము. కావున మామతము నింద్యమెట్లగును? అనుటయు జగద్గురుండు. ఓహో! శబ్ధిగుణకమాకాశమని వినియుండలేదా ? సగుణమును బ్రహ్మమునుగాఁ జెప్పవచ్చునా? కార్యకారణబోధకమైయున్నది. కావున శబ్దమువలన దెలియబడుచుండెడి యాకాశము బ్రహ్మముకానేరదు. ఎవ్వనికిని నాకాసాదులకంటె నాధిక్యము వేదమందుఁజెప్పబడినదో యట్టి సచ్చిదానందస్వరూపమైన పరమాత్మ నద్వైతబుద్ధితో దెలిసికొనుము ముక్తుండవయ్యెదవని పలికిన విని యాశూన్యవాడి యమ్మహాత్ముని బాదంబులంబడి ఆర్యా! భవద్దర్శనంబునఁ గృతార్జుండనైతి. మూఢుండ నైన నన్ను బ్రహ్మోపదేశంబునఁ గృతార్థుంగావింపుమని వేఁడుకొనుటయు నతండు వానిని శిష్యునిగాఁ జేసికొనియెను.
ఆ రీతినే యయ్యతిపతి వరాహసాంఖ్యకాపిలాణుక శేషచంద్ర పితృమతస్థులఁ దత్తద్దేవతారాధకుల సద్వైతబోధచేఁ గృతార్థులం గావింపుచు నరిగియరిగి పశ్చిమ సముద్రతీరంబున విరాజిల్లుచున్న గోకర్ణక్షేత్రమున కరిగెను.