కవిరాజమనోరంజనము/చతుర్థాశ్వాసము

చతుర్థాశ్వాసము



మద్బృందావనధా
త్రీమండలభాగధేయదృష్టాంతజగ
క్షేమంకరచరణాంబుజ
కోమలవిన్యాసరాజ గోపవిలాసా!

1


వ.

అవధరింపుము సమససద్గుణసాంద్రు లగుశౌనకాదిమునీంద్రులకు సామోదహృద
యజలజాతుం డై సూతుం డి ట్లనియె నాసమయంబున.

2


క.

మిత్రావరుణమునీంద్రులు, ధాత్రీస్థలి నంబురాశితటవనపుణ్య
క్షేత్రమునందుఁ దమోను, న్నేత్రు హరుగుఱించి తపము నిష్ఠసలుపుచున్.

3


సీ.

ఆవిప్రవరులు కాయలుఁబండ్లు నాహారములు గాఁగఁ జేసి యాకలి యణంచి
యాబాడబులు దార్ఢ్య మతిశయిల్లఁగ మహాంభోమధ్యసీమలఁ బూనినిలిచి
ద్విజవల్లభు లాత్మప్రకాశతచేఁ దమోగుణము నిర్జితము చేసి
యాకమలజకులఖ్యాతు లుద్దీప్తచండాంశుబింబాభిముఖ్యము వహించి


తే.

యమ్మహాగోత్రు లనిలశీతాత పాది, కముఁలఁ దలఁకక నిశ్చలత్వమున నుండి
యవ్విబుధవర్యు లనిమిషంబైన దృష్టి, చేతసుమనస్కు లగుచుఁ జేసిరి తపంబు.

4


తే.

అలఘువాగ్వైభవమున శేషాహిమూర్తు, లనుట కది వన్నె వెట్టిన యట్లు గాఁగ
నమ్మహాత్ములు మారుతాహారు లైరి, నిశ్చలం బైన తత్తపోనియతియందు.

5


వ.

మఱియు నమ్మహర్షిపుంగవు లహింసాసత్యాస్థేయబ్రహ్మచర్యదయార్ణపక్షమా
ధృతిమితాహారశుచిత్వంబు లనుదశగుణంబుల నొప్పుయమంబున నిర్మలులయి
తపస్సంతోషాస్తిక్యదానేశ్వరపూజావేదాంతశ్రవణ మతిలజ్జాజపవ్రతంబులను
దశగుణంబులం గలుగు నియమంబునఁ గృతకృత్యులయి స్వస్తికాసన గోముఖా
నన పద్మాసన వీరాసన సింహాసన మయూరాసన కుక్కుటాసన సిద్ధాసనాది
సంజ్ఞలం గల నానావిధాసనంబుల నభ్యాసికులయి యిడానాడం బవనం బత్యంత
మందగతిం బూరకంబు చేసి కుంభకంబున నిలిపి జాలంధరోడ్డియాణమూల

బంధత్రయాభ్యాసపరిపాకంబున రేచకపూరకంబులు విసర్జితంబులయి శబ్దాదివిష
యంబులు నిర్వర్తింప నున్నిద్రితయైన కుండలిశక్తియందు బ్రత్యఙ్ముఖం బయినపవ
నంబు ప్రవేశించి సమాగమమోచనంబు నొందుచు నయ్యుత్తమాంగస్థలంబున నతి
రహస్యం బయినశృంగాటకకోటరంబున నమ్మారుతంబు మనస్సమేతంబయి నిలిచి
యటమీఁదం ద్రివక్రాకారంబయిన సుషుమ్నామార్గంబునందు మందగమనంబున
నడువఁ గుంభకనిష్ఠులయి యోగానలంబునం గరంగు సుధాస్థానస్రావకరసంబున
నాప్యాయితశరీరు లగుచు నెట్టకేలకు నొయ్యనం బింగళానాడి రేచకంబు సేయు
చు నేవంవిధంబయిన ప్రాణాయామంబున సిద్ధులయి యష్టాదశస్థానపవనదృఢంబును
యోగకాలంబున మానసికంబుగ నిత్యకర్మంబులు నడుపుటయును బాహ్యదృశ్యం
బులయందు నాత్యలక్ష్యంబు గనుటయు నాదియగు చిహ్నంబులు గల ప్రత్యాహారం
బునం బ్రవీణులయి జానుజంఘకటిబాహుశిరస్సులను పంచమండలంబులం బంచ
భూతంబుల నిలిపి యందు విఘ్నేశరుద్రమహేశబ్రహ్మవిష్ణువుల ధ్యానంబు సేయుచు
ధారణనిష్ఠ ననుష్ఠాతలయి యాధారాదిషట్చక్రంబుల సగుణవిచారంబును హృత్క
మలాంతర్జ్యోతియందు చిత్తంబు లీనంబగుటయు భ్రూమధ్యచిత్కళాచింతనంబు
నాదియగుధ్యానంబున నిరూఢులయి యద్వితీయం బయి సర్వపరిపూర్ణంబైన
బ్రహ్మంబు తానయై యుండుసమాధియందుఁ బరమానందు లయి పరమశివోపాసనఁ
జేయుచుండి రయ్యెడ.

6

గ్రీష్మఋతువర్ణనము

మ.

జగతిం దోఁడె నిదాఘ మంతఁ బ్రతిభాశ్లాఘ్యంబు సాంద్రీభవ
న్మృగతృష్ణాకృతకప్రవాహసలిలోర్మిస్వీకృతోదాభిలా
షగతస్వాంతచరిష్ణు జంతునిచయాశామోఘ మభ్యర్చితా
ధ్వగపూర్వాఘము తిగ్మితోగ్రతపనద్రాఘిష్ఠమృష్ణ్యౌఘ్యమై.

7


సీ.

విసరెఁ బశ్చిమదిశావిర్భూతవాతంబు హోరని వడనిప్పు లుప్పతిలఁగఁ
గాంచె నెండలు మహోగ్రంబులై దిశల నుర్వీస్థలి పెటపెట వేగుచుండ
నేర్చెఁ గార్చిచ్చు లుగ్రార్చిస్ఫుటంబులై యటపులఁ జిటచిటార్భటి నటింప
నెగసె గుప్పున సెగల్ నగకూటముల నినోష్ణవితప్తరవికాంతజంబు లగుచుఁ


తే

బొదవెఁ బెంధూళి శర్వరీభూతవితత, శక్తిసంస్తంభనక్రియోద్యుక్తసమయ
మంత్రసిద్ధవిసృష్టభస్మం బనంగ, సకలజనభీష్మమైన గ్రీష్మంబునందు.

8

చ.

ఉడుగనిబాడబాగ్నిసెగ కోర్చియు నోర్వగలేక వేసవిన్
జడమయుఁ డయ్యు నయ్యపరసాగరుఁ డుస్సున నూర్పువేఁడిమిం
బడమటిగాడ్పు లుప్పతిలెఁ బారముగాక నిదోఘవేళలం
గడుసెగచేత మేహమయగాత్రజనుల్ తపియింపకుందురే.

9


క.

వడగాడ్పు లెదుర్కొనఁగాఁ, బడమటికై యరుగుకమలబంధునివాజుల్
సుడివడివడిసెడి వెడవెడ, నడచెననం దడవు గాఁగ నడచె నహంబుల్.

10


ఉ.

సన్నము లయ్యె రాత్రులు పసన్నము లయ్యెను మల్లెగుంపు లా
సన్నము లయ్యె జాజులు విషణ్ణము లయ్యెను బొందువేళ లు
త్పన్నము లయ్యె గాడ్పులు విపన్నము లయ్యెను జంతువుల్ సుసం
పన్నము లయ్యెఁ నెండ లతిపన్నవసంతదినాంతరంబులన్.

11


సీ.

శ్రీదేవి భూదేవి చెఱియొకచరణంబు నూరుదేశంబుల నుంచి యొత్త
సమయోచితంబుగా సరసంపుజోలలు దివ్యాంగనలు నిగ్గుదేరఁ బాడ
సనకాదు లుపనిషత్సారసంస్తవకదం బోచ్చైర్నినదపాఠ ముజ్జగింప
సద్దుసద్దనుచు విష్వక్సేనుఁ డింద్రముఖ్యులను జేసన్న నవ్వలికి ననుప


తే.

నమృతసాగరమధ్యశేషాహితల్ప, భాగమున సౌఖ్యనిరతిచేఁ బవ్వళించి
నిదురతమిఁ గన్ను లరమోడ్చి నెఱి మొగిడ్చె విష్ణుమూర్తి తదాషాడవేళయందు.

12


సీ.

వాసితోసీరసంవాసితోదారసుధారసశైత్యాంబపూరములను
వరదంతశఠఫలస్ఫురదంతరుద్భూతరసనిశ్వమిళితగోరసచయంబు
వేల్ల దేలాచూర్ణతల్లజైకస్వాదుసంపన్నశర్కరసలిలములును
గలితకుస్తుంబరలలితజీరణముఖ్యసౌవీరతప్తపిష్టద్రవంబు


తే.

మొదలుగాఁ గల పానీయములను బథిక, వితతికి నిదాఘశాంతి గావింపఁ బథము
లందుఁ జలిపందిరులు వెట్టి రడుగడుగున, జగతిఁ బుణ్యాత్ము లాగ్రీష్మసమయమునను.

13


ఉ.

మోహకరస్తనోచ్చలనముల్ గనిపింపఁగ వేసవింబ్రపా
గేహవిలాసినుల్ పసిఁడిగిండ్ల జలంబులు దేరఁ బాంథు లో
హోహొలసత్పయోధరము లున్నతపుంగలశంబులంగభూ
దాహముఁ దీర్చుకొందుము గదా దయ చేసిన నండ్రు నవ్వుచున్.

14


సీ.

సరసపద్మాకరజలకేళులనుఁ బూటచలువలై తగుసన్నవలపములను
గులుకుపన్నీటఁ జొబ్బిలు సుగంధంబులు నమృణాళతాళవృంతానిలముల

ననుగుణవస్తుదధ్యన్నభోజనముల నిర్మలమధురపానీయములను
వలపుఁ గప్రపువిడ్యముల వెన్నెలబయళ్ల సైకతములఁ జల్వచప్పరముల


తే.

విరులపాన్పుల శశిశిలావేదికలను, గృతపరీరంభమధుపానకించిదవశ
యువతిఘనకుచకుంభశైత్యోదయముల, భోగులకు సౌఖ్య మొదవె నుష్టాగమమున.

15
వ.

అప్పుడు.

16


శా.

వీతోచ్ఛాదనవిగ్రహప్రణిహితావిర్భూతచండాంశుగ
ద్యోతక్షాంతిగులై స్థిరాహితపదాగ్రోద్ధానసర్వాంగులై
జ్యోతిస్తల్లజదీప్తమండననిరీక్షోత్ఫుల్లచక్షుస్సరో
జాతోదన్ముఖులై తపంబు మును లిచ్చం జేసి రవ్వేళలన్.

17


క.

తపమునఁ దీండ్రించుమహా, తపమునకుం దోడు తీవ్రతరమై భువిఁ ద
త్తపము వెలింగెను దివిజా, తపముఖులకు మిగులభయము దలకొనుచుండన్.

18


ఉ.

కంజహితప్రచండరుగఖండనిదాఘము చంద్రచంద్రికా
పుంజము గాఁగఁ జిచ్చులకుఁ బొత్తగుఁ పశ్చిమవాయువుల్ మనో
రంజకచందనానిలపరంపర గాఁగ మునుల్ సహించి రి
చ్ఛం జలియింప కమ్మహిమచందమొ వారలయోర్పుచందమో.

19


వ.

అంత

20

వర్షాకాలవర్ణనము

స్రగ్ధర.

ప్రావృట్కాలంబు దోఁచెన్ బ్రచురితభువనప్రాణిసంతానసంతా
పావారోగ్యప్రతాపోద్యమచటులనిదాఘాంతకృజ్జైత్రయాత్రా
దావజ్జీమూతసేనాస్తనితగుభగుభాదభ్రసంగ్రామభేరీ
రావైరావత్యసిప్రక్రమధగధగసంరంభగంభీరధాటిన్.

21


క.

తొలువానకాలమున న, గ్గలమై ధరమీఁద రాలెఁ గరకప్రకరం
బలఘుతరస్తనితార్భటి, కులికి నిలువలేక పడినయురుగణ మనఁగన్.

22


ఉ.

నిప్పులు రాల గ్రీష్మమున నిక్కినగాడ్పులు వార్షికంబునం
జప్పుడు సేయకే మరలసాగెఁ బ్రతీచికిఁ బ్రాచినుండి తా
రప్పటిపొంగుచేఁ బ్రజల నాపదఁ బెట్టి నిజాధికారముల్
దప్పినఁ జిన్నఁబోయి మరలం జనుచుందురు గాదె దుష్ప్రభుల్.

23


క.

కమలాకరంబు లయ్యెను, గమలాకరములు ఘనంబు ఘనమయ్యె నభం
బమరనభంబై వార్షిక, సమయంబున రసరసప్రశస్తి వహించెన్.

24

పృథ్వీ.

తళత్తళలసచ్ఛవిం దనరె ధాటివిద్యుల్లతల్
పెళత్పెళమిళధ్వనిం జెలంగెఁ బేర్చి గర్జార్భటుల్
ఝళంఝళ గళజ్జలోద్ధతి నెసంగె నంభోదముల్
ఘళంఘళ విశృంఖళప్రగతిఁ గాంచి మించెన్నదుల్.

25


సీ.

నీరాళ్లగొంది శంపారుచుల్ గనిపించె నభ్ర మభ్రమునిండ నాక్రమించె
వృష్టికుంభద్రోణవిస్ఫూర్తి వర్షించెఁ జాతకంబులు మింట సంభ్రమించె
నదులు కూలంకషన్నతములై ప్రవహించె హాళికోద్యోగంబు లగ్గలించె
జాజితోఁటలు ఫుష్పసౌభాగ్యత వహించె జలజప్రకాశత సన్నగించె


తే.

జనము మోదించె శాద్వలచ్ఛాయ మించె, నీప మిగిరించె మల్లెమే ల్నిర్గమించె
నెమలి నర్తించె భేకనాదము రహించె, భువిఁ దొలకరించె వానకందువ ఘటించె.

26


మ.

జలసంజాతభవాండమండపగతక్ష్మాచక్రసింహాసన
స్థలధాత్రీధరశంభులింగములకున్ శంపాలతాదీపికల్
వెలుఁగన్ గర్జితమంత్రసూక్తులను ప్రావృట్కాలశైవుం డొన
ర్చె లసన్మేఘఘటాంబుధారల నవిచ్ఛిన్నాభిషేకక్రియల్.

27


మ.

శరచాపోన్నతి సంస్కృతాంబరమణిచ్చాయాప్రకాశంబునన్
హరిసారంగచయప్రచారవిధితఖ్యాతిన్ మహాసారసు
స్థిరతన్ శంబరభంగరమ్యతనుభాతిన్ మీఱుసారస్వత
స్ఫురణంగాంచెను సార్వభౌమవిభవంబున్ వానకాలం బిలన్.

28


ఉ.

వెచ్చనితీర్థమాడి నులివెచ్చపదార్థము లారగించి బ
ల్పచ్చడముల్ ముసుంగులిడి పైఁజలిసోఁకని కమ్ముటిండ్లలో
ముచ్చముడింగి యింటిపని ముమ్మరమెల్లను దీర్చి ప్రక్కకున్
వచ్చినప్రోడయాండ్ర కురువంపుడు బల్చనుకొండలూన ఱొ
మ్మిచ్చి కవుంగలించి సుఖియించిరి ప్రౌఢగృహస్థు లజ్జడిన్.

29


సీ.

పురుషుఁ డుత్పలపత్రములు పిఱుందున నుంచ నవని లాంగలరేఖ లమరె ననుచు
ధవుఁడు మైపూఁప చన్గవనంట నెదనొక్క మెలఁగి కొండలమొగి ల్మేసె ననుచుఁ
జెలువుండు నడుసీమ తళుకుఁ జూపులఁ జూడ మిన్నులు తళతళ మెఱసె ననుచు
విభుఁడు మర్మము లంటి వెసఁగళల్ దొరగింపఁ బద్మాకరము నిండి పాఱె ననుచు


తే.

సరసు లొనరించు నర్మచేష్టలకు సొగసి, కలికిప్రౌఢ లభిప్రాయగర్భితముగఁ
బలుకుదురు వర్తమానముల్ దెలుపుకరణి, గగనగృహముల నవ్వానకాలమునను.

30

చ.

భయమమతులై హఠాద్గుభగుభద్రటదుత్కటగర్జితార్భటిం
బ్రియవనితల్ చనుంగవలు బిట్టదరం బఱతెంచి కౌఁగిటన్
రయమునఁ జేర్పఁ దద్విభులు రంజిలి రయ్యెడ మేడలందు విం
తయి యలరించు నెవ్వరిని యత్నము సేయక వచ్చులాభముల్.

31


క.

ఆవానకాలమున మి, త్రావరుణమునీంద్రు లధికతరనిష్టమెయిం
గావించి రుగ్రతపము భ, యావహమై త్రిభువనముల నట్టిటుసేయన్.

32


సీ.

తతజటామండలాంతస్సీమ నిండుచో భాగీరథీజూటుఁ బ్రమథనాథుఁ
గండభాగంబులఁ గాల్వలై పాఱుచో దానధారాకటోత్కటగజంబు
దివ్యవిగ్రహముల దిగఁబాఱుచోట నిర్ఝరసానువైన గోత్రాధరంబుఁ
జరణాంబుజంబులఁ బొరయుచో వియదాపగాప్రసూపదుఁ ద్రివిక్రమసమాఖ్యుఁ


తే.

బోల్పఁ దగి రమ్మహామునుల్ భూరిజలద, భవనిరర్గళధారాళబహుళవృష్టి
జలము చేతఁ దద్వార్షికసమయమునను, వారి మహిమాతిశయ మనిర్వాచ్య మరయ.

33


ఉ.

గండములాని పార్శ్వములఁ గ్రమ్మి నితంబము లాఁగి పాదము
ల్నిండి ఝరీచయంబు లవనీధరసీమలఁ బాఱుకైవడిన్
గండము లాని పార్శ్వములఁ గ్రమ్మి నితంబములాఁగి పారముల్
నిండి యొసంగె వర్షభవనీరము మౌనులపైఁ బ్రవాహమై.

34


శా.

ఈచందంబున నమ్మహామునివరుల్ హృత్పద్మకోశాంతర
ద్యోచక్రోర్జితలింగశాంభవమహాజ్యోతిం బ్రపూర్ణంబుగా
లో చూపం దెలివిన్ సమస్తమును నాలోకించుటల్ సిద్ధవ
త్ప్రాచుర్యం బయినట్లు వ్రేఁగునఁ జలింపం జొచ్చె విశ్వంబొగిన్.

35


తే.

జగతి ఘటచక్రసామ్యనైజగతి యయ్యె, నగము లుపవచ్చిలాభగ్ననగము లయ్యె
వనధు లకలంకరూపజీవనధు లయ్యె, లోకముల కాతపము దురాలోక మయ్యె.

36


క.

అట్టిమహోపద్రవమున, నట్టిట్లై కలఁగె జగము హరిహయుని మదిం
బుట్టెఁ దనయాధిపత్యం, బెట్టగునో యనునిచార మెంతయుభరమై.

37


క.

 ఏపగిదినైన విఘ్నం, బాపాదింపంగ వలయు నత్యుగ్రకరం
బీపరమమునులతప మని, యాపురుహూతుండు మిగులనార్వేరమునన్.

38


వ.

ఇట్లని తలంచె.

39


మ.

అతిసౌందర్యము నాటపాటవగ యొయ్యారంబు వాక్ప్రౌఢియున్
రతిఁ జౌషష్ఠికళల్ ఘటించి మనసుల్ రంజిల్లఁగాఁ జేయు ప్రౌ

ఢతయుం గల్గినయింతి దాకొనిన నిష్ఠల్ వీడి మోహింతుర
య్యతిముఖ్యుల్ సెగపొంత వెన్న పురుషుండౌఁ బో వధూచేష్టకున్.

40

ఋషుల తపోవిఘ్నమునకై యింద్రుఁ డూర్వశిని బంపుట

.
ఉ.

అన్నిట జాణ యూర్వశి గదా సురభోగవతీజనంబులో
నన్నలినాయతాక్షి నట కంపిన నమ్మనులన్ భ్రమింపనో
పు న్నిజహావభావములఁ బొందగు నిప్పనియంచుఁ బిల్వఁబం
చె న్నిజదూతచే నమరశేఖరుఁ డయ్యరవిందలోచనన్.

41


తే.

పిలువఁబంచిన నారాజబింబవదన, చిలుక యాడినమాటలు దలఁచుకొనుచు
సంతతము సంశయంబును సంభ్రమంబు, గదుర మణిభూషణోజ్జ్వలగాత్రి యగుచు.

42


సీ.

చరణమంజీరపుంజరవప్రమాణంబు భద్రేభగతివిలంబనము దెలుపఁ
గనరానినడుమునఁ గనిపించుజవజవల్ కుచకుంభభారంబుగుట్టు దెలుప
నవికారవచనవీక్షావిలాసంబు లుత్తమనాయికావృత్తి దెలుప
వనజగంధభ్రాంతిఁ దనువు వెన్కగు తేఁటు లొగిఁ బద్మినీజాతి యగుట దెలుపఁ


తే.

పురుషనికరంబుమీఁదను బుష్పశరుఁడు, తెగి ప్రయోగంబు సేయ మూర్తీభవించి
వచ్చు మోహనమంత్రదేవత యనంగఁ, జనియె నూర్వశి సురరాజసన్నిధికిని.

43


మ.

చని చింతామణిభద్రపీఠమున రాజశ్రీవిలాసోన్నతుల్
పెనుపొందన్ జగదేకవైభవమునం బేరోలగంబున్న యా
ఘనవాహుం బొడగాంచి మ్రొక్కి యెలమిం గైవారముల్ చేసి ని
ల్చిన సానుగ్రహలోచనాంచలరుచుల్ చెల్వొంద వీక్షింపుచున్.

44


ఉ.

ఆవనజాయతాక్షికిఁ బ్రియంబున నిట్లని పల్కె నింద్రుఁ డిం
దీవరనీలవేణి జగతీస్థలిఁ బావనశాసనంబునన్
భావములం జలింపక తపంబొనరించుచు నున్నవారు మీ
త్రావరుణాఖ్యమౌను లతిదారుణనిష్ఠ జగద్భయంబునన్.

45


క.

మోచాఫలమధురాధర, నీచాతుర్యమున వారినియమప్రత్యూ
హాచరణము గావింపుము, నీచేతం గాని కాదు నిజ మటుసేయన్.

46


సీ.

సుదతి నీకుచగురుల్ చూచినమునిసింహు లాశ్రయం బొనరించు టద్భుతంబె
వనిత నీయౌవనవనము గాంచిన మౌనికుంజరుల్ రమియింపఁగోరు టరుదె
కలికి నీకటిభూమి గనుఁగొన్న యతిరాజు లనురక్తి నంటి పైకొనుట వెఱఁగె
రమణి నీమధ్యాంబరము గన్న ఋషిచంద్రు లవలంబనము సేయు టబ్బురంబె

తే.

ప్రాప్యసద్యస్సుఖంబుల బాసి యేల, యిచ్చగింతు రతిప్రయాసేష్టదముల
గిరివిపినవాసభూప్రదక్షిణచిదంబ, రావలోకనముల నెవ్వరైనఁ దరుణి.

47


మ.

యతిరాజన్యతపోమహానలము చల్లాఱంగ సౌదామినీ
లతికాహంకరణాపహాసకరలీలాలాలసాపాంగసం
గతశోభాకలశాంబుధిస్ఫుటతరంగశ్రేణి పైకొల్పు మో
శతపత్రానన యిట్లు చేసిన జగజ్జాలోపకారం బగున్.

48


క.

అని పలికి కలికి నపుడ, య్యనిమిషపతి సబహుమానకానుఙ్ఞతఁ దా
ననిపిన మహాప్రసాదం, బని మరలెన్ సభికవీక్ష లటు వెనుతగులన్.

49


చ.

వెలఁది నృపాలుఁ జూతు ననువేడ్కయ కాని మహోగ్రు లమ్మునీం
ద్రులు తనయత్న మెట్టులగునో యని చూడదు పోవఁబూనెఁ దా
వలచిన చోటి కేగుశుకవాణి సముద్రముపైన నీఁదుఁ బో
తలఁప నిరంకుశంబులు గదా జవరాండ్ర తలంపు లెయ్యెడన్.

50


తే.

ధరకు నరిగెడుపయనంబు తనకుఁగల్గు, టది నిధానంబు దొరకినయట్ల యగుచు
నతిశయంబైన సమ్మోద మావహింపఁ, జారులోచన నిజనివాసమున కరిగి.

51


క.

నవరత్నభూషణాంబర, నవమాల్యసుగంధలేపనంబులచేతన్
నవలా లసదభినవతా, నవలాలస యగుచు నటఁ జనం బయనం బై.

52


సీ.

హంసకాశ్రయలీల నమరెఁ గొమ్మపదంబు లంబుజంబులు గావె కంబుకంఠి
ఘనసారలిప్తతఁ దనరెఁ గోమలి మేను శంపాలతిక గావె చంద్రవదన
కమ్మలసంగతిఁ గడువొప్పె సఖిచెవుల్ శ్రీకారములు గావె చిగురుఁబోఁడి
చిత్రపత్రముల రాజిలె నింతికుచములు జక్కవల్ గావె విశాల నయన


తే.

యనుచుఁ దను జూచి చతురోక్తులాడుప్రోడ, సఖులవచనంబులను ముఖచంద్రసహజ
దరహసనచంద్రికలకు విస్తార మెసఁగ, నతివ సకలాభరణభూషితాంగి యగుచు.

53


క.

మురజోపాంగవిపంచీ, స్వరమండలముఖ్యనాట్యసమయోచితబం
ధురవాద్యమేళములతో, నరుణాధర యరిగె మునులయాశ్రమమునకున్.

54


వ.

ఆసమయంబున.

55


క.

శరదాగమంబు గడచెన్ , శరదాగమ మావహిల్లె జగతిన్ వికస
చ్ఛరవిమలసైకతము లై, శరవిమలత నలరె నదులు సరసప్రౌఢిన్.

56


శా.

భేరీశంఖమృదంగకాహళరవోపేతంబులై ధూపధూ
మారబ్ధోరుసుగంధబంధురములై యశ్రాంతనైవేద్యవి

స్తారోదారము లై ప్రదీపకళికాసాంద్రంబులై దేవతా
గారంబుల్ నవరాత్రులం దనరె విఖ్యాతిన్ శరద్వేళలన్.

57


ఉ.

అంబరలంబిఖండవిశదాంబుధరాళి కొసంగె ధూసర
త్వం బెలమిన్ శరత్ప్రథమపక్షదినంబుల మంత్రసిద్ధహ
స్తాంబుజదత్తదీపితహుతాశనకుండగతాజ్యభోజ్యభూ
షాంబరపుష్పచందనఫలాదిమహాహుతిహోమధూమముల్.

58


సీ.

నిద్రానుభవముద్ర నెలకొన్న నునుఁగెంపుచేఁ గన్నులకు వింతచెలువుఁ దోఁప
బరివర్తనముల రాపడిన చందనచర్చ సుందరాంగంబున సొబగు మీఱఁ
జెమటచేఁ గరఁగి కించిదృశ్య మగుతిలకంబు నెన్నుదుట నందంబు గులుక
లంబితం బగుకుండలంపుటొత్తున నేర్పడినరేఖ హంసపీఠిక వెలుంగ


తే.

మేలుకొని లేచి కూర్చుండెఁ బాలకడలి, నట్టనడుమ సహస్రఫణాఫణీంద్ర
భోగశయ్యాతలంబున భువనకర్త, కమలనాభుండు తచ్ఛరత్కాలమునను.

59


ఉ.

కాముప్రయాణదుందుభులకైవడిఁ దచ్ఛరదాగమంబునన్
వేమఱు మ్రోసె దిక్కుల నవీనఫలోదయసస్యమంజరీ
హామతిసంభ్రమద్విహరణార్థసముద్ధతి శాలిపాలికా
స్తోమఝణంఝణత్కటకశోభితహస్తచపేటనాదముల్.

60


వ.

మఱియుఁ దత్సమయంబున సాధుజనంబునం బోలి పంకరహితస్వచ్ఛజీవనంబైన
స్రవంతీవితానంబును జంపకమహీరుహంబులగతి ననాశ్రితసారసంబులైన జీమూత
ఖండంబులును ననూపమభూములచందంబున మందీకృతశిఖిప్రకాశంబు లయిన
ధరాధరంబులును వైద్యశాస్త్రంబువిధంబున గౌరాభ్రకగుణప్రకటంబయిన తారా
పథంబును భాగ్యవంతునిమందిరంబుకైవడి శ్రీవిశేషాభిరామం బయినచంద్రికాపుం
జంబును విష్ణువిగ్రహంబులరీతిం గమలాకరంబులయిన కొలంకులును గలిగి నితంబినీ
కదంబకనితంబబింబంబులకు నువమానంబు సేయందగు నందంబులం దనరు సమున్న
తసైకతంబులవలనను దానశీలునికీర్తివిస్ఫూర్తి నకలంకధావళ్యవికసనంబయిన కాశ
ప్రచయంబులవలనను చాపాంధకారంబులం బరిహరించుటకు దృష్టాంతంబుఁ జూపు
కరణిఁ దమఃపటలంబు నణంచుచు సుజనమందిరాంగణంబులం బ్రకాశించుకార్తిక
నియమదీపికాజాలంబులవలనను నక్తభోజనవ్రతనిష్ఠు లొనర్చు నన్వహమహారు
ద్రాభిషేకపూజావిధానవిశేషంబులం దనరి విదోషంబులయిన ప్రదోషంబులం గళ్యా
ణనిలయశబ్దార్థంబు ధ్వనిపరంబయిన నిజాభిధేయలీలం దెలుపుశివాలయచయంబుల
వలసను సకలసౌకర్యాలవాలం బయిన శరత్కాలంబు ప్రవర్తిల్లె.

61

ఊర్వశి మిత్రావరుణులయొద్దికి భూమికి వచ్చుట

క.

అత్తఱి నత్తరళేక్షణ, మత్తద్విపయాన యువతిమణి యూర్వశి లో
హత్తిన వేడ్కను ధరకు వి, యత్తలమార్గమున డిగ్గి యట చని యెదుటన్.

62


సీ.

పంటముత్తైదువుగంటలమొలనూలు పడమటిదొరయేలు నిడుదప్రోలు
మీనై మెలంగుసామికిఁ జుట్టుకొల్లారు రతనంపుసరకుతోరపుబిడారు
వేల్పుపాతరకత్తెబిడ్డని చొరుబొక్క కుండపుట్టుగుజోగి గొన్నగ్రుక్క
రేఱేనిసిరి కుబ్బరించు మ్రోఁతలప్రోవు తపసిదోసపుమంట దాఁచుఠావు


తే.

బల్లిదపుటేటియిల్లాండ్రయల్లిబెల్లి, మేరదప్పక నిలిచిన నీరువెల్లి
నిట్టనేరేడుదిబ్బకుజుట్టువారు, తీరు చెన్నారు మున్నీరు తెఱవ గాంచి.

63


వ.

ప్రమోదమేదురహృదయసరసీరుహ యగుచుం జని యప్పారావారంబు తీరంబు
నందు.

64


చ.

చెలులును దాను నూర్వశి ఋషిప్రవరాశ్రమసీమ చేరి సం
చలదవలగ్నకీలితల సద్రశనావరకింకిణీధ్వనుల్
కలితకరాంఘ్రిపద్మకటకస్ఫుటవాదముతోడ నైక్యమై
చెలఁగ మెలుంగుచున్ ధరకు జేరిన తీఁగెమెఱుంగుకైవడిన్.

65


సీ.

తనతనుమధ్యసౌందర్యరేఖకు లొఁగి కొదమసింగంబులు గుహలు చేరఁ
దనమందయానమోహనలీలకును లజ్జనొంది మత్తేభముల్ క్రిందుచూడఁ
దనచంచలావలోకనచారుతకు నోడి సారంగనికరంబు పూర్తిగఱవ
దనమంజులస్వరోదారత కళుకొంది కోకిలంబులు కొనకొమ్మ లెక్కఁ


తే.

దనవినీలకచప్రశస్తతకుఁ జిక్కి, భృంగనిచయంబు గీపెట్టఁ బృథులజఘన
యల్లనల్లన నేతెంచి యధికనిష్ఠఁ, దపము గావించు నత్తపోధనులఁ గాంచి.

66


మ.

పటవాసంబుల నంగరాగములఁ బుష్పస్తోమదామంబులం
బటుసౌరభ్యపరంపరల్ వొదువఁ దత్ప్రాంతంబునం జేరి సం
ఘటితస్వాంజలిఫాలయై మునులు ద న్గన్నెత్తి వీక్షింపకుం
డుట భావించి ప్రయాససాధ్యమనుచున్ డోలాయమానాత్మయై.

67


వ.

ఇంచుకతడవు విచారించి నిజవిలాసవిభ్రమవిద్యాప్రాగల్భ్యంబులఁ జూపి యెట్లయి
నను రాగరసమగ్నులం జేయుదుంగాక యనునహమికం దత్ప్రదేశంబున మందా
రకుందచందనమాలతీమధురికక్రముకఖర్జూరనారంగనారికేళపున్నాగచాంపేయల
వంగమాతులుంగరంభాజంబీరజంబూప్రముఖనిఖిలతరుషండంబుల నజహద్యసంత

సాంతత్యంబులై ప్రకాశించు ప్రవాళదళలతాప్రతానకోరకలతాంతమంజరీపరాగ
మకరందశలాటుఫలగుచ్ఛప్రముఖసౌభాగ్యంబులం గన్నులపండువై కోయిలలయెలుం
గులఁ జిలుకలకలకలంబులఁ గొఱవంకలరవాంకంబులఁ బారావతంబులరుతంబులఁ
గేకులకేకారవంబులఁ దుమ్మెదలరొదలఁ గర్ణపర్వంబయి కబంధజాతసౌగంధికకు
ముదసముదయావంధ్యబంధురసుగంధిసంబంధిగంధవహకారణబంధుకృతోపచార
సుఖసమ్మోదితప్రాణినికరంబులయిన కమలాకరంబులఁ గరం బొప్పునప్పుణ్యాశ్రమం
బున విబుధవేశ్యాలలామంబు వయస్యలుం దారును విహారం బొనర్చి రప్పుడు.

68


సీ.

మకరందనదులవెంబడి సంచరించుచో హంసాంగనలరేఖ యచ్చుపడఁగఁ
బొలుపొందు పల్లవపుంజంబు చిదుముచోఁ గలకంఠయువతులగరిమఁ దనరఁ
గలిత సౌరభసుమాఘ్రాణంబు సేయుచో భ్రమరకాంతలవింత పరిఢవిల్ల
రసమనోహరఫలగ్రహణంబు సేయుచో శుకవిలాసినులపొందిక రహింప


తే.

నమరలీలావతులు తద్వనాంతరమున, విహరణం బొనరింపుచు వేడ్క మీఱఁ
జేయుశృంగారచేష్టల శ్రీ యొసంగె, మదనఛాటి నిరాఘాటమహిమ యగుచు.

69


చ.

పరువడి మల్లెమొగ్గలును బాటలముల్ కలయంగఁ గోసి యొ
క్కరమణి యూర్వశికిఁ గానుక పట్టిన దంతకాంతిసుం
దరతయు మోవిఠీవియుఁ గనంబడ నవ్వెఁ దదంగపుష్పవి
స్ఫురణల తారతమ్యములు పోలిక కేలికబంటు వాసిగన్.

70


తే.

ముదితయొక్కతె సంపెంగమొగ్గతావి, కొనుటకై నాసికాద్వారమునకుఁ జేర్పఁ
గోరి సౌందర్యభిక్షకై చేరఁబోలు, వాకిటికినంచు నవ్విరి వనితలెల్ల.

71


తే.

తరుణి సంపెఁగపువ్వులదండ గూర్చి, కబరికాభృంగవితతిపైఁ గదియఁజుట్ట
వింతయై యొప్పె నొప్పుట విస్మయంబె, శత్రువులు మిత్రులైన సౌజన్యగుణము.

72


మ.

శుకచంచూపుటఘాతరేఖలఁ గడున్ సొంపొందుశాఖావలం
బకజంబీరఫలద్వయంబు గని కొమ్మా చూచితే ప్రౌఢనా
యకునిం గూడిన బాల చన్గవకు సామ్యంబయ్యె నౌనంచు నొ
క్కకురంగేక్షణ చూపెఁ దోడిచెలికిం గందర్పుఁ డగ్గింపఁగన్.

73


క.

శ్రవణావతంసములుగా, సవరించిరి వకుళముకుళచయ మింతులు క
న్గవ తలఁదిరుగక యుండం, దవిలి మరుం డిడినశాసనంబు లనంగన్.

74


చ.

మఱఁదల రావె యంచు నొకమానిని యొక్కతెఁ జీరి వచ్చున
త్తఱి చన్నుఁగవ దాఁక వడిన్ వయివం దటాలునం

దెఱవ కవుంగిలించి వెనుతియ్యక చన్గవఁ దత్కుచద్వయం
బఱిముఱి నొత్తె నవ్వి రహహా సరికిన్ సరియంచు నంగనల్.

75


చ.

విరులకు నొక్కయిందుముఖి వేడుకతో నిజశాఖ వంచుచోఁ
బురుషమహీజ మయ్యి గురుఁబోఁడి పయింటచెఱంగు పట్టి త
ద్గురుకుచముల్ బయల్పడఁగఁ ద్రోచె నచేతన మయ్యు మాయురే
పురుషులు చేతనుల్ మమతఁ బొందరె చక్కనియింతిఁ జూచినన్.

76


మ.

అరవిందాక్షులు దీఁగయుయ్యలల నొయ్యారంబుగా నూఁగఁ జొ
చ్చిరి పాదాబ్జము లవ్వనీకిసలయశ్రేణిం దలల్దన్న సుం
దరశోభానఖపఙ్క్తి చుక్కగమిపై దండెత్త మంజీరపుం
జరవం బభ్రధునీమరాళముల వాక్ స్తంభంబు గావింపఁగన్.

77


పాదాక్రాంతములయ్యె రాగగుణసంపత్పల్లవవ్రాతముల్
మోదంబొప్ప నుయాల లూఁగుచుఁ బదంబుల్ ప్రాంతవృక్షాళికిన్
మీఁదం జూపుమెఱుంగుబోండ్ల కుచితం బేకావిటీకోటికిం
బాదాక్రాంతము లౌట రాగగుణసంపత్పల్లవవ్రాతముల్.

78

పుష్పాపచయవర్ణనాదికము

సీ.

అలివేణి కెంగేల నంట మాకందంబు ఒకవాణి పాడినఁ బ్రేంకణంబు
పొలఁతుక కలికిచూపులఁ జూడఁ దిలకంబు చెలిపదాబ్జంబుఁ జేర్చిన నశోక
మలసగామిని ముద్దుపల్కు పల్కిన గోఁగు నలినాక్షీహసనం బొనర్పఁ బొన్న
కనకాంగి యూర్పు సోఁకిన సిందువారంబు చానమోమెత్తినఁ జంపకంబు


తే.

కుసుమకోమలి యెదఁ జేర్చుకొనినఁ గ్రోవి, యువతి పుక్కిటిమధువు పైనుమియఁ బొగడ
తమి నలరి పూచెఁ బో యచేతనము లయ్యుఁ, బురుషులన నెంత చెలులకు మరులు కొలుప.

79


వ.

మఱియు నయ్యరవిందలోచనానిచయంబు పుష్పాపచయంబు స్వచ్ఛందవిహరణకుతూ
హలాధీనమానస లయి యొనర్చుచుం దమలోన.

80


రగడ.

తరుణి తరుణిసుమాళి యబ్రపుఁదావిఁ దా నిలసిల్లె నిత్తఱి
నరయ నరయత మాని చేకొన రమ్మర మ్మని పిలిచి బిత్తరి
కదలి కదలి నటింప దళములఁ గానఁగా నరుదయ్యె నందము
ముదిత ముదితమిళిందమౌఁ గదె మొల్ల మొల్లపువిరిమరందము
తనరు తనరుచిగరుడరత్నమతల్లి తల్లియ నా వెలుంగుచు
వనిత వనితరుశాఖఁగీరము వ్రాలె వ్రాలెడువేడ్కఁ బొంగుచుఁ

బొగడఁ బొగడఁగ నొప్పుఁ జూడుము పూని పూని కరంబు గొమ్మది
నగము నగమును బోలె నున్నది నాతి నాతిలకంబు సుమ్మది
వరస వరసహకారపాళి సువర్ణవర్ణపరాగజాతముఁ
గురువ గురువగు వలపు నల్దెస గుప్ప గుప్పన వీచె వాతము
కోక కోశనదస్తనాంఘ్రి ముకుందకుందనిదానలాభమె
నీకు నీకురువేరు లిట్లొడినిండ నిండన నింతలోభమె
వలపు వలపున దమ్మియని శశివదనవదనము సారెఁ జేరఁగ
నలికి నలికిభ్రమించే నగ్గజయాన యానవలాలు గేరఁగ
తా లతాలఘుడోల నూఁగుచుఁ దన్నఁ దన్నగ మది చలించెను
మేలమే లలితాంగి ప్రౌఢిమ మెచ్చు మెచ్చుగ నందగించెను
అతివ యతివర్ణితములై చెన్నారు నారుచిరంపుమల్లెలు
హితమహితమతి నొసఁగి కైకొనవింతవింతలె నీకుఁ జెల్లెల
యక్క యక్కలకంఠకులరవ మందమందత చెలఁగె విందము
నిక్కు నిక్కుజరాజి దట్టపునీడ నీడగ్గఱనె యుందము
జాతిజాతి సుగంధ మిచట నెసంగ సంగతమయ్యెఁ జా వివి
గోతు గోతులితాబ్జ త్రుంచవె గోర గోరకములు ప్రియాళిని
లలన లలనవపాటలీపటలంబు లంబుజగంధిపొదపొద
గలయఁ గలయవి యెల్లఁ గోయగఁ గానఁ గానవె యటకుఁ బొదపొద
కాంత కాంతపుగొజ్జఁగుల నిదె కంటిఁ గంటికి నింపుగా నివి
నింతు నింతులఁ గాననీకొడి నిచ్చ నిచ్చకు వేయఁ గానివి
కమ్మ కమ్మరొ చూతు సంపెంగలను గలనునుగాంతవృత్తులు
కొమ్మకొమ్మకుఁ బూన్కి నిగిడెదఁ గొమ్మ కొమ్మలె పొన్నగుత్తులు
కలసి కలసితచంచలతవనకమలకమలత నాటఁజూపెడు
నలరునలరుల తీఁగయదె నటనాఁగ నాగము గెలువ నోపెడు.

81


వ.

అని యన్యోన్యసంభాషణతత్పరలై చెలంగి మెలంగుచుండి రప్పుడు.

82


సీ.

స్వేదాంబుకళికలచేఁ గుచంబులకు దృష్టాంతమయ్యెఁ బయోధరాభిధాన
మపరంజిపసిఁడిచాయలఁ గుల్కుతనువల్లికలయందు బడలికల్ గానుపించె
వడదాఁకి కనుగంది వదనేందుబింబముల్ కెందమ్మిచాయల నందగించె
నలసభావములైన యంఘ్రివిన్యాసముల్ విహరణోత్సాహంబు విడుపుఁ దెలిపెఁ

తే.

 భ్రాంతసరసీరుహాకరాంభస్తరంగ, పవనములమీఁద హృదయము పరువులెత్తె
వేల్పువెలయాండ్ర కారామవిహృతివలన, సంభవించినఘనపరిశ్రాంతివలన.

83

జలకేళీవర్ణనము

క.

వనకేళియలఁతఁ దీర్పఁగ, వనకేళియ యుచితమనుచు వనితలు వలుకన్
వినిహితకరమని సఖిపై, వినిహితకర యగుచు మరలె వెలఁదుక యచటన్.

84


సీ.

సరసాతిశయసార సరసానుభవధీర తరసారఝంకార కరమదాళి
కలనాదకృతతాళ కలనాయుతమరాళ లలనాపురుషజాల లలితకేళి
రటదాగమాభంగ నటదాతతతరంగ ఘటదాకృతిరథాంగ పటలశాలి
పవనార్భకవినోద జననాట్యకృన్మోద భువనాద్భుతామోద కువలయాళి


తే.

ప్రకటనికటతటస్ఫుటపటుపటీర, విటపిపరిమళమిళితనవీనమృదుల
కదళికాతరువిగళితకలితశశిర, జఃపులినపాళి యొక్కకాసారమౌళి.

85


వ.

మఱియును.

86


తే.

భువనములు దనలోపలఁ బొదలుచుండ, రాజహంసరథాంగవిరాజి యగుచు
నబ్జభూషితమై యొప్పె నక్కొలంకు, హరునిపోలిక తనయందు నచ్చుపడఁగ.

87


ఉ.

హల్లకపాళిపేర వికచాబ్జదళంబులపేరఁ జక్రవా
కొల్లసనంబుపేరఁ జెలువొందెడు హంసకులంబుపేర సం
ధిల్లు శయాంబక స్తనగతిస్ఫురణల్ నయనాభిరామమై
చెల్లఁగఁ దద్వినోదసరసీరమ సొంపు వహించె నెంతయున్.

88


తే.

ఇందిరామందిరమునకు మందిరమఁట, పుట్టినిల్లఁట పుష్పవద్భోగినులకు
నాయుధాగారమఁట మాధవాత్మజునకు, సరసిమహిమంబు వర్ణింప శక్యమగునె.

89


ఉ.

అట్టి సరోవరంబుఁ గని యవ్వనితల్ జనితానురాగలై
యిట్టి కొలంకుఁ జూచి మును పెన్నఁ డెఱుంగ మటంచు నెమ్మదిం
బుట్టిన తద్విహారరతబుద్ధిఁ జొకాటపురేవెలుంగురా
మెట్టులమీఁద బాదములు మెట్టుచు నందెలు ఘల్లుఘల్లనన్.

90


తే.

అతివ లవలంబితాన్యోన్యహస్తకమల, లగుచు సలిలంబులోపల దిగి నిజాంగ
లలితలావణ్యముక్తాఫలప్రదీప్తి, చే నలంకరణంబు చేసిరి కొలంకు.

91


మ.

జలజాతోత్పలహల్లకప్రముఖపుష్పశ్రేణి నెట్లాడుచున్
జలపూరంబులఁ జల్లులాడుచు నుదంచచ్చంచరీకాళి న
గ్గలికం జోపుచు హంససారసరథాంగవ్రాతముం దోలుచున్
సలిలక్రీడ లొనర్చి రంగనలు సింజత్కంకణోదారలై.

92

సీ.

వెలయించెఁ గ్రొత్తచెంగలువపువ్వులగముల్ రమణీమణులహస్తరాగలక్ష్మి
సమకొల్పె నభినవచక్రవాకసమృద్ధి పువ్వుఁబోఁడులకుచాభోగమహిమ
యెసఁగఁజేసె నపూర్వబిసరుహసామగ్రి బింబాధరలయాస్యబింబసుషమ
పొదలించె వింతతుమ్మెదగుంపులను దటిల్లోచనాకచభారమేచకంబు


ఆ.

సహజమయిన సరసిసౌభాగ్యమునకు సౌ, భాగ్య మొదవఁ జేసెఁ బద్మముఖుల
యంగములవిలాస మవని శ్రీ శ్రీ జేయు, ననెడిమాట నిశ్చయంబు గాఁగ.

93


సీ.

ఈముద్దుమోముల కెనయౌనె తనలోనితమ్ములు పంకజాతము లనుచు
నీవాలుఁగన్నుల కెనయౌనె తనలోని కైరవంబులు దివాభీరు లనుచు
నీచన్నుఁగవలకు నెనయౌనె తనలోని చక్రపఙ్క్తులు విలక్షణము లనుచు
నీవళిరేఖల కెనయౌనె తనలోని ఘనతరంగములు భంగంబు లనుచు


తే.

నీశిరోజములకు నెనయౌనె తనలోని భ్రమరములు సువర్ణసుమవిరోధు
లనుచు దద్విటీవిహారవిలోచన, వ్యాజమునఁ గలంక మందెఁ గొలఁకు.

94


సీ.

కచవిలాసము చూచికాదె చలించె శైవాలముల్ మదభృంగజాలములును
ఘనకుచోన్నతి చూచికాదె జంకె సరోజకుట్మలానీకముల్ కోకములును
గనుచూపువగఁ జూచికాదె తలంకె నిందీవరములు నండభూవరములు
కరరక్తిమము చూచికాదె కంపమునొందె నవహల్లకములు కెందమ్మిగములు


తే.

ననుచు నిజవిహరణరభసాతిరేక, లుఠదభంగురభంగవిలోలతత్త
దాకృతులు చూచి పలుకుదు రబ్జముఖులు, చతురభాషలు జలకేళిసమయమునను.

95


క.

అంభోరుహాకరమున విజృంభణమున నీఁదుటకు ధరించిన శుంభ
త్కుంభప్లవంబు లనఁ గుచ, కుంభంబులు దనర ముద్దుగుమ్మలు వరుసన్.

96


క.

జలముల మునుఁగుచుఁ దేలుచు, మెలఁగఁగ జవరాండ్ర ముద్దుమేనులు వొలిచెన్
జలదంబులోన నెడనెడ, లలితగతిం దోఁచు చంచలాలత లనఁగన్.

97


సీ.

గుత్తంపుగుబ్బలు గుఱిచేసి వైచెఁ బయోజకుట్మలముల నొకతె నొకతె
కులుకువాల్గన్నులు గుఱిచేసి వైచె నీలోత్పలావళులచే నొకతె నొకతె
కొమరారుబాహువుల్ గుఱిచేసి వైచెఁ గొంచక మృణాళంబుల నొకతె నొకతె
క్రొన్ననకెమ్మోవి గుఱిచేసి వైచె హల్లకనికాయంబున నొకతె నొకతె


తే.

తగవు దప్పని జగడ మీతరుణులందు, సూటిపడె మేలు మే లని జోకఁ జెలులు
సరసమాడంగ విరుల వసంతమాడి, రాలతాంగులు పంకేరుహాకరమున.

98

చ.

లలనలముద్దుమేనుల నలందిన నిర్మలచంద్రసారసం
కలితపటీరపంకనవగంధరసంబును బూని వింతగా
వల పుదయించు తత్సరసివారి నపూర్వముదాప్తిఁ దేలుచుం
జెలఁగె మరాళదంపతులు చిత్రగతిం గలనాదవైఖరిన్.

99


తే.

ఇవ్విధంబునఁ గొంతప్రొ ద్దిందువదన, లంబుజాకరకేళివిహారలీల
మెలఁగి చాలించి వెలువడి రలమరుండు, పదును వెట్టి వెడల్చునంబకము లనఁగ.

100


క.

అనురాగరసార్ద్రములై, యెనసి తొలంగని విటాలి హృదయములగతిన్
వనితలతనువుల నంటెన్, ఘనరససంప్లుతములైన కనకాంబరముల్.

101


చ.

తడిసిన వల్వెపయ్యెదలు దాకొని పైపయి నంటి యుండఁగా
నుడువ నగోచరం బగు వినూత్నవిలాసత నొప్పె నప్పు డ
ప్పడఁతుల గుబ్బచన్గవలు ప్రౌఢకవీంద్రులచే రచింపఁగాఁ
బడుమృదుగూఢపాకరసబంధురకావ్యవచస్సమంబులై.

102


సీ.

అంగనాకచనీరజావతీర్ణంబులై వర్షోపలముల భావమునఁ బొలుచు
మదవతీవదనేందుమండలావృతములై తారకావళివినోదమునఁ దనరుఁ
గామినీకుచహేమకలశస్థితంబులై ముక్తాఫలంబులమురువు గాంచు
లలితవతీగాత్రలతికాశ్రయంబులై నవకోరకంబులనయముఁ దెలుపు


తే.

వెల్లివెట్టిన లావణ్యవిభవవాహి, నీసముద్భూతబుద్బుదానీక మనఁగఁ
దగిన జలబిందువితతి కాంతలమనోహ, రాంగకంబుల జలకేళికాంతమునను.

103


శా.

సౌవర్ణాంబరముల్ ధరించి మణిభూషాజాలముల్ దాల్చి మే
ల్పూవుందండలఁ గీలుగంట సిగ లొప్పు ల్మీఱఁగా వైచి నె
త్తావుల్ గ్రమ్మెడు చందనం బలఁది కాంతల్ నవ్యశృంగారలీ
లావిభ్రాచితలై సుశీతలరసాలచ్ఛాయ నాసీనులై.

104


వ.

ఉండి రయ్యెడ నయ్యూర్వశి వశీకరణార్థంబుగా సంగీతప్రసంగం బెసంగించు
నుత్సాహంబున.

105


చ.

గవిసెనఁ బాయఁగాఁ దివిచి కైకొని సారెలు చక్కనొత్తి మా
ర్దవఫణితిన్ శ్రుతుల్ గలియఁ దంత్రులు చక్కఁగ మేళగించి చ
న్గవపయి నొక్కకాయ యొకకాయ నిజాంకమునందు నుంచి ప
ల్లవమృదులాంగుళీహతి కలక్వణితంబుగ వీణ మీఁటుచున్.

106

సీ.

బంగారుజలపోఁత రంగుమీఱినకాయ కుచమండలంబుపైఁ గొమరుమిగుల
సరసాంగుళులు సారెసారె సారెలమీఁద నారోహణావరోహణతఁ దనర
నేర్పరింపఁగరాక యేకమై జంత్రగాత్రంబుల నాదామృతంబు దొరుగ
భావానుభవలీలఁ బైకొన్న మదిసొక్కు కనుచూపువింతచేఁ గానఁబడఁగ


తే.

మంద్రమధ్యమతారకాసాంద్రసరిగ, మపదనిస్వరానుస్వరమాధురీధు
రీణగీతప్రబంధప్రమాణఫణితి, వీణ వాయించె గానప్రవీణ యగుచు.

107


తే.

వెలఁదికుచకుంభములతోడ వీణకాయ, పడఁతివీణాస్వరముతో విపంచిరవము
చేసె సహవాస మనుగుణస్నేహ మనఁగ, నందమౌఁ గద యీడుజోడైన చెలిమి.

108


చ.

మలయజగంధి తాళపరిమాణమనోహరరాగగీతికా
కలనినదంబు జంత్రమున గాత్రమునం జెలగింపు నింపుచే
శిలలు ద్రవించెఁ జిత్రములు జీవకళల్ ధరియించె దారువుల్
పొలుపుగ నంకురించె మృగముల్ మదిఁజొక్కు వహించె నెంతయున్.

109


శా.

ఆగాంధర్వనినాదవైభవము బ్రహ్మానందమై యందమై
భోగేచ్ఛాంకురకందమై శ్రుతిసుభోద్భూతామృతస్యందమై
వాగర్థైకరసానుభూతి కుతుకస్వచ్ఛందమై యొప్పుచున్
రాగాంభోనిధి ముంచి యెత్తె మునిచంద్రస్వాంతకంజంబులన్.

110


ఉ.

చల్లఁదనంపుసొంపు వెదచల్లుచు వెన్నెలతేటవోలె వి
ద్యుల్లతికాంగి గానరసముద్గతమై మునిమానసాంతరా
లోల్లసనప్రపూర్తిఁ జెలువొంది కరంగఁగఁ జేసె నింపు సం
ధిల్లఁ దదీయధైర్యరజనీకరకాంత శిలోచ్చయంబులన్.

111


తే.

రాగమా యిది మది కనురాగ మనుచుఁ, బదములా యివి ప్రేమ కాస్పదము లనుచుఁ
దాళమా యిది రతికినుతాళ మనుచు, యోగు లద్భుతరసభంగయోగు లగుచు.

112


శా.

ధ్యానానందనిమీలనంబు లగునేత్రద్వంద్వముల్ విచ్చి య
మ్మౌనుల్ గాంచిరి చెంగటన్ నిజసఖీమధ్యంబునం బొల్చు శం
పానైగన్నిగగాత్రి నీలచికురన్ బంధూకరాగాధరన్
మీనాక్షిన్ దృఢతుందిలస్తనిదరస్మేరాననాంభోరుహన్.

113


వ.

కాంచి యక్కళావతీతిలకంబు చక్కఁదనంబునకు నక్కజం బగునాశ్చర్యంబు
నొందుచు.

114

చ.

పలుకుల ముద్దునెమ్మొగముబాగు పిఱుందులసోయగంబు చ
న్నులగమకంబు కన్నులవినోదము చేతుల యొప్పిదంబు చె
క్కులబిగి కౌనులేఁతవగ కొప్పువిలాసము మోవిఠీవి మై
చెలువము దీనిసొమ్ముగ రచించెఁ జుమీ యజుఁ డింతవింతఁగన్.

115


ఉ.

తావిపసిండికమ్మి వనితామణిమేను కళంకులేని రా
కావిధుబింబ మంగనమొగంబు సుధారస మూరు కెంపు లీ
లావతిమోవి యిట్టటుఁ దొలంగని జక్కవ లింతిచన్ను లౌ
రా వలరాయఁ డైనను విరాళిఁ గొనుం గద దీనిఁ జూచినన్.

116


క.

తెలుపక తెలుపుచు నున్నది, జలజాననమోము పూర్ణచంద్రుఁ డగుట కో
మలహసనచంద్రికాధర, లలితసుధాదృక్కురంగలక్షణములచేన్.

117


సీ.

ఘనసారసారసాంగత్యంబు నొల్లని గజనిమ్మపండ్లచక్కందనంబు
ముక్తామణుల గూఢముగ నణంచుకయున్న కుంభికుంభములవిజృంభణంబు
చేరఁబోయినను శృంగారరసాకృతి గనుపించుకొండలగౌరవంబు
చకితస్వభావచాంచల్యపత్రకములై భ్రమియించు చక్రవాకములసొబగు


తే.

పోల్పఁదగు టెట్లు కలితకర్పూరమై ప్రకాశమౌక్తికహారమై కదిసి చూడ
సరసమై విస్తరళపత్రసహితమై యె, సంగు నీయంగనామణిచన్నుఁగవకు.

118


ఉ.

అంబుజగర్భుఁ డింతియధరాంగుళిహాసశిరోరుహాదు లం
దంబగుకెంపు విద్రుమకదంబము మౌక్తికముల్ సురేంద్రనీ
లంబులు నాదిగాఁగ నుపలంబులె కూర్చి రచించె దీని చి
త్తంబును నట్ల సేయఁడుగదా మదిలో ననుమాన మయ్యెడున్.

119


మ.

అనురాగంబున నట్టిరూపవతి తానై కౌఁగిటంజేర్చి పై
కొని కించిచ్చలితస్తనాగ్ర యగుచుం గొక్కోకశాస్త్రార్థయు
క్తిని బుంభావరతిప్రసంగకలనం గ్రీడించునాభాగ్య మె
వ్వనికిం గల్గు నదృష్టలధ్యములు గావా సుందరీసౌఖ్యముల్.

120


వ.

అని విచారింపుచు.

121


సీ.

భస్మాంగరాగకల్పనఁ దొఱింగి లతాంగి వలిగుబ్బమొనల మై యలమఁ దివురు
నాసాగ్రదృష్టివిన్యాసంబు చాలించి నాతిమర్మంబులు నాటఁజూచు
నాదసంశ్రవణసన్నహనంబు మఱచి తన్విమృదూక్తి వినుటకు వీనులొగ్గుఁ
దొరుగు బ్రహ్మపదామృతరస మానుట మాని మానినికెమ్మోవి యానఁగోరుఁ

తే.

గేవలం బగుకుంభకక్రియ సడల్చి, కొమ్మ ముఖపద్మసురభి మూర్కొనఁదలంచుఁ
గరణపంచక మిట్లు తద్గతముఁ జేసి, మునియుగం బాత్మనిష్ఠ వీడ్కొని కరంగి.

122


తే.

మగువతనుసీమ నాపాదమస్తకముగఁ, దిరుగ మౌనులచూపులఁ దియ్యవింటి
గడుసుమన్నీఁడు చనుగట్ల నడిమియిఱుకు, గనుమనరికట్టె నిట్టటుఁ గదలనీక.

123


ఉ.

పయ్యెదజాళువాబిఱఁగు పయ్యెదఁ చిక్కటమై బిగించి యా
యయ్యల కాసగొల్పఁ జెలి యయ్యలఘుస్తనపాళిమీఁదఁ జే
వెయ్యను బుద్ధిపుట్టె మఱివె య్యనుకొన్న విరక్తి గల్గునే
తియ్యనివింటిదంట యొఱదియ్యని వాఁడికటారి యెట్టిదో.

124


సీ.

అంకంబులయ్యె నీలాలకచెక్కిళ్ల మకరదళంబులు మన్మథునకుఁ'
జాపంబులయ్యెఁ గంజాతపత్రేక్షణభూవల్లికాద్వయి భావజునకు
బాణంబులయ్యెఁ జంపకమోహనాంగియపాంగమాలికలు పంచాశునునకు
నళిబలంబయ్యె సీతాంశుబింబాననబలుకొప్పు శంబరభంజనునకు


తే.

నమ్మునీంద్రులమీఁద నహంకరించి, దండు వెడలెడు పుష్పకోడండపాణి
కమరె సాధనసంపత్తి యలఘుమహిమ, పొలఁతియంగకలీలావిభూతివలన.

125


ఉ.

ఆవలరాయరాహుతుఁ డహంకృతి పచ్చనిఱెక్కపక్కెరన్
ఠీవివహించుతేజిని వడిం దుమికింపుచు నుగ్రమూర్తియై
కేవున నార్చి తూఱి నఱకెన్ యతిహృద్ధృతి ఖండఖండముల్
గా వరకేతకీకుసుమగర్భదళోజ్జ్వలఖడ్గధారచేన్.

126


తే.

ఇట్లు మదనవ్యధాభిన్నహృదయు లగుచు, నున్న మిత్రావరుణమౌను లన్నిలింప
సుందరీమణి మోమునఁ జూడ్కి నిలిపి, యెద్దియేనియుఁ బలుక నూహించునపుడు.

127


ఉ.

పంకజనేత్ర యమ్మునులభావ మెఱింగి తరంగితప్రమో
దాంకవిలోలలోచనదృగంచలయై గళితోత్తరీయయై
పొంకపుఁజన్నుదోయి వలపుల్ గొలువ న్నవరత్న కింకిణీ
కంకణమంజులధ్వనులు ఘల్లన సిబ్బితితోడ మందహా
సాంకురలక్ష్మిఁ జిత్తము బయల్పడ డిగ్గున లేచి నిల్చినన్.

128


క.

ఆవగ యబ్బురపడి మో, హావేశతఁ జూడఁజూడ యతివరులమనో
భావము లానందావి, ర్భావంబులఁ జొక్కి వీర్యపతనం బయ్యెన్.

129


వ.

తదనంతరంబ.

130

మిత్రావరుణు లూర్వశిని శపించుట

క.

తెలివొంది యాత్మనిష్ఠా, చలనమునకు వగచి తాపసజనోత్తము లీ
లలనకతంబున విఘ్నం, బొలసెఁ దపంబునకు ననుచు నొదవెడు నలుకన్.

131


కె.

మానవమానవతీస్థితి, తోనుండుము భూమి ననుచుఁ దొడరి శపింపన్
మానిని శాపవిముక్తికిఁ, గా నెంతయు వేఁడుకొనినఁ గరుణాన్వితులై.

132


క.

కతిపయదినములు భువిలో, నతిసంతోషమున నుండి యంతట నమరా
వతి నుండఁగలవు పూర్వ, స్థితి నంచు ననుగ్రహంబు చేసిరి మౌనుల్.

133


వ.

అంత నక్కాంత చింతారహితస్వాంతయై యమ్మునీంద్రుల వియోగంబునఁ బ్రస్ఖ
లితశుక్రంబు కుంభక్షిప్తంబు గావించి వారలచేత ననుజ్ఞాతయై చని పురూరవుని
తోడి సంబంధం బ పేక్షించి తిరుగుచుండఁ గుంభగతం బయినమిత్రావరుణుల
తేజంబువలన మహామహిమప్రాశస్త్యుండై యగస్త్యుండును, నిమినృపాలశాపనష్ట
శరీరుండై పునర్దేహప్రాప్తితికిఁ బ్రహ్మనియోగంబున మిత్రావరుణతేజఃప్రవిష్టుం
డయిన మునిశ్రేష్ఠుఁ డగువసిష్ఠుండును సంభవించి రట యూర్వశిం దోడ్కొని
పోవుటకై నాట్యమేళకర్త లగుట గంధర్వు లచటికి వచ్చి యమ్మగువయభిప్రాయం
బెఱింగి యిప్పడతి హృదయం బిప్పుడు మరల్ప వశంబుగాదు మఱికొన్నిదినంబుల
కయినం దోడ్కొనిచన నుపాయం బిప్పుడు చేయవలయు నని యూహించి యత్త
రుణిం గనుంగొని నీవు పురూరవునిపొందునకయి బద్ధానురాగంబున నున్నదానవు
నీకోర్కె విఫలంబు చేయంగూడదు గావున నిన్నొకటి యర్థించెద మంగీకరింప
వలయు నతనిసఖ్యం బనుసంధించునపుడు నీవు క్రీడార్థంబుగాఁ బెంచిన జోడు
తగళ్లను జోరమృగాద్యుపద్రవంబులం బొరయకుండ నిరంతరంబు సంరక్షించు
నట్లును వివస్త్రతాకారంబుగాని యాకారంబున నెప్పుడు నీకడ మెలంగునట్లును
సమయంబు చేసి యొడం బఱుచునది యని యియ్యకొలిపి యయ్యింతి వీడ్కొని
చని రంత.

134

హేమంతఋతువర్ణనము

క.

హేమంతము నవయౌవన, సీమంతవతీకుచాద్రిసీమాంతరవి
శ్రామసుఖయువనిరాకృతి, సామంతం బగుచుఁ దనరు జగతిన్ సుగతిన్.

135


తే.

చలికి బెగడొంది మేరువుచాటుఁ జొచ్చి, యెట్టకేలకుఁ గాని రాఁ డినుఁడు వెడలి
వెడలి పరువెత్తి యపరాత్రి వెనుక కేగు, నితరజనములు శీతార్తి యెన్న నేల.

136

తే.

మాసములలోనఁ దనమూర్తి మార్గశీర్ష, మనుభగవదుక్తి కిది సాక్షి యయ్యె ననఁగఁ
బాడిపంటలు బలిసి సౌభాగ్యమహిమ, లోచనానంద మయి యుండె లోకమునను.

137


చ.

చలిచలి యంచు మానవులు సంకుచితాంగకులై వణంకుచుం
బొలఁతులగుబ్బచన్గవలపొంతల డాఁగియు మారుతంబుపై
నొలయని యిండ్లనీగియుఁ గటూష్మపదార్థము లారగించియుం
గళితపుఁ బచ్చడా లిరియఁ గప్పియుఁ గుంపటుల న్మెలంగువ
హ్నుల సెగఁగాఁగియున్ గడపుచుందురు ప్రొద్దులు సీతుకందువన్.

138


సీ.

తతహంసమాలికాతల్పభాగంబులపై జోడువాయక పవ్వళించి
యగరుగంధపుఁబూతఁ దగుగుబ్బచన్నుల సెగలూరఁ గౌఁగిళ్లఁ బిగియఁజేర్చి
తమిదోఁచు నంతరుష్ణము దెల్పునూర్పులు మోముఁదమ్ములు గ్రమ్మముద్దు లొసఁగి
సలవంగనవజాతిఫలమిళద్వీటియుతాధరసీథువు లాననిచ్చి


ఆ.

ప్రచురనర్మమర్మరుచిరలై శ్యామాజ, నంబు సలుపుసురతనాట్యసుఖము
రసికులకు మనోభిరంజనం బయి యొప్పె, భువిని హిమదినైకభోగ్య మగుట.

139


వ.

తదనంతరంబ.

140

శిశరఋతువర్ణనము

క.

పన్నీటిజడికి నామని, వెన్నెలల కబోధవేళ వీడ్కొలుపు పయో
జోన్నతికి ధాన్యలక్ష్మి ప్రసన్నంబగునెళవు శిశిరసమయము దోఁచెన్.

141


సీ.

జగదేకమాత నీశ్వరిఁ గన్నవరగోత్ర మాశ్రమస్థలముగా నమరు నెద్ది
సత్యవతీపరాశరులకూటములకై కల్పించె నహరంధకార మెద్ది
జైవాతృకునికరచ్ఛాయాకలాపంబు తనమూర్తిమయముగాఁ దనరు నెద్ది
పన్నీరుపేరిఁటఁ బరఁగి భోగులకు వేసవివేళ సౌఖ్యం బొసంగు నెద్ది


తే.

యట్టినీహార మఖిలదిగంతరములఁ, బర్వె నీరంధ్రమై కకుప్పాలకావ
రోధయౌవతయవనికారుచిరధవళ, పటపటుత్వంబు దనయందుఁ బట్టువడఁగ.

142


క.

వరతుహినబిందుసాంద్రో, దరము లగుచు నాగవల్లిదళములు దనరున్
సురతాంతశ్రమజలకణ, భరితశ్యామాకపోలఫలకాభము లై.

143


శా.

సంకేతంబుల జారులం గలసి తత్సంయోగజశ్రాంతితో
లంకె న్నిల్పెడు ప్రేమబంధముల రేల్ గౌఁగిళ్ల నిద్రించి ని
శ్శంకం జేరుదు రిండ్లు రేపకడలం జారాంగనల్ ఛాదితా
శాంకోద్యచ్ఛిశిరాగమాధికహిమాద్యావృత్త్యదృశ్యక్రియన్.

144

క.

ఉండున్ ఘనఘనసారక, రండముక్రియ భూనభోంతరాళవ్యాప్తా
ఖండహిమపాండిమమున న, జాండకటాహంబు తదహరాదులయందున్.

145


ఉ.

ఆయెడ నప్పురూరవుఁ డుదగ్రపరాక్రముఁ డష్టదిఙ్మహీ
నాయకలోకమౌళినటనవ్యకిరీటకిరీటభావభా
గ్గేయనిజైకశాసనవిఖేలనుఁడై యపశత్రుపక్షని
ద్రాయితఖడ్గజిహ్వగవతంసకుఁడై జగ మేలుచున్నెడన్.

146


వ.

ఒక్కనాఁడు.

147

పురూరవుఁడు మాఘస్నానము చేయ నేగుట

క.

ద్వాదశి నభ్యంగము ప్రా, మాదికమున సంఘటించె మనుజపతి కమ
ర్యాదాప్తి వచ్చుఁగాదె ప్రమాదం బొకవేళ బుద్ధిమంతులకయినన్.

148


ఉ.

ఆదురితంబుచే నృపతి యాననసీమ వికారభావ ము
త్పాదకమైన నాప్తులగు బ్రాహ్మణముఖ్యులతోడఁ దెల్సినన్
ద్వాదశిపుణ్యకాలమునఁ దైలమునం దలయంటికొంట దో
షోదయమయ్యెఁ గానఁ గల దొక్కయుపాయము దీనిఁ మాన్పఁగన్.

149


శా.

ప్రారబ్ధాఘపరంపరాదహనకుంభద్రోణిపద్వార్షికా
ధారాపాతము సంచితోగ్రదురితధ్వాంతచ్చటాచ్ఛేదన
ప్రారంభస్ఫుటభాస్కరోదయము ఘోరాగామికాంహోంబుము
గ్వారధ్వంసకలాగవాశుగము మాఘస్నాన ముర్వీశ్వరా.

150


తే.

అర్కుఁ డించుక యుదయించు నపుడు గ్రుంకు, లిడఁ బవిత్రులఁ జేయుదు నిలసురాపు
నైనఁ బ్రహ్మఘ్ను నైన నటంచు మ్రోయు, సలిలదేవత మాఘమాసంబునందు.

151


మ.

కలుగున్ స్నానము భాగ్యవంతులకు గంగారంగదుత్తుంగభం
గలసత్పాండిమతోఁ గళిందతనయాకల్లోలమాలాసము
జ్జ్వలనైల్యం బెదిరింప గర్భితసరస్వత్యూర్మిగౌరంబుతో
నలరం బొల్చు త్రివేణి సార్కమకరోద్యన్మాఘమాసంబునన్.

152


క.

కావున మాఘస్నానముఁ, గావింపుము భోగమోక్షఘంటాపథమై
భూవల్లభ సంకల్పఫ, లావాప్తి యొసంగఁజేయు నతిశీఘ్రమునన్.

153


చ.

అని మఱియుం దదీయసుకృతాతిశయంబు సవిస్తరంబుగా
వెనుకటిసత్కథల్ దెలుప వీనులవిందుగ నాలకించి మే

లనుచుఁ బురూరవుండు సకలాఘవిభంగకు గంగకున్ రయం
బునఁ జని మాఘమాసదినముల్ గ్రమియింపుచునుండె నిష్ఠతోన్.

154


క.

స్నానంబుల నియమాను, ష్ఠానంబుల సిద్ధయోగసల్లక్ష్యహరి
ధ్యానంబుల నానావిధ, దానంబులు హర్షపూరితస్వాంతుండై.

155


వ.

ఉండి యొక్కనాఁడు.

156


సీ.

ఏకాంతవసతిఁ బద్మాసనాసీనుఁడై తనువు ఋజూన్నతస్థాయిఁ జేసి
పరఁగుప్రాణాయామపరిశుద్ధిఁ బవను భ్రూమధ్యశృంగాటకాంబరముఁ జేర్చి
శబ్దాదివిషయముల్ సడలి డెందమవాతనిలయనిశ్చలదీపకళికవోల
నేకాగ్రత రహింప నీక్షణంబులు నాసికాగ్రవిన్యస్తంబు లై సెలంగ.


తే.

నాదబిందుకళాస్ఫూర్తి పాదుకొనఁగ, లోను వెలి యను భేదంబు గానఁబడక
సర్వపరిపూర్ణ మగువిష్ణుశబ్దవాచ్య, సిద్ధవస్తువు ధ్యానంబు సేయుచుండె.

157


శా.

ఆయానంద మమందమై యమృతవర్షాసారసంసేచన
ప్రాయంబై లభితస్వపూర్వసుఖసారంబై యనిర్వాచ్యని
ద్యాయోగానుభవైకమై వెలయ నంతర్జోతి నారాయణున్
యుక్తం బగునిర్వికల్పకసమాధిం బూని భావింపుచున్.

158


క.

నియమసమాప్త్యవసానస, మయమున ననిలంబు మొదవిమట్టునకు శసైః
క్రియఁ జేర్చి ముకుళితాక్షి, ద్వయ మల్లన విచ్చి చూచి ధరణిపుఁ డెదుటన్.

159

తనకుఁ బ్రత్యక్షమైనవిష్ణుని రాజు స్తుతించుట

సీ.

కమలాంచితంబులై కనుపట్టి నయనవక్షోనాభివివరముల్ సొంపుమీఱ
నబ్జారిహితదీప్తతాసమానంబులై వదనహస్తప్రభావాప్తు లమర
ఘనవిరాజద్ద్యుతికలితంబులై శరీరాంబరధ్వజలీల లతిశయిల్ల
సుమనోవిభాసితస్తుత్యంబులై ధైర్యపరిపాకమౌళిసంపదలు దనర


తే.

నపుడు ప్రత్యక్షమయ్యె సుధాంశువంశ, రాజమౌళికి నాదినారాయణుండు
జన్మజన్మాంతరసహస్రసంచితాత్త, సుకృతపరిపాకభాగ్యవిస్ఫురణఁ జేసి.

160


దండకము.

శ్రీమద్రమాభద్ర మాతంగకుంభోపమానస్తనన్యస్త కస్తూరికా చిత్ర
పత్రాంకురాలంక్రియాం కచ్ఛలోద్భాసియంతః కళంకప్రభాస్తోకరాకాకురం
గాంకబింబాకృతిన్ సారసౌరభ్యధావళ్యపాటీరపంకైకచర్చామిళచ్చారుదోరంతర
స్ఫూర్తి వర్తిల్లఁగాఁ దత్కురంగాంకబింబంబుతో సాహచర్యంబు వాటించు తారా
వళుల్ వోలె ముక్తాఫలోదారహారావళుల్ సొంపుమీఱంగఁ దత్తారకావారకాం

తుల్ ప్రకాశించునవ్వేళ సంపుల్లదుల్లాసలక్ష్మి న్విరాజిల్లు నీలోత్పలారామమో
నాఁగ నిద్దంపునెమ్మేనినైల్యం బతుల్యస్థితి న్మీఱ నయ్యుత్పలారామసాంగత్యముం
గాంచు లీలాసుధాసారకాసారమై విగ్రహారణ్యలావణ్యసంపత్తి యొప్పారఁ
దత్సుధాసారకాసారభాగంబునం దట్టమై తెట్టువల్ గట్టియున్నట్టి నెత్త
మ్మిపుప్పెళ్లభాతిన్ నితంబంబుపై వర్ణితోదీర్ణసౌవర్ణపీతాంబరాడంబరం బొప్ప
నత్తమిపుప్పొళ్లచెంతన్ నితాంతంబు వింతై వెలుంగొందు రంగత్తరంగంబులం
బోలి యొప్పారు నంచద్వళీరేఖ శోభిల్లఁగాఁ దత్తరంగాళిపైఁ బొల్చుస
ద్బాలశైవాల వల్ల్యాకృతిన్ రోమరాజీస్వరూపంబు గన్పట్ట నబ్బాలశైవాల
వల్ల్యగ్రభాగంబునం దేలి కల్పించు నాకంబుకంబున్ విడంబించు రేఖాత్ర
యీరమ్యకంఠం బకుంఠద్యుతిన్ నీటువాటింపఁ దత్కంబుసామీప్యదేశంబునన్
మంజుభాషామిషప్రస్రవన్మాకరందంబుతో లోచనచ్ఛద్మసంఫుల్లపత్రాభిరూప్యం
బుతో నొప్పుపద్మంబనన్ సుందరంబైన నెమ్మోము సమ్మోహనశ్రీలఁ బెంపారఁ
దత్పద్మసౌరభ్యపారంపరాస్వాదనాసక్తి పై మూగు బల్తేటిమొత్తంబుడంబుం దలం
పించు నీలంపుఛాయల్ వెదల్చల్లు నోయారంపుంగేశబంధం బవంధ్యప్రమో
దంబు సంధింప నత్తేఁటి మొత్తంబు నిర్వంకలన్ లీలఁ గ్రీడించు రాయంచలౌనంచు
నెంచన్ వినోదించుచున్ గ్రేవలం గేవలంబైన లావణ్యకారుణ్యసంపత్తి ను
ప్పొంగు దివ్యాంగనాశ్రేణిపాణిద్వయి న్వీచునిస్తుల్యధావళ్యవచ్చామరస్తోమ మందం
బు నొందంగ నాయంచలంచద్గతి న్గూయునవ్యక్తమాధుర్యధుర్యస్వనంబోయనం జా
మరగ్రాహిణీ హేమరాజన్మణీ కంకణక్రేంకృతుల్ పొంకమై మ్రోయఁగాఁ దత్స్వర
ప్రాప్తికిన్ వ్యాప్తివాటిల్లు నట్లౌపకంఠద్రుమారూఢహేలాపికవ్రాతకంఠోదితంబైన
యప్పంచమాఖ్యస్వరంబుం బలెం జెంగటన్ వచ్చువైమానికస్త్రీలసంగీతముల్ రంగు
రక్తుల్ వహింపంగ నప్పంచమంబుం బ్రమాణించి యామీఁదటన్ దైవతాంచన్నిషాద
శ్రుతుల్ నింపఁగా లక్ష్యముల్ దెల్పుచందాన హేషావిశేషంబులం బృంహితంబుల్
చెలంగించు నుత్తుంగరంగత్తురంగంబులన్ భద్రమాతంగయూధంబులం జక్కఁగా నెక్కి
వెన్వెంట దిక్పాలకశ్రేణి యేతేర నేవంవిధాకారశృంగారలీలాసద్వైభవశ్రీలచే
నందమై లోచనాందమై చిత్కళానందమై యొప్పురూపంబుతో నిట్లు ప్రత్యక్షమై
నట్టి యాదేవతాచక్రవర్తిన్ లసద్దివ్యమూర్తిన్ జగద్గేయకీర్తిన్ హృతబ్రాహ్మణార్తిన్
నమద్యోగిబృందున్ దరస్మేరశోభాజితజ్యోత్స్నితాచంద్రముక్తాసుకుందున్ ము
కుందున్ ముకుందాది నానానిధానప్రధానాభిధానాలకానాథముఖ్యస్ఫురద్రత్న
కోరోటీరరుగ్రాజినీరాజనాభాజనాంఘ్రిద్వయీభాసమానున్ సమానాసమానాంగసౌ

భాగ్యనీళావినీలాలకాఫాలకాశ్మీరరేఖాంకితప్రస్ఫురత్కంబుజిత్కంధరున్ గంధ
రాక్షేపకృత్కోమలశ్యామలచ్ఛాయికాబంధురున్ బందురక్షాకృపామంధరున్
మంథరున్ మంధరగ్రావధౌరంధరానుగ్రహోద్భూతచింతామణిశ్రీసుధాకామధుగ్దే
వతాసింధురున్ సింధురాజన్యరాజత్తరంగోపరిస్ఫూర్జితాహీంద్రభోగస్థలానల్ప
తల్పున్ నిజాకల్పతేజోభిరామున్ జగత్కల్పనాకౌశలున్ సిద్ధసంకల్పుసుకల్పసంసి
ద్ధిగాఁ జూచుచున్ జన్మ సాఫల్యమయ్యెం గదా నేఁటి కంచున్ బ్రమోదించుచున్.

161


తే.

అట్లు ప్రత్యక్షమైన రమాధినాథుఁ, గాంచి యానందరససమాక్రాంతహృదయ
కమలుఁడై మేనఁ బులకాంకురములు నిండ, నతులతరభక్తి సాష్టాంగనతు లొనర్చి.

162


వ.

ఇట్లని స్తుతియించె.

163


సీ.

భూచక్రధూర్వహభోగిభోగశయాన యానాయితేనసూతానుజాత
జాతరూపమయప్రశస్తనాభీపద్మ పద్మాలయాలయబాహుమధ్య
మధ్యవిలాససంపజ్జితమృగరాజ రాజహంసాంబకరాజమాన
మానసదహరతుంభజ్జోతిరాకార కారణోత్సన్నావతారవార


తే.

వారణాధీశదైన్యాంధకారసూర్య, సూర్యమందవచస్తుత్యసుప్రభావ
భావభవకోటిసుందరశ్రీవిచిత్ర, చిత్రకాయమహాసురామిత్రుమిత్ర.

164


సీ.

తరుణేందుధరమిత్ర దాసవనీచైత్ర కమలాకళత్ర జగత్పవిత్ర
భరితమంధరగోత్ర భ్రాజితాయుతమిత్ర రక్షితాదితిపుత్ర రమ్యగాత్ర
శయనీయపటపత్ర సౌవర్ణనేత్ర పాపలతాలవిత్ర దోర్బలవిచిత్ర
పోషితవైధాత్ర భువనహితక్షాత్ర పరిహృతభవగోత్ర పరిచరిత్ర


తే.

వికసితస్వేతశతపత్ర విమలనేత్ర, చండభండనభూజైత్ర దండయాత్ర
నిగమశాస్త్రాగమస్తోత్ర నికరపాత్ర, యంబకశ్రోత్రరాజఫణాతపత్ర

165

పాదభ్రమకకందము

దానవజలేజవనదా, భానుతతవిభాకరైక భావితతను భా
మానాధ వివిధనామా, యానసరసహారహీరహాసరసనయా.

166

ఓష్ఠ్యకందము

ప్రాపై మాపైఁ బ్రేమన్, మాపాపముఁ బాపి ప్రోవుమా మము భవ్యా
భ్రౌపమ్యభావిభావా, భూపా భ్రూవిభ్రమాప్రభూపా మాపా.

167

నిరోష్ఠ్యమహాస్రగ్ధర

కరఖేలచ్ఛక్రధారాఖరకరకరవినిర్ఖండితోద్ధండచండా
సురరాట్చక్రాంధకారశ్రుతితురగజటాజూటరంగత్తరంగో

త్కరగంగానీరహైరాకరణచణరణత్కాంచనాంచిత్తులాకో
ట్యురుకాంతిచ్ఛన్నగోత్రార్యుదకజజిశిరోయుక్తరాజత్కిరీటా.

168

ద్వ్యక్షరకందము

మామానినీన నేనా, నేమమున ననూననాము నిన్నెన్నను నా
నామునిమనోన్మనిమన, నామనమున నమ్మినాను నన్నోముమనా.

169

గోమూత్రికాబంధము

క.

మురహరసుఖకరలీలా, పరమకృపాధామ విజయభాహాగర్వా
పురహరసఖ సురపాలా, వరసుకృతాధార వినయవాహాఖర్వా.

170

నాగబంధము

చంపకము.

జలరుహనాభ శూలధరసారసగర్భసమేతవైభవా
సలలితరూపనీల ఖలజాలహరప్రభభూరిభోగదా
విలసితపాదశైలధరవీరవరద్విపమోహవారణా
జ్వలదరివాసఖేలకరసారశుభప్రదగీతవారణా.

171

ఛత్రబంధము

క.

ధీరవరద సామరనుత, సారసనయన యెనయైనసరణి మకరహా
హారకమణిరదసురసా, సారసుదరసాతనురమసాదరవరదా.

172

అష్టదళపద్మబంధము

స్రగ్ధర.

హారీనిష్ఠావిబల్యాద్యభినుతసమరోగ్రాఘసుశ్రీవరాహా
హారావశ్రీసుఖగ్రాహకరతిముఖలౌల్యావనస్థాసురీహా
హారీసుస్థానవల్యాయతవిపినసమగ్రాటకప్రాక్షరోహా
హారోక్షప్రాకటగ్రాహ్యసితయశసకల్యాబలిష్ఠానిరీహా.

173

చక్రబంధము

శా.

వక్షశ్రీమణిసుప్రదీప్తమనుసేవ్యా యచ్చనీలాంగదా
యక్షాగోచర కన్గొనంగ మఱి భాగ్యంబబ్బె నాకిఫ్డు నీ
దక్షోపాధిఁ బవిత్రుఁ జేయు మనువొంద న్నన్ననాతంకదా
దాక్షిణ్యావహగేయ నాకు దరియుం దా పొక్కనీవేకదా.

174

సర్వతోభద్రబంధశ్లోకము

నభోగోదదగోభోన, భోప్రమాక్షక్షమాప్రభో
గోమాశయాయాశమాగో, దక్షయాననయాక్షద.

175

ఆంధ్రగీర్వాణభాషాశ్లేషకందము

దేవరమే లారసికా, యేవరసన్మానకమదినేననయము నీ
తావమరున్నాకదనం, దావాలాయమనుమాట దప్పవినవయా.

176

కందద్వయరుగ్మవతీ కమలవిలసిత గర్భక్రౌంచపదవృత్తము

శ్రీమహిమానిశ్రేయససీమా చిరశుభకరవిలసితగుణఖేలా
సామజసంరక్షా నుతసామా సరసిజభవసురసముదయపాలా
తామరసాప్తస్థానకధామా దరనినదచకితదనుసుతజాలా
తామసదూరా ధామసుధామా తరుణసజలజలధరనిభనీలా.

177

ఆపద్యములోనే గర్భకందము

శ్రీమహిమానిశ్రేయస, సీమాచిరశుభకరవిలసితగుణఖేలా
సామజసంరక్షానుత, సామాసరసిజభవసురసముదయపాలా.

178

ద్వితీయకందము

తామరసాప్తస్థానక, ధామా దరనినదచకితదనుసుతజాలా
తామసదూరా ధామసు, ధామాతరుణసజలజలధరనిభనీలా.

179

ఆపద్యములోనే గర్భరుగ్మవతీవృత్తము

శ్రీమహిమానిశ్రేయససీమా, సామజసంరక్షానుతసామా
తామరసాప్తస్థానకధామా, తామసదూరా ధామసుధామా.

180

ఆపద్యములో గర్భకమలవిలసితము

చిరశుభకరవిలసితగుణఖేలా, సరసిజభవసురసముదయపాలా
దరనినదిచకితదనుసుతఖేలా, తరుణసజలజలధరణిభనీలా.

181


మ.

అజరుద్రాదులు మిమ్మెఱింగి నుతిసేయన్ లేరు నేనెంతవాఁ
డ జగద్రక్షణదక్ష నిన్నుఁ గొనియాడ న్నీస్వభావంబు దా
సజనానుగ్రహనిష్ఠితం బగుట నాజన్మంబు సాఫల్యమం
ద జడుండంచు నిరాకరింపక ప్రసన్నుండౌట సర్వేశ్వరా.

182


చ.

అని వినుతించురాజుఁ గరుణామృతశీతలదృష్టిఁ జూచి యి
ట్లను మదుపాస్తిసిద్ధి ననఘాత్ముఁడ వైతివి గాన వంశపా
వన నినుగారవింప నిటవచ్చితి మెచ్చితి నిచ్చితిన్ మనం
బునఁ గలకోర్కులెల్లఁ బరిపూర్ణసుఖంబున నుండు నెమ్మదిన్.

183

తే.

అనుచు నిజపాంచజన్యగర్భామృతంబు, తనువుపైఁ జల్లి దోషముల్ దలఁగఁజేసి
పలికె వెండియు నాశ్రితపారిజాత, మారమాభర్త సౌమ్యకుమారుతోడ.

181


శా.

వైవర్ణ్యంబు దొలంగి షోడశకళాస్వచ్చేందుబింబోపమ
శ్రీ వర్తిల్లెడు నీదుమోము మరునాక్షేపించు సౌందర్యలీ
లావిస్ఫూర్తి యెసంగు దివ్యవనితాలాభంబు గల్గున్ సుపు
త్రావిర్భూతి ఘటించు నేలుదు వనేకాబ్దంబు లీరాజ్యమున్.

182


క.

తుది ననపాయమహాసుఖ, సదనం బగుమత్పదమున సంతసమున నుం
డెద వంచు నానతిచ్చి ప్ర, మదమున వేంచేసె మరలి మాధవుఁ డంతన్.

183


శా.

ఆచక్కందన మాదయారసపుఁజూ పాకోమలస్మేర మా
వాచామాధురి యానిసర్గసరళత్వం బాత్మలో నెంచుచున్
భూచక్రేశ్వరుఁ డేగె నంబురుహనాభుం డాశ్రీితానీకర
క్షాచింతామణిగా యటంచు సముదాశ్చర్యంబుతో వీటికిన్.

184


క.

తనరాకను రాకను జం, ద్రునిరాకను బొంగునమృతతోయధిగతి నూ
తనశృంగారరసోన్నతి, వినుతింపఁగ నొప్పుపురి ప్రవేశించి తగన్.

185


తే.

అన్నరేంద్రుండు రాజ్యభోగానుభూతి, నుల్లమున నుల్లసిల్లుచు నుండె ననుచుఁ
బలుకఁ దరువాతికథ వచఃప్రౌఢిఁ దెలుపు, మని మునీంద్రులు సంప్రీతి నడుగుటయును.

186

పుష్పమాలికాబంధము

చంపకము.

శమదమధామమానస లసద్వసనావృతనూతనాతసీ
సుమసమకోమలాంగ శుచిశుభ్రశుభాకరధీరసారకీ
ర్తిమహిమ సామగేయకృతకృత్య కృపానిధి రాధికాధిపా
సమదమహామురారిచరచక్రచరాచరవారధారణా.

187

ఖడ్గబంధము

క.

వీనఘనయాన కనకన, వీనమణిస్థగితమకుట విజయోద్యోగా
గానకళాద్భుతయాగభు, గానతపదకమలసజ్జనామర్త్యనగా.

188

గోమూత్రికాబంధము

ఉత్సాహము.

తారహారహీరభూరిధామకీర్తికారణా
చారునైల్యసాంద్రదేహక్షేత్రశౌర్యఖేలనా
క్రూరవారవీరవైరిగోమహార్తివారణా
మేరుతుల్యవీంద్రవాహమిత్రకార్యపాలనా.

189


గద్య.

ఇది శ్రీమంగళాచలనృసింహకృపాప్రసాదసంప్రాప్తవిద్యావైభవ కనుపర్తి
రామనమంత్రితనూభవ సుజనహితకృత్యనిత్య అబ్బయామాత్యప్రణీతం బయిన
కవిరాజమనోరంజనం బనుమహాప్రబంధంబునందుఁ జతుర్థాశ్వాసము.