పంచమాశ్వాసము
|
హరినీలసముజ్జ్వల
దేహద్యుతిజాల వినతదిక్పాలచతు
ర్వ్యూహస్ఫుటలీలజగ
న్మోహన గోపాలరణితమురళీలోలా.
| 1
|
వ. |
అవధరింపుము సమస్తసద్గుణసాంద్రు లగు శౌనకాదిమునీంద్రులకు సామోదహృదయ
జలజాతుండై సూతుం డిట్లనియె నట నూర్వశీసౌగంధికగంధి యవ్వసుంధరా
రమణుసంబంధంబునకై సంధిల్లుప్రేమబంధంబున నంతంతకు నగ్గలించుదురంత
చింతాభరపరిశ్రాంతి నెంతయు నలసి సొలసి బాహులతాద్వయావలంబితాంస
భాగోభయపార్శ్వగతప్రాణసభయుగళాధీనశరీరయై యపాటవమాంద్యగమనం
బున వనాంతరంబులఁ బరిభ్రమించుచు హృదయాంతరాళంబున ననస్తమితస్థితి
నశ్రాంతప్రకాశమానంబై తపింపజేయు విప్రలంభప్రద్యోతనద్యోతంముద్య
మంబువలనం గాలనిరూపణంబు దెలియక నిమేషంబులు మాసంబులుగా గ్రహిం
పుచు నకలంకమీనాంకబిరుదాంకగీతికలు నిశ్శంక నంకించి పొంకంబుగాఁ బలుకు
చిలుక గొరువంక కోయిలమూఁకల కలకలంబుల కులుకుచు వికసితకుసుమవిసరపరి
చ్యుతపరాగపటలసాంద్రస్థలంబులు నిదాఘమధ్యందినాతపతప్తసికతాతలంబులుగా
నడుగిడ నలుకుచు మరందంబులకై ముసరుమిళందమ్ముల నందమ్ములై యమందపరి
మళానందకందమ్ము లగుకెందమ్ములందనరు నరవిందాకరబృందములగు చందమ్ములం
గని సధూమాంగారకుందమ్ములుగా విచారించి తొలంగుచు మరుత్పరంపరాకంప
మానవిశాలరసాలసాలప్రవాళజాలలీలాఖేలనంబులు శంబరాంతకుండు శాంబరీవిడం
బనంబున బహుముఖంబులు జళిపించు కౌక్షేయకవిక్షేపంబులుగాఁ దలంచి కలం
గుచుఁ దిరిగి తిరిగి వింధ్యపర్వతప్రాంతంబునఁ జైత్రరథోపమానం బగునొక్కవిచిత్రో
ద్యానంబు చేరి భద్రోపమానస్వచ్ఛతరచ్ఛాయాతరుచ్ఛాయాతలంబునం గూర్చుండి
|
|
|
నిట్టూర్పులు నిగుడించుచు నాందోళితమానసయై యిట్లని వితర్కించె.
| 2
|
ఉ. |
ఆనరనాథచంద్రునిసమాగమసిద్ధికి నింద్రుపంపు భా
గ్యానుగుణంబుగాఁ హృదయంబున నమ్మిటువచ్చి వానిమో
మైనను జూడనైతి నకటా నికటావృతశంబరాహితా
నూనవరూథినీకలకలోద్ధతి కెవ్విధి నోర్తు దైవమా.
| 3
|
చ. |
వలచితినంచుఁ బోయి జనవల్లభు నేనయి పల్కరించినం
జులకదనంబు గాదె ననుఁ జూచి యనాదరణంబు సేసినన్
నిలుచుట యెట్లు ప్రాణములు నేర్పున నాపయిఁ బ్రేమ వానికిం
గలుగఁగఁజేసి కూర్చునుపకారులు నాకిఁక నెవ్వ రక్కటా.
| 4
|
క. |
మనసియ్యక యలయించును, దనువలచిన రంభనైనఁ దా వలచినచోఁ
జెనఁటికినైనను వశుఁడై, చనువిచ్చును బురుషుఁ డెంతసరసుం డైనన్.
| 5
|
శా. |
సౌందర్యంబును యౌవనంబు సిరియున్ సారస్యమున్ వైభవా
నందంబుం గలనాయకుండు వశుఁడై నైసర్గికప్రేమ యొ
ప్పం దాఁ బైకొని నర్మమర్మవచనోపశ్లేషపుంభావయా
చ్ఞం దన్ వేఁడ రమింపఁగల్గుట గదా సౌఖ్యంబు వామాక్షికిన్.
| 6
|
క. |
సరివలపులైన కూటమి, సరసంబై సుఖమొసంగు జవ్వని కైనం
బురుషుని కైనను గూరిమి, యరగొఱఁదగు కలయి కది నిరర్థక మరియన్.
| 7
|
ఉ. |
ఇక్కడి కేల వచ్చు జగదేకనిజాతపవారణాబ్జస
మ్యక్కిరణాపరూపితసమస్తదిగంతనృపాతపత్ప్రభుం
డక్కుసుమాస్త్రమోహనశుభాంగుఁడు వచ్చిన వచ్చుఁగాక నా
యక్కఱ వాని కేటి కరుదా యెలజవ్వను లంతవానికిన్.
| 8
|
వ. |
అని తలంచి నిట్టూర్పు నిగిడించుచు.
| 9
|
తే. |
ముందు విరహాగ్నిసంతాప మందుచున్న, యపు డకారణబంధుఁడై యరుగుదెంచి
సరసహితవాక్సుఛాధారఁ జల్లఁ జేసి, నట్టిశుకమౌళి నిఁకఁ గాంచు టెట్టొ యనుచు.
| 10
|
క. |
కాంచనగాత్రి తలంచిన, యించుకతడవునకు శుక మహీనాశుకమై
చంచలగరుదంచలమరు, దంచితరవ మెసఁగఁ దోఁచె నంబరవీథిన్.
| 11
|
శా. |
రాకారమ్యనిశాకరోదయమునన్ రంజిల్లునీలోత్సలా
నీకంబుం బలెఁ దద్విలోకనసమున్మేషంబులై సాద్భుత
వ్యాకోచస్థితి నేత్రముల్ మెఱయఁగా నాళీకదంబంబు నా
ళీకాభాస్యయుఁ బూర్వసౌహృదయనాళీకాంతరంగంబులన్.
| 12
|
క. |
ఉత్కంఠాతిశయంబుల, నుత్కంఠాభిముఖు లగుచు నుడుపోదయనం
దత్కైరవదళనయనలు, దత్కైరవరాగ మనుసుదర్శనపరతన్.
| 13
|
సీ. |
భగవత్కథానులాపప్రసంగతఁ దనశుకనామము మహార్థశోభితముగ
వైమానికుల ఱెప్పపడనికన్నులు తనతనులీలఁ జూచి సార్థకము నొంద
నరవిందరాగరాగాసనద్యుతి తనకరుణారసవ్యాప్తిగతి వెలుంగఁ
జాంచల్యరహితవీక్షావిలాసము తనగాంభీర్యగుణసూచకంబు గాఁగఁ
|
|
తే. |
జిలుకఱేఁడు నభోంతరసీమనుండి, డిగ్గి చనుదెంచి వ్రాలెఁ బటీరగంధు
లున్నవనిశాఖశాఖపై నొఱపుమేని, పసిమిగారుడమణిపరంపరల నీన.
| 15
|
ఉ. |
పెన్నిధిఁ గన్న పేదగతిఁ బెంపున నుర్వశి హర్షసారసం
పన్నవికాసమానముఖపంకజయై తగ లేచి మ్రొక్కినన్
మన్ననతో శుభం బొసఁగుమాటల దీవన లిచ్చి కెంపురా
వన్నియుమోముపుల్గు మృదువాక్ఫణితిం జెలితోడ నిట్లనున్.
| 17
|
క. |
నీలాలక జాలింబడ, నేలా యిఁక నీదుకోర్కు లీడేరఁగ భూ
లావతంస మిచటికి, వాలాయము వచ్చు మేలువాఁ డగునీకున్.
| 18
|
వ. |
మఱి యొకయుపాయం బెఱింగించెద సకలావయవసంపూర్ణసరససౌందర్యసౌభాగ్య
సముదారంబగునీయాకారంబు పటంబున స్ఫుటంబుగా వ్రాయించి యారూపం బప్పు
రూరవునికి దృగ్గోచరం బగునట్లు చేసినం ప్రేమాంకురం బతనిహృదయంబున నుద
యంబై పూర్వానురాగనివానం బగునాగమిష్యమాణవసంతసమయంబున నమ్మహీకాం
తుండు వనాంతరంబునకు విహారోత్సుకస్వాంతుండై యేతెంచి నిన్నుఁ గాంచి
శోభావైభవపరాభూతచంచలంబులగు తావకదృగంచలంబులకు సహాయంబుగా
విజృంభించి జళిపించు నించునిలుతుని ఖడ్గాంచలధగద్ధగలచే సంచలితమానసుండై
నీతోడికూటమి వాటించు ననేకసమవేకసమం బగుస్నేహమోహంబులఁ గ్రీడిం
చెద రని చెదరని మనస్తాపంబు దీఱ నూఱడించి యారాజకీరంబు ముదితాముదితవా
రంబై మేఘద్వారంబుననుండిన ప్రచారంబున సరి గెఁ దదనంతరంబ శిల్పకళావిశేషం
బున వలంతియగు పొలంతియొక్కతె యన్నెలంతరూపంబు శృంగారరసానురూపకం
బుగా లిఖయించి యవ్విచిత్రపటంబు గైకొని నిజమాయాబలంబుల నెవ్వరు నెఱుంగ
కుండ నమ్మహీజానిరాజధాని యుపాంతంబున భూకాంతునివిహారస్థానం బగునుద్యా
|
|
|
నంబునం జేరి తదంతర్విరచితకనకమణిఖచితకేళీగృహద్వారపార్శ్వభాగమృగాంక
శిలామయవితర్దికోపరిస్థలంబునకు నూతనాలంకారంబుగాఁ దదీయతపనీయకుడ్యం బా
ధారంబుగా నిలిపి చనియె నంత.
| 19
|
క |
వనపాలకు లప్పటముం, గని యౌరా యింతతీరుగలప్రతిమలు నెం
దును జూడ మిడ కెవ్వరు, గొనివచ్చిరొ మదికి వెఱఁగుగొలిపెడు మిగులన్.
| 20
|
క. |
ఏలికకుఁ గాను కిత్తము, చాలన్ దయచేయు ననుచు సరససుగంధ
శ్రీ లెసఁగు విరులు కోసి ప్రవాళపుటంబులను బొదివి వఱలెడువేడ్కన్.
| 21
|
తే. |
చిత్రపటపూర్వకముగ విచిత్రపుష్ప, పత్రపుటములు గొనివచ్చి ప్రభునిసన్ని
ధానమునఁ బెట్టి మ్రొక్కిన దద్విలాస, మునకు నరుదంది యెక్కడి దనుచు నడుగ.
| 22
|
ఆ. |
సామి వారితోఁటలో మిద్దెముంగలి, యరఁగుమీఁద నుండె నాడ కెవఁడు
దెచ్చిపెట్టినాఁడొ దేవరా యెఱుఁగము, కానరాదు వింతమానిసడుగు.
| 23
|
క. |
అని జాతీయపుమాటలు, తనతో నాడంగ మొగముదమ్మిఁ దదాక
ర్ణనహాస్యరసముఁ జిత్రముఁ, గనుఁగొను నద్భుతరసంబుఁ గలసి వెలుంగన్.
| 24
|
వ. |
ఉద్యానపాలకుల నుచితవస్తుప్రదానంబుల నాదరించి వనావనక్రియకు నాజ్ఞాపించి
పనిచి క్రమ్మఱ నప్పటం బభిముఖంబుగా నునుచుకొని యద్దివ్యవిలాసినీరూపంబు
సాపేక్షవీక్షణంబుల నుపలక్షింపుచు.
| 25
|
ఉ. |
క్రమ్మఱఁ గ్రమ్మఱ న్విభుఁడు గన్గొనుఁ దచ్చరణాంగుళప్రపా
దమ్ములు జానుజంఘలు నితంబము నాభ్యుదరావలగ్నపా
ర్శ్వమ్ములు వెన్నుఁ జన్నులుఁ గరంబులుఁ గంఠము మోనిఁ జెక్కులా
స్యమ్మును ముక్కుఁ జూపు బొమలా చెవులా నుదు రాప్రవేణియున్.
| 26
|
ఉ. |
చూడఁగఁ జూడఁగా మదికిఁ జొక్కొదవన్ భ్రమఁ జెంది నిక్కపుం
జేడియఁగాఁ దలంచి యెదఁ జేర్చుకొనం దమకించు నేలమా
టాడవు కోమలీ యని ప్రియంబునఁ బల్కఁదలంచు నారతి
క్రీడల మంత్రవాది యొనరించిన శాంబరియందు మగ్నుఁడై.
| 27
|
ఉ. |
ఎవ్వతెరూప మొక్కొ యిది యింత విచిత్రవిలాసరేఖ యే
జవ్వనులందుఁ జూడ మిది చక్కఁదనంబులఁ గుమ్మ కాముచే
క్రొవ్విరితూపు రత్నములకుప్ప మెఱుంగులతేటఁ ప్రోవు హా
యవ్వనజాతలోచన నిజాకృతిఁ జూచునుపాయ మెద్దియో.
| 29
|
క. |
ఎవ్వనికి వలచునో యెల, జవ్వని తద్రూపలిఖితచారుపటం బె
ట్లవ్వనిఁ జేరెనొ హరుచే, నొవ్వని మరుశక్తి యనిఁ జనుంగద దానిన్.
| 30
|
చ. |
అరయఁగ నాలతాంగి లిఖితాంగ మచేతనమయ్యు డెందమున్
గరఁగఁగ జేయుచున్నయది కన్గొనినంతనె హంసయానమున్
సరసమృదూక్తులుం గులుకుచల్లెడుచూపులు గల్లియొప్పు న
త్తరుణిసచేతనాంగము నెదంగదియించిన సౌఖ్య మెట్టిదో.
| 31
|
వ. |
అని యనేకప్రకారంబుల మదనవికారం బొదవించువిచారంబున నక్కాంతవృత్తాం
తంబు దెలియుటకై వితర్కించుచు.
| 32
|
సీ. |
పటముచెంత నయో సుపర్వాంగనోత్తమా యని వ్రాసియున్న దివ్యలిపివలన
క్షితిపకన్యాశ్రేష్ఠ చిత్రసంగతిపటం బునుప విచిత్రమై యుంటవలన
జనలోకశిల్పకుల్ గని నిర్జరీలేఖ యని నిశ్చయించినయందువలనఁ
బ్రాసంగికమున నారదుఁడు మున్నప్సరోజనము వర్ణించి పేర్కొనుటవలన
|
|
తే. |
భావిసంబంధమున కభిప్రాయమైన, తలఁపుగొలుపు ఋణానుబంధంబువలన
నతనిమది దోఁచెఁ దచ్చిత్రితాంగలీల, యుర్వశీకాంతరూపు గానోపుననుచు.
| 33
|
క. |
ఏరీతినయిన నాలల, నారత్నముతోడి పొందొనర్పవలయు నం
చారాజశేఖరుఁడు మది, నారనితమి సాత్త్వికోదయముగా నుండెన్.
| 34
|
క. |
అంత నతాంతనితాంతల, తాంతవనాంతర్నిశాంతహరిదంతసమా
క్రాంతరవకాంతముదితా, నంతశకుంతము వసంత మాగతమయ్యెన్.
| 35
|
వసంతఋతువర్ణనము
తే. |
ప్రాదళమ్ములన్ మలినాంబరము విడిచి, కట్టెఁ గెందలిరాకుచెంగావివలువ
వనరమాదేవి మాధవస్వామిరాక, కపుడు వాసకసజ్జిక యగుటఁ జేసి.
| 36
|
సీ. |
తలిరుజొంపముపేరఁ బులకాంకురము లూనుఁ బువ్వులపేర లేనవ్వు నవ్వు
నలరుఁదేనియపేర హర్షాశ్రువులు నించు నళిపాళిపేరఁ గొ ప్పలవరించుఁ
బుప్పొడిపేర సొంపుగ గందవొడి పూయుఁ జిల్కపల్కులపేరఁ జెలులఁ జీరు
ఫలరాజిపేర దీప్తమణిభూషలు దాల్చుఁ బరభృతధ్వనిపేరఁ బాట పాడుఁ
|
|
తే. |
జిరసమాగతమాధవవరసమాగ, మోదితావ్యాహతౌత్సుక్యమున వనీర
మారమణి మేలుపడినకోమలులచేష్ట, లట్టులౌఁగద ప్రాణనాయకులయెడల.
| 37
|
ఉ. |
నూతనపుష్పితక్రమమనోహరయౌవనరేఖఁ బల్లవ
వ్రాతము గూడి కొమ్మలు విరాజితలీల నెసంగునత్తఱిన్
|
|
|
నూతనపుష్పితక్రమమనోహరయౌవనరేఖఁ బల్లవ
వ్రాతముఁ గూడఁ గొమ్మలు విరాజితలీల నెసంగి రెంతయున్.
| 38
|
క. |
అమరె వసంతత్యాగము, లమితములై విప్రతతికి నభిమతఫలముల్
సుమహితసారాశనముల్, గ్రమమున నభ్యాగతాళులకు నొనగూడన్.
| 39
|
శా. |
కాలజ్ఞానవచోద్విజప్రతతి వేడ్కం బుష్పవద్గణ్య న
వ్వేళం గాంచి కుహుకుహూక్తిఁ బలికెన్ వేకృష్ణపక్షస్థితిన్
లాలిత్యాకృతి యొప్ప శ్రుత్యనుగతిన్ నానావనీసీమలం
బ్రాలేయద్యుతిరేఖ నష్టమగునప్పట్లన్ యథార్థంబుగన్.
| 40
|
సీ. |
మాధవాగమనసంభ్రమరణత్తూర్యముల్ వనరమాకంకణక్వాణనములు
శంబరాంతకవందిజయశబ్దములు పాంథకాంతాశ్రుతిద్వయీమంతుదములు
దంపతీమానసంస్తంభనమంత్రముల్ పంచమశ్రుతితంత్రిబాంధవములు
బాలికాగణనాదపౌనరుక్తములు భృంగాంగనాగీతికోపాంగకములు
|
|
తే. |
వల్లికానర్తకీనాట్యవాదనములు, నగశతాంగాగ్రఘంటాఘణంఘణములు
రసికమానసాహ్వానపారంపరములు, చెలఁగెఁ గలకంఠకంఠకూజితము లపుడు.
| 41
|
మ. |
లతకూనల్ గడుఁ బెంపుమీఱి ఋతువేళాపుంరతిక్రీడ సం
తతిగల్గన్ ఫలగర్భభారములఁ జెందంబోలుఁ గాకున్న లం
బితరోలంబకదంబనీలిమము గన్పింపం గతం బేమి న
వ్యతరాంతర్మకరందదుగ్ధసుమగుచ్ఛాంచత్కుచాగ్రంబులన్.
| 42
|
ఉ. |
ఈచిగురాకువంటిది సుమీ తనప్రేయసిమోవి యంచు నీ
పూచినమాధవీలతికపోలికగా చెలియంగ మంచు నీ
రాచిలుకన్ జయించుఁగద రామవచోగతి యంచు వన్యముల్
చూచి వధూటులం దలఁచి సొక్కుచు నుందురు పాంథు లత్తఱిన్.
| 43
|
సీ. |
తనుసుఖం బిచ్చు శీతలతరుచ్చాయావిశేషముల్ బాలికాశ్లేషములును
వీక్షణప్రీతి గావించు జాంబీరసమాజముల్ యువతివక్షోజములును
గర్ణపర్వ మొనర్చు కలరవాదికకంఠరణితముల్ మదవతీమణితములును
ఘ్రాణతృప్తి యొసంగు ఘనపుష్పసురభిసంబంధముల్ వనితాస్యగంధములును
|
|
తే. |
నాలుకకు నింపుపుట్టించు నవఫలరస, పూరములు యౌవతాధరసారములును
సరసులకు నిట్టు లవ్వనుల్ జవ్వనులును, జేయువేడ్కలు వింతలై చెల్లె నపుడు.
| 44
|
సీ. |
తాళీఫలస్ఫూర్తిఁ దనరెడు వీఁగుఁజన్గొండలజవజవల్ మెండుకొనఁగ
నాయముల్ గరఁగంగ నాడు నర్మోక్తిహెచ్చరికలగుసగుసల్ సందడింప
|
|
|
నోరు చెక్కిట నటు నొక్కుచు బడిబడి నిడుచుంబనముల చప్పుడు చెలంగ
సమరతి ప్రతివేగసంపూర్తికై చేయు సచపేటహుంకృతిస్వనము లడర
|
|
తే. |
వయసు గడుసుఁదనంబున వర్తమాన, కాలమహిమను సిగ్గుసిగ్గరితనంబు
దాల్పఁగఁ బ్రగల్భ లంగజోద్ధతి రమింపు, సొంపుమధువేళ భోగుల కింపొనర్చె.
| 45
|
శా. |
పన్నీటం జలకం బమర్చి చలువల్ పైఁదాల్పఁగా నిల్చి ద
ధ్యన్నాహారము గంధలేపము విరుల్ తాంబూలముల్ సొంపుమీ
ఱ న్నవ్యవ్యజనాతపత్రచరణత్రాణాదులన్ భాగ్యసం
పన్నుల్ విప్రుల కర్చగా నొసఁగి రవ్వైశాఖమాసంబునన్.
| 46
|
చ. |
ఘనుఁడు పురూరవుండు త్రిజగత్పరిపూరితకీర్తి రాజ్యపా
లన మొనరింపుచుం దనతలంపున నుర్వశిచిత్రరూపభా
వనప్రతిబింబలక్ష్మి యొదవంగఁ దదీయనిసర్గరూపద
ర్శనమునకై యుపాయము విచారము సేయుచునుండె నయ్యెడన్.
| 48
|
మ. |
ఒకనాఁ డానృపశేఖరుండు తపనీయోద్యత్సభామండపా
ధికశోభామణిభద్రపీఠమున నుద్దీప్తిన్ సుఖాసీనుఁడై
సకలామాత్యసుహృత్సరోహితవయస్యప్రౌఢవిద్వత్కవీం
ద్రకళావద్వనితాద్యనేకపరివారస్ఫూర్తి వర్తిల్లఁగన్.
| 49
|
క. |
పేరోలగమున నుండఁగఁ, జారులు దేశాంతరములఁ జరియించి రయం
బారఁ జనుదెంచి మ్రొక్కిన, వారల మన్నించి మనుజవల్లభుఁ డెలమిన్.
| 50
|
చారులు పురూరవునకు విచిత్రవనవృత్తాంతముం దెల్పుట
వ. |
లోకవార్తావిశేషసంశ్రవణకుతూహలసూచనాలక్షణంబు లయినకటాక్షవీక్షణంబు
లం గనుంగొనిన నయ్యింగితం బెఱింగి పునఃప్రణామం బాచరించి వినయవచనచమ
త్కారు లయినచారు లిట్లని విన్నవించిరి.
| 51
|
క. |
భూవల్లభ కురుకోసల, సౌవీరవరాటలాటసౌరాష్ట్రకళిం
గావంతివిషయనగరీ, నీవృచ్చయవార్త లరసి నీసన్నధికిన్.
| 52
|
ఉ. |
వచ్చితి మోనృపాలక భవత్పరిపాలనధర్మ మెట్టిదో
యెచ్చటఁ జూచినన్ బ్రజ లభీష్టపదార్థసమృద్ధిసౌఖ్యముల్
నిచ్చలు గాంచి పుణ్యము లనేకవిధంబుల నాచరింపుచున్
సచ్చరితస్థితిన్ మెలఁగుచందము కన్నులపండు వయ్యెడున్.
| 53
|
ఉ. |
రేయి నిగూఢవృత్తిని జరింపుచు విందుము లౌక్యవాక్యముల్
పాయక సర్వకాలమును బావనకీర్తి పురూరవుండ దా
నీయవనీతలంబునకు నేలిక గావలె ధర్మశాలి జే
జే యని వేయునోళ్ల నుతిచేయనివారలు లేరు భూవరా.
| 54
|
తే. |
నీయశఃపుంజగగనధునీప్రపూర్తి, విగతపంకౌఘ మైనయీజగమునందు
నన్నివార్తలు మంచివై యమరుఁగాక, యితరవార్తలు గలవె నరేంద్రచంద్ర.
| 55
|
ఉ. |
చూచితి మొక్కవింత యొకచో జనవల్లభ చిత్తగింపు విం
ధ్యాచలమౌళ్యుపాంతగహనాంతరపద్ధతి వచ్చుచుండ దృ
గ్గోచరమయ్యె మాకు బహుకుందతమాలరసాలసాలజం
బూచలపత్రపూగముఖభూరుహషండము నేత్రపర్వమై.
| 56
|
శా. |
నానాదేశములందుఁ జూతుముగదా నారంగజంబీరజం
బూనింబామ్లకదంబకుందకదళీపున్నాగచాంపేయతా
ళీనీపక్రముకాదిపాదపలసల్లీలావనంబుల్ తదు
ద్యానశ్రీకి సమాన మౌనె యొకయింతైన న్నరేంద్రోత్తమా.
| 57
|
తే. |
అమరతరువుకు సంతానమనిన పేరు, నగవిభంజనుతోఁటకు నందకాఖ్య
మదనసంహరువనికిఁ గుమారసంజ్ఞ, యగుట తద్వనసంతతి యగుట నేమొ.
| 58
|
సీ. |
ఆశాఖ లౌన్నత్యవైశాల్యసాంద్రతాచ్ఛాదితాశాఖలు జనవరేణ్య
యాపల్లవములు మోహనమంత్రమూర్తీభవత్పల్లవంబులు వరగుణాఢ్య
యాసుమనోరాజి యామోదముదితాభ్రచరసుమనోరాజి శౌర్యధుర్య
యాలతల్ జితయౌవనారంభబాలికాజనతనూఖేలతల్ వినుతచరిత
|
|
తే. |
యాపరాగంబు లుత్పాదితాధ్వసీన, హృదయసుమచాపరాగంబు లింద్రవిభవ
యౌవనం బాశ్రయిష్ణునానావిహంగ, మృగకుటుంబావనంబు ధాత్రీకళత్ర.
| 59
|
మ. |
కలకంఠాంచితకంఠపంచమకుహూకారంబులుం గీరకో
మలవాచానినదంబులుం గలరవామందధ్వనుల్ శారికా
కలనాదంబులు చంచరీకచయఝంకారంబులున్ దట్టమై
చెలఁగుం దద్వనసీమ మన్మథజయశ్రీగీతికారావ మై.
| 60
|
తే. |
అట్టిశృంగారవనము సొంపమరఁ గాంచి, యద్భుతంబంది మఱియును నచటగల్గు
వింత లెల్లను గనుఁగొను వేడ్కఁ దద్వ, నాంతరము సొచ్చి విహరించునవసరమున.
| 61
|
క. |
మణిరశనాగుణకింకిణి, గణహంసకకంకణానుకరణరవంబుల్
కిణికిణికిణికుణుకుణుకుణు, ఝణఝణఝణ మనుచు నొకదెసన్ వినఁబడియెన్.
| 62
|
క. |
విని నిలిచి మఱియు నాలిం, చిన వీనుల సోఁకె నమృతశీతలమధుర
స్వనవాగ్వైఖరి వనితా, జనసంచారప్రకారసంసూచక మై.
| 63
|
చ. |
ఇది విజనస్థలం బిచట నిట్లు మెలంగెడువారు దేవతా
సుదతులొ రాజకన్యకలొ చూచినఁ దప్పగునేమొ యంచు మా
హృదయములందు శంక జనియించిన నవ్వలఁ బోక క్రమ్మఱన్
మొదలిటిత్రోవ పట్టి వనముల్ నగముల్ పురముల్ గ్రమించుచున్.
| 65
|
క. |
దేవరసందర్శనమున, కై వచ్చితి మనుచుఁ బలుక నవనీరమణుం
డావనము చూచువేడుక, భావంబునఁ బొడమ నటకుఁ బయనంబయ్యెన్.
| 66
|
శా. |
తప్తస్వర్ణసువర్ణరత్నఘృణిసాంద్రం బై మరుద్వేగవ
త్సప్తిస్ఫూర్జిత మై ఘణంఘణరవాంచద్ఘంటికాబద్ధ మై
వ్యాప్తోదారవిభాగజాహితపతాకౌన్నత్యమై యొప్పు ను
ద్దీప్తస్యందన మెక్కి భూషణమణీదేదీప్యమానాంగుఁ డై.
| 67
|
పురూరవుఁడు చత్రవనముం జూడనేగుట
క. |
చారులు చూపుపథంబునఁ, జారుతరాటోపచతురచతురంగయుతిన్
స్వారి వెడలె నమ్రశిర, స్స్వారి పురూరవుఁడు వైభవాడంబరుఁ డై.
| 68
|
ఉ. |
కోమలగంధవాహమనుకూలగతిం బ్రసరించెఁ బుణ్యకాం
తామణిపూర్ణకుంభయుగధౌతదుకూలఫలప్రసూనము
ఖ్యామలవస్తువుంజ మెదురయ్యె సువర్ణపయోవిహంగముల్
వామదిశాగతిన్ మెలఁగె వల్లభునుల్లము పల్లవింపఁగన్.
| 70
|
వ. |
అట్లు చనిచని పురోభాగంబున.
| 71
|
చ. |
సకలధరాధురంధరభుజాభుజగేంద్రుఁ డతండు గాంచె హా
టకతటకూటకోటినికటప్రకటభ్రమరాంబుభృద్వితా
నకశకలప్రకాండకుహనాగహనద్విపయూథనిగ్రహో
త్సుకజవనోత్సతద్ధరికిశోరవిశాలము వింధ్యశైలమున్.
| 72
|
తే. |
కాంచి యంచితమోదవికాసమాన, మానసాంభోజుఁడై యసమానలీల
మానవేంద్రశిరోమణి మఱియు మఱియుఁ, దద్విశేషావలోకితోత్సాహమునను.
| 73
|
సీ. |
కరిణీకరోత్కీర్ణఝరిణీకసిక్తాగ్రచరిణీకుచోపరిచ్ఛన్నశాటి
జలజాతరాగాద్యుపలజాతమయదరీస్థలజాతతప్రభాసాంద్రమూర్తి
నటనాధిగతశిబుస్ఫుటనాదహృదయసంఘటనార్తతాబిలంగతభుజంగి
శిఖరాంతరప్రయాయిఖరాంశుసాన్నిధ్యసుఖరంజితాబ్జినీస్ఫురితసరసి
|
|
తే. |
కిసలయఫలలసదసమకుసుమవిసర, సరసతరతరువిహరణపరపరభృత
నికరమధుకరకలరవశుకకులముఖ, విహగముఖరవముఖరి యవ్వింధ్యశిఖరి.
| 74
|
మ. |
అని వర్ణింపుచు నవ్విభుండు తదగప్రాంతాటవీపద్ధతిం
జనియెన్ మేఖలకన్యకాతటవతీసంఫుల్లసౌగంధికా
భినవాంభోజపరాగసౌరభమిళత్ప్రేంఖత్తరంగౌఘమ
గ్ననితాంతాగతశైత్యమాంద్యపవమానస్పర్శజానందుఁ డై.
| 75
|
తే. |
ఇవ్విధంబున నవ్విభుం డేగి యెదుటఁ, గాంచె నవమల్లికావల్లికామతల్లి
కావలీనర్తనోపదేష్టాయమాన, మృదుపవన మై వెలింగెడు తదుపవనము.
| 76
|
వ. |
కాంచి హృదయంబున నుదయం బగువీక్షణాపేక్ష నాక్షమావల్లభుండు శతాం
గావతరణంబు చేసి నిజబలంబు నచ్చట నిలువ నియమించి మృదులతరపాదుకాకీ
లీతపదకమలుండై సమానవయస్కుండును నసమానగుణసంపన్నుండును నతిప్రియ
సఖుండును నగచతురమతి యనుమంత్రితనూభవుండు తనతోడన రా నతనికరాం
బుజం బవలంబనంబు చేసి భద్రదంతావళప్రతిమానయానంబున మూర్తిమంతుం
డయినవసంతుం డన నయ్యుద్యానంబు ప్రవేశించి నిజాగమనోత్సాహంబున వన
దేవత లుప్పరిగలపయినుండి పెల్లుగఁ జల్లులాజలచందంబున నందంబయి వృక్షా
గ్రంబులనుండి పవనవిక్షేపవశంబున జలజలరాలు విరులవర్షంబునకు హర్షంబు
నొందుచు మంగళగీతపఠనంబులతోఁ గర్పూరదీపికారాజి నీరాజనంబు లొసంగు
కొమ్మలవిధంబునం గొమ్మలు చరత్కలకంఠవధూమధురస్వనభాస్వరంబు లయి తర
ళాయమానతరుణారుణపల్లవసల్లలితనిజోపశాఖాశిఖరంబు లయికనుపట్టు నయంబు
నకుఁ బ్రియంబందుచు నడుగులకు మడుగులు పఱచినకరణి జరణన్యాసంబునకు
నుల్లాసవికాసకరంబయి వనమేదిని మేదురంబుగాఁ గప్పి యొప్పుపుప్పొడివింతకు
సంతసింపుచు మింటనంటం బెరిఁగి తఱచుగాఁ బూచిన రసాలాదిసాలంబులకొమ్మల
ముసురుకొని మసలుచు రసంబులు మెసఁగు భృంగవిసరంబుల నఱ్ఱులెత్తి కనుంగొని
యదభశుభ్రేతరాభ్రవిభ్రమభ్రాంతి విచ్చలవిడి బురివిచ్చి హెచ్చి మెచ్చొదవ
నచ్చటచ్చట నాట్యంబులు సలుపుమయూరవారంబులు సొంపునకు నింపందుచుఁ
|
|
|
బరిపక్వబహువిధమధురఫలరసాహారవిశేషంబునం దోఁచుకయివడి నత్యంతమాధుర్య
మంజుమనోహరంబు లయిన వచనరచనాచమత్కారంబులు శృంగారకథాప్రసంగం
బులు సేయు కలికిచిలుకలవినోదంబునకు మోదంబు నొందుచు రతిసుందరీకందర్పుల
క్రీడామందిరంబులపొందిక శ్రవణానందఝంకరణగాంధర్వబంధురంబు లయిన
మిళిందబృందములసందడి సంచలించు పరువంపువిరులగమిం దొరుఁగు నమందమక
రందబిందుసందోహమ్ము సోనల నలరారు పుష్పవల్లికల మొల్లంపుటల్లికల నుల్లసిల్లు
చల్లఁదనంబునం బొదలు పొదరిండ్ల యందంబునకు నానందంబు నొందుచు మఱి
మఱియుఁ దద్విశేషంబులు గనుంగొని కొనియాడుచు సఖుండును దానును జనిచని
ముందట.
| 77
|
ఉ. |
కాంచనశైలధీరుఁ డటఁ గాంచె నటత్తటకాంచనద్రుశా
ఖాంచలవాతచంచలనవాంబుజసంగితరంగమాలికా
సంచయడోలికాభ్రమణసంభ్రమలోలమరాళబాలికా
ప్రాంచితకేలికాకలితహంసము నొక్కసరోవతంసమున్.
| 78
|
క. |
కాంచి ప్రమోదించి నయం, బెంచి సఖునితోడ సనియె నిక్కొలను విలో
కించెతె కిలికించితసుఖ, దాంచిత యగురవికి నేతదబ్జిని దినమున్.
| 79
|
సీ. |
ఇందిందిరాలకబృందసంపదఁ జూపి బేడిసతళుకుకన్బెలుకుఁ జూపి
చక్రవాకస్తనసౌభాగ్యములు చూపి యరుణోత్పలాధరస్ఫురణ చూపి
యతులమృణాలబాహావిలాసము చూపి సౌగంధికాంగవాసనలు చూపి
లీలాతరంగవళిప్రకాశత చూపి యరవిందచరణసుందరతఁ జూపి
|
|
తే. |
యింపు పుట్టించుచున్నది హృదయమునకు, నిక్కొలఁకు వింత చూచితివే వయస్య
కలితయౌవనరూపరేఖాఖిలాస, విభ్రమోదార యగుప్రౌఢవేశ్య వోలె.
| 80
|
క. |
కువలయపుష్కరములతో, భువనములు నిజోదరమునఁ బొలుపొందఁగ స
త్కవివచనవర్ణితం బయి, శివులీల న్మెఱసి సరసి చెన్ను వహించెన్.
| 81
|
తే. |
ఇప్పయోజాకరంబున నొప్పుమీఱు, తమ్ములెల్లను బారిజాతమ్ము లయ్యె
నరయ నిందుల జలపూర మమృతమయ్యె, నతిశయశ్లేషత స్వభావగతి వహింప.
| 82
|
క. |
వరవర్ణిని యగుపద్మిని, పరివృతబహుళాళి యయ్యుఁ బట్టపగ లినున్
సరసతఁ గలసి వలపునం, బరఁగెడు గురియే వరాబ్జవాసన లింకన్.
| 83
|
మ. |
అనుచుం దత్సరసీరుహాకరము డాయంబోవఁ దత్తీరభూ
మిని నెత్తావియనంటులం దొరుఁగు నమ్మేల్కప్రపుంధూళి పైఁ
|
|
|
గననయ్యెన్ రుచిరాంగుళీవలయరేఖాలక్ష్యమాణాంఘ్రినూ
తనవిన్యాసము లంగనాజనవనాంతక్రీడ సూచింపుచున్.
| 84
|
క. |
ఆజాడం జనిచని యా, భూజాని లసద్రసాలభూజానీక
భ్రాజితభువి శశికాంతపు, రాజగతి వసించి యున్నరాజనిభాస్యన్.
| 85
|
చ. |
చుక్కలలోని చంద్రకళసొంపున నారమణివ్రజంబులో
జక్కనినాయకోపలము చందమునం జెలికత్తెపిండులో
నక్కజపున్ విలాసమున నందముగుల్కెడు నుర్వశీపయో
ముక్కచదృక్కుచస్థితివిమోహితపూరుషఁ గాంచె ముందరన్.
| 86
|
క. |
చూచి సలోలవిలోలా, లోచనుఁ డయి ముందు తా విలోకించిన లీ
లాచిత్రరూపవిభవం, బీచెలువదిగా యటంచు నెంతయు వేడ్కన్.
| 87
|
ఉ. |
అగ్గజరాజకుంభకుచయందము చందము డెందముం దమిన్
మొగ్గఁగఁ జేయ డాయఁ జనుముచ్చట నచ్చట నిల్చి శంకతో
నగ్గలికం గనుంగొనఁగ నత్తఱి బిత్తరి చూచె మోముక్రొ
న్నిగ్గునిగన్నిగల్ తళుకు సిద్దపుటద్దపుసొంపు నింపఁగన్.
| 88
|
క. |
తరుణియు రమణుఁడు నొండొరు, సురుచిరగతి నదరిపాటఁ జూచిన చూపుల్
మరుఁ డేమఱించి యేసిన, శరములక్రియ మానసములు జల్లనిపించెన్.
| 89
|
తే. |
రమణి రమణీయరూపాభిరాము నతనిఁ, గాంచి కాంచలతాలంబిఘంటికాచి
రత్నరత్నతులాకోటిరవ మెసంగ, సారసారంగలోలదృగ్జాల యగుచు.
| 90
|
ఉ. |
దిగ్గున లేచి శంకితమతిన్ శశికాంతశిలావితర్దికన్
డిగ్గి బెడంగుగుబ్బలు నటింపఁగఁ గౌను వడంక వేడ్కతో
సిగ్గు మొగంబునన్ మొలవఁ జెంత నికుంజము చాటుకేగె స
మ్యగ్గమనంబునం జకితహంసికలీల సఖీసమేత యై.
| 91
|
క. |
నడుపువగ పిఱుఁదుపొంకము, నడుముసొబగు వెన్నుచెన్ను నవకపుజిగి కీ
ల్జడతీరు విభునికన్నుల, కడలించెఁ బ్రియంబు మగువ యటు మరలునెడన్.
| 92
|
తే. |
ఇట్లు పొదరింటిమాటున కేగి నిలిచి, యింతచక్కనిపురుషుని నెందుఁగాన
మితనిఁ జూడఁ బురూరవుండే యటంచుఁ, దోఁచుచున్నది యని వాంఛతోడ మఱియు.
| 93
|
క. |
తరుణి తదీయనికుంజాం, తరసంధులు గానవచ్చు ధరణీశ్వరుసుం
దరమూర్తి నిలోకింపుచు, మరువేదన కగ్గమగుచు మది నిట్లనియెన్.
| 94
|
సీ. |
కిసలయారుణకాంతి బిసరుహంబులఁ గూర్చి విరచించెనో వీనిచరణయుగము
నీలంపుఁజకచకల్ రోలంబములఁ గూర్చి కల్పించెనో వీనికచభరంబు
|
|
|
క్రొత్తముత్తెపునిగ్గు పుత్తడిపైఁ గూర్చి చేసెనో వీనివిలాసమూర్తి
తనరుబింబమృదుత్వ మొనరఁ గెంపునఁ గూర్చి కావించెనో వీనికావిమోవి
|
|
తే. |
యిట్లు సౌందర్యరససార మేర్చికూర్చి, తనచమత్కారమునకు నిదర్శనముగ
వీని సృజయింవెఁ గాఁబోలు విశ్వగురుఁడు, గాక కల్గునె యిట్టియాకారగరిమ.
| 95
|
క. |
మరునిం జూడమొ కుసుమా, కరునిం గనుఁగొనమొ యమృతకరునిన్ నలకూ
బరుని వీక్షింపమొ యీ, సరసునిఁ బోలుదురె రూపసౌభాగ్యమునన్.
| 96
|
తే. |
అకట యిటువంటి భువనమోహనవిలాస, మూర్తి ప్రియుఁడు గానోఁచనిముద్దుగుమ్మ
చక్కఁదనమును జతురత జవ్వనంబు, నడవిఁ గాసిన వెన్నెలయట్లు గాదె.
| 97
|
పురూరవుం డూర్వశికడకుఁ జెలికాని బంపుట
మ. |
అని యూహింపుచు నున్నచో నరవరుం డచ్చోట నాసీనుఁడై
తనమిత్రుం గని పల్కె నిట్టియతిసౌందర్యాంగి నేభూములన్
వినియుం జూచి యెఱుంగ మమ్మరుఁడు నువ్విళ్ళూరఁడే దీనిఁ జూ
చిన నిక్కోమలి వర్తనంబు దెలియం జిత్తంబునం గోరెదన్.
| 98
|
క. |
అనవుడుఁ బతితలఁపు మదిం, గని యంగనచంద మరసి క్రమ్మఱ నేతెం
తు ననుచు నయ్యుర్వశియు, న్ననికుంజంబునకు మంత్రినందనుఁ డరిగెన్.
| 99
|
క. |
అరుదెంచునతనిరాకడ, నరపాలుననుగ్రహంబునకు మూలముగాఁ
బరమామోదము నొందుచు, హరిణాక్షి బహూకరింప నాసీనుండై.
| 100
|
వ. |
మృదుమధురభాషణంబుల నవ్విలాసినితో నతం డి ట్లనియె.
| 101
|
ఉ. |
ఉత్తమనాయికాగుణము లొప్పుచున్నవి నిన్నుఁ జూడ నో
మత్తమరాళయాన సురమానినివో నరభామవో ఫణా
భృత్తరుణీశిరోమణివో యెవ్వరు నీవు నిమిత్తమేమి నీ
విత్తరుభూములందిరుగ నెయ్యది పేరు నిజంబు దెల్పుమా.
| 102
|
శా. |
మావృత్తాంతముఁ దెల్పెద న్వినుము రామా మామకీయాంసపే
ఠీవిన్యస్తకరాబ్జుఁడై యపుడు ప్రౌఢింబొల్చి యంతంత రాఁ
గా వీక్షించితివౌఁ గదా యతఁడు లోకస్తుత్యకీర్తిప్రతా
పాచార్యుండు పురూరవుండు జనలోకైకాతపత్రుం డిలన్.
| 103
|
మ. |
తత్ప్రపితామహుం డఁట సుధాజలరాశి పితామహుండు రా
జత్ప్రభుఁ డైనచంద్రుఁడఁట సౌమ్యుఁడు తండ్రఁట సంప్రదాయ మే
|
|
|
తత్ప్రతిభన్ రహించు నఁట ధాత్రిఁ బురూరవుతోడ సాటికిన్
సత్ప్రభుతావిశేషమునఁ జర్చలు సేయఁగ నెవ్వ రంగనా.
| 104
|
సీ. |
ధరణీశునకుఁ బట్టుధవళాతపత్రంబు నీడకు లోనుగా నిలుచుచనువు
రాజుగూర్చుండెడి రత్నసింహాసనం బొరసి చెయ్యూనుక యుండుచనువు
జననాథునకు వీచుచామరంబులగాడ్పు తుదులుమైఁ బొలయంగఁ గదియుచనువు
నధిపుతో నేకాంత మాడువారల విన్నపముల కౌఁగాదని పలుకుచనువుఁ
|
|
తే. |
గలిగి వర్తింతు నెప్పుడు గారవమున, రాజరాజైన యప్పురూరవునిమ్రోల
ననుఁగుఁజెలికాఁడ నెంతయు నతని కేను, జతురమతి యండ్రు నాపేరు చంద్రవదన.
| 105
|
తే. |
అమ్మహారాజుసఖ్యసౌఖ్యానుభూతి, గల్గు టెవ్వరికైన భాగ్యమునఁ జుమ్ము
మనసుగలవారి కతనిసంబంధ మేను, ఘటన సేయంగఁ జాలుదుఁ గమలవదన.
| 106
|
చ. |
హృదయము ఝల్లుఝల్లు మనియెం బులకాంకురపాళి నెమ్మెయిల
బొదలెఁ బ్రమోదబాష్పజలపూరము కన్నుల నిండె నార్ద్రసం
పద వహియించెఁ గంతువిడి పట్టు పురూరవురాకఁ దెల్పుత
న్మృదువచనాక్షరంబు లెలమిం జెవి సోఁకినయంత నింతికిన్.
| 108
|
తే. |
అట్లు రాగప్రవాహమగ్నాంతరంగ, యగుచు మందాక్షసంకుచితావలోక
నాంచలంబుల నిజవయస్యాలలామ, చూడఁ దద్భావ మెఱిఁగి యాప్రోడవనిత.
| 109
|
వ. |
అమ్మంత్రికుమారునితో ని ట్లనియె.
| 110
|
సీ. |
అనఘాత్ముఁ డైన నారాయణయోగీంద్రునూరుదేశంబున నుద్భవిల్లె
సకలకళ్యాణభాజనమై వెలింగెడు నమరావలీస్థలి నధివసించెఁ
బ్రౌఢి గాంధర్వాప్సరఃకళావతులకు నాయకురాలితనంబు గాంచె
నృత్యసంగీతసాహిత్యపాండిత్యాప్తి మేటివేల్పులచేత మెప్పువడసె
|
|
తే. |
నుర్వశి యనంగ నొప్పు నీయుత్పలాక్షి, యరయ నీయింతచెలికత్తియలము మేము
ధారుణీస్థలి నొకనిమిత్తమున నిట్లు, సంచరింపంగవలసె నీచంద్రముఖికి.
| 111
|
చ. |
విను మిఁక దాఁపనేల నయవిశ్రుతుఁడైన పురూరవక్షితీ
శునిగుణముల్ జగజ్జనవచోరచనశ్రుతిరంజనంబుగా
విని విని దర్శనంబునకు వేడుకనొందుచు నున్న మాఘన
స్తని కతఁ డిందు వచ్చుట నిదానముగాదె యభీష్టసిద్ధికిన్.
| 112
|
క. |
అని సాభిప్రాయంబుగ, వనజానన పలుక మనుజవరు విహృతినెపం
బున నిక్కుంజసమీపం, బునకుం గొనివత్తు వినయమునఁ గనుఁగొనుఁడీ.
| 113
|
క. |
ఇయ్యంతి కోర్కి సఫలం, బయ్యెడు నని యనునయించి యధిపతి కడకుం
జయ్యన నరిగి మృదూక్తులఁ, దొయ్యలివృత్తాంత మతనితోఁ దెల్పుటయున్.
| 114
|
ఉ. |
ఆపలుకుల్ సుధారససమంచితసారములై చెవుల్ సొరన్
భూపతి యాత్మహర్షరసపూర్తికి నేమనవచ్చుఁ బూర్వసం
తాపదశాకృశశ్లధకనత్కటకాంగదముద్రికాదిర
త్నోపలభూష లంగములయుబ్బునఁ బొల్చెను బిక్కటంబులై.
| 115
|
తే. |
ఉల్లమునకు నిండారులై వెల్లివిరియఁ, బొందునానందరసవార్ధిబుద్బుదంబు
లనఁగ దట్టంబులై పులకాంకురంబు, లవయవంబులఁ బొడమంగ నవ్విభుండు.
| 116
|
మ. |
చిరకాలంబుననుండియున్ హృదయరాజీవాంతరాళంబునన్
హరిజుం డేసిన చిల్కుటమ్ముగతి సమ్యక్కీలితం బైన ని
ర్జరబిబ్బోకవతీలలామవిషయేచ్ఛాబద్ధసంకల్ప మీ
శ్వరుఁ డీడేర్పఁ దలంచె నేఁటి కనుచున్ సన్మిత్రుతో నిట్లనున్.
| 117
|
ఉ. |
ఈచపలాక్షిరూపము సుమీ మును చిత్రపటంబునందు నేఁ
జూచి విరాళినొందుట కిశోరమృగేక్షణ యీలతాంగి దృ
గ్గోచరమయ్యే నిచ్చట నకుంఠితభాగ్యగతిన్ విలంబ మే
లా చతురత్వ మేర్పడ విలాసినిపొందు ఘటింపఁజేయుమా.
| 118
|
వ. |
అనినం జతురమతి యమ్మహీపతి కి ట్లనియె.
| 119
|
మ. |
జగతీనాథకులావతంస వినుమా సంకల్పసిద్ధుండ వీ
వగుటన్ నీదుమనోరథంబు సఫలం బౌ సంశయం బేల బా
ళిగ నిచ్చోఁ గలవింతలెల్లఁ గనుపోల్కిన్ దత్సమీపంబునం
దగురీతి విహరింపుచుండ నవలా తానే నినుంజేరెడున్.
| 120
|
చ. |
అనవుడు సంతసించి మనుజాధిపుఁ డాప్తసహాయుఁడై బుగు
ల్కొనియెడు తావులం బొలుచు క్రొవ్విరితేనియ లాని ఝంకృతి
ధ్వను లొనరించుతుమ్మెదకదంబముచేఁ జెలువొందుపూఁబొదల్
గనుఁగొనుచు న్నిలింపగణికాస్థితకుంజముచెంత కేగినన్.
| 121
|
ఉ. |
సిగ్గును వేడ్కయున్ బెరసి చీఁకటివెన్నెలలై మొగంబులో
జగ్గొకవింత సేయ నృపుసన్నిధి నౌఁదలవాంచి నీకుఁ దా
మొగ్గితి నంచుఁ దెల్పుగతి మ్రొక్క లతాంగి పతాకయుగ్మస
మ్యగ్గరుడోపలాంకవలయాంకితహస్తఘటల్లలాట యై.
| 122
|
చ. |
పొలతుకగుబ్బచన్నుఁగవపొంగున కయ్యెద చాలదయ్యెఁ దొ
య్యలికనుదోయివిప్పునకు నాననబింబము చాలదయ్యె న
వ్వెలఁదిదరస్మితామృతపువెల్లికిఁ జెక్కులు చాలవయ్యె నా
చెలియనురాగ మెంతయని చెప్పుదు నాథునిఁ గాంచునయ్యెడన్.
| 124
|
సీ. |
నయనోత్పలముల కానంద మబ్బెనెకదా యాస్యాబ్జమునకు వైకాస్య మొదవె
హర్షాశ్రుహిమవూర మగ్గలించెనె కదా కచతమంబునకు శృంగార మొదవె
తనువల్లికకుఁ జల్లఁదన మబ్బెనేకదా కుచకోకములకుఁ బైకొనియె నుబ్బు
పులకాంకురంబులు పొరలి పాఱెనెకదా చెక్కుటద్దములకు జిగిరహించె
|
|
తే. |
నిష్కళంకకళాపూర్ణనృపతిచంద్ర, దర్శనవిశేషమున సముత్సాహరసత
రంగితము లయ్యె నతివసర్వాంగకముల, పూర్వమైత్రి ఘటించు టద్భుత మనంగ.
| 125
|
వ. |
అప్పు డవ్విభుం డవ్విలాసినివిలాసవిశేషంబున కద్భుతం బందుచు డెందంబున
ని ట్లని తలంచె.
| 126
|
తే. |
అతివకనుదమ్ము లింతిముఖారవింద, మతివహస్తాంబుజములు తన్వంగిచరణ
కంజములు కొమ్మనెమ్మేనికమలసురభి, చాటుచున్నవి పద్మినీజాతి యగుట.
| 127
|
సీ. |
సరసీరుహము లోకచక్షుర్హితోదార మని మొగంబును బోలు ననఁగఁ దగునె
జక్కవల్ రాజితాచలచిత్రపత్రంబు అని చన్నుఁగవఁ బోలు ననఁగఁ దగునె
యవనీతలంబు రత్నాకరమేఖల మని పిఱుందును బోలు ననఁగఁ దగునె
పికములు మాధవప్రియమంజులరవంబు లని పల్కులను బోలు ననఁగఁ దగునె
|
|
తే. |
సోమునకు నోడి దోషాప్తి జోడువీడి, చక్రధాటి నణంగి ప్రశస్తవర్ణ
సంపదఁ దొఱంగి యివి యెట్లు సాటివచ్చుఁ, గంబుకంఠిమనోజ్ఞాంగకంబులకును.
| 128
|
ఉ. |
ఏమితపంబుఁ జేసెనో సుమీ యళు లిచ్చెలికేశబంధ మై
తా ముదయించినందుకు నిదర్శనమౌఁగద సుప్రసూనపుం
ఖామలగంధబంధురరసాతిశయానుభములు గల్గునే
కా మఱి పూర్వజన్మమునఁ గల్గినవృత్తి భవాంతరంబునన్.
| 129
|
ఉ. |
దూరపుఁబొందులన్ సుఖము దోఁపక పుష్పరసంబు పేరఁ గ
న్నీరిడుచున్న యక్కుముదినిం గరుణించి లతాంగిముద్దుమో
మై రహిఁదాల్చి చంద్రుఁ డెద నంటఁగఁ జేర్చిన సానురక్తి నిం
పారెడు శోణకోణరుచిరాయతనేత్రయుగచ్ఛలంబునన్.
| 130
|
తే. |
అతివనునుగౌ నదృశ్యవశ్యాదికళలఁ దనరి మృగరాజజయలీలఁ దగిలియున్న
సుందరత నొంది పెంపు మిన్నంది యట్లు, లేమిచే ముష్టిపట్టుట కేమిగతమొ.
| 131
|
క. |
కనఁబడునఁట సగుణస్థితిఁ, గనరాదఁట నిర్గుణాప్తిఁ గలదో లేదో
కనకాంగినడుముపోలిక, యెనయఁ జిదంబరరహస్య మెవ్వఁ డెఱుంగున్.
| 132
|
క. |
అపు డయ్యింతిం గనుఁగొని, యపరిమితానందహృదయుఁ డై యి ట్లనియెన్
గపురంపుఁజలువపలుకులు, చపలాంబకవీనులకు రసాయనములు గాన్.
| 134
|
సీ. |
ఉవిద నీకొప్పు నీలోత్పలంబులగుంపు భామ నీకన్నులు పంకజములు
లలన నీనాస తిలప్రసూనము మధూకములు నీచెక్కిళ్లు కమలగంధి
తెఱవ నీ ముద్దువాతెఱ పాటలము మల్లెమొగ్గలు నీదంతములు మృగాక్షి
వెలఁది నీ పాలిండ్లు విరిచెండ్లు బంధూకములు నీకరంబులు ముద్దుగుమ్మ
|
|
తే. |
నెలఁత నీమేను సంపెంగ నీ పదములు, హల్లకము లింతి సుమనోలతాంగి నిన్నుఁ
బువ్వుగమి నిర్మి౦చెఁ బో విధాత, చాన నీపొందు పుష్పపూజాఫలంబు.
| 135
|
సీ. |
కులుకువెన్నెలనవ్వు చిలుకు చెక్కిళ్లకుఁ దళుకుముత్యంపుఁ గమ్మల మెఱుంగు
కెంపుసంపద పెంపు నింపు లేమోవికి వీటికారసరాగవిభ్రమంబు
ఖంజనప్రతిమానరంజనం బగుచూడ్కి కంజనరేఖాసమాశ్రయంబు
మురిపెంపుసంపెంగ విరిపెంపుగలమేని కమలకాంచనదుకూలానుభూతి
|
|
తే. |
గలిగి నైసర్గికమున కుత్కర్ష మెసఁగ, వెలఁది నీరూపు చూడ్కికి విందులొసఁగెఁ
గలిమిగలచోట మఱియును గలిమి గలుగు, ననినజనవాక్యమునకు దృష్టాంతముగను.
| 136
|
సీ. |
చంద్రసారమె గాదు చంద్రసారముఁ గూర్చి చేసెఁ గాఁబోలు నీచిన్నినవ్వు
కమలలీలయ కాదు కమలలీలయుఁ గూర్చి కల్పింపఁబోలు నీకన్నుదోయి
సరసహేమమె కాదు సరసహేమముఁ గూర్చి విరచింపఁబోలు నీవిమలమూర్తి
సత్ప్రవాళమె కాదు సత్ప్రవాళముఁ గూర్చి యొనరింపఁబోలు నియోష్ఠబింబ
|
|
తే. |
మంబురుహసూతి సృజనకాలంబునందుఁ, గాక యిట్టియదృష్టపూర్వైకమోహ
నాంగసౌభాగ్య మమర నరాహిరాజ, కన్యలకుఁ గల్గనేర్చునె కమలవదన.
| 137
|
సీ. |
వనిత నీచూపులవాఁడికి నోడి మన్మథమార్గణములు సూనంబులయ్యె
సుదతి నీ చిఱునవ్వుసొగసున కోడి వెన్నెల కౌముదీవచనీయమయ్యె
లలన నీస్వనమంజులతకు నోడి పికస్వనంబులు పంచమత్వంబు నొందె
యువతి నీనడకల కోడి హంసీపదన్యాస మౌదాసీన్య మనుభవించె
|
|
తే. |
నిట్లు నీ చక్కఁదనముతో నీడుగాక, పరిభవము నొంది యున్నశంబరవిరోధి
సాయకాదులు న న్నేమి సేయఁజాలు, నింక నీదయ గలిగిన నిందువదన.
| 138
|
క. |
అనుమాన మేల నిఁక నే, నినుమానఁగఁజాల నీవు నెఱజాణవు పై
కొనుమా ననుఁ జల్లఁగఁ గను, గొను మాననకమల మెత్తి కువలయనయనా.
| 139
|
క. |
కనుఁగవ మెఱుఁగులు గ్రక్క, న్వనజాసన ఱెప్పలెత్తి వరుఁ జూచె జరీ
లున మరుఁ డొఱవెఱికి తళు, క్కనఁ గా జళిసించుచంద్రహాస మనంగన్.
| 141
|
ఉ. |
రాజనిభాస్య పల్కె నలరాజకుమారకుమారుతోడ నో
రాజకుమార ముందు సురరాజకుమారకుఁ జూతు వాహినీ
రాజకుమారుఁ జూతు ధనరాజకుమారునిఁ జూతుఁ గాని నీ
రాజదలేఖ్యమూర్తి సరిరా జగమందు వసింప రెవ్వరున్.
| 143
|
శా. |
నీలావణ్యము నీగుణాతిశయము న్నీభావము న్నీవచో
లాలిత్యంబును నీప్రతాపమును జాలన్ విన్నదానన్ మరు
త్పాలాస్థానమునందు నారదుఁడు దెల్పన్ మోహవిభ్రాంతనై
భూలోకేశ్వర నాఁటనుండియును నీపొం దాత్మలోఁ గోరుచున్.
| 144
|
మ. |
విను మయ్యింద్రునిపంపున న్మునితపోవిఘ్నార్థమై వచ్చి ని
న్గనుఁగో నె ట్లొనఁగూడునో యనుచుఁ గాంక్షన్ దైవము న్వేఁడుకొం
చు నిమేషం బొకయేఁడుగాఁ గడపుచున్ క్షోణీశ య కైవడి
న్వనవాసంబులు సేయునాకు నినుఁ గానం గల్గె భాగ్యంబునన్.
| 145
|
చ. |
విరహమునం గృశింపుచును వెన్నెలయెండల నెండి కంతుపూ
శరములవానలం దడిసి చందనశైలపుఁజల్లగాడ్పుని
బ్బరపువడన్ శ్రమంపడి తపం బొనరించుచు నున్నదాన నో
నరవర నీకునై యిటలు నావల పే మని యింకఁ దెల్పుదున్.
| 146
|
మ. |
హృదయేశా ననుఁ జూడు నీ కొఱకు నే నిట్లైతి నంచున్ సగ
ద్గదదీనోత్తులచేఁ గపోలఫలకాంతాశ్రూరుబిందుచ్ఛటన్
వదనగ్లాని యెసంగ నుస్సురనుచున్ వామాక్షి చూపెన్ మనో
జదశాయాసకృశాంగవల్లి పతికిన్ సమ్మోహముం జేయుచున్.
| 148
|
వ. |
అప్పు డప్పడంతిం జూచి యతండు రాగరసమగ్నుం డగుచు నిట్లనియె.
| 149
|
ఉ. |
నీమొగ మేను నామొగము నీవు నెఱుంగకముందు ముందుగా
నేమి ఋణానుబంధమొ సుమీ సరిమోహము లగ్గలించె నో
హేమలతాంగి యింక మఱుఁ గేటికి నమ్మిక మాట పల్కెదం
గాముఁడు సాక్షి గాఁగఁ గలకాలముఁ గూడి సుఖింత మింపుగన్.
| 150
|
క. |
నావుడు సంతసమంది క, ళావతి యిట్లనియె నోయిలావల్లభ మ
ద్భావంబున కనుకూలుఁడ, వై వర్తింపంగవలయు నది విను మనుచున్.
| 151
|
క. |
వేడుకకై తాఁ బెంచిన, జోడుతగళ్లను సువర్ణసూత్రాంచితమం
టాడోలనఘణఘణనిన, దాడంబరకంధరంబు లై తగువానిన్.
| 152
|
వ. |
చెలికత్తియలచేతఁ దెప్పించి యప్పతికిఁ జూపి యిట్లనియె.
| 153
|
మ |
అవనీనాయక వీనిదుష్టమృగచోరాద్యాపదల్ పొందనీ
క విమర్శింపుచు నెల్లప్రొద్దు దయతోఁ గాపాడుచుండన్ వివ
స్త్రవికారస్థితి లేక నాకడ వసించన్ మాటపట్టిచ్చెదే
ని వినోదంబుల జోడువాయ కెపుడున్ నీతోడఁ గ్రీడించెదన్.
| 154
|
పురూరవుఁ డూర్వశిని నిజపురంబునకుఁ దెచ్చుట
తే. |
అనుచు సమయంబు చేసి న ట్లాలతాంగి, వనితల తలంపు లెఱుఁగ నెవ్వరివశంబు
జనపతియు నట్లకా యని సమ్మతించె, వనజముఖులకుఁ బురుషులు వశులుగారె.
| 155
|
వ. |
ఇ ట్లన్యోన్యస్నేహానుగుణంబు లగుమాటల నాడుకొనిన యనంతరంబ యమ్మహీ
కాంతుం డక్కాంతం దోడ్కొని పురంబున కరుగుతలంపున మరలి వనంబు వెలు
వడి నిజబలంబులం గలుపుకొని యూర్వశీసహితంబుగాఁ గనకరథారూడుం డయి రో
హిణీయుక్తుం డగుచంద్రుండునుం బోలె మహేంద్రవైభవంబున రాజధానికిం జని
సామంతసచివప్రముఖపరిజనంబులఁ దగురీతి బహూకరించి తత్తద్గృహంబుల కనిపి
నిజనికేతనంబు ప్రవేశించి యుండె నప్పుడు పరిచారికాజనంబులు తత్సమయోచి
తంబు లయిన రాజోపచారంబులు సేయుచుండి రయ్యెడ.
| 156
|
ఉ. |
కంకణనిక్వణంబు ఘలుఘల్లున మ్రోయఁ గపోలపాళితా
టంకరుచు ల్వెలుంగ నుదుటం జిఱుచెమ్మట గ్రమ్మ హారముల్
కుంకుమగంధపున్వలపు గుబ్బలపై నటియింప నొక్కయే
ణాంకనిభాస్య భూపతికి నంటె సుగంధపునూనె యత్తఱిన్.
| 157
|
చ. |
మగువకరాబ్జతాండవచమత్కృతిచేఁ దలయంటుచున్నచో
సొగసగు నూర్పుతావి పయిసోఁకినఁ గంకణనాదఝంకృతిన్
మొగమనుతమ్మికిన్ వలచి ముక్కనుసంపెఁగమొగ్గ కల్కిపై
కెగయుచు వ్రాలుచుండె మనుజేంద్రుని పెన్నెఱిగుంపుఁదుమ్మెదల్.
| 158
|
మ. |
పరఁగన్ భూవిభుమేన నల్గిడి తలం బ్రామెన్ సుగంధద్రవం
బరవిందాస్య నతానతాగ్రకుచకుంభాలోలహారావళుల్
స్మరసామ్రాజ్యపదాభిషేకమునకుం బైవంచు బంగారుగిం
డ్ల రహిం జాఱుసుధాసుధారలన లీలాఖేలనమ్రాంగి యై.
| 159
|
తే. |
కదిసి జలకంబు వోసి రక్కాంతినిధికిఁ గామినులు కమ్రకరకంజకలితకనక
కాచకంకణకమనీయకలరవంబు, కర్ణహితముగఁ గాంచనకలశములను.
| 160
|
సీ. |
తడియొత్తె నొక్కసుందరి రాజమౌళికి లాలితధౌతదుకూలమునను
కట్ట నొసంగె నొక్కలతాంగి యధిపతి కసమానమృదులదివ్యాంబరంబు
సిగవైచె నొక్కరాజీవాక్షి విభునకు వికచక్రసూనమాలికలు చుట్టి
ధూపం బిడియె నొక్కతొయ్యలి నృపునకుఁ జందనాగరురజస్సారమునను
|
|
తే. |
దిద్దె నుదుటను గస్తూరితిలక మొకతె, యలఁదె నొక్కతె నెమ్మేన మలయజంబు
వీవన ధరించి చల్లఁ గా విసరె నొకతె, చంద్రవంశాబ్ధిసంపూర్ణ చంద్రునకును.
| 161
|
సీ. |
గారెలు బూరెలు కండమండెంగ లప్పంబులు మొదలైన భక్ష్యములును
సరసాన్నమును బాయసము సూపము శాకములు మొదలైనట్టి భోజ్యములును
పడిదెంబు లానవాల్ పరిపక్వఫలములు సురసముల్ మొదలైన చోష్యములును
బహువిధంబుల నొప్పు పచ్చళ్లు లేనియల్సిగరులు మొదలైన లేహ్యములును
|
|
తే. |
నారికేళోదకంబు పానకము చల్ల, నీరు మొదలైన యట్టిపానీయములును
ననఁగ బేరైనపంచపదార్థములును, భూరమణుఁ డిష్టసహితుఁడై యారగించె.
| 163
|
ఉ. |
కారపుఁగూరలున్ మిగులఁ గాఁగినచారులు నెయ్యి పప్పు పొం
గారినయానవాలు వరమాన్నము కమ్మనిపిండివంట క
ర్పూరమువంటి నెయ్యి కడుఁ బొత్తిగ వార్చిన యన్న ముప్పునన్
గూరిన యల్ల మావు పెరుఁగున్ భుజియించె నృపాలుఁ డయ్యెడన్.
| 164
|
తే. |
ఉప్పు పులుసు తీపి యొగరు కారము చేఁదు, ననఁగఁ దగినరసము లాఱునుల్బ
ణముల నుల్బణములు నమములు నగుపదా, ర్థముల భోజనంబు ప్రహితమయ్యె.
| 165
|
తే. |
పండుటాకులు కపురంపుబాగములును, ముత్తియపుసున్నము లవంగములును నేల
కులును జాపత్రియాదిగాఁ గూర్చి యపుడు, జనవిభుఁ డొనర్చెఁ దాంబూలచర్వణంబు.
| 167
|
సీ. |
నవరత్నఖచితమైన కిరీట మాణిముత్యములచౌకట్లు కుందనపుఁజిలుక
తాళితో సరిపెనల్ తారహారములు పచ్చలభుజకీర్తులు జాతికెంపు
రవలతాయెతులు వజ్రపుగంకణములు మెఱుంగులరాకట్టు టుంగరములు
ధగధగల్ గులుకు నందంపుమేఖల ఘలుఘలుమ్రోయునందె లంగకములందు
|
|
తే. |
వెలుఁగఁ గటితటి సిద్దంపువలువగట్టి, తగటుదుప్పటి వలెవాటు దనరవిరుల
సరులు మైపూఁతగందంబు పరిమళింప, ధరణివిభుఁ డొప్పె నూత్నకందర్పుఁ డనఁగ.
| 168
|
వ. |
ఇవ్విధంబున నవ్విభుండు సకలాలంకారమనోహరాకారుండై క్రీడామందిరంబునఁ
బీఠమర్దకవిటవిదూషకప్రముఖప్రియజనంబులతో నిష్టగోష్టీవినోదంబులం బ్రొద్దు
పుచ్చుచు నుర్వశీసంభోగాపేక్ష క్షపాకాలంబునకై నిరీక్షింపుచుండె నయ్యుర్వ
శియు శుద్ధాంతమందిరంబున సఖీసహస్రసంసేవితయై మజ్జనభోజనాదు లనుభవిం
పుచు గంధపుష్పదుకూలాభరణాద్యనుభవంబుల నుల్లాసవికాసమాన యగుచుఁ
బురూరవస్సమాగమోత్కంఠ నిమిషంబులు యుగంబులుగాఁ గ్రమింపుచుండె
నప్పుడు.
| 169
|
సూర్యాస్తమయాదివర్ణనము
చ. |
అపరమితోన్నతం బగుబలాఢ్యుహజారపుపైఁడిమేడపై
విపులసరోజరాగమయనిస్ఫుటహాటకకుంభమో యనన్
అపరధరాధరేంద్రశిఖరాగ్రతలంబు నలంకరించెఁ దా
నపుడు పతంగబింబము జపారుణకాంతిరమావిడంబ మై.
| 170
|
తే. |
అస్తమయవేళ నినునియం దాత్మలీల, నావహించిన శ్రీవాసుదేవమూర్తి
ఱొమ్ముకౌస్తుభరుచులు పైఁగ్రమ్మినట్లు, సూర్యబింబంబు బంధూకశోణమయ్యె.
| 171
|
సీ. |
వరుణశుద్ధాంతయౌవ్వతచారుసీమంతసిందూరరజముతోఁ జెలిమి చేసి
వనధిరాజోద్యానవనవాటికాతరుకిసలయశ్రేణితోఁ గ్రీడ సల్పి
పాశభృత్కేలికాపద్మాకరోత్ఫుల్లహల్లకవ్రజముతో ననఁగి పెనఁగి
ప్రాచేతసోజ్జ్వలప్రాసాదములఁ బొల్చుకురువిందమణులతో సరసమాడి
|
|
తే. |
నిండుకొనియె సమస్తదిఙ్మండలమున, సాంధ్యరాగంబు తాండవసంభ్రమభ్ర
మన్మహానటపటుజటామకుటఘటిత, ఫణిఫణామణిగణఘృణిప్రచుర మనఁగ.
| 172
|
ఉ. |
తమ్మి నయమ్ము దప్పఁ గుముదమ్ము ముదమ్మున నొప్పఁ జక్రవా
కమ్ములు జోడువిప్పఁ దమకమ్మునఁ బాంథులపై మరుండు పూ
టమ్ములు గుప్పఁ జీఁకటి భయమ్ముగ దిక్కులఁ గప్ప భాస్కరుం
డమ్మెయి న స్తమించె నుదయమ్మయి మించె నుడుప్రభావళుల్.
| 173
|
సీ. |
కల్పించెఁబో నీలకైరవమాల్యసంబంధముల్ ధమ్మిల్లబంధములను
నిరచించెఁబో మనోహరకురంగీమదతిలకముల్ వరపాలఫలకములకుఁ
గలిగ్ంచెఁబో నీటుకాటుకరేఖలయందము నయనారవిందములకుఁ
గదియించెఁబో లసత్కారాగురువిలేపయోగముల్ ఘనకుచాభోగములకుఁ
|
|
తే. |
జేసెఁబో నీలివన్నియచీరముసుఁగు, వేయుసదుపాయములు మృదుకాయములకు
నంధకారం బకారణబంధు వగుచు, జారులకు జేరఁ జనునభిసారికలకు.
| 174
|
క. |
తమిమించె నంతకంతకుఁ, దమిమించెను చిన్నవయసుదంపతులమదిన్
దమకింపుగఁ గలయుటకై, దమకింపుచు మరుఁడు సేయుతహతహవలనన్.
| 175
|
తే. |
అరికి నరియయ్యె నవ్వేళ నది యుచితము, గాక తమ్ముల కహితమ్ము మిత్రు
నకున మిత్రత గాఁగఁ దానడచె నెట్టి, తగవు దోషాఖ్య వర్తించుఁ దామసులకు.
| 176
|
మ. |
సమయాధోరణశేఖరుండు తిమిరస్తంబేరమోత్తంసముం
బ్రమదంబారఁగ నిల్పి సాంద్రతరతారావారముక్తామణీ
సముదీర్ణస్థితి నొప్పవిష్ణుపదపున్ జౌడోలు పైనెత్త వే
గమె వాహ్యాళికి వెల్వడం గల శశాంకస్వామికిన్ ముందటన్.
| 177
|
క. |
పాండిమము దోఁచె నైందవ, మండలధరగర్భభరసమంచిత యగునా
ఖండలదిగ్భామినిముఖ, మండలమున లోధ్రకుసుమమాలాద్యుతియై.
| 178
|
తే. |
ఉదయపర్వతసంగతి నొప్పి ధవళ, కిరణబింబము నైజరక్తిమ వహించె
నాత్మనిర్లిప్తుఁ డయ్యు దేహాప్తివలనఁ, గర్మఫలభోక్తవలెఁ దోచుకరణి గాఁగ.
| 179
|
చ. |
చలువవెలుంగు వేల్పులరసాయనపుందొన పాలవెల్లిలో
మొలచినముద్దుపాపఁడు కుముద్వతివేడుకకాఁడు తమ్మిలోఁ
గిలిగలచంద్రబింబముఖికిన్ సయిదోడు చకోరభోజనం
బులనెఱదాత చందురుఁడు పూర్వదిశాస్థలి నొప్పె నయ్యెడన్.
| 180
|
తే. |
అంతకంతకు రాగంబు నపనయించి, శుచి వహించి సత్సంగతి సొంపు గాంచి
విష్ణుపద మాశ్రయించి యాద్విజవిభుండు, సుగతి గైకొని జగములు పొగడఁ దనరె.
| 181
|
సీ. |
కకుబంశకుడ్యభాగములపైఁ బ్రసరించి పాలసున్నపుగచ్చు పగిదిఁ దనరి
చంద్రకాంతగ్రావచయముపైఁ బ్రసరించి సెలయేటిజాలు పెంపొలయఁజేసి
క్రీడించువిటవిటీశ్రేణిపైఁ బ్రసరించి రతిహెచ్చరికమందు రహి వహించి
యల చకోరంపుగుంపులమీఁదఁ బ్రసరించి యాఁకటిపంటకొల్చై యెసంగి
|
|
తే. |
భువనహితచారుచంద్రికల్ భూనభోంత, రాళమున నిండుకొనియె హేరాళముగను
హారహీరతుషారమందారగంధ, సారఘనసారధవళవిస్తార మగుచు.
| 182
|
క. |
చూపట్టె నిర్మజ్యో, త్స్నాపూరిత మగుచు భువన మంతయు సర్వ
వ్యాపకుఁడు శంభుఁ డనియెడి, యాపలు కవ్వేళ దృష్టమయినవిధమునన్.
| 183
|
శా. |
మార్తాండౌషధసేవచేతను జగన్మర్త్యుండు ప్రాలేయశీ
తార్తిం బాసి తదీయవైకృతివిదాహం బొందఁ దద్భాధ ని
ర్వర్తింపం గ్రియచేసె యుక్తి చెలువారం బూర్ణచంద్రోదయ
స్ఫూర్తిం గాలభిషగ్వరుండు పయిపై జ్యోత్స్నారుచుల్ దేరఁగన్.
| 184
|
ఉ. |
కూరిమినెచ్చెలుల్ సొగసుగుల్కెడుగిన్నెల నించి చెంతలం
జేరి యొసంగ ఘల్లుమని చేతులకంకణనాద మొప్ప నొ
య్యారముతోడ నందుకొని యౌష్ఠపుటంబులఁ బీల్చికొంచు హా
లారసపానలీలలఁ జెలంగిరి వారలతాంగు లయ్యెడన్.
| 185
|
ఉ. |
కారణ మేమి లేకయె వికావిక నవ్వును నిర్ణిమిత్త మె
వ్వారలనైననుం బిలిచి వాదుకుఁ బోవు నిరర్థకంపుహుం
కారముతోఁ జెలంగు సరికన్నుబొమల్ ముడివెట్టు వట్టియా
ర్వేరము సేయు సీధురసవిభ్రమయైనమృగాక్షి యత్తఱిన్.
| 186
|
సీ. |
ఒక టాడఁబోయి వేఱొక టాడు మాటలుఁ బదములఁదొట్రుపా టొదవు నడలు
సొక్కు చూపులకెంపు సొంపారు కన్నులు మదఘూర్ణితములైన మానసములుఁ
జనుదోయి గన్పడ జాఱుపయ్యెదకొంగు లలికంబులకు వ్రాలునలకచయము
శ్రమబిందువులచేఁ గరంగుకస్తురిబొట్టు లవశతదూఁగాకునంగలతలుఁ
|
|
తే. |
గలిగి మధుపానజనితవికారపార, వశ్యలాలసగాత్రలై వేశ్య లపుడు
విటులభావంబులకు నొకవింతవేడ్క, యెసగఁగాఁ జేసి రన్నిశవసరమునను.
| 187
|
సీ. |
బతిమాలినను బయల్పడనీనియంగముల్ సొరిది ముచ్చటదీఱఁ జూచిచూచి
ప్రార్థించినను నోర నంటనియ్యనిమోవి కసిదీఱఁ గంట్లుగాఁ గఱచికఱచి
వేఁడుకొన్నను గేలు వేయనియ్యనిగుబ్బ లాసదీఱఁగఁ బట్టి యలమియలమి
యడుగుకొన్నను మొగం బిడనీనిచెక్కిళ్లు ప్రేమదీఱఁగ ముద్దు పెట్టి పెట్టి
|
|
తే. |
వారుణీరసపానవికారమత్త, ఖండితావార్యరతిసౌఖ్యకలన గాంచి
పల్లవులు మెత్తు రత్తఱిఁ బ్రాణబంధు, వగుట నిది యాసవాహ్వయం బయ్యె ననుచు.
| 188
|
వ. |
అట్టినిశాసమయంబున నప్పురూరవుడు.
| 189
|
సీ. |
ఘనతరస్తంభసంఘటితమాణిక్యముల్ దీప్తదీపావళీస్థితి వెలుంగ
వాతాయనాయాతవాతపోతంబులు చామరవిక్షేపసౌఖ్య మొసఁగ
నపరంజిమెఱుఁగు నిద్దపుఁగీలుబొమ్మలు పరిచారికలరీతిఁ బనులు సేయ
ముత్యాలపంజరములఁ గీరశారికల్ శృంగారకథలు వచింపుచుండ
|
|
తే. |
వజ్రసోపాననీలకవాటచంద్ర, కాంతకుట్టిమమరకతఖచితకుడ్య
పుష్పరాగవితర్దికాస్ఫూర్తి నధిక, సుందరంబైన కేళికామందిరమున.
| 190
|
చ. |
పగడపుఁగోళ్లు వజ్రములపట్టెలు సైకపుఁబట్టుపట్టెడన్
జిగిబిగియైన యల్లికవిచిత్రపటావృతహంసతూలికన్
మిగుల రహించుపానుపున నించినజాజులు గానరా బయిన్
దగువలిపంపురాజదుపధానము గల్గినశయ్యమీఁదటన్.
| 191
|
తే. |
పవ్వళించినఁ దన్మనోభావ మెఱిఁగి, ప్రోడనెచ్చెలు లుర్వశిఁ దోడి తెచ్చి
యమ్మహారాజుసన్నిధి కనిపి రపుడు, మణితులాకోటినిక్వణక్వణన మెసఁగ.
| 192
|
క. |
లోలాక్షి ప్రౌఢయయ్యును, బాలికయునుబోలె సత్రపామందగతిన్
డోలాయమానమానస, యై లోపలి కరిగె మోహ మట్టిద కాదే.
| 193
|
క. |
వచ్చినఁ గనుఁగొని గొబ్బున, గ్రుచ్చి కవుంగిటను జేర్చి కోర్కులు మదిలో
హెచ్చఁగ శయ్యకుఁ దార్చి శ, రచ్చంద్రనిభాస్యమనసు రంజిలఁ బల్కెన్.
| 194
|
సీ. |
తరుణి నీముఖచంద్రదర్శనాపేక్షఁ జూపులకుఁ బున్నము యొక్కప్రొద్దు లొదవె
నతివ నీమధురవాగమృతపారణవాంఛ శ్రుతులకు నిరశనవ్రత మొసంగె
నాతి నీపరిరంభణస్వర్గభోగేచ్ఛ దేహంబునకుఁ దపసిస్థితి ఘటించెఁ
జాన నీపొందుబ్రహ్మానందగతిరతి నెమ్మది కద్వైతనిష్ఠ పొడమె
|
|
తే. |
నని తదాసక్తి నయనకర్ణాంగ మాన, సములు నీయండఁ జేర్చు నామమత దెలిసి
మొగము చూపి భాషింపుచుఁ బిగువుకౌఁగి, లిచ్చి కలసి కావింపు మభీష్టసిద్ధి.
| 195
|
ఉ. |
చన్నులు పద్మకోశములు చక్కనిచేతులు పల్లవాకృతుల్
నెన్నుదు రర్ధచంద్రరమణీయము ముష్టికరప్రమాణతన్
జెన్నగు మధ్య మంగములచే భరతాభినయం బెఱుంగనౌ
చున్నది నిన్నుఁ జూచినఁ దలోదరి యాటకు జాణవౌటనో.
| 196
|
సీ. |
నీదులావణ్యాంబునిధిలోనఁ జూపులు మునిఁగి తేలవు చూడ ముద్దుగుమ్మ
నీదుచన్గొండల నెత్తమ్ములకుఁ బ్రాఁకి దిగలేదు భావ మోయిగురుఁబోఁడి
నీకటాక్షశరార్తి నెమ్మేను మ్రాన్పడి తెలివినొందదుగదే జలదవేణి
నీయధరామృతశ్రీ యాసఁ దవిలి నాలుకదాహ మణఁగదు లోలనయన
|
|
తే. |
నీవు కౌఁగిటఁ జేర్చి మన్నింపుకున్న, భామ నీచక్కఁదనమె నాపాలిటికిని
జాలియున్నది విరహాగ్నిపాలుపఱువ, నించువిలుకానిగుణదోష మెంచనేల.
| 197
|
వ. |
అని మఱియు నర్మమర్మవచనప్రసంగవశంబునఁ గురంగనయనయంతరంగంబు రాగ
రసతరంగితంబయి కరంగం బలుకుచుఁ గౌఁగిలించునప్పుడు.
| 198
|
ఉ. |
ఆయతమోహనాంగు మెఱుఁగారెడుకన్నులకొద్దిఁ జూచి యా
హా! యిటువంటి నీచెలిమి యబ్బక యీవఱదాఁక నూరకే
పోయె నయో దినంబులని పొక్కుచుఁ జేర్చె లతాంగి బాష్పధా
రాయు మైనమో మతనిరాజితహారభుజాంతరంబునన్.
| 199
|
ఉ. |
భూదయితుండు కౌఁగిటను బొందుగఁజేర్ప సుఖించి పూర్వరా
గోదితతాప మప్పతికి నొయ్యనఁ దెల్పుచు వెచ్చనూర్చి త
త్సాదరణోక్తి వెండిఁ బ్రియమందఁగ మోదములోన ఖేదమున్
ఖేదములోన మోదము సఖీమణి మోమునఁ దోఁచు వింతయై.
| 200
|
తే. |
అంబుజాక్షి నితంబబింబాంబరంబుఁ, దివిచి లేఁగౌను నివిరి మోదించె నతఁడు
హైమవేదికఁ దనరు సింహాసనంబుఁ, గొనిన కైవడి మి న్నందికొనినరీతి.
| 202
|
తే. |
విభుఁడు తమకించి కటిచీర వీడఁదివియ, నంబరము లేక యును విలాసాంగిమధ్య
మంబరం బున్నయట్లుండె నదరి చెదరు, నాయముల సిగ్గు నిలుపలే దాయెఁగాని.
| 203
|
మ. |
కృతసంపర్కమనోజ్ఞహారలతికాశ్రీరోమరేఖాసితా
సితమై బంగరుతాళి మేల్పసిమితోఁ జెన్నొందుశోభాసమ
న్వితకాంతాకుచమధ్యమం బనుత్రివేణీసంగముం జొచ్చి భూ
పతిసంకల్పము కాంచె మన్మథపరబ్రహ్మైక్యతానందమున్.
| 205
|
చ. |
విభునివిలోకనంబు లరవిందదళాయతనేత్ర కౌనునం
దభినతసౌఖ్యలీలల విహారము సల్పి కటిస్థలంబుపై
రభసముతోడ వ్రాలె నొనరన్ సుకృతానుభవంబు చెల్లిన
న్నభముననుండి భూతలమునం బడుమానవుతోడ నుద్దియై.
| 206
|
తే. |
తరుణినడుమున ఖేచరత్వము వహించు, వనితకటియందు భూచరత్వంబు దాల్చు
రమణినాభిఁ బాతాళచరత్వ మభ్య, సించు నవ్విభుచూపు లచ్చెలువఁ గదిసి.
| 208
|
సీ. |
ఎదురుకోలు ఘటించె నితరేతరప్రఫుల్లాంబకాంభోజదృగంచలములు
వాద్యఘోష మొనర్చె వరరత్నకింకిణీకంకణకిణిఝణత్కరణరవము
మంగళసూత్రసంపద దెల్పెఁ బతిచేయు లలితాంగికంఠావలంబనంబు
తలఁబ్రాలముత్తియంబులయంద మొందె జల్జలరాలు కచపుష్పసముదయంబు
|
|
తే. |
పలుకులగ్నాష్టకము లయ్యె గళరవములు, పొత్తులభుజింపువేడుక పొలపుదాల్చెఁ
బక్వబింబాధరామృతపానలీల, తన్మిథునకేళిపరిణయోత్సవమునందు.
| 209
|
సీ. |
గమకముల్ చూపి ధైర్యము గలంగించిన గుబ్బల నఖపఙ్క్తికొలఁదిఁ గ్రుమ్మి
నోరూరఁ జేయుచు నాఱఁడిబెట్టిన మోవి క్రొవ్వాఁడిపల్మొనల నొక్కి
మకరరేఖలఁ బొల్చి మదనవేదనఁ గొల్పు కొమరుఁజెక్కులఁ జపేటములఁ బెట్టి
యాలంబనరసాప్తిఁ జాల స్రుక్కించిన గాత్రంబు భుజములఁ గట్టివైచి
|
|
తే. |
ముందు విరహాంబురాశిలో ముంచి ముంచి, యలఁతఁ బెట్టిన యలివేణియంగకములఁ
జలముసాధించె నారాజచంద్రుఁ డిట్టు, లెంత చేసిన వారికి నంతగాదె.
| 210
|
తే. |
పడఁతిపాదప్రపాదసంస్పర్శనంబు, పద్మకచ్ఛపలాభంబుపగిదిఁ దోఁచె
దోఁచదే శంఖనీలముల్ దొరకినట్లు, రతిగళకచాప్తి యారాజరాజునకును.
| 211
|
సీ. |
యుగపత్ప్రచుంబితాన్యోన్యవీటీసుగంధాధరపుటచూత్కృతాభిరామ
మేకదాసంవీక్షితేతరేతరముఖవ్యాకోచనిర్నిమేషాంబకంబు
సాంగత్యకూజితాంచత్పరస్పరకంఠమణితస్వనావ్యక్తమధురిమంబు
సమకాలగాఢబద్ధమిథోభుజాజహదంకపాళీమిళదవయవంబు
|
|
తే. |
సహనటద్వంద్వసమరతిసమయచటుల, జవపునఃపునరాఘాతశబ్దరచిత
తాళమానంబు తత్సురతంబు మిగుల, సౌఖ్యకరమయ్యె నన్నెఱజాణలకును.
| 212
|
ఉ. |
ఎక్కడనంటినం గళలయిక్కువ లెక్కడ ముద్దు వెట్టినన్
మక్కువచే గగుర్పొడుపు మర్మము లెట్లు నఖాంకురంబులన్
నొక్కిన గాటపుందమియు నొవ్వని మైమఱ పెద్ది పల్కినం
జక్కెరవిల్తుమంత్రములు చానకు నానృపుతోడికూటమిన్.
| 213
|
సీ. |
మనసిజబాణముల్ దొనలఁ జేరె ననంగ లీలఁ గన్నులు ముకుళీభవించె
కందర్పుచాపవిక్రమ మణంగె ననంగ భ్రూలతావిభ్రమమంబులు దొలంగె
|
|
|
విరివిల్తుమూఁకలు విఱుగుచూపె ననంగఁ గ్రొమ్ముడి వీడి ముంగురులు చెదరె
దర్పకుతూర్యనాదము లణంగె ననంగ మణిభూషణధ్వనుల్ మట్టుపడియె
|
|
తే. |
నావిలాసిని నవసురతావసాన, సమయజగ్లాని సౌమ్యభావము వహించె
వర్తమానపరాభవావస్థ నున్న, చిలుకతేజీవజీరునికలకతోడ.
| 215
|
ఉ. |
ప్రాయపుదంపతుల్ బెగడుపాటున నొండొరుఁ గౌఁగిలించి యా
హా యిదె తెల్లవారెఁగద యంచుఁ బునారతివాంఛ నర్మవా
చాయుతిఁ దావులంటుచు వేసం దమిరేఁచి రమింపఁ గొక్కురో
కోయని తామ్రచూడములు కూయఁదొడంగె నడంగెఁ జీకటుల్.
| 216
|
చ. |
అపుడు తమంబుచొప్పుఁ దెలియన్ సమయోచితవేషధారియై
తపనునియాజ్ఞఁ గైకొని ముదంబున వేగున కేగుదెంచు దూ
తపగిదిఁ జూడనొప్పె నుదితంబయి తూర్పున వేగుచుక్క యా
నెపముననో తదాఖ్య ధరణిం బ్రతిపాదితమౌట దానికిన్.
| 217
|
సీ. |
సురతవిముఖతచే సోలుపద్మినికి శంకిని మహోత్సాహంబుఁ గీలుకొలిపి
వగలఁ గుందెడుచక్రవాకంబులకుఁ జకోరంబులయుల్లాసరస మొసంగి
స్వపరజాగ్రద్వధూచాక్షుషంబులకు దీపములశోణద్యుతి పాదుకొల్పి
వసివాడు దేరియున్నసరోజరాజికిఁ గుముదసౌభాగ్యంబుఁ గుదురుపఱిచి
|
|
తే. |
యానిదురమబ్బు శంకిని కావిచార, దశ చకోరకములకు నాధవళిమంబు
దీపికల కానిమీలనస్థితి కుముద్వ, తికినిఁ గల్పించె సమయమాంత్రికవరుండు.
| 218
|
మ. |
జలజాతాహితుతో రతిం బెనఁగుచో సయ్యాటపున్ రాపుచే
ష్టలఁ జెల్లాచెదరైనహారగుళికాజాలంబు తావేకువం
దొలఁగం జూచుచు నేఱి పుచ్చుకొనియెం దోడ్తో నిశాలీనకుం
తల యన్న ట్లపరూపతం బొరసి భాంతస్సాంద్రతారావళుల్.
| 219
|
ఉ. |
వీచెఁ బ్రభాతవాత మరవిందవనంబుల మేలుకొల్పుచుం
దోఁచె విటీవిటావలికిఁ దుందుడుకుల్ విడలేని కూర్ములన్
సాఁచె మయూఖమాలి కరశాఖలు పూర్వనగంబుచెంతఁ జె
య్యాఁచె మనోభవుండు విరహార్తుల నొంచుట మాని శాంతుఁడై.
| 220
|
మ. |
సరసీకేళిగృహంబునం గుముదినీసంభోగలీలన్ నిశా
కరుఁ డాత్మప్రతిబింబరంభమున వేడ్కల్సల్పి తాజోడువా
|
|
|
సరుగన్ ఖిన్నతనొందెఁ గైరవిణి తా నంతంతకున్ వెల్లనై
జరిగెం బొం దెడలైనదంపతులకుం జాలౌట యాశ్చర్యమే.
| 221
|
క. |
దధిమథనఘుమఘుమధ్వని, యధికంబై వల్లవీగృహంబులఁ జెలఁగెన్
మధుకరవేణీకంకణ, మధురఝణత్కారమిళితమసృణం బగుచున్.
| 222
|
సీ. |
వనవాటికలయందు వరవిహంగీవిహంగసమాజకూజితకలరవంబు
ప్రాసాదములయందుఁ బాఠకోద్గీతభూపాళాదిగీతికాబహుళరవము
గోస్థానములయందు గోపకాహ్వానోత్సుకారంభసురభికాంభారవంబు
నళినాకరములందు నవనవోత్భుల్లారవించబృందచలన్మిళిందరవము
|
|
తే. |
స్నానఘట్టంబులందు మజ్జనవిధాన, నిరతవిశ్వంభరామరనికరపఠిత
సుప్రసిద్ధాఘమర్షణసూక్తరవము, శ్రావ్యమైయొప్పె నయ్యుషస్సమయమునను.
| 223
|
తే. |
వనజబంధుండు దనుఁ జేరవచ్చునపుడు, ప్రథమదిక్సీమరాగసంపద వహించె
ననఘు లగువారు దనయింటి కరుగుదేరఁ, గోరి యనురాగ మందనివారు గలరె.
| 224
|
మ. |
నలినీపుణ్యఫలంబు కోకమిథునానందాలవాలంబు ది
గ్వలయాలంకరణంబు మోక్షపదవీఘంటాపథం బంబర
స్థలమాణిక్యము బ్రహ్మవిష్ణుశివతేజఃపుంజ మౌపాసకో
జ్జ్వలనిక్షేపము భానుబింబము ప్రకాశం బయ్యెఁ బ్రాచీదిశన్.
| 225
|
సీ. |
కమలాసనమున సాకల్పహైమాంగుఁడై యాత్మమండలములో హరి వెలుంగఁ
బెంపుతో మాఠరపింగళోద్గండారిపారిపార్శ్వకకోటి బలిసికొలువ
సౌరసూక్తముల సంస్తవము గావింపుచు వాలఖిల్యాదులు మ్రోల నిలువ
గరుఁడాగ్రజుఁడు హరిద్ధరిసప్తకంబును ఛాత్కా.రరవముతోఁ జబుకుసేయ
|
|
తే. |
హృద్యగంధర్వమర్దళవాద్యరంజ, కాప్సరోనాట్యసంరంభ మతిశయిల్ల
రుచిరరత్నవిమానసంరూఢుఁ డగుచు, నుదయగిరిశృంగమునఁ బొల్చె నుష్ణకరుఁడు.
| 226
|
తే. |
పూర్వపశ్చిమదిగ్భాగముల నలంకృ, తంబులై సూర్యశశిమండలంబు లపుడు
హరునితేరికి బండికండ్లైన నాఁటి, చంద మిటువంటిదని తెల్పె జగములకును.
| 227
|
ఉ. |
చెక్కులచుంబనాంకములు చెందొగచాయల మోవిఁమీది ప
ల్నొక్కులు నిద్రదేరెడుకనుంగవ వీడినకీలుగంటునుం
జిక్కులు వడ్డహారములు సిబ్బెపుగుబ్బల గోటినాటు లా
చక్కెరబొమ్మకున్ రతిరసస్ఫుటచిహ్నము లొప్పె వేకువన్.
| 229
|
సీ. |
ఎడఁబాయలేమి ననిచ్ఛతో లేచుచు మోహాప్తి నిడుకొన్న ముద్దుసొగసు
మఱుఁగుగా నవ్వల మరలవీడిన నీవి ముడిగొల్పి పయ్యెదయిడినసొబగు
పిఱుఁదుపై వ్రాలెడు నెఱికురు లసదుగాఁ గొని కేలఁబొదివిన కొప్పువింత
పదముల జాళువాపావాలు దొడివి చప్పు డెఱుఁగరాకుండ నడుచుహొయలు
|
|
తే. |
కని కరంగెడువిభుని నెమ్మనము నపుడు, ముదిత రాగరసాంబుధి ముంచి యెత్తె
మరలి చూచిన సురతజాగరపుఁగెంపు, నిగ్గు గనుచూపుచే శయ్య డిగ్గి చనుచు.
| 230
|
సీ. |
చెలువకౌఁగిటినొక్కుచే నెద నేర్పడ్డ నవరత్నహారచిహ్నములతోడఁ
బూఁబోఁడిచుంబనంబులఁ జెక్కులంటిన తాంబూలరసరక్తిమంబుతోడఁ
గొమ్మకన్నుల నద్దుకొనుటచే గళమునఁ గనుపట్టుకజ్జలాంకములతోడ
ముదితపల్లొత్తుల మోవిపైఁ జైలువొందు సరసంపుఁగెంపులవరుసతోడ
|
|
తే. |
మెలఁతమొనగోటినాటుల మిగుల నంద, గించు సందిళ్ళ చంద్రరేఖికలతోడ
మొదలిచెలువంబునకు వింతమురిప మెసఁగఁ, గేళిసదనంబు వెడలి భూపాలకుండు.
| 231
|
వ. |
స్నానసంధ్యాద్యనుష్ఠానంబులు నిర్వర్తించి నిత్యోచితదానంబుల మహీసురసంతర్ప
ణంబు గావించి షడ్రససంపన్నంబు లయినభక్ష్యభోజ్యచోష్యలేహ్యపానీయంబులం
దృప్తుండయి కిరీటకుండలగ్రైవేయకేయూరకంకణోర్మికామేఖలాంగదాదిదివ్యమణి
ఖచితజాంబూనదాభరణమనోజ్ఞదుకూలాదుల నలంకృతుండయి సామంతమంత్రి
పురోహితసేనానాయక విద్వత్కవివందిమాగధవిలాసినీపరిచారికాదులు నిజాధి
కారానుగుణంబుగాఁ గొలువు సేయ రాజ్యభారధురంధరుండయి యుండె నయ్యుర్వ
శియు శుద్ధాంతమందిరంబున సఖీసహస్రసంసేవితయై మజ్జనభోజనాదు లనుభవిం
చుచు నుచితంపువిధంబున మెలంగుచుండె నవ్విధంబున నయ్యుర్వశీపురూరవ
స్సు లిష్టోపభోగంబుల నిరతసురతక్రియాసౌఖ్యంబులం దేలుచు.
| 232
|
క. |
మేడల మెలఁగుచుఁ బొన్నల, నీడలఁ జెలఁగుచు నటద్వనీతటపుళిన
క్రీడలఁ దనరుచు నింపగు, జాడల నలరుదురు వారసతియుం బతియున్.
| 233
|
ఉ. |
ఒక్కనిమేషమైన నొకరొక్కరిమోములు చూడకుండినన్
మిక్కిలి జాలినొందుదురు మేనులు జీవము లొక్కరూపుగా
మక్కువలం దలంపుదురు మాటికి వెన్నవలెం గరంగుచున్
సొక్కుదు రొండొరున్ దనువుసోఁకిన వారలమోహ మెట్టిదో.
| 234
|
మ. |
జననాథాగ్రణికిన్ లతాంగికి యథేచ్ఛక్రీడలన్ నిత్యనూ
తనహర్షాప్తియె కాని నెమ్మది విషాదం బింతయున్ లేదు లే
|
|
|
దన నేలా కల దొక్కవేళ భరితప్రాంచన్మణీహారపుం
జనిరోధాంతరితోపగూహముల నిచ్చన్ ముచ్చటల్ దీఱమిన్.
| 235
|
క. |
ఇవ్విధమున నవ్వేలుపు, జవ్వనియును నవ్విభుండు సరివలపులతో
నివ్వటిలం బువ్విలుతుని, యవ్వింతలఁ గొంతకాల మట్లు మెలఁగఁగాన్.
| 236
|
ఇంద్రునిపంపున గంధర్వు లూర్వశికై భూలోకమునకు వచ్చుట
ఉ. |
అంతట నొక్కనాఁడు దివిజాధిపుఁ డయ్యమరావతీసభా
భ్యంతరసీమయందుఁ గొలువై బలువైభవ మొప్ప నృత్య మ
త్యంతనిరూఢి నప్సరస లాడఁగ జూచుచు నుండె నుండ య
క్కాంతల నందఱం గలయఁగన్గొని యుర్వశి గానరామికిన్.
| 237
|
తే. |
తగ విచారించి యచటిగంధర్వవరులఁ, బిలిచి నా డూర్వశిని ధరాస్థలికి నంపి
తిమిగదా నాటనుండియుఁ దిరిగిరాక, యుండఁ గారణ మేమి భూమండలమున.
| 238
|
క. |
అనవుడు గంధర్వులు త, ద్వనితావృత్తాంత మెల్లఁ దనతోఁ దెలుపన్
విని యేయుపాయమున నై, నను గోమలిఁ దోడితెండు నాకంబునకున్.
| 239
|
ఆ. |
అని యనుజ్ఞ సేయ నవనికి నేతెంచి, యుర్వశియు నృపాలుఁ డున్నయట్టి
చెలిమిఁ గాంచి యెడలు సేయుటకై వేళ, గాంచి యుండి రప్రకాశవృత్తి.
| 240
|
ఉ. |
ఆయెడ నొక్కనాఁటినిశియందుఁ దటాంతనికుంజపుంజపు
ష్పాయతదివ్యగంధమిళితాగతవాతపరంపరన్ సుఖ
శ్రీ యెసఁగంగ నొక్కనదిచెంతను సైకతవేదికాస్థలిన్
బ్రేయసియున్ బ్రియుండు గడుఁబ్రేమలఁ గొందలిరాకుశయ్యపై.
| 241
|
క. |
కుసుమశరశాస్త్రవిద్యా, రసికతఁ జౌషష్టికళలఁ బ్రౌఢిమఁ జూపెన్
ముసిముసినగవులు మొగమునఁ, బ్రసరింపఁగ యువతి యుపరిరతులం బతికిన్.
| 243
|
కవిరాజవిరాజితము. |
ముడిచినపువ్వులు జిల్లలరాలఁగ మూపున వ్రేలెడుక్రొమ్ముడియున్
గడుసుజనుంగవ జవ్వడువన్ గడుగంపము నొందెడుహారములున్
నడుము వడంక మృదుధ్వని నుత్పతనంబులు సల్పెడు బల్పిఱుఁదుం
బొడగని సొక్కె విభుండు కళావతి పూరుషభావరతిక్రియలన్.
| 244
|
క. |
సమకాలసుఖజలోదయ, శమితస్మరయుద్ధతంత్రసన్నాహములన్
రమణియు రమణుఁడు సొక్కున, నమరం గనుమూయుచున్న యాసమయమునన్.
| 245
|
తే. |
సమయభంగంబునకు నిది సమయ మనుచు, దవిలితఱి వేచి యున్నగంధర్వవరులు
వారి కనతిదూరంబున వరసఖీజ, నోపకంఠంబునను గట్టియున్నయట్టి.
| 246
|
ఉ. |
మేషయుగంబుఁ బట్టుకొని మెల్లనె పో నవి భీతిఁ గూయఁ ద
ద్ఘోషము వీను సోఁకిన దిగుల్గొని గొబ్బున లేచి తీవ్రసం
భాషల లెమ్ములెమ్ము నరపాల తగళ్ల మరల్పు దొంగలన్
భీషణశక్తిఁ దోలు మని ప్రేయసి వల్కఁగ నిద్రమబ్బునన్.
| 247
|
తే. |
లేవకుండిన రోషంబు లేదు నీకు, దెగడి నే మొఱపెట్టంగ మగతనంబు
దక్కి వినియును వినినచందమున నున్నఁ, వాఁడ వెందైన నిటువంటివారు గలరె.
| 248
|
క. |
కూరిమిబిడ్డలవలెఁ బ్రియ, మారఁగ నేఁ బెంచుకొన్నయట్టితగళ్ళం
జోరుల పాల్పఱచితి నీ, వీరత్వము నమ్మి యింక వేయన నేలా.
| 249
|
మ. |
అని యక్కోమలి దూఱనాడు పరుషవ్యాహార మేపాటి సోఁ
కెనొ కర్ణంబుల వ్రేటువడ్డపులిభంగి దిగ్గున లేచి య
జ్జననాథుం డదె పోకుపోకు మనుచున్ శాతాసివిక్షేపసం
జనితోద్యద్ద్యుతి యంధకార మణగించందూడె వేగంబునన్.
| 250
|
క. |
నిద్రాభంగవికారము, రౌద్రావేశమును విస్మరత యొదవింపం
దద్రాజమౌళి జఘనజ, హద్రాజితవస్త్రుఁ డగుచు నరిగె నెఱుఁగమిన్.
| 251
|
క. |
దాకొని వడి గంధర్వుల, పైకిన్ లంఘించి వేసెఁ బటుహ స్తనట
ద్భీకరకరవాలమున భ,యాకులతఁ దగళ్ల విడిచి యవ్వల జరుగన్.
| 253
|
తే. |
తస్కురులమీఁద నుఱుకుచో ధరణివిభుఁడు, వీరరసమున భైరవాకారుఁ డయ్యె
నంతమాత్రమె కాదు వీతాంబరత్వ, కారణమునను భైరవాకారుఁ డయ్యె.
| 254
|
తే. |
అట్లు గంధర్వులను దోలి యాపొటేళ్లఁ, బట్టి తెచ్చిన విభుఁ గాంచి ప్రమద ప్రమద
మంది యెదఁ జేర్చుకొనఁబోయి యతని మేనఁ, జీర లేమికిఁ గలుషితచిత్త యగుచు.
| 255
|
క. |
ఆలింగన మొసఁగని జవ, రాలం గని తెలిసి వేగ మంబరము కటిన్
జాలిం గట్టెడు నానృప, మౌళిం గలకంఠి వికలమతిఁ గనుఁగొనుచున్.
| 256
|
చ. |
పలికె నరేంద్రుతోఁ గుముదబంధుకులోత్తమ హీనుభంగి యి
ట్లలుకువలేక వస్త్రరహితాకృతి నాకడ నిల్వఁ బాడియే
యల సమయో క్తియుం దలఁపవైతివి వీడనిపొందు వీఁడుకో
వలసెఁ గదా యిఁకం గలలవంటివి గావె ఋణానుబంధముల్.
| 257
|
క. |
నావలనఁ గొఱఁత గలుగదు, నీవచనము దప్పె నింక ని న్నననేలా
దైవకృతం బటువంటిది, భూవర నాకొఱకు వగలఁ బొందకు మింకన్.
| 258
|
తే. |
పోయివచ్చెద దయయుంచుమీ యటంచు, జనియె నుర్వశి చేలులుఁ దానును యథేచ్ఛఁ
బ్రియునివలవంత మనసునఁ బెట్టదయ్య, వారకాంతలవలపు లెవ్వరికి సతము.
| 259
|
తే. |
అపుడు కెలన నున్న యట్టిగంధర్వులు, కోమలాంగిఁ దోడుకొనుచుఁ జనిరి
ముదిత శాపదోషమును మును మును లను, గ్రహము చేసినట్లు రహితమయ్యె.
| 260
|
క. |
అంతటఁ జింతాక్రాంత, స్వాంతుండై వంత నొందె వసుధాకాంతుం
డెంతయు నకటా వలచిన, యింతిం బాసిన విచార మిం తన వశమే.
| 261
|
సీ. |
సింహాసనోపరిస్థితి యొల్లక లతాంగి తనుమధ్యసీమయందమె తలంచు
భూచక్రపరిపాలనోచితక్రియ మాని తఱలాక్షిసిఱుఁదుచందమె తలంచుఁ
ఘనకుంభగుంభివాహనకేళి చాలించి కలికిపాలిండ్లపొంకమె తలంచుఁ
జాపాస్త్రధారణాసక్తి లేక నెలంత భ్రూకటాక్షవిలాసములె తలంచుఁ
|
|
తే. |
గనకసంపద లార్జించుకాంక్ష విడిచి, యతివనిద్దంపుమేనిచాయలె తలంచు
నధిపుఁ డిబ్భంగి రాజ్యభోగాభిలాష, వదలి యేప్రొద్దుఁ దన్మయావస్థ నొందు.
| 263
|
క. |
అసురుసురని సొలయున్ రా, జసురేంద్రుఁడు మలయపవనుచలికసరునకున్
బిసరుహశరుశరవిసరపు, ముసురునకుం దడిసి కిసలములవిసరునకున్.
| 264
|
ఉ. |
కన్నుల నీరునించుఁ బులకంబులు దాల్చు వహించుఁ గంపమున్
విన్నఁదనంబు నొందుఁ గడువిస్వరతం బలవించు ఘర్మబిం
దూన్నతిఁ జెందు ఱిచ్చవడి యుండును మూర్ఛిలు నంతనింతిపై
కొన్నటులైన లేచు వగఁగుందుచు భూపతి సాత్త్వికాఫ్తిచేన్.
| 265
|
వ. |
ఇవ్విధంబున నవ్విభుండు విరహవ్యాకులితచిత్తుండై పురంబు చొరనొల్లక యుర్వశి
నన్వేషింపుచుండ నమ్మహీభర్తవర్తనం బరయుటకయి వచ్చి యచ్చేడియ యతని
దైన్యం బవలోకించి యూఱడించుటకయి సరస్వతీతటినీతటంబున సఖీసమేత
యయి పొడచూపిన.
| 266
|
ఉ. |
గుండియ జల్లు జల్లనియెఁ గోమలిఁ జూడగఁ జూచినంతలోఁ
నిండె జలంబు కన్నులను నీకొఱకై యిటులున్నవాఁడ నో
|
|
|
యండజయాన యంచుఁ తనయార్తత దెల్పుచుఁ బల్కుఁ బల్కులో
మెండుగఁ దోఁచె గద్గదిక మేదినినాయకుకూర్మి యెట్టిదో.
| 267
|
తే. |
ఇట్లు కరుణంబు నొంది యయ్యింతిఁ గదిసి, వర్తులోత్తుంగదృఢకుచద్వంద్వలిప్త
చందనద్రవ మెదకాఁక చల్లఁజేయ, గాటముగఁ గాంక్షకొలఁదినిఁ గౌఁగిలించి.
| 268
|
ఉ. |
నామది నిన్ను జీవముగ నమ్ముటకా పగదానికైవడిం
గాముని కప్పగించితివి కట్టిఁడిదాన యజుండు నీ మనం
బేమిటఁ చేసెనో యెఱుఁగ నింతదలంచినదాన వక్కటా
యేమిటి కింత నన్ను భ్రమియించితివే పయిపూఁతకూర్ములన్.
| 270
|
తే. |
మానవతి నీవు కట్టిఁడిమనసుదాన, వగుట నే నేల తెలియలే నైతి మున్నె
హృదయసీమాబహిర్గతాగేంద్రకఠిన, చణభవత్కుచకుంభముల్ చాటుచుండ.
| 271
|
క. |
కులుకుచు జిలిబిలిపలుకులు, పలుకుచు రసమొలుకుచూపు వదనాబ్జముపైఁ
జిలుకుచుఁ బలుమొననొక్కుల, నులుకుచు రతివేళఁ జొక్కుచుందువు తరుణీ.
| 272
|
క. |
వదలెను క్రొమ్ముడి వదలియు, వదలనిలజ్జాభరంబు వడికూటములం
గదలెడు నడుమును గదలియుఁ గదలనిచనుదోయి దలఁచి కరఁగెద రమణీ.
| 273
|
చ. |
పిలుపులయింపు ముద్దుగొనుపెంపుఁ జనుంగవయుబ్బరింపుఁ జె
క్కుల చెమరింపు మైపులకగుంపు వదల్పనికౌఁగిలింపుఁ గ
న్నుల యదలింపఁ గీలుజడనొంపుఁ దలంపున వేడ్క నింపు నీ
కలయిక సొంపు నే మఱవఁగాఁగలనా కలనైనఁ గోమలీ.
| 274
|
మ. |
అని దైన్యోక్తుల దూఱుప్రాణవిభు నూఱార్చెన్ లతాతన్వి చుం
బనదానంబుల దంతబాహులతికాబంధంబులం జల్పితా
నునయాలాపములన్ జపాకుసుమకాంతు ల్గుల్కు కెమ్మోవిక్రొ
న్ననమాధుర్యరసంపువిందులఁ గృతానందంబు లౌపొందులన్.
| 275
|
వ. |
ఇ ట్లయ్యిందువదన రాజకందర్పు డెందం బానందంబు నొందఁజేసి యిట్లనియె.
| 276
|
మ. |
తగునే రాజకుమార మన్మథమనస్తాపంబుచే నింతనె
వ్వగలం బొందఁగ ధైర్యశాలివిగదా వారాంగనాస్నేహమో
హగుణంబుల్ చపలాయితాయతము లెంతైనన్ సతం బేలగున్
నగరే లోకులు నీమనం బిటులు మగ్నంబైన రాగాంబుధిన్.
| 277
|
ఉ. |
నీకడ నిన్నినాళ్లవలె నే వసియింపఁగరాదు దేవతా
లోకమునన్ సురేంద్రసభలో నిక నిచ్చలుఁ గొల్వుసేయుటన్
నాకడ కీవిభావరి సనన్ మఱి మీఁదటిరేయి రమ్ము సౌ
ఖ్యాకరవృత్తిఁ గూడఁగ నుపాయ మగుం జను మిప్పు డింటికిన్.
| 278
|
వ. |
అని మఱియుఁ బ్రియాలాపంబుల నూఱడించి యుర్వశి గంధర్వులం గలసి దేవ
లోకంబున కరిగెఁ బురూరవుండును నక్కలికి పలికిన పలుకున కర్థంబు విచారించి
యీరేయి గడపి తనకడకు వచ్చునది యని యాదేశించుటను దరుణి గర్భధారిణిగా
నెఱింగి యొకదినంబు మితంబుసేయుట మనుష్యమానంబున సంవత్సరం బని తెలిసి
ప్రతిష్ఠానంబున కరిగి యథోచితంబుగా రాజ్యపాలనంబు సేయుచు ముర్వశీవిర
హితం బగుట భోగంబులయం దాసక్తిలేక వలసి వల్లమి ననుభవించుచుండె.
| 279
|
తే. |
అహము లెల్లను దద్వధూహావభావ, మహురభివ్యక్తకృతముదావహములుగను
నిశలు దత్కుచపరిరంభనిర్భరసుఖ, కారణస్వప్నదశలుగాఁ గడపుచుండ.
| 280
|
క. |
ఏఁడయ్యె నొకదినం బొక, యేఁడై యరుగంగ మానవేంద్రున కది పె
క్కేఁడు లనితోఁచ రెండవ, యేఁడు ప్రవేశించె నతని కెలమి యొసంగన్.
| 281
|
వ. |
అట నుర్వశియుం బురూరవఃకళాభరితప్రదీపితం బయిన గర్భంబువలన శుభముహూ
ర్తంబున నవమోహనాకారుం డగునాయు వనుకుమారుం గాంచి గారవంబునఁ
బెనుచుచుండె.
| 282
|
తే. |
అప్పు డతఁ డుర్వశీదర్శనాభిలాష, బుద్ధి రేగుచుఁ గనకాద్రి పొంత వనవి
హారపరత సఖీయుక్త యగుచు వచ్చి, మెలఁగుచున్నట్టి యవ్వేల్సుమెలతఁ గాంచె.
| 283
|
క. |
ఆరమణియుఁ బ్రియ మగునుప, చారంబులఁ బ్రీతుఁ జేసి జనవల్లభుతోఁ
గూరిమి నిట్లను విను మొక, నేరుపు ననుఁ గలిసియుండ నీ కెఱిఁగింతున్.
| 284
|
శా. |
నే గంధర్వులయాజ్ఞచేఁ మెలఁగుచున్కిం జేసి నీతోడిసం
యోగక్రీడలఁ దొంటియట్ల మెలఁగన్ యుక్తంబుగా దింక నీ
వాగంధర్వుల వేఁడికొమ్ము వినయం బారంగ నట్లైన సం
భోగార్థంబుగ నీకు నిచ్చెదరు నన్ భూపాలచూడామణీ.
| 285
|
తే. |
అనుచుఁ బల్కిన నట్లకా కనుచు నాతఁ, డొక్కవిజనస్థలంబున నొక్కరుండు
పొసఁగఁ గూర్చుండి గంధర్వపుంగవులను, భక్తియుక్తి నుద్దేశించి ప్రస్తుతించె.
| 286
|
సీ. |
సంగీతరసవిలాసమునఁ గేశవశివబ్రహ్మల మెప్పించుప్రౌఢులార
చక్కఁదనంబున శంబరారికినైనఁ జాలమి పుట్టించుసరసులార
|
|
|
యణిమాదికములైన యష్టవిభూతుల సిద్ధులైనట్టి ప్రసిద్ధులార
యఖిలరాగంబులయందు హవిర్భాగభోక్తలై పెంపొందుపుణ్యులార
|
|
తే. |
కోరి మిమ్ము భజించెద గారవమున, నాకు మీరు ప్రసన్ను లై నామనోర
ధంబు లీడేర్పరయ్య గంధర్వులార, ధామధామాస్యవిజితగాంధర్వులార.
| 287
|
వ. |
అని మఱియు ననేకప్రకారంబులం బ్రస్తుతించిన దివ్యజ్ఞానసంపన్ను లయిన గంధ
ర్వు లతనిస్తవంబునఁ బ్రీతులయి యతనికిఁ బ్రత్యక్షంబయిన నతం డుర్వశి నిమ్మని
యడిగిన వార లమ్మచ్చకంటి నిచ్చుట యుక్తంబుగా దనుతలంపున వయోరూపలక్ష
ణాదుల నుర్వశింబోలియున్న యగ్నిస్థాలి యనునీలవేణి నిచ్చిన యవ్వసుంధరా
రమణుండు గంధర్వమాయామోహితుండయి యుర్వశియకా కలంపుచు నయ్యంగ
నం గయికొని దానితోఁ గొన్నిదినంబులు సురతసుఖం బనుభవింపుచునుండి యవ్వె
లంది చేష్టితంబులు వేఱొక్కభంగి యగుటకు సంశయింపుచుం దనమనంబున.
| 288
|
ఉ. |
ఆసరసోక్తు లానగపు లానెనరూనినచూపు లామహో
ల్లాసరసాప్తి యాముఖవిలాత యాహృదయానుగుణ్యలీ
లాసురతక్రియల్ మదిఁ దలంచిన నిచ్చెలియందుఁ గల్గవే
మో సుగుణాభిరామ యగునుర్వశి గాఁ దిది నిక్క మారయన్.
| 289
|
క. |
వంచించిరి గంధర్వు ల, టంచుఁ దరుణి నచట నునిచి యాత్మపురికి నే
తెంచి ధర యేలుచుండె గుణాంచిత నుర్వశిఁ దలంచి యసురుసురనుచున్.
| 290
|
తే. |
అంతఁ ద్రేతాయుగము చొచ్చె నప్పు డతని, బుద్ధి కామ్నాయములు కర్మబోధకంబు
లగుచుఁ ద్రివిధంబులై తోఁచ యాగవిధులు, తదనుగుణముగ నొనరించుతలపుతోడ.
| 291
|
సీ. |
వెడలి యగ్నిస్థాలికడ కేగి యవ్వనంబున శమీగర్భసంభూతమైన
యశ్వత్థమును గాంచి యందరణులు రెండు గొని క్రింద నొక్కటి యునిచి మీఁద
నొకటి చేతులఁ బట్టి యురవడిఁ ద్రచ్చుచు నొనరఁ బూర్వారణి యుర్వశియును
దగనుత్తరారణి దానును నడుమఁ బుత్రుండుగాఁ దలఁపుచోఁ దొడరి మంత్ర
|
|
తే. |
ముచ్చరించుచు నుండ నం దుదయమయ్యె, హవ్యవాహుండు తనయుఁడై యప్పురూర
వక్షితీకున కిహపరావార్యసౌఖ్య, గరిమ ఘటియింపఁజేయఁ దాఁ గర్త యగుచు.
| 292
|
వ. |
అట్లు సంజాతుండయిన వీతిహోత్రుని శాస్త్రోక్తప్రకారనిర్మితయాగశాలాంతకుండం
బులం బ్రతిష్ఠించి వసిష్ఠాదు లయిన మునిశ్రేష్ఠులు విశిష్టప్రకారంబునం దదనుష్ఠానంబు
నడిపింప గోభూహితణ్యరత్నాంబరాదినానావిధధానంబులఁ దృప్తులం జేసి దీనార్థివ్రా
తంబుల నభీష్టవస్తువులం దనిపి పరమేశ్వరుండు ననంతుండును నాశ్రితవత్సలుండును
|
|
|
నఖిలజగత్కర్తయు నగుశ్రీమన్నారాయణస్వామిం గుఱించి యనేకయాగంబు
లొనర్చె నంతం బురందరప్రముఖదేవత లతనికిం బ్రసన్నులయి యభీష్టవరంబు
లొసంగి యుర్వశీకాముకుం డగుట నతనియభిప్రాయంబు దెలిసి యవ్విలాసిని
నతని కిచ్చి నరసురలోకంబుల యథేచ్ఛావిహారంబులఁ జరియించు నట్లు దివ్యత్వం
బొసంగి రంత.
| 293
|
తే. |
ధరణి నాహవనీయంబు దక్షిణాగ్ని, గార్హపత్యంబు నన విభక్తములు చేసి
త్రివిధమున హోమవిధులు వర్తిల్లఁజేసెఁ, గర్మపరులకు సులభంబుగా నతండు.
| 294
|
క. |
తనకు వశంగతురాలై, యనవరతము, చెలులుఁ దాను నరమర లేక
త్యనుకూలత నయ్యుర్వశి, చనువును మెలఁగంగ మదనసౌఖ్యాన్వితుఁడై.
| 295
|
తే. |
పచ్చకపురంబువంటి సుపర్వబోగి, నీలలామంబు చనువు దక్కోలుగొనియెఁ
బంతమున నానృపాలుఁడు భాగ్యవంతు, డెంతఁ దలఁచిన సఫలమౌ నిది నిజంబు.
| 296
|
సీ. |
వేదశాస్త్రపురాణవిదితమై గణుతింపఁ దగుసదాచారవర్తనమువలన
న్యాయార్జితములైన నవరత్నకనకసామజహయప్రముఖసంపదలవలన
మందారసుమహరిచందనామోదదివ్యాంగనాసురతభోగాప్తివలన
శ్రీవాసుదేవాంఘ్రిచింతనామృతధారఁ బొరయుబ్రహ్మానందపూర్తివలన
|
|
తే. |
గరిమ ధర్మార్థకామమోక్షము లనంగఁ, దగినపురుషార్థములు నాల్గుఁ దమకుఁదామె
సిద్ధమైయుండ సంకల్పసిద్ధుఁ డనఁగఁ, ధారుణీచక్ర మేలెఁ బురూరవుండు.
| 297
|
వ. |
అయ్యుర్వశీపురూరవస్సులకు నగ్రసుతుండయి జనియించిన యాయువునకు సహో
దరులయి క్రమంబున శ్రుతాయువును సత్యాయువును జయుండును విజయుండును
నన నేవురు పుత్రు లుదయించిరి. తత్కుమారషట్కంబువలనఁ గ్రమక్రమంబునఁ
బుత్రపౌత్రాభివృద్ధియయి చంద్రవంశపారంపర్యంబు జగద్వితం బయి వెలసె నని
సూతుఁడు శౌనకాదులకుం దెలిపిన నామహర్షులు పరమహర్షరసభరితహృదయు
లయి యతనిం బ్రశంసించిరి.
| 298
|
క. |
కవిరాజమనోరంజన, మవునన వక్తకును శ్రోత కలిశుభదంబై
భువి నాచంద్రార్కము కీ, ర్తి వెలుంగఁ బురూరవశ్చరిత్రము దనరున్.
| 299
|
శా. |
శ్రీకాంతాకుచకుంభలిప్తసరసశ్రీగంధసత్సౌరభా
శ్రీకాంతాతతబాహుమధ్యరుచిరశ్రీవత్సవాణీధవ
శ్రీకంఠస్తుతశక్రవాయుతనయశ్రీదాదిసంసేవితా
శ్రీకారప్రతిమానకర్ణయుగళా శ్రీరాజగోపాలకా.
| 300
|
క. |
చక్రహితకన్యకాతటి, చక్రోత్పలపత్రఘటనచతురనతసుధీ
చక్రధరాచక్రధరా, చక్రధరాకీర్తిమగ్నచక్రధరార్ద్రా.
| 301
|
పృథ్వీవృత్తము. |
గదాకరముదాకరద్యుతివికస్వరా సుస్వరా
సదాశివపదాశివస్తనితశ్లాఘ్య కాభిఖ్యకా
గదాగ్రజపదాగ్రజత్రిపథగావనా పావనా
విదాహితమదాహితప్రకటవిక్రమాశుక్రమా.
| 302
|
గద్య. |
ఇది శ్రీమంగళాచలనృసింహకృపాప్రసాదసంప్రాప్తవిద్యావైభవ కనుపర్తి
రామనమంత్రితనూభవ సుజనహితకృత్య నిత్యాబ్బయామాత్యప్రణీతం బయిన
కవిరాజమనోరంజనం బనుమహాప్రబంధంబునందు సర్వంబును బంచమాశ్వాసము.
|
|
కవిరాజమనోరంజనము సంపూర్ణము.