తృతీయాశ్వాసము
|
రుచిరపాంచజన్యజ
సారఘుమంఘుమనినాదచకితా హితగం
భీరగుణస్ఫారదర
స్మేరసుధాంచితకపోల శ్రీగోపాలా!
| 1
|
వ. |
అవధరింపుము సమస్తసద్గుణసాంద్రు లగుశౌనకాదిమునీంద్రులకు సామోదహృదయ
జలజాతుండై సూతుం డి ట్లనియె.
| 2
|
క. |
అంతట వైవస్వతభూ, కాంతుఁడు సుద్యుమ్ను రాజుఁ గావించినఁ దా
నెంతయు నీతి నిలాస్థల, మంతయుఁ బాలించెఁ బ్రజకు నానందముగాన్.
| 3
|
క. |
రాజై యొకనెల యొకనెల, రాజాననయై బ్రకాశరాహస్యములన్
రాజద్గతి మెలఁగుచును ధ, రాజనపరిపాలనంబు రహిఁ గావించెన్.
| 4
|
పురూరవుని రాజ్యాభిషేకము
మ. |
ప్రకటఖ్యాతి సమస్తభూవలయముం బాలించి సంప్రాప్తవా
ర్థకుఁడై భోగములెల్ల మాని దృఢవైరాగ్యంబునన్ రాజ్యభా
రకునిం గాఁగఁ బురూరవు న్నిలిపి నైర్మల్యాంతరంగంబుతో
నొకపుణ్యాశ్రమసీమ ముక్తికొఱకై యుండెం దపోనిష్టచేన్.
| 6
|
వ. |
ఇట్లు పురూరవుండు రాజ్యాభిషిక్తుం డై.
| 7
|
సీ. |
అచలధర్మోజ్జ్వలుఁ డగుటకుఁ దనపుణ్యజనవరమిత్రత సాక్షిగాఁగ
భువనప్రజావనప్రవణుఁ డౌటకుఁ దనశక్తిత్రయస్ఫూర్తి సంగతముగఁ
గళ్యాణలక్షణాకారుఁడౌటకుఁ దనభూభృద్విభుత్వంబు పూన్కి సేయ
విబుధలోకామోదవిభవదుఁ డగుటకుఁ దనసౌమనస్య మత్యనుగుణముగ
|
|
తే. |
రాజరూపంబు దాల్చినరాజమౌళి, యనఁగ రాజీవబాంధవుఁ డనఁగ మేరు
శైల మనఁ బారిజాతభూజాత మనఁగ, భూతిరుచిధైర్యవితరణస్ఫురణఁ దనరె.
| 8
|
క. |
యుగపద్వ్యాపకశశభృ, జ్జగదంబకబింబితప్రశస్త యశస్తు
త్యగురుప్రతాపదీపిత, గగనధరాభాగుఁ డగుచు గడునొప్పారెన్.
| 9
|
చ. |
అలనృపుధర్మపద్ధతి సమస్తజనుల్ ధనవంతు లౌటఁ గా
ల్నిలుపఁగఁ జోటులేక భువి లేములు లేమలబల్ పిఱుందుల
న్నెలచనుగట్లసందులను నెన్నడుసీమల నీఁగె భానుమం
డలరుచిఁ దూలి గొందుల నడంగిన చీఁకటికైవడిం దగన్.
| 10
|
ఉ. |
ఆకుముదప్రియాన్వయుననాభ్యుదయంబున వర్ధమానలీ
లాకృతి నొప్పెఁ గీర్తులు మహార్ణవసప్తకలంఘనోద్ధతిన్
దాకొని చక్రపర్వతనితంబములం దదధీనభూమియుం
దాఁక నగుంజుమీ యని నిదానము ముందుగఁ దెల్పుకైవడిన్.
| 11
|
తే. |
ఇవ్విధంబున సామ్రాజ్య మేలుచుండి, నిజభుజాబలవిస్ఫూర్తి నృపులకెల్ల
దెలియ దృష్టాంత మొనరింప దిగ్విజయము, సేయ నూహించి యారాజశేఖరుండు.
| 12
|
క. |
అజహదహమహమికాపటు, భుజజభుజంగమవిహంగపుంగవధాటీ
నిజదండయాత్ర విజయ, ధ్వజపటకృతగగనచిత్ర దనరంగదలెన్.
| 13
|
సీ. |
గంభీరవేదివిఖ్యాతిచేఁ దనరి సన్నాహ్యంబు లైనదంతావళములు
పంకింప శస్త్రనిపాతధీరంబులై వఱలునాజానేయవాహములును
నప్రతిహతసకలావయవంబులై యమరు హిరణ్మయస్యందనములు
సాంయుగీనప్రశస్తతఁ బెంపుమీఱిన శుష్మాతిశయభీష్మసుభటచయము
|
|
తే. |
గమనధాటీచలద్ధరాకటకఘటద, పూర్వభరభరణశ్రాంతభుజగకమఠ
శైలదిగ్దంతుఁడై యేగెఁ జటులపటహ, ఘూర్ణితధ్వని దిశలు గగ్గోలుపడఁగ.
| 14
|
పురూరవుని జైత్రయాత్ర
శా. |
ఆసన్నాహము చూడనొప్పెఁ బ్రకటాహంకారఘోరద్విష
త్త్రాసోత్పాదకపాంచధారవిచలత్కంఖాణసంఘాతరిం
భాసంఘట్టితగహ్వరీజనితరంగద్దూళిపాళిచ్ఛలో
ద్బాసాధీశమహామహదహనశుంభద్ధూమరేఖాంకమై.
| 15
|
తే. |
అమ్మహీశ్వరు విజయయాత్రాధ్వసీమ, నవని చతురంగపదహతి నవనియయ్యె
రణితభేరీధణంధణంధణరవంబు, వినినయంతనె విమతులు విమతులైరి.
| 16
|
శా. |
ప్రస్థానాహతదుందుభిధ్వనులఁ గంపంబంద నవ్వేళ న
స్వస్థాకారములయ్యె భూమి నచలవ్రాతంబు సంబంధ ని
త్యస్థానం బగుటన్ క్షమాపతి తదీయాకారసంప్రాసితా
వస్థం బొందెఁ జలంబు నక్షమయు నైవర్తింపఁ దన్నామముల్.
| 17
|
ఉ. |
భంగముఁ జెంది సింధుపతి పాఱె నుతించెను మాగధుండు కా
ళింగుఁడు మానమెల్ల వదలెన్ వనవాసము చేసె మత్స్యుఁ డా
త్మాంగబలంబు లేమి బెగడందె విదేహుఁడు కుంతలుండు దా
నింగిత మెంచి చిక్కు వడియెన్ నరనాయకు మేటిధాటికిన్.
| 18
|
మ. |
సమరోగ్రుం డగునానృపాలునెదుటన్ సంగ్రామజిద్వీరసే
నమహాబాహుపరంతపాదు లభిమానత్యాగులై యప్రకా
శముగా నుండిరి పేరుపెద్దఱికముల్ చర్చింప ఖద్యోతనా
మములన్ దాల్చు మెఱుంగుకీటముల సామాన్యంబు పాటింపఁగన్.
| 19
|
క. |
శకభూవిభుఁ డవ్విజయము, నకు నోర్వక కురుకరూశనరనాథసహా
యకుఁడై చతురంగబల, ప్రకటపదాహతుల ధరణిభాగము గదలన్.
| 21
|
వ. |
చుట్టుముట్టి బెట్టిదం బగుధైర్యంబునం బొదివె నప్పుడు.
| 22
|
ఉ. |
బెబ్బులిమీఁదటం గవియు పెన్వృభషంబులభంగి దోఁపఁగా
నబ్బలుయోధుపైఁ గదిసి యార్పులు నింగిఁ జెలంగ నానృపుల్
నిబ్బరపుంజలంబున వినిష్ఠురబాణపరంపరార్బు లా
గుబ్బుగఁ బ్రజ్వరిల్లఁ బయకొన్నబలం బెడతాఁకె నయ్యెడన్.
| 23
|
క. |
పరశుముసలాసిముద్గర, శరపట్టిసభిండివాలచక్రగదాతో
మరకుంతశక్తిశూల, క్షురికాదుల నుభయబలము శూరతఁ బోరెన్.
| 24
|
వ. |
ఇ ట్లుభయసైన్యంబును భయశూన్యంబై యన్యోన్యజిగీషాపరతం దాఁకి పోరు
నెడఁ బురూరవుబలంబు చలంబున విజృంభించి మించి వజ్రవజ్రాయుధంబుధార
బారికిం దప్పియొప్పిన వసుంధరాధరంబులవిధంబుం గైకొని దుర్దాంతదంతఘట్టనల
నుద్దండశుండాదండప్రహతుల నహితుల నహితుల నిహతులం గావింపుచు నాధోరణ
రణక్రీడాసముత్సాహపౌనఃపున్యకారణంబు లగువారణంబులును, అష్టావధానదు
రాహుత్తభాహుస్తంభశుంభన్నిశితనిస్త్రింశధారాపాతలక్ష్యంబులకు విమోఘ
సంపాదకంబులైన ధావనవల్లనవేష్టనాదిగతివిశేషంబులఁ బ్రతిభటచతురంగభంగ
|
|
|
పాటవంబునకు సంవర్తసమయసముద్రతరంగంబు లైనతురంగంబులును, భుజావష్టంభ
సమధికధైర్యనిరవధికరథికనికరధనుర్ముక్తనిశితవిశిఖాశనిజన్మదేశంబులై రిపుమండలంబు
గుండియ లవియించు నేమీనిర్ఘోషస్తనితంబు చెలంగ నారచితమణిఘృణివిద్యుదుద్య
ద్విపులాద్యుస్థలచరచ్చగిదంబు లైతోఁచు నరదంబులును లేళ్లపిండుపై నుఱుకు
నుద్దండపుండరీకంబులవీఁక ఢాక నేయుచు నిజప్రతాపదహనజ్వాలాజాలంబుల
పోలిక భగభగాయమానంబులై వెలుంగు నలుగులం గలుగు కఠోరకుఠారకఠార
కుంతప్రభృతిసాధనంబులసాదన మెఱవడి నురువడిం బరవళ్లు ద్రొక్కుచుఁ బెక్కు
చందంబుల విరోధివరూథినిం బొడవడంగించు విక్రమారభటు లగువీరభటులును,
వీక్షమాణగీర్వాణశిరఃకంపసంపాదకధాటీనిరాఘాటభుజాటోపపాటవంబున
నాక్రమించిన నయ్యుద్ధతికిం బ్రతిఘటింపంజాలక పరాభూతంబులై వెఱచి
పఱచు నిజసైన్యంబులం గలయంగనుంగొని శకనృపాలుండు రోషరక్తాంబ
కుండై యంబకంబు లాకాశంబు నిరవకాశంబుగా నిండుకొన గండుమిగిలి కోదండ
పాండిత్యంబు నెలపుచు నిజబలంబులం బురికొల్పికొని కడంగి సంగరం బభంగురభంగి
నొనర్ప నప్పు డయ్యిరువాఁగున వికృతాకారంబులై పడిన గజవాజిభటకళే
బరంబులును, శకలీకృతంబులయి కూలినరథంబులును, ప్రవాహంబులయి పాఱురక్తం
బులును, రాసులయిన మాంసంబులును, ప్రోవులయిన ప్రేవులును, శిథిలంబులయిన కిరీట
కుండలప్రముఖభూషణంబులును, వ్యాకీర్ణంబులైన ఛత్రచామరంబులును, భగ్నం
బులైన నానావిధసాధనంబులునుం గలిగి చూడ భీభత్సరసప్రదానంబై బహు
పలలఖాదనకుతూహలప్రమత్తభూతబేతాళకోలాహలంబు భూనభోంతరాళంబు
నిండుకొనం బ్రచండబై యబ్భండనంబు త్రిలోకభీకరం బై యుండె నప్పుడు.
| 25
|
మ. |
ప్రకటాహంకృతిఁ బోరువైరిబలముల్ భగ్నంబులై పాఱఁగా
శకలీభూతదిశేభకర్ణకుహరజ్యాటంక్రియాఘోరకా
ర్ముకుఁడై బాణదవాగ్ని పైకొలుపుచుం గ్రోధంబుతో వచ్చుచం
ద్రకులాధీశ్వరు డాకకు న్నిలిచి ధైర్యస్ఫూర్తి వర్తిల్లఁగన్.
| 26
|
క. |
శకభూపతి నిశితాంబక, నికరంబులు పైనిగుడ్ప నిష్ఠురభల్ల
ప్రకరములఁ ద్రుంచి నొంచెం, బ్రకటపరాక్రముడు చంద్రపౌత్రుం డతనిన్.
| 27
|
చ. |
రణ మొనరించి రంబరచరత్సురచారణనిర్నిమేషవీ
వీక్షణవిభవాంతరాయకృదఖండమహాబిలభాగభాగవా
|
|
|
రణనిబిడీకృతప్రదరరాజిధగద్ధగదీప్తిపుంజు లై
రణదురుశింజినీపటుతరధ్వని దిక్కులు వ్రక్కలింపఁగన్.
| 29
|
చ. |
ఇటువలెఁ గొంతప్రొద్దు తనయిచ్ఛకు నించుక మెచ్చురాఁగఁ బ్ర
స్ఫుటధృతిఁ బోరుచున్న శకభూపతి గర్వమణంగఁజేసి యొ
క్కట హయసూతకేతురథఖండనకేళి యొనర్చి పేర్చి యి
ట్టటు జుణగంగనియ్యక బుధాత్మజుఁ డాతనిఁ దోడియోధులన్.
| 30
|
తే. |
పట్టుకొని యవ్విభుండు గృపాళుఁడగుట, నిగ్రహింపక వారి ననుగ్రహించి
యస్మదాజ్ఞానువర్తులై న్యాయసరణి, నేలుఁడని రాజ్యభారంబు లిచ్చి మఱియు.
| 31
|
మ. |
భువనఖ్యాతిఁ బురూరవఃప్రభుఁడు జంబూద్వీపనామంబునన్
లవణార్ణోధిచతుర్దిశావధికలీలం బొల్చుభూమండలిన్
నవఖండంబులఁ గల్గురాజులు నిజాజ్ఞావర్తులై కానుకల్
వివిధార్థంబు లొసంగఁ గైకొనుచు దోర్వీర్యం బవార్యంబుగన్.
| 32
|
చ. |
తనకు వసిష్ఠమౌని విదితంబుగఁ దెల్సిన మంత్రశక్తి నై
న్యనికరయుక్తుఁడై గగనయానత నంబుధు లుత్తరించి కై
కొనియెను దీవు లెల్ల నిజఘోరశరౌఘవిభూతిధైర్యులై
తను శరణంబు వేఁడుకొను తద్ధరణీశుల నాదరించుచున్.
| 33
|
సీ. |
లక్షయోజనములు లవణాంబురాశి లక్షద్వయం బైక్షవసాగరంబు
చర్చింప నాల్గులక్షలు సురాజలధి లక్షాష్టకం బాజ్యమహార్ణవంబు
పదియాఱులక్షలు పరఁగఁ దధ్యుదధి ముప్పదిరెండులక్షలు పాలకడలి
యిలఁ జతుష్షష్టిలక్షలు శుద్ధజలవార్థి ఇట్టివిశాలాబ్ధు లేడు గడచి
|
|
తే. |
కొనియెఁ దన్మధ్యముల నట్టికొలఁది దగుర, సాస్థలిని జాంబవప్లక్షశాల్మలములు
వరకుశక్రౌంచశాకపుష్కరము లనఁగ, నొప్పుమీఱిన దీవు లాఱొక్కటియును.
| 34
|
శా. |
చక్రాకారధరాధరేంద్రము జయస్తంభాకృతిం బొల్చె ది
క్చక్రాంతస్థలిఁ దన్నృపాలకజగచ్చక్షుశ్శతాంగస్ఫుర
చ్చక్రానాహతసంభ్రమభ్రమణచంచద్ఘాటికావ్యాప్తభూ
చక్రావధ్యువసూచకం బగుచు విశ్వఖ్యాతి సంధిల్లఁగన్.
| 35
|
శా. |
నానాద్వీపనృపార్పితాంచదుపధానైర్మల్యమాణిక్యము
క్తానీలాదివినూత్నరత్నవరసౌందర్యాంగనాదివ్యభూ
|
|
|
షానవ్యాంబరముఖ్యసంపదలతో సంప్రీతుఁడై క్రమ్మఱం
దా నేతెంచె నృపాలుఁ డాత్మపురి కుద్యద్వైభవోపేతుఁ డై.
| 37
|
సీ. |
తనకీర్తికర్పూరమునకు బ్రహ్మాండకటాహంబు దగుకరాటంబు గాఁగ
దనభుజాకర్బురస్తంభంబునకు ధరాసతి ఘటన్మరకతప్రతిమ గాఁగ
దనబాహుశౌర్యభేతాళుసాదనకుఁ జక్రక్ష్మాధరము సాము గరిడి గాఁగఁ
దనసద్విలాసకందర్పమూర్తికి జనస్వాంతముల్ కేళిగేహములు గాఁగఁ
|
|
తే. |
దనకథామృతసరసికి ఘనకవీంద్ర, వదనభారతి రాయంచవనిత గాఁగ
నమ్మహామహుఁ డద్వితీయాతపత్రుఁ, డై జగంబేలుచున్నవాఁ డమరవర్య.
| 38
|
క. |
అని యనిమిషసభ నృపసో, ముని మునిపతితచ్చjfత్ర ముందెలుపుచుఁ బే
ర్కొని కొనియాడఁ దదుక్తులు, వినf వినిభృతహర్షులైరి విబుధేంద్రాదుల్.
| 39
|
తే. |
అతనిసద్గుణవర్ణనం బాలకింప, నింపు చిగురొత్తె రంభకు హేమ కరఁగె
నల మదాలస చొక్కె నాహరిణి చకిత, యయ్యె శశిరేఖ తలఁప రసార్ద్ర యయ్యె.
| 40
|
సీ. |
అమ్మహారాజువృత్తాంత మాసక్తితోఁ జెవియొగ్గి వినని రాజీవగంధి
విని వానిభువనమోహనవిలాసస్ఫూర్తి సారె భావింపనిచంద్రవదన
భావించి యతనిసంపర్కంబునకుఁ జాల ముచ్చటపడని నమ్మోహనాంగి
ముచ్చటపడి చిత్తమున వెన్నవలెఁ గరంగుచుఁ దన్మయత గీల్కోననిరమణి
|
|
తే. |
తన్మయతచేత కందర్పగేహ, యగుచుఁ దెలివొంది యసురుసు రననివనిత
గానఁబడదయ్యె సురగణికాజనంబు, లో నొకర్తైనఁ దత్సభాస్థానమునను.
| 41
|
తే. |
పూనె ఘర్మాంబుకళికలు మేన మేన, చిత్రరేఖాకృతి వహించెఁ జిత్రరేఖ
మనసిజవరూథినికి వరూధిని చలించె, నిందుమతి వేఁడుకొనెఁ గాము నిందుమతిని.
| 42
|
ఉ. |
కిన్నరరాజనందనునికిం దెగనమ్మినసొమ్ములై తదం
చన్నఖకోరకాంకముల శాసనరేఖలుదాల్చు గుత్తపుం
జన్ను లొగిం గగుర్పొడిచె జల్లున రంభకుదారరూపసం
పన్నత నొప్పు నత్రిసుతపౌత్రుచరిత్రము విన్నమాత్రలోన్.
| 43
|
ఉ. |
కెంపుమొగంపుబచ్చతురికీ నుఱికింపుచు ఝంకరింపుచే
నింపొదవించు నారి బిగియింపుచు వాచవిపెంపునింపుము
వ్వంపులకైదువుం దిగిచి వంపుచుఁ దావుల యంపసోన వ
ర్షింపుచు జాలిమాలి గొనఁజేసె మరుం డమరీకదంబమున్.
| 45
|
ఉ. |
కామునిబాణముల్ నిరవకాశముగా సురకామినీమన
స్సీమలఁ బర్వుచున్ గటికచీఁకటి గ్రమ్మఁగఁ జేసెఁ దచ్ఛర
స్తోమ మసంఖ్యమై మదికిఁ దోఁచఁగ నారతిజాని కయ్యజుం
డేమి దలంచి చేసెనొ సుమీ మును పంచశరాభిధానమున్.
| 46
|
సీ. |
అతనిబింబాధరం బందనిమ్రానిపండని విచారించె మదాలసాఖ్య
యతనిచేసోఁకుసయ్యాట లేటావలిగిలిగింత లని వితర్కించె రంభ
యతనితాంబూలగంధాస్యాప్తి యేనుఁగుమీఁదిసున్నం బని మేన యెంచె
నతనికృపారసామృతవృష్టి పెదగంగయుదక మంచు ఘృతాచి మదిఁ దలంచె
|
|
తే. |
జనమనోరమ ధ్యానమాలినిఁ గళావ, తియుఁ దిలోత్తమ పూర్వచిత్తియుఁ బ్రమోహి
మొదలుగా నింతులకుఁ జింతయొదవె నతని, చిత్త మది గట్టుచాటునిక్షేప మనుచు.
| 48
|
క. |
ఆవిభుసర్వోత్కర్షత, భావింపఁ దదాప్తి దుర్లభంబని తచ్ఛం
కావిర్భవదురునిశ్వస, నావధికప్రేమ లైరి యమరలతాంగుల్.
| 49
|
సీ. |
పుట్టినయి ల్లేప్రపూర్ణేందుముఖికిని నారాయణస్వామియూరుసీమ
నాట్యవేదార్థంబునకు నేకళావతి లాస్యనిరూఢి కూలంకషంబు
ప్రథమబహూకారపాత్రలలోన నేయి౦తి హరిహరాజేంద్రసభలఁ
కారణం బేహంసగమనరూప మరుంధతీమనోహరుపునర్దేహలబ్ధి
|
|
తే. |
కట్టి యూర్వసి భువనమోహనవిలాస, నిజకటాక్షపరంపరావిజితకుసుమ
ధన్వచార్వసిసౌమ్యనందనకథాసు, ధార్ణవాంతర్నిమగ్నాంతరంగ యగుచు.
| 51
|
ఉ. |
అన్నరనాథుచక్కఁదన మాధరణీశ్వరుభోగభాగ్యసం
పన్నత యమ్మహామహునిప్రాజ్ఞత యవ్విభుధైర్యవిక్రమా
భ్యున్నతి దేవమౌని సరసోక్తులఁ గర్ణరసాయనంబుగా
విన్నది యాదిగాఁగ నళివేణికిఁ గన్నులఁ గట్టినట్ల యై.
| 52
|
ఊర్వసి పూరూరవుని విరాళిగొనుట
క. |
అతనివిలాసగుణాదులు, మతి దలఁపుచు మోహజలధిమగ్నతచేఁ ద
ద్గతమానసయై వేలుపు, లతకూన వియోగవిప్రలంభము నొందెన్.
| 53
|
తే. |
కలికిడెందంపుబాదున మొలచి కొనలు, సాఁగి సంకల్పలతలు సంజాతపులక
ఘర్మజలబిందుమిషమునఁ గానిపించె, బల్లవితకోరకితలక్ష్మి బయలు మెఱసి.
| 54
|
మ. |
సరసానుగ్రహలోచనాంచలవిలాసభ్రూలతాసంజ్ఞచే
స్వరధిష్ఠాత యొసంగుదివ్యపటభూపాపూర్వకానుజ్ఞ సుం
దరి తాఁ గైకొని మందహాసముఖచంద్రజ్యోత్స్నికాభృత్కుచాం
తరయై యౌఁదలవాంచి మ్రొక్కి యరిగెం దచ్చింతతో నింటికిన్.
| 56
|
తే. |
కొలువు చాలించి శుద్ధాంతనిలయమునకు, నరిగె వజ్రి యథేచ్ఛావిహారపరత
నేగె నారదమునివరుం డెల్లసురలుఁ జని, వసించిరి నిజనివాసములయందు.
| 57
|
శా. |
ఆచందంబున నూర్వసీరమణి యాత్యావాసముం జేరి రా
కాచంద్రాతపధాళధళ్యరుచిరంగత్తుంగసౌధాగ్రలీ
లాచిత్రాంతరదివ్యహంసమృదుతూలస్నిగ్ధశయ్యరి బ్రచిం
తాచేతోగతిఁ బవ్వళించి నృపుచందం బాత్మ భావింపుచున్.
| 58
|
ఉ. |
ఏటికిఁ జెప్పెఁ దాపసి నరేంద్రునిపెంపు సురేంద్రుతోడ నే
నేటికి వింటిఁ దద్గుణములెల్లఁ బరా కొకయింతలేక నా
కేటికిఁ బుట్టె వానిపయి నెంతట నంకెకురానిప్రేమ న
న్నేటికి నప్పగించెఁ గుసుమేషుని బారికి దైవ మక్కటా!
| 60
|
క. |
నాకం బెక్కడ ధరణీ, లోకం బెక్కఁడ దలంపులో ముచ్చట య
య్యేకచ్ఛత్రాధీశ్వరు, దూఁకొను టది నాకు నెట్లు దొరకెడు నకటా!
| 61
|
ఉ. |
ఎన్నఁడు చూడఁగల్గెడినొ యిందుకులాగ్రణిముద్దుమోము నా
కన్నులు చల్లఁగా నతనిఁ గౌఁగిటఁ జేర్చి సుఖాప్తిఁ జొక్కు భా
గ్యోన్నతి కల్గునో కలుగదో వల పెంతట నేమి సేయఁగా
నున్నదొ దైవయోగ మెటు లున్నదొ దీని కుపాయ మెద్దియో.
| 62
|
మ. |
కలుగుంగా యలరాజుశేఖరునఖాగ్రస్పర్శతం బొంగుచున్
గిలిగింతల్ గొనుగుబ్బచన్మొన లెదం గీలించి నిండారుఁగౌఁ
గిలిగా నాతమి దీర నొక్కి చిగురుంగెంజాయనున్మోవి జొ
బ్బిలు తాంబూలసుగంధసీధువు ముదాప్తింగ్రోలుచుం జొక్కఁగన్.
| 63
|
ఉ. |
అవ్విభుచిత్తముం గరఁగునట్లుగ వేళ యెఱింగి మద్విధం .
బెవ్వరు విన్నవించెద రదేల గ్రహించు నతండు చూపులన్
నవ్వులమాటలన్ విలసనంబులఁ దక్కఁ బెనంగఁజాలు మే
ల్జవ్వను లుందు రందు రతిసౌఖ్యవిమోహితుఁ జేయకుందురే.
| 64
|
మ. |
మది నంతంతకు నగ్గలించుబలుప్రేమం దాళరా దేమి సే
యుదు నేయత్నముచేత వశ్యుఁ డగు నాయుర్వీశుఁ డేనోము నో
ముదు నేదైవము వేఁడుకొందు నిఁక నీ మోహాబ్ధికిన్ మేర యె
య్యది నా కెవ్వరు ప్రాణబంధులు మదీయాసక్తి యీడేర్పఁగన్.
| 65
|
ఉ. |
రేచితబాహ్యవృత్తిఁ గడురేచకపూరకకుంభకక్రియా
సూచన నూర్పుల న్నిడివిచొప్పడ వల్లభురూప మాత్మలోఁ
జూచుచుఁ దత్కథామధువచోజపశీలత నుండెఁ బుష్పనా
రాచగురూపదేశమున రాజనిభాస్య తదేకనిష్ఠతోన్.
| 67
|
చ. |
చిలుకలుతేరు మేల్ చెఱకుసింగిణి వాసనగుపవపూవుట
మ్ములపొది వాఁడిచెంగలువమొగ్గకటారి మీఁటారితేఁటికో
యిల గొరవంకపౌఁజు లెగనెత్తినపొంకపుమీనుడాలు పెం
పలర రతిప్రియుండు దివిజాంగన కుద్ధతి చూపె నయ్యెడన్.
| 69
|
క. |
చెఱకువిలుకాఁడు కోమలి, యిఱుకుంజనుదోయినడిమియెద గుఱియిడి తాఁ
గఱకువిరిములుకు లేసెం, జుఱుకునఁ దనచేతిమేటిసూటిన్ ధాటిన్.
| 70
|
క. |
మనసిజుశర మంటెను జెలి, చనుగొండలనడుమ నదియె శరగిరియోగం
బనిపించెఁ జెమటవానలు, పెనఁగొనునిట్టూర్పుగాడ్పు బిసబిస విసరన్.
| 71
|
మ. |
జళిపించుంజిగురుంబిరంగి గదుమున్ ఛాత్కారధీరధ్వనుల్
చెలఁగం బచ్చనిఱెక్కజీన్పులుఁగుతేజిన్ హెచ్చరించున్ హళా
హళిగాఁ దుమ్మెదమూకలన్ విజయశీలాహంకృతిన్ హుంకృతుల్
సలుపుం గుండియ జల్లనన్ గలువనేజారౌతు హేమాంగిపైన్.
| 72
|
సీ. |
నళినలోచనకుఁ బున్నమచందమామ లేయెండలు వేసంగియెండ లయ్యెఁ
గాంతకుఁ గలకంఠకంఠపంచమకుహూకారంబు గర్జావికార మయ్యె
విమలేందుముఖికి నవీనమైనకురంగనాభి యచ్చపువత్సనాభి యయ్యె
నరుణాధరకుఁ జందనాచలాగతగంధవాహంబు గరళప్రవాహ మయ్యె
|
|
తే. |
లలనకు రసాలశాఖాచలప్రవాళ, పాళి జాజ్వల్యమానదీపాళి యయ్యె
ముద్దుగుమ్మకు నీచందమునఁ బ్రమోద, కరము లెల్ల మనోవ్యథాకరము లయ్యె.
| 73
|
ఉ. |
ఆరుచిరాంగికి న్మధుకరాళి శిలీముఖపఙ్క్తి యయ్యెఁ బ
న్నీరు శరౌఘు మయ్యెఁ దరుణీమణికిన్ మలయానిలంబు నిం
|
|
|
బారుణకోమలాధరకు నాశుగ మయ్యె ఖగంబు లయ్యె శృం
గారవతీలలామకుఁ బికంబులు మన్మథసాధనంబు లై.
| 74
|
ఉ. |
పాడదు చల్లఁగా జిలుఁగుఁబాట విపంచి వహించి యెప్పుడుం
జూడదు కూర్మినెచ్చెలుల సోఁగకనుంగవఱెప్పలెత్తి మా
టాడదు పంజరాంతరశుకావళి సారెకుఁ బేరుకోఁగ లో
వీడదు చింత వంత యలివేణి మనోభవబాణఖిన్న యై.
| 75
|
ఉ. |
పువ్వులు మానెఁ దావిమెయివూఁతలు మానె సఖీజనంబుతో
నవ్వులు మానె కీరవచనప్రతిభాషలు మానె మానెఁ దా
నెవ్వియు నింపుగాక సుఖహేతువు లెల్ల మనోజబాధ నా
జవ్వని దుఃఖితే మనసి సర్వ మసహ్య మనంగలేదొకో.
| 76
|
సీ. |
ఇంకఁబాఱె శరస్మృగాంకబింబాస్యవాతెఱ నూరునమృతంపుఁదేటకొలను
వసివాళ్లు వాడె జీవంజీవలోచన తారుణ్యలీలాశరీరలతిక
కసుగందె నవలీలఁ గైరవకుంతల పొంకపుఁజనుదోయి పువ్వుగుత్తు
లలతనొందెను బల్లవారుణపాణి మొహనయాన మేఘనాదానులాసి
|
|
తే. |
తాపతపనుం డుదగ్రప్రతాపపటుక, వెలుఁగ నిట్టూర్పుగాడ్పు లావిర్భవించెఁ
బ్రబలమై మండువేసంగి పట్టపగటి, వేళయై తోఁచెఁ గొమ్మకు విరహభరము.
| 77
|
తే. |
చిఱువిషఁపుఁగూతఁ గోయిల చెవులఁ జిలుక, జిలుక పగవారిచుట్టమై చెదరఁబలుకఁ
బలుకలువ యీటెదారి దానలఁచె నలుక, నలుక నొందెను జెలి బాష్పజలము లొలుక.
| 78
|
క. |
ఈచందంబున విరహం, బాచందనగంధి కంతకంతకు నధికం
బై చేయునవస్థాగతి, చూచి సఖీజనులు వగచుచుం దమలోనన్.
| 79
|
ఉ. |
ఎక్కడనుండి వచ్చెఁ బరువెత్తుచుఁ గొంటుతపస్వి వచ్చెఁ బో
యిక్కరణిన్ విరాళిసివమెత్త వినోదపుసుద్దులెల్లఁ దా
నిక్కడ నేల దెల్పె కతలే వెతలయ్యెఁ గదా పురూరవుం
డెక్కడ యీలతాంగివల పెక్కడ దూరవిచార మక్కటా!
| 80
|
చ. |
కలకలనవ్వుకోమలిమొగంబు వికాసము వీడెఁ బొన్నపూ
వలపులమేనుదీఁగె వసివాడె సుధామధురద్రవంబు జొ
బ్బిలుననమోవి యెండె జిగిబెళ్కుకనుంగవ నీరునిండె గు
బ్బలు శ్రమవారిఁ దోఁగె మది భావజుకాఁకల వేఁగె నక్కటా!
| 81
|
మ. |
అకటా యీవెత చూడనే వశముగా దమ్మయ్య కందర్పసా
యకజాలానలకీలఁ గీల్కొను విదాహవ్యాప్తి నెట్లోర్చు నీ
|
|
|
సుకుమారాంగి యటంచు జాలిపడు నాసుభ్రూసమాజంబునం
దొకప్రౌఢాంగన కూర్మిఁ జేరి పలికెన్ యోషిల్లలామంబుతోన్.
| 82
|
సీ. |
వలపించుటే కాని వలచి దక్కవుగదా కుసుమబాణునికైనఁ గోమలాంగి
యోరకంటినె కాని తేఱిచూడవుగదా యలకళానిధినైన నలసగమన
వినయంబులే కాని చనువు వేడవుగదా దేవేంద్రునైన నిందీవరాక్షి
బయటిమాటలె కాని భావమియ్యవుకదా రాజరాజునకైన రాజవదన
|
|
తే. |
చక్కఁదనముఁ గళావిశేషంబు విభవ, మును సిరియు నేకమూర్తి దాల్చినపురూర
వునిగుణమ్ములు గుణము లయ్యెనె లతాంగి, మరుఁ డురులు కొల్ప నీమనోమర్మములకు.
| 83
|
సీ. |
కిన్నరస్వరలీల గేరునీగానవిద్యామాధురికి వీను లప్పగించి
ఱవికఁ బిక్కటములై కనబొల్చునీదుగుబ్బలకు భావంబులు పాలుపఱిచి
పైసోఁకు నీగీతపదరసవ్యంజకోజ్జ్వలదృష్టి కాస్యముల్ వశ మొనర్చి
యపరంజిపసిఁడిచాయల నీరుమైమెఱుంగులకుఁ గన్గవలు దక్కోలు చేసి
|
|
తే. |
రక్తిఁ గడుజొక్కి చిత్తరుప్రతిమ లగుచు, నుండుదురు గాదె యింద్రాదు లోలతాంగి
కామతూర్యాయమానఘల్ఘలరవాంఘ్రి, వలయవై నీవు నాట్యంబు సలుపునపుడు.
| 84
|
మ. |
సురవిద్యాధరసిద్ధసాధ్యఖగరక్షోయక్షగంధర్వఖే
చరనాగేంద్రకుమారవైభవవిలాసశ్రీల నింతైన రా
గరసంబందని నీదుచిత్తశశభృత్కాంతోపలం బీగతిం
గరఁగంజేసెనె రాజచంద్రుగుణరాకాచంద్రికల్ కోమలీ.
| 85
|
సీ. |
ఉత్తుంగకుచకోకయుగళంబు దాకొన వదనేందుబింబంబు వ్రాల్చకమ్మ
చారులోచనసరోజంబులఁ జికురంపుటిరులు పైకొన జాఱనీకుమమ్మ
యధరంపులేఁజిగురాకుపై నుస్సున నెమ్మోముసెగగాడ్పు నించకమ్మ
తళుకొత్తు చెక్కుటద్దములపైఁ గన్నీటిచినుకులు రాలంగఁ జేయకమ్మ
|
|
తే. |
రమ్యలావణ్యమౌక్తికరత్నరాశి, కలఘువిరహాగ్నిశిఖలు పైకొలుపకమ్మ
యువిద నీవిట్టు చేసిన నొకటికొకటి, వికటమయ్యెడు ధైర్యంబు విడువకమ్మ.
| 86
|
శా. |
ధీరోదాత్తవు మాటనేర్పరివి బుద్ధిం బెద్ద వత్యంతగం
భీరస్వాంతపు దేవభోగవనితాబృందములో నెంతయుం
లేరౌ నాయకురాల వెంచఁదగు నీపెం పన్నిటం బ్రౌఢ వై
యీరీతి న్వగ నొంద నీకుఁ దగునా యిందీవరాభాలకా.
| 87
|
సీ. |
నెఱపుచున్నది జక్కిణీలయల్ హొయలుగా శశిరేఖ నాటకశాలలోనఁ
జూపుచున్నది జోగిణీపంతు రంతుగా రంభ నాట్యగృహాతరంబునందు
|
|
|
నాడుచున్నది కేళిహాళిఁ గోలాటంబు మంజుఘోషిణి లాస్యమందిరమునఁ
జలుపుచున్నది ప్రోడజాడల గొరపంజియల తిలోత్తమ నృత్యనిలయసీమ
|
|
తే. |
నాటపాటల సభలోన సాటిచెలులు, మించు మెప్పించుకొన నభ్యసించువగలు
వింటివా తెల్పుచున్నది వెలఁదివితతి, మర్దళధ్వని తత్తత్క్రమంబు లెల్ల.
| 88
|
శా. |
నీసౌందర్యము నీవయోవిభవమున్ నీనృత్యగీతాదివి
ద్యాసంపత్తియుఁ జూచి యోర్వక యసూయల్ సేయు రంభాదు లు
ల్లాసంబందఁగ నేల యిట్లు విరహగ్లానిం గృశింపంగఁ జిం
తాసంతాపము మానవే చెలి మదిన్ ధైర్యంబు గీల్కొల్పవే.
| 89
|
క. |
అనునయ మొనరింపుచు సఖి, యనునయభాషలను జింతయాగక యాచ
క్కనిచెలువ పరితపించుట, కని చెలులు విచారహాతఁ గటకటపడుచున్.
| 91
|
సీ. |
కొమ్మచేతులు చూచి కుత్తుకబంటితో నున్నదిగాదె పయోజవనము
విమలాంగిమాటలు విని పండ్లుగొఱుకుచు నున్నది గాదె కీరోత్కరంబు
వనితచూపు దలంచి వైషమ్యగతి నున్నయదిగాదె మదనసాయకసమాజ
మతివయానము గాంచి యప్రియస్థితి నున్నయదిగాదె మఱి రాజహంసకులము
|
|
తే. |
చలము సాధించ నిప్పుడే సమయ మనుచు, విప్రలంభభరంబున విహ్వలించు
వెలఁదిన లయించుచున్నది విషమసంధిఁ, గీడొనర్చుట హీనుల జాడగాదె.
| 93
|
ఉ. |
తాపముచేతఁ జిక్కి వనితామణి జాఱిన చక్కనొత్తగా
నోపదు పయ్యెదన్ మగువ లొయ్యన గుబ్బలు గప్పరమ్మ జో
డై పొలుపారు జక్కవలయాకృతి నున్నవి శీతభానుఁ డా
శాపరిపూర్ణచంద్రికమిషంబునఁ జాలవిషంబు గ్రక్కెడున్.
| 94
|
ఉ. |
ఏమి యుపాయమమ్మ యిఁక నిందులకో చెలికత్తెలార కాం
తామణిగాత్రహేమముదితం బగుఘర్మజలచ్ఛలంబునన్
గాముశరాగ్నికీలలను గ్రాఁగి కరంగి తొరంగెఁ జూడరే
యేమఱనేల చేయఁదగు నీయెడలన్ శిశిరోపచారముల్.
| 95
|
తే. |
ఉపవనచ్ఛాయ సంతాన ముడుపు ననెడు, భ్రాంతిఁ బొందింపఁ జెలులనిర్బంధమునను
రమణి నెమ్మది నుత్సాహరహిత యయ్యు, నంచితోద్యానసీమకు నరుగఁదలఁచి.
| 97
|
సీ. |
సఖులమాటలకు వేసట నొందుచును శయ్యపై లేచి యఱుదుగాఁ బయిఁటఁజేర్చి
చెదరినకురు లొక్కచేఁ బట్టి సొగసు చా లని కొప్పు వలసి యొల్లమిని దుఱిమి
బరువంచు ముత్యాలుసరములు దివిచి చెంగట నున్నయింతిదోయిటను వైచి
వలదంచు గిలుకుపావా లవ్వలికిఁ ద్రోచి యలఁతిపాదుక లంఘ్రులందుఁ దొడిగి
|
|
తే. |
యనుఁగునెచ్చెలి భుజము కరావలంబి, తంబుగా నూఁది కనకసౌధంబు డిగ్గి
యలపుసొలపున నసురుసురనుచు మంద, మందగతి నేగె వనమున కిందువదన.
| 98
|
క. |
ఆరామలతాగృహమున, కారామ లతిప్రయత్నలై యరిగి రొగిం
దా రామలయజగంధిం, దారామలరుచినఖాళిఁ దగఁ దోడ్కొనుచున్.
| 99
|
సీ. |
రాజీవరాజీవరాజిరాజితములై కెలఁకుల కొలఁకులు దొలఁకుచోట
ఘనసారఘనసారఖను లైనఖనటచ్ఛదచ్ఛటాకదళికాతరులక్రేవ
సంతానసంతానసంతతాతాంతత శృంగారపాదపశ్రేణినడుమ
మాధుర్యమాధుర్యమధురసఫలగుచ్ఛవల్లులపందిటిచల్లనీడ
|
|
తే. |
శీతకరశీతకరశిలాంచితవితర్ధి, సీమ సీమంతవతులు లేఁజిగురుశయ్య
నమర నమరకళావతివిధి వసింపఁ, జేసి చేసిరి సముచితశిశిరవిధులు.
| 101
|
సీ. |
క్రొత్తగాఁ గురిసిన గొజ్జంగివిరిమంచు నీరు నెమ్మేనిపై నించినించి
బరువైన యనఁటికంబముల జాఱినయట్టి చంద్రరజంబు పైఁజల్లిచల్లి
శశికాంతపాత్రలఁ జలువటారుసుగంధ మవయవంబుల నిండ నలఁదియలఁది
పూఁదేనెవడియు నంబుజనాళహారంబు లురపుగా నుఱమున నుంచియుంచి
|
|
తే. |
సరసనవ్యలామజ్జక జాలతాళ, వృంతములఁ జల్లగాడ్పురా విసరివిసరి
యూర్వశికిఁ బ్రాణసఖులు శైత్యోదయతకుఁ, జేసి రుపచారములు నేర్పుచేత నపుడు.
| 102
|
క. |
ఏలాలవంగనవసుమ, నోలామజ్జకసుగంధనుతకర్పూర
శ్రీలలితమాధురీజల, మాలేమకుఁ గ్రోలనిచ్చి రతివలు మఱియున్.
| 103
|
సీ. |
కలికిచన్నులమీఁద గర్పూర మిడుచు జంబీరఫలభ్రాంతి బెదరె నొకతె
పికవాణికురుల సంపెఁగదండ చుట్టుచుఁ జంచరీకభ్రాంతి జడిసె నొకతె
యింతికన్నులయందు హిమజలం బునుపుచు వికచాంబుజభ్రాంతి వెఱచె నొకతె
చెలిమోవి మధురాంబువు లొసంగుచును మధుసారపూరభ్రాంతి జంకె నొకతె
|
|
తే. |
యతివ కుపచార మపచార మయ్యె ననుచుఁ, దావ మెచ్చుట కులికి సద్వస్తుఘటన
మానరుపమేయముల నుపమానములుగ, బ్రమసి ముగ్ధసఖుల్ తదంగములయందు.
| 104
|
క. |
పలుమఱు చల్లనిమందు, ల్చెలిపైఁ జల్లియును లోపలికి నొసఁగియుఁ దా
మలసిరి గాని విలాసిని, యలయికఁ దీర్పంగఁజాలరైరి లతాంగుల్.
| 105
|
తే. |
పూర్ణచంద్రోదయం బన్నఁ బొక్కిపడును, దరుణి కుసుమాకరంబన్నఁ దల్లడిల్లు
భూపతి యశైత్యకారిగాఁ బొగడికొనుచు, వనిత తనుసామ్య మెఱుఁగ నెవ్వరివశంబు.
| 106
|
తే. |
మాటిమాటికిఁ దొరఁగు చెమ్మటల మేటి, బోటి బిగువాటి చనుఁగవ సూటిదనరె
నీటువాటిల్లు సెలయేటి నీటితోడ, సాటిమీఱు నగద్వయిసాటి యగుచు.
| 107
|
ఉ. |
కప్పురపున్ రజంబునఁ బొగల్ బలియించి సురంటిగాడ్పుచేఁ
బుప్పొడులన్ రవుల్కొలిపి పుష్పతతిం గమలించి గంధపున్
లప్పలు పొంగులెత్తి పొరలం దెరలించి యలంచె నంగజుం
డప్పటి మందులెల్ల విరహాగ్నికి విందులు చేసి కోమలిన్.
| 108
|
సీ. |
నిగమఘోటలలాటనేత్రానలజ్వాలఁ గాక దేఱినకాముకాండములును
రాహుగ్రహోగ్రదంష్ట్రావిషగ్రాహియై కఱకెక్కిన శశాంకకౌముదియును
ఘోరాస్యభుజగభూత్కారాస్తి మెలఁగి నిశ్శంకఁ బైకొనుసమీరాంకురములు
దుస్సహవాసంబుతో గడిచేరిన కలకంఠములకు హుంకారరవము
|
|
తే. |
మచ్చరించినకైవడి మఱియుమఱియు, హృదయసంతాప మొదవింప నిందువదన
యోర్వఁజాలక వగనొందుచునికిఁ జూచి, చెలులు చింతాసమాక్రాంతచిత్త లగుచు.
| 110
|
తే. |
కువలయాక్షులు కేతకీకుసుమగర్భ, దళముపై నవ్యహిమజలమిళిత మైన
హరిణమదపంకమున వ్రాసి రపు డలేఖ్య, తనునివేఘప్రసూనేఘవినుతలేఘ.
| 111
|
చ. |
వలపలిచేత భూశరము వామకరంబునఁ బచ్చవిల్లు కో
పులను వసంతకైరవవిధుల్ వెనుకన్ మలయానిలుండు ముం
గల వరశారికాశుకపికభ్రమరాళి వెలుంగఁగాఁ జెలుల్
వలపులరాజువైభవము వ్రాసిరి గేదఁగిపువ్వురేకునన్.
| 112
|
ఆ. |
వ్రాసి యెదుట నిలిపి వనితలు దివ్యవ, స్తువులు దెచ్చి యపుడు షోడశోప
చారములను బూజ సలుపుచు జగదేక, వీరు మారు నిట్లు వేఁడుకొనిరి.
| 113
|
సీ. |
పుట్టినాఁడవుగదా భువనైకసామ్రాజ్యదక్షుతా యాదిమదంపతులకుఁ
బట్టినాఁడవుగదా బ్రహ్మేశ్వరాదుల నైనఁగలంచు బాణాసనంబుఁ
గట్టినాఁడవుగదా కఠినవైరాగ్యసంస్తంభవిద్యకు బిరుదధ్వజంబు
చుట్టినాఁడవుగదా శుభ్రయశోలతాంకురము లజాండకోటరము నిండ
|
|
తే. |
వర్ణనీయ మిందీవరవర్ణనీయ, మందమహిమాతిశయమహీబృందముఖ్య
ముఖ్యులకు నాజవంజవసౌఖ్యదాన, చణనిరంకుశానుగ్రహసదన మదన.
| 114
|
ఉ. |
హల్లకపాణి నీశరశరాసనచిహ్నము లక్షులందు భ్రూ
వల్లికలన్ వహించుకొని వర్తిలుచున్ మణితచ్ఛలంబున
న్మెల్లన యోగ్యవేళలను నీతిరుమంత్రముఁ బల్కు మాచెలిం
జల్లనిచూపు చూడు సుమసాయక నిల్పు మతాభిమానమున్.
| 115
|
వ. |
అని ప్రార్థించుచు నించునిలుతునివలన నించుకైన ననుగ్రహంబు లేమి లేమ పరి
తాపాతశయం బవలోకించి కించిన్మధ్యలు వేసటపడుచు నప్పడుచుఁదనంబుల
పెద్ద నుద్దేశించి యి ట్లనిరి.
| 116
|
మన్మథోపాలంభనము
తే. |
కుసుమసాయకశృంగారరసశరీర, శాలివగునీకు మనసు పాషాణమయము
సద్గుణము లేని దది యేటిచక్కఁదనము, కటాకటా తేనెపూసిన కత్తిగాదె.
| 117
|
ఉ. |
నారఁట తేఁటి జోకనలినారఁట తేరఁట చిల్క సౌరభో
ద్గారఁట విల్లు పూతనయగారఁట చుట్టము శైత్యపున్ సదా
చారఁట కమ్మ గట్టుపరిచారఁట కోయిల కేతనీభవ
ద్వారఁట యిట్టినీ కొదుగువారఁట లోకు లదేమిచిత్రమో.
| 118
|
తే. |
మారణోపాయమర్మకర్మములయందు, నీనృశంసత చూచికా నిర్ణయించె
సార్థకము గాఁగఁ బంకరుహాసనండు, మకరకేతన నీపేరు మారుఁ డనుచు.
| 119
|
క. |
అసమాశుగ నీచాపము, కుసుమం బని పెద్దలనుట కుత్సితసుమమం
చుసుమీ కాకుండిన నే, కుసుమంబులు నరుల మన్నిగొను నీరీతిన్.
| 120
|
క. |
ఎట్టు జనించితి వకటా, కట్టిఁడి వగునీవు మదన కరుణానిధులై
నట్టి తలిదండ్రులకు సుధ, పుట్టినజలరాశి విషము పుట్టినరీతిన్.
| 121
|
సీ. |
కుటిలోగ్రనిటలదృఘ్ఘోరాగ్ని నీకు నిర్బంధపంచత్వంబు ప్రాప్త మగుట
యాకారహీనుఁడవై యుండియును గాలిచందాన లోకసంచారి వగుట
వేళఁ గాచుకొని యావేశించి యింతులఁ బురుషులఁ బీడపా ల్పఱుచుచుంట
నీవు పోఁకిన నెంతనీతిశాలికినైనఁ బుణ్యపాపవివేకబుద్ధి చెడుట
|
|
తే. |
యెంచిచూచిన భూతము వీవు మదన, సంశయము లేదు శివుఁడు మోక్షప్రదాత
యతనిచే ద్రుంగియును ముక్తి నందలేక, గ్రహమ వైతివి విరహులకర్మవశత.
| 122
|
వ. |
అని మఱియుఁ బెక్కుచందంబులఁ గందర్పు నిందించి యిందిందిరాలక లిందీవర
పాలకుం డగునిందు నుద్దేశించి యి ట్లనిరి.
| 123
|
చంద్రోపాలంభనము
సీ. |
శ్రీసహజోన్నతిఁ జెలువొందుటయె కాక శ్రీసహజోన్నతిఁ జెలువుఁగంటి
సత్కళానిధివై ప్రశస్తిఁ గాంచుటె గాక సత్కళానిధివై ప్రశస్తిఁగంటి
కువలయహితవృత్తిఁ గొమరు మీఱుటె గాక కువలయహితవృత్తిఁ గొమరుగంటి
హరిణలక్ష్మాఖ్యత నందియుండుటె గాక హరిణ లక్ష్మాఖ్యత నంద గంటి
|
|
|
కదిసి విషమాంబగకుని కాప్తగరిమఁ గనుటె, గాక విషమాంబకుని కాప్తగరిమఁగంటి
తనరె నీవింత నీవింతఘనుఁడ వయ్యుఁ, జందమా మాచెలి నలంచఁ జందమామ.
| 124
|
|
అమృతకరుఁ డనుపేరు నీ కాదియంద, హీనుఁడై యొప్పుననుచు వాగీశుఁ డనుట
కర్థ మెవ్వరుఁ దెలియలేరైరి కాని, యరయ విరహులపాలిటి కదియ నిజము.
| 125
|
క. |
ఇఱ్ఱందురు మఱ్ఱందురు, వెఱ్ఱులు నీలోనినలుపు విషరాశి సుమా
జుఱ్ఱుకొని నిన్ను రాహువు, గఱ్ఱున మఱి త్రేన్సకున్నె కాకున్న శశీ.
| 126
|
సీ. |
తినలేక వెడలఁ గ్రక్కిన రాహు వెఱుఁగు నీయంగంబు విషమౌట యమృతమౌట
బడలి ఖిన్నతనొందు పద్మిని యెఱుఁగు నీచాయ వేండ్రంబౌట చల్లనౌట
నిలువున నీఱైన నెల ఱా లెఱుంగు నీకరము నిష్ఠురమౌట సరసమౌట
కవఁబాసి పొగులు జక్కవపక్షు లెఱుఁగు నీచర్య దారుణమౌట సౌమ్యమౌట
|
|
తే. |
యాలిఁ గోల్పడ్డనీయుపాధ్యాయుఁ డెఱుగు, నీవు దుర్ణీతి వగుట సునీతి వగుట
యెఱుఁగ రన్యులు నీమర్మ మెఱుఁగకునికి, జనులు నిన్నుఁ గూరగ్రహ మనరు చంద్ర.
| 127
|
చ. |
చతురుల మంచుఁ బండితులు సారెకు నీమెయికందుఁ జూచి క
ల్పితవచనంబులన్ మఱుఁగు వెట్టి శశంబు మృగంబు లాంఛన
స్థితి యని పల్కుచుందురు శశీ పటురౌద్రుఁడు వీరభద్రుఁ డు
ద్ధతి నిను గుండియల్ కమలఁదన్నినచోట నదేమి పాపమో.
| 128
|
తే. |
కైరవాప్తకళంకంబు పేర విషము, లోనఁ బూర్ణించియుండఁ బైపైని చంద్రి
కలు వెలింగించెదవు కుత్తుకను విషంబు, నాలుకను బెల్లమును గాదె పాలసునకు.
| 129
|
క. |
తమ్ములు కుముదప్రియ నీ, తమ్ములు నీయనుజనివసితమ్ములు శరజా
తమ్ములు నీయల్లుని కహి, తమ్ములుగాఁ జూడు వనుచితమ్ములు నడకల్.
| 130
|
శా. |
చూడంజాలక మిత్ర బాంధవులవిజ్జోడై చనంజేయవో
క్రీడంగూడి మెలంగుసత్పరిచరశ్రేణిం బ్రభ ల్గుంచవో
తోడంబుట్టవునింటిపైఁ దెగవొ నిన్ దోషాకరుం డంట కీ
జాడల్ సాక్షులు నేతిబీరపసవోచంద్రాదినామార్థముల్.
| 131
|
సీ. |
గ్రాహాదిసత్త్వభీకరమహార్ణవగర్భబాడబజ్వలనసంపర్కవృద్ధి
త్రిజగద్భయంకరోత్కృష్టహాలాహలవిషహుతాశనసహావిర్భవంబు
భావసంభవభంగఫాలభాగాక్ష్యవలాంతికతమవరాంగాశ్రయంబు
పురజయక్షణరథికరణగోధరఫణిశ్వసనాగ్నినైకటచక్రతాప్తి
|
|
తే. |
మొదలుగాఁ గ్రూరసాంగత్యములను బెంపుఁ, గనిన నీకెక్కడిది మంచితనము చంద్ర
గడును వెన్నెలచిచ్చుల నుడుకఁజేసి, కనికరములేక యేఁచెదు కమలముఖుల.
| 132
|
తే |
అనపరాధ నవధ్య నీయబల నింత, యేఁచెదవు చంద్ర యీయుసు రేల పోవు
నష్టకళ మిత్రునింట హైన్యమున నుండ, నీకు సంప్రాప్తమగుఁగాక నెలకు నెలకు.
| 133
|
వ. |
అని యనేకప్రకారంబుల నిశాకరు నిరాకరించి చంచలాక్షులు దక్షిణదిగాగమన
విశేషంబున శీత్యమాంద్యసౌరభ్యంబులం బసమీఱు సమీరు నుపలక్షించి యి
ట్లనిరి.
| 134
|
మలయానిలోపాలంభనము
సీ. |
దండభృత్కింకరోద్ధండహుంకరణకోలాహలంబుల లోపలను మెలంగి
యౌర్వసంతప్తయామ్యదిశాసముద్రకల్లోలజాలంబుల నోలలాడి
మలయశైలపటీరనిలయజిహ్మగఘోరవిషవక్రబిలముల విహృతిసలిపి
దర్దురప్రముఖపద్ధత్యవ్యటవ్యాశ్రయాశుతో సంబంధ మాచరించి
|
|
తే. |
వచ్చెదవు నీదుదుర్మార్గవర్తనంబు, తెలియనీయవు బాహ్యశీతలమువలన
వంచకుఁడ వెట్లు నిను నమ్మవచ్చు ననిల, యతివినయ మెల్ల దూర్తత యనుట నిజము.
| 135
|
చ. |
సరసుల సంగతిన్ మెలఁగు సౌమ్యుఁడనన్ మృదువర్తనంబుచే
నరయ ననుంగుఁజుట్టముక్రియన్ భువి నంతట నల్లిబిల్లివై
తిరుగుదువంచు నిన్ను వలితెమ్మర ప్రాణముఁ గాఁగఁ జూచు సుం
దరి నలయించె దిట్ల నువు దప్పినవేళఁ గుమిత్రు లీదృశుల్.
| 136
|
తే. |
చల్లకాఁకల ననుకూలశాత్రవమునఁ, గోరి విరహులప్రాణముల్ గొందు వనిల
నిను జగత్ప్రాణుఁ డని పల్క మనసు గొల్ప, దంటిమేనిఁ బ్రభంజనుఁ డందు మిఁకను.
| 137
|
ఉ. |
వేసవిమంట లుప్పతిల వీఁచు నిను్ మలయాద్రిగంధపున్
వాసనలన్ సరోవనజవాసనలన్ జిలిపూన భావనల్
చేసెను వేళవెజ్జు భువి జీవులకై యటులయ్యుఁ బోక నీ
దోసము బెట్టుచిచ్చువలెఁ దోఁచు వియోగులకున్ సమీరణా.
| 138
|
తే. |
వాతవిధ్వంససరసాఖ్యవఱలునౌష, ధంబు నాగేంద్రమనుమంత్రితంబుఁ జేసి
వలయు నీపైఁ బ్రయోగింప మలయపవన, మందుమంత్రంబులను గాని మట్టుపడవు.
| 139
|
వ. |
అని యిత్తెఱంగునఁ బవమాను నవమానవచనంబులం బోనాడి పాంథశ్రవణబాధా
కరణనిజనినాదకలకలంబు లగుకోకిలంబుల నుద్దేశించి ముద్దియ లిట్లనిరి.
| 140
|
కోకిలాద్యుపాలంభనము
శా. |
ఇన్నాళ్లుం గడులొంగియుండుదురు మాహేమాంగిమాధుర్యసం
పన్నంబైన యెలుంగుసొంపునకు నీపట్లన్ వియోగవ్యథా
ఖిన్నం గర్ణకఠోరనాదముల స్రుక్కింపంగ నాయంబె మీ
రెన్నం గోవెలలార సద్విజులకుం బీద్రోహముల్ చెల్లునే.
| 141
|
శా. |
ఆహా కోవెల మీకు మాధవుఁడు భాగ్యం బిచ్చుటల్ పాంథపీ
డాహంకారతకా ప్రవాళచయముక్తాచంద్రసానల్పలీ
లాహారంబులఁ బూనఁ గొమ్మల మనోల్లాసంబునం జేరఁ గే
ళీహన్ మావులఁ నెక్కఁగాక భువి లోకేశుల్ నిజాత్యున్నతుల్.
| 142
|
వ. |
అని వనప్రియంబుల నప్రియంబులు వలికి చెలికత్తియలు పలుకుములుకులంగలి
కివీనుల కులుకుపుట్టించు చిలుకలం గనుంగొని.
| 143
|
చ. |
కర మనురక్తిఁ గొమ్మకరకంజమునం దిడి మీకుఁ బాలుఁ జ
క్కెరలును బెట్టి పెంచి పలికింపుడు మాటలు నేర్పినందుకా
విరసపుఁ గూఁతలన్ మిగుల వేదనగొల్పెద రింతి కియ్యెడన్
గురువుకు బొమ్మ వెట్టితిరి క్రూరవిచారమ కీరవారమా.
| 144
|
ఆ. |
రక్తముఖులు కావరపువిజాతులు కుజ, త్యాశ్రయములు మీర లగుటఁ జపల
వృత్తి నోటఁగాయవేయక వదరుచుఁ, గలఁచెదరు లతాంగిఁ జిలుకలార.
| 145
|
వ. |
అని యిట్లు కీరంబులం దూఱఁబలికి యళినికరంబులం జూచి యి ట్లనిరి.
| 146
|
చ. |
నిలిచినచోట నిల్వక వనిం జలచిత్తముతో భ్రమింపుచుం
జెలఁగి యెలుంగుచేఁ జెవులు చిందఱవందఱనొందఁ గూయుచున్
|
|
|
మలినశరీరులై మిగుల మత్తతనుండఁగఁ దేఁటులార పె
ద్దలు మధుపంబు లుందురుగదా మిము దుర్గుణమిట్టిదే కదా.
| 147
|
క. |
రణసీమ నెట్లు నిలుతురొ, గణుతింపఁగఁ దేఁటులార కామునివింటన్
క్షణచిత్తులు మీ రతఁ డే,గుణము విచారించి మిమ్మ గుణముంజేసెన్.
| 148
|
క. |
అలికుంతల మీనామము, వెలయం దలమోచి యున్నవిశ్వాస మయో
తలపున నుంచక పలుకూఁ, తలచే నీగతి నలంచఁదగునే తరుణిన్.
| 149
|
తే. |
ఇందుముఖు లిందుకందర్పమందగంధ, వాహశుకపికభృంగసందోహముఖ్య
శత్రుపక్షంబు నిందించి సకియభయము, దీఱ నూఱడఁబల్కి రుదారఫణితి.
| 151
|
ఊర్వశిని సఖు లూఱడించుట
సీ. |
సంపెంగకైదువ సవరించుమరునితో హర్షించనేర్చునే యళికులంబు
రామనామోక్తిచే రంజిల్లుచిలుకలఁ గూడివర్తించునే కోకిలములు
హరుని నెమ్మేనఁ బాయక యున్నకుముదాప్తు నాప్తుఁగాఁ జూచునే యసమబాణుఁ
డాదిత్యబింబోదయముగోరుతమ్ముల హితులుగాఁ దలఁచునే హిమకరుండు
|
|
తే. |
వారివారికి నన్యోన్యవైరవృత్తి, గలుగుటకు నిట్లు హేతువుల్ గలుగుటెల్ల
శత్రుపక్షంబునకు నపజయకరంబు, గాన నీకేల వెఱపింపఁ గమలనయన.
| 152
|
ఆ. |
కాముఁ డనఁగ నెంత గండుఁగోయిల యెంత, సోముఁ డెంత గాలి నేమ మెంత
భీము రాము గాముఁ బాముఁ బ్రార్థించిన, భామ వారి గర్వభంగ మగును.
| 153
|
వ. |
అని యివ్విధంబున నాజవ్వని నూఱడింపుచుండి రయ్యవసరంబున.
| 154
|
సీ. |
బదరికావనభూమిఁ బరమాత్ముఁడైన నారాయణదేవుని నాశ్రయించి
వర్తించుఁ త్రైలోక్యవర్తి నామమున నొక్కశుకోత్తమంబు త్రికాలవేది
సత్యలోకంబున శారదారమణి ముంజేతిపైనుండు రాచిలుకతోడి
బాంధవంబునఁ జేసి పడఁతియుఁ దానుఁ దర్సందర్శనార్థంబు చనుచునుండి
|
|
తే. |
యమరపురిమీఁదుగాఁ బోవునపుడు నయన, గోచరం బగునూర్వశీకోమలాంగి
తోఁటసౌకర్యమునకు సంతోషమంది, యింతతడ విందు నిలుతమే యింతి యనుచు.
| 155
|
ఉ. |
పల్లవపుష్పగుచ్ఛఫలబంధుర మైనరసాలశాఖపైఁ
జల్లఁదనంపుసొంపు వెదచల్లెడు కొమ్మకుఁగొమ్మతోడఁ దా
నల్లన జేరి నిల్చి తదుపాంతసరోవనశీతవాతపో
తోల్లసనాప్తికై యెఱక లొయ్యన విచ్చుచు సొక్కి మెచ్చుచున్.
| 156
|
చ. |
అలయికదీఱ జాతసుఖుఁడై నిజచంచుపుటంచలాహతిన్
గళితములైన పక్వసహకారఫలంబులమాధురీరసం
బెలమి భుజించి తాను దనయింతియుఁ దృప్తివహించి యచ్చటం .
గలుగువినోదముల్ మఱియుఁ గన్గొనుచున్ విహరించి యొక్కచోన్.
| 157
|
ఉ. |
వాడినమోముతోఁ జెమటవానలఁ దోఁగిన చన్నుదోయితో
వీడినకొప్పుతోఁ బొడము వెచ్చనియూర్పులతోఁ గరాబ్జముం
గూడినచెక్కుతో వగలఁ గూరెడుచిత్తముతో మరుండు వే
టాడఁగఁ జిక్కువడ్డమృగియై బెగడొందుచు నున్నయూర్వశిన్.
| 158
|
తే. |
సఖులు గావించునుచితోపచారములకుఁ, జెలులు ధైర్యంబు దెలిపెడుపలుకులకును
మనసు గొలుపక హా దైవమా యటంచు, విసువుకొనుచున్న యవ్వెలవెలఁదిఁ జూచి.
| 159
|
వ. |
కటకటంబడుచు శుకాంగన మనోహరున కిట్లనియె.
| 160
|
ఉ. |
అక్కట యీలతాంగి సకలావయవంబులు చూడ నెంతయున్
జక్కఁదనంబు లొచ్ఛెమగుచంద మొకించుకయైన లేదు ముం
దెక్కడఁ జూడలేదు నిజ మిట్టివిలాసిని నేమికారణం
బొక్కొ మనోవ్యథం బొరలుచున్నది చూచితె ప్రాణనాయకా.
| 161
|
తే. |
నాథ యీయింతి జూచిన నామనంబు, జాలిగొనియెడు మీపదాబ్దంబులాన
వినఁదగుదునేని తెల్పుఁడు విశ్వమునను, మీరెఱుం గని కార్య మేమియును లేదు.
| 162
|
త్రైలోకవర్తి యనుచిలుక తనచెలికి ఊర్వశివృత్తాంతముఁ దెల్పుట
క. |
అని పలికిన ప్రియురాలిం, గనుఁగవ నుల్లాసరసవికాస మెసంగం
గనుగొని యిట్లనిపలికెన్, వినుమని మాధుర్యరచన విలసన్ముఖుఁ డై.
| 163
|
సీ. |
పరమపావనమైన బదరికావనమున నిశ్చలంబుగఁ దపోనిష్ఠ సలుపు
చున్న నారాయణయోగీంద్రు నియతి విఘ్నము సేయ గీర్వాణనాథుఁ డంప
నమరాంగనలు వచ్చి హావభావవిలాసములు చూపుదును దనమ్రోల మెలఁగఁ
గాంచి నవ్వుచు నఖాగ్రంబులఁ దన తొడ చీఱి యం దభినవశ్రీయుతాంగి
|
|
తే. |
నివ్వరారోహఁ గల్పించి యవ్వినోద, మునకు లజ్జాభయంబుల మునుఁగుచున్న
యచ్చరలఁ జూచి మీ చేష్ట లతివలార, యిచట నేమగు మఱలిపొం డింద్రుకడకు.
| 164
|
క. |
అని తనయూరువున జనిం, చినదగుటన్ దరుణి కూర్వశ్రీనామముఁ దా
నొనరించి ముఖ్యురా లగు, ననిమిషసతులార మీకు ననుచు నొసంగెన్.
| 165
|
క. |
ఆకొమ్మఁ దమకుఁ బెద్దగ, గైకొని యేతెంచి రమరకాంతలు దివికిన్
లోకస్తుతసుందరియై, నాకంబునఁ బెంపుగనియె నాటంగోలెన్.
| 166
|
మ. |
ఇది యీయూర్వశి పూర్వవృత్త మిపుడీహేమాంగి గందర్పతా
పదశంజెందెఁ బురూరవున్ వలచి తత్ప్రస్తావముల్ చాల నా
రదుచే విన్నదియై యెఱుంగుదువె యారాజేంద్రునిం జూతుమే
కద నారాయణసేవకై యతఁడు రాఁగా నవ్వనిన్ జవ్వనీ.
| 167
|
వ. |
అని పలుకుచున్న జీవితేశ్వరువచనంబు లాలించి యించుకతఁడు తూష్టీకత్వంబున
విచారించి శిరఃకంపంబు సేయుచుఁ గీరభామిని యిట్లనియె.
| 168
|
క. |
అగునగు నెఱుఁగుదుఁ బ్రియకర, మగుమగువల కతనియంద మకలంకశశి
న్నగునగుమొగ మీయింతికిఁ, దగు దగు నిద్దఱకుఁ జెలిమి తమిఁ గ్రీడింపన్.
| 169
|
మ. |
అను నీముచ్చట ప్రస్ఫుటాక్షరరవవ్యాహారమై కర్ణరం
జన గైర్వాణసుశబ్దమై వినఁబడం జంద్రాస్య లాశ్చర్యఖే
లనలోలద్వికచాంబికప్రభలు లీలాచంద్రికల్ చల్లఁ గ
న్గొని రాసన్నరసాలశాఖ నలరుంగొమ్మన్ శుకద్వంద్వమున్.
| 170
|
ఉ. |
కీరములన్ మనోజ్ఞరుచిఖేలనవర్ణవిశేషశోభితా
కారములన్ నవారుణముఖప్రథితాత్మగతానురాగవి
స్తారములన్ జనశ్రుతిరసాయనమంజులవాక్కథాసుధా
పూరములన్ గనుంగొని రపూర్వముదంబున నూర్వశీసఖుల్.
| 171
|
మ. |
మణిమంజీరఝళఝుళన్నినదసంపన్నాంఘ్రివిన్యాసవా
రణకుంభప్రతిమానపీనకుచభారప్రోచ్చలన్మధ్యలై
గణికల్ తత్సహకారముం గదిసి శోభాచంక్రమాక్షిద్వయీ
ఘృణు లుడ్డీనచకోరికాచయజయశ్రీ నొంద వీక్షింపుచున్.
| 173
|
వ. |
నిలిచి తత్తేజోవిశేషంబున కద్భుతం బందుచుం బ్రార్థనావచనపూర్వకప్రాంజలులై
కీరోత్తముం గనుంగొని.
| 174
|
ఉ. |
కన్నుల పండువయ్యె నినుఁ గన్నఁ జెవుల్ కడుచల్లనయ్యె ఠీ
వి న్ననువొందునీపలుకు విన్నను నీకరుణార్ద్రదృష్టిపై
కొన్న వసంతలక్ష్మి నెలకొన్న లతావళు లయ్యె మేనులో
యన్న శుకప్రకాండ విను మన్నిటఁ బుణ్యశరీరి వెన్నఁగన్.
| 175
|
ఉ. |
కేళికినై శుకాకృతు లొగి ధరియించి మెలంగునాజగ
న్మూలనిదానదంపతుల మువ్వురిలోపల నొక్కరో దయా
శీలత మన్మనోరథము చేరి యొసంగఁగ వచ్చినట్టి మా
పాలిటిభాగ్యదేవతలొ పల్కఁదగున్ భవదీయవృత్తమున్.
| 176
|
వ. |
అని వినయభాషణంబులు పలుకుచున్న యన్నుల నవలోకించి కించిత్ప్రసారిత
నిజకటాక్షవీక్షణుం డగుచుఁ బక్షివరుంఁ డిట్లనియె.
| 177
|
సీ. |
మానివాసము ముక్తిమౌనివాసం బైనబదరికావనసీమ భామలార
మామైత్రి యలకరామామైత్రిఁ బేరైన శుకతల్లజముతోడ సుదతులార
మాయింపు ఖేదముల్ సూయింపు భగవత్కథాప్రసంగంబులు తరుణులార
మానేత్రములకును మానేత్రజాదిలోకములు దృశ్యంబులు కాంతలార
|
|
తే. |
మానిజగతి దుస్సంగతి మాని జగతి, సత్ప్రచారతనుండుట సకియలార
మాహితప్రోక్తి వినుఁడు సమాహితమున, మీకు శుభవార్త పలికెద మెలఁతలార.
| 178
|
ఉ. |
ఊర్వశి పాకశాసనునియోగమునన్ భువికేగు నచ్చట
సర్వగుణాభిరాము నృపచంద్రు బురూరవుఁ గాంచు నాతఁ డీ
పర్వశశాంకబింబముఖిపైఁ గడుఁ గూర్మివహించు మామకా
శీర్వచనంబు సిద్ధముగఁ జేకుఱు నిద్దఱకున్ సరాగముల్.
| 179
|
ఉ. |
చంద్రనిభాస్య కానృపతిచంద్రునితో సతమైనకూటమిం
జంద్రునియందు లీయమగు చంద్రికయుం బలెనుండఁ గల్గెడుం
జంద్రవిలాసమూర్తు లగుచక్కనిపుత్రులఁ గాంచు భూమిలోఁ
జంద్రకులంబు వర్ధిలు నిజంబుగ నూర్వశికారణంబునన్.
| 180
|
వ. |
అచిరకాలంబున నీమనోరథంబు సాఫల్యం బగునని యూర్వశి నుద్దేశించి యిట్లనియె.
| 181
|
శా. |
మానారాయణమూర్తియూరువున జన్మంబందుటం జేసి నీ
పై నెయ్యంబున నింతయం తెలిపితిన్ భాగ్యంబుచే నీకు నా
భూనాథాగ్రణి మేలువాఁడగును నీపుణ్యంబు లీడేఱు బా
లా నిశ్చింతతనుండు మింక వగ పేలా నీకు మేలయ్యెడున్.
| 182
|
క. |
అని పలికి తానుఁ బ్రేయసి, యును నవ్వలనరుగఁ దగుప్రయోజనము ముదం
బునఁ దెలిపి పోయివచ్చెద, మని చెప్పి సముద్గమించె నంబరవీథిన్.
| 183
|
తే. |
ఉభయపక్షప్రకాశత నొప్పుచక్ర, విభ్రమణలీల లెసఁగించు విషమజాడ్య
కరగతి నయంబు దనర శుకప్రకాండ, మవగుణము లేని శశియన నరిగె దివిని.
| 184
|
తే. |
చిలుకమిథునంబు వెంట నాచెలులచూపు, లపు డదృశ్యావధికముగ నరిగి తిరిగె
సాధు లగుబంధువుల దవ్వు సాగనంపి, వచ్చు టుచితంబుగద గుణవంతులకును.
| 185
|
క. |
చిలుక సుధారసధారలు, చిలుక వచించిన హితోక్తి చెవిఁ జేర్చుటచే
వెలవెల దొలంగి వేలుపు, వెలవెలఁదికి మోముదమ్మి వికసిత మయ్యెన్.
| 186
|
సీ. |
తడిగట్టినట్లు చందనకర్దమంబు వాడినతనూలతమీఁద నెనయ నలఁది
యరుణోదయము గాఁగ నబ్జరాగపుతాళి సొలసినకుచకోకములను జేర్చి
మకరంద మొలుకు కమ్మనిపూలు చెదరిన కొప్పు తుమ్మెదగుంపుఁ గూర్చి చుట్టి
చీఁకటి కప్పుగాఁ జెలఁగు కాటుక కాంతనయనోత్సలముల నందముగఁ దీర్చి
|
|
తే. |
విరహవేదన బడలిన వెలఁదియంగ, కముల కుపచార మదియె శృంగార మదియె
తానొనర్చిరి తెలిసి యేకక్రియాప్తి, నావయస్యలనేర్పు నేమనఁగవచ్చు.
| 188
|
క. |
అంగీకృతకాలోచిత, శృంగారవిలాస యగుచుఁ జెలికత్తెలతో
రంగగు నిజమందిరమున, కంగన యేతెంచెఁ గోర్కు లతిశయమందన్.
| 189
|
ఉ. |
ఇంద్రుఁ డనుజ్ఞ యిచ్చుపని యెయ్యది గల్గునొ భూమి కేగ రా
జేంద్రునిదర్శనంబు ఘటియించుట యెట్లొకొ వాఁడు మన్మన
స్సాంద్రతరానురక్తికి వశంగతుఁడౌట కుపాయమేమొ ని
స్తంద్రతఁ జిల్కపల్కులు నిజంబగునో యది గాక తప్పునో.
| 190
|
సీ. |
అభిలాష మీ డేఱు ననుచు నమ్మికగాఁగ నాడిన చిలుకవాక్యములవలనఁ
దఱుచైన కలలోని దర్శనస్పర్శన సంజల్పసంయోగసరణివలన
నతనిము న్గనుఁగొన్న యమరశిల్పకులు వ్రాసినపటం బెద నుంచుకొనుటవలనఁ
దలఁచి కావించునోములసమాప్తిని, బుణ్యవతులు దీవించుదీవనల వలన
|
|
తే. |
వామలోచన యాత్మీయవామలోచ, నం బదరు టాదిగా శకునములవలనఁ
దెచ్చుకోలుదిటంబున దినములొక్కఁ, గతిఁ గడుపుచుండె మనసు తద్గతము చేసి.
| 192
|
క. |
భువిఁ బుణ్యము లొనరింతురు, దివిభోగము లందుకొఱకుఁ దిరముగ వ్రతముల్
దివినుండి చేసె నూర్వశి, భువిభోగముకొఱకు నిది యపూర్వము గాదే.
| 193
|
వ. |
అని పలికినం బరమహర్షసమన్వితులై మహర్షు లవ్వలివృత్తాంతంబు దేటపఱు
పుమని యడుగుటయును.
| 194
|
శా. |
కద్రూసంభవదర్పభంజనమహాగాంధర్వ గాంధర్వసం
పద్ద్రాఘిష్ఠకవంశరావలహరీమాధుర్య మాధుర్యయో
షిద్ద్రుక్చారుచకోరికాప్రియముఖశ్రీరాజ శ్రీరాజమా
నద్రుస్ఫారతటార్కజావిహరణానందాత్మ నందాత్మజా.
| 195
|
క. |
పింఛాలలంకృతకచతా, పింఛాంచితనీలవర్ణబృందావనభూ
లాంఛితపదఘోషవధూ, వాంఛితపదమాగ్ధ్యజగదవనవైదగ్థ్యా.
| 196
|
కవిరాజవిరాజితము. |
చరణరణన్మణినూపురధీధితిసంవృతకాళియభోగిఫణా
ఖురజరజఃపటలావృతదిక్తటఘాటనిశాటవిభంగరణా
విరహరహస్సమయాగతయోపసువృత్తకటీసహవిభ్రమణా
పరమరమాంగలతాశ్రయవిగ్రహభద్రతమాలతరుస్ఫురణా.
| 197
|
గద్య. |
ఇది శ్రీమంగళాచలనృసింహకృపాప్రసాదసంప్రాప్తవిద్యావైభవ కనుపర్తి
రాయనమంత్రితనూభవ సుజనహితకృత్యనిత్య అబ్బయామాత్యప్రణీతం బైనకవిరాజ
మనోరంజనం బనుమహాప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము.
| 198
|