కవిజనాశ్రయము/షట్ప్రత్యయాధికారము
శ్రీరస్తు.
కవిజనాశ్రయము.
షట్ప్రత్యయాధికారము.
క. శ్రీనారీప్రియకరుఁ డఖి
లానందకరుడు[1] కవిజనాశ్రయుఁడు ధరి
త్రీనుతుఁడు సమస్తకళా
నూనుఁడు షట్ప్రత్యయంబు లొగి నెఱిఁగించున్.[2] 1
క. క్రమమునఁ బ్రస్తారము న
ష్టము నుర్దిష్టమును వృత్తసంఖ్య యనంగా
నమరు లగక్రియ యన న
ధ్వము నన షట్ప్రత్యయములు తనరున్ గృతులన్. 2
క. ఇడి గురువుక్రింద లఘు వ
క్కడ సదృశము సేసి పిఱుఁదఁ గదిసినగురువం
దిడఁ బస్తారము; రెం డిడి
మడుప నగును వృత్తసంఖ్య మల్లియరేచా ! 3
క. [3]ధరవృత్తసంఖ్యలో సవ
మురుముం జేసినను గూడు మొన్కడ లఘువుల్ [4]
గురువులు సమవిషయంబులు
విరచింపఁగఁ జెడినయట్టివృత్తము వచ్చున్. 4
క. [5]ఒక్కటి మొద లిడి మడుపుచు
నక్కడఁ దుదదాఁక లఘువులందలిలెక్కల్
లెక్కించి కూడఁ బదపడి
యొక్కటి మఱి యందుఁ గూడ నుద్దిష్ట మగున్. 5
క. తరతరమ దొంతివృత్తా
క్షరములు లెక్కాదికంబుగా నిల్పి యధో౽
క్షరము లుపర్యక్షరములు
పరువడిఁ గూడుచు నుపాంతపర్యంతముగాన్. 6
క. కలయ నుపాంతాధో౽క్షర
ము లుపాంతములందు నిల్పి మునుగూడిన నొ
క్క లగక్రియ (తత్పిండిత)
మలవడ సద్వృత్తసంఖ్య మల్లియరేచా ![6] 7
క. అగు నర్ధ మేకరహిత
ద్విగుణితసంఖ్యాంగుళీకృతివ్యాపక మి
ద్ధగుణాఢ్య ! కవిజనాశ్రయ!
జగజ్జనాధార! ధీర! చారుచరిత్రా! 8
[7]గద్యము. ఇది వాదీంద్రచూడామణిచరణసరసీరుహ మధుకరాయమాన శ్రావకాభరణాంక విరచితం బైనకవిజనాశ్రయం బనుఛందంబునందు షట్ప్రత్యయాధికారము.
- _________
- ↑ ద-శ్రీనారీప్రియుఁ డఖిలబుధానందకరుండు .
- ↑ ద-లొప్పఁగఁ జెప్పున్. ద-ప్రతి యింతటితో సరి .
- ↑ క-వృత్తసంఖ్యార్థమున్ దుదివిషమమైన | గురువు లిడుచును నొక్కటి గూర్చి మఱియు |దళముచేయుచు సమసంఖ్య దగఁగ లఘువు | దనర నిడినను నష్టవృత్తంబు వచ్చు.
- ↑ ఈపాదము సమన్వయముగా లేదు.
- ↑ డ-లో నున్నది. క-ఆది రెండిడిమడుపుచు నలర గురువు | లున్ననొక్కటి దరపుచు నన్ని యక్క, రముల నీరీతిమడుపంగఁ గ్రమముతోడఁ, దెలిసి సుకవులు దీని నుద్దిష్ట మండ్రు.
- ↑ ళ-లో "నొక్కలగక్రియ” యనునంత వఱకు మాత్రమే యున్నది.
- ↑ మూలములో లేదు.