కవిజనాశ్రయము/దోషాధికారము

శ్రీరస్తు.

కవిజనాశ్రయము

[1]దోషాధికారము.

క. శ్రీశ్రితవక్షుఁడు విద్యా
   శ్రీశ్రితముఖుఁ డఖిలజనవిశేషితకీర్తి
   శ్రీశ్రితభువనుఁడు సుకవిజ
   నాశ్రయుఁ డెఱిఁగించుఁ గృతుల నగుదోషంబుల్. 1

క. [2]రూపితపునరుక్తి వ్య
   ర్థా పార్థ విసంధి సంశయ చ్ఛందోభం
   గాపక్రమ యతిభంగ వి
   రూపోక్త్యపశబ్దములు విరోధము కృతులన్. 2

క. అని యిట్లు దశవిధము లగు
   మునిమతమునఁ గావ్యదోషములు; వాని నెఱుం
   గనివాఁ డిప్పాట నెఱుం
   గు నుదాత్తకృతిప్రసంగగుణ దోషములన్. 3

క. మును సెప్పినశబ్దమె చె
   ప్పునేని కొఱ లేక శబ్దపునరుక్తి యగున్;
   మును చెప్పినయర్థమె చె
   ప్పునేని కొఱ లేక యర్థపునరుక్తి యగున్ . 4

క. దినకరుఁ డని మఱి దినకరుఁ
   డనఁగా శబ్దపునరుక్తి యనఁ జనుఁ గృతులన్ ;
   దినకరుఁ డని యాదిత్యుం
   డనఁగా నర్థపునరుక్తి యనిరి కవీంద్రుల్. 5

క. [3]అయనయసమేత ! కమనీ
   యయశా ! పునరుక్తి యయ్యు నమరుఁ బదావృ
   త్తియు మఱి వీప్సాభీక్ష్ణ
   క్రియాసమభిహార మైనక్రియలన్ గృతులన్. 6

క. విను వసతి వసతి దప్పక
   వన మనఁగా వీప్స, వచ్చి వచ్చి చనుం దా

   ననఁగను నభీక్ష్ణ మి మ్మి
   మ్మనఁగాఁ గృతులన్ గ్రియాసమభిహార మగున్. 7

క. తనసత్యము తనశౌచము
   తనశౌర్యము తనవిశిష్టదానము చతురా
   ననునకుఁ బొగడఁగ మిక్కిలి
   యని యీక్రియఁ జెప్పినది పదావృత్తి యగున్. 8

క. మొదలిక్రియతో నమర్పక
   విదితవిరుద్ధార్థయుక్తి విపరీతం బై
   తుదఁ గ్రియరాఁ జెప్పిన వ్య
   ర్థదోష మని రఖిల కావ్యతత్త్వవిధిజ్ఞుల్. 9

క. [4]పొడిచి యొడువంగఁ బగఱను
   గడుఁ గరుణాపరుఁడ వీవు కావున నీ క
   ల్గెడువారు లేరు పగ ఱె
   క్కడ నని యిప్పాటఁ జెప్పఁగా వ్యర్థ మగున్. 10

క. దినకరుఁడును హిమకరుఁడును
   మనసిజుఁడును బోల్స నీసమానులు సత్కాం
   తి నుదాత్తతేజమున సొబ
   గున ననిన నపక్రమం బగున్ వ్యుత్క్రమ మై. 11

క. వినుతచ్ఛందంబునఁ జె
   ప్పినయెడ నిలుపక కడలను దప్పి నిలుచుచొ
   ప్పునఁ జెప్పిన నది యతిభం
   గనామదోష మగుఁ గృతి జగజ్జనవినుతా! 12

క. వెలయంగ లక్ష్యలక్షణ
   ముల సిద్ధము లైనశబ్దములు గాని కుసం
   ధులు మొదలైనవిరూపో
   క్తు లెల్ల నపశబ్దనామదోషము లయ్యెన్. 13

క. పరఁగ నికారోపరిత
   [5]త్స్వరమ యికారంబుతోడ సదృశముగా నె
   వ్వరియి ల్లిది యి ట్లన కె
   వ్వరి ది ల్లి ట్లనఁ గుసంధివర్గం బయ్యెన్ . 14

క. స్వరగణము కూడి కృతిఁ ద
   త్స్వర మైననకార మొంది వ్రాయై[6] చనఁగా
   [7]దొర వీవు నజుఁడు ననకయ
   దొర వీవు న్నజుఁడు ననిన దుస్సంధి యగున్. 15

క. తనకడకు వలచి యేఁ బో
   [8]యిన నొల్లం డొల్లఁ డింక నే నాతనిఁ గా

   మిని! గవయ నేమి నోఁచితి
   నన విరహిణి కమరు నీక్రియన్[9] వ్యర్థంబై . 16

క. వన మిదియె కంటె తోడ్పడు
   మన వన మని యొండు రెండు మడుగులు గాఁ జె
   ప్ప నపార్థదోష మగు; నది
   చను మత్తోన్మత్త బాలచరితములందున్.[10] 17

క. తలరమి నీతో మేరువు
   అలవి యగుం గాక యొరులు అలవి యె వర ఉ
   జ్జ్వలతేజ యనఁగ సంధిం
   గలయనినొడువులు విసంధికము లనఁ బరఁగున్. 18

క. ప్రియమున నే నిన్ను మనః
   ప్రియుపాలికిఁ బుచ్చఁ బోయి బింబాధర ! పా
   డియె యిట్లు చేయ నని సం
   శయార్థముగఁ జెప్పఁ గృతుల సంశయ మయ్యెన్. 19

శ. భూభాగనభోభాగది
   శాభాగప్రవర్తికీర్తి సత్కృతికృతిచ్ఛం
   దోభంగ మిట్లుగా ఛం
   దోభంగం బనుప్రధానదోషం బయ్యెన్. 20

క. [11]నొడువులకు సంధి నెగ్గులు
   [12]వొడమిన శ్రుతి దుష్ట మయ్యె; భూతలమున ని
   చ్చెడునెడ నినుమడి సిరి యనఁ,
   [13]బడు నీజో డనినఁ జుట్టుప్రా వగుఁ గృతులన్. [14] 21

క. తుద వేఱు సేసి మఱి చ
   క్కఁదనపుఁ దెనుఁగున నమర్చి కల వంబుజముల్
   పదియు ననక కల వంబుజ
   పది యని కృతిఁ జెప్ప వైరిపద మనఁ బరఁగున్.[15] 22

క. [16]వెలయఁగఁ [17](జెఱాకు) విలు గొని
   [18]యలరమ్ములు చేతఁ బట్టి యంగజుఁడు విరా
   హుల నేయు నేర్పుకడిమిన్
   దొల మెలయఁగ ననినఁ గాకుదోషం బయ్యెన్. 23

క. ఈతఁడు “నృపస్య నగరం
   యాతి” యనం జనిన సుప్తిజంతంబులు, "కృ
   త్వా తీర్త్వా జిత్వా" యన
   బ్రాఁతిగ నీక్రియలు చొరవు [19]భాషాకృతులన్. 24

క. వితతసుకవివాక్యం బవ
   గతమై 'కవయె వదంతి కావ్యం' బని స
   త్కృతి నీక్రియఁ బెట్టించిన
   నతిశయమై యుండు సుప్తిజంతం బయ్యున్. 25

క. ఇవి మొదలగునొడువు లనే
   కవిధగ్రామ్యోక్తు లెన్ని కల వన్నియు స
   త్కవు లపశబ్దము లని త
   త్కవితల మెచ్చరు కవీంద్రకల్పమహీజా ! 26

క. శ్రీ దేవీపతి రేచఁడు
   గాదిలియై చనఁగ దేశకాలకళాలో
   కాదివిరోధస్థితుల స
   మాదరమునఁ దెలియఁ జెప్పు నఖిలజనులకున్. 27

క. కలహంసలు క్రొమ్మామిడి
   తలిరులలోఁ గోకిలాళి తామరవిరిపు
   వ్వులలో నాడెడు ననును
   క్తులు దేశవిరోధనామదోషము లయ్యెన్. 28

క. [20]చినికెడుఁ బురినెమిళులు ముద
   ముననాడెడు నింద్రగోపములు పాఱెడు నా
   మనికాల మయ్యె నిలలో[21]
   ననఁ గాలవిరోధదోష మనిరి కవీంద్రుల్ . 29

క. అసమగజము లందలములు[22]
   కొసమాత్రకు దెచ్చు నట్టిగుఱ్ఱంబుల నం
   కుస మిడక యెక్కు ననఁగా
   హసనీయకళావిరోధ మనిరి కవీంద్రుల్ . 30

క. విను కరహీనుఁడు తగ వ్రా
   సినపొత్తము తెచ్చి యొక్క చెవిటి వినఁగ బో
   రనఁ జదివె మూఁగ సభలో
   నన లోకవిరోధదోష మనిరి కమీదుల్. 31

క. [23]ఘసదండకాష్ఠకృష్ణా
   జినములు సొగయింప నొక్కజినముని చనుదెం
   చె ననఁగ సమయవిరోధం
   బని కవులకుఁ జెప్పుఁ గవిజనాశ్రయుఁ డొనరన్. 32

క. [24]జిననుతధర్మ మహింసయ
   యనుమతమున వితతముగ గజాసురుఁ బాపం
   బని చంపఁ డయ్యె నీశ్వరుఁ
   డన నిది యాగమవిరోధ మనిరి కవీంద్రుల్. 33

క. అని యిట్టివి దశదోపము
   లనఁ జనుఁ గృతి నివియ వెండి యతిశయతరమై[25]
   చనుఁ గొన్నియెడల ధీరుల
   మన మలరఁగఁ జెప్పి రేని మల్లియ రేచా! 34

క. జయదేవాదిచ్ఛందో
   నయమున సంక్షేపరూపునం జెలువుగ మ
   ల్లియ రేచన సుకవిజనా
   శ్రయుఁ డీఛందంబుఁ జెప్పె జనులకుఁ [26]దెలియన్. 35

[27]గద్యము. ఇదివాదీంద్రచూడామణిచరణ సరసీరుహమధుకరాయమాన కవిజనాశ్రయ శ్రావకాభరణాంక [28]విరచితం బైన కవిజనాశ్రయచ్ఛందంబునందు దోషాధికారము. [29]

___________
  1. క-చ-డ-లలో నున్నది. ఈయధికారము ఛందశ్శాస్త్రమునకు సంబంధించినది కాక పోయినను, ప్రక్షిప్త మనుటకుఁ దగిన యితరకారణములు కనఁబడకుంటచే నీగ్రంథములోని భాగముగా గ్రహింపఁబడినది.
  2. చూ. 1 యతిభంగ మర్థశూన్యం | సతతనిరుద్ధార్థ ముక్తపునరుక్తార్థం ! చ్యుతయాథాసంఖ్యం వ్యవ! హితమచ్ఛందం 'విసంధికం నేయార్థం. 2 ఆగమసమయ న్యాయవి! భాగకళాకాల లోకదేశవిరుద్ధం| భోగివిషం బోల్ప్రాణ త్యాగమనాగినుగు మమళకృతివధు గినితుం. (కర్ణాటకవిరాజమార్గము.)
  3. చూ:-దూరాభీక్షణవీప్సో! దారానుకృతిక్రియాసమభిహాంసమీ ! పోరుతరచాపళాదిగె! సారం బుధరిం పదక్కె యుగళోచ్చరణం. (కర్ణాటక శబ్దమణిదర్పణము)
  4. చూ: అరినృపబలమంగెల్దర్ | పరాక్రమక్రమదె శౌర్యమం ప్రకటిసునీం | నరమహితా నినగే నహి ! తరు మొళరే సతత పరహితాచార పరా. (కవిరాజమార్గము.)
  5. క - త్పరమయికారంబుతో ధ్రువం బమరఁగ నె.
  6. క-వ్రాలై.
  7. క-దొర యీ మనుజుం డనకయ, దొర యీమనుజుండు అనిన దుస్సంధి అనిన దుస్సంధి అగున్.
  8. క-యిననో ల్గొనఁ డొల్లఁ డింక.
  9. క-నీక్రియలు.
  10. చూ. స్థిర మర్థశూన్య మెంబుదు , దురుక్తమిద నింతు పేళ్దొ డెల్లంపీనం, మరుళుం మదిరాసరవశ, శరీరమం పేళ్గు మఱిప నావం పేళ్లుం. (కవిరాజమార్గము.)
  11. చ-నుడువు లగు సంధి నెగ్గులు.
  12. డ--పొడమిన నతిదుష్ట మయ్యె.
  13. చ-బడునిచ్చోటులను.
  14. ఈపద్యముతరుహత చ-లో, ఇందు కుదాహరణము. అవనిపుండు పుట్టె నమరకుజము భంగి, బుధులు గురులు నమల బుద్ధిఁదలఁప, నిచ్చు నష్టసుతుల నితనికి శ్రీవాసు, దేవుఁ డనినఁ జుట్టుప్రానకృతుల- అని యున్నది.
  15. చ - వైరివర్గం బరయన్ . వైరిపదమునకుఁ గన్నడమందరిసమాసమని పేరు. “పదవిధికన్నడకంస, క్కదక్క మిల్లాద్యరిందె సందుననఱిది, ర్పుదుబిరుదావళియో ళ్పే, శ్వుదు పెఱవఱొళాగదిదు విరుద్దసమాసం." (శబ్దమణిదర్పణము. ).
  16. డ- వెలసినచెఱాకువిలుగొని, యలవడఁ ద్రిప్పుచును వచ్చె నంగజుఁడును విరహుల నేయ ననినఁ గలిమిన్' , దొల మొలయఁగ ననినఁ గాకుదోషములయ్యెన్.
  17. మూలములో జిగురా కని యున్నది గాని యది పొరపాటు.
  18. క-యలమరు ద్రిప్పుచును వచ్చి యంగజుడు విరా, హుల నేయు సమలికలమని , దొలమిగులఁగ ననినఁ గాకుదోషం బయ్యెన్.
  19. ఇచ్చట భాష యనఁగా సంస్కృతముకంటె భిన్న మయినదేశభాష. ఈశబ్ద మీయర్థమం దుత్తరదేశ మందు వ్యవహరింపఁబడుచున్నది.
  20. చ-చినికెడుభువి.
  21. డ-మనికాలమయ్యెఁ బొ మ్మి ట్లన.
  22. చ-అసమగజంబుల దవ్వుల. డ-అసమగజంబులు పూవులు.
  23. చ.లో లేదు. చూ-అమరఁగఁ బులితోలును మ, స్తమునం బలుజడలు దాల్చి సౌగతుఁ డొప్పెన్ ,
    హిమకర శేఖరుగుడి నన, సమయ వరుద్ధార్థమగుచుఁ జను సత్కృతులన్. (కావ్యాలంకార చూడామణి)
  24. చ-లో లేదు.
  25. చ-అనునీదశవిధదోషము, లనఁ గృతులం దివియ నెండి యతిశయకరమై.
  26. క-నొనరన్.
  27. డ-లో లేదు. దీనికిఁబూర్వము చ-లో నీక్రిందిపద్య మున్నది. సకలమహీజనంబులకుసంతస మయ్యెడు సౌఖ్య సంపదల్, సకలధరాధినాథులు నిజస్థితి దప్పక భూమి నేలఁగా, సకలకవీశ్వరుల్ పొగడఁ జంద్రుఁడు సూర్యుఁడు గల్గునంతకున్ , సకలధరిత్రలో వెలసి ఛందము తద్ద వెలుంగుచుండెడున్.
  28. చ-శ్రావకాభరణ.
  29. సమస్తాధికారమని పాఠాంతరము.