కవికర్ణరసాయనము/తృతీయాశ్వాసము

తృతీయాశ్వాసము



రంగవలయరూఢా
ధారమహీరుహ సమస్తధరణీతరుణీ
హారాయమానవిమలక
వేరసుతామధ్యఖచితవిమలేంద్రమణీ.

1


వ.

ఇట్లు విశ్వదిగ్విజయంబు సేసి మాంధాతృమహీమండలేశ్వరుండు జగత్పూజ్యంబు
గా రాజ్యంబు సేయుచున్నకాలంబున.

2

మాంధాతకడ కిరువురు చిత్రకారులు వచ్చుట

క.

చిత్తరువు వ్రాయ నేర్చిన, యుత్తమశిల్పకులు వచ్చి యొకయిద్దఱు భూ
భృత్తపనుఁ గాంచి యవ్విభు, చిత్తము రంజించి రాత్మచిత్రక్రియలన్.

3


క.

మెచ్చి తమ కమ్మహీవరుఁ, డిచ్చుపదార్థంబు లొల్ల కే మిచ్చటికిన్
వచ్చుటకుఁ గారణము గల, దిచ్చం గృప సేయవలయు నేకాంతంబున్.

4


వ.

అనిన ననుగ్రహాతిరేకంబునం కార్యజిజ్ఞాసాకుతూహలంబున నట్ల యేకాంతం బొసం
గిన వార లిట్లని విన్నవించిరి.

5

చిత్రకారులు విమలాంగివృత్తాంతముఁ దెల్పుట

క.

కుంతలపతికిం గల దలి, కుంతల విమలాంగి యనఁగఁ గూఁతురు రజనీ
కాంతునిపదియేడవకళ, కంతునియాఱవశరంబు గణుతింపంగన్.

6


గీ.

రత్నపుత్రిక వోలె నారాజకన్య
పుట్టినప్పుడు యొకమహాద్భుతపుఁగాంతి
నుదయ మందినఁ గనుఁగొని యుచిత మగుటఁ
దండ్రి విమలాంగి యనుపేరు దాని కిడియె.

7


గీ.

కన్య యై మా కొకానొకకారణమునఁ, గలిగె నది దేవతామూర్తి గాని మనుజ
జాతి గాదని బహుమానసహితమతులఁ, దల్లిదండ్రులు పెనుప నత్తన్వి పెరిగె.

8


క.

కుందనము గమ్మవలపుం, జెందెడుచందమునఁ దెల్లచెఱుకునఁ బం డై
సుందరి యగునక్కన్నియ, యం దెలప్రాయంబు విడువ నాయత మయ్యెన్.

9

బాల్యయౌవనసంధివర్ణనము

క.

తొడరియుఁ దొడరనిసిగ్గునఁ, బొడమియుఁ బొడమనియురోజములఁజాపలమున్
విడిచియు విడువనినడపులఁ, బడఁతుకపై నూఁగునూఁగుఁ బ్రాయం బయ్యెన్.

10


చ.

దివసమువోలె శైశవము దీఱఁగఁ బ్రాయపురేయి దోఁచుచో
నవకపుమోవికెంపునఁ గనంబడియెన్ నెఱసంజవోలె న
క్కువలయపత్రనేత్ర నవకుంతలబాల తమోవితానముల్
గవియఁగఁ దానఁ బో మరునిగర్వము దుర్వహ మయ్యె నయ్యెడన్.

11


చ.

గురుకుచకుంభసంస్థితికిఁ గూడె నురంబున నాలవాలముల్
పొరసెఁ గురుల్ ముఖాబ్జమునఁ బొడ్మెడుతావికిఁ జేరుతేఁటు లై
గరువపుఁజూపు లోరసిలెఁ గన్నులక్రేవకు సి గ్గెలర్ప నా
వరనృపకన్యయం దభినవంబుగ జవ్వన మంకురింపఁగన్.

12


చ.

విరివియె కాని పైపొడవు వెల్వడ కుండెడుపూఁపచన్నులన్
సరవియె కాని దంతురత చాలనిసన్నపుముత్తరంగలన్
దరళవిధంబె కాని నిశితత్వ మెఱుంగనిక్రొత్తచూపులన్
సరసిజనేత్ర పొ ల్పెసఁగె శైశవయౌవనసంధిఁ జూడఁగన్.

13


సీ.

విస్తారవిలసనప్రస్తావనలు దోఁచె, సరవిఁ దటప్రదేశములయందుఁ
శ్రమముతోఁ దల లెత్తెఁ గడకంటిచూపుల, యందుఁ గౌటిల్యదూర్వాంకురములు
సరసవైదగ్ధ్యరసాయనోదయమునఁ, బలుకు లొయ్యొయ్యన పదనుకొనియె
నురముపైఁ జెక్కి పయోధరంబులు చేసె, లాలితోద్భేదకోలాహలములు


తే.

నవయవంబులు గైసేఁత లభిలషించెఁ, జెవులు సంభోగవార్తలచవులు మరిఁగె
జనవరాత్మజ కంతను శైశవంబు, వీడి క్రొత్తగఁ బ్రాయంబు గూడునపుడు.

14


వ.

అంతఁ గ్రమక్రమంబున.

15

నవయౌవనవర్ణనము

మ.

స్మరశాతావిలాసపుష్పమధుమాసం బక్షవృత్తిస్వయం
వర మాలోకనభాగధేయము మదస్వాతంత్ర్య మవ్యాజల
బ్ధరహఃకేళికళామనోరథలతోపఘ్నంబు నారోపితా
భరణప్రాయము ప్రాయ మయ్యువతిపైఁ బ్రాదుర్భవం బొందినన్.

16


చ.

కనగొని నిల్చుపేరనఁటికంబము లయ్యె మృదూరుకాండముల్
గువలయతోరణావలినిగుంభన మయ్యెఁ గటాక్షవిభ్రమం
బవిరళపూర్ణకుంభయుగ మయ్యె విరాజదురోజయుగ్మ మ
య్యవనిపకన్యయందు నవయౌవనలక్ష్మిసమాగమంబునన్.

17

సీ.

ప్రథమహాలాహలప్రధమానకీల లై, వీఁచెఁ గ్రూరకటాక్షవీక్షణములు
దరహాసచంద్రికాంకురములు దల లెత్తె, నుదితేందుబింబ మై యొప్పె మొగము
సమసమున్మగ్నవాసనకుంభివరకుంభయుగ్మ మై కుచకుంభయుగళి దోఁచెఁ
బ్రకటసుధాపూర్ణరత్నకుండిక యయ్యె, నరుణాభ మై మధురాధరంబు


గీ.

విశ్వమోహనలీల నావిర్భవించి, మదనజగదేకపూజ్యసామ్రాజ్యలక్ష్మి
సతి పయోనిధి యై యున్న శైశవంబు, మహితయౌవనమంధానమథిత మైన.

18


చ.

ఉరుతరవజ్రకర్కశతయుం గుధరోన్నతియుం గుచంబులన్
సరసిజసద్వికాసమును జంద్రవిలాసము నెమ్మొగంబునన్
గరికరలక్ష్మియుం గదళికాతరువిస్ఫురణంబు నూరులం
బొరయుట చిత్రమయ్యె నృపపుత్రిక కాయెలజవ్వనంబునన్.

19


ఉ.

కన్నులఁ జంచలత్వమును గ్రౌర్య మపాంగవిలోకనంబులం
జన్నులఁ గర్కశత్వముఁ గృశత్వముఁ గౌనున మందభావము
న్నెన్నెడ వక్రతం గురుల నెక్కొనఁ జేసియు నెట్టిచిత్రమో?
కన్నియజవ్వనంబు త్రిజగజ్జనసన్నుత మయ్యె నయ్యెడన్.

20


ఉ.

నీరజసూతి దీనితనునిర్మితకాలమునందు డించినం
గారుమెఱుంగు లయ్యె నునుఁగాంతికి గీసినయట్టిపైపొరల్
సౌరభహీనభాగములు సంపఁగిక్రొవ్విరు లయ్యె మార్దవ
శ్రీరహితాంశము ల్నవశిరీషము లై విలసించె ధారుణిన్.

21


ఉ.

కారుమెఱుంగు లయ్యె నునుఁగాంతికిఁ బైపొర గీసివేయ బం
గారువు లయ్యెఁ జేసె గలఁగందినపల్లటుత్రోవఁ జంపకా
కారము లయ్యెఁ గర్కశత గల్గినప ట్లటువ్రేయ దీని న
న్నీరజసూతి సేయునెడ నిక్కమ నాఁ దను వొప్పె నింతికిన్.

22


చ.

కమలము మోమునందు నొకకన్నులమాత్రముఁ బోల దన్నచో
గమలవిరోధియందు నొకగండతలంబును బోలఁ డన్నచోఁ
గమలముఁ జందురుండు సరిగా రని వేఱ గణింప నేటికిన్
రమణిదరస్మితేక్షణతరంగితమోహన మైనవక్త్రమున్.

23


చ.

తరళగతిద్యుతిచ్ఛటలఁ దమ్మికొలంకులు సేయుదిక్కులం
గురియుఁ గటాక్షపాతములఁ గోణముల న్మదనాస్త్రవర్షముం
గరువపుఁజూపులం గొలుపుఱుమెరుంగులు మింటసాటియే
తరుణి విలోకనమ్ములకుఁ దమ్ములు నమ్ములు గ్రొమ్మెఱంగులున్.

24


గీ.

మహితకటిచక్రవక్షోజమండలంబు, లప్పు డకృశసమృద్ధిచే నతిశయిల్ల
సంతతక్షామ మిం దెట్లు సంభవించె, నాఁగ మధ్యప్రదేశంబు నాతి కమరె.

25

గీ.

ఒత్తుకొనివచ్చుకటికుచోద్వృత్తిఁ జూచి, తరుణితనుమధ్య మెచటికో తలఁగి పోయె
నుండెనేనియుఁ గనఁబడకున్నె యహహ! యుద్ధతులమధ్యమునఁ బేద కుండఁ దరమె.

26


సీ.

అవనిపై నుండుఁగా కనఁటికంబము లెట్టు లనఁటికంబములపై నవని నిలచె?
గగనంబు గిరులపైఁ గనుపట్టుఁ గా కెట్లు గగనంబుపై గిరు ల్గాన నయ్యె?
జలధరంబులమీఁద శశియుండుఁ గా కెట్లు శశిమీఁద నున్నది జలధరంబు?
నాళంబుపైఁగాక నలినకోశం బెట్లు నలినకోశంబుపై నాళ మున్న?


గీ.

దనుచుఁ జూపఱులకు విస్మయంబు గొలుపుఁ, దొడలుఁ గటిమండలంబును నడుముఁ జన్ను
లాననముఁ గొప్పు నాభియు నారుఁ నలర, నలరె విమలాంగి నవయౌవనాగమమున.

27


ఉ.

త్రాసునఁ దూఁపవచ్చు ముఖతామరసంబును నిండుచందురు
న్వాసి యెఱుంగరాదు మగవాలికమీలకుఁ గన్నుదోయికి
న్వీసము దప్పు లేదు నెరివేనలికిం జిఱుదేఁటిదాంట్లకుం
దోసముగాదె యయ్యతినతోఁ బెఱతొయ్యలి నీడుసేసినన్.

28


చ.

ఘనపథమధ్యనిర్భరము గా నుదయించి నిరుద్ధలోకలో
చనముగ సన్నికృష్ణముఖచంద్రము లై శ్రితతారకంబు లై
యనయము కుంభసంభవమహత్త్వవిజేతలు నౌటఁ గన్యకా
స్తనములు వింధ్యముం దెగడి సాటికి హెచ్చినమేరుకూటముల్.

29


మ.

స్మరసమ్మోహనమంత్రదేవత మనోజప్రౌఢసామ్రాజ్యల
క్ష్మి రమానందనభాగ్యరేఖ మదనక్రీడావనీపుష్పముం
జరి కామావరకీర్తి మన్మథపునస్సంజీవినీవిద్య నా
ధరణీశోత్తమకన్య యొప్పె విలసత్తారుణ్యసంపన్న యై.

30


వ.

ఇ ట్లభినవతారుణ్యభువనైకగణ్య యగునిజకన్యం గనుంగొని జయభద్రుండు దీనికిం
దగువరుండు స్వయంవరంబునం గాని కలుగం డైనం గలహమూలం బగుట నది
గా దని యత్యంతనిపుణులు నంతరంగులు నగు చిత్రకారుల మమ్ము రహస్యంబుగా
నియోగించినం బనిపూని నేమును విచిత్రచిత్రకళాకౌశలవశంబున నిఖిలదేశాధిపతులం
గనుంగొని యుపకృతుల మగుచు నందఱయాకారంబులు యథారూపంబును రహస్యం
బుగాఁ బటంబులం జిత్రించికొని వచ్చి వచ్చి యక్కన్యాభాగ్యపరిపాకంబున నస్మదీ
యతపఃఫలోదయంబున నిన్ను నిట్లు సందర్శింపం గంటి మిటమీఁదివిశేషం బొకటి
విన నవధరింపుము.

31


గీ.

కన్య యది యెట్టు లాలోకకారి యట్ల
యీవు నతిలోకతేజోభిహితుఁడ వగుట

యుగళ మగుటకుఁ దగుట మీయొండొరులకుఁ
గాఁగల దిటుల యనియు నిక్కముగ నెఱుఁగ.

32

చిత్రకారులు మాంధాతకు విమలాంగి చిత్రపటముఁ జూపుట

క.

దేవ! భవత్తేజము మా, భావంబుల నిట్లు బయలుపఱచుట కిట ము
న్నేవలనఁ బరు లెఱుంగరు, గావున నిత్తలఁపు దైవికమున ఫల మగున్.

33


ఉ.

ఆసతిమేనుచెల్వుఁ గలయంత వచింపఁగ నేర మన్నచో
వ్రాసితి మన్న రాదె యపరాధము? పోలికమాత్ర చిత్రవి
వ్యాసము చేసినార మిదె యంచుఁ దదాకృతిలేఖనక్రమో
ద్భాసిపటంబు విప్పి నరపాలునిసన్నిధిఁ బెట్టి చూపినన్.

34


క.

నిను నెడఁ గరఁగినమనమున, యనమార్గంబున స్రవించి యవయవములలో
నెనయంగఁ జేరునట్లుగఁ, గనుఁగొనియె న్విభుఁడు గన్యకారూపంబున్.

35


సీ.

కచభారరుచులఁ జీఁకఁటిఁ గొన్నయపరాధ మాన నేందుద్యుతి నపనయించుఁ
గ్రూరకటాక్షము ల్గొన్నఁ బైకొనుమూర్ఛ నధరసుధారసం బాని తెలియుఁ
గుచశైలతటుల డిగ్గుచుఁ గొన్నకంపంబు ద్రివళిసోపాన మూఁది విడఁ గాంచు
మధ్యకార్శ్యముఁ జూడ మదిఁ గొన్న కరుణంబు కటిబింబసంపదఁ గాంచి మఱచు


గీ.

నూరుయుగలక్ష్మిఁ బాసి రా నొదవుతాప, మడఁచు బదపల్లవంబులయందుఁ బొరలి
రాజవరుదృష్టి కుంతలరాజకన్య, సుందరాకార ముత్కంఠఁ జూచునపుడు.

36


క.

చనుఁగవ పొడవై నాభిం, గనుఁగొన నిన్ను మయి మఱియుఁ గటి పొడ వగునం
గనవిషమాకృతిపథమున, జనపతి మదిఁ దొట్రుకొనుచుఁ జాల వరించెన్.

37


క.

వనితనతనాభిఁ దుంగ, స్తనములఁ గడచి చనలేవు జనపతిచూడ్కు
ల్మనమున నుయ్యో కొండో, యని యాందోళించువారి కగునే తెగువల్.

38


వ.

ఇ ట్లత్యంతాసక్తుఁ డయ్యును ధీరవాయకుం డగుటఁ జిత్తవృత్తి బయలు పడనీక యి
ట్లనియె.

39


గీ.

నిక్కముగ నిట్టిరూపంబు నెలఁత యొకతె, గలిగెనే బ్రహ్మనిపుణుఁ గాఁ దలఁపవలదె?
కలిగె లేకుండె నిట్టియాకార మిట్లు, వ్రాయ నేర్చినమీనేర్పు వలయుఁ బొగడ.

40


వ.

అని యుచితసత్కారంబులం బ్రీతులం జేసి వీడ్కొల్పిన వారును నిక్కార్యంబు సం
ఘటించి మఱికదా దేవరచేత మెచ్చులం బడయువార మని పంతంబు లాడుచు నిజ
దేశంబునకుం జనినయనంతరంబ.

41


క.

చిత్రకళావంతులచేఁ, జిత్రపటము చన్న నైనచిత్రము హరిణీ
నేత్రం జిత్రించినత, త్చిత్రపటం బయ్యె విభునిచిత్తం బంతన్.

42

మాంధాత విమలాంగిని వలచుట

సీ.

భద్రేభకుంభసంస్ఫాలనక్రీడలఁ, దన్వంగికుచములఁ దలఁచి తలఁచి
కరకృపాణీసముత్కంపనక్రీడలఁ, దరలాక్షికన్నులఁ దలఁచి తలఁచి
ధరవైరిమణిహారధారణక్రీడలః, దరుణిగుంతలములఁ దలఁచి తలఁచి
సజ్యకార్ముకలతాసంగ్రహక్రీడల, లలనబొమ్మలతీరుఁ దలఁచి తలఁచి


గీ.

రుచిరతరభద్రపీఠాధిరోహణములఁ, దామరసనేత్రికటిపెంపుఁ దలఁచి తలఁచి
యవనిపతి స్వపదార్థానుభవము లెల్లఁ, గన్యరూపానుభవముగాఁ గరఁగుచుండె.

43


వ.

ఇట్లు నిరంతరచింతాతిశయంబునఁ దదాయత్తచిత్తుం డగుచు నృపోత్తముం డిట్లని
వితర్కించె.

44


గీ.

చిత్రకారులరాకఁ జర్చింప నొక్క, దేవతామాయ గాదె యీత్రిజగదేక
సుందరాకృతిఁ జిత్రించి చూపు టెట్లు, చూచునంతన మఱి దగు లేచు టెట్లు.

45


వ.

అని తలంపుపెంపునం జిత్రితవిచిత్రాకారక్రమంబు సంస్మరించి.

46


సీ.

హరినీలములఁ జేసి యంధకారముఁ జేసి, మొలకతేఁటులఁ జేసి ముద్దుగుడిచి
మీనులఁ బుట్టించి మెఱుఁగులఁ బుట్టించి, శుక్తులఁ బుట్టించి స్రుక్కణంగి
యద్దము ల్నిర్మించి యమృతాంశు నిర్మించి, వనజము నిర్మించి వణఁకు దేఱి
గుచ్ఛము ల్సృజియించి కోకము ల్సృజియించి, కుంభము ల్సృజియించి కొంకువాసి


గీ.

ప్రోడయై మీఁద నిర్మింపఁబోలు నలువ, కన్యకామణికురులు కన్గవయు మొగముఁ
జన్నుదోయియు నట్లు గాకున్న నిట్టి, యనుపమానాంగములు సృష్టియందుఁ గలవె?

47


వ.

అని మఱియును.

48


సీ.

మెట్లకుఁ దర మిడ మెయికొంట యాయింతి, కుచములప్రతిఁ జూపఁ గోరు టెల్ల
ఖడ్గధారాపదగ్రహణంబు సేయుట, సుదతియా రుపమింపఁ జూచు టెల్ల
గగనారవిందంబుఁ గనుట యాసతిమధ్య, గతినాభితో సాటిఁ గాంచు టెల్ల
నంధకారము ద్రవ్వు టాయింతికుంతల, ముల సాటివెట్టంగఁ బూను టెల్లఁ


గీ.

జందమామకు గ్రుక్కిళా యిందువదన, వదనసామ్యంబు సేయంగ వాంఛసేఁత
పృథవికడ గాంచు టారామపిఱుఁదుతోడ, సదృశవస్తువు గను టన్నఁ జదురులెల్ల.

49


వ.

అని వెండియు నిజమనోగతానురాగం బుపలక్షించుకొని.

50


సీ.

బింబోష్ఠిముఖ మిందుబింబ మై యుండ నా, డెందంబునకు నేల కందు గలిగె?
ముగుదచన్నులు తమ్మిమొగ్గ లై యుండ నా, చిత్త మేగతిఁ బొందె మెత్తపాటు?
సతినితంబము రథచక్ర మై యుండ నా, భావంబునకు నెట్లు ప్రాణ మొదవె?
నబ్జాక్షిపెందొడ లనఁటులై యుండ నా, యుల్లంబు లైసార్వ మొందు టెట్లు?

గీ.

మగువజిగిమేను కుందనం బగుచు నుండఁ, గాఁకఁ గరఁగెడు నామనోగతు లి దెట్లు?
వనితయవయవములఁగల్గువస్తుగుణము, చూపఱులయందుఁ బొరయుట చోద్యమొక్కొ?

51


వ.

అని మఱియు రసాతిరేకంబున.

52


ఉ.

మౌనము మారుమాట ముఖమండల మెత్తఁగనియ్య కొల్ల కే
పై నిగుడించునూర్పుప్రసభాచరణంబులకుం బ్రతిక్రియ
ల్గా నొనరించుచున్న సతికన్యక నూతనసంగమంబునన్
బానుపుపై మదీయభుజపంజర మెన్నఁ డలంకరించునో?

53


చ.

తమకము నాఁగి ముచ్చటకుఁ దార్చి నెపంబున సోఁకి హస్తసం
గమమున కియ్యకొల్పుపులకంబులు మై నొదవించి వంచన
క్రమముల నొయ్యఁ బయ్యెదయుఁ గంపమున న్దొలఁగింపఁ బూన్కికిన్
సమకొని సీగ్గు నీవియును జార్చి యెద వృతిగూర్చు టెన్నఁడో?

54


చ.

స్థిరమతి నీకు మేము మును చెక్కుల వ్రాసినపత్రభాగము
ల్వరుస యురంబున న్గలిగి వచ్చెఁ గదే విపరీతవృత్తి మీ
సరసరసప్రసక్తి నని చాయలఁ బాఱఁగ నాఁగు నెచ్చెలిం
గరకమలాహతి న్నిలుపఁ గన్నియ నెన్నఁడు ప్రోడఁజేతునో!

55


క.

అరె మఱియుఁ బెక్కుకోర్కులు, బెనఁగొన నక్కన్యవలనఁ బ్రేముడివలన
న్మనుజపతి యంత నిపత, న్మనసిజకరశరధిసదృశమానసుఁ డగుచున్.

56


సీ.

దొరల విమర్దంబుఁ బొరయుతల్పముదక్కఁ, గెలన నిద్రాహాని తెలియనీక
పదలెడుభూషణావలి దక్క నితరుల, మేనిపై కార్శ్యంబు గాననీక
మొనయనియింద్రియంబులు దక్క నన్యులఁ, గ్రియలయం దరుచి లక్షింపనీక
తగవుమాలినకోర్కి దక్కఁ దక్కొరులకు, హ్రీపరిత్యాగంబు నెఱుఁగనీక


గీ.

మలయపవమానచలనము ల్గలిగి యైన, దవ్వులకు నిశ్చలంబైనతరువువోలె
మదనవికృతి క్రమాక్రమ్యమానుఁ డయ్యుఁ, బరుల కవికారుఁడై యుండెఁ బార్థివుండు.

57


వ.

ఇ ట్లనుదినప్రవర్ధమానమనోభవదశావిశేషంబులవలన నమ్మహీపాలశేఖరుం డేటి కెదు
రేగుచందంబున దుర్భరం బైనకాలంబుఁ గడుపుచుండె నటఁ జిత్రకారులు కృతార్థ
మతి నతిత్వరితగతి నిజదేశంబునకుం జని తమకొర కెదురుచూచుచున్న నేలికం బ్ర
హృష్టహృదయుం జేయుచు నుచితగతిం గాంచి యేకాంతంబునఁ దమతెచ్చినచిత్ర
పటంబులు నివేదించి జిత్రించిన వివిధదేశాధిపతులం గ్రమక్రమంబున వేర్వేఱఁ
జూపి యిట్లనిరి.

58


క.

దేవరయానతి నిఖిల, క్ష్మావరులన్ వ్రాసి యిట్లు సమ్ముఖమునకుం
దేవలనెఁ గాని పనిలే, దీవిస్మృతి మాకుఁ జూడ నిది యెట్లన్నన్.

59

కుంతలేశునెడఁ జిత్రకారులు మాంధాతగుణములు వర్ణించుట

మ.

అరవిందప్రతిమల్లఫుల్లనయనుం డాజానుబాహార్గళుం
డరతోత్తాలవిశాలవక్షుఁడు సమగ్రాకారలోకైకసుం
దరుఁ డుల్లోకవిచిత్రతేజుఁ డిల మాంధాతృక్షమామండలే
శ్వరుఁ డాతం డొకరాజమాత్రుఁ డటె సాక్షాద్విష్ణుఁ డూహించినన్.

60


క.

అతనిఁ గనుఁ గొన్నచూపుల, నితరమహీపతులు సృష్టి నెంతటితేజో
యులు లేవి సూర్యుముండటఁ, బ్రతిదీపము లట్ల యతఁడు ప్రభుమాత్రుండే?

61


క.

నీకన్య కతఁడు దగు నా, భూకాంతాగ్రణికి నీదుపుత్రికయ తగు
న్మాకుం దోఁచినమత మిది, టీకలు పదివేలు నేమిటికి నిప్పటికిన్.

62


క.

అతిమానుష మైనతద, ద్భుతతేజము వ్రాసి చూపఁ బోల దతనియా
కృతిమాత్ర మచటఁ జిత్రిం, చితి మిదె యని చూపఁ జూచి చిత్తం బలరన్.

63


వ.

కుంతలేంద్రుండును వారలు పలికినంతకు నిక్కం బగుటకు మెచ్చి పారితోషికం బొసంగి
యనిచినపిదప విమలాంగికిం బ్రియవయస్యయుఁ బ్రోడయు నగుపాలిక యనుశు
ద్ధాంతచారిణి రావించి నిజప్రారంభంబునుం జిత్రకారాభిప్రాయంబునుం దెలిపి తత్త
ద్దేశనగరనగనదీవిహారప్రదేశవిశేషంబులతోఁ గులగోత్రచరిత్రనామాంకంబులతో య
థారూపంబులతో నిందుం జిత్రింపనిరాకుమారుండు సర్వంసహాచక్రబునం గలుగం
డీనృపనందనసందోహంబు మదీయనందన డెందంబు గందళింపంజేసినయనురూపభూప
కుమారునిం దెలిసికొని రమ్మని యాజ్ఞాపించినం బనిపూని చని యక్కుమారికకు నా
సంతోషం బెఱింగించి యచ్చిత్రచిత్రపటంబు విప్పి చూపునపుడు.

64


ఉ.

పాలిక చూపఁగా నవనిపాలతనూభవ సూచె దేశత
చ్ఛాలనదీవనీనగరసత్కులనామయశస్సనాథులం
గౌళకళింగవంగకురుకాశకరూశవిదేహచోళపాం
చాలవనాయుసింధుముఖసర్వమహీవలయాధినాథులన్.

65

విమలాంగి మాంధాతం జిత్రపటమునఁ గని మోహించుట

గీ.

చూచి యెవ్వనిఁ గైకోక సుదతి యంతఁ, జూచె డెందం బెనసి యెత్తఁ జూడ్కి నాఁట
గుణవినిస్తంద్రు నుత్తరకోసలేంద్రు, నిరుపమాకారు యువనాశ్వనృపకుమారు.

66


శా.

ఆకంఠప్రణయప్రమత్తము లపూర్వాశ్చర్యనిష్యందము
ల్సాకూతాయతపాతము ల్సుఖవిశేషాంతర్ముహుర్ముగ్ధముల్
హ్రీకోణాంచలచంచలాలసవశప్రీతిప్రసాదోదయ
వ్యాకోచంబులు నైనవీక్షణముల న్వామాక్షి సూచెం బతిన్.

67

మ.

అనురాగాకృతికందకందళము భోగైకాంతసారంబు యౌ
వనసర్వస్వ మశేషవిభ్రమకళాస్వాంతంబు విశ్వైకమో
హనశృంగారరహస్య మంగజవిజృంభావాహనాగ్రక్షణం
బు నరేశాత్మజచూడ్కి గ్రోలె నపు డాభూపాలసౌందర్యమున్.

68


ఉ.

చిప్పిలుచెక్కుపై చెమటచిత్తడులం గరపల్లవంబులం
గప్పుచుఁ జన్నుగ్రేవఁ బులకంబులు పయ్యెద నొత్తి యోరఁగాఁ
ద్రిప్పినమోము వంచి జగతీపరుచిత్ర మపాంగదృష్టిచేఁ
దప్పక చూచి రాజసుత తానును జిత్తరు వయ్యె నత్తఱిన్.

69


వ.

ఇట్లు దర్పకదశాధ్యయనంబునకుఁ బ్రథమప్రణవం బైనయవలోకనమహోత్సవంబునం
దగినకన్నియ నెఱింగి యంత నిఱంగనియదియుంబోలెఁ బ్రియవయస్య సోపాలంభ
నంబుగా ని ట్లనియె.

70


ఉ.

ఒల్లమి నిట్లు మాఱుమొగ మొందియునుం దడ వేల సాల్వభూ
వల్లభుఁ జూడు వీఁడె గుణవంతుఁ డనాఁ దలవంచి నెచ్చెలిన్
హల్లకపాణిపాణిధృతహల్లకతొడితుఁ జేసెఁ గింపు సం
ధిల్లఁగ సిగ్గులేనగవు దేఱెడుకన్నులచే నదల్చుచున్.

71


వ.

అప్పు డప్పాలికయు బాలికఁ గని నవ్వుచు.

72


క.

కోపించె దేల యట్టిమ, హీపతిఁ బతిగా వరించు టే నెఱుఁగుదు నే
వాపుచ్చ కొరులమనసుల, లోపలితలఁ పెఱుఁగు టెల్ల లోకమునఁ జెలీ.

73


వ.

అని యుచిత సరససల్లాపంబులం గలపికొని.

74


గీ.

రూపమున నెల్లఁ ద్రిజగదారూఢలట్ల, బుద్ధియందును సశలైకపూజ్య నైతి
నెల్లరాజులలోన మే లేఱ్చి తగిన, వరునిఁ గోరితి వతిభాగ్యవతివి సఖియ.

75


వ.

అని యమ్మనోరథం బప్పు డమ్మహీపతికి విన్నవించిన నతండును జిత్రకారాభిప్రా
యంబునం జనతలంపునుం గన్యామనోరథంబు నొక్కటి యగుట దైవఘటనంబ కాఁ
దలంచి ప్రహృష్టహృదయుం డై తత్కార్యసంధానోన్ముఖుం డయ్యె నంత నిక్కడ.

76

విమలాంగి మన్మథావస్థల నొందుట

క.

నెచ్చెలి తనకుం జూపిన, యచ్చిత్రపటంబులోనియధిపతిరూపం
బచ్చొత్తినగతిఁ దోఁపఁగ, నచ్చెలువమనంబు సంతతాంతర్ముఖి యై.

77


సీ.

పూర్ణచంద్రునిఁ జూచి పూర్ణచంద్రునియందు, విపులనేత్రయుగంబు వెదకఁ జూచు
మణికవాటముఁ జూచి మణికవాటమునందు, తారహారంబులు దడవఁ జూచు

నునుఁగంబములఁ జూచి నునుగంబములయందుఁ, గంకణాంగదములు గానఁ జూచు
వికచాబ్జములఁ జూచి వికచాబ్జములయందు, శుభదోర్ధ్వరేఖలు చూడఁ జూచుఁ


గీ.

దరుణమృగలోలనేత్ర సంతతముఁ దనదు, చిత్తసింహాసనము నధిష్టించియున్న
యధిపమన్మథుభువనమోహనము లైన, యవయవంబులు చెలి గన్నయట్ల యైన.

78


చ.

చెలుల మొఱంగి యేకతమ చెన్నున హస్తములందుఁ దూలికా
ఫలకముల న్వహించి తనభావములోఁ బతిరూపు వ్రాయఁగాఁ
దలఁచి లతాంగి చిత్రముగఁ దా నవిచేష్టతఁ జిత్రరూప మై
నిలిచెఁ దదాకృతిస్మరణనిర్వృతిచే వివశాంతరంగ యై.

79


చ.

వదనము వ్రాసి తోన గరువంబునఁ జుంబనకేళి సల్పుచున్
హృదయము వ్రాసి తోన నిలు వేది కవుంగిటఁ జిక్కఁజేర్చుచుం
బదములు వ్రాసి తోన కరపద్మములం బ్రియ మార నొత్తుచు
న్సుదతి పతి న్లిఖించు మఱి చూడ నెఱుంగదు కోర్కి పెక్కువన్.

80


వ.

ఇట్లు తీవ్రంబు లగుకోర్కులత్రొక్కునం జిక్కువడి యక్కన్య తనలోన.

81


ఉ.

మారునిచేతిఘాత నభిమానమువోక సఖీజనంబుచే
నారడి గప్పిన న్వలపు లంగడి కెక్కక కోరినప్పుడే
కూరిమివల్లభుం గలసి కోర్కి ఫలించి సుఖించుకన్నియ
ల్భారఫునిష్ఠఁ బూని తొలుబాములనోముల నేమి నోఁచిరో?

82


ఉ.

వల్లభుపేరఁ జిత్తరువు వ్రాసినరూపముఁ జూచినంత నా
యుల్లము నీర మై కరఁగుచున్నది నిక్క మతండు వేడ్క రం
జిల్లఁ గవుంగిటం బిగియఁ జేర్చినయేని యురంబుపైఁ దనూ
వల్లియు నేను బెంజెమట పట్టఁగ బిట్టు గరంగి పోవనే.

83


క.

అని మఱియుఁ బెక్కుకోర్కులు, దనమదిఁ బైకొనఁగ వెలఁది దరళోర్ముల నాఁ
గినయట్ల యోర్చి చెలులం, గననీక వెలుంగుచుండెఁ గన్నియ యంతన్.

84


చ.

ఉదయమె కాని యస్తగతి నొందక తీవ్రగతి న్వెలుంగున
మ్మదనభుజప్రతాపరవి మండఁగ విప్పుడు మో డ్పెఱుంగమి
న్నిదురకుఁ బాసి యచ్చెలువనేత్రమహోత్పలము ల్జయించె నె
ల్లిదమున రాత్రు లెల్ల ముకుళించు విస్ఫురదంబుజంబులన్.

85


ఉ.

అంగన కౌను యౌవనసహాయమునం గయిచేసినట్ల నేఁ
డంగజుప్రాపుఁ గల్గి యఖిలాంగము లేన యలంకరింపఁగా
నంగములందు నేల యివి యంచుఁ గృశత్వ మహంకరించి తా
నంగదకంకణాదు లగునాభరణంబులఁ జార్చె నింతికిన్.

86

ఉ.

వారణరాజయానకును వారము గుంతలమధ్యవీథి సిం
దూరము దూర మయ్యె మగతుమ్మెదప్రోడలు గోడగించుఝం
కారము కార మయ్యెఁ జెలికత్తియలం బలికించువాక్యసం
భారము భార మయ్యె మదిఁ బర్విననూతనకామవిక్రియన్.

87


చ.

విరులు సరంబు లయ్యె చలివెన్నెల యొట్టినమంట యయ్యెనుం
గరువలి వజ్ర మయ్యెఁ జెలికత్తియ యొప్పని దయ్యె హస్తపం
జరమునఁ బూని పెంచుశుకశాబకము న్బగచాటు దయ్యె న
త్తరుణికిఁ బంచబాణుఁ డనుదైవము దాఁ బ్రతికూల మౌటచేన్.

88


చ.

పులకకదంబము ల్నినిచె ఫుల్లముఖాబ్జవిలాససంపద
ల్దొలఁగె మరాళికాగతులు దూరము లయ్యె శ్రమాంబుపూరము
ల్వెలి విరియంగఁ జొచ్చెఁ బురివిచ్చి నటింపఁగ నెమ్మిగోరిక
న్బొలఁతుకయందు మన్మథుఁడు పూర్ణముగా శరవృష్టిఁ జూపఁగన్.

89


తే.

తాపమును బాండిమయు నాఁగఁ దరుణిమేన
రెండును వెన్నెలయుఁ గూడి రెండు నుండి
భావిలజ్ఞావినాశసంప్రాప్తికొఱకొ
ధైర్యహానికినో మహోత్పాత మయ్యె.

90


వ.

ఇ ట్లంతకంతకుఁ బెరుగువిరహపరితాపంబు నిలువరింపం గొలంది గాక నెచ్చెలులం
గనుమెఱంగి యొక్కనాఁ డొక్కతెయు మందిరారామంబునకుం జని.

91


సీ.

అలరు ఱేకులయలుఁగులు మీఁదఁ గురియుచోఁ, చేలకొంగుముసుంగు చేసి చేసి
చిల్కపల్కులు గాఁడి జీవంబు లెడలుచో, నంగుళంబుల వీను లాని యాని
యడుగులఁ బుప్పొడు లంటి చుఱ్ఱడుచుచో, నుస్సురు మని వెచ్చ నూర్చి యూర్చి
కమ్మదెమ్మెరలుపైఁ గలయంగ సోఁకుచో, వల్లరియునుబోలె వణఁకి వణఁకి


తే

సాహసమె తోడు గాఁగఁ నచ్చపలనయన, మందిరారామవాటికమధ్యవీథిఁ
దఱిసి చని యొక్క పుష్పలతాగృహమున, ధవళకరకాంతశయ్యపైఁ దనువు వైచి.

92


ఉ.

లేనిప్రియుండుఁ గన్గొనఁగ లేనివిలాపము విన్నవింపఁ గా
లేనిప్రియంబుఁ గైకొనఁగ లేనికడంకలుఁ గౌఁగిలింపఁగా
లేని ముదంబుఁ జేకొనఁగ లేనిరతు ల్మదిఁ బట్టుకొల్పఁగా
లేనిసుఖంబుఁ దాల్మిఁ గబళింపఁగ సింధురయాన దీన యై.

93


వ.

ఉండునంత నిచ్చటం బ్రియవయస్యం గానమిం జేసి చెలికత్తియ లెత్తినతత్తఱం
బున నత్తలోదరిపదారవిందంబులచొప్పునం జనుదెంచి యుద్యాననికుంజంబు డాసి
పరికించునప్పుడు.

94

ఉ.

తూలినమోముచెల్వుఁ బయిదూఁకొనుఘర్మజలంబువెల్లువం
దేలినమేను నెమ్మనముత్రిక్కులఁ జిక్కులఁ జేసి వెల్వడం
దోలినతాల్మి వల్లభుఁడు దోఁచినరిత్తకు రిత్తకౌఁగిటన్
పోలినచందముం గలయఁ జూచి వయస్యలు భీతచిత్త లై.

95


క.

తత్తఱిలువారి నందఱ, నత్తఱి మఱుపడఁగ నిలిపి యప్పాలిక దా
నత్తన్విఁ దెలిపి కౌఁగిట, నొత్తి కురు ల్నిమిరి యుల్ల మూఱడిలంగన్.

96


ఉ.

మచ్చిక గల్గునెచ్చెలుల మమ్ము మొఱంగి లతాంగి! యొంటి నీ
విచ్చటి కెట్లు వచ్చితివి! యీవనవాటిక దాదిప్రక్కయే?
పచ్చనివింటిజోదు తగుబందుగుఁడే? మఱి చిల్క లేమి నీ
నచ్చినతోడఁబుట్టుగులె? నాయము దప్పుఁ గ దమ్మ! యియ్యెడన్.

97


చ.

హిమకరుఁ డంకకాఁడు మధు వెప్పుడు జాతివిరోధి రాజకీ
రము ప్రతిపక్షి తెమ్మెరలు ప్రాణముదాయలు కాచియుండుఁ జూ
తము గడుఁజూడఁ జాలఁ డలదర్పకుఁ డింత యెఱింగియుం జెలీ!
మము సఖులం దొఱంగి రిపుమధ్యమ మీవన మొంటిఁ జొత్తురే.

98


చ.

మనమున నీవు గోరునృపమన్మథుతో నినుఁ బెండ్లి సేయ నీ
జనకుఁడు సంభ్రమించె నదె సమ్మద మొందుదు గాక బేలవై
వనరుహపత్రనేత్ర! యిటు నాఁగె వదల్చిన కోర్కులన్ మనో
జున కెర యచ్చి డిల్లపడఁ జూచినఁ జూచినవారు మెత్తురే?

99


వ.

అని సి గ్గెక్కించి పలికిన నెచ్చెలికంఠంబు కరంబులం బెనంచి తనవాడినవదనపద్మంబు
నోరగాఁ దదీయకుచమధ్యంబునం జిక్కం జేర్చి నిడుదకనుఁగొలంకులఁ గ్రొవ్వెఁడి
బాష్పకణపరంపర లొలుక నిట్టూర్పు నిగిడించి.

100


క.

మగబొమ్మఁ జూడ నొల్లని, ముగుదతనం బెల్ల మూలముట్టుగ నిటు పె
ల్లగిలించుకొంటి నేనే, తగనిమనోరథమువలనఁ దప్పదు చెలియా!

101


క.

చెలు లెఱిఁగిన నాడెద రను, తలఁ కది ప్రావడియె నీవుడు దర్పకశరబా
ధలవలన నాకుఁ బ్రాణము, నిలుపుట గండ మయినయది నిక్కము సకియా!

102


ఉ.

ఏయఁ దొణంగెఁ గంతుఁ డెడ యీక శరంబుల వేఁడివెన్నెలల్
గాయఁ దొణంగెఁ జందురుఁడు గర్ణపుటంబులు వీలఁ గోయిలల్
గూయఁ దొణంగె వల్లభులఁ గోరెడుకన్నెల కెల్ల నిట్టిదే
నాయమొ? లేక దైవ మిది నాకు ఘటించెనొ? నేఁడు నెచ్చెలీ!

103

క.

కర మర్థి వేన పెనుపం, బెరిగినశుక మోట లేక ప్రేలుచు హృదయం
బెరియింపఁ దొణఁగె నింకం, బరభృతములు చెప్ప నేల పంకజవదనా!

104


చ.

వలపులఱేనిచేతివలవంతల కోర్వక చల్లగాలిపై
నొలయ నెదిర్చి యే శుకపికోక్తులకుం జేవియొగ్గి యేని మొ
క్కలమున మోకమావిపయిఁ గన్నిడి యేఁ దనువుఁ దొఱంగఁ గాఁ
జెలుల మొఱంగి యొక్కతియ సేరితి నీవనమధ్యకుంజమున్.

105


క.

చెప్పితిఁ దలంపు నీకుం, దప్పక యిది యెట్లు సేయు దాన న్వినుమో
యప్ప! రహస్యం బొక్కటి, యొప్పగుఁ గా కుండు నింక నోడఁగ నేలా!

106


ఉ.

సత్తుగ నోఁచ నెట్లుఁ బతిసంగతికిం బ్రతిరూప మేని నా
చిత్తము పూనికం గుఱుచచేసినపోలముతోడి నన్ బ్రియో
ద్వృత్తి విశాలవక్షమునఁ దేఱెడునట్లుగ వ్రాసి చూపి నా
యుత్తలపాటు మాన్పు మది నూఱడి వెన్నెలచిచ్చు చొచ్చెదన్.

107


వ.

అని సప్తమం బైనయవస్థాంతరంబు దేటపడం బలికిన నులికిపడి పాలికయు నిబ్బాలిక
మనఃపరిపాకంబుఁ బరికించినం గార్యంబుపరువంబు దప్పిన యది యైన నిరంతరం
బగుకంటె నిప్పటికిం గొంత యూఱడిలం బలికి తెలుపు టుచితంబుగా కేమి యని
లేనిబింకంబు దెచ్చుకొని.

108


మ.

అలరుందూపుల మూలపా ల్పఱిచి సొంపౌనిక్షుచాపంబునం
గలపెం పెల్ల దృణీకరించి మకరాంకం బవ్వలం ద్రోచి య
చ్చల మేపారఁగఁ జిన్నిబాలకులచేఁ జప్పట్లు వెట్టింతు న
వ్వలఱేనిం జెలి! యొక్కపోటుదొర గా వాలూఁది చింతింపకే.

109


సీ.

అహికులాధిపు వ్రాసి యంత్రించి దక్షిణ, గంధవాహునిరాక గట్టువఱకు
రాహుపూజాభిచారవిధాన మొనరించి, శశిబిట్టబిరుగుడు చంపి వైతు
నలు వైన శ్రీరామనామమంత్రంబుచేఁ, గలకంఠతతుల వాకట్టి విడుతు
సంపంగి నౌషధసంప్రయోగము చూపి, మొకరితుమ్మెదపిండు మూర్ఛవుత్తు


గీ.

భ్రాంతభూరుహముల గల్గుపండ్లు మిలిచి, త్రుళ్లుచిలుకలనాల్కల ముండ్లు విఱుతుఁ
బొలఁతి! నాయంతనెచ్చెలిప్రోడ గలుగ, నించువిలుతునివగకు నీకేల తలఁక?

110


తే.

డెందమునయందు వ్రీడ నాటింపవలదె? యఱితి హారంబు నులిగొన్న దకట! మేలె?
యొంటి నిల నేల! యిచటరా యుత్సలాక్షి! ప్రోదిచూతంబునకు నీరు వోయవలదె?

111


వ.

అనిన నప్పలుకులయెడ ననాదరంబు తేటపడ వెడనవ్వు నవ్వి.

112

ఉ.

ప్రోడవు గాన నీ పలుకు పోలదు గా దనరాదు గాక యీ
వీడసితాపవేదనల వేఁగెడుచెన్నటిమేనఁ బ్రాణముల్
గూడి వసింప నోర్వ విదిగో చనుచున్నవి యేల వ్రీడయుం
గ్రీడయు నాకు హారమును గీరముఁ జూతము గీతముం జెలీ!

113


వ.

 అనుటయు నక్కన్నియమేనిసంతాపాతిశయంబు పరికించి యలంతులం బోకుండుట
యెఱింగి కొంత యుపశమంబు సేయకున్నఁ బ్రమాదం బగు నని నెచ్చెలులం బిలిచి
యచ్చెలువ వారునుం దానును శిశిరోపచారంబులు సేయ సమకట్టి యప్పుడు.

114

చెలియలు విమలాంగికి శిశిరోపచారములఁ జేయుట

ఉ.

ఈరపుమోకమావిఁ గమియిక్కువ గొజ్జెఁగలందు జాఱుప
న్నీరులయేఁట నయ్యనఁటినిట్టలపైఁ బొరలూడి రాలుక
ర్పూరపుదీవి చెంగలువపువ్వులు గప్పినచప్పరంబులో
సారపుఁదమ్మిపుప్పొడులశయ్యకుఁ గన్నియఁ దెచ్చి నెచ్చెలుల్.

115


వ.

హారపటీరకర్పూరపన్నీరపల్లవహల్లకాదశిశిరద్రవ్యంబులు గొని వచ్చి విరహాదిదైవ
తం బగుభావభవునాకారంబు ప్రతిష్ఠించి యారాధించి యతని నుద్దేశించి.

116


ఉ.

గిల్లియ గోరఁ దీర్పుపనికి న్మఱి గొడ్డలి యెల్లకే కదా!
బల్లిద మైనసాధనముఁ బట్టక మన్మథ! నీవు లోకముం
దెల్లమిగా జయించితివి తియ్యనివింటను గమ్మఁదూపులం
జల్లనిమంత్రిచే శ్రుతిరసాయన మయ్యెడు తేంట్లయార్పులన్.

117


సీ.

నీవిక్రమ క్రీడ నిజహృదయంగమం, బై మెచ్చు శ్రీధరుం డనుఁగుఁతండ్రి
నీయాజ్ఞ కొం డన నేరక ముద్రిత, వదనుఁ డై వర్తించువాగ్వరుండు
నీతూపు కోర్వక నిటలాక్షుఁ డుమతనూ, ఫలకంబుచాటునఁ బాయఁ డెపుడు
నీబిరుదోక్తిచిహ్నితజయజంగమ, స్తంభ మై యున్నాఁడు జంభవైరి


గీ.

యింకఁ దక్కినబడుగుల నెన్న నేల? యిట్టినీ విట్లు పసిబాల నేఁచు టెట్లు?
పర్వతం బెత్తు కేలన బంతి యెత్తి, కడిమి నెఱుపంగఁ జూచితే కాయజన్మ!

118


వ.

అని మఱియును.

119


సీ.

ముద్దియయెడఁ గల్గుమోమోట మఱచితే, కాణించె దేల? రాకాశశాంక!
మగువ నీకిచ్చినమాటప ట్టెఱుఁగవే, యించుక కృప సేయవేల? చిలుక!
కోమలాంగికి నఱ్ఱుఁగుత్తిక వై యుండి, కలకంఠమా! కనికరము వలదె?
చెలిమోముఁదమ్మితావులఁ గ్రోలుచుండియు, గుడిచినింటికిఁ గీడుఁ గోరకు మలి!


గీ.

కాల మెల్ల పగలు గా వచ్చింది మీకుఁ, గొమ్మ నేఁచఁ నగదు కోకయుగమ!
యకట! సతికి నంతరంగ మై యుండియు, మలయకయ్య! నీవు మలయపనన!

120

వ.

అని సపరివారంబు గా మదనదేవతాప్రార్థనం బొనరించి.

121


ఉ.

పత్రము పుష్పమున్ ఫలము భక్తి నొసంగెడువార మింతె యీ
మాత్రమునం బ్రసన్ను లయి మానినిఁ గన్గొనుఁ డయ్య! మీకృపా
పాత్రము గాఁగ నంచుఁ దగుభంగిఁ బికంబులఁ దేంట్లఁ జిల్కలం
బత్రము పుష్పము న్ఫల ముపాయన మిచ్చి భజించి యచ్చెలుల్.

122


సీ.

స్వర్ణకుంభములకు వర్ణలేపనముగఁ, జన్నులఁ గుంకుమం బలఁది యలఁది
వెడవిల్తునలుఁగులు వొడయుట గాఁ గన్ను, లెడవక పన్నీటఁ దుడిచి తుడిచి
లేఁతతుమ్మెదలకు మేతఁగా విరిదమ్మి, పుప్పొడిఁ గురులపైఁ బోసి పోసి
యనుఁగుఁజుట్టములతో నాలింగనంబు గాఁ, బదకరంబులఁ జిగు ళ్లదిమి యదిమి


గీ.

కప్పురపుధూళి మేనిపైఁ గుప్పి కుప్పి, విపులకదళీదళంబుల వీచి వీచి
విరహపరితాపవతి యైనవెలది కపుడు, చెలులు శిశిరోపచారము ల్సేయఁ జేయ.

123


ఉ.

ధాతుపటంబులం బొగసి డట్టపుఁబుప్పొడి రాఁజి చందన
వ్రాతముచేతఁ గాల్కొని ప్రవాళముఖంబుల వీవవీవ ను
ద్భూతమహార్చులం బెరిగి తోరపుఁగొజ్జెఁగ నీటిపేరిపె
న్నేతఁ బ్రతీప్త మయ్యెఁ దరుణీమణిపై విరహాగ్ని యెంతయున్.

124


మ.

పటకి న్నార్చినలీలఁ జందనము పైఁ బైఁ బూయ నంగారక
చ్ఛటలం గాఁచుతెఱంగునం జిగురు సెజ్జం బొర్లగా నప్పట
ప్పటికిం జేరఁగ నిచ్చిన ట్లొడలిపైఁ బన్నీరు చల్లంగ ను
త్కట మయ్యెం బెనుఁగాఁక బంగరుసలాకం బోలునబ్బాలకున్.

125


వ.

ఇట్లు విరహానలం బగ్గలించుటకు బెగ్గిలి నెచ్చెలులు శిశిరోపచారంబులు చాలించి
చంద్రమందానిలకందర్పాదులం బ్రార్ధించు టుడిగి వారిపయిం గినుక వొడమి.

126


ఉ.

పైకొని వచ్చె దేల? నినుఁ బాము దినం జలిగాలి! ప్రార్థనం
గైకొనవేల? చంద్ర! నినుగా మడువన్ మెలఁపేది ప్రేలెదో
కోకిల! యేటి కిట్లు? వినుఁ గొర్తఁబడం దరలాక్షి సేయునీ
పాకము దప్ప వేల? నిను భస్మము గా వలరాజ! యిత్తఱిన్.

127


తే.

తలఁప దోషాకరుం డఁటే తగినప్రాపు, సహచరుఁడు జాతిమాలినచైత్రుఁ డట్టె
యెప్పుడును నీవు నీయొడ లెఱుఁగ వింక, మదన! మఱి యేమి చెప్ప నీమధుపగుణము.

128


వ.

అనునంత నుదయగిరిశృంగాటకంబునం దుహినకిరణకిరణోదయసూచకం బగుచు నునుఁ
గెంపుజగజంపుగొనం గనుపట్టిన బిట్టులికి యబ్బాలిక పాలికకరంబు కరంబున నప్ప
ళించి యీరెలుంగున.

129

ఉ.

కూయఁగ నిమ్ము కోయిలలఁ గోపము దీరఁగ బువ్వుఁ దూపు లి
ట్టేయఁగ నిమ్ము మన్మథుని నీయెడ దూఱఁగ నీకు నేటికిన్?
మ్రోయఁగ నిమ్ము తుమ్మెదలఁ గ్రూరత మై నను నేఁచు బెల్లఁ దా
రీయుదయించువెన్నెలపయిం బడునంతకుఁ గాదె కోమలీ!

130


క.

చిచ్చునకు గాడ్పు దోడై, వచ్చినగతి మరుని కబ్జవైరియుఁ దో డై
వచ్చె నదె యాస వల దిఁక, మచ్చిక దలపోసి నన్ను మది మఱవకుమీ.

131


వ.

అని యఖండపాండురప్రభాడంబరంబున నంబరంబుఁ గబళించుచు శుభ్రకరుం డభ్యు
దయవిభ్రమంబు చూపిన.

132


చ.

పొడిచిన చంద్రుఁ జూచి నృపపుంగవ! వచ్చితె? యంచు లేమపైఁ
గడువడిఁ గేలుసాఁచి బిగికౌఁగిటి కందక యున్న పూనిక
ల్పడలి విషణ్ణ యై మరల శయ్యపయిం బడి వెచ్చనూర్చున
ప్పడఁతి మనోజతీవ్రశరబాధలఁ జిత్తగతుల్ భ్రమించినన్.

133


వ.

ఇట్లు చిత్తవిభ్రమణరూపం బైనదశాంతరంబు నొంది వెండియం శశిమండలంబుపయిం
గన్నిడి.

134


ఉ.

నిప్పులకుప్ప మింట నదె నెచ్చెలి కా దది చంద్రబింబమో
యప్ప! యదేల మీఁదఁ బొగ యంగన! కా దది పైకళంకపుం
గప్పు తనింపఁజేయు నఁటె కల్వలఱేఁ డతఁ డేల సేయు నీ
ముప్పిరిగొన్నతాప మది మోహము నొందకు వే తలోదరీ!


వ.

అని సఖీప్రయత్నంబునం జంద్రుండ కా నెఱింగి నిజవిరహప్రవర్గ్యవహ్నికిం
బయఃప్రపూరం బైనచంద్రికాసారంబు దుస్సహం బగుటయుఁ గటకటం బడి
యుడురాజు నుపలక్షించి.

136


తే.

ఉవిద! వీఁడు సుధాంశుఁ డై యుండి తాప, మెట్లు సేయు వియోగికి నట్లు దలఁప
జలధి జన్మించునపుడె లక్ష్మంబుపేర, నడుమ హాలాహలముఁ దాల్చినాఁడు గాక.

137


తే.

పథికసంహారనిజపాపఫలమువలన, దినదినక్షయమునఁ గడతేఱి పోయి
విరహిజనపాపఫలమున వీఁడు మరల, ననుదినంబున కభ్యుదయంబుఁ బొందు.

138


తే.

హాలహలమునకంటె నీయమృతకరుఁడు
దుస్సహుం డనుదృఢబుద్ధి దోఁచె నాకు
మృడుఁడు హాలాహలము దక్క మింగెఁ గాని
వీని మ్రింగియు రాహువు వెడలఁ గ్రాయు.

139


క.

నిజ మెఱుఁగ లేదు లోకము, నిజగురుతల్పగుని యామినీపతి వీనిన్
ద్విజరా జనుచును బేర్కొను, గజగామిని నేతిబీఱకాయంబోలెన్.

140

సీ.

పు ట్టండ్రు గొందఱు పుట్టయే మఱి వృద్ధిఁ, బొందకుండఁగ హాని పుట్టవలదె?
వట మండ్రు గొందఱు వట మేని యూడలు, వాఱిమండల మెల్లఁ బ్రబలవలదె?
మృగ మండ్రు గొందఱం మృగమే నెదుక నీక, మృదుకరాంకురములు మేయవలదె?
శశ మండ్రు గొందఱు శశ మేని దేవతా, పథకుల కిరవు మార్పంగవలదె?


గీ.

వీనిలో నొక్క టెద్దియే నైన నంక, ముండియును జెడకున్నవాఁ డువిద! వీఁడు
ధర్మపరు హేతువునఁ గీడు దాఁకుఁ గాని, పాపపరుఁ దాఁక దనియెడుపలుకు నిజము.

141


ఆ.

అనుచు నంతలోన నతిసాంద్రచంద్రికా, స్పర్శనమునఁ దనువు పరవశముగ
నున్న శిశిరవిధుల నొకభంగి నబ్బాలఁ, దెలుపుచెలులఁ బ్రోడచెలువ చూచి.

142


తే.

చాలు మనసేయుశిశిరోపచారనిధులు, మెలఁత కంగజదశలు తొమ్మిదియు నిండె
నింకఁ బదియవదశఁ బోవనీక వేగ, మగనితోఁ గూర్చుటయ చల్వమందు సతికి.

143


వ.

అని పలికి యక్కన్య నంతఃపురంబునకుం గొని వచ్చి యప్పు డంతయును మహీకాం '
తురకు విన్నవించినం జంచలస్వాతుం డై యతండును శీఘ్రంబ వరునిఁ గూర్చునుపా
యంబు చింతించుచున్నసమయంబున.

144

మాంధాత కుంతలేశునొద్దకు దూతం బుత్తెంచుట

సీ.

ఆగతిఁ జిత్రస్వయంవరంబునఁ దన్నఁ, గుంతలేశ్వరపుత్రి కోరు టెల్ల
జారులవలన నిశ్చయముగ విని హర్ష, మెసఁగ మాంధాతృమహీశుఁ డనుప
దూత మోసలనుండి ప్రీతిమైఁ దనరాక, దౌవారికునిచేతఁ దనకుఁ జెప్పి
పంపిన విని జయభద్రుండు సాద్భుత, ప్రమదుఁ డై తోతేరఁ బనుప వచ్చి


గీ.

యుచితగతిఁ గాంచి సత్క్రియారచనఁ బొంది, చేరి యర్హాసనమున నాసీనుఁ డగుచుఁ
గుశలసంప్రశ్ముఖసుఖగోష్ఠిఁ జరపి, యాగమనకార్య మెఱిఁగించ నాత్మఁ గోరి.

145


మ.

స్వగతక్షోణికి మేరకంబములు ప్రాక్శైలంబు నస్తాద్రియుం
జగతీనాయకు లాత్మజంగమజయస్తంభంబు లింద్రాదిదే
వగణాస్యంబులు నైజసద్గుణలతావ్యాప్తోచితోపఘ్నముల్
తగదే! సన్నుతి సేయ నెవ్వరికి మాంధాతృక్షమావల్లభున్.

146


తే.

అమ్మహాత్ముండు నీయల్లుఁ డగుటఁ గోరె, నెంత భాగ్యైకశాలివో? కుంతలేశ!
యనుడు మది వెల్లివిరిసినహర్షజలధి, లహరి యై వక్త్రమున సముల్లసన మెసఁగ.

147


వ.

మొదలఁ జేసిన చిత్రస్వయంవరప్రయత్నంబును వెనుకటిచిత్రకారోక్తియుఁ బిదప
నైవకన్యామనోరథంబును దురియం బైనవిచారవిశేషంబును సవిస్తరంబుగా నెఱింగిం
చి యాశ్చర్యకథనం బైనయీయవిలంబఘటనంబు దైవకృత్యం బగుటఁ గృతార్థుండ
నైతిం గన్యామనోరథపరిపాకంబు పరికించినం దడయుట దగదు 'శుభస్య శీఘ్ర' మ్మను

నయంబ యవలంబనీయం బని యప్పుడు మౌహూర్తికుల రావించి చేరువన లగ్నంబు
నిశ్చయించి దూతపురుషు నుచితసత్కృతులఁ బ్రీతునిం గావించి నిజపురోహిత
సహితంబుగా నతని నయోధ్య కనిపి శుభలేఖాప్రేరణంబున నిజనిఖిలబంధుహితలో
కంబు రావించి పరిణయోచితసమస్తవస్తు పత్సంపాదనంబునకుం దగినయధికారుల
నియమించి పురంబుఁ గైసేయం బనిచి నిజరాష్ట్రంబున నయోధ్యానగరమార్గంబున
విడుదు లాయితంబు సేయించి జామాతృసమాగమప్రతీక్షాపరుం డై యుండునంత
గతిపయదినాంతరంబున.

148

మాంధాత విమలాంగిం బెండ్లాడఁ గుంతలేశుపురి కేతెంచుట

శా.

సప్తద్వీపధరాధవు ల్నిజచమూ సంయుక్తులై శ్రీకరుల్
సప్తాశ్వాన్వయజు ల్భజింపఁ ద్రిదశాశ్చర్యప్రదం బై జగ
ద్వ్యాప్తాశ్చర్య మెలర్ప వచ్చెఁ దగ మాంధాతృక్షమాభర్త సం
ప్రాప్రాభీష్టమనోరథం బగుటకున్ భావంబునం బొంగుచున్.

149


వ.

ఇ ట్లరుగుదెంచి నిజబంధుసామంతసేనాసమేతుం డై దూరంబున గుంతలేంద్రుం డెదు
రుకొని తోతేర మంగళాలంకారసంకులం బైనతేదీయపురంబుం బ్రవేశించి రాజమా
ర్గంబునం జనునప్పుడు.

150

పౌరకాంతలు రాజమార్గమున మాంధాతం గనుంగొనుట

సీ.

క్రొవ్వెద యూఁదినకుడిచేతికరమూల, కాంతులు కేయూరకాంతిఁ బొడువఁ
బెఱకేలి కందనిబిగిగుబ్బచనుఁగ్రేవ, నిగ్గుపయ్యెదకు వన్నియ యొసంగఁ
దఱుచుటూర్పులతావి కెఱఁగుముందటితేంట్ల, దివిరెడునునుఁజూడ్కి తెలుపు సేయఁ
గడుఁబేద యగుకౌను గమనవేగంబున, మెలఁ పేది జవజవ జలదరింపఁ


గీ.

గుఱుచనెట్టున నందియల్ చరచి మెరయఁ, బిఱుఁదువ్రేఁకంబుచే నీవి బిగువు సడలఁ
జూపఱుల కెల్లఁ దనుఁ గనుచూఱ యొసగిఁ, వేగ పరతెంచి చూచె భూవిభు నొకర్తు.

151


చ.

తరుణి యొకర్తు కంఠమునఁ దాల్పఁగఁ దావస మేది హారముల్
కరములయందుఁ బూని పతిఁ గన్గొన వచ్చె రయంబుమై స్వయం
వరమునఁ దాన మున్ను నృపవర్యు వరింపఁగఁ గోరి మంగళా
విరళమధూకదామకము వేడుకఁ జేకొని వచ్చెనో? యనన్.

152


చ.

నెఱఁకులు గాఁడ దన్మరుఁడు నిర్దయుఁ డేసినతూఁపు లేఱి య
త్తెఱఁ గెఱిఁగింప భూపతికిఁ దెచ్చుగతి న్వస దోఁప విచ్చుచోఁ
దురుమ నెఱుంగ నొక్కసతి తోడన తెచ్చినఁ బొల్చెదో యిటన్
గిఱికొనుపాణిపద్మరుచిఁ గెంపు వహించినకమ్మగ్రొవ్విరుల్.

153

తే.

తమకమునఁ బాదలాక్ష యంగమున నలఁది, నృపతిఁ గన్గొనవచ్చెఁ గన్నియ యొకర్తు
విటులనెత్తుట జొత్తిల్లి వెఱపుఁగఱపు, మకరకేతనుఖడ్గపుత్రికయుఁబోలె.

154


క.

ఇల ఱేనిఁ జూడఁ జనుతమి, లలన యొకతె తడబడినయలంకారముతో
వలయువడి గూడనిపద, స్ఖలనంబును గలిగి కుకవికవితయుఁ బోలెన్.

155


ఉ.

ఆరనిచెక్కులేఁజెమట లప్పటియుం బొడమంగ నిక్కు చొ
ప్పారనిమేని ముత్పులక లగ్గల మై యుదయింప మ్రానుపా
టారనిచూడ్కి వెండియును నన్నున సోల రతాంతతాంతి య
ల్లారక మున్న వచ్చి యొకయంగన చూచె నరేంద్రచంద్రునిన్.

156


ఉ.

భారపునిండువెక్కసపుఁబ్రాయపుజవ్వని యోర్తు మందిర
ద్వారమునందు నిల్చి నృపవంశమనోభవుచిత్తమోహనా
కారముఁ జూడ నంగజవికారవశంబున నీవి జారినం
గూరినసిగ్గుమైఁ దలుపు గొబ్బున మాటుగఁ జేసె నాభికిన్.

157


ఉ.

అంబుజనేత్ర యోర్తు వసుధాధిపుఁ గన్గొనుచో రసాతిరే
కంబునఁ జేత మున్ను తమకంబునఁ దెచ్చినదర్పణంబునం
బింబిత మైనరాజుప్రతిబింబము చెక్కుల నొక్కి గ్రక్కునం
జుంబన మాచరించి చెలిఁ జూచి ముఖాబ్జము వంచె సిగ్గునన్.

158


తే.

మానలేక నిగిడ్చిరి మఱియు మఱియు, సతులు దృగ్జాలములు రాజచంద్రుమీఁద
నతనిలావణ్యజలధితో నణఁగియున్న, తమి మనంబున శోధింపఁ దలఁచిపోలె.

159


క.

పెల్లుకొనఁ గురిసి రప్పుడు, దల్లుగఁ దమచూడ్కులకును దల మిచ్చుచు భూ
వల్లభుపైఁ బురభామలు, కొల్లలు గా లాజమిళితకుసుమాంజలులన్.

160


వ.

ఇట్లు పౌరవిలాసినీదృక్చకోరచంద్రుం డగుచుఁ జనుదెంచిన రాజచంద్రుం గుంతలేశ్వ
రుం డాత్మనిర్దిష్టంబుకు మంగళాలంకృతంబు నగువిడిది విడియించి యితరసామంత
మంత్రిపరివారచమూవర్గంబులఁ దగిననెలవుల విడియించి యుచితోపచారంబులం
బ్రీతులం గావించి వివాహమంటపంబునకుం దగినవస్తువు లొడఁగూర్చుటకుఁ దగు
వారి నాదేశించి యనంతరంబ పతంగుం డపరదిగంగనాసంగతుం డగుచు వచ్చినం గు
మారిక నలంకరింప నియమించినం బనిపూని పాలికాదిసఖీజనంబు లంతిపురంబున.

161

సఖీజనంబు విమలాంగి నలంకరించుట

,
తే.

విరహపరితాపశాంతికై వెలఁది మున్ను, చలువలొనరించినట్టి తులనె నీకుఁ
బరిణయాలంక్రియలు సేయుభాగ్య మబ్బెఁ, జెలియ! ము న్నేమినోము నోఁచితిమొ మేము.

162


వ.

అని వెండియు.

163

సీ.

అంగసంభవుఁ డింక నబ్జాక్షి! నీకు విధేయుఁడై కనుసన్నఁ దిరుగుఁ గాక
నఖపదచ్ఛలమున సఖి! యాకళానిధి, వచ్చి నీశరణంబుఁ జొచ్చుఁ గాక
చెమట లార్చుచు సేవ చేసి సుందరి! మంద, పవనుండు నీకృపఁ బడయుఁ గాక
తరుణి సోలపుటూర్పుతావి యెంగిలి మ్రింగి, తేంట్లు నీలెంకలై తిరుగుఁ గాక


గీ.

సీత్కృతుల నభ్యసించినశిష్యు లగుచుఁ, జెలువ! చిలుకలు నీమాట సేయుఁ గాక
తొలుత వలవంత గొలిపినద్రోహు లగుటఁ, గాంత! నీ వింక రతిఁ బతిఁ గలసినపుడు.

164


వ.

అని సమేలంబుల మేలంబు లాడుచు లజ్జావనతసస్మితముఖారవింద యగునక్కన్నియ
కు మంగళాభ్యంగంబు మొదలును దర్పణదర్శనంబు తుదయునుం గా విచిత్రభంగుల
శృంగారించిన.

165


ఉ.

 శారదలక్ష్మిఁ చేకొనినచంద్రకళాకృతి నెల్లపాపలం
దేరినరత్నలేఖికగతి న్మధుపుష్పితపల్లవస్థితిం
గారునఁ బుట్టి క్రొత్తసిరి గైకొని క్రాలుమెఱుంగుభంగి శృం
గారము పూని యచ్చెలువ కన్నులపండువ యయ్యె నయ్యెడన్.

166


ఉ.

చొక్కపుజల్లిమీఁద నిరుసూరెలఁ గుండలరత్నము ల్పయి
న్ముక్కరముత్తియంబు గలముద్దియముద్దుమొగంబె చూడగాఁ
జుక్కలరాణివాసములు చుట్టును గొల్ప బుధుం గుమారుఁ బే
రక్కున గ్రుచ్చి యెత్తుకొని యాడెడురాజును బోలె నత్తఱిన్.

167


క.

కరివంకబొమలపైఁ గ, స్తురిఁ దీర్చినతిలకరేఖ సుదతికిఁ బొల్చె
న్మరుఁడు వెడవింటఁ దొడిగిన, యరవిరునునునల్లగల్వయమ్మునుబోలెన్.

168


తే.

ఉన్నఁ గరికుంభములకు లోనుండు నండ్రు, గాని మరుపట్టబద్ధయోగ్యగజకుంభ
ములకునదె మీఁద గ్రాలెడుముత్తియంబు, లనఁగ సతిచన్నుఁగవఁ బొల్చె హారమణులు.

169


తే.

హారరత్నప్రతిచ్ఛాయ లడరఁ గలసి, క్రాలుకరమూలకుచమూలకాంతివలన
నింతిమృదుబాహులతలయం దేఱుపఱక, నర్పితము లయ్యెఁ గనకశతాంగకములు.

170


క.

గురుకుచభరభంగుర మగు, తరుణీమణికౌనుపేదతనమే తనకా
భరణముగఁ బొలిచెఁ గలదే?, పరభరణముకంటె సొమ్ము పరికింపంగన్.

171


క.

తరుణీమణీకటిరత్నా, కరమేఖల యగుచుఁ బృథ్వి గావునఁ బొలిచెన్
బరికింపఁ బృథ్వి రత్నా, కరమేఖల యగుచుఁ బొలుపుఁ గైకొనుఁ గాదే?

172


సీ.

మగువచన్నులఁ గుంకుమము పూయు టాత్మీయ, కరికుంభయుగళిఁ జెందిరము గాఁగఁ
దెఱవక్రొమ్ముడివిరుల్ దుఱుముట నిజతూణి, నేర్చి నారాచంబు లిడుట గాఁగఁ
గడకంట జొక్కపుఁగాటుకఁ దీర్చుట, తనవింట నళిగుణోర్ఘటన గాఁగ
గజయానకటిరటత్కాంచి వహించుట, నిజసమారంభడిండిమము గాఁగ

గీ.

బాలికామణిశృంగారభంగు బెల్ల, విశ్వవిజయైకదీక్షాప్రవృత్తుఁ డైన
తనకు సమరోక్తసన్నాహదశలు గాఁగ, దర్సితుం డయ్యె మిగులఁ గందర్పుఁ డపుడు.

173


వ.

అంతట మహీరమణచంద్రుండునుం బారిజాతమహీజాతంబు వసంతవిలాసంబునుం
బోలెఁ బరిణయోచితాలంకరణంబుఁ బూని పంకజహితుం డపరజలధిం గ్రుంకినం గర
ణీయంబులు నివర్తించి మౌహూర్తికదత్తం బైన సుముహూర్తంబు నికటంబు విచ్చే
యు మని భావుకవిజ్ఞాపితుం డై.

174


సీ.

మూర్ధాభిషిక్తులముకుటరత్నద్యుతు, ల్కరదీపదీప్తులఁ గలిసికొనఁగ
రత్నవేత్రపరంపరారుచు ల్పురసతీ, నీరాజనాంశుల నిలిపికొనఁగ
స్మేరముఖాంబుజశ్రీ పార్శ్వదోధూయ, మానచామరలక్ష్మి మాఱుకొనఁగ
వందిమాగధులకైవారంబురావంబు, శుభతూర్యరవములఁ జూఱకొనఁగఁ


గీ.

బసిఁడిరథ మెక్కి విపులవైభవము మెఱయఁ, జూపరుల కెల్ల వ్రేఁకపుఁజోద్య మొదవ
సాంగమై వచ్చుభాగధేయంబుఁ బోలె, మామయింటికి వచ్చె జామాత యపుడు.

175


వ.

ఇ ట్లరుగుదెంచి రథావతరణం బొనరించి యెడనెడఁ బ్రాయంపుఁబడంతులు తమ
మెఱుంగుఁజూపులతోడి కర్పూరదీపకళికల నిగిడింప మంగళాలంకారసంకులంబు లగు
కక్ష్యాంతరంబులు గడచి చనినయనంతరంబ యభ్యంతరంబున.

176

విమలాంగీమాంధాతృ వివాహము

చ.

కదళము లూరుకాండములు గాఁగఁ దలంపుచుఁ బూర్ణకుంభసం
పదఁ గుచకుంభభావనయ పైకొన దర్పణలక్ష్మిచే హస
ద్వదనము చూచినట్లయి ప్రవాళరుచిం జిగిమేనుఁ దోఁపఁ గా
నెదుటనె యున్నకన్నెసవియే పతి చూచె వివాహవేదికన్.

177


వ.

ఇట్లు కన్యావిలోకనమనోరథంబు తమకంబు రేఁపం గళ్యాణరంగంబు గదియఁ జను
దెంచి యచట సర్పితమహార్హమణిమయోన్నతపీఠాసనంబున నాసీనుం డై వివ్వదుపదిష్ట
మార్గంబునం గుంతలేంద్రుండు గావించుమధుపర్కాదియథోక్తశుభసమర్చనంబులు
గైకొని నిజహృదయచిరమదనవహ్నికిం బ్రశామకంబుగా నతం డొసగుకన్యాదా
నోదకధారం బరిగ్రహించి కౌశేయయవనికావ్యవహిత యగు కుంతలేశ్వరదుహితం
గదియ వచ్చె నప్పుడు.

178


క.

ఒండొరుఁ గనుగొనఁ దివురుచు, నుండువధూవరుల మదనుఁ డొగిఁ దూపులచే
నిండుదెరచాటు గైకొని, రెండును దనయంపదొనలు రిత్తగ నేసెన్.

179


క.

వెలిపట్టుపచ్చడముతొర, వొలిచె వధూవరులమధ్యమున వారిమది
న్వలరాచశివముఁ గొలుపఁగఁ, దొలితొలిఁ గర్పూరధూపధూమం బనఁగన్.

180

క.

రమణీజనంబు కల్యా, ణము వాడఁ బవిత్రతూర్యనాదము లెసఁగన్
సుముహూర్త మయిన వేడ్కలఁ, దివురు వధూవరులనడిమితెర యెత్తుటయున్.

181


తే.

తగవుప్రాపున లజ్జ నధఃకరించి, నెలఁతనెమ్మోముజిగిఁ గ్రోలె నృపునిదృష్టి
తెర యెడల్చినఁ గనుఱెప్ప తెర వహించి, నిగిడె నధిపతిమూర్తిపై నెలఁతచూడ్కి.

182


మ.

తెరపట్టించినవేళఁ జేతివిలసద్దివ్యప్రసూనాస్త్రముల్
సరిపో నేసి సుమాస్త్రు డేసెఁ బిదపన్ జంద్రానన న్భూవరుం
దెర యెత్తించినవేళఁ గూర్మియలుఁగు ల్దీండ్రించుచుం గోర్కుల
న్గరుల న్గల్గినతత్పరస్పరసమీక్షాతీక్ష్ణబాణంబులన్.

183


వ.

తదనంతరంబ.

184


తే.

మన్మథుఁడు తాన తనదుసామ్రాజ్యమునకుఁ, గాంక్ష యువరాజ్యపట్టంబు గట్టఁ జేసె
శీతకరునకు ముక్తాభిషేక మనఁగ, భర్త చంద్రాస్యపైఁ దలఁబ్రాలు వోసె.

185


చ.

ఎగయుచు నున్నజక్కవల నేలుచనుంగవవ్రేఁగునం దెగెం
దెగె ననఁ గౌను సాఁగికొన నిక్కి బయల్పడు బాహుమూలమున్
దగదగ మించునిండుజిగి దట్టపుఁబైఁడి వసంత మాడఁగా
మగనిశిరంబుపై నినిచె మానిని వే తలఁబ్రాలు దోయిటన్.

186


క.

ఒండొరులు వోయుతలఁబ్రా, లొండొరుదేహములు సోఁకి యుల్లంబులయం
దొండొరుఁ గౌఁగిటఁ జేర్చిన, నిండుముదం బొదవఁ జేసె నెలఁతకుఁ బతికిన్.

187


క.

అంగజవికారవశమున, నంగుళములు వణఁక వణఁక నప్పుడు భూభృ
త్పుంగవుఁడు పెద్దదడవున, మంగళసూత్రంబు గట్టె మానిని యఱుతన్.

188


క.

పరిరంభత్వర గలయెం, డొరులమనంబులకుఁఁ గొంత యూఱటగా సుం
దరి యొక్కతె ముడిచె వధూ, వరులకు నపు డుత్తరీయవసనాంచలముల్.

189


తే.

తనదుపంతంబు చెల్లిన దర్పకుండు, వేడ్క రతిచేతఁ దనచెయి వేసి నవ్వ
గురుజనులయాజ్ఞ నపు డొక్కతరుణి నగుచు, బాలకెంగేలు పతికేలఁ గీలు కొలిపె.

190


క.

సంగతిలేనితరసమ, స్తాంగంబులఁ దొఱఁగి కన్నియకుఁ బతికి మిథ
స్సంగతము లైననిజహ, స్తాంగుళములయందు నిలిచె నపు డుల్లంబుల్.

191


వ.

అనంతరంబ గురుజనపురస్సరంబుగాఁ గల్యాణరంగంబునకు వచ్చి యథోక్తవిథి
శుభహోమకృత్యంబు నిర్వర్తించునప్పుడు.

192


సీ.

తఱి వేచి యొండొరుమొఱిఁగి కన్గొనునాసఁ, దారలు కడగంటఁ జేరి మెలఁగఁ
బార్శ్వదృష్టికిఁ గానఁబడునంతనంతన, యంతముఁ గనుట గా నాత్మ లలర
హోమధూమంబుల కొఱగుపేరిటఁ జూడ, కైన నొండొరుమోము లభిముఖముగ
స్పర్శ లేకున్న నాసన్నపార్శ్వంబులు, పెరపార్శ్వములకంటెఁ బ్రియము గాఁగ

తే.

హోమవేదియందు నొక్కపీఠంబున, నొప్పి రపుడు కన్నెయును వరుండు
గంతుఁ డిరువురందుఁ గలకూర్ము లొక్కింత, చూచి కట్లె వైచి తూఁచుకొనఁగ.

193


వ.

ఇట్లు వివాహంబు నిర్వర్తించి క్రమంబున దినచతుష్టయం బరిగినం బంచమవాసరం
బునఁ బ్రభాతం బగునంతఁ గుంతలేశ్వరుండు పరిణయాగతరాజసమాజంబుఁ బూజించి
శుభముహూర్తంబున వధూవరులం బయనంబు చేసి.

194


రగడ.

పగడపుదీఁగెలు గోమేధికములు, పచ్చలుఁ గెంపులు పుష్యరాగములు
నిగనిగ మనువైడూర్యములును హరి, నీలము లంభోరుహరాగములు
ముక్తాఫలములు వజ్రోపలములు, మొదలగురవమణిసందోహంబులు
శుక్తిపాలికలు శంఖపుటంబులు, శుద్ధసువర్ణాదికలోహంబులు
వెలిపట్టులు మంజిడులును దోఁపులు, వెల్లులుఁ జెంగావులు సకలాతులు
వలిపంబులు దుప్పట్లును మాదా, వళులును జీబులు జిలిబిలిజాతులు
గింటెంబులు బతినీల్ దసలీలును, గిముకాకరకులు సుకదట్టమ్ములు
కంటకిగుజ్జరీమదుపువులు మొదలుగఁ, గలిగినపలువన్నెలపుట్టమ్ములు
కుంకుమపు వ్వగరును దట్టపునుం, గును గస్తూరియు హిమవారిపూరము
సంకుమదంబు గుమంజియుఁ బూతియుఁ, జందనఖండంబులుఁ గర్పూరముఁ
దెల్లనిజల్లులు వింజామరములుఁ, దెగగలసవరా లేనికకొమ్ములుఁ
జల్లనిగందపుఁజిప్పలు రత్నపు, సానలు శశికాంతము నద్దమ్ములుఁ
బగడపుబరణులు దంతపుఁబెట్టెలుఁ, బలువన్నెలచిలుకలయడకొత్తులు
జిగలపగడపుగిండ్లును గిన్నెలుఁ, జిత్రము లగుధూపంబులవత్తులు
జాలవల్లికలు పలుమానికములు, చదరంగంబులు సొగటాసారెలు
కాళాంజులు మసగపుఁబ్రతిమలు మేల్, కట్టులు నేకాండపుఁదెరచీరెలు
సరసపుఁబలుకులు గద్యపద్యములు, చదువఁగ నేర్చినశుకశారికలును
నిరతము నాడఁగఁ బాడఁగ నేర్చిన, నెచ్చెలి నెఱజాణకుమారికలును.

195


క.

మున్నగువస్తువు లరణము, కన్నియ కిడి వెంట మూఁడుగమనము లరుగన్
మన్నించి నిలిపి వీడ్కొని, యున్నతముగఁ బతియుఁ గూర్మియువిదయుఁ దానున్.

196

మాంధాత పత్నీసహితుఁ డై యయోధ్యకుఁ జేరుట

వ.

సైన్యసమేతుం డై కతిపయప్రయాణంబుల నయోధ్యాపట్టణంబు గదియం జని నిజ
సామంతపౌరివర్గంబు లెదుర్కొన మహోత్సవాలంకృతంబైనపురంబు ప్రవేశించి
సఫలమనోరథుం డై మఱునాఁడు వివాహసమాహూతు లై వచ్చి యున్న సకలరాజ
లోకంబు నుచితసత్కారంబులం బ్రీతులం గావించి నిజదేశంబుల కనిపి యుచిత

వ్యాపారంబుల దినశేషంబు గడపి నిశోదయంబునఁ గృతకరణీయుం డగుచు నవో
ఢారిరంసామాంసలం బైనచిత్తంబున.

197

విమలాంగీమాంధాతలు క్రీడాగృహము సొచ్చుట

సీ.

రతిబంధబంధురప్రతిమావితనంబు, కల్పితకల్హారకల్పకంబు
సురభితైలోదయచ్ఛురితప్రదీపంబు, కర్పూరధూపసమర్పణంబు
శుక్తివిన్యస్తకస్తూరీపటీరంబు, వీటికాపరిపూర్ణపేటికంబు
శయ్యాసమీపకాంచనకళాచీకంబు, గంధవద్వారిభృంగారుకంబు


గీ.

భర్మపంజరశుకశుకీపఠ్యమాన, కామశాస్త్రోక్తబహుపద్యగద్యకంబు
కరణనికరసమున్మాదకారణంబు, మనుజపతి సొచ్చె మోహనమందిరంబు.

198


వ.

చొచ్చి క్రీడాగృహమధ్యంబున సమున్నతరత్నపీఠంబు నలంకరించి యుచితపరిచారి
కలు సేవింప నుండునంత నట మున్న పాలికాదిప్రౌఢసఖీజనంబు విమలాంగిం జేర
నరిగి.

199


తే.

గాజుపూసకుఁ గనకనిష్కములు వ్యయము, సేఁత తక్కినపనులు గైసేఁత సతికి
జాతిమణి గొనఁ గనకనిష్కములు వ్యయము, సేఁత వరుగూర్చుపనికిఁ గైసేఁత సతికి.

200


వ.

అట్లగుట నీకు నిప్పుడు సఫలం బైనశృంగారం బంగీకరింపవలయు రమ్మని ప్రారంభ
ప్రయోజనంబు దేటపడం బలికి ప్రహర్షజనితముఖవిలాసాలంకృత యగునచ్చెలువకుఁ
బునరుక్తంబుగా సమయసముచితాలంకరణం బొనరించి తోతేర లజ్జాప్రవాహంబు
నకు నెదురేగుట గా నెట్టకేనియుం గేళీమందిరంబునకు వచ్చునప్పుడు.

201


తే.

నిబిడవీచీపరంపరానీత యగుచుఁ, గొలనిదరిఁ జేరుజలరుహంబులపరాగ
రేఖయునుబోలెఁ బ్రియసఖీ, ప్రేరణమున, నొయ్యనొయ్యన సతి కేళిశయ్యఁ జేరె.

202


తే.

తల్పమునకు సఖీప్రయత్నమున వచ్చు, నభినవోఢకు నడుగడు గామ డయ్యె
దలఁపు పురపురగొనఁ దత్తఱిలుతదీయ, కాంతునకుఁ దత్క్షణము బ్రహ్మకల్ప మయ్యె.

203


క.

మరుఁడును లజ్జయు డెందము, సరిపాలం బంచికొనఁగ సాధ్వసమునఁ ద
త్పరిశిష్టాంశము గొనియే, వరతల్పమునకు నవోఢ వచ్చెఁ గడంకన్.

204


వ.

ఇ ట్లరుగుదెంచి ప్రాంతరత్నస్తంభంబు దాపుగొని సఖీజనంబులమరువున లజ్జావనత
వచనారవింద యగుసుందరిం గడచి ముందఱికి వచ్చి తనకు మ్రొక్కినపాలికం
జూచి నృపాలతిలకుం డాఁగినమనఃప్రమోదంబు మొగంబున దరహాసంబు మొలపింప
ని ట్లనియె.

205


ఉ.

పాలిక! యేమివార్త? ధరపై ధర కేమిటివార్త? దేవ! నీ
వేలఁగ నొవ్వగోరుకొను దీ వనుభీతియె దక్క మానెఁ గా
కేల భయంబు? సేయుపని యెవ్వరు మాను మనంగఁ గర్త? లీ
వేలిక వొంట రెంట నయ మిమ్మని కా కిటు విన్నవించుటల్.

206

చ.

ఇది తఱి యయ్యుఁ జంద్రుఁ డుదయింపఁ డదే? ముదయింపకుండు టె?
ట్లుదయముపై మొగు ల్పొదివి యున్నది యింతియె కాక యద్దెసం
బొదలెడునాఁకట న్బడలెఁ బొమ్ము చకోరము లంత యేల పై
నొదవెడు మేఘము ల్దొలఁగకుండఁగ వచ్చునె శీతరోచికిన్?

207


వ.

అని యిట్లు నర్మగర్భంబుగా నన్యాపదేశవచనసందర్భంబులం దనతలంపున కనుగుణం
బులు గాఁ బ్రత్యుత్తరంబు లిచ్చినప్రోడతనంబునకు మెచ్చి పాలికకు నితరసఖీజనం
బులకుం గర్పూరవీటిక లొసంగిన నచ్చెలువలు విభునిహృదయపరిపాకం బెఱింగి
యొక్కొక్కనెపంబునం గన్నియ మొఱంగి యందఱుం గ్రీడామందిరంబు వెలు
వడినయనంతరంబ.

208

నవోఢాసంగమవర్ణనము

క.

 కెలనిమణికుడ్యతలమునఁ, బొలసినతవనీడ దోడిబాల యనుచు న
చ్చెలువవిభుఁ డంత నొయ్యనఁ, బలికించినఁ దెలిసి యులికిపడి వెడలునెడన్.

209


ఆ.

చెట్ట యొడిసిపట్టి సెజ్జకుఁ దివియుచో, నడుగు బిగ్గఁ ద్రొక్కి యతివ యపుడు
కూర్మివిభునిమీఁద గొనయ మెక్కించుచో, నల్ల వంగు మరునివిల్లువోలె.

210


చ.

తలిమముఁ జేరకున్న మదిఁ దత్తఱ మెత్తి విభుండు బాలికన్
నిలువునఁ గౌఁగిలింప రమణీరమణీయశరీరయష్టి ము
త్సులకిత మైనఁ బొల్పెసఁగె భూవరకల్పకబాహుశాఖలన్
వలగొని యున్నకోరకితవల్లిమతల్లియుఁ బోలె నయ్యెడన్.

211


సీ.

వెడలి పోఁ దలఁచుచో నొడిసి కేల్పట్టినఁ, దిరిగి నెచ్చెలిఁ జూచుదీనదృష్టి
శయ్యకుఁ దిగుచుచోఁ జను దేక బిగ్గరఁ, జరణాంబుజము ద్రొక్కు చండితనము
బలిమిఁ గౌఁగిట గ్రుచ్చి తలిమంబుఁ జేర్చుచో, నొడఁబాటు చాలనినిడుదయూర్పు
ముంగేల వంచినమొగ మెగయించుచో, మెయికొనునేత్రనిమీలనంబు


గీ.

మాటలాడక చేకొన్న మౌనముద్ర, యైదు నివి పంచబాణుని కైదుతూపు
లయ్యెఁ బతిడెందమునఁ గాఁడునట్టు లేయ, నంగనామణి సవిక్రొత్తసంగమమున.

212


సీ.

తలవంచుటయె కాని తప్పక కనుప్రేమ, ఘన మని లోచూపుగతము వెట్ట
మౌనముద్రయె కాని మాటాడువేడుక, గడు సని ముఖకాంతి ముడియ వేయ
నడ్డగించుటె కాని యాలింగనప్రీతి, బలు వని కంపంబు బాస సేయఁ
బైవెట్టమియె కాని పైకొనుతమికల్మి, స త్తని పులకలు సాక్షి పలుకఁ


గీ.

గరుణముగ నేఁడఁ జొరమియె కాని మనసు, కరఁగినది యని చెమటపై కంటఁజాట
హృదయనాథుని మది దక్క నేలుకొనియె, బాలికామణి యపుడు దాఁ బ్రథమరతిని.

213

చ.

బలిమి రసాతిరేకమునఁ బయ్యదకొం గెడలింపఁ గంపముం
దళుకును గల్గుతొల్కరిఁ గనంబడు క్రొత్తమెఱుంగుఁబోలె న
ప్పొలఁతిమెఱుంగుమేనదియు భూవరుతాల్మి మరుండుఁ దెంపఁగా
బెలుచ నొర న్వెడల్చి జళిపించుకృపాణిక యయ్యె నయ్యెడన్.

214


క.

కొల్లలు గో నఱ్ఱాడెడు, వల్లభుదృఙ్మధుపతతుల వ్రాలఁగనీ కు
త్ఫుల్లకుచగుచ్ఛములఁ గర, పల్లవపుటయుగళిచేత బాలిక పొదివెన్.

215


తే.

కంకణక్రేంకృతులపేరఁ గలహ మాడి, యధిపుకరములతో బాలహస్తయఁగము
సరిఁ బెనంగఁగ నా కేల జగడ? మనుచు, జాఱు గతి నీవి తనుఁ దానె జాఱె సతికి.

216


తే.

పయ్యెద బలము దూలినఁ బణఁతి బాహు, శక్తిఁ గుచదుర్గములఁ గాచి జాఱునీవిఁ
బట్టఁబోయిన రాజు చేఁ బడియె రెండు, భేదమున నెంతకార్యంబు గాదు తలఁప?

217


తే.

ముగ్ధ యగుఁ గాక యే? మింత ముగ్ధ గలదె? బాల జఘనాంశుకం బింక గోల పెనఁగ?
రాజవరునకు రోజదుర్గములు రెండుఁ, జేపడియె నట్టె యిఁకఁ గ్రిందిసీమ యెంత?

218


క.

ఒడిసి జఘనాంశుకం బపు, డెడలించినవిభునిదృష్టి కెడయీనిమతిన్
బడఁతుక లజ్జావశమునఁ, గడువడితోఁ బొదివి బిగ్గఁ గౌఁగిటఁ జేర్చెన్.

219


ఉ.

చూడనిచూడ్కియు న్బలుకఁ జూడనివాక్కును గౌఁగిలింపఁగాఁ
జూడనికేలుగంటి యిడఁ జూడనిమోవియు మాఱుసేయఁగా
జూడనిచెయ్వుఁ బైకొనఁగఁ జూడనికాయముఁ గల్గి తోల్తొలిన్
జేడియసంగమంబు నృపుచిత్తముఁ దత్తఱ పెట్టె నింపునన్.

220


చ.

వెఱపు నలంతికంపమును వీడనివ్రీడయు మాఱుసేయఁగా
నెఱుఁగమి యేపులేమి పరియెత్తెడుచొక్కులగోలు ముందుగా
మఱుపుమొగంబు నోరయును మాటుగ ఱెప్పలఁ గప్పుచూడ్కియుం
దెఱవ నవాగ్రసంగతిఁ బ్రతిక్రియ లై యలరించె భూవిభున్.

221


సీ.

కేలితోఁ గేలు కెంగేలఁ గీలించుచోఁ, బులకోద్గమము వెంట వెలువరించి
యెయ్య నొయ్యన మీఁదిపయ్యెదఁ దివియుచోఁ బొడము కంపములతో నెడలఁదూలి
కడునించుమెత్తనికౌఁగిటఁ జేర్చుచోఁ, గ్రమ్ములేఁజెమటలఁ గరఁగ జార్చి
మరపించి యెల్లనిమర్మంబు లంటుచోఁ, బుణికిళ్ల నెళవులు పుణికి వైచి


గీ.

పలుదెఱంగుల మదిసిగ్గు వెలితిపఱచి
దినకరాన్వయుఁ డొకకొన్నిదినములకును
బొలఁతియెడఁ బూన్కి కొడఁబాటుపొందుఁ గాంచె
నిగ్రుచుకోర్కులఁ దనడెంద మివతళింప.

222

సీ.

పదిప్రశ్నముల కైనఁ బ్రత్యుత్తరముఁ బొందఁ, జూచువీనుల కింపు రేఁచిపెట్ట
నిరువదిపొంచుల కెదిరించు నొకచూపు, కనుబండువకు సంచకరువు గాఁగ
ముప్పదికౌఁగిలింపులఁ గాంచుబిగి యెందుఁ, జోఁకుచోఁ గొనగోరు సోఁకఁ జేయ
నలునదిమనవులఁ గలయొక్కయొడఁబాటు, పారవశ్యమునకుఁ బరిసనముగ


గీ.

నడ్డగింపును గాక సయ్యాట లేక, యంతరాళంబు లొకకొన్నియహము లహహ!
వేఱ యొకకొంతరుచి గొల్పె విభునిమదికిఁ, గిసలయాధరతో రహఃక్రీడనములు.

223


సీ.

నెమ్మోవి దాఁచెడి నెపమునఁ జెక్కులు, చుంబింప నెడ మిచ్చుసుదతినేర్పుఁ
గినిసి చెక్కులు దాఁచికొనియెడినెపమున, మోము మోమునఁ గూర్చుముదిత వరవు
వెడలెడితననీవి సవరించునెపమునఁ, గౌఁగిటీ కొచవించుకాంతతలఁపుఁ
గరములఁ జనుదోయిగప్పు నెపంబున, నీవిక సందిచ్చు నెలఁతమతముఁ


గీ.

దొడిఁబడక గానఁ బడనీక యొడలు నులియు, నెపముమైఁ గౌఁగిటి కెదుర్చు నీరజాక్షి
యుపమయును భూమివల్లభునుల్లమునకుఁ, గ్రొత్తచవి గొల్పె మఱి వేఱె కొన్నినాళ్లు.

224


ఉ.

చేసినచోఁ బ్రతిక్రియలు సేయనెఱుంగమి మున్ను తోడుతోఁ
జేసినచేఁతకు న్మరలఁ జేయఁగ వేడుక సేసి యంతటన్
జేసినఁ జేయఁ జొచ్చెఁ జిఱుచెయ్వుల నంతట బ్రోడ యై తుదిన్
జేసెఁ బయోజనేత్ర పతి సేయకయున్ రతిఁజేయుచెయ్వులన్.

225


సీ.

ఈక్షింపఁగా నేర్చె నిఱ్ఱింకుఁజూపుల, మోవిఁ గూర్పఁగ నేర్చె మొలకనవ్వు
పొలయింపఁగా నేరెచి భూలతానటనంబు, విన నేర్చె నర్మోక్తి వీను లాని
యెదురొత్తఁగా నేర్చె నిఱియుఁగౌఁగిటియందు, మొగమెత్తఁగా నేర్చె మోవిఁగమున
గర మెత్తి యీ నేర్చెఁ గర్పూరవీటిక, నలరింపఁగా నేర్చె నంఘ్రు లెత్తి


గీ.

నేర్చె గరువింప మెచ్చింప నేర్చె నేర్చె, మొగము గనుపట్టి యలకమై మ్రొక్కు గొనఁగ
జెలువ పతిచేతిరతికళాశిక్షణమునఁ, బంచబంగాళముగ లజ్జఁ బాఱఁదోలి.

226


వ.

ఇట్లు క్రమక్రమప్రవర్ధమానంబు లగు ప్రణయంబులచందంబునం బ్రోడతనంబులఁ సమ
ప్రవృత్తంబులై.

227


సీ.

మెఱఁగి కన్గొనుచోట మొఱుఁగుపై మతి దప్పి, పోక యొండొరుల నాపోక చూచి
సిగ్గునఁ బలుకుచో సిగ్గుపై మతి దప్పి, యిచ్చ నొండొరులతో ముచ్చటాడి
నెపమునఁ బొంకుచో నెపముపై మతి దప్పి, కాంక్ష నొండొరు బిగ్గఁ గౌఁగిలించి
తాలిమి నెఱపుచోఁ దాల్మిపై మతి దప్పి, కాయ్వుమై నొండొరుఁ గడవఁ గరఁగి


గీ.

గుట్టు చెల్లింపలేక లోగుట్టువడని, తమమతులకూర్మి నివ్వెఱతమక గదుర
బూవిలుతుచేతిచిత్రంపుబొమ్మ లగుచు, దంపతులు సల్పి రంగజస్వైరవిధులు.

228

ఉ.

సిగ్గునకుం బికాపికలు చిత్తసమున్నతిపేరివార్తకుం
గగ్గులకాళ్లు శంకలకుఁ గన్కనియెగ్గులఁ బుట్టువల్కకు
న్సగ్గిసముగ్గిసల్ నిలుపుసైరణకు న్గననీనియెత్తికో
ళ్లగ్గజయానకుం బతికి నయ్యె యథేష్టరహఃప్రసంగముల్.

229


చ.

అలిగినవేళ వయ్యెడినిజాంగజతాపము పేరియెండలున్
గలసినవేళ నయ్యెడిమొగంబులనవ్వులపేరివెన్నెలల్
దలఁచుటె కాని యవ్విభుఁడు దన్వియు సంతతకేలిలోలతన్
దలఁప నెఱుంగ రెన్నఁడు దినంబులయెండలు రేలవెన్నెలల్.

230


సీ.

మాధవీమధుపానమత్తాలినీగాన, విభవాకులోద్యానవీథికలను
జంద్రికానిర్ధూతజలదపథోపేత, శశికాంతకలధౌతసౌధములను
గాదంబినీజాలకలకలవాచాల, శైవలినీలోలసైకతములఁ
గలితలీలాయత్నకల్పితగిరినూత్న, కాంతి నానారత్నకందరముల


గీ.

మఱియు వివిధవిహారైకమందిరముల, నిచ్చనిచ్చలు గ్రొత్తలై యెచ్చరించు
ఖేలనంబులఁ దెప్పలు దేలుచుండె, నెలఁతయును దాను మాంధాతృనృపవరుండు.

231

ఆశ్వాసాంతము

ఉ.

ఆర్తిక్షీణగజేంద్రరక్షణ కళావ్యాఘాతవిఖ్యాతిమ
త్కర్తృత్వ ప్రతిమల్ల పల్లవసతీకౌమారహారక్రియా
ధూర్తాగ్రేసర సహ్యసంభవ లసద్వ్యూఢాంతరంగస్థలీ
మూర్తోస్మద్విధభాగధేయ శరదంభోజాతపత్రేక్షణా.

232


క.

డోలాలీలాందోళన, ఖేలాస్వగతాగతాభివీక్షణజనితో
ద్వేలప్రమదాంబుధిక, ల్లోలప్లవదస్మదాదిలోకస్వాంతా.

233


భుజంగప్రయాతము.

అభద్రాంధకారోదయద్భానుభావా, శుభైకాశ్రయీభూతశుద్ధస్వభావా
యభక్తావళీదృష్ట్యహఃకాలతారా, స్వభక్తాగ్రభూపారిజాతావతారా.

234


గద్య.

ఇది శ్రీమద్భట్టపరాశరదేశికేంద్రచరణసరోజసేవకోపసేపక నరసింహనామధే
యప్రణీతం లైనకవికర్ణరసాయనం బనుకావ్యంబున నాయికానిరూపణంబును, యౌ
వనవర్ణనంబును, విప్రలంభంబునందు దశదశానిరూపణంబును, వివాహంబును, నవో
ఢాసంగమంబు నన్నది తృతీయాశ్వాసము.