కవికర్ణరసాయనము/చతుర్థాశ్వాసము

చతుర్థాశ్వాసము



రంగనిలయ వలయా
కారాభయముద్రితైకకరకిసలయ లీ
లారసనిరంకుశస్వే
చ్ఛారచితజగత్ప్రసూతిసంస్థితివిలయా.

1

వసంతర్తువర్ణనము

ఉ.

భాసురలీల నయ్యె నిలపై మధుమాసము గర్వితేక్షుబా
ణాసకృతాట్టహాసము భయాకులపాంథవిముక్తదీర్ఘని
శ్శ్వాసము కోపనాధృతినివాసము కోకిలకీరషట్పదో
ల్లాసము దత్తభూరుహవిలాసము సర్వమనోవికాస మై.

2


ఉ.

ప్రాయము భూరుహంబుల కపాయము మంచున కాపతత్పవి
ప్రాయము పాంథకోటికి నుపాయము చిల్కలకున్ సమాపనా
ధ్యాయము కోపనాధృతికి దాయము చల్లనిగాలి కెన్నఁ గా
నాయము పుష్పబాణునకు నామని నే మని ప్రస్తుతింపఁగన్?

3


చ.

తెగినమనోభవుం దిరుగఁ దెచ్చి కుజంబుల కెల్లఁ బ్రాయము
ల్మగుడఁగ నిచ్చి యన్యభృతమండలిమూఁగతనంబు వుచ్చి ము
జ్జగముల వార్త కెక్కివనసంతభిషగ్వరుఁ డాప్తుఁ డయ్యునుం
దగుగతి మాన్ప లేఁడ మఱి దక్షిణవాయువునందుఁ జాడ్యమున్.

4


క.

తొలఁగి చిరకాలమునకుం, గలసినమాధవునిమీఁదఁ గనలి ననశ్రీ
తలిరుల నెఱ్ఱంబాఱుచుఁ, గలకంఠప్రథమవాక్యగతులం గొణఁగెన్.

5


ఉ.

ఆసమయంబున న్మధుసమాగతలక్ష్మి వనప్రవేశముం
జేసినవేళఁ జూడ బొలిచెం బికషట్పదభూతతృప్తి గాఁ
బోసినమాంసపుంజములపోలికఁ బల్లవితామ్రసంచయం
బాసనపాత్ర లయ్యె వకుళాగ్రదళమ్మకుళప్రతానముల్.

5

ఉ.

పొన్నలు నవ్వెఁ గ్రొన్ననలపుష్పరసంబునఁ గేసరంబు లు
త్పన్నజుగుప్స మై నుమిసెఁ బాటలము ల్గుసుమోదయంబుచేఁ
గన్నెఱ చేసెఁ దిట్టెఁ గలకంఠరుతంబులఁ జూతము ల్వృథా
మున్నుగ నన్నిటం గడచి మోదుగుపువ్వుల విఱ్ఱవీఁగినన్.

7


చ.

చిగురులచేతఁ గోయిలలఁ జిత్రఫలంబులజేతఁ జిల్కలం
దగుపువుఁదేనెచే నలులఁ దావులచే మలయానిలంబులన్
మొగడలచేఁ బ్రసూనశరు మోదితుఁ జేసి యభీష్టదంబు లై
పొగడిత కెక్కెఁ గల్పకముఁ బోలె రసాలకుజంబు లామనిన్.

8


సీ.

వివిధవనీరమావిమలసాంద్రకటాక్ష, వీక్షాపరంపరావిలసనములు
మలయమారుతచరన్మత్తేభచరణావ, లంబితాయతశృంఖలాలతికలు
పథికజనావలీప్రతిసమాకర్షణ, ప్రద్యుమ్నముక్తదోఃస్రగ్రహములు
మధుజగన్మోహనమంత్రవాదికరాబ్జ, వలమాననలినాక్షవలయితములు


గీ.

ప్రథమకౌమారనవపరిపాకకలన, వికసదభిమతతరులతాగ్రకరమంజు
మంజరీమధుమధురిమోన్మాద మెసఁగ, మెలఁగె బహువిధగతులఁ దుమ్మెదలగములు.

9


చ.

పనివడి హారదంతురితపాండ్యవధూకుచశైలసంధులన్
ఘనముగ డస్సి చోళనవకంజముఖీరతిఘర్మవారి నా
ని నెఱిని గుంతలీసురభినిశ్వసనంబుల నూఁత గొంచు నొ
య్యనఁ జనుదెంచె నంత మలయాచలశీతలవాతపోతముల్.

10


క.

మమ్మురపుందేనెలజడి, చెమ్మ లపనవీథు లెల్లఁ జెన్నగుటఁ జుమీ!
కమ్మవిరితావిమోపరి, తెమ్మెర లొయ్యొయ్య వెఱచి తిరుగుట లెల్లన్.

11


చ.

చలువలపుట్టినిండ్లు నవసౌరభలక్ష్ముల కంతరంగముల్
మెలఁపులకు న్నివాసములు మెచ్చులచేరుగడల్ విరక్తతా
కలవల కెత్తుకోళ్లు తమకంబులకుం గయిదండ లామనిన్
మలయుచు వచ్చె గంధగిరిమంధరబంధురగంధవాహముల్.

12


సీ.

రేల వెన్నెలలు పండ్రెండుసూర్యులు చూపు, బీఱెండ లై కాసి నీరసింప
దక్షిణానిలము లుద్ధతి నేడుదెఱఁగులఁ, బెరిగెడుగాడ్సు లై పెల్లగింపఁ
గెంజాయ దిక్కులఁ బింజించుచిగురులు, కాలానలార్చు లై కాఁకఁ బెనుప
నలి శుకపికగర్జ లడరఁ బూదేనియ, ఘోరాంత్యవృష్టి యై కురిసి కలఁప


గీ.

విరహవేదన లెసఁగి యుద్వేలగతుల, నద్భుతముగ నేకార్ణవ మగుచు ముంప
నఖిలసుఖకారి యగువసంతాగమంబు, పథికలోకంబునకు మహాప్రళయ మయ్యె.

ఉ.

పూచినపువ్వు లెల్ల నుతిఁ బొందె మనోభవునంపకోల లై
వీచినగాడ్పు లెల్లఁ బొదలె న్మలయాచలమారుతంబు లై
యేచినపల్కు లెల్లఁ దగియెన్ బికభృంగశుకస్వరంబు లై
చూచినరూప మెల్ల మదచుంబిత మై విలసిల్లె నామనిన్.

14


చ.

ప్రసవశరప్రతాపశిఖిఁ బర్వఁగఁ జేయుటచే నిదాఘ మై
కుసుమరసాతివర్షమునకున్ గుదు రౌటఁ బయోదకాల మై
రసికమనోంబుజంబు లలరంగ శర త్తయి తాన శైశిరో
ల్లసనముఁ జూపి పాంథసతులన్ వణంకించె వసంత మత్తఱిన్.

15

మాంధాత యువతులఁ గూడి వనవిహారము సల్పుట

వ.

ఇట్టివసంతసమయంబున మహీరమణశేఖరుం డొక్కనాఁడు విహారకుతూహలంబునం
బ్రేయసీసమేతుం డై గణికాగణంబులు విటవిదూషకాదిక్రీడాపరికరజనంబులు
నర్హవాహనారూఢు లై కొల్చి రా విరచితోచితవివిధవిచిత్రక్రీడాలతాగృహాలంకృ
తాంతరంబునుం గేలీశైలశైవలినీప్రముఖనానావిహారప్రదేశోపశోభితంబును వసంత
విలసితస్వవిలాసాపహసితనందనంబును నగునగరోపవనంబు సొత్తెంచె నప్పుడు.

16


ఉ.

ఇంచుగతిం బరాగ మెగయించియు వెంటన వచ్చుతేంట్ల మ్రోఁ
గించియుఁ గమ్మతావు లొలయించియుఁ బైమకరందబిందువుల్
నించియు మెచ్చి తన్ బొగడు నేర్పు లొసంగుచు నెల్లవారికిన్
బంచవిధేంద్రియంబులకుఁ బండువు చేసె వనీసమీరముల్.

17


వ.

ఇ ట్లభిమతప్రమదవనసమీరంబు లెదురుకొనం గ్రీడావనమధ్యంబు తఱిసి వివిధమధుర
తరులతావిశేషంబులం గలుగునభినవకుసుమకిసలయఫలపరాగమకరందమిళిందశుకపిక
మిథునసంపదల నుత్కర్షించుచుం గలయ మెలంగి పుష్పాపచయముKsచ్ఛావిహారం
బులకు నందఱ నద్దినం బెల్ల నచట నిలువ నియమించి పాలికాదిసఖీజనంబులు గొలువ
విమలాంగియుం దానును వసంతునింటికి విందువచ్చురతీసహాయుం డైనమన్మథుండు
నుంబోలె నొక్కయభ్యంతరవనాంతరంబు చొచ్చి యందు.

18


సీ.

నవలీల మలయగంధవహుండు వివిధపు, ష్పామోదముల నుపాయన మొసంగఁ
గలకుహూరుతములఁ గలకంఠములు సవి, నయభంగి విజ్ఞాపనంబు చూపఁ
బరిపక్వఫలరసప్రణతిమైఁ దరువులు, కిసలయాంజలిపుటీక్రియ ఘటింపఁ
గలితప్రసూనసంగతి వల్లికలు తల్ప, రచనామహోపచారము నొనర్ప


గీ.

లలనతో రాజు వనవీథికల సుఖించె, మంజరీపుంజనిష్యందమానమధుర
మధురసాస్వాదసమ్మోదమధుపగీతి, మాధురీధుర్యమాధవీమండపముల.

19

పుష్పాపచయకేళీవర్ణనము

వ.

అంత నిటఁ దరుణీతరుణజనంబులు పుష్పాపచయవినోదంబులం దగిలి విహరించు
నప్పుడు.

20


సీ.

అలరుల కెత్తుచో నఱచేతికెంజాయ, లొదవి కోయిలల నోరూరఁ జేయ
నునుమేను లలసి మ్రానులమీఁద నొరగుటల్, తీవలు వ్రాఁకినతెఱఁగు దెలుపఁ
జెలికత్తియలలీలఁ బిలుచునున్పలుకులు, మదకీరములముద్దుమాట లార్ప
బుగబుగ వలచునూర్పులతావు లెసఁగి క్రొ, న్ననలకు వింతవాసన లొసంగ


గీ.

నిక్కి కొనగొమ్మ లందుచో నీవి జాఱి, బయలువడి యొప్పునాభికూపములసొబగు
లంగలతలకు నరవిరు లై చెలంగ, సతులు పుష్పాపచయకేలి సలిపి రర్థి.

21


చ.

చనుఁగవకంటె గుచ్ఛములు చక్కనయే? యధరంబుకంటె నే
ననుచు చిగుళ్లు? నీదువచనంబులకంటెనె చిల్కపల్కులున్?
వనమున నాకు వింతలఁటె వస్తువు? లంచు నివృత్తుఁ డయ్యెఁ దో
డన యొకఁ డల్కమైఁ దనపడంతుక క్రమ్మఱి యింటి కేగఁగన్.

22


చ.

పొడవున నున్నపల్లవునిఁ బూవులు వేఁడుచు నొక్కనెయ్యపుం
బడఁతుకహస్త మెత్తుటయుఁ బయ్యద జాఱి కుచోదయాద్రిపైఁ
బొడిచి వినూత్నరాగరుచిఁ బొల్పువహించునఖాంకచంద్రుచే
ముణిఁగె నొకంతలో సవతిముద్దియపిండుముఖారవిందముల్.

23


చ.

అందినవారు పుచ్చుకొనుఁడా! యని చే విరిబంతి యెత్తినన్
జందనగంధు లిద్ద ఱొకజాణనివీఁపు నురంబుఁ జన్ను లా
సందునఁ జక్క నొక్కుచును సారెకు నిక్కఁగ శంబరారిచేఁ
జెందలిరాకువాలునొఱచేఁ బెడపోటనుబోనివ్రేటునన్.

24


చ.

ఇరువురయందు ము న్నొకతె కిచ్చిన నొక్కతె యల్గు నంచు మీ
యిరువురలావు గాన నగునీవిరిఁ గైకొనుఁ డంచుఁ బల్లవుం
డిరువురముందఱన్ బడఁగ నేసినఁ దత్కపటం బెఱింగి మ
మ్మిరువుర సాటి సేయఁ దగునే? యని యొక్కట నల్గి రిర్వురున్.

25


చ.

తనప్రియుమీఁద నొక్కలత తార్కొని గుచ్ఛయుగంబు మోఁపినన్
గినిసి సపత్ని గా దని సఖీజనసాక్షి నెఱింగినట్టియం
గననికటంబునన్ సవతి కాంతునిపైఁ బడి పెన్నురంబునన్
జనుఁగవ మోఁపినన్ గినియఁ జాలద వేఱొకతీవ యన్ మతిన్.

26


చ.

పిలిచితి నన్ను వేఱొకతెపేరున నే నివి యెల్ల నంచు ము
న్నలిగె నొకర్తు పల్లవున కవ్వల నొల్లక రోసినట్టియీ

యలరుల నిచ్చెదే యనుచు నల్లె సపత్నియు నట్ల కాదె ధూ
ర్తులు తుద నెల్లవారలకు దూరుల పో తలపోసి చూచినన్.

27


చ.

తనుఁ బెరపేరఁ బిల్చి యిడఁ దత్కుసుమంబుల పూఁచి మోమునన్
గినుపున వ్రేసె నొక్కసతి కేసరరేణువు రాలె నంచుఁ జేఁ
గనుఁగన మూసికొన్న వెఱఁ గౌఁగిటఁ జేర్చుచుఁ గేలు వుచ్చి చూ
చిన నగుధూర్తపల్లవునిచేఁతకు గాసిలి యల్లెఁ గ్రమ్మఱన్.

28


ఉ.

నేరవు నీవు కొప్పిడఁగ నే ఘటియించెదఁ బువ్వు లంచు నం
భోరుహలోచనన్ దిగిచి ముందర నుండఁగఁ బంచి యొక్కరుం
డీరస మొందుతోడిపతి కివ్వలమోము మలంచి చుంబనా
చారముచే మనఃప్రియము సల్పె సఖుల్ తననేర్పు మెచ్చఁగన్.

29


చ.

సవతిమొగంబు చూచుచు నొసంగినపల్లవుమీఁదికిన్సునన్
దవిలిననెవ్వఁగం దనువు తప్తముగాఁ దలవంచి యున్నయ
య్యువతికరంబులోనివిరు లూష్మతఁ గందుట చెప్ప నేటికిన్?
గవిగొను దానియూర్పులసెకన్ గసుగందె వనంబుపువ్వులున్.

30


చ.

చిగురులఁ గర్ణపూరములు సేయుతలంపునఁ గోయునంతలోఁ
దగ వఱి యవ్వలన్ విటుఁడు తాను సపత్నియుఁ గూడుకొన్న నె
వ్వగ నొకపువ్వుఁబోఁడి వలవంతల వేఁగుచుఁ జేత నున్నయా
యిగురులె సెజ్జ చేసికొనియెం దనుతాపభరోపశాంతికిన్.

31


చ.

తలిరుల నెల్లఁ గోసి కరతామరసద్యుతి వెల్లి గొల్పఁగా
నలరుల నెల్లఁ గోసి నఖరాంచలదీప్తులు పై నిగుడ్పఁ గాఁ
జిలుకల నెల్లఁ దోలి తమచిన్నియెలుంగులభంగిఁ జూపఁగాఁ
జెలువము క్రొత్త యై సతులచే వనవాటిక యొప్పె నయ్యెడన్.

32


తే.

తమయలంకారములకు నై తరుణు లెల్లఁ, గ్రొవ్విరులుఁ జిగుళ్లును గోసి రైన
దాన వనవాటికకుఁ బొల్బు తఱుఁగ దయ్యె, దార యయ్యింతు లొకయలంకార మగుట.

33


చ.

అనుఁగువిటుల్ ప్రసూనముల నాభరణంబులు గూర్ప నేర్పుమై
ననువు లెఱింగి మేనికళ లారసి మర్మము లంటువేళలన్
దనువులఁ బుట్టుచిత్తడుల దట్టము లై దిగజాఱెఁ గాంతలం
దనయము రేఖ లై వనవిహారపరిశ్రమఘర్మతోయముల్.

34


చ.

పొలఁతులకున్ వనీవిహృతిఁ బుట్టినసేదలు దొల్కరించినన్
వలిచనుఁగొండలం బొడమి వచ్చుపరిశ్రమవారివాహినీ
విలసనరేఖకున్ వళులు వీచిపరంపర లయ్యె నిమ్ననా
భులు తిరు లయ్యె వాలుకలపుంజము లయ్యె నితంబబింబముల్.

35

సీ.

కుచకుంభభారభంగురమధ్యలతికలు, పునరుక్తగుణయుక్తిఁ బూనుకొనఁగఁ
గరఁగినతిలకరేఖలతావులకుఁ జొక్కి, నట్లు కురుల్ నొస ళ్లత్తుకొనఁగ
వ్రేఁకంబులకుఁ దోడువిరులవ్రేఁగులకల్మి, వీడెడుక్రొమ్ముళ్లు వెన్ను లొరయ
మఱి నిసర్గము లైనమందయానంబులు, తొట్రుపాటున వింతతొడవు దాల్పఁ


గీ.

దఱచుటూర్పులు తమకమ్మతావివలన, నలుల కలరులు గ్రోలినయరుచి మాన్ప
సతులు పుష్పాపచయకేళిఁ జాల నలసి, కోరి రాత్మల నంభోవిహారకేళి.

36

జలక్రీడాభివర్ణనము

చ.

బడిబడిఁ భ్రాంతదీర్ఘకలఁ పద్మసుగంధిపయస్తుషారముల్
జడిగొన నల్లనల్లఁ బయిఁ జల్లుచు వాడినపువ్వుబోంట్లకున్
బడలిక లార్చి చేకొనియెఁ బ్రస్తుతు లయ్యెడ మందమారుతం
బెడరున నైనచుట్టమున కెవ్వరు సాటి జగత్త్రయంబునన్.

37


ఉ.

పల్లవధూర్తు నెన్నడుముపార్శ్వ మొగిం గుడిచంట నొత్తి దో
ర్వల్లరి మూఁపునం బెనఁచి వ్రాలి యురంబునఁ జెక్కుఁ జేర్చి సం
ధిల్లెడుచూడ్కితోన నడదేరఁగ నెచ్చెలిపిండు సన్నిధిం
జెల్లె విదగ్ధతాగరిను సేదనెపంబునఁ బద్మనేత్రకున్.

38


చ.

తరుణుల కింపు లై తనరెఁ దత్సమయంబులయందుఁ బార్శ్వచా
మరములు గల్గి భర్తృముఖమారుతపాతము లుష్ణవారణో
త్కరములు గల్గి యైనఁ బ్రియకాముకహస్తపటావకుంఠముల్
పరిజన మున్న నైన నిజపల్లవదత్తకరావలంబముల్.

39


క.

పద్మప్రకాశలక్ష్మీ, సద్మంబులఁ గంకణప్రశస్తముల దళ
తృద్మాస్య లంతఁ గాంచిరి, పద్మాకరములనుబోనిపద్మాకరముల్.

40


చ.

కొలఁకులు చేర వచ్చి యనుకూలతటంబుల నిల్చి ముగ్ధ లౌ
నలికులవేణు లయ్యెడ నిజావయవప్రతిబింబశోభగాఁ
దలఁపుచు నుల్లముల్ పొదలఁ దప్పక చూడఁ దొణంగి రందులో
జలజములన్ మృణాళములఁ జక్రయుగంబుల గండుమీనులన్.

41


గుఱి గడవన్ మరందములు గ్రోలి మదంబునఁ జొక్కు వల్లభ
న్మొఱఁగి పరాలినీరతికి మోదమునం జని తొంటియట్ల కా
నెఱుఁగక యుండఁ దమ్మివిరియింటికి వచ్చినభృంగపల్లవున్
నెఱతన మెన్నుపల్లవుని నీరజలోచన దాఁచెఁ గిన్పునన్.

42


సీ.

కదళికలనుకంటె కరభంబులనుకంటె, నిభకరంబులఁ బోల్ప నిప్పు డనువు
చక్రంబులనుకంటె శకటాంఘ్రులనుకంటె, నిసుకతిప్పలఁ బోల్ప నిప్పు డొప్పు

గుచ్ఛంబులనుకంటెఁ గుధరంబులనుకంటె, నిఱిజక్కవలఁ బోల్ప నిప్పు డొనరు
నద్దంబులనుకంటె నమృతాంశుఁడనుకంటె, నెలదమ్మిగమిఁబోల్స నిపుడు దగవు


గీ.

నాఁగఁ బొలిచి రంగనలు నీటియాటల, కెచ్చరించి తఱియునెడఁ గొలఁకుల
తోయసంగమమునఁ దొడలను బిరుదుల, వలిచనుంగవలను వదనములను.

43


చ.

అమితవిలాసినీకుచరథాంగకసంగతి గల్గ దీర్ఘికా
సముదయ మప్పు డాత్మగతచక్రయుగంబులఁ బాయఁ ద్రోచెఁ బ్రాం
తములకుఁ దత్ప్రదేశసవిధాతరళోర్మిభుజాపరంపరన్
దమ కొకమేలు గల్గ దిగఁ ద్రావరె యాశ్రితులన్ జడాశయుల్?

44


చ.

కువలయపత్రనేత్ర యొకకుంభమ చాలుఁ దరింపఁజేయ ని
కుమ నీ కయత్నకుచకుంభయుగం బది గల్గ నిందనే
రవె? భయ మేల? రమ్మని కరంబుల నీడ్చిన వ్రాలుభీరువున్
వివృతభుజాంతరస్థలనివేశితఁ జేసెఁ బ్రియుండు నవ్వుచున్.

45


క.

నిలువున నీఁదుచు రమ్మీ, కొలఁదియ యన నేగి మునుఁగుకొలఁదిన యిరుచే
తులఁ బట్టి యెత్త భయమునఁ, గలకంఠి యొనర్చె విటునికంఠగ్రహమున్.

46


తే.

ఇంతిదరినుండి చివ్వున నెగసి యుఱుక, నురువుకొని నీరు వలయ మై పొరలి విరియ
నడుమ నుదయించెఁ జక్కనినగుమొగంబు, మధ్యమానాంబునిధిఁ జందమామవోలె.

47


తే.

ఒత్తిగిలి యీఁద నీటిపై నొంటిఁ దోఁచు, కొమ్మవదనాంబుజముపొంత కుచము గాంచి
కవదొఱంగినచక్రవాకం బొకండు; తోడిప్రియసతి యని ప్రీతిఁ గూడుకొనియె.

48


చ.

అలరి యొకింతమాఱుమొగ మై యఱచేతుల నొగ్గికొన్న న
చ్చలమునఁ గాముకుండు పయిఁ జల్లెడునీటిమెఱుంగుఁదుంపరల్
చెలువచనుంగవన్ బొలిచెఁ జేరి తదీయనఖాంకచంద్రులన్
గొలిచి వినూతనద్యుతులు గొల్పెడుతారకపఙ్క్తులో యనన్.

49


క.

అనులేపనములు గరఁగిన, చనుఁగవల నఖాంకురములు సతులకుఁ దగునా
ననపూర్ణవిధులవలనను, ఘన మై జాఱిపడి యొప్పుకళలో యనఁగన్.

50


ఉ.

చల్లెడునీటిపై మలయజంబు గరంగిన నింతిచన్నులన్
బల్లవితోరుకాంతి గనుపట్టెడుకెంపులు చూచుశంకమైఁ
బల్లవుఁ డొక్కఁ డివ్వలిసపత్నిమొగంబున నీరుతోడుతో
గళ్లుపడ న్వడిన్ బెడమొగం బగునట్లుగఁ జల్లె నార్చుచున్.

51


తే.

ధవుఁడు చల్లెడుకరవారిధార లెట్టు, లోర్చెనో కాని తరలాక్షియొద్ద సవతి
తత్కుచాఘాతఘట్టనోత్పతిత మగుచు, నొక్కతుంపర పైబడ్డ నోర్వ దయ్యె.

52

క.

మును జలము సవతిపైఁ జ, ల్లినఁ గినుకం గొలనువెడలులేమ విటుఁడు వె
న్కొని యొకబిసతంతువునం, దనువు దవులు వ్రేసి పట్టు దా నన నిలిచెన్.

53


ఉ.

క్రొవ్వున నప్పయోరుహముఖుల్ జలఖేలన మట్లు సల్పఁగాఁ
ద్రెవ్వినహారరత్నవితతద్యుతికాంతుల మ్రింగి పూఁతలుం
బువ్వులుఁ జూపుచున్ బయలు వూనె సరోవరసంఘ మట్లపో
యెవ్వఁడు నల్పలాభమున కేల వహించుఁ బరార్థలాభమున్?

54


చ.

అతివలు పల్లవు ల్జలవిహారము చాలిచి నిర్గమింపఁ బ్ర
చ్యుతవివిధాంగరాగకుసుమోత్కరభూషణభూషితంబు లా
యతపరిమర్దనిర్దయహఠాకృతికంబులు నై కొలంకు లు
ద్ధతసురతాంతముక్తమృదుతల్పతలంబులుఁ బోలెఁ జూడఁగన్.

55


క.

ఖేలనము చాలి వెడలెడు, నాళీకవిశాలలోచనం బాయుటకుం
జాలక తారును వెడలెడు, పోలిక మునుమును తరంగములు దరి కెక్కెన్.

56


ఉ.

త్రస్తకురంగలోచనలు దర్పకముద్రలు చాటుగాఁ గృత
స్వస్తికహసయుగ్మములఁ జన్నులు చెక్కులు గప్పి పార్శ్వప
ర్యస్తకచాగ్రభాగముల నంబుపరంపర జాఱ నంసవి
న్యస్తనతాస్య లై వెడలి రంబురుహాకరతీరభూమికిన్.

57


ఆ.

సతులమేన గాఢసంశ్లేషసుఖమున, నార్ద్రతరము లైనయంశుకములు
కరఁగిపోయెఁ గాక కాదేని ప్రకటంబు, లగుట యెట్లు వారియవయవములు.

58


తే.

వర్ణమాత్రంబునన కాక వారిదముల, వర్షగుణమున గెలువంగ వలసి పోలె
సూటిధారాళవర్షంబు చూపె నపుడు, కరనిపీడితకామినీకచభరములు.

59


తే.

బహురసార్ద్రతఁ దము వంటి పాయలేని, వసనములు డించి సతులు నీరసము లైన
క్రొత్తమణుఁగులు వేడ్క గైకొనిరి యహహ! ప్రియము గైకోరునూతనప్రియలుసతులు.

60


చ.

స్మరపరిదత్తహస్తములు సర్వసమీక్షణభాగధేయముల్
తరుణిమరత్నసానువులు దర్పకదర్పలతావసంతముల్
వరహృదయానురాగరసవార్ధివివర్ధనపూర్ణచంద్రమః
కరములు వేడ్కఁ గైకొనిరి కాంతి లలంకరణంబు లయ్యెడన్.

61

సూర్యాస్తమయవర్ణనము

తే.

శ్రీసమగ్రత నట్ల కైసేసి యున్న, సుందరీజనముల కర్థిఁ జూపఁ దగిన
యరుణమణిమయ మగునిల్వుటద్ద మయ్యె, నప్తగిరిపేరిపేటియం దహిమకరుఁడు.

62


తే.

శాంతి దిగఁబాఱఁ బ్రాచిముఖంబునందు, బద్మినీముఖవికసనప్రౌఢి సడలె
భానుఁ డప్పుడు మధ్యస్థభావ ముడిగి, కాంక్ష నపరానుషక్తి రాగము వహింప.

63

తే.

పద్మినీభోగలబ్ధసంస్పర్శనమునఁ, గలితమైనపరాగరాగమునఁ బోలె
భానుకరములు దివసావసానసమయ, సమధికోత్ఫుల్లపల్లవచ్ఛవి వహించె.

64


చ.

వెనుకొనుదృక్పరంపరలవెల్లువలన్ బతితాభిసారికా
జనములు త్రోవఁ ద్రోవ నలచక్రయుగంబులు గాతరావలో
కనములఁ ద్రిప్పఁ ద్రిప్పఁ జనఁ గ్రమ్మఱ నేరక పోలెఁ బశ్చిమా
వనిభృదధిత్యక న్నిలిచె వారిజబాంధవబింబ మయ్యెడన్.

65


తే.

తొంటితేజంబు దూలినఁ దూలనిమ్ము, కాలగతి దాఁట శక్యంబె ఖరకరునకుఁ?
జాలదా భాగ్య మిది? యెల్ల జగము మ్రొక్కె, నస్తసమయవేళ నుదయంబునందపోలె.

66


చ.

చరమధరాధరాగ్రమునజాఱెడువేళఁ బతంగుఁ డంగజ
త్వరితమనస్కమై నిలిచి తన్నుఁ గనుంగొనుసౌధశేఖరో
పరితరుణీజనంబుముఖపద్మములన్ వికసింపఁ జేసె స
త్పురుషులు తారు దుర్దశలఁ బోవుచు నైననుఁ బ్రోతు రాశ్రితున్.

67


తే.

అహిమభానుండు చనుదేర నస్తశిఖరి, సరవి నర్చించుకుంకుమాక్షతము లయ్యెఁ
బరిణతాతపసంధానభాసమాన, శిఖరసానుఝరోద్ధూతశీకరములు.

68


ఉ.

క్రొత్తగ దీర్ఘికానికటకుంజగృహంబులఁ దల్పకల్పనా
యత్తము లైనమత్తకరు లాత్మకరాగ్రము లెత్తి పల్లవో
పాత్తమనస్కత న్వెరఁజి యాడఁగఁ జొచ్చెఁ బరిభ్రమించుభూ
భృత్తరువాటికావిటపబృందమిళజ్జరఠాతపంబులన్.

69


వ.

అప్పుడు.

70


సీ.

మొగడలబిగివీడుతొగల నంకూరించు, క్రొత్తనెత్తావి మూర్కొనుచు నులుకు
నిష్ప్రభం బై నీట నీడఁ దోఁచినభాను, బింబంబు గని భీతి బీఱువోపు
బాష్పంబు చూడ్కిఁ గప్పఁగఁ గూడి యుండియు, వికలకంఠముగ నొండొకటిఁ బిలచుఁ
గసిగాటు గఱచినబిసనాళములఁ జంద్ర, కరశంక సంధిల్లి మరలఁ గ్రాయు


గీ.

నీడ లను బుద్ధి నొండొంటిఁజూడ కనలి, నీడ లొండొంటిఁగాఁ జూచి కూడ నరుగు
భావివిరహవ్యధాభయభ్రాంతివలన, శోకపరవశ మై చక్రవాకయుగము.

71


ఉ.

కుత్తుక లెత్తి బిట్టులికి క్రుంకురవిం గని దీనవృత్తితో
నొత్తినభావిదుర్భరవియోగభరంబున నొండొకంటిమో
మత్తమిలం గనుంగొనురథాంగయుగంబుల దృష్టి గప్పుఁ బో
మిత్తుగఁ గన్నునీ రొదవి మించినచీఁకటికంటె మున్నుగన్.

72


ఉ.

ఆంతరభక్తి మజ్జనకరాష్ట్రము లబ్జములు న్ముణుంగఁ గాఁ
గాంతులరాక నంగనలకన్నుఁదొగల్ తొగలున్ దలిర్పఁ గా

దొంతరగా వియోగినులదుఃఖతమంబుఁదమంబుఁ బర్వఁగా
నంతట భానుబింబ మపరాంబునిధానములో మునింగినన్.

73


క.

బలు పగుచీఁకటిరాకకుఁ, దలఁకెడుమతి నాకసంబు తనమణిజలసం
స్థలమున నిక్షేపించిన, పొలుపునఁ బశ్చిమసముద్రమున రవి గ్రుంకెన్.

74


చ.

అనలముఁ దేజమున్ బ్రకుపితాంబుజనేత్రల రాగమున్ రణాం
గనివహమున్ ద్రితాపమును గాల్కొననిల్వఁగ లేమి పుంశ్చలీ
జనముఁ బ్రవర్ధమానకరసఖ్యవియోగులచిత్తవృత్తి గా
దినకరుఁ డస్తమించినఁ దదీయగుణంబులు చేరె నిన్నిటన్.

75


సీ.

ఇనకరాకులజగజ్జనతాలవృంతంబు, నిద్రాణపద్మినీనిశ్శ్వసితము
కైరవిణీబోధనారంభజృంభంబు, తిమిరమత్తేభఫూత్కృతినిపాత
మాగచ్ఛదతనుధ్వజాంచలచ్చలనంబు, విరహిణీప్రాణాభివిగళనంబు
సాంధ్యరాగసుపర్ణచలగరుత్కలనంబు, చక్రవియోగాగ్నిచర్మభస్త్రి


గీ.

రతిసముత్సుకసువదనారభ్యమాణ, ముఖ్యనేపథ్యవాస్తవామోదముదిత
మధుపమధురారవోద్గీయమాన మగుచు, మెలఁగె నయ్యెడ సాయంసమీరణంబు.

76


సీ.

కలపంబు లొడఁగూర్చుకన్యకాజనముల, రమణీయమణికంకణములరవలి
ప్రియులఁ దోతెమ్మన్నఁ బిలిచి తే నరుగుచే, డియలనున్గులుకుమట్టియలయులివు
నడయాస జోకొట్టు ననకంపుటల్లుండ్ర, తఱిమిపోనాడువత్తలయదల్పు
కైసేఁతల నొసంగు కమ్మఁదావులసోలు, నెలదేఁటినిసుఁగులయించుమ్రోఁత


గీ.

కలుపుబాపలరాక యక్కలకు నెఱుఁగఁ, బలుకుచిలుకలకల్కిపల్కులను గలసి
మరుఁడు విడిసినదండుసంభ్రమముఁబోలెఁ, గలకలిత మయ్యె గణికానికాయవాటి.

77


ఆ.

ధర్మపథ మొకింత దలఁపక పద్మలో, చనము లొగి మొగిడ్చి సంజప్రొద్దు
నిదురవోయెఁ బద్మినీజాతి దానఁ బో, సిరి దొలంగి మిగులఁ జెట్టవట్టె.

78


క.

కలువలకు వచ్చునిందిర, తలుపులు ముద్రించి యున్నతామరసగృహం
బులు పా డగుటన్ మూల్గుచు, నలిభూతము లందులోన నధివసియించెన్.

79

సాంధ్యరాగవర్ణనము

క.

మెలఁకువలు చాలి తమతమ, నిలయంబుల కెగసి వచ్చు నెమళులపింఛో
జ్జ్వలరుచులు సాంధ్యరాగా, కులతిమిరోదయము మున్నుకొలిపెన్ దెసలన్.

80


క.

ఇనుఁ డేగుచుఁ జీఁకటివెను, కొనుశంకం గాపు వెట్టికొని పోయినయ
త్యనురక్తికిరణబలమో?, యన సంధ్యారాగ మొదవె నపు డపరదిశన్.

81


క.

సురుచిరకుసుంభవర్ణాం, బరకలితపయోధరాతిభరభంగుర యై
వరుణదిశ యపుడు నూత్న, స్మరానురాగంబు గొలిసె జనులకు నెల్లన్.

82

నక్షత్రవర్ణనము

తే.

శర్వరీచంద్రపరిణయసముచితాంకు, రార్పణక్రియఁ గలయ వియద్విభాగ
పాలికలఁ దోఁచుక్రొత్తజాజాలమొలక, లనఁగ దారక లొండొండ యంకురించె.

83

అంధకారవర్ణనము

చ.

కనుఁగొన నింగిఁ దార లని కల్వలఱేఁ డని చంద్రికామృతం
బని యొకసృష్టి చూపుటకు నై సమయం బనునైంద్రజాలికుం
డనుపమితానుభావమున నందఱచూడ్కులు గప్పుపొంటె వీ
చినయలనెమ్మికుంచియరుచిం దలఁపించె నవాంధకారముల్.

84


ఉ.

తారకశంఖహారయు నుదారతమోసితకంచుకావృతి
స్ఫారయు నైనయారజనిభైరవి భైరవఖేలనంబు పెం
పారఁగ వారుణీకలిత మై రుచి మించినసాంధ్యరాగసం
భారముపేరి భూరినవమాంసతతిన్ గబళించె నంతటన్.

85


చ.

నలుపులయిక్క లంజియలనమ్మినరోవెలపంట జక్కవల్
తలఁపనికీడుకానియన దాయము క్రొవ్విరితమ్మిలచ్చికిన్
వెలిచవిగోరుదుండిగపువేడుకకత్తెలనోమునోఁత గూ
బలమణిహంబు జారులకుఁ బండువ చీఁకటి పర్వె నుర్వరన్.

86


శా.

కస్తూరీతిలకంబు లై హరిశిలాకల్పంబు లై కజ్జల
ప్రస్తారక్రియ లై నవాగురుమషీపంకానులేపంబు లై
శస్తానీలపటావకుంఠనము లై జన్మించె దిఙ్నామనా
రీస్తోమంబులయందు నూతనతమోరేఖాంకురశ్రేణికల్.

87


ఉ.

లోకమునన్ గులాచలము లున్నతరూపకులంబుఁ జూడఁ గా
నేకవిధంబు కాఁగ నుదయించిన చీఁకటిచేత నయ్యెడన్
బైకొని వచ్చుదుర్విటులభావము వేఱుగనీక సామ్యమున్
గైకొన కున్నె వృక్షగణికావళిదంతురగండపాలికల్?

88


చ.

ఎరియు దంతురస్థలులనే శయనింపఁ దమాలపల్ల వా
స్తరణము లై యనావృతి నశంక వసింపఁగ నీలిచేలపెం
దెర లయి యొండొరుం బిలిచి తేరఁగ నర్మసఖీజనంబు నై
యరుచుగ జారదంపతుల కత్యుపకారము చేసెఁ జీఁకటుల్.

89


సీ.

కలయిండ్ల కరిగెడుకన్నంపుదొంగల, నీలికానెలదీప్తి నిండెఁ గాక
గద్దించి చనుదుండగపువేడ్కకత్తెల, మైలచీరలచాయ మలసెఁ గాక

ముకుళితవికసితాంబురుహోత్పలములకు, నెడయాడునలికాంతు లెసఁగెఁ గాక
విటులకై మెండాడువీథులజంతల, పెనుఁగాటుకలకప్పు బెరసెఁ గాక


గీ.

వాడఁబాఱెడువిరహిణీవదనసమితి, కందుపొందున నగునల్పు గలసెఁ గాక
కానినాఁడింతదట్ట మీఁ గలదె మొదల?, ననఁగ జీఁకటి యంతంత కగ్గలించె.

90


సీ.

కరఁచి చిప్పలఁ బట్టుకత లెఱుంగము గాక, వ్రాయంగ నిది మషీరసము గాదె?
యిది గుణంబులు సేయువిర వెఱుంగము గాక, నీలాలసరులు గా నింపరాదె?
కరవటంబులఁ బెట్టువెఱ వెఱుంగము గాక, వనితల కిది నవాంజనము గాదె?
కడవలఁ గొని ముంచుగతి యెఱుంగము గాక, చేలల కిది మంచినీలి గాదె?


గీ.

పోవఁ డే నిది రవి నైనఁ బొదువుఁ గాదె? యంక మను పేర నురముపై నచ్చు దా
గాక శశి నైన దిగమ్రింగుఁ గాదె? యనఁగఁ, బ్రబల మై గాఢతమతమఃపటలి పర్వె.

91


తే.

అర్కు వెన్నాడి రాజశుద్ధాంతగణముఁ, దారకల బందెఁ గొని యెందు మాఱు లేక
యంధకారంబు జృంభితం బైన దీప, కలిక లతిభీతి శరణాగతము లయ్యె.

92


వ.

ఇట్టి గాఢాంధకారం బుదయించుటకు మునుమున్న.

93

జారవిటవిటీవర్ణనము

సీ.

మడమలు మోవంగ మైలచీరలు గట్టి, కర్ణముల్ మోవంగఁ గాటుక లిడి
మోఁచేతిపట్టులు మోవ గాజులు దొడి, గలకముల్ మోవఁ గొప్పులు ఘటించి
వెడలి గద్దువ మోవ వీడియంబులు చేసి, కాంక్షఁ జెంపలు మోవ గంద మలఁది
చెక్కిళ్లు మోవంగఁ జెవుల నాకులు వెట్టి, బొమలు మోవఁగఁ జుక్కబొట్టు దీర్చి


గీ.

భావభవుచేతివిడివాటుబడియద్రుడ్లు, సంజప్రొద్దున బలుపిశాచములుఁ బోలె
మెదల భయము గ జనుఁ బట్టి వదల రైరి, వీథు లరికట్టి పురి గట్టివేశ్య లపుడు.

94


సీ.

చిటికలు వ్రేయుచుఁ జిఱుపాట పాడుచు, జార్చి పయ్యెదఁ గూడఁ జేర్చుకొనుచుఁ
గన్నరూపము నెల్లఁ గరసంజ్ఞఁ బిలుచుచు, నెటకేనిఁ జనువాని కెదురు సనుచుఁ
గడచి పోవచ్చినఁ గౌఁగిటఁ బట్టి నీ, వా? యంచు వదలి మోహంబు రేఁచి
చూపినవెలకు నంతే పొ! యనుచు జంకె, వేయుచు రోయుచు వెంటఁబడుచు


గీ.

రూక లడుగుచు దుదిఁబచ్చనాకు కైన, నొడఁబడుచు హస్తగత మైననొడియ నడిచి
దొడ్డబందాటమునఁ గోకఁ ద్రోసికొనుచు, గుడిసెజంతలు తెరువాటుగొట్టి రపుడు.

95


చ.

ముడిఁగిముసుంగుతో వెనుక ముందును జూడక వచ్చి లోనికిం
దొడుకొని పోయి వ్రేలిడిన ద్రొబ్బినఁ బెంపునకుం బసిండికిం
జెడి తముఁ దార తిట్టుకొని చీ యని కేలు విదిర్చి రోయుచున్
గుడిసెలు దూఱి వెల్వడరి క్రొత్తగుసిగ్గరిమిండ లయ్యెడన్.

96

కాంచినవారు గారు బిగికౌఁగిలి మెల్లనిచొక్కుపల్కు లా
లించినవారు గారు నెలలేమలకున్ రతి నొక్కవృత్తి దోఁ
పించినవారు గారు తమి పెక్కువతో వెల లిచ్చి తీర్చి ర
ప్పంచశరుండు పూఁట యగుపత్రము లేనిఋణంబు హాలికుల్.

97


ఉ.

ఒత్తిలి రిత్త పైకొనుచు నొంటన రెంటన నిద్ర పుచ్చుచున్
మెత్తన లేచి దీపము శమింపఁగఁజేసి శయింపఁ బ్రక్కలన్
దొత్తులఁ బెట్టి వచ్చి తమతొల్లిటిమిండలఁ గూడికొంచు నో
ర్మొత్తిరి క్రొత్తరోయిడినమొప్పెల గద్దరిలంజ లయ్యెడన్.

98


సీ.

పథికులఁ గని తానుఁ బథికుఁ డై యొకకొంత, నడచి ముందరివారిఁ గడపి మరలు
వరములు దయసేయ వలరాచదేవర, వలగొనుగతిఁ జుట్టి వచ్చు నిల్లు
లోలతఁ జెవి యొగ్గి లోనిచప్పుళ్లకు, డిల్లమై వడి నిగిడించు నూర్పు
కడయింట నత్త మేల్క ని బిట్టు దగ్గిన, నిరుగాల నిలువక యేగు బెగడి


గీ.

యడిగినంతయు రో యిచ్చినట్టిక్రొత్త, కోడెఁ జేకొని తను వెళ్లఁగొట్టుటయును
భ్రాంతి తనవల్పులంజియఁ బాయ లేక, వ్రీడ యించుక లేనిచేబోడిబొజుఁగు.

99


వ.

మఱియును.

100


మ.

కుటిలాకారత వామదక్షిణకరాంగుళ్యగ్రజిహ్వాసకృ
ద్ఘటితస్ఫోటనముష్టిఘట్టనదటద్ఘట్టాదినానావిధో
ద్భటఘోషంబులతో నదూరపదవీపాంథావలీశృంఖలల్
ఘటచేటీగతిసంభ్రమంబు లెసఁగన్ గ్రం దై పురీవీథులన్.

101


వ.

తదనంతరం బాగాఢాంధకారంబున.

102


ఉ.

కోటలు బొమ్మరిండ్లు మఱి కొండలు తాఁపలు దివ్యదృష్టికిన్
గాటుక లంధకారములు గాఁ జని కందువపట్లఁ బాంసులా
పాటలగంధు లొంది రుపభర్తలతో మణితాదు లైనజం
జాటము లేనికూటముల సాహసకల్పలతాఫలంబులన్.

103


చ.

కులసతిశిష్టమార్గమునకు న్మది నిల్పిన దాఁటరామికిన్
గులము మహాంబురాశి పతి కొండ గృహాంగణ మంధకూప మా
కులసతిదుష్టమార్గమునకు న్మది నిల్పినయేని దాఁటగాఁ
గుల మొకగోష్పదంబు పతి గుండు గృహాంగణ మాటప ట్టగున్.

104


చ.

కనఁబడువార లెల్లఁ దనుఁ గన్నిడిరే సవి విన్న పల్కు లె
ల్లను దనుఁ గూర్చియే సవి తలంకున గొంకుచు నైన సాహసం

బునఁ దగ వచ్చి యట్టె వెఱవోవఁగఁ గౌఁగిటఁ జేర్చు బిగ్గరన్
వనిత ముహూర్తమాత్ర ముపవల్లభునిం దొలుక్రొత్తఱంకునన్.

105


చ.

వడఁకకు మింక నిచ్చటికి వచ్చితి వేవురు గానకుండ వి
డ్విడు మిది నీవికంచు లికవీడినఁ బై చెమటాఱుఁ గాని లో
గడియకు మంచుఁ దెల్సి నవజారిణి నొక్కఁడు తొంటిమేనులం
బడిసినభాగధేయపరిపాకము గాఁ గదియించెఁ గౌఁగిటన్.

106


సీ.

శ్రవణయోగ్యం బైనశబ్ద మొక్కఁడు లేక, ప్రియము గొల్చెడునలం క్రియలు లేక
సరస మై మృదు వైనశయ్యగల్గుట లేక, యర్థసంగ్రహము పై నర్థి లేక
వరుఁడు వట్టినచోటఁ బ్రత్యుత్తరము లేక, ప్రాణహానికిఁ గొంకుపాటు లేక
వర్ణగౌరవలాఘపములపై మతి లేక, వృత్తభంగమునకు వెఱపు లేక


గీ.

తారుదారయ తక్క నెవ్వారు నొరులు, దడన రొకమూలఁ బడి ప్రసిద్ధములు గాకఁ
యపు డవిద్వత్ప్రబంధంబు ననుకరించె, జారిణీజారనవరహస్సంగమములు.

107


వ.

ఇట్టిజారచోరవిహారంబులు చెల్లుచుండ మఱియును.

108


చ.

అలిగినవారు వట్టియడియాసల మోసలఁ జేరి చొచ్చి పో
నులికినవారు పండువుల నూడనిఁ బాడినవారు వింతరో
వెల గొని తమ్ము నత్త లిలు వెల్వడఁ ద్రోలినవారు నాదిగాఁ
గలవిటు వెల్ల నొక్కయెడఁ గాల్కొని గోష్ఠి యొనర్చి రయ్యెడన్.

109

వేశ్యామాతృగర్హణము

సీ.

భావింపఁ దీర్థపురేవుకాఱుమొసళ్లు, చెఱకుపైఁ గ్రొవ్వాఁడికఱకుఁబేళ్లు
గెంటనితేనియజుంటిపై యీఁగలు, పూచినమొగలిపైఁ బొరలుముండ్లు
పంటచేలకు నాఁగఁబడినయోదంబులు, గందంపుఁదీవెల కాలఫణులు
కదలక పెన్నిధిఁ గాచుదయ్యంబులు, రచ్చరావులబొమ్మరక్కసియలు


గీ.

లంజతల్లు లనఁగ లక్షింపఁగా నిట్టి, కట్టిఁడులకు నలువ కరుణ లేక
బాఁతిమాలినట్టిబ్రతుకులు నిడుపుగాఁ, జేసి విటులగోడు వోసికొనియె.

110


ఆ.

గణికవలని దెంతఘన మైనసుఖ మేని, దానితల్లివలనఁ దప్పిపోవు
మదిఁ దలంప నెట్టిమధురాన్న మేనియు, నీఁగ దొరలె నేని నిందు టెట్లు.

111


సీ.

భావజు విడిచినపాడింటిపై బొల్లి, పాదుట్రుగతి మేనఁ బలిత మొదవ
నంటుండకుండఁ బ్రాయము దుల్పుకొనుమాడ్కి, పడుచన్ను లేచి చప్పట్లు చఱవ
ననుభవేచ్ఛావిలాసాదులఁ దిగిచిన, కొఱ్ఱునాఁ జేయూఁతకోల యూఁది
యుండుటఁ గష్ట మే నొల్ల మే ననునట్లు, పలుమాఱు విడువక పడఁత వడఁక

గీ.

నున్నలంజతల్లిఁ గన్నచో నల్లుర, గుండె భగ్గు రనుచు నుండ దెట్లు?
తేరిచూడ వెరచి చేగదు మృత్యువు, దానఁ గాదె చావు దప్పి మనుట.

112


వ.

మఱియు నుడుగువోయినమ్రాఁకునుంబోలెఁ బండ్లు డుల్లి, ప్రాంతవలయునుంబోలెఁ
గన్నులు చెదరి, పిఱికిబంటునుంబోలె నిలువక బొమ్మలు వదలి, గర్వగ్రంథియుంబోలె
వినక, పాడిల్లునుంబోలె వెన్నొరగి, ముదిరిన మొగలిచెట్టునుంబోలె నేలమోవం జన్నులు
డిగి, యెంటనికాపుప్రజయునుంబోలె నిండెలు దొలంగి, యినుపముట్టునుంబోలెఁ
గాలిసత్వం బుడిగి, కూలినబావితెఱంగున నడపలేక, మోఁపరితలయునుంబోలె బట్టగట్టి,
తగవుగోరియుంబోలెఁ గూడఁబెట్టుచు, ముట్టంబడిన రోగంబునుంబోలెఁ జొరవయీక
జరానివాసంబగుచు లంజతల్లి పెక్కేండ్లు బ్రతుకుటకు నిటులపాపంబ కారణంబు.

113

వారవనితాదూషణము

సీ.

చంక్రమక్రమశీల శాఖామృగంబులు, భద్రద్విపశ్రవఃప్రాంచలములు
ధారాధరోదరోదయతటిల్లతికలు, వహ్నిసముజ్జ్వలజ్జ్వాలశిఖలు
గోపురోపరిపతాకాపటముఖములు, పరిదృశ్యపిప్పలపల్లవములు
తరుమరుచ్చలదళాంతరగతాతపరేఖ, లూర్మిమాలిసముద్యదూర్మిలతలు


గీ.

వెలచెలువలచిత్తవృత్తు లాజన్మచం, చలతరంబు లింత తెలిసి తెలిసి
నేర్తు ధనము లిత్తు నిలుపుదు ననిపాఱు, విటుఁడు శుద్ధమైనవెఱ్ఱి గాఁడె.

114


క.

రూపముచెలు వది చిత్తరు, రూపంబులయందుఁ గలదు రుచి గొని సతి దన్
బైపడనిచోట మన సిడు, పాపపువిటుకంటె లంజబందయుఁ గలఁడే?

115


ఉ.

ఒక్కని విన్నదాఁక మఱియొక్కరుపైఁ దలఁ పైనదాఁక వే
ఱొక్కనిఁ గన్నదాఁకఁ దను నొక్కఁడు పైకొని సోఁకుదాఁక నొం
డొక్కనిఁ దక్కు చూపి తగు లూడ్చెడునంతటిదాఁక మిండచే
రొక్కము చెల్లుదాఁకనె సరోరుహరోచనలందుఁ గూరుముల్.

116


క.

మధురములానెడునాలుక, విధురమతిం బులుసు గొనఁగ వేడుకపడున
ట్లధికుఁడగువిటునిఁ గూడియు, నధముని మదిఁ గోరకుండ దంగన యెట్లున్.

117


తే.

కువిటుఁ దగిలినమది చాటుగొనదు గాని, వెలసతికిఁ గూర్మిరసికుపై విఱుగుఁ దఱుచు
హేయ మగుముట్సు మెక్కిన నిందుఁగాక, యెందు శునకంబునకు నెయ్యి యిందు దెట్లు?

118


తే.

విటుఁడు రో యిచ్చివేశ్య నిల్పుటయె కాని, యొరులఁగోరెడు గుణమెట్లు నుడుపలేఁడు
డొల్లునీరంబు నాఁకట్టఁ జెల్లుఁగాఁక, డొల్లుగుణ మది మాన్పంగఁ జెల్లు నెట్లు?

119

వ.

బలిమిం గట్టకట్టి యాకఁట్టంబడియును బ్రవాహంబుం నిజప్రవహణంబు విడువక
ప్రవహణద్వారంబుల వెదకుచుం జిరకాలంబు నిలిచి యేనియుం గనుమ గలిగినం బ్రవ
హించుచందంబున వారవనితమనంబును ధనప్రదానాదిసకలప్రయత్నంబుల నిలు
పంబడియును మార్గాంతరంబులు వెదుకుచుం బెక్కుదినంబులు ననుపువడియును నెడరు
గలిగిన నొండొక్కనిం గూడుకొనునది స్వభావగుణంబు.

120


సీ.

ధనమాస వేఱొండు దలఁపద యే నది, జలజలోచనకు నౌషధపుఁగూర్మి
ఘనునొద్ద నుండియుఁ దన కాసపడియె నేఁ, బొలఁతుక కదియె యూర్పోకకూర్మి
తగిలినచో నెల్లఁ దహతహ నొందె నేఁ, బోటికి నది యలవాటఁ గూర్మి
తనకట్లకెలనికిఁ దనమేలు చూపు నేఁ, జేడియ కదియు వైశికపుఁగూర్మి


గీ.

తనదు పైత్యభ్రమంబున ధరణ దిరిగి, నట్ల యగుభంగి విటుని మోహమునఁ దోఁచుఁ
గాన నిక్కంపుఁ గూరిమి గణికయందుఁ, బొరయదిలఁ బొర్సెనే నది తెరువుపెసర.

121

చంద్రోదయవర్ణనము

తే.

అనుచు నీరీతి ముచ్చట లాడుకొనఁగ, విటకుమారులదుర్గోష్ఠి వినఁగ వినఁగ
యామినీకాంత కుదయించునలఁతినవ్వు, తెఱఁగుతో నంతఁ దూర్పునఁ దెలుపు దోఁచె.

122


క.

ఎల్లయెడయుఁ జీఁకటిచే, నల్లనయై తొడిమపట్టు నాఁ దూర్పునఁ బా
టిల్లెడుచిఱుగెంపున నభ, మల్లోనేరేడుఁబంటియాకృతిఁ జూపెన్.

123


వ.

తదనంతరంబ.

124


సీ.

అంగసంభవుప్రోషితాలంభవిధిఁ బ్రతి, ష్ఠింప నుండెడు హోమశిఖి యనంగఁ
దిమిరాఖ్యభూతతృప్తికిఁ బ్రాచి యనువేఁట, నఱకిన మెడపట్టువఱ కనంగ
నాతపతప్తకల్హారలక్ష్మికి నిశాంగన, యిచ్చుమడఁతచెంగావి యనఁగ
గౌముదీసుధ వోయఁగాఁ జకోరములకు, నలువ యెత్తెడురత్నకలశ మనఁగ


గీ.

జారతస్కరలోకసంహారమునకు, సమయ మనియెడునలికలోచనుఁడు చాలఁ
గినిసి తెఱచినయలికలోచన మనంగ, నిండుఁగెంజాయఁ బూర్ణచంద్రుండు వొడిచె.

125


క.

సమధికవిరహవ్యధఁ బడి, భ్రమసినకోకంబు లుదయపాటలుఁ జంద్రుం
గమలాప్తుఁడు వొడిచినసవి, నిముసము మిథ్యాప్రమోదనీరధిఁ దేలెన్.

126


క.

తొలిఁదొలిఁబొడమెడువెన్నెల, మొలకలఁ బైకొని చకోరములు మేయంగాఁ
గలువచెలికాఁడు పొడిచిన, తొలుదెసనుం దమము కొంత దొలఁగక యుండెన్.

127


క.

ముంగోలుమొలకవెన్నెల, లం గలఁగంబడు తమంబులం గలగగనో
త్సంగము గంగాయమునా, సంగమముం దలఁపు చేసె సజలాకృతి యై.

128


ఉ.

చెందిన కూరిమిం దిమిరచేలము వీడఁగ నైందవోపల
స్వందమునం జెమర్చి కమలాక్షముల న్మొగిడించుయామినిం

జందురుఁ డంగరాగరుచి జారఁ గవుంగిటఁ జేర్చి పొందె స్వ
చ్ఛందతఁ దారకాకుసుమసంకుచితాంబరతల్పమధ్యమున్.

129


తే.

ఇంచుకించుక శశి యుదయించునపుడు, తఱుచుఁజీఁకట్లు భీతిమైఁ దఱిసి దాఁగె
ముకుళితాంబుజపుటకుటీమూలములనొ?, సభయమూర్ఛితవిరహిణీస్వాంతములనొ?

130


చ.

సుదతులనున్న గ్రొవ్వెదలు చొచ్చెనొ? కాంతలరోమరేఖలం
దొదిఁగెనొ? పుష్పకోమలులయోలపునాభుల లీన మయ్యెనో?
ముదితలచూడ్కిఁ జేరె నొకొ? ముగ్ధలఱెప్పలలోన డాఁగెనో?
వెదకిన లేకపోయె నభివృద్ధతమంబు విధూదయంబునన్.

131


క.

ప్రమథపతిమూర్తిచంద్రుఁడు, తిమిరగజాసురు వధించి తిత్తొలిచినత
త్సమధికచర్మముఁ దాల్చిన, క్రమమున సంకంబు కడుఁబ్రకాశిత మయ్యెన్.

132


చ.

కరమిళనంబుచే ముఖవికాసము గల్గగఁ జేసి వెల్వడన్
దెరు వఱి చిక్కి యున్న యలతేంట్లను లోపలికందు నాపివి
స్ఫురితపరాగహాసపరిపూరితఁ జేసి మధుచ్ఛలంబునన్
గరఁగఁగఁ జేసి మానసము కైరవిణీప్రియఁ జంద్రుఁ డయ్యెడన్.

133


చ.

అనుపమకాలచక్రఘటయంత్రవశంబునఁ జంద్రమండలం
బనుపటికంపుగుండ్రఁ గలయంబడ నొల్కుచు సాంద్రచంద్రికాం
బునిధిసముద్ధతామృతము ముంచె జగం బనుపేరిసస్యము
న్దినకరతీవ్రతాపనిహతిం గలవా డఱి తొంగలింపఁగన్.

134


సీ.

పైసుధారోచిబింబము తక్రమునయందు, మునిఁగి తేలెడువెన్నముద్ద గాఁగ
మహి విశ్రమించుదంపతులు పాల్కడలిలో, భాసిల్లుదివ్యదంపతులు గాఁగ
నింగినాడుచకోరనివహంబు మిన్నేటఁ, గలయ నీఁదెడునంచకొలము గాఁగ
దెసలఁ గైరవసముత్థితపరాగము వజ్ర, మయశైలతటులపై మంచు గాఁగ


గీ.

మీఁదఁ దొట్టి క్రింద మిక్కుటం బై యంత, రాళ మెల్ల నిబ్బరముగ ముంచి
యెల్లకడలయందు మొల్ల మై పండువె, న్నెల జగంబుకుక్షి నిండి వెలిఁగె.

135


క.

కడలేనియచ్చవెన్నెల, నడుమం జంద్రుండు మంథనగమునఁ దరువం
బడు పాలకడలి మును దాఁ, బొడమి పయిందేలువిధముఁ బొందుగఁ దెలిపెన్.

136


ఆ.

పాలకుండవోలె బ్రహ్మాండ మప్పుడు, జీర్ణచంద్రికాభిపూర్ణ మగుచుఁ
బాలు గ్రోల మీఁదఁ బైకొన్న ఫణిఫణా, బింబ మనఁగ నిందుబింబ మలరె.

137


తే.

మించి వెన్నెల జగ మెల్ల ముంచినపుడు, తఱచుఁజీఁకట్టు భీతిమైఁ దఱిసి డాఁగె
ముకుళితాంబుజపుటకుటీమూలములనొ?, సభయమూర్ఛితవిరహిణీస్వాంతములనొ.

138

చ.

కరఁగెడుచంద్రకాంతములఁ గాలువ లై ప్రవహించునీటనో?
విరియునవోత్పలావళుల వెల్లువ లై చనుపువ్వుఁదేనెనో?
తొరఁగువియోగిబాష్పములతోరపుటేఱులచే సమృద్ధినో?
పొరిఁబొరి నింగి మింగుచును బొంగెఁ బయోధి విధూదయంబునన్.

139


ఉ.

పిల్లల కెల్ల మేపి మును పేర్చిన వెన్నెలతీఁగెలేఁగొనల్
కొల్లఁగఁ దారునుం బతులుఁ గుత్తుకబంటిగ మేసి గూండ్లలో
వెల్లులు గూడఁ బోసికొనువేడుకఁ బుక్కిటఁ బట్టి చీఁకటుల్
జల్లునఁ బాఱఁగా నుమియుఁ జాఁగినకోరిక లంజకోరికల్.

140


వ.

అప్పుడు.

141

యువతీశృంగారకేళివర్ణనము

క.

ఇతరశరంబులు గాఁ డని, యతివలయభిమానకవచ మతనుఁడు సించన్
సితకరశాణసముత్తే, జితకువలయసాయకములచే నట్టియెడన్.

142


తే.

తప్పు లొనరింప కైన నాతప్పు లెన్ని, తారు మును ద్రోచిపుచ్చుటే త ప్పటంచుఁ
బ్రియుల దోతేర సఖుల నంపిరి వనితలు, తప్పు తమ దని ప్రణయంబు చెప్ప నేల?

143


ఉ.

త్రోచినమీఁదటన్ మరలఁ దోకొని వచ్చుట కెన్నిభంగుల
న్నేచినదాన వీ నయిన నిన్నిటు వంపఁగఁ జాల నిక్కువం
బోచెలి! నీవ నే నగుచు నుండుటఁ బోయిననిన్ను నన్నకాఁ
జూచి యతండు లాఘవము చూపెడునో యని యేమి సేయుదున్?

144


ఉ.

ద్రోహములేనిచోట విభుఁ ద్రోచినద్రోహఫలంబు గాదె న
న్నీహరిణాంకుఁ డింత యెరియించుట? వెన్నెల కోర్చునంతనే
సాహసి నెట్లు? నాయెడఁ బ్రసన్నకృపామతి వై లఘుత్వసం
దేహము లేక వల్లభునిఁ దెచ్చువిదగ్ధవు నీవు నెచ్చెలీ!

145


చ.

ఎడయెడమాట లేల? చని యేన ముఖాముఖిఁ బిల్తుఁ బిల్వఁ గాఁ
నొడఁబడి రాఁడ యే నతని కొప్పనసేయుదుఁ బ్రాణ మన్న నీ
నడుమన నన్ను జీవము గొనం దలకొన్నది యోవయస్య! యీ
విడువనివేలమై కురియువెన్నెలచిచ్చున కేమి సేయుదున్?

146


తే.

అనుచుఁ బ్రియదూతికలతోడ నాడికొనఁగఁ, బలుకు లవి చాటువడి వించుఁ బతులు లోని
తుకతుకలు మాని క్రొత్తవేడుకలు వొదల, బయలువడి వల్లభల సిగ్గుపఱిచి రపుడు.

147

చ.

తడయుట కోర్వలేక యొకతన్వి మనఃపరికల్పనంబుచే
నెడపక వల్లభుం డెదుటి కేర్పడ వచ్చినయట్ల తోఁపఁగా
నుడుగనికోర్కులం బొరలుచుండి యతం డరుదేరఁ గాంచియుం
దడియక యుండె నెప్పటి విధంబునఁ గౌఁగిటఁ జేర్చునంతకున్.

148


చ.

నెలకొనురత్నకుడ్యమున నీడయె వల్లభుఁ డంచుఁ గిన్కమైఁ
బొలఁతి పరాఙ్ముఖత్వమునఁ బొందినఁ దా నపరాధి గాన సం
కిలి వెనుకన్ వసించి పరికించువిటుండు నయత్నసిద్ధ మై
కలిగెఁ దదాభిముఖ్య మని కౌఁగిటఁ జేర్చె లతాంగి లజ్జిలన్.

149


చ.

తనహృదయం బగల్చుటకుఁ దానుఁ బతిన్ హృదయం బగల్పఁగా
వనిత తలంచెఁ గాక కడువంచన చేసినవాఁడు చేరినన్
గినుక తొఱంగి పోవఁ జనుఁ గేలఁ దెమల్చినమాత్రఁ గర్కశ
స్తనములు వీఁపున న్మొలవఁ దార్కొని కౌఁగిటఁ జేర్ప నేటికిన్?

150


ఉ.

పట్టకుఁ బట్ట కేల ననుఁ బట్టెద వోరి! బిగించి కౌఁగిటం
బట్టెదవే? వృథా యెరియఁ బట్టగు నీకయి మత్కుచద్వయీ
ఘట్టనచేఁత నిప్పు డెఱుఁగం దలపోయవు గాక యెవ్వతెం
బెట్టినవాఁడవో హృదయపీఠిక దానికి నొత్తు డౌఁ జుమీ!

151


క.

తద్రదనఖాదిముద్రా, ముద్రితు నినుఁ దగవు మాలి ముట్టుదునట్రా?
యుద్రేకింపక తల శఠ!, ముద్రించినసొమ్ము పరులు ముట్టం దగునే?

152


క.

తలఁ పెత్తి యొండుపేరం, బిలిచినఁ దప్పేమి? నీకుఁ బ్రియ మగుసతిగాఁ
దలఁచుట చాలదె? నాక, ప్పొలతుఁకనామంబుఁ దాల్చుపుణ్యము గలదే?

153


క.

ద్రోహముసేయమికి పరా, రోహ మది న్నమ్ము నీదురోమావళికృ
ష్ణాహిం బట్టుదు నిదె యని, సాహసికవిటుండు నీవిసడలం దొడికెన్.

154


చ.

ఘనకుచకుంభయుగ్మ మిది గైకొన నీక వియోగవార్ధిలో
నను మునిఁగించుభావమున నాజలజాయతనేషేత్ర! శయ్యపై
ననయము నల్కమై నకట! యవ్వలిమోమయి? తైన నేమి నీ
వినుతకటీతటీపులినవీథి వసింపఁగ గల్గెఁ జాలదే!

155


క.

మన్నించి యిట్లు నన్నుం, దన్నియశోకుఁడుగఁ జేయుతలఁ పిది యొప్పున్
నన్ను దయఁ జూచి యిఁక నో, కన్నియ! వెసఁ దిలకితాత్ముఁ గా జేయఁ గదే.

156


క.

ఈరీతిఁ గుటిలవాక్య, ప్రారంభవిజృంభణంబు ఫలముగ నలుకల్
దేరుటయుఁ గలసి చూపిరి, పౌరవిటీవిటులు సీధుపానక్రీడల్.

157

మధుపానక్రీడావర్ణనము

తే.

వారుణీసక్తహృదయాలవాలవీథి, నంగనలయందు మదలత యంకురించి
పాటలాలోకనశ్రీలఁ బల్లవించెఁ, గుసుమితం బయ్యె నిర్హేతుహసితలీల.

158


క.

మది సిగ్గు వెఱికి వ్రేయఁగ, మదనుఁడు మధురసము నించి మఱిపాఁ తగలం
గదలింప నూఁగుపోలిక, సుదతికి మధుసేవఁ దనువు సొరుగఁగఁ జొచ్చెన్.

159


తే.

తొట్రుకొనునడ్గులును వెడద్రొక్కుఁబల్కు, లుల్లముల సిగ్గెఱుంగమియును ఘటించి
జవ్వనులకును మరల శైశవము దెచ్చి, వారుణియు నెట్టిసిద్ధౌషధీరసంబొ?

160


సీ.

కోపంబు లేక భ్రూకుటి ఘటియించుఁ బో, లింపంగ లక్ష్యంబు లేక చూచుఁ
బిలువకుండఁగ నైనఁ బలుకు నోహో! యని, బయలూఁత గొనఁజూచుఁ బాఱఁజూచుఁ
గారణం బొండులేకయు నవ్వు వికవికఁ, గ్రాలెడునీడపై సోలఁజూచుఁ
జేరువనెచ్చెలిఁ బేరెలుంగునఁ జీరు, మనసు లేకయుఁ బాడు మానిమాని


గీ.

ప్రస్తుతముగానివెడతొక్కుఁబలుకు పలుకు, మ్రోయుఁదేఁటులతోఁ గూడి ముచ్చటాడు
నుబ్బి జాబిల్లిఁ బిలుచు రాకున్న నలుగు, మగువ యొక్కతె మధుమదోన్మత్త యగుచు.

161


తే.

శశవిషాణంబు దీర్ఘ మై సంభవించె, వికసితం బయ్యె గగనారవింద మపుడు
మధురసాస్వాదనోన్మత్తమత్తకాశి, నీకలోక్తిప్రసంగాభిసిత మగుచు.

162


సీ.

మ్రాఁగన్నువడి వెడదూఁగుమేనున మింట, నొఱగుచుఁ బడఁ బాఱి యులికి తెలియు
నెఱిబొమ్మ లెగయించి నిలువుఁజూపులఁ జూచి, కోపించి యలు లంచుఁ గురుల జడియుఁ
దలఁపున గుఱి లేక తనుఁ దాన మెచ్చుచుఁ, జప్పుడు గాఁగఁ జేచఱచి నవ్వుఁ
గార్య మొకండు లేకయ పిల్చి నెచ్చెలి! యే మన్న మఱి చెప్పు నెఱుఁగ కుండు


గీ.

చన్ను లెడగాఁగఁ బయ్యద సవదరించు, హస్తతాళంబు లిడి మస్త మభినయించుఁ
గడమవడఁ బల్కుఁ బలుకు లాకస్మికముగ, మగువ మదిరారసోన్మాదమహిమవలన.

163


క.

హాలారసపానంబునఁ జాలఁగ నున్మత్త యగుచు శంకింపక పై
వ్రాలి విటుఁ గౌఁగిలింపఁగ, బాలామణి లజ్జ యొద్ది పణఁతులఁ జేరెన్.

164


సీ.

అభిముఖ్యంబున నలరెడుచూపులు, నారాచధార లై నాటుకొనఁగఁ
బెనఁగొల్పినప్పుడు బిగియీనిచేతులు, పాశబంధములట్లు బలిమి చూపఁ
బ్రత్యుత్తరమునకుఁ బ్రాఁతి యౌపలుకులు, జాతహుంకృతుల మై సందడింప
నెగయించిపట్టిన నెదురనివసనంబు, లగపడ్డచక్కియ యప్పళింపఁ


గీ.

జెట్టఁ గబళించి తిగిచినఁ జేరఁబడని, సతులు మధుపానమున లజ్జ సడలి తార
పల్లవులఁ బట్టి కేలితల్పముల కీడ్వ, మదవతీనామ మపుడు సమర్థ మయ్యె.

165


సీ.

ముసముస మని చుట్టుకొసవెండ్రుకలు పట్టి, హుమ్మనిమట్టియ లులియ దాఁచి
తుదనాల్కఁ దొరలనితొక్కుఁబల్కులఁ దిట్టి, కటికిచన్ను లురంబు గాఁడ నదిమి

గ్రుచ్చి చేతుల మేనుముచ్చుట్టురాఁజుట్టి, దొమ్మియూర్పులతావి గుమ్మరించి
తమిగోళ్లఁ దనువు జూదపుటిండ్లుగా వ్రచ్చి, చొక్కున మోవినంజుళ్లు గఱచి


గీ.

మధుమదోన్మత్తలై యల్క మఱచి సఖులు, సూరెలకుఁ దాఱఁ బతులపై సోలునట్టి
చేడియల మన్మథుఁడు వెఱ్ఱిచెఱుకువింట, నేసె నుమ్మెత్తి విరులచే నేస రేఁగి.

166


మ.

అనుకూలక్రియ చూప నేరక బలవ్యాకృష్టిచే వక్ర యై
యనుమానాకులతం బదంబు మృదుశయ్యం గూర్పఁగా లేక చా
లనిగూఢంబుగ భావముం గుకవితాలక్ష్యస్థితిం జెంది యై
న నవోఢాంగన చేసె వల్లభున కానందంబు డెండంబునన్.

167


తే.

మదనునభ్యుదయైకకర్మంబు జరపఁ, గోరుకొను కామినులుఁ గాముకులును మొదటఁ
జేసి రుదితస్మితంబులచేఁ గపోల, పాలికలయందు నంకురార్పణవిధంబు.

168


ఆ.

యువతిఁ దివియనీక యున్నపయ్యదతోన, లీలఁ దిగిచి కౌఁగిలించె విటుఁడు
తత్తఱించి వాని దర్పకుం డొరతోన, విసరి యడిద మెత్తి వ్రేయ కున్నె?

169


క.

విన దయ్యెఁ బ్రియము తుదిఁ గై, కొనదయ్యెన్ మ్రొక్కు కాముకుఁడు వెఱవక పై
కొని కౌఁగిలింప వనితకుఁ, గొనకొని కన్నీటితోన కోపము వెడలెన్.

170


తే.

మగని కౌఁగిటిబిగిచేత మగువయఱితి, హారలత ద్రెవ్వుటయు ముత్తియములు చెదరె
నటన చూప గణంగునన్నాతిచన్ను, లెదురెదుర నిచ్చుపువ్వుదోయిలియుఁ బోలెయ

171


తే.

ఉన్నతస్తనకుంభము లురము దన్ని, పట్టె నొకకేలఁ గౌఁగిటఁ జుట్టిపట్టి
యపరకరమున వీటుఁ డేమి యందఁగలఁడె? చంద్రముఖినీవితనుఁ దానె జాఱెఁ గాక.

172


క.

అంగనముఖచంద్రునకు భు, జంగముఖగ్రహణ మొప్పుసమయంబున స
ర్వాంగములకు ఘర్మోదక, సంగతిచే మజ్జనంబు సలుపఁగఁ గల్గెన్.

173


చ.

త్రివళితరంగసంగతులఁ దేలుచుఁ గ్రుంకుచు నాభిదీర్ఘకన్
వివృతకటిస్థలీపులినవీథిఁ జరించుచుఁ గౌఁగిలింప నూ
రువు లను పేరనంట్ల నడరుం బ్రియపల్లవుహస్త మప్పు డా
యువతికుచంబుల న్బొరలి యూష్మలచేతఁ దపించెఁ గావునన్.

174


ఆ.

పాక మెఱిఁగి కేలిభవనంబు వెడలెడు, సఖులతోనె వెడలి చనియె నప్పు
డేణశాబనయనహృదయంబు లజ్జయుఁ, గాముకునిమనంబుకరకరియును.

175


చ.

జనితరతిత్వరం జెలులసన్నిధిఁ బయ్యదయంటు భర్తపై
గినిసి యదల్పు మైబొమలు గీల్కొనఁ జేసి యళీకదీనతా
భినయము చూపుకాంతమదిఁ బ్రేమవిపాకముఁ దెల్సి నీవి స
య్యనఁ దనుఁ దాన జాఱె దరహాసముతోఁ జెలు లెల్ల వెల్వడన్.

176

క.

అలసినవల్లభు మెచ్చక, మెలఁత రతి న్విక్రమింప మెయికొనియెడున
క్కొలఁది మరుఁ డలయఁ బువ్వుల, విలు గొని రతిదేవి సమరవిధిఁ గైకొనియెన్.

177


సీ.

నెచ్చెలిరాక రానేర దింతకు మున్ను, తాన యై రతులకు దఱుము టెట్లు?
చేపట్టి తివియక చేర దింతకు మున్ను, పౌరుషంబున నెట్లు పైనటించెఁ?
బయ్యద దివనీక పట్టు నింతకు మున్ను, సిగ్గు సేసంగతి దిగ్గనాడె?
నడిగిన మాఱుమాటాడ దింతకు మున్ను, రతికూజితంబు లేగతి రచించె?


గీ.

నబల యఁటె పేరు సుకుమార మట్టె తనువు, తరుణిరతినిర్దయత్వంబు దలఁచునపుడు
కొసర దఁట యింత యైనఁ బైకొనఁగ నింక, నాతిదీనోక్తు లెట్లుగా నమ్మవచ్చు?

178


వ.

ఇవ్విధంబునం ప్రశాంతలజ్జాప్రపంచంబును బర్యస్తనిరస్తసమస్తశంకాకళంకం
బును బరిహృతపరస్పరమనోంగవచనంబు నగుట నిష్కంటకమదనసామ్రాజ్యం బై
నిఖిలేంద్రియనిరంకుశస్వారాజ్యం బై యవలోకనాలాపనాలింగనాధరాస్వాదనాదుల
యందు ముఖ్యోపసర్జనభావంబు లేక యొండొకంటికిం బ్రోదులై యుపక్ర
మోపరమంబుల కంతరంబులు గలుగక చోఁకుఁజోటెల్లనుం గళానిలయంబును
నగపడుచక్కి యెల్లనుం జుంబనస్థానంబును జేయుచెయువులెల్లను బారవశ్యజనకం
బులును నగుచుఁ బరిరంభనిర్దయత్వంబునుం బ్రణయరసభావార్ద్రత్వంబును గుచకచ
గ్రీవక్రౌర్యంబునుం గరుణోక్తిదైన్యంబునుం బౌనఃపుణ్యభేదనంబును బరివర్ధితా
ఖిలాభిలాషైక్యంబునుం గలిగి యఖిలాంగవిభ్రమాస్పదం బయ్యును నవంగవిలసితం
బును నవిరతోద్గతసకంపసీత్కృతం బయ్యును నపాకృతచేలంబును బహుబంధసంబంధ
బంధురం బయ్యును నిర్లేపభావభాసితంబును నఖాంకచంద్రకళోదయనిధానంబయ్యును
నద్వితీయానువాదార్హంబును సమయసముచితం బయ్యునుం దర్శితవైపరీత్యంబు
నగుచుం బ్రవర్తిల్లునంత.

179


సీ.

ఉపధానవినిమయం బొండొకచూపుటఁ, బెరకేలు లక్కునఁ బ్రిదిలి బిగియఁ
బలుచోఁకుటలు వ్రేఁకఁ బడుమోవు లెఱుఁగమిఁ, గముచుట కులికి సీత్కార మీఁగ
నభినవనఖరేఖ లఱుక్రమ్ముచిత్తడి, సోఁకెడుచుఱ్ఱున స్రుక్కఁబడఁగ
వీడ్వడఁ గ్రోలుచు వెడలించునూర్పులు, ప్రాణంబు లేకంబులగుటఁ దెలుపఁ


గీ.

బారవశ్యంబు లాచ్ఛాదపటము గాఁగ, సాంద్రనిజబాణజాలజర్జరితు లగుచుఁ
బడుగుఁబేకయు నైనదంపతులఁ జూచి, యెలనగవు నవ్వి మరుఁడు వి ల్లెక్కుడించె.

180


చ.

మెలఁతలు వల్లభు ల్మొదల మెచ్చుగ నుండిరి నాకతంబునన్
నిలువునఁ గత్తికోఁత లయి నిద్దపుమోవులు నజ్జునజ్జులై
యలజడి వాడి వత్తు లయి రక్కట యే నిఁక నున్న నేమి గాఁ
గలరొ? యిదేల? వోదు ననుకైవడితో నిశి యేగె నేగినన్.

181

ప్రభాతవర్ణనము

క.

ఏకతపుమతకముల నా, నాకరణాసననిరూఢి నటియించుమదో
త్సేకమిధునంబులకుఁ గృక, వాకుస్వర మంత భరతవాక్యం బయ్యెన్.

182


తే.

ధవళకిరణుండు చరమదిక్తటమువెంట, నల్లనల్లనఁ దిగజాఱె వెల్ల నగుచు
సురతపరవశఖేచరీవిరళచికుర, భారమున జాఱువాఱుపూబంతివోలె.

183


చ.

దలమఱిపోవువెన్నెలవిధం బది రక్తపటీరచర్చగాఁ
జులకనితారకావళి విసూత్రితహరమణివ్రజంబుగా
నలతొలుసంజకెంపు పదయావకచిహ్నలు గాఁగ నంబర
స్థలి యలరారె వేకువ నిశాశశిభుక్తవిముక్తశయ్య నాన్.

184


తే.

వేగునంతకు విటవిటీవివిధసురత, బంధబంధురగతులు తత్పరతఁ జూచి
మెచ్చి తలలూఁచునట్లు కంపింపఁ జొచ్చె, వేగుఁబోకటగృహదీపికాగణంబు.

185


ఆ.

దశలు తుదకు వచ్చి తల లల్ల నల్లన, వణఁకవణఁక నపుడు వార్ధకంబు
తేటపడు విభాతదీపంబులకు మేనఁ, బలిత మనఁగ వెల్లఁబాటు తోఁచె.

186


చ.

వలిగొను మంచునం దడిని వారిజినీకలికాపుటీకుటీ
బిలములు దూఱి తేనియలవెల్లువఁ దోఁగుచు వచ్చి యంతటన్
దలిమము లుజ్జగించుమిథునంబులయందు వియోగవహ్నిఁ గా
ల్కొలిపెఁ చదూష్మలం బొరలఁ గోరియుఁబోలె విభాతవాతముల్.

187


చ.

నయమున సూతగీతులు వినం బడ హారము లింపు సూప వీ
డియములు క్రొత్త లై తగఁ బటగ్రహణత్వరమాణవల్లభా
వయవములందుఁ జూడ్కు లొదవ న్నునుగాడ్పులు సోడుముట్ట నిం
ద్రియములపండు వయ్యెను సతీపతికోటికి వేగుఁబోకటన్.

188


చ.

చిడిముడితోడఁ జేల మొకచేఁ గటిమండలిమీఁదఁ జేర్చుచున్
వెడవెడ జారునిం గనలి వేనలిఁ దత్కరమూలకాంతి వీ
డ్వడఁ బెరకేల నిల్పుచును వాడుఁ గనుంగవ సోల శయ్యపైఁ
బడఁతులు లేచుసంభ్రమము భర్తల నువ్విళు లూర్చెఁ గ్రమ్మఱన్.

189


ఆ.

దించి సురతవేళ దిగఁ దన్ని విడిచిన, పగఁ బటంబు లంతఁ బద్మముఖులు
తత్పతలము డిగుచుఁ దముఁ దార తిగిచిన, విటులవెనుకఁ జొచ్చి వెడలకుండె.

190


చ.

అలసతచేఁ ద్రపాగమసమాకులభావముచేత నైనయ
వ్వలువలపిండు వాయఁ గని వారక మీవలరాచవేడ్కలన్
మెలఁగెడువేళ వీడ్వడిన మీ కిది యుక్తమె? యంచు హాసముల్
సలిపిరి గేలిపెట్టుచును జంపతులం జెలిపిండు వేకువన్.

191

తే.

రేయి నిజనాథుల నభిసరించి పోయి, తెల్లవాఱంగ మరల నేతెంచి రనఁగఁ
దఱచుఁజీఁకటు లంతంత దలఁగిపోవఁ, దెల్లమిగఁ గానఁగా నయ్యె నెల్లదిశలు.

192


క.

నిజవరపరిరంభణమున, రజనీహారములు ద్రెవ్వి రాలినముక్తా
వ్రజములొకో? యనఁ దగి భూ, మిజదళములఁ జెలువు గొలిపె మిహికాలవముల్.

193

సూర్యోదయవర్ణనము

క.

ఒక్కింత యపుడు తూరుపు, దిక్కునఁ దొలుతెలుపు దోఁచె ధృతి చెడి వగలన్
జొక్కెడుజక్కవలపయిం, దెక్కలిదైవంబు కన్ను దెఱచె ననంగన్.

194


క.

అందముగ మీఁద దినమణిఁ, బొందించి విభాత మలనభోరమ కిడఁగాఁ
గుందనపుమొగపుఁ గూరుచు, చందంబున నంత పూర్వసంధ్య జనుంచెన్.

195


ఆ.

తప్పులేక రాజు తమడించి యపరఁ జెం, దుటయుఁ దాను మిగులదోష యగుటఁ
బ్రాచి లోక మెఱుఁగఁ బాలఁబుట్టెడువాని, పోల్కి నెఱ్ఱ నగుచుఁ బ్రొద్దువొడిచె.

196


సీ.

పద్మినీవిస్తీర్ణపద్మప్రశస్తహ, స్తము లిందిరకు మందిరములు గాఁగఁ
గలయంగఁ గుముదీనీకుల మెల్ల నభినవ, కోశసంపత్తిచేఁ గొఱలుకొనఁగఁ
గమనీయచక్రవాకద్విజవ్రజ మెల్లఁ, బరిణయోత్సవయుక్తిఁ బరిణమింపఁ
జింతితవివిధార్థసిద్ధిచేత సమస్త, జనములు సంతోషజలధిఁ దేల


గీ.

నాత్మవసువితీర్ణి ననురాగయుక్తి మై, విశ్వ మెల్లఁ బల్లవింపఁ జేసి
యుదయశిఖరిపేరియున్నతనూత్నసిం, హాసనాగ్రసీమ నలరె నినుఁడు.

197


వ.

ఇట్లు సూర్యోదయం బగుటయు.

198

మాంధాత పరిజనముతోఁ బురమున కేతెంచుట

క.

కృతకాల్యకృత్యుఁడై భూ, పతిశేఖరుఁ డపు డశేషపరిజనసంసే
వితుఁ డగుచుఁ బ్రమదవనని, ర్గతుఁ డై పురి కేగుదెంచెఁ గడుముద మొదవన్.

199

ఆశ్వాసాంతము

ఉ.

స్వర్ణసువర్ణచేల ధనవర్ధితనిర్ధనవత్కుచేల గో
కర్ణకులేంద్రకుండలితగాత్రశయాన ఖగేశయాన సం
పూర్ణకృపావలోక పరిపోషితలోక నిజాంకవర్ణనా
కర్ణనబంధురక్షణ ప్రకల్పితసంశ్రితబంధురక్షణా.

200


క.

చోళేంద్రధర్మవర్మనృ, పాలప్రాంగణనిధాన పరిఖేలవదు
త్కూలకవేరసుతాపరి, ఖాలంకృతరంగమండలాధీశమణీ.

201

తురంగవృత్తము.

తరుణరవికరవికచసరసిజదర్పమోచనలోచనా
శరధినిరవధినిఖిలజలహృతిసాంద్రకంధరబంధురా
గిరిమధనజమధువిధుకరశ్రితకీరవాహనమోహనా
స్ఫురదచిరరుచిరుచిరచిరరుచిపోషకాంబరడంబరా.

202


గద్య.

ఇది శ్రీమద్భట్టపరాశరదేశికేంద్రచరణసరసీరుహసేవకోపసేవక నరసింహనామధేయ
ప్రణీతం బైనకవికర్ణరసాయనం బనుకావ్యంబున వసంతవర్ణనంబును, వనవిహారజలక్రీ
డలును, సూర్యాస్తమయతమస్తారకాజారవిటవిటీవర్ణనంబును, జంద్రోదయంబును, మధు
పానరతినిరూపణంబును, ప్రభాతసూర్యోదయంబులు నన్నది చతుర్థాశ్వాసము.