కవికర్ణరసాయనము/ద్వితీయాశ్వాసము

ద్వితీయాశ్వాసము



రంగదివ్యగృహశృం
గారోజ్జ్వలదీప శిశిరకరపుష్కరిణీ
తీరఫలనమ్రకల్పమ
హీరుహ కరుణాతరంగితేక్షణసుముఖా.

1


క.

ఈవిధమున నిజనందను, భూవల్లభుఁ జేసి వృద్ధభూపతి విషయ
వ్యావృత్తచిత్తుఁ డగుటన్, దా వనమున కేగఁ దలఁచి తనకులసరణిన్.

2

యువనాశ్వుఁడు మాంధాతకు రాజనీతిఁ దెల్పుట

గీ.

తల పెఱుంగఁ జెప్పి తనయుని నొకవెంట, నియ్యకొలిపి పిదప నేకతమున
నొయ్యడాయఁ బిలిచి యొకకొంతనయమార్గ, మెఱుకపఱుపఁ దలఁచి హితమతోక్తి.

3

అంగపంచకనిరూపణము

గీ.

మనుజపతి కుపాయమును సహాయంబును, వినుము దేశకాలవిభజనంబు
నాపదకుఁ బ్రతిక్రియయుఁ గార్యసిద్ధియు, నంగపంచకము సమస్తవిధులు.

4

ఉపాయస్వరూపనిరూపణము

వ.

మహాభూతపంచకపరిణామనిశేషంబుల సకలప్రపంచంబు నగుచందంబున నేతదం
గపంచకవివిధభేదసంగ్రహంబుల సమస్తనీతిధర్మమర్మంబులు నగుటం దత్ప్రకా
రంబులకుం బ్రదర్శనార్థంబు గాఁ కొన్ని వివరింతుఁ బ్రథమపరిగణితాంగం బైన
యుపాయంబులు సామదానభేదదండంబులు తద్విభేదంబు లనేకప్రకారంబు లై
యుండు నవి యన్నియు నేకవిషయంబు లై గురులఘుత్వాదిహేతుభేదంబున నను
కల్పరూపంబులు గావు ప్రత్యేకంబ నియతభిన్నవిషయంబు లగుట నేకైకస్వతం
త్రోపాయంబులు గావున నన్నియును వర్జనీయంబు లగుటం దత్తద్గుణోత్కర్షం
బాలింపుము.

5


గీ.

ధన్యతయుఁ బూర్ణతయుఁ గొల్చుదానమునకుఁ, బ్రోదియును రక్షయును జేయు భేదమునకు
దండియును వన్నెయును దెచ్చు దండమునకు, సామమున కేయుపాయంబు సమముగాదు.

6

క.

హితు లగుదు రహితవర్గము, హితమతిఁ బోప్రాణ మైన నీఁ జూచు హితా
హితతతిగతరూపజగ, త్త్రితయనువశ్యౌషధములు ప్రియభాషణముల్.

7


క.

కా కేమి తన్నుఁ దిట్టెనె?, కోకిల తన కేమి ధనము కోకొ మ్మనెనే?
లోకము పగ యగుఁ బరుసని, వాకునఁ జుట్ట మగు మధురవాక్యమువలనన్.

8


గీ.

ఉన్నసాధనగతుల సాధ్యుండు గాక, మ్రింగఁ బఱతెంచుశత్రువు మిత్రుఁ జేయు
దానమున నాత్మవశగులు గానివార, లితరు లెవ్వార లీజగత్త్రితయమునను.

9


క.

శత్రుల మిత్రులఁ జేయు, మిత్రుల భృత్యులుగఁ జేయు నిజగుణవృత్తిం
బాత్రులుగఁ జేయు నందు, ధాత్రీపతి కన్నియెడల దానము తగదే?

10


క.

ఆయాసదుర్లభముల న, నాయాసమునన ఘటించు ననభిస్పృష్టా
పాయంబు పతికి భేదో, పాయము గడు నిష్ట మగునుపాయముగాదే?

11


క.

అరుల విదళింపఁ గానే, నరపతి తేజస్వి యగుట నడురేయియిరు
ల్విరియించునపుడు దీప, స్ఫురణము దగుఁ గాక పగలు చొప్పడి యున్నే?

12


క.

దండసమర్థుఁడు పతి గా, కుండిన సేవకులు నులుక రుగ్రారికుభృ
న్మండల ములుకునె? కావున, దండసమర్థుండు గాఁగఁ దగుభూపతికిన్.

13


క.

పౌరుషము గలుగఁగానే, సారము లను భేదదానసామములు సమి
ద్భీరువున కవి ఫలింపఁగ, నేరవు షండునకు నింతినేపథ్యంబుల్.

14

సహాయస్వరూపనిరూపణము

వ.

ఇవి ప్రధానప్రకారంబులు. మఱియు నుపేక్షాదులు నగు ప్రకారాంతరంబులు నెఱుంగు
నది, యిది యుపాయస్వరూపనిరూపణం బయ్యె. నింక సహాయస్వరూపంబు విను.
మఱియు రాష్ట్రదుర్గధనాదిసంపద్రూపంబున మంత్రిసామంతసుహృద్బలదూతచార
ప్రభృతిపురుషసంపత్తిరూపంబున బహుప్రకారం బై యుండునవి. యిన్నియు నవ
శ్యంబు లగుటకుం బ్రత్యేకగుణంబు లాకర్ణింపుము.

15


గీ.

అరులవలనఁ గాచుకరణి మేనుతెవుళ్ల, వలనఁ గాచుకొనఁగవలయు నట్ల
యరులవలనఁ గాచుకరణిని నైజాధి, కారిజనులవలనఁ గావవలయు.

16


క.

ప్రోదిఁగొనఁదగినఃపుష్పఫ, లాదులు గొడ్డంట వ్రచ్చి యవనిజము నెడన్
వాదుగొనునట్ల భూప్రజ, బాధించిన నేల కలుగు పతి కరిగోరుల్?

17


క.

మన సిచ్చినఁ దన కోడరు, చను విచ్చినఁ బ్రజలు వెక్కసము సేయుదు రౌ
ట నృపతి మన సీకయ కడుఁ, జను వీకయ మెలపవలయు సమ్ముఖచరులన్.

18

మించి ధనమాసఁ బ్రజ నెఱి, యించుదురాత్ములకు గ్రేణి యిచ్చుట పతి కూ
హించిన నిండినచెఱు వవి, యించి శకులకులము సంగ్రహించుట గాదే?

19


క.

హరి జలధి నాశ్రయించెను, హరునంతటివాఁడు నద్రి నధివసియించెన్
నరపతిమాత్రున కరిజన, దురధిగమం బైనయట్టిదుర్గము వలదే?

20


క.

ధనహీనుఁడు నిరుపాయుఁడు, ధనదాసులు గాక పురుషదాసులు గలరే?
ధనము సకలైకమూలము, ధనసంగ్రహ మెడలినతఁడు దా రా జగునే?

21


క.

ధనము చన దోష మరుదే?, యొనరించినయట్టివిధము లుర్వీపతికిన్
విను పాత్రుల కీకుండుట, యు నపాత్రులయందు నిడుటయును నీ రెండున్.

22


క.

కర్త యగుకతన మతిఁ గల, కర్తృత్వమదంబువలన గార్యాతురతన్
గర్తస్య మెఱుఁగఁ దగుటఁ బ్ర, వర్తకుఁ డగుమంత్రి పతి కవశ్యము వలయున్.

23


క.

విపదురుపంకంబునఁ బడి, నపు డిభశత మై వెడల్చునతఁ డున్మదుఁ డై
నపు డంకుశ మై మఱలుచు, నృపకుంజరమునకు మంత్రి నిర్వహిత గదా!

24


క.

కెలనికి వ్రేఁకము దనకున్, వలఁతియుఁ గా దండనాథవర్గముఁ బెనుపన్
వలయుఁ బతియూఱటకు నై, బలిమికిఁ దేఁకువకుఁ దోడుపా టొదవునకున్.

25


గీ.

ఎంతబలియురకుఁ దనంతగా సామంత, గణముఁ బెనుప కేల కలుగు జయము?
శేషునంతవాఁడు శిరములు వెయి పూని, కాక మహి వహింపఁ గలిగె నెట్లు?

26


క.

పతికి ననుకూలసేనా, పతు లనఁగా నెంద ఱన్ని పటుతరభుజము
ల్పతికిఁ బ్రతికూలసేనా, పతు లనఁగా నెంద ఱన్నిపార్శ్వోరగముల్.

27


క.

బలియుఁ డగుమిత్రుసంగతి, గలరా జభ్యుదయ మందు గౌరవయుతుఁ డై
బలియఁ డగుమిత్రుసంగతి, గలరా జభ్యుదయ మొందఁ గనఁబడుఁ గాదే?

28


క.

చేరువపగ దీర్చుటకై, దూరపుఁదో డాసపడుట దుర్మతియింటం
గూరినచి చ్చార్చుటకై, ధారుణిఁ గూపంబు ద్రవ్వఁ దలఁచుట గాదే?

29


గీ.

కిరణములు లేనిపగలింటిసరణిఁ దరణి, వెలుఁగ నేర్చునె యుదయాస్తవేళలందుఁ?
గాన విను ముగ్రతేజుల కైన మూల, బలము లే కున్నఁ గడుఁ బెంపుఁ బడయరాదు.

30


క.

ఎప్పుడు దనకుం బగ గల, దప్పుడ సైన్యము ఘటింతు ననఁ బతి కగునే?
యెప్పుడు దగుసైన్యములే, దప్పుడ పో పగయుఁ గలుగు నవనీపతికిన్.

31


క.

నిజముఖపపనమ శంఖ, ప్రజనిత మై మధ్యమందరం బగుమాడ్కిన్
నిజవాక్యమ దూతముఖ, ప్రజనిత మై యతిశయంబు పతికిం దెచ్చున్.

32


క.

తనయున్నచోటనుండియుఁ, గనుఁగొనఁ దగు జగము దేశకాలవిరోధం
బునఁ బొరయ కుండుచారుం, డనునేత్రముచేత నృపతి యఖిలజ్ఞతకున్.

33

దేశకాలవిభాగస్వరూపము

వ.

ఇంక దేశకాలవిభాగస్వరూపంబు విను మఖిలకృత్యంబులుం దదుభయాధీనసిద్ధికరంబు
లగుటం దత్ప్రకారంబులచే ననంతంబు లై యుండు నైనంగొన్ని నిర్దేశించెద.

34


క.

ఏవేళ నెచటఁ బండెడి, దేవి త్తది యెఱిఁగి కాదె యిడఁ గాఁ దగు? న
ట్లేవేళ నెచట నెట్టిఫ, లావహ మది యెఱిఁగి చేయనగు భూపతికిన్.

35


క.

అరివెట్టిన లాఘవ మగు, నెరమన భేదంపుఁజేఁత నేరమిఁ దెచ్చున్
విరసించినఁ గ్రొవ్వగుటన్, సరి యగువానియెడ నెల్ల సామంబ తగున్.

36


గీ.

ఏఱు నిలుపఁ గే లొగ్గుట యిచ్చకంబు, మత్తకరిఁ గెరలించుట మాయచేఁత
కొండ నెదిరించి తగరు ఢీకొనుట కడిమి, కాన నధికుని యెడ మేలు దాన మండ్రు.

37


క.

ప్రియ మెఱుఁగలేఁడు దాన, క్రియఁ గ్రొవ్వును మఱి క్రియాతిరేకం బగుటన్
బయినెత్తఁ దగదు మత్తుం, డయినపగఱ భేదవిధికి నర్హుం డెందున్.

38


గీ.

సామదానములకుఁ జన వేది భేదంబు, సేఁత దలఁపఁ బందసేఁత యని న
కాన తా బలాఢ్యుఁ డైన విక్రమశాలి, హీనశత్రుమీఁద నెత్తవలయు.

39


వ.

అట్టితుర్యకార్యంబునను నిశ్చితవిజయం బగుటం జేసి యాత్మీయబలంబు నిచ్చి కేవలాం
గీకరణంబున మౌర్ఖ్యాభిముఖుండు గాక తత్తద్దేశకాలానుకూలంబుగాఁ బూర్వోపాయ
త్రయానుప్రాణితం బగుప్రాధాన్యంబు నెఱపవలయుభంగులు నెఱుంగునది.

40


క.

అగపడునంతకు బలియుఁడు, పగఱకుఁ బ్రియ మాడు నొక్కపట్టునఁ దనపే
రుగ నమ్మి జంతు వరుదే?, బిగువునఁ బెనుఁబాము కూఁతపెట్టెడుమాడ్కిన్.

41


క.

గాలపుటెర యిచ్చి కదా?, వాలుగులం దిగచికొనుట వక్రరిపుఁడు దా
నే లోఁబడునంతకు బల, శాలియు దానంబు చూపఁ జను నొక్కయెడన్.

42


క.

చొరవ దన కీనివెదురుల, నొరయించి దహించుగాడ్సునోజం బొది యై
పెరిగెడురిపులకు నంత, ర్విరసము గలిగించువెరవు వెదకఁగవలయున్.

43


క.

పేటెత్తి రిపులతో విరి, వో టగుసదుపాయ మొకటి పుట్టింపఁ దగుం
బో టొడ్డి యైనఁ దాఁ గను, చాటునబండంగి వేఁటసలిపెడురీతిన్.

44


క.

అరి నొకని బొడమినప్పుడ, బరువున నడరంగఁ జేయ బహు జిచ్చుగతిన్
దరుణం బురంబువోలెన్, బరువం బగుతనకు నోర్వఁ బడు వేఱొకనిన్.

45


క.

సులభమునఁ దీర్చుపనికై, బలు వగుయత్నంబు సేయఁ బతిఁ జూచినయే
ములు ముంట దివియ కడిదము, జళిపించినయట్టిబేలచందము వచ్చున్.

46

క.

చేయింపవలయుపనిఁ దాఁ, జేయుట కర్జంబు గాదు శీఘ్రమ తానై
చేయంగవలయు కార్యము, సేయం బనుపుటయుఁ గాదు సిద్ధము పతికిన్.

47


క.

స్థానబలంబున నధికుని, హీనుఁడు మెప్పించు బయిల నేగుక్కలకున్
లోనగు మొసలి యుదగ్రత, నేనుఁగుఁ బడఁ దిగుచుఁ గాదె యిరవున నున్నన్.

48


క.

ఊహ చెడి ఱేఁచఁబడెడు మ, హాహితుకోపాగ్ని పిదప నార్చుటకొఱకై
స్నేహము నెఱపఁగఁ జూచుట, మోహం బభివృద్ధిఁ బొందు మునుపటికంటెన్.

49


క.

అధముఁ డని రిపుఁడు లోనగు, విధ మెఱుఁగక యెత్తి పిదప వెడఁదిరిగినయే
నధమత మానిచి వానికి, నధికత నొసఁగంగఁ బోవు టండ్రు వయజ్ఞుల్.

50


వ.

ఇంక విపత్తిప్రకారంబును గార్యసిద్ధియు ననిష్టనివృత్తినిరాపణంబును నిష్టప్రాప్తిరూ
పంబును బరస్పరసాకాంక్షంబు లై ప్రాప్యంబు లగుటంజేసి రాజులకు నీరెండును
ద్వివిధం బైనకార్యఫలం బిది యెఱుంగునది.

51


క.

సకలానిష్టంబును బా, యక యిష్టప్రాప్తివలన నయ్యెడుసుఖ మే?
మొకచే ననలము దరికొన, నొకచేఁ జందనముఁ బూయ నూఱటఁ గనునే.

52


క.

కావున నాత్మాభ్యుదయ, శ్రీవిభవ మరిక్షయంబుఁ జేకుఱు నయబా
విక్రమముల నఖిలధ, రావల్లభుఁ డైన యతఁడు రాజనఁ బరఁగున్.

53


శా.

సర్వక్షోణితలంబు నేకధవళచ్ఛత్రంబు గా సంతతా
ఖర్వశ్రీఁ దిలకింపఁ నేలుము భుజాగర్వాతిరేరోన్నతిన్
బూర్వాస్తాచలమధ్యదేశనివసద్భూపాలమాళిస్ఫుర
ద్గీర్వాణాధిపరత్నరుఙ్ముధుకరోద్దీప్యత్పదాబ్జుండ వై.

54

యువనాశ్వుఁడు మునియై వనమున కేగుట

క.

అని దీవించి నిజాత్మజు, వినయవినమ్రతకు నలరి వీడ్కొని చనియెన్
మునివేషంబునఁ బావన, వనవాసంబునకు లోకవర్ణితయశుఁడై.

55

మాంధాత ధర్మిష్ఠుఁడై భూమి నేలుట

మ.

జనకుం డేగినయట్టిపిమ్మట మహాసామ్రాజ్యభారంబు గై
కొని మాంధాతృమహీవరుండు గరచెన్ ఘోర ప్రతాపాగ్నులన్
వనజాతప్రభవాండభాండపరిపూర్ణం బైనదృప్యన్నరేం
ద్రనిజస్ఫీతయశఃప్రపంచనవనీతంబు ల్గడు న్వేల్మిడిన్.

56


సీ.

వక్రభావ మధిజ్యవరధన్వమునఁ గాని, తన నెమ్మనంబునఁ దగులనీక
నిశితస్వభావంబు నిజడ్గమునఁ గాని, తనవర్తనంబులం దగులనీక

విశదభావము కీర్తివిలసనంబునఁ గాని, తనమంతనంబునఁ దగులనీక
దీర్ఘభావము శత్రుదీనత్వమునఁ గాని, తనదుకోపంబునఁ దగులనీక


గీ.

యంబుధులు కేళకుళులు కులాచలములు, మేడ లలచక్రగిరిచుట్టుగోడ గాఁగ
నవనిఁ బాలించె శుద్ధాంతభవన మట్ల, కీర్తిలక్ష్మీకళత్రుఁ డాక్షితివరుండు.

57


సీ.

సర్వసర్వంసహాజనము నర్థార్థిగా, కర్థి నర్థించుసమర్థ మయ్యె
బాతాళమున నుండుఫణికచ్ఛపాదులు, భార మేమియు లేనిబ్రదుకుఁ గనిరి
ఖచరలోకంబునఁ గ్రతుభుగ్జనంబులు, తృప్తిమైఁ గఱ్ఱునఁ ద్రేఁపఁ గనిరి
త్రిజగతి సంతతాతిథి యైనకలహాశి, నయనంబు లాకఁటిభయము మఱచె


గీ.

దానగుణశాలి భూసముద్ధరణదక్షుఁ, డనిశమఖదీక్షితుండు మత్తారిహరణ
వివృతినిరతుండు యువనాశ్వవిభుసుతుండు, ఘనుఁడు మాంధాత నృపుఁడైన కాలమునను.

58

శరత్కాలవర్ణనము

శా.

ఆలోకోత్సవ మయ్యె నంత గజగండావిర్భవిద్దానకీ
లాలం బంబుజినీతటీవరమరాళం బుఝ్ఝితాంభస్సరి
త్కూలం బుత్సలగంధదుర్లలితవాతూలం బుదీర్ణేందురు
గ్జాలం బంగభవానుకూలము శరత్కాలంబు రమ్యాకృతిన్.

59


సీ.

జగతీస్థలము పట్టుచాలమి పరికించి, చాలించులీల వర్షములు వెలిచెఁ
గైకొన్ననీ రెల్లఁ గ్రక్కించి రవి నాఁక, విడుచులీల మొయిళ్లు విరియఁ బాఱెఁ
బ్రావృడ్జననితోడఁ బాసినబిడ్డ లై, పెంపేది నదుల శోషింపఁ జొచ్చె
రాజులు దండయాత్రలఁ ద్రొక్కుడగుభీతి, నిలఁ జొచ్చె నన రొంపు లివురఁ బాఱె


గీ.

జలము కలక దేఱె సస్యము ల్పక్వంబు, లగుచు వచ్చెఁ దెల్ల నయ్యె దెసలు
ఱెల్లు పూఁచె నంచ లెల్లెడఁ గొలఁకుల, నుల్లసిల్లె శారదోదయమున.

60


సీ.

అంబుదంబులఁ గల్గునాసారవర్షంబు, కరిమదంబులయందుఁ గ్రాలుకొనియెఁ
గేకికేకలఁ గల్గుకాకలీభావంబు, కలమగోపికలవాగ్గతులఁ జేరెఁ
గేతకీతతిఁ గల్గుకృతవికాసస్ఫూర్తి, కుందవాటికలపైఁ గుదురుకొనియె
సురచాపమునఁ గల్గుపరభాగసంపత్తి, చేలకేగెడుశుకశ్రేణిఁ జెందె


గీ.

బకకులంబులగతి విజృంభణమదంబు, మధురకలహంసకులముల నధివసించె
నఖిలలోకప్రసాదావహముగ వాన, కాల మరుగంగ నవశరత్కాల మైన.

61


చ.

శరదుదయంబున న్విగతసంకులపంకములౌట మార్గము
ల్గరగర నైన నైన వెసగాఁ జనసేరక యుండి రెల్లెడన్
దెరువరు లాత్మదృష్టి కతిథిత్వము గొల్పెడుపంటచేలపా
మరసతులం బథం బడుగు మాటికిమాటికి మాటలార్పుచున్.

62

శా.

పారావారజలంబు లీకొడిదెఁడుం, బ్రాపించి యే యిచ్చుచో
ధారాగర్జలు చూపు నంబుధరబృందం బంచుఁ గాంతిచ్ఛల
స్మేరుం డై కనుపట్టు యామ్యదిశఁ గుంభీపుత్త్రుఁ డాపోశన
స్వైరక్రీడనభూషితోజ్ఝితచతుర్వారాశికుం డంతటన్.

63


ఉ.

కైరవబంధుబింబము ముఖప్రతిబింబము తద్గతస్మితాం
కూరము శీతలాతపము కుండలసూచితమౌక్తికావళుల్
తారలు గా శరత్సమయలక్ష్మి గనుంగొనురత్నదర్పణా
కారమున న్నభస్స్థలము గన్నులపండువఁ జేసె రాత్రులన్.

64

మాంధాత దిగ్విజయయాత్ర సేయుట

క.

ధాత్రీశుఁ డంత దిగ్జయ, యాత్రాసంరహంభజృంభితాటోపహతిన్
శాత్రవులగుండె లగలఁగ, జైత్రప్రస్థానభేరిఁ జఱపించుటయున్.

65


శా.

భూకంపంబు జనింప రొంపిగ మహాంభోరాసు లుప్పొంగఁగా
లోకాలోకము పెల్లగిల్లఁగ మరుల్లోకంబు ఘూర్ణిల్ల న
స్తోకవ్యాప్తి నజాండభాండదళనోద్భూతధ్వనిం బోలి యు
ద్రేకించెన్ విజయప్రయాణహతభేరీభూరిభాంకారముల్.

66


సీ.

సజలధారాధరసముదయోదయశోభఁ, గార్కొనుభద్రేభఘటలపెంపు
నూర్మి మాలి సముద్యదూర్మిమాలికలట్ల, నడతెంచుఖత్తులాణములమురువు
సురవిమానగణావతరణక్రమక్రీడ, గమనించుమణిశతాంగములసొబగు
వివిధసింహకిశోరనిహృతివిభ్రమలీలఁ, బైకొను బహువీరభటులముంపు


గీ.

నలర నానాత్మవిజయచిహ్నములు గ్రాల, ఘనరణోల్లాస మాస్యవికాస మొసఁగఁ
దోడు సూపిరి సన్నాహదోహలమున, దండనాథులు నిజబలోద్దండు లగుచు.

67


మ.

జగతీమండలనాథుఁ డప్పు డుచితాచారంబులం దీర్చి మే
లగులగ్నంబున జైత్రతూర్యములు మ్రోయం గాంచనస్యందనా
ధిగతుం డై జయవాక్యవైఖరి బుధు ల్దీపింప సౌధంబులన్
జిగురుంబోఁడులు జాలమార్గములుగా సేస ల్పయిం జల్లఁగన్.

68


క.

మదవద్గజహయరథభట, పదసరభసఘట్టనాదిబహుభంగురతా
స్పద మగుచు నఖిలధరణియుఁ, గదలం బ్రాఙ్ముఖము గాఁగఁ గదలె న్మొదలన్.

69


సీ.

అంకుశాహతులకుఁ గొంకక తమతమ, నీడలఁ దఱమి వెన్నాడుకరులు
త్రోవ చేకొన్నదంతావళంబుల మోయఁ, దఱమి చివుక్కున దాఁటుహరులు
ఘననేమిరవముల గర్జించి పగతురఁ, గేతనాగ్రముల ఝంకించుతేర్లు
తొడివిన మైజోళ్లు తుత్తుము రైరాల, నొడలు లుప్పొంగఁ గ్రేళ్లుఱుకుభటులు

గీ.

నగుచు నడచె లెక్క కగ్గలం బై సేన, యఖిలభువనవితతి నాక్రమింప
నుగ్రరభసలీల నుద్వేల మై త్రోచు, బహుళవిలయజలధిలహరు లనఁగ.

70


శా.

ప్రస్థానారభటీవిశృంఖలచమూరాసోత్థితాంతర్మదా
వస్థం భద్రగజంబె సైనికులత్రోవం బోవఁగానీక మా
ర్గస్థం బైనతెఱంగు నైనజయముం గల్పింతు భూభర్తకున్
స్వస్థానస్థితి మీరు నిల్పుఁడమనచ్చందంబు గాకుండునే?

71


ఉ.

కత్తి కళేబరం బొరయఁ గా నెలవు ల్దెగి క్రమ్మునెత్తుటన్
జొత్తిలి నోర జొ ల్లలరఁ జూపఱకుం దలఁపించె నయ్యెడన్
మత్తిలి వాగెవెక్కసపుమావు పయోనిధివారివారణా
యత్తమహానలంబు నరుదారఁగఁ గ్రక్కెడు తొంటిగోడిగన్.

72


మ.

అనతారాతివిఖండనప్రవణ భాహాగర్వదుర్వారు న
మ్మనువంశోత్తముఁ జెందినట్టి ప్రమదోన్మాదాతిరేకంబు పెం
పున విశ్వంభర మిన్నుముట్టె ననఁగాఁ బొంగారెఁ దద్భూమిభృ
ద్ఘనసేనాపదఘట్టనోత్థితవియద్వ్యాప్తక్షమారేణువుల్.

73


సీ.

అంబరజంబూఫలంబున కగచరు, లుగ్రరోచికి రాహువిగ్రహములు
అష్టదిఙ్ముఖముల కవకుంఠనంబులు, మఘవత్కరి కపూర్వమజ్జనములు
కులమహీధరములకు నవాభ్రపంక్తులు, జలరాసులకుఁ గుంభసంభవములు
శాత్రవవదనాంబుజములకుఁ దుహినము, ల్ధర లోకదృష్టికి దర్శనిశలు


గీ.

నెఱసె సర్వంకషంబు లై నిబిడగతుల, వివిధరథనేమిహరిఖురద్విరదచరణ
భటపదభ్రమణత్వరోత్పాదితములు, రాజవరదండయాత్రాధరారజములు.

74


గీ.

బలవిరావమునకుఁ బ్రతిఘోష మొసఁగెడు, కులనగంబులంత గుహలు నిండ
నిబిడధూళి పర్వ నిశ్శబ్దగతి నుండె, నెలుఁగురాసి పలుకు వెడలనట్లు.

75


గీ.

ఆత్మ మదవృష్టిచే నేల యందువాసి, మీఁద దళ మైనధూళిచే మెఱసి యపుడు
ధరణి మోచినహరిదంతదంతికులము, భావ మెఱిఁగించె సేనామదావళములు.

76


గీ.

దానధారలచే ధరాతలము గడిగి, హస్తముఖబిందువుల విహాయసము గడిగి
సైన్యరేణువు నడఁగించె సామజములు, సత్వనిధు లోప రెట్లు రజంబు నడఁప.

77


చ.

తమకు నయత్నసిద్ధముగ దానము లై యలరించు భూప రా
గము లన వానిచేఁ దమకుఁ గల్గెడుదానజలాతివృష్టిచే
సమయఁగఁ జేయఁ జొచ్చెఁ బటుసైన్యమదేభకులంబు లప్ప ని
క్కము నదియట్ల మత్తు లుపకర్తల కేనియుఁ గీడు సేయరే?

78

క.

తరళనిజఖురనిపాత, స్ఫురదనవిభుప్రపంచమున కపు డంతః
పురములుగ నోరఁ జొంగలు, గురియఁగఁ గడలేక నడచె గుఱ్ఱపుఁబౌజుల్.

79


క.

ఆశుగహతిచేఁ గేతుని, వేశితబిరుదములు పల్లవితవీరరసా
వేశమునఁ బోలెఁ గదలఁ బ్ర, కాశితముగఁ గదలెఁ జిత్రగతుల రథంబుల్.

80


గీ.

నిబిడధూళీభరంబుచే నింగి విఱిగి, పడుమనశ్శంక నెదు రానిపట్టినట్లు
హస్తకుంతపరంపర లలర వసుధఁ, గప్పుకొనుచుఁ బదాతివర్గంబు నడచె.

81


క.

బలగతుల ధూళి యై యెగ, సిల నింగికి రెండుపాళు లెగసిన వైనన్
జిలువలఱేనికిఁ గ్రిందన్, బలభరమునఁ దొంటికంటె భారం బయ్యెన్.

82


సీ.

ఇలఁ ద్రొక్కుడున కోర్వ కెగసి మీఁ దెక్కెడు, పగిదిఁ గెంధూళి పెల్లెగసె మింట
నేలకుఁ జోటిచ్చి నింగి క్రిందికి డిగ్గు, పగిదిఁ గాననములు బయలువడియె
మముఁ జొచ్చినా రెఱుంగుము సుండి రిపు లని, మొరయించుగతి మాఱుమ్రోసె గిరులు
తెగువైరు లింక భేదింతుర న్వెరఁ బోలె, హేతిదీధితులచే నినుఁడు మాసె


గీ.

నామసమతాభ్యసూయచే నలువఁ బోలె, వాహినులు దోఁకి పిండిలిపండు లయ్యె
విశ్వవిజిగీష మై యువనాశ్వనృపతి, నందనునిసేన లందంద నడచునపుడు.

83


క.

జలభూములధూళియు ని, ర్జలభూములజలము లూర జగదద్భుతభం
గుల నడచె నమ్మహీపతి, బలవదసంఖ్యేయవివిధబలసంఘంబుల్.

84


సీ.

రథనేమిఘట్టనారవముచే నగలించెఁ, గొందఱహృత్పుటీకోటరముల
దంతికర్ణానిలోద్ధతి నార్చెఁ గొందఱఁ, తీవ్రప్రతాపప్రదీపశిఖల
హరిఖురోద్ధతధూళి నడఁగించెఁ గొందఱ, యతివేలవీరరసాంబునిధుల
భటభుజాస్త్రచ్ఛవి భంగించెఁ గొందఱ, గంభీరగర్వాంధకారతతులఁ


తే.

గోపనిశ్వాసమారుతాటోపమహిమఁ, దూల్చెఁ గొందఱచిరయశఃస్థూలపటలి
విశ్వవిశ్వంభరాచక్రవిజయదీక్ష, నెరపుచోఁ బేర్చి మాంధాతృనృపవరుండు.

85


సీ.

నందనం బొనరించె వంగభూమీశుండు, మొగిచెఁ గేల్దోయి కాంభోజరాజు
వినతుఁ డయ్యెఁ గళింగవిశ్వంభరాభర్త, తల వంచెఁ గాశ్మీరధరణిధవుఁడు
మ్రొక్కె సౌరాష్ట్రభూభృత్కులాధీశుండు, దండంబు పెట్టె గాంధారనాథుఁ
డభినందనము చేసె నంగభూపతి నమస్కారంబు గావించె సాల్వవిభుఁడు


తే.

గౌళనేపాళపాంచాలకాశకుకుర, సింధుమరహాటచోళాదిసింధువలయ
వలయితాశేషధారుణీశ్వరులు చేసి, రంజలులు తన్మహారాజకుంజరునకు.

86


శా.

చిత్తప్రీతిగ నప్పనం బొసఁగి రాసింధుస్థిరానాయకు
ల్తత్తద్దేశవిశేషవస్తువులు మాంధాతృక్షమాభర్తకున్

మత్తేభంబులు తేజు లంగనలు హేమంబు ల్మణు ల్ధేనువు
ల్మొత్తంబు ల్మృదుచేలము ల్పరిమళంబు ల్కిన్నరద్వంద్వముల్.

87


చ.

కులగురుమంత్రశక్తి నవికుంఠిత మైనమహారథంబునం
దలముగతి స్సముద్రవియదద్రులపై విహరింప నేర్చు న
బ్బలుమగఁ డేడుదీవుల నుపాయనము ల్గొని యష్టదిక్కుభృ
త్తలములు వ్రాసె రూఢబిరుద ప్రథమావజయాంకమాలికల్.

88


శా.

లోకాలోకమహీధ్రముద్రితమహీలోకంబు బాహాబలో
ద్రేకప్రౌఢి జయించి యమ్మనుకులాధీశావతంసంబు లో
కైకాశ్చర్యకరానుభావవిభవాహంకారరేఖన్ మరు
ల్లోకస్కందనలోలుఁడై కదలె నాలో నేకధాటీగతిన్.

89

మాంధాత స్వర్గమును ముట్టడించుట

గీ.

ఇట్లు సురలోకజయకాంక్ష నేగి బలము, విడిసె సురగిరిపరిసరోర్వీతలమున
నీర్ఘ్య నారత్నసానువు నెగిరి ముంపఁ, గ్రమ్మితొట్టెడురత్నాకరంబువోలె.

90


క.

చనుదెంచి రహితవీరులు, నను నాగుహ లాక్రమించి నడచిరి మొఱయో
యని యనిమిషులకు మొఱ చే, సినగతి మార్మొనసె నద్రి సేనాధ్వనికిన్.

91


క.

ఆరవమున మేల్క ని సే, నారేణువు చూచి కనలి నభమునకు రయో
దారగతిఁ జౌకళించెం, జేరువ నపరంజిమెట్టుసింహపుఁగొదమల్.

92


క.

శైలాధిపతికిఁ బృతనా, ధూళీతతి సోఁకకుండఁ దూలించె సము
ద్వేలనిజవాలలీలా, చాలనముల నినదచకితచమరీమృగముల్.

93


క.

బలఘోషమునకు మతులం, గలఁగియు గిరిగుహలు వెడలఁ గానక పులు లా
బలముల ధూళీసంప, ద్విలసనములు గలయ వేఁట తెరవై కప్పెన్.

94


గీ.

మున్నుగాఁ గొంద ఱేగి చేకొన్నవిడిది, పట్ల సంకేతకేతనప్రతతి గల్గు
బిరుదుప్రతిమలు తమవారిఁ బిలిచె నపుడు, నిజపటాంచలచలకింకిణీరవముల.

95


క.

పసిఁడిజలపోసనంబుల, నసమరుచిం బొలుచుగొల్లియన లున్నతిపెం
పెసఁగఁగఁ బసిండిగుబ్బలి, పసిమినుగులగతిఁ దదంకభాగస్థము లై.

96


ఉ.

దూరపథంబుసేదఁ బడి తూలుచు వచ్చినవారి వస్తుసం
భారము దారు మోచి నిజపల్లవశయ్యలఁ జెట్లనీడ నిం
పార భజించె సైనికుల నప్పుడరణ్యమహీమహీజము
ల్చేరినవారిఁ జేకొనువిశేషముఁ జెట్లును నె ట్లెఱుంగునో?

97


క.

అండము లెండనె యుండియుఁ, బరిసరవర్తులకు నీడపట్టై నిలిచెన్
ధరపై నున్నతులు నిజా, తురతఁ దలంపుదురె యాశ్రితులఁ బ్రోచునెడన్?

98

గీ.

ఆశ్రమించినశిఖిసమూహములు బెదరి, పోయినప్పుడు మునుకంటెఁ బొలిచె నడవి
మ్రాను లయ్యెడ వివిధసామంతవరుల, పరిజనముఁ జేర్చుపింఛాతపత్రతతుల.

99


చ.

పరువు లిడంగ నాత్మఖురపాతములం గనకాద్రిచెంగటన్
గర మపరంజిరామొరసుగట్టపునేలలు చూర్ణితంబు లై
ఖురళికలట్ల యాట బలఘోటకకోటికి సేద దేరఁగాఁ
బొరలుట కయ్యెడ న్వెదకఁ బోవల దయ్యె రజఃప్రదేశముల్.

100


ఉ.

కొంచెముగా నిజాంగకము గుంచి ధరిత్రికి నంతయంత లం
ఘించిన లేచుదంతిఁ బరికించు జనంబులు గొంత ఱాత్మ భా
వించి రవంధ్యవింధ్యపృథివీధరఘోరతరోదయంబు గా
వించిరి వేఱ కొందఱు త్రివిక్రమవిక్రమవిస్మయస్మృతిన్.

101


ఉ.

దాన నిరోధమయ్యెడువిధంబు నెఱింగి జలావగాహమున్
మానుప వేఁడి కాళ్లను బెనం గొనుపట్పదపఙ్క్తులో యనం
నవశృంఖలాలతలు గ్రందుగ మ్రోయఁగ నీడ్చికొంచుఁ బె
ల్లేనుఁగు లేగెఁ గొండసెలయేరుల మజ్జన మాచరింపఁగన్.

102


గీ.

తరళతరకర్ణహతిశంక దనిని నిగుడఁ, గ్రోలఁగా లేనితేఁటులకొదువ దీఱఁ
గ్రోలెఁ గండూయమానకపాలకషణ, వనకుజాసక్తజలమదావళమదంబు.

103


క.

తా నడ్డంబుగఁ దిగుచుట, నేనుఁగు మఱలంగఁ బఱచనేటికిఁ బ్రభవ
స్థాన మగునీలశైలం, బై నెగడం జూపఱులకు నద్భుత మొదవన్.

104


గీ.

నతజలావగాహనమున నుద్ధితము లై, క్రాలె వక్త్రకరికరంబు లపుడు
కుంభమణినిధానగుప్తికై యున్నత, ఫణము లైనకాలఫణులువోలె.

105


శా.

ఝంకారంబులపేర నింగి దనకై సంకల్పముం జెప్పఁగాఁ
గ్రుంకు ల్వెట్టినకుంభినీపతి దిశాకూలంకషామోదపా
హంకారంబుగ దాన మీ నలులకున్ హస్తోదకం బిచ్చున
టంకూరజ్జలబిందువు ల్నభము మూయం జేసె ధూత్కారముల్.

106


చ.

వనగజదానగంధి యగువాహిని వారికి నల్లియంతఁ గై
కొనక తటోపరిస్థలము కొమ్ములచే విడలింపఁ జొచ్చె నా
ననమునఁ గెంపు దేఱఁ బలనాగముపేర జలంబు గ్రోలఁగాఁ
దనకు సరోవరం బొకటి ద్రవ్వికొనం దలపోసియో యనన్.

107


గీ.

మావటీ లంగముల ధూళి వోవఁ గడుగ, మజ్జనం బాడి వెడలుచో మఱియు దాన
సామజంబులు ధూళి మైఁ జల్లుకొనియె, మందబుద్ధుల కొకనియమంబుగలదె?

108

క.

ఘోటకగజపాలురఘట, చేటీసల్లాపపరత శీఘ్రంబుగ నా
ఘోటకగజములు మాటికి, నీటికిఁ జనుతెరువు లెల్ల నిబిడము లయ్యెన్.

109


సీ.

వివిధపదార్థాభివిశదీకృతిం గృతి, వ్యాకర్తఁ బోలెను వైశ్యుఁ డప్పు
డాతిథ్య మొనరించి హరియించె వేశ్యాజ, నంబు సైనికులయర్థంబు లపుడు
హుంకారశతమున కొండోడకను గ్రాస, కబళము ల్భుజియించె గంధకరులు
ఘోటికాస్మృతి నగ్రఖురములఁ ద్రవ్వుచుఁ, గవణము ల్దినియె సైంధవకులంబు


గీ.

నిజనిజాహారతృప్తిమై నిఖలజనము, వేణువీణాదిబహుకలక్వాణ మెసఁగ
సరససంగీతగీతప్రసక్త మయ్యె, రమ్యతర మైననవశిబిరస్థలమున.

110

రావణుండు మాంధాతకడకు దూతం బంపుట

వ.

అనంతరంబ యంబుజహితుం డపరాంబుధిం గ్రుంకినం గృతోచితాచరణుం డై
యుత్తరకోసలేంద్రుండు కర్పూరతైలకరదీపికాసహస్రపరంపరసౌరభవిశేషంబులు
సేవాగతసామంతజనంబులు వివిధగంధానులేపసుగంధంబులతోడ సంబంధబాంధవం
బనుసంధింపఁ బ్రౌఢపాఠకోత్తములు నిజవిజయాంకమాలికాపఠనంబులవలన శ్రవణసు
ఖంబుగా ముఖరం బైనకొలువుకూటంబునఁ బేరోలగం బుండునంత దౌవారికుం డే
తెంచి మ్రొక్కి దూతపురస్సరుం డైనదైతేయుం డొక్కం డరుగుదెంచి మోసల
నున్నవాఁ డని విన్నవించిన నాకస్మికవిస్మయాయత్తచిత్తంబున నాస్థానం బెల్లం దదా
గమనసాపేక్షనిరీక్షణం బయ్యె నప్పు డయ్యధిపతియనుమతంబున నాహూతుం డై యే
తెంచి నిర్భయంబున నహంకారగర్భంబుగాఁ గర్ణకఠోరంబు లైనవచనసందర్భంబుల
గొలం వెల్ల వినం బెద్దయెలుంగున వాఁ డి ట్లనియె.

111


శా.

ఎవ్వం డిం దధినాథుఁడో? యతఁడ నా? లే తుచ్చుఁడా! మంత్రి యిం
దెవ్వండో వినుఁ డింకఁ దక్కినబలాధీశాఖ్యకీటంబు లిం
దెవ్వం డెవ్వఁడొ మీఁదిచే టెఱుఁగ రీహీ! నిక్కమే రాజు లై
క్రొవ్వు ల్మీఱ మదిం గృతార్థులగతిం గూర్చున్నవా రిందఱున్.

112


సీ.

కైలాసశిఖరంబు కందుకం బెవ్వని, కండూతి నిజభుజాదండములకుఁ
గృత్తాత్మశిరములు నెత్తమ్ము లెవ్వని, నీలకంఠార్చనానియమములకు
శతమఖాంతఃపురక్షితము లు గ్గెవ్వని, యుగ్రాసిపుత్రికాభ్యుదయమునకుఁ
గనకగర్భాండంబు కరఁగెడునుయిద యె, వ్వనిరోషశిఖిశిఖావైభవమున


గీ.

కతఁడు దుర్వారదిగ్విజయప్రయాణ, సరళమార్గాంతరాంతరసన్నివేశ
భవనవలయీకృతాఖిలభువనకుండు, రావణుఁడు వొల్చు విశ్వవిద్రావణుండు.

113


వ.

అమ్మహావీరుండు విశ్వవిజయధాటీసమాటోపంబునం బాతాళభూర్భువనంబు లాక్ర
మించి యెదుర్పడుశూరుండు లేక యుపరిలోకం బైనస్వర్గంబునకుం జనిన సునాసీరా

దులు నాసీనవీరులకుఁ బట్టుపడిన రోసి విడిచి కసివోనిదోర్దర్పభరంబుతోడన మఱలి
యదె నికటనగోపరిస్థలంబున విడిసి యాఁకొన్నబెబ్బులికి మేఁకలకూఁతముంబోలెఁ బర
సైన్యకలకలంబు వినంబడిన నెవ్వ రని తెలిసి రమ్మనిన నతనియానతిం బనిపూని వచ్చితి
నస్మత్స్వామి యగునతనిపరాక్రమక్రమంబు లొకకొంత యెఱింగికొనుండు విని
పించెద.

114


మ.

సమదైరావతదంతము ల్విఱిచి బీజశ్రేణి గా సాధ్వస
భ్రమధావత్సురలోకరాడపయశఃపంకంబులో నాటి త
ద్రమణీక్షేత్రజలంబులం బెనిచి యాదైతేయవంశావతం
సము గొల్పె న్నిజకీర్తివల్లికల నాశాకోటిపైఁ బ్రాఁకఁగన్.

115


క.

దనుజపతి మఖము లుడుపఁగ, జనితస్వాహానియుక్తి సమ మయ్యును ద
క్కినసురలకంటె ననలున, కినుమడి యయ్యెం గళత్ర మిదె చెఱపడుటన్.

116


ఉ.

తోడనె లేచి దండము ప్రతోదముగా నెనుపోతుతో జముం
డూడినచక్కటిన్ మడుగు లూనిన నెత్తుట భగ్నశృంగముల్
ప్రోడతనంబునం దగినబూఱటకొమ్ములు గాఁగఁ జల్లుపో
రాడిరి నిన్న రావణరణావని భూతపిశాచబాలికల్.

117


క.

బాడుదలఁ బట్టుకొలమునఁ, గూడనిచెడుగంతుఁ బెట్టుకొనఁ జూచియుఁ జే
యాడక వదలిన నూడని, బాడెం గోణపుఁడు దైత్యపతివెనువెనుకన్.

118


క.

దనుఁ గట్టఁ ద్రాళ్లు తానై, కొనివచ్చిన జూడ యనుచుఁ గుదియించి కరం
బునఁ బాశముఁ గొని తానన, వనధీశుని గట్టె నసురవర్యుం డాజిన్.

119


గీ.

ఆత్మజవము నచ్చి హరిణంబు డిగి భీతిఁ, బాఱఁగాళ్లు రాక పవనుఁ డసుర
లెగిచి కూడ ముట్టి యెకిరింతయిరినోరి, గరికిఁ దిగచి నోరఁ గఱచుకొనియె.

120


క.

మిడిగడుపువ్రేఁకమున నొక, యడు గే నిడ లేక యున్న యర్థాధిపతిం
బుడమిఁ బడఁ ద్రోచి పైమరు, పడ శవములతిట్ట పేర్చి పరిజన మరిగెన్.

121


క.

కలవాఁ డెవ్వడు జెడఁడను, పలుకు నిజం బాజిఁ బట్టువడియును దనకుం
గలనిధులను దండువ యిడి, తలతో నూఁదఁబడి పోయె ధనధుఁడు గృతి యై.

122


గీ.

ఎద్దుచేతిపుర్వు నెమ్ములుఁ బొడతోలు, నొల్ల కసురవీరుఁ డొడిచికొన్న
చంద్రరేఖ నాత్మసత్కీర్తిరేఖ గాఁ, దలఁచి వగచుఁ జంద్రధరుఁ డతండు.

123


గీ.

అసురచెఱసాలయం దున్నయమరవరుల
నారు లిప్పుడు ధరియించినారు జడలు
ధూర్తరక్షఃప్రతాపాగ్నిధూమరేఖ
లార్తనిర్జరలోకాపకీర్తిలతలు.

124

వ.

గుడిమ్రింగువానికి గుడితలుపు లప్పడంబు లని చెప్పవలెనె? యీచందంబున శతమఖ
ప్రముఖులం జెఱపట్టిన రావణునకు నధమమర్త్యులు మీరు లక్ష్యంబు గా రని యెన్న
నేల? తలంగి పోయినం గట్టువడి బ్రదుకలే రగుట బుద్ధిమంతు లైన నమ్మి నావెంటనే
వచ్చి యతనిమ్రోల శరణంబు నొంది ప్రాణంబులు గాచికొనుం డని పలికిన.

125


సీ.

అరుణాయమానంబు లై చూపు లొదవంగ, నిండార దెసలు తీరెండఁగనియె
నత్యుష్మగ్రీష్మంబు లై యూర్పు లొలయంగ, గాఢంబుగా వడగాడ్పు వీచె
నాసారవర్షంబు లై స్వేదములు గ్రమ్మ, మణికుట్టిమస్థలి మడువుకొనియె
నహహశబ్దమయంబు లై హాసములు పర్వఁ, గ్రందుగా వీతెంచెఁ గలకలంబు


గీ.

దైత్యకులభర్తృభృత్యధూర్తప్రతాప, దండహతపుండరీకోగ్రదండనాథ
నిర్నిరోధాగ్రహావేశనియతివలన, మనుకులాధీశునాస్థానమండపమున.

126


వ.

అప్పు డవ్విభుండును నిటలకుటిలభృగుటీకుటీకపటంబునం బొగసినదైత్యకులభర్తృ
భృత్యరోషానలంబునం బొలయుకీలలచెలువునం గనుంగొనలం గెంపు గదుర నెదుర
నున్నదూత జుఱచుఱం గనుంగొని.

127


క.

దూత నని వెఱక ప్రేలేదు, దైతేయాధముఁ డెదిర్చి తానై యని కి
ట్లేతెంచుపనికి మదిలోఁ, గాతరుఁ డై నోరఁబోటుఁ గఱపె న్నీకున్.

128


చ.

కొలిచినవారినేరమునకుం బతి దండ్యుఁడు గాన నిఫ్టు నీ
పలికినప్రల్లదంబులకుఁ బ్రాప్యఫలంబుగ నెల్లి యాజిలో
నిలిచినయేని దూతవుగ నిన్నిటు పంపినరాక్షసాధమున్
సెలవులు వాయఁ ద్రొక్కి వెస జిహ్వ యసిన్ మొదలంటఁ గోయుదున్.

129


ఉ.

మేరునగంబునివ్వలిసమీపవసుంధర సంగరస్థలం
బోరి! నిశాచరాధముని నుగ్రకరుం డుడయాద్రి కెల్లి దో
తేరకమున్న పోరి కరుదెమ్మను రజ్జులు ప్రేలి రానినాఁ
డూరక పోదు సుమ్మి నకులోగ్రకృపాణిక రేఁచిపెట్టునన్.

130


క.

అని వాని వెడలఁ ద్రోయం, బనిచి మహీపాలుఁ డెల్లి బవరముసుండో!
యని నిఖిలసైన్యములకును, జనితోత్సాహముగ వీటఁ జాటించుటయున్.

131


సీ.

కైదువు లర్చించి కలయర్థ మంతయు, నిలుఁ జూఱ యర్థుల కిచ్చువారు
కదనోత్సవత్వరఁ గను మూయు నెఱుఁగక, కోర్కి మై వేబోకఁ గోరువారు
వెడనిద్రఁగలలోన విమతుఁ గూల్చితి మని, కలువరింతలఁ బేరుపలుకువారు
పొలయల్క లెడలించి పొలఁతులచే బిగ్గఁ, గంఠగ్రహప్రీతిఁ గాంచువారు


గీ.

భానుబింబంబు ఛేదింపఁ బంతమాడి, యించుపడఁతులమతులు భేదించువారు
నగుచు బలయోధు లా రేయి యనుభవించి, రాహవోత్సాహసన్నాహహర్షరసము.

132

గీ.

త్రోపువడి కోపమున దైత్యదూత యంతఁ, గనకధరణీధరాధిత్యకాస్థలమున
నుగ్రదనుజులు గొల్వఁ గొల్వున్నదనుజ, విభునిసన్నిధి నది విన్నవించుటయును.

133


ఉ.

త్రొక్కుడువడ్డభోగిగతి మ్రోఁగి ఘృతాహుతి గొన్న యగ్నియ
ట్లొక్కట మండి దండహతి నొందిన కోల్పులిమాడ్కిఁ జూడ్కికిన్
వెక్కసమై ఘనస్వనము విన్నమృగేంద్రమువోలెఁ బైఁ బడ
న్నిక్కి సురారి యాత్మరథినీవరకోటిమొగంబు చూచినన్.

134

రావణు సేనాధిపతులు పంతంబులు వల్కుట

వ.

విలయపవననవజనఘూర్ణమానమహార్ణవోద్రేకరేఖావిడంబకాండంబు నభంగక్రూరభ్రూ
భంగభంగితంబును నట్టహాసప్రభాఫేనిలంబును నవిరతోద్భేదస్వేదప్రవాహపరివార
హితంబును నరణాయమానావలోకనసచ్ఛురణకలుషితంబును నై తాలగ్రీవచక్రాక్ష
జంఝశ్వాసగుహాముఖసేతుఘ్రాణతటిజిహ్వాక్రోశబాహుకూటోదరకుంభహనుప్రము
ఖం బగుదైతేయసామంతవర్గం బనర్గళారంభసంరంభవిజృంభణంబునం గొలువుకూటంబు
గ్రక్కదల నొక్కంత దిగ్గన లేచి యేచినతమిం బ్రాసాసిభిండివాలశూలప్రముఖ
ప్రహరముఖంబుల నిప్పుకలు చిటులం ద్రిప్పుచు నొండొరుం గడవనేయం జక్కాడి
యెక్క డెక్క డనియు నెప్పు డెప్పు డనియు నేమేమి యనియు విడునిడు మనియు
వివిధవీరాలాపంబులు గ్రందుకొన వీరనృత్యంబు సలిపి రప్పుడు విభీషకుం డనుదండ
నాయకుం డఖండనాదంబు నిగుడ భుజాస్ఫాలనం బొనరించుచు ని ట్లనియె.

135


క.

పుడమి సమస్తముఁ బిడికిటఁ, బొడిపొడిగా ముసిమి కినియఁ బొడమినపై చి
త్తడి యడఁగఁ జల్లుకొందునె, యెడయేటికి లె మ్మనుజ్ఞ యి మ్మసురేశా!

136


వ.

అనినఁ బ్రలంబకుం డనువాఁ డిట్లనియె.

137


గీ.

ఉదధి పుడిసిలించి యొకగ్రుక్కఁ గొని లోని, చిలువసెజ్జతోడిజలజనాభు
నరిగి పాఱఁ గఱ్ఱు మనఁ ద్రేఁచి పుత్తునో? క్రాసి యుమిసి విడుతునో? సురారి!

138


వ.

అనిన విఘసనుం డనుదైతేయనాయకుం డిట్లనియె.

139


ఉ.

తారలచేరు గ్రుచ్చి యఱుత న్ధరియింతునొ? భానుబింబనీ
హారమరీచిబింబముల నన్నువ లై తగఁ గర్ణకుండలా
కారము గా వహింపుదునొ? కంజభవాండకరండఖండముం
గోరఁగఁ బట్టి యీభువనకోటి గుటుక్కున మ్రింగిపుత్తునో?

140


వ.

అనిన నందఱ మెచ్చక నిఘ్నకుం డనుయాతుధానప్రధానవీరుం డిట్లనియె.

141


చ.

శతమఖు నగ్ని నంతకు నిశాచరుఁ బాశి సమీరు నర్థపున్
శితిగళు గిట్టి బిట్టెగచి చెచ్చెరఁ గైకొని తెచ్చి పేరితో

నితఁ డితఁ డీతఁ డీతఁ డితఁ డీతఁ డితం డితఁ డంచు నింక నే
నితరులు వోలె నిప్పు డిహిహీ! వెడపంతము లాడ నేర్తునే?

142

రావణుఁడు మాంధాతపై దాడి వెడలుట

క.

అని సామంతులపంతపుఁ, బెనుగాడ్పులతరతరంబు పెరిగెడునసురే
శునికినుపుగడలి మెఱసెనొ, యనఁ దిగి ప్రస్థానభేరి యంతట మ్రోసెన్.

143


మహాస్రగ్ధర.

బలగర్జానాదవేదప్రణవరవణమై ప్రాణిహింసారిరంసా
బలికాలక్ష్వేళితాపోపమయి కలహభుక్పారణామంత్రణం బై
బలవిద్విట్పౌరకన్యాపరిణయకలనాబంధురాశీఃపదం బై
పలభుగ్భర్తృప్రయాణప్రతిహటపటహప్రౌఢరావం బెలర్చెన్.

144


సీ.

వింధ్యాద్రిఁ గలయఁ బర్వినకారుమొయిలు నాఁ, గఱుకునెమ్మేన మైమఱువు దొడిగి
మున్నీటిపై మండుపెన్నేటిచిచ్చుపై, ఠవణించుమణికిరీటములు దాల్చి
మదహస్తి పెఱికినమ్రాను చేకొనునట్లు, విస్మయం బగునొక్కవిల్లు పూని
ప్రళయపర్జన్యుండు సవిపరంపరవోలె, నదురు లీనెడునంపపొదులు పూని


గీ.

యుగ్రకరుఁడు వెండియు నమోఘనైదాఘ, తీష్ణగతి వహించుతెఱఁగు దోఁప
గ్రూరుఁ డైనదనుజకులభర్త భయదస, న్నాహకలితుఁ డగుచు నడరె ననికి.

145


వ.

ఇట్లు సమరసన్నాహదోహలంబున రావణాసురుండు విగ్రహం బెత్తి యాగ్రహంబున
మూర్తీభవించినపరాక్రమంబున నాకారంబు గైకొన్నమాత్సర్యంబునఁ బురుష
భావంబు భజించినక్రౌర్యంబున నవయవంబులు భయంకరత్వంబున దుర్ణిరీ
క్షుండును దుస్సహుండును దుర్లివార్యుండును నగుచుఁ జిరమనోరథసిద్ధి
యైనయుద్ధంబు గలిగినపరమలాభంబున నుల్లంబునం బట్టువడనిమహోల్లాసంబు
వదనదశకంబునకు మందహాసవికాసంబు నొసంగ నగరు వెడలి నిజోద్యోగాను
రూపంబుగా నున్నతం బైనకామగమనం బైనరథంబు నారోహించి సామంత
మంత్రిసుతహితాదివర్గంబు లనర్గళారంభంబున నిరుపక్కియలం బిక్కటిలి సేవింప
ధవళచ్ఛత్రడిండీరంబుగాఁ దనయందు వెల్లివిరియువీరరసప్రవాహంబున కలంకారంబు
గా విహారంబు చూపుచామరమరాళంబులకరాళదంష్ట్రాప్రభాపూరంబులు ముకు
టంబులు సంపాదింప శంఖకాహళీసంధుక్ష్యమాణం బగుచుఁ బాఠకపఠనముఖరంబు
గా నుద్దీపించునిజప్రతాపపావకునకు సముత్తాలకీలాకలాపంబు లై ముందఱ నందంద
సందడి జడియుచుం గనత్కనకవేత్రపరంపరలు వర్తింప నరుదెంచునపుడు ప్రియా
దత్తగండూషహాలారసాస్వాదనంబున రణోన్మాదం బెత్తి తత్తరంబున దొరలు పాయం
దట్టినపట్టెంబు లంకించుచుఁ దమనీడలుదారు వెన్నాడుచుం బఱతెంచువెక్కసపుఁగఱకు

రక్కసులును, మఱియు దక్షిణహస్తంబులఁ దొడిగినయంతన సమరసంతోషంబున నవ
యవంబు లుప్పొంగ నితరహస్తంబులం దొడువను దొడివినహస్తంబుల వెడలింపను
రాక కవచంబులును వెనువెంట వ్రేలికొనం గంచుకంబు లూడ్చినకాలోరగంబులభంగి
మోఁగుచుఁ బఱతెంచుయాతుధానయోధులును, మఱియు మునుపు సురలఁ గెలచిన
సురలోకంబు చూఱఁగొనునప్పుడు చెఱఁబడక మఱుంగునం దలంగి లోఁబడక పోయి
రగుట నీరణంబునం గోలలు మున్నుగాఁ దనువులు దొఱంగి వెనుకొనువార మింతసిద్ధం
బనీ ప్రతిజ్ఞాబద్ధలై యూర్వశి నాకు నాకుం దిలో త్తమ ఘృతాచి నాకు నాకు మేనక
యనుచు నొండొరుం గడవఁ బంతంబులాడి వివాదించుచుం జనుదెంచునక్తంచరకుమార
వీరులును, మఱియు నాయోధనోత్సవాగమహర్షాతిశయంబున నుబుసుపోక లీలాపరత్వం
బునం గొందఱు గంధర్వదంతావళంబులుం గొందఱు రథారోహణులుం గొంద ఱుత్తమా
శ్వంబులునుం గొందఱు రాహత్తులునుం గొందఱం శతాంగంబులునుం గొందఱు రథిక
సారథులును మఱియునుం గొందఱు భేరుండశరభశార్దూలసింహభల్లూకవరాహాదిక్రూర
జంతుభేదంబులునై సర్వతోధికంబైనయనివార్యరభసంబునం గవిసి పఱతెంచు కామరూ
పధరు లగుధూర్తదనుజులుం గలిగి శతసహస్రలక్షకోటిశతకోట్యర్బుదన్యర్బుదాదిసం
ఖ్యల నతిక్రమించి విరించి కీజీవలోకంబు దోడుచూపుభావంబునం జూపఱులచూ
డ్కికి వెక్కసం బయి యొక్కంతఁ బట్టుసాలక మేరుమహీధరావతరణమార్గంబు నతి
క్రమించి నిండుచెఱువనియునీరునుంబోలె మహీమండలంబు గలయ ముంపుచు వివిధ
భీషణక్ష్వేళాసమున్మేషంబున దిగంతంబునం దొట్టుచు నెడవిడనియడియాలంపుగొడుగు
లం బడగలయంతరాళంబున దంతురంబు గావించుచు వెల్లివిఱియునమ్మహాసురచమూ
సమూహంబులు విలయసమయంబునం జెలియలికట్ట నతిక్రమించుమహార్ణవతరంగపరం
పరలం దలపించె నివ్విధంబున.

146


సీ.

తీవ్రదంతిప్రభాతేజోధరంబులు, విరళాంధకారంబు వెన్నడింప
బదసముద్ధతమేరుపదవీపరాగంబు, తొలుసంజరుచులకుఁ దోడుపడఁగ
వివిధతూర్యధ్వనిక్ష్వేళారవంబులు, గతనిద్రముగ భూతగణముఁ గలఁప
వస్త్రరోచులు దీప్యదర్కబింబమునకు, దీధితి ప్రతినిధిస్థితి వహింప


గీ.

భయదనిజధాటికాటోపపటిమ కులికి, డాఁగిపోయినగతి నిశ యేగువేళ
నాహవోత్సాహసన్నాహ మతిశయిల్ల, విడిసెఁ బతిసేన కెదురొడ్డి విమతసేన.

147


సూర్యకులనృపసూర్యుండును సూర్యోదయంబునం గృతకాల్యకరణీయం డై జగదండ
భాండంబు బూరటిల సన్నాహభేరి చఱిపించి దనుజసేనకుం బ్రతిగా నిజబలంబుల
మాఱొడ్డు సంఘటించుటకు దండనాయకుల నియోగించిన.

148


క.

హరి కరిఁ గరి హరి హరికరు, లరద మరదము కరిహరుల హరికరిరథము
ల్పురుషునిఁ బురుషుఁడు రథకరి, హరులం గాచికొనఁ బన్ని రధిపతివీటన్.

149

ఉ.

వీ ళ్లవి రెండుఁ బన్నుడు దివిం గలహాశనమౌనిచూడ్కు లు
వ్విళ్లు గొనంగఁ జొచ్చె నలవేల్పుపడంతులనెమ్మనంబు పిం
పి ళ్లొగిఁ గూయఁ జొచ్చెఁ దమిపెక్కువ మృత్యువు మ్రింగఁ జొచ్చె గ్రు
క్కి ళ్లవియంగఁ జొచ్చె రవికిన్ హృదయం బఖిలంబు నయ్యెడన్.

150


గీ.

పన్ని వేగిరించుపరనిజధ్వజినులఁ, జూచి కోప మేచి త్రోచి యపుడు
పోర నొండొకంటిఁ బొడుచుట కవనీశ, విబుధరిపులు గేలువిడుచుటయును.

151

మాంధాతృ రావణసైన్యములు ఘోరముగ బోరుట

క.

శ్రుతికటువుగ నిరువాగునఁ, జతురంగధ్వనులు తూర్యశబ్దము లేకా
త్మతఁ జూపుటయును దిక్కులు, ప్రతివాక్కులు గాన భిన్నభావము దెలిపెన్.

152


మ.

రతివాదంబులు దక్కి భర్తల స్వయంగ్రాహాంకపాలీసమ
న్వితులం గా నొనరింప సిద్ధవనిత ల్నిద్రాణకంఠీరవ
ప్రతతు ల్గర్జిల నమ్మహాబలయుగారావంబు భూభృద్గుహా
ప్రతిఘోషాధిపదీర్ఘ మై పగిలిచెం బంకేజగర్భాండమున్.

153


గీ.

కుంతములఁ జిమ్మి శక్తుల గ్రుచ్చి యెత్తి, ముసలముల మోఁది కరవాలముల దళించి
పరశువులఁ ద్రించి గదలచేఁ బంపు చేసి, ఘోరగతిఁ బేర్చి యిరువాగుఁ బో రొనర్చె.

154


క.

కలన నొక టొకటి మార్కొని, కలసి కచాకచి విచిత్రగతిఁ బోరఁగ నా
బలముల కుడిగె విభేదము, బలభటులకుఁ గలిగెఁ గాని ప్రత్యంగములన్.

155


సీ.

మది తత్తఱం బెత్తి మొదల మ్రొక్కులు చూపి, పట్టి పైకోకలు పాఱఁదిగిచి
కేలిమై గుణము లగ్గించి యగ్గించుచు, నడుములు డాకేలఁ దొడికి పట్టి
కుటిలభావములు గైకొని యున్నఁ బరికించి, పరుసనై రంపిల్లుబిరుసు మెచ్చి
పరిచితస్నేహానుపాకంబు మది నచ్చి, వదలక కొప్పులు వాలఁ దిగిచి


తే.

యచ్చలము మీఱ మెలసినయట్ల వచ్చు, తరుణులును బోనివిండ్లతో దండిమగలు
విషమశరఖేలనము చూపువేళయందు, నభినవకుతు లెసఁగె బెల్లంగములను.

156


క.

సలలితవికాసలక్ష్మీ, నిలయము లగుయోధవదననీరజములపైఁ
బొలసెఁ బరంపర లై యపు, డలఘుశిలీముఖకులంబు లారవ మెసఁగన్.

157


క.

తొడవినయొడలను ఱవికల, నెడలిచి యనురక్తరచన లేర్పడ భటులన్
మెడలు గబళించి వివశతఁ, బొడమించె న్శూరఖడ్గపుత్రిక లంతన్.

158


గీ.

పటవణించిన యరిగెలపౌఁజుమీఁదఁ, గూడి విలుకాండ్రు తూపులు గురియుమ్రోఁత
సమరవీరుల మ్రింగుకోపమున జముఁడు, పెటపెటనఁ బండ్లు గీఁటెడు పెల్లు చూపె.

159


గీ.

పోటుపూఁచి పట్టునీటెలు దగె రెండు, వీళ్లయందు సమరవీరవరుల
మ్రింగ వెఱచి యున్నమృత్యుముఖంబున, బయలువడినదంతపంక్తు లనఁగ.

160

గీ

తీవ్రచక్రనిహతిఁ దెగి కాళ్లు గుత్తుల, కొలఁది కూడి చనినఁ గూలఁబడక
నిలిచి పోరి రిపుడు నిజహస్తకుంతంబు, లూఁత గాఁగ వీరయోధవరులు.

161


క.

ఎడమకడవాఁడు వొడిచినఁ, గుడిచే బాణముల కొఱగి కొఱప్రాణముతోఁ
బుడమికి వ్రాలఁగఁ జేయం, బడకయు శరతల్పవసతి భటులకుఁ గలిగెన్.

162


గీ.

విడిచి వాటుల వీఁపున వెడలుగొరక, లొగ్గి నిలుపుటఁ గూలక మ్రొగ్గతిల్ల
నీటు దప్పని యరిగెలచాటుకలిమి, నీల్గియును గొంద ఱహితులు నిలిచి రాజి.

163


గీ.

నన్నుఁ జిన్నపుచ్చి నాకంబు పెద్దసే, యంగఁ బోవు టె? ట్లటంచుఁ బుడమిఁ
దెగినవీరులరుగుతెరు వరికట్టె నా, సమరధూళి మింట సాంద్ర మయ్యె.

164


గీ.

తూర్యములఁ బెట్టుచప్పుడు దోఁప కైన, కప్పుకొనుధూళి నొండొరుఁ గాన కైన
పోర నిరువాగునెదురుగఁ బొడుచుపోటు, లందు నొకటియు వృథగాదు క్రందుకలిమి.

165


క.

ఇలకును నింగికి భేదము, గలుగక రణధూళి పర్వఁగా నిరుమొనలన్
విలుకాం డ్రేసెడితూపులు, నెలవుగ నాకసము గాఁడి నిలిచె న్నడుమన్.

166


గీ.

తనువు తనువును దార్కొన్నదాఁకఁ గాన, రానిబలధూళిఁ జేతిశస్త్రములు వదలి
పొదివి యొండొరుఁ ద్రోపాడి పోరుకతన, మల్లుపోరాటమైఁ బోరు చెల్లె నపుడు.

167


క.

తొరఁగెడునెత్తుటఁ దేలియు, నొరిగెడుప్రాణముల నింగియును గప్పుచు నా
దురమున ధూళి యడంచిరి, పరస్పరాస్త్రముల గ్రువ్వఁ బడువీరభటుల్.

168


సీ.

చెఱకుసన్నిద మాడుతెఱఁగున గొడ్లండ్ల, నడుములు రెండుగా నఱికి నఱికి
యంత్రమాడెడుభంగి నట్టలు దలలును, విడసినధారల వ్రేసి వ్రేసి
కఱకుట్లు గ్రుచ్చుసంగతి నల్వు రేవుర, గుదులుగా గొరకల గ్రుచ్చి క్రుచ్చి
దొంతుల కుఱుకురీతుల నొడ్డణములతో, శిరముల దౌడలఁ జిదిపి చిదిపి


తే.

పల్లదమునఁ బల్కుపంతంబు నొకఁడుగాఁ, బోటుగరపుకన్న పోల్కిఁ జూపు
శివము లెత్తినట్లు చేతులతీఁట వోఁ, బోరి రిందు నందు వీరభటులు.

169


క.

ఇది హస్తం బది మస్తం, బిది తొడ మెడ డొక్క పిక్క యిది కాలిది వ్రే
లిది వదనం బిది రదనం, బిది యిది యని యెఱుఁగ కుండ నీల్గిరి సుభటుల్.

170


గీ.

ఉభయబలముల బిరుదురాహుత్తు లెదిరి, తోలుగుఱ్ఱంపుపౌఁజులధూళికతన
నపుడు కాలనిశావేళ యైనచోటఁ, దగియె ఖద్యోతనామంబు తపనునకును.

171


చ.

ఇతరబలాంగకోటి గలహింపఁగ సంగరభూతభోజనో
చితముగఁ బ్రోవు లై పడియెఁ జిత్రముగాఁ గవిరూపరూపము
ల్కుతలముదూఱున ట్లెదిరి గుఱ్ఱపురౌతులు వ్రేటులాడ న
ద్భుతముగఁ దద్భుజక్రియకుఁ బోలెడునట్లుగఁ గల్గెఁ బచ్చడుల్.

172

క.

పగరౌతు లెడమభుజములు, తెగవ్రేసినవాగెవట్టుతెఱఁ గేదియునుం
దగునిజహియముల నద్భుత, ముగ రాఁగలసన్న మెపిల పోరిరి రౌతుల్.

173


క.

రౌతుల సందిటఁ గొని చను, రౌతులవడిగుఱ్ఱముల కరాతికృపాణీ
పాతితహయు లై తిరిగెడు, రౌతులు రౌతు లయి పోరురణ మలరారెన్.

174


గీ.

రౌతు వొడిచినఁ బుడమికి వ్రాలుభటులు, ఖడ్గముల వ్రేయ ముందఱికాళ్లు ద్రెవ్వి
హయము గూలంగ నిజపటాప్రాంతమునన, తెళ్లునారౌతుతలయును డొల్లనడఁచె.

175


క.

నెత్తురుముడుపులు పౌఁజుల, మొత్తపుపొదులు గలకలనుమోదముఁ బెనుపన్
మత్తకరిఘటల శృంఖల, వృత్తి నెదుర్పడియె రెండువీడులయందున్.

176


గీ.

ఉపరిసామంతజనము పెంపొప్ప వార, ణముల కులవృద్ధు లని చేరిన నెమళు లన
నోలి నిరువాగుతరులపై వ్రాలుశత్రు, శస్త్రికలు గ్రాలుపింఛగుచ్ఛములు వొలిచె.

177


గీ.

ఉభయబలములు నెదిరి పోరొడ్డి కదియు, కరిఘటలయంతరాళంబు గాన నయ్యెఁ
గపటపాఠీనవిహృతివేగంబువలనఁ, బాయపడి తోఁచుజలధి ర్భంబువోలె.

178


క.

దూరమున శరము లేయుచుఁ, జేరువ బల్లెముల నొంచి చేరినయపుడా
ధోరణపరులు పరస్పర, వారణముల కుఱికి రిపులు వధియించి రనిన్.

179


గీ.

క్రొత్తయినుపకట్లకొమ్ముల నన్యోన్య, ఘట్టనముల నిప్పుకలు జనింపఁ
గర్ణచామరములఁ గప్పుచుఁ గ్రొంపొగ, లెగయఁ బోటులాడె నిభము లపుడు.

180


క.

రొమ్ములు విఱిగినబిరుసునఁ, గ్రమ్మరు ప్రతిగజముపార్శ్వకము కరి వొడిచెన్
గొమ్ములకొలఁదియుఁ దిగఁబడఁ, గ్రమ్మి నదీతటము గ్రొచ్చుకైవడి దోఁపన్.

181


క.

కలనం బిఱుసన వయ్యును, బలవద్భద్రేభములకుఁ బ్రతిగజదేహం
బులు మునుఁగ నాఁటి కొమ్ములు, వెలువడఁ బెఱుగుట కొకింత వెనుచన వలసెన్.

182


క.

కుంజరము వాజిఁ గొమ్ముల గ్రుచ్చి యెత్త, జడియ కసిధార మావంతుఁ బుడమిఁ గూల
వ్రేసి రాహుత్తుఁ డామదద్విపము నెక్కి, మలపి ధీకొల్పి శాత్రవబలముఁ బఱపె.

183


గీ.

చాయ దప్పించి కొమ్ములసంది కొదిగి, గ్రుంకి తొండముఁ దెగవ్రేసికొంచుఁ గాళ్ల
నడుము నరిగినభటుని గానఁడు నిజాగ్ర, హస్తఖండంబు భటుఁ డంచు హస్తి వొడిచె.

184


క.

దురమున మృత్యువు శూరుల, కరముల రెంటన వసించి కరులకు శుండా
చరణరదనాలముఖములఁ, వరలక యవ్వేళనష్టధా వసియించెన్.

185


క.

తమయెక్కియున్నమదనా, గములకు ననిపోటు గరపు గా నెదిరిసరూ
పము వెల్లఁ ధర మునుమును, సమయఁ దొఱంగించి చంపఁ జని రాకోమరుల్.

186


క.

శరము లడరించి ముందఱి, పరబలములఁ ద్రుంచి తెరపిఁ బడుత్రోవలుగా
నరదంబులు నడపించుచు, సరినిరువాగును రణంబు సలిపిరి రథికుల్.

187

క.

ఆరూఢి వీరరథిక, క్రూరాశుగనిహతి నేలఁ గూలియు శైలా
కారంబు లైనగజములు, తేరులు చనకుండ వారితెరు వరికట్టెన్.

188


వ.

ఇవ్విధంబున.

189


క.

నారదమునిచూడ్కికి సుఖ, పారణ గా నింగివేల్పుపడఁతులయిండ్లం
గోరిక నాథులపండువు, గా రవిమండలము డొలుకఁగా నని చెల్లెన్.

190


గీ.

దురములోఁ దఱు చైన నెత్తురుమడుగులు, కాళ్లు ద్రెవ్వినకరులు వక్రంబు లయ్యె
లూనతత్కరవితతి జలూకమయ్యె, భిన్నతత్పదకులము దాఁబేళు లయ్యె.

191


క.

నలుగడల నట్టలాడుచుఁ, బొలుపారఁగ మొదల నిడినపుష్పాంజలు లై
దళితకరికుంభముక్తా, ఫలములు రణరంగవీథిఁ బ్రకటము లయ్యెన్.

192


క.

పలుచనినెత్తురుమడుగులఁ, బొలిచె రథనేమివలయములు రణహతవీ
రులు దూరఁగ రవిబింబము, దొలుకై రుచి మాలి నీడ దోఁచినమాడ్కిన్.

193


క.

ఖరభల్లనిహతిఁ ద్రెవ్విన, తురగంబులవాలవితతి దురమునఁ గ్రొన్నె
త్తురుమడుగులఁ జూపట్టెన్, విరిజల్లులఁ గుసుమనూనె వేసినమాడ్కిన్.

194


గీ.

ఎదురుపోట్ల మిడిసి యెగసి బోరగిలంగఁ, గూలి నేలఁ గఱచుకొన్నదొరలు
సచ్చి యైనఁ దమకు సడలనిభూమిభృ, ద్భావిలోభ మెఱుకపరచి రపుడు.

195


సీ.

వివిధమాంసంబులు వివిధభోజ్యములు గా, నెత్తురు ల్పెక్కుపానీయములుగఁ
బదహస్తతతు లపూపవిశేషములు గాఁగ, బహుగాత్రఖండము ల్పచ్చడులుగఁ
బ్రేవులప్రోవులు సేవెలుగాఁ దెట్టె, గొన్నక్రొన్మెదడులు జున్ను గాఁగ
ఛిన్నాస్థిఖండము ల్చెఱకుఁదుంటలు గాఁగ, నెర వైనయయ్యూట నెయ్యి గాఁగ


గీ.

సమరవీరులు నప్సరస్సతులు పెండ్లి, యాడునప్పుడు షెండ్లివిం దారగించి
భూతబేతాళఖగమృగవ్రాత మొందెఁ, జాల సంతృప్తి నారణస్థలమునందు.

196


వ.

మఱియునుం గ్రోధంబులకు సామ్రాజ్యంబును గ్రూరత్వంబులకు నామనియు మదంబులకు
సాఫల్యంబును మాత్సర్యంబులకుఁ గృతార్థతయు నభిమతంబులకు విలసనంబును నాశ్చ
ర్యంబులకు నుద్వేలనంబును నుత్సాహంబులకు బురిటిల్లును నున్మాదంబులకుం బ్రాఁకు
డును సాహసంబులకుఁ బర్వంబును సత్వంబులకు దాయంబును బ్రాయంబులకు గైసేఁ
తయు బంతంబులకుం బరిణేతయు సత్కీర్తిలతలకుం బాదును స్వర్గంబులకు ఘంటాపథం
బును నగునమ్మహాహవంబునం బేరుకలరౌతు లాయశుద్ధిగాఁ దార యెఱింగి వ్రేసినజన్ని
దఁబువ్రేట్లం బంచి వేసినగతం గాలు చే యాడక నిలువునఁ గుప్పలై కూలినపట్లును,
నిక్కుబాయ లై వడినయెడలునుం, బరిఘాఘాతంబులం బలకలతోడన పునుకలు
తుందునకలై రూపు చెడి మడిసినచోట్లును, వాఁడిగుదియల మోఁదిన నొడళ్లు గుల
గుల లై తలమోపులు దిగ వైచినగతిఁ గాలుసేతు లాడక నిలువునం గుప్ప లై కూలిన

పట్లును, నిక్కుగలడొక్కచిప్పలవలనఁ గొనం జిమ్మినం బంది వొడిచినగతి నాపాదచూ
డంబు గా నొదవినక్రొంగంట్ల నుడుగక వెడలుక్రొన్నెత్తుటన్ జొత్తిల్లి త్రెళ్లి జొత్తు
పాపల విడంబించుచక్కట్లును, జొరువ గని తఱిసి గండ్రగొడ్డండ్ర ఖండించినం గీలెడ
లినజంత్రంబులక్రియ నడుములు దెగి యపరభాగంబు లున్నయట్ల యుండ నూర్ధ్వభా
గంబులు జాఱినవంకలును మఱియుఁ గుంతతోమరశరశక్తిముసలగదాపట్టసప్రాసపాశ
భిండివాలశూలప్రముఖప్రహరణప్రహారంబులం గన్ను వెన్ను డొక్క పిక్క కాలు
వ్రే లనుభేదంబు సేయరాక కలిపి క్రుమ్మినగతిం దఱిగి మెదపిన తెఱంగునం గుడిచి
క్రక్కినచందంబునం బగిలియు నొగిలియు దునిసియుం దుమురయ్యుం గండలు నెత్తు
రుంబ్రేవులు మెదళ్లును గలయంబడి పేరి పేరెండతాఁకునఁ గరంగి నిగ్గు తేఱుతావులును,
వెండియు నొండెడలం గుంభముక్తముక్తాఫలశర్కరిలంబు లగునేనికమెదళ్లు కెళ్లు
కొనియు నమలి చవి గొన లేక మరల వెడలఁ గ్రక్కు డాకినీగణంబులును, మాంసం
బులే పెరిగి మిసమిసలు వారుమృతసామంతజనంబుల పెన్నురంబు లన్నువం గవిసి కబ
ళించి యంతర్మగ్నభగ్నంబు లగునస్త్రభంగంబు లంగుళ్ల నాటిన మిట్టిపడి వెరిదేఱనో
ళ్లు విదిర్చికొనుచుం బారుభూతవ్రాతంబును, రక్తపానమదోన్మత్తంబు లై ద్విపరదవఖం
డంబులం దురంగవదనంబులు చేర్చి కిన్నరాకారంబులు పన్నియు గజవక్త్రంబులు
గూర్చి గణపతిప్రతిమలు సేసియు నొక్కొక్కటం బెక్కుతలలు హత్తించి చతుర్ముఖ
షణ్ముఖాదిరూపంబు లొనర్చియు బరితఃపతితమృతివీరుల తనుత్రాణశిరస్త్రాణభూషణ
వస్త్రవిశేషంబుల యథాతథంబులు గాఁ బూన్చి మాతంగతురంగశవంబు లారోహిం
పించి లె మ్మనుచు నార్చి మోదియు వినోదించుపిశాచలోకంబును, నిజముఖాగ్రఘట్ట
నంబులచేతం బ్రహారవశంబునం గప్పినమూర్ఛలు దెప్పిరిలి కొఱప్రాణంబులతోఁ
బొరలు వీరయోధులపై మూఁగుచు విరియుచుఁ జిఱ్ఱుముఱ్ఱాడుకాకోలూకాదివిహంగ
సంఘంబులును, శతమతిం బతితకేతనబిరుదప్రతిమలం గదిసి పసిగొనం గదిలిన నెదిరి
ఝుంకించుట గా శంకించి వెనుకద్రొక్కునక్కపదువులుం గలిగి, మహాప్రళయంబునుం
బోలె సర్వతఃకబంధబంధురంబును, దివసావసానసమయంబునుంబోలె వియుక్తరథాంగ
సంఘంబును, నంధకారంబునుంబోలె హతసహస్రాతపత్రంబును, మత్తురాజ్యంబు
నుంబోలె విధ్వస్తసమస్తధర్మంబును, గుకవికవితయుంబోలె భగ్నోరుప్రాసంబును,
శూన్యపురంబునుంబోలె శిథిలపరిఘాకులంబును, వార్ధకంబునుంబోలె భిన్నగదాసంకులం
బును, అవగ్రహంబునుంబోలెఁ బ్రశాంతనిశ్శేషవాహినీసంకులంబును నై సంగ్రామ
రంగంబు చూపఱకు వెరపు వెరగు వెక్కసపాటు నొదవించె నయ్యవసరంబున.

197


గీ.

బలము లడఁగినఁ దమ కెదుర్పడగఁ దెరపి, గలుగుటకుఁ బొంగి యార్చి శంఖంబు లొత్తి
తాఁకి రెక్కటిరెండుమొత్తములు దొరలు, నోర్చి ఫణిపతితలలు నుఱ్ఱూఁత లూఁగ.

198

క.

కడపడక కూలుగొడుగులుఁ, బడగలుఁ జామరలుఁ గలయఁ బడి మూర్ఛితు లై
పడియెడుతారలకును ము, న్నొడఁగూడెడు మెత్తపఱపునొఱపు వహించెన్.

199


గీ.

యోధవరులయెడళ్లు పెల్లుబ్బి పాఱి, తన్నుఁగట్టినతూపులతఱుచువలన
నెత్తురులఁ గొమ్మెదళ్లు మునింగి సమర, ధరణి గరుపాఱియున్నవిధంబు సూపె.

200


క.

ఈరీతి నుభయబలములు, పోరాడఁగఁ దత్ప్రతాపములు సూచి మదిం
గూరినలజ్జఁ బ్రతాప, ప్రారంభం బుడుగునట్ల భానుఁడు గ్రుంకెన్.

201


క.

అనిఁ దెగవీరులు దివికీం, జనుచుం దనుఁ జించికొనుచుఁ జనఁ జనసంధ్యా
ఘనదీప్తిరుధిర మొలుకఁగ, ననువఱి యినుఁ డస్తశిఖరి నల్లన సోలెన్.

202


క.

కదనమునఁ గినియుశూరుల, వదనంబులఁ బదనుగొనుచు వడి నాకసమున్
బొదివెనొకొ? సమరశోణిత, సదమలరుచు లనఁగఁ బర్వె సాంధ్యమరీచుల్.

203


గీ.

భానుకులముఖ్యుబలముపైఁ బగఁ దలంచి, తననిశాచరవరులబాంధవము దలఁచి
పోర నోడింప గెలిపింపఁ బూనికాదె?, పర్వె నన నిర్లు దట్ట మై పర్వుటయును.

204


వ.

అట్టియెడం బ్రళయసమయంబున విడివడినమహావలాహకంబునుంబోలె దిశావలయం
బద్రువ గర్జిల్లుచు నిజతనుచ్ఛాయాఛ్ఛటాస్ఫురణంబునం జిమ్మచీఁకటి రెట్టింపం గుటిల
చటులదంష్ట్రాఘట్టనంబులం జిటులువిస్ఫులింగంబులు విద్యోతమానఖద్యోతంబులకుం
బ్రాపు చూపం గఠోరహుంకారభయంకరంబు లగుచుం గులాచలమహాగుహాకుహరం
బుల విడంబించువదనగహ్వరంబులఁ గంఠపర్యంతంబుగాఁ దెఱచి యెదిరించువీరులం
బట్టి విఱిచి వైచుకొని మ్రింగుచుం బొంగుచుం బ్రహస్తమహాకాయప్రముఖప్రధాన
వర్గంబుసు నగ్నికేతురశ్మికేతువిరూపాక్షాదిబలాధ్యక్షులు నింద్రజిదతికాయదేవాంతక
నరాంతకప్రభృతికుమారులును మున్నుగా నసంఖ్యేయు లగుయాతుధానవీరు లేచి త్రోచి
హాలాహలానలం బుద్వేలనంబు చూపురూపునఁ గవిసి నిజమాయావిజృంభణంబుల
మహార్ణవంబు వెల్లి విరియించియం బ్రళయానలజ్వాలాకలాపంబులం జుట్టుకొలిపియుం
గూరోరగపాశంబులం గట్టుపఱచియు నఖండగండశిలావర్షంబు లొండొండఁ బయిం
గురియించియు మఱియు ననేకంబు లగుమిథ్యామహోత్పాతకల్పంబుల భ్రమియించి
గుండియ లవియించినం జెదరి బెదరినసజ్జనవచనంబులునుం బోలె మరుగు లేక సాధు
జనంబునుంబోలె నొక్కం డొకనితెరువు వోక యామనిక్రొన్ననలునుంబోలెఁ బరువు
మిగిలి యమ్మహీనాథుయోధు లాయోధనంబు మఱచి వెఱచఱచి దైన్యంబుల తోడన
కైదువలు విడిచి యొండొరుం గడచి విజయశంఖనాదంబులతోడం బిశితాశనవీరు
లార్చుచును వెనుకం దలలు వీడం బఱచిన.

205

మాంధాత రాక్షససైన్యముపై విజృంభించుట

శా.

కించిద్భ్రూకుటిఫాలవీథి మెలయం గింక న్మహీభర్త దో
రంచచ్ఛాపగుణధ్వను ల్చెలఁగ బాణౌఘంబుచే యామినీ

సంచారోద్ధతు లైనరక్కసుల నాశ్చర్యంబుగా వేల్మిడిం
జించెం ద్రుంచె వధించె నొంచె నొలచెం జెండాడెఁ జండాకృతిన్.

206


క.

మిడియుతల తునియునడుమును, బడుతొడయును విఱుగుకాలు పగులుతనువు లై
బడలువడి యసురబలములు, పొడ వడఁగె న్విభునిబాణములవెల్లువలన్.

207


క.

పరహృదయకమలభేదక, శరకిరణసహస్రకర్కశం బై మనుజే
శ్వరకరవలయిత మగువిలు, పరికింపఁగఁ దత్ప్రతాపభాస్కరుఁ డయ్యెన్.

208


క.

కనుఁగొన నొకఁ డయ్యు మహ, త్యనుమిత మై నైక మయ్యె నధిపతి తెగ కె
క్కినతూపు తీవ్రభావం, బున దీపజ్వాలవోలె భువనాద్భుత మై.

209

మాంధాతృరావణు లొండొరుల నధిక్షేపించుకొనుట

మ.

అది యెల్లం గని రావణుండు లయకాలాగ్నిక్రియ న్మండుచుం
బదిదిక్కు ల్పదినోళ్లచేతఁ గబళింపం జూచుచందంబునన్
వదనౌఘం బపు డట్టహాసరచన వ్యాలోలజిహ్వాభయ
ప్రద మై యుండఁగ విస్ఫులింగములు నేత్రశ్రేణి వర్షింపఁగన్.

210


క.

నిలు నిలు నృప! నీ వగుదువు, బలియుఁడ! నీబీర మెల్లఁ బదిలపఱపు నీ
పలలములు నీకు నోడిన, పలభుక్కులమునకుఁ బంచి పాలిడువాఁడన్.

211


గీ.

కాదు వో వేఁగునాఁడు ముక్కంటితోడ, వెండికొండయు నాభుజాదండమునకు
దురము గఱ వౌట నైన ప్రాఁద్రుప్పుతోడి, చంద్రహాసంబురీతి నోజనవరేణ్య!

212


క.

బలిభిత్ప్రభృతు లెదుర్పడ, బలవంతులు గామిఁ బ్రాఁతవడినకృపాణం
బులు గడుగువాఁడ నిదె నీ, గళరక్తముచేత నేఁడు ఖరకరవంశా!

213


గీ.

అనినఁ దద్వచోనిలాహతిఁ గోపాబ్ధి, వెల్లివిరిసి నెఱసి వేల ముంచి
తొట్టి మెఱయునురుగుదెట్టువవోలెఁ గె, మ్మోవిఁ జిఱుతనవ్వు మొలకలెత్త.

214


క.

తనుఁ దానె పొగడుకొను టిది, ఘనమతులపథంబు గాడు కైదువచేతం
గొనియుండియు నసురాధమ! పనిమాలిన రజ్జు లాడఁ బౌరుష మగునే.

215


వ.

అనిన మిగులం గోపించి.

216

మాంధాతృరావణుల ద్వంద్వయుద్ధము

క.

ఒక వింటికిఁ బదివిండ్లను, బ్రకటించినఁ గాదు నాకుఁ బంతము పరిపం
థికిఁ బెంపొసగుట యని వి, ల్లొకటనె దనుజేంద్రుఁ డేసె నుగ్రాస్త్రంబుల్.

217


మ.

అవి దోడ్తోఁ దునుమాడి భూవరుఁడు నుగ్రాకారుఁ డై శింజినీ
రవ మాశాంతరముం జెవుడ్పఱప నారాచంబు లొక్కుమ్మడిం
గవియింపం దశకంఠుఁ డద్భుతరసక్రాంతాత్ముఁ డై హస్తలా
ఘవ మగ్గించి తదీయబాణవితతుల్ ఖండింపరా కుండుటన్.

218

క.

ఒండువిలు సాలమిని వే, ఱొండొకవి ల్లెత్తి చాలకుండినఁ బైఁ బై
నొండొండఁ బూనఁ గార్ముక, దండంబులు పదియు నయ్యె దశకంఠునకున్.

219


క.

వదలక విభుఁడును వివిధ, ప్రదరంబుల వెల్లిగొలుపఁ బటు వగుదీప్తుల్
పొదిగొన్నవేళ నింగియుఁ, దుది నేమని చెప్ప నంపదొన యై తోఁచెన్.

220


సీ.

భూరితరంగితాంభోధి యై క, నుపట్టు నురగకులంబుచే నొక్కమాటు
నికటకాంచనరాజీవకషోపలముఁ బోలు, నురుగరుత్మత్కాంతి నొక్కమాటు
కాచపాకక్రియాకరకుటీరముఁ బోలు, హుతవహజ్వాలల నొక్కమాటు
చటులమహావటక్ష్మారుహంబును బోలు, నుదకధారలచేత నొక్కమాటు


గీ.

నభము చూపఱ కిట్ల మాంధాతృమనుజ, నాయకుండును రాక్షసనాయకుండు
నిగిడి పన్నగమారుతాగ్నేయవారు, ణాదిదివ్యాస్త్రములఁ బోరునాహవమున.

221


చ.

ఉడుగక పెద్దకాల మిట లొండొరు గెల్వఁగ లేక కోపము
ల్విడువక పోరిపోరి తుద వేసరి దైత్యుఁడు చంద్రహాసముం
బుడమివిభుండు పాశుపతము న్వడిఁ బూనిన మ్రొగ్గె దిక్కరు
ల్జడధులు ఘూర్ణిలెం బెకలె శైలను లల్లల నాడె లోకముల్.

222

శివుఁడు ప్రత్యక్షమై యుద్ధమును మాన్పుట

గీ.

అంధులై చేయునది లేక యమరు లింకఁ, ద్రుంగెఁ భో విశ్వ మింతటితోడ ననఁగ
నంతలోనన వారలయంతరమున, నలికనేత్రుండు ప్రత్యక్ష మగుచు నిలిచె.

223


శా.

ఓహో! చాలుఁ బురే! మహాహవము మీకొండొక్కరుం దక్కఁగా
బాహాహంకృతి యెందు వేఱ సరి చెప్పం గాన మీ విశ్వని
ర్దాహక్రీడకు మిమ్ముఁ బంపిడితినే? తప్పయ్యె మీ కీజగ
ద్ద్రోహం బేటికిఁ బొండు మీరిరువురుం దుల్యప్రభావాధికుల్.

224


గీ.

అనిన హరునియాజ్ఞ కసురేంద్రుఁ డట్లకా, సమ్మతించె విభుఁడు సమ్మతిలక
యహితుమీఁదికోప మారక భువనంబు, తలఁక భవునిఁ జూచి పలికె నపుడు.

225


క.

నిను దశశిరములఁ బూజిం, చినవాఁ డని కాదె వీనిఁ జేపట్టితి? వే
నును నీమది కెక్కినయీ, తనితలలం ద్రుంచి నిన్నుఁ దగఁ బూజింతున్.

226


వ.

అనుటయు.

227

శివుఁడు మాంధాతకు విజయము నొసంగుట

ఉ.

మెచ్చి హరుండు రాజ! వినుమీ యొకమాట మదంఘ్రిభక్తిసం
పచ్చరితార్థుఁ డీయసురభర్త నిసర్గబలాధికుండ వీ
విచ్చితి నీక యజ్జయము నింతియ కాదు వరంబు నొక్క టే
నిచ్చితి నిన్ను నెవ్వఁడు జయింపఁడు పొమ్ము జగత్త్రయంబునన్.

228

గీ.

అని విభుండు సేయువినయంబు గైకొని, పోయె హరుఁడు చిన్నఁబోయె నసుర
విజయశాలి యపుడు విజయకాహళములు, మొరయ నాత్మసైన్యములు భజింప.

229

మాంధాత హిమవంతము నెక్కుట

ఉ.

హేలమెయి న్మహీరమణుఁ డెక్కెను నిశ్చలనమ్రదేవతా
సాలము గంధరస్థనురచారణదంపతిగాననీచివా
చాలముఁ దుంగశృంగతటసక్తమణీపునరుక్తతారకా
జాలముఁ బారిజాతవనసంస్థితిమూలము హేమశైలమున్.

230


వ.

మఱియు నమ్మహామహీధరంబు తారకితనభోభాగంబునుంబోలెం బ్రతిఫలితోత్తుంగ
శృంగతరుప్రసవపరంపరావిరాజితంబు లగువిశాలహరినీలవప్రస్థలంబులచేతను వప్రస్థ
లంబుల వ్రేలుచు మొదలం గులిశఖండితంబు లైనపట్లం గ్రమ్మఱఁ విగిర్చి మొలచిపొలుదు
పక్షశ్రేణియుంబోలెఁ గనుపట్టు నవీనధారాధరంబులచేతను, ధారాధరంబుల మదాంధ
సింధురంబు లనురోషంబున ఘోషింపుచుం బయింబడ నుఱికి నిజనిపాతవిశీర్ణగర్భంబు
లగునయ్యంబు ధరగర్భంబులు దొఱఁగి ధాతుస్థలంబులం బొరలి పాఱునీరంబులు రక్తపూ
రంబులం బ్రోవులై గానంబడువడగండ్లు కుంభనిర్ముక్తముక్తాఫలంబులుగాఁ దలంచి
గర్జించుసింహకిశోరంబులచేతను, సింహకిశోరంబులజాడలు వెనుకొనుభిల్లపల్లవాధరధను
ర్గుణక్వణనంబులు గుహాముఖంబులం బ్రతిశబ్దంబులు చూప మేఘగర్జితంబుల నుత్కంఠం
బులై యాలకించునీలకంఠంబులముఖంబులం గబళితవాలంబు లై వ్రేలెడుఫణులఫణా
మణులు మ్రాకులకులంబులకు దివియ లై వెలుంగఁ జీఁకటి యెఱుంగనిదినకరకరనికర
దురధిగమవనీగర్భంబులం గ్రీడాగృహంబులును మఱియుఁ బ్రతిరాత్రంబును వెన్నె
లలంగఱంగునుపరిచంద్రకాంతంబులజలంబులు పయిం దొరుఁగఁ దట్టి ఘర్షణంబునం
జలితపరతరుశాఖలవలన జారి క్రింద మృగనాభిమృగాధ్యస్తవిస్తీర్ణశిలాతలంబులు
గుప్పలు గొని తత్పరిమళమిళితంబు లైనచందనపంకంబు లనులేపంబులను వెండియు
నర్కకిరణసంపర్కంబున సూర్యకాంతంబులం జిటిలెడుననలకణపరంపరలసోఁకునం
బరిసరమదకరిభగ్నకాలాగరుతరుకాష్ఠంబులవలన నెగసి పరిభ్రమచ్చమరీమృగవాలవీజన
వశంబునం గలయ విరిసి నెరసి కమ్మతావులు బుగులఁకొనునునుఁబొగధూపంబులు గొనఁ
బ్రయత్నసిద్ధోపచారంబు లుద్దీపనంబుం గొలుప నిచ్ఛావిహారంబులం గ్రీడించుకిన్నర
మిథునంబులచేతను, గిన్నరమిథువంబులు మధురగీతికలం గరంగునుపలకులంబులజలం
బులు గూడి యేఱు లై ప్రవహింప నిమ్నోన్నతస్థలపతనావసరంబులం బెల్లెగసి గిన
లక్ష్మీశిరంబున నచలపతి తననించునేసఁబ్రాలచందంబున నందంబు లగుజలకణాసా
రంబులచేతనుం గన్నులపండువు సేయుచు, భగవంతుండునుం బోలె భృగపాదలక్షి
తోత్కర్షంబును, జతుర్ముఖుండునుంబోలె హంసోపరివిలసితంబును, శంకరుండునుం

బోలె నిజమూర్ధ్న్యంతర్గతచంద్రంబును, బురందరుండునుంబోలె నధఃకృదభీష్టావృష్టిద
మేఘంబును, ఐరావతంబునుంబోలె నఖండగండస్థలప్రమదాపాదకంబును, శబ్దశాస్త్రం
బునుంబోలెఁ బ్రకటితధాతువిశేషంబును, చార్వాకసిద్ధాంతంబునుంబోలెఁ గూటముక్తి
ప్రతిషిద్ధాకాశంబును నై వెండియు నొండుచందంబున భీమసత్వసంపన్నంబయ్యును
గీచకకులవర్ధనకారణంబును, గుహాశోభిశం బయ్యును దారకాసురవిహారోచితస్థానం
బును, బహుకోటీవజ్రవిజృంభితం బయ్యును గరుత్మదుపలకలితంబును, నిరంతరచంద్ర
కాంతం బయ్యును బద్మరాగపరభాగస్ఫురితంబు నగువిచిత్రశోభాస్పదం బగునన్న
గోత్తమంబునం గలుగువివిధవిశేషంబుల కరు దందుచు నుత్సాహంబున.

231

మాంధాత మందరముపై జయస్తంభముల నాటుట

క.

మేరునగ మెక్కి యటఁ జని, యారాజశిరోవతంస మటఁ గాంచె సుధా
ధారాపాతక్షాళిత, రారాజత్కనకకందరము మందరమున్.

232


సీ.

కస్తూరికామృగీకర్ణేజపంబులు, నిర్ఘరీనివహపాణింధమములు
బహుమహీజపరాగపశ్యతోహరములు, ఫణిమిథునప్రియంభావుకములు
శబరసతీరతిశ్రమతాళవృంతముల్, వంశసారస్వతావాపకములు
చమరవాలసమీరసద్బ్రహ్మవాదులు, తతబర్హిబర్హసంధాయకములు


తే.

కుంజవిహృతికళాభద్రకుంజరములు, మందరాచలవనమందమారుతంబు
లెదురుకొన నమ్మహాగిరి యెక్కి యందు, జనవరుఁడు నిల్పె నిజజయస్తంభపటలి.

233


వ.

ఇట్లు స్వర్గపుప్రాంగణక్రీడాశైలం బైనమందరమహీధరంబుపయిం జయస్తంభంబు వ్రేసిన.

234

మాంధాతృ డింద్రపూజితుఁడై పురంబు చేరుట

ఉ.

విస్మయమగ్నుఁ డై యటకు వృత్రహరుం డరుదెంచి భూవిభున్
సస్మితసాధువాక్యరచనం బ్రియ మాడి విరోధి మండలీ
ఘస్మరి నీకు నీడు త్రిజగంబుల లీ రని యెన్న నేల? శౌ
ర్యస్మయరేఖ రావణమహాసురఁ గెల్చితి వాజి నెక్కటిన్.

235


తే.

అనుచు నగ్గింపఁ బూజించి యనుప మరలి, ఖేచరీగీతవిఖ్యాతకీర్తి యగుచు
విజయవాదిత్రములు మ్రోయ నిజపురంబు, వేడ్క మెయిఁజొచ్చి పాలించె విశ్వధరణి.

236

ఆశ్వాసాంతము

ఉ.

పూతవిహార హారరుచిపూరితరంగితవత్స వత్సల
త్వాతిశయాత్మదా వినయదాంతికగోచర గోచరాంగనా

జాతపయఃపురోహరభుజంగ భుజంగశయాన యానలీ
లాతురగోత్తమక్రమవిలంఘనచంచలకుండలాంచలా.

237


క.

గోవర్ధనధృతిదర్శిత, గోవర్ధన నిజఘృణానుగుణసజ్జనబ్బం
దావన పదపాలితబృం, దావన సంశ్రితకృతానుధావనచరితా.

238


స్రగ్విణి.

సమాశ్రితవిశేషణా సమతవిద్విషద్భీషణా
సమాయతచతుర్భుజా సమరరంగభూభృద్భుజా
నమఃపతపరాయణానతజనార్తిజంబాలకూ
లముద్రుజఘృణాసుధాలహరిఘూర్ణమానార్ణవా.

239


గద్య.

ఇది శ్రీమద్భట్టపరాశరదేశికేంద్రచరణసరసీరుహసేవకోపసేవకి నరసింహనామధేయ
ప్రణీతం బైనకవికర్ణరసాయనం బనుకావ్యంబునందు ద్వితీయాశ్వాసము.