కవికర్ణరసాయనము/పంచమాశ్వాసము

పంచమాశ్వాసము



శ్రీరంగప్రియమందిర
భూరంగాకస్మికాత్తభూషణ లంకా
భూరమణనిరంతరవీ
క్షారతికరుణారసప్రసాదాభిముఖా.

1


వ.

ఇవ్విధంబున నిరంకుశస్వేచ్ఛావిహారంబులం బ్రవర్తిల్లుచు నొక్కనాఁడు.

2


సీ.

కమ్రకంకణఝణత్కారసంకులముగా, సుందరీజనము వీచోపు లిడఁగ
నర్హసంగతి నంతరాంతరంబుల మంత్రి, సామంతహితవీరసమితి గొలువ
వివిధప్రదానాదివిజయాదినిజగుణప్ర, కరంబు ప్రౌఢపాఠకులు చదువ
స్వమహితైశ్వర్యానువాదరూపంబుగాఁ, జే యెత్తి విబుధు లాశీర్వదింప


గీ.

వేత్రధరనిష్ఠురోక్తిపై చిత్రు లెసఁగ, నంగచోళకళింగవంగాదివివిధ
సకలదేశాధిపతులు దర్శనము వడయ, నిండుకొలువుండె మాంధాతృనృపవరుండు.

3

వసిష్ఠాదిమహర్షులు మాంధాతకడ కరుదెంచుట

వ.

ఇట్లు కొలువుండునంత వసిష్ఠప్రముఖమహర్షు లరుదెంచినం బ్రహర్షపులకితాంగుం
డగుచు సాష్టాంగదండప్రణామంబు చేసి పురోనిర్దిష్టమార్గుండగుచు నంతఃపురంబునకుం
గొని చని యచట మహార్హమణిమయాసనంబుల నాసీనులం గావించి తానును విమ
లాంగియు నర్ఘ్యపాద్యమధుపర్కా దు లగుసపర్యలం బరితుష్టులం జేసి ప్రసన్ను లగు
నత్తపోధనసత్తములకు నందఱకుం గృతాంజలి యగుచు నృపకుంజరుం డిట్లనియె.

4


క.

తపములు నిర్విఘ్నములే? యుపహతిగంధంబుఁ జోఁకకున్నవె వనముల్?
కృప ననుఁ గృతార్థుఁ జేసితి, రిపు డైనం గృత్య మాన తిచ్చుట యొప్పున్.

5


వ.

అనిన వారెల్ల నుల్లసితవదనారవిందు లై.

6


చ.

మనుకులచంద్ర! కేవలము మాకు నొకం డన నేల? విశ్వభూ
జనములయందు నార్తి యనుశబ్దము లేదు భవాదృశాధిపుం

గని విని ము న్నెఱుంగ మిఁకఁ గల్గెడుశంకయు లేదు లేదు మా
కనఘ! భవద్విలోకవజహర్షము దక్కఁగఁ దక్కు వాంఛయున్.

7


వ.

విశేషించియు నీచేయువినయాతిరేకంబునం బొడమెడు పరమప్రసాదాతిశయంబు
మదీయమానసంబుల వరప్రదానోన్ముఖంబులం జేసి వేగపెట్టెడు నగుటం గోరినయది
సర్వప్రయత్నంబుల నొడఁగూర్చువారము, నీ కెద్ది యభిమతం బెఱింగింపు మనినం
బొంగి నృపపుంగవుండు పునఃప్రణతుండై.

8


సీ.

పూర్వాస్తశైలముల్ పొలిమేర లగుధాత్రి, కొడయుండ నేన వేఱొకఁడు గలుగఁ
డేకరాజక మైనయీవిశ్వధాత్రి న, ధర్మంబు శబ్దమాత్రంబు లేదు
విత్తాధిపతి కైన విస్మయం బొనరించు, విత్తసంపద కింత వెల్తి లేదు
మానసంబున నేని మఱి దేహమున నేని, యెదవునాధివ్యాధి యొకఁడు లేదు


గీ.

నాకు వెక్కసించునాయీమహైశ్వర్య, మింకఁ బరుల కైన నేమి చెప్ప
నేమి కొదవ నెట్లు గా నా కిది, ప్రార్థనీయ మనుచుఁ బలుక నేర్తు?

9


క.

కావున సంపద్విషయం, బై వేఁడుకొనంగఁ దగినయది లే దంత
ర్భావమున నాకుఁ దెలియం, గావలసినయర్థ మొకటి కల దతిహిత మై.

10


తే.

లక్షితము సేయ దేశకాలస్వభావ, విప్రకర్షంబు లేక యీవిశ్వ మెల్లఁ
గరతలామలకంబు గాఁ గనునతీంద్రి, యప్రబోధంబు గలపుణ్యు లరయ మీరు.

11


క.

మీయెఱుఁగనియర్ధము లే, దీయెడ నను మీ రనుగ్రహింపుదు రేనిన్
నాయడుగునర్థమునకుఁ గృ, పాయతమతి నొసఁగవలయుఁ బ్రత్యుత్తరమున్.

12

మాంధాత మునులం దనపూర్వజన్మవృత్తాంతము నడుగుట

సీ.

అస్మదీయం బైనయాంగికం బగుతేజ, మతిలోకమై యున్న దద్భుతముగ
భావంబు నట్టుల భగవత్పదాంభోజ, భావనామృతపానపరవశంబు
మీకోడ లైనయీమెలఁతకు నాయట్ల, తనుకాంతిహరిభక్తు లనుపమములు
విశ్వైకవంద్య! యీయైశ్వర్యమును నాకుఁ, జోద్య మైన దనన్యసులభ మగుట


గీ.

నిట్టిమహిమలఁ బొంద మున్నెట్టివార, మేమి సుకృతంబు చేసితి మింకమీఁది
భవమునందును నీపెంపుఁ బడయుటకు ను, పాయ మెయ్యది? వివరించి పలుకవలయు.

13


వ.

అనిన నందఱు నట్టివిచిత్రప్రశ్నంబునకుం దగినయుత్తరంబు చెప్పుటకు నరుంధతిపతి
ననుమతించి నియమించిన విజ్ఞానఖని యగునమ్మహాత్ముండును నివాతప్రదీపంబురూపం
బున ముహూర్తమాత్రం బుపరతబహిరింద్రియుం డై యోగసమాధివశంబున నయ్య
ర్థంబు గాంచి ప్రసాదసుముఖుం డగుచు నభిముఖుం డై మునిసభామధ్యంబున నంద
ఱు వినుచుండ నమ్మహారాజచంద్రున కిట్లని చెప్పం దొడంగె.

14

వసిష్ఠుఁడు మాంధాతపూర్వజన్మవృత్తాంతముఁ దెలుపుట

క.

శూద్రుఁడ వై తొలుమేనున, నుద్రిక్తచరిత్రనిష్ఠురోక్తుల లోకో
పద్రవము చేసితివి నృప, భద్రేభ! సమసబంధుబాహ్యుఁడ వగుచున్.

15


క.

ఈసతియు నాఁటిభవమున, నీసతి యై నీవు దన్ను నిరసించిన న
త్యాసక్త యగుచు విడువక, చేసే భవత్ప్రీతికొఱకుఁ జెన్నంటిపనుల్.

16


సీ.

పైతామహం బైనచేతిరొక్కము చెల్లు, నంతకు నుద్వృత్తి నట్లు దిరిగి
పేద వై కృషి చేసి పెట్టినసస్యంబు, లెల్లఁ బొల్లైనఁ గొన్నాళ్లు నవసి
గతి లేక దాస్యంబు గైకొని దానిచే, గ్రాసంబు నడవక కడుఁ గృశించి
కడఁ దిరిపంబ వై కాంతయు నీవును, దేశంబులం దెల్లఁ దిరిగి తిరిగి


పంచపాది గీ.

యంత కొకపట్టణమున విష్ణ్వాలయంబు
చేరి యొకకొంద ఱచట వసించి పరమ
యోగివరు లుండ నిచ్చలుఁ జాఁగి మ్రొక్కి
నిండుమతిఁ జేసితివి వార లుండునెలవు
లూడ్చియును నీరు చల్లియు నూడిగములు.

17


వ.

ఇట్లు మహాభాగవతసందర్శనంబునం జిత్తంబు సన్మార్గప్రవృత్తం బై దినదినంబును దదీ
యసేవాచరణంబునం దద్దర్శనతదాలాపశ్రవణంబులవలన నంతకంతకుం బూర్వ
దుష్కృతంబులవలన డెందంబులు నిరుపాధికవిష్ణుభక్తిప్రవణంబు లై.

18


సీ.

ఉపభూమి నెవ్వ రే నుమిసిన వీటికా, చర్వితాదుల నెత్తి చల్లి చల్లి
ప్రాకారవీథులఁ బ్రతివేళయందును, నొదవెడుచెత్త వో నూడ్చి యూడ్చి
కుండలసలిలంబు గొని వచ్చి దుమ్ము వోఁ, గలయరసి దోడ్తోన చిలికి చిలికి
మండలవేదికామండలంబుల గోమ, యంబునఁ జల్లగా నలికి యలికి


తే.

పొలిచి గుడిచుట్టుఁ దగియున్నఁ బొంగి పొంగి, మాసి కనుపట్టుటకు నాత్మ రోసి రోసి
యంతరంగంబునందుఁ దాదాత్మ్య మొదవి, చేసితిరి మీరు విష్ణుసంసేవనంబు.

19


వ.

మఱియును.

20


తే.

హరిసమీపప్రదీపిక యారకుండ, భోజనానీతతైలంబుఁ బోసి తీవు
నిజపటము చించి యీపడంతియును ప్రత్తి, యోజితము చేసి వెలిఁగించె నొక్కనాఁడు.

21


వ.

ఇట్లు ఫలాభిసంధిరహితంబు లైనహృదయంబులతో మీర లిరువురు సకలఫలసాధనం
బైన భగవద్భజనంబు సేయుచుండు నంత.

22


శా.

సేవార్థంబుగ వచ్చె నచ్చటికి నిస్సీమక్రమక్రూరనా
నావాహద్విపవీరయోధరథసన్నాహంబుతో రత్నభూ

షావిస్ఫూర్తులతోఁ గళత్రశిబిక చంచత్సహస్రంబుతో
సౌవీరాఖ్యమహీమహేంద్రుఁడు ముదస్తంబేరమారూఢుఁ డై.

23


క.

వచ్చిన యద్ధరణీధవు, నచ్చెరు వొడవించువిభవ మది గనుఁగొని సం
పచ్చరితార్థుం డితఁ డని, ముచ్చట నొందితిర మీరు మోహమువలనన్.

24


క.

అది కారణముగ నిష్ట, ప్రదమై హరిసేవ నేటిభవమున నీయ
భ్యుదయం బొనర్చె భగవ, త్పదసేవ చతుర్విధేష్టఫలదము గాదే!

25


క.

తనువులఁ బవిత్రకాంతియు, మనముల విజ్ఞానరూపమధురిపుభక్తిన్
జనియింపఁ జేసె మీ కి, ట్లనుపమదీపప్రదాన మది నృపతిలకా!

26


వ.

అట్లగుట నింక ముందఱిభవంబునకు నిట్టియైశ్వర్యం బొకం డేల ధర్మార్థకామమోక్షం
బులం దేది గోరిన నట్టిచతుర్విధఫలంబులకు భగవత్సేవాచరణం బొకండు సాధనం
బగుట వివిధాఖిలకర్మంబులు భగవత్సేవాచరణరూపంబులు గాఁ గావింపు మభిమతం
బొనరించు ననిన నాశ్చర్యహర్షకబళితాంతధికరణుం డగుచు నృపశ్రేష్ఠుండు వసిష్ఠున
కిట్లనియె.

27

వసిష్ఠుఁడు మాంధాతకుఁ గర్మస్వరూపముఁ దెల్పుట

తే.

వివిధఫలబీజ మై యేకవిధముక్రియయు, వివిధకర్మంబులకు నేకవిధఫలంబు
గలుగునట్లుగ తరుబీజఫలములందు, నీదృశవ్యత్యయము గంటి మెట్లు నెచట?

28


ఆ.

ఇదియె కాదు శాస్త్ర మెఱిఁగించు ప్రతికర్మ, మునకు భిన్నభిన్నముగ ఫలంబు
నట్లు కాఁగ దెలియ నానతి యిమ్ము క, ర్మస్వరూప మెల్ల మౌనిచంద్ర!

29


క.

అన విని భూవరుప్రశ్నం, బున కెంతయు మెచ్చి మౌనిపుంగవుఁ డనియెన్
జనవర! క్రియాస్వరూపం, బనయము బుధులకును గహన మది విను తెలియన్.

30


వ.

కర్మంబులు దృష్టద్వారోపకారకంబులు సదృష్టద్వారోపకారణంబులు నన రెండుదెఱం
గులై యుండు, దృష్టద్వారోపకారకంబులెల్ల లౌకికంబులు, సదృష్టద్వారోపకారకంబు
లెట్ల వైదికంబు లనం బడు. అట్టివైదికకర్మంబులు నిత్యనైమిత్తికకామ్యప్రభేదంబులం
ద్రివిధంబు లై యుండు. అందుఁ జేయకుండినం బ్రత్యవాయం బై వర్ణాశ్రమాదిప్ర
యుక్తంబు లగుచుఁ బ్రతిసమయంబునం జేయవలయునవి నిత్యంబు లనంబడు. అట్టివ
యై కదాచిత్కర్మనిమి త్తంబులయందుఁ జేయవలయునవి నైమిత్తికంబు లనం బడు.
చేయకుండినం బ్రత్యవాయంబు లేనియవి కామ్యంబు లనంబడు. అందు నిత్యనైమి
త్తికంబులకుఁ గర్తృభేదంబున విహితత్వంబును సహకారిత్వంబున నాకారభేదంబు
ను గలదు. అట్టికర్త యనతిరిక్తఫలకామియు నతిరిక్తఫలకామియు నన ద్వివిధంబు.
అనతిరిక్తఫలకామి యన నీశ్వరాజ్ఞారూపంబు లైనయవి యాచరించుటయ తనకు

ఫలంబుగాఁ దదతిరిక్తఫలంబు గోరనియతండు. అతనికిం గేవలవిహితత్వాకారంబున
సిద్ధించు. అతిరిక్తఫలకామి యన నాచరణంబ కాక తదతిరిక్తం బైనఫలం బపేక్షిం
చునతండు. అతనికి నాచరణీయత్వంబు విహితత్వాకారంబున సిద్ధించుచు నభిమతఫల
సాధనభూతకర్మాంతరాధికారజనకంబు నగుట సహకారిత్వాకారంబు నసహకారిత్వా
కారంబునుం గా నుభయాకారంబుల సిద్ధించు. ఇంకఁ గామ్యకర్మంబులు నియత
ఫలంబులు ననియతఫలంబు లన ద్వివిధంబులు. అందు నియతఫలంబులనఁ దమకు విహి
తంబు లైనఫలంబులందె కాని ఫలాంతరంబులందు వినియుక్తంబు గానియవి. అని
యతఫలంబు లనం బూర్వోక్తనియతఫలంబులకు వ్యతిరిక్తంబుగా సంకల్పానురూప
ఫలంబులం బొడమించునవి. ఇట్టినియతానియతఫలంబునుం గర్తృగతగుణత్రయభేదం
బున సాత్వికంబును రాజసంబును దామసంబు నన మూఁడుదెఱంగు లై యుండు.
అందు సాత్వికఫలంబు బ్రహ్మవిద్యానిష్పత్తి, రాజసంబున స్వర్గాదిప్రాప్తి, తామసంబు
నం బరహింసాదికంబు. అట్లు గావున నిందు దృష్టద్వారోపకారకంబు లైనలౌకిక
కర్మంబులుంబోలె నియతఫలంబు లైనకామ్యకర్మంబులు ఫలబీజన్యాయంబున నన్యథా
సిద్ధిజన్యజనకభావంబునం గలవి గాని యితరకర్మంబు లెల్లం గర్తృసంకల్పాను
రూపఫలప్రదాయకంబు లగుట వివిధఫలోత్సాదనంబునకు నేకకర్మంబ బీజంబుగా
నేర్చు. వివిధకర్మంబులు నేకఫలోత్పాదకంబులు గా నేర్చు. అనిన నర్ధాంగీకారం
బునం బార్థివోత్తముండు వెండియు ని ట్లనియె.

31


సీ.

అధికారజనకంబు లై నిత్యనైమిత్తి, కములు కామ్యము లంగకములు నంట
యాకామ్యములు దేవతారాధనాకృతు, లందు నదృష్టంబు లనుట దత్త
దారాధ్యహితదేవతానుగ్రహములఁ ద, ద్ద్వారంబునను ఫలావాప్తి యనుట
సకలఫలప్రదుం డొకఁ డెట్టు లొకఫలం, బెట్లు పల్వు రనుగ్రహింప వెలయు


గీ.

ననుట వివిధదేవతారాధనాకార, కర్మవితతియం దొకండు నిఖిల
ఫల మనేకఫలము బహుకర్మముల కిచ్చు, ననుట పొసఁగ కున్న దాత్మ ననఘ!

32


వ.

అనిన నతిని ప్రజ్ఞావిశేషంబున కలరి యారాధనస్వరూపంబుగతి నారాధనీయస్వరూ.
పంబు వినక యీ సందియంబు దెగదు విను మని యిట్లనియె.

33

ఉపాస్యబ్రహ్మస్వరూపనిరూపణము

తే.

భగవదారాధనక్రియాప్రకర మెల్ల, నిఖిలకర్మసమారాధనీయుఁ డతఁడ
యఖిలవివిధఫలప్రదాయకుఁ డతండ, యఖిలదేవతలకు నంతరాత్ముఁ డతఁడ.

34


ఉ.

దేవత లెంద ఱందఱుఁ దదీయశరీరము లట్లు గానఁ ద
త్సేవ తదర్చనంబ యని సేవకు లాత్మ నెఱుంగకున్నఁ ద

త్సేవ తదర్చనం బగుట సిద్ధము గాన విభుండ యిచ్చుఁ ద
ద్దేవతమాత్రభక్తియును దత్తదభీష్టఫలంబు దానికిన్.

35


క.

యజ్ఞముల కెల్ల భోక్తయు, యజ్ఞఫలప్రదుఁడు నతఁడ యని యెఱుఁగమి న
ల్పజ్ఞు లగునితరదైవమ, యజ్ఞులు గూలుదురు కుడిచి యల్పఫలంబుల్.

36


క.

తముభజియించినదైవము, తమకుం బ్రాప్యంబు గాన దైవంబుఁ దద
వ్యముఁ గొల్చుమూఢమతులకు, సమకొను ఫల మల్పతమము సవినాశంబున్.

37


ఆ.

ప్రాగనాదికర్మబద్ధు లై తుచ్ఛకా, మములచేత విష్ణు మఱచి జడులు
కేవలముఁ దదన్యదేవతామాత్రాను, షక్తు లగుచుఁ గొలుతు రుక్తవిధుల.

38


తే.

క్షణికము నుపాధిబంధతుచ్ఛంబునైన, త్రిగుణమయభోగ్యజాతంబు దృష్టిఁ దగిలి
నిత్యనిరుపాధినిరవధినిఖిలరూప, భోగ్య మగునాత్మ నెఱుఁగ దెప్పుడును జగము.

39


తే.

నిరధికానందనిత్యు లాహరిగుఱింది, యితరులగుఱించి సంఛిన్నహీనసుఖులు
కర్మ మొక్కండ ఫలవిభాగములు పెక్కు, చిత్ర మిది చూడు సంకల్పమాత్రభిదను.

40


వ.

అట్లగుట నంతరాత్మ నెఱుంగనియప్పుడు తత్తద్దేవతారాధనరూపంబు లైనవివిధంబు
లగుకర్మంబు లంతరాత్మ యొక్కండ భగవంతుం డని యెఱింగి తదారాధనరూపం
బులుఁ గా నొనరింప నభిమతైకఫలబీజంబులు గా నేర్చు. అభిమతవివిధఫలప్రదా
యకభగవదారాధనరూపం బగుట నేకర్మంబును వివిధఫలంబులకు బీజంబునుం గా
నేర్చు. కావున నవశ్యంబును మొదల నారాధనీయం డగుభగవంతు నెఱుంగవలయు.
కేవలదేహాత్మాభిమానమూలంబు లగుభగవద్విషయరాగద్వేషాదులు కర్మహరంబులు గా
నేర్చుఁ గానిఁ దత్త్వజ్ఞతాభిమానంబున భగవంతు నన్యథారూపంబున నొండె విపరీత
రూపంబున నొండె నెఱింగె నేని తన్మూలతద్విషయద్వేషం బధోగతికారణం బగుట
గణింప నేల? తన్మూలరాగకార్యంబు లగుతదారాధనస్మరణకీర్తనాదులు విఫలంబు లగు.
ఇంతియ కాదు. తాదృగ్విధవిరుద్ధజ్ఞానంబునం బ్రత్యవాయంబు నగుట యథావస్థితవస్తు
జ్ఞానంబున నెఱింగి యారాధింపవలయు భగవత్స్వరూపం బాకర్ణింపుము.

41


సీ.

సర్వశరీరనిష్కర్షికేతరసర్వ, శబ్దాభిలాష్యుండు సర్వకార్య
సర్వహేతువు సర్వశాస్త్రీయధర్మసమారాధ్యదైవం బఖిలఫలదుఁ
డఖిలాత్మలకు వాస్తవాభిగమ్యుఁడు ముము, క్షువుల కాశ్రయము ముక్తులకుఁ బ్రాప్య
మఖిలప్రకారనిరతిశయభోగ్యంబు, వివిధవేదాంతైకవేద్యతముఁడు


గీ.

నిఖిలవిషయంబులకుఁ బ్రత్యనీక మగుట, సకలకల్యాణగుణగణాస్పదుఁడు నగుట
లక్షితస్వాన్యవస్తువిలక్షణుండు, విభుఁడు పురుషోత్తముఁడు రమావిభుఁడు వెలుఁగు.

42


సీ.

అగులక్షణము లనన్యాధీనచేతనా, నాధారభావముల్ వ్యాప్తి మీఱ
నవబోధసత్యసుఖామలత్వాదులు, రూఢస్వరూపనిరూపకములు

సిద్ధస్వరూపవిశేషధర్మజ్ఞాన, శక్తివైరాగ్యాదిషడ్గుణములు
సద్గుణానంతవిస్తారభేదములు సౌ, శీల్యాదినిత్యనిస్సీమగుణము


గీ.

[1]లఖిలజగదుదయపాలన హరణములును, నిగ్రహానుగ్రహంబులు నియతకరుణ
నాచరించుట ముఖ్యకృత్యంబు లరయఁ, బరమపదపూర్వమై యొప్పు బ్రహ్మమునకు.

43


సీ.

శ్రీవల్లభుఁడు సూక్ష్మచిదచిద్విశిష్టతఁ, దాన యీజగదుపాదాన మయ్యెఁ
గ్రమ్మఱ నాత్మసంకల్పవిశిష్టతఁ, దాన జగన్నిమి త్తంబు లయ్యెఁ
గాలాదు లగుసహకారుల కాత్మ యై, తా జగత్సహకారితయు వహించె
మహదాదికారణాత్మతఁ దాన వెండియుఁ, దత్కార్యకారణత్రయము నయ్యె


గీ.

సూక్ష్మచిదచిద్విశిష్టవస్తువు నిజేచ్ఛ, నామరూపవిభాగార్హనటనమునకు
స్థూలచిదచిద్విశిష్ట మై తోఁచుఁ గాన, గార్యవస్తువు దాన యక్కైటభారి.

44


తే.

ఆత్మసంకల్పమహిమచే నవ్విభుండు, స్వాపృథక్సిద్ధచిదచిద్ద్వయంబునందుఁ
జూపుఁ బరిణామ మాత్మస్వరూపమునకుఁ, గలుగకుండుటఁ దా నిర్వికారుఁ డగుచు.

45


ఆ.

నిర్వికార మయ్యె నిజనపుఃపరిణాను, భాజి యైనయట్టిబ్రహ్మమునకుఁ
గలుగుప్ర్రాగవస్థ కారణభావంబు, భావ్యవస్థ కార్యభావ మయ్యె.

46


క.

ప్రకృతిపురుషులు తదీయులు, ప్రకృతిపురుషమూల మీప్రపంచం బగుటన్
బ్రకటమతిఁ జూడఁ దదితర, సకలముఁ దజ్జనిత మింతసత్యము సుమ్మీ!

47


క.

చేతనము శేష మతనికిఁ, జేతనశేషంబు మఱి యచేతన మగుటన్
జేతనకులమున కఖిలా, చేతనముల కతఁడ సర్వశేషి తలంపన్.

48


తే.

తలఁప శేషిత్వకారణత్వములు నెట్టు, లట్లు మఱి బోధశక్తి బలాదిసుగుణ
యుక్తి నాతండ కాని వేఱొకఁడుఁ గలుగ, దతనికంటెను బరతరం బై యణువును.

49


ఆ.

నలినభవునిపిదప నామరూపవిభావ, నార్హ యగుతమఃపదాభిలాష్య
ప్రకృతిఁ దగుఁ దదీయఁ బ్రాపించు నతనిసం, కల్పమున నభూతగణము వింటె.

50


క.

ప్రకృతివిచిత్రత నానా, వికృతులఁ బుట్టించి సర్గవేళల మరలం
బ్రకృతివశావశు లగునీ, సకలాత్మలఁ బొడమ నతఁడ సంకల్పించున్.

51


తే.

అవిదితాకారమున నంతరాత్మ యగుచుఁ, దన్ను ధరియించి నియమించి తనకు నతఁడ
దేహి యగుఁ గాని జగము దా దేహ మయ్యు, నతని కుపకారకంబు గా దధిపచంద్ర!

52


క.

ధారకుఁ డైనను లే దొక, భారము సంకల్పమునన భరియించు నసా
ధారణము చూడు మవ్విభు, ధారకభావంబు లేను తక్కొకరునకున్.

53


క.

సాగరనియమం బిందు వి, భాగము సౌదామినీవిభంగము ఘనసం
యోగము రనిరతిపవనస, మాగమ మివి గావె విష్ణుమాయాప్రౌఢుల్.

54


క.

భూతంబు లెల్లఁ దత్తను, భూతము లతఁ డాత్మభావమునఁ దద్ద్వితయో
పేతుం డై పొలుచుఁ దదు, ద్భూతస్థితివిలయహేతుభూతుం డగుచున్.

55

మ.

చతురాస్యుండును దక్షముఖ్యులు నశేషప్రాణులున్ గాలమున్
జతురాకారవిభూతు లీశ్వరులకున్ సర్గంబునం దెల్ల సం
స్థితికిన్ విష్ణుతయున్ మనుప్రభృతులున్ జీవావళుల్ గాలమున్
హతికిన్ రుద్రుఁడు నంతకప్రముఖు లయ్యైజంతువు ల్కాలమున్.

56


మ.

నలువ న్మున్ను సృజించి యాతనికి నంతర్యామి యై దక్షము
ఖ్యులఁ బుట్టించి తదంతరాత్మత నమోఘుం డై జగజ్జీవులం
గలుగంజేసి తదంతరంగగతుఁ డై కావించు నుత్పత్తి నా
ప్రళయం బీశుఁ డనుక్షణంబును రజఃప్రారబ్ధలీలారతిన్.

57


మ.

విను మాపద్ధరణాదికంబు నెఱపున్ విష్ణ్వాదిభావస్థుఁ డై
మనుముఖ్యాత్మల కాత్మయై తెలుపు సన్మార్గంబు శాస్త్రోక్తులన్
జననీరాజగురుప్రదాతృముఖనానాజీవలోకాత్మ య
య్యు నొనర్చున్ వివిధస్థితి న్విభుఁడు సత్వోద్రిక్తలీలారతిన్.

58


ఆ.

అంతరుద్రవహ్నియమముఖ్యులకు సర్వ, జంతుకాలములకు నంతరాత్మ
యగుచు నిలిచి క్రమితయును దత్ప్రకారసం, హర్త యగుఁ దమఃప్రవృత్తి విభుఁడు.

59


తే.

విషమసృష్ట్యాదికముల్ విశ్వపతికి, నిర్ఘృణత్వాదికంబుఁ జెందింప లేవు
సృష్టివైషమ్యుహేతువుల్ సృజ్యకర్మ, శక్తులయ కానఁ గేవలసాక్షి యందు.

60


వ.

ప్రళయసమయంబునం బ్రలీనజ్ఞాను లగుచు సుషుప్తిసమయంబునకంటె నచిత్ప్రాయు
లై ప్రకృతినిర్మగ్ను లై యుండునిఖిలజీవులపయిం గరుణించి చతుర్ముఖశరీరుం డై
భగవంతుండు సృజ్యకర్తనిపాకనిరపేక్షంబు గాఁ గేవలనిరంకుశస్వేచ్ఛామూలం బైన
ప్రథమసర్గంబునం గరుణకళేబరాదిప్రదానం బొనరించి నిజనిజానాదికర్తవాసనావశం
బున వివిధకర్మజ్ఞానచికీర్షాప్రయుత్నవంతు లగువారల కనంతరంబ యనుమంతృత్వంబున
నంతరాత్మ యై యుత్తరోత్తరప్రవర్తకుండై యుండునక్కా లంబున నెల్లజీవులుఁ
బ్రబలజ్ఞానసంపన్నులు దీర్ఘాయుష్మంతులు నవితథమనోరథులు నై దైవమనుష్యభావ
భేదంబులు లేక వర్తించుచు వివిధవిషయానుభవలోభపరాభూతచేతస్కతం గర్తృ
త్వాభిమానంబున నహంకారమమకారగ్రస్తు లై కామచారంబుల నధర్మప్రవర్తనంబు
నకుఁ జొచ్చి కృతయుగంబునకంటెఁ ద్రేతయుఁ ద్రేతాయుగంబునకంటె ద్వాపరం
బును ద్వాపరంబునకంటెఁ గలియునుం గా నుత్తరోత్తరం బల్పజ్ఞానశక్తులు నల్పాల్స
సుఖులు నత్యల్పజీవితులు పై క్రిమికీటప్రాయులగుచు నశింప నున్న ననుకంపాయత్త
చిత్తుం డై భగవంతుండు తత్తత్కాలంబుల దేవతిర్యఙ్మనుష్యాదిసజాతీయతాంగీకరణం
బున నవతరించుచుఁ బునఃపునరుద్ధరణంబున ధర్మప్రవర్తనంబు గల్పించుచు ధర్మా
చరణం బొనరించునప్పుడు నిజానుగ్రహరూపపుణ్యఫలంబు గా ననుకూలసుఖసంబం

ధంబులు గల్పించుచు నధర్మప్రవర్తకు లైనయప్పుడు నిజనిగ్రహరూపఫలంబు గాఁ
బ్రతికూలదుఃఖంబు లొదవించి శిక్షించుచుం గేవలాధర్మనిష్ఠు లైనయెడం బునఃప్రళ
యంబు గలిగించి యుడుపుచు నివ్విధంబున నఖిలభూతహితపరత్వంబున లీలాప్రవృ
త్తుం డగుటంజేసి విచిత్రఫలభోక్తలగుజీవులం గూర్చి వైషమ్యనైర్ఘృణ్యంబు లీశ్వరు
నకుం దొరల నేర వట్లు గావున.

61


చ.

కలుగదు కర్మబంధమును గాఁడు నియోజ్యుఁడు లే దవిద్య ప్రాఁ
బలుకులు దెల్పుఁ గాన జనపాలనసంహృతు లీశ్వరుండు దాఁ
జలుప గతంబు తత్ఫలము సత్యము లీల యొకండ యెవ్వియుం
దలఁచినయంతమాత్ర నగు దానఁ బ్రయాసము గల్గ దేమియున్.

62


క.

దేవతలును ఋషులుం దను, భావ మెఱుంగరు సుకర్మఫలమునఁ దత్త
ద్దేవర్షిభావబోధ, శ్రీవిభవము లతఁడ వారిఁ జేర్చినకతనన్.

63


క.

భూతభవత్ప్రభవిష్య, ధ్భూతంబుల నెఱుఁగు నవ్విభుం డతనిఁ గనన్
భూతభవత్ప్రభవిష్య, ద్భూతంబుల లేఁడొకండు భూవర! వింటే.

64


చ.

అవనివిభుండు నాకవిభుఁ డండనిభుం డణిమాదిసిద్ధులున్
వివిధసుకర్మశక్తిఁ బ్రభవింతు రతండ యనుగ్రహింప వి
ప్రవరులు బద్ధచేతనసపక్షులు సిద్ధులు ముక్తులున్ ధరా
ధవ! విరు మీశితత్వసముదాయము లీశుఁ డతండ వీరికిన్.

65


సీ.

అర్కానలాదుల కాత్మ యై దీప్తిచే, వెలిఁగించు నతఁడ యీవిశ్వ మెపుడు
మహి కాత్మ యై మహామహిమచే నిత్యంబు, ధరియించు నెల్లభూతముల నతఁడు
పోషించు నతఁడు సర్వౌషధీకులముల, నమృతాత్ముఁ డగుచంద్రునందు నిలిచి
జఠరాంతరగ్ని యై జంతుభుక్తంబుల, నఱిగించు భోజ్యపేయాదు లతఁడ


గీ.

యఖిలజనహృదంతరాత్మ యై సకలప్ర, వృత్తు లతఁడ కలుగఁ జిత్తగించు
నతనితోడఁ బాసి యణు వైనఁ గలుగ దీ, ప్రకృతిపురుషజప్రపంచమునను.

66


క.

నీరజగర్భాండంబుల, నారసి చూచినఁ దదీయయత్నము వెలి గాఁ
బూరితుద యైనఁ గదల, న్నేర దిది రహస్యతత్త్వనిర్ణయము సుమీ.

67


క.

సర్వావస్థాపస్థిత, సర్వాంతశ్చిచ్ఛరీరసహితుం డగుచున్
సర్వప్రకారముల నీ, సర్వము నై యున్నవాఁడు సత్యం బధిపా!

68


మ.

అపృథక్సిద్ధము గాన మర్త్యుఁ డని దేహం బెట్లు తద్దేహితో
వ్యపదేశం బగు నట్ల సత్త్వచిదచిద్వర్గంబు నుర్వీపతీ!
యపృథక్సిద్ధవిశేషణత్వమున దేహం బౌట విష్ణుండ కా
వ్యపదిష్టం బగు సర్వవాచకవచోవాద్యుం డతం డొక్కఁడున్.

69

ఉ.

స్థూలకృశాదిరూపముల దూఁకొను నేకవిధాత్మవస్తువున్
బోలె జగచ్ఛరీరకతఁ బొల్చుట సర్వవచోభిలాష్యుఁడై
క్రాలినఁ గ్రాలుఁ గాని మురఘస్మరుఁ డొందఁడు హేయసంగతిన్
బాలకృశాదినామములఁ బైకొనకుండు తదాత్మకైవడిన్.

70


ఉ.

కారణభూతకంతుమయకార్యవిచిత్రపటంబునందుఁ జె
ల్వారదె శుక్లతాదిగుణ మయ్యయితంతున? నట్ల యీజగ
త్కారణకార్యతాదశలఁ గైకొన వెన్నఁడు భోక్తృభోగ్యసం
ప్రేరకభావము ల్చిదచిదీశ్వరులం దొకవైపరీత్యమున్.

71


క.

భూనాథ ! యిట్టి తత్త్వ, జ్ఞానము లేకున్న నతని జగదేకవిభుం
గా నెఱుఁగ లేఁ డెఱింగినఁ, గాని తదేకప్రియుండు గాఁ డెవ్వాఁడున్.

72


తే.

జనియు నాదియు లేక యీశ్వరుల కెల్ల, నీశుఁడొక్కండ కా విష్ణు నెఱుఁగుఁ బ్రాజ్ఞుఁ
డతని నన్యసజాతీయమతిఁ దలంచు, నతఁడ కడు మూఢుఁ డగు నిశ్చయమ్ము సూవె.

73


చ.

జనితకృపైకహేతువున సర్వసమాశ్రయణీయతార్థమై
మనుజుఁ డనంగఁ బుట్టి యతిమానుషకృత్యము లాచరింపఁ గ
న్గొనియుఁ దమోవిరాజితతను ల్జగదన్యసమానబుద్ధి నా
తనిఁ గలుషించి కూలుదురు తద్వ్యతిరిక్తభవార్ణవంబునన్.

74


మ.

తనసంకల్పముచే జగజ్జననవిధ్వంసంబులం జేయఁ జా
లినసర్వేశున కెంతయత్న మగుఁ బోలింపన్ ఖలధ్వంసనం
బనఁగాఁ దత్సకలావతారములు లీలాయత్తముల్ శాపము
ఖ్యనిమిత్తంబు నెపంబు విస్మరణశోకాదు ల్ప్రమోదించుటల్.

75

వేదవేదాన్తపురాణస్వరూపనిరూపణము

వ.

ఈయర్థంబు వేదనిశ్చితం బెట్లన వేదపూర్వభాగంబు విధ్యర్థవాదమంత్రరూపంబునఁ
ద్రివిధంబు. అందు విధ్యంశంబు ప్రవర్తకనిషేధనియమసంకోచభేదంబునం ద్రివిధంబు.
ప్రవర్తకవిధు లన భగవదనుగ్రహహేతుకర్మంబులయందుం బ్రవర్తించుప్రేరకవా
క్యంబులు. నిషేధవిధు లన భగవన్నిగ్రహహేతుకర్మంబులయందు నిర్వర్తించునిషేధ
వాక్యంబులు. నియమసంకోచకవిధు లన భగవద్విస్మృత హేతువిషయానుభవంబు
దొఱంగిననరులకుఁ దాదృగ్విధేంద్రియార్థపరత్వంబు రుచించునట్టి భోగవ్యవస్థావస్థాపక
వాక్యంబులు. ఇందుఁ బ్రవర్తకవిధులును నుపాత్తదురిక్షయార్ధంబున ననిష్టనివర్తన
పూర్వకంబుగా నధికారజనకంబులు, నభిమతార్థసాధనావబోధకత్వంబున నిష్టప్రాప
కంబులు నై ద్వివిధంబులు. ఆందుఁ బ్రథమగణితంబులు నిత్యనైమిత్తికంబులుం, దద
నంతరగణితంబు కామ్యంబు ననంబడు. ఇది విధిభాగనిరూపణంబు. ఇట్టివిహి

తాచరణాపేక్షితంబు లగుఫలప్రదనిరూపణాదిప్రతిపాదకభాగం బరవాదంబును,
విహితానుష్ఠేయార్థప్రకాశకంబు మంత్రభాగంబు ననంబడు. అందు నర్థవాదంబు
శబ్దప్రధానంబునుం, గేవలతాత్పర్యప్రధానంబును నన రెండువిధంబులు. అందు
భ్రమణాంతరవిరోధంబు లేనియెడ శబ్దప్రధానంబును, తద్విరోధంబుగలయెడం గేనల
తాత్పర్యప్రధానంబునుం గా నంగీకరింపపలయు. ఇది వేదపూర్వభాగస్వరూపంబు.
ఇంక వేదాంతభాగంబును సద్విద్యాదహరవిద్యాదివిజ్ఞానవిధివిశేషంబులు స్వతంత్రభే
దవిశేషాపవర్గవ్యతిరిక్తఫలాంతరవిశేషాదివిశేషంబుల నిహితజ్ఞానవిశేషవిషయజ్ఞేయప్ర
కారభేదతత్స్వరూపనిరూపణతత్ప్రతిపత్తిరూపఫలాద్యర్థప్రతిపాదనవిశేషంబుల
విహితానుష్ఠేయార్థప్రకాశప్రణవాష్టాక్షరాదిమంత్రవిశేషంబులం గలుగుట విధ్యర్థ
వాదకమంత్రవిభక్తివేదపూర్వవిభాగంబుతో సమరూపంబ. అందు వేదపూర్వభాగ
విహితకర్మవిశేషంబు లెల్ల ఫలప్రదదేవతారాధనాత్మకంబు లై తదారాధనీయ
దైవతైకశేషంబు లగుట నారాధనాత్మకకర్మవిధిభాగంబునకంటె నారాధనీయదేవ
తాప్రతిపాదనరూపం బైనయర్థవాదభాగంబె ప్రధానం బగు. ఐననుఁ బ్రాయికం
బుగ లోకంబు కేవలకర్మాధికారి యగుటం గర్మకర్తవ్యతావిశ్వాసజననార్థంబును ఫల
ప్రదం బగుటకుం గేవలకర్మం బనుష్ఠాతయందుఁ గర్తనిష్పాదకదేహాంతరాతిరిక్తుం
డై కర్మఫలభోక్త యగుజీవుండు గలం డనుసత్తాజ్ఞానమాత్రంబె కాని తత్స్వరూప
నిరూపణాదికంబు నపేక్షింపం దగుటనుం గర్మప్రాధాన్యసిద్ధికై కర్మప్రతిపాదక
పూర్వభాగంబునందు నర్థవాదంబు విధివిశేషంబు గా సమర్థింపుదురు గాని వే
దాంతభాగవిహితోపాసనాత్మకజ్ఞానవిశేషంబు లెల్ల నుపాస్యస్వరూపైకనిరూపణీ
యంబు లగుట వేదాంతంబునందు స్వయంపరమపురుషార్థరూపోపాస్యస్వరూపాది
సమర్థనార్థభాగశేషంబ తత్ప్రాప్త్యుపాయభూతతదుపాసనాత్మకజ్ఞానవిధిభాగంబు.
ఇట్టికర్మజ్ఞానప్రతిపాదకంబు లగువేదపూర్వోత్తరభాగంబులం బ్రకారవైవిధ్యంబున
భగవత్ప్రతిపాదకంబులు. అత్తెఱంగు వినుము. లౌకికవైదికనాచికశబ్దంబు లెన్ని యన్ని
యు భగవన్నామంబుల. అందు సవ్యవధానాభిధాయకంబులు నవ్యవధానాభిధాయకం
బులు నుభయవిధానాభిధాయకంబులు నై మూఁడుదెఱంగు లై యుండు. సవ్యవధా
నాభిధానంబు లనం బ్రకారభూతప్రకృతిపరిణామభూతపిండవిశేషజీవముఖంబునం
బ్రకారిబ్రహ్మవాచకంబు లగు దేవతిర్యఙ్మనుష్యాదిలౌకికశబ్దంబులు. అవ్యవధానాభిధా
నంబు లన సాక్షాద్భగవద్వాచకంబు లగుపరబ్రహ్మపరమాత్మపురుషోత్తమవాసుదేవ
నారాయణాదిశబ్దంబులు, ఉభయవిధానాభిధానంబు లనం బుష్కలగుణయోగంబు
ముఖ్యార్థంబుచే భగవద్వాచకంబు లయ్యుం దద్గుణలవయోగంబున నౌపచారికంబులై
ప్రకారభూతదేవతాంతరసూచకంబు లగుచుఁ బ్రకారిబ్రహ్మవాచకంబు లగునింద్రాగ్ని

వాయువరుణాదిశబ్దంబులు. ఇట్టిత్రివిధాభిధానంబులకు నభిధేయం బైనపరబ్రహ్మం
బునుం గారణరూపంబునుం గార్యరూపంబు నన ద్వి రకారంబులఁ బ్రతిపాదింపం
బడు. అందుఁ బ్రధానం బైన కారణరూపభగవత్స్వరూపంబునుం దత్తత్సాధారణ
విగ్రహస్థానాదివిశేషంబులుం దదుపాసనావిధానంబులుం దత్ప్రకారభేదంబులుం
దత్ఫలం బైనమోక్షంబును నవ్యవధానాభిధానంబులచేత వేదాంతభాగంబుం బ్రతిపా
దించు. [2] తదనురోధావిరోధతాత్పర్యం బైనవేదపూర్వభాగం బుభయవిధాభిధానం
బులచేఁ గార్యరూపభగవద్రూపవిశేషంబులుం దదుపాసనవిధానంబులుం దత్ప్రకార
భేదంబులు స్వర్గాదులం బరహింసాదులు నై వివిధంబు లైనతత్ఫలంబులం బ్రతిపా
దించు. మాతాపితృసహస్రంబులకంటె వత్సలతరం బైనశాస్త్రం బనతిశయఫలం
బైనమోక్షంబునందుఁ దుచ్ఛదోషదుష్టఫలంబులం దదుపాయంబుల విధించుటకుం
దాత్పర్యం బెఱుంగవలయును. వినుము. కేవలసాత్వికజనాధికారం బైన మోక్షసాధ
నంబు చూపినం బూర్వదుర్వాసనావశంబునం దదభిముఖులు గానిరాజసతామసజను
లు నిజనిజాభిమతఫలసాధనం బెఱుంగక యనుపాయమార్గంబుల ననుపాయతానుమతి
ప్రవృత్తు లై ప్రణష్టు లయ్యెద రని సకలాధికారిసాధారణవత్సలం బైనశాస్త్రంబు
నిజనిజానాదివాసనావశంబున స్వాభిమతఫలవృత్తమనస్కు లగువిచిత్రాధికారులకుం
దత్తదభిమతఫలసాధనంబు సకలఫలప్రదుండగుభగవంతుం డొక్కండ కాన తత్తత్ప్ర
కారాంతఁ విశిష్టభగవత్ప్రతిపాదనంబునుఁ దదారాధనభేదంబులను విధించెను. ఏతదభి
ప్రాయం బెఱింగి సాత్వికజనం బిందు స్వోపయుక్తాంశంబుచేఁ బ్రకారిసమారాధనంబు
చేసి మోక్షంబు గాంతురు. ఇతరాధికారులు ప్రకారి నొల్లకయు నెఱుంగకయుఁ
బ్రకారభూతదేవతాంతరమాత్రంబులయంద యుపాస్యతాబద్ధబుద్ధు లై తత్తదారాధన
లబ్ధఫలలుబ్ధులై నిత్యబద్ధు లై యుండుదురు. అట్లగుట నిఖిలవేదవేదాంతంబులు భగవ
త్ప్రతిపాదకంబుల. తదుపబృహణంబులై పౌరుషశాస్త్రంబు లైనపురాణంబులు వేదం
బులునుఁబోలె మొదలఁ జతుర్ముఖముఖవినిస్రుతంబుల యైనను బ్రథమవక్త యగునతని
గుణావరోధంబున సత్వోదయసమయంబునం జెప్పంబడినయవి యథార్థజ్ఞానంబున
భగవత్ప్రతిపాదకంబు లై దేవతాంతరప్రతిపాదకపురాణాంతరంబులకు నన్యథా
జ్ఞానవిపరీతజ్ఞానమూలత్వంబు దెలుపుచు సాత్వికంబు లనంబడు. రజస్తమోగుణోదయ
సమయంబులం జెప్పంబడినయవి యన్యథాజ్ఞానవిపరీతజ్ఞానమూలంబు లగుటం దత్త
ద్దైవతాంతరపరత్వప్రతిపాదకంబు లై రాజసంబులుం దామసంబులు ననం బడు. ఇట్టి
గుణత్రయమూలప్రతిపాదకవైషమ్యంబునుం దత్తదధికారవిశ్వాసజనకంబు లై తత్తద
భీమతఫలప్రదంబు లగుట భగవత్సంకల్పకల్పితంబ యని యెఱుంగునది.

76

ఉపాసకస్వరూపనిరూపణము

తే.

వనధి నభిధేయం బయ్యు వలయుపనికి, రేవులన కాని చొరరానిరీతి నధిప!
విశ్వరూపకుఁ డయ్యు శ్రీవిభుఁడు నుక్త, రూపముల సేవ్యుఁ డగు నారురుక్షువులకు.

77


సీ.

ఆరురుక్షుం డన నారూఢుఁ డనఁగను, పాసకుం డిరువు రై పరఁగు నందు
నభ్యాసనిరతాత్ముఁ దారురుక్షువు నాఁగ, నారూఢుఁ డనఁగ నభ్యాసనిరతి
శయదశాసంస్కృతస్వాంతసాక్షాత్కృతి, భగవత్స్వరూపానుభవపరాత్ముఁ
డతనికిఁ దగుఁ గాని యవిశేషసకలప్ర, కారసంయుతరమాకాంతుసేవ


గీ.

యారురుక్షువునకు నారూఢుఁ డగునంత, కొవర శుద్ధవిగ్రహుండ కాని
కర్మవశ్యజీవిగతుఁ డుపాస్యుఁడు గాఁడు, నిత్యవర్ణధర్మనియతిఁ దక్క.

78


తే.

జ్ఞానశక్తివిశిష్టవేషమున నంత, రాత్మ యై ప్రేరకుం డగు నఖిలమునకుఁ
గలుగు మఱిదివ్యశుభసువిగ్రహవిశిష్ట, పాంచవిధ్యంబు విభు వైన బ్రహ్మమునకు.

79

విరుద్ధశ్రుతిసామరస్యము

సీ.

చిదచిద్విశిష్టత చెప్పినశ్రుతి దాన, తిరుగ బ్రహ్మం బద్వితీయ మనుట
విజ్ఞాతృభావంబు వెలయించి శ్రుతి దాన, మఱియు బ్రహ్మంబు చిన్మాత్ర మనుట
శుభగుణయోగంబు చూపిన శ్రుతి దాన, మగుడఁ బరబ్రహ్మ మగుణ మనుట
దివ్యవిగ్రహయుక్తిఁ దెలిపినశ్రుతి దాన, యప్పటియును బ్రహ్మ మతను వనుట


గీ.

సదృశ మొకఁడు లేమిఁ జాటుట జడభాగ, హీన మనుట హేయ మైనగుణము
గలుగ దనుట కర్మకార్యదేహంబు లే, దనుట శ్రుతిసమోభయార్థి యనుట.

80


క.

సర్వాచేతనచేతన, సర్వావసరానుభూతసర్వావస్థా
సర్వప్రవృత్తిసత్తా, నిర్వాహక మంతరాత్మ నృపమణి! వింటే.

81

భగద్విగ్రహస్వరూపనిరూపణము

సీ.

పంచోపనిషదుక్తపరమేష్టిముఖశుద్ధ, సత్వసంశ్రయపంచశక్తిమయము
నిత్యదివ్యవిసర్గనిస్తులాద్భుతయౌవ, నాదికల్యాణగుణాస్పదంబు
సముపాశ్రితాత్మీయసర్వతత్వాత్మక, భూషణాయుధనిత్యభూషితంబు
సకలలోకస్వాంతచక్షురాకర్షకా, ప్యాయకతాపాపహారకంబు


గీ.

స్వేతరసమస్తవైరాగ్యహేతుభూత, మఖిలయోగిమనఃప్రథమావలంబ
మాశ్రితార్థంబు లక్ష్మీసమాశ్రితంబు, విభున కైచ్ఛిక మై కల్గునిగ్రహంబు.

82


ఉ.

శ్రీదయితుండు దాల్పుమణి జీవుఁడు లక్ష్మి ప్రధాన మండ్రు
మోదకి బుద్ధి శార్ఙ్గము సముజ్జ్వలశంఖము లింద్రియాదిభూ

తాదులు చక్ర ముల్లము శరాదికవర్గము వైజయంతి సో
త్పాదకభూతపఙ్కి యని వైకృతి విద్యయు నయ్యవిద్యయున్.

83

భగవదవతారరహస్యకథనము

వ.

ఏతాదృగ్విధవిగ్రహవిశిష్టవేషంబునం బరవ్యూహవిభవార్చాంతర్యామిరూపంబు లనం
పరమపురుషునకుం బంచప్రకారంబులు గలవు. అందుఁ బరరూపంబు నిక్యముక్తాను
భవార్థంబుగా నిత్యేచ్ఛానుగృహీతం బై ననిత్యవిగ్రహంబునం బరమపదంబునం బరమ
వాసుదేవాభిధానంబున వెలుఁగొందు ప్రధానప్రకారంబు. ఇట్టిది పరరూపంబు. జగదు
త్పత్తిస్థితిప్రళయార్థంబు నుపాసకానుగ్రహార్థంబును నుక్తగుణద్వయద్వయాభివ్యక్తి
లక్షణలక్షితంబు లై నిజేచ్ఛావశంబునం గైకొనిన సంకర్షణప్రద్యుమ్నానిరుద్ధవాసుదేవ
భావంబు లగుచతుర్విధవిభాగవిశేషంబులు వ్యూహంబు లనంబడు. అందుఁ గేశవాదిమూ
ర్త్యంతరగ్రహణరూపంబు లైనయవాంతరవ్యూహంబులు వివిధంబులు. ఇట్టివ్యూహ
విశేషంబులు దుష్టనిగ్రహశిష్టప్రతిపాలనార్థంబుగాఁ దిర్యఙ్మనుష్యవిజాతీయతాంగీ
కారంబునం జూపునావిర్భావంబు విభవం బనం బడు. అదియును గౌణంబును ముఖ్యం
బు నన ద్వివిధంబు. అందుఁ గర్మవశ్యజీవాధిష్ఠానద్వారంబునం దాత్కాలికకార్యార్థం
బుగాఁ జూపుగుణావిర్భావంబు గౌణంబు. మఱి దీపంబువలనఁ బ్రతిదీపంబురూపంబు
న దివ్యవిగ్రహంబుతోడన చూపు నావిర్భావంబు ముఖ్యంబు అందును వామనత్రివిక్ర
మన్యాయంబున నవాంతరాకారాంతరగ్రహణంబు లసంఖ్యేయంబులు. ఇంక నంతర్యా
మి యన నుపాసనాసిద్ధికై యుపాసకాంతరంగంబులకు విషయం బయ్యెడునుపాస్య
విగ్రహవిశేషంబు. మఱి యర్బావతారం బనం బరవ్యూహాదిసమస్తప్రశస్తలక్షణపరి
పూర్ణంబై దేశకాలస్వభావవిప్రకర్షంబులేక యనాలోచితివిశేషాశేషజగజ్జనోజ్జీవనార్థం
బుగా మాంసనయనంబులకు ననుభావ్యం బైనపూర్వోక్తసమస్తప్రకారంబులం జూపు
నవితారవిశేషంబు. అదియు స్వయంవ్యక్తంబు దైవంబు సైద్ధంబు మానుపంబు ననం
జతుర్విధం బైయుండు. అందు నప్రాకృతదివ్యవిగ్రహంబున స్వతఃప్రాదుర్భావంబు స్వ
యంవ్యక్తంబు. శిలాదారులోహాదివిగ్రహంబుల దేవజనంబులచేతం దపస్సిద్ధమహర్షి
జనంబుచేతను మర్త్యజనంబుచేతను బ్రతిష్ఠితంబు లైనయవి క్రమంబున దైవంబు సై
ద్ధంబు మానుషంబు ననంబడు. ఇట్టిపంచప్రకారంబులయందుం బరరూపంబు నిత్యైక
ప్రకారంబు, అది నిత్యముక్తైకగోచరంబు, వ్యూహరూపంబు వివిధంబు. తత్తద్దేవర్షిమా
త్రగోచరంబు. విభనం బనంతప్రకారంబు, అది తత్తత్కాలీనజనగోచరంబు. అం
దును ముఖ్యవిభవంబు సైద్ధంబు నంతర్యామిరూపంబు నుపాసకేచ్ఛాభేదంబున నైకవి
ధం బుపాసకైకగోచరంబు. అర్చారూపం బనంతప్రకారంబు, అనాలోచితవిశేషాశేష
జగజ్జనగోచరం బఖిలప్రకారసేవ్యంబు.

84

ఉ.

దారుశిలాదిభావమున దైవముల న్నిరసించి తామసుల్
కోరుదు రెంతచేరువయెకో తమ కాత్మవివేకపాకముల్
వారిధరంబుల న్విడిచి వచ్చిన చాతకధూర్తు లంబుధిన్
దారు గొనంగ శక్తులె సుధామధురోదకపానసౌఖ్యముల్?

85


క.

కావున సర్వగుఁ డయ్యును, శ్రీవరుఁ డర్చాగతుండ సేవ్యుం డగుఁ ద
త్సేవయు శరణాగతుఁ డై, కావింపక ఫల మొసంగఁ గా లే దధిపా!

86

ప్రపన్నస్వరూపనిరూపణము

వ.

దుర్లభాభిమతార్థసిద్ధికిం గృపాశక్తిసంపన్నుం డైనసమర్థునియందు నుపాయాంతర
నివృత్తిపూర్వకంబుగాఁ జేయుభరసమర్పణంబు శరణాగతత్వం బనం బడు. ఇది యభి
మతార్థసిద్ధిదం బగుట సకలజగత్ప్రసిద్ధంబు. ఇట్టికృపాశక్త్యాధిగుణవత్స్వరూపం బైన
శరణ్యత్వంబునుం భగవద్వ్యతిరిక్తపురుషాంతరంబునం దౌపాధికంబు నల్పాల్పతమం
బును నైయుండు. అతని నాశ్రయించువానిశరణాగతత్వంబు నౌపాధికంబు నల్పాల్ప
ప్రయోజనంబు నగు. ఆశరణ్యత్వంబు భగవంతునందు స్వాభావికంబును నిరతిశయం
బును నై యతనియందుం దదితరసమస్తపురుషులకు శరణాగతత్వంబు స్వరూపోచితం
బురు నిరతిశయప్రయోజనార్థంబు నగు. అట్లగుట నీయర్థంబున యథార్థజ్ఞానంబున
నిశ్చితంబుగా నెఱింగినసాత్వికుం డభిమతార్థసిద్ధికి నితరుల నొల్లక భగవంతు శరణంబు
సొచ్చి తదారాధనంబు సేయవలయు. అట్లు చేసె నేని స్వరూపసిద్ధియు దేశకాలమం
త్రతంత్రాదిన్యూనాతిరేకంబులవలన వైకల్యంబు లేక యారాధనఫలాభిమతార్థసిద్ధియు
నగు. అట్లు సేయం డేని కర్తృత్వాహంకృతిచే స్వరూపహానియు నారాధనవైకల్యం
బుచే ఫలహానియు నగు. ఇట్టిసాత్వికుండును మిశ్రసత్వనిష్ఠుండును శుద్ధసత్వనిష్ఠుం
డును నన ద్విప్రకారుండు. అందు మిశ్రసత్వనిష్ఠుం డనం బరమాత్మ యగుభగవంతు
నకుం గలశేషత్వంబునుం దదితరసమస్తజీవాత్మలకు నైనశేషత్వంబును స్వాభావికంబులు
గా నెఱింగియుఁ దదేకభోగ్యుఁడు గాక ప్రారబ్ధకర్మవాసనావశంబునఁ దామసరాజస
ఫలంబు లభిలషించి తదర్ధంబుగా భగవత్ప్రతిపత్తి సేయునతండు. శుద్ధసాత్వికుం డన
సుజ్ఞానంబుచే భగవదేకభోగ్యుం డై తత్ప్రాప్తిరూపమోక్షంబె యపేక్షించి భగవ
త్ప్రతిపత్తి సేయునతండు. అందు మిశ్రసత్వనిష్ఠుండు నీశ్వరయథార్థజ్ఞానవంతుం
డగుటం దత్ప్రభావంబుచేఁ గ్రమంబున ఫలానుభవంబుచేత నీశ్వరానుగ్రహంబుచేఁ బ్రా
రబ్ధకర్మంబు జయించి శుద్ధసాత్వికుం డగు. అట్టిశుద్ధసాత్వికుండును ననాదిసుకృతపరి
పాకభేదంబున నంగప్రతిపత్తిపరుండును స్వతంత్రప్రతిపత్తిపరుండు నన ద్వివిధం
బగు. అందు నంగప్రతిపత్తినిష్ఠుం డన నభిమతభగవత్ప్రాప్తికిఁ గర్మజ్ఞానానుగృహీతం
బైనభక్తియోగంబుచే భగవదనుగ్రహంబు బడయంగోరి తాదృగ్విధభక్తినిష్పత్తికై

తదంగంబు గా శరణంబు చొచ్చునతండు. స్వతంత్రప్రపత్తినిష్ఠు డన నుక్తభక్తి
యోగనిష్పాదనంబునయం దశక్తుండును విలంబాసహిష్ణువు నై యన్యవిధానంబున
భగవదనుగ్రహంబు వడయుటకై ప్రపత్తి సేయునతం డట్లు గావున.

87


తే.

మహి నసంఖ్యేయపుణ్యజన్మములమీఁద, నాత్మ హరిశేషతాజ్ఞాన మంకురించి
ప్రాప్యమును బ్రాపకము సర్వ మతఁడ యనుచు, నతనిశరణంబు చొచ్చుమహాత్ముఁ డరిది.

88


తే.

గురుకృపాంజనరంజనస్ఫురిత మైన, శాస్త్రదృష్టిఁ బరాత్మశేషత్వరూప
మైనయాత్మస్వరూపవిధాన మెఱిఁగి, నతఁడు తత్ప్రాప్తికై చొచ్చు హరిశరణము.

89


క.

ఒకఁడు భగవంతుఁ డెట్లుగ, సకలేష్టవిధాయి యెట్లు చర్చింపఁగఁ దా
నొకఁడ యగుఁ దత్ప్రపత్తియు, సకలార్థసమాహితార్థసాధన మనఘా!

90


క.

శరణాగతులకుఁ దక్కన్, బరులకు మోక్షంబు లేదు భవనస్థుఁడు ని
ర్భరుఁడు నన నిరుదెఱంగులఁ, బరఁగుఁ బ్రపన్నుండు సుకృతపరిపాకభిదన్.

91


క.

శక్తాధికారి కనితర, భక్తిద్వారమునఁ జేసి పరమోపాయం
బుక్తప్రపదన మితరా, సక్తునకు హితస్వతంత్రసాధన మరయన్.

92


వ.

అందు నంగప్రతిపత్తిపరుపకు నంగభూతప్రపత్తిసాధ్యంబును బరబ్రహ్మప్రాప్తిసాధ
కంబు నగుభక్తియోగస్వరూపం బాకర్ణింపుము.

93

భక్తియోగస్వరూపనిరూపణము

సీ.

వేదాంతవాక్యార్థవిజ్ఞానజన్యంబు, తద్విలక్షణము ప్రత్యక్షసమము
దర్శనోపాసనధ్యానాదిపదవాచ్య, మాత్మాపరోక్షముఖ్యప్రతీక
ముక్తకరజ్ఞానయోగనిష్పాద్యంబు, పరభక్తిముఖదశాంతరయుతంబు
యజననందనకీర్తనాదిపర్యవసాయి, యపురావృత్తిమోక్షావధికము


గీ.

తైలధారానవచ్ఛిన్నతాగతంబు, ప్రీతిరూపసమాపన్న మై తనర్చు
సతతభగవత్స్వరూపానుసంస్మరణము, భక్తియోగంబు తత్పదప్రాపకంబు.

94


వ.

వినుము శాస్త్రార్థకత్వజ్ఞానంబుచేఁ గర్మయోగాధికారంబు సంభవించు జపతపస్తీర్థదా
నయజ్ఞాదిసేవనరూపం బైనకర్మయోగంబుచే జితాంతఃకరణుం డైనపురుషునకు జ్ఞాన
యోగాకారంబు సంభవిందు. పరిశుద్ధాత్మభాననారూపం బైన యోగద్వారంబుచే
నొండె నంతర్గతతాదృగ్విధాత్మజ్ఞానంబున నైవసాక్షాత్కర్మయోగంబుచేతన యొండె
యోగాధికారంబులు గల్గు. ప్రకృతివిదితాత్మావలోకనరూపం బైనయోగంబుచే నాత్మ
శేషత్వజ్ఞానంబు దృఢం బై భక్తియోగాధికారంబు సిద్ధించు. పరమాత్మైకాంతికప్రీతి
కారితధ్యానకీర్తనయజనవందనాద్యవస్థితరూపం బైనభక్తియోగంబుచేఁ బరమభక్తిపర
మజ్ఞానాదితదవస్థావిశేషముఖ్యంబున ముక్తుండై పరమపదప్రాప్తుం డగు నట్లు గావున.

95


తే.

జ్ఞానకర్మంబు లాత్మదర్శనముకొఱకు, నాత్మదృష్టియు భక్తిసంప్రాప్తికొఱకు

భక్తిభగవత్పదాప్తికై పరఁగు నిందు, లేదొక విపర్యయసముచ్చయాదిశంక.

96


తే.

ధీరహితకర్మమును గర్మదూరమతియు, భక్తివిరహితధీక్రియల్ ముక్తబుద్ధి
కర్మ మగు భక్తియోగంబు గాదు గాన, వలయు మాత్రస్వరాదికాన్వయము చూవె.

97


క.

ధీకర్మభక్తియోగము, లేక శరీరమునఁ గలుగ వెవ్వారికి నా
ధీకర్మంబులు జననా, నేకసహస్రములమీఁద నిచ్చున్ భక్తిన్.

98


సీ.

శాస్త్రార్థబోధంబు సంభవింపక యైన, నొకఁ డెవ్వడేఁ గర్మయోగి యగుట
కర్మయోగావృత్తి గలుగ కేనియు నొకా, నొకఁ డెవ్వఁడే జ్ఞానయోగి యగుట
యుక్తాత్మభావనాయోగంబు లేకున్న, నొకఁ డెవ్వఁడే యోగయోగ్యుఁ డగుట
యాత్మావలోకనం బభ్యసింపక యైన, నొకఁ డెవ్వఁడే భక్తియోగి యగుట


గీ.

ప్రాగ్భవాగమవిజ్ఞాన ఫలము చూవె, పౌర్వజననాకలితకర్మఫలము చూవె
ప్రథమజన్మాత్మభావనాఫలము చూవె, ప్రాగ్జననయోగపరిణామఫలము చూవె.

99

త్యాజ్యసంసారరూపనిరూపణము

వ.

వస్తువివేకంబు లేక విషయవిరక్తియు భగవద్భక్తియుం బొడమ నట్లగుట భజనీ
యభగవత్స్వరూపనిరూపణం బయ్యె నింకఁ ద్యజనీయసంస్కృతిస్వరూపంబు
వినుము. జీవుండు జ్ఞానస్వరూపుండును జ్ఞానగుణకుండును నిర్మలుండును భగవ
చ్ఛేష తైకరసుండును భగవదేకభోగ్యుండును నయ్యు ననాదికర్మరూపావిద్యాసం
కుచితగుణభూతజ్ఞానుం డై స్వస్వరూపపరమాత్మస్వరూపంబుల విషయీకరింప
నెఱుంగమి సహజానందవిముఖుం డయి యనాదినిజకర్మానురూపభగవత్సంకల్ప
కల్పితప్రకృతిపరిణామవిశేషం బైనకళేబరంబుచే బద్ధుం డై బంధనకళేబరంబుఁ
దన్నుంగాం దలంచుకొని యింద్రియాధీనజ్ఞానుండును విషయాధీనసుఖుండును
నై సర్పదష్టునకు నింబపత్రంబులు మధురంబు లై తోఁచువిధంబునఁ గర్మ
బద్ధుం డైనతనకు జడప్రకృతిపరిణామవిశేషంబులగు హేయవిషయంబులు భోగ్యంబు
లై తోఁపఁ దదనుభవలుబ్ధబుద్ధి యగుచుం గర్మాచరణం బొనరించుచుఁ దత్ఫలంబు
లైనసుఖదుఃఖంబు లనుభవించుచు వాసనావశంబునం గ్రమ్మఱ రుచి పుట్టి యుత్త
రోత్తరంబు కర్మం బొనరించుచు ననలతప్తస్థాలీసంసర్గకారణంబున నుదకం బుష్ణ
భావబుద్బుదాదికంబు నొందుచందంబున నచిత్సంసర్గదోషంబున హేయదుఃఖాది
కంబునకు నాస్పదం బై సంచరించు. తత్క్రమం బాకర్ణింపుము. అనాదిపూర్వ
కర్మకారణంబున సకలభావంబులయందుం దత్తద్దేవమనుష్యాదిరూపంబున జరాయు
జత్వంబునుఁ, బక్షిసర్పాదిరూపంబున నండజత్వంబును, గీటకాచరాదిరూపంబున
నుద్భిజ్జభావంబును, యూకాదిక్రిమిరూపంబున స్వేదజత్వంబునుం గాఁ జతుష్ప్ర
కారంబులఁ బుట్టుచుండు. ఇందు మనుష్యభావంబు దక్కం దక్కినపుణ్యపాప
కర్మాధికారంబు లయినసకలభావంబులయందుఁ దత్తచ్భావప్రయుక్తకేవలసుఖదుఃఖం

బులన పొందుచుఁ, బుణ్యపాపకర్మాధికారం బైనమనుష్యభావంబునందు బహిరంతరిం
ద్రియవ్యాపారరూపం బైనజాగ్రద్దశయప్పుడు జీవవ్యాపారద్వారకేశ్వరప్రయత్న
సంసృష్టంబు లైనవిషయంబు లనుభవించుచుఁ దదనుభవపరిశ్రాంతబహిరింద్రియోపర
మరూపం బైనస్వప్నదశయందుఁ దత్తత్కాలమాత్రంబులు దత్తత్పురుషమాత్రానుభా
వ్యంబులుం గాఁ గేవలేశ్వరప్రయత్నసంసృష్టంబు లైనవిచిత్రవిషయంబుల నంతః
కరణంబుచేతనే యనుభవించుచుఁ దదుభయదశావిషయవిశేషానుభవవ్యాపారపరిశ్రాం
తబహిరంతరింద్రియోపరమరూపం బైనసుషుప్తిదశయందు నిస్సంబోధుం డగుచు,
బాహ్యాభ్యంతరంబులు మఱచి విశ్రమస్థానం బైనపరమాత్మయందు నుపరతుం డై
విశ్రమించుచు, నతనిచే స్వస్థుం డై వెండియు భోగార్థంబు బోధితుం డై మేల్క
నుచు, అర్ధమరణరూపం బైనమూర్ఛయందు నచిత్ప్రాయుం డై జ్ఞప్తిసంకోచంబు
నొందుచు, ఉత్క్రాంతిరూపం బైనమరణదశయందుం గ్రమంబున బహిరింద్రి
యంబు లంతఃకరణంబునందు నంతఃకరణంబు ప్రాణంబులందుఁ బ్రాణంబులు దన
యందుఁ దాను భూతతన్మాత్రంబులయందుఁ దన్మాత్రంబులు పరమాత్మయందును బరిణ
మింప నిస్సంబోధుం డై బాహ్యాభ్యంతరంబులు మఱచి, బాహ్యాంతఃకరణభూతతన్మాత్ర
సంయోగరూపం బైనసూక్ష్మశరీరంబుతో నుత్క్రాంతుం డై హృదయస్థానసంబంధం
బగునేకోత్తరశతనాడికాదిగణంబునందు ముక్తైకనిర్గమద్వారం బైనమూర్ధన్యనాడి
దక్కం దక్కినశతనాడీద్వారంబులవెంట నేదే నొక్కంట నేత్రశోత్రాదిశరీరప్రదే
శంబుల వెడలి, కేవలపాపపరుం డేని యాతనాతనూబద్ధుం డై నియమమార్గంబునం
గింకరాకృష్ణుం డై చని, నిరయంబు లనుభవించినపిదపం బరిశిష్టకర్మాంతరవశంబున
'జాయస్వమ్రి యస్వ' యనుసంకల్పమాత్రంబునఁ బునఃపునర్నికృష్ణజన్మమరణంబులం బొ
రలుచు, ఇష్టాపూర్తాదిపుణ్యకర్మపరుం డేని సూక్ష్మశరీరంబుతో ధూమాదిమార్గం
బునుం గా నుత్తరోత్తరప్రాపితుం డగుచుఁ, గ్రమంబున ధూమరాత్ర్యపరపక్షదక్షి
ణాయనపితృలోకాకాశచంద్రస్థానంబులకుం జని, చంద్రప్రాప్తిచేత నమృతమయ
శరీరుం డై తత్తదనుగుణపుణ్యలోకంబులం దత్తదధిదేవతాకింకరుం డగుచుఁ దత్తత్స
మానభోగంబు లనుభవించి, పుణ్యావసానంబునం గర్మాంతరప్రారంభంబునం గ్రమ్మఱ
సూక్ష్మశరీరంబుతో నవరోహణక్రమంబున డిగ్గి, క్రమంబునం జంద్రాకాశవాయుధూ
మాభ్రమేఘంబులకు వచ్చి, మేఘంబుననుండి వర్షం బై పురుషునిం జెంది, పురుషుని
యందు రేతోరూపంబునం బరిణమించి, యోషిత్కుక్షిం బడి, యందు గర్భం బై
పొదలి, క్రమ్మఱ జీవత్వంబునం జన్మించు. ఇట్టి సంసారావర్తగర్తంబునం బరిభ్ర
మించుచు.

100


ఆ.

గర్భజన్మబాల్యకౌమారతారుణ్య, వృద్ధతాదు లైనవివిధదశల
నొకట నైన సుఖము నొందలేఁ డన్నిట, నవధి లేనివగల నంచుఁ బ్రాణి.

101

సీ.

మలమూత్రపంకిలమాతృగర్భంబున, నతిసుకుమారదేహము దపింప
ముడియకట్టుగ వీఁపునడుమునెమ్ములు వంగి, యుల్బపరీతుఁ డై యుండి లోన
నత్యుష్ణలవణకట్వమ్లాదితన్మాతృ, భోజనంబులకాఁకఁ బొక్కిపడుచుఁ
బరితృప్తి ముడువఁ జాఁపఁగ సమర్థుఁడు గామి, సర్వాంగముల నొప్పి సంఘటిల్ల


గీ.

నూర్పు వెడలక విజ్ఞానముక్తిఁ బూర్వ, జనిశతంబులఁ దలపోసికొనుచు నిట్లు
కాంచు దుస్సహగర్భదుఃఖంబు మొదలఁ, బ్రాణి ప్రాచీనకర్మనిబంధనమున.

102


సీ.

ప్రేరకోత్కటసూతిమారుతాహతి గర్భ, మున నధోముఖముగాఁ బొరలఁబడుచు
దేహసంకోచకద్రౌహిణానిలముచే, నానాస్థిసంధిబంధములు నొగుల
శుక్లమూత్రపురీషశోణితావృతి బ్రుంగి, ముఖము విచ్ఛిన్న మై మొదల వెడలఁ
గేశమూర్ఛాయుక్తిఁ గ్రిమివోలె నెట్టకేఁ, దల్లిదుర్గంధరంధ్రమున వెడలి


గీ.

జగతిఁ బడి బాహ్యవాయుసంస్పర్శనమున, నెఱుక చెడి కావుకావున నేడ్చుఁ బ్రాణి
ఱంపమునఁ గోయుగతి ముండ్లఁ ద్రెంపునట్లు, యోనియంత్రప్రపీడచే నొడలు నొవ్వ.

103


చ.

మలమున బ్రుంగుఁ డైనతలిమంబుపయిన్ శయనించి మేను చీ
మలు దిన మక్షికల్ గఱవ మానుప నేరక యొత్తిగిల్లి పై
నొలసినతీఁట గోఁకికొని నోపకయే వ్యవహారమజ్జనా
దులును బరేచ్ఛఁ గైకొనుచు దుఃఖము వొందు శిశుత్వవేళలన్.

104


క.

గురుజననిరోధక్షా, కరణంబులవలన నిలుపు గానక క్రీడా
పర మగుహృదయము దుఃఖా, కర మై తపియించుఁ బ్రాణి కౌమారమునన్.

105


సీ.

ఎవ్వండ? నెందుండి యెచటి కేమిటికి నే, బద్ధుండ నైతి నేబంధనమునఁ?
గారణం బెయ్యది? కాదు కారణ మెద్ది?, యెద్ది కారణజన్య? మేది కాదు?
ధర్మ మే దేది? యధర్మంబు నే దిప్పు?, డెందు వర్తించెద? నందు నిలువ?
నేది కృత్య? మకృత్య మెయ్యది? గుణసంవి, శిష్ట మెయ్యది? దోషజుష్ట మెద్ది?


గీ.

యనువివేకంబు లేక ప్రాయమునఁ క్రొవ్వి, పశువువోలె శిశ్నోదరపరుఁడు నరుఁడు
సంచరించుచు నజ్ఞానసంభవంబు, నధికతర మైనదుఃఖంబు ననుభవించు.

106


క.

కరణకళేబరపాటవ, కర మగుప్రాయంబు తనకుఁ గలుగుటకు దురా
చరణమ ఫల మగు శిశ్నో, దరపరుఁడు సుఖంబ కాఁగఁ దలఁచు న్వగయున్.

107


శా.

అజ్ఞానం బనఁగాఁ దమోవిలసనం బజ్ఞానకార్యోదయం
బజ్ఞానానుగుణంబ కాన గళితోక్తాచార మౌ దానికిన్
బ్రాజ్ఞుల్ ప్రాప్యఫలంబు నారకము కా భాషింతు రట్లౌటచే
నజ్ఞానాదుల నిందు నందు నిజ మై ప్రాపించు దుర్దుఃఖముల్.

108

సీ.

మృగపక్షిరాక్షసోరగవరాదులచేతఁ, బరఁగుతాపం బాధిభౌతికంబు
శీతోష్ణవైద్యుతవాతవర్షాదులఁ దనుకుతాపం బాధిదైవికంబు
గుల్మజ్వరచ్ఛర్ధికుష్ఠశూలాదుల, నవమానకామలోభాదిదశల
శారీర మై మనోజనిత మై యిబ్భంగి, నడరుసంతాప మాధ్యాత్మికంబు


గీ.

పండితోత్తమ! యిట్టితాపత్రయంబు, ప్రాక్తనం బైనకర్మనిబంధనమున
ననుభవించుచు శోకాత్ముఁ డగుచు నరుఁడు, బాల్యమున బ్రాయమున వృద్ధభావదశను.

109


వ.

వెండియు జరాప్రాదుర్భావంబున శిథిలం బై కుదురుప ట్టెడలి లివలివం గదలురదన
పఙ్క్తులును, జిగి దెగె బిగి వదలి స్రగ్గి వగ్గువడి తరంగితాయమానం బైనసర్వాంగీణ
చర్మంబును, బయలువడి నిలువునం దేఱినబీఱనరంబులును, అంతర్గతకనీనిక లై దూషి
కాదూషితాస్రనిసృతిం జెక్కులం జిత్తడగొలుపుచు దూరితస్నైగ్ధ్యంబు లై వెలి
కుఱికినకన్నులును, పుంజికొని వెడిలి నిడుద లై యుడుగక రసగిలునాసాకేశంబులు
ను, లాలావినిర్యాసంబులు సెలవుల నురుఁగుకొన దుర్గంధధురంధరం బైనవక్త్రకోట
రంబును, ప్రస్ఫుటీభూతసర్వాస్థిస్థలంబును, పరిభుగ్నపృష్ఠాస్థిపరంపరాకంబు నయి
కంపమానం బగుశరీరంబునుం గలిగి యెదుర నిలిచినం బొడగానక బెట్టు పిలిచిన వినక
యాఘ్రాణించియుఁ గంధంబు గొన సమర్థుండు గాక చప్పరించియుం జవిపొం దెఱుం
గక జఠరానలంబు కుంఠితంబగుట నల్పాహారుండును నల్పాల్పవిహారుండును నై యెట్టకే
నియుం దడవున లేచుచు నెట్టకేనియుం దడవునఁ గూర్చుండుచు నెట్టకేనియుం దడవు
నఁ జేష్టించుచు ననుభూతవస్తువుల నా క్షణంబ మఱచుచుఁ బ్రవృత్తిప్రయత్నాక్షమంబు
లైనసకలకరణంబులచే మరణంబునకుం గాలుచాఁచియుఁ బూర్వజన్మవ్యాపారంబులు
నుం బోనితనప్రాయంబునాటిపోకలు దలంచుకొని యుస్సు రని వేఁడినిట్టూర్పుతోఁ
బరితపించుచు సకృదుచ్చారణంబున మిగుల నలయుచు శ్వాసకాసమహాయాసంబున వేఁ
గుచు నంతకుం గంట బొట్టు వెట్ట నెఱుంగక వేఁగించుచు సంచారంబులకు నాకాం
క్షించుచుఁ జవులు గొనంగోరుచు నొరులు లేవ నెత్తం బరులు శయినింపఁ జేయ
నఖిలశౌచవిరహితత్వంబున నెల్లరోఁతలకు నెల్లయై భృత్యు లవమానింపం బరిజను లప
హసింప బాంధవులు ముక్కు విఱువం బుత్రులు వేసరం గళత్రం బోకిలింప నివి
మొదలుగా వార్థకదుఃఖంబు లనేకంబు లనుభవించి యంతమీఁద నత్యంతదుస్సహం
బైనమరణం బనుభవించుఁ దత్ప్రకారం బాకర్ణింపుము.

110


సీ.

హస్తాంఘ్రికంధర లవశంబులై త్రెళ్లి, కలయ నంగంబులఁ గంప మొదవి
పలుమాఱు మూర్ఛిల్లి పలుమాఱు దెలివొంది, తనకళత్రాదులతగులు మిగిలి
మరణావయనపీడ మర్మము ల్భేదిల్లి, ప్రాణానిలంబుల పట్టు వదలి
తెల్లగ్రుడ్డులు తేలగిల్లి తీపులు పుట్టి, దోషము ల్పొందుగఁ దొట్టగిల్లి

గీ.

పొడమగుట్టెత్తి తాల్వోష్ఠపుటము లెండి, తాపమున దప్పి నాఁకటఁ దప్తుఁ డగుచు
దుస్సహక్లేశమున మహాతురత యెదవ, నొరలుచును దేహ మొకభంగి నుత్క్రమించు.

111


ఉ.

వేదన మీఱ నిత్తనువు వీడ్కొని జీవుఁడు తీవ్రశోషణా
పాదకయాతనావపురుషస్థితుఁ డై యమదూతపాశదం
డాదులపీడ నుగ్రపథయానము నంతకదర్శనాదినా
నాదురవస్థలం బొగిలి నారకబాధలఁ బొందు మీఁదటన్.

112


సీ.

మొఱలు పెట్టఁగ అంపములఁ ద్రెంపఁబడువారు, పుటపాకములకాఁకఁ బొక్కువారు
వెడఁదగొడ్డండ్లఁ బచ్చడిసేయఁబడువారు, పుడమిఁ బాఁతిన నుక్కిపోవువారు
కొర్ల వ్రేసిన గుచ్చుకొని వ్రేలఁబడువారు, నుప్పురొంపులఁ గ్రుక్క నురియువారు
క్వథితతైలముఁలఁ బక్వము సేయఁబడువారు, దెంచనంబుల వ్రేయఁ ద్రెళ్లువారు


గీ.

పులులుఁ బక్షులు భక్షింపఁ బొరలువారు, గలిగి శతధాసహస్రధాకారభిదలఁ
గలుగ దెన్నిక నిరయప్రకారములకు, దుఃఖ మేకైకమును గడు దుస్సహంబు.

113


క.

నిరయానుభవముపిదపం, బరిశిష్టం బైన పూర్వపాపఫలంబున్
బొరయుటకుఁ గూలుఁ గ్రమ్మఱ, నరపశుమృగఖగనగాదినానాయోనిన్.

114


తే.

వినుము దుఃఖంబు నిరయసంస్థునక కాదు, శతమఖస్థానమునయందుఁ బతనభీతి
నున్నదినములు నిర్వృతి నొందలేక, కూలుఁ బుణ్యంబు తుదిఁ జాల కుతిలపడుచు.

115


క.

మరలన్ గర్భము జన్మము, మరణము నిరయమును మఱియు మఱియు నయి నిరం
తరసంసృతిచక్రంబున, దొరలి నరుం డొందు సర్వతోదుఃఖములన్.

116


తే.

సుతకళత్రాదిసకలవస్తువులు వగల, బ్రుంగువడనిసుఖంబు చేయంగఁ జాల
వేల నిన్నియు? సంసారి కొద్ది యిష్ట, మడియపో దుఃఖతరుబీజ మనఘచరిత!

117


క.

బ్రదికెడునంతకుఁ బురుషుఁడు, ప్రిదులక నిలు వెల్ల నగలఁ బెనగొనియుండన్
గుదురుకొని దూదిమాఁగుడు, బొదివిన కార్పాసబీజమునకుఁ బ్రతియై.

118


సీ.

ప్రకృతినైకాకృతీపరిణామదేహంబు, తన్నుఁ గా మూడుండు దలఁచుఁ గానఁ
డదుపభోగ్యము లైనధనగృహాదులయందుఁ, దనకు భోగ్యము లనుతలఁపు పుట్టి
భోగ్యత్వబుద్ధిచే భోగింపఁ గామించు, భోగవిఘ్నములపైఁ బొడము గినుపు
భోగంబు చవిచోఁకఁ బొడము లోభము లోభ, మున నొం డెఱుంగమి మోహ మొదవు


గీ.

భోగలోభగర్వముల మదం బుదయించు, భోగసిద్ధికొఱకుఁ బోక పెనఁగఁ
గలుగు మత్సరంబు గాన దేహాత్మాది, జనిత మీదురంతసంసరణము.

119


ఉ.

పుట్టుగుచెట్లకు నోలనఁ బోసినవిత్తులు శాంతిముస్తకున్
ముట్టియతోడిజీవములు మోహపుటిర్లకునుం గుహూనిశల్

కట్టనియిం డ్లఘంబులకుఁ గట్టడి యాసలసంప్రసూతికిన్
గుట్టులతోడిగర్భిణులు కోరిక లెవ్వరి నొంపకుండునే?

120


ఉ.

లజ్జకుఁ బాపు శీలముఁ గులంబు వడి న్విడిపించు సూనృతం
బుజ్జన సేయుఁ జేయ మొగమోటమిఁ దూలుచుఁ బాతకంబులన్
మజ్జన మార్చు వార్చు నభిమానము రోఁతల కియ్యకొల్పు నీ
ముజ్జగ మైనఁ ద్రిప్పుఁ దుది ముట్టదు దా ధనకాంక్ష యేరికిన్.

121


చ.

అడుగనియండజాదులకు నాఁకలి దీరకయున్నె? దీనుఁ డై
యడిగెడుచోట నెంతఘనుఁ డైనను హీనుఁడె కాఁడె? హీనుఁ డై
యడిగెడునాఁడు తృప్తిపరుఁ డౌనె? యతృప్తుఁడు సౌఖ్య మొందునే?
యడుగుట యెన్నిజన్మముల కాఱణి నెవ్వగ వో తలంపఁగన్.

122


శా.

పాత్రాపాత్రనివేకరిక్తులు శుభప్రారంభముక్తు ల్పురీ
పోత్రీప్రాయులు తత్వసాధనకథాబోధానపాయుల్ శ్రవో
నేత్రఘ్రాణకజిహ్వికాపరమనోనిత్యానుకూలు ల్సదా
మూత్రద్వారసుఖాతిలోలు రహహా! మోక్షం బపేక్షింతురే?

123


క.

మలమూత్రరక్తపిత్తా, దులు వేర్వే రైన రోసి దుర్మదుఁ డిహిహీ!
మలమూత్రరక్తపిత్తా, దులప్రో వగుదేహ మింపుతోఁ గామించున్.

124


శా.

చన్ను ల్కాఁక పసిండికుండ లఁట వక్షశ్చరదుర్మాంసముల్
కన్ను ల్క్రొవ్విరిదమ్మిఱేకు లఁట వేల్లద్దూషికాగోళముల్
వెన్ను ల్సోగయనంటియాకులఁట సంవీతాస్థిపుంజంబు లీ
యన్ను ల్సౌఖ్యముగాఁ దలంచుజను లాహా! యెంత మూఢాత్ములో?

125


క.

అందాఁక గురువు దైవము, నందాఁక న తగవు ధర్మ మంతస్సహనం
బందాఁక నెల్లగుణములు, నెందాకం గినుపు వొడమ దెట్టివరునకున్.

126


ఆ.

కినుపు దోఱఁగలేనిమనుజుండు సత్కర్మ, మాచరించు టెల్ల ననఘచరిత?
యింట నున్నపిల్లి నెడలింపకుండియ, యముఁగుఁజిలుకఁ బెనుచునట్ల కాదె?

127


ఉ.

ఏకడఁ జొచ్చునో సుకృత? మెచ్చటడాఁగునో తృప్తి? యెప్పుడో
పోకడ శాంతి? కెం దణఁగిపోవునో సౌఖ్యము? మాన మేమి యౌ
నో? కృప యెట్లు మాయమగునో? యశ మేగహనఁబు దూఱునో?
లోకమునం దెఱుంగ మొకలోభ మెదిర్చినమాత్రఁ జిత్ర మై.

128


చ.

ఇడుమను ధర్మశాస్త్రకథ లిన్నియు మిథ్యలు కూటిమాత్రమున్
గుడుచుట దుర్వ్యయంబు కొడుకుం బగవాఁ డడుగంగఁ జూచు నేఁ

గడపటఁ బ్రాణ మన్న సుఖగౌరవ మన్నను దైవ మన్న నే
డ్గడయు ధనంబ తత్త్వ మనఁగా విను మర్మమ పొమ్ము లోభికిన్.

129


తే.

చంద్రసూర్యాగ్నిరుచులచే సడలిపోని, యట్టిమోహంపుటిర్లచే నంధు లగుచు
సౌఖ్యమార్గంబు గానక సకలజనులుఁ, గూలుదురు మాతృగర్భాంధకూపతతుల.

130


క.

మును గలిగియు రూపఱినం, గనియును విషయముల మఱియుఁ గాంక్షించు నిహీ!
యనుభవముమీఁద నెఱుఁగని, మనుజాధము మోహ మొరులమాటల విడునే?

131


తే.

మరలకుండుట యెఱిఁగియు మఱవలేరు, విడక పోరామి యెఱిఁగియు విడువలేరు
కానిపని యౌటల యెఱిఁగియు మానఁ జాల, రద్భుతము గాదె మోహాంధు లైననరులు?

132


ఉ.

మేరువుఁ బూరిగాఁ దలఁచు మి న్నఱచేతన మూయఁ బైకొనున్
నీరధిఁ బుక్కిలింతునను నిర్జరనాధుఁడ నేన పొ మ్మనున్
ధారుణి పెల్లగింతు ననుఁ దా నొకమానవకీట మైన ని
వ్వారలు మాన్ప లే రిది ధ్రువంబు మదం బనుసన్నిపాతమున్.

133


చ.

గురువులకంటెఁ జుల్కనయుఁ గ్రూరతకంటె హితంబు దుర్జనో
త్కరములకంటెఁ జుట్టలు వృథాకలహంబులకంటెఁ గృత్యముల్
దురితముకంటె మేలు పరదూషణవృత్తముకంటె వేడ్కయున్
ధరఁ దమకంబుకంటె మఱి ధన్యత గల్గదు మర్త్యకోటికిన్.

134


క.

ఇచ్చెద నను సర్వస్వముఁ, జొచ్చెద నను మర్త్యుఁ డెదిరి సౌద యైనఁ దుదిన్
జచ్చెద నను వెడపనికై, మచ్చరమునకంటెఁ గీడు మఱియుం గలదే?

135


క.

అనుభోక్త ద న్నెఱుంగం, డనుభవకారయిత వార్త యైనను నెఱుఁగం
డనుభావ్యతత్త్వ మెఱుఁగం, డనుభవమే కాని బద్ధుఁ డంధుఁడ కాఁడే?

136


చ.

విడుపఁడు సౌఖ్యము న్మఱచి వేమఱు నంకుశబాధ నెమ్మిఁ గో
రెడు నగపడ్డ సింధురమురీతి ఫలోత్కటబంధనంబు మా
నెడుదెఱ నేర్పరించుకొని నేరక యింద్రియపంచకంబుచే
నుడుగనికోర్కిఁ దీర్చుకొనుచుండుట మేలుగఁ జూచు జీవుఁడున్.

137


మ.

ప్రతిదేహప్రళయంబు నందనతనుబంధానుసంబంధుఁ డై
ప్రతినైమిత్తికమున్ జతుర్ముఖశరీరస్తబ్ధుఁ డై ప్రాకృత
ప్రతికల్పాంతమునం బరాత్మతను నిర్మగ్నాత్ముఁ డై యాలయ
త్రితయంబందు నరుండు వీడఁ డచిదాప్తిం గ్రమ్మఱం బుట్టుచున్.

138


తే.

ఇట్టి సంసారబంధంబు హేయ మగుటఁ, గనియు వినియు విరక్తుండు గాక మఱియుఁ
గోరి పొందు నరుండు తత్కారణం బ, నాదికర్మప్రవాహంబు మేదినీశ!

139

చ.

ఫలరసశాసనాప్రదవిభాగవశంబునఁ గర్మశక్తికిన్
గల దిరుభంగి యందుఁ బ్రతికర్మవిధానఫలానుభూతులన్
బొలియఁ బురోంశ మున్న పెరప్రోవు ఘటించుదురంతవాసనా
బలమున నుత్తరోత్తర మపారనిరంతరకర్మబంధమున్.

140

మోక్షావతరణము

వ.

అట్లగుట సంసారచక్రంబు కర్మమూలం బగుటయుఁ దత్కర్మంబు దురంతం బగుట
యుఁ దప్పదు. ఐనను సుకృతదుష్కృతరూపం బైనయాకర్మంబు భగవదానుకూల్యప్ర
వృత్తిప్రాతికూల్యప్రవృత్తిరూపం బగుట ననుగ్రహనిగ్రహంబులచే సుఖదుఃఖ ప్రదుం
డయినయీశ్వరునకుం బ్రాధాన్యం బంగీకరింపలేకుండుటయ కాదు, తానునుం దత్సం
కల్పాయత్తసత్తాప్రవృత్తికంబు. ఈయర్థంబు సృజ్యసంహార్యకర్మనిరపేక్షయుగవత్సృష్టి
సంహారాదులయందుఁ బ్రసిద్ధంబు. అట్లు గావున నిరంకుశస్వతంత్రుండయినయీశ్వరుం
డు వైషమ్యునైర్ఘృణ్యంబులకు లోనుగాక తత్తత్కర్మానుగుణంబుగా స్వర్గనిరయంబు
లొసంగునట్ల యచ్యుతస్వానుకూలప్రవృత్తిరూపం బైనయనాదిమోక్షబీజంబు గలచే
తనునకు మోక్షం బొసంగు. తత్క్రమంబు సావధానుండ వై వినుము. విశేషంబులు
నెల్లజీవులం దత్తత్కర్యానుగుణంబుగా సంసరింపంజేయుచు లీలాప్రవృత్తుం డయ్యు
నీశ్వరుండు సమయప్రతిపక్షవీక్షాపరుం డై యొక్కకాలంబున నొక్కచో నొక్క
రునకు ఘుణాక్షరన్యాయంబున నొక్కయాదృచ్ఛికస్వసేవాచరణంబు గలుగం గటా
క్షించి య్దుం దచ్చేతనాభిప్రాయంబు లేకుండిన స్వాభిప్రాయంబునన యది నెపం
బుగా నతని నుద్ధరింప సన్నద్ధుం డయి విశేష ప్రయత్నంబునకుం జొచ్చు నట్ల
గుటంజేసి.

141


క.

తాదృగ్విధోక్తలఘుతర, యాదృచ్ఛికసుకృతికుం డనంతరదేహ
ప్రాదుర్భవంబునప్పుడ, శ్రీదయితేక్షణసుధాభిషేకముఁ గాంచున్.

142


తే.

ఎల్లపురుషుండు తనజనియించునపుడు, యజకటాక్షితుఁ డై రాజసాత్మకుండు
హరకటాక్షితుఁ డై తామసాత్మకుండు, హరికటాక్షితుఁ డై సత్వపరుఁడు నగును.

143


వ.

ప్రత్యుపకారాదిహేతునిరపేక్షంబుగాఁ గేవలకృపైకమూలం బగుట నదియ భగవం
తునకు నిర్హేతుకకృపాకటాక్షంబు.

144


ఆ.

కాన నిట్టిజాయమానకటాక్షంబు, గలుగఁ గలుగు సత్త్వగౌరవంబు
సత్త్వగుణమువలన సదసద్వివేకి యై, హితపదంబు దనకు నెఱుఁగ నేర్చు.

145


క.

సదసద్వివేక మొదవిన, మదముక్తకుదృష్టిబాహ్యమత మగుచుఁ ద్రయీ
పదసేవితాభిముఖ మై, వదలదు సత్సంగమంబు వసుధాధీశా!

146

క.

సాత్వికశాస్త్రప్రవణుఁడు, సాత్వికసత్సంగమంబు సడలక భగవ
త్తత్వకథాశ్రవణంబున, సత్వరతవిముక్తి నొందు సంసారమునన్.

147


తే.

భ్రాంతి వాసిన మున్ను తద్భ్రాంతికతన, తనయొనర్చినవిక్రియల్ దలఁచి పోలె
దేహ మాత్మనువిభ్రాంతి దెలిసి నరుఁడు, ప్రాగహంకృతి కాత్మలోఁ బరితపించు.

148


ఆ.

తనువుఁ దన్ను గాఁగఁ దలఁచుట తనుభోగ్య, విషయ మాత్మభోగ్యవిషయ మనుట
యిరుదెఱంగుభ్రాంతి యిదియ కదా! యవి, ద్యామహీజబీజ మనఘచరిత!

149


క.

తనుఁ దనువు గామి యెఱిఁగినఁ, దనుభోగ్యములందు భోగ్యతామోహంబున్
దినదినమున సడలి క్రమం, బున విషయవిరక్తిఁ గాంచుఁ బురుషుం డనఘా!

150


క.

కూరిమి విఱిగినసతిపై, నేరమి దోఁచుగతి విషయనిస్పృహమతి యై
కోరిక లుడిగినవానికి, నూరక విశ్వంబుమీఁద నొల్లమి పుట్టున్.

151


క.

ప్రవితతవైరాగ్యమహా, దవవహనశిఖముఖాతితప్తుఁడు తనకున్
భవసింధుతరణమునకు, బ్లవము సదాచార్యవర్యపద మని చేరున్.

152


వ.

చేరి గురుని దర్శించి పూర్వోక్తసదుపాయస్వీకరణంబున భగవద్భక్తుం డై తదనుగ్ర
హాతిరేకంబున ముక్తుండగు నట్లు గావున నీశ్వరునకు వైషమ్యూదిపరిహార్థంబు గా నిం
తయుం బ్రపంచింపంబడియె నింతియ కాని సర్వసారం బైనరహస్యం బొక్కటి
యాకర్ణింపుము.

153


తే.

గణనచో ధనికునిచేతఁ గనకకోటి, నొండెఁ గాకణికాకోటి నొండెఁ జెందు
గవ్వయునుబోలె మోక్షకక్ష్యమున నొండె, బంధమున నొండెఁ బడుఁ బ్రాణి భగవదిచ్ఛ.

154


వ.

ఈయర్థంబు 'నినిషాదోనినిష్ఠా' శ్రుతి సిద్ధం బని చెప్పి విరమించిన సర్వసందేహ
నివృత్తం బైనచిత్తంబు పరమనిశ్చయానందమగ్నంబై నృపకులతిలకుండు కులగురునకు
సాష్టాంగం బెరగి లేచి కృతాంజలి యై.

155


తే.

ఉక్తసాధనమున మోక్ష మొదవునంత, కోర్వ వాత్సల్యనిధి పురుషోత్తముండు
నయనగోచర మగుసాధనంబు నాకు, నర్థి నానతి యిచ్చి కృతార్థుఁ జేయు.

156

వసిష్ఠుండు మాంధాంత కష్టాక్షరీమంత్రరత్నము నుపదేశించుట

వ.

అనిన నతనిభగవత్ప్రవణ్యంబునకుం దనయుపదేశసాఫల్యంబునకు నలరి యట్లేని
తపంబునం గాని శీఘ్రంబున నిట్టికోర్కి సిద్ధింప దగుటం దపంబు సేయు మని వ్యక్త
లక్షణంబున నతని భగవత్ప్రపన్నునిం గావించి జప్యం బైనమంత్రంబునుం దదర్థరహ
స్వంబునుం దదనుష్ఠానప్రకారంబును దదుచితనియమంబులు నుపదేశించి దీవించి
ఋషులుం దానును బూజితుం డై వీడ్కొని చనినయనంతరంబ రాజర్షివరుండును
తమసాసరయూమధ్యంబునం గృతతపోధనుం డై యుక్తనిష్ఠం దపం బొనరింపం
దొణంగె.

157

ఆశ్వాసాంతము

ఉ.

తార్కికవామనోన్నతలతామధుకోశ నిరీశసాంఖ్యయో
గార్క యపూర్వనిర్వహితృహంసమనాఘన నిర్గుణోక్తిమ
న్మర్కటనారికేళఫల మామకసాత్యవతేయ వాఙ్మయో
దర్కసుధార్ణవోదయవిధాయకపార్వణశర్వరీవరా.

158


క.

ప్రచ్ఛన్నబౌద్ధదుస్సహ, హృచ్ఛర లక్ష్మణమునీంద్రహృదయాదర్శ
స్వచ్ఛతరప్రతిఫలిత, స్వచ్ఛరణస్వస్వరూపసహజాకృతికా.

159


స్రగ్విణి.

నిత్యధర్మాత్మకా నిత్యధర్మాస్పదా, నిత్యచిద్రూపకా నిత్యరూపోజ్జ్వలా
నిత్యబోధాశ్రయా నిత్యచిన్మాత్రకా, నిత్యనిర్వేదకా నిత్యభేదాంచితా.

160


గద్య.

ఇది శ్రీమద్భట్టపరాశరదేశికేంద్రచరణసరసీరుహసేవకోపసేవక నరసింహనామధేయ
ప్రణీతం బైనకవికర్ణరసాయనం బనుకావ్యంబున వసిష్ఠాగమనంబును, రాజప్రశ్న
ప్రతివచనంబులును, అందుఁ గర్మస్వరూపబ్రహ్మస్వరూపంబులును, వేదవేదాంత
పురాణస్వరూపనిరూపణంబును, భక్తిప్రపత్తిరూపసాధననిరూపణంబును, సంసార
నిరూపణంబును, మోక్షావతరణంబును నన్నది పంచమాశ్వాసము.

  1. గీతపాదలక్షణ మేలనో తప్పినది.
  2. 'తదనురూపాదిరాగతాత్పర్యంబు' అని పాఠాంతరము.