కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/పౌరాణికులు నీచులా?



పౌరాణికులు నీచులా?

ఈ వాక్యము గూర్చి ప్రపంచకము పుట్టింది మొదలు నేఁటివఱకు ఎవరికినీ వివరించవలసిన ప్రసక్తికలిగినట్టు వినలేదు. గ్రహచారవశాత్తూ ప్రస్తుతం నాకుకలిగింది. పౌరాణికులు నీచులే అయితే వారిలో మొట్టమొదటివాఁడైన సూతుఁడు బ్రహ్మఋషులైన శౌనకాదులచేత అర్ఘ్యపాద్యాదులిచ్చి సమ్మానించబడడం జరిగివుండదు (సూతసంహిత చూ.) అయితే బలరాముఁడు సూతుణ్ణి తల బద్దలుకొట్టి యెందుకు చంపాలి? అని ప్రశ్నిస్తారేమో? ఆచంపడం బ్రహ్మఋషులతో సమానంగా తారతమ్యం లేకుండా కూర్చున్నాఁడని కాని అతcడు పౌరాణికుఁడగుటచేత నీచుఁడని కాదు. ఆ కాలంలో బ్రాహ్మణులయితే సరి అందఱికంటే యెక్కువ అనేభావంతో క్షత్రియాదులు గౌరవించేవారు.

“కాషాయ దండమాత్రేణ యతిః పూజ్యః" అన్నట్లే జందెంవున్నంతలో బ్రాహ్మఁడు పూజ్యఁడుగా చెలామణి అయేవాఁడు. బలరాముఁడు మూఢభక్తులలోవాఁడుగాని శ్రీకృష్ణునివంటి పరిజ్ఞాత కాఁడు. పైగా హాలాపానలాలసుఁడు. ఆరింగ (మైకం) లో వున్నాఁడేమో అట్టి సమయంలో శౌనకాది బ్రాహ్మణ ఋషి సమాజంలో అగ్రపీఠాన్ని అలంకరించి కూర్చున్న సూతుణ్ణి చూచీ చూడడంతోటట్టే వొళ్లు భగ్గునమండి చేతులోవున్న ముసలంతో వొక్క పెట్టుపెట్టేటప్పటికి పాపం! ఆ తపస్వి స్వర్గం అలంకరించాఁడు. శౌనకాదులు ఆ పనికి అంగీకారం లేనివారే అయినా మాట్లాడితే మనపనికూడా పడతాఁడేమో (త్రాగుబోతుకదా) అని కిక్కురు మనకుండా వూరుకున్నారనుకోవాలి. దెబ్బకు దెయ్యం జంకుతుంది, లేదా జరిగిపోయిన పని శౌనకాదులు మందలిస్తే మాత్రం కలిసివస్తుందా? రాదుకదా; బలరామునివద్ద యీ దుర్గుణం తప్ప యితర దుర్గుణాలు లేవు. దేవ బ్రాహ్మణ భక్తుఁడు. అమాయకుఁడు. యీ సురాపాన దురుణం వొక్క బలరామునికే కాదు. యాదవులందఱికీ వున్నట్లే భాగవతంవల్ల ధ్రువపడుతుంది. ఇతఁడు వారిలో “తత్రాపిచ చతుర్థోంకః" అనుకోవాలి. భవతు. ప్రస్తుతాంశాన్ని మఱిచి వ్రాస్తున్నాననుకుంటాను. ఈ ప్రమాదం నాకు అనాదిగా వుంది. ఇప్పుడు మఱీ అధికమయి నా పని "గానుగు రోకలిసిద్ధిపిడి" అనే స్థితిలోకి వచ్చింది. ఇట్టి స్థితిలోవున్న నన్ను ఆప్తులు సభలకు ఆహ్వానిస్తారు. వెళ్లే శక్తిలేక మానుకుంటే యేలాగో లాక్కుపోతారు. అక్కడ యేప్రమాదం వస్తుందో అని వారు ఆలోచించరు. వెళ్లి వూఱికే బెల్లంకొట్టిన రాయిమాదిరిగా కూర్చుంటే యేలాగ? యేదో మాట్లాడవలసివస్తుంది. ఆ మాటలలో యేమీ దురర్ధం లేకపోయినా వుందని భ్రమించడం అక్కడనుంచి – “పంచశుభం పంచాశుభమ్" లోకి దిగడం, యెందుకీకర్మం అని వూరుకున్నా తప్పడంలేదు. ప్రారబ్ధం భోగతో నశ్యేత్, యిది "యావజ్జీవం హోష్యామిగా” పని జరగవలసిందే. మళ్లా ప్రస్తుతం దేనిలోకో పోయింది అనుకుంటాను. భవతు. బలరాముఁడికి ఆ రింగ (మైకం) తగ్గిన తరవాత పశ్చాత్తాపం కలిగింది. ఆయీ దోషం యేలా నివర్తిస్తుంది అనే చింత వుదయించింది. ఆ బ్రాహ్మఋషులను ప్రశ్నించాఁడు. వారు నిర్మొగమాటంగా జవాబిచ్చారు. యేమని?

సూతుఁడు జన్మత శ్శూద్రుఁడయినప్పటికీ జ్ఞానతః బ్రాహ్మఁడు కాఁబట్టి నీకు బ్రహ్మహత్యాదోషం తగిలింది అని స్పష్టంగా చెప్పి దానికి తగ్గ ప్రాయశ్చిత్తాదికం విధించారు. వారి వాక్యానుసారంగా బలరాముఁడు తీర్థయాత్రాదులు సేవించడం జరిగింది. మనకు ప్రస్తుతం కావలసింది “పౌరాణికులు నీచులు"కారు, పరమపూజ్యు లనేదియ్యేవే. వ్యాసులవారికి వేదాలు నాలుగేకాక శిలసంహితలున్నూ మహాపురాణాలు పద్దెనిమిదిన్నీ ఉపపురాణాదులు పద్దెనిమిదిన్నీ హృత్కవిలిగదా? ఇన్నిపురాణాలకీ కర్త వ్యాసులేనా? వేఱువేఱుగావున్నారా? అనేవిచారం యిప్పుడు పెట్టుకోవద్దు.

“పౌరాణికులు నీచులా” అను విషయాన్నే చర్చించుకుందాం. వ్యాసులవారు వేదాల ప్రచారానికి కొందఱు శిష్యులను వినియోగించారనిన్నీ పురాణ ప్రచారానికి సూతుణ్ణి నియోగించారనిన్నీ ఆ పురాణాలలోనే కనపడుతుంది. ఆ పురాణ వేత్తృత్వమే సూతుణ్ణి బ్రహ్మఋషిని చేసిందని వేఱే వ్రాయనక్కఱలేదు. అట్టి పురాణాదులయందు నీచత్వాన్ని ఎవ్వరాపాదిస్తారు? శాంతం పాపం. విధించిన బ్రహ్మహత్యా ప్రాయశ్చిత్తమే వేయినోళ్లతో ఘోషిస్తూవుంది. అట్టి పురాణాలను లోకులకు బోధించే సాహిత్య పరులు నీచులు అనడానికి యే ప్రాజ్ఞునికి నోరాడుతుంది. అసలు వేదార్థం చెప్పేవారికి

“శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా
 కల్పశ్చేతి షడంగాని వేదస్యాహు ర్మనీషిణః"

అనే షడంగాలున్నూ తెలిసి వుండాలి. ఈలాటి షడంగవేత్తలు యింకా కొంచెం శేషించి వున్నది మన ఆంధ్రదేశమే. అఱవదేశంకూడా ఆయీ భాగ్యంకలదే అని వినికి. భవతు. యిన్ని ప్రజ్ఞలు వున్నా పురాణాలు, చూడకుండా వేదార్థం చెప్పడాని కేమహావిద్వాంసుఁడేనా వుపక్రమిస్తే అప్పుడు ఆవేదం పాపం గడగడ వొణికిపోతుందఁట! ఆయీరహస్యం నేను ఆమహా విద్వాంసుల ముఖతః విన్నదేకాని స్వకపోలకల్పితం కాదు. అట్టి పౌరాణికులు నీచులు అని అపవదించడానికి యెవరికి వుంటుంది సాహసం. భారత  రామాయణాలు రెండూ పురాణాలు కావు. భారతం యితిహాసం, రామాయణం కావ్యం. వేదానికి కూడా అపౌరుషేయత్వాన్ని పలువురు వొప్పరని తెల్విడి. వాల్మీకి మొదటికవి, వ్యాసులు రెండోకవి.

“ఏనాతి ప్రియశిష్యుఁడా నాకు సంభవుం
 డటుమీఁది శిష్యుండు వ్యాసమౌని" (శ్రవణా)

వీరిద్దఱూకూడా యించుమించుపురాణకర్తలే. యిక తెలుగులోనికి వద్దాం. నన్నయ్య, తిక్కన్న, యెఱ్ఱన్న వీరుముగ్గురూ పురాణాంద్రీకరణం వల్ల పౌరాణికులే. లోకంలో ఆంధ్రదేశంలో యీత్రితయానికి వున్నగౌరవం యెవరికీ లేదుగదా? అట్టివారిని, నీచులుగా అపవదించే వారుంటారని నేననుకోను, వేయిమాటలెందుకు? పురాణాల యందు పూర్వకవులకెంత గౌరవం వున్నదీ పెద్దన్నగారి వాక్యమే తెల్పుతుంది.

(1) "అతుల పురాణాగమేతిహాసకథార్థ"

(2) "బ్రహ్మాండాది నానాపురాణ విజ్ఞాన నిరతు"

ఇందు రెండోది నన్నయ్యభట్టారకునిది, విస్తరమెందుకు? పురాణాలయందుఁగాని, పౌరాణికులయందుఁ గాని నైచ్యభావంకల ప్రాజ్ఞులున్నట్లు నేను ఎఱుగను నాకు పౌరాణికులయందు చాలా గౌరవభావమే వుంది. పురాణాలయందున్నూ చాలా గౌరవభావమే. కనుకనే దేవీభాగవతమును దెలిఁగించాను. దాన్ని యెవరేనా యెక్కడేనా పురాణం చెపుతూవున్నారంటే అది నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇతరులకుకూడా ఆలాగే అని నేను అనుకుంటాను. పౌరాణికులంటూ లేకపోతే సంస్కృత పురాణాలుగాని, ఆంధ్రపురాణాలుగాని బూజుపట్టిపోవలసిందే. సర్వేసర్వత్ర ఈ యిరవయ్యో శతాబ్దంలో అంతో యింతో అక్షరజ్ఞానం వుండడంచేత యెవరంతటవారు ఆయాపురాణాలు చదువుకుంటూ వున్నారుగాని యిప్పటికి కొంతవెనక కాలంలో పౌరాణికులే ఆయాచరిత్ర జ్ఞానానికిన్నీ వాట్ల వ్యాప్తికిన్నీ దిక్కు అట్టివారు నీచులని యెవరపవదించినా అది నేను వినలేను. వినినచో దుఃఖింతును. పౌరాణికునిద్వారా వ్యాప్తికి రావడం గ్రంథానికి న్యూనతాపాదకమే అయితే బట్టులద్వారా వ్యాప్తికి రావడం అంతకన్నా అధ్వాన్నం గావాలిగదా! చూడండీ శ్రీనాథుని చాటువు.

క. కవితాకన్యకు నలువురు
   కవి జనకుఁడు బట్టుదాది గణుతింపంగా
   నవరసరసికుcడె ధవుఁడగు
   నవివేకియె తోడఁబుట్టు వనవేమనృపా.

దీనిలో బట్టురాజులద్వారా ఆరోజులలో జరిగే కవితావ్యాప్తిని శ్రీనాథుఁడు తెల్పివున్నాండు. ఇప్పుడు అచ్చు రాఁబట్టి పూర్వపురీతిని వ్యాపించ నక్కఱలేదనుకోవచ్చును.

“నోటఁబడు తుంపురులేనియు నిప్పు
 డచ్చువచ్చినకతనన్ జగాన విలసిల్లెడి"

అయినా నాటకాలకు ప్రదర్శకు లేలాటివారో పౌరాణికులు పురాణాల కాలాటివారే. తఱచు పౌరాణికులు బీదవారుగా వుంటారు కనక నైచ్యాన్ని ఆపాదించవచ్చునందామా? సమ్మతమే. కాని ఆ పక్షంలో యీ దోషం పౌరాణికులకన్నా ముందుగా కవులకే తగులుతుంది కదా! నీచులు రచించినట్టున్నూ, నీచులు వ్యాప్తినందిస్తూ వున్నట్టున్నూ తేలుతుంది. అందుచేత ఆ హేతువుచే నైచ్యాన్ని ఆరోపించడం పొసఁగదు! ఆ దారిద్ర్యాన్ని కూడా మహాకవులు వొక ఆభరణంగానే అలంకరించుకున్నారు

(1) మాంతుభిక్షాటనమ్.

(2) శ్లో. నా౽స్మాకం శిబికా... విద్యానవద్యాస్తినః

(3) శ్లో. ఆరనాళగళ దాహశంకయా మన్ముఖా దపగతా సరస్వతీ.

కవులు దరిద్రులనడానికి మనహిందువులే కాదు ఆంగ్లేయులు, పారశీకులు లోనైనవారంతా వొప్పుకుంటారు. అంతమాత్రంచేత ఆ కవిరచనకు నైచ్యంరాదు. శ్లో. “భిక్షుణా కక్షనిక్షిప్తః కిమిక్షు ర్నీరసోభవేత్" -

అని పూర్వలే సమాధానమిచ్చియున్నారు. కవిరచనకు నైచ్యాన్ని సంఘటించేది గ్రంథంలో ప్రతిపాద్యమైన విషయంగాని, కవినిష్ఠదారిద్ర్యాదికం కాదు. కేవలమూ ప్రతిపాద్యాన్ని బట్టే గౌరవం రావడమూ కష్టమే. యిది మఱొకప్పుడు చూచుకుందాం. కవికి ఆగ్రహం కలిగి వ్రాసేవ్రాఁతలో కూడా ఔదార్యం వండాలి. అంతేకాని హేయ ప్రసంగం వుండకూడదు. తిడితే తిట్టినాఁడుగాని మృదువుగావుంది అని రసజ్ఞులు మెచ్చుకోవాలి. చంద్ర రేఖావిలాపంలా వుంటే అది హేయంగా కనపడుతుంది. ఈ విషయంలో దొరకకుండా వుండడం చాలాకష్టం. ప్రస్తుతం నాదృష్టిలో పౌరాణికులు గాని, పురాణాలుగాని, పురాణకర్తలుగాని, ఆంద్రీకర్తలుగాని, శ్రోతలు గాని వీరందఱూ పరమపూజ్యులుగానే తోస్తారు. వీరిని నీచులుగా పరిగణించి కవికవిత్వాన్కి నైచ్యాన్ని ఆపాదించేవారివూహ నాకు నచ్చక లేని వోపిక తెచ్చుకొని యీ నాలుగు మాటలూ వ్రాశాను. ఐశ్వర్యానికీ, కవిత్వానికీ ఎంతచుట్టఱికమో దారిద్ర్యానికీ, కవిత్వానికీ అంతే చుట్టరికం. ఒక్కొక్క కవివాణి వొక్కొక్కరికి నచ్చుతుంది. ఒక్కొక్కరికి నచ్చదు. భిన్న రుచిర్హి లోకః యెవ్వరికీ నచ్చనిదంటూ వుంటుందని నేననుకోను.

"లోకులరసనలె యాకులుగా నుండునట్టియవివో కవితల్" (కవికర్ణ)

ఈ వైభవం పట్టడం కష్టం. కేన్వాసింగు వల్లకూడా యీ వైభవం పట్టదు. దీనికికూడా సమర్ధనం భవభూతి చూపించాఁడు.

“ఉత్పత్స్యతే మమతుకోపి సమానధర్మా కాలోహ్యయం నిరవధిర్విపు లాచ పృథ్వీ" అన్నాఁడు. ఈవిషయం సహృదయైకగమ్యంగాని వైతండికులతో వాదించి తేల్చదగ్గదికాదు. తనమనస్సులో నొకటిపెట్టుకొని పైకినొకటి మాట్లాడువారు సహృదయు లెన్నటికిన్నీ కారు. విషయం విషయాంతరంలోకి దూకుతూవుంది. ప్రస్తుతం పౌరాణికులను గూర్చి కదా వుపక్రమించాను. వారు బీదవారే యగుదురుగాక. వారు నా దేవీభాగవతాన్ని పురాణం చెప్పి వ్యాప్తికి తేవడం నారచనకు గౌరవాపాదకమే. దానివల్ల నారచనకు నైచ్యంరాదని నానమ్మిక. ప్రత్యుత గౌరవమే. నారచనలో వ్యాకరణాది దోషాలుంటే అట్టిదోషం తగులుతుంది. దానికి పౌరాణికులు కారణంకాదు. నేను ఛందోమాత్ర పరిజ్ఞానంతో రచనకు దిగితే... "వ్యాకరణాదివిత్" అని వుండడంచేత అట్టిదోషం తగులుతుంది. కేవల లక్ష్యజ్ఞానం మీఁదగాని లక్షణ జ్ఞానం మీఁదనే గాని కవి ఆధార పడకూడదు. రెంటినీ అనుసరించాలి. అందులో లక్ష్యమే ప్రధాన స్థానానికి వస్తుంది. వ్రాస్తేచాలా వ్రాయాలి. కొంచెం దిక్ప్రదర్శనం చేస్తాను. శ్రీమాడభూషి వేంకటాచార్యులువారు (అభినవ పండితరాయలు) అక్షిభ్రువ అని ప్రయోగించారు. వారి సమకాలికులే బాగా కవిత్వం చెప్పేవారే 'చక్షుర్ర్భువ' అని ప్రయోగించారు. చక్షుః భూః, యీ రెండున్నూ కల్పితే అకారాంత యేలా అయిందని ఎవరో అడిగితే, యీయనకు వ్యాకరణం రాదు కనుక ఆచార్యులవారి 'అక్షిభ్రువ' అనే ప్రయోగాన్ని చూపించారు. (వైయాకరణాః పిశాచాః ప్రయోగమంత్రేణ నివారణీయాః) అయితే ఆరూపం పాణినీయ సూత్రం (అచతుర, చూ) లో నిపతించ బడివుంది గాని రెండోరూపం నిపతించబడి లేదు. కనక అక్షికిచక్షుః అని మాఱిస్తే ప్రాణం మీఁదకి వస్తుంది. ఆయీరహస్యాలు చిరకాల గురుశుశ్రూషా సాధ్యాలుగాన యితరధా యెంతటి బుద్ధిశాలులకున్ను అంకేవికావు. ఆయీచూపిన అక్షిభ్రువ - చక్షుర్భువ అనే రూపాలవల్ల కేవల లక్ష్యాధారంగా రచన సాగిస్తే నవ్వులపాలు కావలసివస్తుందని వ్యాకరించినట్లయింది. యింకోటి కూడా చూపి దీన్ని ముగిస్తాను. యీగోల యెందఱో మహాకవులకే చాదస్తంగా (తెలియక సుమండీ) కనపడుతుంది. పత్రికాపాఠకుల కీగోల రుచింపదని యెఱిఁగిన్నీ ప్రసక్తి కలగడంచేత జిజ్ఞాసువుల కుపకరిస్తుందని కొంచెం వ్రాస్తున్నాను. ఇంద్రాణి అంటే (ఇంద్రస్య - భార్యా) ఇంద్రుని భార్య. వితంతువు అనే అర్థం వేదపరిభాషగాని శాస్త్రతః వచ్చేదికాదు. దీన్ని గూర్చి (పల్లెటూళ్ల పట్టుదలలు చూ.) అన్యత్ర చిరకాలంనాఁడు వ్యాకరించాను. ఇంద్రుని పెళ్లాం ఇంద్రాణి అయినట్లే ఇంద్రవాచకమే అయిన శక్రపదానికి శక్రాణి అనే రూపాన్ని పుట్టిస్తే యేం జరుగుతుందో వైయాకరణులు చెపుతారు. అది కవులపనికాదు. అయితే రుద్రాణి, భవాని, శర్వాణి, మృడాని యీ నాలుగున్నూ శివుని భార్యను చెపుతాయి. ఇంద్రుని భార్యను చెప్పేది ఇంద్రాణి ఒక్కటే. శివుని భార్యను శివాని అనేపదంతో వాడితేనో యేముంది. యద్దేవా దేవహేళనమ్. యిందుకోసమే “ఛందోవ్యాకరణాదివిత్" అన్నారు. ప్రస్తుతానికి వద్దాం. నాదృష్టిలో పౌరాణికులు ఘనులు. నీచులుకారు. నీచత్వఘనత్వాలకు దారిద్ర్యం కారణం గాదు. పౌరాణికుల వల్లనే గ్రంథకర్తకు గౌరవప్రదమే. తన రచనవల్ల పలువురు జీవించడం కన్న గ్రంథకర్తకు కావలసిందేమిటి?

మా నాటకాలు ప్రదర్శించి తద్వారా పలువురు జీవిస్తున్నారని విని నేను సంతోషించేవాణ్ణి. మనదగ్గిఱ డబ్బూ దస్కమూ పుచ్చుకోకుండానే ప్రదర్శించడానికి మఱీ సంతోషం కలిగేది. యిటీవల ఆ ప్రదర్శకులవల్ల ప్రదర్శనానికి “యింత" అంటూ మాకు ఫీజు యివ్వడం కూడా జరుగుతూ వుంది. యిది నా మనస్సుకు అంతగా నచ్చుబాటు లేకపోయినా పుచ్చుకుంటూ వున్నాను. కాని వెనుకటికాలం వాళ్లకు హోటల్ పద్ధతిలాగే యిదీ నచ్చదు. యెవరి రచన పదిమంది విద్వాంసులు నిర్వ్యాజంగా చదువుకుంటారో ఆ రచనే అదృష్టవంతము. ఆరచయితే అదృష్టవంతుఁడు. అట్టిసుయోగము ఆ గ్రంథ నిష్ఠమైన రసాన్నిపట్టి ఉంటుంది. యీ సందర్భం ప్రబంధాలకి సంబంధించేమాట. పురాణకవిత్వం పదిమందీచదవడం తన్నిష్ఠమైన పుణ్యగాథలనిబట్టిగాని రచననుబట్టి మాత్రమే కాదు. పురాణ కవిత్వం చాలా భాగం అనాదిగా చేదస్తంగానే వుంటుంది; వున్నా పౌరాణికులు దాన్ని మన్నిస్తూనే వుంటారు. పౌరాణికులు పూజ్యులు, గౌరవనీయులు, నమ్యులు.

★ ★ ★