కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/వికటవిమర్శనం
వికటవిమర్శనం
కవుల కవిత్వాన్ని గూర్చి విమర్శించడం ఏలా వుండకూడదో తెల్పితే, యేలా వుండాలో తెల్పినట్టే అవుతుంది. కనక దాన్ని గురించి నాకు చేతనైనంతలో కొన్ని మాటలు వ్రాస్తాను. అయితే యీ విషయం చిరకాలంనాఁడే “అపూర్వ కవితా వివేచనం” అనే పేరుతో మాచేత తెల్పఁబడింది. యింకా కొన్ని వ్యాసాలలో కూడా తెల్పఁబడి వుంది. ఆకారణంచేత చర్వితచర్వణప్రాయమే అయినప్పటికీ, కవిలోక మూర్ధన్యుఁడైన కాళిదాసు గారి కవిత్వాన్ని గూర్చి వ్రాయడం గనక కొంత నూతనంగానే వుంటుందనుకుంటాను. యెందఱో కవులు యెన్నో కావ్యాలు వ్రాసినా కాళిదాసుకు వచ్చిన పేరుప్రతిష్ఠలు యెవ్వరికిన్నీ రాలేదంటే కాదనే వారెక్కడా వుండరు గదా! ఆ పేరుప్రతిష్ఠలకు కారణం ఏమిటో తెలిసిన వారు లోకంలో చాలా తక్కువగానే వుంటారు. నామట్టుకు నాకు నిన్న మొన్నటివఱకున్నూ కాళిదాసు కవిత్వం కంటే కూడా మణికొందఱు కవుల కవిత్వమందే ప్రీతివుండేది. కాని యెందఱో ప్రాజ్ఞులు మెచ్చుకొన్న కాళిదాసు కవిత్వాన్ని మెచ్చుకోకపోతే అవమానం వస్తుందనే భయంచేత నేను ఎక్కడా అన్యథాగా ప్రచారం చేసేవాణ్ణికాను. నేను మెచ్చుకొనే కవిత్వాలు యేలా వుండేవో? కొంచెం మచ్చుచూపి మఱీ ప్రస్తుతం వుపక్రమిస్తాను.
శ్లో. “ప్రాతరంబుజవిడంబిలోచనాం
మాతరం త్రిజగతా ముపాస్మహే
శీతరమ్య కరుణావలోకనై
ర్యా తరంగయతి మంగళాని నః"
యీ శ్లోకం శ్లేషయమక చక్రవర్తి శ్రీ వేంకటాధ్వరి లక్ష్మీసహస్రంలోనిది. యిందులో ప్రాతర మాతర శీతర యాతర అని యెంతో శ్రవణానందంగా నాలుగు చరణాలలోను వుండడం నాకు చాలా శ్రవణా నందంగా వుండేది. కాళీసహస్రంలో యీ మాదిరి కవిత్వాన్ని చెప్పడానికి కొంత ప్రయత్నించడం కూడా జరిగింది. యెంతవఱకు కృతార్థత్వం కలిగిందో చెప్పలేను. మొట్టమొదట సంస్కృత కవిత్వానికి ఆరంభించినప్పుడు కాళిదాసుగారి
శ్లో. "ద్వైపాయనప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళిచరణా"
శ్లో. "నాళీకజాద్యదితిజాళీ శిరఃకలిత మౌళి ప్రభాంచిత పదా"
అంటూ కొన్ని శ్లోకాలు యిష్టదేవత కాళికను గూర్చిన్నీ
శ్లో. "బాలం సమస్త జగదాలంబ మంబుధర నీలం బలారివినుతం."
అంటూ శ్రీకృష్ణ భగవానుణ్ణి గూర్చిన్నీ వ్రాసివున్నాం. కాని యెక్కడి కెక్కడ? యమకంలోకూడా కాళిదాసుగారి రచనలో కొంత చక్కనిభావం యిమిడివుంది. మా రచనలోనో? యే కొంచె మే మాత్రమో భావం వందేమో కాని అట్టిభావం లేదు సరిగదా! అట్టి సమాసకూర్పు సమేతమున్నూ లేనేలేదు. యీ సంగతి రచనాకాలంలో మాకు పొడకట్టలేదుగాని యిటీవల క్రమక్రమంగా పొడకడుతూ వచ్చింది. అయితే యీ రహస్యం యెఱుఁగనివారు చాలామంది మమ్మల్ని యీ రచనను పురస్కరించి ప్రశంసించడం కలదు. యెవరికోకాని యీ తేడాపాడాలు పొడకట్టవు. అందుచేతే "కోవేత్తి కవితాత్త్వమీశ్వరో వేత్తివానవా అన్నారు పెద్దలు. ప్రాచీనత్వ నవీనత్వాలు దీనికి కారణంగానైతే కొందఱు పెద్దలు చెపుతారుగాని దానికి కాళిదాసే వొప్పుకోలేదు. దీన్ని గూర్చి నారోజుల్లోనే అనుభూతమైన వొకసంగతిని చదువరుల వినోదార్థం వుదాహరిస్తాను. వొకరైల్వే స్టేషనువద్ద పెద్దవుద్యోగంలో వున్నవొక పంతులుగారు కూర్చుని వున్నారు. వారిదగ్గర వొకాయన వొక ప్రాచీన గ్రంథంలో వున్నశ్లోకాలు చదువుతూ అందుండే చమత్కారాన్ని వివరిస్తూ “యిలావుండాలి కవిత్వమంటేను. ఇప్పటికవిత్వాలు వెధవకవిత్వాలు” అనడానికి మొదలెట్టేసరికి, నాకేమో కొంతయిబ్బందిగా తోఁచి "అయ్యా! యిదెవరికవిత్వమండీ!" అంటూ మెల్లిగా ప్రశ్నిస్తూ సమీపానికిచేరి వకటిరెండు నిమిషాలు వారివెనకాల హంగుచేసి తర్వాత "అయ్యా మీరిప్పుడు మెచ్చుకుంటూవుండే కవికికూడా పూర్వం కొందఱుకవులు వుండి వుంటారుకదా! ఆ కవుల కవిత్వాన్ని మీవంటి ప్రాజ్ఞులెవరో యీలాగే పఠించి ఆనందించడం జరక్కపోదుగదా! ఆసమయంలో తాత్కాలికపు కవుల కవిత్వాన్ని మీలాగే నిందించడం జరిగే యెడల మీరిప్పుడు మెచ్చే కవి కవిత్వంకూడా "వెధవ కవిత్వ" పదానికి గురికావలసి వస్తుందేమో? ఆలోచించండీ!” అంటిని. దానితో ఆయనకు కోపమైతే వచ్చిందిగాని ఆకోపాన్ని ఆఁపుకొని “మీరెవ?” రంటూ నన్ను ప్రశ్నించారు. సమీపంలో వున్నవా రెవరో “ఫలానా" అని చెప్పారు. అంతటితో మాకూ మాకూ స్నేహభావం కుదిరింది. చెప్పొచ్చేదేమిటంటే? ప్రాచీన నవీనత్వాలు కవిత్వాన్ని మెచ్చడంలో లేశమూ కూడా వుపకరించవు. కాని సర్వసామాన్యంగా ప్రాచీనుల కవిత్వాన్ని అభినందించడమున్నూ నవీనుల కవిత్వాన్ని యీసడించడమున్నూ కనబడుతుంది. యెవరెన్ని వుదాహరణాలు చూపినా ఆ వ్యవహారం అమల్లో వుండేదే కాని పోయేదికాదు. యింకో వూళ్లో యింకో చమత్కారం జరిగింది. టూకీగా దాన్ని కూడా వుటంకిస్తాను. వొక ప్లీడరుగారుండేవారు. ఆయనకి యింగ్లీషురాదుగాని సంస్కృతంలో మంచి పాండిత్యం వుండేది. భాష్యత్రయశాంతికూడా చేశారు. సదాచార సంపత్తిలో కూడా అగ్రగణ్యులు. వేఱే చెప్పేదేమిటి? స్నానం చేసిన తర్వాత ఆయన బ్రాహ్మణేతరుణ్ణి చూస్తే మళ్లా స్నానం చేయవలసిందే. పార్టీలతో స్నానానికి పూర్వం యేం మాట్లాడేవారో అంతే. ఆయన కవులను మెచ్చడంలో వాడే మాటలుకూడా వకమాదిరిగా వుండేవి. భవభూతిని గూర్చి మెచ్చేటప్పుడు, “అమ్మ మొగుడు” అనిన్నీ కాళిదాసుని మెచ్చేటప్పుడు, “అమ్మమ్మ మొగుడు” అనిన్నీ అంటూవుండేవారు. చెప్పేదేమిటంటే? ఆయనకు నవీన కవిత్వం అంటే బాగున్నదేనా సరే తావన్మాత్రంచేత యీసడించడం అలవాటు. దానికి మేమొక వుపాయం చేశాం. యేమిటంటే? మా స్వంతకవిత్వంలోవే యేదో ప్రసక్తిలో కొన్ని వినిపించాం. “యిది యెవరి కవిత్వ?"మంటూ ఆయన పృచ్చచేశాఁడు. ప్రాచీన కవి పేరునే చెప్పడం జరిగింది. దానితో “అమ్మమొగుడు" పదంతో అభినందించడమున్నూ జరిగింది. అప్పటికి వూరుకొని వొకటి రెండు రోజులైనాక యథార్థాన్ని చెప్పి, ప్రాచీనత్వ నవీనత్వాలు కవిత్వ ప్రాశస్త్యానికి హేతువులు కావని కాళిదాసుగారన్న మాటలను స్మరింపఁజేసి వుభయులమున్నూ స్నేహభావంతో ప్రవర్తించాం. యింక యీ యితిహాసాలల్లోన్నుంచి ప్రధానాంశానికి వస్తున్నాను. సర్వోత్తరమైన కాళిదాసుగారి కవిత్వాన్ని నేను ఏదోమాదిరిగా అపవదిస్తాను. లోకం నన్ను క్షమించాలి. నేను చూపే ఆక్షేపణలు సరియైనవైతే కావుగానీ సామాన్యుల దృష్టికి సరియైనవే కాఁబోలును అనే భ్రాంతిని కలిగిస్తే కలిగిస్తాయేమో? నిశ్చయంగా చెప్పలేను. కథలోకి దిగుతూన్నాను. - రఘువంశం ప్రథమస్సర్గ 47 వ శ్లోకంలో -
“అపి లంఘిత మధ్వానం బుబుధే న బుధోపమః
అనివుంది. దిలీపమహారాజు వసిష్ఠాశ్రమానికి ప్రయాణమై వెడుతూ భార్యకు తోవలోవున్న ప్రకృతి చిత్రాలు చూపుతూ తాను అప్పటికి ఎంతమేర ప్రయాణం చేశాఁడో తెలుసుకోలేకపోయాఁడు అని వర్ణించాఁడు కాళిదాసు. అట్టి సందర్భంలో - “బుధోపమః" అన్న విశేషణం దిలీప మహారాజుకు వాడడం యెందుకో? ఆ విశేషణం లేకపోతే వచ్చేలోపమేమిటో? విచారించవలసివుంది. నా మట్టుకు ఆ విశేషణం కేవలం “చవైతుహి చమైతుహి" అనే మాదిరిగా తోస్తూవుంది. దానికి పాదపూరణంకంటే అతిరిక్తఫలం కనపడడంలేదు. వ్యాఖ్యాత యేదో సార్ధక్యం వున్నట్టయితే కొంత కష్టించి తేల్చాఁడుగాని అది అంత నచ్చుఁబాటుగా లేదు. దీని తరువాత శ్లోకంలో
"సదుష్ప్రాపయశాః ప్రాపదాశ్రమం శ్రాంతవాహనః"
“వాచమాదదే వదతాంవరః” (56 శ్లో)
“దిలీపుఁడు మాటాడెను" అనడానికి, "వాక్కును స్వీకరించెను" అని కాళిదాసు వ్రాశాఁడు. ఆదానమంటే స్వీకరించడం అర్థంకదా! స్వీకరించడమంటే? ప్రతి గ్రహించడమేనా కాదా? అయేయెడల ప్రతిగ్రహించడానికిన్నీ యివ్వడానికిన్నీ సంబంధం నియతంగా వుండాలి. కాళిదాసు యే తాత్పర్యంతో ఆ వాక్యం వ్రాశాఁడో? అలాటి అర్థం రాదుసరిగదా! బొత్తిగా లగించని అర్థం మఱొకటి వస్తూవుంది. యెవరో తనకు దానం చేస్తేవారి వాక్కును దిలీపుఁడు పరిగ్రహించాఁడనే అర్థం రాకుండా చేసేవారుం టారనుకోను. సహృదయత్త్వమంటూ వుంటేనో! “నచశంకావచోత్తరమ్.”
“గురుణా బ్రహ్మయోనీనా" (64 శ్లో)
శ్లో. "కింతు వధ్వాం తవైతస్యాం" (64 శ్లో)
యీశ్లోకంలో దిలీపుఁడు తన భార్య అయిన సుదక్షిణాదేవిని తన పురోహితుఁడైన వసిష్ఠమహామునికి కోడలుగా నిరూపించి మాట్లాడుతున్నాఁడు. దీనివల్ల వచ్చే దుర్వ్యంగ్యం యెంతోవుంది. దిలీపుని తల్లి వసిష్ఠుఁడికే దిలీపుణ్ణి కన్నదనే ధ్వని దుర్నివారంకదా! అక్కడక్కడ రాజకుటుంబాలకు సంతానలోపం తటస్థించినప్పుడు పురోహితులద్వారాగా ధర్మసంతానం కలిగించుకోవడం ప్రస్తుతధ్వనికి సహకారి కావడం తోడవుతుంది కూడాను. విచారిస్తే యింకో దురర్థంకూడా తీయవచ్చును. వధూశబ్దానికి కోడలనే అర్ధమే కాకుండా కేవలము స్త్రీ అని. అర్థం చెప్పేటట్టయితే నీ భార్య అని తేలుతుంది. పురుష వాచక శబ్దానికి స్త్రీ వాచకం అంటే స్త్రీ పర్యాయంతో సంబంధం కలిపినప్పుడు భార్య అనే వస్తుందిగాని మఱివకలాగు రాదు. యిది ప్రసిద్ధ విషయము గనక వుదాహరణా లక్కఱలేదు. ఆ యీ దురర్ధాలన్నీ కాళిదాసు లోపాలో? కావో? సహృదయులు విచారింపఁగలరు.
శ్లో. "...సుప్తమీన ఇవహ్రదః" (73 శ్లో)
యీ శ్లోకంలో కన్నులు మూసుకొని ధ్యానిస్తూవున్న వసిష్ఠుణ్ణి నిద్రపోతూవున్న చేఁపలు కల సరస్సుతో కాళిదాసు పోల్చివున్నాఁడు. వసిష్ఠుని నేత్రాలకున్నూ చేఁపలకున్నూ వుపమానం ధ్వనిస్తూవుంది. స్త్రీ నేత్రాలకు చేఁపలతో సామ్యం ప్రసిద్ధంగాని పురుషనేత్రాలకు ప్రసిద్ధంకాదు కనక యిది ఆక్షేపణీయంకాకపోదు. మఱిన్నీ చెడుకంపుతోవుండే చేఁపలతో పరమ పవిత్రంగా వుండే ఋషి నేత్రాలకు సామ్యం చెప్పడం బొత్తిగా వొప్పుకో తగ్గదికాదు. సహృదయులు విచారింతురుగాక.
శ్లో. "పురాశక్ర ముపస్థాయ" (75 శ్లో)
శ్లో. "వన్యవృత్తి రిమాం శశ్వదాత్మానుగమనే నగాం" (88 శ్లో)
యీ శ్లోకంలో గోవును అనుగమించడం వుపదేశించారు వసిష్ఠుల వారు. యీ అనుగమించడంకూడా కొంచెం అళ్లీలార్థానికి తోవతీస్తుందని నా ఆశయం. దానికి “వన్యవృత్తి" అనే విశేషణం కొంత సహాయం కూడా చేస్తుంది. నందినీధేనువు వన్యములైన గడ్డి వగయిరాలవల్ల జీవనం చేసేదే కనక నీవున్నూ వన్యములైన కందమూలాదులతో జీవనంచేస్తూ దాన్ని అనుగమించ వలసిందని వుపదేశించినట్లు తేలుతుంది. సహృదయులు బాగా ఆలోచింతురుగాక! యీ అర్ధంవల్ల తోఁచే అపార్ధాన్ని దీని తర్వాత శ్లోకం “వ్రస్థితాయాం" అనేది పూర్తిగా బలపఱుస్తుందని చెప్పనక్కఱలేదు. విస్తరభీతిచే దానికి దోషోపోద్బలకంగా వ్యాఖ్యానించి చూపలేదు.
శ్లో. “... విససర్జోర్జిత శ్రియం.” (63 శ్లో)
శ్లో. "నిశమ్యదేవానుచరస్యవాచం” (12 శ్లో)
యీ శ్లోకంలో “దేవానుచరస్య" అనేపదం యీశ్వరునికి నవుకరయిన సింహము అనే అర్థంలో కాళిదాసుచేత ప్రయోగింపఁబడింది. వ్యాఖ్యాతకూడా అలాగే వ్రాశాcడు. కాని యీసింహము నందినీ ధేనువుచేత కల్పించcబడ్డ సింహంగాని ఈశ్వరుని నౌకరుకాదు. దిలీపుని హృదయాన్ని పరీక్షించడానికి తానేమో ఈశ్వర భృత్యుణ్ణనిన్నీ తనపేరు కుంభోదరుఁడనిన్నీ తనకు యీ సింహాకారాన్ని యీశ్వరుఁడే అనుగ్రహించాఁడనిన్నీ మాయమాటలు చెప్పినది నందినీధేనువుచేత కల్పితమైన సింహమేకాని యీశ్వరభృత్యుఁడుకాఁడు. ప్రస్తుతవాక్యం కవివాక్యంగాని మఱివకటి కాదు. కవిచెప్పే వాక్యం యథార్థబోధకంగా వుండవలసింది. దిలీపునికి యిది కల్పిత సింహమని తెలియక పోవచ్చును గాని కవికి తెలియకపోవడం యెలాగ? యిది యిదివఱలో చేసిన శంకలవంటిది కాదని విజ్ఞులు కొన్ని వున్నప్పటికీ గ్రంథవిస్తర భయంచేత వాట్లను చూపలేదు. తృతీయసర్గలో,
శ్లో. "శ్రుతస్య యాయాదయ మంతమర్భకః"
అని రఘుమహారాజును గూర్చి గొప్ప విద్వాంసుఁడవుతాఁడనే అభిప్రాయంతోటే వ్రాసినప్పటికీ యిందులో మొదటిమాట వదిలిపెట్టి చదువుకుంటే అశ్లీలార్థానికి తోవతీస్తూవుంది. నామకరణ సందర్భంలో యీలాటివాక్యం ప్రయోగించడం యుక్తం కాదనుకుంటాను.
శ్లో. “మహోక్షతాం వత్సతరః స్పృశ న్నివ ద్విపేంద్రభావం కలభః శ్రయన్నివ" (32 శ్లో)
శ్లో. “హరేః కుమారో౽పి కుమారవిక్రమః" (55 శ్లో)
యిందులో మొట్టమొదట వున్న "హరేః" (దేవేంద్రునియొక్క) అనేపదం దగ్గిఱవున్న కుమారశబ్దంతో అన్వయించడం యుక్తంగాని, యొక్కడో దూరంగా మూఁడో చరణంలో వున్న “భుజే" అనేసప్తమ్యంతంతో అన్వయించడం యుక్తంకాదు. "పాఠక్ర మాదర్థక్రమో బలీయాన్" అనే న్యాయాన్నిబట్టి ఆలాఅన్వయిస్తామే అనుకున్నా దూరాన్వయదోషం తగిలి తీరుతుంది. కనక విస్తర మనవసరం. న్యాయంగా "హరేః" అన్న దాన్ని దగ్గిరగావున్న “కుమార" శబ్దంతో అన్వయించేయెడల రఘుమహారాజు దిలీపుని సంతానం కాక దేవేంద్రుని సంతనాం కావలసి వస్తుంది. దానితో సుదక్షిణాదేవి అహల్యవంటిది కావలసివస్తుంది. దానితో లోఁగడ సుదక్షిణాదేవికి ద్వితీయస్సర్గలో కాళిదాసువాడిన - "అపాంసులానాం ధురికీర్తనీయా" అన్న విశేషణం 'నేతిబీరకాయ' కావలసి వచ్చి కాళిదాసు గారికి స్వవచోవ్యాఘాతం తటస్థిస్తుంది. విజ్ఞులు విచారించవలసివుంటే విచారింతురుగాక-
శ్లో. "శరేణ శక్రస్య మహాశనిధ్వజమ్" (56 శ్లో)
యిందులో రఘుమహారాజు దేవేంద్రునియొక్క అశనిధ్వజాన్ని అంటే వజ్రాయుధ రూపమైన జెండాను బాణంతో కొట్టినట్టుగా కవి చెప్పి వున్నాఁడు. కాని అక్కడ 'శనిధ్వజం' అనే అర్థం ఝడితి స్ఫూర్తి కలిగి వుంది. దేవేంద్రుఁడి ధ్వజంమీఁద శని వుండడంవల్లనే రఘుమహారాజుకు లొంగిపోయినాఁడనే అర్ధాన్ని కలిగిస్తూ ఉండడంచేత రఘుమహారాజు పరాక్రమానికి రాఁదగ్గంత గౌరవం రాకపోవడమే కాక యింకా చాలా దోషాలు ప్రసక్తిస్తాయో? లేదో విజ్ఞులు విచారించాలి.
శ్లో. “సుదక్షిణాసూను రపి న్యవర్తత" (67 శ్లో)
యిందులో దిలీపపుత్రుఁడని చెప్పక తల్లిపేరు చెప్పడం లోఁగడ వుదాహరించిన దోషాన్ని కొంతబలపఱచినట్టయిందో? లేదో? విజ్ఞులు విచారించవలసివుంది.
శ్లో. “మనుప్రభృతిభి ర్మాన్యై రక్తా (7 వశ్లో 4 సర్గ)
యిందులో రఘుమహారాజుచే పరిపాలింపఁబడుతూవున్న భూదేవి యిదివఱలో యితని పూర్వులచే పరిపాలింపఁబడ్డప్పటికీ యితని విషయంలో కొత్తదానివలెవుంది. అని వర్ణించాఁడు. పూర్వుల పరిపాలనకంటే కూడా యీతని పరిపాలన చాలా బాగావుందనే తాత్పర్యంతోటే కాళిదాసు పైశ్లోకాన్ని వ్రాసి వున్నాఁడు, కాని, స్త్రీలింగసారస్యం వల్ల రాజుకున్నూ, భూమికిన్నీ భార్యాభర్తృభావం ధ్వనించడానికి లేశమున్నూ అభ్యంతరం లేదు కనక తన తండ్రి మొదలైనవారిచే అనుభవింపఁబడ్డ స్త్రీనియ్యేవే తానున్నూ అనుభవించడమనే దోషం తగిలి రఘుమహారాజులకు, 'అమ్మ మగఁడు. నాయనమ్మ మగఁడు' వగయిరా దోషాలను సంఘటిస్తుందనుకుంటాను. కుల క్రమాగతమైన రాజ్యపరిపాలనాన్ని ఆమోదించే రాజుల కందఱికీ యీ దోషం తగిలే తీరుతుంది. గనక యీ ఆక్షేపణ చేయఁగూడదంటారేమో? ఆక్షేపకులెవ్వరూకూడా మఱికొందఱికికూడా తగులుతుందన్నంతమాత్రంలో ఆక్షేపించడాన్నుంచి విరమించరు సరికదా! మీకు మఱీ మంచిది అలా తగలడమనికూడా జవాబు చెపుతారు. కాఁబట్టి విజ్ఞులు మార్గాంతరం విచారించాలి.
శ్లో. "కుంభయోనే ర్మహౌజసః" (21 శ్లో)
యిందులో అగస్త్యుఁడనే అర్థంయిచ్చే కుంభయోనిపదం కుంభమువంటి. అని ఉపమానపూర్వ పదకబహువ్రీహిగా చెప్పుకోవడంవల్ల అశ్లీలార్థం యిచ్చి తీరుతుంది. కుఱ్ఱ వాళ్లకు పాఠం చెప్పడంలో చాలాచిక్కు కలిగిస్తుంది కాఁబట్టి 'కుంభసూతేః’ అని సవరించాలంటాను.
శ్లో. “విశాంపతి ర్విష్టరభాజమారాత్ (3 వశ్లో - 5 సర్గ)
ప్రజా పాలకుఁడు అనే తాత్పర్యంతో యీ శ్లోకంలో వాడిన 'విశాంపతిః' అనే పదం దురర్థాన్ని కూడా యిచ్చేదిగా వుండడంచేత చింత్యం కాక తప్పదు. ప్రయోగాలు కావాలంటే -
శ్లో. “విడ్జాలసమవిడ్జాలం భాతి పెద్దాపురం"
ఇత్యాదులు పెక్కులు. యీలాంటి విమర్శన చేయకూడ దనియ్యేవే నా అభిప్రాయం గాని నిజంగా కాళిదాసుకవిత్వం దోషభూషితమని లేశమున్నూకాదు. అయితే యీవ్రాఁత - పాడువ్రాఁత - యెందుకు వ్రాశా? వంటారేమో? కాళిదాసాదులలో కూడా సహృదయత్వం లేనివారికి యిట్టి అపార్థాలు కనపడేటప్పుడు అస్మదాదుల మాట లెక్కేమిటి? అని చూపడానికే కాని వేఱుకాదు. కనక సహృదయులు నన్ను క్షమించాలి!!
★ ★ ★