కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/శిష్టావారి విశిష్టత్వం

శిష్టావారి విశిష్టత్వం

ఎట్టిదో నాకు గోచరించినంతలో కొంచెం వ్రాయవలసిన ప్రసక్తి కలిగింది. ఏ మహావ్యక్తిని గూర్చి వ్రాయవలసిన ప్రసక్తి కలిగిందో, ఆ వ్యక్తికిన్నీ నాకున్నూ సుమారు ముఫ్ఫై మూఁడేండ్ల కాలమునుండి గాఢమయిన పరిచయం వుంది. యీ పరిచయాని క్కారణం నేను బందరు (ప్రస్తుతం కాలేజీగా మాఱిన) హైస్కూలుకు తెలుఁగు పండితుఁడుగా వెళ్లడమే. వ్రాయఁదలఁచుకొన్న మహావ్యక్తిషడ్దర్శనీ పారగులు శ్రీ శిష్టానరసింహ శాస్త్రులుగారు. వ్రాసే వ్యక్తి యేదో మాదిరిని నాలుగు తెలుఁగు ముక్కలూ నాలుగు సంస్కృతపు చెక్కలూ కలగాపులగంచేసి నలుగురి నోళ్లల్లో ఎలాగో పడి పైకి వచ్చిన నేను. యెవరినేనా మెచ్చవలసివచ్చినా లేక యీసడించవలసివచ్చినా ఆవలివారిని యే విషయంలో ఆయా పనులకు గుఱిచేయవలసి వస్తుందో ఆయా విషయాలలో యీవలి వ్యక్తికి ఆవలివారిని మించిన పాండిత్యం వుండడం ఆవశ్యకం. అదిలేని పద్ధతిని మెచ్చిన మెప్పుగాని యీసడించిన యీసడింపుగాని విజ్ఞలోకం ఆదరించదు. ప్రస్తుతం యెవరిని గూర్చి నేను యీ అభినందనం వ్రాయవలసి వచ్చిందో ఆ నరసింహ శాస్రుల్ల గారికి ‘షడ్దర్శనాలయందున్నూ మహారాజాస్థానాలలో పరీక్ష యిచ్చి పొందిన సర్టిఫిక్కెట్లు వున్నాయి. నాకు ఆలాటి సర్టిఫిక్కెట్లు లేవు. నా ప్రధాన గురువు బ్రహ్మయ్య శాస్త్రుల్లుగారు మాత్రం షడ్దర్శనీవేది చర్ల బ్రహ్మయశాస్త్రి గురువరేణ్యుఁడు ధరాభరణ! మాకు" ఇత్యాదులు చూడఁదగు. దీనివల్ల నాకు- “సంధ్యావందనం నమ్మగురువు కిల్లా" అనే దోషం తొలఁగినట్లయిందే కాని ఆ మహావ్యక్తిని గూర్చి అభినందించే యోగ్యత కలగనే లేదు. యిట్టి స్థితిలో నేను బందరు శిష్యుల కోరికమీఁద యిటీవల షష్టిపూర్తి దరిమిలాను బందరుకు మూడోసారి తలవనితలంపుగా వెళ్లడం తటస్థించింది. వెళ్లిన మూఁడోనాఁడే అపారమైన పడిశభారంతో నలగడంవల్ల ఆంధ్రజాతీయ కళాశాలావరణంలో కూప కూర్మంవలె వుండవలసిన వాణ్ణయినాను. పలువురు ఆప్తులు రావడంలో శ్రీ శాస్త్రులుగారున్నూ దయచేయడం తటస్థించింది. వారు కొత్తగా రచించిన "ఇందిరాపరిణయం” అనే నాటకాన్ని నాకు యిస్తూ వారికి నాయందు వుండే అవ్యాజమైన ప్రేమకు స్ఫోరకంగా వుండే మాటలు వాక్రుచ్చినారు, ఆ మాటలు నేను “యథావద్వస్తు వర్ణనం” గానే జమకట్టుకొనే యెడల నాకు వుండే అధికారం యే యూనివర్సిటీకి కూడా వుండకపోవలసి వస్తుందని భయపడుతూన్నాను. యింకోటి : ఆలా నేను సంతోషించే పక్షంలో నావంటి అమాయకుఁడంటూ ప్రపంచకంలో లేకపోవలసి వస్తుంది కూడాను. అందుచేత నాశక్తిని గుర్తెఱిఁగినయ్యేవే నేను శాస్త్రుల్లుగారి కవిత్వాన్ని గూర్చి నాల్గు మాటలు వ్రాయవలసి వ్రాస్తున్నాను.

శాస్త్రుల్లుగారు తెలుఁగులోకూడా కొన్నిపొత్తములురచించియున్నారు. కాని ప్రస్తుతం నాకభిప్రాయార్థంగా యిచ్చింది సంస్కృత నాటకం. దీన్ని గూర్చి సంక్షేపరూపంగా భగవంతుఁడు తోపించిన అభినందనాన్ని మిక్కిలిగా క్రోడీకరించి వ్రాస్తున్నాను. సంస్కృత పత్రికకే పంపితే యెన్నో రెట్లు వ్రాయవలసిన నాటకమిది యనుట నిర్వివాదము. యీశాస్త్రుల్లుగారు ‘షడ్దర్శనీపారగు" లనేసందర్భాన్ని లోకంతోపాటు నేనున్నూ విశ్వసించేవాణ్ణే గాని, యేమాత్రమో కవనం అల్లఁగలరనే తప్ప సంస్కృతంలో యింతటి ధారాశుద్ధి గలవారనే విశ్వాసం నాకు యితః పూర్వంలేదు, లేనేలేదు. అందుక్కారణం వారిగ్రంథాలు నేను శ్రద్ధగా చదవకపోవడమే. వీరుకవులనే కాదు, మహాకవులని, అందులో ఆధునికుల పుంతలోనివారు కారని, యే మురారి మహాకవి ధారతోనో పోల్చతగ్గధార వీరిదని వీరి యిందిరా పరిణయం నాకుబోధించింది. యిట్టినిరాఘాటమైన ధారతో నిర్దుష్టంగా కవిత్వం చెప్పేవీరికి ప్రపంచకంలో కవులలో స్థానం యెందుకు లేకపోయిందా! అని సంశయం కలుగుతూవుంది. కాని శాస్త్రజ్ఞులెవరున్నూ కవులనిపించుకోడానికి చాలా అభిజాత్యం పెట్టుకుంటారనిన్నీ నాచిన్నప్పుడెఱుఁగుదును. శాస్త్రం చదువుకున్నవాళ్లంటే కవిత్వం చెప్పుకొనే వాళ్లకు యెంతోగౌరవం వుండటమున్నూ, కవిత్వం చెప్పేవాళ్లంటే శాస్త్రజ్ఞులకు యీసడింపున్నూ సర్వసామాన్య విషయాలే కాని నాచిన్న నాఁటికి కొత్తవికావు. అందులో తెలుఁగులో కవిత్వం చెప్పేవాళ్లంటే సంస్కృతపండితులు బొత్తిగా తోcటకూరలో పురుగువంతుగా చూడడం నేను అనుభవ సిద్ధంగానే యెఱుఁగుదును. యీ కారణం చేతనే మా పరమ గురువులు బ్రహ్మయ్యశాస్త్రులుగారికి జంకుతూ జంకుతూ చాటునా మాటునా మేము శాస్త్రాభ్యాసకాలంలో కవిత్వాన్ని సాగించేవాళ్లం. దానిక్కూడా వారు అంగీకరించేవారు కారన్నమాట. అందుకే మేము శాస్త్రవ్యాసంగానికి అడ్డుతగలని పద్ధతిని కవిత్వం చెప్పకోడానికి అభ్యనుజ్ఞ పుచ్చుకోవలసి వచ్చింది. ఆపద్ధతి కవిత్వమే మా ధాతురత్నాకరరచన. ప్రస్తుతం శిష్టాకవిగారు - కాదు, పండితుడుగారు - నిరాఘాట రచనాధురంధరులై వుండికూడా యేసంస్థానానికిన్నీ కవినని వెళ్లినట్లు కనపడదు. అప్పయ్య దీక్షితులంత వారిక్కూడా యీతలతిక్కవున్నట్టు- “పిళ్ళః కవిరహం విద్వాన్" అనే వాక్యంవల్ల స్పష్టపడుతుంది. పూర్వకాలంలో మాట నేను చెప్పలేనుగాని నావిద్యాభ్యాస కాలానికి కవి అనిపించు కోవడంకంటె పండితుఁడనిపించుకోవడమే గౌరవాపాదకమని నేను బాగా యెఱుఁగుదును. గద్వాలాదులలో కవికి పూర్ణసమ్మానం రు.12లు వార్షికం. శాస్త్రజ్ఞులకు పూర్ణసమ్మానం రు18లు వార్షికం. కవికి శాస్త్రజ్ఞులతోపాటు సమ్మానంలేదు సరిగదా, గాయకులతో పాటుకూడా సమ్మానంలేదు. యీ దురన్యాయాన్ని సహించలేకే వనపర్తి సంస్థానంలో- -

కıı గానమ్ముకన్న కవన - మ్మేనాఁడేనియును తక్కువే?

అంటూ నేను రాజుగారితో వివదింపవలసివచ్చింది. విషయం విషయాంతరంలోకి పోతూవుంది. ప్రస్తుతం మనకు ముఖ్యంగా కావలసింది, పండితులు కవిత్వాన్ని చెప్పినప్పటికి కవినామధారణకు లజ్జపడతారనే దియ్యేవే. షడ్దర్శనీవేత్తలుగావున్న మన శిష్టాశాస్త్రుల్లుగారు కూడా ఈకారణాన్ని పురస్కరించుకొనియ్యేవే “కలౌషష్టి" అతిక్రమించే వఱకున్నూయేచిల్లర మల్లరలో తప్ప పుస్తకరూపంగా యేవిషయాన్నీ ప్రచురించినట్టు లేదనుకుంటాను. ఆ మధ్య కాళిదాసకృత మేఘసందేశాన్ని ఆంద్రీకరించి నట్లెఱుఁగుదును. దానివల్ల వీరు బాల్యాదారభ్యా అభ్యసించినవిద్య సంస్కృతమైనా, ఆంధ్రంమాతృభాష అనే హేతువుచేతో, కాలేజీలో ఆంధ్రాని క్కూడా వీరు వుపాధ్యాయులుగా వుండవలసి వచ్చో, దానిలో కూడా కృషి చేసినట్లు విస్పష్టమే. వీరి కవితాధార ఆంధ్రంలో కూడా ధారాళంగానే నడుస్తుంది. అయితే వీరి ఆంద్రీకరణానికి లోకంలో తగినంత వ్యాప్తి కలిగిందా అంటే మాత్రం తగిన జవాబు లేదు. శాకుంతలాంద్రీకరణానికి వీరేశలింగం పంతులవారికిన్నీ మేఘసందేశాంద్రీ కరణానికి వ -సు. రాయుఁడు గార్కిన్నీ కొంత పేరు వచ్చినట్లు లోకంవల్ల తెలుస్తుందే కాని తక్కిన వారి కెవరికిన్నీ అంతటి అదృష్టం పట్టినట్లు కనపడదు. అంతమాత్రంచేత వారివారి ఆంద్రీకరణాలు వ్యర్థాలనడానికి వలనుపడదుగదా? ఇంతటి మహాశాస్త్రవేత్త కవి కావడమే దుర్ఘటం, ఆ కావడంలో సంస్కృతంలో అయితే కావచ్చుఁగాక దేశభాషలోకావడం మిక్కిలి అభినందనీయం. యిది హరినాగభూషణంగారి వంటి మహాగాయకుcడు, లేదా శిరోమణి పనిపడితే గజ్జకట్టి నారాయణదాసువలె హరికథాకాలక్షేపం చేయడం వంటిది. వెనక శ్రీ శిష్టు కృష్ణమూర్తిగారు వేదం వచ్చి, వేదాంగములున్నూ వచ్చి ఉభయ భాషా కవియై కులవిద్యయైన వీణలో అఖండుఁడై, సన్నాయి కూడా వాయించుట డోలు కూడా వాయించుటవంటిదిగా భావించవలెను. వెనుక శ్రీమదహోబల శాస్త్రుల్లుగారు శ్రీ చింతామణి గణపత్యుపాసకులు కాశీలో చెప్పులు కుట్టుటలోకూడా పాండిత్యమును కనపఱచి తజ్జాతీయునిచే సర్టిఫికెట్టు పుచ్చుకొన్నట్లు గురువులవల్ల విన్నాను. యాయన ఆంధ్రుఁడు. కాశీలో నెల్లపండితులను జయించి “కాశ్యా మేకః కాశినాథో౽వశిష్ట" అని విరమించినట్లు వినికి. కాశీలో విద్యార్థులు నేఁటికిన్నీ యేటేటా పూజించే గణపతి యీ శాస్త్రులుగారు ప్రతిష్ఠించిన దైవతమే. ఆ పూజ ఆంధ్ర విద్యార్థుల యాజమాన్యం మీఁదనే మా విద్యార్థి దశ వఱకున్నూ జరిగేది. బహుశః యిప్పుడుకూడా డిటో ప్రకారమే జరుగుతూ వుందనుకుంటాను. మన ఆంధ్రులలో కాశీని కూడా వకమూలకు తెచ్చిన విద్వాంసులుండేవారని పయిసంగతి సాక్ష్యమిస్తుంది. నిన్న మొన్నటిదాఁకా సజీవులైవున్న శ్రీ మహామహోపాధ్యాయ భట్టాచార్య గంగాధర శాస్త్రుల్లుగారు కూడా ఆంధ్రులే. ఇట్టివారు బహుమంది మన ఆంధ్రులలోవున్నారు. ఆకాలంలో వేదశాస్త్ర శ్రౌతాలల్లో వ్యాసంగం చేసి లోకాతీతులనే పేరు పొందేవాళ్లుండేవారు. ఈ కాలంలో రాజకీయ భాషల్లో పాండిత్యం సంపాదించి ఖండాంతరాల్లో మహా మహోపాధ్యాయ స్థానాన్ని అలంకరిస్తున్నారు. ఉదాహరణం లేక ప్రథమోదాహరణం, శ్రీ రాధాకృష్ణన్. శ్రీ శిష్టాశాస్త్రుల్లుగారు బందరువారు కాకపోయినా కొంచెం పైకి వచ్చింది మొదలు తమ పాండిత్యాన్ని బందరుకే వినియోగించిన కారణంచేత బందరు పౌరులు వీరిని శ్రీయుతులు నాదెళ్ల పురుషోత్తమ కవివతంసునితోపాటు తమవారినిగా పేర్కొని గర్వపడుటకు శంకింపనక్కరలేదు. పురుషోత్తమ కవిగారు గురు శుశ్రూషవినాగా అనేకవిద్యలలో నాఱితేఱిన ప్రజ్ఞావిశేషమును సంపాదించుటయేకాక దానినంతటినీ పట్టణవాసులకొఱకు నిర్వ్యాజముగా నుపయోగించిన విద్యా వయోవృద్ధులు. “ప్రినిసిపల్డుమేన్” అనే యింగ్లీషుభాషావాదుల టైటిల్సుకు వీరు ప్రథమోదాహరణం కాఁదగ్గవారు. నరసింహశాస్త్రులు గారు “తప్పించుక తిరుగువాఁడు ధన్యుఁడు సుమతీ" అనే మాదిరివారు. వీరు చాలాభాగం తమతండ్రి శ్రీ సీతారామశాస్త్రులవారి యొద్దనే విద్యాభ్యాస మొనర్చినట్లు వ్రాసుకొని యున్నారు. ఆశ్లోకమునుదహరిస్తాను.

శ్లో. విద్వన్మత్తేభపంచాననబిరుదధరో దక్షిణస్యాం తథైంద్ర్యాం
    భూయష్షట్కృత్వ ఊరీకృత నిగమశిరోరత్న భూషాకలాపః
    శ్రీ సీతారామ విద్వద్గురు చరణసమారాధనావా౽ప్తవిద్యో
    వ్యద్యోతిష్టా౽ష్టదిక్షుస్వయ మతులయశా శ్శిష్టవంశ్యో నృసింహాః|

యీ సీతారామ శాస్త్రులవారి సాహిత్యం మిక్కిలి సుప్రసిద్ధం. వీరు కేవలసాహితీపరులు మాత్రమేకారు. వీరివల్ల ప్రస్థానత్రయశాంతి చేసిన వారెందఱో కలరు. సదరు శాస్త్రులవారి దర్శనం నేను గుంటూరులో చేసివున్నాను. మాటలాడడంలోకూడా యీశాస్త్రుల్లుగారు బహు చమత్కారులు. వీరు వార్ధక్య దశలోకి వచ్చారనే కారణంచేత గుంటూరుకాలేజీ ప్రిన్సిపాలు “వుల్లు దొరగారు రిటైరు కావలసిందని చెప్పడానికి పూర్వరంగ ప్రశ్నగా “శాస్త్రుల్లుగారూ? మీకెన్నియేళ్లు" అని అప్పుడప్పుడు అడుగుతూ వచ్చేవారఁట. దానికి సీతారామ శాస్త్రుల్లుగారు తడుముకోకుండా "తొమ్మిదేళ్లు" అనే చెపుతూ వుండేవారఁట. కొంచం తెలుగు మాట్లాడడం చేతనైన సదరు ప్రిన్సిపాల్ “వుల్లు గారు” “వాటీజ్ దట్" అని తనలో తానే ముసిముసినవ్వులు నవ్వుకొని వూరుకునేవారఁట! తుట్టతుదకువకనాఁడు ప్రిన్సిపాల్‌గారు గట్టిగా నిర్బంధించి అడిగేటప్పటికి- "తొమ్మిదేళ్లంటే అఱవై మూఁడేళ్లు" అని సమాధానం చెపితే దొరగారు చాలాసంతోషించి మళ్లా కొన్నాళ్లు వుండడానికి ఆర్డరు ప్యాసుచేశారఁట. ఆ శాస్త్రుల్లుగారి వాక్చాతుర్యాన్ని వర్ణించవలసివస్తే చాలాగ్రంథం పెరుగుతుంది. దీన్ని బట్టి మనకథానాయకుఁడు నరసింహ శాస్త్రుల్లుగారి వంశం అనాదిగా విద్యావంశమని మనం సంతోషింపవచ్చు. కథానాయకుని కుమాళ్లలో కొందఱు ప్లీడర్లుగానూ, కొందఱు ఉపాధ్యాయులుగానూ వున్నారు. విమర్శనాలు వగైరాలలో పాల్గొన్నవారున్నూ వీరిలో వున్నారు. వాగ్భంధం బ్రహ్మాస్త్రం మొదలైన పేళ్లతో అవి అచ్చయి వున్నాయి. మొత్తం శాస్త్రుల్లుగారికి సర్వైశ్వర్యాలున్నూ ఫలించాయన్నమాట. తుదకు "నాటకాంతం కవిత్వమ్” అనే అభియుక్తోక్తి సార్ధక పడేటట్టు యీ “ఇందిరాపరిణయ” నాటకాన్ని రచించారు. ఇది సముద్రమథనంతో ప్రారంభమయింది. నృసింహావతార కథతో పరిసమాప్తి చేశారు.

శ్లో. ఛన్నం వ్యోమతలం విమాననిచయై రభ్రైరివ ప్రావృషి
    శ్రావ్యాదిక్షు చరంతిదుందుభిరవా వర్షాసు నిర్హ్రదవత్
    విద్యుత్పజ్తినిభాశ్చరంతి వనితా దివ్యాఃప్రియై స్పైరితో
    బ్రహ్మా౽ండం నిరవద్య మద్య లలితం పాణిగ్రహే శ్రీహరేః.

ఉదాహరించిన శ్లోకద్వయం వల్లనే గ్రంథకర్త ధారాశుద్ధి యెట్టిదో విజ్ఞులు గురుతింపగలరు. యెంతపరిశీలించినా పాదపూరణార్థకములైన చ. వై. తు. హి. న. లోనగునవి కనపడవు. సుబంధు మహాకవి యే మన్నాఁడు!

“సత్కవికావ్యబంధఇవ, అనవబద్ధతుహినః"

అన్నాఁడు. యేసందర్భంలో? వసంతర్తు వర్ణనా సందర్భంలోనో, లేక గ్రీష్మర్తు వర్ణనా సందర్భంలోనో, ఋతుపక్షంలో మంచువుండదని గ్రహించుకోవాలి. మఱివక శ్లోకంకూడా చూపుతాను.

శ్లో. కీరాః కోరకితేషు కల్పతరుషుప్రారబ్దవేదాక్షరా
    వాతా శ్చందనవాటి కాంగణచలద్గంగా౽౽పగాంభ స్పృశః
    కించైతే విరువంతి పంచమరవం చూతేషు పుంస్కోకిలాః
    కుంజేషు ప్రతిబద్ధఝంకీతిరవా ధావంత్యమీ షట్పదాః,

నేను ఉదాహరించిన శ్లోకాలేవీ, ఆలోచించి వెదకి వుదాహరించినవి కావు. యెక్కడపట్టినా ధార అనర్గళంగానే నాబుద్ధికి కనపడుతూ ఉంది. అందుచేత గ్రంథమంతా నాకుధారాశుద్ధికి వుదాహరణంగానే కనపడుతూవుంది. యిందు మిక్కిలీ సులభంగా వేదాంతబోధ సాధించఁబడింది. హరి హర వైషమ్యము లేకుండా కథావస్తువు కల్పింపఁబడింది. తెలుఁగుపత్రికలో యింతకన్న శ్లోకాలు వుదాహరిస్తే వ్యాసము చేదస్తపు తరగతిలోనికి చేరవలసివస్తుంది. అయితే యీనాటకంలో శాబ్దికదోషాలేమీ లేనేలేవా? అని పురోభాగులు ప్రశ్నిస్తారేమో? వున్నాయి. లేకపోలేదు. కాని అవి అచ్చుపొరపాట్లున్నూ కావు. గ్రంథకర్తగారి వ్రాతలోనే ఆపొరపాట్లు పడివున్నాయి. ప్రాచీన పండితులందఱున్నూ వ్రాయడం అలాగే వ్రాస్తారు. యీ అంశం తాటాకు గ్రంథాలు పరిశీలిస్తే స్పష్టపడుతుంది. దాన్నివారి పాండిత్యలోపం క్రింద పరిగణించుకోవడం ప్రాజ్ఞ లక్షణంకాదని నా తలంపు. మాముత్తాతగారి స్వదస్తూరి పుస్తకాలలో వారి పేరు నృసింహశాస్త్రుల్లు అనే వ్రాయఁబడివుంది. అంతమాత్రంచేత ఆయనకు సింహశబ్దవ్యుత్పత్తి తెలియదని యెట్లనుకునేది? యిట్టివితప్ప పనిపడితే నిల్వతగ్గవి కనపడలేదు. ఒక్కటికాఁబోలు నాకు ప్రష్టవ్యంగా కనపడింది. తీరా దాన్ని బయటపెడితే “ఫణిపయితాహే - కణపయితాహే" అన్న మాదిరిగా యేంజవాబు వస్తుందో అని భయపడి వూరుకున్నానని విజ్ఞులకు విన్నవించుకుంటాను. మఱిన్నీ వీరియింటిపేరే కొంచెం మార్పుతో మఱివకటివుంది. అది శిష్ట్లా, యింకొకటివుంది, అది శిష్టు, ప్రస్తుతం మనంమాట్లాడుకున్నది శిష్టావారినిగూర్చి శిష్టువారినిగూర్చి యింకొకసారి వ్రాస్తాను. ఆవ్రాసేటప్పడే తాటితో దబ్బనంగా పిండుప్రోలు వారున్నూ వస్తారు. మాప్రాంతంలో వీఱిద్దఱికీ సంబంధించిన కథలు చాలా వున్నాయి. కొన్నిటిని శ్రీగురజాడ రామమూర్తి పంతులుగారు కవిజీవితములు అనే చరిత్రగ్రంథంలో యెత్తుకున్నారు. ఇంకాకొన్ని పల్లెటూళ్లల్లో పెద్దలవల్ల నేను విన్నవున్నాయి. మఱొకప్పుడు వ్రాస్తాను. ప్రస్తుతం శిష్టావారికి నమస్కరిస్తూ దీన్ని ఆపుతున్నాను.


★ ★ ★