అధ్యాయం : 45

బెంగాలీ “ఆనందమయి మాత”

“నిర్మలాదేవిని ఒక్కసారి చూడకుండా మాత్రం ఇండియా నుంచి వెళ్ళకండి. ఆవిడ భగవద్భక్తి గాఢమైనది. ‘ఆనందమయి మా’గా ప్రసిద్ధి పొందారావిడ.” మా మేనకోడలు అమియా బోస్ నిండు మనస్సుతో నావేపు చూస్తూ అన్నది.

“అలాగే! ఆ సాధ్విని తప్పకుండా చూడాలని నాకూ మనస్సులో ఉంది,” అంటూ ఇంకా ఇలా అన్నాను: “దైవసాక్షాత్కార సాధనలో ఆవిడ చేరిన ఉన్నతస్థితిని గురించి చదివాను. కొన్నేళ్ళ కిందట ‘ఈస్ట్-వెస్ట్’ పత్రికలో ఆవిణ్ణి గురించి ఒక చిన్న వ్యాసం వచ్చింది.

“ఆవిణ్ణి నేను దర్శించుకున్నాను,” అంటూ ఇలా చెప్పింది అమియా; “ఆవిడ ఈమధ్య మా ఊరు- జెంషెడ్‌పూరు వచ్చారు. ఒక శిష్యుడి విన్నపాన్ని మన్నించి ఆనందమయి మాత, అవసాన దశలో ఉన్న ఒకతని ఇంటికి వెళ్ళారు. ఆవిడ అతని మంచం దగ్గర నించున్నారు; అతని నుదుటి మీద చెయ్యి వేసేసరికి అతని మరణవేదన అంతమయింది; వెంటనే జబ్బు మాయమయింది; తన ఆరోగ్యం మెరుగవడం చూసి ఆశ్చర్యపోతూ ఆనందించాడతను.”

కొన్నాళ్ళ తరవాత ఆనందమయి మాత, కలకత్తాలో భవానీపూర్ పేటలో ఒక శిష్యుడి ఇంట్లో బసచేశారని విన్నాను. వెంటనే నేనూ, శ్రీ రైటూ కలిసి కలకత్తాలో మా నాన్నగారి ఇంటిదగ్గర్నించి బయలు దేరాం. మా ఫోర్డు కారు భవానీపూర్ ఇంటికి చేరువవుతూ ఉండగా, నా మిత్రుడూ నేనూ, వీధిలో ఒక అసాధారణ దృశ్యాన్ని గమనించాం.

ఆనందమయి మాత, టాపులేని ఒక కారులో నించుని ఉంది. ఆవిడ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్టుంది. శ్రీ రైట్ కొంచెం దూరంలో మా ఫోర్డు కారు ఆపి, ఆ ప్రశాంత జనసమూహం దగ్గరికి నాతో బాటు నడిచి వచ్చాడు. ఆ సాధ్వి మా వేపు చూసింది; కారులోంచి దిగి మా వేపు వచ్చిందావిడ.

“బాబా, వచ్చేశావా!” అంటూ (బెంగాలీలో) ఉత్సాహాతిరేకంతో పలికి, నా మెడచుట్టూ చేతులు వేసి నా భుజం మీద తల ఆనించింది. ఆ సాధ్విని నేను ఎరగనని అంతకుముందే నేను శ్రీ రైట్‌కు చెప్పి ఉండడం చేత, ఈ అసాధారణ స్వాగత ప్రకటన చూసి బ్రహ్మాండంగా ఆనందిస్తున్నాడతను. వందమంది శిష్యుల కళ్ళు, ఆప్యాయత వెల్లివిరుస్తున్న ఆ దృశ్యం మీదే నిలిచిపోయాయి.

ఆ సాధ్వి ఉన్నత సమాధి స్థితిలో ఉన్నదన్న సంగతి నేను తక్షణమే గమనించాను. స్త్రీగా తన బాహ్యదేహం మీద స్పృహలేని ఆ సాధ్వి, తాను మార్పులేని ఆత్మనని ఎరుగును; ఆ స్థాయినుంచి ఆవిడ, మరో దైవభక్తుణ్ణి ఆనందంగా పలకరిస్తోంది. చెయ్యి పట్టుకుని నన్ను తన కారులోకి తీసుకువెళ్ళిందావిడ.

“ఆనందమయి మా, మీ ప్రయాణానికి ఆలస్యం చేస్తున్నాను!” అని నేను అభ్యంతరం చెప్పాను.

“బాబా, కొన్ని యుగాల తరవాత మళ్ళీ ఈ జన్మలో మొట్టమొదటి సారిగా నిన్ను కలుసుకుంటున్నాను!”[1] అన్నదామె. “అప్పుడే వెళ్ళిపోకు.”


కారు వెనకసీట్లో కూర్చున్నాం ఇద్దరం. కాసేపట్లోనే ఆనందమయి మాత నిశ్చల సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆమె సుందరనయనాలు అర్ధనిమీలితాలయి ఊర్ధ్వలోకాభిముఖంగా నిలకడగా నిలిచిపోయాయి. సమీప దూరాల్లోగల ఆంతరిక స్వర్గరాజ్యంలోకి చూస్తున్నాయవి. “జయ జయ జగజ్జననీ!” అంటూ మెల్లిగా జోహార్లు పలికారు శిష్యులు.

నేను భారతదేశంలో దైవసాక్షాత్కారం పొందిన పురుషుల్ని చాలా మందిని చూశాను; కాని అటువంటి ఉన్నతస్థితి నందుకున్న సాధ్విని అంతకుముందు ఎన్నడూ చూడలేదు.

ఆమె కోమల ముఖమండలం అనిర్వచనీయమైన ఆనందంతో మరింత మెరుస్తోంది; ఆమెకు ఆనందమయి మాత అన్న పేరు రావడానికి కారణం అదే. ముసుగు వేసుకోని తలకు వెనకాల విరబోసిన పొడుగాటి నల్లటి జుట్టు వేలాడుతోంది. ఎప్పుడూ తెరుచుకొనే ఉండే ఆమె జ్ఞాన నేత్రానికి గుర్తుగా నుదుట ఎర్రటి గంధంబొట్టు ఉంది. చిన్న ముఖం, చిన్న చేతులు, చిన్న కాళ్ళు- ఆమె ఆధ్యాత్మిక పరిమాణానికి విరోధా భాసంగా ఉన్నాయి!

ఆనందమయి మాత సమాధి స్థితిలో ఉండగా, పక్కనున్న శిష్యురాలిని కొన్ని ప్రశ్నలు వేశాను.

“ఆనందమయి మాత భారతదేశంలో విరివిగా ప్రయాణాలు చేస్తారు; ఆవిడకి అనేక ప్రాంతాల్లో వందలకొద్దీ శిష్యులున్నారు,” అని చెప్పింది శిష్యురాలు. “ఆవిడ సాహసించి చేసిన ప్రయత్నాలవల్ల వాంఛనీయమైన సంఘ సంస్కరణలు చాలా వచ్చాయి. ఆవిడ బ్రాహ్మణి అయినప్పటికీ కులభేదా లేవీ పాటించరు. ఆవిడకు జరగవలసిన సదుపాయాలు చూస్తూ మేము కొంతమందిమి, ఆవిడతోబాటు ప్రయాణాలు చేస్తూ ఉంటాం. మేము ఆవిణ్ణి తల్లిలా సాకాలి; ఆవిడకి ఒంటిమీద ధ్యాస ఉండదు. ఎవరూ పెట్టకపోతే అన్నం తినరు; అడగనూ అడగరు, ఆవిడ ముందు అన్నం పెట్టినా కూడా ముట్టుకోరు. ఆవిడ ఈ లోకంలోంచి అదృశ్యం కాకుండా చూడ్డం కోసం, శిష్యురాళ్ళం మేమే మా చేతులతో తినిపిస్తాం. తరచుగా ఆవిడ, వరసగా కొన్ని రోజులపాటు దివ్య సమాధిలో ఉండిపోతారు; ఊపిరి ఆడడమే అరుదు; కళ్ళు రెప్పవాలకుండా ఉండిపోతాయి. ఆవిడ ముఖ్య శిష్యుల్లో ఒకరు, ఆమె భర్త. చాలా ఏళ్ళ కిందట, వాళ్ళ పెళ్ళి కాగానే, ఆయన మౌనవ్రతం పట్టారు.”

పొడుగాటి జుట్టూ జీబురు గడ్డమూ విశాలమైన భుజాలూ చక్కని అంగసౌష్ఠవమూ గల ఒకాయన్ని చూపించిందా శిష్యురాలు. గుంపు మధ్యలో ప్రశాంతంగా నించుని ఉన్నారాయన; భక్తితత్పరత చూపే శిష్యుడి మాదిరిగా చేతులు జోడించుకొని ఉన్నారాయన.

అనంత ఆనందసాగరంలో ఒక్కసారి మునిగి పునర్నవం చెందిన ఆనందమయి మాత, ఇప్పుడు తన చేతనను భౌతిక ప్రపంచం మీద కేంద్రీకృతం చేస్తోంది.

“బాబా, నువ్వెక్కడ బస చేశావో చెప్పు.” ఆవిడ కంఠస్వరం స్పష్టంగా, శ్రావ్యంగా ఉంది.

“ప్రస్తుతం కలకత్తాలోనో, రాంచీలోనో; కాని త్వరలో తిరిగి అమెరికా వెళ్ళిపోతున్నాను.”

“అమెరికాకా?”

“ఔనమ్మా. ఆధ్యాత్మిక అన్వేషణ సాగించేవాళ్ళు భారతీయ సాధ్వీమణిని చిత్తశుద్ధితో మెచ్చుకుంటారు. నువ్వు కూడా వస్తావా?”

“బాబా తీసుకువెడితే వస్తా.” ఈ సమాధానంతో, దగ్గరున్న శిష్యులు గాభరాపడుతూ ముందుకు వచ్చారు.

“మేము ఇరవై మందికి పైగా ఎప్పుడూ ఆనందమయి మాతతో ప్రయాణం చేస్తూ ఉంటాం,” అని దృఢంగా చెప్పారొకరు. “ఆవిడ లేనిదే మేము బతకలేం. ఆవిడ ఎక్కడికి వెడితే అక్కడికి మేమూ వెళ్ళవలసిందే.”

ప్రయాణికుల సంఖ్య దానంతట అది పెరిగిపోయే ఇబ్బంది ఎదురయినందువల్ల, మనస్సు పీకుతూనే ఉన్నా, నా ఆలోచనను విరమించుకున్నాను!

“కనీసం రాంచీ అయినా రావాలి, శిష్యులతో,” అన్నాను ఆ సాధ్విదగ్గర సెలవు తీసుకుంటూ. “నువ్వే ఒక దివ్య శిశువువయినందువల్ల నా విద్యాలయంలో ఉన్న పిల్లల్ని చూసి ఆనందిస్తావు.”

“బాబా ఎప్పుడు తీసుకువెడితే అప్పుడు సంతోషంగా వస్తాను.”

తరవాత కొంత కాలానికి రాంచీ విద్యాలయానికి, ఆ సాధ్వి ఆగమన సందర్భంగా పండుగ కళ నచ్చింది. ఆ పండుగరోజు కోసం ఎంతగానో కాసుకొని ఉన్నారు కుర్రవాళ్ళు - పాఠాలు లేవు; గంటలకు గంటలు ఎడతెరిపిలేకుండా సంగీతం; దానికి రసపట్టుగా ఒక విందు!

“జయ్! ఆనందమయి మా కీ జయ్!” ఆ సాధ్వీమణి బృందం విద్యాలయ ద్వారంలో అడుగుపెడుతూ ఉండగా, ఉత్సాహం ఉరకలు వేస్తున్న అనేక పసిగొంతుల్లో ఈ నినాదం మోగిపోయింది. బంతిపూల వాన, తాళాల చప్పుళ్ళు, నిండుగా పూరించిన శంఖాలు, మద్దెలల మోతలు! ఆనందమయి మాత చిరునవ్వు చిందిస్తూ, పరుచుకున్న ఎండతో ఆహ్లాదకరంగా ఉన్న విద్యాలయ భూమిలో హాయిగా విహరించింది; ఆవిడ ఎప్పుడూ హృదయంలో ఒక చిన్న స్వర్గాన్ని నిలుపుకొని సంచరిస్తూ ఉంటుంది.

“ఇక్కడ అందంగా ఉంది,” ఆనందమయి మాతను నేను ప్రధాన భవనంలోకి తీసుకువెళ్తున్నప్పుడు ఆవిడ దయతో అన్న మాటలివి. పసిపాపలా చిరునవ్వు నవ్వుతూ నా పక్కన కూర్చుంది. ఆవిడ ఎవరికయినా ప్రేమాస్పదులందరిలోకి అతి దగ్గరిదాన్ని అనిపించేటట్టు చేస్తుంది; అయినా ఆవిడచుట్టూ దూరత్వ పరివేషం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. భగవత్స్వరూపమైన సర్వవ్యాపకత్వంలో విరోధాభాసంగల వేర్పాటు ఇది.

“నీ జీవితాన్ని గురించి కొంచెం చెప్పమ్మా.”

“బాబాకి తెలుసు, అదంతా; మళ్ళీ చెప్పడమెందుకు?” ఒక చిన్న జన్మ తాలూకు వాస్తవ చరిత్ర ఏమంత తెలుసుకోవలసింది కాదని ఆమె భావిస్తున్నట్టు స్పష్టమవుతున్నది.

నేను మెల్లగా మరోసారి మనవిచేసి నవ్వాను.

“బాబా, చెప్పడానికి అట్టే లేదు,” అంటూ ఆవిడ, అవసరంలేదని సూచిస్తున్నట్టుగా చేతులు విస్తరించింది. “నా చేతన ఎన్నడూ ఈ తాత్కాలిక శరీరంతో ముడిపడి ఉండలేదు, బాబా, నేను[2] ఈ భూమి మీదికి రాకముందు ‘నేను దాన్నే,’ చిన్నపిల్లగా ఉన్నప్పుడు ‘నేను దాన్నే.’ పెరిగి పెద్దదాన్ని అయాను; అయినా ‘నేను దాన్నే.’ నా పుట్టింటివాళ్ళు ఈ శరీరానికి పెళ్ళి ఏర్పాట్లు చేసినప్పుడు కూడా ‘నేను దాన్నే.’

“బాబా, మీ ఎదుట ఇప్పుడూ ‘నేను దాన్నే.’ ఆ తరవాత అనంత విశ్వంలో నా చుట్టూ సృష్టినర్తనం మారినప్పటికీ ‘నేను దాన్నే.’

ఆనందమయి మాత ధ్యానస్థితిలో మునిగిపోయింది. ఆమె శరీరం రాయిలా కదలిక లేకుండా అయిపోయింది; ఎప్పుడూ తనను పిలుస్తూండే లోకానికి పరుగుతీసింది. ఆమె కళ్ళ నీలపు మడుగులు నిర్జీవంగా తేజోవిహీనంగా కనిపించాయి. సాధువులు తమ చేతనను భౌతిక శరీరంలోంచి తొలగించినప్పుడు తరచు ఈ మాదిరిగా అవుపిస్తూ ఉంటుంది; అప్పుడా శరీరం ఆత్మరహితమైన మట్టిముద్దకు మించి ఉండదు. మే మిద్దరం సమాధి స్థితిలో ఒక గంటసేపు కూర్చుని ఉన్నాం. ఒక చిన్నహాస రేఖతో ఆవిడ ఈ లోకానికి తిరిగి వచ్చింది.

“ఆనందమయి మా, దయ ఉంచి నాతోబాటు తోటలోకి రండి. రైట్‌గారు ఫొటోలు తీసుకుంటారు.”

“అలాగే బాబా. నీ ఇష్టమే నా ఇష్టం.” ఆవిడ చాలా ఫొటోలకు నించున్నప్పుడు, ఆవిడ కళ్ళలో మార్పులేని దివ్యతేజస్సు అలాగే ఉండిపోయింది.

విందుకు వేళ అయింది! ఆనందమయి మాత తన గొంగడి ఆసనం మీద కూర్చుంది. ఆమెకు అన్నం తినిపించడానికి పక్కనే ఒక శిష్యురాలు. పసిపిల్ల మాదిరిగా ఆ సాధ్వి, శిష్యురాలు నోటికి అన్నం ముద్ద అందించినప్పుడు అణకువగా మింగింది. ఆనందమయి మాత, కూరలకీ మిఠాయిలకీ తేడా ఏమీ గుర్తించలేదని స్పష్టమయింది.

పొద్దు కుంకుతుండగా ఆ సాధ్వి తన బృందంతో బయలుదేరి వెళ్ళింది. వర్షిస్తున్న గులాబి రేకుల మధ్య ఆమె, పసివాళ్ళని దీవిస్తూ చేతులు పైకి ఎత్తింది. వాళ్ళ ముఖాలు, అప్రయత్నంగా ఆవిడ చూపించిన ఆప్యాయతతో ప్రకాశ మానమయాయి.

“నీ ప్రభువును నువ్వు సంపూర్ణ హృదయంతో, సంపూర్ణ ఆత్మతో, సంపూర్ణ మనస్సుతో, సంపూర్ణ బలంతో ప్రేమించాలి,” అంటూ ప్రకటించాడు. క్రీస్తు. “ఇది మొట్టమొదటి ఆజ్ఞ.”[3]

ఆనందమయి మాత, అల్పమైన ప్రతి అనుబంధాన్నీ తెంచుకొని ప్రభువు కొక్కడికే తన విధేయత చూపించింది. పసిపాపలాంటి ఈ సాధ్వి మానవ జీవితపు ఏకైక సమస్యను - అంటే, భగవంతుడితో ఐక్య స్థితి ఏర్పరచుకోడమనే సమస్యను - పండితుల మాదిరిగా సూక్ష్మేక్షికలతో కాకుండా, సునిశ్చిత విశ్వాసపరమైన తర్కంతో పరిష్కరించారు. లక్షోప లక్షల విషయాలతో పొగచూరిపోయిన ఈ నితాంత సరళత్వాన్ని మానవుడు మరిచిపోయాడు. దేవుడిపట్ల అనన్యమైన ప్రేమను తిరస్కరించి ప్రపంచదేశాలు, బాహ్యమైన ఔదార్యాలయాలపట్ల సునిశిత ఆదరంతో తమ నాస్తికతను కప్పిపుచ్చుతున్నాయి. మానవతాదృష్టితో చేసే ఉపకారాలు, మనిషి దృష్టిని క్షణకాలంపాటు తన మీంచి మళ్ళించేటట్టు చేస్తాయి కనక - అవి మంచివే; కాని మొదటి ఆజ్ఞగా ఏసుక్రీస్తు ప్రస్తావించిన జీవిత ఏకైక బాధ్యతనుంచి అతనికి విముక్తి ప్రసాదించవు. దేవుణ్ణి ప్రేమించాలన్న ఉద్ధారక కర్తవ్యం, తన ఏకైక సంరక్షకుడు[4] ఉచితంగా ప్రసాదించిన గాలిని మొదటి ఊపిరిగా మానవుడు తీసుకొన్నప్పుడే ఏర్పడింది.

రాంచీ సందర్శన తరవాత మరో సందర్భంలో నేను ఆనందమయి మాతను చూసే అవకాశం కలిగింది. కొన్ని నెలల తరవాత ఆవిడ శ్రీరాంపూర్ స్టేషను ప్లాట్‌ఫారం మీద తమ శిష్యులతో, బండికోసం ఎదురు చూస్తోంది.

“బాబా, నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను,” అని చెప్పింది ఆవిడ. “కొందరు దయాపరులు డెహ్రాడూన్‌లో మాకో ఆశ్రమం కట్టించారు.”

ఆవిడ బండి ఎక్కుతుండగా - గుంపు మధ్యలో ఉన్నా, రైల్లో ఉన్నా, విందు ఆరగిస్తున్నా, మౌనంగా కూర్చుని ఉన్నా ఆమె కళ్ళు భగవంతుడిమీంచి మళ్ళేవి కావని గమనించి నేను ముగ్ధుణ్ణి అయాను. నాలో ఇప్పటికీ, అమేయ మాధుర్యం గల ఆమె కంఠస్వరం వింటూనే ఉంటాను;

“చూడు, ఇప్పుడూ ఎప్పుడూ కూడా ఆ నిత్యాత్మతో ఏకమై ఉండి నేను ఎప్పటికీ దాన్నే.”

  1. శ్రీ శ్రీ ఆనందమయి మాత 1896 లో, తూర్పు బెంగాల్‌లో త్రిపుర జిల్లాలో ఖేవరా గ్రామంలో జన్మించారు. (ప్రచురణకర్త గమనిక.).
  2. శ్రీ శ్రీ ఆనందమయి మాత తన నెప్పుడూ “నేను” అని ప్రస్తావించదు. “ఈ దేహం” అని కాని, “ఈ అమ్మాయి” అని కాని, “మీ బిడ్డ” అని కాని సవినయంగా, డొంక తిరుగుడు మాటలు వాడుతుంది. అంతే కాకుండా, తాను ఎవరినీ “శిష్యుడు” అని కాని “శిష్యురాలు” అని కాని చెప్పదు. వ్యక్తి ప్రమేయంలేని జ్ఞానంతో ఈవిడ, జగజ్జననిగా మానవులందరిమీదా దివ్యప్రేమను కురిపిస్తుంది.
  3. మార్కు 12: 30.
  4. “కొత్తగా, ఇంతకన్న మేలుగా ఉండే ప్రపంచాన్ని సృష్టించాలన్న ఆకాంక్ష అందరికీ కలుగుతుంది. మీరు అటువంటి విషయాల మీదికి మనస్సు పెట్టకుండా అంతకన్న పరిపూర్ణమైన శాంతి లభించే అవకాశం ఉన్న దైవచింతన మీద మనస్సు నిలపండి. దైవాన్వేషకుడు, లేదా సత్యాన్వేషకుడు, కావడం మానవుడి విధి” - ఆనందమయి మాత.