అధ్యాయం : 44

గాంధీమహాత్ములతో వార్ధాలో

“వార్ధాలో మీకు స్వాగతం!” గాంధీమహాత్ముల కార్యదర్శి, మహాదేవ దేశాయి, మిస్ బ్లెట్ష్‌కూ శ్రీ రైట్‌కూ నాకూ సౌహార్దంతో నిండిన ఈ మాటలతో స్వాగతం చెబుతూ ఖద్దరు మాలలు వేశారు. మా చిన్న బృందం, ఆగస్టులో ఒకనాడు వేకువజామున, అప్పుడే వార్ధా స్టేషనులో దిగింది. బండిలో ఉన్న దుమ్ములోంచీ ఉక్కపోతలోంచి బయటపడ్డందుకు మేము సంతోషించాం. మా సామాను ఒక ఎద్దుబండిలో వేయించి శ్రీ దేశాయితోనూ ఆయన వెంట వచ్చిన బాబా సాహెబ్ దేశ్ ముఖ్ , డా॥ పింగళే గార్లతో కలిసి మేము, ఒక తెరిపి మోటారుకారులో బయలుదేరాం. బురద గొట్టుకుపోయిన నాటురోడ్ల మీద కొంతసేపు ప్రయాణంచేసి “మగన్ వాడి” చేరాం; భారతదేశ రాజకీయ ఋషి ఆశ్రమమది.

దేశాయిగారు మమ్మల్ని వెంటనే ‘రాతగది’లోకి తీసుకువెళ్ళారు; అక్కడ గాంధీమహాత్ములు బాసెంపట్టు వేసుకుని కూర్చుని ఉన్నారు. ఒక చేతిలో కలం, మరో చేతిలో ఒక కాయితం ముక్క; ఆయన ముఖంలో హృదయాకర్షకమైన మధుర మందహాసం!

“స్వాగతం!” అని హిందీలో రాశారాయన; ఆరోజు సోమవారం; వారానికోసారిగా ఆయన మౌనం పాటించే రోజు అది.

మేము కలుసుకోడం అదే మొదటిసారి అయినా, మేము ఒకరి నొకరం ఆప్యాయంగా, చూసుకున్నాం. గాంధీమహాత్ములు 1925 లో రాంచీ విద్యాలయాన్ని సందర్శించారు; అది ఆ విద్యాలయాని కొక గౌరవం. ఆ సందర్భంలో ఆయన, అతిథుల అభిప్రాయాల పుస్తకంలో, దయతో ప్రశంసాపూర్వకమైన మాటలు కొన్ని రాశారు.

100 పౌనుల క్షీణకాయం గల ఆ సాధువులో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాలు ప్రస్ఫుటమవుతున్నాయి. స్నిగ్ధమైన ఆయన ధూమ్రవర్ణ నేత్రాలు జ్ఞానంతో, చిత్తశుద్ధితో, వివేకంతో వెలుగొందుతున్నాయి; ఈ రాజనీతిజ్ఞులు న్యాయ, సాంఘిక, రాజకీయ పోరాటాలు అనేకం జయించారు. గాంధీగారు భారతదేశంలోని లక్షలాది జనహృదయాల్లో స్థానం సంపాదించుకున్నంతగా, ప్రపంచంలో మరే నాయకుడూ సంపాదించుకోలేదు. “మహాత్ముడు” అంటూ ఆయనకు వచ్చిన ప్రసిద్ధ బిరుదం, ప్రజలు స్వచ్ఛందంగా ఆయనకు అర్పించిన నివాళి. వాళ్ళకోసమే ఆయన, తమ దుస్తుల్ని కొల్లాయిగుడ్డకు పరిమితం చేసుకున్నారు. చాలా వ్యంగ్యచిత్రాలకు ఎక్కిన ఆ కొల్లాయిగుడ్డ, అంతకు మించినదేదీ ధరించజాలని దళిత జనబాహుళ్యంలో తామూ ఒకరమన్న భావనకు చిహ్నమయింది.

“ఆశ్రమవాసులు పూర్తిగా మీ సేవకు హాజరుగా ఉంటారు; ఏ పని కావాలన్నా, దయచేసి వాళ్ళని అడిగి చేయించుకోండి.” శ్రీ దేశాయి మమ్మల్ని రాతగదిలోంచి అతిథిగృహానికి తీసుకువెళ్తూ ఉండగా, మహాత్ములు అప్పటికప్పుడు ఈ ముక్కలు రాసి, సహజ సౌమనస్యంతో నాకు అందించారు.

దేశాయిగారు మమ్మల్ని పండ్లతోటలగుండా, పూలతోటలగుండా నడిపించి జేలీ కిటికీలున్న ఒక పెంకుటింటికి తీసుకువెళ్ళారు. ముందరి దొడ్లో ఉన్న ఇరవై ఐదడుగుల నూతిని, పశువులకు నీళ్ళు పట్టడానికి ఉపయోగిస్తారని చెప్పారు; ఆ పక్కనే ధాన్యం నూర్చడానికి సిమ్మెంటు చక్రం ఒకటి ఉంది. మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున ప్రత్యేకంగా ఇచ్చిన చిన్న పడకగదుల్లో, వీలయినంత కనీసపు సామగ్రి మాత్రమే - నులకతాటితో అల్లిన ఒక్క మంచం మాత్రం ఉంది. వెల్ల వేసిన వంటింట్లో ఒక మూల నీటి కుళాయి ఉంది; మరో చోట వండుకోడానికి ఒక పొయ్యి ఉంది. కాకుల అరుపులూ, పిచికల కిచకిచలూ, పశువుల అంబారవాలూ, రాళ్ళు కొట్టేటప్పుడయే టకటకచప్పుళ్ళూ - నిరాడంబరమైన పల్లెల్లో వినబడే శబ్దాలు మా చెవులకు సోకాయి.

శ్రీ రైట్ యాత్రాదినచర్య (ట్రావెల్ డైరీ) పుస్తకాన్ని గమనించి శ్రీ దేశాయి, దాన్ని తెరిచి, అందులో, గాంధీమహాత్ముల యథార్థానుయాయులు (సత్యాగ్రహులు) అందరూ చేసే సత్యాగ్రహా[1]వ్రత ప్రతిజ్ఞల్ని వరసగా రాశారు.

“అహింస; సత్యం; ఆస్తేయం (దొంగిలించకపోవడం); బ్రహ్మచర్యం; అపరిగ్రహం; కాయకష్టం; జిహ్వను అదుపులో ఉంచుకోడం; నిర్భయం; అన్ని మతాలపట్లా సమాన గౌరవం; స్వదేశీ (దేశంలో తయారైన వస్తువులే వాడడం); అంటరానితనం పాటించక పోవడం, ఈ పదకొండూ వినయవిధేయలతో ప్రతిజ్ఞలుగా పాటించాలి.”

(ఆ మర్నాడు గాంధీగారే స్వయంగా ఈ పేజీమీద సంతకం చేసి తేదీ కూడా వేశారు – ఆగస్టు 27, 1935).

మేము వచ్చిన రెండు గంటల తరవాత నన్నూ నా సహచరుల్నీ భోజనానికి పిలిచారు. మహాత్ములు అప్పటికే, ముంగిలికి ఆయన పఠన మందిరానికి మధ్యలో ఉన్న ఆశ్రమం వసారా కమాను కింద కూర్చుని ఉన్నారు. సుమారు ఇరవై ఐదు మంది సత్యాగ్రహులు కూర్చున్నారు; వాళ్ళకు ఎదురుగా ఇత్తడి కప్పులూ కంచాలు పెట్టి ఉన్నాయి. అందరూ కలిసి ప్రార్థన చేశారు; తరవాత పెద్ద ఇత్తడిపాత్రలు తెచ్చి వాటిలోంచి, నెయ్యివేసిన చపాతీలు తీసి వడ్డించారు; ‘తాల్సరీ’ (ఉడకబెట్టిన కూరగాయల ముక్కలు), నిమ్మకాయ మరబ్బా కూడా వేశారు.

మహాత్ములు చపాతీలు, ఉడకబెట్టిన బీట్ దుంపలు, కొన్ని పచ్చికూరలు, నారింజకాయలు తిన్నారు. కంచానికి ఒక పక్కన పెద్ద వేపాకు ముద్ద ఉంది; రక్తాన్ని శుభ్రపరచడంలో వేపాకు చెప్పుకోదగ్గది. ముద్దలో కొంతభాగం ఆయన చెమ్చాతో విడదీసి నా కంచంలో వేశారు. బలవంతాన మా అమ్మ నా చేత వెగటుమందులు మింగించిన చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. నేను దాన్ని నోట్లో వేసుకుని మంచినీళ్ళతో బాటు గుటుక్కున మింగేశాను. కాని గాంధీగారు, అరుచి అనుకోకుండా, ఆ వేపాకుల ముద్ద కొద్దికొద్దిగా నమిలి తిన్నారు.

ఇచ్ఛానుసారంగా తమ మనస్సును ఇంద్రియాల మీంచి మళ్ళించే సామర్థ్యం మహాత్ములకు ఉందని ఈ చిన్న సంఘటనలో గమనించాను. కొన్నేళ్ళ కిందట ఆయనకు గిలక (appendectomy) ఆపరేషను జరిగిన సంగతి గుర్తొచ్చింది నాకు. మత్తుమందు లేవీ తమకు అక్కర్లేదని ఆ సాధువు, ఆపరేషను జరుగుతున్నంత సేపూ తమ శిష్యులతో కులాసాగా కబుర్లు చెప్పారు. ఆయనకు బాధను గురించిన స్పృహ లేదన్న విషయాన్ని ఆయన ప్రశాంతమైన చిరునవ్వు వెల్లడిస్తోంది.

మధ్యాహ్నం గాంధీగారి ప్రముఖ శిష్యురాలైన మాడలీన్ స్లేడ్‌తో ముచ్చటించే అవకాశం కలిగింది; ఒక ఇంగ్లీషు నౌకా సేనాధిపతి కుమార్తె ఈమె; ఈ అమ్మాయి పేరు ఇప్పుడు మీరా బెహిన్.[2] ఈమె తన రోజువారీ కార్యకలాపాల గురించి నిర్దుష్టమైన హిందీలో నాకు చెబుతున్నప్పుడు పుష్టిగా, ప్రశాంతంగా ఉండే ఆమె ముఖంలో ఉత్సాహం వెల్లివిరిసింది.

“గ్రామ పునరుద్ధరణ కృషి లాభదాయకమైనది! మాలో ఐదుగురం ప్రతిరోజూ పొద్దున 5 గంటలకు లేచి, దగ్గరిలో ఉన్న పల్లెలో వాళ్ళకి సేవచేసి సాధారణ ఆరోగ్య నియమాలగురించి వాళ్ళకు బోధిస్తాం. వాళ్ళ పాకీదొడ్లూ బురదమట్టితో వేసిన తాటేకు గుడిసెలూ శుభ్రం చెయ్యడం ఒక పనిగా పెట్టుకున్నాం. పల్లెటూరివాళ్ళు చదువురానివాళ్ళు; చేసి చూపిస్తే తప్ప వాళ్ళకి నేర్పడం సాధ్యం కాదు!” అంటూ కులాసాగా నవ్విందామె.

ఉన్నత కుటుంబంలో జన్మించిన ఈ ఆంగ్ల వనిత చేత - మామూలుగా “అంటరానివాళ్ళు” మాత్రమే చేసే పాకిపని చేయించినది, నిజమైన క్రైస్తవ సహజమైన వినయం; అందుకు ఆమె వేపు ప్రశంసాపూర్వకంగా చూశాను.

“నేను 1925 లో భారతదేశం వచ్చాను,” అని చెప్పిందామె. “ఈ దేశంలో, ‘నేను నా ఇంటికే తిరిగి వచ్చాను’ అనిపిస్తుంది. ఇప్పుడిక నా పాత జీవనసరళికీ పాత అభిరుచులకూ మారిపోవాలని అనిపించదు.”

మేము కొంచెంసేపు అమెరికాగురించి మాట్లాడుకున్నాం. “భారతదేశాన్ని సందర్శించే అమెరికన్లు అనేకమంది, ఆధ్యాత్మిక విషయాల్లో కనబరిచే గాఢమైన ఆసక్తి గమనించి నే నెప్పుడూ సంతోషిస్తూ ఆశ్చర్యపోతూ ఉంటాను,”[3] అన్నదామె.

మరి కాస్సేపట్లోనే మీరా బెహెన్‌కు రాట్నంతో చేతుల నిండా పని పడింది. గాంధీ మహాత్ముల కృషివల్ల రాట్నాలిప్పుడు భారతీయ గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయి.

కుటీర పరిశ్రమల పునరుద్ధరణను ప్రోత్సహించడానికి గాంధీగారికి బలమైన ఆర్థిక, సాంస్కృతిక కారణాలు ఉన్నాయి, కాని ఆయన ఆధునిక ప్రగతినంతనూ పిచ్చిగా ఖండించమని చెప్పరు. యంత్రాలు, రైళ్ళు, కార్లు, టెలిగ్రాఫు ఆయన జీవితంలోనే ప్రముఖ పాత్రలు వహించాయి! జైలులోనూ బయటా కూడా కలిపి ఏభై ఏళ్ళపాటు ఆయన ప్రజాసేవ చేసిన కాలంలో, రాజకీయ ప్రపంచంలోని వ్యవహార వివరాలతోనూ కఠోర సత్యాలతోనూ ప్రతిరోజూ కుస్తీపట్లు పడుతూండేవారు. అయితే ఇవి, ఆయన మనస్సంతులనాన్నీ నిష్కాపట్యాన్నీ మతిస్థిమితాన్నీ మానవ స్వభావంలోని చిత్రవిచిత్రాల్నీ హాస్యధోరణిలో మెచ్చుకోడం మాత్రమే పెరిగేటట్టు చేశాయి. మేము ముగ్గురం బాబా సాహెబ్ దేశ్‌ముఖ్‌గారి అతిథులుగా సాయంత్రం 6 గంటలకు భోజనాలు చేశాం; రాత్రి ఏడు గంటలకు మళ్ళీ మేము మగన్‌వాడి ఆశ్రమంలో ప్రార్థన వేళకి వెళ్ళి డాబా ఎక్కాం; అక్కడ ముప్ఫైమంది సత్యాగ్రహులు గాంధీగారి చుట్టూ కూర్చుని ఉన్నారు. ఆయన ఒక తుంగచాపమీద కూర్చుని ఉన్నాడు. పాతకాలపు జేబు గడియారం ఒకటి ఆయనకు ముందరివేపు వేలాడుతోంది. వాలుతున్న సూర్యుడు తాటిచెట్లమీదా మర్రిచెట్లమీదా చివరి వెలుగులు ప్రసరిస్తున్నాడు; రాత్రి రొద, కీచురాళ్ళ చప్పుళ్ళు మొదలయాయి. వాతావరణం పూర్తిగా ప్రశాంతంగా ఉంది. నేను మైమరిచిపోయాను.

శ్రీ దేశాయి భజనకీర్తన ఒకటి పాడుతూ ఉండగా తక్కిన వాళ్ళంతా ఆయన పాడింది అందుకొని పాడుతున్నాడు; తరవాత గీతా పారాయణ జరిగింది. ముగింపు ప్రార్థన నన్ను చెయ్యమని మహాత్ములు నాకు సంజ్ఞ చేశారు. ఆలోచనకూ ఆశయానికి ఎటువంటి పొందిక ఉంది? ఎప్పటికీ మనస్సులో ఉండిపోయే స్మృతి: ఆకాశంలో అప్పుడే పొడిచిన చుక్కల కింద, వార్ధాలో మిద్దెమీద జరిగిన ధ్యానం.

కచ్చితంగా ఎనిమిది గంటల వేళకు గాంధీగారు మౌనం చాలించారు. ఆయన జీవితంలో కఠిన శ్రమ కలుగుతూ ఉండడంవల్ల, కాలాన్ని సూక్ష్మ ప్రమాణాల్లో కేటాయించడంకోసం అవసరమయింది.

“స్వాగతం స్వామీజీ!” ఈసారి మహాత్ము లిచ్చినది కాయితం మీద రాసి చూపించిన స్వాగతం కాదు. మేము అప్పుడే డాబామీంచి దిగి ఆయన రాతగదికి వెళ్ళాం. అందులో చదరలు (కుర్చీలు లేవు), పుస్తకాలు, కాయితాలు, మామూలు కలాలు (ఫౌంటెన్ పెన్నులు కావు) ఉన్న పొట్టి డస్కు పెట్టె, ఒక మూల టిక్కు టిక్కుమనే పాత గడియారం ఉన్నాయి. సర్వత్ర వ్యాప్తమయిన కాంతి, భక్తి ప్రభతో గాంధీగారు, సమ్మోహకమూ గహ్వర సదృశమూ అయిన బోసినోటితో చిరునవ్వు చిందిస్తున్నారు.

“చాలా ఏళ్ళ కిందట, నా ఉత్తరప్రత్యుత్తరాల పని చూసుకోడానికి వ్యవధికోసం, వారానికి ఒకరోజు మౌనం పాటించడం ప్రారంభించాను. కాని ఇప్పుడు, ఆ ఇరవై నాలుగు గంటలూ ప్రధాన ఆధ్యాత్మిక అవసరంగా పరిణమించాయి. నియత కాలికమైన మౌనం ఒక భాగ్యమే కాని చిత్రహింస కాదు,” అని వివరించారాయన.

నేను మనసారా అంగీకరించాను.[4] మహాత్ములు నన్ను అమెరికాగురించి, యూరప్‌గురించి అడిగారు; భారతదేశాన్ని గురించి, ప్రపంచ పరిస్థితులగురించి మేము చర్చించుకున్నాం.

“మహాదేవ్,” శ్రీ దేశాయి గదిలో అడుగుపెడుతూ ఉండగా గాంధీగారు అన్నారు, “స్వామిజీ రేపు రాత్రి యోగాన్నిగురించి మాట్లాడ్డానికి టౌన్ హాల్లో ఏర్పాట్లు చేయించండి.”

ఆ రాత్రికి నేను మహాత్ముల దగ్గర సెలవు తీసుకుంటూ ఉండగా ఆయన, ముందు చూపుతో, సెట్రోనెల్లా ఆయిల్ (ఒక రకం గడ్డి నూనె) సీసా ఒకటి నా చేతికి ఇచ్చారు.

“వార్ధా దోమలకి అహింస[5] సంగతేదీ తెలియదు. స్వామీజీ?” అన్నారాయన, నవ్వుతూ. మర్నాడు పొద్దున మేము తేనె పానకమూ పాలూ గోధుమ జావా తాగాం. గాంధీగారితోనూ సత్యాగ్రహులతోనూ భోజనానికి రమ్మని పదిన్నరకి మమ్మల్ని ఆశ్రమం వసారాలోకి పిలిచారు. ఈ రోజు వంటకాల్లో ఎర్రబియ్యం, కొత్తగా ఎంపికచేసిన కూరగాయలు, ఏలక్కాయ గింజలు కూడా ఉన్నాయి.

మధ్యాహ్నం ఆశ్రమ ప్రదేశంలో తిరిగాను. కొన్ని ఆవులు నదురూ బెదురూ లేకుండా మేత మేస్తున్న మైదానం వరకు తిరిగాను. గోరక్షణ అంటే గాంధీగారికి గాడమైన ఆసక్తి.

“ఆవు అనేది నా దృష్టిలో, మానవులకన్న తక్కువ స్థాయిలో ఉన్న మొత్తం జంతు ప్రపంచం కింద లెక్క; మానవుడి సహానుభూతులను మానవేతరాలకు కూడా విస్తరింపజేస్తుందది,” అని వివరించారు మహాత్ములు. “బతికే ప్రతి జీవిలోనూ తనను చూసుకోడానికి మానవుడు గోవును పూజించాలని పెద్దల ఆదేశం. సనాతన ఋషులు గోవును దైవ సమానంగా భావించడం సహజమే. భారతదేశంలో మనిషికి ఆవు మంచి తోడు; అది సర్వసంపత్ప్రదాత్రి. అది పాలివ్వడమే కాకుండా, సేద్యానికి కూడా ఉపయోగపడుతోంది. గోవు కరుణ రసాత్మక కావ్యం; ఆ సాధుజంతువులో కరుణే కళ్ళకి కడుతుంది. మానవజాతిలో లక్షలాది మందికి రెండో తల్లి అది. గోరక్షణ చేయడమంటే, భగవంతుడు సృష్టించిన మూగజీవాలన్నిటికీ రక్షణ ఇవ్వడమన్న మాట. సృష్టిలో నిమ్న శ్రేణివి నోరులేనివి కనక, వాటి పిలుపు అన్నిటికన్న శక్తిమంతంగా ఉంటుంది.” నైష్ఠిక హిందువుకు కొన్ని నిత్యకర్మలు విధించి ఉన్నాయి. ఒకటి ‘భూతయజ్ఞం’; అంటే పశువులకు మేత పెట్టడం. సృష్టిలో అల్పమైన అపరిణత జీవులపట్ల మనిషి తనకున్న బాధ్యతల్ని గ్రహించుకోవాలన్న దానికి ఇది ప్రతీక; ఆ అల్పపరిణత జీవరూపాలు, సహజాతపరంగా దేహస్పృహకు ముడిపడి ఉన్నవి. ఆ దేహస్పృహ మానవ జీవితంలోకి చొచ్చుకు వచ్చింది. అయితే అల్పపరిణత జీవరూపాలకు, మానవజాతికి విశిష్టమైన ముక్తి దాయక వివేక లక్షణం లేదు. ఆ విధంగా భూతయజ్ఞం దుర్బల జీవుల్ని ఆదుకోడానికి మానవుడిలో ఉన్న సంసిద్ధతకు బలం చేకూరుస్తుంది. అదే విధంగా అతడు, ఉచ్చతర అదృశ్యజీవుల అసంఖ్యాక శుభాశీస్సులవల్ల ఊరట పొందుతాడు. అంతేకాకుండా, భూమిలోనూ సముద్రంలోనూ ఆకాశంలోనూ విచ్చలవిడిగా వ్యర్థమయిపోతున్న ప్రకృతి వరప్రసాదాల్ని పునరుజ్జీవింపజేయవలసిన బాధ్యత కూడా మానవుడి మీద ఉంది. ప్రకృతిలో ఉన్న జంతువులకూ మనిషికీ సూక్ష్మలోక దేవతలకూ మధ్య పరస్పర భావసంపర్క రాహిత్యం అనే పరిణామాత్మక అవరోధాన్ని నిగూఢ ప్రేమతో దాటడం జరుగుతున్నది.

ఇతర దైనిక యజ్ఞాలు- ‘పితృయజ్ఞం, నృయజ్ఞం.’ పితృయజ్ఞం, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం. మానవుడు, గతానికి తాను ఋణపడి ఉన్నానన్న సంగతి అంగీకరించడానికి చిహ్నమది. నృయజ్ఞం అంటే, ఆగంతుకులకుగాని బీదవాళ్ళకుగాని అన్నం పెట్టటం. మానవుల విషయంలో ఇప్పుడు తనకున్న బాధ్యతలకూ సమకాలికుల విషయంలో తనకున్న విధులకూ అది చిహ్నం.

మధ్యాహ్నం పూట, చిన్న చిన్న అమ్మాయిలకోసం ఏర్పాటుచేసిన గాంధీగారి ఆశ్రమానికి వెళ్ళి నృయజ్ఞం చేశాను. శ్రీ రైట్ నాతోబాటు వచ్చాడు. కారులో పదినిమిషాల ప్రయాణం. పొడుగాటి వన్నెవన్నెల చీరలకు పైన కుసుమకోమలమైన కన్నెపిల్లల ముఖాలు! ఆరుబయట కొద్దిసేపు నేను హిందీలో ప్రసంగించాను. ప్రసంగం చివరిలో ఆకాశం చిల్లులుపడ్డట్టు దబ్బాటుగా వాన కురిసింది. నవ్వుకుంటూ నేనూ శ్రీ రైట్ కారెక్కి మగన్ వాడికి ఉరికాం. వెండిరేకుల్లా మెరుపులు మెరుస్తున్నాయి ఆకాశంలో; అంత జోరుగా కురిసింది వాన.

మళ్ళీ అతిథిగృహంలో అడుగుపెడుతూ అక్కడి నిరాడంబరతా, ఆత్మత్యాగానికి నిదర్శనాలూ చూసి, మళ్ళీ మరోమాటు కొత్తగా విస్మయం చెందాను. గాంధీగారి ‘అపరిగ్రహ ప్రతిజ్ఞ,’ దాంపత్య జీవితంలో తొలి కాలంలోనే ఆచరణలోకి వచ్చింది. ఏడాదికి 60,000 రూపాయలకు పైగా ఆదాయం వచ్చే విస్తారమైన వకీలు వృత్తిని విడిచిపెట్టి మహాత్ములు, తమ సంపదను పేదవాళ్ళకు ఇచ్చేశారు.

త్యాగాన్ని గురించి సామాన్యంగా ఉండే అసమగ్రమైన అభిప్రాయాల్ని శ్రీయుక్తేశ్వర్‌గారు వేళాకోళం చేస్తూ ఉండేవారు.

“బిచ్చగాడు సంపద ఏమీ త్యాగం చెయ్యలేడు,” అనేవారు ఆయన. “ ‘నా వ్యాపారం పడిపోయింది, నా పెళ్ళాం వదిలేసింది, నేను అన్నీ త్యాగం చేసేసి సన్యాసుల మఠానికి వెళ్ళిపోతాను,’ అంటూ ఎవ రయినా విలపిస్తున్నారంటే, అతను చెబుతున్నది ఏ లౌకిక త్యాగం గురించి? సంపదనూ ప్రేమనూ అతనేమీ విడిచిపెట్టలేదు; అవే అతన్ని విడిచిపెట్టేశాయి!”

అందుకు భిన్నంగా గాంధీగారిలాంటి సాధువులు, స్పష్టంగా భౌతికవస్తు త్యాగాలు చెయ్యడమే కాకుండా, తమ అంతరాంతర జీవిని సర్వమానవ వాహినిలో లీనంచేసి, అంతకన్న కష్టమైన స్వార్థబుద్ధినీ వ్యక్తిగత లక్ష్యాన్ని త్యాగం చేశారు. మహాత్ముల ధర్మపత్ని కస్తూరిబాయి. ఈమె విశిష్టురాలు. తనకోసం, పిల్లలకోసం ఆయన తమ ఆస్తిలో భాగమేదీ కేటాయించి పెట్టనందుకు ఆమె ఆక్షేపించలేదు. చిన్నతనంలోనే పెళ్ళి అయిన గాంధీగారూ భార్యా నలుగురు కొడుకులు పుట్టిన తరవాత బ్రహ్మచర్య వ్రతం ప్రారంభించారు.[6] వారి దాంపత్య జీవనం ఒక గంభీరమైన రూపకం; అందులో ప్రశాంతనాయిక అయిన కస్తూరిబాయి, భర్త అడుగుజాడల్లో నడిచి జైలుకు వెళ్ళారు; మూడు వారాలపాటు ఆయన ఉపవాసాలు చేసినప్పుడు ఆమె కూడా చేశారు. ఆయన వహించే లెక్కలేనన్ని బాధ్యతల్లో ఆమె తమవంతు పూర్తిగా వహించారు. గాంధీగారికి ఆవిడ ఈ విధంగా జోహార్లు అర్పించారు.

“మీ యావజ్జీవిత సహచారిణిగా, సహాయకురాలిగా ఉండే మహదవకాశం పొందినందుకు మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. మన దాంపత్యం, కామవాంఛ మీద కాకుండా, ‘బ్రహ్మచర్యం’ (ఆత్మనిగ్రహం) మీద ఆధారపడి ప్రపంచమంతటిలోకీ సర్వశ్రేష్ఠమైన దాంపత్యమయి నందుకు మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. భారతదేశం కోసం మీరు చేపట్టిన జీవిత కృషిలో నన్ను మీకు సమానురాలిగా పరిగణించినందుకు మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. జూదంలోనూ పందాల్లోనూ స్త్రీలోలత విషయంలోనూ మద్యపానంలోనూ పాటల్లోనూ తమ కాలాన్నంతనీ వెచ్చించేసి, చిన్న నాటి ఆటవస్తువులంటే తొందరగా విసుగెత్తిపోయే చిన్న పిల్లవాడి మాదిరిగా భార్య అన్నా, పిల్లలన్నా విసుగెత్తేసే భర్తల్లో మీరు ఒకరు కానందుకు మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఇతరుల శ్రమను దోచుకుంటూ, ధాన్యం పండించడానికే తమ కాలాన్ని వినియోగించే భర్తల్లాంటివారు మీరు కానందుకు ఎంతగా ధన్యవాదాలు చెప్పుకోవాలి!”

“లంచాలకన్న దేవుడికీ దేశానికీ మీరు అగ్రస్థానం ఇస్తున్నందుకూ మీకు దృఢవిశ్వాసబలం ఉన్నందుకూ భగవంతుడిమీద సంపూర్ణమైన ప్రగాఢ విశ్వాసం ఉన్నందుకు మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పుకోవాలో! నా కన్న దేవుడికి దేశానికి అధిక ప్రాముఖ్యమిచ్చే భర్తకు భార్యనయినందుకు నేను ఎంతగా ధన్యవాదాలు చెప్పుకోవాలి? మన జీవిత విధానాన్ని మీరు, అంత సంపన్న స్థితినుంచి అంత స్వల్పస్థితికి మారుస్తూంటే నేను సణుక్కొంటూ తిరగబడినప్పుడు, నా కుర్రతనపు లోపాలకు మీరు ఓర్పు చూపినందుకు మీకు కృతజ్ఞురాలిని.”

“చిన్న పిల్లగా ఉన్నప్పుడు నేను మీ తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నాను; మీ అమ్మగారు గొప్ప ఉత్తమురాలు; ఆవిడ నాకు చక్కని తర్ఫీదు ఇచ్చారు; ధైర్యసాహసాలుగల భార్య ఎలా ఉండాలో, నాకు భర్త కాబోయే తమ కుమారుడి ప్రేమనూ గౌరవాన్ని ఎలా నిలుపుకోవాలో నేర్పారావిడ. ఏళ్ళు గడుస్తూ ఉండగా, మీరు భారతదేశానికి అత్యంత ప్రియతమ నాయకులయారు. ఇతరదేశాల్లో తరచు జరుగుతుండే మాదిరిగా, భర్త విజయ సోపానాలు ఎక్కినప్పుడు భార్యను విడిచి పెట్టేసే దుస్థితి నాకు కలుగుతుందేమోనన్న భయమేమీ లేదు. మరణ సమయంలో సైతం మనం ఆలుమగలుగానే ఉంటామన్న సంగతి నాకు తెలుసు.”

కస్తూరిబాయి చాలా సంవత్సరాలపాటు, ప్రజాద్రవ్యానికి కోశాధికారిణిగా పనిచేసేది. దైవస్వరూపులుగా ప్రజల మన్నన లందుకున్న మహాత్ములు, కొన్ని కోట్ల రూపాయిలు విరాళాలు సేకరించారు. గాంధీగారి సమావేశానికి వెళ్ళే ఆడవాళ్ళు నగలు పెట్టుకుని వెళ్తే, వాళ్ళ భర్తలకు బెరుకుగా ఉంటుందని భారతీయ గృహాల్లో నవ్వుకుంటూ కథలు కథలుగా చెప్పుకొనేవారు. దళితజాతి ఉద్ధరణకు శ్రమించే గాంధీమహాత్ముల సమ్మోహక స్వరం, సంపన్నుల బంగారం గాజుల్ని, వజ్రాలహారాల్నీ ఆకర్షించేసి, వాళ్ళ చేతులనుంచీ మేడలనుంచీ ఊడి చందాల బుట్టలో పడేట్టు చేస్తుంది.

ఒకనాడు, ప్రజానిధికి కోశాధికారిణి అయిన కస్తూరీబాయి, నాలుగు రూపాయిలు ఎలా ఖర్చయాయో లెక్క చెప్పలేకపోయింది. గాంధీగారు, ఆ నిధులకు సంబంధించిన లెక్కలు ఆడిట్ చేయించి ప్రచురిస్తూ, తమ భార్య నిర్వహణలో వచ్చిన నాలుగు రూపాయిల తేడానూ నిర్దాక్షిణ్యంగా ఎత్తి చూపించారు.

నేను ఈ కథ, నా అమెరికన్ విద్యార్థుల క్లాసుల్లో తరచుగా చెప్పేవాణ్ణి. ఒకనాడు సాయంత్రం హాలులో ఒకామె ఆగ్రహావేశంతో ఊగిపోయింది: “మహాత్ముడయేది, కాకపోయేది - ఆయనే కనక నా మొగుడయి ఉంటే - అనవసరంగా చేసిన అటువంటి బహిరంగమైన అవమానానికి, మొహం మీద ఒక్క గుద్దు గుద్దేదాన్ని!” అంటూ అరిచింది.

అమెరికన్ భార్యలగురించి, భారతీయ భార్యలగురించి మా మధ్య సరదాగా కొంత వాగ్వాదం జరిగిన తరవాత, నేను ఇంకా పూర్తిగా వివరించడానికి పూనుకున్నాను. “గాంధీగారి భార్య, ఆ మహాత్ముణ్ణి తన భర్తగా కాకుండా గురువుగా భావించింది. చాలా చిన్న పొరపాట్లనయినా చక్కదిద్దే హక్కు గురువుకు ఉంది,” అని స్పష్టం చేశాను. “కస్తూరిబాయిని బహిరంగంగా మందలించిన కొంత కాలానికి, గాంధీగారికి ఒక రాజకీయ నేరారోపణ మీద జైలుశిక్ష పడింది. ప్రశాంతంగా ఆయన ఆమెకు వీడుకోలు చెబుతూ ఉండగా ఆవిడ, ఆయన పాదాల మీద వాలింది. “గురుదేవా, నేను మిమ్మల్ని ఎప్పుడయినా నొప్పించి ఉంటే నన్ను క్షమించండి,” అని ప్రాధేయపడింది.

వార్ధాలో ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు నేను, ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ప్రకారం, గాంధీగారి రాతగదిలోకి వెళ్ళాను, తన భార్యను శిష్యురాలిగా చేసుకోడమనే అరుదైన అలౌకిక ఘటనను సాధించగలిగిన సాధువు గాంధీగారు. ఎన్నడూ మరుపురాని చిరునవ్వు చిందిస్తూ పైకి చూశారు ఆయన.

“మహాత్మాజీ,” అంటూ ఆయన పక్కన, ఉత్తి చాపమీద కూర్చుంటూ, “అహింసకు మీ నిర్వచనమేమిటో చెప్పండి,” అన్నాను.

“మనస్సులో కాని, చేతలో కాని ఏ జీవికీ హాని చెయ్యకుండా ఉండడం.”

“చక్కని ఆదర్శమే! కాని, ఒక పిల్లవాణ్ణి కాపాడడానికో, తనని కాపాడుకోడానికో తాచుపామును చంపగూడదా అని ప్రపంచం ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది.”

“నిర్భయం, అహింస అన్న నా ప్రతిజ్ఞల్ని రెండింటినీ ఉల్లంఘించకుండా నేను తాచుపామును చంపలేను. అంతకంటె, ప్రేమ స్పందనతో ఆ పామును శాంతపరచడానికి మానసికంగా ప్రయత్నిస్తాను. నా పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి కదా అని, నేను నా ప్రమాణాల్ని దిగజార్చలేను,” తమకు సహజమైన చిత్తశుద్ధితో గాంధీగారు ఇంకా ఇలా అన్నారు, “ఏ మాట కా మాటే చెప్పుకోవాలి - ఒక తాచుపామే కనక ఎదురయితే నేను నిబ్బరంగా ఇలా కబుర్లు చెప్పలేను!”

పథ్యం గురించి చాలా ఇటీవల వెలువడ్డ పాశ్చాత్య గ్రంథాలు కొన్ని ఆయన బల్ల మీద ఉన్నాయి; నేను వాటిని గురించి వ్యాఖ్యానించాను.

“ఔను. పథ్యం అన్నది, ప్రతిచోటా ఎంత ముఖ్యమో సత్యాగ్రహోద్యమంలో కూడా అంత ముఖ్యం,” అని ముసిముసిగా నవ్వుతూ అన్నారాయన. సత్యాగ్రహులకు సంపూర్ణమైన నిగ్రహం ఉండాలని చెప్పేవాణ్ణి కనక, బ్రహ్మచారికి (బ్రహ్మచర్యం పాటించేవాడికి) తగిన ఉత్తమ ఆహారం ఏమిటో కనుక్కోడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాను. ప్రజననకారక సహజాతాన్ని అదుపులో పెట్టుకోడానికి ముందు జిహ్వను జయించాలి. అర్ధాకలిగా ఉండడం కాని, అసంతులిత ఆహారం తీసుకోడం కాని దానికి ఉపాయం కాదు. తిండికోసం లోపల ఉండే అత్యాశను మొదట జయించి ఆ తరవాత, అవసరమైన విటమిన్లూ ఖనిజాలూ కేలరీలూ మొదలయినవన్నీ ఉండే సాత్త్విక ఆహారం తింటూ ఉండాలి సత్యాగ్రహి. ఆహారానికి సంబంధించిన బాహ్యాంతర జ్ఞానంవల్ల సత్యాగ్రహి శుక్లం, ఒంటికంతకీ పనికివచ్చే జీవశక్తిగా ఇట్టే మారుతుంది.

మాంసానికి బదులుగా తినదగ్గ మంచి ఆహారపదార్థాల గురించి మాకు తెలిసిన సంగతులు తులనాత్మకంగా ముచ్చటించుకున్నాం, గాంధీగారూ నేనూ. “అవొకేడో (avocado) అద్భుతమైంది.” అన్నాను నేను. “కాలిఫోర్నియాలో మా కేంద్రానికి దగ్గర, అవొకేడో తోపులు లెక్కలేనన్ని ఉన్నాయి.” గాంధీగారి ముఖంలో ఆసక్తి కనబడింది. “అవి వార్ధాలో పెరిగితే బాగుండును. సత్యాగ్రహులు కొత్త ఆహారాన్ని మెచ్చుకుంటారు.”

“లాస్ ఏంజిలిస్ నుంచి అవొకేడో మొక్కలు కొన్ని తప్పకుండా వార్ధాకు పంపిస్తాను,” అని చెప్పి, “గుడ్లు, మాంసకృత్తులు (ప్రోటీన్లు) ఎక్కువగా ఉండే ఆహారం; ఇవి సత్యాగ్రహులకు నిషిద్ధమైనవా?”

“బీజంలేని గుడ్లు నిషిద్ధం కావు,” అంటూ, వెనకటి సంగతులు తలుచుకుని నవ్వుకున్నారు మహాత్ములు.

“చాలా ఏళ్ళు, నేను వాటి వాడుకను సమ్మతించలేదు. ఇప్పటికీ నే నయితే తినను. మా కోడళ్ళలో ఒక అమ్మాయి ఒకసారి, పోషకాహార లోపంపట్ల ప్రాణం పోయే స్థితికి వచ్చింది; ఆమె గుడ్లు తిని తీరాలని పట్టుపట్టాడు డాక్టరు. నేను ఒప్పుకోలేదు. దాని బదులు మరోటి చెప్పమన్నాను.”

“ ‘గాంధీజీ, బీజంలేని గుడ్లలో శుక్లం ఉండదు; అందులో హత్య ఏమీ ఉండదు,’ ” అన్నాడాయన.

“అప్పుడు నేను సంతోషంగా అనుమతించాను, మా కోడలు ఆ గుడ్లు తినడానికి; తొందరగానే ఆమెకు మామూలు ఆరోగ్యం చేకూరింది.”

అంతకుముందు రోజున గాంధీగారు, లాహిరీ మహాశయుల క్రియాయోగం దీక్ష తీసుకోవాలన్న కోరిక వెల్లడించారు. ఆయన చిత్తశుద్ధికీ జిజ్ఞాసాప్రవృత్తికి నేను ముగ్ధుణ్ణి అయాను. దైవాన్వేషణ విషయంలో ఆయన చిన్నపిల్లవాడి మోస్తరు; “అలాటి వాళ్ళదే స్వర్గరాజ్యం,” అంటూ ఏసుక్రీస్తు, పిల్లల్ని ప్రశంసించాడు. గాంధీగారిలో అటువంటి పరిశుద్ధ గ్రాహకత వెల్లడి అయింది.

నేను మాట ఇచ్చిన దీక్షా సమయం వచ్చింది. కొందరు సత్యా గ్రహులు - క్రియాయోగ దీక్ష తీసుకోదలిచిన శ్రీ దేశాయి, డా॥ పింగళే మరికొందరు - గదిలోకి వచ్చారు.

నేను మొదట, ఆ చిన్న తరగతికి, శారీరకమైన యోగదా అభ్యాసాలు నేర్పాను. శరీరం ఇరవై భాగాలుగా ఉన్న సంగతి ఆంతరికంగా దర్శిస్తాం; ప్రతి భాగంలోకి శక్తి వెళ్ళేటట్టుగా, సంకల్పం దాన్ని నిర్దేశిస్తుంది. కాస్సేపట్లోనే, నా ఎదుట ప్రతి ఒక్కరూ స్వయంచలన మానవ యంత్రంలా స్పందించడం చూశాను. గాంధీగారి శరీరంలో ఇరవై భాగాల్లోనూ స్పందన ఫలితాన్ని చూడడం సులువే; చూసేవాళ్ళకి, ఆయన శరీర భాగాలు ఎప్పుడూ పైకి కనిపిస్తూనే ఉంటాయి! ఆయన చాలా సన్నగా ఉన్నా, వికార మనిపించేటంత బక్కగా ఉండరు; ఆయన ఒంటిమీది చర్మం నున్నగా, ముడతలు లేకుండా ఉంటుంది.[7]

తరవాత నేను, వాళ్ళకి క్రియాయోగమనే ముక్తిదాయక యోగప్రక్రియ ఉపదేశించాను.

మహాత్ములు ప్రపంచమతాలన్నిటినీ శ్రద్ధాసక్తులతో అధ్యయనం చేశారు. జైనగ్రంథాలు, బైబిలు కొత్త నిబంధన గ్రంథం, టాల్‌స్టాయ్ సమాజ శాస్త్రీయ రచనలు - గాంధీగారి అహింసా సిద్ధాంతపరమైన దృఢ విశ్వాసాలకు ప్రధానమైన ఆధారాలు[8] ఈ మూడూ. ఆయన తమ అభిమతాన్ని ఇలా వ్యక్తం చేశారు: “బైబిలు, కొరాను, జెంద్ - అవెస్తా[9] అన్నవి వేదాల లాగే దైవ ప్రేరణవల్ల రచించినవేనని నమ్ముతాను. గురు సంప్రదాయాన్ని విశ్వసిస్తాను. కాని ఈ కాలంలో అనేక లక్షలమంది, గురువు లేకుండానే పోవలిసి వస్తోంది. దానికి కారణం, పరిపూర్ణ పరిశుద్ధతా, పరిపూర్ణ విద్వత్తూ- రెండూ ఉన్నవారు చాలా అరుదై పోవడం. కాని ఎవరూ, తమ మతానికి సంబంధించిన సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేకపోతున్నామని నిరాశ పడక్కర్లేదు. ఎంచేతంటే, తక్కిన గొప్ప మతాలన్నిటిలోని మౌలికాంశాలలాగే, హిందూమత మౌలికాంశాలు కూడా మార్పు చెయ్యరానివీ సులువుగా తెలుసుకోగలిగినవీ.”

“ప్రతి హిందువులాగే నేనూ దేవుణ్ణి నమ్ముతాను; ఆయన ఒక్కడేననీ నమ్ముతాను; పునర్జన్మ, మోక్షం ఉన్నాయని నమ్ముతాను...... హిందూమతం మీద నాకున్న అభిప్రాయాల్ని గురించి, నా భార్యమీద నా కున్న అభిప్రాయాల్ని గురించి చెప్పగలిగిన దానికంటె ఎక్కువ చెప్పలేను. ప్రపంచంలో ఏ ఆడదీ స్పందింపజెయ్యలేనంతగా, ఆవిడ నన్ను స్పందింపజేస్తుంది. అలాగని, ఆవిడ తప్పు లేమీ చెయ్యదని కాదు; నేను గమనించగలిగిన వాటికంటె ఎక్కువ లోపాలే ఆవిడలో ఉన్నాయని నేను తెగించి చెబుతాను. కాని తెగరాని బంధం ఒకటి ఉంది. అలాగే హిందూమతంలో లోపాలూ పరిమితులూ ఎన్ని ఉన్నప్పటికీ, అదంటే నేను స్పందిస్తాను. గీతలో కాని, తులసీదాసు రాసిన రామాయణంలో కాని ఉన్న సంగీతాన్ని మించి మరేవీ నన్ను ఆనందపరచలేదు. నేను కొన ఊపిరి తీసుకుంటున్నాననుకుంటే, గీతే నాకు ఊరట ఇస్తుంది.”

“హిందూమతం ఒంటెత్తు మతం కాదు. ప్రపంచ ప్రవక్తలందరినీ పూజించడానికి అవకాశం దాంట్లో ఉంది.[10] సామాన్యార్థంలో అది, ప్రచారక మతం కాదు. అది చాలా తెగల్ని తనలో లీనం చేసుకుందనడంలో సందేహం లేదు; కాని ఈ లీనం చేసుకోడమన్నది పరిణామాత్మకంగానూ అగోచరంగానూ జరిగింది. ప్రతి ఒక్కడూ తన విశ్వాసాన్నిబట్టి, లేదా ధర్మాన్ని [11]బట్టి దేవుణ్ణి కొలవాలని చెబుతూ, తద్వారా అన్ని మతాలతోనూ శాంతియుత సహజీవనం చేస్తుంది.”

క్రీస్తు గురించి గాంధీగారు ఇలా రాశారు: “ఆయన కనక ఇప్పుడు మనుషుల మధ్య నివసిస్తూ ఉండి ఉంటే, ఆయన, ‘నన్ను ప్రభూ, ప్రభూ... అంటూ పిలిచే ప్రతి వాళ్ళూ కాక, నా తండ్రి ఇచ్ఛానుసారంగా నడుచుకొనేవాడు మాత్రమే,’[12] అని రాసినట్టుగానే, బహుశా తన పేరు కూడా ఎన్నడూ విని ఉండని అనేకమంది జీవితాల్ని దీవించి ఉండేవాడని నా దృఢవిశ్వాసం. ఏసుక్రీస్తు, తన జీవితం ద్వారా నేర్పిన పాఠంలో మహత్తర ప్రయోజనాన్ని ఏకైక లక్ష్యాన్నీ మానవజాతికి తెలియజేశాడు; మన మందరం ఆశించి ఉండవలసిన మహదాశయ మిది; ఆయన ఒక్క క్రైస్తవమతానికే కాదు, యావత్ప్రపంచానికి సర్వదేశాలకూ సర్వజాతులకూ చెందినవాడని నా విశ్వాసం.”

వార్ధాలో నే నున్న చివరి రోజు సాయంత్రం, టౌనుహాలులో శ్రీ దేశాయి ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగించాను. యోగశాస్త్రాన్ని గురించి నే నిచ్చే ఉపన్యాసం వినడానికి వచ్చిన జనం, సుమారు 400 మంది, ఆ గదిలో కిటికీల్లో కూడా కిక్కిరిసిపోయారు. నేను మొదట హిందీలోనూ తరవాత ఇంగ్లీషులోనూ ప్రసంగించాను. నిద్రపోవడానికి ముందు, గాంధీగారి దర్శనంకోసం మేము సకాలంలో ఆశ్రమానికి తిరిగి వచ్చాం, ఆయన ఆ సమయంలో ప్రశాంతంగా కూర్చుని ఉత్తర ప్రత్యుత్తరాలు చూసుకుంటున్నారు.

పొద్దుట 5 గంటలకు నేను నిద్ర లేచేసరికి, చీకటి ఇంకా తచ్చాడుతూనే ఉంది. పల్లె బతుకులో అప్పుడే కదలిక మొదలయింది; మొదట ఆశ్రమం గేటు దగ్గర ఒక ఎద్దుబండి, ఆ తరవాత నెత్తిమీద పెద్ద బరువు మోస్తున్న ఒక రైతును చూశాను. పొద్దుటి పలహారం అయిన తరవాత మేము ముగ్గురం, గాంధీగారి దగ్గర సెలవు తీసుకుంటూ ప్రణామాలు అర్పించడానికి వెళ్ళాం. ఆ సాధువు ఉదయ ప్రార్థనకు నాలుగు గంటలకే లేస్తారు.

“మహాత్మాజీ, సెలవు!” ఆయన పాదాలు ముట్టుకోడానికి నేను ముందుకు వంగాను. “మీ సంరక్షణలో భారతదేశం క్షేమంగా ఉంది.”

వార్ధా యాత్ర ముగిసిన తరవాత కొన్నేళ్ళు గడిచిపోయాయి. భూమి, మహాసముద్రాలు, ఆకాశం, యుద్ధంలో మునిగిన ప్రపంచంతో మలినమైపోయాయి. ప్రపంచ మహానాయకుల్లో గాంధీగారొక్కరే ఆయుధ బలానికి బదులుగా, ఆచరణానుకూలమైన అహింసను ప్రత్యామ్నాయంగా ప్రసాదించారు. కష్టనష్టాల్ని తీర్చడానికి అన్యాయాల్ని తొలగించడానికి గాంధీమహాత్ములు అహింసా సాధానాల్ని చేబట్టారు. అవి ఎంత ఫలదాయక మైనవో పదేపదే నిరూపించుకున్నాయి. ఆయన తమ సిద్ధాంతాన్ని కింది మాటల్లో చెప్పారు:

“వినాశానికి నడుమ జీవితం కొనసాగుతూండడం చూశాను. కాబట్టి వినాశంకంటె పరమధర్మం ఒకటి ఉండితీరాలి. ఒక్క ఆ ధర్మంలో సువ్యవస్థితమైన సమాజమే అవగాహనకు అందుతుంది; జీవితం జీవన యోగ్యమవుతుంది.”

“జీవితధర్మం అదే అయినట్లయితే, మనం దాన్ని నిత్యజీవితంలో అమలులో పెట్టాలి. యుద్ధాలు ఎక్కడ ఉంటే అక్కడ, ప్రత్యర్థి ఎక్కడ ఎదురయితే అక్కడ, మనం ప్రేమతో జయించాలి. ఒకానొక ప్రేమసూత్రం నా జీవితంలోనే, విధ్వంస సూత్రం అందించనంత ఫలితాన్ని అందించింది.”

“భారతదేశంలో మనకు, ఈ సూత్రం పనిచెయ్యడం అత్యంత విశాల స్థాయిలో కళ్ళకు కట్టింది. అహింస 36,00,00,000 మందిలోకి చొచ్చుకుపోయిందని నేను అనను; కాని అత్యంత స్వల్పకాలంలో ఏ ఇతర సిద్ధాంతమూ చొచ్చుకుపోనంతగా ఇది చొరబారిందని తప్పకుండా చెబుతాను.”

“అహింసాత్మక మనఃస్థితి సాధించడానికి చాలా శ్రమతో కూడా శిక్షణ అవసరమవుతుంది. సైనికుడి జీవితంలాగే అది, క్రమశిక్షణతో కూడిన జీవితం. మనోవాక్కాయాలు సరయిన సమన్వయం పొంది ఉన్నప్పుడే పరిపూర్ణస్థితిని అందుకోడం జరుగుతుంది. సత్యాహింసల నియమాన్ని మన జీవితధర్మంగా చేసుకోవాలని నిర్ధారణ చేసుకుంటే, ప్రతి సమస్యా పరిష్కారానికి లొంగుతుంది.”

ఆధ్యాత్మిక దృష్టి లేకపోతే ప్రజలు నశించిపోతారన్న సత్యాన్ని, భయంకరమైన ప్రపంచ రాజకీయ సంఘటనల పరంపర, నిర్దాక్షిణ్యంగా చూపిస్తోంది. మతం కాకపోతే విజ్ఞానశాస్త్రం, మానవజాతిలో భద్రతా రాహిత్యజ్ఞాన లేశాన్నీ సమస్త భౌతిక వస్తువుల అశాశ్వతత్వాన్నీ జాగృతం చేసింది. మానవుడిప్పుడు, అంతర్నిహితమైన తన మూలతత్త్వం దగ్గరికి అంటే తనలో ఉన్న పరమాత్మ దగ్గరికి ― కాకపోతే, నిజంగా మరెక్కడికి పోతాడు?

చరిత్ర తిరగేసినట్లయితే, మానవుడి సమస్యలేవీ పాశవిక శక్తిని ఉపయోగించడంవల్ల పరిష్కారం కాలేదని సహేతుకంగా ఎవరయినా చెప్పవచ్చు. మొదటి ప్రపంచయుద్ధం, దురంత భయానక కర్మను సృష్టించింది; అది రెండో ప్రపంచ యుద్ధంగా పరిణమించింది. ఇప్పటి దుష్కర్మ అనే పెద్ద మంచుగడ్డను కరిగించగలిగింది, సోదరభావమనే ఎండవేడి మాత్రమే; లేనినాడు, అది మూడో ప్రపంచయుద్ధంగా మారవచ్చు. ఇరవయ్యో శతాబ్దిలో అమంగళత్రయం! వివాదాల్ని పరిష్కారం చెయ్యడంలో మానవ వివేకానికి బదులుగా ఆటవిక తర్కాన్ని ఉపయోగించినట్లయితే భూమిమీద మళ్ళీ ఆటవికతను సృష్టించినట్టే. జీవితంలో సోదరులు కాకపోతే, భయానక మృత్యువులోనే సోదరులవుతారు వాళ్ళు. అణుశక్తుల్ని కని పెట్టడానికి దైవం, ప్రేమతో మనిషిని అనుమతించింది అటువంటి అవమానం తెచ్చుకోడానికి కాదు.

యుద్ధమూ నేరమూ ఎన్నడూ లాభించవు. విస్ఫోటక శూన్యత అనే పొగలోకి పోయిన కోట్లకొద్ది డాలర్లు, ఒక కొత్త ప్రపంచాన్ని- రోగమన్నది దాదాపు లేకుండా, పేదరికం అసలే లేకుండా ఉండే ప్రపంచాన్ని రూపొందించడానికి సరిపోయి ఉండేవి. భయం, సంక్షోభం, కరువు, మహామారి విలయ తాండవం చేసే ప్రపంచం కాదు నెలకొనవలసింది; శాంతి, సౌభాగ్యం, విస్తరించే జ్ఞానం ఉండే విశాల ప్రపంచం.

గాంధీగారి అహింసావాణి, మానవుడి అత్యున్నత చేతనను స్పృశిస్తుంది. దేశాలు ఇకముందు, చావులో కాక, బతుకులో మైత్రి ఏర్పరుచుకోవాలి; నాశనంలోకాదు, నిర్మాణంలో; ద్వేషంతోకాదు, ప్రేమమయమైన సృజనశీలక అద్భుతచర్యలతో.

“ఎవరయినా హాని కలిగించినప్పుడు క్షమించాలి,” అంటుంది మహాభారతం. “మానవుడు క్షమిస్తూ ఉండటంవల్ల నే మానవజాతి మనుగడ సాగుతోందని చెప్పారు. క్షమించడం పవిత్రత; క్షమవల్లనే విశ్వం సుసంఘటితమై ఉంది. క్షమ బలవంతుల బలం; క్షమ త్యాగం; క్షమ మనశ్శాంతి. క్షమ, సాధుస్వభావం ఆత్మసంయమంగలవాళ్ళ గుణాలు. అవి శాశ్వత సద్గుణానికి చిహ్నాలు.”

క్షమ - ప్రేమల ధర్మంలోంచి సహజంగా పుట్టిందే అహింస. ధర్మ యుద్ధంలో ప్రాణనష్టమే అవసరమయితే, జీసస్ మాదిరిగా, తన రక్తం ధారపొయ్యడానికి సిద్ధంగా ఉండాలి కాని, ఇతరుల రక్తం పారించడానికి కాదు,” అని కంఠోక్తిగా చెప్పారు గాంధీగారు. “తత్ఫలితంగా, ప్రపంచంలో రక్తం చిందడం క్రమంగా తగ్గుతుంది.”

ప్రేమతో ద్వేషానికి, అహింసతో హింసకూ తట్టుకొని, ఆయుధాలు ధరించడం కంటె, నిర్దాక్షిణ్యంగా జరిగే ఊచకోతకు సిద్ధపడిన భారతీయ సత్యాగ్రహులగురించి ఎప్పుడో ఒకనాడు మహేతిహాస గ్రంథాలు వెలువడకపోవు. తత్ఫలితంగా కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థులు అవమానం పొంది, తన ప్రాణంకన్న ఇతరుల ప్రాణాలకు ఎక్కువ విలువ ఇచ్చే మనుషులు కంటబడడంతో గాఢంగా చలించిపోయి, తమ తుపాకులు కిందపారేసి పారిపోవడం జరిగింది.

“నా దేశానికి స్వాతంత్ర్యం సంపాదించడానికి రక్తపాతం కావించే మార్గాల్ని అనుసరించడం కంటె, అవసరమయితే కొన్ని యుగాలయినా కాసుకొని ఉంటాను.” బైబిలు ఇలా హెచ్చరిస్తుంది: “కత్తి పట్టిన వాళ్ళందరూ కత్తికే ఎర అవుతారు,”[13] అని. మహాత్ములు ఇలా రాశారు:

“నేను జాతీయవాదీనని చెప్పుకొంటాను; కాని నా జాతీయవాదం విశ్వమంత విశాలమయినది. భూమిమీదున్న దేశాలన్నింటినీ తన ఒడిలోకి తీసుకుంటుందది.[14] నా జాతీయతావాదంలో సర్వప్రపంచ సంక్షేమమూ ఇమిడి ఉంది. నా భారతదేశం, ఇతర దేశాల బూడిదగుట్టలలోంచి పైకి లేవాలని కోరను నేను. భారతదేశం ఏ ఒక్క మనిషినీ దోచుకోవాలని కోరను. భారతదేశం తన బలంతో ఇతర దేశాల్ని కూడా శక్తిమంతం చెయ్యగలగడానికి అది బలిష్ఠంగా ఉండాలని కోరతాను. ఈనాడు యూరప్‌లో ఒక్క దేశమయినా అలా లేదు; అవి ఇతర దేశాలకు బలం చేకూర్చవు.

“ప్రెసిడెంట్ విల్సన్ పధ్నాలుగు చక్కని అంశాలు రూపొందించి, వాటిని పేర్కొన్నాడు కాని, “ఇంతా చేసి, శాంతి సాధించడానికి మనం చేసే ప్రయత్నం విఫలమయిందంటే, మళ్ళీ చేబట్టడానికి మనకి ఆయు ధాలు ఉండనే ఉన్నాయి,” అన్నాడు. ఆ స్థితిని నేను ఇలా తిప్పి చెప్పాలనుకుంటున్నాను: “ఇప్పటికే మన ఆయుధాలు విఫలమయాయి. ఇప్పుడిక కొత్తదారి వెతుక్కుందాం; సత్యమనే ప్రేమ, దైవశక్తిని ఉపయోగించి చూద్దాం. అది ఉంటే మన కింకేమీ అక్కర్లేదు.”

మహాత్ముల సందేశాన్ని వ్యాప్తిచేసే వేలాది నిజమైన సత్యాగ్రహుల్ని (ఈ అధ్యాయంలో తొలిభాగంలో ఉదాహరించిన పదకొండు కఠోర ప్రతిజ్ఞలూ తీసుకున్న వాళ్ళను) తర్ఫీదు చెయ్యడంవల్లా; అహింస వల్ల కలిగే ఆధ్యాత్మిక లాభాలనూ ఉత్తరోత్తరా భౌతిక లాభాలనూ అవగాహన చేసుకునేందుకుగాను భారత జనసామాన్యానికి ఓర్పుతో బోధించడంవల్లా, అన్యాయానికి సహాయం చేయడానికి నిరాకరించడం, ఆయుధాలు చేపట్టడంకన్న అవమానాల్నీ జైలుశిక్షనూ చావునూ సైతం సహించడానికి అంగీకారం అన్న అహింసాత్మక ఆయుధాల్ని ప్రజలకు అందించడంవల్లా, సత్యాగ్రహుల్లో వీరోచితమైన బలిదానానికి లెక్కలేనన్ని ఉదాహరణల ద్వారా ప్రపంచ సానుభూతి సంపాదించడంవల్లా గాంధీగారు, అహింసకున్న ఆచరణానుకూల స్వభావాన్నీ, యుద్ధానికి దిగే అవసరం లేకుండా వివాదాల్ని పరిష్కరించుకోడానికి తోడ్పడే, దాని గంభీరశక్తినీ నాటకసహజంగా చిత్రీకరించారు.

మరే దేశంలోనూ మరే నాయకుడూ, తుపాకిగుండ్ల ద్వారా తప్ప మరే విధంగామా ఎన్నడూ తన దేశానికి సంపాదించని అనేక రాజకీయ పరిష్కారాల్ని అప్పటికే గాంధీగారు అహింసామార్గాల్లో సాధించారు. అన్ని తప్పుల్నీ అన్ని చెడుల్నీ నిర్మూలించడానికి అహింసా పద్ధతుల్ని రాజకీయ రంగంలోనే కాకుండా, భారతీయ సంఘ సంస్కరణ అనే సునిశిత సంకీర్ణ రంగంలో కూడా ప్రశస్తంగా ప్రయోగించడం జరిగింది. గాంధీగారూ ఆయన అనుచరులూ, హిందువులకూ, మహమ్మదీయులకూ మధ్య చాలా కాలంగా సాగుతున్న వివాదాల్ని చాలావాటిని పరిష్కరించారు; కొన్ని లక్షలమంది ముస్లిములు గాంధీగారిని తమ నాయకుడుగా భావించుకున్నారు. అంటరానివాళ్ళు ఆయన్ని, తమకోసం నడుం కట్టిన నిర్భయ విజయ వీరుడిగా పరిగణిస్తారు. “నాకు మరో జన్మ కనక ఉండేటట్లయితే నేను అంటరానివాళ్ళలో ఒక అంటరానివాడిగా పుట్టాలని కోరుకుంటాను; ఎంచేతంటే, దానివల్లే నేను వాళ్ళకి మరింత సార్థకమైన సేవ చెయ్యగలుగుతాను,” అని రాశారు గాంధీగారు.

గాంధీ మహాత్ములు నిజంగా “మహాత్ములే”; కాని ఆయనకి ఆ బిరుదు ఇవ్వాలన్న వివేకం చూపించినవాళ్ళు, కోట్లకొద్ది నిరక్షరాస్యులు. సాధుసత్తముడైన ఈ ప్రవక్త తన దేశంలోనే గౌరవం పొందారు. నిమ్న స్థాయి రైతు, గాంధీగారి పెద్ద సవాలు అందుకోడానికి పెరగగలిగాడు. మనిషిలో స్వభావసిద్ధమయిన ఔదార్యాన్ని గాంధీమహాత్ములు హృదయ పూర్వకంగా విశ్వసిస్తారు. తప్పనిసరి అపజయాలు ఆయనకు ఎన్నడూ దిగ్భ్రమ కలిగించలేదు. “ప్రత్యర్థి తనను ఇరవై సార్లు దగా చేసినా, ఇరవై ఒకటోసారి కూడా అతన్ని నమ్మడానికి సిద్ధంగా ఉంటాడు సత్యాగ్రహి; ఎంచేతంటే, మానవ ప్రవృత్తి మీద అచంచల విశ్వాసం ఉండటమే అతని సిద్ధాంత సారం కనక,” అని రాశారు గాంధీగారు.[15] “మహాత్మాజీ, మీ రయితే అసాధారణ వ్యక్తులు. మీరు చేసినట్టే లోకం చెయ్యాలని ఆశించగూడదు,” అన్నాడొక విమర్శకుడు ఆయనతో.

“శరీరాన్ని మెరుగుపరుచుకోగలంగాని ఆత్మకున్న గుప్తశక్తుల్ని మేల్కొలపడం అసాధ్యమని మనని మనం ఎంత భ్రమ పెట్టుకుంటామో చూస్తే విడ్డూరంగా ఉంటుంది,” అని జవాబిచ్చారు గాంధీగారు. “అటువంటి శక్తుల్లో ఏదయినా ఒకటి ఉన్నట్లయితే, మనలో అందరిలాగే నేనూ దుర్బల మర్త్యుణ్ణేననీ, నాలో అసాధారణమైన దేదీ వెనకకాని ఇప్పుడుకాని లేదనీ నిరూపించడానికే నేను ప్రయత్నిస్తున్నాను. ప్రతి సాటిమనిషి లాగే నేను కూడా సహజంగా తప్పులు చేసే సామాన్య వ్యక్తినే. అయితే నేను నా తప్పుల్ని ఒప్పుకొని, వాటిని సరిదిద్దుకోడానికి కావలసినంత వినయం ఉన్నవాణ్ణని అంగీకరిస్తాను. భగవంతుడి మీదా ఆయన మంచి తనం మీదా నాకు అచంచలమైన విశ్వాసం, సత్యంకోసమూ ప్రేమకోసమూ అవ్యయమైన ఆకాంక్ష ఉన్నాయని ఒప్పుకుంటాను. కాని ఇది ప్రతిమనిషిలోనూ అంతర్నిహితంగా లేదా?” - అంటూ ఆయన ఇంకా అన్నారు: “దృగ్విషయిక ప్రపంచంలో మనం కొత్త ఆవిష్కరణలూ నూతన కల్పనలు రూపొందిస్తూంటే, ఆధ్యాత్యిక రంగంలో మన దివాళా కోరుతనాన్ని చాటి చెప్పుకోవాలా? అపవాదాల్ని ఒక సూత్రంగా చెయ్యడానికి వాటి సంఖ్యను గుణించుకుంటూ పోవడం అసాధ్యమా? అంతగా అయితే మనిషి, మొదట ఆటవికుడయిన తరవాతే మనిషి కావాలా?”[16] విలియం పెన్, 17 శతాబ్దిలో పెనిసిల్వేనియా వలస స్థాపించడంలో విజయవంతంగా పనిచేసిన అహింసా ప్రయోగాన్ని అమెరికన్లు గుర్తు చేసుకోవచ్చు. అప్పుడక్కడ, “కోటలు లేవు, సైనికులు లేరు, స్వచ్ఛంద సేనలు లేవు, ఆయుధాలు కూడా లేవు.” కొత్తగా వలసవచ్చిన వాళ్ళకూ స్థానిక ఎర్ర ఇండియన్లకూ మధ్య సాగిన దారుణమైన సరిహద్దు పోరాటాల్లోనూ మారణ కాండల్లోనూ ఏ కష్టాలకూ గురికాకుండా ఉన్నవాళ్ళు, పెనిసిల్వెనియా క్వేకర్లు అనే ఒక తెగవాళ్ళు మాత్రమే. “ఇతరుల్ని చంపేశారు; కొందర్ని ఊచకోత కోశారు; కాని వీళ్ళు క్షేమంగానే ఉన్నారు. క్వేకర్లలో ఒక్క ఆడది కూడా ఆపదకు గురికాలేదు; క్వేకర్లలో ఒక్క పిల్లవాణ్ణి కూడా చంపలేదు; ఒక్క మగవాణ్ణి కూడా హింసించలేదు.” చివరికి క్వేకర్లు, బలవంతాన రాష్ట్రపాలన విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు, “యుద్ధం రగిలింది; కొందరు పెనిసిల్వేనియా వాసుల్ని చంపేశారు; క్వేకర్లనయితే ముగ్గురినే చంపారు; ఆ ముగ్గురూ కూడా, ఆత్మరక్షణకోసం ఆయుధాలు తీసుకు వెళ్ళగూడదన్న విశ్వాసం కోల్పోయి పతనమైనవాళ్ళు.”

“మొదటి ప్రపంచ మహాయుద్ధంలో బలప్రయోగం ప్రశాంతి నెల కోల్పలేక పోయింది,” అని చెప్పాడు, ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్. “జయాపజయాలు, ఒకదానిలాగే మరొకటి నిస్సారమయినవి. ప్రపంచం ఆపాఠం నేర్చుకొని ఉండవలసింది.”

“హింసాత్మకమైన ఆయుధాలు ఎక్కువయినకొద్దీ మానవజాతికి దైన్యం ఎక్కువవుతుంది,” అని బోధించాడు లావోట్జు. “హింసకు లభించే విజయం సంతాపోత్సవంతో ముగుస్తుంది.”

“నేను పోరాడుతున్నది. ప్రపంచ శాంతికోసమే కాని మరి దేని కోసమూ కాదు,” అని చాటి చెప్పారు గాంధీగారు. “భారతీయ ఉద్యమం, అహింసాయుత సత్యాగ్రహ ప్రాతిపదిక మీద సాగినట్లయితే అది దేశ భక్తికి కొంత అర్థం ఇస్తుంది – అంతేకాదు, జీవితానికి కూడా నని నేను సవినయంగా మనవి చేస్తాను.”

గాంధీగారి కార్యక్రమాన్ని అలవిగాని కలలు కనేవాడి కల్పనగా కొట్టి పారేసేముందు పాశ్చాత్య దేశాలు, సత్యాగ్రహాన్ని గురించి గలీలీ గురువు ఇచ్చిన నిర్వచనాన్ని గురించి ఆలోచించడం మంచిది.

“కంటికి కన్నూ పంటికి పన్నూ అని చెబుతూ ఉండడం మీరువిన్నారు; కాని నే నంటాను, నువ్వు చెడును (చెడుతో) అరికట్టకు: అంతకన్న, ఎవరయినా నీ కుడి చెంపమీద ఒక్క పెట్టు పెడితే, అతనికి నీ రెండో చెంప కూడా చూపించు.” (మత్తయి 5 : 38-39).

ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలతో నిర్వీర్యమై విధ్వంసమైన శతాబ్దిలో, కచ్చితమైన భగవత్కాల నిర్ణయానుసారంగా గాంధీ శకం ముగిసింది. ఆయన జీవితం అనే రాతిగోడ మీద దివ్య హస్తాక్షరాలు కనిపిస్తాయి: అది సోదరుల్లో ఇక మళ్ళీ రక్తపాతం జరగగూడదన్న హెచ్చరిక.

గాంధీమహాత్ముల దస్తూరీ,

హిందీలో

గాంధీమహాత్ములు యోగదా సత్సంగ విద్యాలయాన్ని సందర్శించారు. వారు దయతో, అతిథుల అభిప్రాయాల పుస్తకంలో ఈ కింది పంక్తులు రాశారు:

“ఈ సంస్థ నాకు ఎంతో నచ్చింది. ఈ విద్యాలయం రాట్నంవాడకాన్ని ఇంకా ఎక్కువగా ప్రోత్సహిస్తుందని ఎంతో ఆశిస్తున్నాను.”

సెప్టెంబరు 17, 1925

(సంతకం) మోహన్ దాస్ గాంధీ

గాంధీమహాత్ములకు నివాళి

“జాతిపిత అన్న పేరు ఆయనకు సార్థకమయింది; ఒక పిచ్చివాడు ఆయన్ని చంపాడు. వెలుగు ఆరిపోయినందుకు కోటానుకోట్లు విలపించిపోతున్నారు... ఈ గడ్డ మీద వెలిగిన వెలుగు మామూలు వెలుగు కాదు. ఆ వెలుగు ఈ దేశంలో వెయ్యేళ్ళు కనిపిస్తుంది; ప్రపంచం దాన్ని దర్శిస్తుంది.” 1948 జనవరి 30న న్యూఢిల్లీలో మహాత్మాగాంధీ హత్య జరిగిన కొద్దిసేపటికి, భారత ప్రధాని అన్నమాటలివి.

అంతకు కొన్ని నెలలముందు భారతదేశం, శాంతియుతంగా దేశ స్వాతంత్ర్యం సంపాదించుకుంది. 78 ఏళ్ళ వయస్సుగల గాంధీ గారి పని పూర్తి అయిపోయింది. తమ రోజులు దగ్గర పడుతున్నాయని ఆయన తెలుసుకున్నారు. ఆ విషాద సంఘటన జరిగిననాడు పొద్దున, “ఆభా, ముఖ్య మైన కాయితాలన్నీ ఇలా తీసుకురా,” అని మనమరాలితో చెప్పారాయన. “నే నివాళ జవాబులు రాసెయ్యాలి. రేపనేది ఇక లేకపోవచ్చు.” తమ చరమ భవితవ్య సూచనల్ని గాంధీ గారు తమ రచనల్లో అనేకచోట్ల వెల్లడించారు.

ఉపవాసాలతో చిక్కి శల్యమైన శరీరంలో మూడు పిస్తోలు గుండ్లతో మరణిస్తున్న మహాత్ములు, మెల్లగా నేలకు వాలుతూ, మౌనంగా క్షమాదానం చేస్తూ హిందూ సంప్రదాయపద్ధతిలో నమస్కరిస్తూ చేతులు పైకి ఎత్తారు. జీవితంలో నటనే ఎరగని గాంధీగారు ఆ మరణ సమయంలో మహానటులయారు. ఆయన నిస్స్వార్థ జీవితంలోని త్యాగాలన్నీ కలిసి, ప్రేమపూర్వకమైన ఆ చివరి భంగిమను చూపించగలిగాయి.

ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ మహాత్ములకు జోహార్లు అర్పిస్తూ ఇలా అన్నాడు. “ఇటువంటి వ్యక్తి ఒకడు రక్తమాంసాలతో ఈ భూమిమీద నడిచాడన్న సంగతి నమ్మలేని తరాలు కూడా రావచ్చు.” రోమ్‌లో వాటికన్ నుంచి వచ్చిన సమాచారంలో ఇలా ఉంది: “ఆ హత్య ఇక్కడ మాకు ఎంతో సంతాపం కలిగించింది. క్రైస్తవ సద్గుణాలు మూర్తీ భవించిన దేవదూతవంటి గాంధీగారి కోసం ప్రజలు విలపిస్తారు.”

ఒక విశిష్ట సత్కార్యాన్ని సాధించడానికి భూమి మీదికి వచ్చిన మహాపురుషులందరి జీవితాలూ ఏదో ఒక ప్రతీకాత్మకమైన అర్థంతో ముడిపడి ఉంటాయి. భారత సమైక్యంకోసం నాటకీయంగా సంభవించిన గాంధీగారి మరణం ప్రతి ఖండంలోనూ అనైక్యంతో చీలికలై పోయిన ప్రపంచానికి ఆయన సందేశాన్ని ప్రముఖంగా చాటి చెప్పింది. ఆ సందేశాన్ని ఆయన భవిష్యత్తును సూచించే ఒక ప్రవక్త మోస్తరుగా ఇలా వెల్లడించారు:

“అహింస జనబాహుళ్యంలోకి వచ్చింది; అది జీవిస్తుంది. అది ప్రపంచానికి. శాంతిదూత.”

  1. “సత్యానికి నిలబడి ఉండడం” అన్నది, ఈ సంస్కృతపదానికి అనువాదం. సత్యాగ్రహమన్నది గాంధీగారు నడిపిన ప్రసిద్ధ అహింసోద్యమం.
  2. గాంధీ మహాత్ములు రాసిన ఉత్తరాలు కొన్ని ఈమె ప్రకటించింది. ఈమెకు గురువుగారు నేర్పిన స్వయంశిక్షణ వీటిలో వెల్లడి అవుతుంది. (‘గాంధీస్ లెటర్స్ టు ఏ డిసైపుల్’, హార్పర్ అండ్ బ్రదర్స్, న్యూయార్కు, 1950).

తరవాత ప్రచురించిన ఒక పుస్తకం (ది స్పిరిట్స్ పిల్గ్రిమేజ్; కోవర్డ్ - మెక్‌కాన్, న్యూయార్కు, 1960) లో మిస్ స్లేడ్, గాంధీగారిని వార్ధలో కలుసుకున్న అనేకమందిని గురించి ప్రస్తావించింది. ఆమె ఇలా రాసింది: “ఇంతకాలం గడిచాక ఇప్పుడు నేను వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోలేను; కాని ఇద్దరు మాత్రం మనస్సులో స్పష్టంగా, నిలిచిపోయారు: టర్కీదేశపు ప్రసిద్ధ రచయిత్రి హాలిద్ ఎదీబ్ హానుమ్, అమెరికాలో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థను స్థాపించిన స్వామి యోగానందగారు.” (ప్రచురణకర్త గమనిక).

  • మిస్ స్లేడ్‌ను చూస్తుంటే నాకు గుర్తువచ్చిన మరో వ్యక్తి మిస్ మార్గరెట్ వుడ్రో విల్సన్; ఈమె అమెరికా అధ్యక్ష మహాశయుల పుత్రిక. ఈమెను నేను అమెరికాలో కలుసుకున్నాను. భారతదేశం మీద ఈమెకు గాఢమైన ఆసక్తి ఉండేది. తరవాత ఈమె పుదుచ్చేరి వెళ్ళింది; జీవితంలో చివరి ఐదేళ్ళూ ఈవిడ అక్కడే ఆత్మద్రష్ట అయిన మహాయోగి, శ్రీ అరవింద ఘోష్ పాదసన్నిధిలో - సంతోషంగా శిక్షణ పొందుతూ గడిపింది.
  • నేను అమెరికాలో చాలా సంవత్సరాలనుంచి మౌనసమయాలు పాటిస్తూ నన్ను కలుసుకోడానికి వచ్చేవాళ్ళకూ నా కార్యదర్శులకూ వెరపు కలిగిస్తూ వచ్చాను.
  • హాని చెయ్యకపోవడం; గాంధీజీ జీవిత తత్త్వాని కిది పునాది. అహింసను మూలగుణంగా మన్నించే జైనులవల్ల ఆయన గాఢంగా ప్రభావితులయారు. హిందూమతంలో ఒక శాఖ అయిన జైనమతాన్ని బుద్ధుడి సమకాలికుడైన మహావీరుడు, క్రీ. పూ. 6 శతాబ్దిలో విస్తృతంగా వ్యాప్తిచేశాడు. మహావీరుడంటే “గొప్ప నాయకుడు” - అనేక శతాబ్దాల అనంతరం ఆయన, తన వీరపుత్రులైన గాంధీగారిని చూసుగాక!
  • గాంధీగారు, ‘ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్’ అన్న పుస్తకం (అహమ్మదాబాద్ : నవజీవన్ ప్రెస్) లో తమ జీవిత కథను కఠోరమైన నిష్కాపట్యంతో అభివర్ణించారు.

    ప్రసిద్ధమైన పేర్ల తోనూ అద్భుతమైన సంఘటనలతోనూ కిక్కిరిసిపోయే ఆత్మకథలు అనేకం, అంతరంగ విశ్లేషణ విషయంలో కాని, వికాసానికి సంబంధించిన ఏదశను గురించి కాని, దాదాపు పూర్తిగా మౌనం వహిస్తాయి. “ఈయన చాలామంది ప్రసిద్ధ వ్యక్తుల్ని ఎరిగినవాడే కాని, తనను తాను ఎన్నడూ తెలుసుకున్నవాడు కాడు,” అన్నట్టుగా, ఒక రకమైన అసంతృప్తితో ఈ పుస్తకాలు పక్కన పెట్టేస్తాడు చదువరి. గాంధీగారి ఆత్మకథ విషయంలో ఇలాటిది జరగడం అసంభవం; ఆయన తమ తప్పుల్నీ తమాషాల్నీ వ్యక్తి ప్రమేయంలేని సత్య సంధతతో బయటపెడతారు; ఏ యుగ చరిత్రలోనయినా ఇలాటిది జరగడం అరుదు.

  • గాంధీగారు, చిన్నవీ పెద్దవీ కూడా, చాలా ఉపవాసాలు చేశారు. ఆయన ఆరోగ్యం చాలా మంచిది. ‘డయట్ అండ్ డయట్ రిఫారం; నేచర్ క్యూర్; కీ టు హెల్త్’ అన్న ఆయన పుస్తకాలు, భారతదేశంలో, అహమ్మదాబాదులో నవజీవన్ పబ్లిషింగ్ హౌస్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి.
  • థోరో, రస్కిన్, మాజినీ అన్న ఇతర పాశ్చాత్య రచయితల గ్రంథాల్ని కూడా గాంధీగారు నిశితంగా అధ్యయనం చేశారు.
  • క్రీ. పూ. సుమారు 1000 లో జొరాస్టర్ పర్షియాకు ప్రసాదించిన పవిత్ర గ్రంథం.
  • ప్రపంచమతాల్లో హిందూమతం విశిష్టత ఏమిటంటే, అది ఎవరో ఒక గొప్ప వ్యవస్థాపకుడు ఏర్పరిచింది కాక, వ్యక్తి ప్రమేయంలేని వైదిక గ్రంథాల ద్వారా ఆవిర్భవించింది. ఆ విధంగా హిందూమతం, అన్ని కాలాల, అన్నిదేశాల ప్రవక్తల్నీ పూజ్యభావంతో కలుపుకోడానికి అవకాశమిస్తుంది. పవిత్ర వేదగ్రంథాలు, మానవుడు చేసే ప్రతి పనికీ దైవనియమంతో సామరస్యం కలిగించే ప్రయత్నంలో భక్తి తత్పరతనే కాకుండా ముఖ్యమైన సాంఘికాచారాల్ని అన్నిటినీ కూడా క్రమబద్ధం చేస్తాయి.
  • నియమ [న్యాయ] పదం కన్న సమగ్రమైన సంస్కృత పదం; నియమానికి, లేదా స్వాభావిక ఋజువర్తనకు కట్టుబడి ఉండడం; ఏ ఒక సమయంలో నయినా మనిషి ఉండే పరిస్థితుల్లో, అతనికి సహజమైన కర్తవ్యం. మానవుడు పతనంనుంచి, బాధనుంచి తనను కాపాడుకోడానికి తోడ్పడే స్వాభామిక నియమ సముదాయమని, పవిత్ర గ్రంథాలు ధర్మాన్ని నిర్వచించాయి.
  • మత్తయి 7: 21.
  • మత్తయి 26 : 52. బైబిలులో మానవుడి పునర్జన్మను గర్భితంగా సూచించిన అసంఖ్యాకమైన సందర్భాల్లో ఇది ఒకటి. జీవితంలోని జటిలతల్లో చాలావరకు, కర్మసంబంధమైన న్యాయ సూత్రాల్ని అవగాహన చేసుకోడంవల్లనే అవగాహన అవుతాయవి.
  • మనిషికి తన దేశాన్ని ప్రేమించడంలో ఘనత ఉందనుకోగూడదు, తన జాతిని ప్రేమించడంలో, తాను ఘనత పొందాలి. – పారశీక సామెత.
  • అప్పుడు పీటరు ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ, నా సోదరుడు నా విషయంలో ఎన్ని సార్లు పాపం చేస్తే నేను క్షమించాలి, ఏడు సార్లా? ఏసు ప్రభువు అతనికి చెప్పాడు, ఏడుసార్లేనని చెప్పను నీకు, ఏడుకు డెబ్బైరెట్లు సార్లంటాను.” - మత్తయి 18 : 21-22. అంగీకారయోగ్యం కాజాలని ఈ సలహాను అర్థంచేసుకోడానికి నేను గాఢంగా ధ్యానించాను. “ప్రభూ, అది సాధ్యమా?” అని ఆక్షేపణ తెలిపాను. అప్పుడు చివరికొక దివ్యవాణి జవాబిచ్చి, ఒక వెలుగు వెల్లువలో నన్ను ముంచెత్తింది. “ఓ మనిషీ, మీలో ప్రతివాణ్ణీ నేను రోజూ ఎన్ని సార్లు క్షమించడం లేదూ?”
  • గొప్ప ఎలక్ట్రికల్ ఇంజినియరుగా పేరు పొందిన ఛార్లెస్ పి. స్టీన్ మెట్జ్‌ను శ్రీ రోజర్ డబ్ల్యు. బాబ్సన్ ఒకసారి ఇలా అడిగాడట :

    “వచ్చే యాభై ఏళ్ళలో మహత్తర అభివృద్ధి సాధించే పరిశోధన రంగం ఏమిటి?” దానికి స్టీన్‌మెట్జ్, “ఆధ్యాత్మిక మార్గాల్లో మహత్తరమైన ఆవిష్కరణ జరుగుతుందనుకుంటాను,” అని జవాబిచ్చాడు. “మానవుల వికాసంలో మహత్తర శక్తి ఉందని స్పష్టంగా చరిత్ర ఉద్ఘాటించే బలం ఇక్కడ ఉంది. అయినా కూడా మన మిప్పటికీ దాంతో ఆడుకుంటున్నామే కాని, భౌతిక శక్తుల్ని అధ్యయనం చేసిన మాదిరిగా, దాన్ని ఎన్నడూ తీవ్రంగా అధ్యయనం చెయ్యలేదు. భౌతిక వస్తువులు సుఖాన్ని ఇచ్చేవనీ స్త్రీపురుషుల్ని సృజనశీలంగానూ శక్తిమంతంగానూ చెయ్యడంలో అవి నిరుపయోగమైనవనీ ఎప్పటికో ఒకనాటికి ప్రజలు తెలుసుకుంటారు. అప్పుడు ప్రపంచంలో విజ్ఞానశాస్త్రవేత్తలందరూ తమ ప్రయోగశాలల్ని ఇంతవరకు తడిమి కూడా చూడని దేవుణ్ణి ప్రార్థననూ ఆధ్యాత్మిక శక్తుల్నీ అధ్యయనం చెయ్యడానికి వినియోగిస్తారు. ఈ రోజు వచ్చినవాడు ప్రపంచం, వెనకటి నాలుగు తరాల్లోనూ చూసిన ప్రగతికన్న ఎక్కువ ప్రగతిని ఒక్క తరంలోనే చూస్తుంది.”