ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 46
అధ్యాయం : 46
నిరాహార యోగిని
“సార్, ఈ ఉదయం మనం ఎక్కడికి వెళ్తున్నాం?” శ్రీ రైట్ ఫోర్డు కారు నడుపుతున్నాడు; రోడ్డు మీంచి చూపు నావేపు మళ్ళించి ప్రశ్నార్థకంగా చూశాడు. అటుతరవాత తాను బెంగాలులో ఏ ప్రాంతం కనుక్కోబోతున్నాడో అతనికి అంతగా తెలిసేది కాదు.
“దేవుడు తలిస్తే, ఇప్పుడు మనం, ప్రపంచంలో ఎనిమిదో వింత చూడ్డానికి వెళ్తున్నాం- పలచని గాలి మట్టుకే భోంచేసే యోగినిని చూడ్డానికి వెళ్తున్నాం!”
“థెరిసా నాయ్‌మన్ చూసిన తరవాత - వింతలే వింతలు!” అయినా శ్రీ రైట్ కుతూహలంగా నవ్వాడు; పైగా కారువేగం పెంచాడు కూడా. అతని యాత్రా దినచర్య పుస్తకంలోకి ఎక్కడానికి ఇంకా అసాధారణమైన ముడిసరుకు దొరికింది; సామాన్య పర్యాటకుడికి దొరికే మాదిరిగా ఒకటో, అరో కాదు!
రాంచీ విద్యాలయం దాటి అప్పుడే బయటికి వచ్చాం; ఆ రోజు సూర్యుడికంటె ముందే మేలుకున్నాం. మా బృందంలో, మా కార్యదర్శీ నేనూ కాక, మరో ముగ్గురు బెంగాలీ స్నేహితులు కూడా ఉన్నారు. ఉల్లాసకరమైన చల్లగాలి పీల్చుకున్నాం; పొద్దుటిపూట దొరికే సహజ మధువు అదే. వేకువజామునే పనులకు బయలుదేరే రైతుల మధ్యమంచి రోడ్డుమీద మెల్లగా సాగే ఎడ్లబండ్ల మధ్యనుంచి కారు మెలకువగా నడి పించాడు మా డ్రైవరు, కారు చప్పుడుకు అవి బెదిరిపోయే అవకాశం లేకుండా.
“సార్, ఈ నిరాహార యోగినిని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉందండి మాకు.”
“ఆవిడ పేరు గిరిబాల,” అని చెప్పాను నా సహచరులకు. “ఆవిణ్ణిగురించి చాలా ఏళ్ళకిందట, స్థితిలాల్ నంది అనే పండితోత్తములు చెప్పగా విన్నాను. ఆయన మా తమ్ముడు విష్ణుకు చదువు చెప్పడానికి తరచుగా గుర్పార్ రోడ్డు వీధిలో మా ఇంటికి వస్తూండేవారు.”
“గిరిబాలను బాగా ఎరుగుదును,” అని చెప్పారు స్థితిబాబు. తిండి తినకుండా బతకడానికి ఆవిడ ఒక యోగప్రక్రియ సాధన చేస్తుంది. ఇచ్ఛాపూర్[1] దగ్గర ఉన్న నవాబ్ గంజ్‌లో, మాకు పొరుగింట్లోనే ఉండేది ఆవిడ. ఆవిణ్ణి సన్నిహితంగా పరిశీలించడం నే నొక పనిగా పెట్టుకున్నాను. ఆవిడ ఏదైనా తిన్నట్టు కాని, తాగినట్టు కాని నా కెన్నడూ కనిపించలేదు. చివరికి నా ఆసక్తి ఎంతగా పెరిగిందంటే, నేను బర్డ్వాన్ మహారాజు[2] దగ్గరికి వెళ్ళి, ఒక పరీక్ష జరిపించమని అడిగాను. ఆ కథ విని ఆయన ఆశ్చర్యపోయి, ఆవిణ్ణి తమ రాజమందిరానికి ఆహ్వానించారు. ఆవిడ, ఆయన పెట్టే పరీక్షకు ఒప్పుకొని, ఆయన ఇంట్లోనే, తాళం పెట్టిన ఒక వాటాలో రెండు నెలలపాటు ఉంది. తరవాత మరోసారి రాజమందిరానికి వెళ్ళి ఇరవై రోజులపాటు ఉంది; మూడో పరీక్ష పదిహేను రోజులు జరిగింది. ఈ మూడు కఠిన పరీక్షల ద్వారా, ఆవిడ నిరాహార స్థితిలో ఉంటుందని తాము నిస్సందేహంగా నమ్ముతున్నట్టు మహారాజావారు నాకు స్వయంగా చెప్పారు.”
“స్థితిబాబు చెప్పిన ఈ కథ ఇరవై ఏళ్ళకు పైగా నా మనస్సులో నాటుకుపోయింది,” అంటూ ఇలా చెప్పి ముగించాను. “నేను ఆ యోగినిని కలుసుకోకముందే కాలప్రవాహం ఆవిణ్ణి కబళించెయ్యదు కదా అని, అప్పుడప్పుడు అమెరికాలో అనుకుంటూ ఉండేవాణ్ణి. ఈపాటికి చాలా వృద్ధురాలై ఉంటుందావిడ. ఇప్పుడు ఎక్కడ ఉంటోందో, అసలు బతికుందో లేదో కూడా నాకు తెలియదు. కాని, ఇంకొన్ని గంటల్లో మనం పురులియా చేరతాం; ఆవిడ సోదరుడికి ఒక ఇల్లుంది అక్కడ,” అన్నాను.
పదిన్నరకి మేము గిరిబాలగారి సోదరుడు, లంబోదర డేతో ముచ్చటిస్తున్నాం. ఆయన పురులియాలో వకీలు.
“మా అక్కయ్య బాగానే ఉంది. ఆవిడ ఒక్కొక్కప్పుడు ఇక్కడ నా దగ్గరే ఉంటూంటుంది; కాని ప్రస్తుతం, బియూర్‌లో మా ఇంట్లో ఉంటోంది.” లంబోదర బాబు మా ఫోర్డు కారు వేపు సంశయంగా చూశారు. “స్వామీజీ, బియూర్ దాకా లోపలికి ఇంతవరకు ఏ కారూ చొచ్చుకు వెళ్ళలేదనుకుంటాను. మీ రందరూ ఎడ్లబండి కుదుపులకు సిద్ధపడ్డమే మంచిదనుకుంటాను.”
మా బృందంలో అందరూ మా ఫోర్డు కారుపట్ల, ఏకగ్రీవంగా విశ్వాసం ప్రకటించారు.
“ఈ పోర్డు అమెరికా నుంచి వచ్చినది,” అని చెప్పాను ఆ వకీలుకు. “బెంగాలు నడిబొడ్డుతో పరిచయం చేసుకునే అవకాశం దానికి లేకుండా చెయ్యడం విచారకరమైన విషయం!” “గణేశుడు[3] మీకు తోడు వచ్చుగాక!” అన్నారు లంబోదరబాబు, నవ్వుతూ. మర్యాదగా ఇంకా ఇలా అన్నారు: “మీ రెప్పటికయినా అక్కడికి చేరడమే జరిగితే, గిరిబాల మిమ్మల్ని చూసి సంతోషిస్తుందన్నది ఖాయం. ఇప్పుడావిడ డెబ్బయ్యోపడిలో పడబోతోంది; అయినా ఆరోగ్యం దివ్యంగా ఉంది.”
“అయ్యా, ఒక్క మాట చెప్పండి, ఆవిడ ఏమీ తినరన్నది పూర్తిగా నిజమేనా?” మనస్సులో భావాల్ని బయలుపరిచే కిటికీల్లాటి ఆయన కళ్ళలోకి సూటిగా చూశాను.
“అది నిజం.” ఆయన చూపు నిష్కల్మషంగా, విశ్వసనీయంగా ఉంది. “ఏభై ఏళ్ళలో ఆవిడ ఒక్క ముద్దకూడా అన్నం తినగా నేను చూడలేదు. ఈ ప్రపంచం హఠాత్తుగా అంతమయినా నేను ఆశ్చర్యపోను కాని, మా అక్కయ్య అన్నం తింటోందంటే ఆశ్చర్యపోతాను!”
ప్రపంచంలో ఈ రెండు సంఘటనలూ అసంభవమైనవే కనక, ఇద్దరం ముసిముసి నవ్వులు నవ్వుకున్నాం.
“గిరిబాల తన యోగసాధనలకు, అలవి కాని ఏకాంతం కోసం ఎన్నడూ ఎదురు చూడలేదు,” అంటూ సాగించారు లంబోదర బాబు. “ఆవిడ జీవితమంతా, మా ఇంట్లోవాళ్ళ మధ్యా స్నేహితుల మధ్యా గడిచింది. ఆవిడ విచిత్ర స్థితికి వాళ్ళందరూ అలవాటు పడిపోయారు. గిరిబాల ఏదైనా తినాలని హఠాత్తుగా నిర్ణయించుకుంటే, వాళ్ళలో ఆశ్చర్యపోని వాళ్ళు ఒక్కరూ ఉండరు! హిందూ వితంతువుకు తగినట్టుగా మా అక్కయ్య, సహజంగా విశ్రాంతి జీవితం గడుపుతూంటుంది. కాని పురులియాలోనూ బియూర్‌లోనూ ఉన్న మా వాళ్ళందరికీ ఆవిడ, అసాధారణ స్త్రీ అన్న సంగతి తెలును.” ఆ సోదరుడి చిత్తశుద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. మా చిన్న బృందం, ఆయనకు మనసారా ధన్యవాదాలు చెప్పి బియూర్‌కు దారి తీసింది. ఒక వీధిలో ఉన్న దుకాణం దగ్గర లూచీలూ (రొట్టెలు) కూరా కొనుక్కోడానికి మేము ఆగాం. శ్రీ రైట్, నిరాడంబరమైన హిందూ పద్ధతిలో వేళ్ళతో తింటూండగా, ఊళ్ళో పిల్లలు చుట్టూ మూగి, అతని వేపు కళ్ళప్పగించి చూస్తున్నారు.[4] ఆ మధ్యాహ్నం మాకు చాలా శ్రమ కలిగించబోయే ఆ సంగతి మాకు అప్పటికి తెలియదనుకోండి - ప్రయాణ ప్రయాసకు తట్టుకునేలా బలం చేకూర్చుకోడానికి వీలుగా మాకు కరకరా ఆకళ్ళు వేశాయి.
ఇప్పుడు మా దారి, బెంగాలులో బర్డ్వాన్ విభాగంలో, ఎండకు మాడిన వరిపొలాల గుండా, తూర్పువేపు సాగింది. రోడ్లకు ఎడాపెడా దట్టమైన చెట్లు బారులు తీర్చి ఉన్నాయి. మైనాలూ కంఠం మీద చారలుండే బుల్‌బుల్ పిట్టలూ పాడే పాటలు, పెద్ద గొడుగుల్లాంటి కొమ్మలున్న చెట్ల సందుల్లోంచి వినవస్తున్నాయి. అప్పుడొకటీ ఆప్పుడొకటి కనిపించే ఎడ్లబండ్ల కొయ్యచక్రాల ఇనప పట్టాలు ఇరుసూ ‘రినిరిని మంజుమంజు’ అంటున్నట్టు కీచుగా చప్పుడు చేస్తున్నాయి. నగరాల్లో తారురోడ్ల మీద కారుటైర్లు చేసే చప్పడుకు ఇది విరుద్ధం.
“డిక్, ఆపు!” అంటూ చటుక్కున నేను అనే సరికి, ఫోర్డు కారు, దానికి అభ్యంతరం చెబుతున్నట్టుగా ఒక్క కుదుపు కుదిపింది. “బరువు మొయ్యలేకపోతున్న ఆ మామిడిచెట్టు మనని కేకేసి పిలుస్తోంది చూడు!” మే మయిదుగురం చిన్న పిల్లల్లా, ఆ మామిడిపళ్ళు పడ్డ నేలమీదికి ఉరికాం; పండ్లు ముగ్గి ఉండడంవల్ల ఆ చెట్టు ఘనంగా రాల్చింది.
“ఎన్నో మామిడి పళ్ళు ఎవరికంటా పడకుండా నేలమీద రాలి పోవడానికే పుట్టాయి; రాతిగొట్టు నేలమీద తమ మాధుర్యాన్ని వ్యర్థం చేసుకోడానికే పుట్టాయి,” అంటూ ఉదాహరించాను.
“అమెరికాలో ఇల్లాంటి దేమీ ఉండదు కదండి, స్వామీజీ?” అంటూ నవ్వాడు, నా బెంగాలీ విద్యార్థుల్లో ఒకడు, శైలేశ్ మజుందార్.
“ఉండదు,” అని ఒప్పుకున్నాను, మామిడిపండ్ల రసం పీల్చుకొని తృప్తిపడి. “పడమటి దేశాల్లో వీటిని ఎంత పోగొట్టుకున్నానో మామిడిపండ్లు లేని స్వర్గం హిందువు ఊహకే అందదు!”
ఒక రాయి విసిరి చిటారు కొమ్మనున్న చక్కటి పండు ఒకటి రాలగొట్టాను.
ఉష్ణదేశపు ఎండకు వెచ్చగిలిన అమృత ఫలాన్ని కొరుక్కుతింటున్నవాణ్ణల్లా మధ్యలో ఆగి, “డిక్, కెమేరాలన్నీ కారులో ఉన్నాయా?” అని అడిగాను.
“ఉన్నాయండి; సామాన్ల అరలో ఉన్నాయి.”
“గిరిబాలగారు నిజమైన యోగిని అని కనక రుజువయితే, ఆవిణ్ణి గురించి పడమటిదేశంలో రాస్తాను. అటువంటి ఉత్పేరక శక్తులు గల హిందూయోగిని - ఈ మామిడిపళ్ళలో చాలావాటి మాదిరిగా - అజ్ఞాతంగా పుట్టి గతించి పోగూడదు.”
అరగంట గడిచాక కూడా, నే నింకా ఆ శాంతిధామంలోనే విహరిస్తున్నాను. “సార్, ఫొటోలకి కావలసినంత వెలుతురు ఉండాలంటే పొద్దు కుంకకముందే మనం గిరిబాలగారి దగ్గరికి చేరుకోవాలండి,” అన్నాడు రైట్. ఆ తరవాత చిన్నగా చిరునవ్వు నవ్వుతూ, ఇంకా ఇలా అన్నాడు: “పడమటివాళ్ళంతా సంశయమనస్కులు; ఫొటోలు లేకపోయినట్లయితే ఆవిణ్ణి గురించి చెప్పేది వాళ్ళు నమ్ముతారని అనుకోడానికి వీల్లేదు!”
ఈ జ్ఞాన శకలం వివాద రహితమైనది; జిహ్వాకర్షణ నుంచి నేను వెనక్కి తిరిగి మళ్ళీ కారులోకి వచ్చి కూర్చున్నాను.
“నువ్వన్నది నిజం, డిక్,” అంటూ నిట్టూర్చాను, కారులో అడుగుపెడుతూ. “పడమటివాళ్ళ వాస్తవికతాభిమానాన్ని మన్నించడం కోసం నా మామిడిపండ్ల స్వర్గాన్ని త్యాగం చేస్తాను; పోటోగ్రాఫులు తప్పకుండా కావాలి!”
వృద్ధాప్యంలో కనిపించే అవలక్షణాల్లా, మొహంమీది ముడతల్లాటి గాళ్ళతోనూ, సెగ్గడ్డల్లా గట్టిపడ్డ బంకమట్టితోనూ మరింత ప్రయాస పెడుతూ వచ్చింది, దారి. శ్రీ రైట్, ఫోర్డుకారును ఇంకా సులువుగా నడపడానికి వీలుగా, మేము అప్పుడప్పుడు దిగి వెనకనించి తోస్తూ వచ్చాం.
“లంబోదర బాబుగారు నిజమే చెప్పారు. కారు మన్ని మొయ్యడం లేదు, మనమే కారును మోస్తున్నాం!” అన్నాడు శైలేశ్.
దూరానికి ఒక పల్లె కనిపించేసరికి, ఈ దిగడాల్లోనూ ఎక్కడాల్లోనూ మాకు కలుగుతున్న విసుగు మరుగుపడుతూ వచ్చింది; ప్రతి పల్లె, చిత్రమైన నిరాడంబరత చూపే దృశ్యం.
“మా దారి మలుపులు తిరిగి, అడవి నీడలో ఒదిగి ఉంటున్న పాతకాలపు నిర్మల గ్రామాలగుండా, తాటితోపులగుండా సాగింది,” అంటూ శ్రీ రైట్, తన యాత్రా దినచర్య పుస్తకంలో, 1936 మే 5 తేదీ పుటలో రాసింది ఇలా ఉంది. “బురదమట్టితో కట్టిన ఈతాకు గుడిసెల గుంపులు చాలా ఆకర్షకంగా ఉన్నాయి; గుడిసెల తలుపుల మీద దేవుడి పేర్లలో ఒకటి, అలంకారంగా రాసి ఉంటుంది. దిస మొలలతో ఉన్న చిన్న పిల్లకాయలు చాలామంది, అమాయకంగా ఆడుకుంటున్నారు; తమ పల్లెలోకి పిచ్చిగా దూసుకు వస్తున్న, నల్లగా పెద్దగా ఉన్న, ఎడ్లులేని బండిని తేరిపారి చూస్తున్నారు; లేదా చెల్లా చెదరుగా పారిపోతున్నారు. మగవాళ్ళు దారిపక్క చెట్లకింద పాలుమాలికగా చేర్లబడి ఉండగా ఆడవాళ్ళు మట్టుకు, నీడల్లోంచి తొంగి చూస్తున్నారు. అయినా వాళ్ళ చూపుల వెనక కుతూహలం కనబడుతోంది. ఒకచోట పల్లెప్రజలు ఒక పెద్ద చెరువులో కులాసాగా స్నానాలు చేస్తున్నారు. (బట్టలు మార్చుకోడానికి, పొడిబట్ట ఒంటికి చుట్టుకొని తడిబట్టలు కిందికి జారవిడుస్తున్నారు). ఆడవాళ్ళు పెద్ద పెద్ద ఇత్తడి బిందెలతో ఇళ్ళకి నీళ్ళు తీసుకువెళ్తున్నారు.
“దారి మిట్టపల్లాలుగా ఉండడంతో మాకు బలే తమాషాగా ఉంది; మేము ఎగిరెగిరిపడుతూ, ఊగిసలాడిపోతూ, వాగుల్లో పడి, నిర్మాణం పూర్తికాని ఒక కాలిబాటకు చుట్టు తిరిగి, పొడి ఇసక ఉన్న నదీగర్భాలకు అడ్డబడి జారుతూ, చివరికి సాయంత్రం 5 : 00 గంటల ప్రాంతానికి మా గమ్యస్థానం- బియూర్‌కు చేరుకున్నాం. బంకూరా జిల్లాలో ఉన్న ఈ కుగ్రామం దట్టమైన హరితవృక్షాల ఒడిలో మరుగుపడి ఉంది; వానా కాలంలో వాగులు పొంగి వెల్లువలై పారుతూ ఉండగా, పాముల్లాటి రోడ్లు విషంవంటి బురద కక్కుతూ ఉన్నప్పుడు ప్రయాణికులు ఆ ఊరు చేరలేరు. “ఊరి బయట ప్రత్యేకంగా ఒక స్థలంలో ఉన్న దేవాలయంలో అర్చన ముగించుకొని ఇంటిముఖం పట్టిన భక్తబృందంలో ఒకర్ని మాకు దారి చూపించమని అడుగుతూ ఉండగా ఒంటిమీద అంతంత మాత్రంగానే బట్టలున్న కుర్రవాళ్ళు ఒక డజనుమంది మమ్మల్ని గిరిబాలగారి ఇంటికి తీసుకువెళ్దామన్న ఉత్సాహంతో కారుకు రెండు పక్కలా మూగేశారు.”
“కొన్ని మట్టిగుడిసెలకు నీడనిస్తున్న ఈతచెట్లతోపు వేపు సాగింది మా దారి; కాని మేము అక్కడికి చేరేలోగా మా ఫోర్డు కారు ఒక్క క్షణం ఒరిగి, పైకి ఎగిరిపడింది. ఆ సన్నటి దారి చెట్లచుట్టూ, చెరువుల చుట్టూ గుట్టల మీదుగా, గుంటల్లోకి లోతైన గాళ్ళలోకి సాగింది. గుబురు పొదలమీద కారు లంగరు వేసినట్టయి, తరవాత ఒక గుట్టమీదికి దేకింది. మేము మెల్లగా, జాగ్రత్తగా ముందుకు సాగాం. ఇంతలో హఠాత్తుగా దారి అటకాయించిపోయింది; బండిదారి మధ్యలో మొక్కల గుబురు ఒకటి ఉంది. అంచేత చుట్టు తిరగడం అవసరమయింది. ఒక ఏటవాలు రాతిచట్టు మీంచి కిందకి, ఎండిపోయిన ఒక చెరువులోకి దిగింది కారు. అక్కణ్ణించి కారు బయటపడ్డానికి, కొంత గీకడం, నరకడం, పారతో చెలగడం అవసరమయాయి. దారి ఎక్కడికక్కడ, ముందుకు పోవడానికి వీలులేకుండా ఉంది; అయినా మా యాత్ర సాగవలసిందే. వందకొద్ది పిల్లలూ తల్లిదండ్రులూ తేరిపారి చూస్తూండగా, ఉపకార బుద్ధిగల కుర్రవాళ్ళు పారలు తెచ్చి అడ్డంకులు తొలగించేశారు. (గణేశుడి ఆశీస్సుల మహిమ!)
“కాస్సేపట్లో మేము, రెండు పాతగాళ్ళ గుండా మెల్లగా దారి చేసుకుంటూ పోతుంటే, ఆడవాళ్ళు, గుడిసెల గుమ్మాల దగ్గర నించుని కళ్ళు విప్పార్చుకొని చూస్తున్నారు. మగవాళ్ళు మా పక్కగానూ వెనక గానూ వస్తూంటే, పిల్లలు పెద్ద ఊరేగింపుగా వచ్చి చేరుతున్నారు. ఈ రోడ్లమీద సాగిన మొట్టమొదటి కారు, బహుశా మాదే కావచ్చు; ఇక్కడ, ‘ఎద్దుబండ్ల సంఘం’ సర్వశక్తి మంతంగా ఉండి ఉండాలి! ఎంత సంచలనం కలిగించాం మేము! పురాతనమైన ఏకాంతాన్నీ పవిత్రతనూ చెడగొడుతూ సూటిగా తమ గూడెంలోకి చొచ్చుకువచ్చే కారును అమెరికా వా డొకడు నడుపుతూ ఉండగా సాగివస్తున్న మా బృందం!
“ఒక సన్న సందు దగ్గర ఆగి, వంద అడుగుల దూరంలో ఉన్న గిరిబాలగారి పూర్వికుల ఇంటిని చూశాం. గతుకుల రోడ్డుమీద నానా పాట్లూ పడుతూ చేసిన మా దూరప్రయాణం ముగిసిన తరవాత, ఒక విధమైన కార్యసాఫల్యానందం అనుభవించాం మేము. ఇటికలతోనూ సున్నంతోనూ కట్టిన ఒక పెద్ద రెండంతస్తుల భవనం దగ్గరికి వెళ్ళాం; ఆ భవనం చుట్టూ ఉన్న గుడిసెల ముందు అది కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. ఆ ఇల్లు ఇప్పుడు మరమ్మతుల్లో ఉంది; దాని చుట్టూ వెదుళ్ళతో కట్టిన పరంజా ఉంది.”
“ఆత్రంగా ఎదురు చూడ్డంతోనూ అణచుకున్న అనందంతోనూ మేము భగవంతుడి క్షుధారహిత స్పర్శతో పునీతురాలైన వ్యక్తి ఇంటి ముందు నిలిచాం. తలుపులు తెరిచి ఉన్నాయి. పిన్నలూ పెద్దలూ, బట్టలు కట్టుకోనివాళ్ళూ కట్టుకున్న వాళ్ళూ అదే పనిగా మాకేసి కళ్ళప్పగించి చూస్తున్నారు; కొద్దిపాటి కుతూహలమున్న ఆడవాళ్ళూ మగవాళ్ళూ మగపిల్లలూ ఈ అపూర్వ దృశ్యాన్ని తిలకిస్తూ మా వెంట ఉన్నారు.”
“కొద్దిసేపట్లోనే ఒక పొట్టి మనిషి గుమ్మంలో కనిపించింది - ఆవిడే గిరిబాల! లేత బంగారువన్నె, పట్టుపంచె కట్టుకొని ఉన్నారావిడ. భారతీయులకు సహజమైన విధంగా సవినయంగానూ జంకుతూనూ ముందుకు వచ్చారు; స్వదేశీ వస్త్రం పై మడతలోంచి కొద్దిగా తొంగి చూశారు. ఆవిడ కళ్ళు తలమీది ముసుగు నీడలో మంటలేని నిప్పుల్లా మెరిశాయి. అత్యంత దయామయమైన ఆవిడ ముఖం చూసి ఆకృష్టులమయాం - లౌకిక అనుబంధంతో మలినం కాకుండా ఆత్మదర్శనమూ అవగాహనా ఉట్టిపడే ముఖమది.”
“ఆవిడ వినయపూర్వకంగా దగ్గరికి వచ్చి, మేము ‘స్టిల్’ కెమేరాతోనూ ‘మూవీ’ కెమేరా[5] తోనూ కొన్ని ఫొటోలు తీసుకోడానికి అంగీకరించారు. భంగిమల సర్దుబాటుకూ వెలుతురుపడే ఏర్పాటుకూ సంబంధించిన మా ఫొటో టెక్నిక్‌లను ఆవిడ, సిగ్గుపడుతూ ఓరిమితో సహించారు. చివరికి మేము, ఏభై సంవత్సరాలకు పైగా అన్నపానాలు లేకుండా జీవించినట్టు తెలుస్తున్న ప్రపంచంలోని ఏకైక మహిళ ఫొటోలు అనేకం, భవిష్యత్ తరాలవారికోసం తీశాం. (థెరీసా నాయ్‌మన్ అయితే 1923 నుంచే ఉపవాసం చేస్తోంది). ఒదులుగా జారుతున్న బట్ట పూర్తిగా కప్పుకొని, గిరిబాలగారు మా ముందు నించుని ఉంటే, ఆవిడ ముఖకవళిక అత్యంత మాతృసహజంగా ఉంది; కళ్ళు వాల్చుకొని ఉన్న ముఖం, చేతులు, కురచ పాదాలూ తప్ప, ఆవిడ శరీరం ఇంకేమీ కనిపించలేదు. అరుదైన ప్రశాంతి, అమాయకత్వం ఉట్టిపడే ముఖం - చిన్న పిల్లకుండే మాదిరి వెడల్పాటి, వణికే పెదవి, స్త్రీ సహజమైన ముక్కు, సన్నగా మిలమిల మెరిసే కళ్ళు, రవ్వంత చిరునవ్వూ.”
గిరిబాలగారి గురించి శ్రీ రైట్‌కు కలిగిన అభిప్రాయమే నాకూ కలిగింది. ఆవిడ వేసుకున్న లేతవన్నె ముసుగులాగే, ఆధ్యాత్మికత ఆవిణ్ణి ఆవరించింది. ఒక గృహస్థురాలు సన్యాసికి ప్రణామం చేసే ఆచారం ప్రకారం ఆవిడ నాకు ప్రణామం చేశారు. ఆవిడలోని నిరాడంబరమైన ఆకర్షణా ప్రశాంతమైన చిరునవ్వూ, మధురమైన గంభీరోపన్యాసం కన్న కూడా మిన్నగా మాకు స్వాగతం చెప్పాయి. ఒళ్ళంతా దుమ్ముకొట్టుకు పోయి కష్టపడి చేసిన ప్రయాణం బడలిక అంతా మరిచిపోయాం.
ఆ సాధ్వి, వరండాలో బాసెంపట్టు వేసుకుని కూర్చున్నారు. ఒంటిమీద వయోభారం కనిపిస్తున్నా, బక్కచిక్కి పోలేదు; బూడిద వన్నెలో ఉన్న ఆవిడ చర్మం స్వచ్ఛంగా, ఆరోగ్యంగా ఉంది.
“అమ్మా, ఈ యాత్ర చెయ్యాలని నేను పాతికేళ్ళకు పూర్వం నుంచి ఆత్రంగా అనుకుంటూ వచ్చాను! మీ పావన జీవనాన్ని గురించి స్థితిలాల్ నంది బాబుగారి దగ్గర విన్నాను,” అంటూ బెంగాలీలో చెప్పాను.
“ఔను,” అంటూ తల ఊపా రావిడ, “ఆయన నవాబ్‌గంజ్‌లో మా పక్కింట్లో ఉండేవారు; మంచివారు.”
“ఈ మధ్యకాలంలో నేను మహాసముద్రాలు దాటి వెళ్ళాను; కాని ఎప్పుడో ఒకనాడు మిమ్మల్ని చూడాలన్న సంగతి ఎన్నడూ మరిచిపోలేదు. మీ రిక్కడ చాలా అజ్ఞాతంగా నిర్వహిస్తున్న దివ్యలీలను, లోపలి అన్నబ్రహ్మాన్ని చాలాకాలంగా మరిచిపోయిన ప్రపంచానికి ఘనంగా వెల్లడి చెయ్యాలి.”
ఆ సాధ్వి ప్రశాంతమైన ఆసక్తితో చిరునవ్వు నవ్వుతూ, ఒక్క నిమిషం కళ్ళు పైకి ఎత్తారు.
“బాబాకే బాగా తెలుసు,” అంటూ వినమ్రంగా జవాబిచ్చారు.
ఆవిడ అన్యథా భావించనందుకు నేను సంతోషించాను; యోగులూ యోగినులూ ప్రచారానికి ఎలా స్పందిస్తారో ఎవరికీ ఎన్నడూ తెలియదు. గాఢమైన ఆత్మపరిశీలన నిశ్శబ్దంగా సాగించాలన్న కోరికతో, వారు ప్రచారాన్ని నియమప్రకారం తిరస్కరిస్తారు. అన్వేషణమనస్కుల ప్రయోజనంకోసం తమ జీవితాల్ని బహిరంగంగా ప్రదర్శించడానికి సరయిన సమయం ఆసన్నమైనప్పుడు, వాళ్ళకొక అంతఃప్రేరణ కలుగుతుంది.
“అయితే అమ్మా, అనేక ప్రశ్నలతో మిమ్మల్ని విసిగిస్తున్నందుకు క్షమించండి. దయచేసి, మీకు ఇష్టమైనవాటికే జవాబు లివ్వండి; మీ మౌనాన్ని కూడా అర్థం చేసుకుంటాను నేను,” అంటూ కొనసాగించాను.
ఆవిడ ప్రసన్నంగా చేతులు చాపారు. “నాలాంటి సామాన్య వ్యక్తి తృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలిగినంత మట్టుకు, సంతోషంగా ఇస్తాను.”
“అఁహఁ. మీరు సామాన్యులు కారు!” అని మనఃపూర్తిగా అభ్యంతరం చెప్పాను. “మీరు మహితాత్మలు!”
“నే నందరికీ వినమ్రదాసిని.” ఆవిడ చిత్రంగా ఇంకా ఇలా అన్నారు, “వంట చెయ్యడమన్నా, వడ్డన చెయ్యడమన్నా నాకు ఇష్టం.”
“తిండి తినని సాధ్వికి ఇది విడ్డూరమైన కాలక్షేపమే,” అనుకున్నాను.
“అమ్మా, మీ నోటినించి వినాలని ఉంది; ఒక్క మాట చెప్పండి? మీరు అన్నం తినకుండానే ఉంటున్నారా?”
“అది నిజం.” కొన్ని క్షణాలు ఆవిడ మౌనం వహించారు; ఆ సమయంలో ఆవిడ, మనస్సులో ఏవో లెక్కలు వేసుకుంటూ సతమత మవుతున్నారన్న సంగతి, ఆ తరవాత చేసిన వ్యాఖ్యానాన్ని బట్టి తెలిసింది. “పన్నెండేళ్ళ నాలుగునెల్ల వయస్సునుంచి ఇప్పటి అరవై ఎనిమిదేళ్ళవరకు యాభైఏళ్ళ పై చిలుకుగా నాకు అన్నపానాలు లేవు.”
“తినాలని మీ కెప్పుడు అనిపించలేదా?”
“అన్నంకోసం ఆర్తి కలిగితే తినవలసి ఉండేది.” రోజుకు ముప్పొద్దులా తిండి తింటేకాని బతకలేని ప్రపంచానికి తెలియని స్వతస్సిద్ధమైన సత్యాన్ని ఈవిడ, హుందాగానే, ఎంత సులువుగా చెప్పారు!
“కాని మీరు ఏదో ఒకటి ఆహారంగా తీసుకుంటూనే ఉంటారేమో!” నా కంఠస్వరంలో కొద్దిగా ఆక్షేపణ ధ్వనించింది.
“తప్పకుండా!” చటుక్కున అర్థం చేసుకుంటూ చిరునప్పు నవ్వారు ఆవిడ.
“గాలిలోంచి సూర్యకాంతి[6]లోంచి వచ్చే సూక్ష్మతర శక్తులవల్లా, చిన్న మెదడు ద్వారా మీ శరీరాన్ని పునర్నవం చేసే విశ్వకాంతివల్లా పుష్టి కలుగుతోంది మీకు.”
“బాబాకు తెలుసు,” అంటూ మళ్ళీ ఒప్పుకున్నా రావిడ, ఆవిడ తీరు సౌమ్యంగా, సరళంగా ఉంది.
“అమ్మా, బాల్యజీవితం గురించి చెప్పండి. భారతదేశానికంతకూ ఆ మాటకు వస్తే - సముద్రాల అవతల ఉన్న మన సోదర సోదరీమణులకు కూడా గాఢమైన ఆసక్తి కలిగిస్తుంది.”
గిరిబాలగారు స్వాభావిక గాంభీర్యాన్ని పక్కకి పెట్టి కులాసాగా సంభాషణ సాగించారు.
“అలాగే,” ఆవిడ స్వరం మెల్లగా, దృఢంగా ఉంది. “నేను ఈ అడవి ప్రాంతంలో పుట్టాను. అలవికాని ఆకలి ఉండడం తప్ప నా బాల్యంలో చెప్పుకోవలసింది ఏదీ లేదు.”
“తొమ్మిదేళ్ళ వయస్సప్పుడు నాకు పెళ్ళి నిశ్చయమయింది.”
“అమ్మాయ్, నీ వాపిరిగొట్టుతనాన్ని అదుపులో పెట్టుకోవే!” అత్తవారింట్లో కొత్తవాళ్ళ మధ్య ఉండే సమయం వచ్చినప్పుడు, నువ్వు తిండి తినడం తప్ప మరేమీ చెయ్యకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? అంటూ హెచ్చరిస్తూ ఉండేది తరచు, మా అమ్మ.”
“ఆవిడ ఊహించిన ప్రమాదం రానే వచ్చింది. నేను నవాబ్ గంజ్‌లో మా అత్తవారింటికి వెళ్ళేసరికి నా వయస్సు పన్నెండేళ్ళే. నా తిండిపోతు అలవాట్ల గురించి మా అత్తగారు, పొద్దున, మధ్యాహ్నం, రాత్రికూడా నన్ను అవమానిస్తూనే ఉండేవారు. అయితే, ఆవిడ తిట్లు నాకు దీవెనలయాయి; నాలో నిద్రాణంగా ఉన్న ఆధ్యాత్మిక ప్రవృత్తులు ఒక్కసారి మేలుకున్నాయి. ఒకనాడు పొద్దున ఆవిడ చేసిన హేళన చాలా నిర్దాక్షిణ్యంగా ఉంది.”
“ ‘నేను బతికున్నంత కాలం, మళ్ళీ ఇక అన్నం ముట్టనని మీకు నిరూపిస్తాను,’ అని చటుక్కున బదులిచ్చాను.”
“మా అత్తగారు వెటకారంగా నవ్వారు. ‘అలాగా!’ అన్నా రావిడ. ‘మితిమించకుండా తిని బతకలేనిదానివి అసలే తినకుండా ఎలా బతుకుతావే?’ ”
“ఈ వ్యాఖ్యానం, జవాబు చెప్పడానికి వీలయినది కాదు. అయినా నా హృదయంలో ఒక వజ్రనిర్ణయం జరిగింది. ఒక ఏకాంతస్థలంలో కూర్చుని పరమేశ్వరుణ్ణి ప్రార్థించాను.”
“పరమేశ్వరా, తిండివల్లకాకుండా నీ వెలుగువల్ల బతకడం ఎలాగో నాకు నేర్పే గురువు నొకరిని నాకు ప్రసాదించు.” అంటూ ఎడతెరిపి లేకుండా మొరపెట్టుకున్నాను.
“ఒకానొక దివ్యానందం నన్ను ఆవేశించింది, ఆ ఆనందపార వశ్యంతో నేను లేచి, నవాబ్‌గంజ్ గంగాఘట్టం బయలుదేరాను. దారిలో, మా అత్తవారింటి పురోహితులు తారసపడ్డారు.”
“ ‘మహాశయా, నేను తిండి తినకుండా బతకడం ఎలాగో చెప్పండి,’ అని, ఆయన్నే నమ్ముకొని అడిగాను.”
“ఆయన జవాబు చెప్పకుండా, నావేపు తేరిపార చూశారు. చివరికి ఓదార్పు ధోరణిలో మాట్లాడారు. ‘అమ్మాయ్, ఈ రోజు సాయంత్రం గుడికి రా; నీ కోసం ప్రత్యేకమైన వైదిక విధి ఒకటి జరుపుతాను.’ ”
“ఈ అస్పష్టమైన సమాధానం కాదు నేను ఆశించింది; ముందుకు సాగి, ఏటి రేవుకు వెళ్ళాను. ప్రాతఃకాల సూర్యకిరణాలు నీళ్ళలోకి దూసుకుపోతున్నాయి; ఏదో పవిత్ర దీక్ష తీసుకోడాని కన్నట్టు, గంగలో స్నానం చేసి పునీతురాల్ని అయాను. చుట్టుకున్న తడిబట్టతో గంగ ఒడ్డు నుంచి వస్తూంటే, ఆ పట్టపగటి వెలుతురులో, నా గురుదేవులు నాకు ఎదురుగా ప్రత్యక్షమయారు.”
“ ‘చిట్టితల్లి,’ అంటూ ఆప్యాయంగా పలకరించారు. ‘నీ అత్యవసర ప్రార్థన మన్నించి, నీ కోరిక నెరవేర్చడానికి దేవుడు ఇక్కడికి పంపిన గురువును నేను. చాలా అసాధారణమైన ఆ ప్రార్థనకు ఆయన గుండె కరిగిపోయింది! ఈనాటి నించి నువ్వు సూక్ష్మకాంతివల్ల జీవిస్తావు, నీ శరీరాణువులు అనంతవాహినితో పునర్నవం చెందుతూంటాయి.’ ”
గిరిబాలగారు మౌనం వహించారు. నేను, శ్రీరైట్ పెన్సిలూ పుస్తకమూ తీసుకుని, అతనికి తెలియడానికి కొన్ని సంగతులు ఇంగ్లీషులోకి అనువాదం చేశాను.
ఆ సాధ్వి కథ కొనసాగించారు. ఆవిడ మధురస్వరం, వినిపించీ వినిపించనట్టుగా ఉంది. “రేవు నిర్మానుష్యంగా ఉంది. నా గురుదేవులు ఇతరులెవరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికని, మా చుట్టూ కాపుదలగా ఒక కాంతి పరివేషాన్ని కల్పించారు. మర్త్యులమాదిరిగా స్థూలమైన ఆహారాలమీద ఆధారపడకుండా, శరీరానికి స్వేచ్ఛ ప్రసాదించే ‘క్రియా’ ప్రక్రియను నాకు ఉపదేశించారు. ఆ ప్రక్రియలో ఒకానొక మంత్రమూ,[7] సగటు మనిషి సాధనచేసే దానికన్న కష్టతరమైన ఒక శ్వాసనియంత్రణాభ్యాసం ఉంటాయి. మరే మందూ గారడీ ఇందులో లేవు. ‘క్రియ’కు మించి మరేం లేదు.”
నాకు అనుకోకుండా, పత్రికారచనా విధానం అలవరిచిన అమెరికా పత్రికారచయిత ధోరణిలో, గిరిబాలగారిని అనేక విషయాలగురించి ప్రశ్నించాను; అవి పాశ్చాత్యులకు ఆసక్తి కలిగిస్తాయని నా అభిప్రాయం.
ఆవిడ కొద్దికొద్దిగా ఇలా చెబుతూ వచ్చారు: “నా కెన్నడూ పిల్లలు కలగలేదు; చాలా ఏళ్ళ కిందట నేను వితంతువునయాను. నాకు నిద్ర, మెలకువ రెండూ సమానమే కనక, చాలా తక్కువసేపు నిద్రపోతూంటాను. పగటిపూట, నా ఇంటిపనులన్నీ చేసుకొని రాత్రిపూట ధ్యానం చేస్తాను. ఋతువు తరవాత ఋతువు మారుతూ వస్తున్నప్పుడు, వాటి మార్పు నాకు కొద్దిగానే అనుభూతమవుతుంది. నే నెప్పుడూ జబ్బు పడలేదు; ఏ వ్యాధి నా అనుభవంలో లేదు. ప్రమాదవశాత్తు గాయపడ్డప్పుడు కొద్దిగా నొప్పి కలుగుతుంది. నాకు శారీరకమైన మలమూత్రాది విసర్జనలు లేవు. గుండె కొట్టుకోడాన్నీ ఊపిరి ఆడడాన్నీ నేను అదుపులో ఉంచుకోగలను. అంతర్దర్శనాల్లో తరచుగా నేను, నా గురుదేవుల్నీ ఇతర మహాత్ముల్నీ చూస్తూంటాను.”
“అమ్మా, మీరు, తిండిలేకుండా జీవించే విధానాన్ని ఇతరుల కెందుకు నేర్పగూడదు?” అని అడిగాను.
ప్రపంచంలో తిండిలేక మాడే కోట్లాది ప్రజల మేలుకోసం నేను పెట్టుకొన్న మహత్తరమైన ఆశలు ఇట్టే భగ్నమయిపోయాయి.
“ఊఁహుఁ,” అంటూ తల తిప్పారావిడ. “ఈ రహస్యం ఎవరికీ వెల్లడించగూడదని గట్టిగా ఆదేశించారు, నా గురుదేవులు. భగవంతుడి లీలారూప జగన్నాటకంతో నేను జోక్యం చేసుకోడం ఆయన అభిమతం కాదు. తిండి తినకుండా ఉండడం ఎలాగో, నేను కనక చాలామందికి నేర్పేసినట్టయితే, రైతులు నా కేమీ ధన్యవాదాలు చెప్పరు! తియ్య తియ్యని పండ్లు నిరుపయోగంగా నేలమీద పడి ఉంటాయి. దైన్యం, ఆకలి, చావు అన్నవి, జీవితానికి నిజమైన అర్థాన్ని అన్వేషించడానికి, చివరికి మనను తరిమే కర్మసంబంధమైన కొరడాలుగా కనిపిస్తాయి.”
“అమ్మా, మీ రొక్కరే తిండి తినకుండా ఉండిపోవడంవల్ల ఉపయోగమేమిటి?” అని మెల్లగా అడిగాను.
“మానవుడు ఆత్మ అని నిరూపించడానికి.” ఆవిడ ముఖం జ్ఞాన దీప్తితో వెలుగొందింది. “అతడు అన్నంవల్ల కాకుండా, శాశ్వత కాంతివల్ల జీవించడం ఎలాగో, దివ్య ప్రగతి సాధనలో క్రమంగా తెలుసుకో గలిగేటట్టు నిరూపించడానికి.”[8] ఆ సాధ్వి గాఢమైన ధ్యానస్థితిలోకి వెళ్ళారు. ఆవిడ దృష్టి అంతర్ముఖమయింది; ఆవిడ కళ్ళలోతులు అభావసూచకాలయాయి. శ్వాసలేని ఆనందసమాధి స్థితికి నాందిగా, ఆవిడ ఒక రకమైన నిట్టూర్పు విడిచారు. కొంత సేపు ఆవిడ ఆంతరిక ఆనంద స్వర్గంలోని నిరాక్షేపణీయమైన రాజ్యానికి పరుగుతీశారు.
చీకటి ముసిరింది. ఒక చిన్న కిరసనాయిలు దీపం వెలుగు, నిశ్శబ్దంగా నీడల్లో కూర్చున్న అనేకమంది గ్రామీణుల ముఖాల మీద పడింది. రయ్యిన దూసుకువచ్చే మిణుగురు పురుగులూ, గుడిసెల్లో దూరాన ఉన్న చమురులాంతర్లూ, ఆ కారునల్లని రాత్రివేళ అందంగా ప్రకాశించాయి. ఇక , బాధాకరమైన వీడుకోలు సమయం; మందకొడిగా, విసుగెత్తించేలా సాగే ప్రయాణం ముందుంది మాకు.
“గిరిబాలగారూ, మీ జ్ఞాపకార్థం నాకు ఏదైనా ఇయ్యండి - మీ చీరల్లోది, ఒక చిన్న పేలిక,” అని అడిగాను, ఆ సాధ్వి కళ్ళు విప్పుతూ ఉండగా.
వెంటనే ఆవిడ, ఒక బనారసు పట్టుబట్ట ముక్క ఒకటి తీసుకువచ్చి ఇచ్చి, సాష్టాంగ ప్రణామం చేశారు.
“అమ్మా,” అంటూ గౌరవ పురస్సరంగా అన్నాను, “మీ బదులు నన్నే మీ పవిత్ర పాదాల్ని ముట్టుకోనియ్యండి!”
- ↑ ఉత్తర బెంగాలులో.
- ↑ మహారాజ రాజశ్రీ సర్ విజయచంద్ మహతాబ్; ఇప్పుడు గతించారు. గిరిబాల విషయంలో ఆ మహారాజు జరిపించిన మూడు పరీక్షలకూ సంబంధించిన లిఖిత ఆధారం కొంత, ఆయన కుటుంబికుల దగ్గర ఉండడం ఖాయం.
- ↑ “ఆటంకాల్ని తొలగించేవాడు.” భాగ్యదేవత.
- ↑ శ్రీయుక్తేశ్వర్‌గారు అంటూండేవారు: “భగవంతుడు మనకి భూదేవి ఫలాలు ఇచ్చాడు. తిండిని చూడ్డం, వాసన చూడ్డం, రుచి చూడ్డం మనకి ఇష్టం- హిందువుకు దాన్ని తాకడం కూడా ఇష్టం;” భోంచేసేటప్పుడు ఇంకెవరూ దగ్గర లేకుండా ఉన్నట్లయితే, దాన్ని ‘వినడానికి’ కూడా అభ్యంతరం ఉండదు.
- ↑ శ్రీ రైట్, శ్రీరాంపూర్‌లో చివరి ధనుర్మాస సంక్రమణోత్సవ సందర్భంగా శ్రీ యుక్తేశ్వర్‌గారి, చలన చిత్రాలు కూడా తీశాడు.
- ↑ “మనం తినేది వితరణ జీవశక్తి; మన తిండి చాలా పరిమాణాల శక్తి,” అంటు 1933 మే 17 న మెంఫిస్‌లో జరిగిన వైద్యశాస్త్రవేత్తల సమావేశంలో, క్లీవ్ లాండ్ వాస్తవ్యుడైన డా॥ జార్జి డబ్ల్యు క్రైల్ చెప్పాడు. శరీరంలోని విద్యుద్వలయమైన నాడీమండలానికి విద్యుత్ ప్రవాహాల్ని పంపే అత్యంత ముఖ్యమైన ఈ వికిరణ జీవశక్తి, సూర్యకిరణాలవల్ల ఆహారంలో సమకూరుతుంది. అణువులు సౌరమండలాలు అంటాడు డా॥ క్రైల్. అణువులు, చుట్టుకుపోయిన అనేక స్ప్రింగుల మాదిరిగా, సూర్యకిరణాలు నిండిఉన్న వాహకాలు. అసంఖ్యాకమైన అణుప్రమాణాల శక్తిని ఆహారంలో తీసుకుంటాం. అణువులు ఒకసారి మానవశరీరంలోని ప్రోటోప్లాజం (జీవపదార్థం) లోకి ప్రవేశించిన తరవాత, వాటి సూర్యకాంతి కొత్త రసాయనిక శక్తినీ కొత్త విద్యుత్ప్రవాహాల్ని సమకూరుస్తుంది. ‘మీ శరీరం అలాంటి అణువులతో ఏర్పడ్డది’, అంటాడు డా॥ క్రైల్. ‘అవే మీ కండరాలూ మెదళ్ళూ కళ్ళూ చెవులూలాంటి జ్ఞానేంద్రియాలూను.’ ”
మానవుడు నేరుగా సౌరశక్తివల్ల ఎలా జీవిస్తాడో, శాస్త్రవేత్తలు ఎప్పుడో ఒకనాడు కనిపెడతారు. “సృష్టిలో, సూర్యకాంతి గ్రాహకశక్తి ఏదో ఒక విధంగా ఉన్నట్టుగా మనకు తెలిసిన ఒకే ఒక పదార్థం, క్లోరోఫిల్ (పత్రహరితం),” అంటూ న్యూయార్క్ టైమ్స్‌లో రాశాడు, విలియం ఎల్. లారెన్స్. “సూర్యకాంతిలో ఉన్న శక్తిని ఇది గ్రహించి, మొక్కలో నిలవచేస్తుంది. ఇది లేకపోతే ప్రాణం నిలవదు. బతకడానికి మనకు కావలసిన శక్తిని మనం, శాకాహారంలోనిలవఅయి ఉన్న సౌరశక్తి నుంచి పొందుతాం; మనం ఆ శాకాహారమైనా, తింటాం, శాకాహారం తినే జంతువుల మాంసమైనా తింటాం, బొగ్గునుంచికాని, నూనెనుంచికాని మనకు వచ్చే శక్తి, అనేక లక్షల సంవత్సరాల కిందటి వృక్షాల క్లోరోఫిల్‌ను నిక్షిప్తంచేసుకున్న సౌరశక్తి, మనం క్లోరోఫిల్ ద్వారా సూర్యుడివల్ల బతుకుతున్నాం.
థెరిసా నాయ్‌మన్, భౌతికమైన ఆహారంవల్లకాని, నిరాహార జీవనానికి ఉపకరించే శాస్త్రీయ యోగ ప్రక్రియ తాలూకు అభ్యాసాలవలకాని బతకలేదు. దీనికి వివరణ, వైయక్తిక కర్మతాలూకు గజీబిజీలో మరుగుపడి ఉంది. ఒక థెరీసా నాయ్‌మన్‌కు కాని, ఒక గిరిబాలకు కాని, అనేక పూర్వజన్మల దైవాంకిత జీవనం ఉండి ఉంటుంది; కాని బాహ్యాభివ్య క్తికి వాళ్ళవాళ్ళ మార్గాలు వేరువేరుగా ఉంటాయి. తిండిలేకుండా జీవించిన క్రైస్తవ సాధువుల్లో (వాళ్ళు కూడా, ఏసుక్రీస్తు క్షతచిహ్న ధారిణులైన ‘స్టిగ్మాటిస్ట్’ లే) చెప్పుకోవలసిన వాళ్ళు: షీడామ్ వాస్తవ్యురాలైన సెంట్ లిడ్వినా, రెంట్ వాస్తవ్యురాలైన పుణ్యశీల ఎలిజబెత్, సీనా వాస్తవ్యురాలైన సెంట్ కాథరైన్, డొమినికా లాజారీ, ఫోలిగ్నో వాస్తవ్యురాలైన పుణ్యశీల ఏంజిలా, 19 శతాబ్ది లూయిస్ లాటో. సమైక్యంకోసం, ప్రగాఢమైన అభ్యర్థన చేసి స్విట్జర్లాండ్ రాజ్యసమాఖ్యను కాపాడిన, 15 శతాబ్ది నాటి సన్యాసి ప్లూ వాస్తవ్యుడైన సెంట్ నికోలాస్ (బ్రూడర్ క్లాస్) ఇరవైఏళ్ళ పాటు నిరాహారిగా ఉండిపోయాడు.