ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 43
అధ్యాయం : 43
శ్రీయుక్తేశ్వర్‌గారి
పునరుత్థానం
“కృష్ణభగవానుడు!” నేను బొంబాయిలో, రీజెంట్ హోటల్లో నా గదిలో కూర్చుని ఉండగా, ఆ అవతారమూర్తి దివ్యమంగళరూపం ఒక ఉజ్జ్వల దీప్తితో నాకు దర్శన మిచ్చింది. నేను మూడో అంతస్తులో ఉన్నాను; కిటికీ తెరిచి ఉంది; దాంట్లోంచి బయటికి చూస్తూ ఉండగా, వర్ణించశక్యంకాని ఆ అద్భుతదృశ్యం, వీధికి అవతలివేపు ఎత్తయిన ఒక భవనం పై కప్పుమీద హఠాత్తుగా నా కంట పడింది.
చిరునవ్వు చిందిస్తూ, పలకరింపుగా తల ఆడిస్తూ, ఆ దివ్యమంగళ విగ్రహుడు నా వేపు చెయ్యి ఊపాడు. కృష్ణభగవానుడిచ్చిన సందేశాన్ని నేను సరిగా అర్థం చేసుకోలేకపోవడంవల్ల ఆయన ఆశీః సంకేతంతో అంతర్ధానమయాడు. అద్భుతమయిన దివ్యానుభూతితో ఉత్తేజం పొందిన నాకు, ఏదో ఆధ్యాత్మిక సంఘటన జరగబోతున్నదన్న అభిప్రాయం కలిగింది. నా పాశ్చాత్యదేశ యాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది. మళ్ళీ మరోసారి కలకత్తా, పూరీ వెళ్ళేలోగా బొంబాయిలో కొన్ని బహిరంగ సభల్లో నేను ఉపన్యాసాలివ్వడానికి కార్యక్రమాలు నిర్ణయమయాయి.
1936 జూన్ 19 తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు - అంటే, శ్రీకృష్ణుడు దర్శనమిచ్చిన వారం రోజులకు- బొంబాయి హోటల్లో నేను మంచం మీద కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండగా, ఒకానొక దివ్య కాంతి నాకు బాహ్యస్మృతి కలిగించింది. నేను కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా, నా గది ఒక విచిత్ర ప్రపంచంగా మారిపోయింది; సూర్యకాంతి ఒక దివ్యతేజస్సుగా పరిణామం చెందింది.
ఎదురుగా, రక్తమాంసాలతో నిండిన శ్రీయుక్తేశ్వర్ గారి విగ్రహాన్ని చూసేసరికి ఆనంద తరంగాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేశాయి.
“నాయనా!” అంటూ వాత్సల్యం ఉట్టిపడేటట్టు పిలిచారు, గురుదేవులు. ఆయన ముఖంలో దివ్యదరహాసం వెలుగుతోంది!
జీవితంలో మొట్టమొదటి సారిగా నేను ఆయన పాదాలముందు మోకరిల్ల నిది అప్పుడే; ఆబగా ఆయన్ని చుట్టేసుకోవాలని చటుక్కున ముందుకు ఉరికాను. ఎంత మహత్తరమైన మధుర క్షణం! అప్పటికి కొన్ని నెలలుగా నాలో గూడు కట్టుకుని ఉన్న విషాదం, ఇప్పుడు ఒక్కసారి వెల్లువలా వచ్చిపడుతున్న దివ్యానందంవల్ల ఇట్టే తేలిపోయినట్టు అనిపించింది.
“నా గురుదేవా, నన్ను విడిచి పెట్టి ఎందుకు వెళ్ళిపోయారు?” ఆనందం పట్టలేక, నా మాటలు తడబడుతూ వెలువడ్డాయి. “నన్నసలు కుంభమేళాకి ఎందుకు వెళ్ళనిచ్చారు? మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినందుకు నన్ను నేను ఎంత కసిగా తిట్టుకున్నానో తెలుసా?”
“నేను మొట్టమొదటిసారి బాబాజీ దర్శనం చేసుకున్న యాత్రా స్థలాన్ని చూడాలని నువ్వెంతో ఉవ్విళ్ళూరుతున్నావు; అంచేత నీ ఆశకు అడ్డు రాగూడదనుకున్నాను. అయినా నేను, నిన్ను విడిచి ఉన్నది కాస్సేపే; ఇదుగో, మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర లేనూ?”
“అయితే గురుదేవా, ఇప్పుడిక్కడ ఉన్న వారు మీరేనా? ఆ గురు సింహులేనా? పూరీ ఇసక పర్రలో పూడ్చిపెట్టిన శరీరం మాదిరి మరోదేహం ధరించి వచ్చారా మీరు?”
“నేను వాణ్ణే నాయనా. ఇది రక్తమాంసాలున్న శరీరం. నేను దీన్ని సూక్ష్మశరీరంగా చూస్తున్నప్పటికీ, నీ దృష్టి కిది భౌతికమైనదే. విశ్వాణువుల్లోంచి నేను పూర్తిగా కొత్త శరీరాన్ని సృష్టించుకున్నాను. ఇది ముమ్మూర్తులా, నీ స్వప్నలోకంలో, పూరీలో స్వప్నభూమిలో నువ్వు పూడ్చిపెట్టిన, విశ్వస్వప్న భౌతికశరీరాన్ని పోలి ఉన్నదే. నిజం చెప్పాలంటే, నేను పునరుత్థానం చెందాను - భూమిమీద కాదుకాని, ఒక సూక్ష్మలోకంలో. అక్కడుండేవాళ్ళు, భూమిమీది మానవులకన్న ఎక్కువగా, నా ఉన్నత ప్రమాణాలకు నిలబడగలవాళ్ళు. ఎప్పటికో ఒకనాటికి, నువ్వూ నీ ప్రియతములూ అక్కడికి వచ్చి నాతోబాటు ఉంటారు.”
“మృత్యుంజయులై న గురుదేవా, ఇంకా చెప్పండి.”
గురుదేవులు చటుక్కున, ముచ్చటగా ముసిముసి నవ్వు నవ్వారు. “నాయనా, నీ పట్టు రవ్వంత సడలించవూ?” అంటూ అడిగారు.
“రవ్వంతే!” అప్పటిదాకా నే నాయన్ని, ఉడుంపట్టులా గట్టిగా పట్టేసుకుని ఉన్నాను. పూర్వం ఆయన శరీరానికి విలక్షణంగా ఉంటూండే కొద్దిపాటి సహజ సుగంధమే ఇప్పుడు కూడా ఆయనకు ఉందని పసిగట్టాను. ఆయన దివ్యశరీర స్పర్శవల్ల కలిగిన ఒకానొక ఆనందానుభూతి ఆనాడు ఆయనతో గడిపిన గంటలు తలుచుకున్నప్పుడల్లా, నా చేతుల్లోనూ అరిచేతుల్లోనూ జివ్వుమంటూ ఉంటుంది.
“భౌతిక కర్మను అనుభవిస్తూండే మానవులకు సహాయం చెయ్యడానికి భగవంతుడు, భూమిమీదికి ప్రవక్తలను పంపినట్లే, ఒక సూక్ష్మలోకంలో రక్షకుడిగా సేవ చెయ్యమని భగవంతుడు నన్ను ఆదేశించాడు,” అంటూ వివరించారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “దాన్ని ‘హిరణ్యలోకం’ అంటారు. ఆ లోకంలో ప్రగతి పొందిన సాధకులు తమ సూక్ష్మలోక కర్మనుంచి విముక్తి పొందడానికి సూక్ష్మలోక పునర్జన్మలు లేకుండా చేసుకోడానికి అక్కడ నేను సాయపడుతున్నాను. హిరణ్యలోకవాసులు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన అభివృద్ధి సాధించినవాళ్ళు, వాళ్ళంతా భూమిమీద తమ పూర్వజన్మలో, మరణసమయంలో ఒంటిమీద స్పృహతో భౌతికకాయాన్ని విడిచి వెళ్ళిపోవడానికి వీలు కలిగించే, ధ్యానోపార్జితమైన శక్తిని సాధించినవాళ్ళు. వెనకటి మానవ జీవితంలో సవికల్ప నిర్వికల్ప సమాధి స్థితుల అనుభవం గడిస్తేనే కాని, ఎవ్వరూ హిరణ్యలోకంలోకి ప్రవేశించలేరు.[1]
“హిరణ్యలోకవాసులు అంతకు పూర్వమే, సాధారణ సూక్ష్మమండలాలగుండా సాగివచ్చి అక్కడికి చేరి ఉంటారు; భూలోక ప్రాణులు దాదాపు అందరూ, మరణించిన తరవాత ఆ సూక్ష్మ మండలాలకు చేరవలసిందే. అక్కడ, సూక్ష్మలోకాల్లోని తమ పూర్వకర్మలకు సంబంధించిన అనేక బీజాల్నీ నశింపుచేసుకుని ఉంటారు. ఉచ్చస్థితిలో ఉన్న భక్తులు తప్ప, తక్కిన వాళ్ళలో ఎవరూ, సూక్ష్మమండలాల్లో అటువంటి ముక్తిదాయక కృషి ఫలప్రదంగా చెయ్యలేరు.[2] అప్పుడు, సూక్ష్మకర్మ లేశాలన్నిటినుంచీ తమ ఆత్మల్ని పూర్తిగా విముక్తం చేసుకోడానికి సాధకులు, హిరణ్యలోకంలో కొత్త సూక్ష్మశరీరాలతో తిరిగి పుట్టడానికి విశ్వనియమంచేత ఆకృష్టులవుతారు. నేనున్నది, సూక్ష్మలోక సూర్యుడనీ స్వర్గమనీ చెప్పే ఈ హిరణ్యలోకంలోనే. అక్కడివాళ్ళకి సహాయం చెయ్యడానికి అంతకన్న ఉన్నతమైన కారణలోకంలోంచి వచ్చి, దాదాపు పూర్ణసిద్ధి పొందినవాళ్ళు కూడా హిరణ్యలోకంలో ఉన్నారు.”
నా మనస్సు, మా గురుదేవుల మనస్సుతో పరిపూర్ణమైన అనుసంధానంలో ఉంది; మాటలతో మనస్సుకు హత్తించే చిత్రాల్ని ఆయన, కొంతవరకు వాక్కుద్వారాను, కొంతవరకు భావాల బదలాయింపుద్వారాను నాకు తెలియజేస్తున్నారు. ఆ విధంగా నేను ఆయన భావచిత్రాల్ని గబగబా ఆకళించుకుంటున్నాను.
గురుదేవులు ఇంకా ఇలా చెప్పారు: భగవంతుడు మానవుడి ఆత్మను వరసగా మూడు శరీరకోశాల్లో పొందుపరిచి ఉంచాడన్న సంగతి నువ్వు పవిత్ర గ్రంథాల్లో చదివావు - భావం, లేదా కారణ శరీరం; మానవుడి మానసిక, భావోద్రేక ప్రకృతికి స్థానమైన సూక్ష్మశరీరం; స్థూలమైన భౌతిక శరీరం. భూమిమీద మనిషికి భౌతిక జ్ఞానేంద్రియాలు ఏర్పడి ఉంటాయి. సూక్ష్మలోక వ్యక్తి, తన చేతనతోనూ అనుభూతులతోనూ ప్రాణకణిక (లైఫ్ ట్రాన్)[3] లతో తయారైన శరీరంతోనూ పని చేస్తాడు. కారణ శరీరం ధరించినవాడు, భావాల ఆనందమయలోకాల్లో ఉండిపోతాడు. కారణలోకంలోకి ప్రవేశించడానికో, పునఃప్రవేశానికో తయారవుతున్న సూక్ష్మలోక భక్తులతోనే నా పని.
“పూజ్య గురుదేవా, సూక్ష్మ విశ్వాన్ని గురించి ఇంకా చెప్పండి.” శ్రీయుక్తేశ్వర్‌గారు కోరినమీదట, నేను ఒక్కరవ్వ పట్టు సడలించినప్పటికీ, నా చేతులు మాత్రం ఇంకా ఆయన్ని చుట్టుకొనే ఉన్నాయి. నా దగ్గరికి రావడానికి యముణ్ణి చూసే ఎగతాళిగా నవ్విన మా గురుదేవులు, నిధులన్నిటినీ మించిన పెన్నిధి!
“సూక్ష్మశరీరులతో నిండిన సూక్ష్మలోకాలు చాలా ఉన్నాయి,” అంటూ ప్రారంభించారు గురుదేవులు. “అక్కడ ఉండేవాళ్ళు ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి ప్రయాణం చెయ్యడానికి విద్యుత్తుకన్న, లేదా రేడియో ధార్మిక శక్తులకన్న వేగంగా సాగే సూక్ష్మ వాహనాల్ని, లేదా కాంతిపుంజాల్ని వాడతారు.”
“వెలుగు, వన్నెల సూక్ష్మ స్పందనలతో రూపొందిన సూక్ష్మ విశ్వం. భౌతిక విశ్వానికి కొన్ని వందలరెట్లు పెద్దది. భౌతిక సృష్టి యావత్తు, సూక్ష్మ మండలమనే ప్రకాశవంతమైన పెద్ద గాలిబుడగ కింద ఘనరూపమయిన ఒక చిన్న బుట్టలా వేలాడుతూ ఉంటుంది. రోదసిలో భౌతికమైన అనేక సూర్యగ్రహాలూ నక్షత్రాలు సంచరించేటట్టుగానే లెక్కలేనన్ని సూక్ష్మ సౌర, నక్షత్ర మండలాలు కూడా ఉంటాయి. సూక్ష్మలోక సూర్యచంద్రులు ఈ సూర్యచంద్రులకన్న అందంగా ఉంటారు. సూక్ష్మలోక తేజోమండలాలు తేజస్వంతమైన మేరు ప్రభామండలాన్ని (ఆరోరా బొరియాలిస్) పోలి ఉంటాయి. ఈ సూక్ష్మలోక సౌరమేరుప్రభ, మందకిరణ చంద్రమేరుప్రభ కన్న మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది. సూక్ష్మలోకంలో రాత్రీ పగలూ, భూమిమీది వాటికంటె దీర్ఘమైనవి.”
‘‘సూక్ష్మవిశ్వం అత్యంత ఆకర్షణీయమైనదీ పరిశుభ్రమైనదీ పరిశుద్ధమైనదీ సువ్యవస్థితమైనదీ. నిర్జీవగ్రహాలూ చవిటి పర్రలూ అక్కడ లేనే లేవు. భూలోకానికి కళంకప్రాయమైన సూక్ష్మజీవులు (బాక్టీరియా), పురుగులు, పాములు వంటివి అక్కడ ఉండవు. శీతోష్ణస్థితులూ ఋతువులూ భూలోకంలో మాదిరిగా ఉండవు; సూక్ష్మమండలంలో నిత్య వసంత ఋతువుతో సమశీతోష్ణస్థితి నిలిచి ఉంటుంది. అప్పుడప్పుడు, వెలుగులీనే తెలిమంచూ, వన్నె వన్నెల వెలుగుల వానలు కురుస్తూ ఉంటాయి. సూక్ష్మలోకాలంతటా మాణిక్య సరోవరాలూ, మిలమిల మెరిసే సముద్రాలూ, ఇంద్రచాప నదులూ సమృద్ధిగా ఉంటాయి.”
“మామూలు సూక్ష్మవిశ్వంలో - అంటే, హిరణ్యలోకమనే సూక్ష్మతర సూక్ష్మ స్వర్గంలో అని కాదు – భూమినుంచి దాదాపు ఇటీవల వచ్చిన, కొన్నికోట్ల సూక్ష్మ జీవాత్మలు ఉంటాయి. అంతే కాకుండా, దేవతాశక్తులూ, మత్స్యకన్యలూ, చేపలూ, జంతువులూ, పిశాచాలూ, భూతాలూ, దైవాంశ సంభూతులూ, అదృశ్య శక్తులూ కూడా అసంఖ్యాకంగా ఉంటాయి. ఇవన్నీ కర్మల గుణగుణాల్ని బట్టి వేరు వేరు సూక్ష్మ గ్రహాల్లో నివసిస్తాయి. మంచిశక్తులకూ చెడ్డశక్తులకూ గోళాకార భవ నాల్ని, లేదా స్పందనశీల ప్రాంతాల్ని సమకూర్చడం జరిగింది. మంచివి స్వేచ్ఛగా ప్రయాణం చేస్తాయి; కాని దుష్టశక్తులు పరిమిత మండలాలకు లోబడి ఉంటాయి. మనుషులు భూమిమీదా, పురుగులు మట్టిలోనూ, చేపలు నీళ్ళలోనూ, పక్షులు గాలిలోనూ ఉండేటట్టే, వివిధ శ్రేణుల సూక్ష్మలోక జీవులకు సముచితమైన స్పందనశీల నివాసాలు సమకూరి ఉంటాయి.”
“వివిధ సూక్ష్మలోకాలనుంచి వెలివేసిన, పతిత దేవదూతలమధ్య ప్రాణకణికాస్త్రాలు (లైఫ్‌ట్రానిక్ బాంబులు), లేదా మానసిక మంత్రశక్తుల[4] స్పందనశీల కిరణాలతో ఘర్షణ, యుద్ధం జరుగుతూంటాయి. ఈ బహిష్కృతులు తమ దుష్కర్మను అనుభవిస్తూ నిమ్నతర సూక్ష్మ విశ్వంలోని అంధకారాచ్ఛన్న ప్రాంతాల్లో నివసిస్తూంటారు.”
“అంధకారమయమైన సూక్ష్మ కారాగారానికి పైనుండే విశాల మండలాలన్నీ ప్రకాశమానంగా అందంగా ఉంటాయి. సూక్ష్మ విశ్వం భూమికన్న ఎక్కువ సహజంగా, దైవసంకల్పంతోనూ పరిపూర్ణతా పరికల్పనతోనూ అనుసంధానం చెంది ఉంటుంది. సూక్ష్మలోక వస్తువు ప్రతిదీ ప్రధానంగా దైవసంకల్పంవల్లా పాక్షికంగా సూక్ష్మలోక జీవుల ఆహ్వాన సంకల్పంవల్లా ఆవిర్భవిస్తుంది. దేవుడు సృష్టించినదాన్ని దేన్నయినా మార్చేయడానికి కాని, దాని అందాన్ని రూపాన్ని అతిశయింప జేయడానికి కాని వాళ్ళకి శక్తి ఉంటుంది. సూక్ష్మవిశ్వాన్ని తమ ఇచ్ఛానుసారంగా మార్చేసే స్వాతంత్ర్యమూ, లేదా మెరుగుపరిచే స్వాతంత్ర్యమూ హక్కూ, భగవంతుడు తన సూక్ష్మలోక సంతానానికి ఇచ్చాడు. భూమిమీద ఒక ఘనపదార్థాన్ని ద్రవరూపంలోకి కాని, ఇతర రూపంలోకి కాని మార్చాలంటే సహజ ప్రక్రియద్వారా, లేదా రసాయన ప్రక్రియలద్వారా మార్చాలి. కాని సూక్ష్మలోకపు ఘనపదార్థాల్ని కేవలం, అక్కడ నివసించేవాళ్ళ సంకల్పమాత్రంచేత, తక్షణమే సూక్ష్మద్రవాలుగానూ, వాయువులుగానూ లేదా అణుశక్తిగానూ మార్చడం జరుగుతున్నది.”
“సముద్రంలోనూ నేలమీదా గాలిలోనూ జరిగే యుద్ధాలతో, హత్యలతో ఈ భూమి కళంకితమైపోయింది,” అంటూ ఇంకా చెప్పసాగారు గురుదేవులు. “కాని, సూక్ష్మలోక రాజ్యాలకు సుఖప్రదమైన సామరస్యమూ సమానత్వమూ తెలుసు. సూక్ష్మలోక జీవులు తమ రూపాల్ని సంకల్పానుసారంగా సాక్షాత్కరింపజేయడం, అదృశ్యంచేయడం చేస్తూంటారు. పువ్వులుకాని, చేపలుకాని, జంతువులుకాని తాత్కాలికంగా, సూక్ష్మలోక మానవులుగా రూపాంతరణం చెందగలవు. సూక్ష్మలోక జీవులన్నీ స్వేచ్ఛగా ఏ రూపమయినా తాల్చి, ఒకదాంతో ఒకటి సులువుగా భావసంపర్కం పెట్టుకోగలవు. స్థిరంగా, కచ్చితంగా ఉండే ప్రకృతి నియమం ఏదీ వాటిని నిర్బంధించదు. మాటవరసకు, ఏ సూక్ష్మలోక వృక్షాన్నయినా సూక్ష్మలోకపు మామిడిపండుకాని, పువ్వుకాని - నిజం చెప్పాలంటే, మరే వస్తువునయినా కాని- సృష్టించి ఇమ్మని అడిగి తీసుకోవచ్చు. కొన్నికొన్ని కర్మసంబంధమైన ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ, వివిధ రూపాల్ని కోరడం విషయంలో, సూక్ష్మలోకంలో విభేదాలు లేవు. ప్రతిదీ దేవుడి సృజనాత్మక కాంతితో స్పందిస్తూ ఉంటుంది.”
“అక్కడివాళ్ళెవరూ తల్లికడుపున పుట్టినవాళ్ళు కారు. సూక్ష్మలోక వ్యక్తులు, విశ్వానుసంధానంచెంది ఉన్న తమ సంకల్పం ఇచ్చే ఆదేశాలతో విశిష్టకల్పనాయుక్తమైన సూక్ష్మరూపాలుగల సంతానాన్ని సృష్టించవచ్చు. అంతకుముందే భౌతికకాయాన్ని విడిచిన వ్యక్తి, అనురూపమైన మానసిక, ఆధ్యాత్మిక ప్రవృత్తులచేత ఆకృష్టుడై, ఒక సూక్ష్మలోక కుటుంబం ఆహ్వానాన్ని అందుకొని, ఆ కుటుంబంలోకి వస్తాడు.
“సూక్ష్మశరీరం చలికికాని వేడికికాని ఇతర ప్రకృతి పరిస్థితులకుకాని లోబడదు. సూక్ష్మశరీరంలో సూక్ష్మమస్తిష్కం ఒకటి ఉంటుంది; దాంట్లో, సర్వజ్ఞత్వం గల ‘వెయ్యి రేకుల వెలుగుల తామరపువ్వు’ కొంతమట్టుకు చురుకుగా పనిచేస్తూ ఉంటుంది; అలాగే, ‘సుషుమ్న’లో, అంటే సూక్ష్మ మస్తిష్క-మేరు దండాక్షంలో, జాగృత కేంద్రాలు ఆరు ఉంటాయి. గుండె, వెలుగునూ విశ్వశక్తినీ మెదడునుంచి, తీసుకొని సూక్ష్మనాడులకూ శరీరకణాలకూ పంపిణీ చేస్తుంది. సూక్ష్మలోక జీవులు ప్రాణకణికాశక్తి వల్లా పవిత్ర మంత్ర స్పందనలవల్లా తమ రూపాల్లో మార్పులు చేసుకొంటూ ఉంటారు.
“చాలా సందర్భాల్లో, సూక్ష్మశరీరం, ముందటి భౌతికరూపానికి అచ్చంగా ప్రతిరూపంలా ఉంటుంది. సూక్ష్మలోక వ్యక్తి ముఖము ఆకారమూ అంతకు ముందు భూమిమీద చేసిన మజిలీలో, అతని పడుచు ప్రాయంలో ఎలా ఉండేవో అలా ఉంటాయి. కాని అప్పుడప్పుడు, నాబోటివాడు ముసలిరూపే నిలుపుకోవాలని తలుస్తాడు.” యువతాసక్తి ఉట్టిపడే గురుదేవులు, సవిలాసంగా ముసిముసి నవ్వులు నవ్వారు.
“సూక్ష్మమండలాలు, పంచేంద్రియ జ్ఞానంతో గ్రహించదగ్గ అంతరాళిక త్రిమితీయ ప్రపంచం మాదిరిగా కాకుండా, అన్నీ కలిసి ఉన్న సహజావబోధమనే ఆరో జ్ఞానేంద్రియానికి గోచరమవుతాయి.” అంటూ ఇంకా ఇలా చెప్పారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “సూక్షలోక వ్యక్తులు కేవలం, సహజావభోదానుభూతివల్ల చూస్తారు, వింటారు. వాసన చూస్తారు రుచి చూస్తారు, తాకుతారు. వాళ్ళకి మూడు కళ్ళు ఉంటాయి, వాటితో రెండు కొంతమట్టుకు మూసుకొని ఉంటాయి. మూడోది, ముఖ్యమైన సూక్ష్మనేత్రం; ఇది నుదుటిమీద నిలువుగా, తెరుచుకొని ఉంటుంది. సూక్ష్మలోక మానవులకు కళ్ళు, చెవులు, ముక్కు, నాలిక, చర్మం అన్న బాహ్య జ్ఞానేంద్రియాలు అన్నీ ఉంటాయి; కాని వాళ్ళు, శరీరంలో ఏ భాగంతోనయినా సంవేదనలు పొందడానికి సహజావబోధమనే జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించుకుంటారు. మాటవరసకి, వాళ్ళు చెవితోకాని, ముక్కుతో కాని, చర్మంతోకాని చూడగలరు. కళ్ళతోటికాని, నాలికతోటికాని వినగలరు; చెవులతోకాని, చర్మం మొదలైనవాటితోకాని రుచి చూడగలరు.[5]
“మానవుడి భౌతిక శరీరం లెక్కలేనన్ని అపాయాలకు గురయ్యే విధంగా ఉంటుంది; అది ఇట్టే గాయపడుతుంది; లేదా అంగవైకల్యం పొందుతుంది. కాని ఆకాశతత్త్వ సంబంధమైన సూక్ష్మశరీరం అప్పుడప్పుడు కోసుకుపోవచ్చు, లేదా గాయపడవచ్చు; కాని అది ఇచ్ఛాశక్తి వల్ల వెంటనే నయమయిపోతుంది.”
“గురుదేవా, సూక్ష్మలోక వ్యక్తులు అందరూ అందంగా ఉంటారాండీ?”
“సూక్ష్మలోకంలో, అందమనేది ఆత్మపరమయిన గుణమేకాని బాహ్యరూపం కాదు,” అని జవాబిచ్చారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “అంచేత, సూక్ష్మలోకవాసులు ముఖలక్షణాలకు ప్రాముఖ్యమియ్యరు. అయితే, సంకల్పమాత్రంచేత, నవీన సుందర సూక్ష్మశరీరాన్ని సృష్టించుకుని ధరించే హక్కు వాళ్ళకి ఉంది. భూమిమీద మనుషులు పండుగపబ్బాల్లో కొత్తదుస్తులు ధరించినట్లే, సూక్ష్మలోకవాసులు కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకంగా కల్పించిన రూపాలు ధరిస్తారు.
“హిరణ్యలోకం వంటి సూక్ష్మ గ్రహాల్లో, అక్కడివాడు ఎవరయినా ఆధ్యాత్మిక ప్రగతిద్వారా విముక్తుడయి, తత్ఫలితంగా కారణ లోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆనందోత్సవాలు జరుగుతాయి. అటువంటి సందర్భాల్లో, అగోచరుడైన పరమేశ్వరుడూ ఆయనలో లీనమైన సాధువులూ, ఆ ఉత్సవాల్లో పాల్గోడానికి దివ్యసుందరమైన సూక్ష్మదేహాలతో సాక్షాత్కరిస్తారు. ప్రభువు తన ప్రియపుత్రుణ్ణి సంతోష పెట్టడానికి అతడు కోరిన రూపం ధరిస్తాడు. భక్తుడు దేవుణ్ణి భక్తితో కొలిచినట్లయితే ఆయన్ని జగన్మాతరూపంలో దర్శిస్తాడు. ఏసుక్రీస్తుకు దేవుణ్ణి గురించి చేసే భావనలన్నిటిలోకీ పితృభావనే ఎక్కువ ఆకర్షంగా ఉండేది. సృష్టికర్త తాను సృష్టించిన ప్రాణుల్లో ప్రతి ఒక్క దానికీ ఇచ్చిన వ్యక్తిత్వం, ఆయన సర్వతోముఖమైన ప్రజ్ఞ వెల్లడి కావాలని, ఊహించడానికి వీలుగానూ ఊహించడానికి వీలులేని విధంగానూ కోరికలు కోరుతుంది!” మా గురుదేవులు నేనూ హాయిగా కలిసి నవ్వుకున్నాం.
“ఇతర జన్మల్లోని స్నేహితులు, సూక్ష్మలోకంలో ఒకరినొకరు సులువుగా గుర్తుపడతారు,” అంటూ శ్రీయుక్తేశ్వర్‌గారు, మధురమైన వేణునాదం వంటి స్వరంతో చెబుతూ వచ్చారు. “స్నేహానికి అమరత్వం ఉన్నందుకు ఆనందిస్తూ వాళ్ళు, పార్థివ జన్మలో భ్రాంతిమయమైన వియోగాలు జరిగే విషాద సమయంలో తరచు శంకిస్తూ వచ్చిన, ప్రేమ అవినశ్వరతను ఇప్పుడు అనుభూతం కావించుకుంటారు.”
“సూక్ష్మలోక వ్యక్తులు సహజావబోధంవల్ల, తెర చీల్చుకొని మానవ కార్యకలాపాల్ని గమనిస్తూ ఉంటారు; కాని మానవుడు మాత్రం, అతని ఆరో జ్ఞానేంద్రియం కొంతమట్టుకు వికాసంచెంది ఉండకపోతే సూక్ష్మమండలాల్ని దర్శించలేడు. భూమిమీద ఉండేవాళ్ళు అనేక వేలమంది క్షణికంగా, ఒక సూక్ష్మలోకజీవినో, ఒక సూక్మలోకాన్నో దర్శించినవాళ్ళే.[6]
“హిరణ్యలోకంలో ఉండే, ప్రగతి సాధించిన జీవులు సాధారణంగా సూక్ష్మలోకపు దీర్ఘమైన రాత్రింబగళ్ళలో నిర్వికల్ప ఆనందసమాధిలో జాగృతులై ఉంటారు. విశ్వపరిచాలనానికి సంబంధించిన క్లిష్ట సమస్యల్ని పరిష్కరించడానికి భూలోకయానానికి ఉద్యుక్తులైనవారి ఆత్మల విమోచనకు సహాయపడుతూ ఉంటారు. హిరణ్యలోక జీవులు నిద్రపోయేటప్పుడు, అప్పుడప్పుడు, కలలవంటి సూక్ష్మ అంతర్దర్శనానుభవాలు పొందుతూ ఉంటారు.”
“అయినప్పటికీ, సూక్ష్మవిశ్వంలోని అన్ని ప్రాంతాల్లో ఉండేవాళ్ళూ మనోవేదనలకు గురిఅవుతూ ఉండేవాళ్ళే. హిరణ్యలోకంవంటి గ్రహాలమీద ఉండే మహాభక్తుల సునిశిత మనస్సులు, సత్యవర్తనలో కాని సత్యదర్శనంలో కాని ఏదయినా పొరపాటు జరిగినట్లయితే తీవ్రమైన మనోవేదన పొందుతాయి. ఈ ప్రగతజీవులు తమ ప్రతి చర్యనూ ఆలోచననూ, ఆధ్యాత్మిక నియమ పరిపూర్ణత్వంతో అనుసంధానం కావించుకోడానికి ప్రయత్నిస్తారు.”
"సూక్ష్మలోకవాసులందరి మధ్య భావసంపర్కం పూర్తిగా, మానసిక ప్రసార (టెలిపతీ) సూక్ష్మ దూరదర్శనాల (ఆస్ట్రల్ టెలివిజన్) ద్వారా జరుగుతుంది. మామూలుగా భూమిమీద ఉన్నట్టు, పలికిన మాటకూ రాసిన మాటకూ మధ్య ఉండే గందరగోళం, అపార్థద్యోతకత సూక్ష్మమండల వాసుల్లో లేవు.”
“వెలుతురు కల్పించిన బొమ్మలవరస ద్వారా, సినిమా తెరమీద మనుషులు నిజంగా ఊపిరి తీసుకోకుండానే కదలడం, కార్యకలాపాలు సాగించడం చేస్తున్నట్టుగానే, కాంతే తమకు మూలమై తమను చైతన్య వంతుల్ని చెయ్యడానికి ఆక్సిజన్ ఏదీ అవసరం లేని సూక్షలోక సమన్విత జీవులు నడుస్తారు, పనిచేస్తారు. మానవుడు ప్రధానంగా ఘన, ద్రవ, వాయు పదార్థాలమీదా గాలిలో ఉన్న ప్రాణశక్తి మీదా ఆధార పడి ఉన్నవాడు; కాని సూక్ష్మలోకవాసులు ప్రధానంగా విశ్వకాంతి మీదే ఆధారపడి బతుకుతారు.”
“గురువుదేవా, సూక్మలోక వ్యక్తులు ఏమయినా తింటారాండీ?” నేను ఆయన వివరణను మనస్సు, హృదయం, ఆత్మ అనే నా శక్తులన్నిటి గ్రాహకగుణంతోనూ ఆస్వాదిస్తున్నాను. అధిచేతనానుభూతులు శాశ్వతత్వంగలవి; ఇవి వాస్తవమైనవీ, మార్పులేనివీ; కాని క్షణికమైన ఇంద్రియానుభూతులు తాత్కాలికంగానూ సాపేక్షికంగానూ మాత్రమే నిజమైనవి; వాటి విషయంలో మానవుడికుండే జ్ఞాపకాలు త్వరగానే కరిగిపోతాయి. మా గురుదేవుల మాటలు నా మనఃఫలకం మీద ఎంతగాఢంగా ముద్రవేసుకున్నాయంటే, ఏ సమయంలో నయినా సరే, నా మనస్సును అధిచేతన స్థితిలోకి మార్చుకుని ఆ దివ్యానుభూతిని స్పష్టంగా తిరిగి పొందగలను.”
“సూక్ష్మలోక భూముల్లో వెలుగు రేకల్లాటి కూరగాయలు సమృద్ధిగా ఉంటాయి,” అని జవాబిచ్చారాయన. సూక్ష్మలోకవాసులు పళ్ళూ కూరగాయలు తింటారు. సూక్ష్మలోకంలోని శోభాయమానమైన వెలుతురు. నీటి బుగ్గలనుంచి ఎగిసిపడి ప్రవహించే అమృతాన్ని పానం చేస్తారు. భూమిమీద సాధారణంగా, మానవుల అదృశ్యబింబాల్ని ఆకాశతత్త్వం (ఈథర్) లోంచి రప్పించి టెలివిజన్ సాధనం ద్వారా కళ్ళకు కట్టించినట్టే, దేవుడు సృష్టించిన ఆకాశతత్త్వంలో తేలే కూరగాయలు, మొక్కలు, పండ్ల అగోచర సూక్ష్మ ప్రతిరూపాల్ని సూక్ష్మలోకంలో, అక్కడుండేవాళ్ళ ఆదేశాలవల్ల రూపొందించవచ్చు. అదే విధంగా, సూక్ష్మలోక జీవుల ఉద్దామ కల్పనల్ని అనుసరించి విశాలవనాల్ని సాక్షాత్కరింప జేయనూ వచ్చు; తిరిగి వాటిని ఆకాశతత్త్వసహజంగా అదృశ్యం కావించనూ వచ్చు.”
“హిరణ్యలోకంవంటి స్వర్లోక మండలాల్లో ఉండేవాళ్ళు తిండి తినవలసిన అవసరం లేకుండా దాదాపు స్వేచ్ఛ పొందినప్పటికీ కూడా, కారణలోకంలో దాదాపు పరిపూర్ణతాసిద్ధి పొందిన జీవుల అనియత అస్తిత్వం, అంతకన్న ఉన్నతస్థితిలో ఉంటుంది; వాళ్ళ ఏకైక ఆహారం ఆనందామృతమే.”
“సూక్ష్మలోకవ్యక్తి, భూలోకంలో వివిధ జన్మల్లో పొందిన తండ్రుల్నీ తల్లుల్నీ భార్యల్నీ భర్తల్నీ పిల్లల్నీ స్నేహితుల్నీ అనేక మందిని చూస్తాడు. వాళ్ళు సూక్ష్మవిశ్వంలోని వివిధ భాగాల్లో అప్పుడప్పుడు అవుపిస్తూ ఉంటారు.[7] అంచేత, ఎవరిమీద ప్రత్యేకాభిమానం చూపించాలో తెలుసుకోలేకపోతున్నాడు; ఈ విధంగా అతడు, జీవు అన్నిటినీ భగవంతుడి సంతానంగానూ ఆయన వైయక్తికీకృత అభివ్యక్తులుగానూ గ్రహించి, వాళ్ళందరిమీదా దివ్యమైన, సమానమైన ప్రేమ చూపిస్తాడు.
“తనకు ప్రియమైనవాళ్ళ బాహ్యరూపాలు మారిపోయినప్పటికీ (దాదాపు వెనకటి జన్మలో వాళ్ళ కొత్తగుణాల వికాసానికి అనుగుణంగా) సూక్ష్మలోకవాసి, ఇతర జీవనస్తరాల్లో ఒకప్పుడు తనకు ప్రియంగా ఉన్నవాళ్ళనందరినీ గుర్తుపట్టడానికి తన అమోఘ సహజావబోధాన్ని ఉపయోగించి, వాళ్ళని తమ కొత్త సూక్ష్మలోక నివాసాలకు ఆహ్వానిస్తాడు. సృష్టిలో ప్రతి అణుపూ నశింపజేయరాని వ్యక్తిత్వం[8] ఏర్పడి ఉన్నది కనక, సూక్ష్మలోక మిత్రుడు ఏ దుస్తులు ధరించినప్పటికీ ఇతరులు అతన్ని గుర్తుపట్టేస్తారు; భూమిమీద నటుడు ఏ మారువేషంలో ఉన్నప్పటికీ నిశిత పరిశీలనవల్ల అతన్ని గుర్తు పట్టగలిగేటట్టే.
“సూక్ష్మమండలాల్లో మామూలు ఆయుఃప్రమాణం, భూమిమీద ఉన్నదానికన్న చాలా ఎక్కువ. ఏ వ్యక్తి అయినా ఒక సూక్ష్మగ్రహంలో కొంతకాలం ఉంటాడు; ఆ కాలపరిమితి అతన్ని, నియమానుసారంగా నిశ్చితమైన ఒక కాలంలో తిరిగి భూమండలానికి ఆకర్షించే భౌతిక కర్మభారాన్ని బట్టి నిర్ణయమవుతుంది. కొందరు జీవులు భౌతికంగా మరణించిన తరవాత వెంటనే భూమిమీదికి తిరిగి వచ్చేస్తారు. మామూలుగా దానికి కారణం, అలా తిరిగిరావాలని వాళ్ళకి బలమైన కోరిక ఉండడమే. చాలా మట్టుకు అభివృద్ధి సాధించిన వ్యక్తుల సూక్ష్మశరీర జీవితం సగటు ఆయుఃప్రమాణం, ఐదువందల ఏళ్ళ నుంచి వెయ్యేళ్ళవరకు ఉంటుంది. (భూలోక ఆయుఃప్రమాణంతో పోల్చి చూస్తే). సెక్వోయియా వృక్షాలు ఇతర వృక్షాలకన్న కొన్ని వేల ఏళ్ళు బతికేటట్టుగాను, చాలామంది అరవై ఏళ్ళు నిండకముందే చనిపోతున్నప్పటికీ కొందరు యోగులు అనేకవందల ఏళ్ళు బతుకుతున్నట్టుగాను అసాధారణ వ్యక్తులు, సూక్ష్మమండలంలో సుమారు రెండువేల ఏళ్ళు బతుకుతారు.
“సూక్ష్మలోక జీవి జ్యోతిర్మయదేహాన్ని విడిచేసే సమయంలో యముడితో కష్టపడి పెనుగులాడక్కర్లేదు.”
“అయినా ఈ జీవులు సూక్ష్మతరమైన కారణ శరీరంకోసం సూక్ష్మరూపాన్ని విడవాలన్న ఆలోచన వచ్చేసరికి కొద్దిగా గాభరా పడతారు. సూక్ష్మలోకంలో, కోరుకోని చావూ జబ్బూ ముసలితనమూ ఉండవు. ఈ భయాలు మూడూ భూలోకానికి పట్టిన శాపాలే; ఇక్కడ మనిషి, బతకడానికి గాలీ అన్నమూ నిద్రా అవసరమైన దుర్బల భౌతికకాయమే తానని దాంతో పూర్తిగా మమైకమయిపోవడానికి తనచేతనను అనుమతిస్తాడు.”
"భౌతికమరణంలో ఊపిరి పోతుంది; మాంస సంబంధమైన కణాలు విఘటనం చెందుతాయి. కాని, సూక్ష్మ శరీరమరణంలో ప్రాణ కణికలు చెల్లాచెదరయి పోతాయి; అవి సూక్ష్మలోకజీవుల శరీరాలకి ప్రాణసంఘటన కావించిన విశ్వశక్తి తాలూకు ప్రత్యక్షీకృత ఘటకాంశాలు. భౌతిక మరణసమయంలో మనిషికి ఒంటిమీద స్పృహపోతుంది. సూక్ష్మలోకంలో ఉన్న తన సూక్ష్మశరీరం స్పృహకు వస్తుంది. నిర్ణీత సమయంలో సూక్ష్మలోక మరణాన్ని అనుభవించి తద్వారా మనిషి, సూక్ష్మలోక జననమరణాల స్పృహనుంచి భౌతిక జననమరణాల స్పృహకు సాగుతాడు. సూక్ష్మ, స్థూల శరీరకోశాల ఆవర్తన చక్రాలు జ్ఞానం ర్ణిర్గంచని జీవులందరికీ అనివార్యమైన భవితవ్యాలు. పవిత్ర గ్రంథాల్లో ఆసనరకాల కిచ్చిన నిర్వచనాలు ఒక్కొక్కప్పుడు, ఆనందమయ సూక్ష్మ లోకాల్లోనూ నిరాశాజనకమైన భౌతిక లోకాల్లోనూ కలిగిన అనేక అనుభవాల తాలూకు అవచేతనకన్న గాఢమైన జ్ఞాపకాల్ని మనిషిలో రేకెత్తిస్తాయి.”
“గురుదేవా, భూమిమీదా సూక్ష్మ కారణ లోకాల్లోనూ సంభవించే పునర్జన్మల భేదాన్ని వివరంగా చెప్పరూ?” అని అడిగాను.
“మానవుడు ప్రధానంగా వైయక్తికీకృత ఆత్మగా, కారణ శరీరుడు,” అంటూ వివరించారు మా గురుదేవులు. “ఆ శరీరం ముప్ఫైఐదు తత్త్వాలతో (భావాలతో) కూడినది; దాన్ని రూపొందించడానికి మౌలిక ఆలోచనాశక్తులుగా, లేదా, కారణ ఆలోచనాశక్తులుగా, దేవుడికి అవి అవసరమయాయి; ఆ తరవాత ఆయన, వాటిలోంచి పందొమ్మిది తత్త్వాలు తీసుకొని సూక్ష్మశరీరాన్నీ, పదహారు తత్త్వాలు తీసుకొని భౌతికశరీరాన్ని నిర్మించాడు.
“సూక్ష్మశరీరంలో ఉండే పందొమ్మిది తత్త్వాలూ మానసికమైనవీ, భావోద్రేకపరమైనవీ, ప్రాణకణికాపరమైనవీ. ఆ పందొమ్మిది అంశాలూ ఏవంటే: బుద్ధి (తెలివి); అహంకారం; చిత్తం (అనుభూతి), మనస్సు (ఇంద్రియ స్పృహ); ఐదు జ్ఞానేంద్రియాలు- చూపు, వినుకలి, వాసన, రుచి, స్పర్శ (శబ్దస్పర్శరూపరసగంధాలు) గ్రహించడానికి ఉపకరించే సూక్ష్మ ప్రతిరూపాలు; ఐదు కర్మేంద్రియాలు - ప్రజననానికీ విసర్జనకూ మాటకూ నడకకూ కాయిక కర్మలకూ ఉపకరించే సామర్థ్యాల మానసిక ప్రతిరూపాలు; ప్రాణశక్తి తాలూకు ఇంద్రియాలు ఐదు - శరీరంలో స్ఫటికీకరణ (crystallizing), స్వాంగీకరణ (assimilating), విసర్జన (eliminating), జీవాణుపాక (metabolizing), ప్రసరణ (circulating) కార్యాలు జరిపేవి (ప్రాణాపాన వ్యానోదానసమావ వాయువులు ). పందొమ్మిది తత్త్వాల సూక్ష్మ శరీర కోశం, పదహారు స్థూల రసాయన మూలకాలతో రూపొందిన భౌతిక శరీరం నశించిన తరువాత కూడా ఉంటుంది.
“దేవుడు వివిధ తత్త్వాల్ని తనలోనే భావన చేసుకొని వాటిని స్వప్నాల్లోకి ప్రక్షేపించాడు. ఆ విధంగా, అనంత సాపేక్షతాభరణాలతో బృహత్పరిమాణంలో అలంకరించుకొన్న విశ్వస్వప్న మాయాసుందరి (Lady Cosmic Dream) ఆవిర్భవించింది.”
“కారణ శరీరంలోని ముప్ఫైఐదు తత్త్వాల్లోనూ భగవంతుడు, మనిషి సూక్ష్మశరీరం బాపతు పందొమ్మిది తత్త్వాల్నీ, భౌతిక శరీరం తాలూకు పదహారు తత్త్వాల్నీ సర్వసంకీర్ణతాయుతంగా సమకూర్చాడు. స్పందనశక్తుల్ని ఘనీభూతంచేసి, మొదట మనిషి సూక్ష్మ శరీరాన్ని చివరికి భౌతిక శరీరాన్ని సృష్టించాడాయన. మౌలిక సారళ్య రూపుడయిన పరమేశ్వరుడు దిగ్భ్రమకారకమైన నానాత్వంగా పరిణమించడానికి కారణమయిన సాపేక్షతానియమం ప్రకారం కారణవిశ్వమూ కారణ శరీరమూ సూక్ష్మవిశ్వానికి సూక్ష్మదేహానికి భిన్నంగా ఉంటాయి. అలాగే భౌతికవిశ్వమూ భౌతికదేహమూ కూడా స్వభావతః, సృష్టిలోని ఇతర రూపాలకు భిన్నంగా ఉంటాయి.”
“రక్తమాంసాలతో కూడిన శరీరం, సృష్టికర్త నిశ్చిత, ప్రత్యక్షీకృత స్వప్నాలతో ఏర్పడినది. ఆరోగ్య అనారోగ్యాలూ కష్టసుఖాలూ లాభనష్టాలూ అన్న ద్వంద్వాలు భూమిమీద ఎప్పుడూ ఉంటాయి. మానవులకు త్రిమితీయ (three-dimensional) పదార్థంలో పరిమితీ ప్రతిరోధమూ తప్పవు. మనిషికి బతికుండాలన్న కోరిక, జబ్బువల్లనో మరే కారణాలవల్లనో తీవ్రంగా సడలిపోయినట్లయితే మరణం సంభవిస్తుంది; మాంసరూపమైన బరువైన బాహ్యకళేబరాన్ని తాత్కాలికంగా వదిలెయ్య వలసి వస్తుంది. అయితే ఆత్మ, సూక్ష్మ కారణ శరీరాల్లో అబద్ధమై ఉంటుంది.[9] ఈ మూడు శరీరాల్నీ కలిపి ఉంచే సంయోజకశక్తి కోరిక తీరని కోరికల చాలనశక్తే మానవుడి బానిసతనానికి కారణం.
“భౌతిక వాంఛలకు మూలం అహంకారమూ ఇంద్రియ సుఖాలూ. ఇంద్రియానుభవ నిర్బంధం లేదా ప్రలోభం, సూక్ష్మలోక అనుబంధాలకు కాని కారణలోక అనుభూతులకు కాని సంబంధించిన వాంఛాశక్తికన్న ఎక్కువ శక్తిమంతమైనది.”
“సూక్ష్మలోక వాంఛలు, స్పందనరూప సుఖానుభవానికి సంబంధించినవి. సూక్ష్మలోక జీవులు వివిధ గోళాల ఆకాశ సంగీతాన్ని ఆలకించి సృష్టి అంతా పరివర్తనశీల కాంతి తాలూకు అనంతాభివ్యక్తులుగా కనబడ్డంవల్ల పరవశులై ఆనందిస్తారు. సూక్ష్మలోక జీవి వెలుగును వాసన చూస్తాడు, రుచి చూస్తాడు, తాకుతాడు. ఈ విధంగా సూక్ష్మలోక వాంఛలు అన్ని వస్తువుల్నీ అనుభవాల్నీ కాంతిరూపాలుగా, లేదా ఘనీభూత ఆలోచనలుగా, లేదా కలలుగా రూపొందించడానికి సూక్ష్మలోక జీవికి ఉండేశక్తిని బట్టి ఉంటాయి.”
“కారణలోక వాంఛలు అనుభూతివల్ల మాత్రమే నెరవేరతాయి. కారణ శరీరంలో మాత్రమే అబద్ధులై ఉండి, విముక్తప్రాయులైన జీవులు విశ్వాన్నంతనీ దేవుడి స్వప్నభావాలకు సిద్ధించిన ప్రత్యక్షరూపంగా దర్శిస్తారు; ఆలోచనమాత్రం చేతనే వాళ్ళు దేన్నయినా సాక్షాత్కరింప జెయ్యగలరు. కాబట్టి కారణ శరీరులు, భౌతిక ఇంద్రియ సుఖాన్నికాని, సూక్ష్మలోక ఆనందాన్ని కాని స్థూలమైనదిగానూ, ఆత్మకు కలిగే సూక్ష్మతర సంవేదనలకు అవరోధకంగానూ పరిగణిస్తారు. కారణ శరీరులు తమకు కావలసినవి తక్షణమే సాక్షాత్కరింపజేసుకొని కోరికలు నశింపజేసు కొంటారు.[10] కారణ శరీరమనే నాజూకు ముసుగు మాత్రమే కప్పి ఉన్న వాళ్ళు, సృష్టికర్తలాగే విశ్వాల్ని సృష్టించగలరు. సృష్టి అంతా విశ్వ స్వప్నజాలంతో రూపొందినందువల్ల, కారణ శరీరమనే పలచని వస్త్రం ధరించిఉన్న ఆత్మ, వివిధ విస్తృతరూపాల్లో శక్తిని సాక్షాత్కరింప జేసుకొంటూ ఉంటుంది.
సహజంగా కంటికి కనిపించని ఆత్మను దాని శరీరం చేతా వివిధ శరీరాలచేతా మాత్రమే గుర్తు పట్టడానికి వీలవుతుంది. శరీరం ఒకటి ఉందంటే, అది తీరని కోరికవల్ల ఏర్పడినట్టే లెక్క.[11]
“మానవుడి ఆత్మ, ఒకటో రెండో మూడో - శరీరమనే సీసాల్లో బంధించి ఉండి, అజ్ఞానమూ కోరికలూ అనే బిరడాలతో గట్టిగా బిగించి ఉన్నంతకాలం అతడు, పరమాత్మ సాగరంలో లీనం కాలేడు. చావు అనే సుత్తి దెబ్బతో స్థూల భౌతికకాయం బద్దలయిపోయినప్పుడు సూక్ష్మ, కారణ శరీరాలనే తక్కిన తొడుగులు రెండూ, సర్వవ్యాప్త ప్రాణమనే పరమాత్మతో సచేతనంగా లీనంకావడానికి వీలులేకుండా ఆత్మను నిరోధించడానికి, ఇంకా మిగిలి ఉంటాయి. జ్ఞానం ద్వారా నిష్కామం అలవడినప్పుడు, దాని శక్తి తక్కిన కోశాల్ని రెండిటినీ ఛిన్నా భిన్నం చేసేస్తుంది. చివరికి, స్వల్పమయిన మానవాత్మ విముక్తమయి, అమేయ సమృద్ధమయిన పరమాత్మతో ఐక్యమవుతుంది.”
ఉత్కృష్టమూ, అద్భుతమూ అయిన కారణలోకాన్ని గురించి మరీ కొంత చెప్పమని గురుదేవుల్ని అర్థించాను.
“కారణ శరీరం, చెప్పలేనంత సూక్ష్మమయినది,” అన్నారాయన. “దాన్ని అర్థంచేసుకోవాలంటే ఎవరికయినా, తాము కళ్ళు మూసుకొని సూక్ష్మవిశ్వాన్నీ భౌతికవిశ్వాన్నీ సమస్తాన్నీ - గట్టిబుట్ట ఒకటి, కింద వేలాడుతూన్న ప్రకాశమానమైన గాలిబుడగ నంతటినీ భావాలరూపంలోనే దర్శించడానికి కావలసిన మహత్తర ఏకాగ్రతశక్తులు ఉండి ఉండాలి. అధిమానవసాధ్యమైన ఏకాగ్రతతో ఆ రెండు విశ్వాల్నీ, వాటి సంకీర్ణత లన్నిటితో సహా, కేవల భావాల్లోకి పరివర్తన చేయడంలో, లేదా పరిష్కారం చేయడంలో, కృతకృత్యుడు కాగలిగితే అప్పుడతడు కారణలోకాన్ని చేరి మనస్సుకూ పదార్థానికీ మధ్య సరిహద్దులో నిలబడతాడు. అక్కడతడు, ఘన ద్రవ వాయుపదార్థాలు, విద్యుత్తు, శక్తి, సర్వజీవులు, దేవతలు, మనుష్యులు, జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవులు మొదలైన, సృష్టిలోని వస్తువులన్నిటినీ చైతన్యరూపాలుగా దర్శిస్తాడు; అంటే, మనిషి కళ్ళు మూసుకొని తన దేహం భౌతిక నేత్రాలకు కనబడకుండా కేవలం భావంగా మాత్రమే ఉన్నా కూడా తా నన్నవాడు ఒకడు ఉన్నాడని గ్రహించినట్టుగానే అన్నమాట.”
“మనిషి, ఊహలో చెయ్యగలిగిందల్లా కారణ శరీరుడు వాస్తవంగా చేస్తాడు. కేవలం మనస్సులో, ఆలోచనలో మొదటి కొసనుంచి తుదికొస దాకా సాగడానికికాని, ఒక లోకంనుంచి మరో లోకానికి మానసికంగా లంఘించడానికికాని, నిత్యత్వమనే కూపంలోకి అంతులేకుండా పడుతూ ఉండడానికికాని, నక్షత్ర మండలాల ముత్యాల పందిరిలోకి రాకెట్టు మాదిరిగా దూసుకుపోవడానికికాని, పాలపుంతల మీదా నక్షత్రాంతరాళాలోనూ సెర్చిలైటులా మిలమిల్లాడడానికికాని, అత్యంత విస్తారమైన మానవ కల్పనాశక్తికి సామర్థ్యం ఉంది. కాని కారణలోక జీవులకు అంతకన్న గొప్ప స్వేచ్ఛ ఉంది. భౌతిక అవరోధంకాని, సూక్ష్మ అవరోధంకాని, కర్మబద్ధతకాని లేకుండా వాళ్ళు, తమ భావాల్ని తక్షణమే మూర్తరూపంలో అనాయాసంగా ప్రత్యక్షీకరించుకుంటారు.”
“భౌతికవిశ్వం మౌలికంగా ఋణవిద్యుత్కణాలతో (ఎలక్ట్రాన్‌లతో) ఏర్పడ్డది కాదని, అలాగే సూక్ష్మవిశ్వం మౌలికంగా ప్రాణకణిక (లైఫ్‌ట్రాన్) లతో ఏర్పడ్డది కాదని - నిజానికి ఆ రెండూ, సృష్టిని సృష్టికర్తనుంచి విడదియ్యడానికి మధ్యలో కలగజేసుకుంటున్నట్టు అనిపించే సాపేక్షతా నియమమనే మాయచేత ఖండితమై, విభాజితమైన భగవద్భావన తాలూకు సూక్ష్మతమ కణాలతో ఏర్పడ్డదనీ గ్రహిస్తారు.”
“కారణలోకంలో ఆత్మలు, ఒకదాన్నొకటి ఆనందమయ పరమాత్మ తాలూకు వైయక్తికీకృత బిందువులుగా గుర్తుపడతాయి; వాటి చుట్టూ ఉండే వస్తువులన్నీ భావవస్తువులే, కారణశరీరులు, కేవలం భావాలయిన తమ దేహాలకూ ఆలోచనలకూ ఉండే తేడా గమనిస్తారు. మానవు డొకడు కళ్ళు మూసుకొని మిరుమిట్లు గొలిపే తెల్లటి వెలుగును కాని, మందమైన నీలివన్నె మసక వెలుతురును కాని చూడగలిగినట్టే కారణ శరీరులు, కేవలం ఆలోచనల్నే చూడగలరు, వినగలరు, వాసన చూడగలరు, రుచి చూడగలరు, తాకగలరు. వాళ్ళు విశ్వమానవ శక్తితో ఏదైనా సరే సృష్టించేస్తారు, లయం చేస్తారు.”
“కారణ లోకంలో చావుపుట్టుకలు రెండూ భావనలోనే ఉంటాయి, కారణ శరీరులు నిత్యనూతన జ్ఞానం అనే అమృతంతోనే విందు చేసుకుంటారు. శాంతి అనే నీటి బుగ్గల్లోంచి పెల్లుబికి వచ్చింది తాగుతారు, అనుభూతి అనే దారిలేని నేలమీద తిరుగుతారు, ఆనందమనే అనంతసాగరంలో ఈదులాడతారు. అవిగో! వాళ్ళ ఉజ్జ్వల భావదేహాలు. అనంతత్వపు ఆకాశరూప ఉరఃస్థలిమీద కోటానుకోట్లుగా పరమాత్మ సృష్టించిన లోకాల్నీ, విశ్వాలనే తాజా బుడగల్నీ, జ్ఞాన తారకల్నీ, సువర్ణ నీహారికల చిత్రవర్ణ స్వప్నాల్నీ దాటి మునుముందుకు దూసుకుపోతున్నాయి.
“అనేక జీవులు కారణలోకంలో వేలకొద్ది సంవత్సరాలు ఉండిపోతారు. గాఢతరమైన ఆనందాతిరేకంవల్ల విముక్తాత్మ అప్పుడు స్వల్పమైన కారణ శరీరంలోంచి బయటికి వచ్చి కారణ విశ్వానికున్న విస్తారత అనే రూపాన్ని ధరిస్తుంది. భావాల వేరువేరు సుడిగుండాలూ ప్రత్యేకీకృత శక్తితరంగాలు, ప్రేమా, ఆనందమూ, శాంతీ, సహజావబోధమూ, ప్రశాంతతా, స్వయంసంయమమూ, ఏకాగ్రతా - ఇవన్నీ కరిగి, పరమానంద సాగరంలో లీనమయిపోతాయి. అటుమీదట ఆత్మ, తానొక వైయక్తికీకృత తరంగంగా ఆనందానుభవం పొందదు; చిరంతన హాసం, ఆహ్లాదాలు, స్పందాలు అనే కెరటాలు గల విశ్వైక మహాసాగరంలో విలీనమయి పోతుంది.”
“ఆత్మ, ఈ మూడు శరీరాల గూళ్ళనూ విడిచేసినప్పుడు, సాపేక్షతానియమం నుంచి తప్పించుకొని, అనిర్వచనీయ నిత్యస్థితం అవుతుంది.[12] సర్వవ్యాపకత్వమనే సీతాకోక చిలకను చూడు; దాని రెక్కలమీద నక్షత్రాలూ చంద్రబింబాలూ సూర్యబింబాలూ చిత్రించి ఉన్నాయి! పర మాత్మగా విస్తరించిన ఆత్మ, వెలుగులేని వెలుగు, చీకటిలేని చీకటి, ఆలోచనలేని ఆలోచన ఉండే ప్రాంతంలోనే, విశ్వసృష్టి అనే దైవ స్వప్నంలో కలిగిన ఆనందాతిశయంతో మత్తెక్కి ఉంటుంది.”
“విముక్తాత్మ!” అంటూ విస్మయంతో పలికాను.
“చివరికి శారీరక భ్రాంతులనే మూడు ఘటాలలోంచి బయటపడ్డ ఆత్మ తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండానే అనంతంలో ఏకమవుతుంది. క్రీస్తు ఏసుగా పుట్టడానికి పూర్వమే ఈ చరమస్వేచ్ఛ సాధించాడు. ఆయన భూలోక జీవితంలో మరణమూ పునరుత్థానమూ అనే మూన్నాళ్ళ అనుభవంతో సూచితమైన పూర్వదశలు మూడింటిలోనూ ఆయన, పరమాత్మను చేరుకోడానికి కావలసిన సంపూర్ణశక్తిని సాధించాడు.” అన్నారు గురుదేవులు.
“అభివృద్ధిచెందని మనిషి ఈ మూడు శరీరాల్లోంచి బయటపడ్డానికి భూలోకంలోనూ సూక్ష్మలోకంలోనూ లెక్కలేనన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుంది. ఈ చరమస్వేచ్ఛ సాధించిన గురువు, ఇతర మానవుల్ని దేవుడి దగ్గరికి తిరిగి తీసుకురావడానికి, భూలోకానికి ప్రవక్తగా తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకోవచ్చు, లేకపోతే నాలాగ, సూక్ష్మవిశ్వంలో ఉందామని అనుకోవచ్చు. అక్కడ రక్షకుడు, అక్కడివాళ్ళ కర్మ[13]భారాన్ని కొంత తాను మోస్తూ వాళ్ళు సూక్ష్మవిశ్వంలో మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా చేసి, వాళ్ళు కారణ లోకమండలాలకు శాశ్వతంగా వెళ్ళేటందుకు సహాయపడతాడు. లేదా విముక్తాత్ముడు, కారణలోకంలోకి ప్రవేశించి, అక్కడివాళ్ళు కారణశరీరంలో తమ జీవితకాలాన్ని తగ్గించుకొని కైవల్య ప్రాప్తిపొందడానికి తోడ్పడతాడు.”
“పునరుత్థానం చెందిన మహాత్మా! ఆత్మలు ఈ మూడు లోకాలకూ తిరిగి రావాలన్న నిర్బంధం కలిగించే కర్మనుగురించి ఇంకా తెలుసుకోవాలని ఉందండి.” అన్నాను. సర్వజ్ఞులైన నా గురుదేవులు చెప్పేది ఎప్పటికీ అలా వింటూనే ఉండగలననిపించింది. ఆయన భూమిమీద గడిపిన జీవితంలో ఏ సమయంలోనూ నేనింత జ్ఞానాన్ని ఒంటబట్టించుకోలేకపోయాను. ఇప్పుడు మొట్టమొదటిసారిగా, చావుబతుకుల చదరంగం బల్లమీదుండే నిగూఢమయిన అంతరాల్నిగురించి సుస్పష్టమూ సునిశితమూ అయిన జ్ఞానం పొందుతున్నాను.”
“మానవుడు సూక్ష్మలోకాల్లో శాశ్వతంగా ఉండడం సంభవించేలోగా, అతడు తన భౌతికకర్మను, లేదా కోరికల్ని పూర్తిగా అనుభవిందాలి,” అంటూ వివరించారు గురుదేవులు, ఆహ్లాదకరమైన కంఠస్వరంతో. “సూక్ష్మలోకాల్లో రెండురకాల జీవులు ఉంటారు. భూలోక కర్మను ఇంకా క్షయం చేసుకోవలసినవాళ్ళనూ ఆ కారణంగా తను కర్మ సంబంధమైన ఋణాన్ని తీర్చుకోడానికి స్థూలమైన ఒక భౌతికదేహంలో ఉండవలసినవాళ్ళనూ భౌతిక మరణానంతరం, సూక్ష్మలోకానికి వచ్చే శాశ్వతవాసులుగా కాకుండా, [చుట్టపు చూపుగా] తాత్కాలికంగా వచ్చే సందర్శకులుగా మాత్రమే పరిగణించాలి.”
“భూలోకంలో కర్మఫలానుభోగం పూర్తికాని జీవులకు సూక్ష్మలోకమరణం సంభవించిన తరవాత విశ్వభావాల ఉన్నత కారణమండలం లోకి వెళ్ళడానికి అనుమతి లభించదు. పదహారు స్థూలతత్త్వాలున్న తమ భౌతికదేహాన్నీ, పందొమ్మిది సూక్ష్మతత్త్వాలున్న సూక్ష్మదేహాన్నీ వరసగా స్పృహలో ఉంచుకుని, భౌతికలోకానికి సూక్ష్మలోకానికి అటూఇటూ రాకపోకలు సాగిస్తూ ఉండాలి. అయితే భౌతికశరీరం నశించిన తరవాత ప్రతిసారీ, భూమినించి వచ్చిన, అభివృద్ధిచెందని జీవి, చాలామట్టుకు మరణ స్వప్నమనే గాఢసుషుప్తిలో ఉండిపోతాడు; అందమైన సూక్ష్మలోకం అతని స్పృహలో ఉండదు. అటువంటివాడు సూక్ష్మలోక విశ్రాంతి తీసుకున్న తరవాత అనుక్రమ శిక్షణకోసం భౌతికలోకానికి తిరిగి వెళ్తాడు. పదేపదే సాగే రాకపోకలవల్ల అతడు క్రమంగా, సులువుగా అర్థంగాని సూక్ష్మనిర్మాణం గల లోకాలకు అలవాటు పడిపోతాడు.”
“అది అలా ఉండగా, సూక్ష్మవిశ్వంలో మామూలుగా ఉంటున్నవాళ్ళు, లేదా చిరకాలంగా స్థిరనివాసులుగా ఉంటూ వచ్చినవాళ్ళు భౌతిక వాంఛ లన్నిటినించీ విముక్తులయి, భూలోకపు స్థూల స్పందనలకు మళ్ళీ లోనుకావలసిన అవసరం లేనివాళ్ళు. అటువంటి జీవులకు సూక్ష్మ, కారణ కర్మలుమట్టుకే అనుభవించవలసి ఉంటుంది. సూక్ష్మలోకంలో మరణించిన తరవాత ఈ జీవులు అత్యంత సూక్ష్మతరమూ సుందరతరమూ అయిన కారణలోకానికి వెళ్తారు. విశ్వనియమం నిర్ణయించిన ప్రకారం కొంత జీవితకాలం గడిచిన తరవాత, ఈ ప్రగత జీవులు హిరణ్యలోకానికో అలాంటి ఉన్నత సూక్ష్మలోకానికో వెళ్ళి, సూక్ష్మలోక కర్మఫలావశేషాన్ని అనుభవించడానికి ఒక కొత్త సూక్ష్మశరీరంలోకి ప్రవేశిస్తారు.”
“అబ్బాయి, నేను దైవాజ్ఞచేత పునరుత్థానం చెందానని, ఇప్పుడు నువ్వు పూర్తిగా గ్రహించవచ్చు,” అంటూ ఇంకా చెప్పారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “అయితే నేను రక్షకుడిగా పనిచేసేది, భూమినుంచి పైకి వచ్చిన సూక్ష్మలోకజీవుల్ని ఉద్ధరించడంకోసం కన్న, ముఖ్యంగా కారణ లోకంనుంచి తిరిగివచ్చి సూక్ష్మలోకంలో పునర్జన్మ ఎత్తిన ఆత్మల్ని ఉద్ధరించడం కోసమని చెప్పాలి. భూమినుంచి వచ్చినవాళ్ళు తమ భౌతిక కర్మావశేషాల్ని ఇంకా నిలుపుకొనే ఉన్నట్టయితే, హిరణ్యలోకంవంటి అత్యున్నత సూక్ష్మలోకానికి చేరలేరు.”
“భూమిమీదుండే వాళ్ళలో చాలామంది, సూక్ష్మలోక జీవితంవల్ల కలిగే ఉత్కృష్ట ఆనందాల్ని లాభాల్నీ హర్షించడానికి ఉపకరించే ధ్యానార్జిత అంతర్దర్శనాన్ని అలవరచుకోని కారణంగా, మరణానంతరం మళ్ళీ భూమిమీదుండే పరిమిత, అపరిపూర్ణ సుఖాలకోసమే తిరిగిరావాలని కోరుకునేటట్టుగానే, చాలామంది సూక్ష్మలోక జీవులు, కారణలోకంలోని ఆధ్యాత్మికానందమనే ఉన్నతావస్థను ఊహించుకోలేక, తమ సూక్ష్మ శరీరాలు మామూలుగా విఘటనంచెందే సమయంలో, స్థూలతర అసహజ సూక్ష్మలోక సౌఖ్యాన్ని గురించిన ఆలోచనలమీదే మనసుపెట్టుకొని సూక్ష్మ స్వర్గానికి తిరిగి రావాలని కోరుకుంటారు. సూక్ష్మలోకంలో మరణించిన తరవాత, బహుసన్నని సరిహద్దులో సృష్టికర్తనుంచి వేర్పాటుగా ఉన్న కారణ భావజగత్తులో శాశ్వతనివాసం పొందగలిగే ముందు, అటువంటి వాళ్ళ భారీ సూక్ష్మలోక కర్మ క్షయం కావాలి.”
“ఒక జీవి, కంటికి ఇంపుచేసే సూక్ష్మవిశ్వంలో లభించే అనుభవాలకోసం మరేమీ కోరికలు పెట్టుకోకుండా, తిరిగి అక్కడికి వెళ్ళాలన్న వ్యామోహానికి లోబడకుండా ఉండగలవాడయితేనే, అతడు కారణలోకంలో ఉండిపోతాడు. అక్కడ కారణకర్మను, లేదా వెనకటి కోరికల బీజాల్ని క్షయంచేసే పని పూర్తిచేసి, బద్ధమైన ఆత్మ, అవిద్య అనే మూడు బిరడాల్లోనూ చివరిదాన్ని బయటికి నెట్టేసి, కారణ శరీరమనే కడపటి సీసాలోంచి బయటపడి శాశ్వత పరబ్రహ్మంలో కలిసిపోతుంది.”
“ఇప్పుడు తెలిసిందా నీకు?” గురుదేవులు మనోహరంగా చిరునవ్వు నవ్వారు! “తమ దయవల్ల తెలిసిందండి; ఆనందంతోనూ కృతజ్ఞతతోనూ నోట మాట రావడం లేదండి.”
ఒక పాటకాని, కథకాని విని అంతకుముందెన్నడూ నేను స్ఫూర్తిమంతమైన జ్ఞానం పొందలేదు. హిందూ పవిత్ర గ్రంథాలు కారణ, సూక్ష్మ లోకాలగురించీ మానవుడి మూడు శరీరకోశాల్నిగురించీ ప్రస్తావించినప్పటికీ, పునరుత్థానం చెందిన మా గురుదేవుల ఆహ్లాదకరమైన సాధికారతతో పోల్చిచూస్తే, ఆ గ్రంథాల్లో చెప్పింది ఎంత దుర్గ్ర్యాహ్యంగా, ఎంత అర్థరహితంగా ఉంటుందో అనిపించింది! ఆయన దృష్టిలో, “యాత్రికు డెవడూ తిరిగిరాని అనన్వేషితదేశం,”[14] ఒక్కటీ లేదు!
“మానవుడి మూడు శరీరాలూ ఒకదాంట్లోకి ఒకటి చొచ్చుకుపోయి ఉంటాయన్న విషయం, అతని త్రిగుణాత్మక ప్రకృతి ద్వారా అనేక మార్గాల్లో వ్యక్తమవుతుంది,” అంటూ చెప్పసాగారు గురుదేవులు. “భూమి మీద మానవుడికి జాగ్రదవస్థలో, దాదాపు ఈ మూడు వాహకాలూ స్పృహలో ఉంటాయి. రుచి చూడ్డం, వాసన చూడ్డం, తాకడం, వినడం, లేదా చూడ్డం వంటి ఇంద్రియానుభవాలు పొందాలని అతడు ఇంద్రియ భోగలాలసుడై తలపెట్టినప్పుడు, అతడు ప్రధానంగా తన భౌతిక శరీరంతో పని చేస్తున్నాడన్న మాట. అంతర్దర్శనం పొందడం, లేదా సంకల్పించడం అన్నవి అతడు ముఖ్యంగా సూక్ష్మశరీరంతో చేస్తున్నాడు. మనిషి ఆలోచిస్తున్నప్పుడు కాని అంతఃపరిశీలనలోనో ధ్యానంలోనో గాఢంగా మునుగుతున్నప్పుడు కాని అతని కారణ శరీరానికున్న వ్యక్తీకరణ శక్తి వెల్లడి అవుతుంది; అలవాటు ప్రకారం కారణ శరీరంతో సంబంధం పెట్టుకొనేవాడికి ప్రతిభాసంబంధమైన విశ్వభావాలు ఏర్పడతాయి. అంటే, ఒక వ్యక్తిని ‘భౌతిక మానవుడు’గా కాని, ‘శక్తిమంతుడైన మానవుడు’గా కాని, ‘ప్రజ్ఞాపరుడైన మానవుడు’గా కాని స్థూలంగా వర్గీకరించవచ్చు.
“మనిషి ప్రతిరోజూ సుమారు పదహారేసి గంటలసేపు భౌతిక వాహనంగా తనను భావించుకుంటూ ఉంటాడు. తరవాత నిద్రపోతాడు; కలలు కనేటట్టయితే, సూక్ష్మలోక జీవుల మోస్తరుగానే ఏ వస్తువునయినా అనాయాసంగా సృష్టిస్తూ సూక్ష్మశరీరంలో ఉంటాడు. మానవుడి నిద్ర, కలలు లేకుండా చాలా గంటల సేపు గాఢంగా సాగినట్లయితే అతడు, తన చేతనను లేదా అహంకారతత్త్వాన్ని కారణశరీరానికి బదిలీ చెయ్యగలుగుతాడు. అటువంటి నిద్ర పునర్నవీకరంగా ఉంటుంది. కలలు కనేవాడు తన సూక్ష్మశరీరంతో సంబంధం పెట్టుకుంటున్నాడు తప్ప, కారణ శరీరంతో కాదు; అతని నిద్ర పూర్తిగా పునర్నవీకరం కాదు.”
శ్రీయుక్తేశ్వర్‌గారు అద్భుతమైన ఈ వ్యాఖ్యానం చేస్తూ ఉంటే, నేను ప్రేమభావంతో గమనిస్తూ ఉన్నాను.
“గురుదేవా, మీ శరీరం అచ్చూమచ్చూ, నేను చివరిసారి పూరీ ఆశ్రమంలో చూసి వలవలా ఏడ్చినప్పటి శరీరంలాగే ఉందండి.” అన్నాను.
“ఔను. నా కొత్త శరీరం, పాతదానికి పరిపూర్ణమైన నకలు. ఈ రూపాన్ని నేను సంకల్పానుసారంగా ఎప్పుడైనా సరే ప్రత్యక్షంచెయ్యడం, అదృశ్యం చెయ్యడం చేస్తూంటాను; భూమిమీద చేసిన దానికంటె కూడా తరచుగా చేస్తూ ఉంటాను. శీఘ్రంగా అదృశ్యం చెయ్యడంవల్ల నే నిప్పుడు కాంతిరథం (లైట్ ఎక్స్‌ప్రెస్) మీద ఒక గ్రహంనుంచి మరో గ్రహానికీ, నిజానికి సూక్ష్మలోకంనుంచి కారణలోకానికి లేదా భూలోకానికి, క్షణంలో ప్రయాణం చేస్తూంటాను,” అంటూ మా గురుదేవులు చిరునవ్వు నవ్వారు. “ఈ రోజుల్లో నువ్వు చాలా వేగంగానే సంచారం చేస్తూ ఉన్నప్పటికీ, నిన్ను బొంబాయిలో పట్టుకోడం నా కేమీ కష్టం కాలేదు!”
“గురుదేవా, మీరు పోయినందుకు నే నెంత విలపించిపోయానో!”
“బాగుందోయ్! నేను పోవడమేమిటి? ఏ రకంగా? ఇందులో కాస్త తిరకాసు లేదూ?” శ్రీయుక్తేశ్వర్‌గారి కళ్ళు ప్రేమతోనూ వినోదంతోనూ మిలమిల్లాడుతున్నాయి.
“నువ్వు భూమిమీద కలగన్నావంతే; ఆ భూమిమీద నువ్వు నా స్వప్న శరీరాన్ని చూశావు,” అంటూ ఇంకా చెప్పారాయన. “తరవాత నువ్వా స్వప్నబింబాన్ని సమాధి చేశావు. ఇప్పుడు నువ్వు చూస్తున్న శరీరం ఉందేం - ఇప్పటికీ నువ్వింకా గట్టిగానే చుట్టేసుకుని ఉన్నది - మాంసమయమైన ఈ నా సూక్ష్మతర శరీరం, భగవంతుడి మరో సూక్ష్మతర స్వప్నలోకంలో పునరుత్థానం చెందింది. ఎప్పటికో ఒకనాటికి ఈ సూక్ష్మతర స్వప్నశరీరమూ, సూక్ష్మతర స్వప్నలోకమూ కూడా గతిస్తాయి; అవి కూడా ఎప్పటికీ ఉండిపోయేవి కావు. కలల బుడగలన్నీ చివరికి, చరమ జాగరణ స్పర్శతో పగిలిపోక తప్పదు. అబ్బాయ్, యోగానందా, కలల్నీ వాస్తవాన్ని విడమరిచి చూడు!”
వేదాంత[15] పరమైన ఈ పునరుత్థాన భావన నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. పూరీలో గురుదేవుల నిర్జీవకాయాన్ని చూసి ఈయనకోసం విచారించినందుకు నేను సిగ్గుపడ్డాను. మా గురుదేవులు, తమ జీవితాన్నీ భూమిమీద పొందిన మరణాన్నీ ఇప్పటి పునరుత్థానాన్నీ, విశ్వస్వప్నంలో దైవభావాల సాపేక్షతలకు మించి మరేమీ కావని గ్రహిస్తూ, ఎప్పుడూ సంపూర్ణంగా దైవజాగృతిలోనే ఉన్నవారని నేను ఇప్పటికి తెలుసుకున్నాను.
“యోగానందా, నా జీవితాన్ని, మరణాన్నీ, పునరుత్థానాన్ని గురించిన సత్యాలు ఇప్పుడు నీకు చెప్పాను. నా కోసం బెంగపెట్టుకోకు; అంతకన్న, దేవుడి కల అయిన ఈ భూలోకం నుంచి సూక్ష్మ శరీరాచ్ఛాదితమైన ఆత్మలు ఉండే మరో భగవత్స్వప్న గ్రహానికి వెళ్ళిన నా పునరుత్థాన వృత్తాంతం ప్రతిచోటా చాటు! ప్రపంచంలో ఉన్న దుఃఖపీడిత, మరణభీత స్వప్న దర్శుల హృదయాల్లో కొత్త ఆశను చిగురింపజేస్తుందది.”
“ఔను గురుదేవా!” ఆయన పునరుత్థానంవల్ల కలిగిన ఆనందాన్ని నేను మనసారా ఇతరులతో పంచుకుంటాను!
“భూమిమీద నా ప్రమాణాలు, అసౌకర్యం కలిగించేటంత ఉన్నతమైనవీ, చాలామంది స్వభావానికి సరిపడనివీను. నిన్ను నేను తిట్టవలసిన దానికంటె ఎక్కువసార్లే తిట్టాను. నువ్వు పరీక్షలో నెగ్గావు; నీ ప్రేమ, నా మందలింపుల మబ్బుల్లోంచి దూసుకు వచ్చి ప్రకాశిస్తోంది,” అంటూ ఆయన, దయతో ఇంకా ఇలా అన్నారు; “నే నివాళ నీకు ఇంకో సంగతి కూడా చెప్పాలని వచ్చాను: ఇక ముందెన్నడూ నేను మందలిస్తూ తీవ్రంగా నీ వేపు చూడను. నిన్నింక తిట్టను.”
నా మహాగురువుల మందలింపులు ఎంతగా పోగొట్టుకున్నానో నేను! ఆయన తిట్టిన ప్రతి తిట్టూ నా కొక దీవెనగా ఉండేది.
“ప్రియాతి ప్రియమైన గురుదేవా! లక్షసార్లు తిట్టండి - ఇప్పుడు చివాట్లు పెట్టండి!” “ఇంక తిట్టను,” అన్నారాయన. ఆయన దివ్యస్వరంలో, గుప్తంగా, నవ్వు ఉన్నప్పటికీ ఆ స్వరం గంభీరంగా ఉంది. “మన రూపాలు రెండూ భగవంతుడి మాయాస్వప్నంలో వేరువేరుగా కనిపించినంత కాలం, నువ్వూ నేనూ కలిసి చిరునవ్వు నవ్వుకుంటాం. చివరికి మనం ఒకరమై విశ్వప్రియతముడిలో లీనమవుతాం; మన చిరునవ్వులు ఆయన చిరునవ్వు లవుతాయి; మన సమైక్య ఆనందగీతం అనంతమంతటా స్పందిస్తూ, దైవానుసంధానం పొందిన ఆత్మలకు ప్రసారమవుతూ ఉంటుంది!”
శ్రీయుక్తేశ్వర్‌గారు కొన్ని ఇతర విషయాలు కూడా వివరించారు; కాని వాటిని నే నిక్కడ వెల్లడించలేకపోతున్నాను. బొంబాయి హోటలు గదిలో ఆయన నాతో గడిపిన రెండు గంటలలోనూ నే నడిగిన ప్రతి ప్రశ్నకూ జవాబు ఇచ్చారు. 1936 జూన్‌లో, ఆనాడు ఆయన ప్రపంచ భవిష్యత్తు గురించి పలికిన జోస్యాలు, కొన్ని ఈపాటికే ఫలించాయి.
“బాబూ, ఇప్పుడింక నిన్ను విడిచి వెళ్ళిపోవాలి మరి!” ఈ మాటలు వినడంతోటే, నేను చుట్టి ఉంచిన చేతుల్లో గురుదేవులు కరిగి పోతున్నట్టు అనిపించింది.
“నాయనా,” అంటూ పిలిచినప్పుడు ఆయన కంఠస్వరం, నా ఆత్మాకాశంలోకి స్పందిస్తూ ప్రవేశించింది: “నువ్వు నిర్వికల్ప సమాధి ద్వారంలోకి ప్రవేశించి నన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఇవాల్టి లాగే, రక్తమాంసాలున్న శరీరంతో నీ దగ్గరికి వస్తాను,” అన్నారాయన.
ఈ దివ్యవాగ్దానం చేసి శ్రీయుక్తేశ్వర్‌గారు నాకు కనుమరుగయి పోయారు. సంగీతంతో కూడిన ఉరుములా మారుమోగిన మేఘ గర్జన స్వరం ఒకటి ఇలా పలికింది: “అందరికీ చెప్పు! మీ భూలోకం దేవుడి కల అని నిర్వికల్ప సమాధిలో తెలుసుకున్న వాడల్లా హిరణ్యలోకమనే సూక్ష్మతర స్వప్నజనిత గ్రహానికి రాగలడు; అక్కడ నేను అచ్చం, భూమిమీదున్నప్పటి శరీరంలాటి శరీరంతోనే పునరుత్థానం చెంది ఉండడం గమనిస్తాడు. యోగానందా, ఈ మాట అందరికీ చెప్పు!”
వియోగదుఃఖమంతా మబ్బులా విడిపోయింది. కొంత కాలంగా, ఆయన మరణంవల్ల కలిగిన సంతాపం, శోకం నా మనశ్శాంతిని హరిస్తూ వచ్చాయి; కాని ఇప్పుడవి చిన్నబుచ్చుకుని పరారి అయ్యాయి. కొత్తగా ఏర్పడ్డ అంతులేని ఆత్మఛిద్రాలగుండా, దివ్యానందం ఒక నీటిబుగ్గలా ఎగజిమ్మింది. ఉపయోగంలో లేకపోవడంవల్ల ఏనాడో పూడుకుపోయిన ఈ చిల్లులు, ఒక్కసారి ఆనందపు వెల్లువ పోటెత్తేసరికి, పెద్దవయాయి. నా పూర్వజన్మలు, చలనచిత్రం మాదిరి క్రమమైన వరసలో నా లోపలి కంటికి అవుపించాయి. వెనకటి సత్కర్మ దుష్కర్మలు రెండూ, గురుదేవుల దివ్యసందర్శనవల్ల నా చుట్టూ ప్రసరించిన విశ్వకాంతిలో కరిగిపోయాయి.
నా ఆత్మకథలోని ఈ ఆధ్యాయంలో, మా గురుదేవుల ఆదేశాన్ని అనుసరించి శుభవార్త చాటాను; అయితే అది, జిజ్ఞాసారహితుల్ని మరోసారి చిరాకుపెడుతుంది. నేలమీద పొర్లాడడం బాగా ఎరుగును మనిషి; నిస్పృహ కలక్కపోవడం అతనికి అరుదు; అయినా ఇవి వికృతులు. మానవుడి సత్యస్వరూపంలో భాగాలు కావు, అతడు సంకల్పించిన రోజున స్వాతంత్ర్య పథంలో అడుగుపెడతాడు. చాలా కాలంగా అతడు, అజేయమైన ఆత్మను లెక్కచెయ్యకుండా - “మట్టివి నువ్వు” అంటూ చెప్పే ఘోరమైన నిరాశావాదాన్ని చెవిని పెడుతూ వచ్చాడు.
పునరుత్థానం చెందిన మా గురుదేవుల్ని దర్శించే భాగ్యం కలిగిన వాణ్ణి నే నొక్కణ్ణే కాను.
శ్రీయుక్తేశ్వర్‌గారి శిష్యకోటిలో ఒక ముసలావిడ ఉండేది; ఆవిణ్ణి అందరూ ‘మా’ (అమ్మ) అని పిలిచేవారు, ఆప్యాయంగా. ఆవిడ ఇల్లు పూరీ ఆశ్రమానికి దగ్గరలోనే ఉండేది. గురుదేవులు పొద్దుటి పూట షికారుకు వెళ్ళేటప్పుడు తరచుగా ఆవిడ ఇంటి దగ్గర కాస్సేపు ఆగి, కబుర్లు చెప్పి వెళ్తూ ఉండేవారు. 1936 మార్చి 16 తేదీ సాయంత్రం మా, ఆశ్రమానికి వచ్చి, గురువుగారిని ఓసారి కలుసుకోడానికి వచ్చాను అన్నది.
“అదేమిటి, గురుదేవులు వారంరోజుల కిందటే పోయారు కదమ్మా!” అన్నాడు, పూరీ ఆశ్రమం నిర్వహణ బాధ్యత తీసుకున్న స్వామి సేవానంద, ఆవిడవేపు విచారంగా చూస్తూ.
“అసంభవం!” అంటూ చిరునవ్వు నవ్వుతూ ఆక్షేపణ తెలిపిందావిడ.
“కాదమ్మా!” అంటూ గురుదేవుల్ని సమాధి చెయ్యడానికి సంబంధించిన వివరాలన్నీ చెప్పాడు సేవానంద. “రండి, ఆయన సమాధికి ఎదురుగా ఉన్న తోటకు తీసుకువెడతా మిమ్మల్ని.”
మా తల తిప్పింది. “ఆయనకి సమాధేమిటి! ఈవేళ పొద్దున పదింటికి ఆయన, మామూలుగా షికారుకు వెళ్తూ మా ఇంటి మీదుగా వెళ్ళారు! పట్టపగలు, ఆరుబయట, నేను ఆయనతో చాలా నిమిషాలసేపుమాట్లాడాను.
“ ‘ఈవేళ సాయంత్రం ఆశ్రమానికి రా’ అన్నారాయన.”
“వచ్చాను! పండబారిన ఈ ముసలి తలమీద ఆయన దీవెనలు కురిశాయి! ఈవేళ పొద్దున ఆయన మా ఇంటికి వచ్చింది. ఎలాటి దివ్య దేహంతోనో నేను తెలుసుకోవాలని అనుకున్నారు, అమర గురుదేవులు!”
సేవానంద ఆశ్చర్యపోయి ఆవిడముందు మోకరిల్లాడు.
“మా, నా గుండెలోంచి ఎంత దుఃఖభారం తీసేవు తల్లి! ఆయన పునరుత్థానం చెందారు!” అన్నాడతను.
- ↑ సవికల్ప సమాధిలో భక్తుడు, బ్రహ్మమూ తానూ ఒకరేనన్న అనుభూతి పొందుతాడు. కాని, నిశ్చల సమాధి స్థితిలో తప్ప విశ్వచైతన్యాన్ని నిలుపుకోలేడు. అఖండమైన ధ్యానం ద్వారా అతను, నిర్వికల్ప సమాధి అనే ఉన్నతస్థితిని చేరుకుంటాడు; అప్పుడతను దైవానుభూతిని కోల్పోకుండానే ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతూంటాడు.
నిర్వికల్ప సమాధిలో యోగి, తన భౌతిక కర్మలోని, అంటే, భూలోక సంబంధమైన కర్మలోని - చివరి లేశాల్ని క్షయం చేసుకుంటాడు. అయినప్పటికీ అతనికి కొంత సూక్ష్మ, కారణ కర్మలు అనుభవించవలసి ఉంటుంది; అంచేత, ఉన్నత స్పంద మండలాల్లోని సూక్ష్మలోకంలోనూ కారణలోకంలోనూ దేహధారణ చెయ్యవలసి ఉంటుంది.
పవిత్ర గ్రంథాలు నిషేధించిన మందుల ద్వారాను, మత్తుపానీయాల ద్వారాను ఎవరయినా, సూక్ష్మనరకాల్లోని జుగుప్సాకరమైన రూపాలు కనిపించేటంతగా మతిభ్రమణం కలిగించుకోవచ్చు.