అధ్యాయం : 42

గురుదేవుల సన్నిధిలో చివరి రోజులు

“గురూజీ, ఈవేళ పొద్దున మీరు ఏకాంతంగా కనిపించినందుకు నాకు సంతోషంగా ఉంది.”

పండ్లూ గులాబీల సుగంధ భారాన్ని మోసుకొని నే నప్పుడే శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చాను. శ్రీయుక్తేశ్వర్‌గారు నిర్లిప్తులై చూశారు నావేపు.

“ఏమిటి నీ ప్రశ్న?” తప్పించుకోడానికి చూసినట్టుగా, గది అంతా కలయజూశారు గురుదేవులు.

“గురూజీ, నేను మీ దగ్గరికి హైస్కూలు పిల్లవాడిగా వచ్చాను, ఇప్పుడు నేను పెరిగి పెద్దవాణ్ణయాను; ఒకటిరెండు వెంట్రుకలు కూడా నెరిశాయి. మొదట మనం కలుసుకున్న క్షణంనుంచి ఈనాటివరకు మీరు నా మీద మౌనంగా ఆప్యాయత కురిపిస్తూ వస్తున్నప్పటికీ, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అని మీరు అన్నదీ, మనం మొదట కలుసుకున్న రోజున, ఒకే ఒకసారి అన్న సంగతి మీకు గుర్తుందా?” అంటూ ప్రాధేయపూర్వకంగా ఆయనవేపు చూశాను.

గురుదేవులు చూపు వాల్చుకున్నారు. “యోగానందా, మాటలులేని గుండె చక్కగా పదిలపరిచే స్నిగ్ధభావనల్ని పొడిపొడిగా ఉండే మాటల్లో పెట్టాలా?” అన్నారు. “గురూజీ, మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు, కాని ఆ మాట మీరు చెప్పగా వినాలని నా చెవులు తపించిపోతున్నాయి.”

“నువ్వు కోరుకున్నట్టే కానియ్యి. వైవాహిక జీవితంలో ఉన్న రోజుల్లో నేను, యోగమార్గంలో తర్ఫీదు ఇయ్యడానికి, నాకు ఒక్క కొడుకు ఉంటే బాగుండునని నేను తరచు తపిస్తూ ఉండేవాణ్ణి. కాని నువ్వు నా జీవితంలో అడుగు పెట్టాక తృప్తిపడ్డాను; నీ లోనే నా కొడుకును చూసుకున్నాను.” శ్రీయుక్తేశ్వర్‌గారి కళ్ళలో స్పష్టంగా రెండు కన్నీటిబొట్లు నిలిచాయి. “యోగానందా, నేను నిన్నెప్పుడూ ప్రేమిస్తూ ఉంటాను.”

“మీ సమాధానమే నాకు స్వర్గప్రవేశానికి అనుమతి పత్రం.” ఆయన మాటలకు నా గుండెలో బరువు దిగిపోయినట్టు అనిపించింది. ఆయన భావావేశరహితంగా, కుదురుగా ఉంటూండేవారని నాకు తెలుసు; అయినా, ఆయన మౌనానికి నేను తరచు ఆశ్చర్యపోతూ ఉండేవాణ్ణి. ఆయన్ని నేను పూర్తిగా తృప్తిపరచలేకపోయానేమోనని అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాణ్ణి. ఆయనది చిత్రమైన స్వభావం; ఎప్పుడూ పూర్తిగా తెలిసేది కాదు; బయటి ప్రపంచానికి అందనంత లోతుగా, నిశ్చలంగా ఉండేది ఆయన ప్రకృతి. ఆ బయటి ప్రపంచం విలువల్ని ఆయన ఏనాడో అధిగమించారు.

తరవాత కొన్నాళ్ళకి నేను కలకత్తాలో ఆల్బర్ట్ హాల్లో అసంఖ్యాకులైన శ్రోతల నమక్షంలో ఒక సభలో ప్రసంగించాను. శ్రీయుక్తేశ్వర్‌గారు, సంతోష్ సంస్థానం మహారాజా, కలకత్తా మేయర్‌లతో బాటు సభావేదిక మీద కూర్చోడానికి అంగీకరించారు. గురుదేవులు నా దగ్గర వ్యాఖ్యానమేమీ చెయ్యలేదు; కాని ప్రసంగ సమయంలో నేను అప్పు డప్పుడు ఆయన వేపు చూస్తూ, ఆయన సంతోషిస్తున్నట్టు కనిపిస్తున్నారని భావించాను.

ఆ తరవాత, శ్రీరాంపూర్ కాలేజి పూర్వవిద్యార్థుల సభలో ప్రసంగించవలసి వచ్చింది. నేను పాత సహాధ్యాయుల్ని చూస్తుంటేను, వాళ్ళు తమ “పిచ్చి సన్యాసి”ని చూస్తుంటేను ఆనంద బాష్పాలు స్రవించాయి.[1] ధారాళమైన వాగ్ధాటిగల మా తత్త్వశాస్త్రాచార్యులు, డా॥ ఘోషాల్ గారు, నన్ను అభినందించడానికి ముందుకు వచ్చారు; కాలమనే రసవాది వల్ల వెనకటి మా అపార్థాలన్నీ తొలగిపోయాయి.

డిసెంబరు నెల చివరిలో శ్రీరాంపూర్ ఆశ్రమంలో చలికాలపు సంక్రమణోత్సవం జరిగింది. ఎప్పటి మాదిరిగానే, శ్రీయుక్తేశ్వర్‌గారి శిష్యులు ఎక్కడెక్కడివాళ్ళూ అక్కడ సమకూడారు. భక్తి సంకీర్తనలూ అమృతంలాంటి తియ్యటి గొంతులో క్రిష్టోదా ఒక్కడూ పాడిన పాటలూ కుర్ర విద్యార్థులు వడ్డించిన విందు భోజనమూ కిటకిటలాడే ఆశ్రమ ప్రాంగణంలో ఆరుబయట నక్షత్రాల కింద గాఢంగా సంచలనాత్మకమైన గురుదేవుల ఉద్బోధా - ఎన్నెన్ని జ్ఞాపకాలు! ఎప్పుడో గతించిన ఏళ్ళ ఆనంద మహోత్సవాలు! అయితే, ఈ రోజు రాత్రి ఒక కొత్త విశేషం ఉంది.

“యోగానందా, ఈ సమావేశంలో నువ్వు ఇంగ్లీషులో మాట్లాడు.” ఇబ్బడిగా అసామాన్యమైన ఈ కోరిక కోరుతుంటే, గురుదేవుల కళ్ళు మిల మిలలాడాయి; ఇంగ్లీషులో నా మొదటి ఉపన్యాసం జరగడానికి ముందు ఓడలో నేను పడ్డ అవస్థ తలిచారో ఏమో ఆయన. నా శ్రోతలకూ సోదర శిష్యులకూ ఈ కథ చెప్పి, గురుదేవులకు హృదయపూర్వకంగా జోహార్లు అర్పిస్తూ ముగించాను.

“అమోఘమైన వారి మార్గదర్శకత్వం నాకు, మహాసముద్రంలో ఓడమీదే కాదు, మహావిశాలమై ఆదరభరితమైన అమెరికాదేశంలో నేనున్న పదిహేనేళ్ళూ ప్రతిరోజూ నాకు లభిస్తూనే ఉంది,” అని ముగించాను.

అతిథులు వెళ్ళిపోయిన తరవాత శ్రీయుక్తేశ్వర్‌గారు, ఒకప్పుడు తమ పక్కలో పడుకొని నిద్రపోవడానికి అనుమతించి (అది కూడా ఒక్కసారే, ఇలాటి ఉత్సవం ఒకటి జరిగిన తరవాత) నన్ను తీసుకు వెళ్ళిన పడగ్గదికే రమ్మని పిలిచారిప్పుడు. ఈరోజు రాత్రి మా గురుదేవులు అక్కడ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు, వారి పాదసన్నిధిలో అర్ధచంద్రాకారంగా కూర్చున్నారు శిష్యులు.

“యోగానందా, నువ్విప్పుడే కలకత్తా వెళ్ళిపోతున్నావా? రేపు మళ్ళీ ఒక్కసారి రా ఇక్కడికి. నీకు చెప్పవలసిన సంగతులు కొన్ని ఉన్నాయి.”

మర్నాడు మధ్యాహ్నం, ఆశీఃపూర్వకమైన చిన్న మాటలు కొన్ని పలికి శ్రీయుక్తేశ్వర్‌గారు, ‘పరమహంస’[2] అనే ఉన్నత పరివ్రాజక బిరుదం నాకు ప్రసాదించారు. ఆయన ముందు నేను మోకరిల్లుతూ ఉండగా ఇలా అన్నారు, “ఇప్పుడిది ‘స్వామి’ అన్న నీ వెనకటి బిరుదానికి బదులుగా వాడుకలోకి వస్తుంది.” ‘పరమహంస జీ’[3] - అన్నది పలకడానికి నా పాశ్చాత్య శిష్యులు పడవలసిన పాట్లు తలుచుకుని నాలో నేను ముసిముసి నవ్వులు నవ్వుకున్నాను.

“భూమి మీద ఇప్పుడిక నా పని పూర్తి అయింది; ఇక నువ్వు కొనసాగించాలి,” అన్నారు గురుదేవులు ప్రశాంతంగా. ఆయన కళ్ళు ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉన్నాయి. నా గుండె భయంతో దడదడా కొట్టుకుంటోంది.

“పూరీలో మన ఆశ్రమం బాధ్యత తీసుకోడానికి ఎవరినయినా పంపు,” అంటూ చెప్పారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “నే నంతా నీ చేతుల్లో పెట్టేస్తున్నాను. నువ్వు నీ జీవితనౌకనీ, సంస్థానౌకనీ విజయవంతంగా దైవతీరాలకు చేర్చగలుగుతావు.”

నేను కన్నీళ్ళు కారుస్తూ ఆయన పాదాల్ని చుట్టేసుకున్నాను; ఆయన లేచి ప్రేమపురస్సరంగా దీవించారు.

తరవాత గురుదేవులు తమ ఆస్తిని బందోబస్తు చెయ్యడానికి సంబంధించిన న్యాయశాస్త్రపరమైన వివరాలు నాతో ముచ్చటించారు; తాము పోయిన తరవాత, తమ రెండు ఆశ్రమాల్నీ ఇతర ఆస్తుల్నీ స్వాధీనం చేసుకోడం కోసం తమ బంధువులెవరూ వ్యాజ్యమాడకుండా ఉండేలా కట్టుదిట్టం చెయ్యాలని ఆయన ఆత్రం; ఆ ఆస్తుల్ని కేవలం ధర్మకార్యాలకే వినియోగించేటట్టుగా పత్రం రాసిపోవాలని ఆయన కోరిక.

“ఈమధ్య గురువుగారు కిద్దర్‌పూర్ వెళ్ళడానికి ఏర్పాట్లు జరిగాయి కాని, వెళ్ళలేకపోయారు.” నా సోదరశిష్యుడు అమూల్యబాబు ఒకనాడు మధ్యాహ్నం నాతో అన్నాడు; ఏదో కీడు జరగబోతున్నట్టు నాలో వణుకు పుట్టింది. నేను గుచ్చిగుచ్చి అడిగిన మీదట శ్రీయుక్తేశ్వర్‌గారు ఇలా చెప్పారు, “ఇంక నేను కిద్దర్‌పూర్ వెళ్ళేది లేదు.” ఒక్క క్షణం గురుదేవులు, జడుసుకున్న పసివాడిలా వణికిపోయారు.

(“మహామునుల్లో సైతం, దేహమనే ఇంటిమీద మమకారం, దాని సహజ ప్రకృతినిబట్టి పుట్టి[4] రవ్వంత ఉంటుంది,” అని రాశాడు పతంజలి. మా గురుదేవులు చేసే ప్రసంగాలు కొన్నిటిలో, “చాలా కాలం పాటు పంజరంలో పెట్టి ఉంచిన పక్షి, తలుపు తెరిచినప్పుడు, తనకు అలవాటయిన ఇంటిని విడిచి వెళ్ళడానికి వెనకాడుతుంది,” అంటూండేవారు).

“గురూజీ, అంతమాట అనకండి! అలాటి మాటలు మరెన్నడూ నా దగ్గర అనకండి,” అంటూ ఏడుస్తూ మనవి చేసుకున్నాను.

శ్రీయుక్తేశ్వర్‌గారి ముఖం ప్రశాంత దరహాసంతో ప్రసన్నమయింది. ఎనభై ఒకటో పుట్టినరోజు రాబోతున్నా, ఆయన బాగా దృఢంగా ఉన్నారు. మాటల్లో వెలువడకపోయినా, హృదయానికి అనుభూతమయే మా గురుదేవుల ప్రేమలో ప్రతిరోజూ ఓలలాడుతూ, ఆసన్నమవుతున్న మరణాన్ని గురించి ఆయన చేసిన రకరకాల సూచనల్ని నా మనస్సులోంచి తొలగించేశాను.

"గురుదేవా, అలహాబాదులో ఈ నెల కుంభమేళా జరుగుతోందండి,” అంటూ మేళా జరిగే తిథులు ఒక బెంగాలీ పంచాంగంలో గురుదేవులకు చూపించాను.[5]

“నీకు నిజంగా వెళ్ళాలని ఉందా?”

నేను తమను విడిచివెళ్ళడం శ్రీయుక్తేశ్వర్ గారికి ఇష్టం లేదన్న సంగతి పసిగట్టకుండా నేను, “ఒకసారి అలహాబాదులో జరిగిన కుంభ మేళాలో మీకు బాబాజీ దర్శనభాగ్యం కలిగింది. బహుశా ఈసారి ఆయన్ని దర్శించే భాగ్యం నాకు కలగవచ్చు,” అన్నాను.

“నువ్వు వారిని అక్కడ కలుసుకుంటావనుకోను.” తరవాత గురుదేవులు మౌనం వహించారు, నా ఆలోచనలకు అడ్డురావడం ఇష్టంలేక.

ఆ మర్నాడు నేను కొంతమందిని వెంటబెట్టుకొని అలహాబాదుకు బయలుదేరుతుంటే, గురుదేవులు యథాప్రకారంగా ప్రశాంతంగా నన్ను ఆశీర్వదించారు. శ్రీయుక్తేశ్వర్‌గారి వైఖరిలో ఉన్న గూఢార్థాలు నాకు స్పృహలో లేకపోవడానికి కారణం, గురుదేవుల మరణాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసిన అనుభవం నాకు బలవంతంగా కలక్కుండా ఉండాలని భగవంతుడి ఇచ్ఛ. నా జీవితంలో ఎప్పుడూ ఇలాగే జరుగుతోంది; నాకు అత్యంత ప్రియమైనవాళ్ళ మరణ సమయాల్లో, దేవుడు దయతలిచి, నేను ఆ సన్నివేశాలకు దూరాన ఎక్కడో ఉండేటట్టు ఏర్పాటు చేశాడు.[6]

మా బృందమంతా 1936 జనవరి 23 తేదీన కుంభమేళా చేరింది. దాదాపు ఇరవై లక్షలమంది ఉన్న ఆ జనసందోహం కంటికి ఆకర్షకంగా ఉండడమే కాదు, మనసును ఉర్రూతలూగిస్తుంది; ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పరమాత్మ విలువ మీదా గాఢతరమైన భగవదాలంబన ప్రాప్తికోసం లౌకిక బంధాల్ని విడిచిపెట్టిన సాధుసన్యాసుల మీదా అధమాధమ స్థితిలో ఉన్న రైతుకు సైతం సహజసిద్ధమైన గౌరవం ఉండడం భారతీయుల విశిష్టత. కపటులూ నయవంచకులు నిజంగా ఉన్నారు; కాని భగవదాశీస్సులతో దేశాన్ని వెలుగొందించే కొద్దిమందికోసమని భారతదేశం అందరినీ గౌరవిస్తుంది. ఈ సువిశాల దృశ్యాన్ని చూసిన పాశ్చాత్యులకు జాతి జీవనాడినీ, కాలం తాకిడికి తట్టుకొంటూ భారతదేశం నిలుపుకొంటున్న అణచలేని జీవశక్తికి మూలమైన ఆధ్యాత్మిక వైభవాన్నీ అనుభూతి కావించుకోడానికి అద్వితీయమైన అవకాశం కలిగింది.

మా బృందం మొదటి రోజంతా, కేవలం చూడడంతోనే గడిపింది. వేలకొద్ది యాత్రికులు, పాపపరిహార నిమిత్తం పావనగంగలో స్నానాలు చేశారు. బ్రాహ్మణ పురోహితులు శాస్త్రోక్తమైన పూజాపురస్కారాలూ అగ్ని కార్యాలు నిర్వర్తించారు; మౌన సన్యాసుల పాదాల దగ్గర భక్తి పూర్వకంగా కానుకలు సమర్పించారు; ఏనుగులూ, అందంగా అలంకరించిన గుర్రాలూ, మందగొడిగా నడిచే రాజపుటానా ఒంటెలూ బారులు బారులుగా సాగాయి; వాటి వెనక, వెండిబంగారాలతో చేసిన రాజ దండాల్నీ పట్టు ముఖమల్ పతాకాల్నీ ఊపుతూండే దిగంబర సాధువుల చిత్రమైన ఊరేగింపు సాగింది.

గోచీలు మాత్రం పెట్టుకుని ఉన్న తపస్వులు, ప్రశాంతంగా చిన్న చిన్న గుంపులుగా కూర్చుని ఉన్నారు; వేడికీ చలికీ తట్టుకోగలిగేందుకు వీలుగా వారు, ఒంటికి బూడిద పూసుకుని ఉన్నారు. వారికి నుదుట ఉన్న చందనపు బొట్టు జ్ఞాననేత్రాన్ని సూచిస్తోంది. తల నున్నగా గీయించుకుని, కాషాయవస్త్రాలు ధరించి, ఒక్కొక్క వెదురుకర్రా భిక్షాపాత్రా చేతపట్టుకున్న సన్యాసులు వేలకొద్దీ ఉన్నారు. వాళ్ళు నడుస్తున్నప్పుడూ శిష్యులతో వేదాంత చర్చలు చేస్తున్నప్పుడూ కూడా వాళ్ళ ముఖాలు, సన్యాసులకు సహజమైన ప్రశాంతతతో ప్రకాశించాయి.

అక్కడక్కడ చెట్లకింద, మండుతున్న కొయ్యదుంగల గుట్టలు చుట్టూ ఆకర్షణ కలిగించే సాధువులు[7] ఉన్నారు; వాళ్ళ జుట్టు జెడలుకట్టి తలమీద చుట్టచుట్టి ఉంది. వాళ్ళలో కొందరికి, కొన్ని అడుగుల పొడుగు గల గడ్డాలు ఉన్నాయి; వాటిని చుట్టచుట్టి ముళ్ళు వేసుకున్నారు. వాళ్ళు ధ్యానంలో నయినా ఉంటారు, లేదా చెయ్యిచాపి దారినిపోయే జనాన్ని ఆశీర్వదిస్తూ నయినా ఉంటారు - బిచ్చగాళ్ళు, ఏనుగుల మీద సాగే మహారాజులు, వన్నెవన్నెల చీరలు కట్టుకుని గలగలలాడే గాజులతోనూ గల్లుగల్లుమనే కడియాలతోనూ సాగే ఆడవాళ్ళు, వికారంగా చేతులు చాపుకొని ఉన్న ఫకీర్లు, యోగదండాల్ని పట్టుకువెళ్ళే బ్రహ్మచారులు, అంతరంగానందాన్ని గంభీరంగా దాచిపెట్టుకున్న వినయ సాధుమూర్తులు ఎందరో ఉన్నారు. ఈ కోలాహలాన్ని మించిపోయేటట్టుగా అదే పనిగా మోగే గుడిగంటల పిలుపు.

మేము మేళాకు వచ్చిన రెండో రోజున, నా సహచరులూ నేనూ వివిధ ఆశ్రమాల్లోకీ, తాత్కాలికంగా వేసిన గుడిసెల్లోకి వెళ్ళి సాధుసత్పురుషులకు ప్రణామాలు చేశాం. మఠామ్నాయంలో ‘గిరి’ శాఖ నాయకుల ఆశీస్సులు అందుకున్నాం - చిరునవ్వు చిందించే నిప్పులవంటి కళ్ళూ బక్కపలచని ఒళ్ళూ గల తపస్వి ఆయన. ఆ తరవాత మరో ఆశ్రమానికి వెళ్ళాం; అక్కడి ఆశ్రమ గురువులు అప్పటికి తొమ్మిదేళ్ళుగా మౌనవ్రతంలో ఉన్నారు; పండ్లు మాత్రమే ఆయన ఆహారం. ఆ ఆశ్రమం హాలులో ఒక వేదిక మీద కూర్చున్న అంధసాధువు ‘ప్రజ్ఞా చక్షువు’[8]; శాస్త్రాలు గాఢంగా అధ్యయనం చేసిన పండితుడాయన; అన్ని సంప్రదాయాలవాళ్ళూ ఆయన్ని ఘనంగా గౌరవిస్తారు.

నేను వేదాంతం గురించి హిందీలో సంగ్రహంగా ఒక ప్రసంగం చేసిన తరవాత, మేము ప్రశాంతమైన ఆ ఆశ్రమంలోంచి బయటికి వచ్చి దగ్గరలో మరో స్వామిని సందర్శించాం. గులాబివన్నె చెక్కిళ్ళు, ధృడమైన భుజాలు కలిగి సుందరరూపులయిన ఆ సన్యాసిపేరు కృష్ణానందగారు. ఆయన దగ్గర పెంపుడు ఆడసింహం ఒకటి పడుకొని ఉంది. ఆ అడవి జంతువు ఆ సన్యాసి ఆధ్యాత్మికాకర్షణకు లోబడి (ఆయన శరీర దార్ఢ్యానికి మాత్రం కాదని కచ్చితంగా చెప్పగలను!) అన్నం, పాలూ తప్ప మాంస మేదీ ముట్టదు. పచ్చని జూలుగల ఈ జంతువుకు, దీర్ఘ గంభీర గర్జనలో ఓంకార నాదం చెయ్యడం నేర్పారు ఆ స్వామి. అదొక పిల్లిజాతి భక్తురాలు!

ఆ తరవాత చెప్పుకోదగ్గది, ఒక పండిత యువసాధువుతో జరిగిన సంభాషణ. దాన్ని గురించి శ్రీ రైట్, తన యాత్రా దినచర్య పుస్తకంలో ఇలా రాశాడు:

“మేము ఫోర్డుకారులో, కిర్రుకిర్రుమనే బల్లకట్టు వంతెనమీద, దిగువ మట్టంలో ప్రవహిస్తున్న గంగానదిని దాటాం; ఆ జనసమ్మర్థంలో పాము పాకినట్టుగా ముందుకు సాగి, సన్న సన్నటి వంకర సందుల్లోంచి వెళ్ళి, ఏటి ఒడ్డుకు చేరినప్పుడు, యోగానందగారు, బాబాజీ, శ్రీయుక్తేశ్వర్‌గారూ కలుసుకున్న స్థలంవేపు చూపించారు. కాసేపటికి మేము కారులోంచి దిగి, సాధువులు వేసిన మంటలనుంచి దట్టంగా వస్తున్న పొగ ల్లోంచి, జారుడు ఇసకమీద కొంతదూరం నడిచి, అడుసుమన్నూ గడ్డీ కలిపి వేసిన చిన్న చిన్న గుడిసెల సమూహానికి చేరాం. ఈ తాత్కాలిక ఆవాసాల్లో ఒకదాని ముందు ఆగాం. దానికి తలుపు లేదు; లోపలికి ప్రవేశించడానికి చిన్న దారి ఉంది. కరపాత్రి అనే యువ సంచార సాధువు బసచేస్తున్నది అక్కడే; విశిష్టమైన ప్రతిభకు పేరు పొందిన వాడాయన. అక్కడ, ముదురు పసుప్పచ్చ వన్నెగల గడ్డిచాపమీద బాసెం పట్టు వేసుకుని కూర్చుని ఉన్నారు. ఆయన ఆయనకున్న ఒకేఒక ఆచ్ఛాదన- పై పెచ్చు, ఆయనకున్న ఒకేఒక ఆస్తి- భుజాలమీద కప్పుకున్న కాషాయ వస్త్రం.

“మేము కాళ్ళూ చేతులూ నేలకు ఆనించి పాక్కుంటూ ఆ కుటీరంలోకి వెళ్ళి, ఆ జ్ఞానమూర్తికి ప్రణామం చేసేసరికి, దివ్యత్వం ఉట్టిపడే ఆ ముఖంలో చిరునవ్వు విరిసింది. ప్రవేశమార్గం దగ్గరున్న కిరసనాయిలు లాంతరు వింతగా అల్లల్లాడుతోంది; గుడిసె గోడలమీద నీడలు ఆడుతున్నాయి. ఆ సాధువు కళ్ళు సంతోషంతో వెలిగాయి. చక్కని ఆయన పలువరస ధగధగా మెరిసింది. ఆయన మాట్లాడే హిందీ నేను అర్థం చేసుకోలేకపోయినప్పటికీ, ఆయన ముఖ కవళికలు చాలా స్పష్టంగా ఉన్నాయి; ఆయన ఉత్సాహంతోనూ ప్రేమతోనూ ఆధ్యాత్మిక తేజంతోనూ నిండి ఉన్నారు. ఆయన గొప్పతనం విషయంలో ఎవ్వరికీ సంశయం కలగదు.”

“భౌతిక ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండేవాడు సుఖజీవనాన్ని గురించి ఊహించుకోడు. బట్టల సమస్య ఉండదు; రోజు విడిచి రోజు తప్ప అన్నం ముట్టకుండా, ఎన్నడూ భిక్షాపాత్ర పట్టకుండా ఉండడంవల్ల రకరకాల తిళ్ళకోసం మొహం వాచడం ఉండదు; ఎన్నడూ డబ్బుతో లావాదేవీలు లేకుండా, వస్తువులేవీ దాచి పెట్టుకోకుండా ఎప్పటికీ దేవుణ్ణే నమ్ముకుని ఉండడంవల్ల డబ్బుకు సంబంధించిన లంపటాలు ఏవీ ఉండవు; పవిత్ర నదీతీరాల వెంబడి నడుచుకుంటూ సాగిపోవడం తప్ప వాహనాలు ఎక్కడమన్నది అసలే ఉండదు; మమకారాల్ని తప్పించుకోడం కోసం, వారం రోజులకంటె ఎక్కువ ఎక్కడా ఉండడం జరగదు.”

“అటువంటి వినయాత్ముడీయన! వేదాల్లో అసాధారణ పాండిత్యం గడించిన ఈయన, బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి ఎం. ఏ. పట్టం, శాస్త్రి (శాస్త్రాల్లో పండితుడు) పట్టం గడించినవాడు. నేను ఆయన పాదాల దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఒకానొక మహత్తరానుభూతి నాలో వ్యాపించింది; నిజమైన భారతదేశాన్ని చూడాలన్న నా కోరికకు, ఆ అనుభవం ఒక సమాధానంగా కనిపించింది; ఆధ్యాత్మిక మహనీయులు గల ఈ దేశానికి నిజమైన ప్రతినిధి ఈయన.”

కరపాత్రిగారిని, ఆయన సంచారజీవితం గురించి అడిగాను. “చలికాలానికి మీకు అదనంగా బట్టలు లేవా?”

“లేవు, ఇది చాలు.”

“మీరు పుస్తకాలు కూడా తీసుకువెడతారా?”

“ఊఁహుఁ. నేను చెప్పేది వినదలిచినవాళ్ళకి నా జ్ఞాపకంతోనే బోధిస్తాను.”

“ఇంకా ఏం చేస్తారు?”

“గంగ ఒడ్డున తిరుగుతాను.”

ప్రశాంతమైన ఈ మాటలు విన్నప్పుడు, ఆయన జీవితంలో ఉన్న నిరాడంబరత నాకు కూడా అలవడితే బాగుండునన్న తపన నన్ను వివశుణ్ణి చేసింది. అమెరికానీ, అక్కడ నా భుజాలమీదున్న బరువు బాధ్యతల్నీ గుర్తు చేసుకున్నాను. “లేదు యోగానందా, ఇలా గంగ ఒడ్డున తిరిగే యోగం నీకు ఈ జన్మలో లేదు,” అని ఒక్క క్షణం దిగులుగా అనుకున్నాను.

ఆ సాధువు, తమ ఆధ్యాత్మికానుభూతులు కొన్ని నాకు చెప్పిన తరవాత, నేను చటుక్కున ఒక ప్రశ్న వేశాను.

“మీరు వర్ణించినవి ఇవన్నీ శాస్త్రజ్ఞానంలో చెబుతున్నారా, మీ అంతరికానుభవంతో చెబుతున్నారా?”

“పుస్తకాల్లో చదివింది సగం, అనుభవంలో సగం,” అంటూ చిరునవ్వుతో సూటిగా జవాబు ఇచ్చారు.

మేము కొంతసేపు ధ్యానమౌనంలో కూర్చున్నాం. ఆయన పవిత్ర సన్నిధి నుంచి తరలివచ్చిన తరవాత నేను శ్రీ రైట్‌తో, “బంగారు గడ్డి సింహాసనం మీద కూర్చున్న మహారాజు ఈయన,” అన్నాను.

ఆ రోజు రాత్రి మేళా మైదానంలో నక్షత్రాల కింద, పుల్లలతో కుట్టిన విస్తళ్ళలో భోజనాలు చేశాం. పళ్ళాలు కడిగే బెడదను భారతదేశంలో కనీస స్థాయికి తగ్గించడం జరిగింది.

సమ్మోహం కలిగించే ఆ కుంభమేళాలో మరో రెండు రోజులు ఉన్నాం; తరవాత వాయవ్యంగా ప్రయాణించి, యమునాతీరంలో ఉన్న ఆగ్రా చేరాం. మళ్ళీ మరోసారి తాజ్‌మహల్ వేపు చూపు సారించాను; పాలరాతితో మలిచిన ఆ స్వప్నాన్ని తిలకించి అప్రతిభుణ్ణి అయాను; జితేంద్రుడి పక్కన నించుని ఉన్న వెనకటి సన్నివేశం నా మనస్సులో మెదిలింది. అక్కణ్ణించి బయలుదేరి బృందావనంలో స్వామి కేశవానందగారి ఆశ్రమానికి వెళ్ళాం.

కేశవానందగారి కోసం వెళ్ళడంలో నా ఉద్దేశ్యం, ఈ పుస్తకంతో ముడిపడి ఉన్నది. నన్ను లాహిరీ మహాశయుల జీవిత చరిత్ర రాయమని శ్రీయుక్తేశ్వర్‌గారు కోరిన కోరికను నే నెన్నడూ మరిచిపోలేదు. నేను భారతదేశంలో ఉన్న కాలంలో, అవకాశం దొరికినప్పుడల్లా, ఆ యోగావతారమూర్తి ప్రత్యక్ష శిష్యుల్నీ బంధువుల్ని కలుసుకుంటూనే ఉన్నాను. వాళ్ళతో జరిగిన సంభాషణలు రాసి పెట్టుకుంటూ, యథార్థ విషయాల్నీ తేదీల్నీ సరిచూసుకుంటూ, ఫొటోలూ పాత ఉత్తరాలూ పత్రాలూ సేకరించాను. నా ‘లాహిరీ మహాశయ దస్త్రం’ పెరగడం మొదలయింది. గ్రంథకర్తృత్వంలో నేను పడవలసిన పాట్లు ముందు ఉన్నాయని గ్రహించి డీలా పడిపోయాను. ఆ మహాగురువుల జీవితకథారచయితగా నా పాత్రను నేను సముచితంగా నిర్వహించగల సామర్థ్యం నాకు ప్రసాదించమని ప్రార్థించాను. లిఖిత వృత్తాంతంలో తమ గురువుగారిని తక్కువ చెయ్యడంకాని, తప్పుడు వ్యాఖ్య చెయ్యడంకాని జరుగుతుందేమోనని, ఆయన శిష్యుల్లో చాలామంది భయపడ్డారు.

“దైవావతారుల జీవితానికి, పసలేని పలుకులతో ఎవ్వరూ న్యాయం చెయ్యలేరు,” అని నా దగ్గర వ్యాఖ్యానించారు, పంచానన్ భట్టాచార్యగారు.

ఇతర సన్నిహిత శిష్యులు కూడా అదే విధంగా, ఆ యోగావతారుల్ని అమర గురుదేవులుగా తమ గుండెల్లో దాచి పెట్టుకోడంతోనే తృప్తిపడ్డారు. అయినప్పటికీ, లాహిరీ మహాశయులు తమ జీవిత చరిత్రను గురించి చెప్పిన జోస్యం నా మనస్సులో ఉండడంవల్ల, ఆయన బాహ్యజీవితానికి సంబంధించిన యథార్థ విషయాల్ని సేకరించి సత్యనిరూపణకు శక్తివంచన లేకుండా కృషి చేశాను.

స్వామి కేశవానందగారు, బృందావనంలో ఉన్న తమ కాత్యాయనీ పీఠ ఆశ్రమంలో మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించారు. చక్కని తోటలో ఉన్న ఆ ఆశ్రమం, భారీఎత్తు నల్ల స్తంభాలతోను, ఇటికలతోను కట్టింది. ఆయన వెంటనే మమ్మల్ని, కూర్చునే గదిలోకి తీసుకువెళ్ళారు; అందులో లాహిరీ మహాశయుల పెద్ద ఫోటో ఒకటి ఉంది. ఆ స్వామికి తొంభయ్యో ఏడు దగ్గర పడుతోంది కాని, కండలు తిరిగిన ఆయన శరీరం బలాన్నీ ఆరోగ్యాన్నీ కనబరుస్తోంది. పొడగాటి జుట్టు, మంచులాటి తెల్లటి గడ్డం, ఆనందంతో మిలమిల్లాడే కళ్ళు గల ఆయన, మూర్తీభవించిన యథార్థ ఋషిపుంగవులు. భారతీయ గురువుల గురించి రాసే నా పుస్తకంలో ఆయన్ని గురించి కూడా చెప్పదలుచుకున్నానని నేను ఆయనకు తెలియజేశాను.

“మీ పూర్వ జీవితాన్ని గురించి కొంచెం చెప్పండి.” ప్రాధేయ పూర్వకంగా చిరునవ్వు నవ్వాను; మహాయోగులు సాధారణంగా మితభాషులు.

కేశవానందగారు వినమ్రతా భంగిమ ఒకటి చేశారు. “నా బాహ్య జీవితానికి సంబంధించింది. చాలా స్వల్పం. నిజానికి, నా జీవితమంతా హిమాలయాల్లో ఏకాంత ప్రదేశాల్లోనే గడిచిపోయింది; ప్రశాంతమైన ఒక గుహనుంచి మరో గుహకు నడిచి వెళ్తూ ఉండేవాణ్ణి. కొద్దికాలం నేను హరిద్వారానికి అవతల, చిన్న ఆశ్రమం ఒకటి నడిపాను; దాని చుట్టూ పొడుగాటి చెట్ల తోపు ఒకటి ఉండేది. ఎక్కడపడితే అక్కడ తాచుపాములు విచ్చలవిడిగా ఉంటూండడంవల్ల యాత్రికులు అక్కడికి వచ్చేవారు కారు. అది ప్రశాంతమైన ప్రదేశం,” అంటూ కేశవానందగారు ముసిముసి నవ్వు నవ్వారు. “తరవాత, గంగకు వరదవచ్చి, ఆ ఆశ్రమాన్ని తాచుపాముల్నీ కూడా ఊడ్చి పెట్టేసింది. అప్పుడు మా శిష్యులు ఈ బృందావన ఆశ్రమం కట్టడానికి నాకు తోడుపడ్డారు.”

మా బృందంలో ఒకరు ఆ స్వామిని, హిమాలయాల పులుల బారినుంచి ఎలా రక్షించుకోగలిగారని అడిగారు. కేశవానందగారు తల ఊపారు. ఆ ఉన్నత ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అడవి జంతువులు యోగుల్ని పీడిం చడమన్నది అరుదు. ఒకసారి నాకు, అడవిలో ముఖాముఖిగా ఒక పులి తారసపడింది. హఠాత్తుగా నేను చేసిన ధ్వనికి ఆ జంతువు రాయిలా స్తంభించిపోయింది,” అంటూ చెప్పి ఆ స్వామి, వెనకటి జ్ఞాపకాలతో మళ్ళీ ముసిముసిగా నవ్వారు.[9]

“అప్పుడప్పుడు నేను, కాశీలో ఉన్న మా గురువుగారిని దర్శించడానికి నా ఏకాంతవాసంలోంచి బయటికి వచ్చేవాణ్ణి. హిమాలయారణ్యాల్లో నేను అంతూపొంతూ లేకుండా చేసే సంచారానికి గురువుగారు నన్ను వేళాకోళం చేస్తూండేవారు.”

“ ‘నీ అరికాల్లో చక్రం ఉంది,’ అన్నా రొకసారి ఆయన నాతో. ‘పవిత్ర హిమాలయాలు నిన్ను ఆకట్టుకోడానికి కావలసినంత విశాలంగా ఉన్నందుకు సంతోషం.’ ”

“చాలాసార్లు, మహాసమాధికి ముందూ తరవాతా కూడా, లాహిరీ మహాశయులు సశరీరులై నా ముందు సాక్షాత్కరించారు. హిమాలయాల ఎత్తు, ఆయన చేరలేనిదేమీ కాదు!” రెండు గంటల తరవాత మమ్మల్ని భోజనాల గదిలోకి తీసుకువెళ్ళారాయన. నేను లోపల గాభరాపడి నిట్టూర్పు విడిచాను. మరో పదిహేను వంటకాల భోజనం! భారతదేశం ఆతిథ్యాన్ని అందుకోడం మొదలయి ఏడాది నిండకముందే నేను ఏభై పౌన్ల బరువు పెరిగాను! అయినప్పటికీ నా మీద గౌరవంతో ఏర్పాటుచేసిన అంతులేని విందుల్లో, శ్రద్ధగా వండిన వంటకాల్ని తిరస్కరించడం చాలా మొరటుతనం అనిపించుకుంటుంది. భారతదేశంలో (దురదృష్టవశాత్తు , మరెక్కడా కాదు!) బాగా లావెక్కిన సన్యాసిని ముచ్చటపడి చూస్తారు.

భోజనం అయిన తరవాత కేశవానందగారు నన్నొక మారుమూలకి తీసుకువెళ్ళారు. “నీ రాక మేము అనుకోనిదేమీ కాదు,” అన్నారాయన. “నీకో కబురు చెప్పాలి.”

నేను ఆశ్చర్యపోయాను. కేశవానందగారి దర్శనానికి వెళ్ళాలన్న ఊహ నేను ఎవరికీ చెప్పలేదు.

“కిందటేడాది నేను, బదరీనారాయణానికి దగ్గరలో ఉత్తర హిమాలయాల్లో తిరుగుతూ ఉండగా దారి తప్పిపోయాను. విశాలమైన ఒక గుహలో తలదాచుకోడానికి చోటు కనిపించింది. ఆ గుహలో రాతి నేలమీదున్న ఒక గుంటలో నిప్పులు కణకణా మండుతున్నా, గుహమట్టుకు ఖాళీగా ఉంది. ఈ ఏకాంతవాసంలో ఉండే ఆయన ఎవరా అని ఆలోచిస్తూ నేను, ఆ మంట దగ్గిర కూర్చున్నాను. గుహలోకి ప్రవేశించే దారిలో పడుతున్న ఎండమీద నా చూపు నిలిచిపోయింది.”

“ ‘కేశవానందా, నువ్విక్కడున్నందుకు సంతోషం.’ ఈ మాటలు నావెనకనుంచి వినవచ్చాయి. నేను చటుక్కున వెనక్కి తిరిగి అదిరిపడ్డాను; బాబాజీని చూసి అప్రతిభుణ్ణి అయాను! ఆ మహాగురువులు గుహలో ఒక మూల, భౌతికరూపంలో సాక్షాత్కరించారు. చాలా ఏళ్ళ తరవాత మళ్ళీ ఆయన్ని దర్శించినందుకు అమితానందంలో మునిగి నేను ఆయన పవిత్ర పాదాలముందు సాష్టాంగ ప్రణామం చేశాను.”

“ ‘నే నిక్కడికి పిలిచాను నిన్ను,’ అంటూ చెప్పారు బాబాజీ. ‘అంచేతే నువ్వు దారితప్పి, నా తాత్కాలిక వసతి అయిన ఈ గుహకి రావడం జరిగింది. కిందటిసారి మనం కలుసుకుని చాలా కాలమయింది; మళ్ళీ మరోసారి నిన్ను పలకరించడం నాకు సంతోషం.’ ”

“ఆ అమర గురుదేవులు, ఆధ్యాత్మికంగా నాకు ఉపకారం చేసే కొన్ని మాటలతో నన్ను దీవించి, తరవాత ఇలా అన్నారు: “యోగానందకి నువ్వొక కబురు చెప్పాలి. అతను భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు నిన్ను చూడ్డానికి వస్తాడు. అతని గురువుకూ లాహిరీ శిష్యుల్లో ఇంకా బతికున్నవాళ్ళకీ సంబంధించిన అనేక విషయాల్లో అతను మునిగి ఉంటాడు. అప్పుడు అతనితో చెప్పు, అతను నన్ను చూడాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు కాని, ఈసారి నే నతన్ని కలుసుకోననీ, మరో సందర్భంలో కలుస్తానని చెప్పు.’ ”

బాబాజీ పలికిన, ఈ ఓదార్పుతో కూడిన హామీ కేశవానందగారి నోట విని గాఢంగా చలించాను. నా గుండెలో ఉన్న మూగబాధ ఒకటి దీంతో తొలగిపోయింది; శ్రీయుక్తేశ్వర్‌గారు ముందే సూచించినట్టు, బాబాజీ నాకు కుంభమేళాలో కనిపించనందుకు మరి నేను దిగులు పడలేదు.

ఆశ్రమ అతిథులుగా ఒక రాత్రి అక్కడ గడిపి, మర్నాడు మధ్యాహ్నం మేము కలకత్తాకు బయలుదేరాం. యమునానది మీదున్న వంతెన మీదగా కార్లలో ప్రయాణం చేస్తూ, ఆకాశంలో సూర్యుడు నిప్పు రాజేసినట్టుగా, నిజంగా అగ్నిదేవుడి వన్నెల కొలిమిలాగున్న బృందావన ఆకాశరేఖ అద్భుత దృశ్యాన్ని కింద నిలకడగా ఉన్న నీళ్ళలో ప్రతిఫలిస్తూండగా తిలకించి ఆనందించాం. యమునాతీర సైకతాలు బాలకృష్ణుడి స్మృతులతో పునీతమైనవి. ఆ దైవావతారమూర్తికీ ఆయన భక్తులకూ ఎప్పటికీ ఉండే దివ్య ప్రేమకు ప్రతీకగా ఆయన ఇక్కడ ముగ్ధమాధుర్యంతో గోపికలతో లీలా వినోదాల్లో మునిగి తేలాడు. చాలామంది పాశ్చాత్య వ్యాఖ్యాతలు కృష్ణభగవానుడి జీవితాన్ని అపార్థం చేసుకున్నారు; కేవల వాచ్యార్థ గ్రహణపరుల్ని పవిత్ర గ్రంథాల్లోని అలంకారికాభివ్యక్తి కలవరపరుస్తూ ఉంటుంది. ఒక అనువాదకుడి రాతలో వచ్చిన హాస్యాస్పదమైన తప్పు దీనికొక ఉదాహరణ. మధ్యయుగంలో జీవించిన రవిదాసు అనే చర్మకారుడు ఆత్మద్రష్ట అయిన సాధువు ఆయనకు సంబంధించిన కథ ఇది; అతడు మానవులందరిలోను మరుగుపడి ఉన్న ఆధ్యాత్మిక విభూతిని తన వృత్తికి సంబంధించిన సులువైన మాటలతోనే గానం చేశాడు:

విశాల వినీలాకాశం నీడలో
నివసిస్తాడు దేవుడు చర్మాంబరధారిగా.

రవిదాసు కవితకు ఒక పాశ్చాత్య రచయిత రాసిన అనాలోచిత వ్యాఖ్య విన్నప్పుడు, నవ్వు ఆపుకోలేక ఎవరయినా పక్కకి తిరిగి నవ్వుకుంటారు.

“తరవాత అతడు ఒక గుడిసె వేసుకొని, అందులో తాను చర్మంతో చేసిన ఒక బొమ్మ పెట్టుకుని పూజచెయ్యడం మొదలు పెట్టాడు,” అని రాశాడు.

రవిదాసు, మహానుభావుడైన కబీరుకు సోదర శిష్యుడు. రవిదాసు శిష్యశిఖామణుల్లో ఒకతె, చిత్తోడ్ రాణి. ఆమె ఒకసారి తన గురువుగారి గౌరవార్థం ఒక విందు ఏర్పాటుచేసి చాలామంది బ్రాహ్మల్ని భోజనానికి పిలిచింది. కాని వాళ్ళు, చెప్పులు కుట్టే అంత్యజుడి పక్కన కూర్చుని మేము భోంచెయ్యం అని అన్నారు. కాని దర్జాగా దూరంగా, మైలపడని అన్నం తినడానికి కూర్చునేటప్పటికి, ప్రతి ఒక్క బ్రాహ్మడికీ పక్కన ఒక్కొక్క రవిదాసు కనిపించాడు. ఈ సామూహిక దర్శనానుభవంవల్ల చిత్తోడ్‌లో, విస్తృతంగా ఆధ్యాత్మిక పునరుద్ధరణ జరిగింది.

మరి కొన్నాళ్ళకు మేము కలకత్తా చేరుకున్నాం. శ్రీయుక్తేశ్వర్‌గారిని చూడాలని తహతహలాడుతూ ఉండగా, ఆయన శ్రీరాంపూర్ నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు, దక్షిణదిశలో మూడువందల మైళ్ళ దూరంలో ఉన్న పూరీలో ఉన్నారని విని నిరాశపడ్డాను.

“వెంటనే పూరీ రండి.” ఈ టెలిగ్రాం మార్చి 8 న అతుల్‌చంద్రరాయ్ చౌదరి ఇచ్చినది; ఈ సోదర శిష్యుడు గురుదేవుల కలకత్తా శిష్యుల్లో ఒకరు. ఆ వార్త చెవిని పడగానే, దాంట్లో ఉన్న అంతరార్థానికి నేను వ్యసనపడి కింద మోకరిల్లి, మా గురుదేవుల ప్రాణం కాపాడమని దేవుడికి మొరపెట్టుకున్నాను. నాన్న గారి ఇంటి దగ్గర్నించి రైలుకు బయలుదేరబోతూ ఉండగా లోపలినించి ఒక దివ్యవాణి పలికింది.

“ఈ రాత్రి పూరీ వెళ్ళకు. నీ ప్రార్థన మన్నించడానికి వీలులేదు.”

“ప్రభూ, గురుదేవుల ప్రాణం కాపాడమని పదేపదే నేను చేసే ప్రార్థనల్ని నువ్వు తిరస్కరించవలసి ఉంటుంది కనక, పూరీలో నాతో పెనుగులాటకు దిగడం నీకు ఇష్టం లేదు. అలాగయితే ఆయన, నీ సంకల్పం మేరకే ఉత్తమ విధులు నిర్వహించడానికి వెళ్ళిపోవాలా?”

ఆంతరికమైన ఆదేశానికి తల ఒగ్గి, ఆ రోజు రాత్రి పూరీ ప్రయాణం మానుకున్నాను. మర్నాడు సాయంత్రం బండికి బయలుదేరాను; దారిలో ఏడుగంటల వేళ, నల్లటి సూక్ష్మమేఘం ఒకటి ఆకాశాన్ని కమ్మింది.[10] తరవాత మా బండి గర్జనచేస్తూ పూరీవేపు సాగుతూ ఉండగా, నా ఎదుట శ్రీయుక్తేశ్వర్‌గారి రూపం దర్శన మిచ్చింది. గంభీర భంగిమలో కూర్చుని ఉన్నారాయన. రెండు పక్కలా రెండు దీపాలు ఉన్నాయి.

“అయిపోయిందా అంతా?” అంటూ ప్రాధేయపూర్వకంగా చేతులు ఎత్తాను.

ఆయన తల ఊపారు. తరవాత మెల్లగా అదృశ్యమయారు.

మర్నాడు పొద్దున నేను పూరీ ప్లాట్‌ఫారం మీద నించుని - అప్పటికీ, అనుకున్నది జరగదని అనుకుంటూనే రవ్వంత ఆశ పట్టుకొని వేలాడుతూ ఉండగా, నాకు తెలియని వ్యక్తి ఎవరో నా దగ్గరికి వచ్చాడు.

“మీ గురువుగారు పోయిన సంగతి విన్నారా?” మరో మాట ఏమీ అనకుండా వెళ్ళిపోయాడాయన; ఆయన ఎవరో, నన్ను ఎక్కడ కలుసుకోవలసిందీ ఆయనకి ఎలా తెలిసిందో కనిపెట్టడానికి నేను ప్రయత్నించలేదు.

మా గురుదేవులు ఆ దుర్వార్తను రకరకాలుగా నాకు అందించడానికి ప్రయత్నిస్తున్నారన్న సంగతి గ్రహించి కొయ్యబారిపోయి, నేను ఫ్లాట్‌ఫారం గోడమీద వాలిపోయాను. తిరుగుబాటుతో కుతకుతలాడుతున్న నా అంతరంగం ఒక అగ్నిపర్వతంలా ఉంది. నేను పూరీ ఆశ్రమానికి చేరేసరికి, దాదాపు స్పృహతప్పి పడిపోయే స్థితిలో ఉన్నాను. “గుండె చిక్కబట్టుకో, ప్రశాంతంగా ఉండు,” అంటూ పదేపదే మృదువుగా చెబుతూ వస్తోంది అంతర్వాణి.

ఆశ్రమంలో గురుదేవుల భౌతికకాయం ఉన్న గదిలో అడుగు పెట్టాను. ఊహించలేనంత సజీవంగా, పద్మాసనంలో ఉంది ఆయన శరీరం; ఆరోగ్యం, సౌందర్యం ఉట్టిపడుతున్నాయి. చనిపోవడానికి, కొన్నాళ్ళ ముందు, గురుదేవులకు కొద్దిగా జ్వరం వచ్చింది; కాని ఆయన అనంతధామంలోకి ఆరోహించడానికి ముందు రోజున, ఆయన శరీరానికి పూర్తిగా ఆరోగ్యం చేకూరింది. ప్రియమైన ఆయన దేహంవేపు నేను ఎన్నిసార్లు చూసినప్పటికీ, దాంట్లోంచి ప్రాణం పోయిందని అనిపించేటట్టే లేదు. ఆయన చర్మం నున్నగా మెత్తగా ఉంది. ముఖంలో ప్రశాంతమైన దివ్యానందం వ్యక్తమవుతూ ఉంది. మార్మికమైన పిలుపు వచ్చిన సమయంలో ఆయన, స్పృహతోనే దేహాన్ని విడిచిపెట్టారు.

“బెంగాల్ సింహం వెళ్ళిపోయింది,” అంటూ వాపోయాను.

మార్చి 10 న అంత్యక్రియలు జరిపాను. సన్యాసులకు విధించిన సనాతన పద్ధతి కర్మకాండ ప్రకారం శ్రీయుక్తేశ్వర్‌గారిని, పూరీ ఆశ్రమం తోటలో సమాధిచెయ్యడం[11] జరిగింది. ఆ తరవాత, ఆయన శిష్యుల్లో దగ్గరలో ఉన్నవాళ్ళూ దూరాల్లో ఉన్నవాళ్ళూ మేష సంక్రమణ సందర్భంగా గురుదేవులకు శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చారు. కలకత్తాలో ప్రముఖమైన అమృత బజార్ పత్రిక, ఆయన బొమ్మ ఒకటి వేసి, ఆయన్ని గురించి ఇలా రాసింది:

“81 సంవత్సరం వయస్సుగల శ్రీమత్ స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి మహారాజ్ మరణ భండార కాండ మార్చి 21 న పూరీలో జరిగింది. దీనికి చాలామంది శిష్యులు పూరీ పెళ్ళారు.”

“భగవద్గీత వ్యాఖ్యాతల్లో అగ్రేసరుల్లో ఒకరయిన స్వామి మహా రాజ్, కాశీలో ఉండే యోగిరాజ్ శ్రీ శ్యామాచరణ్ లాహిరీ మహాశయుల శిష్యశిఖామణి. స్వామి మహారాజ్, భారతదేశంలో అనేక యోగదా సత్సంగ (సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్) కేంద్రాలకు వ్యవస్థాపకులు. అంతేకాకుండా, ఆయన ప్రధాన శిష్యులైన స్వామి యోగానందగారు పాశ్చాత్యదేశాలకు వ్యాప్తిచేసిన యోగవిద్యా ఉద్యమానికి గొప్ప స్ఫూర్తి నిచ్చినవారు ఆయన. మహాసముద్రాలు దాటివెళ్ళి భారతీయ మహామహుల సందేశాన్ని అమెరికాలో వ్యాప్తి చెయ్యాలన్న స్ఫూర్తి, స్వామి యోగానందగారికి కలిగించినది, శ్రీయుక్తేశ్వర్‌గారి భవిష్యత్ దృష్టి, గాఢానుభూతి.”

“భగవద్గీతకూ ఇతర పవిత్ర గ్రంథాలకూ శ్రీయుక్తేశ్వర్‌గారు చేసిన వ్యాఖ్యానాలు ప్రాచ్య పాశ్చాత్యతత్త్వశాస్త్రాలమీద ఆయనకున్న అధికారానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. అంతేకాకుండా అవి, తూర్పుదేశాలకూ పడమటిదేశాలకూ మధ్య నెలకొనవలసిన ఏకత్వ సాధనకు మార్గ నిర్దేశకంగా నిలుస్తాయి. అన్ని మతవిశ్వాసాల ఏకత్వాన్నీ నమ్మే శ్రీయుక్తేశ్వర్ మహారాజ్, మతంలో శాస్త్రీయదృష్టి పొందుపరచడానికి వివిధ తెగల, సంప్రదాయాల నాయకుల సహకారంతో ‘సాధుసభ’ స్థాపించారు. మరణ సమయంలో ఆయన, సాధుసభ అధ్యక్ష స్థానానికి తమకు వారసులుగా స్వామి యోగానందగారిని నియమించారు.”

“అటువంటి మహాపురుషుల మరణం భారతదేశానికి తీరని లోటు. ఆయన సాన్నిహిత్యం పొందే అదృష్టం కలిగినవారందరూ భారతదేశ సంస్కృతిలోని నిజమైన స్ఫూర్తినీ ఆయనలో మూర్తీభవించిన సాధననూ తమ అంతరంగాల్లో పొందుపరుచుకుందురుగాక!”

నేను కలకత్తాకు తిరిగి వచ్చాను. పవిత్ర స్మృతులుగల శ్రీరాంపూర్ ఆశ్రమానికి అప్పుడే వెళ్ళగలనన్న విశ్వాసం లేనందువల్ల, శ్రీరాం పూర్‌లో శ్రీయుక్తేశ్వర్‌గారి బాలశిష్యుడైన ప్రఫుల్లను పిలిపించి, అతను రాంచీ విద్యాలయంలో చేరడానికి తగ్గ ఏర్పాట్లు చేశాను.

“మీరు అలహాబాద్ మేళాకు బయలుదేరిననాడు పొద్దున, గురుదేవులు, రాతబల్లమీద భారంగా వాలిపోయారు,” అని చెప్పాడు ప్రపుల్ల.

“ ‘యోగానంద వెళ్ళిపోయాడు! యోగానంద వెళ్ళిపోయాడు!’ అంటూ విలపించారాయన. తరవాత నిగూఢంగా ఇలా అన్నారు: ‘మరో పద్ధతిలో చెప్పాలతనికి.’ అప్పుడాయన గంటల తరబడి మౌనంగా కూర్చున్నారు.

ఉపన్యాసాలతో, తరగతులతో, ఇంటర్య్వూలతో, పాతస్నేహితుల్ని తిరిగి కలుసుకోడంతో గడిచిపోయాయి ఆ రోజులు. పైకి నవ్వుతూ నిర్విరామమైన కార్యకలాపాలలో మునిగి ఉన్నా, సర్వానుభూతి సైకత తటాల మధ్య అనేక సంవత్సరాలపాటు యథేచ్ఛగా ప్రవహిస్తూ వచ్చిన నా ఆనంద నది, ఈ విషాద సంఘటన అనే వాగు కలవడం వల్ల కలుషితమయి పోయింది.

“ఆ దివ్యఋషి ఎక్కడికి వెళ్ళారు?” అంటూ నా అంతరంగ అఖాతాల్లోంచి నిశ్శబ్దంగా అరిచాను.

సమాధానం రాలేదు.

“గురుదేవులు, విశ్వ ప్రేమాస్పదుడైన పరమాత్మలో పూర్తిగా ఐక్యంకావడమే మంచిది,” అని నా మనస్సు నాకు నచ్చజెప్పింది. “అమర లోకంలో ఆయన శాశ్వతంగా విరాజిల్లుతున్నారు.”

“ఆయన్ని మరెన్నడూ పాత శ్రీరాంపూర్ భవనంలో నేను చూడ లేక పోవచ్చు,” అని హృదయం విలపించింది. “ఇక మీదట, ఆయన్ని కలుసుకోడానికి నీ స్నేహితుల్ని తీసుకువచ్చి, “ఇదుగో చూడండి, భారతదేశ జ్ఞానావతారులు ఆయన,” అని సగర్వంగా చెప్పలేవు.

మా బృందం జూన్ నెల తొలినాళ్ళలో బొంబాయినించి బయలుదేరి పాశ్చాత్యదేశాలకు వెళ్ళడానికి శ్రీ రైట్ ఏర్పాట్లు చేశాడు. మే నెలలో కలకత్తాలో వీడ్కోలు విందులూ, ప్రసంగాలు జరిగిన తరవాత పదిహేను రోజులకు, మిస్ బ్లెట్ష్, శ్రీ రైట్, నేనూ ఫోర్డు కారులో బొంబాయికి బయలుదేరాం. మేము అక్కడికి చేరిన తరవాత ఓడ అధికారులు మా ప్రయాణం రద్దు చేసుకోమన్నారు; మా ఫోర్డు కారుకు ఆ ఓడలో చోటు లేకపోవడమే దానికి కారణం; ఆ కారు మళ్ళీ మాకు యూరప్‌లో అవసరమవుతుంది.

“పరవాలేదు,” అన్నాను శ్రీ రైట్‌తో విషాదంగా. “నేను మళ్ళీ ఒకసారి పూరీ వెళ్ళాలనుకుంటున్నాను.” అని మనస్సులో ఇలా అనుకున్నాను, “మళ్ళీ మరోసారి నా కన్నీళ్ళు, గురుదేవుల సమాధిని తడపాలి.”

  1. పరమహంసగారి మహాసమాధి తరవాత, శ్రీరాంపూర్ కాలేజి ప్రిన్సిపాలు డా॥ సి. ఇ. అబ్రహాంగారు సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్‌కు రాసిన ఉత్తరంలో ఇలా అన్నారు: “స్వామివారికి శ్రీరాంపూర్ కాలేజీ మీద గొప్ప అభిమానం ఉండేదని నాకు తెలుసు; యోగానంద స్కాలర్‌షిప్, ఈ యథార్థానికి తగిన స్మారక చిహ్నంగా నిలుస్తుంది.” (ప్రచురణకర్త గమనిక).
  2. ‘పరమ’, అత్యున్నత; ‘హంస’ తెల్లటి హంసను సృష్టికర్త అయిన బ్రహ్మకు వాహనంగా చెబుతాయి పురాణాలు. పవిత్రమైన ఈ హంసకు, నీళ్ళు కలిసిన పాలల్లోంచి నీళ్ళను మాత్రం వేరుచేసే శక్తి ఉందని చెబుతారు; అంచేత అది వివేకానికి ప్రతీక అయింది.

‘అహం-సః’ (ఉచ్చారణలో, హంస) అంటే, “నేనే ఆయన” అని అర్థం. శక్తిమంతమైన ఈ రెండు సంస్కృత మంత్ర శబ్దాలకూ శ్వాసప్రశ్వాసలతో స్పందక సంబంధముంది. ఆ విధంగా మానవుడు ప్రతి శ్వాసతోనూ, “నేనే ఆయన్ని” అన్న తన ఉనికిని గురించిన సత్యాన్ని అనుకోకుండానే నొక్కి చెబుతుంటాడు.

  • వాళ్ళు సాధారణంగా నన్ను ‘సర్’ అని సంబోధిస్తూ ఈ ఇబ్బంది తప్పించుకున్నారు.
  • అంటే, గతంలో పొందిన మరణానుభవాలనే పురాతన మూలాలనుంచి అని అర్థం. [“స్వరసవాహి విదుషో౽పి తథారూఢో౽భినివేశః]. ఈ సూత్రం పతంజలి యోగసూత్రాల్లో 11 : 9 లో వస్తుంది.
  • ప్రాచీన గ్రంథమైన మహాభారతంలో మతపరమైన మేళాలగురించి ప్రస్తావించడం జరిగింది. హ్యూయాన్ త్సాంగ్ అనే చైనా యాత్రికుడు క్రీ. శ. 644 లో అలహాబాదులో జరిగిన పెద్ద కుంభమేళాను గురించి రాశాడు. ‘కుంభమేళా’ అన్నది ప్రతి మూడో సంవత్సరం వరసగా, హరిద్వారం, అలహాబాదు, నాసిక, ఉజ్జయిని క్షేత్రాల్లో జరుగుతూంటుంది. ఆ తరవాత మళ్ళీ హరిద్వారంలో జరిగే నాటికి పన్నెండేళ్ళ ఆవృత్తి పూర్తి అవుతుంది. వాటిలో ప్రతి పట్నం కుంభమేళా జరిగిన తరవాత ఆరో సంవత్సరంలో ‘అర్ధ కుంభమేళా’ జరుపుకుంటుంది; ఆ ప్రకారంగా వివిధ పట్నాల్లో మూడేళ్ళకొకసారి కుంభమేళా, అర్థ కుంభమేళా జరుగుతూ ఉంటాయి.

    ఉత్తర భారతాన్ని ఏలిన హర్షుడు, రాజు ధనాగారంలో ఉన్న సంపదనంతనీ (ఐదేళ్ళలో కూడ బెట్టినది) కుంభమేళాలో సన్యాసులకూ యాత్రికులకూ పంచిపెట్టాడని హ్యూయన్ త్సాంగ్ చెబుతున్నాడు. హ్యూయన్ త్సాంగ్ చైనాకు తిరిగి వెళ్ళేటప్పుడు వీడ్కోలు సందర్భంగా హర్షుడిచ్చిన అమూల్యాభరణాల్నీ బంగారాన్నీ అతడు కాదని, మత సంబంధమైన 657 రాత ప్రతులను అంతకంటె విలువయినవిగా భావించి తనతో తీసుకుపోయాడు.

  • మా అమ్మ, అన్నయ్య అనంతుడు, అక్క రమ, గురుదేవులు, నాన్నగారు, ప్రేమాస్పదులైన అనేక మంది ఇతరులూ చనిపోయినప్పుడు నేను దగ్గర లేను.

    (నాన్నగారు కలకత్తాలో, 1943 లో, ఎనభై తొమ్మిదో ఏట కాలంచేశారు.)

  • భారతదేశంలో ఉన్న కొన్ని లక్షలమంది సాధువుల్ని నియంత్రించడానికి ఏడుగురు నాయకులతో కూడిన కార్యవర్గం ఒకటి ఉంది; ఈ ఏడుగురూ భారతదేశంలో ఉన్న ఏడు పెద్ద విభాగాలకు ప్రతినిధులు. నేను ‘మహామండలేశ్వరు’ల్ని – అంటే అధ్యక్షులైన శ్రీ శ్రీ జయేంద్రపురిగారిని కలుసుకున్నాను. ఈ సాధుపుంగవులు చాలా మితభాషులు; ఈయన తమ ప్రసంగాన్ని తరచుగా - ‘సత్యం, ప్రేమ, పని’ అన్న మూడు మాటలకే పరిమితం చేసుకుంటారు. ఇదే తగినంత సంబాషణ.
  • (భౌతికదృష్టి లేకుండా) “తన జ్ఞానంతోనే చూసే వ్యక్తి” అన్న అర్థంగల ఒక బిరుదు.
  • పులుల్ని జయించడానికి చాలా పద్ధతులున్నట్టు కనిపిస్తోంది. ఫ్రాన్సిస్ బర్టిల్స్ అనే ఆస్ట్రేలియా దేశపు అన్వేషకుడు, భారతదేశంలో ఉన్న అడవులు తనకు “రకరకాలుగాను, అందంగాను, సురక్షితంగాను” కనిపించినట్టు రాశాడు. ఆయన రక్షాకవచం ‘ఈగల కాయితం’ (ఫ్లై పేపర్). “ప్రతిరోజూ రాత్రి నేను, నా శిబిరానికి చుట్టూ కొన్ని కాయితాలు పరిచి ఉంచేవాణ్ణి; దాంతో నిశ్చింతగా ఉండేవాణ్ణి,” అని వివరించాడు. “దానికి కారణం, మనస్తత్వ సంబంధమయినది. పులి గొప్ప స్వాభిమానంగల జంతువు. అది ఈగల కాయితం దాకా వచ్చేవరకు, చుట్టూ తిరిగి గాండ్రిస్తూ మనిషిని సవాలు చేస్తుంది. తరవాత చల్లగా జారుకుంటుంది. దర్జాగల పులి ఏదీ కూడా, జిగురు కాయితం మీద చతికిలబడ్డ తరవాత మనిషి ఎదుటపడ్డానికి పూనుకోదు!”
  • శ్రీయుక్తేశ్వర్‌గారు 1936 మార్చి 9 న, సరిగా అదే సమయంలో, రాత్రి 7 : 00 గంటలకు మహాసమాధి చెందారు.
  • హిందువుల అంత్యక్రియలకు సంబంధించిన కర్మకాండలో గృహస్థుల్ని దహనం చెయ్యాలని విధించారు; స్వాముల్నీ ఇతర సంప్రదాయాల సన్యాసుల్నీ, దహనం చెయ్యకుండా నేలలో పూడుస్తారు. (సందర్భానుసారంగా, వీటికి మినహాయింపులు ఉన్నాయి). సన్యాసుల శరీరాలు, సవ్యాసదీక్ష తీసుకునే సమయంలో ప్రతీకాత్మకంగా, జ్ఞానమనే అగ్నిలో దగ్ధమై పోయినట్టు పరిగణిస్తారు.