ఉదయనోదయము/వనమాలివిలాసము-తృతీయాశ్వాసము

వనమాలివిలాసము


తృతీయాశ్వాసము



క. శ్రీ జనకకన్యకాధిప[1]
భూజాని సమానశౌర్య బుధవినుత కళాం
భోజాసన వితరణ వి
ద్యాజిత శిబిచంద్ర కొండురక్క మహీంద్రా. 1

వ. అవధరింపుము. 2

ఉ. ఆ కలకంఠకంఠీఁగుటిలాలక నంగజుమోహశక్తి నం
గీకృత సౌకుమార్యఁ గిలికించిత హాసవిలాస భాసురా
లోకనఁ బుండరీకదళలోచనఁ జూచితి హాసభావ రే
ఖా కమనీయఁ గొంతవడి కన్నులపండువుగాఁగ నత్తఱిన్. 3

ఆ. కేల నల్లఁ బట్టి లీలాసరోజంబుఁ
ద్రిప్పె నుబుసుపోక తెరవ యపుడు
అదియ దాని చారువదన చంద్రమునకు
సంతరించెఁ బరిధి చక్రలీల. 4

చ. వదనసరోరుహంబు పయి వాంఛ గడల్కొన నాభి దీర్ఘికా
స్పదవసతిం దొఱంగి రభసంబున మీఁదికి వచ్చివచ్చి నె
మ్మదిఁ గుచమంజరీ యుగళమధ్యమున న్వసియించి యున్న ష
ట్పద శిశుపంక్తివోలెఁ గనుపట్టు లతాంగికి నారు వింతయై. 16

గీ. నాభి లీలాసరః క్రీడనం బొనర్చి
లలిత వక్షోజకేళి శైలముల మీఁది
కెక్కిపోయెడు మరునకు నిడిన శక్ర
నిలయనిశ్రేణి యననొప్పు నెలఁత యారు. 17

క. సీతాపతి కోపానల
భీతంబగు కోకయుగము మృదుకుచయుగళీ
కైతవమునఁ జేరిన ద
జ్జాతముఖిన్ సతతయోగ సంసిద్ధికినె. 22

ఉ. అన్నలినాయతాక్షి దరహాసలవంబుల సోయగంబుచేఁ
దన్నులఁ బడ్డ చింతబలె తామరసేక్షణ బోఁటికత్తె లొ
య్య న్నెరులంటి దువ్వు సమయంబునఁ దచ్చరణాంతికంబులం
బన్నుగ వచ్చివ్రాలు కుచభారముతోఁ బెడఁబాసి మల్లియల్. 44

చ. తనదు విరోధి యైన పురదానవఖండను చాపదండమున్
జనకుని వీట దాశరథి సత్వ మెలర్పఁగఁ ద్రుంచి వైచుటల్
విని రణధర్మవేది యగు వీరుఁడు మారుఁడు మేలు తానునుం
దన విలు గట్టి పెట్టె వనితాభ్రుకుటీ[2] కుటి కైతవంబునన్. 75

ఉ. ఇట్టిది దాని చక్కఁదన మెన్నఁగ శేషునకైన శక్యమే
యట్టి చకోరలోచన మురాంతక నీదయ గల్గునంతకున్
నెట్టన వేసవిం బడిన నిమ్నగవోలెఁ గళానివిష్టయై
గుట్టున మేను నిల్పుకొని కుందుచు నున్నది యేమిచెప్పుదున్.76

క. నత నిజ వదనామృతరు
క్ప్రతిబింబితమైన హృదయభాగముతో నా
రతిఁబోఁడి మతి హిమద్యుతి
సతతము గెల్పించు నీదు సమత[3] వహించున్. 78

ఉ. ఈ కృతినున్న[యా][4] కువలయేక్షణఁ దన్వి నృపాలకన్య రా
కాకుముదాప్తబింబముఖిఁ గన్నులపండువుగాఁగఁ జూచి ద
ర్వీకరతల్ప చేరఁజని వేగమ యమ్మునిదత్తశాంబరిం
బోకడ వెట్టచున్ విజనభూమి ననుం బొడచూపి నిల్చితిన్. 79

క. ఆ చెలువ యిట్లు దృష్టికి
గోచరనై యంతికమునఁ గ్రుమ్మరు నన్నుం
జూచి కరం బచ్చెరుపడి
వాచామృత మొలుకఁ గొంతవడి కిట్లనియెన్. 80

మ. రమణీ యెవ్వతె వీవు పక్షితతికిన్ రారాని కన్యావరో
ధము నీ వేగతిఁ జొచ్చి వచ్చితివి తద్ద్వారంబు లుద్యత్కృపా
ణమహావీరభటాకులంబులు గదే నానాపగా వీచి వి
భ్రమహల్లీసకరంగశృంగమగు నీ ప్రాసాద మె ట్లెక్కితే. 81

క. కారణ మెయ్యెది యిచటికి
వారిజదళనేత్రి నీవు వచ్చుటకు మమున్
నీరూపదర్శనస్థితి
చే రమణీ ధన్యమతులఁ జేయుట దక్కన్. 82

ఆ. ఈ కృపాణవల్లి యేరాజు సవరించు
పాణిపంకజమునఁ బల్లవోష్ఠి
హర[5] కిరీట వాటి నసితాహియును బోలె
లలన నిన్ను నిది యలంకరించె. 84

క. అని పలికి యవ్విలాసిని
దనుజాంతక యూరకుండెఁ దత్సమయమునన్
మునుపలికి చెవుల కింపుగ
వెనుకఁ గళాసించి నట్టి వీణియపోలెన్. 89

క. ఈ రీతి వాక్సుధారస
పూరము దయసేసి తమకమునఁ గూరు సతిం
దేరకొనఁ జూచి చిత్తం
బారయ నిట్లంటి మంజులారవ ఫణితిన్. 90

మ. విను భూపాలతనూజ నే యిదుకులోర్వీవల్లభుం డైన కృ
ష్ణుని నెయ్యంపు వయస్య నవ్విభు మహాశుద్ధాంతరంగంబులో
నన నర్తింపుచు నుందు నెల్లపనులన్ మందారమాలాఖ్య న
మ్మనుజేంద్రాభరణంబు నర్మసఖిగా మన్నించు న న్నెప్పుడున్. 91

క. మందరధరు ఖడ్గం బిది
నందకమనఁ బరఁగు నతని నామాంకనముల్[6]
పొందుగఁ దాలుచు రిపురా
డ్బృందాంగకసంగజనితభీతింబోలెన్. 104

గీ. అనిన నాయింతి నాచేతి యా కృపాణ
వల్లి యల్లన కొని పాణిపల్లవమునఁ
బట్టి తన చారువక్షోజభారమునను
జేర్చె నానందరసమగ్నచిత్త యగుచు. 105

గీ. దర్శనీయ యగుచుఁ దనరారు నీ ఖడ్గ
పుత్రి నాకుఁ బ్రాణమిత్ర మయ్య
నింతి నీకుఁ దక్క నిమ్ము నా కని సారె
నప్పు డా లతాంగి యడిగె నన్ను. 109

చ. అడిగిన గుట్టుచేసి దనుజాంతక నే నిటులంటి దానితోఁ
బడఁతుక నాకు నీకపటభావము సర్వముఁ గానవచ్చె న
ప్పుడ ప్రియమిత్ర మయ్యె నసిపుత్రిక నీకిదె నాకు నియ్యెడం
దడయఁ బనేమి పోయెద మదస్థిరులం దుచితంబ తౌల్యముల్. 110

గీ. కుదురు పాలిండ్లపైఁ జీరకొంగు జార
సంభ్రమంబునఁ బరతెంచి సకియ నాదు
కరముఁ గరమునఁ గీలించి కరము వినయ
భంగి మృదురీతి నిట్లని పలికె నపుడు. 116

గీ. ముదిత మున్నీటి నడునీట మునుఁగఁ బాఱు
నరున కోడయుఁ బోలె నై నాకు నీవు
చేరి తని యుండ డించిపోఁ జిత్తగించె
దింతి నాభాగ్య మెట్లైన నేరుపడదె. 118

క. అని పలుకుచున్న తొయ్యలి
మన సఖిలము నాకు దృష్టిమానం బగుడున్
వనజేక్షణ మఱియును ద
న్మనసారయఁ గోరి ప్రౌఢమతి నిట్లంటిన్. 129

గీ. ముజ్జగంబుల నరయంగ ముదిత నీవ
మాటనేర్పరి వని నేఁడు మాకుఁ దెలిసె
రమణి వీవన్న యప్పుడు రాత్రి పగలు
పగలు రేలవు వేయును బలుక నేల. 131

గీ. పలుకుఁ దొయ్యలి కుతికె లోపలనె యుండి
మాన్పలేదయ్యె నేమిటి మాని నమ్మ
యిట్టి మాటల ప్రోడ వైనట్టి నిన్నుఁ
జేయఁ బూనిన నిజభర్త చిత్త. 132

చ. తొలఁకు సుధారసద్రవముతోడి భవత్కలవాక్కలాపముల్
కలుగమిఁ జేసి తొల్లి కలకంఠి శతక్రతుముఖ్యదేవతా
వలి యమృతార్థ మట్లు దురవస్థలఁ గైకొనెఁ గాక కల్గినం
జెలఁగి పయోనిధిం దరువఁ జేతుల తీటయె లోలలోచనా. 136

మ. ప్రకటోద్యోత్కలకంఠ పంచమ కుహూకారంబులన్ ఫుల్లవ
ల్లకి కోదీరిత కాకలీకలకలాలంకారభావంబులన్
సకలోత్కృష్టముగా నుతించు కవివాక్సంభార గాంభీర్యమున్
సకియా యెందుల కేఁగె నేఁడు నిజవాచాసన్నిధానంబునన్. 137

క. నీ హారి వాక్యకౌశల
మోహో యెంతటిది గాకయుండిన మహి నే
లా హరిభద్రేభమునకు
లోహార్గళవారి యయ్యె లోలతరాక్షీ. 139

క. అన విని దనుజాంతక య
వ్వనజాక్షి మొగం బొకింత వంచుచుఁ జింతా
ఘన వైయాత్యపదంబున
కెనయఁగ మధ్యస్థ యగుచు నిట్లని పలికెన్. 140

మ. వనిత యేమని మాటలాడెదు వచోవైదగ్థ్య మేపారఁగా
ఘనతారుణ్యకళావిలాసమదరేఖామాద్యదుచ్యద్వధూ
జనచేతోహరుఁ డాతఁ డెక్కడ మహాసర్వజ్ఞుఁ డోచెల్ల చూ
చిన నే నెక్కడ బాల్యచాపలభర క్షిప్తాంత[7] రాత్మంగదే. 141

ఉ. పల్లవికాజనంబు లనువారము లెప్పుడు ప్రాంతభూమి వ్రే
పల్లియలోన నమ్మురవిభంజను చేష్టలు చూచుచుందు ర
ప్పల్లవపాణు లుల్లముల భావనచేసిన నొప్పుఁగాక సం
ఫుల్లముఖాబ్జ మా కెఱుఁగఁ బోలునె తన్నిజభావవర్తనన్. 143

గీ. అనిన సెలవివాఱ నలఁతి[8] నవ్వొలయించి
కొనుచుఁ జేరఁబోయి[9] కువలయాక్షి
కేలుగేల లీలఁ గీలించి యిట్లంటి
వారిజాక్ష చతుర వాక్యభంగి. 145

చ. ఎఱుఁగని మాటి నంగవయి యెవ్వరి ముందర నాడె దిట్లు నీ
తెఱఁగిది నీకు సుబ్బె[10] సుదతీ మును శారికచేత నెయ్యపుం
గఱదలు చెప్పి పంపి మురఘస్మరుచిత్తము గుత్తజట్టిగా
నెఱఁదగఁ[11] గొన్నయట్టి తరుణీమణి యెవ్వతె నాకుఁ జెప్పుమా. 146

తే. ఇంచు కంతయుఁ దలఁపవై తిందువదన
వెన్నుఁ డెవ్వరికై పొక్కుచున్నవాఁడొ
యతని దురవస్థఁ దలపోయ నక్కటకట
వెలఁది యడవికిఁ గాసిన వెన్నెలయ్యె. 147

తే. వెఱ్ఱితనములు యాదవవిభుని కడలు
తెలియదో కాక శైశవోదీర్ణమైన
నీ గుణంబును నిన్నును నీరజాక్షి
యుల్లమునఁ జాల నాశించి యున్నవాఁడు. 149



ఉ. చేడియ నా మనోరధము చేకురె నెంతయు నిన్నుఁ గన్నులం

[జూడఁగఁగంటి శ్రీహరినిఁ జూచెడు నంతటి దన్కఁ గం][12]టికిం
గూడదు కూర్కు నాకుఁ గయికొమ్ము ప్రియంపడి తీ కృపాణమున్
వేడుక దీఱునంత కరవిందనిభానన పోయివచ్చెదన్. 151

వ. అని యిత్తెరంగునఁ బలుకుచున్న నవలోకించి. 156

శా. గాండీవాయుధశౌర్య శౌర్యజ సదృక్ష శ్రీకళాకల్ప మా
రాం..............................................................
దండస్థాపిత మేదినీవలయ సత్యస్వచ్ఛ జిహ్వాంచలా
కొండూరక్క మహాధ్వరీంద్ర రిపురాట్కుంభీన పంచాననా. 157

క. కకుబంతవధు...
..............................................
మకరధ్వజ సుకవివర
ప్రకరావన కొండురక్క పావనభవనా. 158

తోటకము. గుణభూషణ ధీర చకోరశశీ
రణరంగమహీ..............
.......................................
గ్రణి కొండురి యక్కజగద్వినుతా. 159

గద్యము

ఇది శ్రీమదింద్రేశ్వరవరప్రసాదలబ్ధకవితాసార నారనామాత్య
కుమార సూరిజనవిధేయ సూరయ నామధేయ
ప్రణీతంబైన వనమాలివిలాసం బను
మహాకావ్యంబునందు
తృతీయాశ్వాసము





  1. ప్రాసవ-కన్యాధిప (సా.ప.)
  2. ప్రా.స.వ.-రనితాభృకుటీ-సా.ప.
  3. ప్రా.స.వ.-నిమితసా.ప.
  4. ప్రా.పూర
  5. ప్రా.స.వ.-హరి-సా.ప.
  6. ప్ర.స.వ.-నామాంకణముల్-సా.ప.
  7. ప్రా.స.వ.-భరక్తిస్తాంత-సా.ప.
  8. ప్రా.స.వ.-బాఱ్లవలఁతి-సా.ప.
  9. ప్రా.స.వ.-వారువోయి-సా.ప.
  10. ప్రా.స.వ.-లబ్బె-సా.ప.
  11. ప్రా.స.వ.-నెఱదగ-సా.ప.
  12. ప్రా.పూరణము