ఉదయనోదయము/వనమాలివిలాసము-ద్వితీయాశ్వాసము
వనమాలివిలాసము
ద్వితీయాశ్వాసము
క. శ్రీరజనీకరధర పద[1]
వారిజ పుష్పంధయీ భవన్మానసక
ర్పూరపటీరసుధారస
హార యశస్సాంద్ర కొండు రక్కమహేంద్రా. 1
వ. అవధరింపు మిట్లరుగుదెంచుచున్న యిన్నారదుం గని డెందం బమందానందంబునఁ గందళింప గోవిందుం డుల్లసితహాసవిలాసభాసురం బగు ముఖవిలాసంబుతో నెదురేఁగి ప్రమదాశ్రువారిపూరంబున గండంబులు గడుగుచుఁ బ్రణమిల్లి
యల్లనల్లన కృతకరావలంబనుం డగుచుఁ గొనివచ్చి యొక్క చొక్కంపుమణిమయాసనంబున నాసీనుం గావించె.... 2
గీ. అపుడు నయమానకోవిదండైన శౌరి
వినయమున సేమ మడిగిన వేల్పుఁదపసి
ధవళతరదంతరుచి ధాళధళ్యముగ ని
జాంగరుచిఁ బ్రోదిసేయ నిట్లనియె హరికి. 9
క. అనపాయి దివ్యకరుణా
జనకం బగు చూడ్కి నీవు శాసింప జగం
బున నేమి గొఱఁత శుభములు
వనజేక్షణ కుశల మున్నవాన మనిశమున్. 10
గీ. భువనములు (సూచు)[2] వేడుకం బూని యేను
ధరఁ జరించుచు నొక యద్భుతంబుఁ గంటి
నహహ యది నీకు నెఱిఁగింతు నను తలఁపున
నలినలోచన నేఁ డిందు నాదురాక. 11
సీ. విను జనార్దన (మున్ను వి)[3]న్నాఁడ వీవును
వసుధ నొప్పారు నవంతిదేశ
మబ్భూమి కధినాథుఁడై యుండు ననువిందు
నగ్రజన్ముఁడు విందుం డధికబలుఁడు
సమరసమ్ముఖజయశాలి యివ్విందాను
విందుల వెసు[4]బుట్టె విమలభాను
కౌస్తుభంబులతోడఁ గమల పుట్టినయట్లు
వెలఁది యొక్కతె పూర్ణవిధునిబాస్య
ఆ. యా లతాంగి వొలిచె నంతఃపురంబులోఁ
గురులు నొసలిమీఁద గునిసి[యాడఁ][5]
బైనటించు[6] తేఁటి పదువతో నందనా
వనిఁ దనర్చు కల్పవల్లి వోలె. 12
ఉ. అంతట నొక్కనాఁడు [దను][7]జాంతక విందుఁడు కూర్మిసోదరిం
గంతు కృపాణవల్లరికి గాదిలిచుట్టము వోని కన్య న
త్యంతవయోభరాలస నిజాంఘ్రిసరోరుహదర్శనాగతం
గాంతవితాంతకాం[తిఁ బొడ][8]గాంచి మనంబునఁ బొంగె నెంతయున్[9]. 15
ఆ. ఆ లతాంగిఁ దన్వి హేలాసమంచిత
ననుపమాన యౌవనాభిరామ
నే నృపాలసుతున కిత్తునొక్కో యని
యుల్లమునఁ దలచి యొక్కనాఁడు. 16
క. సురుచిరమణిఫలకంబున
ధరణింగల రాజసుతులఁ దరుణవయో సం
భరితులఁ గులసంజాతుల
నిరుపమమతి వ్రాసిచూపె నిజసోదరికిన్. 17
ఉ. చూపిన నయ్యవంతినృపసూతి సురాసురకిన్నరావలికిన్
భూపకుమారవర్యుల నపూర్వవయోగుణరూపధన్యులం
జూపుల తీపులం గొసరఁ జూచి యొకానొకనిన్ నిజోల్లస
ద్రూపవిలాసలబ్ధి కనురూపముగాఁ గొనదయ్యె నాత్మలోన్. 18
ఆ. అవ్వధూటి నాఁటి కంతఃపురంబున
కనిచిపనిచి మఱియు నా నృపాల
వరుఁడు వ్రాసె జలధవలయితావనిలోన
గలుగు నృపులఁ జిత్రఫలకమునను. 21
క. విందుం డా ఫలకం బర
విందానన యైన మిత్రవిందకుఁ జూపెన్
డెందమున నా నృపాలక
నందనులను మెచ్చదయ్యె నందకుమారా. 22
క. కర్ణాకర్ణనములఁ జ[తు
ర][10]ర్ణోనిధి మధ్యభూతలాధిపు రెల్లం
దూర్ణమె యివ్వార్త న్వని
పూర్ణంబుగఁ జేసి రుల్లముల సిబ్బెతలన్. 24
సీ. అంతట నొక్కనాఁ డరవిందహితుఁ డబ్ధి
పూరంబు[నం బడఁబో][11]వుచుండ
బ్రహ్మాండమధ్యంబు బయలింత లేకుండఁ
బమ్మి చీఁకటి కారుకమ్మి నిండఁ
దమము నోలకుఁ ద్రోచి తలచూపి హిమరోచి
పూర్ణచంద్రిక నిట్టవొడిచి కాయ
వలపలి దెసనుంచి వచ్చి [చెం(గలువలు)][12]
కమ్మనెత్తావులఁ గ్రుమ్మరింప
ఆ. సఖులు గొలువఁ[13] గేలిసౌధమధ్యంబున
పణఁతి మృదులశయ్యఁ బవ్వళించి
యిష్టకథల దగిలి హేలావినోదమున్
జరుపుచున్నయట్టి సమయమునను. 25
క. మే[లి చెలియ యో][14]ర్తు ప్రసం
గోచితమై పెద్దచేసి యుగ్మలిమ్రోలన్
నీ చరితంబులు చెప్పెను
వాచాప్రాచుర్యచర్య వైఖరి మెఱయన్. 26
ఆ. అదియ నందుగాఁగ యదురాజనందన
విషమశరుఁడు పువ్వువిల్లుఁ గేలఁ
బట్టి యా లతాంగిఁ బరవశఁ గావించె
నహహ కుసుమసమయ మలినిఁ బోలె. 30
సీ. దర్శించు చూడ్కులఁ దనివి వో కేప్రొద్దుఁ
జెలులు వ్రాసిన భవచ్ఛిత్రకములు
పాడు వీణియఁ గేలఁ బలికించి భ[వదీయ
కృతులు][15] చెక్కులఁ బులకించుకొనుచు
విలిఖించు కొనగోర విషమసాయకలేఖ
నీ పేర నవపద్మినీదళములు
పట్టునెత్తమ్మి చే నిట్టూర్పుల నలంచు
నతనుబాణం బన్న యలుకఁ[16] బోలె
ఆ. [(కువల)యా][17]క్షి రేలు కోర్కితోఁ బెడఁబాయు
నిదుర కొఱకుఁ బగలు నీరజాక్షి
చెలువ చెక్కులందుఁ జేర్చుఁ బాండిమరేఖ
ముఖవినిర్జితేందుమూర్తిఁ బోలి. 32
ఉ. ఏమని చెప్పు[దున్ యదుకు][18]లేశ్వర తత్తనుతాపగౌరవం
బా మృగరాజమధ్య తనుయష్టి నలందిన చందనంబు లీ
లామృగనాభిలేపనవిలాసము గైకొన హారమౌక్తిక
స్తోమ మురోజపాలిపయిఁ దూకొనె నీలమణి[ద్యుతిం గొనన్][19]. 33
గీ. చెప్పఁ జిత్రంబు వినుము రాజీవనయన
సుదతి తనుతాపమున వ్రేళ్ళు చురుకు మనిన
నులికిపడ సారె మహ్హన నూఁదుకొనుచు
సఖు లలందు[దు][20] రతివ మైఁ జందనంబు. 34
చ. వెనుఁబడ దించుకైన వెనువెంటనె వచ్చు జగంబు నిందకున్
వినదు సఖీజనంబు పదివేలవిధంబుల బుద్ధి చెప్పినన్
వనరుహనేత్రి నీకడకు వచ్చు తలంపులె చేయుచుండు నె
మ్మనమున రేలునుం బగలు మాధవ నీపయిఁబ్రేమ యెట్టిదో. 37
క. స్ఫురితాధర మాకంపిత
కర ముద్గతబాష్ప ముదితఘర్మ ముదంచత్
పరిధానంబై మానస
సురతశతం బరిగె రాజసూతికి నీతోన్. 39
గీ. గోరు చోఁకని[21] పరిరంభకోటితోడ
పల్లు చోఁ కని[22] చుంబనప్రతతితోడ
నాథుచోఁ కని సంభాషణములతోడ
రమణి యోలాడె మానసరతి పయోధి. 40
మ. కలకంఠీమృదుకంఠరావముల [కా][23]కంపించు భృంగాంగనా
కలగానంబుల కుమ్మలించు నవమాకందీలతాపుంజ వీ
థులకుం బోవఁగ నోడుఁజుడ [భయ][24]మందుం బూర్ణిమాచంద్రునిన్
జలతాతేక్షణ యవ్విలాసిని మనోజాతాగ్ని సంతప్త యై. 41
ఉ. [అప్పు][25]డు తోడనాడు చెలులందఱు నాత్మలఁ జాలఁ గుందుచుం
జొప్పఱి శారదార్కరుచి సోఁకున గ్రుస్సిన యేరుఁ బోని యా
కప్పురగంధిఁ జూచి గజగామిని చందము నేఁడు రాజుతోఁ
జె[(ప్పు)దమంచుఁ[26] (బూని)][27] సరసీరుహనాభ నసంభ్రమంబునన్. 43
వ. ఒండొరులం గడవం బరతెంచి తద్వృత్తాంతం బంతయు నమ్మహీకాంతునకుం జెప్పిన నతండును నమ్మత్తకాశిని చిత్తంబు [భవదాయత్తం][28] బగుట యెఱింగి కురురాజువలని నెయ్యంబునం జేసి యుల్లంబునఁ జిడుముడి వడుచుఁ జెల్లెలికడ కేతెంచి సుందరంబగు మందిరారామసీమంబున మాధవీలతామంటపంబున విరహవేదనాదూయమాన యగుచు విన్ననై యున్న కృశోదరిం జూచి నాసాగ్రంబున తర్జనిని మోపి యలంతినవ్వుతోఁ దలయూపుచు నిట్లనియె. 44
శా. పాపా చూడవొ యేమి చిత్రఫలకం(?) బాటించి నే వ్రాయు ధా
త్రీపాల[గ్రణులన్ మ][29]హామహుల సందీప్తప్రతాపాఢ్యులం
జాపల్యంబున వారి డించి మగధక్ష్మాభర్తకై వార్థిలోఁ
గాపున్నట్టి మురారియే ఘనుఁడు గాఁగాఁ గోరితే యాత్మలోన్. 45
గీ. అబల నాబుద్ధిఁ జేసి యయ్యదునృపాలు
మీఁద నొల్లమి వాటించు మేటి నృపతిఁ
గోరు మొక్కనిఁ గలకంఠి కోరునమ్మ
యవని నెలమావి యుండఁగ నన్యశాఖి. 47
క. అలి పలుకు నన్న వాక్యము
వినివినముగఁ జేసి దాని వెడలఁగ నొత్తెన్
వనజాక్షి మనసులోపల
వనధి పయోవీచి క్షుద్రవస్తువుఁ బోలెన్. 48
ఉ. ఆ నయశాలి విందుఁడు ప్రియానుజ బావ మెఱుంగఁ గోరువాఁ
డై నలినాయతేక్షణ సభాసదనంబున కేఁగుదెంచి నా
నా నరపాలనందనుల నవ్యవయోగుణరూపధన్యులం
దే నియమించెఁ గాలరుల దిక్కుల కన్నిటికి న్ముదంబునన్. 49
గీ. అట్లు ప్రతికూలుఁడై యున్న యన్నఁ దలఁచి
నెరయ దూరంబు నందున్న నిన్నుఁ దలఁచి
యధికవాతూలహతిఁ గంప మడరు నట్టి
కడలియును బోలె కలకంఠి కడు వణంకు. 50
ఉ. కావున నోమురాంతక యఖండదయావిభవం బెలర్ప రా
జీవదళాక్షి నయ్యబల శీఘ్రమ యుద్వహ[నమ్ము][30] గమ్ము క్రో
ధావిలవైరిలోకమకరాలయముం బటుబాహుమందర
గ్రావముచే మదించి కుతుకంబున రెండవలక్ష్మి కైవడిన్. 51
మత్తకోకిల. వారిజేక్షణ పంపుమా వరవర్ణినిం బరిచారి మం
దారమాలిక నర్మవేదిని యవ్విలాసిని పాలికిన్
నీరజానన [నీరదావృతి నింగి][31] నేరి కదృశ్యయై
బోరునం జనివచ్చుఁ గ్రమ్మఱఁ బూని నీకడ కర్థిమైన్. 56
ఉ. ఇప్పుడు వార్ధివేష్టిత మహింగల రాజులు వచ్చియున్న వా
రిప్పుడు సాఁగుచున్న యది యింపెసలారఁ[గ నీ][32] స్వయంవరం
బిప్పుడ వచ్చి శౌరి నిను నంబరవీథులఁ గొంచు నేఁగు నం
చిప్పువుఁబోఁడి యక్కువయేక్షణతో నెఱిఁగించు టొప్పగున్. 57
క. అని చెప్పి మునివరేణ్యుఁడు
వినువీథిని శారదాభ్రవిభ్రమ[లీలన్
జన ని][33]oతి కడకు ఖగవా
హనుఁడును మందారమాలికాంగనఁ బనిచెన్. 58
మ. అదియున్ మోదమెలర్ప నారదుని మాహాత్మ్యంబునం జేసి తో
యదమార్గ[oబునఁ బాఱి యల్లన నదృశ్యంబయ్యె [34]][35] దైత్యారియుం
దదనుప్రేషితదృష్టిలో నిలిచె విందక్షోణి భృత్సోదరీ
సదుదంత శ్రవణోధితామృతరసాస్వాదానుమోదార్థియై. 59
క. మందారమాలికయుం దా[36]
విందానుజ నూరడించి వేవేల శతా
నందసుతు మహిమ మరలి ము
కుందుని సన్నిధికి వచ్చి కుతుక మెలర్పన్. 60
శా. దేవా దేవరయాజ్ఞ మౌళిఁగొని సందేశాక్షరశ్రేణ చే
తోవీథి న్నెలకొల్పి యేను మునిరాడ్డుర్వారవాక్శక్తిచే
నీవీ డప్పుడు నిర్గమించి చదలన్ హేలాగతి న్బోవుచో
దేవేంద్రాతి సమస్తదేవతలకున్ దృష్టింపరాకుండితిన్. 63
గీ. గగనతల చుంబి సౌదశృంగములు గడచి
కనకతోరణశృంగాటకములు దాఁటి
కరసముద్ధృతఖడ్గసంకలితసుభట
రక్షితం బైన నృపమందిరంబుఁ గంటి. 113
మ. నివషత్పుష్పకదంబ మైన మరుతూణీరంబునం బోలె న
య్యవరోధం బలరారు నే నతులతో నారాజ బింబాస్యలం
జివురుంబోఁడుల నీలకుంతలల రాజీవాక్షులన్ హావభా
వవిలాసైకనిరూఢలం దనివివోవం జూచితిం జూడ్కికిన్. 123
ఉ. ఆ సరసీరుహాక్షులు ప్రియంబునఁ జుట్టును జేరి కొల్వ ను
ల్లాస మెలర్పనున్న శుభలక్షణలక్షిత మిత్రవింద న
బ్జాసన సృష్టికిన్ మొదలి యచ్చును బోనియనంగవైభవన్
భాసురరూపయౌవనవిభాసితఁ గంటి రమేశ యత్తఱిన్. 127
చ. నిరుపమ రామణీయక జనిస్థల మైన తదంగనాజనా
భరణముఁ జూచు నాక్షణము భావము నీపయిఁ దోఁచెఁ దన్మనో
హరుఁడవుగాఁగ మీన తగు దంబుజలోచన చందనావలీ
పరిచిత కర్హమె యితర పర్వతముల్ మలయంబు దక్కఁగన్. 129
శా. దక్షబ్రహ్మ విపక్ష చామర మరుద్దంతావళేంద్ర క్షపా
ధ్యక్ష క్షీరపయోధి కుందరజతాహార్యామరక్ష్మాజ హ
ర్యక్ష క్షామ సరస్వతీ హిమమహీధ్ర స్వర్ధునీ మల్లికా
గోక్షీరాబ్జవలక్ష కీర్తివిభవా కొండూరి యక్కధ్వరీ. 130
క. వాచాగోచర నయ విబు
ధాచార్య మృగేంద్రశౌర్య హరి దిభకుల సం
కోచన పటహోద్భట రవ
యాచకమందార కొండు రక్కమహీంద్రా. 131
స్రగ్విణి. ప్రాతరాదిత్యరూప ప్రతాపోదయా
భూతి లక్ష్మీవరా భూతగర్భాచ్యుతా
ఐతమాంబాధవా అబ్జగర్భాన్వయా
ఖ్యాతకొండూరి యక్కప్రభుగ్రామణీ. 132
గద్యము
ఇది శ్రీమదింద్రేశ్వరవరప్రసాదలబ్ధకవితాసార నారనామాత్య
కుమార సూరిజనవిధేయ సూరయ నామధేయ
ప్రణీతంబైన వనమాలివిలాసం బను
మహాకావ్యంబునందు
ద్వితీయాశ్వాసము
- ↑ వద
- ↑ ప్రా.పూరణము
- ↑ ప్రా. పూరణము
- ↑ విందులకును (సా.ప.)
- ↑ ప్రా. పూరణము
- ↑ వైనటించు (సా.ప.)
- ↑ ప్రా. పూరణము
- ↑ ప్రా. పూరణము
- ↑ గాంచె మనంబునఁ బొంగె నింతయున్ (సా.ప.)
- ↑ ప్రా.పూరణము
- ↑ ప్రా.పూరణము
- ↑ ప్రా.పూరణము [లెం ....] సా.ప.
- ↑ సఖుల గొలుపు (సా.ప.)
- ↑ ప్రా.పూర
- ↑ ప్రా.పూర
- ↑ యెలుక (సా.ప)
- ↑ ప్రా.పూరణము స.వ. రాక్షి (సా.ప.)
- ↑ ప్రా.పూరణము
- ↑ ప్రా.పూరణము
- ↑ ప్రా.పూరణము
- ↑ బోకని (సా.ప.)
- ↑ బోకని (సా.ప.)
- ↑ ప్రా.పూరణము
- ↑ ప్రా.పూరణము
- ↑ ప్ర.పూరణము
- ↑ హమంచు (సా.ప.)
- ↑ ప్ర.పూరణము
- ↑ ప్ర.పూరణము
- ↑ ప్ర.పూరణము
- ↑ ప్రా.పూరణము
- ↑ ప్రా.పూరణము
- ↑ ప్రా.పూరణము
- ↑ ప్రా.పూరణము
- ↑ రి వాలంకించె (సా.ప.)
- ↑ ప్రా.పూరణము
- ↑ ప్రాసవ-మాలికెయును (సా.ప.)