ఉదయనోదయము/వనమాలివిలాసము-చతుర్థాశ్వాసము

వనమాలివిలాసము


చతుర్థాశ్వాసము

క. శ్రీకనకాచల కార్ముక
రాకేందు మరీచి సోదరాయిత కరుణా
లోకన రక్షిత గుణ ర
త్నాకర విభవేంద్ర కొందురక్క మహీంద్రా. 1

వ. అవధరింపుము. 2

క. కినుకయుఁ గోపము మనమున
బొనఁగొన నిట్లనియె రాజబింబాస్య కనుం
గొనల మగుడారు నశ్రులు
కొనగోళ్ళం బార మీఱికనుచు ముకుందా. 3

క. తెలియవు లవమాత్రంబును
కలకంఠీ మన్మనః ప్రకార నిశుద్ధిన్
తలఁగోసి తెచ్చి ముందర
నిలిపినఁ గనుమాయ యనెడి ని న్నేమందున్. 6

గీ. నెలఁత సంపెంగ దండలు నీ కరములు
కలువరేకులఁ బోలు నీ కన్నుదోయి
పేరు దలపాసి మారుమందారమాల
యువిద యెట్లయ్యె కెంద మయోమయంబు. 10

సీ. సకియ యమ్మురవైరి సన్నిధి నిట్లని
నా మాట గాఁగ విన్నపము సేయు
దేవేశ మొసలిచేఁ దీల్వడి మొరచూపు
కరిఁ గాచినట్టి[1] నీ కలితనంబు



కురురాజు సభలోనఁ గోలుపోయిన కృష్ణ

కభయ మిచ్చిన నీ దయాగుణంబు
నేఁ డెందులకుఁ బోయె నిన్ను వీవిశ్వంబు
సర్వజ్ఞుఁ డను మాట సంశయంబొ

ఆ. విందుఁ డెల్లి నన్ను వేరొక్కనికి నీయ
నున్నవాఁడు మేళనోత్సవమున
వాని మోసపుచ్చి వచ్చి నిజాధీన
బుద్ధి నన్నుఁ గొంచుఁబోవ కిట్లు. 16

క. ఒల్లమి చేసిన నీవే
తెల్లమిగాఁ జూచె దేల తెలుపఁగ నిపు డు
త్ఫుల్లాబ్జనయన ముందరఁ
బిల్లీతలు గొనుచు వచ్చు పృధుదుర్యశమున్. 17

మ. సకలాత్ముం డని చెప్ప విందు నిను సర్వస్తుత్య లోకంబు లేఁ
టికి నా యీదురవస్థలన్ సదయదృష్టిం జూడ నేతజ్జగ
త్ప్రకరంబున్ సకలంబు దీనజనసంత్రాణేచ్ఛమైఁ బ్రోచు నీ
యకలంకస్థిరమానసం బకట నాయం దేల పాటింపవే. 18

మ. విహితాంభోనిధి మధ్యవాసవసతిన్ విశ్రాంతిమై నున్న నీ
కహహా యేల యెఱుంగవచ్చు మురదైత్యధ్వంసి నేఁడెల్లి యీ
మహితప్రాంతవనీ విరంతర చరన్మత్తాలి గానంబునన్
ముహురుత్తాలిత మాధవీ వహకుహూముక్కా[క][2]లీ భంగులన్. 20

క. వేఁడిదవానల కీలల
నాఁ డాహుతిఁ గొన్న నీదు నైపుణి కృష్ణా
నేఁ డెందు వోయె నాలో
గాఁడిన మదనాస్త్రవహ్ని కడ కొత్తఁగదే. 21



క. అని యిట్లు విన్నవింపఁగ

సవినయముగఁ జేసెనేని విను సారసలో
చన మఱియును నిట్లను
మనుమానం బేల యింక నాతనితోడన్. 22

ఉ. నాదగు మే లెఱింగియు మనంబున నొల్లమి చేసె దేని దా
మోదర మత్ప్రతిజ్ఞ విను ముగ్రచిదగ్నికి దేహ మాహుతిం
గా దరికొల్పి నిన్నె పతిగాఁగ వరించెద మీఁదనైన న
వ్వేదవతీ వధూటి గతి వేమఱు మాటలతోడి దేటికిన్. 23

సీ. అని చెప్పుమని చెప్పి యాయింతి జగదీశ
తెలిగన్నులను నీరు దెచ్చుటయును
గనికరం బాత్మలోఁ గళలొత్తగా నేనుఁ
గాంచనభృంగారకంబు నీటఁ
దొయ్యలికన్నులు దుడిచి నెయ్యంబున
బిగువుఁ గౌఁగిటఁ జేర్చి మగువ నీదు
చిత్త మారయఁగోరి చేసితి ఖేదంబు
తల్లి యీతప్పు చిత్తమున మఱవు

గీ. మమ్మ నీవు పలికినట్టి యీ మాటల
వలన లేశమైనఁ గలదె కొదవ
చేసె నమృతరసము చిలుకు నీ పలుకులు
పణఁతి నాకుఁ జెవుల పండువుగను. 24

గీ. ఉవిద యోరంతప్రొద్దు ని న్నుల్లమునను
నెమ్మిఁ జింతించి చింతించి నీ విభుండు
ప్రసవసాయకుచేఁ బాట్లఁబడు తెఱంగు
లేకముఖమునఁ బలుక నే నెట్లు నేర్తు. 25

మ. చతురంభోనిధి వేష్టితాఖిలమహీచక్రంబునం గల్గు రా
జతనూజావలి చూచుచుండ మణిమంచశ్రేణకామధ్యమ
క్షితి నేతెంచి నినున్ మురాంతకుఁడు రాజీవాక్షి తార్క్ష్యోపరి
స్థితుఁడై వచ్చి గ్రహించి తోడుకొని వేంచేయు న్నిరాతంకతన్. 30

గీ. నెలఁత చెక్కులవ్రేలు నీ (?)నున్న గురుల
కొనల గోళ్ళను గొప్పునఁ గూడ దువ్వి
ముడుచు వేడుక నసురారి మొకరితేఁటి
మూఁతి ముట్టని యవ్వేల్పుమోఁక విరుల. 33

ఉ. నీ కుచశైలకూటముల నీ నతనాభి సమీపభూములన్
నీ కటిసైకతస్థలుల నీ మృదుచారుతరోరుసీమలన్
నీ కరమూలకూటముల నెయ్యమునన్ విహరించుఁగాత నా
ళీకనిభాస్య యయ్యదుకులీను కరాంబుజ మెల్లవేళలన్. 34

ఉ. తోయలి వేఁగుఁజుక్క యదె తూర్పుదెసం బొడతెంచె కొక్కరో
కో యని కుక్కుటంబులును గూయఁదొణంగె జరానిరూఢయై
పోయె నిశావధూటియును బోవలె నుండుము తల్లి చల్లఁగా
నా యెడ నెల్లకాలము మనంబున నీదయ యిట్లు నిల్పుమీ. 37

తే. అనుచు గమనింప గమకించు నంతలోనఁ
ద్రోవ కడ్డంబు వచ్చి పాథోరుహాక్షి
కమలబిసకోమలంబైన కరయుగమున
లీల బిగ్గర మెడఁ గౌఁగలించి పలికె.< 38br>
క. కలలోన కూట మయ్యెను
నెలఁతుక మినుకాడి యునికి నీ వరుగంగా
నిలువఁగ నేర్తునే నని
నెలవున జవిహరిణి నిలుచనే పులులకడన్. 39

ఉ. వచ్చెద నిన్నూగూడి వరవర్ణిని నీదగు విద్యనేర్పునం
బొచ్చెములేని కూర్మి యదుపుంగవు పాలికిఁ గొంచుఁ బో ననున్
నెచ్చెలి యిప్పు డిట్లయిన నీకు ముహూర్తములోనఁ గీర్తియున్
వచ్చు ననాధరక్షణ భవంబగు పుణ్యముఁ దోన కల్గెడిన్. 40

క. అని కౌఁగిలించి కరముల
నను విడువక సారెసారె నాకుఁ బ్రియంబుల్
వెనుబడఁ జెప్పుచుఁ గన్నీ
రనయము నిగుడించు నింతి కపు డిట్లంటిన్. 43

ఉ. వారిరుహాక్షి నీ వెఱుఁగవా నృపధర్మము లేమిలోన నిం
డారి తొలంకు ప్రేమమున నాడెదుగాక భుజాబలంబుచేఁ
బేరువహించు రాజులకుఁ బెంపఱి భూముల నన్యభామలం
జోరకవృత్తిమైఁ గొనుట చొప్పడునే తలపోసి చూడఁగన్. 44

ఉ. చేడియ యేతదర్థమయి శీఘ్రమ యిన్నగరాంతికంబునం
గూడెడి మేదినీరమణకోటి నకుంఠితబాహువిక్రమ
క్రీడన ముల్లసిల్ల ననిఁ గీటణఁగించి పిశాచకోటికిన్
వేడుకచేసి చేయు నరవిందదళాక్షుఁడు నీకు నిమ్ములన్. 46

ఉ. నీ కటిపెంపు చక్రమున నీ గళవిభ్రమ మంబుజంబులన్
నీ కరభోరుభంగి గద నీ భృకుటిస్థితి శార్ఙ్గవల్లరిన్
నీ కమనీయకోమలత నిల్కడ ఖడ్గమునన్ ఘటించి కా
దా కడుఁబ్రేమ చూపు హరి తన్వి నిజాయుధపంచకంబుపైన్. 47

ఉ. నీ వలిచన్నుదోయి రమణీయత కుంభములన్ మృదూరు పా
ళీవిభవంబు తుండమున లేమెఱుఁగారెడి నవ్వు దంత శో
భావళులన్ విలాసగతి యానముల న్నెలకొల్పి కాదె రా
జీవదళాక్షి నీ విభుఁడు సింధురముం గొనియాడు యాత్రలన్. 48

సీ. అనిన సంతోషించి యవనీశనందన
సంప్రసాదోన్ముఖస్వాంత యగుచు
మది నన్ను నేప్రొద్దు మఱవకుండుటకునై
ధరియింపు మదిని సుందరి యటంచుఁ
దనకంఠహార మొయ్యన పుచ్చి వినయోక్తు
లను వొందఁ జెప్పి నాయఱుతఁ జేర్చెఁ
బచ్చకప్పురమును బండుటాకులఁ గూర్చి
పూగఖండములఁ దాంబూల మొసఁగి

గీ. పువ్వుకట్టిన యీ గందవొడియు నొసఁగి
మించుఁగనుదోయి బాష్పముల్ నించికొనుచు
నెట్టకేలకు నన్నెంపె నింతి యనుచుఁ
క్రి...దళుకొత్త నదిమ్రోలఁ బెట్టుటయును. 49

క. వదనాబ్జము దెలి వొందఁగ
యదురాజవిభుండు దాని యఱితిసరంబుం
బదిలముగఁ దిగిచి తనమెడఁ
గదియించెఁ బ్రమోద మాత్మఁ గదలు కొనంగన్. 50

మ. తరుణీపాణి సరోజదత్తమగు తత్తాంబూలముం జేసె ని
ర్భరమోదంబున యాదవాన్వయ మహీపాలుండు తత్ఖాదనా
కరణోదీర్ణరసంబు చూడ్కులకు వేడ్కం జేసె హృత్పూర్ణ ఠా
గరసం బుచ్చి క్రమంబున న్వెలికి నుద్గారించు వందంబునన్. 53

క. విందానుజావలోకన
నందిత నయనయుఁ దదీయ నయవాక్య సుధా
తుందిల కర్ణయ యగు నా
సుందరి నత డాత్మఁ దలఁచె శోభనవతిగన్. 54

వ. దానికి దివ్యాంబరాభరణంబు లొసఁగి మఱియును. 55

ఉ. తా నడుగంగ సారెకు ముదంబున నమ్మదిరాక్ష చెప్ప విం
దానుజ వార్తలం దవిలి యాదవవల్లభుఁడు న్నిశీధినిం
బోనడపెం గ్రమంబునఁ బ్రమోదరసాంబుధి నోలలాడుచుం
బూని నృపాత్మజం గుఱిచి పోవుటకై దృఢనిశ్చయంబుతోన్. 56

వ. అంతట నక్కడ. 57

క. ఆ చక్రవాళశైల
క్ష్మాచక్రమునందుఁ గలుగు జననాథులు సే
నాచతురంగంబులతో
వే చనుదెఁ దొణఁగి రెలమి విందుని పురికిన్. 58

గీ. వెలిబయళ్ళను జుట్టిరా విడిసి మ్రోయు
నఖిల దిగ్దేశరాజసైన్యములతోడ
నపుడు గైకొనె నప్పురం బబ్ధపూర
పరివృతంబైన ద్వారకాపురము మహిమ. 60

ఉ. వేలములందుఁ జూడ్కులకు వేడుకఁ జేసెఁ గరంబు నిర్మలో
త్తారపటీకుటీప్రతతి తన్నగరాంతికభూములన్ మహా
కాళనికేతనున్ భూజగకంకణు గింకరితాఖిలామరున్
హాళి భజింప వచ్చిన శివాచలకూటశతంబులో యనన్. 61

గీ. వివిధదేశావనీశ నివేశములను
జనము లాడెడి .............శేష
ఘోషణంబుల మంధానకుధరమధ్య
మానపాథోధి నాదంబు మాన మేదె. 62

ఉ. అంతట నమ్ముహూర్తమున నంగజసన్నిభముర్తులైన భూ
కాంతతనూభవుల్ సురభిగంధలతాంతవిభూషణాదులన్
వింతవిలాసముల్ పరిఢవింప నలంకృతులై మనంబులన్
సంతస మొప్ప నిల్చిరి లసన్మణికాంచనమంచవీథులన్. 63

వ. అంత నంతఃపురచారికాకృతపరిష్కార యగు భర్తృదారికాలలామంబు విందానుమతి(o)[3] జెలిమికత్తియ లిరువంకలం గదిసి యేతేర నిజా[ననా][4]oబురుహనిర్జితపూర్ణిమామృతాంశుబింబునుం బోని సితాతపత్రంబు నొరయ [దదీయ][5]సభారంగంబు ప్రవేశించె నప్పుడు. 67

క. దందడి వ్రాలె మహీధవ
నందనపై నపుడు ధరణీనాథుల చూడ్కుల్
మందారకమాలిక మీ
దం దిరమగు గండుతుమ్మెదల చందమునన్. 68

ఉ. ఆతఱి రాజమంచనివహాంచలవీథుల కేఁగుదెంచు న
బ్జాతదళాక్షిఁ బల్కె నటు చంద్రనిభానన దాదిపట్టి వి
జ్ఞాతసమస్తభూరమణజాతగుణాన్వయవేత్రదండముం
జేతఁ దెమల్చి మోపు జనసింధురవం బెడలించె వేడ్కతోన్. 70[6]



ఉ. ఇందునిభాస్య నీవదన మెత్తి తగన్ నిగిడింపు చూడ్కులన్

ముందఱివంక మిన్నక సమూహములై సమదాలిపోతముల్
సందడిసేయ లోకములఁ జంద్రయుగంబును గల్గఁబోలునన్
సందియముల్ సమస్తజనసంతతి కాత్మల నొందఁజేయుచున్. 71

ఉ. ఈ నరనాథవర్యుల యహీనకులస్థలనామవర్తనల్
నే నెఱిఁగించెదన్ విని యనిందితసుందరు నిందు నొక్కనిన్
మానవతీలలామ యనుమానము మాని భవత్కటాక్షవీ
క్షానవదామపాతపరికల్పనచేతఁ గృతార్థుఁ జేయవే. 73

చ. చెలువ త్రికూట నామగిరిశేఖర మాలిక వోలె లంక నాఁ
గల దొక పట్టణం బుదధిగర్భమునన్ దనుజాస్పదంబు ని
ర్మలతదగారకుట్టిమసమగ్రహరిన్మణిరుక్సరోజినీ
స్థలములఁ బూర్ణిమావిధుఁడు దాల్చు మరాళకిశోరఖేలలన్. 74

ఉ. ఏ పురమున్ దశాననుఁ డహీనభుజాదశయుగ్మకంబుచేఁ
బ్రాపిత(ఖే)[7]దుఁడై వికచపద్మవిభానన తాల్చు నట్టిలం
కాపురమున్ విభీషణుఁడు గైకొనె లీల భుజాయుగంబుచే
స్థాపితరామభూపజయశాసన మాతఁడు దక్షిణాశకున్. 79

ఉ. వాని తనూభవుం డితఁడు వారిరుహేక్షణ! చూడు మాతనిన్
వీని యనన్యరూపతనువిభ్రమముల్ వివరించి చూచి కా
దా ననవింటిజోదు మును తాల్పకయుండుట క్రూరభర్గఫా
లానలదగ్ధ మైన తనయంగకమున్ సుర లెంత వేఁడినన్. 80

క. తరుణీ! యీతని డాఁపలి
కురు వెక్కెదవేని నీదు కోమలచరణాం
బురుహామలనఖకాంతులు
సురకాంతలమౌళిఁ జేరు చుక్కలఁ జేరున్. 84[8]



గీ. కఠితనిజదీర్ఘబాహుశృంఖలిక యగుచుఁ

కమలవనసీమ నిశ్చలత్వము వహింప
భూరికీర్తి విశృంఖలస్ఫూర్తి యగుచు
నతివ యితఁ డేలు సింహళం బనెడు దీవి. 85

ఉ. దానికిఁ గొంత దూరమునఁ దామరసేక్షణ చూడ నొప్పగున్
భూనుతవైభవంబు మణిపూరపురంబు సమస్తవస్తుసం
తానసమగ్ర(మై సతతదానదానఝరీద్విరదైక)*వాసమై
మానవతీకటాక్షసుషమానవవిభ్రవరత్నపేటియై. 94

గీ. అప్పురంబున కధినాథుఁ డతివ యితఁడు
జైత్రకళనామధేయుండు జలజబంధు
వం(శజుఁడు వీని నిత్యాధివాసభూ)*మ్య
నిజయశోగంగ కినసూతి నెమ్మినెఱపు. 95

క. కేలం జాపము గైకొని
కోలుతలన్ విందు చూపు గుణనినదంబుం
పోలు నిజాధిముఖారి నృ
పాల రమాచరణ కటక(పటుఝంకృతులన్)*. 96

చ. నెలఁతుక తామ్రపర్ణి యను నిమ్నగ యమ్మలయావనీ ధర
స్థలవిలసత్ప్రతీరత(రుసంచితసౌరభశేత్యలబ్ధి)* చేఁ
బొలిచి విలాసలీల మెయి భూరిగుణాకర వల్లభాత్మ మున్
వలనుగఁ బూనచుండు ననువాసరముం జలరాశి సంగతిన్. 102

ఉ. అన్నది నిర్మలోదక సుధాధిక మాధురి కోహటించి సు
కన్నులు....................... 104

అసంపూర్ణము



ఆంధ్రసాహిత్యపరిషత్ప్రతియం దింతవఱకే కలదు.





  • లుప్తభాగములు ప్ర.మ.భూ.లోని 530, 531, 532, 534 సంఖ్యగల పద్యము లాధారముగ పూరింపఁబడినవి. 18-6-1911లో ‘ప్రబంధమణిభూషణము’నకు మానవల్లిగారు వ్రాసిన పీఠికయందు ‘వనమాలివిలాసము’లోనివిగా 35 పద్యముల సంఖ్యావివరణ మిచ్చియుండిరి. ఇందు 17 పద్యములు ఆంధ్రసాహిత్యపరిషత్ప్రతి యందలి తృతీయ చతుర్థాశ్వాసములలోఁ గలవు. తక్కిన 18 పద్యములు పరిషత్ప్రతియందు లేవు. సందర్భము ననుసరించి ఈ పద్యములు మిత్రవిందకు స్వయంవరవేళ దాదిపట్టి పలువుర రాజులను చూపుచు వారిని వర్ణించి చెప్పునవిగనే యున్నవి. ‘ప్రబంధమణిభూషణము’నకును, పరిషత్ప్రతియగు ‘వనమాలివిలాసము’నకును మూలగ్రంథములు మానవల్లివారియొద్దనున్న ప్రతులే కదా! ‘వనమాలివిలాసము’లోనివిగా ప్రబంధమణిభూషణపీఠికయందు లేని 18 పద్యములు పరిషత్పండితులు మానవల్లివారియొద్దనుండి ‘వనమాలివిలాసము’ నెత్తి వ్రాసికొనునాటికి (1938) శిధిలమైపోయెనేమో! పరిషత్ప్రతియందలి చతుర్థాశ్వాసములోని కొన్నిపద్యములలో నెడనెడ కనపడు లుప్తభాగములు ‘ప్రబంధమణిభూషణము’లో సంపూర్ణములుగనే యున్నవి.

ప్ర.సంపా.

చ. మరుఁ డను నైంద్రజాలికుఁడు మానినినీలముఖస్తనద్వయీ
నిరుపమకోహళీయుగళి నించి జగజ్జనకందుకత్రయిం
బరిపరిరీతులన్ మొఱఁగి పల్మఱుఁ జూపు నిజైకవంచనా
పరతజగజ్జనంబులకుఁ బద్మవిలోచన యేమి చెప్పుదున్.

కోహళి – శివాలయములో శివలింగముపై నుంచెడి పంచముఖనాగాభరణము. ఇది క్రమముగా శిరోభూషణముగా నర్థము గాంచినది. శ్రీనాథుఁడు హరవిలాసమునం దీశబ్దము ప్రయోగించి యున్నాడు “మౌళింగోహళి సంఘటించిన క్రియన్”.ఇచ్చట యిది స్తనశిరోభూషణముగాఁ జెప్పఁబడినది. ఇందు కుచనీలముఖము కోహళిగా నిరూపితము. కోహళీశబ్దము సంస్కృతసమాసమధ్యగత మగుటచే దీనిని సంస్కృతశబ్దముగా భావింపవలెను. కోహళీ శబ్దమునుండియే కుళ్ళా(యి) వచ్చినది.

ఉ. ఆతఱి రాజమంచనివహాంచలవీథుల కేఁగుదెంచు న
బ్జాతదళాక్షిఁ బల్కె నటుచంద్రనిభానన దాదిపట్టి వి
జ్ఞాతసమస్తభూరమణజాతగుణాన్వయవేత్రదండమున్
జేఁత దెమల్చి మోఁపు జనసింధురవం బెడలించె వేడ్కతోన్.

శా. ఆ లంకాపురమేరుశైలతటపర్యంతావనీనాథు లా
శాలక్ష్మీశ్రవణావతంసితయశశ్ఛాయాగుళుచ్ఛుల్ మునుల్
ప్రాలేయద్యుతిభానువంశజులు లీలాపుష్పధన్వాకృతుల్
బాలా! నీ కయి కూడినా రిచట నో పద్మాక్షి! వీక్షింపవే.

సీ. కర్ణాటపతి వీఁడు కర్ణాయతేక్షణ
పాంచాలపతి వీఁడు పద్మవదన
కరహాటపతి వీఁడు గంధేభనిభయాన
ఘూర్జరపతి వీఁడు కోమలాంగి
కుంతలపతి వీఁడు కుటిలనీలాలక
సౌవీరపతి వీఁడు సరసిజాక్షి
సింధుభూపతి వీఁడు బంధుచింతామణి
కాంభోజపతి వీఁడు కంబుకంఠి

గీ. కోసలేశ్వరుం డాతఁడు కుసుమగంధి
వత్సపతి యీతఁ డాతఁ డవంతివిభుండు
సింహళుం డీతఁ డాతండు చేదివిభుఁడు
చూడు నరపాలకుల బాల! శుభగలీల.

సీ. మాళవనేపాలమత్స్యభూపాలురు వీరె
వీరలఁ జూడు విద్రుమోష్ఠి
కొంకణకురుభోటకుకురావనీశులు వారె
వారలఁ జూడు వనజగంధి
తెంకణద్రవిడవిదేహబర్బరపతుల్ వారె
వారె కను మంభోరుహాస్య
ఆభీరలాటబంగాళనాథులు వీరె
వెరవుతోఁ గనుగొను మెఱుఁగుఁబోడి

గీ. అంగవంగాంధ్రచోళపాండ్యత్రిగర్త
కాశికాశ్మీరయవనకేకయవరాట
విభులె యీయున్నవారలు వీరిలోన
నీకుఁ దగురాజు వరియింపు నీలవేణి.

క. సాయంతనసమయంబున
నో యింతీ! యితఁడు దిరుగు నువిదలుఁ దానున్
దోయధిరవనృత్యచ్ఛిఖి
గేయస్ఫాయత్సువేలగిరికూటములన్.

మ. శరణాయాతశరణ్యు నప్రతిరథున్ క్షత్రాన్వవాయైకవి
స్తరణున్ మాగధకల్పవృక్షు మగధక్ష్మాపున్ సితచ్ఛత్రచా
మరసింహాసనకేతనప్రధితసమ్యగ్రాజచిహ్నాఢ్యుఁ జూ
డు రమానందరూపుఁ గానమికి నొండుంజింత లే దీమెయిన్.

ఉ. వీఁడటె కాముఁ డేఁ జెఱకువిల్లెటు వోయె మహేంద్రుఁ డట్టె క
ట్టాఁడిమెఱుంగుఁగన్ను లెటుడాఁచె జయంతుఁడె ఱెప్పవాల్చు లే
పోఁడిమి నేర్చె నశ్వినియె పొత్తెటు వాయఁగఁబెట్టె నంచుఁ గ్రొ
వ్వాఁడిమెఱుంగుఁజూడ్కుల నివాళు లొనర్తురు వీని కచ్చరుల్.

క. రాజన్యమౌళి నీతని
నోజన్ వరియించి పౌరయువతీనయనాం
భోజసుఖ మొదవఁజేయుము
రాజగృహారామకల్పరత్నాంకురమై.

ఉ. దశకంఠక్షయధూమకేతు వగు నుద్యత్సేతు వేపారెనో
శశిబింబానన! దుష్టశిక్షణసరస్వద్రాజగాత్రంబులన్
విశదక్రోధవశాత్ముఁడై రఘుకులోర్వీనాథుఁ డాశానిరం
కుశతేజోధనుఁ డిడ్డశృంఖళిక నా క్షోణీధరస్ఫూర్తితోన్.

గీ. నవ్వుఁ దత్సేతుఖండంబు నలినవదన!
దాశరథి కబ్ధి చేసిన తప్పుఁ దలచి
సారెసారెకు వికచప్రసారసవిధ
తటసమాసక్తనూత్నముక్తామిషమున.

గీ. ఆ రసాతలపర్యంతమైన సేతు
మూల మాధారముగ వచ్చి ముదితభోగి
కామినీతతి చదువు మై గగురుపొడువ
నచట రఘువీరజయశాసనాక్షరములు.

ఉ. దానికిఁ గొంతదూరమునఁ దామరసేక్షణ! చూడ నొప్పగుం
భూనుతవైభవంబు మణిపూరపురంబు సమస్తవస్తుసం
తానసమగ్రమై సతతదానఝరీద్విరదైకవాసమై
మానవతీకటాక్షసుమనవవిభ్రమరత్నదీప్తియై(?).

క. ఏలానిలసంవాసిత
వేలాతటములను నీకు విహరింపంగా
జాలా వేడుక గల్గిన
నీలాలితమూర్తి దక్క నేలుము తన్వీ!

క. పూర్ణేందువదన యత్తటి
దీర్ణఖరీనామనగరి దెలివొందు తదా
కర్ణాక్షులదృగ్దీప్తులు
వర్ణితయువహృత్పతంగవాగుర లరయన్.

గీ. అవని వకుళాభరణయోగి యన ముకుందుఁ
డందుఁ జించాతలంబున నవతరించి
విస్ఫుటంబుగ నర్థముల్ విస్తరించు
ద్రవిళవాగ్రూపవేదవాగ్రత్నములను.

గీ. అప్పురం బేలు రాజులం దర్కకులుఁడు
పేరు లోచనచంద్రుఁడు భీరుమధ్య!
చల్లు నితండు దిగ్వధూస్తనభరముల
భూరినిర్మలకీర్తికర్పూరధూళి.

ఉ. వీని భుజాబలప్రకరవిభ్రమముల్ విపినాధిదేవతల్
గానము సేయుచోఁ దరునికాయము జాతిగ నొత్తుఁ దాళముల్
కానలు దూఱి శాత్రవులు క్రన్ననఁ బాఱెడివేళఁ గొమ్ములన్
మానుగఁ బట్టి గాలి బలుమాఱుఁ జరించుఁ గిరీటకోటిచేన్.

గీ. పసిఁడితీఁగలఁ బోలు నీ బాహుయుగళి
తరుణి! నల్లని వీని పే రురముఁ జేర్పు
దివ్యవాహినీనిజచారుతీరజనిత
కనకవల్లుల నగ్రభాగములఁ బోలి.

చ. ఇతఁడు దశార్ణభూమివిభుఁ డిందునిభానన! వైరిధారుణీ
పతు లితఁ డన్న శైలవనపార్శ్వములందు వసింతు రెప్పుడున్
రతిపతిభాసమాను నుడురాజయశున్ మృగరాజవిక్రమున్
గుతుక మెలర్పఁగా నితనిఁ గోరి వరింపుము నీకు నింపగున్.

వ. ఇట్లు సఖీజనంబులు పురికొల్ప నొల్లకుండిన ముందఱికిం బోనిచ్చి.

శా. చోళద్రావిడపాండ్యరాజ్యమహిభృచ్ఛుద్ధాంతకాంతాపయః
కేలీసక్తతదంగరాగితకురంగీనాభినీలీభవ
ల్లీలావారిభరాభిరామమయకాళిందీనదిం బోలుచుం
గ్రాలుం భూనవవేణికావిధమునం గావేరి లీలావతీ!

గీ. వేడ్కఁ బాండ్యాంగనలు కేళివేళలందు
నాతమనతనాభిపీతంబు లైనవానిఁ
గరుణవక్షోజభరలబ్ధి గ్రమ్మరించి
తూర్పు నడపింతు రయ్యేటి తోయములను.

ఉ. మంగళదివ్యమూర్తికి రమాకుచకుంభపటీరవాసనా
చంగితతారువక్షునకు సర్వచరాచరభూతభర్త కు
త్తుంగభుజంగశాయికిఁ జతుర్భుజభాసికి నున్కిపట్టు శ్రీ
రంగము చూడనొప్పగుఁ గురంగవిలోచన! తత్తటంబునన్.

గీ. రమణి కయ్యేటి కనతిదూరంబునందు
నొట్టుకొని పొల్చు శ్రీరంగపట్టణంబు
దాన్ని వీక్షించి సురదేవతాపురంబు
నేఁడు తప మున్నదదె మరున్నిలయమునను.

మ. ద్విపకుంభస్తని! రాజు తన్నగరికిన్ విం దమ్మహీనాకలో
కపతిం కేసరకేతుఁ డందు రవనిం గల్పించె నేతత్ప్రతా
పపతంగుండు గళిందజన్ విమతరాట్పద్మాననాదృక్పుటీ
నిపతత్సాంజనభాక్సరన్మిషమున న్నిర్యంత్రణప్రక్రియన్.

చ. పడతి! సవర్ణభావమహిమం దెమలించు భవత్కరంబు లి
ప్పుడ తనరారు నీనృపతిపుంగవుహస్తముతోడఁ గూర్చెదేఁ
బడిబడి మానసంబులనుఁ బ్రాకెడి రాగలతామతల్లికిన్
బొడమిన పల్లవద్వితయభూతి నొనర్పదె వేయినేఁటికిన్.

ఉ. కాంచనవప్రదీధితినికాయముచే వసుధావధూటి క
భ్యంచితకుంకుమచ్ఛదనభంగి ముఖంబున నత్తుకొల్పుచున్
జంచలనేత్రి! దక్షిణదిశాస్థలిఁ జూడఁగ నొప్పు నెంతయున్
గాంచి యనంగఁ బట్టణ మఖండమహామహిమాభిరామమై.

మ. ప్రవహించు న్నిరతంబు తత్పురవరప్రాంతక్షమావీథి వే
గవతీనామతరంగిణీతటి జగత్కల్యాణి ప్రాతఃశుచి
ప్లవఖేలద్రవిళాంగనాకుచతటీపర్యస్తకస్తూరికా
ద్రవచర్చావిలవారిపుర యగుచున్ రాజీవపత్రేక్షణా!

క. కలహాంతరితాకృతిఁ గోమలి!
పొలుచుఁ దదంతికమున మజ్జద్ద్రవిళీ
లలితఘనస్తనఘుస్రణా
విలవీచిక యగుచుఁ దటిని వేగవతి యనన్.

ఉ. భూపకుమారి! యప్పురి ప్రఫుల్లకుశేశయపత్రలోచనో
ద్దీపితవక్త్రపద్మములఁ దీటు మదిం దలపోసి చువ్వె తా
రాపతిరామమేరుశిఖరంబులఁ దోచు పయోధివీచులం
బ్రాపితదుష్కళంక మని పల్మరు నాత్మతనూగుళుచ్ఛముల్.

శా. కంపాసైకతవేదికాస్థలముల్ గ్రాలున్ గ్రతుధ్వంసి నై
లింపక్ష్మాధరచాపుఁ డైందవకళాలీలావతంసుండు దృ
క్సంపోద్భర్జితమీనకేతుఁడు జటాజాగ్రద్వియద్వాహినీ
ఝంపావీచిభరాకులాఖిలదిశాజాలుండు లీలావతీ!

గీ. అప్పురం బేలు నధినాథుఁ డతివ యితఁడు
అహరహంబున వాగ్గదండవాహవీని (?)
దానవారి భజింపు సంతతము దీవ్ర
హస్తశక్తులఁ బెట్టి ముక్తావలతను.

క. సానంగశీతలం బగు
నీ నిరుపమదృష్టి వీవి నెఱిఁ జూచెదవే
మానిని! వీనికిఁ గాంచీ
మానవతీవిభ్రమములు మఱపొందించున్.

వ. ఆ దాదిపట్టియు వేఱొక రాజసుందరుం జూపి.

ఉ. ఉజ్జయినీశుఁ డితని మహోన్నతియుం బృథువిక్రమంబు సం
పజ్జయలక్ష్ము లెన్నఁడును బాయ కురఁస్థలబాహుపీఠముల్
బుజ్జన సేయుచుండుటయె పోడిఁమిగా జగమెల్లఁ జాటుఁ జం
చజ్జజాలయతేక్షణ! విశాలము వీని యశంబు చూడఁగన్.

ఈ క్రింది పద్యము నారన సూరనదని యందురు. ఉదయనోదయమున కానరాలేదు. వనమాలివిలాసమున నున్నదేమో.

వేసవిలో మందమారుతము

శా. ఆ కల్లాడ ద దేమొ? నేఁడు పవనుం డాకాశవాపీతటా
శోకాసేకవనాళిఁ గ్రుమ్మరుచు నచ్చో దాఁగెనో లేక గం
గాకల్లోలవతీతరంగముల నూఁగంబోయెనో, లేక కాం
తాకర్పూరకపోలపాళికల నిద్రాసక్తుఁడై యుండెనో.

  1. ప్రా.స.వ.-గాంచినట్టి-సా.ప.
  2. ప్రా.పూరణము
  3. వచనము సంక్షిప్తపఱుపఁబడినది
  4. ప్రా.పూరణము
  5. ప్రా.పూరణము
  6. 70వ పద్యము ప్ర.మ.భూ.లో 514 సంఖ్య గల పద్యము
  7. ప్రా.పూరణము
  8. 71, 73, 79, 80, 84 పద్యములు ప్ర.మ.భు.లో 517, 520, 521, 523 515 సంఖ్యగల పద్యము లాధారముగా పరిషత్ప్రతియందలి లుప్తభాగములు పూరింపఁబడినవి.