ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/వైష్ణవక్రైస్తవమతములు
8. మిత్రసందర్శనము.
- 9. ప్రార్థన.
(షరా : - * అనుగుర్తుగల విషయములు, ఆచరింపఁబడినవనుట).
ఇట్లు నే ననుసరింపవలసిన కార్యక్రమము ముందుగ నేర్పఱచికొని, ఆప్రకారము నెరవేర్చితినో లేదో నాఁటిరాత్రియే చూచికొని వలసినచో, చేయనిపనులు కొన్ని మఱునాఁటి ప్రణాళికలోఁ జేర్చు చుండుటవలన, స్వేచ్ఛావిహారవిషయమున నాపాదములకు నేనే సంకెలలు తగిలించుకొనుటయై, నాకు గట్టిబాధ్యతయు జాగ్రతయుఁ బట్టుపడెను ! శరీరవిధులు, పాఠశాలలోని పనులును ఎప్పటి వప్పుడే నెరవేర్చుచుండుటచే, నామనస్సునకు హాయి గలిగెను. నా శీలప్రవర్తనములనుగుఱించిన సంగతులు దినచర్య దిన ప్రణాళికలయందు ఎప్పటి వప్పుడే లిఖింపఁబడుచుండుటవలన, అకార్యకరణమునకు సామాన్యముగ నా కరము లూనుచుండెడివి కావు. ఏనాఁటి లోపపాపము లానాఁటిప్రార్థనయందును దినచర్యపుస్తకములందును సూచింపఁబడుచుండుటచేత, మనస్సునకు మంచి ప్రబోధమును, న్యాయ మార్గానుసరణమున కమితప్రోత్సాహమును జేకూరెను.
14. వైష్ణవక్రైస్తవమతములు
ఎవని మతవిశ్వాసచరిత్రము వాఁడు విమర్శించుకొనునపుడు హృదయ మాశ్చర్యప్రమోదములకుఁ దావల మగుచుండును ! ఏడవ సంవత్సరమునకుఁ బూర్వము దేవునిగుఱించి నాయూహ లెటు లుండెడివో నాకు జ్ఞప్తిలేదు. ఆసంవత్సరమున గోపాలపురమున మేము బసయుండునింటఁ గొంతకాలము అధ్యాత్మరామాయణపారాయణము జరిగెను. శ్రీరాముని వనవాసకథ యాసమయమున నావీనులఁ బడెను. రాక్షసు లనిన భయము, రామలక్ష్మణులయందు ప్రేమమును నా హృదయమున నంకురించెను. ఆమఱుసటియేఁట రేలంగిలో చెలికాండ్ర సహవాసమహిమమున కృష్ణుఁడు నా కిష్టదైవత మయ్యెను. మాతల్లికి రామునియందు భక్తి. మాతండ్రి శివభక్తుఁ డయ్యును, ఒకటిరెండుమాఱులు నాచేత బాగవతములోని 'బాణాసురకథ' చదివించి, నాకర్థము చెప్పెను. అందలి విష్ణుని యుత్కర్ష నాబాల్యవైష్ణవమును ముదురఁబెట్టెను ! తదాదిగ, 1888 వ సంవత్సర మధ్యకాలమువఱకును, శివకేశవులలో కేశవు నధికునిగ నెంచి, నేను భారతభాగవతాది గ్రంథములు చదువుచు, నారాయణభక్తిపరుఁడ నై యుంటిని.
ఇటీవల కొంతకాలమునుండి నేను జదువు బైబిలుగ్రంథము, చేయుక్రైస్తవస్నేహితుల సహవాసమును, నాకు క్రైస్తవమతాభి మున ముదయింపఁజేసెను. ఆసంవత్సరము ఆగష్టు 7 వ తేదీదినచర్య యందు, "ఆపరమపవిత్రప్రవక్త యగుయేసుక్రీస్తును గుఱించి చదివితిని" అని యున్నది. 9 వ తేదీపుటలో, "భగవంతుడా ! ఐహిక విషయములను గుఱించి నామనస్సును కళవళపడనీయకుము. నే ననవరతము నీప్రేమామృతమును గ్రోలనిమ్ము. ఎపుడును నిన్ను ప్రార్థింతునుగాక !" అని లిఖింపఁబడెను. అప్పటినుండియు కష్ట మావహిల్లి నపు డెల్ల, భగవన్నామచింతనము నాదినచర్యయందు సూచింపఁబడు చుండెను. అక్టోబరు 28 వ తేదీని, "క్రైస్తవదేవాలయమునకు వెళ్లితిని" అని యుండెను. మఱునాఁటిదినచర్యయందు, నేను కొలఁదికాలములో మృత్యుముఖముఁ జొచ్చుట నిశ్చయ మని యెంచి నే గావించిన యొకదీర్ఘప్రార్థనము గానఁబడుచున్నది. అందు, నేను పాపి ననియు, తలంపులందు కలుషితుఁడ నినియు, నాదుశ్చింతలే యాత్మ శాంతిని బారఁద్రోలి శరీరమును మనస్సును గాకుచేసి నా నీతికుసుమ మును ముకుళింపఁజేసె ననియు, నేను వగచితిని. ఆజన్మము మనోవాక్కర్మలందు పవిత్రత ననుభవించినను, గత యేప్రిలు మధ్యకాలము నుండి నేను దుశ్చింతల పాలైతి నని నే మొఱపెట్టి, లజ్జావిరహితమగు నా హృదయమును భగవంతుని హస్తగతము చేయుచు, శీఘ్రమే తనసన్ని ధానమున నన్నుఁ జేర్చుకొనుఁ డని నేను దేవుని ప్రార్థించితిని !
1889 వ సంవత్సరము జనవరి మొదటితేదీదినచర్య బైబిలునందలి "ప్రభువుప్రార్థనము"తో ప్రారంభ మయ్యెను. ఆసంవత్సరము మేనెల మొదటితేదీనికూడ ప్రభువుప్రార్థన పూర్తిగ లిఖింపఁబడెను. నాదుశ్చింతల నరికట్టు మని దేవుని వేడుకొనుట అప్పుడప్పుడు కానవచ్చుచున్నది. మే 15 వ తేదీని ప్రార్థన మిటు లున్నది : - "దయామయా ! నీతనయులము అవివేకమున పాపకృత్యములకుఁ గడంగుచున్నాము. కాన నీవు మావర్తనము గాపాడి, కరుణాళు వగు జనకుని వలె మాతప్పులు సైరింపవలయును." ఈ మేనెలనుండి నవంబరువఱకును వరుసగ ప్రతి యాంగ్లేయమాసారంభ దినచర్యము ప్రభువుప్రార్థనముతో ప్రారంభమగుచుండెను. అప్పుడప్పు డొకానొకదినమున నిటులే యాప్రార్థన ముల్లేఖిత మగుచుండెను.
జూలై 18 వ తేదీని, దసరాసందర్భమున వ్రాయఁబడిన ప్రార్థనము లిచట వివరింపవలసియున్నది : - "పరమపితా ! నీయెడ నాకుఁగల గాఢానురాగము అనిర్వచనీయము. ఈ దుర్బలునికి నీమృదు కరస్పర్శసుఖ మొకింత యొసంగుము ***ద్రోహకౌటిల్యములు ప్రబలిన యీలోకమున నెట్టిసజ్జనుఁడును సైతానుప్రేరణమునకు లోనగుచున్నాఁడు. పావనచరితా, నాహృదయము బలవత్తరమగు దృఢ దుస్సంకల్పముల కిరవు గాకున్నను, ఒక్కొకతఱిని, అసూయ గర్వము మోహము మున్నగు హేయభావములకు గుఱియగుచున్నది. దీనిలో మొదటిది కడపటిదియు నాపరమశత్రువులు. ఈశత్రులబారినుండి నన్నుఁ దప్పింపుమని వినయాతిశయమున వేడుకొనుచున్నాను."
"భగవానుడా ! రాఁబోవు సంవత్సరము దసరానాఁటికి నే నెటు లుందునో తెలియదు. గతదసరాకును ఇప్పటికిని నాలో నెంతయో మార్పు కానుపించుచున్నది. ముఖ్యముగ పవిత్రుఁడగు జీససుప్రభువుమూలమున నే నిపుడు సత్యదైవభక్తుఁడ నైతిని. లోకమునుగుఱించి నా యభిప్రాయము లిపుడు గంభీరములు నాగరికములునై విరాజిల్లుచున్న యవి. ఇపుడు నేను పూర్వమువలె గాక నీతిపరుఁడను ఆరోగ్యవంతుఁడను !"
పైన నుల్లేఖింపఁబడిన దినచర్యభాగములనుబట్టి, మామనసున కిపుడు క్రైస్తవమత సంపర్కము కొంత సోఁకినట్టు తేటపడఁ గలదు. కాని, యెపుడైన నేను సంపూర్ణక్రైస్తవమత విశ్వాసి నైనటుల నాకు జ్ఞప్తిలేదు. ఆ మతగ్రంథములఁ గల భక్తిపోషకములగు ప్రార్థనాదుల పోకడలుమాత్రము కొన్ని నే నిపుడు బాహాటముగఁ గైకొంటిని. జీససుమహాశయుఁడు చూపిన రాజమార్గమున నడచుటకు నాభక్తి యిపు డభ్యాసపడెను. ఇదివఱకు వైష్ణవమువలెనే, ఇపుడు క్రైస్తవముకూడ, నాభక్తికాంత ధరించిన వస్త్రవిశేషముమాత్రమె. క్రైస్తవమతాభిమానము నాకు పట్టుపడుటకుఁగల సందర్భము నొకింత నిచట ప్రస్తావించెదను.
'నేను రాజమంద్రికళాశాలలోఁ జేరినది మొదలు, అందలి యుపాధ్యాయులలో నెల్ల శ్రీమల్లాదివెంకటరత్నముగారు నాకుఁ బ్రియగురువు లైరి. మే మపుడు నివసించుకొట్లదగ్గఱ నొక గృహమున వారు కాపుర ముండుటచేత, తఱచుగ నేను వారిని సందర్శించుచు వచ్చితిని. క్రైస్తవుఁడగు నాయన, ఏతన్మతప్రాశస్త్యమునుగూర్చియు బైబిలునుగుఱించియు నాతోఁ బ్రసంగించుచుండువాఁడు. నావిద్యారోగ్యాభివృద్ధులనుగూర్చి యాయన పలుమారు సదాలోచనలు చెప్పెడి వారు. క్రైస్తవమతస్వీకారము చేయుమని మాత్ర మెన్నఁడును వారు నాకు బోధింపలేదు. అంతియ కాదు. కొన్ని సమయములందు క్రైస్తవమతస్వీకారావశ్యకతనుగూర్చి నేను గ్రుచ్చిగ్రుచ్చి యడుగఁగా, పరమాత్ముఁడు కోరునది హృదయపవిత్రతయేగాని, బాహ్యవేషాదులు గావని యాయన నన్ను హెచ్చరించుచుండువాఁడు. గతసంవత్సరమున నాతో కోనసీమ కేతెంచినస్నేహితుఁడు కారణాంతరములచే క్రైస్తవమతస్వీకారము చేసెద నని నన్ను వేధింపఁగా, నేను 4 వ ఆగష్టుతారీఖున వెంకటరత్నముగారియొద్ద కాతనిని గొనిపోయితిని. ఈవిషయమై వారియమూల్యాలోచన లడుగఁగా, ఆయువకుఁడు క్రైస్తవమతస్వీకారము చేయుట కాయన సమ్మతింపలేదు. అంత నేను క్రైస్తవమతమునుగుఱించి నాయభిమానమును మాగురువునకుఁ దెలిపితిని. నేను నిత్యమును బైబిలుపారాయణము చేయుచు, జీససు బోధన ననుసరించి దైవప్రార్థనలు సలుపుచుంటి నని చెప్పినప్పుడు, అట్టివారలే నిజమైనక్రైస్తవు లని నన్ను వెంకటరత్నముగారు అభినందించి, నా కమితోత్సాహము గలిగించిరి.
నే నిట్లు క్రైస్తవమతావలంబకుఁడను గాకున్నను, క్రైస్తవారాధనయు క్రైస్తవాచార సంప్రదాయములును నా కెంతో రుచికరము లయ్యెను. ప్రపంచమున విస్తరిల్లెడి ప్రకృతిశాస్త్రజ్ఞానాదిశుభముల కెల్ల క్రైస్తవమతమే మూలాధార మని నేను నమ్మి, ఏతన్మతస్వీకారము చేసి క్రైస్తవాచారముల ననుసరించినఁ గాని మనదేశమున కైహికాముష్మికములు లే వని విశ్వసించెడివాఁడను ! ఇట్టియూహలలోఁ గొంత సత్య మున్నను, ఇదియే యమోఘ సత్యము గా దని నేను గ్రహించి, మతవిషయమై నామనస్సున మఱికొంత మార్పు నొందినసందర్భ మిఁకఁ దెలిపెదను.
15. రామభజనసమాజ సంస్కరణము
1888 వ సంవత్సరాంతమున మాతండ్రి ఇన్నిసు పేట మధ్యభాగమున నొకచిన్న యిల్లు స్థలమును గొనెను. మఱుసటి సంవత్సరారంభమున మే మచటికిఁ బోయి, దాని కెదురుగ నున్న దేవరకొండవారియింటఁ గాపుర ముంటిమి. చెంతనుండు నొకయింట ప్రతి శనివారమురాత్రియుఁ గొందఱు యువకులు చేరి, రామభజన జరుపుచుండి, నన్ను తమసమాజమున కధ్యక్షునిఁ జేసిరి. రాత్రులు చాలసేపు ఎలుగెత్తి వారు గీతములు పాడుటవలన నిరుగుపొరుగువారల నిద్రకు నెమ్మదికిని భంగము గలుగుచుండెడిది. మాయింట రెండవ భాగమునఁ గాపురముండు నొకయుద్యోగి యొకనాఁడు, "ఈ రామభజన కడు బాధాకరముగా నున్నదే !" యని మొఱపెట్టఁగా, నే నాయనతో వాదమునకు డీకొని, బాలపామరుల కట్టి భజన లాభదాయక మని చెప్పివేసితిని. ఒకటి రెండుమాఱులు మా తండ్రియును రామభజనసమాజమువారిని గుఱించి విసిగికొని, వారితో జోక్యము కలుగఁజేసికొన వలదని నన్ను మందలించెను. అంతకంతకు రామభజనసమాజమువారి పోకడలు నాకును దుస్సహము లయ్యెను. ప్రార్థన సమయమున వారు రామునిపటమును ముందుంచుకొని, దానికి ధూప దీపనై వేద్యములు సమర్పించెడివారు. క్రీస్తుబోధనానుసారముగ మాన