ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/నియమబద్ధజీవితము
నే నిట్లు మరల పాఠశాలలోఁ బ్రవేశించి, విద్యాధోరణిని బడి, నాశరీరదౌర్బల్యమును మఱచిపోఁజూచుచుంటిని. సహపాఠుల స్నేహ సహవాసముల మరగి, లోకము పాపభూయిష్ఠ మని విస్మరించెడి వాఁడను. కళాశాలలో నే నిపుడు వడ్రము నేర్చుచు, కసరతు చేయుచు, సెలవురోజులలో షికారుపోవుచు, శరీరవ్యాయామమును గుఱించి యెక్కువగ శ్రద్ధ వహించియుంటిని. తల్లి యింట నాకుఁ బ్రత్యేకముగ భోజన సౌకర్యము లొనఁగూర్చుచుండెడిది. సద్గోష్ఠి సత్సహవాసములకుఁ దోడు నే నీకాలమున ననుదిన ప్రార్థనములు చేయుట కభ్యాసపడితిని. ఇ ట్లిన్నివిధముల నాయారోగ్య సౌఖ్యములు పెంపొందుటకు సాధనకలాప మేర్పడియుండెను.
13. నియమబద్ధజీవితము
1889 వ సంవత్సరము జూలై 28 వ తేదీని నాప్రియమిత్రుఁడు కొండయ్యశాస్త్రితోఁ గూడి నేను టాడు విరచితమగు "యువజనహితోపదేశము" అనునొక యాంగ్ల పుస్తకమును మిగుల తమకమునఁ జదివితిని. మాబోటి విద్యార్థుల కుపయుక్తములగు ననేక యంశము లిందుఁగలవు. వానిచొప్పున వర్తనప్రణాళిక నేర్పఱచుకొని యాచరణమునకుఁ గడంగినచో, సర్వానర్థకములకును మూలకందమగు ప్రాలుమాలికను పారఁద్రోలి, పాటుపడుట కలవాటుపడి, శ్లాఘనీయముగ జీవిక గడపవచ్చు నని నాకు స్పష్టపడెను. నాఁటినుండియే యేతద్గ్రంథబోధన మనుసరింప నిర్ధారణము చేసికొంటిని. విధికార్య నిర్వహణమందు కాలనియమమును ఖచితముగఁ బాటింపవలయు ననియే యందలి ముఖ్యవిధానము. మఱునాఁడు చేయవలసినపను లీనాఁడే నిశ్చయించుకొని, ఒకచిన్న పుస్తకమునం దవి యుదహరించి, సమయాను గుణ్యముగ వానిచొప్పున నాచరించి, యింక నెన్నిమిగిలెనో పిమ్మట సిరిచూచుకొనవలెను. క్రమముగ నిత్యవిధు లివ్విధమున నెర వేర్చు చుండినచో, సచ్ఛీలత దానియంత నదియే యలవడు నని యిందలి ముఖ్యోపదేశము.
అదివఱకే, అనఁగా 1888 వ సంవత్సరారంభమునుండియు, "దినచర్య" పుస్తకము లుంచునభ్యాసము చేసికొంటిని. ఏనాఁడు చేసిన పనులు, తలంచినతలంపులు, తటస్థించిన మేలుకీడులును, ఆనాఁటి రాత్రియే యీపుస్తకములందు సంగ్రహముగ లిఖియింపఁబడుచుండెను. దైవప్రార్థన, ప్రాత:కాలస్నానము, శరీర వ్యాయామము మొదలగు నలవాటులు చేసికొంటిని. పూర్వోదాహృతపుస్తకపఠన మప్పటినుండియు, నే నదివఱ కవలంబించినపద్ధతి మఱింత కట్టుదిట్టములతోఁ గూడుకొని జరుగుచుండెను. అందువలన నాకిపుడు నియమానుసారజీవిత మేర్పడెను.
ఆదినములలో నానిత్యకర్మానుష్ఠాన మీవిధముగ నుండెను : - ప్రాత:కాలముననే స్నానవ్యాయామము లైనపిదప, నేను ప్రార్థన సలుపుచుందును. అంత "బైబిలు - నూతననిబంధన"లోని మూఁడు నాలుగధ్యాయములు పారాయణము చేయుచుందును. దినపాఠము లన్నియుఁ జదివి, కళాశాల కేగి విద్య గఱచి, అచటనే సాయంకాలము వడ్రము నేర్చు చుందును. శరీరసాధకము చాలనిచో, డుబెల్సుతో కసరతు చేసి, అవశ్యమగు నింటిపని చక్క పెట్టుకొని, రమ్యప్రదేశ మేదేని సందర్శించియో, ఉద్గ్రంథపఠనము చేసియో సాయంప్రార్థనముతో దినకృత్యములు ముగించుచుందును.
ఇట్లు నేను 29 వ జూలైనుండి 12 వ అక్టోబరువఱకును ఏర్పఱుచుకొనిన నిత్యకర్మానుక్రమణపట్టికలు నా రెండవ దినచర్య పుస్తకమునఁ గలవు. ఈ కడపటితేదీనుండి యాపుస్తకమునం దివి యాగిపోవుటకుఁ గారణము, పుస్తకము రెండవవైపునుండి లిఖించిన దినచర్య భాగము అక్కడవఱకును వ్యాపించి యుండుటయే. మచ్చునకు వానిలో రెండుదినముల కార్యక్రమము నిట మల్లేఖించెదను : -
3 వ ఆగష్టు 188
- 1. స్నానవ్యాయామానంతరమున దైవప్రార్థన.
- 2. చలిదిపిమ్మట, తెలుఁగు : ప్రాతకవులు మువ్వురు.
- 3. 1-3 గంటలమధ్య - ప్రార్థనసమాజకార్యము.
4. ఇంగ్లీషుపద్యకావ్యము : ఆర్కేడీసులో 30, ఇల్‌పెన్సి రోజోలో 10, లల్లీగ్రోలో 20 పంక్తులు.
- 5. విద్యార్థి సమాజసభ : అచట నెవనిమనస్సు నొప్పింపక మెలంగుట.
- 6. శరీరవ్యాయామము.
7. ప్రార్థన.
6 వ అక్టోబరు
- 1. ప్రార్థన.
- 2. బ్లాకీనుండి వ్రాయుట.
3. చరిత్రము.
4. గణితము.
5. మిల్టనులో కొంత.
- 6. ప్రార్థన సమాజసభ.
7. వీలైనయెడల, వీరేశలింగముగారి ప్రార్థనసభ కేగుట. 8. మిత్రసందర్శనము.
- 9. ప్రార్థన.
(షరా : - * అనుగుర్తుగల విషయములు, ఆచరింపఁబడినవనుట).
ఇట్లు నే ననుసరింపవలసిన కార్యక్రమము ముందుగ నేర్పఱచికొని, ఆప్రకారము నెరవేర్చితినో లేదో నాఁటిరాత్రియే చూచికొని వలసినచో, చేయనిపనులు కొన్ని మఱునాఁటి ప్రణాళికలోఁ జేర్చు చుండుటవలన, స్వేచ్ఛావిహారవిషయమున నాపాదములకు నేనే సంకెలలు తగిలించుకొనుటయై, నాకు గట్టిబాధ్యతయు జాగ్రతయుఁ బట్టుపడెను ! శరీరవిధులు, పాఠశాలలోని పనులును ఎప్పటి వప్పుడే నెరవేర్చుచుండుటచే, నామనస్సునకు హాయి గలిగెను. నా శీలప్రవర్తనములనుగుఱించిన సంగతులు దినచర్య దిన ప్రణాళికలయందు ఎప్పటి వప్పుడే లిఖింపఁబడుచుండుటవలన, అకార్యకరణమునకు సామాన్యముగ నా కరము లూనుచుండెడివి కావు. ఏనాఁటి లోపపాపము లానాఁటిప్రార్థనయందును దినచర్యపుస్తకములందును సూచింపఁబడుచుండుటచేత, మనస్సునకు మంచి ప్రబోధమును, న్యాయ మార్గానుసరణమున కమితప్రోత్సాహమును జేకూరెను.
14. వైష్ణవక్రైస్తవమతములు
ఎవని మతవిశ్వాసచరిత్రము వాఁడు విమర్శించుకొనునపుడు హృదయ మాశ్చర్యప్రమోదములకుఁ దావల మగుచుండును ! ఏడవ సంవత్సరమునకుఁ బూర్వము దేవునిగుఱించి నాయూహ లెటు లుండెడివో నాకు జ్ఞప్తిలేదు. ఆసంవత్సరమున గోపాలపురమున మేము బసయుండునింటఁ గొంతకాలము అధ్యాత్మరామాయణపారాయణము జరిగెను. శ్రీరాముని వనవాసకథ యాసమయమున నావీనులఁ బడెను.