ఆంధ్ర రచయితలు/విశ్వనాథ సత్యనారాయణ
విశ్వనాథ సత్యనారాయణ
1893
వెలనాఁటి శాఖీయులు. తండ్రి: శోభనాద్రి. జన్మస్థానము: నందమూరు. నివాసము: బెజవాడ. జననము: 1893 సం. గ్రంథములు: నవలలు: 1. వేయిపడగలు 2. చెలియలికట్ట 3. మాబాబు 4. ఏకవీర 5. జేబుదొంగలు 6. హాహాహూహూ 7. స్వర్గానికినిచ్చెనమెట్లు 8. ధర్మచక్రము-ఇత్యాదులు. నాటకములు: 1. నర్తనశాల. 2. సౌప్తిక ప్రళయము 3. అనార్కలి 4. వేనరాజు 5. త్రిశూలము 6. కళింగరాజ్యము-ఇత్యాదులు. పద్యకావ్యములు: 1. ఆంధ్ర ప్రశస్తి 2. ఆంధ్ర పౌరుషము 3. గిరికుమారుని ప్రేమగీతాలు 4. వరలక్ష్మీ త్రిశతి 5. శృంగారవీధి 6. విశ్వేశ్వర శతకము 7. శశిదూతము 8. ఋతుసంహారము 9. శ్రీమద్రామాయణ కల్పవృక్షము మున్నగునవి. పాటలు: 1. కిన్నెరసాని పాటలు. కోకిలమ్మ పెండ్లి, ఖండ కావ్యములు, కథలు, వ్యాసములు మున్నగునవి.
శ్రీవిశ్వనాధ సత్యనారాయణగారిని నవలారచయిత లెఱుఁగుదురు. నాటికాకర్త లెఱుఁగుదురు. ప్రబంధకవు లెఱుఁగుదురు. పత్త్రికాసంపాదకు లెఱుఁగుదురు. ఉపన్యాసకు లెఱుఁగుదురు. విమర్శకు లెఱుఁగుదురు, సనాతను లెఱుఁగుదురు. సంస్కర్త లెఱుఁగుదురు.
సత్యనారాయణగారు నేఁటి యాంధ్ర సారస్వతమున విశిష్టస్థానము నాక్రమించిన రచయిత. వీరికి నవీన వాఙ్మయముపై నెంత యభిమానమో, ప్రాచీన సాహిత్యముతో నంత యభినివేశము. వీరి కవిత్వములో నాముక్తమాల్యదా కాఠిన్య ముండును; పెద్దనగారి ముద్దు పలుకుల పొందికయు నుండును. ప్రాయికరచన గ్రాంథికము, వ్యావహారికము నిషిద్ధము కాదు. నవ్యకవుల ఖండకావ్యముల ధోరణి చక్కగా సాగింతురు. గేయములు హాయిగా వ్రాయుదురు. శతకములు వ్రాసిరి. నేఁడు రామాయణము మహాప్రబంధముగా రచించుచున్నారు. ఆంధ్ర భాషోద్ధారకులలో "కాశీనాధునివా" రెట్టివారో., ఆంధ్ర భాషా కవులలో విశ్వనాధవా రట్టివారు. నాగేశ్వరరావుగా రాంధ్ర సాహిత్య పరిషత్తును గౌరవించిరి; నవ్యసాహిత్యపరిషత్తు బహూకరించిరి; కాంగ్రెసుతోఁ గేలు గలిపిరి; మఱియొక పక్షమును మర్యాద చేసిరి. మంచియే వారి కుపాద్యము. 'విశ్వనాధ కవికిని సనాతనాధునాతన కవితలయందు సమభావమే. కాశీనాధునివారు శైవమావలంబకులు, విశ్వనాధ వారి 'త్రిశూలము' దానికిఁ దార్కాణము.
కవి వివిధవిషయ నివిష్టబుద్ధి కావలయును. అట్టివారు నేఁటికవులలో లెక్కకు మాత్రమే కలరు. వారిలో సత్యనారాయణ గా రొక్కరు. నేఁడు ప్రాచీనకవితలను 'హుష్' అనువారు కొందఱును, నవీన కవిత్వమును 'అబ్బే' యనువారు కొందఱును. వారికి రసాస్వాదకులలో గణన యుండదు. సారన్య మెచట నున్నదో యరసి దాని నాస్వాదించుట రసికధర్మము. పూర్వ - నవ్య విచారణముతో నతనికిఁ బనియుండరాదు.
పద్యము వ్రాయు కవి గద్యము వ్రాయలేకపోవచ్చును. గద్యము రచించు కవికిఁ బద్యము సాగకపోవచ్చును. నాటకకర్త విమర్శనశక్తి కలవాఁడు కాకపోవచ్చును. సర్వతోముఖ సమర్థత కలవాఁడు దీక్షతో గ్రంథములు వ్రాసి లోకమున కందీయఁ జాలక పోవచ్చును. ఇవన్నియుఁ బట్టినవాఁడు సమగ్ర కళాప్రపూర్ణుఁడైన జాబిల్లి వంటివాఁడు. సత్యనారాయణగారు నవలారచయితలలో నేఁడు మంచిపేరు సంపాదించుకొన్నారు. ఆయన 'వేయి పడగలు' మెచ్చుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయము వసదన మిచ్చినది. విశ్వవిద్యాలయముమెప్పు మనకక్కఱలేదు. అది యొక 'నవల' మాత్రము కాదు. ఆంధ్ర విజ్ఞానసర్వస్వమునకు మాఱుపేరుగా వెలసిన గ్రంథము. దానిలో సత్యనారాయణగారి సారస్వత-సాంఘిక సిద్ధాంతము లన్నియుఁ గరడుగట్టి యున్నవి. గొప్ప యెత్తుగదతోఁ గడదాక సూత్రవిచ్ఛిత్తి సేసికోకుండఁ జూచుకొనుచు నిట్టి మహత్తరగ్రంథము సంధానించుట బహుకష్టమైన కృషి. ఈ కృషిలో వీరి ప్రాపంచిక విజ్ఞానము పంట పండినది. సత్యనారాయణగారి వచన రచనలో నొక క్రొత్తదనము, చిక్కఁదనము గోచరించును. తిక్కన పద్యరచనలో వలె వీరి రచనలోఁ గ్రియాపద బాహుళ్యము ఎక్కడికక్కడ భావము తెగిపోయి పాఠకునిలో మెల్ల మెల్లగాఁ జొచ్చుకొనును. ఈయన భావన యగాధమైనది, దానిని భాషలోఁ బెట్టునపుడు కొంత క్లిష్టత యనివార్యము. 'పాషాణపాకప్రభువు' అను ఖ్యాతి సత్యనారాయణగారికి వచ్చుటలో నర్థ మున్నది. ఆయన శిరీషకుసుమ పేశలముగా వ్రాసికొని పోవుచుఁ, బట్టరాని భావనాపథమునఁ బడినపుడు బ్రహ్మాండమువంటి సమాసము లుపయోగించిరి. ఆ యుపయోగము ప్రయత్నించి తెచ్చుకొన్నది కాదు. ఆయన కది యాజానజము. పద్య-గద్య రచనలు రెండింటను వీ రీయాచారముతో సాగుదురు. గమనింపవలసిన దేమనఁగా, పాఠకుని నిలఁబడనీయకుండ లాగుకొనిపోవు శక్తి వారి వచనములోఁ బ్రచురముగా జాలువారు చుండు ననుట. ఈ ధోరణిలో 'వేయి పడగలు' గాక మఱి తొమ్మిది పది నవలలు వీరు రచించిరి. 'చెలియలి కట్ట' సాంఘికము. 'ఏకవీర' పై నవలల యెదుటఁ బసిబిడ్డయే, కాని విశ్వనాధవారి 'నవలా' సంతానములో నిది మెఱికవంటి రచన. చరిత్రాత్మకమైన యీకూర్పులో అప్రసిద్ధములై యణఁగియున్న దేశమర్యాదలు పెక్కు పేర్కొనఁబడినవి. ఆంధ్రుల పరిపాలనము, వారి ప్రతిభ యిందు రమణీయ దృశ్యముగాఁ గనఁబడును. కథాసంవిధానము, పాత్రపోషణము గొప్పవి. 'ఏకవీర' లో సందర్భోచితముగా వర్ణితమైన కూచిపూఁడి భాగవతుల భామ కలాపము, గొల్ల కలాపము సత్యనారాయణగారి ప్రాచీన కళాభిజ్ఞతకు గుఱుతులు. 'ఏకవీర' యే విశ్వనాధవారికి 'నవలా'కారులలో కురిచీ వేయించి కూర్చుండఁ బెట్టినది. తరువాత వేయి పడగలతోఁ బ్రధానపీఠాలంకరణము. ఈ విషయమునుఁ గొందఱు భేదాశయు లుండవచ్చును ! 'చెలియలి కట్ట' లో రత్నావళిని సాహిత్య వేదినిగాను గవయిత్రిగాను వీరు చిత్రించిరి. శాస్త్రి రత్నావళికిఁ జదువు చెప్పెనని చెప్పుచు ఆంగ్లకవులు, ఆంధ్రకవులు, వివిధకావ్యములు మున్నుగా నెన్ని సంగతులో జోడించిరి. ఏదో విధముగాఁ బ్రతికథనమునను సాహిత్య వాసన యనుబంధింపఁ జేయుట వారి యలవాటు. వేయి పడగల లోని ధర్మారావు మహోత్తమాదర్శములుగల భాషావేత్తగాఁ జిత్రితుఁడు. అతఁడు ఆముక్తమాల్యద - పాండురంగమాహాత్మ్యము, భాగవతము మున్నగు తెలుగు గ్రంథముల మీఁద లోతయిన చర్చలు చేయును. విగ్రహారాధనము, స్త్రీ స్వాతంత్ర్యము మొదలయిన సమస్యలెన్నో యిందు విమృష్టములు. ఆయా సిద్ధాంతములు ప్రదర్శించునపుడు సత్యనారాయణగారి కలము మంచి మెలఁకువతోఁబొలపముగా సాగును.
విశ్వనాథవారి నాటకములలో 'నర్తనశాల' కు మంచిపేరు వచ్చినది. ఉత్తరా పాత్ర ప్రవేశ మీ నాటకమున కొక మెఱుఁగు తెచ్చినది. క్షేమేంద్రుని మెప్పింపఁగల యౌచిత్యశోభ సత్యనారాయణగారి రచన కందినది. అనార్కలీ, వేనరాజు, త్రిశూలముం మధుర నాటకములు. 'త్రిశూలము' ప్రారంభమున వీ రిటులు చెప్పుకొనిరి.
నన్ను నెఱుఁగరొ ! యీ తెల్లనాఁట మీరు
విశ్వనాధ కులాంబోధి విధుని బహు వి
చిత్ర చిత్ర ధ్వని బహు విచ్ఛిత్తి మన్మ
హాకృతి ప్రణేత సత్యనారాయణకవి.
నాటక నవలా రచనలలో నందెవేసిన యీ చేయి పద్యకావ్యరచనలోఁ గూడఁ బటుతరమైన పదవి నందుకొనఁ గలుగుట విశేషము. సత్యనారాయణగారి ఆంధ్రప్రశస్తి, ఆంధ్రపౌరుషము తొలినాళ్ళలోఁ బారాయణ గ్రంథములుగా నుండెడివి. ఎందఱికో యందలి పద్యములు కంఠస్థ ములు. జాతీయ కవితాశాఖనధిష్ఠించి కూసిన కలకంఠములలో విశ్వనాధకవి తొలివాఁడో, మలివాఁడో !
గోదావరీ పావనోదార వాఃపూర
మఖిల భారతము మాదన్ననాఁడు
తుంగభద్రాసముత్తుంగ రావముతోడ
కవులగానము శ్రుతి గలయునాఁడు
పెన్నానదీ సముత్పన్న కైరవదళ
శ్రేణిలోఁ దెన్గు వాసించునాఁడు
కృష్ణా తరంగ నిర్ణిద్రగానముతోడ
శిల్పమ్ము తొలిపూజ సేయునాఁడు
అక్షరజ్ఞానమెఱుఁగదో యాంధ్రజాతి?
విమల కృష్ణానదీ సైకతములయందు
కోకిలపుఁబాట పిచ్చుకగూండ్లు కట్టి
నేర్చుకొన్నది పూర్ణిమా నిశలయందు
'వేంగిక్షేత్రము' పురావైభవము తలఁచుకొని విశ్వనాధకవి గుండె జల్లుమన్నది. ఆర్ద్రమానసుఁడైన కవి కార్చిన వేఁడి కన్నీళ్ళు కరళ్ళుకటి యిట్టులు పద్యము లయినవి.
సీ. ఏరాజు పంచెనో యిచట శౌర్యపుఁ బాయ
సమ్ములు నాగుల చవితినాళ్ళ
ఏ యెఱ్ఱసంజలో నెలమి పల్లవరాజ
రమణులు కాళ్ళఁబారాణులిడిరొ,
చిత్రరధ స్వామి శ్రీరథోత్సవములో
తెలుగు పిల్లలు కత్తి త్రిప్పిరెపుడొ,
యే రెండు జాముల యినునివేఁడిమి వచ్చి
కలసి పోయెనొ త్రిలింగ ప్రభువుల
నాజగచ్ఛ్రేయసంబులై యలరు తొంటి
వేంగిరాజుల పాదపవిత్రచిహ్న
గర్భితమ్మైన యీ భూమి ఖండమందు
నశ్రువులు జార్త్రు జీవచ్ఛవాంధ్ర జనులు.
ఇట వేఁగీశుల పాదచిహ్నములు లెవే! లేవుపో! భావనా
స్ఫుట మూర్తిత్వమునైనఁ బొందవు నెదో పూర్వాహ్ణదుష్కాలపుం
ఘటికల్ గర్భమునం దిముడ్చుకొనియెం గాఁబోలు నీపల్లెచో
టట లోకాద్భుతదివ్యదర్శనమటే యాభోగ మేలాటిదో!
సీ. ఈ నాపదార్పితక్షోణి నేరాజు ధ
ర్మాసనంబుండి స్మృత్యర్థం మనెనొ,
ఈ నా దృగావృతంబైన భూములలోన
నే శౌర్యధనులు శిక్షింపఁబడిరొ,
ఈ నాశరీరమం దివతళించిన గాలి
యెంత పౌరాతన్య మేచుకొనెనొ,
ఈ నా తనూపూర్ణమైన యాకాశమ్ము
నే క్రతుధ్వనులు శబ్దించినదియొ
అస్మదజ్ఞాతపూర్వదివ్యత్వ మొప్పు
నీ వునీతావనీఖండ; మిచట నిలచి
యస్వతంత్రత దొరలు నాయాంధ్రశక్తి
నన్నుఁ గంపింపఁ జేయుచున్నది భృశమ్ము.
ఈ రకమైన కవితాశయ్య భావులకుఁ గాని దొరకని భావపటుత్వము కలది. అన్వయములోఁ గొంత కఠినత, పదప్రయోగములోఁ గొంత బిగువు నుండుటచే 'విష్ణుచిత్తీయ' పాకము వలె వీరిది సుఖము మరిగిన సుకుమారులకు ఆపాతమధురముగా నుండఁజాలదు. సత్యనారాయణ గారు సంస్కృతవాణి యెంత స్వాధీనముఁ జేసికొని వాడుదురో, జాను తెనుఁగు కూడ నంత ప్రీతితో వాడఁగలరు. "మూగనోము" నుండి రెండు పద్యములు : --
బియ్యపు గింజలన్ జిగురు పేడిన గందవు వచ్చి బొట్తుతో
తియ్యని చిన్ని నీ నొసలి తీరులు కుంకుమ తీర్చి ముంగిలన్
తొయ్యలి! నోము చాఱికలతో పనపాడిన ముద్దరాలు నీ
పయ్యెద వ్రాల నీవు నతి పట్టిన దీవన లీయఁ జూచెడున్!
నీ తెలిపట్టు చీర మెయి నీడలు పారి ముసుంగు నంజ క్రొం
బూతల తెల్ల లే మొగిలుపోలిక వాలిక గాలిఁ దూలిపో
నేత బెడంగు కుచ్చెలలు నీ చిఱుకాళుల ముద్దు తోఁచెనో,
లేఁతపొరాడు పయ్యెద చలించిన పచ్చని తాళి తోఁచెనో!
ఈతీరుగా 'విశ్వనాథ' కవి కవితాహేతి రెండువైపుల వాఁడి కలది. శృంగారవీధి - శశిదౌత్యము - ఋతుసంహారము ఇత్యాదులలోని కవితారీతిలో నీ రెండురకములైన రచనలు కనఁబడుచుండును. ఈయన వ్రాసిన యెన్నో కావ్యఘట్టములు భట్టి కావ్యమును జ్ఞప్తికిఁ దెచ్చు ప్రయోగములతో నిండియుండును. నేఁటి - నాఁటి సాధారణ కవులు, అసాధారణ కవులు కూడ వీరివలె ప్రయోగ వైచిత్రీ వ్యామోహము కలవారు తక్కువ దాక్షిణాత్యులవలెఁ బ్రియతద్ధితులు వీరు. రామాయణ కల్పవృక్షము చూచి చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగా రన్నారఁట చమత్కారమునకు : "ఈ గ్రంథమునకు వైశ్వనాథ సాత్యనారాయణీయ - మని పేరు పెట్టుట బాగుగనుండు" నని - రామాయణ పీఠికలో వీరు వ్రాయుచున్నారుగదా,
నన్నయ్యయుఁ దిక్కన్నయు
నన్నా వేశించిరి పరిణాహ మనస్సం
ఛన్నత వారలుపోయిన
తెన్నున మెఱుఁగులను దీర్చి దిద్దుచుఁ బోదున్.
నన్నయ తిక్కనల యొరవడి సత్యనారాయణగారి కవితకు శయ్యాసౌభాగ్యములోనా ? భావనావైభవములోనా ? యని మనసంశయము. అక్కడక్కడ నన్నయ్య తిక్కనల నడకతో నున్నకొన్ని పద్యములున్నవికాక ! మొత్తముమీఁద సత్యనారాయణగారి కవితాశయ్యకు రామకృష్ణుఁడు - కృష్ణరాయలు - శ్రీనాధుఁడు - నాచన సోమనాధుఁడు వీరే యాదర్శ కవులుగాఁ దోఁచెదరు. ఇఁక, భావనా వైభవములో వీరి దొక ప్రత్యేకత. "దీపితాలాతమువొలె నామది విలంబన మోర్వదు నిత్యవేగి నాచేతము శబ్దమేరుటకుఁ జిన్నము నిల్వదు భావ తీవ్రతన్" అని రామాయణ పీఠికలో. ఇంత భావతీవ్రతగల కవి శబ్దము లేరుకొని శైలియే పరమార్ధ మనుకొన లేఁడు. అది యటుండె,
శ్రీ సత్యనారాయణగారి కవితా గురువులు చెళ్ళపిళ్ళవారు. వేంకట శాస్త్రిగారిని గూర్చిన యీకవి హృదయము మహోదారమైనది.
తన యెదయెల్ల మెత్తన కృతప్రతిపద్యము నంతకంటె మె
త్తన తన శిష్యులన్న నెడఁదం గల ప్రేముడి చెప్పలేని మె
త్తన యయి శత్రు పర్వత శతారము సత్కవి చెళ్ళపిళ్ళ వేం
కన గురువంచుఁ జెప్పికొనఁగా నది గొప్ప తెలుంగునాఁడునన్.
అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం
డలఘుస్వాదు రసావతార ధిషణా హంకార సంభార దో
హల బ్రాహ్మీమయమూర్తి శిష్యుఁ డయినా డన్నట్టి దావ్యోమపే
శలచాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళవంశస్వామి కున్నట్లుగన్.
ఈ రెండవపద్యములో సత్యనారాయణగారి కవితాహంకారము రూపము కట్టియున్నది. ఈ అహంకారము వాస్తవమైనదే కాని, యుండరానిది కాదు. సత్యనారాయణగారి 'అహం' కారము కేవల కవితాపరము, లౌకికము నగు నర్థము కలదికాదు. ఆయన సత్యమైన 'అహం' పదార్థ జిజ్ఞాసకల వ్యక్తి. రామాయణ కల్పవృక్షము బాలకాండాంతమున నిట్లు విశ్వేశ్వర ప్రార్థనము చేసినారు.
అమరీ కైశిక పారిజాత కుసుమోహస్వాదు వీబాలకాం
డము నీ భక్తుఁడు శోభనాద్రి దగు సంతానంబు జన్మాద్యపా
యము తప్పించుత ! యెన్ని పుట్టువుల పెట్టైతిన్ శివా ! యేమికా
మము? కోపం బదియేమి ? యేమియగునీ మాత్సర్యమోహో, ప్రభూ !
ఇది మెచ్చెదరో మెచ్చరొ
యిదియును జదివెదరు చదువరేలా నాక
య్యది ? నాయెద మీతో రా
చెద నద్దానికి ఫలంబుఁ జెందించు శివా !
హాళిఁ జరించుఁ గావ్యరచనాత్త యశఃకృత నాకసౌఖ్య వాం
ఛా లులితంపుటాత్మయె పొసంగదు నాదెసఁ బొందుగాక ము
క్త్యాలధరాధినాయకుఁ డదంతయు; నాతపమెల్లఁ బండి యు
ద్వేలజనూరుజావితతి విచ్చెడినట్టు లనుగ్రహింపవే !
ఈవిధమైన కోరికతో 'విశ్వనాథ' కవి రామాయణము రచించుచుండె ననఁగా నది వట్టి కావ్యమాత్రము కాదు, రసాఖండమైన మహాకావ్యమునుగాదు, ఆధ్యాత్మిక తత్త్వమునకు మహాభాష్య రచనయే కాఁగలదు. "కృతిచే సమాత్తమగుఁ గీరితి స్వర్గ, ద మంతె; నేవరింపను స్వర్గం బతిరూక్ష చింతనాగ్రస్థిత తేజము శివు@డు నన్నుఁ జెందెదుఁ గాతన్!" అన్నవాంఛ యుత్తమ జాతి మహాకవికిఁ గాని పొదమదు. "అనృషి కావ్యము రచింపలేఁ" డను మాటవరుసకు నిట్టి సందర్భములో నెంతో వ్యాఖ్య చేయవలసి యున్నది ! ఇపుడు వలదు, అందరు రచయితల నుండి కొన్నిపద్యములేఱి పాథకుల ముచ్చటకై యిచ్చుట యీ రచనలోని యాచారము. ప్రసంగములో సత్యనారాయణగారి పద్యములు మున్నేకొన్ని యెన్నితిని. వారి ప్రత్యక్షరము నెన్నఁదగ్గదే యైనను 'రామాయణ కల్పవృక్షము' నొక కొమ్మ దులిపి కొన్ని పూలు రాలిచెదను.
క. పరసుఖ దశా పరీపా
క రామణీయక మెఱుంగుఁ గచసాన్నిథ్యా
త్తరమణఁ బ్రథమ స్పర్శ
ప్రరూఢి మెడవొలిచె సూత్రబంధనవేళన్.
గీ. కరరుహంబులు చర్మంబు గాకపోయె
నవియుఁ బులకించునేమొ ప్రియగళాత్త
మైన స్పర్శసుఖా ప్తిఁ బ్రియాగళంబు
నంటి బాధించు వీని కేలా ! సుఖంబు.
క. తలఁ బ్రాల వేళఁ బడచును
నలఘుచ్ఛవి నెగురు ముత్తియంబుల మిషచే
నలుకేళకుళులు వొలిచెను
నలుగురు దంపతులు మోహన స్తంభములై.
గీ. నాలుగవ పాలుగా నింద్రనీలమణులు
మణులు కలియంగఁ బోసిరో యనఁగ బొలిచె
ముత్తెములు చతుర్దంపతి ముగ్ధతను స
మా త్తనీల రక్తచ్ఛవుల్ హత్తుకొనఁగ.
గీ. అలుపములు రెండు మూఁడు ముత్యాలు నిలిచి
సీత పాపటలోఁ జిఱు చెమట పోసె
హత్తుకొని గంధపూఁత ముత్యాలు రెండు
రామచంద్రుని మేనఁ దారకలు పొలిచె.
మ. పది దోసిళ్ళకు నొక్క దోసిలి త్రపాపర్యంతమై,సేసబ్రా
లొదిగించెన్ జనకాత్మజాత పతిపై నొయ్యారపున్ లజ్జయున్
జదురౌ తొల్తటి మెట్టు డిగ్గుచుఁ ద్రపాశైథిల్య మార్గంబునన్
బెద రావేళకుఁ దీరినట్టి కనులన్ వీక్షించుచున్ రాఘవున్.
ఆ॥వె. చంద్ర రేఖపైని సన్నని తెలిమొయి
ళ్లాడినట్లు ముత్తియమ్ములాడెఁ
దల్లిమేనిపైని నల్లనియాకాశ
మట్లు రామచంద్రుఁ డందె యుండ.
ఉ. అల్ల వివాహమండపమునై చనుచోటికిఁ జిత్ర చిత్రముల్
కొల్లలుగాఁగ వచ్చె వెలుఁగుల్ వెసఁ బెండిలివారలెల్ల ద్వా
ర్వేల్లితదృష్టులై చినుకు వెక్కసమౌ చిఱు జల్లువానలో
ఫుల్లవిచిత్రవర్ణములు పూవులు చూచిరి లంబమాలలన్.
క. ప్రతి చైత్త్రశుద్ధ నవమికి
వితతంబుగఁ దెలుఁగునేల విరిసెడుజల్లుల్
సితముక్తా సదృశంబులు
ప్రతనులు తలఁబ్రాలవేళ వచ్చెఁ జిటపటల్.
సత్యనారాయణగారి కిన్నెరసాని పాటలు తెలుఁగునాటఁ బ్రాకినవి. సభలలో నాయన యుపన్యాసము చెప్పి యూరకున్న తరువాతనో నట్ట నడుమనో సభ్యులలో నెవరో లేచి కిన్నెరసాని పాటలు పాడవలయునని శాసింతురు. ఆయన వీలుగా నున్నచోఁ బాడుదురు. లేనిచో కస్సుమందురు. 'విశ్వనాథ' కవి యుపన్యాసవాణి పటుత్వము కలది. అధ్యక్ష్యము వహించుటకుఁ గగిన బిగువు వారిలో నున్నది. "విప్రుని యలుకయుఁ దృణహు తాశనంబు దీర్ఘమగునె!" ఈయెఱుక కలవానికి సత్యనారాయణగారు వెన్న వంటిహృదయము కలవారు. ప్రస్తుతము వారియుద్యోగము బెజవాడ కాలేజీయందు. ఇదివరలో రెండు మూఁడు సారులు స్వాతంత్ర్యవాంఛా ప్రభంజనము రేగి కొన్ని యుద్యోగముల నూదివైచినది. మహోదారము, స్వతంత్రమునైన హృదయముగల సత్యనారాయణగారు ఎమ్. ఏ. పట్టభద్రులయినా రన్న విషయము కొందఱు సనాతను లెఱుఁగరు. సభావేదిక మీఁద నాయన మాటాడునపుడు సాధారణముగా నాంగ్లవాసన వేయనీయరు. శుద్ధ శ్రౌతి - కర్మిష్ఠి లోకజ్ఞత గలిగి సంభాషించుచుండెనా యనుకొందుము. సత్యనారాయణగారు శ్రౌతధర్మములు పెక్కులు తెలిసికొనిరి. స్మార్తము పాఠము జెసిరనియు వినుకలి. ఇన్ని యర్హతలు గలవా రాధునికులలో "ద్విత్రాఃపంచషావా."
నన్నయభట్టారకుని యక్షరాక్షరము సత్యనారాయణగారు పరిశీలించి "ప్రసన్న కథాకలితార్థయుక్తి" - "నానారుచిరార్థసూక్తినిధి" అనువాని నాధారముగాఁ దీసికొని 'భారతి' లో వెలువరించిన యమోఘవ్యాసములు వీరి లోఁతుగుండెకు సూచికలు. 'అమృతశర్మిష్ఠ' యని పేరుపెట్టి శర్మిష్ఠాయయాతి చరిత్రము వీరు సంస్కృతభాషలో నాటకముగా సంతరించిరి. వేయిపడగలుగా విప్పారుకొన్న సత్యనారాయణ గారి ప్రతిభావ్యుత్పత్తులను గుర్తించి 'కవిసామ్రాట్' బిరుదము నిచ్చి మెచ్చుటయు, గజారోహణోత్సవము గావించుటయుఁ దెనుఁగుభూమి చేసిన ఘనకార్యములు !