ఆంధ్ర రచయితలు/కట్టమంచి రామలింగారెడ్డి
కట్టమంచి రామలింగారెడ్డి
1880
పాకనాటిరెడ్డి. తండ్రి: సుబ్రహ్మణ్యరెడ్డి. జన్మస్థానము: కట్టమంచి. నివాసము: చిత్తూరు. జననము: 1880. రచనలు: 1. కవిత్వతత్త్వవిచారము 2. వ్యాసమంజరి 3. ముసలమ్మ మరణము 4. నవయామిని (ఖండకావ్యములు) ఇత్యాదులు.
ఒకజాతీయ నాయకుడుగా, అంతర్జాతీయ రాజకీయ వేత్తగా నుండు వాని ప్రశస్తి రామలింగారెడ్డిగారి కున్నది. రచయితగా ఆయనకు గల ప్రసిద్ధియు జక్కనిది. రెడ్డిగారు తెలుగువారే కాని, ఆంగ్లభాషా కోవిదులైన భారతీయు లేపదిమందిలోనో యొకరు. ప్రభుత్వము బహుమాన వేతన మీయగా 'ఇంగ్లండు' నకు బోయి పాశ్చాత్యశాస్త్ర తత్త్వము పుడిసిలించి వచ్చిన పండితు లీయన. ఖండాంతరములలో నున్నను, తెలుగుగలకండపుదీపి మఱచిపోయినవాడు కాడు. అది మన విశ్వవిద్యాలయపు భాగ్యము. రాధాకృష్ణపండితుడు 'ఆక్సుఫర్డు' లో వేదాంత విద్యాగురుత్వము వహించుచున్నను, కాశీ విశ్వకళా పరిష దుపాధ్యక్షతా పదవిలో నున్నను, రష్యా రాయబారిగా నున్నను ఆంధ్ర జనయిత్రి కడుపు చుమ్మలువాఱ గన్నబిడ్డడే!
మన రామలింగారెడ్డిగా రేండ్లతరమున బాశ్చాత్యదేశమున నున్నవారేయైనను మానసములో మాతృపూజ మానలేదు. కళాపూర్ణోదయ కథా సంవిధాన సమీక్ష చేయుచునే యుండెడివాడు. "కవిత్వ తత్త్వవిచార" బీజము లప్పుడే యీయన హృదయక్షేత్రమున బడినవి. పింగళి సూరనార్యునితో గట్టమంచి కవికి బ్రహ్మాండమంత మైత్రి. అందువలననే యతనిలో బొరపాటులని తోచినవి మొగమోటమి లేకుండ మొగముముందఱ జెప్పివైచుటకు సాహసము. ఇది కొంద ఱకు మోటుగానుండును గాని, కవితావిమర్శకున కుండవలసిన లక్షణములలో నిదియొక మంచి లక్షణము. ఆయన విమర్శనములో బాశ్చాత్య సంస్కారవాసన పాలు చాలగా గనుపట్టుచుండును. అట్టులని, వారి సంస్కృతులన్నియు నితడు సహింపనేరడు. సహ్యముగాని శృంగారవర్ణనములు చేయుటను రామలింగారెడ్డి రోయును. ఈత్రోవకు గుఱిగాని వారొక భారత కవులే. వారిలోను 'కవిబ్రహ్మ' రెడ్డిగారి దృష్టిలో విశిష్టుడు. "ఆంధ్రలోక పరిశుద్ధ తపఃపరిపాక రూపుడు - కవితాప్రపంచరవి" తిక్కన, యేయట. తిక్కన 'కడిది యశః కాంతివలన వ్యక్తములైన విశేషములతో కవిత్వ తత్త్వ విచారము వీరు విరచించిరట. ఈతత్త్వవిచారములో దేలిన సిద్ధాంతములపై రాద్ధాంతములు వెలువడక పోలేదు. అగుగాక! కట్టమంచి రచయిత యేసమీక్షయైనను నిష్పాక్షికమై నిశితమై యుండుననుట నిర్వివాదము. రాజకీయముగా గూడ రెడ్డిమాటలు సూటిగా, వేడిగా నాటుకొనుచుండును.
జాతీయ కవితాభిమాని యగు రెడ్డియూహలో వేమనకవి కారణ విమర్శనశక్తికి బట్టాభిషేకము చేసిన మహాత్ముడు, ప్రతిభాశాలియునగు మహాకవి. "ప్రకృతి యనగా మనవారి కనేకుల నిఘంటువులలో నుండు ప్రకృతియేగాని, మూలింటికిబయటనున్న ప్రకృతియెట్టిదో తమసొంత కన్నులతోడ జూచిన పాపమున బోరు. అట్టివారికి వేమన యనుసరణీయమైన త్రోవచూపినా డనుటలో నించుకయు గుణాధిక్యస్తుతి లేదు" ఇది కట్టమంచి విమర్శకుని వాజ్మూలము. ఈ రచయిత అర్థశాస్త్రము నాంధ్రీకరించి యాకృతి స్మరణీయ యగు ప్రేయసి కొసగినాడు. దానికొఱకై వ్రాసిన యంకితపద్యములు పదో పండ్రెండో. అన్నియు జక్కనివీ. ఒక్కటిమాత్రము వ్రాసెదను.
కల్లోల మాలికాకరముల వీచుచు
నెలు గెత్తి పిలిచెడు జలధినుండినిండార నెఱపిన పండువెన్నెల దాగి
నవ్వుచు నాతోడ నభమునుండి
గుసగుసల్ వోపుదు కోర్కిమై సురభి శీ
తల మంద మారుతావళుల నుండి
తేనెల దాపుల జానగు పువుల హి
మాశ్రు లుర్లగ జూచె దవనినుండి
ఛట ఛట రవరాజి ప్రుస్ఫుటముగ్గాగ
ననుచితము సేయ గోపింతు వగ్నినుండి
సకల భూత మయాకార సార మహిమ
నీవు లేకయు నాకు నున్నా వెపుడును.
*
'నవయామిని' రామలింగారెడ్డిగారు 1936 లో రచించిన ఖండకావ్యము. ఇది బిల్హణీయ కావ్యమునకు మార్పుచేసిన కథాసందర్భముగల కృతి. ప్రాచీనకావ్యమగు బిల్హణీయము అనాదరణీయమైన కావ్యమనియు, మంచిదికాదనియు, కల్పన సత్యమునకు నైజమునకు విరుద్ధమనియు రెడ్డిగారి యభిప్రాయము. ఆకథ నంతను సొంతయూహతో మార్పుచేసి "నవయామిని' కూర్పులో బ్రదర్శించినారు. రెడ్డిగారి భావాంబరవీధి విహరించు యామినీ బిల్హణుల ప్రకృతు లివ్వి:-
1. బిల్హణుడు:- పండితుడు. వయస్సు చెల్లినవాడు కాకున్నను కొంతవఱకు ముదిరినవాడు. ధర్మబుద్ధి నిగ్రహశక్తి ఏమాత్రములేని విషయలోలుడుకాడు. నిజశీలము చలితమయ్యె నేని పునరాలోచనమై సమర్థించుకొన జాలిన నిగ్రహపరుండు.
2. యామిని:- వయస్సునను, వర్తనమునను ఆర్య. పరిశుభ్ర మనోగతి గలది. సచ్ఛీల. గయ్యాళి కాదు. మృదుత్వము స్థిరత్వము కలిసిన హృదయము కలది. భావములు వెన్న. పల్కులు తేనెలు. ధర్మసంకల్పము వజ్రము వంటిది. ఈ ప్రకృతులు గల నవయామినీ-బిల్హణులతో నీ కావ్యము రెడ్డిగారు సంతరించిరి. కథానిర్మాణము ప్రకృతము మనము చూడవలదు. ఆయన కటులు తోచినది. పూర్వపు బిల్హణీయకథ యనౌచితీ దుష్టమని యాయన నమ్మినాడు. కాదుకాదని విమర్శకులు వాదములు చేయుచున్నారు. పోనీ! అందలి కవితావైభవమెట్లున్నది! ఈ ఖండకృతిలో మొత్తము ముప్పది పద్యములకంటె మించిలేవు. కాని, మంచి కండగల రచన.
పరవశుడగాక యిన్నేండ్లు బ్రతికి నేడు
నాకు నీవశంబగుట సంతనమ కాని;
కాఱుతప్పి, కాలము సెడి కర్షకుండు
విత్తు చల్లిన ఫలమున్నె? వెఱ్ఱిగాదె?
*
నీవు మనోజ్ఞ మూర్తివి, వినిర్మల కీర్తివి జ్ఞానమందు వి
ద్యా విభవంబునందు బరమాద్భుతశక్తిని ; నాకు జూడగా
దైవము, దండ్రియున్, గురువు,దల్లియు నీవ నఖుండవున్ సదా ;
కావున సాహసించితిని కర్మము ధర్మము పూని తెల్పగన్.
నీప్రతిబింబమగద నే
నో పావనమూర్తి, కినియనోపుదె నాపై
నీషోషించిన లతికను
నీపట్టున నలరనిమ్ము నిర్మల నియితిన్.
*
చిఱునవ్వు రేకుల జెన్నారు మొగము దా
మర సౌరభము మది కరగ నాని
కలికి తనము మీఱ దెలివి మెఱుంగుల
జెలగించు కనుల కాంతులకు దలరి నవ్యముల్ హృద్యముల్ నర్మగర్భితములౌ
తళుకు పల్కుల తీపి దవిలి చిక్కి
మనసు మైనము చెంద మచ్చుమాయల జల్లు
తెలియని ముగ్ధ చేష్టలకు బ్రమసి
బుద్ధి వెనుకకు జిత్తంబు ముందునకును
బోవు భిన్నత శాంతి గోల్పోయి, తగును
దగద యను నిలుకడ లేమి దాల్మి వొలియ
గోర రాదని తెలిసియు గోరినాడ
జేర రాదని తెలిసియు జేరనాడ.
*
మెత్తని, తియ్యని, చల్లని
చిత్తము, జిఱునవుల రుచులు, సిగ్గు మొగము, గ
న్నెత్తని రూపము, హృదయో
న్మత్తత గలిగింప నిట్టి మాటలు ప్రేలెన్.
*
రెడ్డిగారి రచనలలో 'ముసలమ్మ మరణము' నకు మంచి యశస్సు వచ్చినది. ఈ చిన్న కబ్బము చెన్నపురి క్రైస్తవ కళాశాలకు సంబంధించిన ఆంధ్రభాషాభిరంజనీ సమాజము నెలకొల్పిన బహుమాన కావ్యపద్ధతిలో నెగ్గినది. నాడు తత్సమాజపోషకుడు సమర్థి రంగయ్యసెట్టి.
బ్రౌను దొరగారు ప్రకటించిన 'అనంతపురచరిత్ర' యను గ్రంథము నుండి యీ యితివృత్తము కైకొన బడెనని రెడ్డిగారు పీఠికలో వ్రాయుచున్నారు. ఈ కృతి బాల్యములో రచింపబడిన దగుటచే బ్రాచీన కావ్యానుకరణఫక్కి ముప్పాలుగానుండెను. హృదయము సూపించు క్రొత్త వర్ణనములును గలవు. మచ్చునకు:-
లేగమైనాకుచు లీలమై మెడ మలం
చిన గోవు బిండెడు వనరుహాక్షి
బొండు మల్లెల తోట బువ్వులు గోయుచు
వనలక్ష్మి యన నొప్పు వనజగంధి
బీదసాదుల నెల్ల నాదరించుచు గూడు
గడుపార బెట్టెడు కన్నతల్లి
వ్యాధి బాధల నెవరైన నడల రెప్ప
వేయక కాచెడు వినుత చరిత
బిడ్డ లెల్లరు తమవారి విడిచి చేర
జంక నిడు కొని ముద్దాడు సదయహృదయ!
అమ్మ! నీ కిట్లు వ్రాయంగ నౌనె బ్రహ్మ
కనుచు నూరివారందఱు నడలియడలి.
*
కన్నెఱ్ఱ వాఱిన ఖర కరోదయకాల
మల్లన మ్రింగు జాబిల్లి యనగ
జ్వలదగ్ని శిఖలపై నెలనవ్వుతో బోవు
ధాత్రీ మహాదేవి తనయ యనగ
కెందామరల బారు సుందర మగు లీల
నల్ల నల్లన జొచ్చు నంచ యనగ
కాలమహా స్వర్ణ కారకుం డగ్నిలో
కరగించు బంగారు కణిక యనగ
ప్రళయకాలానల ప్రభా భానురోగ్ర
రంగ దుత్తుంగ భంగ సంవ్రాతములకు
గలక నొందక దరహాస మలర, మంద
మందగతి బోయి, చోచ్చె నను గువ నీట. ఈ తీరున విద్వాంసుడై కావ్యరచనము గావించిన కట్టమంచి కవి వంగడము సాహిత్యాభిరుచి కొన్నితరములనుండి కలిగి వచ్చు చున్నది. దానికి దారకాణగా మనరామలింగారెడ్డి యపుడపుడు వ్రాసిన కృతి పీఠికలలోని కొన్ని బంతులు గమనింతము.
"ఒకానొకప్పుడు శిష్యులైన కుప్పనయ్యం గార్లు బురదలో దిగబడి నడవజాలక, గనిమమీద బోవుచుండిన రామలింగారెడ్డిగారిని [మనరెడ్డి ముత్తాత] వచ్చి చేయూత నిమ్మని సంస్కృతములో నాక్రోశించిరి. ఆకూత నవ్యాకరణముగా లేనందున, దానిని దిద్ది పునశ్చరణము చేసిననేకాని రానని కోపించుకొనిరట. ఈయితిహాసము కుప్పనయ్యం గారే యొకానొకప్పుడు క్లాసులో జెప్పిరి. ప్రాణాలకైనను వ్యాకరణము హెచ్చేమో యాకాలపు గురువునకు! ఈయన మహాకవి యని మాబంధువులలో గొప్పప్రసిద్ధి. నేనుపుట్టిన లగ్నమును, మఱికొన్ని చిహ్నములును, భావిపాండిత్య సూచకములని కుప్పనయ్యంగార్లు వారిపేరు నాకు బెట్టిరి."
*
"కవిత్వము మహాసాహస కార్యమని నాతండ్రికి భయము. ఒకవిధముగా జూచిన నిజమే! కాని, వారి కారణములు వేఱు. విషగణములు పడి యెవరికేచేటు వాటిల్లునో యని వెఱుపు పెద్ద. తెనుగులో నాకుండు పాటవము జూచి వీడెప్పుడు కవిత్వరచనకు బ్రారంభించి నాశనమగునో యని దిగులు చెందుచుండును. సాక్షాత్తు తన కంఠస్వరముతోనే తాను జదివెడు మాడ్కినే భారతమును నేను జదువునప్పుడు పరమానందమును, నీతుంటరి కవిత్వమును మొదలువెట్టి యిల్లు కూల్చునో యనుసంశయమును జనిపోవువఱకు దాల్చియుండెను. కవిత్వ మనగా మరణయోగములలో నొకటి!" " మాతండ్రి గారు ప్రచురించిన గ్రంథములు రెండు. భారతసార రత్నావళి, భాగవతసారముక్తావళి. సొంతకవనము పొంత బో గూడదను నియమము దాల్చినవా రగుటవలన, నీ సంపుటీకరణములతో దృప్తి జెందిరి."
*
"ఆంధ్రలోక గురువులలో వేమన మొదటివాడందుమేని, సుమతి రెండవ వాడు......మావంశమున కేదివచ్చిన రానిండు. తెలుగుభాష యొక్కటిమాత్ర మక్షయముగ నిలిచియుండిన జాలును."
*
రెడ్డిగారు 'వ్యాసమంజిరి' యైదుఖండములుగా వింగడింపబడి యున్నది. పూర్వఖండము, అభిజనఖండము, భాషాఖండము, ఆధునిక కవితాఖండము, సాంఘికఖండము నని - ఈరచన లన్నింట నొక్కొక్క క్రొత్తతెన్ను కనబడును. విషయము సూటిగా మొగమోటమి విడిచి వ్రాయుటలో రెడ్డిగారిదొక ప్రత్యేకత. ఆయన మాటలో వలె వ్రాతలో సున్నితమైన ధ్వనిమర్యాద యుండును; హాస్య రేఖలు నుండును. వచనపు నడక చాలదొడ్డది రెడ్డిగారి కలవడినది. పరిశుద్ధమైన లక్షణావిరుద్ధభాషలోనే వీరి రచనలెల్ల సాగినవి.
వీరి వ్యాసమంజరికి ఉపోద్ఘాతము వ్రాయుచు పింగళి లక్ష్మీకాంతముగారు: "విమర్శకులలో వీరికెంత ప్రాధాన్యమున్నదో వ్యాస రచయితలలోను అంతప్రాధాన్యమున్నది. సాహిత్యాంగముగా బరిగణింపదగిన వ్యాసరచన ఆంగ్లభాషలోవలె మనభాషలో ఇంకను పరిణతావస్థకు రాకున్నను, జరిగినంతవఱకు దానిపెంపునకు గారణభూతులైన విద్వాంసులలో వీరొకరు. గ్రంథములకు బీఠికలు వ్రాసినను పత్త్రికలకు వ్యాసములు వ్రాసినను, తాత్త్వికముగా విషయచాలన మొనర్చి పటుత్వముగల భాషలో సోవపత్తికమైన సిద్ధాంతము చేయు నేర్పు వీరి వాక్కునకు సహజగుణము. వీరివ్యాసములకు ఇదియే ప్రథమాలంకారము. రెండవది శైలి..."ఇత్యాదిగా బ్రశంస చేసినారు.
ఉచితనియమనిబద్ధమయిన రెడ్డిగారి వచనశైలిలో మాధుర్య రేఖలు తఱచుగా నగపడుచుండుననుటలో నెవ్వరికి సంశయముండదు. ఈవిధముగా విమర్శకులలో, వ్యాసరచయితలలో, కవులలో నొక మంచితావు నేర్పఱచు కొన్న 'కట్టమంచి' రచయిత జీవితమును వేఱొక చూపుతో జూచినచో , ఆయన పెక్కేండ్లు ఆంధ్ర విశ్వ విద్యాలయోపాధ్యక్షతా పదవి నిస్సామాన్య ప్రతిభతో బరిపాలించి , యిపుడు మైసూరు విశ్వవిద్యాలయమునకు గూడ నదే పదవిలో నుండి సేవ గావించుచున్న మహావ్యక్తి. ఈ రెడ్డివంటి స్వాతంత్ర్య కాంక్షిని తఱచుగా మనము చూడ జాలము. రసలుబ్ధుడైన యీతని సౌహార్దము కొందఱభినవాంధ్రకవులకు మూలశక్తియైనది. రాయప్రోలు - అబ్బూరి - దువ్వూరి - పింగళి - మున్నగువారి యభ్యున్నతి కీయన 'అసరా' మేలయినది. సుప్రసిద్ధ కవులు విశ్వనాధ సత్యనారాయణగారు 'ఋతుసంహార' కావ్యము రామలింగారెడ్డి కంకితము చేసిరి - రాయప్రోలు సుబ్బారావుగారు కట్టమంచి కవిని గూర్చి యిటు లుట్టంకించిరి.
పిండీ పిండని పాడి యాబొదుగులన్ బింబింప గాదంబినీ
కాండం బుర్వర పచ్చ కోకలను సింగారింప నీవేళ బూ
దండల్ దక్కనుద్వారబంధముల సంధానించి ప్రేమోదయా
ఖండ స్వాగత మిత్తు రాంధ్రు లనురాగస్ఫూర్తి రెడ్డ్యగ్రణీ!
*
ఆజిన్ మార్మొగమీక, దిగ్విజయ కన్యా కంచుకంబౌ కుసుం
బాజెండా నెగగట్టి వాజ్మయ నరో మాధ్వీ పిపాసారతిన్
మోజుల్ మీఱగ మాయనుంగు దెనుగుం బూదోట బోషించి రే
రాజుల్ తత్ప్రతిభాంక రెడ్డికులధీర ప్రాచురీచ్ఛాయ నీ
తేజోరూపమునందు చూచెదము ప్రీతిన్ రామలింగాగ్రణీ!
______________