ఆంధ్ర రచయితలు/గురుజాడ వేంకట అప్పారావు
గురుజాడ వేంకట అప్పారావు
1865 - 1915
నియోగిశాఖీయులు. నివాసము: విజయనగరము. రచనలు: 1. కన్యాశుల్కము 2. కొండు భట్టీయము 3. బిల్హణీయము 4. ముత్యాలసరములు - చిన్నకథ 5. నీలగిరి పాటలు 6. సుభద్రా పరిణయము (ఆముద్రిత ప్రబంధము) మున్నగునవి.
అప్పారావుగారిని 'గురుజాడవాల్మీకి' యనికూడ వ్యవహరింతురు. వాస్తవమున కాయన నివీనాంధ్ర వాజ్మయమునకు వాల్మీకివలె నాదికావ్యము రచించి పోయినాడు. ఆ యాదికావ్యము కన్యాశుల్కము. అది దృశ్యకావ్యమే యైనను 'శ్రీమద్రామాయణము' వలె నేడు పారాయణగ్రంథమై యున్నది. 'ముత్యాలసరములు' తీసికొని వచ్చిన వారప్పారావుగారు. ఆదికవి నోటినుండి "మానిషాదప్రతిష్ఠాం త్వ" మ్మనుఛంద స్సప్రయత్నముగా వెలువడినటులు గురుజాడ కవినుండి యపూర్వవృత్తములు వెలువడి లోకమును గదలించినవి. ఆ యీ కారణములు చూచుకొని యప్పారావుగారిని 'వాల్మీకి' యని యుందురు.
1914 సం.లో బ్రభుత్వము సంస్కృత భాష యొక్కయు దత్సంబంధులైన యితరభాషల యొక్కయు బరిశోధనమున కొక పండితపదవి నియమించినది. ఆపదవికి మనదేశమునుండి దరఖాస్తులు వెళ్ళినవి. దరఖాస్తు పెట్టినవారిలో నెవ్వరు సమర్థులు వారికి గనబడలేదట. వయోనియమమును బట్టి గిడుగు రామమూర్తి పంతులుగా రా స్థానమునకు బోవ వీలుపడలేదు. మఱి, తెలుగువారి కేరికిని తత్పదవి దొరకలేదు. ఏయఱవయో, ఏకన్నడియో యాస్థానము నలంకరించి యాంధ్రభాషాతత్త్వమును బరిశోధించుటకు సిద్దపడును.సిద్ధపడుటయేకాదు, తెలుగు భాష దేశభాషలలో నక్కఱ మాలినదిగా నతడు సిద్ధాంతము చేయును. ఈవిషయమున అప్పారావు పంతులుగా రెంతో సంతాపపడి తెలుగుచదువరి కొఱకు బహుయత్నములు చేసిరి. కడకు, బధిర శంఖారావము!
శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారికి వ్యావహారిక వాదమున గుడిబుజముగా బనిచేసిన వ్యక్తి అప్పారావుగారు. రామమూర్తిగారు లక్షణము - అప్పారావుగారు లక్ష్యము. వీరి కన్యాశుల్కము, ముత్యాలసరములు రామమూర్తి పంతులుగారికి నాడు వాదాధారములైనవి. గురుజాడ కవి పిండలి కట్టిన రసజీవనమే కన్యాశుల్కము. వీరివలన 'గిరీశము' శాశ్వతుడాయెను. గిరీశము మాటలు తెలుగునాట జాతీయములుగా బాదుకొనెను. అప్పారావుగారికి వేఱే పేరు లేదు, 'గిరీశమే' ఆయనపేరు. సమాజజీవనమున కింత దగ్గఱగానుండి, గుండియలకు బట్టుకొను వీరిరచన వేఱొకరికి లభించుట సంభవము కాదు. కన్యాశుల్కమునకు బూర్వము సాధారణముగా 'కంపెనీకవులు' నాటకములు రచించుచుండువారు. ప్రాచ్య పాశ్చాత్య సంప్రదాయముల నెఱిగిన అప్పారావుగారివంటి వారు నాటకరచనకు బూనుకొనుట సంఘమునకు మంచిమేలిచ్చినది. కేవలము సంఘసేవయే యీరచనలో గలయుద్దేశము. ఇదిక్రమముగా సారస్వత పరిణామమునకు గూడ దారితీయించినది. గిరీశము పలుకుబళ్ళు పెక్కులు తెలుగువారిలో నామ్నాయములుగా నుండుటకు అప్పారావుగారి కలములోగల నైసర్గిక ప్రతిభ హేతువు. ఇదికాక కొండుభట్టీయము, బిల్హణీయము ననురచనలు వీరివి మఱిరెండున్నవట. విజయనగరము మహారాజ్ఞని నవ్వించుటకు 'కొండుభట్టీయము' రచించుచుండెడివారని చెప్పుదురు. ఏలికయగు నారాణి యీరూపకములో నాయాఘట్టముకు చిన్నపుడు మహానందము పొందు చుండెడిదట. 'బిల్హణీయము' కొంతభాగము ప్రచురితమైనది. శృంగార ప్రధానమైన యితివృత్తము తీసి కొని వ్యావహారికములో గొప్పతీరుగా వీ రీనాటకము వ్రాయుటకు దొరకొన్నారు. కాని పూర్తి కాలేదు.
విజయనగర రాజ్యమునకు సంబంధించిన ఠీవులు, నాటి విశేషములు నెన్నోకథలుగా, కావ్యములుగా వీరువ్రాయుటకు సంకల్పించికొని రని తెలియుచున్నది. పంతులుగారికి తెలుగునాటకరంగమును నూతన విధానములతో దీర్చి దిద్దవలయునని గాడాభిలాషయున్నటులు స్పష్టపడిన సంగతి. విజయనగరము మహారాజు ఆనందగజపతి నిరంతర సాహిత్యవ్యాసంగి. ఆయనకు అప్పారావుగారు హృదయము. ఆనందగజపతి యానందమునకు నాటకములు వ్రాయవలెనని అప్పారావుగారి తలపు.ఈతలపుతో నీయన నాటకరచన కుపక్రమించినను, క్రమముగా బుణ్యవశమున నది యాపదాంధ్రమునకు ఆనందకారణమైనది. గ్రీకు, రోమన్, ఇంగ్లీషు నాటకములు నిశితదృష్టితో బరిశీలించుచు, నెప్పుడును నవ్యతకుద్రోవలు చూచు నలవాటు అప్పారావుగారిలో నున్నటులు విన్నాను. ఆయనవ్రాసికొన్న "డైరీలు" చాలభాగము శ్రీ బుఱ్ఱా శేషగిరిరావుగారు ప్రకటించిరి. అది గొప్పమేలుసేత. ఈ దినచర్యలలో నెన్నోక్రొత్తవిషయములు గోచరించును. 1895 సం. ఏప్రిల్ 29 తేదీని వీరీ 'డైరీ' యిటులున్నది. " నాటకములలో నాయికలు తక్కువ - వసంతసేన బోగముపిల్ల - భూమిక ఆకర్షణీయమే. కాళిదాసుని నాయికలు శృంగారమునకే ప్రసిద్ధి - నాటకములలో దాంపత్య శృంగారమే - సంఘటనములు తక్కువ - నాయిక లేకుండా నాటకము - గ్రీకునాటకములలో గ్రీకుల సాంఘిక పరిస్థితులు - ఇంగ్లీషులో ఆంగ్లులవి - ఇండియను నాటకములలో హిందూపరిస్థితులు కనబడతవి."
నటకులను గూర్చి, అభినయమునుగూర్చి రంగస్థలమును గూర్చి వీరు వ్రాసికొన్న యక్షరములు శిలాక్షరములుగా నున్నవి. ఇవి అప్పారావుగారి 'డైరీ' ల యందలివని శేషగిరిరావుగారు చూపిరి.
" వచనం సరసంగా, సహజంగా, యాసలేకుండా పాత్రోచితంగా చెప్పడము వీళ్లెవళ్లకి తెలియదు. గబగబా స్కూలు పిల్లలు పరీక్షాధికారి యెదుట యేకరువు పెట్టిన ట్లంటారు. పందెంపెట్టి యెవరు ముందు ముగించుతారా అన్నట్లు చెబతారు. నిలుపులు సక్రమంగాఉండవు. యాసగా ఉంటవి. మదరాసీలకు దీర్ఘోపన్యాసాలూ, పాటలు తప్ప మరియేవీ మది కెక్కవు. కేవలం వచన నాటక మంటే వీ రా స్మరంతికే పోరేమో!" "నాటకపుజట్టులోనికి పడుపు కన్యలను చేర్చుట చాలా ప్రమాదకరమని నావూహ. అందకత్తెయై తెలివైన నటి పడుపుకన్యయైతే సంఘమునకు చాలా ముప్పు తేగలదు. ఆమెకు ఎన్నికైన సౌందర్యం లావణ్యం నాగరికతా వుంటే కలుగ గల అల్లర్లకు మేర వుండదు."
" బాలామణి జట్టులో దుష్యంతుడుగా బాలామణిచెల్లెలు వచ్చింది. రూపము వికారంగా ఉంది. నడక రంగేలాతనంగా ఉంది. కంఠం విప్పితే ఆడది అని తెలిసిపోతూ వుంది. బాలామణి తప్ప ఆ జట్టులో చెప్ప తగ్గ మరివొక మనిషి కనబడలేదు. కల్యాణరామయ్య జట్టులో దుష్యంతుణ్ణికూడా చూస్తిని. ఆతని వేషం మరీపాడుగా వుండెను. అట్టి మనిషి కావేషం ఎందుకు వేసిరా అనిపించినది. అతడే వాళ్లలో 'హీరో' కాబోలు. నల్లగా లేడు కాని అందమైనవాడు కాడు. వేషం మీద రూపం అందంగా కనబడేటట్టు చేసుకోవడం కూడా ఎరిగినట్టు తోచదు. సాక్సు, నల్ల ట్రౌజరు, కోటూ వేసుకొని మిలటరీ ఆఫీసరులాగ దిగబడ్డాడు. తలమీద టోపీ కూడాను. చిన్నపలుచని మీసకట్టూ, నుదుట తిరుచూర్ణమూ-మావేపు సాతానిభిక్షువుని జ్ఞాపకమునకు తెచ్చినది. మూతి కొంచెం ముందు కుంటుంది. మీదిపెదవి గుండ్రము; పెదవులలో ఇముడని పొడుగుపళ్లు-ఇట్టి మఖములో లావణ్యము గాని చురుకుతనముగాని యేలాగు కనబడవు ! ఈతనిలో ధీమాగానీ, చలాకీగాని, పౌరుషంగాని వెతికితే కానరావు. వేషంలో మోటుతనము గాని యుక్తతయేమీ లేదు."
ఇది ఇటుండగా, 1895 సం.లో అప్పారావుగారు చమత్కారమునకు వ్రాసికొన్న కొన్ని 'డైరీ' లోనివిషయములు శ్రీ శేషగిరిరావుగారు వెలువరించినవే మనయుపయోగార్ధము చూపించెదను. నిజమునకు, వారిచరిత్రమునుగూర్చి తెలిసీ తెలియని సంగతులుపేర్కొనుట కన్న, వారివ్రాతలే యిచట నుదాహరించుట వినోదముగానుండును.
" 19.4.'95' పదిహేనోతేదీని ఒకసంగతి జరిగినది. తలుచుకుంటే నవ్వు వస్తున్నది. పచ్చయప్పకాలేజీలో మీటింగుకు వెళ్ళి యింకా కొంత వ్యవధి ఉంటే " యీవినింగు బజారులో తచ్చాడుతూ ఉంటిని. ఒక పుస్తకాల స్టాలువద్ద వుండగా ఒక బికారివాడివంటివాడు వచ్చి ఆ అంగడివాని కొక కళ్ళజోడు అమ్మజూపినాడు. అతడు రు. 1 - 6 - 0 యిస్తానంటే వాడు రు.3/-యిమ్మనాడు. నేను రు. 1 - 8 - 0 ఇస్తా నంటిని. వాడు కొంచెం గొణుగుకొని యిచ్చి వేసినాడు. అది వెంటనే కళ్ళకు పెట్టుకొని చూస్తిని: సరిపడలేదు. ఎట్లు సరిపడును? నా కప్పటికి చత్వారములేదు. హ్రస్వదృష్టి లేదు. బూట్సూ, స్పెక్టెకిల్సుతో యేదో లేనిఘనత వచ్చినట్టు మహాదర్జాగా అవి కళ్ళకు వుంచుకొని కాలేజిలోకి వెళ్ళబోయినాను. కాని ఆ కళ్ళజోడులో దూరపుచూపున కొక ముక్కా, చదవడమున కొక ముక్కా అతికివుండడముచేత దృష్టి చెదిరి మెట్ల మీదనే ద్వారములోనే జారి చాలా హాస్యాస్పదముగా చతికిల బడిపోయినాను!"
"ముఖమునకు కనుబొమలు కొంత అందం యిస్తవి. పొటకరించుకొని బొద్దుగా ఉండేవి బాగుండవు. చర్మమునకు అంటుకొని పోయినట్లుంటే క్రూరత్వమును సూచిస్తవి. అతి సున్నితముగా పెన్సిల్‌గీత వలె వుంటే చులకన మనిషి అని సూచన. క్రమముగా విల్లువలె వంగి సాధారణపు దళసరి కలిగి కండ్లకు అతి దూరముగాగాని, అతిదగ్గరగాగాని కాకుండావుంటే అదీ ముఖమున కందమిస్తుంది. ఏక వరుసగా లయినుగా కాకుండా యెగుడుదిగుడుగా వుంటే తెలివితేటలను సూచించును."
" 14 తేదీ మెయి: క్రిస్టియనుకాలేజీలో కెల్లెటుగారిని చూస్తిని. ఒకగంట సేపు చాలసంగతులు మాట్లాడితిమి. * * * పోలికలూ భేదములూ నిరూపించుతూ గ్రీసు రోము రాజ్యముల చరిత్ర నన్ను వ్రాయమని వారు ప్రోత్సహించిరి. అది నాశక్తికి మించినపని అంటిని-'కాదు - మీరువ్రాయగలవారు' అనిరి."
అప్పారావుపంతులుగా రీ తీరుగా నెన్నో సూక్ష్మాతిసూక్ష్మ విషయములు హృదయమునకు బట్టించుకొని, మానసికతత్త్వములు గుర్తించు కొని 'డైరీ' లలో దాచుకొన్నారు. విజయనగరము కళాశాలలో బెక్కునాళ్ళు ఉపన్యాసకులుగా నుద్యోగించి, విజయనగరప్రభువు ఆనంద గజపతి మహారాజున కాంతరిక మిత్రుడై యీయన రాజయోగముతో మెలగెను.
1895 సం. ప్రాంతములో పంతులుగారు మహారాజు సొంతపనులను నిర్వహించుటకును, ఔషధసేవ చేయుటకు మదరాసులో మకాము చేయవలసి వచ్చినది. ఆసమయమున వీరు క్రిస్టియను కాలేజి, ప్రెసిడెన్సీ కాలేజి, పచ్చయప్పకాలేజి, బెంగుళూరుకాలేజి-యివన్నియు జూచి యక్కడి ప్రొఫెసరులతో పాఠప్రవచనములను గూర్చి, విద్యావిధానములను గూర్చి చర్చలు సలిపి వచ్చిరట. వీరి సేవ విజయనగర కళాశాలాయశస్సునకు దివ్యసౌరభము.
ఎంతచులకనైన విషయమైనను లోతుగుండెతో విమర్శింపగల అప్పారావు పంతులుగారు 'కన్యాశుల్కము' నట్లు వ్రాసెననగా నబ్బురము కాదు. మానవసంఘములోని క్రుళ్లు కడిగి దేశమున కొక పవిత్ర సందేశము నందీయవలెనని యాయన యూహించెను. 'గిరీశము' వలన సంఘసంస్కరణోద్యమము వేళాకోళము లోనికి దిగి దేశమున కుపకృతికిమాఱు అపకృతియే ఘటిల్లె" ననియు, "కన్యాశుల్క మసలు నాటకమే కా" దనియు గొన్ని విమర్శనములు లోకములో నున్నవి. ప్రకృతమున కవి యక్కఱలేని సంగతులు. మన మొకటి యనుకొన వచ్చును. 'కన్యాశుల్కము' సాంఘికముగాబెద్ద విప్లవమేమియు గలిగింప జాలలేదుగాని, భాషావిషయకముగా గిడుగువారి వాదమునకు మూదల యైనది. 'కన్యాశుల్కము' సంఘములో గూడ మంచి సంస్కృతి నిచ్చినదని యన్నచో నేను కాదనను. ఆ రచన, పాత్రపోషణము, ఆ జాతీయములు, ఆ సంవిధానము 'కన్యాశుల్కము' ను తెలుగు వారి జీవితములతో నభిన్నమును జేసివైచినవి. గిరీశము-రామప్పంతులు-కరకటశాస్త్రి-మధురవాణి వీరందఱు అప్పారావుగారి ధర్మమా యని చరిత్ర పురుషులు పురాణపురుషులుగా నయిపోయిరి. ఆయన కలములో నట్టి పాటవ మున్నది. కన్యాశుల్కము తరువాత వేదమువారి ప్రతాపరుద్రీయము కొంత ఖ్యాతిగడించుకొన్నది. ఎవరెన్ని వ్రాయనిండు! అప్పారావుగారిదే యావిషయమున నగ్రస్థానము.
దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా
వొట్టిమాటలు కట్టిపెట్టోయ్! గట్టిమేల్ తలపెట్టవోయ్!
పాడిపంటలు పొంగిపొర్లే, దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితె కండ కలదోయ్, కండ గలవాడేను మనిషోయ్!
యీనురోమని మనుషులుంటే, దేశమేగతి బాగువడనోయ్?
జల్దుకొని కళలెల్ల నేర్చుకు, దేశిసరుకులు నించవోయ్!
దేశాభిమానం నాకు కద్దని వొట్టిగొప్పలు చెప్పుకోకోయ్,
పూని యేదైనాను వొకమేల్ కూర్చి జనులకు చూపవోయ్!
ఆకులందున అణగి మణగి కవితకోవిల పలకవలెనోయ్,
పలుకులను విని దేశం దభిమానములు మొలకెత్తవలెనోయ్!
ఈగీతములలో రసికమానసముల లోతులు కదలించు శక్తి యంతగా లేకున్నను, దేశీయులను మేలు కొలుపగలరక్తియేదో యున్నది. మరల, నీ దిగువ గేయము పాడుకొనుడు కొంత యెదలోతులకు జొచ్చుకొను గుణ మీ పాటలో నున్నది.
ప్రేమ పెన్నిధి, గాని యింటను
నేర్ప రీకళ, ఒజ్జ లెవ్వరు
లేరు, శాస్త్రము లిందు గూరిచి
తాల్చె మౌనము, నేను నేర్చితి
భాగ్యవశమున కవులకృపగని;
హృదయమెల్లను నించినాడను
ప్రేమ యను రతనాల, కొమ్ము !
తొడవులుగ నవి మేన తాల్చుట
యెటుల నంటివొ, తాల్చి తదె, నా
కంట చూడుము ! నతులసౌ రను
కమల వనముకు పతులప్రేమయె
వేవెలుగు!
ప్రేమ కలుగక బ్రతుకు చీకటి!
కవిత్వము రసికాధికారులకే కాక సాధారణులకు గూడ నుపకరింప వలయునని తలపు అప్పారావు పంతులుగారిలో నుండి వ్యవహారభాషలో నెన్నో గీతములు వారిచే వ్రాయించినది. వీరి 'నీలగిరి పాటలు' ప్రసిద్ధిలోనికి వచ్చినవి. వీరి పాటలు నాటకములు సంఘసంస్కారమున కుపయుక్త మగునటులు వ్రాయబడినవి. చాటుమాటులు లేకుండ సూటిగా అప్పారావుగారు చెప్పదలచిన విషయమును చెప్పగలరు. ఆయన పాటలతో గంటె "కన్యాశుల్కనాటకము" తో నమృతకీర్తి యైనటులు భావించెదము.
విజయనగర కళాశాలో పన్యాసకులు గాను, ఎస్టేటు ఎపిగ్రాఫిస్టుగాను, శ్రీమదానందగజపతి ప్రాణప్రాణముగాను, తెలుగుదేశములో నాదర్శవ్యక్తిగాను, నాటకకర్తగాను విస్మరింపరాని మహోదయులు అప్పారావుగారు.