ఆంధ్ర రచయితలు/దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి

దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి

1897

తెల్లగాణ్యశాఖీయ బ్రాహ్మణులు. తండ్రి: తమ్మనశాస్త్రి అను నామాంతరముగల వెంకటకృష్ణశాస్త్రి. జన్మస్థానము: చంద్రమపాలెము. నివాసము: పిఠాపురము, మదరాసు. జననము: 1897 సం. రచనలు: 1. కన్నీరు 2. కృష్ణపక్షము. 3. ప్రవాసము; ఊర్వశి. 4. ఋగ్వీధి. (ముద్రితములు) 1. మహతి (గేయ సంపుటి) 2. కార్తీకి 3. ఆకలి (జాతీయగీతములు) 4. బదరిక (పద్యము) 5. రేడియో నాటికలు 6. సుప్రియ (సాహిత్య వ్యాసములు - ఆముద్రితములు) మొదలగునవి.

నేటి కవిలోకమున కృష్ణశాస్త్రిగారి దొక ప్రత్యేక స్థానము. దేవులపల్లిసోదరులను పీఠికాపుర సంస్థాన విద్వత్కవులుగా వింటిమి. ఈజంటలో రెండవవారైన తమ్మనశాస్త్రిగారి కుమారుడీయన. తమ్మనశాస్త్రిగారి యసలుపేరు వేంకటకృష్ణశాస్త్రి. తండ్రికొడుకులపేరు లొకటే. నాడు తండ్రిపేరు కంటె, నేడు కొడుకుపేరు విన్నవారి జనసంఖ్య పెద్దది. కాని, తండ్రిముందు కొడుకు వ్యుత్పత్తిలో బేదవాడు. శివస్వరూపుడైన తమ్మనశాస్త్రి తేజస్సు ముందు కృష్ణశాస్త్రి కుమారమూర్తి. ఆయన కూర్చుండుటకు మేలిజాతి మణివితర్దిక కావలయును. ఇతనికి మెత్తని పూలపానుపుమీద గాని నిదుర పట్టదు.

కృష్ణశాస్త్రికి దొలుతొలుత పిఠాపురము హైస్కూలులో ఆంగ్లపు జదువు. నాడు కూచి నరసింహముగారి గురుత్వము కళార్థుల నెందఱనో భావకులనుగా దిద్దినది. ఆయన యంతేవాసియై యాంగ్ల కావ్య నాటకములోని మెలకువలు గుఱుతించి కృష్ణశాస్త్రి తన ప్రతిభకు మెఱుగు పెట్టుకొనెను. 'స్కూలుఫైనలు' వఱకు దండ్రితో నుండి సాహిత్యతత్త్వము తెలిసికొను భాగ్యము. ఆపిమ్మట నాయనగారి నిర్యాణము. పెదతండ్రి సుబ్బారాయశాస్త్రిగారుకూడ గతించినారు. తండ్రుల నెడబాసిన తనయుడు వారి యుపదేశములు నెమరునకు దెచ్చుకొనుచు, వారి రచనలు పారాయణము చేసికొనుచు గొంతకాలము గడపెను. కూచివారి యాచార్యకము కృష్ణశాస్త్రి యనూచానమైన ప్రతిభాసంపదకు మెఱవడి కలిగించినది. మంచి చుఱుకైన బుద్ధి. విన్నది కన్నది వెంటనే పట్టుకొను నైశిత్యము! అప్పటి కప్పుడే కనబడిన గ్రంథమెల్ల జదివినాడు. 'స్కూలుఫైనలు' పరీక్షలో నుత్తీర్ణుడైన నాటికి వయస్సు పదునైదు సంవత్సరములు . పయిచదువున కొకయేడు ఆగవలసి వచ్చినది. ఈ సంవత్సరములో నాంధ్రసాహిత్య పాఠము. గ్రాంథిక వ్యావహారిక భాషావివాదము పెల్లురేగు నాకాలము కృష్ణశాస్త్రి ప్రభృతులకు వినోదస్థానము.

నాడు కాకినాడలోని కళాశాలకు రఘుపతి వేంకటరత్నము నాయుడుగారి యాధ్యక్ష్యము. నాయుడుగారి యుపన్యాసములు కృష్ణశాస్త్రికి గ్రొత్త యుత్తేజనము కలిగించినవి. ఆయనలోని యాధ్యాత్మిక జిజ్ఞాస, మార్గదర్శకమైనది. 1919 లో 'ఇంటరు' లో గెలుపు. 1918 నాటికి బి.ఏ. పట్టభద్రత. విద్యార్థిదశలోనే బైబిలు, క్రాన్, భగవద్గీతలలోని మెలకువలు, వెలుగులు నాయుడుగారు చూపించినారు. రామమోహనరాయల సిద్ధాంతములు, సాహిత్యములో అప్పారావుగారి పోకడలు గుండెకు పట్టుకొన్నవి.

ఇంక, విద్యార్థిదశదాటిన కృష్ణశాస్త్రిగారికి భాషా-సంఘసంస్కారములు కావలయునన్న భావము దృడపడినది. కాకినాడలో బ్రహ్మసమాజము నాటకసమాజము వీరి సంస్కరణోద్దేశమున కొకదీప్తి కలిగించినవి. మొదట 'మిషన్‌' స్కూలులో నుద్యోగము. బ్రహ్మసమాజములో విడుమర లేని కృషి. 1919 సంవత్సరమునుండి కృష్ణశాస్త్రిగారి జీవితములో నొక నూతన ప్రకరణ మారంభమైనది. గిడుగు రామమూర్తి పంతులు గారి వ్యావహారిక వాదముపై సంపూర్ణమైన విశ్వాసము పాదుకొన్నది. చింతా దీక్షితులుగారి సాహచర్యముతో వ్యావహారిక రచనా ప్రాచుర్యము కొనసాగించిరి. నేటికి, రవీంద్రుడు-షెల్లీ, భవభూతి, పెద్దన, గురుజాడ అప్పారావు ఇత్యాదు లందఱు కృష్ణశాస్త్రిగారిలో దీయతీయని తలంపులు రేపిరి. దాని ఫలమే 'కృష్ణపక్షము' ముగించిరట. 1921 జాతీయోద్యమమునకు వీరిని పురికొల్పిన వత్సరము. ఆయేడే దైవవశమున కృష్ణశాస్త్రిగారికి సతీవియోగము. ఆ పిదప పిఠాపురము హైస్కూలులో ఉద్యోగధర్మము; ద్వితీయవివాహమును. మహారాజు కృష్ణశాస్త్రిగారి జాతీయభావములు సహింపలేక యుద్యోగమునుండి తొలగించివై చెను. తరువాత మఱికొన్ని సంవత్సరములకు 1932 మొదలు 1941 వఱకు కాకినాడ కళాశాలోద్యోగము. అంతటితో దానికిని స్వస్తి. ఆత్మగౌరవమును బాటించుకొన నని కృష్ణశాస్త్రిగారు ప్రతిజ్ఞపట్టినచో, ఆయన కీపాటికి 'ప్రిన్సిపాలు' పదవి వచ్చియుండవచ్చును. ఆదురదృష్ట మాయనకు బట్టలేదు. ఇది కృష్ణశాస్త్రిగారి జీవితములో గొందఱికే విందుగూర్చుభాగము. ఈ పయిది భావుకులకు విడువరాని యాతిథ్యము.

" తలిరాకు జొంపములు సం

దుల త్రోవల నేలువాలు తుహిన కిరణ కో

మలరేఖవొ! పువుదీవవొ!

వెలదీ, యెవ్వ తెవు నీవవిటవీ వనిలోన్.

కారు మొయిళ్ళ కాటుగ పొగల్ వెలిగ్రక్కు తమాలవాటి నే

దారియు గానరాదు, నెలంతా! యెటు వోయెద నర్ధరాత్రి? ని

స్ఫార విలోచనాంధ తమసమ్ముల జిమ్ముచు వేడి వేడి ని

స్టూరుపులన్ నిశీధ పవనోర్మ వితానము మేలు కొల్పుచున్. అది శరద్రాత్రి ; శీతచంద్రాత పాంత

రాళరమణీయ రజత తల్పంబు నందు

జల్లగా నిద్రపోవు వ్రేపల్లెవాడ

సకల గోపాల గోపికా గణముతోడ.

         *

ఎలదేటి చిఱుపాట సెలయేటి కెరటాల

బడిపోవు విరికన్నె వలపు వోలె,

తీయని మల్లెపూ దేనె సోనల పైని

తూగాడు తలిరాకుదోనె వోలె,

తొలిప్రొద్దు తెమ్మెర త్రోవలో బయనమై

పరువెత్తు కోయిల పాట వోలె

వెల్లువలై పాఱు వెలది వెన్నెలలోన

మునిగిపోయిన మబ్బుతునక వోలె,

చిఱుత తొలకరి వానగా జిన్నిసొనగ,

పొంగి పొరలెడు గాల్వగా, నింగి కెగయు

కడలిగా బిల్ల గ్రోవిని వెడలు వింత

తీయదనముల లీనమైపోయె నెడద.

           *

జిలిబిలి పట్టు రేకుల వెంట దొట్రిలు

మల్లియయెద దాగు మధుపరవము

కనుచూపు దాటు నామనిబాయు కోయిల

గొంతులో జిక్కువసంతగీతి

విభువీడి శుష్కించు విరహిణి సెలయేటి

కడుపులో నడగిన కడలి మ్రోత ఱేనికై వెదకెడు ఱిక్క చూపులలోన

జెఱవడ్డ నిండుచందురుని పాట

యిట్లు నీ దీన గోపికా హృదయ మంది

రాంతరాళములోన ద్రుళ్లింతలాడు

వేణు నాదంబు వినిపించు విశ్వమోహ

నాకృతి గిశోరగాయకు నరయు చుంటి.

ఇది నాచరితము, విని, నీ

వదరెదు, తొట్రిలెదు, వడకు, దటు నిటు కనులన్

జెదరెడు చూపుల నేదో

వెదకెదు, ఎవ్వతెవు నీపవిటపీస్థలిలోన్.

'అన్వేషణము' అను శీర్షికతోనున్న ఖండకావ్యమునందలి కొన్ని పద్యములివి. ఈరచనలో దొల్లిటి ప్రబంధముల వాసన లేత లేతగా నున్నది. శైలిలో దెనుగుదనము, కొన్ని తలంపులలో గ్రొత్తదనము, సంవిధానములో దియ్యదనము జతగూడి శ్రుతుల కతిథి గౌరవము నొసగుచున్నవి. కృష్ణశాస్త్రిగారి భావన 'అన్వేషణము' తో నారంభమై నేటికి లోతులు ముట్టినది. ఈయన తెలుగు వారి కిచ్చిన కావ్యములు ప్రధానములైనవి : ప్రవాసము ; ఊర్వశి - కృష్ణపక్షము. ఈ కవినుండి యుబికిన యక్షరములు తక్కువ. కాని, వాని బరువెంతో యెక్కువ. ఆయన ప్రత్యక్షరము ముట్టి చూచినచో నార్ద్రమైన యొక్కొక్క కలువపు రేకు చుట్టినటులు తోచును. కాఠిన్యము సహింపని యీ కవి జయదేవుని వలె పదములేఱుకొని, భవభూతి వలె పాడినాడు. క్షీరసాగరము వంటి హృదయము; చెమ్మగిల్లుచున్న కన్నులు! బ్రతుకుపై నిరాశ!

ఏను మరణించుచున్నాను; ఇటు నశించు

నాకొఱకు చెమ్మగిల నయనమ్ములేదు; పసిడి వేకువ పెండ్లిండ్ల బడిన యెవరు

కరగనేర్తురు జరఠాంధకారమృతికి?

నామరణశయ్య పఱచుకొన్నాను నేనె!

నేనె నాకు వీడ్కొలువు విన్పించినాను!

నేనె నాపయి వాలినా, నేనెజాలి

నెద నెద గదించినాను, రోదించినాను.

బ్రతికియున్న మృత్యువునైన ప్రవాస తిమిర

నీరవ సమాధి గ్రుక్కి క్రుంగినపుడేని

నిను పిలిచినాన, నామూల్గు నీడ ముసిరి

కుములునేమొ నీ గానోత్సవముల ననుచు

ఇదియె నాచితి, పేర్చితి నేనె దీని

వదలిపోని యావసాన వాంఛ గాగ

వడకని కరాలు రగులుచు దుడుకు చిచ్చు

లాలనల నింత నుసిగాగ కాలు త్రుటినె!

అలయు వాతెఱ యూర్పు గాలులు కదల్చి

రేపునంతె నాకష్టాల రేగుమంట

మును బ్రతుకునట్ల నాదేహమును దహింపు!

పడదులే అర్పగా నొక బాష్పమేని!

పడమటికవుల షెల్లీ, బైరను మొదలగువా రిట్టి యీభావనకు దారి చూపినవారనుట సత్యమగుగాక! మన కృష్ణశాస్త్రిగారి కెందఱకో యందని తేనెబిందువులు దొరకినవి. అవి యాయన కవితలో నక్షరములై వెలికుబుకును. ఆయన పద్యము కాదు పాటకాదు మలచి మలచి, తూకము సరిపెట్టుకొని బయట బెట్టునలవాటు గలవ్యక్తి. భావన లోతునకు, పదముల కూరుపునకు హెచ్చు కుందు లుండవు. ఆ సుగుణముగల కవులు తక్కువ సంఖ్యలో నున్నారు. రచనలోని యీశిల్పము తీరు చూడుడు. రేయికడుపున చీకటి చాయవోలె

తమపు టెడద దివాంధగీతము విధాన

ఘాక రావాన వలవంతరేక రీతి

నా విషాదమ్ములో దాగినాడ నేనె!

దేవులపల్లి కవితాగానము ముప్పాతికపాలు కరుణాత్మకము. కరుణలోనే మధురిమ నించి పాఠకుల నూరింపజేయు శక్తి ఆయన కలములో దులకాడుచుండును. దేవులపల్లి కవి యీత్రోవ నవీన కవులెందఱో యనుసరించినారు. "కవి మృతుడైనను చనిపోవరా" దని కృష్ణశాస్త్రిగారి వాణి. బ్రతికియుండియు మరణించుచున్న - జీవఛ్ఛవములైన కవులను జూచి కృష్ణశాస్త్రిగారికి జాలి. రవీంద్రుని యడుగు జాడలలో వీరినడక. తెనుగు కవులలో నన్నయ - రామకృష్ణుడు ఇత్యాదులు కొందఱే యాయన దృష్టిలో మహాకవులు. జయదేవుడు, అమరకుడు, కాళిదాసు, భవభూతి వీరిపేళ్లు చెప్పి కృష్ణశాస్త్రిగారు పొంగిపోదురు. వేంకటరత్నము నాయుడుగారు గురుస్థానము. ఆయనమీద గొప్ప హృదయముతో నీయన రచించిన పద్యములు భావింప దగినవి; విస్మరింప రానివియును.

ఈ జడజీవితమ్ము పలికించితి, వీ యఘవంకమందు సం

భోజము మొల్వజేసితి, వపూర్వము నీదయ, యీనిశీధి నీ

రాజన మెత్తినావు, విపులమ్మగు నీయెద నిండెనే శర

ద్రాజిత చంద్ర కాంతు లమృతమ్ములు స్వర్గలతాంత వాసనల్.

              *

నాయెదలో ద్వదీయ చరణమ్ముల చిహ్నము లెన్న డేనియున్

మాయన, యేనిశీథవు దమస్సులు మాసినగాని జీవయా

త్రాయత వీథి నొక్కడ బ్రయాణము సేయుదు నక్షయంపు బా

థేయముగా గ్రహించి గురుదేవముఖస్రుత గీతికానుధల్.

                * ప్రతిఫల మ్మినుమంత వలవక కర్మముల్

సేయు నీమెయి కురుక్షేత్ర మగును,

ఆశాంతములకు జరాచరమ్ములకును

దరలు నీయెడద బృందావనమగు,

వివిధ ధర్మజ్ఞానవేణీ సమాశ్లేష

మైన నీమనసు ప్రయాగ యగును,

పాతాళమును స్వర్గపద మొక ముడిలోన

నతుకు నీవే వారణాసి వౌదు

నీవు కన్పడ నెదురుగా నిలిచినట్లె

మ్రోలను పురాణ భారత పుణ్యభూమి!

మాకు దినదిన దివ్యయాత్రా కృతోత్స

వానుభూతి నొసంగు బ్రహ్మర్షి నీవు.

గురువునెడల దేవులపల్లికవి భక్తిప్రపత్తుల కే కాక, ఆధ్యాత్మిక దృష్టి నైశిత్యమునకు గూడ నీరచన తారకాణ. కృష్ణశాస్త్రిగారిలో నొక విశేషమున్నది; వీరి భావన మృదుల మృదలముగా నుండి లోతుల నంటుకొనును. ఆ పలుకుల మెత్తదనము హాయి యనిపించును. ఎంతసేపు, కవికి శైలిపై చూపు. ఆయనపాట లందుకే తెనుగునాట ముచ్చటగా బాడుకొనుచుందురు.

ఎవరోహో, ఈ నిశీధి

నెగసి నీడవోలె నిలిచి

పిలుతు రెవరొ, మూగకనులు

మోయలేని చూపులతో

ఎవరోహో! ఎవరోహో!

ఇపుడా నను బలుకరింతురు! మ్రోయలేని నీరవగళ

మున జరించు కోరికతో

ఇపుడా నను బలుకరింతురు!

ఎవరని ఈరేయి నిదుర

హృదయ మదర, వేయి జేయి

చాయలాడ పెనుచీకటి

సైగలతో నాకన్నుల

రక్తమురల లాగికొందురు!

        *           *            *            *

ఇది మున్నుగా నెన్నో కృష్ణశాస్త్రిగారి పాటలు ప్రశస్తి గొని యున్నవి. " జయజయజయ ప్రియభారత జనయిత్రీ! " " యువపతాక నవ పతాక, అరుణారుణ జయపతాక" ఈ పాటలు గానము చేయని సభలు నేడు తక్కువ.

అభినవాంధ్ర కవులలో నొక ప్రత్యేకత సంపాదించుకొన్న దేవులపల్లి కవి పరసేవాహైన్యము ననుభవింపలేని ఆత్మగౌరవశీలి అయినను 1932 మొదలు 1941 దాక పి.ఆర్. కాలేజీలో ఉపన్యాసక పదవిలో నుండవలసి వచ్చినది. వెనుకటి యుద్యోగముల వలెనే యీపదవికూడ స్వాతంత్ర్య మారుతము ధాటి కాగలేక పోయినది. ఆతరువాత కృష్ణశాస్త్రిగారి మనుగడ మదరాసులో. 'మల్లేశ్వరి' మొదలగు చలన చిత్రములకు పాటలు, మాటలు వ్రాసి యిచ్చుచు, రేడియోలో నాటికలు ప్రసారముచేయుచు గాలక్షేపము. చిన్న చిన్న కావ్యములేవో కొన్ని రచించి, యొక రకమైన కవితాపథమునకు దర్శకత్వము సంపాదించెనే కాని, కృష్ణశాస్త్రిగారు రెద్దకము వేసికొని మహాగ్రంథమేదియు వ్రాయలేకపోవుట యొకకొదవ యని కొందఱి విమర్శ. సంపుటములు పెంచకపోయినను, బయటబెట్టిన యక్షరములు రసస్రోతస్సులు! ఆయన యిట్లు పాడుకొనుచున్నాడు.

నా హృదయమందు విశ్వ వీణాగళమ్ము

భోరు భోరున నీనాడు మ్రోత వెట్టు

దశదిశా తంత్రు లొక్క నుధాశ్రుతిని బె

నంగి చుక్కల మెట్లపై వంగి వంగి

నిలిచి నిలిచి నృత్యోత్సవమ్ముల జరించు.

             *

వెలుగులో, అమృతాలొ, తావులొ, మరేవొ

కురియు జడులు జడులు గాగ, పొరలిపాఱు

కాలువలు గాగ, పూర్ణకల్లోలములుగ

కలదు నాలోన క్షీరసాగరము నేడు.

                       _____________