ఆంధ్ర రచయితలు/దువ్వూరి రామిరెడ్డి

దువ్వూరి రామిరెడ్డి

1895 - 1947

రెడ్డి బిడ్డ. జన్మభూమి: నెల్లూరి మండలములోని పెమ్మారెడ్డి పాలెము. జననము: 9 నవంబరు 1895 సం. నిర్యాణము: 1947. రచనలు: 1. పానశాల 2. కృషీవలుడు 3. కుంభరాణా 4. వనకుమారి 5. సీతావనవాసము 6. నలజారమ్మ అగ్నిప్రవేశము. 7. పలితకేశము 8. Voice of the Read (ఆగ్లకవితాసంపుటము) మున్నగునవి.

అభినవాంధ్ర కవితారసాలశాఖ నధిరోహించి మధురగానము చేసిన కవిపుంస్కోకిలము దువ్వూరి రామిరెడ్డిగారిజీవితము స్మరణీయమైనది.

ఆయన కలిగిన రైతుబిడ్డ. ఆకలిమికి దోడు విజ్ఞానసంపత్తి. ఆసంపత్తికి సాయము తీయనైన కవితాధోరణి. ఈసమ్మేళనము చక్కనైనది. ఇది కవిసామాన్యమున కందని విందు. నెల్లూరిజిల్లాలోని పెమ్మారెడ్డి పాలెములో రామిరెడ్డిగారి పుట్టుక. అచటి పల్లెబ్రతుకుల మెలకువలో, వారికవిత యుట్టియలమీద నవనీతము మెనవి యార్ద్రమైనది. మెత్తని హృదయము; మెత్తని రచనాసంపత్తి. ఈభాగ్యముతో నాయన ఖండకావ్యము లెన్నో నంతరించెను. నాటికలు, కథానికలు, వ్యాసములు రచించెను. ఏమివ్రాసినను స్వాతంత్ర్య దీప్తి ప్రదర్శించెడి నేర్పు కలములో నున్నది. నిసర్గమధురమైన పదబంధము రామిరెడ్డిగారికి జన్మతోభవము. ఈసిద్ధివలన నీయన పూర్వ పద్ధతులను దాటి నడచుచున్నానని సాహసముతో వచించెను. ఈదిగువ పద్యములు పరికించునది:

చ. వనలతయైన నాకవిత పత్రపుటంబుల బూవురెమ్మలన్

దినదిన జృంభమాణమయి తేజరిలెన్ సహజ ప్రరోహవ

ర్ధన నియమాను సారముగ దల్లతయెన్నడు దోటమాలి పా

ణిని గనుగోని నవ్య్రరమణీత జిల్కు నపూర్వ పద్ధతిన్. గీ.పంజర నిబద్ధ కీరంబు బయలుగాంచి

యడ్డుకమ్ముల దాటంగ నాశచేయు

నటు బహిర్ని యమంబుల నతకరించి

మన్మనంబు స్వాతంత్ర్య సీమకు జరించు.

గీ. కాన నెవరేమి యనుకొన్న దాన నేమి

గలుగు; గాల మనంతయు; ఇల విశాల;

భావలోకము, క్రమముగా బడయుమార్పు

ఏలహృదయంబు వెలిపుచ్చ నింతయళుకు.

ఈచివరి పద్యభావము భవభూతిని స్మరింప జేయునదికదా! ఈయన వ్రాసికొన్నంతగా భాషా-భావ స్వాతంత్ర్యములు హెచ్చు తీసికొనకుండగనే సంప్రదాయములు పాటించుచు గవిత సాగించుట కాననగును. ప్రాచీన కవి తారీతులపై దండెత్తి యువ్వెత్తుగా నక్షత్ర వీథులలో నెగురు కొదఱవంటి వాడు కాడు రామి రెడ్డిగారు. ఆయన భావ వైభవావేశమునకు సరిపడు భాషాభార ప్రవేశము కలవాడు. ఆంగ్ల పారసీక వాజ్మయములలోని పలుకు బళ్ళు లెస్సగా గుర్తించిన వాడు. సంస్కృత వాజ్మయపు బొలుపులును దెలిసి కొన్నవాడు. సహజముగా సౌజన్యమూర్తి. ఈపయిని, కవిత్వమెటులుండునో భావింపుడు. ఈకవి యభిప్రాయమిది:

వేగు జామున వికసించు విరులయందు

రేకు వెడలించు సంజపూ రెమ్మలందు

కావ్యమున బోలె బఠియింతు కౌతుకమున

ప్రకృతి సామ్రాజ్య పాలన పద్ధతులను.

చటులకల్లోల రసనల సాగరంబు

పవలు రేయి నాలాపించుపాటలందు

అనితర గ్రాహ్యధర్మంబులై చెలంగు

విశ్వసృష్టి ప్రకారముల్ వినుచునుందు. గుజురు తుంపర ముత్యాల కాన్క లిడుచు

తరలు సెలయేటి పాటలో దాగియున్న

రాగతత్త్వంబు నామని రాత్రులందు

కూయు కోయిల కడ నేర్చికొందు వనుల.

            *

ఇట్టి తత్త్వములో నీ రెడ్డి కవి కోకిలము మధురకావ్యగానముచేసినది. వీరి కృషీవలుడు-పానశాల మున్న యినకృతులు చాల బ్రశస్తికెక్కియున్నవి. పల్లెటూరి రైతుబ్రదుకు 'కృషీవలుడు' కావ్యమున మూట కట్టినట్టులు ముచ్చటగా గనవచ్చును.

అన్నా హాలిక! నీదు జీవితము నెయ్యం బార వర్ణింప మే

కొన్నన్ నిర్ఘర సారవేగమున వాక్పూరంబు మాధుర్య సం

పన్నంబై ప్రవహించు గాని, యితరుల్ భగ్నాశులై యీర్ష్యతో

నన్నుం గర్షక పక్షపాతి యని నిందావాక్యముల్ పల్కరే?

రామి రెడ్డి కవిత్వమునకు హాలికుడు ఉద్దీపకుడైనాడు. గతాను గతిగ మార్గమున సాగక, దేశకాలస్థితులు గుర్తించి తన తీయని కైతలో జానపద వాతావరణము రాణింప జేసిన యీరెడ్డికవి మఱవరానివాడు. ఈయన కవిత వివిధ విషయములయందును బ్రసరించినది. 'ప్రణయాహ్వానము' ఎంతమెత్తగా నున్నదో, చూడనగును:

చంద్రికా ముగ్ధ శర్వరీచ్ఛాయలందు

జీవలోకంబు నుఖసుప్తి చెందుచుండ

కవి మనంబును బ్రకృతియు కలయుచుండ

పోదమా కాంత, సెలయేటి పొదలదరికి.

పులుగులు గూళులం జెదరిపోయిన రెక్కల నొత్తికొంచు, గొం

తులను పరస్పరంబు బిగితో బెనవై చెడి వేళ, నెప్పుడుం

దెలుపని హృద్రహస్యముల తిన్నగ వీనులవిందుసేయ నౌ

చెలి సెలయేటి సైకతిము చేరుదమా, మనకేలి యూతలన్. జిలిబిలి కమ్మగానములు చేసెడి యా సెలయేటి యొడ్డునన్

పులకల విస్తరిల్లి నను బోడిమి జూపెడు నీదు బుగ్గలెన్

దొలకెడిసిగ్గుడాలు కడదోపని ముద్దుల గ్రుమ్మరించి యి

వ్వల మధురోక్తులం గడిగి వై చెద గోమలి, రమ్ము మెల్లగన్.

              *

శ్రీ రామిరెడ్డిగారికి బెక్కుసారస్వతములతో బరిచితి యున్నది. ఈయన ఆంగ్లకవితయు స్తుతిపాత్రమై యున్నది. విజ్ఞానశాస్త్ర పరిశోధనము లన్నచో నీయన కధికప్రీతి. శాస్త్రపరిశోధకుల గౌరవనిధి పదివేలు మీదుగట్టి యుంచిన యీరెడ్డిమహోదారత తెలుగునాట రత్నజ్యోతియై నిలుపగలదు. శ్రీమత్కుటుంబమున జనించి, చేతులనిండ విత్తమార్జించి, దుర్వ్యసనములకు బోక విజ్ఞాన నిక్షేపముగా వెచ్చించిన రామిరెడ్డి సాహిత్యధనము పవిత్రమైనది; స్థిరతరమైనదియును. కవితా కళయందే కాక, లోకవ్యవహారములందును వీరికి జాతుర్యము కలిగి యుండెడిది. 'సినిమా' దర్శకత్వములో నిరూపితమైన యీయన నైపుణ్యము గణ్యమై యున్నదిగదా!

విజ్ఞాన పరిశోధన ఫలము కవిత్వకళలో రంగరించి పొంగార జేసి యీమధురకవి వ్రాసిన "పలితకేశము"-"రవి, కవి" యను కావ్యములు చక్కనివి. రెండవ కావ్యమునుండి రెండుపద్యములు:

చ. మునుపటినుండి మానవ సమూహము గాంచిన యున్నతస్థితుల్

పొనరిచినట్టి కార్యము లపూర్వ మనో బలసిద్ధులుం, జిరం

తనమగు దేశానాగరికతల్ బహుశాస్త్ర సమార్జనంబు జె

ప్పిస బదియేండ్లు పట్టు; బృథివింగల దంతయు జెప్పసాధ్యమే?

ఉ. వీనికి మూలకారకులు విశ్రుతబుద్ధి వివేక పూర్ణ వి

ద్యానిలయుల్ సమర్థులు నుదారగుణాడ్యులు పూజ్యులైన మా

మానవులేగదా, తెలివిమాలి వచించితి వింతసేపు నో

భానుడ! చాలు చాలు, నిక బల్కకు మేల వృథాప్రయాసముల్.

               __________________