ఆంధ్ర రచయితలు/గుర్రం జాషువ కవి
గుర్రం జాషువ కవి
1895
జననీజనకులు: లింగమాంబా, వీరయ్యలు. జన్మస్థానము: వినుకొండ. జననము: 1895 అక్టోబరు 28 తేదీ. కృతులు: 1. ఖండకావ్యము (మూడు భాగములు) 2. పిరదౌసి 3. గబ్బిలము 4. స్వప్నకథ 5. కాందిశీకుడు 6. ముంటాజమహలు 7. నేతాజీ 8. స్వయంవరము 9. బాపూజీ (ఖండ కావ్యములు) 10. వీరాబాయి (చరిత్రాత్మక నాటకము) 11. తెరచాటు (సాంఘికనాటకము) ఇత్యాదులు మొత్తము నేటికి రచితములు 21 గ్రంథములు.
నేడుసాగుచున్న యిరువదవ శతకమునకు ఖండకావ్యశకమని పేరు పెట్టుటలో నాక్షేప ముండదు. మహాకవి కాళిదాసు 'మేఘదూతము' ఈ నూతన శకము మేలుబంతి. ఈకాలమున జనించిన మహాకావ్యములు వ్రేళ్ళలెక్కకు వచ్చునవి. ఖండకావ్యము లసంఖ్యాకములు. అనేక కారణములవలన నేటి పాఠకులు సుకుమార హృదయులైనారు. పాఠకుల చిత్తవృత్తుల కనుగుణముగా రచయితలును. లేదా, కొన్ని హేతువు లుండి రచయితలు కవితలో మితబాషులుగానున్నారు. రచయితల ననుసరించి పఠితులును. నేటికవుల చూపులలో గొత్త మెఱుగు లున్నవి. వా రేఱుకొనవలసిన యితివృత్తములే వేఱు. జాతీయమైన సంచలనము, రాజకీయమైన పరిణామము, భాషీయమైన వికాసము-ఇత్యాదు లెన్నో తెనుగున వెల్లిగొని కవిత్వమున నూత్న మార్గములు లేచినవి. పెఱ వాజ్మయములతో మన కేర్పడిన సాన్నిహిత్యము కూడ నీ నవోదయమునకు బేర్కొన దగిన యాదరువు. దాన, దీన-స్వల్పకాల పఠన సాధ్యమగు ఖండకావ్య గానమునకు నేడు సుప్రచారప్రశస్తులు పరిడవిల్లుచున్నవి. ఖండకావ్యములు రెండు మూడు పద్యములనుండి, రెండు మూడు నూఱుల పద్యముల వఱకు నున్నవి. యీనాడు వెలువడుచున్నవి. పద్యముల రాశితోనే కావ్యత్వ సిద్ధి యనరాదుగదా! "అమరుక కవేరేక శ్శ్లోక: ప్రబంధశతాయతే." కావ్యముయొక్క ఏకదేశానుసారియైనది ఖండకావ్య మని సాహిత్య దర్పణకారుడు. దీనికే సంఘాత మని నామాంతరము. ఇది యపూర్వము కాకపోయినను, పూర్వకవులలో ఖండకావ్య రచయితలు మిక్కిలి తక్కువ. నేడో మూడువమ్,తులు ఖండకావ్యముల కారు.
ఏతాదృశ కావ్య వాజ్మయ మధుమాసమున 'జాషువకవి' కషాయకంఠమున గాన మొనరించుచున్న పుంస్పికము. ఆయన ఉభయ భాషా ప్రవీణులు, కవితా విశారదులును. చరిత్ర ప్రసిద్ధమైన వినుకొండలో జాషువకవి జన్మించుట పేర్కొన డగినది. ఈ ధన్యత్వము, ఆయన గుర్తులో నుంచుకొని యిట్లు వ్రాసికొనెను:
శ్రీరాము డేకొండ శిఖరాన గన్నీట
నాలించె సీతాపహరణగాధ
దాటించె నేవీటి దాపున నైతమ్మ
పట్టి మేల్పొట్టేలి వాహనంబు
కోట కొమ్మలమీద గ్రుచ్చినా రేవీటి
తెలుగురాజుల విరోధుల శిరాలు
ముత్యాలతో నారబోసినా రేవీటి
నృపతు లేటేట బండిన యశస్సు
భాస్కరుని దానధార కేపట్టణంబు
చారు చరితకు బంగారు నీరు వోసె
నట్టి వినుకొండ కడుపున బుట్టుకతన
ధన్యుడను నేన యుత్తమోత్తముడ నేన.
జన్మస్థానము వినుకొండ యగుగాక, తెలుగుమండలము సర్వము జాషువకవి కీర్తికి స్థానమైయున్నది. సాధారణ ప్రజానీకములోసైతము మెచ్చుకోలుపడయగల కవితారచన జాషువకవిగారికి నైసర్గికమైయుండి వచ్చినది. రసికవిద్వాంసులు వీరికృతులు చూచి మురిసిపోవుదురు. ఏమనగా, తియ్యనైన శయ్యావైభవముతో, నిర్దుష్టమైన భాషాప్రాభవముతో హృదయములో నున్న విషయమంతయు బాఠకున కందీయగల కూర్పునేర్పు వీరి కబ్బినది. అబ్బిన చాతుర్యమును నిరంతరాభ్యాసమువలన బెంపుచేసికొనిరి. దానితో, ఆయన ప్రతిపద్యము హాయి యనిపించునట్లు వ్రాయగలుగును. బంగారు తీగెవంటి యేదోయొకధారాళత! వృత్తములు, విశేషించి సీసములు, క్రొత్తధోరణిలో క్రొత్తసొంపులు పెట్టి వ్రాయుటలో నీ కవి పేరుపడెను. ఈయన రచించిన ఖండ కావ్యములన్నింటను శైలి సరిగా నొకేతీరున సాగుచుండుట గమనింపదగినది. ఆయన పలుకుబడులు, జాతీయములు, విదేశీయ పదప్రయోగములు, ఎత్తుగడలు-ఎక్కడకు వెళ్లినను మారిపోవు. అదీ ఆయన ప్రత్యేకత. ఈ పద్యములు కొన్ని చూడుడు:
వేగిరాజుల సతీ వితతికి గరువంపు
నడక నేర్పినది నన్నయ్యరచన
తెనుగుభాషా పదమ్మునకు జారని వన్నె
బట్టించినది కవిబ్రహ్మపలుకు
కంచుడక్కల నోరు గట్టించి జయ కేత
నముల నెత్తినది శ్రీనాథుజిహ్వ
ప్రతిలేని యపవర్గ పదవి వంకకు రహ
దారి తీసినది పోతన చరిత్ర
విజయనగరాధిపుల పురావేదికలకు
నందలంబుల మోయు మర్యాద గరపి
తనివి గొన్నది మొన్న పెద్దన కవిత్వ
మాంధ్ర భారతీ! నీ తేజ మద్బుతంబు. విజయ విలాసుని వినుతింప దలచిన
జక్కన కోరమీసాలుదువ్వె
జక్కన్న కవనంబు చక్కనిదని పల్క
పినవీరకవి పల్కువెలదికిమగ డన్న
గండ పెండారంబు ఘల్లు మనియె
పెద్దన్న కవితకు బెదతాత యనిపల్క
రామభూషణు డంబరంబు సూచె
భట్టు మూర్తికి గవిరాజుపట్ట మీయ
తిట్టి లింగడు చేపల బుట్ట సూపె
నందఱందఱు మహనీయు లని తలంచి
యొక నమస్కార మొనరించి యూరకుంటి.
*
కరుచైపోయిన వీరలోకమునకై కన్నీరు వర్షించుచున్
గరముల్ మోడుచు మందభాగ్యదశ కింకన్ దావు లేకుండగా
దొరకె న్మాకు విచిత్ర ద్విగ్విజయ వస్తుశ్రేణి బాపూజిచే
తరమే మమ్మెదిరింప నన్నులకు ఛత్రగ్రహి ఖండాళికిన్.
"స్వయంవరము"
*
ఆడంగుల్ కలవారి తొయ్యలు లనూర్యంపశ్యలై, హాయిగా
మాడీలం బరదాలలో మెరయు శంపావల్లులై యొప్పగా
నాడుం గొండల కోనలన్ గృషికకాంతల్ మూవులం బావల
ల్లాడుం గష్టము చేయు దృశ్యములు నాయాత్మం బ్రపీడించెడిన్.
"కాందిశీకుడు"
* ఇట్టి శయ్యాసౌష్ఠవము తఱచుగా నేడు మనముచూడజాలము. విజాతీయ పదములకు మాఱిపోని తెలుగుముద్రవేసినకవి జాషువయే. ఆయన ఖండకృతులలో దొలుత మంచిపేరువడ్డది "పిరదౌసి". దానివెనుక జాలకృతులాయన వెలువరింవ్హెను. ఇవియెల్ల 'పిరదౌసి' కావ్యమునకు ఆమ్రేడితములు. గబ్బిలము-అనసూయ మున్నగు వీరిరచనలు వ్యథాభరితమైన హృదయమునుండి పొంగి వచ్చినవిగా దోచును. ఈయన కెంత యుత్సాహోద్రేకము లున్నవో, అంత యావేదనమున్నది. ఆవేదనమునుండి సముత్పన్నమగు కవిత రసార్ద్రమైయుండి రసిక మానసములు కరగించుటకు సమర్థమగును. కర్ణుని గూర్చి ఆయన రచించిన పద్యములు గొప్పవి. శ్రుతిసుఖమైన జాషువకవి కోకిలము కవిత్వ గానము విద్యార్థులు, విద్వాంసులు, పామరులు ధీమంతులు కూడ విని తనియుటకు దగినది. అన్వయములో పెళుసుతనము, పదముద్రలో బిరుసుదనము లేక కమ్మెచ్చున దీసినటులు నడచు వీరి కవితాశైలి తెలుగువారి పారాయణముగా జాలువాఱుచున్నది.
జాషువకవి యుభయభాషాప్రవీణ బిరుద విభ్రాజితుడు. 1919 నుండి గుంటూరు ట్రెనింగుస్కూలులో 1928 వఱకు నుద్యోగించెను. తరువాత, 29 సం.15 సంవత్సరములు గుంటూరు జిల్లా బోర్డు పాఠశాలలో తెలుగుపండితపదవి. 42 సం. నుండి మూడు వత్సరములు మదరాసున యుద్ధవిషయికమైన ప్రచారశాఖలో పాటలువ్రాయుచు, ఉపన్యాసములిచ్చుచు: గడపెను. 47 నుండి యుద్యోగ విరమణము. ఈవిశ్రాంతిలో నెన్నో కావ్యములు రచించుటకు వీరు సమర్థులు.
కావ్యరచనోద్యోగము ముందు, ఈ యుద్యోగములన్నియు లెక్కలేనివి. ఆయన ఆధునిక కవులలో జెఱిగిపోని తఱిగిపోని యశస్సునమార్జించుకొన్న కవి. గండపెండరములు తొడిగి, ఏనుగు నెక్కించి, కనకాభిషేకముచేసి, సహస్రద్రవ్యములు కానుకనిచ్చి, తెలుగునేల జాషువకవిగారిని గౌరవించుచున్నది. ఈ గౌరవములకు వారికావ్యములు దోయిలించుచున్నవి.