ఆంధ్ర రచయితలు/వేంకటాద్రి అప్పారావు

వేంకటాద్రి అప్పారావు

1893


నూజవీడు సంస్థానమునకు సంబంధించిన ' ఉయ్యూరు ' జమీందారు. పెంచినతండ్రి : శ్రీరాజా రంగయ్యప్పారావు. వెలమవంశీయులు. నివాసము : నూజవీడు. జననము 1893 ఏప్రిలు 29 వ తేదీ. గ్రంథములు: గోవర్ధనోద్ధారణము, దుర్యోధనాంతము, పృథ్వీరాయుని యంతము, స్నేహలత, శ్రీశోభనాచల మహాత్మ్యము, జ్యోతిర్లీల, ఆంధ్రాష్టపదులు- ఇత్యాదులు.


ఉయ్యూరు సంస్థానాధిపతులు రంగయ్యప్పారావుగారి సంస్కృతాంధ్రభాషాభిరతి కొంత ప్రసిద్ధమైనది. ' పర్షియా ' లో వారు గడిదేరిన విద్వాంసులట. ఆ వాజ్మయమున బ్రసిద్ధిచెందిన " షాహనామా " యను చరిత్రగ్రంథము కొంతభాగము నాంధ్రీకరించి ప్రకటించుట యందులకు దారకాణ. వీరి తరువాత వేంకటాద్రి అప్పారావుగారు సంస్థానమునకు వచ్చిరి. ఈయనకు గవితాధార నిసర్గముగా బుట్టినది. ఆకారణమున వట్టి ' మెట్రిక్యులేషన్ ' పరీక్షాపాఠ్యములతో దృప్తిపడక సంస్కృతాంధ్రములు చదువుకొనవలసిన శ్రద్ధ కలిగినది. గురుముఖమున గొంత వరకు బఠించి వలయు పాండిత్యమును గలిగించుకొనిరి. ఆపిమ్మట గోవర్ధనోద్ధారణము, శోభనాచల మాహాత్మ్యము, జ్యోతిర్లీల మొదలగు నాటక-కావ్యాదులు రచించెను. ఈయనకు నాట్యము, జ్యోతిషము, చిత్రకళ, సంగీతము మొదలగు విద్యలలో మంచి ప్రవేశమున్నది. ఈకళలెల్ల వీరిని స్వయంవరించినవి. చిత్రకళలో వీరికిగల స్వజనశక్తికంటె నభిమానము హెచ్చు. కవితావిషయమున వీరు గావించిన పరిపుష్టికంటె రచనాసృష్టి యున్నతస్థానమున నుండదగినది. వీరి సంగీతసాహిత్యాభిమానములకు ' ఆంధ్రాష్టపదులు ' దృష్టాంతము. ఇటీవల నందమైన యాకృతిలో దీర్చిదిద్ది యాంధ్రి కర్పించిరి. వచస్సందర్భశుద్ధి నెరిగిన జయదేవుని మధురగేయములను దెనుగు బాటలుగాను, శ్లోకములను బద్యములుగాను మార్చి ' ఆంధ్రజయదేవు ' డనిపించు కొన్నా రప్పారావుగారు. ఈరాజకవి రసోత్మేకమైన రచనా రమణీయకమున కీపద్యము మచ్చు :-


జారెన్ బిల్లనగ్రోవి చేనడలి కన్‌సైగన్ వ్రజస్త్రీతతిన్
ఓరం దొల్గగ కన్బొమ్మల్ మెలచి యెంతో భీతి లేజెమ్మటల్
గారన్ నన్గని సిగ్గు చిన్న నగవున్ గన్మోడ్పు తబ్బిబ్బులన్
దోరంబౌ హరి జూడ లోగలగె సంతోషంబు రోషంబునున్.


తెనిగింపు పొందికగా నుండి యింపు పుట్టించుచున్నను నాత్మప్రత్యయము చాలక " ఆ జయదేవునత్కవన మామృదుశైలియు భావరక్తియున్ నైజ మనోహర ప్రతిభ నాతెనిగింపునకెట్లు వచ్చు ? " నని వినయముగా జెప్పుకొన్నారు.


ఈయన రాధాకృష్ణ ప్రేమోపాసకుడు. వీరి చిత్రకళా నికేతనము దీనికి బతాక. రసికత నెరిగిన కవి యౌట శృంగారరసవిలసితములైన యితివృత్తములే వీరి రచనలకు నమధిక ప్రోత్సాహమిచ్చినవి. వంశము పౌరుషవంతమైనదనుట వీరగాథలు కూడ వీ రేరుకొని కబ్బములుగా గూరిచినారు. ఎర్రపంచె కట్టి, తెల్లని పొట్టి చేతులచొక్కా తొడిగి, చిన్న తువ్వాలు పయిని పడవైచికొనియుండు నీ భాగ్యవంతునివేసము దేశమున కొరవడి. ఈయన జ్యోతిర్లీల నాటకము మొదట నిటులు చెప్పుకొనెను.


సీ. కన్నారు నన్ను వేంకటరంగయప్ప రా
          యలు నారయామ్మ నిర్మల విభవులు

రాజ రంగయ్యప్పరాయ బహ్‌దరు చెల్ల
          యామ్మ ప్రేమను బెంచి రధిపదవికి
ధీరతా ధీయుతా సారంబు గూర్చిరి
          గురువర్యు లెందరో కోవిదులును
మత్ప్రాభవార్ధసమ్మతులు నుయ్యూరాది
          బహుజనపదవాటి రహితుకోటి

గీ. వంశవర్ధనుల్ సుతులను వరతనయుల
నేలు గృహవర్తి వేణుగోపాలమూర్తి
వేంకటాద్ర్యప్పరాయడ, విశ్వ సుజన
హిత విధేయుడ విష్ణవమతపరుండ.

1927 సం||లో కాకినాడయందు జరిగిన ఆంధ్రసాహిత్య పరిష ద్వార్షిక మహాసభకు వీ రధ్యక్షులుగా నుండి నెరపిన యుపన్యాసము తెనుగు బాసకు గైసేత.