ఆంధ్ర భాషా చరిత్రము 1-వ భాగము/ఉపోద్ఘాతమున కనుబంధము
ఉపోద్ఘాతమున కనుబంధము.
(i) 1931-జనాభా నివేదికలో తెనుగును గూర్చి వ్రాయబడిన యంశము లీక్రింద సంగ్రహముగా చూపబడినవి:-
"మాతృభాషయనగా నేమి?"
"1921-సంవత్సరమున జనాభా తీసికొన్నప్పుడు 'మీ మీయింట సాధారణముగా నేభాష మాట్లాడుకొందురు ? అని అడుగుచుండిరి. ఈ (1931) జనాభా సమయమున "నీ మాతృభాషయేమి?" అని అడిగిరి. మాతృభాష యేది యను విషయమున నెవ్వరు నెట్టి సందేహమును పడనక్కఱలేదని యెంచుచుందురు. కాని, జాతులును భాషలును నొకదానితో నొకటి కలియుచుండు నీదేశమున సాంఘికాచారము లందును, మత నియమములందునువలె భాషా విషయమున గూడ మాతృభాష యిదమిత్థమని చెప్పుట కష్టమగుచుండును. కావున, నీ విషయమున నెట్టి ప్రశ్ననువేయుట అను విషయమై నిర్ణయించుట కొంచెము కష్టమయ్యెను. సాధారణ మనుష్యుడు సరియైన ప్రత్యుత్తరమిచ్చుటకు సరియైన, సూత్రప్రాయముగనుండు ప్రశ్నను కోరుచుండును. కొంద ఱీ విషయమున నెట్టి ప్రశ్నలకును లొంగకుండిరి. "తమిళుడు తెనుగు స్త్రీని పెండ్లాడిన వారిసంతానముభాష యేమగును?" అని యొకడు ప్రశ్నించును. గంజాము జిల్లాలో తెనుగును ఒఱియాయు గలియుచోట, తెలుగు ఒఱియాభాషల రెండింటిని గూడ మాట్లాడు తెగలవారున్నారు. ఒకటే కుటుంబములోని జనుల పేళ్లలో ఒఱియాపేళ్ళు, తెనుగు పేళ్లుకూడ వినబడుచున్నవి; తెనుగువారిలో నుండు ఇంటిపేళ్లు అట్టివిలేని ఒఱియా కుటుంబములలో వినబడుచున్నవి. అట్టి జనులు తమ మాతృభాష యేది యని యడిగినప్పుడు సరిగ చెప్పలేరు. తమ పూర్వులనుండి యా విషయమై తెలిసి యుండలేదు; తెలిసికొనుటకు వారికి జాలినంత విద్యయులేదు. చిన్ననాటనుండియు వారు రెండుభాషలను మాట్లాడుచునే యున్నారు. "నీ వింటిలో ఏ భాష మాట్లడెదవు?" అని తొలిసారి యడుగగా 'తమిళము' అని చెప్పిన వాడు, నా యెదుటనే తిరిగి 'నీమాతృభాషయేది?' అని అడిగినప్పుడు 'తెలుగు' అని ప్రత్యుత్తరమిచ్చెను. ఈతడు తెలుగువాడు; తెలుగురాని తమిళ స్త్రీని పెండ్లాడినాడు; కాబట్టి, గృహకృత్యములు సరిగ జరుగుటకు భార్యభాషను నేర్చికొని, ఇంటిలో తమిళమును మాట్లాడుచున్నాడు. కడపజిల్లాలో ఒక సూపర్వెజరు తన ప్రశ్నకు సరియైన సమాధానము చిక్కక, "నీ తల్లిపాలతో ఏ భాషను త్రాగినావు?" అని ప్రశ్నించినాడు. ఈ ప్రశ్నకు వెంటనే సరియైన సమాధానము వచ్చినది.
ii. ఉపభాష.
iii. చెన్న రాజధానిలోని భాషలు.
చెన్నరాజధానిలో తమిళము, మళయాళము, తెనుగు, కన్నడము, తుళు, హిందూస్థానీ, అను వ్రాతగలభాష లాఱున్నవి. వీనిలో తెను గన్నిటికంటె సుస్వరితమును, శ్రావ్యమునునై యున్నది. దీని నైరోపా భాషలలోని 'ఇటాలియను' తో బోల్చుట సరిగనే యున్నది. కాని, కొన్ని ఇటాలియను ఉపభాషలు చెవి కసహ్యముగా నుండునట్లే, తెలుగున గూడనన్ని యుపభాషలును నొక్కరీతిగనే శ్రావ్యముగ నున్నవని చెప్ప వీలులేదు.
iV. తెలుగు భాషకు సరిహద్దులు.
(అ) I. తెలుగు-ఒఱియా సరిహద్దు:- గంజాము జిల్లాలోను, విశాఖపట్టణము ఏజెన్సీలోను కొన్ని ప్రదేశములలో రెండు భాషలును సరిసమానముగ నూటికేబది వంతున నున్నారు; కొన్ని ప్రదేశములలో రెండు భాషలును నూటికేబదివంతులు పొందియుండలేదు. సముద్ర ప్రాంతమందెల్ల తెనుగువా రుండుట గమనింపదగినది. ఋషికుల్యా ముఖద్వారము వఱకు దెనుగువారున్నారు. కొన్ని రీతులుగ ఋషికుల్యా నదియు, దాని యుపనదులును ఒఱియా భాషకు దక్షిణపు టెల్లయని చెప్పవచ్చును. ..... విశాఖపట్టణము ఏజెన్సీలో నౌరంగపూరు ఉత్తరభాగము, జయపురము, కో--పుట్టి తాలూకాలలో ఒఱియాభాషయే ప్రధానమైనదన వలెను; కాని, యిచటగూడ నాభాష కోయమొదలగు భాషల ప్రదేశము నాక్రమించుచున్నదనియే చెప్పవలెను. ... విశాఖపట్టణము ఏజెన్సీకి దక్షిణముగ నచ్చు గొలదిని తెనుగుభాష ప్రబలమగుచున్నది, గూడెమ్, నిరవల్లి తాలూకాలోను పాడ్వాతాలూకా దక్షిణమునను తెనుగె ప్రధానభాషయని చెప్పవలెను.
(ఆ) II. తెలుగు - కన్నడముల సరిహద్దు:- ఈ యెల్ల ఉత్తరమున హగేరీ నదియు దాని యుపనదియగు చిన్న హగేరీయు నని చెప్పవచ్చును. మడకసిరా తాలూకా పశ్చిమభాగము కొంచెము తప్ప అనంతపురము జిల్లా యంతయు తెనుగు దేశమందే చేరుచున్నది. ఇచట తెనుగు సరిహద్దు మైసూరు సంస్థానములోనికి చొచ్చుకొని పోవుచున్నది. ఆ సంస్థానములోని కోలారు జిల్లాలోని జనులలో మూడువంతులలో రెండువంతులమంది తెలుగే తమ మాతృభాషగా చెప్పికొని యున్నారు. ఈ ఎల్ల హిందూపురమునుండి కుప్పమువఱ కున్నదని చెప్పవచ్చును; కాని, యీ విషయము మైసూరు జనాభా లెక్కలవలన నిర్ణయము కావలసియున్నది. ఈ యెల్ల సేలము జిల్లాలోని హోసూరు తాలూకా ఉత్తరపుభాగమును కోసికొనిపోయి, పుత్తూరు, చిత్తూరు, తిరుత్తని తాలూకాలలో దక్షిణభాగములను తెనుగు ప్రదేశమున జేర్చుచు, చిత్తూరు - ఉత్తరార్కాడు జిల్లాల సరిహద్దు ననుసరించి, చెంగల్పట్టు జిల్లాలోని తిరువళ్లూరు, పొన్నేరి తాలూకాలను తెనుగుదేశమున జేర్చుచు, పులికాడు సరస్సునకు దక్షిణమున సముద్రమును గలియుచున్నది.
(ఇ) III. తెలుగు - అరవముల సరిహద్దు:- దక్షిణమున అరవదేశములో తెనుగున కెల్లను నిర్ణయింప వీలులేదు. తూర్పు-పడమటి కనుమల మధ్యమునందెల్ల తెనుగు కొలదిగనో గొప్పగనో వ్యాపించి యున్నది. దక్షిణ ఆర్కాడు దక్షిణపు తాలూకాలలోదప్ప, తంజావూరుజిల్లా, పుదుక్కోట సంస్థానము, రామనాథ, శివగంగ జమీందారీలు, తామ్రపర్ణీ నదికి దక్షిణముననున్న తిరునల్వేలిజిల్లా,- ఇచట నచట నన నేల, దక్షిణదేశమందెల్లెడల తెనుగు మాతృభాషగా వినవచ్చు చున్నది. ఈ యెల్ల ఒక మార్గమును పట్టలేదు; కాని, రెండు విషయములుమాత్రము గమనింప దగినవి - (i) మిట్ట ప్రదేశము ననుసరించుట (ii) రాయల సీమలోని నల్ల రేగడభూముల నాశ్రయించుట. తూర్పు తీరమునను, నదీముఖద్వారములను తెనుగు లేదు. తిరునల్వేలి, రామనాథ జిల్లాలలోని కనుమలకు తూర్పుననున్న ఎఱ్ఱమట్టి భూములలో తెనుగువారు పలుచగను, సత్తూరు, శ్రీవిల్లిపుత్తూరు, శంకర నారాయణర్ కోవిల్, కోవిల్ పత్తి తాలూకాలలోని నల్లరేగడ భూములలో అధికముగను గానవచ్చుట గమనింపదగినది. ఇట్లే, మధురజిల్లాలోని తిరుమంగళము తాలూకా నల్లరేగడ భూములకు ప్రసిద్ధి; ఇచట తెనుగు వారెక్కువగ నున్నారు. ఆ జిల్లాయందే మేలూరు తాలూకాలో పచ్చని భూము లున్నవి; ఇచట తెనుగువా రంతగా లేరు........
(ఈ) IV. పడుమటి తీరము:- ఈ తీరమున గూడ తెనుగువారు స్థిరనివాసము నేర్పఱుచుకొని యున్నారు. దక్షిణ కనరా జిల్లాలోని 'కొరగ' లట్టివారు. వీరికొక రహస్యభాష యున్నది. ఇతరులు వినుచుండగా వారు దానిని మాట్లాడరు. కాని, అది తెలుగును బోలి యుండునని తెలియుచున్నది. వీ రనంతపురమునుండి యొక రాజు సేనతో నా ప్రదేశమునకు వచ్చియుండినట్లు వీరియందొక యైతిహ్యమున్నది.
తెలుగువారి యుపభాషలు.
తెనుగు మాతృభాషగా గలిగి మఱియొక దాని నుపభాషగా వాడుచుండు తెనుగువారి సంఖ్య, తమిళము మాతృభాషగా గలిగి యుపభాషల నవలంబించిన తమిళుల సంఖ్యకంటె నాఱురె ట్లధికముగా నున్నది. ఈ భేదమువలన తెను గెంత విరివిగ వ్యాపించియున్నదో తెలియగలదు. హిందుస్థానీ భాష, మాట్లాడువారికంటెను తెనుగు మాతృభాషగా గలవా రెక్కువగ ననేక ప్రదేశములందు వ్యాపించియున్నారు. తెనుగువారెక్కువగ నుపయోగించు నుపభాష తమిళము; కాని, తక్కిన భాషలు మాట్లాడువారు కొలదిగనో గొప్పగనో తెనుగును మాట్లాడుచుందురు. గోదావరి, కృష్ణా జిల్లాలలో తెను గెక్కువగా నుండుటవలన నిచటి వారి కుపభాషలులేవు; పుదుక్కోట సంస్థానములోని తెలుగువారిలో నూటికి తొంబది యెనిమిది మంచి తెనుగునే నిత్య జీవనమున వాడుదురు....... దెలుగువారునిజముగ 'దక్షిణాపథ విహారి' యని వర్ణింపవచ్చును, భాషలను నేర్చుకొనుటయందత -------- వాడు."
II
చెన్న రాజధానిలోని జనసంఖ్యలో ప్రతి 10,000 మందికి నాయాభాషల మాట్లాడువారిక్రింది విధముగ నున్నారు:-
-- | 1931 | 1921 | 1911 | 1901 |
తమిళము | 4013 | 411 | 400 | 4035 |
తెలుగు | 3768 | 3772 | 3769 | 3706 |
మళయాళము | 790 | 754 | 740 | 739 |
ఒఱియా | 392 | 368 | 383 | 468 |
కన్నడము | 366 | 361 | 382 | 406 |
హిందుస్థానీ | 260 | 234 | 233 | 230 |
తుళు | 121 | 126 | 122 | 128 |
III
ఉపభాషలు (Dialects).
తెనుగు మాట్లాడువారు తమభాషకు పేళ్లుగా చెప్పుకొనిన కొన్ని శబ్దములు:- గంజాముజిల్లా దరుల (2); విశాఖపట్టణము:- అఘ్ర (84); బగత (27); బోయ (13); చెంచు (277); ద్రవిడ (1,487); ఏతవన్ (2); ఏతి (40); జోగి (6); మాల (313); మొసిరి (23); ముల్హం (2); రెడ్డి (10); తిత్తియ (14); ఉప్పోరు (2); వైష్ణవ (4); యాత (9).
తూర్పు గోదావరి:- బసగొల్ల (7), దొమ్మర (43); వుప్పరి (1).
పశ్చిమ గోదావరి:- మోటు (3);
కృష్ణ:- రంగిరాజు (30); యానాది (10).
అనంతపురము:- జోగ (13).
బళ్ళారి:- బారిక (3); వడ్డరు (20).
మధుర:- ముత్తువర్ (70).
కోయంబత్తూరు:- లోడియ (2); తొట్టియర్ (3).
IV.
ద్రావిడభాషా కుటుంబములో తెనుగునకు గల స్థానము.