ఆంధ్రభాషార్ణవము/ప్రథమ కాండము

ప్రథమకాండము

స్వర్గవర్గము

సీ.

గట్టులయెకిమీఁడు గన్నవాల్గంటిని జెట్టపట్టుకయేలినట్టిదిట్ట
మున్నేటిరాచూలిముక్కఁ గెంజడలోనఁ గ్రొవ్విరిగాఁ దాల్చుకొన్న మేటి
గబ్బుచెంకమెకంబు గట్టికళవసంబు కుబుసంబుగాఁ జేసికొన్నదంట
ప్రాఁబల్కుగుఱ్ఱముల్ పన్ని సిస్తగునట్టి పుడమితెరేక్కినపోటుగాడు
జముపగతుఁడు బూచులదొరజంగమయ్య మినుసికగలాఁడు ముక్కంటి యనఁగనిట్లు
యౌగికంబులు భవదాఖ్య లలరి యుండు ధాతృమతపదజలజాత మాతృభూత.

37


క.

వెన్నుండు కఱ్ఱినెచ్చెలి, క్రొన్ననవిలుకానితండ్రి గుడుసుటడిదపున్
మన్నెదొర లచ్చిమగఁ డన, నన్నలినాక్షునకుఁ బేరు లగును మహేశా.

38


ఆ.

పలుకువెలదిమగఁడు బంగారుకడుపువాఁ, డంచతేజ నెక్కునట్టి రౌతు
బమ్మ తాత నలువ తమ్మిచూలి దుగినుఁ, డనఁగ బ్రహ్మపేరు లబ్జమౌళి.

39


ఆ.

గట్లఱేనిబిడ్డ కఱకంకునిల్లాలు, కొదమసింగ మెక్కుకొన్న జంత
సత్తి సామితల్లి చండి యమ్మిక దుగ్గ, యనఁగ నీనెలంత యలరు నభవ.

40


క.

వలరాజుతల్లి కలుముల, చెలి కలువలఱేేేనితోడు సిరి లచ్చి యనన్
వెలయును లక్ష్మీనామ, మ్ము లివెల్లను జూడఁ జంద్రభూషితచూడా.

41


క.

పలుకుఁజెలి లచ్చికోడలు, కలనితబిసితల్లి తూఁటిగాసపుఁదేజీ
గలబోటి యనఁగ భాషా, జలజాక్షికిఁ బేరు లౌ నిశాకరభూషా.

42


తే.

గుజ్జువేలుపు పిళ్ళారి కొక్కురౌతు, బొజ్జదేవర యేనుఁగు మొగముసామి
పనిచెఱుపువాఁడు వెనకయ్య యన వినాయ, కునకు బెేళ్ళొప్పును సుగంధికుంతలేశ.

43


చ.

కొమరుఁడు సామి కొంచమలగొట్టిన జాణఁడు విప్పుగన్ను మొ
త్తముపడవాలు ముద్దుగలతల్లులబిడ్డఁడు తీఁగపేరిక
ల్కిమగఁడు ఱెల్లుచూలి నెమిలింబయికొన్న మనీఁడు బారకే
ళ్ళమరినవాఁడు నా నగు గుహాఖ్యలు శ్రీ త్రిశిరఃపురీశ్వరా.

44


సీ.

కండచక్కరదిండికత్తలానివజీరుఁ డలరువిల్కాఁడు పూవులవిలుతుఁడు
చెఱకువిల్కాఁడు క్రొంజిగురులవిల్కాఁడు తలిరువిల్తుండు కన్నులవిలుతుఁడు
పచ్చవిల్తుఁడు చౌపంచతూఁపులజోడు కమ్మవిల్కాఁడు డెందమ్ము చూలి
తియ్యవిల్తుఁడు గాలితేరెక్కుమన్నీఁడు చక్కరవిల్కాఁడు చక్కనయ్య
తుంటవిల్కాఁడు మరుఁ డించువింటివాఁడు దీఁగవిలుకాఁడు వలరాజు తేఁటియల్లె
వింటిదొర నెలయల్లుఁడు వెడవిలుతుఁడు నాఁగ మరునాఖ్య లగు శేషనాగభూష.

45


క.

కరిజేజెయన్న వినుప్రోల్, దొర చౌదంతియెకిమీఁడు తూరుపుదొర మ
బ్బురవుత వేగంటి యనన్,సురనాథుని పేళ్ళు చెల్లు సూర్యవతంసా.

46

క.

దుగమోములయ్య వేల్పుల, మొగ మంటనివేల్పు మబ్బుపూనిసు వనఁగాఁ
దగు నగ్ని దేవతాఖ్యలు, నగజాచిత్తాబ్జతోష నాగవిభూషా.

47


తే.

అగ్గి యనఁగిత్తనంగఁ జిచ్చనఁగ వెలయుఁ, జేతాచేతనాగ్ని నీర్చిచ్చనంగఁ
బొలుచు బడబాగ్ని బూది విబూదియనఁగ భూతి దనరారు శ్రీమాతృభూతలింగ.

48


తే.

వెలిముడియు ననఁగా భస్మభేద మెసఁగుఁ, గందు నారాట మారట కాక మరుగు
దుడుకుసెగ తెర్లు నాఁగఁ జెన్నొందుఁ దాప, మునకు నామంబులై మాతృభూతలింగ.

49


తే.

జముఁడు గుదెదాల్పు పోతుగుఱ్ఱముగలాఁడు
దక్కినపుఱేఁడన యమాఖ్య దనరుఁ బొలసు
దిండి రక్కసి రాతిరిఁ దిరుగుమేటి
యనఁగ నైరృతి దగు నుమాప్రాణనాథ.

50


తే.

వాననెచ్చెలి పడమటివంకఱేఁడు, వల్లెత్రాడు గలాఁ డన వరుణు డొప్పు
లిబ్బిదొర జక్కులకు ఱేఁడు గిబ్బరౌతు, సకుఁడు వానీ డనంగ నీసఖుఁడు శర్వ.

51


తే.

లచ్చిదొరబూరగొమ్ము వలమురి యనఁగఁ, బాంచజన్యంబు దనరు వేయంచులలుగు
చుట్టుకైదువు గుడుసువా ల్సుడియడిదము, బటువుకత్తి నాఁ జక్ర మౌ నిటలనయన.

52


క.

గరుటాలమంతుఁ డనఁగను, గరుడి యనన్ బొల్లినెమ్మొగముపిట్ట యనన్
గరుటామంతుం డనఁగను, గరుడునిపేళ్ళొప్పుఁ జాలఁ గంఠేకాలా.

53


క.

శూలము వెలయును ముమ్మెన, వాలనఁ దెలిగిబ్బ యనఁగఁ బరఁగుచు నుండున్
శూలధరుఁడెక్కు వృషభము, శీలవదాశయనివేశ చెవ్వందీశా.

54


క.

తనరును వేల్పులయిల్లనఁ, గను వేవన్నెలపసిండిగ ట్టనఁగా మే
రునగము దగుఁ దెలియే ఱన, వినువాఁ కాన సౌరగంగ వృషభతురంగా.

55


క.

దైవతమ దావళంబు చౌదంతి యనఁగఁ, దెల్లయేనుఁగు నాగను దేజరిల్లు
దేవతాశ్వంబు వెలయును దెల్లతేజి, నిక్కువీనుల జక్కి నా నీలకంఠ.

56


క.

వెలిగిడ్డి వింటిపసి వెలి, కిలఁబడుతొడు కనఁగఁ బరఁగు ఖేచరగవియీ
పులమ్రాను తెల్లమ్రా ననఁ, జెలగును గల్పకసమాఖ్య చెవ్వందీశా.

57


క.

తలఁపురతనం బనన్ జే, జెలమానిక మనఁగ వెలయుఁ జింతామణి వెే
ల్పులకూ డన నమృతాభిధ, చెలఁగును సద్గుణనివేశ చెవ్వందీశా.

58


తే.

గాడ్పు కరువలి వినుచూలి గాలి వలపు, మోపరి చిలువమేఁ తనఁ బొలుచుఁ బవనుఁ
డెసఁగుఁ దెమ్మర యనఁగఁ బయ్యెర యనంగ, మందమారుతసంజ్ఞలు మాతృభూత.

59


తే.

ఈఁదయన నీఁదర యనంగ నెసఁగు శీత, వాయు వూపిరి యూర్పు నా శ్వాస మలరు
నొప్పు నది దీర్ఘమైన నిట్టూర్పనంగ, నధిక మగునది రోఁజు రొ ప్పనఁదగు హర.

60

తే.

ఉసుఱు నాఁగను బ్రాణాఖ్య యొప్పుచుండు, నదియ యొకచోట జీవాఖ్యయై చెలంగు
నాయురభిధానముగ నదె యలరుచుండు, భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

61


క.

సురలకు వేల్పులు జేజేల్, తెఱగంటులు బానవాలుదిట్ట లనం బే
ళ్లిర వగు సురవేశ్యల క, చ్చర లనఁ బేళ్ళొప్పు బాలచంద్రవతంసా.

62


తే.

పొలసుదిండ్లు రక్కసులు తొలివేలుపు, లనఁగ నసురసంజ్ఞ లలరు బూచి
గాము సోఁకు సత్తి గాలి దయ్యము బూత, మనఁ బిశాచసంజ్ఞ లలరు నభవ.

63


తే.

నీటిదయ్యంబు నెగడునా నివ్వటిల్లు, బొమ్మరక్కసి యనఁగను బొలుచు బ్రహ్మ
రాక్షసునిపేరుగాఁ బోతురా జనుగతిఁ, దద్విషేశంబు లై కొన్ని తనరు నభవ.

64


తే.

ఉద్దవిడి యురవడి హుటాహుటి చుఱుకన, జఱజఱన దడదడనఁగఁ జెఱచెఱ యనఁ
దీవరము సుళ్వు వైళము తివురు తివుట, వేగిరము తుఱు తన శీఘ్ర మౌ గిరీశ.

65


తే.

పరఁగును సతంబు నిచ్చ లప్పనము నిచ్చ, యనఁగ మిక్కిలి మిక్కుటం బగ్గలంబు
బెట్టు నిబ్బరము దిటము బిట్టు గాట, మనఁగ నతిశయ మగును సూర్యావతంస.

66


తే.

కలిమి సిరి పదవి యనఁగ జెలఁగు భూతి, పొలుచు నిక్షేపనామంబు పూడు పనఁగఁ
దనరు లిబ్బి యనంగ నిధానసంజ్ఞ, భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

67


తే.

శ్రీలు వెలయంగ నీపేరఁ జేయుకతనఁ బరఁగు శాశ్వతముగ స్వర్గవర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

68

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

వ్యోమవర్గము

తే.

చదలు నింగి యాకసము మబ్బుత్రోవ యు, ప్పరము విన్ను మిన్ను బయలు వెన్ను
నడుగు రిక్కదారి యన నభం బై తగు, ఖ్యాతిగుణసమేత మాతృభూత.

69


తే.

శ్రీలు వెలయంగ నీపేరఁ జేయు కతనఁ, బరఁగు శాశ్వతముగ వ్యోమవర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

70

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

దిగ్వర్గము

సీ.

ఆస యంచనఁ గడ యంచన దెస యనఁ దేజరిల్లుచు నుండు దిక్సమాఖ్య
తూరు పనంగను దొలిదెస యనఁగను బ్రాగ్దిశసంజ్ఞ యై పరఁగుచుండుఁ
దనరు దక్షిణసంజ్ఞ దక్కినం బన పలకడ యనఁ బ్రత్యక్కు పడమర యన
నడరు నుదక్కు డాకడ యన విలసిల్లు నఱ యన వెలయు నభ్యంతరంబు

మూల యన రోక యనఁ గోణ మొప్పు మొయిలు మొగులు మబ్బన మేఘాఖ్య లగును మోద
మనఁగ మందార మనఁగ మేఘావృతి దగుఁ బుంగవతురంగ శ్రీమాతృభూతలింగ.

71


క.

మెఱుఁ గన మెఱు పన మించనఁ, బరఁగును విద్యుత్తు స్తనితవాచక మౌఁగా
యుఱు మనఁగ నశనిఁ బిడు గం,దురు కొర డన రోహితంబు దోఁచుఁ బురారీ.

72


క.

ఆడె లన నాగడప లన, నాడెబ లన మొగిలుదొంతి కలరును బేళ్ళీ
మూఁడును వడగం డ్లంచును, వాడుదురు కవు ల్కరకల వాగీశనుతా.

73


క.

వఱ పన నవగ్రహంబై, వరఁగు సురేంద్రధనురాఖ్య భాసిల్లుచునుం
దు రతనపుని ల్లనంగను, స్ఫురితగుణావేశ మాతృభూతమహేశా.

74


సీ.

వాన యనంగను వర్షాఖ్య యగు నది విడువక పట్టిన జడి యనఁ దగుఁ
బసపస యను నది మును రనంగను మీఱు నల్పవర్షము సోన యనఁగఁ దనరుఁ
దూర జల్లనఁగను ధారాభిధానమౌఁ దనువైన నదియనూ చిను కనఁదగు
జలబిందునామంబు వెలయు బొట్టు లనఁ దుంపర లన నల్పశీకరము లెసఁగుఁ
దుట్రయన మంచుఁ బోలిన తూరవాన వాన వెలిసియుఁ జూరున బడిననీరు
బొట్లు వంగుళ్ళు నాఁగ నట్లొట్లు నాఁగ బేరులు వహించు నౌర కర్పూరగౌర.

75


తే.

అడ్డి యడ్డము మూయి కప్పడ్డపాటు, మఱుఁగు చాటోల మోలిమి మాటు మూఁత
యనఁగ వ్యవధాన మౌ గడి యన గడంబు, నాఁగను ఘటాదికపిధానమౌ గిరీశ .

76


చ.

నెల రెయివెల్గు చెంగలువనెచ్చెలి వెన్నెలగుత్తి చందు జా
బిలి చలివెల్గు చందురుఁడు వెన్నెలరాయఁడు చందమామ రే
పొలఁతిమగండు వేలుపులబోనము పుట్టుకచల్వజోతి చు
క్కలదొర లచ్చిఱేనెడమక న్నన జంద్రుఁ డగు న్మహేశ్వరా.

77


తే.

బిల్ల బిల్లిక యనఁగను బింబ మొప్పు, సగము సాఁబాలు సావాలు సవము సామ
ర యనఁగాను సమాంశంబు ప్రణుతి కెక్కు, భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

78


ఆ.

తోఁచు శకలసంజ్ఞ తునక తుండెము తుండె, తుండుతుంట పఱియ తునియ మ్రుక్క
వ్రయ్య వ్రక్క వ్రప్పు బ్రద్ద బ్రద్దర పఱ్ఱె, యన సుగంధికుంతలాంబికేశ.

79


సీ.

వెన్నెల [1]రేయెండ యన్నఁ జంద్రిక యొప్పు దగు సుషమాభిద జిగి యనంగ
సిరి చెల్వు చెలువము చెన్ను సొంపొప్పు సోయగము చాయ యనంగ నలరుఁ గాంతి
తే ఱనఁ దే టన మీఱు బ్రసన్నత గుఱి మచ్చ మచ్చము గుఱుతు చిన్నె
లక్కనం బనగఁ గళం కానవా లడియాలమై బచ్చెన యనఁగఁ జిహ్న

మలరు మం చనగాఁ దుషారాఖ్య చెలఁగు, జల్లన యివం బిగం బీము చలిమిరి చలి
జలుబు సీ తివతాళింపు చలువ యివక, యనఁగ శీతంబు గుణిగుణాఖ్యలఁ దగు హర.

80


తే.

చాయపెనిమిటి జముతండ్రి జగముకన్ను, తమ్మిచుట్టము మినురతనమ్ము ప్రొద్దు
ప్రాఁబలుకుటెంకి పచ్చగుఱ్ఱములరౌతు, వేవెలుంగన సూర్యుఁడౌ విదువతంస.

81


సీ.

పరివేషనామంబు భాసిల్లుచుండును గుడి యనఁ బరిదినా గుడుసు నాఁగ
మినుకు తళుకు నిగ్గు మించు కళు కనంగఁ గిరణనామంబులై కెరలుచుండు
మెఱుపు డా ల్మెఱుఁ గనఁ బరఁగును బ్రభ తగు దురవలోక్యప్రభ మిఱిమిడి యన
వెలయుఁ బ్రకాశంబు వెలుఁగు జోతి యనంగ నది మించనైన జ గ్గనఁగ నొప్పు
నాతపాభిధ యెండ యం చనఁగ నెసఁగు నలర నీరెండ యీరెండ యనఁగ గించి
దాతపం బగు మృగతృష్ణ లగుచునుండు నెండమావు లనంగ బాలేందుమౌళి.

82


ఆ.

వేఁడి వెచ్చ వెక్క వెట్ట వెచ్చ యన, నుష్ణసంజ్ఞ దగుఁ గదుష్ణనామ
మలరు గోరువెచ్చ నులివెచ్చ తనివెచ్చ, యన సుగంధికుంతలాంబికేశ.

83


తే.

కఱు కనంగను రుట మనఁ జుఱు కనంగఁ, దీండ్ర మనఁ దీండ్ర యనఁగను దీక్ష్ణనామ
ధేయములు గాను జగతిని దేజరిల్లు, భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

84


తే.

శ్రీలు వెలయంగ నీపేర జేయుకతనఁ, బరఁగు శాశ్వతముగను దిగ్వర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని,మాతృభూత జగత్త్రయీమాతృభూత.

85

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

కాలవర్గము

సీ.

తఱి తతి పదమ హదను సావి యదను నాఁ గాలాభిధానంబుగాఁ జెలంగు
నాయతి కారు కందాయ మనంగ జ్యేష్టాదిమాసచతుష్టయంబు దనరుఁ
గారు చిత్తడి తొలికారు తొలికరి నా వర్షర్టుసంజ్ఞయై పరఁగుచుండు
మంచుకా రనఁగ హేమంతర్తు దగు శిశిరర్తు వౌను జలికా రని యనంగ
నామని యనంగను వసంత మలరుచుండు వెలయు గ్రీష్మర్తు వేసవి వేసఁగి యనఁ
గవిజనదయాంతరంగ పుంగవతురంగ భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

86


తే.

ఉమ్మలిక యుమ్మలిం పుబ్బు నుమ్మ యుక్క, యుమ్మదం బావి యావిరి యమ్మలిక య
నంగ నూష్మాఖ్యలౌ నూట నా ద్రవోష్మ, పొలుచును వినంగ శ్రీమాతృభూతలింగ.

87


తే.

ప్రతిపదాదితిథుల్ నాల్గు పాడ్యమి విది, య తదియ చవుతి యనఁగ జెన్నలరుచుండు
బారసి యనంగ ద్వాదశి పరఁగు బూదె, యనఁ జతుర్దశి వెలయు సూర్యావతంస.

88


తే.

పున్నమ యనంగఁ బూర్ణిమ పొలిచియుండు, నమవస యమాస యంచన నలరియుండు
దర్శనామంబుగాఁ బ్రమథాధినేత, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

89

తే.

ఒద్దనఁగ నాఁ దనంగను బ్రొద్దు నాఁగఁ, బొదలుచుండును దినము నాఁటిది యనంగ
దినభవము పేరు గాఁగను దేజరిల్లు, భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

90


క.

ఎల్లియన రెే పనం దగు, నెల్లికి నాపలిది వెలయు నెల్లుండియు నా
నెల్లుండి కవలి దావలి, యెల్లుండి యనంగఁ దనరు నిందువతంసా.

91


క.

నిన్నన మొన్నన నావలి, మొ న్ననఁ బ్రకృతతిథిముందు మూఁడు వరుసగా
నెన్నఁగ సరిపడి వచ్చును, బన్నగ కృతహార భక్తభావ్యశరీరా.

92


తే.

పగ లనంగను బవ లనఁ బరఁగు నహము, పట్టపగ లన మధ్యాహ్నవాచక మగు
నాహ్నికాభిధ పగటిది యనఁగ నొప్పు, భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

93


సీ.

సంధ్య యొప్పుచునుండు సం జనఁ బూఁ టనఁ బుంటయం చనఁగఁ బురంట యనఁగ
సాయంసమాఖ్యయై చనుచుండు మా పన మునిమా పనఁ బ్రదోష మొప్పుచుండు
రెయి రెేయి రాతిరి రేతి రనంగను రజని పొల్చును నడిరాతిరి యన
నడిరెేయి యనఁగ గాంధారి మాందారిప్రొ ద్దన సరిప్రొ ద్దన నద్దమరెయి
యన నిశీదాఖ్య దగుఁ బ్రభాతాఖ్య దనరు, వేకువ యనంగ వేవినా వేగు నాఁగఁ
దెల్లవాఱఁగ ననుమాట తేజరిల్లు, భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

94


తే.

గడె గడియనాఁగ ఘటికయౌ నడరు జాము, నాఁగ యామము దగునెలనాఁగ మాస
మెసఁగు వత్సర మేఁడాది యేఁడు నాఁగ, భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

95


తే.

నిరుడు నాఁగఁ బరుత్సంజ్ఞ పరఁగుచుండు, మీఱు మున్నేఁడు నాఁగఁ బరారినామ
మలరు నియ్యేఁడునా నైషమార్థ మగుచు, నాద్యసమమగు నేఁడునా నబ్జచూడ.

96


తే.

అన్యదినసంజ్ఞ యొక్కనాఁ డనఁగ వెలయుఁ, దానిమును వెన్కదినములు దనర దొలి
నాఁ డనంగను మఱునాఁ డనంగ వరుస, భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

97


సీ.

దుమగతి కేతునా ధూమకేతువు దోఁచు వెలయుఁ ద్రుంగు డనంగఁ బ్రళయసంజ్ఞ
దోస మనంగను దొసఁగు దొసంగునాఁ గసటునాఁ బాపంబుగాఁ దనర్చు
దమ్మ మం చనఁగను ధర్మంబు విలసిల్లు హర్షాభిధ చెలంగు నరుస మనఁగ
సంతసమం చన సంతోసమం చన నలరు సంతోషంబు వెలయు సుగము
హాయి సుకము సుమాళమం చనఁగ సుఖము క్షేమ మగు లగ్గు లెస్స మే ల్సేమ మనఁగ
సకిన మనఁగను విలసిల్లు శకునసంజ్ఞ గోన మనంగను గుణముగాఁ దనరు నభవ.

98


తే.

చేటు చేట్పాటు గీడ్పాటు చెట్ట కీడు, నేగి చెడిది సీలుగునాఁగఁ జెలఁగు నశుభ
మలరుఁ గట్టిఁడి బవిసి దయ్యమ్ము బైసి, కట్టడి యనంగ నియతిగాఁ గాలకంఠ.

99


ఆ.

ఒప్పు హృదయసంజ్ఞ యుల్లంబు మది డెంద, మెడఁద యెడ్డ యాద యెద మనసనఁ
బుట్టు పుట్టున యనఁ బొలుచు జన్మము సుహృ, దయము నెమ్మది యనఁదగు మహేశ.

100

తే.

శ్రీలు వెలయంగ నీపేరఁ జేయుకతనఁ బరఁగు శాశ్వతముగఁ గాలవర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

101


ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

ధీ వర్గము

తే.

బుద్దియం చన వెలయును బుద్ధిసంజ్ఞ, తెలివి యనఁగ నెఱుక యనఁ దెలివిడియనఁ
బరఁగు జ్ఞానంబు వగపన వగయనఁ దల, పోఁత యనఁ జింత యౌ మాతృభూతలింగ.

102


సీ.

అతివిచారణసంజ్ఞ యలరు నెవ్వగ యన ననుమాన మొప్పగు నంచన యనఁ
దారకాణ యనంగఁ దనరుఁ బ్రమాణంబు తరకటిం పనఁగను దర్క మెసఁగు
సందియమం చన సందేహమై తోఁచు బరఁగు సంకేతంబు బస యనంగ
దిట్టమం చనఁగఁ గన్నట్టి నిర్ణయముగ బవిరి బమ్మెర యన భ్రాంతి చెలఁగుఁ
బంత మనఁగను బద్దు నాఁ బ్రతిన యనఁగ నలరును బ్రతిజ్ఞ విన్నాణ మనఁగ నేరు
పనఁగ విలసిల్లు విజ్ఞానమగు నెఱుగమి యన నజ్ఞాన మద్భుతమిహిరభూష.

103


సీ.

ఇయ్యకో లొప్పికో లీకోలు మైకోలు మేకోలు సమకోలు మేము డొడఁబ
డిక యొడఁబా టనుట కనుపట్టుచునుండు సమ్మతిపేరు గోచరము వెలయు
నగ్గమం చనఁగను నగపా టనంగను గొచరత్వంబుగాఁ దోఁచియుండు
నొగ రనఁ దొగ రన దగును గషాయంబు చనుఁ దీపు తియ్యన యన మధురము
లవణ ము ప్పుప్పన యనఁ జెలంగుఁ గాటు, కార మొఱ్ఱొఱ్ఱన యనంగఁ గటువు వెలయు
నమరుఁ దిక్తము చేఁ దన నామ్ల మొప్పుఁ, బులుసు పుల్లన యన మాతృభూతలింగ.

104


క.

ఉప్పిడి యనఁ జప్పిడి యనఁ జప్పన యన నలవణాఖ్య చను రసనామం
బొప్పుఁ జవి చవు రనంగఁ గ, కుప్పాలకభావ్యదేహ గోపతివాహా.

105


ఆ.

కంపు గబ్బు గవులు గందంబు వల పన, గంధ మొప్పు సురభి కమ్మన యన
నడరుఁదాని యనఁగ నామోదమై తోఁచుఁ, గలుము నాఁగఁ గలుషగంధ మభవ.

106


ఆ.

వెగటు వేదు నాఁగ వికటగంధం బొప్పుఁ, బుస్తు బూజు నాఁగ బూతిగంధ
మలరు గదురు నాఁగ నగును విస్రాఖ్యయై, మహితగుణసమేత మాతృభూత.

107


సీ.

వన్నె వన్నియ యన వర్ణంబు విలసిల్లు దెలి తెల్ల తెల్లన తెలుపు వెల్ల
వెల్లన వెలి నాఁగ వెలయును శుక్లంబు చామనఛాయ నా శ్యామ మొప్పుఁ
గాఱి కఱ్ఱి కాఱియ కఱియ నల్లన నల్పు కప్పు కం దనఁగను నొప్పుఁ గృష్ణ
వర్ణంబు పచ్చన పచ్చ పసిమి నాఁగఁ బీతవర్ణం బగు వెలయు నళిది
యన హరిద్రాభపాటలాఖ్యలు చెలంగుఁబల్ల యనఁ బస్సె యనఁగను బయ్య యనఁగఁ
గాని రా జెఱ్ఱన యెఱుపు జేవురు తొవ రనఁగ రక్తాఖ్య వెలయు సూర్యావతంస.

108

తే.

శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు శాశ్వతముగను ధీవర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

109

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

వాగ్వర్గము

తే.

వాకునా భాషయౌ నఱవమ్ము తెనుఁగు, కన్నడం బన మఱి యిట్లు కొన్ని దేశ
భాషలై యొప్పుఁ గఱదనాఁ బలుకు నాఁగఁ, బొల్చు భాషితమై మాతృభూతలింగ.

110


సీ.

నుడుగు నుడువు నుడి నుడికారము నొడువు నొడి నొడికారము నొడుగు నాఁగఁ
బద మొప్పు మాటన వాక్యమై యొసఁగు వాకొనుటయం చనఁగ వాక్రుచ్చుట యన
వచనంబు విలసిల్లుఁ బలుకరింత యనంగ వాచకసంజ్ఞ యై వఱలుచుండు
మినుకు నాఁగను సూక్తి దనరును జదువునా విద్యాభిధానంబు వెలయుచుండుఁ
బ్రాఁజదువు ప్రామినుకు నాఁగఁ బరఁగు వేద మట్టమనఁ గాండసంజ్ఞయై యలరుచుండుఁ
బన్న మనఁ బ్రశ్నమై తగుఁ బనస యనఁగఁ బొల్చును దదంశపై మాతృభూతలింగ.

111


సీ.

వక్కాణ వక్కణ వైన మనంగను వ్యాఖ్యానసంజ్ఞయై వఱలుచుండుఁ
గత యన కథ తోఁచు గాథయౌ జోలినాఁ గబ్బ మనంగను గావ్య మెసఁగుఁ
సందర్భసంజ్ఞ యై చనును గైకట్టన సమసక మన సమాసంబు చెలఁగు
నానొడి నాఁగను నానుడి నాఁగను నుబ్బు నాఁగను జనశృతి దనర్చుఁ
బొలుచుఁ దద్భేదమై పొక్కు పోవడి యన వార్త సుద్ది యనంగను బరఁగుచుండుఁ
బేరునా నామ మలరును బిలుపు చీరు డనఁగ నాహ్వాన మమరు సూర్యావతంస.

112


సీ.

పేర్కొనుట యనంగ వెలయు నామగ్రహణంబు వాదనంగ వాదంబు చెలఁగు
వావా దినంగను బరఁగు నుపన్యాస మెత్తు జిత్తనఁగ నింపెసఁగు యుక్తి
మందట యనఁగను మందలిం పనఁగను, వ్యవహారసంజ్ఞయై పరఁగుచుండుఁ
జాటువ యనఁగను జను నుదాహరణంబు తిట్టునా శాపంబు తేజరిల్లు
నొట్టు నాఁగను శపథాఖ్య యొప్పుచుండు దీవన యనంగ నాశీస్సుగా వెలుంగు
నడుగుట యనంగఁ బ్రశ్నయై యలరుచుండు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

113


సీ.

మాఱుమా టనఁగను మఱుమాట యనఁగను, బదులుమా టనఁ బ్రతివాక్య మొప్పు
మిథ్యాభియోగంబు మీఱును వళు కనఁ బొలుచుఁ బ్రణాదంబు బొబ్బరింత
యనగ బొబ్బెట్టు నాఁగను బొబ్బ యనఁగను యశము విరాజిల్లు నసమనంగ
నగ్గిం పనం గొనియాడుట యనఁగను గైవార మనఁగఁ బొగడ్త యనఁగఁ
బొగడిత యనంగఁ బొగడునాఁ బొగడిక యన మెప్పునాఁ మెచ్చునాఁగను మీఱువినుతి
గోసన యనంగ గోసునా ఘోషణ మగుఁ భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

114

సీ.

రట్టు రట్టడి రవ్వ రద్ది ర ద్దుప్పత రంతు గొహారు గోర పన వెలయు
నా ఘోషణసమాఖ్య యాడిక యేప మీసడ మీసడింపు తెగడు తెగడిక
యాఱడి యవసడి యగ డౌరు దూఱు దూరు దిసంతు సడి రోయి రోఁత రొచ్చు
సేగింపు సెగ్గెము సె గ్గేవగింపు నా నపవాదసంజ్ఞ యై యలరుచుండు
మొఱ్ఱ యన మొఱ యనఁగ వాపోక యనఁగఁ గూయినాఁ గూతనాగ నాక్రోశ మొప్పు
గొసరునా ననులాప ముల్లసిలుచుండు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

115


సీ.

రోఁజుడు రొంజుడు రొడ్డుడు రొండుడు రొల్లుడు రజ్జు ప్రేలుడు పలుము ప
లవరింపువైజు ప్రల్లదము వదరు వదావళి బజారము నాఁగఁ జెలఁగనౌఁ బ్ర
లాపాభిధ బతిమాలడ మన మిడు కన వన రన వన పన వనట యనఁగ
వాచారపం బన వాచరం బనఁగను దేవురిం పనఁగను దేవు రనఁగ
బరఁగుఁ బరిదేవనము కచ్చె పగటు కంటనమ్ము నాఁగను విప్రలాపమ్ము చెలఁగు
నటమట యనఁగ నపలాప మలరుచుండు భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

116


సీ.

తనరు దె ల్పనఁగఁ గృతప్రశంసాభిధ మొసగెస గుసగుస ముచ్చట యన
సల్లాపసంజ్ఞలై యుల్లసిల్లుచునుండు నెగ్గునా రుశతి పే రెసఁగుచుండు
సాంత్వనసంజ్ఞయై చనుఁ దీయ మనఁగను నిష్టోక్తి భాసిల్లు నిచ్చక మనఁ
గరుకు కరుసు కారు కారొడ్డెము పరుసు పరుసన యనఁగ నిష్ఠురము వెలయుఁ
దొచ్చెము తుటార మనఁగను దుచ్ఛవచన మొప్పు గెంటిస మన స్ఖలితోక్తి సంజ్ఞ
ద్రాబ యనఁగ నసారోక్తి దనరుచుండుఁ బుంగవతురంగ శ్రీమాతృభూతలింగ.

117


సీ.

ఒడ్డారమం చన నొరగొడ్దె మనఁగను సడుగునా వక్రోక్తి యడరుచుండుఁ
జతురోక్తిసంజ్ఞయై చనుఁ జదురుం చనఁ ద్వరితోక్తి వెలయును బద రనంగ
గ్రచ్చు కొతుకు నాఁగ గ్రస్తాఖ్య విలసిల్లు సోల్లుంఠనం బొప్పు నుల్లస మన
బూతునా బూమెనా బూకనా బూటక మ్మనఁగను వెేడబ మనఁగఁ గొడిమె
యనఁగను నబద్దసంజ్ఞయై యలరుచుండు నిజ మనఁగ నిక్కువం బన నిక్కెమనఁగ
నేటు నాగఁను సత్యంబు నెగడుచుండు మాతృభూత జగత్త్రయీమాతృభూత.

118


ఆ.

జాలి బురుడ బొంకు పొల్లు దబ్బఱ కల్ల, డబ్బు తక్కుటక్కు ఠవళి తవళి
తసుకు నసుకు దుద్దు తటవట ఠవ ఠవ, సట హుళిక్కి నా నసత్య మభవ.

119


తే.

శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ బరఁగు శాశ్వతముగను వాగ్వర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

120

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

శబ్దాదివర్గము

సీ.

మ్రోఁత నాదు రవళి మ్రోఁగుడు వాఁగుడు స ద్దులి వలికిడి చప్పు డలుకు
డనఁగ శబ్దం బొప్పు నతిదారుణధ్వని ఱం పన ఱం తన ఱంపి యనఁగఁ
గ్రం దన విలసిల్లు గలకలధ్వని దోఁచు నలబలం బన హళాహళి యనంగ
గొల్లన గొల కన గె ల్లన రొద యనఁ దనరు దిముకునా మృదంగరవము
వెలయు నార్తారవంబు గీపెట్టు నాఁగఁ గంఠనినదాఖ్య యెలుఁగునాఁగను జెలంగు
నదియ సూక్ష్మతరంబుగానైనఁ బరఁగు నీరెలుం గటం చనఁగ బాలేందుమౌళి.

121


సీ.

ఆర్తకంఠరవాఖ్య యలరు నేడు పనంగ వెలయు ఖేదధ్వని ములుగు నాఁగ
గగ్గునా వెలయు గద్గదిక డగ్గుత్తిక యనఁగ గద్గదకంఠ మలరుచుండుఁ
దత్సాధుకృద్ధ్వని దనరును గ్రేటన ఱంకెనా వృషభవిరావ మొప్పు
నఱపు నాఁగఁ బశుకంఠారవంబు చెలంగు శునకారవము మొఱు గనఁ దనర్చు
నూళ యన జంబుకధ్వని యొప్పు నీల యనఁగఁ దస్కరసంకేతనినద మెసగు
జలవిహృతికాలశబ్దంబు వెలయు నోల యనఁ బ్రతిధ్వని మఱుమ్రోఁత యనఁదగు భవ.

122


తే.

పాట యనఁగను గానాఖ్య పరఁగుచుండు, నాలతి యనంగ నాలప్తి యలరుచుండుఁ
దద్విశేషాభిధానముల్ దనరు నేల, జోల సువ్వాల యనఁగను సోమభూష.

123


క.

చరచర యన బిరబిర యన, జరజర యన నిట్లు కొన్నిశబ్డానుకృతుల్
పరఁగుచు నుండును జగతిని, స్ఫురితగుణావేశ మాతృభూతమహేశా.

124


తే.

శ్రీలు వెలయంగ నీపేరఁ జేయుకతనఁ, బరఁగుచుండును శబ్దాదివర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

125

నాట్యవర్గము

సీ.

వీణె వీణియ యన వీణాఖ్య రాజిల్లు వాయింపు నా దన వాదన మగుఁ
గొడుపునా విలసిల్లుఁ గోణాభిధానమై యొళవు నాఁగఁ బ్రవాళ మొప్పుచుండుఁ
గలివెయం చనఁగను గకుభంబు విలసిల్లుఁ దంతి యనంగను దంత్రి వెలయు
నలరును గుబ్బకాయ యన నలాబువు బవిసిన మనఁగఁ దద్బంధన మగుఁ
బరగు నుపవాహనామంబు బిరడ యనఁగ సారె మె ట్లన సోపానసంజ్ఞ దనరు
మేరు వనఁగను విలసిల్లు మేరుసంజ్ఞ భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

126


సీ.

దండె దండియ యన దండవాద్యం బొప్పు దంబురా యనఁగను దుంబుర దగు
డక్క డక్కి యనంగ ఢక్క విరాజిల్లు నావజం బననొప్పు నావజంబు

డవిణ యం చనఁగ నులసిల్లు డిండిమసంజ్ఞ డమరుగం బనఁగఁను డమరు వెసఁగుఁ
దమ్మటం బనఁగను దమటం బనంగను దమఠాభిధానంబు దనరుచుండుఁ
దుడు మనంగను దముకునా గిడియ యనఁగ నరగజం బనఁ దద్భేదనామము లగు
డోలు నాఁగను విలసిల్లు డోలపేరు భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

127


సీ.

డుబుడక్క యనఁగ బుడుబుడుక్క యనఁగ హుడుకునాఁ దనర్చు హుడుక్క పేరు
గుమ్మెత యనఁగను గుంభవాద్యము దోఁచు మద్దెల యనఁ దాగు మర్దళంబు
జమళిగ యం చన యమళిక విలసిల్లుఁ బంబ యం చనఁగను బణవ మెసఁగుఁ
బరఁగుచునుండు డంగుర మన రుంజనా వీరాణ మనఁగను వీరణంబు
కవడె యన నురుమ యనఁగఁ గరిది యనఁగఁ దప్పెట యనంగ వాద్యభేదములు చెలఁగుఁ
దనరుఁ జుయ్యంకి కైముడి యనఁగఁ దాళ ముజ్జ్వలతరాంగ శ్రీమాతృభూతలింగ.

128


సీ.

చిటితాళ మనఁగను జెంగునా జేగంట యన వాద్యభేదంబు లలరుచుండుఁ
గాళె కాళ యనంగఁ గాహళి విలసిల్లు బూరుగ యం చన బూరు వనఁగఁ
గాహళీభేదముల్ గ్రాలుఁ బిల్లనగ్రోవి వాసెగ్రో లనఁగను వంశనాళ
మలరు నాగస్వరం బగు నాగసర మన గంట యనంగను ఘంట యొప్పు
సుతి యనఁగఁ దిత్తి యనఁగను శ్రుతి దనర్చు నాటకత్తె యనంగను నాటరి యన
బాతర యనంగ నర్తకి పరఁగుచుండు భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

129


సీ.

ఆటయం చనఁగ నాట్యం బొప్పుఁ గోలాట మనఁగ హల్లీసకం బలరుచుండు
నాట్యభేదంబుల నామము ల్దనరు జక్కిణి గుజరాతి పేరణు లనంగఁ
గంటయం చనఁగను గట్టర మనఁగను నాట్యబంధం బొప్పు నాట్యయోగ్య
శబ్దసంతతిపేరఁ జన జతులం చన సుగ్గళిం పనఁగఁ దదుక్తి వెలయుఁ
గోపు లన సారు లనఁ దీరుకు లన వెలయు నాట్యగతిభేదముల పేళ్ళు నాగవాన
మనఁగ బోగపుచెలువగుంపైనమేళ జతకుఁ బేరై చెలంగును జంద్రచూడ.

130


సీ.

మాతంగనాట్యనామం బగుఁ జిందునా దరు వనంగను ధ్రువ దనరుచుండు
గరగరిక యన సింగార మనంగను శృంగారనామంబు చెలఁగుచుండు
బీర మనంగను వీరము విలసిల్లు నక్కటికం బన నక్కస మన
నిబ్బరిక మనఁ గనికరం బనంగను గారుణ్యసంజ్ఞ యై మీఱుచుండు
నగవు నవ్వు కేరింతనాఁ దగును హాస మలఁతినగ వన లేనగ వన ముసిముసి
నగ వన ముసినగ వనఁ జిర్నగ వన నెలనగ వన స్మితంబు రాజిల్లు నాగభూష.

131


సీ.

వెక్కురు నాఁగను వికృతంబు విలసిల్లు నాశ్చర్యసంజ్ఞ యై యలరు సోద్య
మచ్చెరు వక్కజ మబ్బురపా టబ్ర మరు దరిది వెగడు వెఱఁగు సోద్దె

ము తటకాపాటునాఁ బొలుపారుచుండును నిర్భరాశ్చర్యంబు నివ్వె ఱనఁగ
ఘోరాభిధానంబు గోర మనంగను బెట్టిదం బనఁగను వెలయుచుండు
గోరగింత యనంగను ఘోరత దగు సిగ్గునా లజ్జ యనఁగను సిబ్బితి యన
నాన యనఁ బుచ్చడీ కనఁగాను లజ్జ బొలుచుఁగడ ధర్మి యౌ నొక్కపొంత నభవ.

132


సీ.

తల్లడింపు తలఁకు తల్లడము తలరు జళుకు జంకెన జంకు జడుపు జాలి
పుయిలోట జలదరింపు దిగులు వెఱ పళ్కు వెఱ యుత్తలము బీతు బెదరు బెగ్గి
లుట యంజిక యుదిల యటన నధృతి యగు ముఖభీతి దగు మొగమో టనంగ
నద రన భయాచలనాఖ్యయై విలసిల్లు గరువము పొగరు కావరము గెబ్బు
త్రుళ్లు క్రొవ్వు తిమురు త్రుక్కు మల్లరమ్ము పోతరం బేపునా గర్వ మొప్పుచుండు
నాము నాఁగ విరాజిలు నాకరంబు పుంగవతురంగ శ్రీమాతృభూతలింగ.

133


సీ.

మన్నన మన్నిక మన్నిం పనంగను బహుమానసంజ్ఞ యై పరఁగుచుండు
నలు చన నెల్లిద మనఁ జౌక యనఁ దిరస్కారంబు రాజిలు నోరు పనఁగ
సైరణ యనఁగను సైఁపు డనంగను దాలిమి యనఁగను దాల్మి యనఁగఁ
దాళిక యన క్షాంతి దనరారు నోర్వమి యన నీరసం బన నీరస యన
నీసునా నూదనాఁ దగు నీర్ష్య వేర మనఁగఁ బగ టన నొంటమి యనఁ బగయన
నొప్పుమి యనంగఁ గంటునా నొప్పువైర ముద్ధృతకురంగ శ్రీమాతృభూతలింగ.

134


సీ.

ప్రతివైరనామంబు పరఁగు సూ డనఁగను గరకరి చలము మచ్చర మనంగ
మాత్సర్యసంజ్ఞ లై మనుఁ జుమ్మకుడ జాలి చూకురు కస్తినా శోక మొప్పుఁ
గన లన బైడాల మనఁగను గను పనఁ గినుక యనంగను గిన్క యనఁగ
నలుక యనంగఁ జిం దనఁగఁ గాంతాళ మనఁగ రోస మనఁగఁ జిందఱ యనంగఁ
గన రనంగను గన రన దనరుఁ గోప మదియె చుఱుకైన రవరవ యనఁగ వెలయుఁ
బ్రణయకోపంబు పొలయల్క యనఁ దనర్చు మోఁడి యనఁ గోవమౌనంబు పొలుచు నభవ.

135


సీ.

తనరు వేళాకోళ మనఁగఁ ద్రిక్క యనంగ రిమ్మ యనంగను రింబ యనఁగ
వెఱ్రి యనంగను బిచ్చి యనంగ నుమ్మాద మనంగ నున్మాదసంజ్ఞ
యాలుడి యనఁగను శీలంబు విలసిల్లు బత్తి యనంగను భక్తి చెలఁగు
నెయ్యము నెయ్యమి నెమ్మి నేస్తము నెన రెలమి మే ల్కూరిమి చెలిమి యరితి
బాళి ప్రేముడి మచ్చిక మక్కువ యనఁ బ్రేమ దోఁచును దీరని ప్రేమ యైన
మరు లనఁగఁ జెల్లు వలపునాఁ బరఁగుచుండు యువయువతిసంభృతప్రేమ యుగ్రమూర్తి.

136


సీ.

అర్మిలి యంచన నరులు నా వర్ణన వాత్సల్యసంజ్ఞ యై పరఁగుచుండు
నిచ్చ కాయువు కోర్కి యేఁకట కోరిక యాస యంచనఁగఁ జెన్నలరు గాంక్షఁ

యర్ధాశ విలసిల్లు నడియాస యనఁగను నంగలార్పం చన నంగద యన
నెంజిలి యనఁగ మనికితం బనఁగఁ దుండుడు కనం దగు మనోవ్యధకు సమాఖ్య
తలఁ పనంగను స్మృతిపేరు దనరుచుండు స్మృతివిశేషంబు సోదెనాఁ జెలగు మఱపు
మఱకువ యనంగ విస్మృతి పరఁగుచుండు నగ్గలిక యన నుత్కర యలరు నభవ.

137


సీ.

హాళి జతన మన నడరు నుత్సాహంబు కపటాఖ్య విలసిల్లు గబ్బిగౌరు
గబుసు కైపు కిటుకు కౌడు డబ్బు కవుడు డంబనంగ నపదేశంబు వెలయు
నెపము నెవ మనంగ నిష్కపటాభిధ నిక్కవు డంచన నెగడుచుండు
నేమఱుపా టన నేమఱిక యన మోస మనఁ బరా కనఁ జనుఁ బ్రమాద
మెచ్చరిక యెచ్చరిం పేవ యేద పదిలము హవణిక పోణిమి యన నొప్పు నవధాన
మలరు వేడ్కన వేడుక యనఁగ వెంట మనఁగను గుతూహలంబు సూర్యావతంస.

138


సీ.

బిత్తరము కులుకు బెడకు వెళుకు గునుపు గొనబు మురిపము మురువు సొగసు
నిక్కు మిటారింపు నీటు మిటారము టెక్కు తెక్కెర మెమ్మె టెక్కు టీకు
హొరఁగు చె న్నేపొర పొయ్యారము బులుపు హోయ లనఁగ విలాసమొప్పుచుండు
నవ్యయ మై యేతదర్ధంబునందలి లలి యన నొకశబ్ద మలరుచుండు
గ్రేణి యన దచ్చన యనంగఁ గేరడ మన గేలియన మేలమన మందెమేల మనఁగ
నాట యనఁద్రస్తరి యనఁగ హాళి యనగఁ బొలుచుఁ బరిహాసములు మాతృభూతలింగ.

139


సీ.

త్రుళ్ళాట గొండ్లినాఁ దోఁచును గ్రీడాఖ్య యదిమించఁ దగు జెరలాట మఁనగఁ
జను సహక్రీడాఖ్య సయ్యాట మనఁగ సయ్యాట యనంగ సైయాట యనఁగఁ
జెమరునాఁ జెమటనా స్వేదంబు విలసిల్లుఁ బరఁగుఁ గొం చనఁగను ముఱికి చెమట
ఱిచ్చపా టనఁగను ఱిచ్చనాఁ బ్రళయమౌ నొప్పు సంభ్రమసంజ్ఞ యుత్తలంబు
తమకము తహతహ తమి తత్తఱము చిడిముడి తరితీ పుత్తలమ్ము చిడిముడిపాటు
నాఁగ దనరారు హిక్కకు నామ మగుచు వెక్కనంగ వెక్కిలియన వేదవేద్య.

140


సీ.

పులక లనంగను బులకర మనఁగను గగ్గు రనంగను గగు రనంగ
గరుదా ల్పనంగను బరఁగు రోమాంచంబు గొఱలు రోదన మేడ్పు గోడునాఁగ
నావలింత యనంగ నావులింత యనంగ జృంభణసంజ్ఞయై చెలఁగుచుండు
గాత్రవినామంబు గనుపట్టు నీల్గనఁదుమ్ము నా క్షుత్సంజ్ఞ దోఁచుచుండుఁ
జనుఁ బడక పవ్వళిం పనఁగను శయనము నెగడుఁ గూర్కన నిడదురనా నిద్దు రనఁగఁ
గరు కనఁగ నిద్ర తూఁగు తందర యనంగ మనును నిద్రావిశేషంబు మాతృభూత.

141


సీ.

గుఱక యనంగను గుఱుపె ట్టనంగను శోభిలుచుండును సుప్తరవము
కల యన స్వప్నాఖ్య వెలయు నిక్కలయన నిశ్చయస్వప్నంబు నివ్వటిల్లుఁ

గలవరిం పనఁగను గలవరింత యనంగఁ గలవర మనఁగను గళవళ మన
స్వప్నభాషణముగా జరుగుచుండును మేలుకొంట యనఁగ మేలుకంట యనఁగ
మేలుకాంచుట యనఁగను మెలఁకువ యన నుపవడ మనంగ నవబోధ మొప్పు భ్రుకుటి
యలరు బొమముడి యన స్వభావాఖ్య చెలఁగు సాజ మోజ యనంగను జంద్రచూడ.

142


సీ.

జీరుకు నాఁగను జీరుకుపాటునాఁ దొట్రుపా టనఁగను దొట్రు నాఁగఁ
దొట్రిలుట యనంగఁ దొట్రగిల్లుట యన స్ఖలనసమాఖ్యయై వెలయుచుండు
జాఱుడు జరుగుడు జాఱుపు జాఱన గళనంబు దనరును వలి వలిపిరి
వడఁ కనఁ గంపాఖ్య యడరును వడవడఁ కన నతికంపంబు దనరుచుండుఁ
బరఁగుఁ బబ్బము పండుగ పండు వనఁగ నుత్సవము తద్విశేషంబు లొప్పుఁ దేవ
తంతు సాకము నంపు జాతర కొలు వన వెలయు సివమన దేవతావేశ మభవ.

143


తే.

శ్రీలు వెలయంగ నీపేరఁ జేయుకతనఁ, బరఁగు శాశ్వతముగ నాట్యవర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

144

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

పాతాళభోగివర్గము

సీ.

పాతాళనామంబు పాఁపజగ మనంగ నేలయడు గనంగ నెగడుచుండు
బిలనామధేయంబు బెల మనంగ సొరంగ మనఁగ సొరంగయం చనఁగ నొప్పుఁ
దూము తూ టనఁగను దూపర మనఁగను దొండి నాఁ జిల్లి నాఁ దొలి యనంగఁ
గన్న మనంగను గనుమ యనంగను గ్రంత యనందగుఁ గందరంబు
సరియ యన గండి యనఁగను సరె యనంగ బడిలి యన దుంక మనరంధ్ర మడరు లాగ
బొఱియ బొఱ్ఱె కలుగు బొక్క బొంద యనఁగఁ బొలుచు గర్తంబు శ్రీమాతృభూతలింగ.

145


సీ.

గాతము గవి యన ఖాతంబు కంటకావరణఖాతము తగు వది యనంగ
లొట్ట లొటారము లొత్తయం చనఁగను శోభిల్లుచుండును నుషిరసంజ్ఞ
చీఁకటి యిరులునాఁ జెలువొందు నంధకారము పేరుగా నంధతమససంజ్ఞ
కటికిచీఁకటి యనఁగను దనరారును జిమ్మచీఁకటి మునిచీఁకటి ముఱి
చీఁకటి మసక ముఱిముఱిచీఁకటి యన నవతమసనామధేయమై యలరుచుండు
నాగములపేరు వెలయును నాగు లనఁగ భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

146


సీ.

తగు సీదరపుపెద్ద తడవులనిడుపడు పాపఱేఁ డన శేషఫణికి సంజ్ఞ
కొండచిలువ యన గోనసం బగుఁ బెనుబామునా నజగరాహ్వయము వెలయు
నీరుపా మనఁగను నీరుకట్టె యనంగ జలభుజంగము పేరు చెలఁగును మను
దిండియం చనఁగను డుండుభం బగు నాగుఁబామనఁ ద్రాఁచన ఫణి దనర్చుఁ
జెలఁగు సర్పభేదంబులు జెఱ్ఱి పెంజర పసిరికపా మనంగ క్షుద్రాహిసంజ్ఞ
తుట్టెపురు వని పల్కఁగఁ దోచియుండుఁ బుంగవతురంగ శ్రీమాతృభూతలింగ.

147

సీ.

పడగదాలు పనంగఁ బా మన విసదారి యన గాలిదిండియం చనఁగఁ జిలువ
యనఁగ సర్పసమాఖ్య లలరు నాహేయమౌఁ బాముది యనఁగను బాఁపది యనఁ
గుప్పన మనఁగను గుబుసం బనంగను గంచుక నామంబుగాఁ జెలంగుఁ
బడిగెనాఁ బడగనా స్ఫట దనరారు విసమునాఁగఁ జిలు మనఁ జను విషంబు
వ్యాళసంగ్రాహినామమై వఱలు గారడీఁ డనంగను బాములవాఁ డనంగ
గారడి యనంగ హస్తసంగతకురంగ భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

148


తే.

శ్రీలు వెలయంగ నీపేరఁ జేయుకతనఁ, బరఁగు బాతాళపన్నగవర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

149

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

నరకవర్గము

సీ.

బిద్దె బిస్త యనంగ వెలయు దుర్గతి వంత గాని వెతారము కారియ వెత
బాలి నొగులు నొప్పి బాద నెగులు నొవ్వి వందురు దురసిల్లు కొందలంబు
సలుపు నోవి యనంగఁ జన వ్యధయేపనా నదనంబు దగుఁ గుక్కు డదుము డొత్త
డ మ్మొత్తు నాఁ బీడనమ్ము విరాజిల్లు వెట్టి యనంగను విష్టి దోఁచుఁ
జోద పల్లట మల్లట చోడుమ బడప యిడు మగబాటు బా మనఁ బరఁగుఁ గష్ట
మామనస్యంబు బిడ్డకు ట్టనఁ దగు దిను కనఁగ గుదవేదనంబుగాఁ దనరు నభవ.

150


తే.

శ్రీలు వెలయంగ నీపేరఁ జేయుకతనఁ, బరఁగు నిచ్చలును నరకవర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

151

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

వారివర్గము

క.

వననిధి యొప్పును బ్రాయే, ఱన మున్నీ రనఁగఁ గడలి యన సంద్ర మనం
గను బాలవెల్లి యనఁగా, వినఁబడునౌ క్షీరజలధి వృషభతురంగా.

152


తే.

మొగులువిరి నీరు నాఁగను దగు జలంబు, మీఱును హిమాంబుసంజ్ఞ పన్నీరనంగఁ
బచనయోగ్యజలాభిధ పరఁగుచుండు, నెస రనంగ నఖాంకవక్రేందుచూడ.

153


సీ.

కర డన గడ లనఁ గర యనంగఁ దరంగ యనఁ దరఁగ యనంగ నల యనంగఁ
దెర యనంగను వీచి పరఁగును నుడి యన నావార్తసంజ్ఞ యై యలరు బుగ్గ
యన బుద్బుదం బొప్పు మను బొ ట్లనఁగ బిందు పరఁగు ఫేనము మర్వు మరుఁ గనంగఁ
దూపరాణ పుటమ్ము తూ మొప్పరము జలదారియం చనఁగను దనరును జల
నిర్గమము తన్ముఖంబున నీటితోడ వచ్చుతృణములఁ జొరనీనిపలక పేరు
లాఁపరా యంచు జనులు పల్కఁగను వెలయు మాతృభూత జగత్త్రయీమాతృభూత.

154

సీ.

త ట్టన దరి యనఁ దనరును దీరాఖ్య దనరును బార మద్దరి యవతల
నాతల నావల నవ్వల నవ లన మీఱుచునుండును బార సంజ్ఞ
యిద్దరి యీవల నివ్వల నివల నీతల నివతల యన నలరుచుండు
దీవి లంక యనంగ ద్వీపంబు సికతాఖ్య యిసు మన నిసుకనా నెసఁగుచుండుఁ
దద్విశేషంబు నెరసునాఁ దనరు నసలు రొచ్చు వం డడు సుబ్బలి రొంపి బురద
యుమ్మలి యవుజు చవుకు నా నొప్పుఁ బంక మార్యచిత్తరి రంప సూర్యావతంస.

155


ఆ.

పఱవ పఱద వఱద పఱతి పఱత వఱ్ఱు, నాఁగ నిటు ప్రవాహనామ మొప్పు
వెల్లి వెల్లువ యన విలసిల్లు నధిక ప్ర, వాహనామముగఁ శెవందిలింగ.

156


సీ.

ఓడ నావ యనంగ నొప్పుచుండుఁ దరణి పడవయం చనఁగ నల్పతరణి దగుఁ
గల మనఁ బోతాఖ్య గనుపట్టుఁ బుట్టినా నరిగోలునాఁ గోల మలరుచుండుఁ
దేపనాఁ దెప్పనా దేటిక యనఁగను బ్లవనామధేయంబు పరఁగుచుండు
నుప్లుత యవసాదికోక్తియై విలసిల్లుఁ దొట్టినాఁ దొట్టునాఁ దొట్టువ యన
సబక యన నగప యనఁగ నభ్రిదోఁచు ద్రోణియగు దోనె యనఁగను స్రోతమెసఁగు
జాలు నాఁగను విలసిల్లు గూడ యనఁగ జలసముత్క్షేపపాత్రంబు చంద్రమౌళి.

157


సీ.

మాలిమికాఁ డనఁ బీలికాఁ డన నోడవాఁ డన నావికహ్వయము చెలఁగు
నచ్చిన మన నచ్చ మనఁ దేరినదియన నలరుఁ బ్రసన్నాఖ్య కలఁత యనినఁ
గలఁగినది యనంగఁ గనుపట్టుఁ గలుషంబు కాలుష్య మెసఁగును గలఁక యనఁగ
వెలయు లోఁ తనఁగ గంభీరము పల్లము నవుకుఁ బల్లనఁగ నిమ్నంబు దనరు
మెట్ట యన మిఱ్ఱునాఁగను మెండు నాఁగఁదోఁచు నుత్తాననామంబు తూలికాఁడు
జాలరి యనంగఁ గైవర్తసంజ్ఞ పరఁగుఁ బుంగవతురంగ శ్రీమాతృభూతలింగ.

158


సీ.

వల యన జాలంబు పరఁగుఁ జాల యనంగఁ దనరుచునుండుఁ దత్సదృశసంజ్ఞ
తద్భేద మొప్పు నూతనఁ గువేణిచెలంగుఁ గొడిమె యం చనఁగను బడిశ మెసఁగు
గాలమం చనఁగను గనుపట్టు మీను మచ్చెము చేఁప యనఁగ మత్స్యము తనర్చు
చొఱ చోఱ యనఁగను బరఁగుఁ రాజీవంబు గెండె యం చనఁగను గండకంబు
తూల యనఁ దూర యనఁగను దోఁచు ఝుషము వాలసిప మౌను వాలుగు వాలుగ యన
బేడిస యనంగ గుల్మము వెలయుఁ బ్రోష్ట మొట్ట యన మీఱు శ్రీమాతృభూతలింగ.

159


సీ.

కొఱ కొఱ్ఱ యనఁగను బరఁగుఁ బాఠీనంబు జెల్ల యం చనఁగను జిమము వెలయు
నలరు రొయ్య యన క్షుద్రాండజనామమై యులచనాఁ దిరికినా మల గనంగ
బొమ్మడాయ యనంగఁ బొలుపారుచుండును మత్స్యభేదంబులు మఱియుఁ గొన్ని
యలరును శుష్కమత్స్యం బుప్పుచేఁపనా పరుగుచేఁ పనఁ గరువా డనంగ

నెండ్రి యన నెండ్రిక యనంగ నెండ్రకాయ యనఁగఁ గర్కటకాభిధ యలరుచుండు
మొసలి యనఁగను మకరంబు బొలుచు మదనభూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

160


సీ.

తామే లనంగను దాఁబే లనఁగ నల్ల దాసరిగాఁ డనఁ దగుఁ గమఠము
వెలయు జలూకాఖ్య జెలగయం చన నెఱ్ఱ యనఁగ మహీలత యలరుచుండు
మాండూకనామంబు మనుఁ గప్పయం చన శంఖము చిందము సంకు బూర
కొమ్మనఁ దనరారుఁ గొఱలును దక్షిణావర్తశంఖాభిధ వలమురి యన
క్షుద్రశంఖము దనరారు గుల్ల యనఁగఁ గప్పచిప్ప యనంగను గాకిచిప్ప
యనఁగ జలశుక్తి దగు గవ్వ యనఁగ వెలయుచుండును వరాటమై బాలసోమభూష.

161


సీ.

నీరుటెంకి యనంగ మీఱు జలాశయం బడరును హ్రదసంజ్ఞ మడుఁ గనంగఁ
దనరును గాడియం చనఁగ నిపానంబు చెలమనా నుపకూప మలరుచుండుఁ
గనుపట్టు నూయినాఁగను గూపసంజ్ఞ పీనాహంబు తాగాఁడి నాఁ జెలంగుఁ
గలుజు రాకట్టునాఁగను శిలాబద్ధమౌ నెగడుఁ బుష్కరిణి కోనే రనంగఁ
జెఱు వనంగఁ దటాకంబు గొఱలుచుండు నలుగునా జలనిర్గమస్థలము వెలయుఁ
గుంట గుంట యనంగఁ బేర్కొనఁగవచ్చు నల్ప మైనతటాక మార్యాసమేత.

162


సీ.

తొట్టునాఁ దీగానాఁ దోచుచుండుఁ దటాక పూర్వదేశాభిధ పొలుచుఁ గొలను
కొలఁకు నాఁగ సరసి వెలయును మెచ్చనాఁ బడియయం చనఁగను బడె యనంగ
బల్వలనామంబు బావి డిగ్గియ యన నగు వాపి యావాల మలరుఁ బాది
యనఁగఁ గ్రీడాఖాతమై కనుపట్టుఁ గేళాకూళి యనఁగఁ గేళాకుళి యనఁ
జెలఁగు నే ఱన నది తద్విశేషసంజ్ఞ యమరుఁ బెన్న యనంగను జమున యనఁగఁ
దనరు రే వన సలిలావతారమార్గ ముద్ధృతకురంగ శ్రీమాతృభూతలింగ.

163


సీ.

కయ్య కాలువ యనఁ గనుపట్టుఁ గుల్య కూడలి యనఁ దద్భేద మలరుచుండుఁ
దొగ తొవ కలువ నాఁదోఁచు నుత్పలము తామర తమ్మి యనఁగఁ బద్మమ్ము చెలఁగుఁ
జెంగల్వ కెందొవ చెందొగ యనఁగను హల్లకసంజ్ఞ యై యలరుచుండుఁ
గెందమ్మి చెందమ్మి కెందామర యన రక్తోత్పలసంజ్ఞయై యొప్పుచుండుఁ
గైరవాభిధగాఁ దెల్లకల్వ యనఁగ వెలయుఁ దెలిదమ్మి వెలిదమ్మి వెల్లదమ్మి
తెల్లదమ్మి యనంగను దేజరిల్లుఁ బుండరీకంబు శ్రీమాతృభూతలింగ.

164


సీ.

నల్లగల్వ యనంగఁ జెల్లు నీలోత్పలం బలరు నుత్పలభేద మల్లి యనఁగఁ
బ్రాచి నీరాకు నావారిపర్ణి చెలంగు నా చన శైవలనామ మెసఁగు
నంతరతామర యనఁగఁ దద్భేదమౌఁ దోఁచు మృణాళంబు తూఁడు నాఁగ
గ్రోవి యనంగను గ్రోలునా నాళమౌఁ దనరును దామరతంపర యనఁ

గమలషండంబు కేసరం బమరు నకరు వనఁగ రే కన సంవర్తికాఖ్య చెల్లుఁ
బొలుచుఁ గర్ణిక దుద్దునా ముద్దె యనఁగఁ బుంగవతురంగ శ్రీమాతృభూతలింగ.

165


తే.

శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు శాశ్వతముగ వారివర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయిమాతృభూత.

166


శా.

శ్రీకైలాసనివాస! వాసవనతాంఘ్రిద్వంద్వ! ద్వంద్వాదిదూ
రీకారాంచితభావ! భావభవభూభృద్వజ్ర! వజ్రప్రభో
ద్రేకస్పర్థివపుష్క! పుష్కలదయార్ద్రీభూత! భూతావనా
లోకాలోకహితప్రచారణ! రణాలోపస్ఫురన్మానసా.

167


చ.

నిరతిశయైకభక్తిమదనీకరమాకర! మారమారకా
సరసముఖేందుకాంతిజితసారసవార! సవాసవాదిఖే
చరభుజగాలయాంతపృథుచాపకలాపకలాకలాపసుం
దర! కరుణాసుధాముదితదాసవనా! సవనావనాదరా.

168


గద్య.

ఇది శ్రీమత్పరమేశ్వరకరుణాకటాక్షసంప్రాప్త సర్వజ్ఞత్వాదికతిపయగుణస్వసా
మ్య తదితరసకలగుణనిరౌపమ్యాసేతుహిమాచలఖ్యాత మహోద్దండకవి బిరుదప్రశస్త
సీతారామార్యవర్యతనూజాత శౌర్యధైర్యస్థైర్యాదిసకలగుణచిరత్నరత్నరత్నాకర
శ్రితజనశ్రీకరకోటిసమాఖ్యవంశసుధాపయోధిరాకాశశాంక ఘంటికాతురగ
నీలాతపత్ర హనుమద్ధ్వజ మకరకేతన దివాదీప నవవిధభేరికాదినిఖిలబిరుదాంక
బృహదంబికాకటాక్షసంజాతసామ్రాజ్యధురంధర విమలయశోబంధుర కర్ణాటచోళ
పాండ్యమహీపాలాదిసంస్తూయమాన శ్రీ రాయఘునాథమహీనాథ సభాంకణ బిరు
ధాయమాన ఆర్యనుతచర్య వేంకనార్యప్రణీతం బైన యాంధ్రభాషార్ణవంబునందుఁ
బ్రథమకాండము సంపూర్ణము.

  1. ప్రాచీన ప్రయోగములందు రేయెండపదము బాలాతపార్థముననే చూపట్టుచున్నది.