ఆంధ్రనాటక పద్యపఠనం/పద్యరూపం

3. పద్యరూపం


ప్రస్తుత విషయానికి సంబంధించిన ముఖ్య పదాలు రెండు - పద్యం, రాగం. ముందు ' పద్యం ' గురించి యోచన చేద్దాం.

పద్యం అనగా పాదాలు గలది. పాదాలు చాలా ఘటాలకి ఉన్నాయి. కాని, యిక్కడ పాదం అంటే నియమిత మైన గణాల లెఖ్ఖగల పదరచన. రెండుగాని, మూడుగాని, నాలుగుగాని, అయిదు గాని అక్షరాల సంపుటి 'గణము ' కాని యీ చివరి అయిదక్షరాల గణం విస్తారం సందర్భించదు. పొడుగు అక్షరం గురువు, పొట్టిది లఘువు. నొక్కి ఊది, అచి, పలకవలిసొచ్చే అక్షరాలు గురువులే అనుకున్నారు. ఈ రెండు రకాల కలగలుపూ ఈ యీ క్రమంలో ఉంటే ఈయీ గణం అని పేర్లు కల్పించారు. ఈయీ గణాలు ఇల్లా ఇల్లాంటి క్రమంలో ఉంటే బయల్దేరే పద్యం పేరు ఫలానా అంటూ పద్యాలపేర్లుకూడా సృష్టించారు. పద్యాల్లో పదాలు సంపుటీ చెయ్య బడి ఉంటాయిగనక, అర్ధభావాలమాట ఎలాఉన్నా, చెవికి ఇంపుగా ఉండేటట్టు నాదసామ్యంకూడా సిద్ధింపజేస్తే ఉభయతారికంగా ఉం టుందనే ఆశతో యతులనీ ప్రాసలనీ శబ్దాలంకారాలనీ అంత్యప్రాస లనీ బోలెడు ప్రత్యేకపు సరంజాం లేవదీశారు. రెండుపాదాల పద్యం ద్విపద. నాలుగు పాదాలవి చంపకమాల, ఉత్పలమాల, మత్తేభం, శార్దూలం – మొదలైనవి. కంద, గీతాలకికూడా నాలుగేసి పాదాలే. సీసానికి నాలుగు పెద్దపాదాలూ మరినాలుగు చిన్నపాదాలూనూ. తెలుగులో ఏకపాది, త్రిపాది లేవు. చాలావరకు 'చతుప్పాత్తులు.' భావం దిగడిపోయినప్పుడు ఎప్పుడేనా ఒక్కొక్కరు పంచపాది రాస్తారు, కాని సాధారణంగా షట్పాదులు రాయరు – కన్నడంలో లాగ. కొందరు అవసరం చొప్పున బహుపాది రచించి 'మాలిక ' అనేపేరుతో దాన్ని వ్యవహరిస్తారు.

తెలుగు ఛందస్సు గురు – లఘు ప్రస్తారంతో బ్రహ్మాండంగా సంకల్పించారు. ఒకే పాదంలో 26 అక్షరాలు ఉన్నా ఉండవచ్చునని బయల్దేరి, ఒక్కొక్క పాదంలో 1, 2, 3, 4, 5, 6 ఇల్లాగ్గా అక్షరాలు ఉండడం తటస్థించినప్పుడు, ఆయా రకాల్లో ఉండగల వృత్తసంఖ్య క్రమంగా 2, 4, 8, 16, 32, 64 ఇల్లాగ్గా ఉంటుందని, చూపించారు. తెలుగులో మొత్తంమీద 13, 42, 17726 పద్యాల రకాలు ఉండ గలవు. కాని, ఇన్నికోట్లలోనూ ఏ వందో గుర్తింపబడ్డాయి. అందులో ఒక యాభై సంస్కృతశ్లోకాల రకాలకి అనుకరణం. కాని, ఆరకాల్ని చాలా స్వతంత్రంగా అనుకరించారు. వాటిల్లో లేని షరతులూ నియ మాలూ అదనంగా తెచ్చిపెట్టుగున్నారు-యతీ, ప్రాసా, చరణాం తంలో శబ్దాంతం కానక్కర్లేకపోవడం మొదలైనవి. కాని, గద్యకి మిక్కిలి చేరుపై, మొత్తం 32 అక్షరాలని లెఖ్ఖఉండి, సంస్కృతంలో ఎంతో విరివిగా వాడబడ్డ అనుష్టుప్పుగురించి, తెలుగులో ఏర్పాటు చేశారుకారు. ఎటొచ్చీ, మాత్రలలెఖ్ఖ 64గల కందాన్ని సృష్టించినట్టు కనిపిస్తారు. అనగా, అనుష్టుప్పు ఎవడైనాసరే రచించడానికి వీలుగా వాళ్ళు కల్పించుగుంటే, తెలుగులో ప్రతివాడూ రచించెయ్యకుండా జాగర్తపడడంనిమిత్తం కందం కల్పించినట్టు తోస్తుంది. ఏమైతేం, తెలుగులో నెలకొల్పబడ్డ ఛందాల్ని మూడువిధాలుగా యోచించ వచ్చు :- (1) ఉన్న పాళంగానే 'తాళం' వెయ్యడానికి సరిపోయేవి (2) మాత్రలలెఖ్ఖ కట్టి ఏదైనా ఒక తాళానికి సరిపుచ్చడానికి వీలైనవి (3) గమనంలో ఏదో ఒక నియమం ఉన్నప్పటికీ ఏ ఒక తాళంకిందికీ రానివి. అక్షరాల పొట్టిపొడుగుల క్రమం ఫలానా మోస్తరుగా ఫలానా 'ఉత్పలమాలలో' ఉండాలీ అనగానే, ఆ అక్షరక్రమం లోంచి ఒక రకమైన నడక బయల్దేరుతుంది, అనగా ఆ అక్షరాల్ని యథారీతి మనం వరసని పలికేటప్పుడు, ఒక నాదం తల ఝాడిస్తూ నడిచి వెడుతూన్నట్టు అనిపిస్తుంది. గానంలో వ్యవహరింపబడే 'తాళం' ఏదేనా ఇటువంటి వాటిల్లో అవలంబించి సరిపుచ్చడానికి కూడా వీళ్లున్నాయి, ఆ శీర్షికకింది పద్యాలన్నింటికీ నడక 'స్థిరం' గనక. కాని సీసం, గీతం, ద్విపద - మొదలైనవి కొన్ని ఉన్నాయి. సీసానికి నడక స్థిరంకాదు. ఏమంటే దానిపాద నిర్మాణంలో ఇంద్ర సూర్యగణాలున్నాయి. ఇంద్రగణాలు ఆరు. కాని వాటిల్లో రెండు భిన్నపరిమాణ వర్గాలున్నాయి. సూర్యగణాలు రెండే ; వాటి పరి మాణాలు సమానమే కుడాను! సీసపాదంలో మొత్తం ఉండవలిసిన ఎనిమిది గణాల్లోనూ మొదట ఆరు ఎవైనాసరే ఇంద్రగణాలూ, తర వాత ఏవైనాసరే రెండు సూర్యగణాలూ – అని ఉంది. ఉండవలి సిన ఆరు ఇంద్రగణాలూ ఒకే పరిమాణవర్గానికి చెందినవైతే (భ, నల- ఈ రెండింటికీ పరిమాణం, 4 మాత్రలు : తక్కిన ర, త, నగ, సల- ఈ నాల్గింటికీ పరిమాణం, 5 మాత్రలు : (లఘువు ఒక మాత్ర, గురువు 2 మాత్రలు - ఏగణంలో ఏస్థానంలో ఉన్నానరే!) అవి వరసని పఠించేటప్పుడు దెబ్బ పడుతుంది, అనగా ఒక విధమైన 'తాళం' . 4 పరిమాణంవి కొన్నీ 5 పరిమాణంవికొన్నీ కలగాపుల గంగా సీసంలో సందర్భిస్తే వాటికన్నింటికీ పేరు 'ఇంద్రగణం' అయినా, పరిమాణాలలో తేడాలవల్ల, నడక సక్రమంగా ఉండదు. అల్లాంటి సీసాల్లో లెఖ్ఖసంగతి చూడక నడక కుంటుతోంది అని సామాన్యంగా అంటారు. ఒక్కొక్క పద్యరకానికి కావలిసినంత గ్రంధంఉంది. దండకాల గణాల్నీ, రగడల గణాల్నీబట్టి, వాటిని పూర్తిగా లయప్రకారం అనవచ్చు. ఆటవెలదిలో మొదటి పాదం లాగ రెండోపాదం ఉండదు. కాని, మూడోది మొదటిదిలాగా, నాలుగోది రెండోదిలాగా ఉంటాయి. బహుశ అందుకనేగావును దాని కాపేరు.

తెలుగుజాతి వేసుగున్న పథకంప్రకారం కోట్లాది నడకలు సూచింపబడి ఉన్నాయి. ఒక వందరకాలు యత్నించి చూపించిన వాళ్ళున్నారు. కాని సర్వసాధారణంగా అమలులో ఉండే కొన్ని పైన చెప్పడం అయింది. 'కందం'లో నియమాలు ఎక్కువట, అందుకని కందం చెబితేగాని 'కవి' కాడు - అనేమాట పుట్టింది. అనగా, ఎంత శ్రమఉంటే అంత గొప్ప పనివాడితనం అందులో ఉంటుందని! కాని, అనుభవంలో శ్రమ వేరూ, పనివాడితనం వేరూ. ఇక ఏ మనస్థితికి ఏ రకం పద్యం వాడాలీ అనేదికుడా తేలదు. అంటే, సీసం ఎప్పుడు రాయాలీ, గీతం ఎప్పుడు, ద్విపద ఏఅవస్థకి, చంపకమాల ఎప్పుడు? అనే వాట్లకి సమాధానాలు అద్వితీయంగా ఉండవు. శోకరసానికి ద్విపద అని కొందరు, కాదు వీరరసానికే అని మరికొందరు. చంపక మాల ఉత్పలమాలలు శతకాలకని వేరేకొందరు. లలితమైన ఉదంతా నికి ఇవి గాని, గంభీరంగా రాజసంగా ఉండాలంటే మత్తేభశార్దూలా లని ఇంకాకొందరు. మత్తేభం పుడితే ఒంటరిగా ఉండదు పక్కనే మరొకటో రెండో ఉంటూంటాయి, దాని గమనం అల్లాంటిదని అంటారు. శ్రీనాధుడిది సీసం, ఆటవెలది వేమన్నది, కందం కవి చౌడప్పది, మత్తేభశార్దూలాలు ధూర్జటివి అంటూ పంపకాలు చేసే వాళ్లున్నారు—కడంవాళ్ళకి ఇవి సయించనట్టు. మంచి కోపంలో చాలా కఠినంగా ప్రసంగించడానికి మహాస్రగ్ధరలాంటివి వాడాలని ఒక తెగవా ళ్ళంటే, అలాంటివి శృంగారానికికూడా వాడచ్చు అని చూపిస్తాడు మరో కవి. చాలా సంగతులుంటే సీసం, ఆటే లేకపోతే కందగీతాలు అని కొందరి దెబ్బలాట. కాని, సీసంలో పిసరంతేనా వృత్తాంతం లేకుండా రాసినవాళ్ళూ, ఓ కందంలోనో గీతంలోనో లక్ష చెప్పిన వాళ్ళూ ఉన్నారు.

నిత్యకృత్యానికి తెలుగు ఛందస్సు

తెలుగుఛందస్సులో ఈ కింది విషయాలు గమనిస్తే, ఎవరేనా తెలుగుపద్యాలలో విహరించడానికి అర్హత సంపాదించవచ్చు.

పలకడానికి కాస్త ఆలస్యం అయే అక్షరం - గురువు. కాకపోతే లఘువు. రెండు లఘువులు 'లల’ము. లఘు-గురువుల జంట 'లగ'ము ( 'వ'గణము ). గురు-లఘువుల జంట 'గల'ము ('హ'గణము). రెండు గురువుల జంట 'గగ'ము ('గా' గణము). “గురువులు మూడిడ -మ' గణము, పరగంగా నాది గురువు- 'భ' గణం బయ్యెన్, ధర మధ్య గురువు-'జ' గణము, సరసగుణా అంత్యగురువు- 'స' గణం బయ్యెన్. -'న' గణంబు మూడు లఘువులు -'య' గణంబున కాది లఘువు యమ తనయనిభా,-'ర' గణంబు మధ్యలఘు వగు, 'త' గణంబున కంత్య లఘువు తత్వజ్ఞనిధీ. భ, ర, త, న గ, న ల, సలంబులు వరుసగ నివి యారు నెన్న వాసనగణముల్. మరి న, హ లు సూర్యు లనబడు. ఇంద్రగణము లారు నిన గణంబులు రెండు పాదపాదమునకు బరగు చుండు, ఆటవెలదియైన తేటగీతియునైన చేర్చవలయు మీద సీసము నకు—ఇనగణ త్రయంబు నింద్ర ద్వయంబును, హంస పంచకంబు ఆట వెలది, సూర్యుడొకడు మీద సురరాజు లిద్దరు, దినకరద్వయంబు తేటగీతి. న, జ, భ, జ, జల్, జ, రేఫల బెనఁగి దశాయతితోడ గూడినన్ త్రిజగదభీష్టదాబుధనిధీ విను చంపకమాల యై చనున్. భానుసమాన విన్ భ, ర, న, భా,ర, లగం, బులగూడి విశ్రమస్థానము నందు పద్మజయుతంబుగ నుత్పల మాలయై చనున్. స్మయదూరా, విలసత్ త్రయోదశయతిన్ మ త్తే భ వి క్రీ డి తా, హ్వయమౌచున్ న భ, రంబులున్ న, మ, య, వ, వ్రాతంబులన్ చెల్వగున్. సారా చారవిశారదా యిన యతిన్ శా ర్దూ ల విక్రీడితాకారంబై మ, స, జ, ంబులున్ మరి స, తా, గ, ప్రాప్తమై చెల్వగున్. కందము త్రిశరగణంబుల, నందము, గా, భ, జ స, నల, ము లటవడి మూటన్, జెందున్ నల, జ, ల నారిట, నొందున్ దుది గురువు జగణముండదు బేసిన్. శ్రావణాభరణాంక విన్ ర, స, జా, భ, రేఫల, దిగ్విరామా హవంబుగ మత్తకోకిల యండ్రు దీని కవీశ్వరుల్. ఇంద్రగణ ములు మూ డినగణ మొకటి చంద్రాస్య ద్విపదకు జనుజెప్ప రేచ. అమరంగ న, స, హ, ంబులం దాదిగా నొండెఁగాదేని యాదిన్ తకారంబుగా నొండె లోనం దకారమ్ము లిమ్మై గకారావసానంబుగాఁ జెప్పినన్ దండకం బండ్రు దీనిం గవీంద్రుల్.”

ఇక యతులు : అచ్చుల్లో- అ ఆ ఐ ఔ ; ఇ ఈ ఋ ౠ ఎ ఏ ; ఉ ఊ ఒ ఓ.

హల్లుల్లో – వర్గాల్ని బట్టిన్నీ, మరి ప్రత్యేకించి కొన్నిన్నీ.

ఈ గొడవ అల్లా ఉండనీండిగాని, గద్య ఉంటూంటే బోలెడు ప్రతిబంధకాలుగల పద్యం అసలెందుకండీ, అనగల్రు. 'గద్య' అంటే చెప్పతగినది, 'వచనం' అన్నా అంతే. కాని, యీ యోచనలో తిరకాసు ఏమిటంటే, ఏ రచనతరవాత ఏరచనకి ప్రాముఖ్యం వచ్చిందో గమనించకపోవడం! ఆదిని 'ఓం' అయితేం 'కున్' అయితేం, నాదం లోంచి గానకవిత్వాలు ఆవిర్భవించడంలో, 'గీత' అనే గ్రంధనామం ఉండడంవల్ల, గేయరూపంలోనే పదరచన బయల్దేరినట్టు అన్ని జాతుల వాళ్లూ ఒప్పుగున్నారు. గేయంలో శబ్దం, గానం, గమనం – అనగా, వ్యక్తనాదం, అవ్యక్తనాదం, నియమితమైన నడక - చేరి ఉంటాయి. కాని, కాలక్రమాన్ని అవ్యక్తనాదం అయిన 'గానం', స్వతంత్రంగా, ఏ యితరంమీదా ఆధారపడకుండా ప్రాణికోటిని ఆకర్షించగలగగానే, అది ప్రత్యేకకళ కాగా, గేయంలో దానికి స్థానం పోయింది. అప్పుడు పదరచనలో శబ్దం, నియమితమైన నడక - ఈ రెండే నిల్చాయి. ఇటు వంటి పదరచన 'పద్యం'. నియమితమైన నడక - అనే తాళంకుడా ప్రత్యేకంగా స్వతంత్రంగా జనాకర్షణ చెయ్యగలగగానే, దానికిగుడా పదరచనలో స్థానం అముఖ్యం అయింది. అప్పుడు శబ్దమే నిల్చి గద్యకికుడా స్వాతంత్ర్యం వచ్చింది. ఆటంకాలూ, శృంఖలాలూ తగ్గి పోవడంగదా స్వాతంత్ర్యలక్షణం! గేయానికి స్వాతంత్య్రం వచ్చి 'పద్యం' అయి, పద్యానికి స్వాతంత్ర్యం వచ్చి గద్యకుడా కళ అయింది. ఆంధ్రంలో దీనికి దృష్టాంతం వీరేశలింగంపంతుల్ని 'గద్యతిక్కన', అనడం. ఇట్లా ఉండగా, వెనకటి అవసరాల్నిబట్టి పద్యం వెనక విరి విగా రాస్తోచ్చారు. ఇప్పుడూ పద్యరూపం అవలంబించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నియమాలు పరిపాటి, అవి ఆటంకాలూ శృంఖ లాలూగా వాళ్ళకి తో స్తే, వాళ్ళు పద్యం గొడవ మానుకుని మరోపని చూసుగునే ఉండేవాళ్లు. క్రియముక్క 'పద్యం' అనేది కవితాసాధనకి ఒకసాధనంగనక, సమర్ధుడు ఆ రూపం అవలంబించినప్పుడు, కూడదని ఎవరనగలరూ? అది ఎంతమందిని ఆకర్షిస్తుందీ అంటే, చెప్పలేం!

కాబట్టి గద్యకళ ఏర్పడిఉండగా, దాని మీద మరికొన్ని నియ మాలు కల్పించుగుని పద్యకళ తయారుచేసుగోలేదు, ఆంధ్రజనం. పద్య కళ ఉంటూండగా, దానిలోని నడక అప్రధానమైపోయి గద్యకళ ఏర్పడింది. అటువంటప్పుడు మరి పద్యం ఎందుకు ? కళలో ఒక రూపం వెనక్కిపడి మరో రూపం జనాదరణ పొందేటప్పుడు, వెనకటి రూపం నాశనంఅయి మాయంకాదు, ఉంటూనే ఉంటుంది. అల్లాగే పద్యరూ పంకుడా. నేటి పరిస్థితుల్లో ధారణ అముఖ్యం. కాని ఎవడేనా ధారణని తిరస్కరించవచ్చుగాని, నటు డెట్లా తప్పించుగుంటాడూ! పద్యం ధారణకెంత వీలూ ! దానిలో ఉండే వర్ణసామ్యం మొదలైనవి కంఠ పాఠానికి ఎంత అనువూ ! మానవసంభాషణకి దూరం అవడంవల్ల పద్యం మహిమాస్పదంగా జనం భావిస్తారు. ప్రపంచభాష లన్నింటి లోనూ ఇంకా పద్యరూపం గణింపబడుతూనే ఉంది. పద్యరూపంలో లెఖ్ఖ ఉంటుందిగనక, దాన్ని ఋజువుచేసి సరిచూసుగోడానికి ఎక్కువ సాధనాలుంటాయి. పద్యరూపంలో స్థలం కుశలం అవడంచేత పదాలు కాదు ప్రతి వర్ణమూకుడా పొదుపుగా వాడాలి. నియమిత మార్గం ఉన్నప్పుడు, వేగం వృద్ధి అవుతుంది. అందుచేత ఎంతోగాధ చెప్పడా నికి ఒక్కొక్కడు పద్యమార్గం అవలంబిస్తాడు, వేగసిద్ధికోసం గద్య ఎవరో చేసినట్టు కనిపిస్తే పద్యం ఏకపళంగా మొలిచినట్టు కనిపిస్తుంది, ఇదివరకే తయారై ఎక్కడో మాటున పడిఉంటే, కవి దాన్ని ఆవిష్క రించి తెచ్చి మనకి ఇచ్చినట్టు ఉంటుంది. పద్యరూపంయొక్క స్వభా వం తెలిసిన శ్రోతకి కర్తయొక్క మార్గం పరిచయం కావడంవల్ల తను కుడా ఆ దిశలోనే వెళ్లి కర్తని మధ్యదార్లో కలుసుకోడానికి యత్నించే అవకాశం ఎక్కువ ఉంటుంది. మోతాదులో మాట్టాడే సంగతిగురించి జనం ఎక్కువ శ్రద్ధ వహిస్తారు, ఎప్పుడు ఆఖరవుతుందో తెలియని వ్యాపారంలో శ్రద్ధ అవిచ్ఛిన్నంగా ఉండదు. అందువల్ల, పద్యం విన డానికే జనకుతూహలం ఎక్కువగా ఉంటుంది. భావౌన్నత్యాన్ని బట్టి గద్యకుడా కవిత్వం అనబడవచ్చుగాని, చిరస్మరణీయ వాక్యాలు, ప్రతిమానవుడి అనుభవాన్నిబట్టీ, పద్యరూపంలోనే విడివిగా ఉం టాయి. జనబాహుళ్యంలో కలిగించవలిసిన విశ్వాసం సునిశ్చితంగా ఉండేటట్టు చెయ్యగల ప్రామాణికత్వం పద్యరూపంలో ఎక్కువఉంది. ఒకరినించి మరొకరికి పాకినప్పుడు గద్యరచనలోకంటె పద్యరచనలోనే వర్ణచ్యుతి తక్కువగా ఉంటుంది. కవి ప్రకటించింది ప్రకటించినట్టు చాలాకాలంతరవాతవాళ్ళకి జొనుపులూ మినహాయింపులూ లేకుండా అందడానికి పద్యరూపం అయితేనే ఎక్కువ సావకాశం ఉంది. పద్య రచనలోని ఒక్కొక్కచోటి పదప్రయోగం పదస్వరూపనిర్ణయానికి అనుకూలిస్తుంది. ఒకప్పుడు కొంతకాలంపాటు మోజుగా ఉండే పద్య విశేషం తరవాతకాలంలో విసర్జింపబడడం జరగవచ్చుగనక, సకృత్తుగా అటువంటి రకాలవల్ల కాలనిర్ణయంకుడా చెయ్యవచ్చు. ఒక్కొక్క పద్యరచయిత అవలంబించే పద్యరూపాలవల్ల అతడి సంప్రదాయమూ, అతడి యిష్టకవుల జాడలూకుడా తెలుస్తాయి.