ఆంధ్రనాటక పద్యపఠనం/పద్యంపాడడపు సంప్రదాయ విచారణ

2. పద్యం పాడడపు సంప్రదాయ విచారణ

మానవహృదయానికి ప్రత్యక్షంయొక్క అనుభూతీ పరోక్షం యొక్క సానుభూతీ ఉన్నాయి. రసపూరితమైన హృదయానుభవమే భావోదయానికి మూలం. సంపూర్ణభావాలతోకూడినయోచన మానవ మేధయొక్క విశేషలక్షణం. ఆయోచన విస్పష్టంగా ఇతర మానవులకి ప్రకటించడానికికుడా మానవుడు నోచుగున్నాడు. యోచనయొక్క ప్రకటనకి అనేక సాధనాలు మానవుడు వాడగలడు. అటువంటి సాధ నాల్లో మాటలు ఒక సాధనం. మాటలతో రచనచేసేవాడు, తన మాటల సముదాయాన్ని మూడు రూపాల్లో ఏదో ఒక రూపంలో ప్రకటించి తీరాలి – గద్యరూపంలోనో, పద్యరూపంలోనో, గేయరూపం లోనో, గద్యరచయితకి అన్నిటితోపాటు సాధారణవ్యాకరణ జ్ఞా నమూ, పద్యరచయితకి అవన్నీ కాక పైగా ఛందోజ్ఞానమూ, గేయ కవికి అవన్నీ కాక పైగా గానతత్వంయొక్క జ్ఞానమూ ఉంటాయి-అని మనం అనుకోవడంలో తప్పు ఉండవచ్చుగాని, ఉండాలి అని కోరుకో డంలో ప్రత్యవాయంలేదు. గద్యరచయిత ఛందోగానాలలోకూడా ప్రవీ ణుడై ఉండాలనీ, పద్యరచయిత గానాచరణలోకుడా ఉద్దండుడై ఉండా లనీ, గేయరచయిత ఛందోగానజ్ఞానశూన్యుడై ఉన్నా ఫర్వాలేదనీ అను కోడం భ్రాంతి. ఏమైనా ఈముగ్గురు రచయితల్లో కేవలగద్యరచయితకి తెలుగుజనబాహుళ్యంలో ప్రత్యేకపు పేరు లేదు, గద్యరచయిత రాత నాటికీ నేటికీ అంతే. అసలు వీరేశలింగంపంతులు వచ్చేవరకూ తెలు గులో కేవల తెలుగుగద్యరచనకి మన్ననే లేదు. ఆయనేనా, ఒకపాటి వాడికి కొరుకుపడని పద్యరూపంలో రచనచేసి చూపించడంవల్లగావును, గత్యంతరంలేక ఆయన్ని 'గద్య తిక్కన' అన్నారు. అట్లానే, కేవల గేయరచయితయొక్క కర్మంకుడా తెలుగుపండితుల దృష్టిలో కాలి పోతూంటుంది. వాణ్ణి గాయకుడు అని పిల్చుగుంటే పిల్చుగోండిగాని వాణ్ణి మాటకారుల్లోకి చొరబడనియ్యకూడదు అనే వాళ్ళున్నారు. అందుకని, మాటరచయితలందర్లోకీ ఏ కొంతో అదృష్టం పెట్టిపుట్టిన వాళ్ళు పద్యరచయితలే. ఇతర విశేషాలకితోడుగా పద్యవేషంకుడా ఉన్నప్పుడుమాత్రమే ఎవడేనా మాటకారిని 'కవి' అనడానికి ప్రజలు ఒప్పుగుంటారుగాని, తక్కిన రచయితలకి చూస్తూచూస్తూ బుద్ధి పూర్వకంగా 'కవి' అనేటంత ఖరీదైన బిరుదం కట్టబెట్టలేరు. అదీ కాక, జనసామాన్యంలో గద్యరచనగురించిగాని, గేయరచనగురించిగాని చెప్పుగోడం ఉండదు. కాని, పద్యరచనవిషయంలో: అతడు పద్యాలు చేస్తాడు, పద్యాలు కడతాడు, పద్యాలు అల్లుతాడు, పద్యాలు చెబు తాడు, పద్యాలు రాస్తాడు - అంటూ వ్యవహరించుతూండడం విన బడుతుంది. 'మాట' అనేది అర్థంతో కూడిన నాదం గనక, పై మూడు రకాల రచయితలూ తమతమ రచనయొక్క సృష్టి జరుగుతూండే సందర్భంలో ఆ రచనని మొదట నాదరూపంలో సృష్టించి తరవాత లిఖితరూపంలో దాన్ని పొందుపరుస్తారో, లేక నాదంతో నిమిత్తంలే కుండా లిఖితరూపంలోనే ప్రథమంలో దాన్ని ఆవిర్భవింపజేసి పదపడి దానియొక్క ఉచ్చారణసంగతి వదిలేస్తారో తెలియదు. రెండు రకాల వాళ్ళూ ఉండవచ్చును. కాని, ఉచ్చారణ చేసినమీదటగాని మాట జీవించదు. అక్షరరూపంలో 'మాట' అనేది సుప్తం అయిఉంటుందని అనుకోవాలి.

అభిప్రాయబాహుళ్యంవల్ల గ్రంధం ఏర్పడుతుంది. వృత్తాంత ప్రాధాన్యంగల గ్రంధాలు అనేక రూపాల్లో ఉండవచ్చు- పురాణం, ప్రబంధం, శతకం, ఖండకావ్యం, నవల, కధానిక మొదలైన రూపాల్లో వీటిల్లో గద్యంగాని, పద్యంగాని ఉండవచ్చు, ఉన్నా, ఇటువంటి రకా లన్నీ ఒక్కొక్క వ్యక్తిప్రత్యేకమూ తన నిమిత్తమే ఏదైనా చదువు కోడమో పఠించుగోడమో జరగవచ్చునని రచయిత అనుకుని ఉండ వచ్చు గనక, ఒక్కొక్క వ్యక్తి ఆయారచనని స్వంతంనిమిత్తం చదువు కోవచ్చు, పఠించుకోవచ్చు, పాడుకోవచ్చు, ఓపికని బట్టి ఆడుతూ పాడుతూ కూడా వ్యవహరించుగోవచ్చు. అట్లానే, ఏదేనా గీతం లిఖిత రూపంలో ఉంటే ఎవడేనావ్యక్తి దానిమీద సూచింపబడే రాగ తాళాలప్రకారం దాన్ని తన నిమిత్తం పాడుకోవచ్చు. అనగా, ఒకేవ్యక్తి స్వంతభుక్తం నిమిత్తం ఎక్కడైనా లిఖితమైన మాట రచనని చేత పట్టుగున్నప్పుడు అది గద్యంఅయినా బాధలేదు, గేయం అయినా చిక్కులేదు, అందువల్ల పదంఅయినా తంటాలేదు. కాని, గ్రంధం ఒక 'నాటకం' అయినట్టయితే, చిక్కులు బయల్దేరతాయి. మొదటి సంగతి, ఉచ్చారణకర్త అన్యుడై తోచడానికి రంగం ఎక్కిన వాడేకాని తన స్వత్వం అక్కడ స్థాపించుగోడానికి ఎక్కినవాడు కాడు. రెండో సంగతి, అక్కడ తన స్వంత ఉపయోగంనిమిత్తం మాటరచన వాడుకునేటందుకు అతడు అక్కడికి వెళ్ళడు. సరికదా, వందలాది సజీపజనం తన ఎదట చూస్తూ వింటూ ఉండగా, తను, తన మాటలయొక్క ఏకోచ్చారణమాత్రమే చేసి, వాటిలోని సంగతి వాళ్ళకి బోధపరిచి, తద్వారా వాళ్ళకి తనుగా కాకుండా అన్యుడై తోచి వాళ్ళని ఆకర్షించడానికి వెడతాడు. ఈ పని చెయ్యడంలో సందర్భించేమాటలు గద్యరూపంలోనే ఉంటాయా సభాముఖాన్ని వాటిని ప్రకటించవలిసిన రీతిగురించి బాధ లేదు. ఏమంటే : తెలుగు ప్రపంచంలో జీవించి వ్యవహరించే వాళ్ళంతా తెలుగు గద్యమే వాడు తూంటారు గనక గద్యోచ్చారణ ఎందు నిమిత్తమో గద్యోచ్చారణ రీతి ఎట్లా ఉండాలో స్థూలంగా ప్రతివాడికీ విశదమే. గేయోచ్చారణ కూడా సభఎదట జరపడానికి వీలుపడే నిమిత్తం ఒక రాగంపేరూ ఒక తాళంపేరూ గేయకర్తచేత సూచింపబడిఉంటాయి గనక, ఆయారాగ తాళాలయొక్క ఆచరణలో సామర్ధ్యం కలవాడే, ఆ గేయాన్ని ఉద్ధ రించి వ్యవహరిస్తాడు. కాబట్టి, సభాముఖాన్ని గద్యోచ్చారణయొక్క విధానంగురించి తగాదా రాలేదూ అంటే, గద్య ప్రకృతిసిద్ధం గనక. గేయోచ్చారణయొక్క విధానంగురించి పేచీ రాలేదూ అంటే, గేయం రాగతాళనియమబద్ధం గనకనున్నూ, నేర్పరి కాని వాడు దాన్ని స్మరించడానికి వీలులేదు గనకనున్నూ ! కాని, పీడ యావత్తూ నాటకపద్యోచ్చారణకి పట్టుగుంది. దాని విధానానికి దారీ తెన్నూ కనిపించదు. పద్యకర్త పద్యాన్ని ఇల్లా కని అల్లా పారేస్తా డట కాని ఉచ్చారణవిషయంలో అతడికి పూచీ ఏమీ లేదుట, అందు వల్ల ఆ విషయం అతడికి తెలియకపోవడం అతడి హక్కుల్లో ఒకటిట ! పైగా, పద్యకర్త పద్యోచ్చారణక్రియలో ఎంతో స్వాతంత్ర్యం పద్యో చ్చారణకర్తకి ధారపోశాడట (తనకి చెందని సొమ్ము !). ఏమిటా స్వాతంత్య్రం అని అడగరేం ! గాత్రమాధుర్యమూ రాగాడంబరమూ కలిగిఉండడం—అల్లాంటివాళ్ళకే ఆ స్వాతంత్ర్యం. దాని ధర్మమా అని, పద్యోచ్చారణకర్తకి పద్యం అన్నా పద్యవిశేషాలన్నా ఛంద స్సన్నా స్పష్టోచ్చారణ అన్నా తెలుగుమాటరీతిఅన్నా తెలిసి తీరా లటగాని, ఎంతమాత్రమూ తెలియకుండా వ్యవహరించగల సదుపా యంకూడా ఉంది. పద్యతత్వం తెలియకుండా పద్యాస్వాదన చేశాం అని చెబితే ఎవరేనా నవ్విపోతారేమో అని కూడా కొందరు సిగ్గు పడకపోవడం ఆ స్వాతంత్ర్యంమూలాన్నే! పద్యరచయితలలోతప్ప ఆంధ్రఛందస్సు వ్యాప్తిహీనం కావడానికి కారణం ఆ స్వాతంత్య్రమే! ఇక, శ్రోతలుకుడాఅయిన నాటక ప్రేక్షుకులు : ఛందస్సు ఏమైనాసరే, కర్ణ పర్వంగా, మరీ రేవెట్టినట్టు కాకుండా అంతమాత్రాన్ని మరీ తుంచి పారేసినట్టు కాకుండా తమరి మనస్సులోఉండి తమరు చెప్పడానికి తగ్గ మాటలు తమరిదగ్గరలేని ఒకానొక పద్యరాగసమ్మేళనప్రమాణ ప్రకారం పద్యోచ్చారణ నిర్వహింపబడితేనే నటనం ఒక కళగాని లేకపోతే కాదని—పిడివాదం ! అందువల్ల, ముఖ్యంగా నాటకరంగ పద్యమూ, దాన్నిబట్టి తక్కిన ఇతర ఆంధ్రపద్యమూ ప్రత్యేకోచ్చార ణలో పొందవలసిన వైఖరి ఏది అనేది ఒక గడ్డుసమస్యగా తయారైంది.

మాటలు గద్యలోఉంటే ఆ మాటలయొక్క అర్థభావరసాలు ద్యోతకం అయేలాగు వాటిని ఉచ్చారణచేస్తూ తన అభినయకళ యొక్క దోహదంవల్ల శ్రోతలకి ఆమాటల్ని సుగమంచేస్తూ అన్యుడై ఒప్పడం గద్యనటుడి బాధ్యత. అట్లానే, మాటలు గేయరూపంలో ఉన్నప్పుడు గేయంనెత్తిని సాధారణంగా రాసిపెట్టిఉండే రాగతాళాలు ప్రయోగించో లోగడ అవి వచ్చి ఉండకపోతే నేర్చి ప్రయోగించో లేకపోతే చచ్చిచెడి ఆ భణితి ప్రయోగించో కొత్తభణితి బనాయించో గేయాలుకుడా రచించిన ఆ నాటకకర్త మాటలసందునా ఒకే మాట యొక్క వర్ణాల సందునా తన ప్రత్యేకకోమలగాత్రానికి తత్పూర్వమే స్థిరపడి అలవాటైపోయిన రాగసంగతులు యథాశక్తితో వెదజల్లుతూ ఆ మాటల్ని తాళంతో బాది రాగంతో ఈడుస్తూ అన్యుడై ఒప్పడం సంగీతనటుడి బాధ్యత. ఇల్లాగ్గా దైవకృపవల్ల తెలుగు గద్యనట గేయనటుల బాధ్యతలు నిర్ణయం అయినాయి. ఇట్లానే, పద్యోచ్చా రణగురించి పద్యనటుడియొక్క బాధ్యతకుడా ఫలానాఅని ఖాయపడి ఉంటే బతికిపోయుందుం, అటువంటిది ఏదీ నిర్ణయం కాలేదు. పద్య నాటకాలు జనించి ఒక అరవై యేళ్ళపాటు విజృంభించి అంతరించ వచ్చే నేటికీ ఆసమస్య అట్లానే ఉండిపోయింది. ఏమయ్యా, నాటక పద్యంగురించే ఈ సమస్య రావడేం! తెలుగు పద్యనాటకం జనించ డానికి పూర్వం వందలాది సంవత్సరాలుగా తెలుగు పద్యాలు వాల్లాడి పోతూ ఉండలేదా ? అంటే, ఉండకేం! ఆంధ్రంలో పద్యరచన నన్నయనాటికే ప్రౌఢ. నాటినుంచి, పురాణాలలోనూ ప్రబంధాలలోనూ శతకాలలోనూ పద్యాలు గద్యతో కలిసి వెలుస్తూండడం జరిగింది. క్రీ శ. 1880 ప్రాంతంలోగాని ఆంధ్రంలో 'నాటకం' అవతరించలేదు. అప్పటివరకూ అన్ని వందల ఏళ్ళూ ఆయాపద్యాల్ని సభాముఖాన్ని ప్రకటించవలిసిన అవసరం వచ్చినప్పుడు ఎట్లా ఉచ్చారణ చేసేవారూ అంటే, పురాణాలు సభ్యుల యెదట వడ్డించడపు సంప్రదాయం నేటికీ నిల్చిఉన్నది గనక, దాన్ని బట్టి అనుమానిస్తే,పద్యాలు "పాడుతూండే” వారు అని తెలుస్తుంది. పురాణపఠనాన్నిబట్టి మరోటికుడా తేల్తుంది. ఏమనీ ? గద్యకూడా పాడేసేవారూ, అని, ఒక పఠిత ఏదో గ్రంథంవిప్పి ఎదర ఉంచుగుని మూలుగుతూ పాడుతూఉంటే, ఆ ముక్కలకి అర్థభావస్వారస్య విశే షాలు మరొకరు అనర్గళంగా చెబుతూంటే, జనం ఆలకిస్తూ ఉండడం– అన్నమాట. ఆ అర్థం చెప్పడంలో ఒకానొకప్పుడు, ఆ చెప్పేవారు తమ చమత్కారం యావత్తూ వెచ్చించి కవిఉద్దేశంలో ఆ కథపట్టులో ఎంతమాత్రమూ లేని సంగతులు చెప్పినా, వారి చెప్పడపు స్వారస్య ప్రవాహవేగంలో మునిగిపోయి, అక్షరకుక్షులు కానివారు సరేసరి అయినవాళ్లుకుడా లెంపలేసుగుని, కళ్లకద్దుకుని ఆ సంగతులన్నీ స్వీకరించడం జరుగుతుంది. చదివేవాడు ఎప్పుడేనా తత్పరుడు కాలేక, ఎదేనా కొత్త మాటగురించిగాని కొత్త సమాసం యొక్క పదవిభ జన గురించిగాని తడుముకోవలిసివచ్చినప్పుడు, ఠక్కున ఆగిపోవడం అసామర్ధ్యాన్ని ఒప్పేసుకోడం కిందికి రావచ్చు గనక-కాలయాపన చెయ్యడానికి మూలుగుప్రారంభించి ఉంటాడు. ఆ మూలుగు పద్యంలో గద్యలోకంటె ఎక్కువ అవసరం. ఎల్లాగూ అవసరంగా పరిణమించిన మూలుగు శ్రావ్యంగా మొదణ్ణించీ ఉంటే తీరిపోతుందని, ఎవరో ఒక గడసరి పద్యాన్నంతనీ రాగంతో బనాయించి ఉంటాడు. అక్క ణ్ణించి పద్యం అయేది గద్య అయేది ఏదో రాగం మీద నాట, మోహం, ఆరభి మొదలైన వాటిల్లో ఒక దానిమీద—మోసెయ్యడం సాగించి ఉంటారు. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పఠిత సరిపో యేవాడు. పైగా, పద్యానికి వ్యాఖ్యానం సావకాశంగా చేస్తారు. అందుకని, పద్యోచ్చారణ అనేది వాళ్ళకి ఒక సమస్యలాగ కనిపిం చనే లేదు. ప్రబంధశతకాల్ని విడివ్యక్తులు స్వంతానికి కొరుక్కుతిన డమేకాని, మహాజనం ఎదట వాటిని దాఖలుచెయ్యడవు అవసరం రాకపోబట్టి, ఆ రచనా రూపాల్లోని పద్యాల ఉచ్చారణకూడా సమ స్యగా పరిణమించలేదు.

ఈస్థితిలోంచి నాటకరంగం అవతరించి, అచిరకాలంలో సంగీత నాటకాలు ఉద్భవించడంతో ఏదైనా పద్యాన్ని ఇష్ట రాగంమీద పాడడమూ, గద్య చెప్పడమూ ప్రారంభం అయింది. గద్యరచన తోనే మొదలెట్టిన నాటకకర్తలు వేషాలెయ్యడానికి మంచిగొంతిగ వాళ్లు వచ్చినకొద్దీ పెద్దపాత్రలకి పద్యాలు 'చెయ్యడం' ఆరంభించారు, నటులే ఇతర యిష్టులచేత కీర్తనలుకుడా రాయింపించి, ప్రదర్శనాల్లో పాడేవారు. గానశాస్త్రవ్యాప్తితో జనంయొక్క గాన ప్రియత్వపు సగటు హెచ్చినకొద్దీ నాటకగానం మారుతోచ్చింది. కీర్తనలకి రాగ తాళాలు రాసిపెట్టి ఉంటాయి. నాటకరంగంమీద సిద్ధించవలిసిన అన్యవ్యక్తిత్వం సంగతి ఏం జరిగితేంగనక, అవి ఆ ఆజ్ఞ చొప్పునపాడాలి అనే నియమం కనపడుతుంది. కాని పద్యానికి పక్క అది ఏరకం ఛందస్సో చెప్పే పదంయొక్క మొదటి అక్షరం ఉంటుంది. అది పాడుకోడానికి సంజ్ఞ అని భావించే తెలుగువాళ్ళున్నారు. పొడుగులు సమానంగా ఉండే పంక్తులు నాలుగు రాసి ఇస్తే, అది పద్యమే అను కుని పాట మొదలెట్టేవాళ్లున్నారు. 'పాడవలిసింది' అనే ఆజ్ఞ అక్కడ ఏమి లేకపోయినా, ఛందస్సుగురించి సంజ్ఞ అక్కడ యిచ్చి ఉన్నా సరే, ఉన్న ఛందస్సు లేనట్టుగా గణించి, ఊరూపేరూ లేని రాగం అక్కడ ప్రత్యక్షంగా ఉన్నట్టు గమనిస్తూ, అదే మిక్కిలి సబబు అని తమరు నమ్ముతూ అట్లా నమ్మనివాళ్ళమీద యథాశక్తి ఆక్షేపణ లేవదీస్తూ వ్యవహరించే ఆంధ్రులు పామరుల్లోమాత్రమే ఉంటేబాగానే ఉండును! పద్యాన్ని ఏ బుద్ధిమంతుడో రాగంపోసి యీడ్చాడు బర బరా ! తక్కినవాళ్ళంతా అంతే చేసి, అప్పుడు సబబులకోసం గాలిం చడం ప్రారంభించారు. సంస్కృతరామాయణం పాడినట్టే ఉందనీ, 'కాంభోజీ మేళ విపంచికా రవ సుధాపూరంబు తోరంబుగాన్' అని ఉందనీ, ‘నాదనామ క్రియా నవ్య వైఖరి' అని ఉందనీ, పూర్వం అంతే అనీ, ఏది పడితే అది తమకి అనుకూలమైన సబబే అనుకుని వాదిస్తూ, దీనదశలో పడిపోయిన పద్యరాగాల్ని కలిపి పుణ్యం ఆర్జించు గోవాలనే తహతహలో కొందరు కొందరు ఉండిపోయారు. నాటక కర్తల పద్యాల్లో త్రాణ లేకపోవడంవల్ల రాగం కలిపి ఆ ఘటాలకి జీవం పోస్తున్నామని రంగంమీది వాళ్ళూ, నాటకరంగంమీది వాళ్ళు పాడుతున్నారని వర్తమానకాల ప్రజలూ మొదలెట్టి, తెలుగులో పద్యం అనేది కనపడీ కనపడడంతోటే, ఒంటరి పరాయివాడిమీద తనకి ఉల్ఫాగా దఖలుపడి బంజరుగా పెరిగిన నాటుకుక్కని ఇస్కూ కొలిపినట్టు, జీవితంలో తను సేకరించి పెట్టుగున్న గాలిపాట సామ గ్రికి గొలుసు వదుల్చేసి, స్వంత ఆస్వాదనికి సరేసరి, ఇతరులచేత ఆ పద్యాన్ని ఆస్వాదింపచెయ్య దల్చినప్పుడు కుడా, యథాశక్తి మూలుగు పద్యానికి జోడించి మరీ ప్రకటించడం సాగించారు.

పద్యంలోకి ఏ దొడ్డిదార్నో సన్నసన్నగా వచ్చి చొరబడ్డ క్షుద్ర రాగం సంగతి, ఏకై వచ్చి మేకై కూర్చోడంలా అయింది. పద్య కర్తకీ, పద్యోచ్చారణకర్తకీ, పద్యశ్రోతకీకూడా పద్యరాగసంధానం లాభదాయకం అనిన్నీ, వీళ్లల్లో ఎవరెవరికి ఎన్నెన్ని లోట్లూ లొసు గులూ ఉన్నా కమ్ముకోడానికి రాగం ప్రాణావసరమైన కవచమనిన్నీ, ఛందశ్శూన్యుల దగ్గిర్నించి అమూల్యమైన నిరర్ధకశ్లాఘ తక్షణం ఆర్జించి గట్టిగా మూటకట్టుగోడానికి రూఢిగా తోడ్పడేటందుకు క్షుద్ర రాగంతప్ప మరి చట్కామంత్రం లేదనిన్నీ వీళ్లు అనుకుని వ్యవహరిస్తు న్నారా అన్నట్టుగా, తెలుగు పద్యానికి రాగదోహదం మొదట్లో కొత్త, వింత, అలంకారం, ఫ్యాషన్, శాస్త్రోక్తం, శాసనం, విధి, తప్పని సరి, తద్దినం, అయి, చివరికి, గ్రంధంలో నిద్రించుతూండే పద్యపాత్ర లకి రాగపు కళాయి పుయ్యకపోతే పద్యపదార్థాలు కిలమూరి ప్రాణం మీదికి తెచ్చి తీరతాయి, అనే నిస్పృహ తెలుగుజాతికి కలిగిపోయింది. అర్ధం గ్రహించేనిమిత్తం పద్యపేటిక తెరవాలంటే తాళంచెవి రాగమే గావును అనే నమ్మకం తెలుగుజనానికి పట్టుగుంది. ఎవడేనా పూర్వ కవి రచించిన ఉత్కృష్టకవిత్వంలో పద్యవాక్యం సభాముఖాన్ని చెప్ప దల్చిన పఠిత ఎంత సమర్ధుడైనా, రాగంగనక తియ్యకపోతే, 'ఎంత ద్రోహం చేశావురా, నీ మొహంఈడ్చా!' అని వాణ్ణి పబ్లిగ్గా తిట్టడా నికికుడా, పద్యరాగశూన్యు డైనాసరే ప్రతి ఆంధ్రవ్యక్తికీ హక్కు ఆంధ్రజాతి ప్రసాదించేసింది. ఎవ్వడైనాసరే ఏ పద్యమైనాసరే ఏ అవస్థ లోనై నాసరే పాడాలి బతగాలి, లేకపోతే ఆ కవిత్వమూ చచ్చిందన్న మాటే, వాడూ అంతే! పద్యం పాడకపోవడం ఒకలోటు, కొంచెం అవకతవక, చివరికి క్షమించరాని ఘోరనేరంకిందికి దిగింది. ఏ బావతో కాస్తంత ఏ రాగమో తెచ్చి కలిపి పద్యాన్ని మూలుగుతూ చదవక పోతే, కాగితంమీద జీవిస్తూండే పద్యం నోట్లో పడగానే చచ్చి పోతుంది బాబోయ్‌అని హాహాకారాలు చేసే విపరీతపరిస్థితి ఆంధ్రలో పరిపాటి అయింది.

పద్యాలు పుట్టడంలోనే గతులుగలిగి ఉన్నా, రాగం తెచ్చి కలి పితేగాని వాట్లకి పుట్టగతు లుండవేమో అని తమకి భయం అని చెబుతూ, పామరజనహృదయాల్లోకి పద్యాల్ని శ్రావ్యంగా జొనపడాని కనే సాకు వెలిబుచ్చుతూ, (స్వంత పెట్టుబడి అక్కర్లేకుండా, పరాయి సొమ్మైన రాగం అయినకాడికి నొల్లుకొచ్చి ఎరగా పారేస్తే, అధిక సంఖ్యాకులైన ఛందశ్శూన్యుల తాలూకు మెప్పు - ఓటు తమ పద్యాలకి దఖలుపడి తీరుతుందిగనక, ఆల్పసంఖ్యాకులైన పద్యవిమర్శకుల్ని ఓడించేటందుకు ఉత్తరోత్రా ఉపచరించవచ్చని ఆంతర్యంలో సంభర పడుతూ) ఎవరో మహాత్ములు ఎల్లానో పద్యంలోకి ప్రవేశం మంజూరు చేసిన అల్పరాగంవల్ల, ఛందస్సుకి ఉచ్చారణలో దుర్గతి పట్టింది, ఒక్కొక్కప్పుడు మృతే సంభవిస్తుంది. ఛందశ్శాస్త్రం బోలెడు పద్య గమనాలు అనేకం. అవన్నీ స్వతంత్రం. వాటి ప్రత్యేకగమనాలు విని ఆనందించే భాగ్యం తెలుగుచెవులు ఇంతవరకు నోచుకోలేదు. 'ఏమం డోయ్, మీ ఛందస్సూ గిందస్సూ నాకు తెలియదు, శ్రావ్యంగా రాగం ఉంటే హాయిగా వింటాను. లేకపోతే ఎవడిక్కావాలయ్యా పాడు మాటలూ!' అని కొందరు ప్రతిపద్యాన్నీ నరికి మాట్లాడేవాళ్లు ఉన్నారు. కాని, పాపం, ఆ అనడంలో తమ భాషని తమరేమం టున్నారో వాళ్ళెరగరు. ఛందస్సు అనేది పద్యాలుకట్టే నేర్పరుల సాంకేతికభాష అయింది. పద్యకవిత్వాస్వాదన అనేది తెలుగులో విరి విగా లేదు. పద్యరూపంలో ఉండగల కవియొక్క రచనని దాని సహజగమనంతో చురుకుగా వినడమనేది కల్లవార్త అయిపోయింది. కొత్త పద్యభావాన్ని వినడం అలవాటు తెలుగులో లేదు. అది చెవిని పడ్డప్పుడు తమరే గ్రహించుకోగలిగినప్పటి ఆనందం, ఆంధ్రుల్లో చాలా మందికి సయించదు. కవి అన్న పదాలు చిరస్మరణీయాలుగాని, అవి పాడి వాటిని ఘనపరుస్తా ననేవాడి గాత్రమూ అది వ్యాఖ్యానిస్తా ననే మధ్యవర్తి చేసే ఉపన్యానమూ కావని, ఆంధ్రులు మరిచిపోయిన స్థితి వచ్చింది. ఉపన్యాసం నేటివరకు తెలుగులో ప్రత్యేక కళ కానేకాదు.