ఆంధ్రనాటక పద్యపఠనం/ప్రాతిపదిక


ఆంధ్రనాటక పద్యపఠనం

ఆంధ్ర నాటక పద్య పఠనం

1. ప్రాతిపదిక

శ్రీ "కూల్డ్రే " దొరగార్ని చల్లనివేళ తల్చుకుంటాను. పూర్వం (అనగా, 1909-1919 లో) ఆయన రాజమండ్రి ఆర్ట్సు కాలేజీ ప్రిన్సిపాలు. ఆయన నిత్యకళోపాసకుడు కావడంవల్ల ఏ 'ఆర్టూ' బోధించని ఆర్ట్సు కాలేజీయొక్క పేరులో అధిష్ఠించిఉన్న వైపరీత్యం ఆయన కాలంలోనేనా తొలిగిపోయిందిగదా అని ఒప్పుగునే వారుండవచ్చు. ఆయన సంభాషణ చిన్నగానూ, కాగితపురచన గంభీరంగానూ ఉండేవి. ఆయన హయాంలో (1918 లో) నేను బి. యే. క్లాసులో ఉండేవాణ్ణి. అప్పట్లో బి. యే. క్లాసుకి ఉంటూండే పఠనవిషయాల రెండింటిలోనూ ఒకటైన 'ఇంగ్లీషు' లో 'రిటరిక్' అనే అంతర్విషయం ఉంటూండేది. ‘రిటరిక్' అంటే 'వక్తృత్వశాస్త్రం' అని అనవచ్చు. అందులో శబ్దనిర్వచనభాగం 'సీనియరు' క్లాసులో ఆయన స్వయంగా బోధించేవారు. ఒకనాడు 'కళ' అనే పదంయొక్క నిర్వచనం చేసిన సందర్భంలో ప్రసంగవశాత్తూ ఉదాహరణపరంగా, "మీ ఆంధ్రకవిత్వం ఒక ప్రత్యేక 'కళ' కాదు” అని ఆయన అన్నారు. అప్పట్లో, బి. యే. కి 'తెలుగు' అంటూ ఒక పఠనవిషయం లేకపోయినప్పటికిన్నీ, నా కలం అసలు తెలుగక్షరాలు ఎక్కడ రాయగలుగుతుందీ అనే నిరాశలో నేను ఉంటూన్నవాణ్ణి అయినప్పటికిన్నీ, “ఎవరో దొరగారేమిటి? మా తెలుగుకవిత్వం గురించి తన ఇష్టం వచ్చిన సాభిప్రాయవిశేషం కోరకుండా కటాక్షించడం ఏమిటి?" అని బహుశా నాకు ఆంధ్రకోపం బయల్దేరింది గావును, క్లాసులో ఎన్నడూ సాధారణంగా నోరువిప్పిఎరగని నేను, లేచి,

ఆంధ్రకవిత్వం ఎందుచేత కాదండీ, ప్రత్యేకకళ ?, అనే ప్రశ్నతో ఆంగ్లంలో ఆయన్ని అటకాయించాను. 'అది మీ సంగీత రాగాల్నించి విడిపడి ప్రత్యేకత్వం ఆర్జించుగోలేకపోయిందిగనక, రాగ మిళితం అయినప్పుడుతప్ప దానికి జన్మ ఉన్నట్టు మీరు ఒప్పుగోరు గనక' -- అనే భావం ఆయన ఆంగ్లంలో వెలిబుచ్చారు. ఆంగ్లంలోనే

నేను - అది తమకు ఎట్లా తెలుసునండీ ?

ఆయన - నేను మీ నాటకాల్లో సరేసరి, తక్కినచోట్లకుడా పండితుల ముఖతాకుడా 'ఓ ఓ ఓ ' అనే రాగపు హోరులోనే దాన్ని వెలువరించడం వింటున్నానుగాని, ఆ మాటల్ని యధాగమ నంతో నేను వినడం లేదు.

నేను - మా కవులు కవిత్వం చెప్పడానికల్లామూలం రాగాలు నేర్చు గోరండి. వాళ్ళల్లో చాలమందికి ఏ రాగాలూ రావు.

ఆయన - అట్లానా ? పరమాశ్చర్యంగా ఉందే నాకూ! నేను అల్లా అనుకోలేదు. అదే నిజమైన పక్షంలో, రచనాదృష్ట్యా మీ కవిత్వం ఒక కళయే. కాని, దాని ఉచ్చారణగురించిన హెచ్చుతగ్గు ఏదో ఉందన్నమాట ! - అన్నారు.

అంతటితో ఆ విషయం క్లాసులో ఆగిపోయింది. కాని, అది నన్ను పట్టుగునే ఉంది. కాలేజీ విడిచిపెట్టిన తరవాతకుడా ఆయన మాట నా చెవిలో ఇంకా మోగుతూనే ఉంది. అందువల్ల ఆంధ్రేతరు డైన ఆ దొరగారి ప్రేరణవల్ల నామకః ఆంధ్రుణ్ణై ఉన్న నేను, ఆంధ్రంలో వద్యం ఆంటే ఏముటో తప్పనిసరిగా చూసుకోవలిసిన అవసరంలో పడి, ఆంధ్రంకేసి తిరగవలిసివచ్చి తిరిగాను. రకరకాల కవనాలకోసం నేను ఆంధ్రసారస్వతంలో ప్రవేశంఅర్థించుకుని చేరాను. గానశాస్త్రంలో గీతం, వర్ణం, కృతి, రాగం, మొదలైనవి ఏముటో పెద్దలవల్లా గ్రంధాలవల్లా నేర్చవలిసొచ్చింది. ఇల్లా కొంత తర్జనభర్జన పడి, పద్యం రాగం అనే మాటలకి సంబంధించిన యథార్థాలు ఎక్కడ తారసిల్లినా సరే పోగుచేసుగోడం, అవి మననం చేసుగుంటూ ఉండడం, పని అయింది

ఇంతలో, అనగా 1924లో బందరులో నటసారస్వత మహాజనసభ అయింది. అప్పుడు నాట్యకళావరణలో నాటకకర్తలుగుడా ఉండవచ్చు ననుకునేవారు. నటసభకి శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారున్నూ సారస్వత సభకి శ్రీ కాశీ కృష్ణాచార్యులుగారున్నూ అధ్యక్షత వహిం చారు. అసలు ఆ రెండుమూడు రోజులూ జరిగిన ప్రతీ ప్రత్యేక నమావేశసందర్భంలోనూ వారిద్దరూకుడా అధ్యక్షించేవారు. కార్య క్రమంలో అచ్చుపడ్డ ఉపన్యాసకుల్లో కొందరు రాలేదు. కొత్తవాణ్ణైన నాకు మొదటి రోజు ఉదయాన్నే 'ఛాన్సు ' ఇచ్చారు. నా విషయం 'నాటక పద్యగానం.' అక్కణ్ణించి, ఆ సాయంత్రమూ, మర్నాడు పొద్దున్నా సాయంత్రమూ నేను ప్రసంగించడమే. నాకు అప్పుడప్పుడు ప్రతికూలంగా నబబులు రావడం, నేను వాటిని పూర్వపక్షం చెయ్య డానికి ఉపన్యసించడమే తప్ప, మరెవరూ ఉపన్యసించలేదు. మరో విషయం ఏదీ చర్చింపబడలేదు. నా గోల ఏమని అంటే: అన్యత్వం స్థాపించడానికి ఏర్పడ్డ నాటకరంగంమీద, స్వత్వాన్ని మిక్కిలి ఖయ పరిచే రాగం వట్టిగెళ్ళి ప్రత్యేకగమన వ్యక్తిత్వంగల పద్యానికి సంధానం చెయ్యయత్నించడం నాటకపరమావధికి భంగకరం అయి ఊరుకోవడమేకాక, విరుద్ధమార్గంలో వర్తిస్తుంది - అని. అదివరకెప్పుడూ నేను జనంఎదట నిలబడలేదు, ప్రసంగించ లేదు. కాని, అవసరాన్ని పురస్కరించుగుని అల్పుడుకుడా ఏదో అల్లరిచెయ్యగలిగే అదను కలుగుతూంటుంది, అందుకని, శాస్త్రం చెప్పిన తరవాయిగా, కొంత ఆట కొంతపాట కొంత మాట లాంటివి ఏకంచేసి ధప్పళంపద్ధతిలో ఏదో నేను దంచెయ్యడం జరిగింది. అక్కడికి వెళ్ళడానికి పూర్వమే, నాలో దీన్నిగురించి బయల్దేరిన ఆందోళన నా దగ్గిర లిఖతం అయేఉండి ఉంది. నాటకం, కవనం, పద్యం, గానం, రాగం, కీర్తన, అభినయం మొదలైన పదాలు ఇదమిత్థం అనుకుని ప్రసంగించడమూ, నాకు చేతనయినంతమట్టుకు దృష్టాంతాలు ఇస్తూండ డమూ. తయారుచేసుగునివెళ్ళిన దస్తరం అప్పుడప్పుడు విప్పి, అదంతా చదవడం మొదలెడతానేమో అనే భయం సభ్యులముఖాల్లో కనపడ గానే దస్తరం కట్టేసి ఏ రాగమో అందుకుంటూండడమూ - ఇల్లాగ్గా రెండు రోజులపాటు - బందరుపౌరుల అంతఃకరణధర్మమా అని - కాల క్షేపం అనండి, భజన అనండి, నేను జరిపాను. వాదనలో : పద్యం పఠించాలి అనే నే నొక్కణ్ణే ఒక పక్షం. తటస్థంగా వింటూన్న ఏ అయిదారుగురో తప్ప తక్కిన అందరూ 'పద్యం రాగించాలి, లేక పోతే ఏడిసినట్టుంటుంది " అనే రెండో పక్షం. నేను తేల్చే సారాంశం చెవికి ఎంత చేదైనా, అంతా నన్ను మన్నించారేకాని, నిరసించలేదు. రాగవిషయంలో నేను చెబుతూండేవి సత్యమే అని నిలబెట్టడానికి శ్రీహరి నాగభూషణముగారూ, పద్యవిషయంలో నేను అనేవి యథార్థం అని నిర్ణయించడానికి శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారూ, అభినయ విషయంలో నేను మాట్లాడేవి రూఢి అని పరిష్కరించడానికి శ్రీ వెదురుమూడి శేషగిరిరావుగారూ అవసరం వచ్చినప్పుడు అడ్డుపడి నా మాట దక్కిస్తూఉండేవారు. ఒక్కొ క్కప్పుడు నే చెప్పిందీ పాడిందీ విని, 'నువు చెప్పేదంతా బాగానే ఉంది. పద్యానికి కాస్త రాగం కూడా ఎదేనా తగిలించనియ్యవయ్యా' అనేవారు, శ్రీ వెంకటశాస్త్రి గారు. పద్య, రాగ, అభినయాల మూడింటికీ సమ్మేళన అన్యత్వం ఒప్పించడానికి వచ్చిన నటుడిపట్ల అసంభవం అని నేను ఉదాహరించి మాట్టాడుతూండేవాణ్ణి. శ్రీ కాశీ కృష్ణాచార్యులుగారు, ఎప్పుడేనా కలగజేసుగుంటూండి, నేను సుగమం చెయ్యలేకపోయిన భావాన్ని తమరు సుగమం చెయ్యడమేకాకుండా దాన్ని అలంకరించికుడా వెలు వరిస్తూండేవారు. ఒకసారి, ఆయన వెంకటశాస్త్రిగారితో, 'ఆగండా గండి, శాస్తుల్లుగారు ! అదికాదు కామేశ్వరరావుగారు చెప్పేది. ప్రౌఢ రాగకన్య వెళ్ళి పద్యపురుషుణ్ణి కౌగిలించుకోగానే, పద్యపురుషుడు గతి చెడడమేకాదు, మూర్ఛలోనే పడిపోతాడు, అంటున్నారు ' - అని సెలవిచ్చారు. అప్పటికి (అప్పణించి ఇప్పటిదాకా కుడా) పెన్స లుతో కాగితాలమీద రాసిఉన్న నా రచన, ఉన్న పాళంగా అప్పట్లో ఇచ్చేస్తే ఒక నూటయాభైరూపాయలు పారితోషికం ఇస్తానని 'శారద' పత్రికాధిపతులు శ్రీ కౌతా శ్రీ రామశాస్త్రిగారు అన్నారు. వారితో నేను, 'అయ్యా ! ఇది నా మొదటిరచన. ఉద్రేకంలో ఏదో అనేస్తూ, మరిచిపోతానేమో అని ఆపళంగానే కాగితంమీద పారే శాను. నాకు తెలుగు తెలియదు, ఎక్కడా నేర్చలేదు, మొదటిసారి అచ్చుపడడమూ, విషయం తగాదావిషయమూ అంటే నాకు భయంగా ఉంది. పైగా, నేనూ రాగ వేషం వేసినవాణ్ణే గనక, ఈ అభిప్రాయాలు మరి కొన్నేళ్ళుపోతే నాకే నచ్చుతాయో నచ్చవో, ఈ ఉడికీఉడకని పాకం జనానికి వడ్డించేవిషయంలో నేను మెత్తపడడంకంటె, నేనే సెట్టు గోడం నాకు శ్రేయస్కరం. మీరు నా రచనకి విలవకట్టినందుకు కృత జ్ఞుణ్ణి ' అన్నాను. అని రచన ఉంచేసుగున్నాను.

[బందరుసభల విశేషాలు నాకు సంబంధించినవి కొన్ని చెప్పు గుంటూ ఉండేవారు. ఓం ప్రధమంలోనే నేను భైరవిరాగం ప్రారం భించి, అయిదు నిమిషాలు పాడి ( అప్పట్లో పాడేవాణ్ణి, విన్న జనానికి సాధారణంగా సుస్తీ చేసేది కాదు !) నే చెప్పిన వృత్తాంతం బోధ పడిందా అని అడిగేసరికి, సభవారు రాగంవల్ల వృత్తాంతాలు బోధ పడవని అనడం - ఇంద్రగణాలులేని పద్యాల్ని తాళంవేస్తూ నేను చెప్పడం - పద్యగానానికీ కీర్తనగానానికీ భేదం చూపించడానికి నేను పాడడం - కొత్తపద్యం కొత్తవాడు పాడేటప్పుడు శ్రోతని ఎక్కువ ఆక ర్షించేది రాగసంగతులా వద్యపదార్ధాలా, అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎవరో 'పద్యపదాలే ' అనగా నేను 'అనుగుం జెల్లెలవై ముకుందు నకు, నాకర్ధాంగివై ...' అంటూ అర్జునుడుపాత్రకున్న పద్యాన్ని, తోడిమీద, 'అనుగుం జెల్లెలవై , ముకుందునకు నా కర్ధాంగివై ... ' అంటూ పాడినా, ఎవ్వరూ నవ్వకపోగా, ' నవ్వరేం ? ' అని శ్రీ వెంకటశాస్త్రులుగా రన్నప్పుడుకూడా జనం నవ్వకపోవడం - 'క్రుమ్మరి పల్లటిల్లితిని ప్రొద్దుననుండియు భోజనమ్ములేక ...' అనే పద్యాన్ని చాలా హెచ్చుస్థాయిలో అందుకుని, 'విశుద్ధ నీరమ్ములుగాని, ' అనే చోట నేను సొమ్మసిల్లినట్లు పడిపోగా నిజం అనుకుని ఎవరో పరిగెట్టి వెళ్ళి నీళ్ళు తీసుకురాగానే, నేను లేచి, నీళ్ళు అక్కర్లేదుగాని ఆపట్టులో అభినయం అట్లా ఉండాలని సూచించడం - గద్యపద్యాల తేడా గమనిం చడంలో, నేను గద్యచదివేటప్పుడు ఎదటివాడు తల కదపకుండా వినడం- నా తల ఊపకుండానే నేను పద్యం చదివేటప్పుడు ఎదటివాడు తల నియమప్రకారం ఊగిస్తూండడం జరగడంవల్ల, పద్యానికి నియమితమైన నడక ఉన్నట్టు ఋజువుకావడం ! - మొదలైనవి. ]

నేను వేదిక ఎక్కడానికి మొదటిసారి అదే అయినా, నా భాగ్య వశంచేత, ఉమ్రావులవంటివారైన శ్రీ భోగరాజు పట్టాభిసీతారామ య్యగారు, శ్రీ చెఱకువాడ నరసింహంగారు, శ్రీ ముట్నూరి కృష్ణా రావుగారు, శ్రీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావుగారు, శ్రీ పురాణం సూరిశాస్త్రిగారు, శ్రీ హరి ప్రసాదరావుగారు మొదలైనవాళ్ళు నా మాటలు మన్నించి వినడం నాకు లభించింది. అటువంటిసభ్యులూ అధ్యక్షులూ నన్ను ప్రోత్సహించడంవల్లే, సభాముఖాన్ని ప్రసంగించ డానికి నాకు ధైర్యం కలిగింది, ఇప్పటివరకూ ఉంది. శ్రీ ఉమ్రే ఆలీషాకవిగారు, తెలుగునాటక పద్యాలు రాగవరసని పాడకపోతే తెలుగుకవిత్వం దెబ్బతినడమేకాక, తెలుగు నాటకప్పాకలు తగులడి శూన్యం అయిపోతాయని తమ భయం వెల్లడిచేశారు. 'కృష్ణాపత్రిక ' లో, నేను బందరుపౌరుల్ని నా పులగపు ఉపన్యాసంతో గభరాయింప చేసి తల్లకిందులు చేశా ననిన్నీ, నేను చెప్పే విడివిడినబబులు సత్యే తరం కాకపోయినా, నేను తేల్చే సారాంశంమాత్రం వాంఛనీయం కాదనిన్నీ, దాంతో ఏకీభవించడం కష్టం అనిన్నీ, అన్నారు. కాని, ఆ సభలో ఉండి, నేను ప్రసంగించేది యావత్తూ తను విని, శ్రీ గాడి చెర్ల హరిసర్వోత్తమరావుగారు తమ 'మాతృ సేవ' పత్రిక 13-6-1924 తేదీగల సంచికలో 'నాటకములు-సంగీతము' అనే శీర్షికతో ఒక ఉప సంపాదకీయం రాశారు. అప్పట్లో నా వాదన ఆయన నాకంటె స్పష్ట తరంగా చెప్పడంవల్ల నై తేనేమి, నేను గ్రంధమే రచించి తెచ్చినట్టు ఆయన గమనించడంవల్ల నై తేనేమి, ఆయన అన్నదీ ఇస్తున్నాను:

మాతృ సేవ

(సంపుటము 2 - సంచిక 17, 13-6-1924)

నాటకములు - సంగీతము

“నాటకములలో సంగీత మవసరమా? అవసరమగునేని ఎంతవర కుండదగును? అను నంశము బందరులో నటమహాసభయందు విమ ర్శకు వచ్చినది. రాజమహేంద్రవరమునందలి హితకారిణీ విద్యాలయ మునకు జేరిన భమిడిపాటి కామేశ్వరరావుగారు సంగీతముపై దండ యాత్రకు నాయకత్వము వహించిరి. హృదయరంజకమగు వాదప్రతి వాదము జరిగినది.

కామేశ్వరరావుగారు తమ వాదమును స్పష్టముగాచెప్పిరి. గ్రంథ మునే రచించి తెచ్చిరి. సారాంశ మింతియే. నాటక మభినయప్రధా నము. పదార్థసముపేతంబగు గద్యపద్యాత్మకము. సంగీతము స్వర ప్రధానము. పదార్థసముపేతము కానక్కరలేదు. పదసంబంధముగల చోటంగూడ నర్ధవైశేష్యము నుల్లంఘించునదియ కావున నీ రెంటికిని నిశ్చయమగు సంబంధము లేదు సరిగదా, సత్యమునకు వైరుధ్యము కూడ గలదు.

సంగీతవిద్యను నిరసించుట యీ విమర్శకు నుద్దేశముకాదు, సంగీతము పరమానంద సందాయకము. ఆత్మాకర్షకము. కళలలో నయ్యది యుత్తమోత్తమము. సర్వజన సమాదరణీయము. సర్వజన సమాదృతము.

కాని నాటకకళ వేరు; సంగీతము వేరు. రెండును ప్రత్యేక వ్యక్తిత్వము కలవి. రెంటికిని నుద్దేశము వేరు. ఒండొంటితో వీనిని మిశ్రమమొనర్చుటచేత నిందులో నొక్కటియగు నాటకకళ నశించు చున్నది, సంగీతమే నిల్చుచున్నది. అయిన దీనికింగూడ సహజశీలము పోషితమగుటలేదు. సంకరజన్మ సాక్షాత్కరించుచున్నది. సత్యమగు సంగీతమునకు తలవంపులగుచున్నవి.

శృతి సంగీతమునకు బునాది. శృతి బెట్టుటతో సంగీత మారంభ మగుచున్నది. మితి బెట్టిన నిలుచు ప్రకృతి సంగీతమునకు లేదు. కాబట్టి నాటకశాలలో శృతి బెట్టుటయుంగూడ తగదు. పద్యమైనను గద్యమైనను శృతిబెట్టక చదివి యభినయవైదగ్ధ్యముచే నర్థవిస్ఫురణము పరిపూర్తిచేసి చూపరులయందు భావోద్రేక, భావోన్మత్తతలను విజృంభింపజేయుట నాటోకోద్దేశము.

కామేశ్వరరావుగా రింకను విపుల విమర్శ గావించిరి. సంగీతము నకు ప్రాముఖ్యము కలుగుటవలన సంఘమునకు సంప్రాప్తించిన కష్ట ములను - భారతప్రపంచము వీనినన్నిటిని ననుభవించుచునే యున్నది- విశదపరచిరి.

ఎదురువాదము బలవత్తముగా వచ్చినదనుటకు గాదు. సంగీ తము లేకున్న పద్యమే సృష్టింపరాదని కొంద రనిరి. ఉమ్రేఆలీషా కవిగారు నాటకము అభినయము, సంగీతము, కవిత్వము ఇత్యాదికళల సమీపకరణముగాని యేకకళ కాదనిరి. ఈ సమీకరణంబున జేరిన యొక్కొక్క కండను నొక్కొక్కరి యభిప్రాయానుసారము దీసి వైచుచు వచ్చినచో నాటకప్రదర్శన మాకాశంగగనంశూన్యం అగు ననియు నాటకశాలలు తగులబెట్టుకొని పోవచ్చుననియు నెదుటి వాదము నాభాసము గావింపజూచిరి.

సంగీతము మానవహృదయమందే కలదు. సంగీతము ననుభవింప లేని మానవు డాయింగ్లీషు కవివరుడు షేకుస్పియ రనినరీతిని నిజముగా గార్దభ చక్రవర్తియే. పద్యమునందు సంగీత మిమిడియున్న దనుటయు సత్యంబె. నాటకము కొన్నికళ లుపాంగములుగా గలదనుటయు నిర్వి వాదంబె. ఇన్ని యంగీకరించిననుగూడ కామేశ్వరరావుగారి వాద మును నర్థము చేసికొనక పోవుటమాత్రము సత్య మెదురుపడినప్పుడు కన్నులు మూసికొనుటయే యగును.

మానవహృదయములోని సంగీతమును పద్యములలోని సంగీత మును సుప్రసిద్ధమై త్యాగయ్యగారి కృతులలోను నితర గాయకుల జావళులలోను స్వరప్రస్తారప్రాధాన్యమై చెన్నలరారు నంగీతకళతో నైక్యపరచి నాటకమున నీ కళకు స్థానమున్నదనుట విపరీతపదార్థ ముచే వాదము సాధించుటదక్క వేరుకాదు.

పద్యరచన గణబద్ధము. ఈ నియమబద్ధుడై యుచితపదార్ధ వైదగ్ధ్యముచే రసప్రపంచమున తాను విహరించి చదువరులను విహ రింపజేయట కళానిపుణుడగు కవిధర్మము. అభినయపూర్వకమగు కావ్యప్రదర్శనమే నాటకప్రదర్శనము. నిజమునకు నాటకము దృశ్య కావ్యము. దృశ్య సంగీతము కాదు. దృశ్యకావ్యమునందు పాడుకొన వలసినచో కవి యనుజ్ఞ యిచ్చుచున్నాడు. అది ప్రాచీన సంప్రదా యము. కాళిదాసాది మహాకవులు పాడుకొనునది యని సూచించు టయే దీనికి తార్కాణము.

కాబట్టి యాంధ్రభూమి కామేశ్వరరావుగారి వాదమును జాగ్ర త్తగా నాలోచింపక తీరదు. నాటకరంగమునుండి సంగీతమును కొంత దూరముచేయక విధి లేదు. నిజమగు నాటకప్రదర్శనము ననుసరింపక యుండరాదు. వెంటనే యేతద్విషయమయి ప్రయత్నములు జరుగును గాక యని కోరుచున్నాము. నటసారస్వతసభవారు చేసిన తీర్మానాను సార మాంధ్రావనిలోని యుత్తమనటు లొక్కటిగజేరి భావప్రదర్శన మున కుచితమగు నాటకమును చేగొని, అట్టి నాటకము లేనియెడల వ్రాయించి - ప్రదర్శించి నాటకకళను సంగీతము కబళింపకుండ కాపాడి నాటకము పండితాదరణీయము గావించి లోకకళ్యాణమున కిద్దానిని సాధనము చేయుదురుగాక యని మరిమరి కోరుచున్నాము.”

విషయం పద్యరాగఅభినయకళల మూడింటికి సంబంధించినది అవడం చేతనో, ఆ మూడు కళలూ నాటకప్రదర్శనం చూసిన ప్రతీ వ్యక్తీ ఏ కొంతో తనకికూడా వచ్చునని అనుకోవడానికి వీలుండడం చేతనో, సభల హడావిడిలో ప్రతివ్యక్తినీ తృప్తిపరచడానికి నాకు సావ కాశమూ సామర్ధ్యమూ లేకపోవడం చేతనో, ఉదాహరణగా నేను తీసుగున్నవి నాటకపు పద్యాలవడంచేతనో, నా వాదన ఎంత సహేతు కంగా కనిపిస్తేంగనక మరీ దారుణంగా కనుపిస్తూన్న సారాంశం ఒప్పు గోడం ఎట్లా అని కొంతమందికి లోపల బాధ బయల్దేరడంచేతనో, నా వాదనని ఏదో మోస్తరుగా నా సమక్షంలో మార్దవంగానూ, నా పరోక్షంలో కొంచెం ఊతంగానూ - కొట్టిపారేసేవిమర్శకులు ఉంటో చ్చారు. అప్పుడు పుట్టిన కొన్ని చిట్టిపొట్టి విమర్శనలూ, నా సమా ధానాలూ ఈ క్రింది విధంగా ఉండేవి :

1. నాకు సంగీతం రాకపోవడంవల్ల ఈ పేచీ బయల్దేర తీశా నని.

సమాధానం :- నాకు చాలా రావు. బహుశ అందులో సంగీతం ఒకటి. నాకు రానివన్నీ ప్రపంచంలో ఉండకూడ నివి అని నేను అనలేదు. కాని, ఒక చిత్రం ఏమిటంటే, నన్ను సంగీత విషయంలో అల్లా ఆక్షేపించినవాళ్లు నే పాడినపాటి రాగమూకూడా పాడలేనివాళ్ళు !

2. నేను నాటకసంగీతం మీద దండెత్తా నని.

సమాధానం:- అదేముటో తెలియక దండెత్తాను. అది సంగీ తమే అని గాయకులంటే, శిరసావహిస్తాను.

కి. నేను గద్యనాటకాలే ఉండాలని అంటా నని.

సమాధానం :- నేను అనను. ఆ మాట గురువులైన శ్రీ శ్రీపాద కామేశ్వరరావుగారిది.

4. మంచిగొంతిగవాళ్ళని చూస్తే నాకు ఈర్ష్య, అని.

నమాధానం :- మంచిగాత్రం వాళ్ళకి మొక్కి వాళ్లపాట వింటాను. ఆ గాత్రంతో వాళ్లు ఏంజేసినా నాకు ఆనందమే. పద్య-రాగ సంబధంమాట నే నడుగుతూంటే, వాళ్ళ గొంతిగమీద నాకు ఈర్ష్య అనడం ఏమిటి, గానం తియ్యగాఉంటుందని జంతువులే ఒప్పుకోగలిగినప్పుడు !

5. కవిత్వం మజాగా ఆనందించడం నాకు తెలియలేదు అని.

సమాధానం:- మజాగా ఆనందించడంకంటె ముందు, కవి త్వాన్ని (పద్యాన్ని) ఆనందించాలనే నా ప్రార్ధన. పద్యాన్ని పారతంత్ర్యం లేకుండా ప్రకటించండి అనే నా మొర.

6. గానానికి ఆకర్షణ ఉన్నసంగతి నాకు తెలియదు–అని.

సమాధానం:- తెలుసును. ప్రాణికోటికంతకీ తెలుసు, నాకు తెలియదా? కాని, ఆ గానం ఎవరిదో గమనించిగాని ఆకర్షణ వికర్షణలు చెప్పలేం. పైగా, వృత్తాంతంగల మాటలతో ఉన్న పద్యం ప్రకటించే క్షణాల్లోతప్ప ఇతర సమయాల్లో గానాకర్షణలక్షణం బయటపడదా?

7. ఎవడిమట్టుకివాడు ఒఖ్ఖడూ కూచుని, తనుగా, తెలుగు పద్యాల్ని పట్టుగుని పాడుకోకూడ దని నేను అన్నా నని.

సమాధానం :- నేను అనలేదు. ఎందు కంటానూ? మతి లేదా ! ఒఖ్ఖడూ కూచున్నప్పుడు ఒకడిమీద మనం శాసించి ఏం లాభం ! వాడిష్టం. నే చెప్పేది : ఎపడేనా ఒక పద్యాన్ని మరోడికి వడ్డించవలిసొచ్చే టప్పటిమాటే ! అందులోనూ, పద్యవృత్తాంతం పూర్తిగా ప్రకటిస్తేగాని అన్యుడై ఒప్పలేని వ్యక్తి !

8. ఇంగ్లీషుపులిని చూసి, తెలుగునక్క వాతలెట్టుగోవడం తగ దన్న మాట నేను మరిచిపోతున్నా నని. సమాధానం: - తెలుగునక్క ఏ పులిని చూసీకూడా పెట్టుగో కూడదు, వాతలు! నేను వాత పెట్టుగోమనడం లేదు. పడ్డ వాత మానుపుగోమంటున్నాను. పద్యం పాడడపు సంప్రదాయం నడిమంత్రపుసిరి. ఒక సంప్రదాయంలో లాభం వీసమూ, బాధకాలు ముప్పాతికమువ్వీసమూ అని తేలుతూన్నప్పుడు ఆ సంప్రదాయాన్ని పక్కకి నెట్టడం వాతలు పెట్టుగోవడమా ?

9. పద్యంవెళ్ళి మంచి (అను-) రాగంతో నిక్షేపంలాగ కాపరం చేస్తూంటే చూడలేక, ఆకలయిక చెడగొట్టి, దంపతులకి విడాకులు ఇప్పించి, పద్యాన్ని బోడించి క్షౌరం చెయించి కూచోబెట్టిస్తున్నా నని.

సమాధానం :- పద్యరాగసంబంధం అసలు 'కాపరం' అయి ఉంటేగదా, నేను విడాకులు ఇప్పిస్తున్నా ననడం ! సుప్ర సిద్ధుడైన కీర్తనకర్తమాటలకీ అతడే నిర్ణయించి సూచించే రాగానికీ దాంపత్యం అంటారా, అది నేను ఒప్పుగుంటాను. కాని, ఏ పద్యంఅయినా సరే, ఏ రాగంతోనైనా సరే, ఎల్లాంటి అవస్థలోనైనా సరే, కలిసి లేచిపోవడానికి నబ బులు చెప్పే నోటితోనేనా, పద్యరాగాలకి దాంపత్యం అనడం! ఇక, పద్యాన్ని నేను బోడించ మనలేదే! రాగపు సవరం పెడితేగాని పునిస్త్రీలాగ కనిపించని పద్యం అసలు బోడిదే అన్నమాట! మరి దాన్ని బోడించడానికి ఎవ్వరూ శ్రమపడనక్కర్లేదు.

10. పద్యక్షీరంలో రాగశర్కర వేసుగో కూడదని నే నన్నానని. సమాధానం:–పద్యాన్ని పాలతో పోల్చారు, ఒప్పుగున్నాం. రాగాన్ని పంచదారతో పోల్చారు, పోనీ అదీ సరే అని, ఒప్పుగున్నాం. పోలికకోసం తెచ్చిన రెండు భిన్నసందర్భాల దినుసులికి సంబంధం ఉండడంవల్ల, పోల్చబడ్డవాటికి సంబంధం ఉందని స్థాపించడమే! అల్లాయితే, పద్యక్షీరంలో రాగలవణం వేసుగోకూడదని నే నన్నాను. 'రాగాన్ని లవణంతోనా పోలుస్తారు?' అని ఎదిరించారు. 'శర్కర'కి కంటె లవణానికి ఎక్కువ 'లావణ్య'మే ఉందని నే నన్నాను. పైగా, శర్కరకంటె జీవనానికి లవణమే ఎక్కువ అవసరం, అన్నాను. రెండు వేర్వేరు ఉపమానాల్ని చేరికచేసి, మళ్లీ హేతువాదంలో పడడం అక్రమం.