ఆంధ్రకామందకము/సప్తమాశ్వాసము

ఆంధ్రకామందకము

సప్తమాశ్వాసము

క.

శ్రీమదహోబల నృహరి
స్వామిపునస్‌స్థాపనప్రశస్తజయాంకా
రామపదభక్తి వరవి
ద్యామహ కొండ్రాజు వెంకటాద్రినరేంద్రా.

1


వ.

అవధరింపుము.

2

యాత్రాభియోక్తృప్రదర్శనప్రకరణము

క.

వ్యసనము విడిచి త్రిశక్తుల
బొసఁగి జయాకాంక్షియైన భూపతి దనకుం
బసగలతఱిఁ గదలఁగఁదగు
వ్యసనంబులు నొందినట్టి వైరులమీఁదన్.

3


చ.

వ్యసనము గల్గియుండురిపువర్గముమీఁదనె దండు పోవఁగాఁ
బొసఁగునటంచుఁ బల్కుదురు పూర్వికు లిట్టిమతంబెకాదు త
ద్వ్యసనము లేకయుండు రిపువర్గముమీఁదటనైనఁ బూని వె
క్కసమగురీతి దండు చనఁగాఁదగుఁ దాను సమర్థుఁడైనచోన్.

4


క.

ఇలఱేఁడు శత్రు గెలువం
గలవేళలనైన శత్రుగణముల రాజ్యం
బుల బలిమిఁ జెఱుపనోపం
గలవేళలనైన దండు గదలఁగవలయున్.

5

ఉ.

పైరులు పండి పుంజగలపట్టున పైరులసీమమీఁదటన్
భూరమణుండు దండు చనఁబొల్పగు నీగతి దండువెళ్ళుచున్
బైరులు చూరఁబట్టి పరిపంథుల జీవనముల్ హరించినన్
సారబలంబుచేఁ దనరి శత్రుల గెల్చును నిర్భయస్థితిన్.

6


చ.

వెనుకటివైరులం దనదు వెన్కనురాఁ గడు మట్టుపెట్టి పెం
పునఁ బరిచర్యలం దెలిసి ముందరఁగల్గుభయప్రదేశముల్
గనిమలు లెస్సగా నెఱిఁగి కంటకశుద్ధి యొనర్చి రానుబో
ననువగుమార్గమందుఁ బతి యాత్ర సనందగు నప్రమత్తుఁడై.

7


చ.

సమమగుచోట్ల గుంటలును జాలఁగ మిట్టలునైనచోట్ల నె
య్యముగలసేన మున్నుగఁ బ్రయాణము వోవుట యొప్పు వైభవ
క్రమములయందుఁ దానెఱుఁక గల్గుచు నార్తుఁడుగాక యన్నపా
నముల సమృద్ధిఁ జెంది జతనంబుగ దండు చనంగఁ జెన్నగున్.

8


చ.

జలము వనంబునుం గలుగు చాయనె వేసవి వైరిమీఁదఁ వో
వలయు మదేభముల్ జలమువల్ల ఘటిల్లెడు సౌఖ్య మొందఁగా
జలములు లేకయుండినను సామజపంక్తులకెల్ల వేసవిం
గలుగుచునుండుఁ గుష్ఠములు గాటపుటెండలఁ బుట్టువెట్టచేన్.

9


క.

ఒక్కయెడ నిలుచునప్పుడు
గక్కసమగు వెట్టనొంచుఁ గరిబృందములన్
మిక్కిలిఁ బ్రయాణముల నిడి
వెక్కసమై నొంపకున్నె వేసవివేళన్.

10


క.

నీరములు లేని వేసవి
సారెకు దురవస్థఁ జెందు జంతువు లెల్లన్
వారణపంఙ్త్కుల కైనం
దీరనితాపముల నపుడె దేహము లెందున్.

11

ఉ.

ఘమ్మను మంచివాసనలు గ్రమ్ముమదమ్ములు గల్గి కొమ్ములం
జిమ్ముట నుగ్గుసూచములు చేసినగట్టులు గల్గి మీఱి కా
ర్గ్రమ్ముచుఁ గప్పు మబ్బుగమికప్పులయొప్పులు గల్గుదంతి సం
ఘమ్ములయందెకా ధరణికాంతులరాజ్యభరంబు నిల్చుటల్.

12


మ.

అవి చూడన్ నడగొండలో యనఁగ నీలాభ్రంబులో నాఁగ గ
ట్లవియం గొమ్ములఁ జిమ్మనోర్చి మదదారాసారతం బేర్చి శా
త్రవులం గోరుపులాడనేర్చి తగు నుద్యద్భద్రనాగేంద్రముల్
భువి రాజ్యాస్పదహేతువైనవి గదా భూపాలకశ్రేణికిన్.

13


ఉ.

శూరతపోటునేర్పు సముజోకయుఁ గల్గిన మావటీఁడు పెం
పారఁగ నెక్కి యుక్కెసఁగి యాయితపాటున మీఱు వారణం
బేరణమందునైన జవమెచ్చినవాజుల నాఱువేలఁ దా
ధీరతమించఁ ద్రుంచు వినుతించు నుదంచితసాహసంబునన్.

14


క.

జలముల నడవుల నప్పుల
బలుదిన్నెల సమములైన పట్టుల వడిఁ గో
టలును గడపు వడియేనుం
గులు గలిగిన దొరకు దొరకుఁ గోరిన జయముల్.

15


క.

ఏతెరువు నీళ్ళు గలయది
యేతెరువు పరభయంబు లెసఁగక తగుఁ దా
నాతెరువునఁ జనవలయున్
భూతలపతి బలము శ్రమముఁ బొందకయుండన్.

16

దండయాత్రా విధానము

సీ.

అధిపతి దండెత్తునట్టిచో క్షుద్రశ
            త్రుండును వెనుక శత్రువుల రేఁచు
నదియ రంధ్రము గాన నహితులౌవారెల్లఁ
            గడు ఘనంబుగఁ జేయఁ గడఁగుచుండుఁ

బతికి ముందఱ వచ్చుపలమున కంటెను
            వెనుక శత్రులపోరె ఘనము దెలియ
నదిగాక కాననియర్ధంబుకొఱకునై
            చేకొన్నయర్దంబు చెఱుపరాదు


గీ.

కానఁ దనబల్మి వైరుల ఘనతఁదెలిసి
వెనుక శత్రుల పగమాన్చి విమతుమీఁద
దండు గదలంగవలయు నుద్దండలీల
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

17


సీ.

తనకుఁ బిఱుంద శాత్రవుఁ డున్నచోఁ దన
            కతఁడును లోగక యరిగెనేని
వెనుకటి శత్రువు వేగభేదము చెంది
            యలమట నొందించు నటులఁ గానఁ
దనకుఁ బిఱుంద ముందఱఁగల్గు శత్రుల
            నడఁపగా నోపినయట్టి శక్తి
కలుగువేళలను విక్రమయుక్తిచే మించి
            ఘనములౌ ఫలములు గలుగనెంచి


గీ.

తనకు నెలవైనపట్టణంబునకు రక్ష
ణమ్ము గావింపఁదగినబలమ్ము నుంచి
దండు గదలంగవలయు నుద్దండలీల
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

18


సీ.

అరయంగ నిఱువదియగు సంఖ్యఁ దగుభటుల్
            గలుగు చేరువయ వర్గం బటండ్రు
ధారుణీస్థలి నిట్టిసేరువ కొక్కొక్క
            ఘనుఁడైన సేరువకానిఁ గూర్చి

పెక్కు చేరువలును బెక్కు చేరువకాండ్లు
            గలిగిన తన యాప్తబలము నేర్చి
తన పట్టణముఁ గావ నొనరింపఁగాఁ దగు
            నిటుల సేరువకాండ్ర నేర్పరింపఁ


గీ.

బరుల కెందు నభేద్యులై పరగుచుండ్రు
గాన నీరీతి నొనరించి ఘనత మించి
దండు గదలంగవలయు నుద్దండలీల
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

19


సీ.

తనకు సహాయమౌ దైవంబుచేత ను
             ద్యుక్తుఁడై దండెత్తుచుండు రాజు
ముందరికి నవశ్యమును జను కార్యంబు
             వెనుకశత్రుని రాక మొనయు శంక
యొక్కవేళనె కల్గియుండినఁ బదరక
             దళవాయినైనను దనయునైనఁ
దనబలంబులలోనఁ దగినట్టు నాలవ
             పాలైన మూఁడవపాలునైన


గీ

బలము నొనఁగూర్చి ముందరి పగఱమీఁద
మునుపుగా నంపి తా నిల్చి వెనుక పగఱ
నుడుగఁగాఁజేసి కదలుట యొప్పునండ్రు
దండయాత్రావిధిజ్ఞు లీధరణిలోన.

20

కోపద్వైవిధ్యము

వ.

మఱియు నాంతరకోపంబును బాహ్యకోపం బనఁగ రెండు తెఱం
గుల కోపంబులు గలవు. వానియందు నాంతరకోపంబ యధి
కంబగు నటులైనను నయ్యిరుతెఱంగులవారి కోపంబులు వారించి

మఱి యభీష్టంబుల నొనర్చి వారిం దనవెంటఁ దోడ్కొని చన
వలయు నయ్యిరుదెఱంగులవారి కోపంబు లెట్టివనిన.

21


సీ.

సుతమంత్రిహితపురోహితనిజవంశజ
            సేనాధిపతులు ప్రధానజనము
లండ్రు ధారుణి వీరలందు నొక్కనికోప
            మైన నాంతరకోప మనఁగఁ బరగు
గడిఁగాచువారలు నడవులకడ నుండు
            ప్రజలును మఱి యెంచ బాహ్యజనము
లరయంగ వీరలయందులో నొక్కని
            కోపమైనను బాహ్యకోప మగును


గీ.

తనకు నాప్తులు చతురులై తగినయట్టి
మంత్రిజనములచేతను మనుజవిభుఁడు
తెలియఁదగు నిట్టికోపముల్ తేటపడఁగ
మించి వారల శాంతిఁ బొందించుకొఱకు.

22


గీ.

ఎట్టిరీతినిఁ దప్తులై యెడసి పగఱఁ
గూడుకొనిపోవ రటులఁ దత్కోప మడఁప
నమరు సామాదులగు నుపాయములనైనఁ
గట్టుకొని వారి విరిపోటు పెట్టియైన.

23


క.

హయములును భటలు చచ్చుట
క్షయమగు దవసంబు బసిఁడి కడు వ్యయమైనన్
వ్యయమగు నిటులన్ క్షయమును
వ్యయమగు పయనంబు మానవలయుం బతికిన్.

24

క.

ఫలమున్ వశ్యము దనకుం
గలయది వేఁ జేతి కిచ్చుగతి వేగమె కా
గలయది వ్యయప్రయాసము
గలిగినయదియైన దండు గదలఁగవలయున్.

25


క.

ఏనుఁగులకు గుఱ్ఱములకు
మానుసులకు నొప్పి దాఁకి మఱి ఫలసిద్ధిం
గానక నొగిలెడు బనికిం
దా నెందును దండుపోవఁ దగ దధిపతికిన్.

26

కార్య వ్యసనంబులు

మ.

తనకున్ శక్యముగాని వస్తువులమీఁదన్ యత్నముల్‌ సేయుటల్
దనకున్ శక్యములైన వస్తువులమీఁదన్ యత్నముల్‌ మానుటల్
దనకున్ శక్యములైన వస్తువుల వేళన్ గోరుటల్ మూఁటి నెం
దును గార్యవ్యసనంబు లండ్రు నయవేదుల్ మేదినీమండలిన్.

27


సీ.

ఓర్పును గరుణయు నోర్పు లేకుండుట
            దాక్షిణ్యమును గ్రూరతయు భయమ్ము
డంబును సిగ్గు దుష్టత్వంబు దైన్యంబు
            నతిధార్మికత్వ మహంకృతియును
దనజాతిఁ బుట్టిన జనులఁ గాదనుటయుఁ
            జంపుటయు నుపేక్ష సలుపుటయును
బలువగు నెండకుఁ జలికిఁ దా నోర్వక
            యుండుట వానకు నోర్వలేమి


గీ.

యివియవేళలఁ జేసిన నెందుఁగార్య
సిద్ధులకు నెల్ల విఘ్నముల్ సేయుచుండు
ననుచు నీతిరహస్యజ్ఞు లండ్రు గాన
వీని ననుచితవేళల విడువవలయు.

28

సప్తవిధపక్షలక్షణము

వ.

మఱియు మైత్రులును, నిజులును, సంబంధులును, భృత్యులును,
నాశ్రితులును, గృహీతులును, గార్యజులు ననెడు నేడుదెఱంగుల
వార లే పక్షంబనం బరంగుచుండుదు రిట్టి పక్షం బనంగ సహాయు
లనం బరగుచునుండు నిట్టి సహాయు లెట్టివారనిన.

29


సీ.

తన తల్లిదండ్రుల యనుఁగుబంధులె మైత్రు
            లెనసిన ప్రాఁతవారెల్ల నిజులు,
సరవి వియ్యంకులె సంబంధు లగుచుండ్రు
            భృతికిఁ గొల్చెడువారె భృత్యు లరయ
నాత్మరక్షణమున నాశ్రయించినవార
            లాశ్రితు లుపచార మందియుండు
వారు గృహీతులు వసుధఁ గార్యార్ధులై
            యనువొందువారె కార్యజులు దలఁప


గీ.

నిటుల నేడుదెఱఁగులౌ నిట్టివారి
పక్షము లటండ్రు ప్రాజ్ఞులై పరగువార
లిందు రాగాపరాగంబు లెఱుఁగవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

30


వ.

ఇట్టి సహాయు లనురాగిసహాయులు సద్వృత్తసహాయులు నన
రెండుతెఱంగులై యుండుదు రందు ననురాగంబుగల సహాయు
లెట్టివారనిన.

31

అనురాగిసహాయలక్షణము

క.

అనిశముఁ జేరి కొల్చి సుగుణావళిఁ గీర్తన చేసి నిందలన్
వినక తదర్థమై తనరు విశ్రుతయత్నము పల్కు శౌర్యముం
గని కనుపట్టు దోషములఁ గప్పుచు నుండుట యెందు నెంచఁగా
ననువగు నెయ్యముల్ గలుగునట్టి సహాయునిచిహ్న మిమ్మహిన్.

32

వ.

సద్వృత్త సహాయుం డెట్టివాడనిన.

33

సద్వృత్తసహాయలక్షణము

చ.

కులమున మించి మోహమునఁ గూడక దైన్యము లేక విద్యలన్
బలమును సత్యముం గలిగి పాటిలు లోభము డించి బుద్ధిచే
నలరుచు మేలెఱింగి వినయంబు వహించినయట్టిమిత్రుఁడే
వలన నుతించ మంచి తగువర్తన మొందిన పక్షమై తగున్.

34

ఆత్మగుణముల నుద్యోగాదుల శ్రేష్ఠత

గీ.

త్యాగ ముద్యోగమును ధీరతయును బుద్ధి
నిజము మర్యాద సిగ్గు నింద్రియజయంబుఁ
బ్రౌఢియును గారవం బనురాగ మోర్పు
బలము నన ముఖ్యగుణములు పార్థివునకు.

35

శక్తిత్రయస్వరూపము

సీ.

సారమౌ నీతిప్రచారం బెఱుంగుట
           జగతిలోపల మంత్రశక్తియందు
రాత్మసంపదతోడ నలరినబలము కో
           శంబు నెంచఁగఁ బ్రభుశక్తి యండ్రు
ఘనమైనయట్టి విక్రమమును బుద్ధియు
           సత్త్వంబు నుత్సాహశక్తి యండ్రు
నీతిమంతులుగాన నృపవరుం డెల్లచో
           నిట్టి త్రిశక్తుల నెనయవలయు


గీ.

నిటులు శక్తిత్రయంబుచే నెనసి యెపుడు
నేర్పుతోడుత వర్తింప నేరకున్న
మించు శత్రుల నెటుల జయించనేర్చుఁ
జెలఁగి సంపద నేరీతిఁ జెందనేర్చు.

36

సీ.

వ్యసన మందిన దైన్య మందకుండుటయును
            ఘనమైన శౌర్యంబుఁ గలుగుటయును
దక్షితయును శీఘ్రతయు మహోత్సాహసం
            పద యండ్రు జగతిలోఁ బ్రాజ్ఞులెల్లఁ
బుట్టగాఁ బుట్టిన బుద్ధియు శాస్త్రంబు
            దెలియుట కతమునఁ గలుగుబుద్ది
పెద్దలసంగతిఁ బెనుపొందుబుద్ధియుఁ
            గడు విచారింపఁగాఁ గలుగుబుద్ధి


ఆ.

జ్ఞానరూపమంత్రిసంపద యనఁదగు
నిట్టిరీతులెల్ల నెఱుఁడనేర్చి
తనదు రిపులమీఁద దండు పోవఁగఁదగు
నీతి నెఱిఁగినట్టినృపవరుండు.

37


మ.

అల యుత్సాహము శౌర్య మందుటయుఁ గార్యం బూనుటల్ సేయుటల్
బలువౌ నిల్కడ పౌరుషంబు ముదముం బ్రాపించు టారోగ్యముం
దలపెల్లన్ ఫలసిద్ధిచేఁ దగుటయున్ దైవానుకూల్యం బగున్
దెలివిన్ భూపతి యిట్టివేళల ధరిత్రిం దండుపోవం దగున్.

38


క.

జనపతి తన భండారం
బనుపమగతి వెంటరా సహాయాదులచే
ననువొంది గెలుచుటకునై
చనఁదగు బక్షాదిహీనశత్రువుమీఁదన్.

39

క.

ఈరీతి నీతియుతుఁడై
భూరమణవరుండు దండు పోయినయేనిన్
సారోదారతఁ బారా
వారావృతమైన ధరణివలయం బేలున్.

40

దండయాత్రాకాలదేశాదులు

చ.

జలములు మబ్బుగల్గుతఱి సామజపంఙ్క్తికి దండు పోఁదగున్
జలములు మబ్బులేనితఱి సైంధవరాజికి దండు పోఁదగున్
వెలువని జళ్ళు మంచుఁ గడువెట్టయు లేక చెలంగ నామనిం
గలయగ సర్వసైన్యములు గైకొని భూపతి దండు పోఁదగున్.

41


గీ.

గూబ రాతిరిఁ గాకులఁ గొట్టి నొంచు
కాకి పగలైన గూబల గడిమిఁ జించుఁ
గాన వేళ విచారించి కదలవలయుఁ
గాల మెఱుఁగుచుఁ గదలినఁ గలుగు జయము.

42


ఆ. వె.

కుక్కచేత మొసలి చిక్కును దరియందుఁ
గుక్క మొసలిచేతఁ జిక్కు నీట
నటులఁగానఁ దనకు ననువైన చో టొంది
చెలఁగు రాజు కార్యసిద్ధిఁ జెందు.

43


సీ.

సమములై కనుపట్టు చదురపునేలల
           నశ్వముల్ మున్నుగా నరుగవలయు
మిట్టలు గుట్టలు గట్టులు నై నచో
           నేనుఁగుల్ మున్నుగా నేఁగవలయుఁ
బొదలును మ్రాఁకులుఁ బొదలెడిచోటులఁ
           గాలాళి మున్నుగాఁ గదలవలయు
జలములు లోఁతుగాఁ గలిగినచోటులఁ
           దగిన యోడలమీఁద దాఁటవలయుఁ

గీ.

జదురములు మిట్ట గుంటలు జలముఁ బొదలు
గలుగు నటువంటి నేలల బలము డిందు
నందుచే ముందు చనఁదగు నందుచేతఁ
బోవఁదగు దండయాత్ర మహీవిభుండు.

44


చ.

జనపతి వానకాలమునఁ జాలఁగ మిట్టలమించు త్రోవలన్
బనుపడ వేసవిన్ సలిలమార్గమునం జన నొప్పు నెందుఁ ద
క్కినయెడ మిశ్రభూములను గేవల దుర్ఘటమైన మార్గముల్
గనుగొని యాత్మసేనకు సుఖంబగు రీతుల దండు పోఁదగున్.

45


క.

జలములు కడుఁ గలత్రోవన్
జలములు లేనట్టి త్రోవఁ జనక సుఖగతిన్
నెలవరులఁ గూడి చనఁదగు
గలయం గట్టియలుఁ గసవు గలిగినత్రోవన్.

46


మ.

తన చుట్టంబుల మూఁక రాకడలచే ధాన్యాదికప్రాప్తిచే
ననువై నీళ్ళఁజెలంగి నమ్మికల లోనై యుండు తన్మార్గభూ
జనముల్ గల్గినత్రోవఁ బోవఁదగు నెంచం దీనుఁడై భంగముం
గని వీఁకల్‌ చెడి వచ్చుత్రోవఁ జనఁగాఁ గాదెందు భూభర్తకున్.

47


చ.

తెలియక దూరమైన రిపుదేశము వేగిరపాటు మీఱఁగాఁ
జలమునఁ జొచ్చిపోవు దొర సంగరరంగమునందు వైరిభూ
తలపతి ఖడ్గధారల విదారితుఁడై బహురక్తధారలం
గలగొని పొక్కి యుక్కు సెడి గ్రక్కున నూరకె చిక్కి స్రుక్కఁడే.

48


వ.

ఇ ట్లపాయంబులఁ జెందని యుపాయంబులం బయనంబులు
గదలివచ్చి సైన్యంబులు విడియింపందగు నచట మఱియును.

49


చ.

అరులకుఁ జాలరానియటు లాత్మబలంబుల నిల్పి రక్షణం
బరయుచు నీతిరీతిఁ దగి యాప్తులు శూరులునైన యోధులె

చ్చరికెలఁ జుట్టియుండగ నిశాసమయంబుల యోగనిద్రలం
బొరయుచు నుండగాఁ దగును భూపతి యెందును జాగరూకుఁడై.

50


చ.

కలయఁగఁ జాలి రొప్పు కరిఘంటల గల్గు ఘణంఘణధ్వనుల్
మెలఁకువఁ జెంది గుఱ్ఱముల మించిన హేషితభాంకృతిధ్వనుల్
నిలుకడఁగాంచు యోధతతి నిశ్చలవాక్యడిమండిమధ్వనుల్
నెలకొని వీనులంటఁ బతి నిద్దురసందున మెల్కువై తగున్.

51


క.

నిదురతఱి నప్పటప్పటి
కది యెవ్వఁడు మేలుకన్న యతఁడని పతి దా
సదయుఁడయి యాదరింపుచుఁ
బదిలంబని యెచ్చరించి పలుకఁగవలయున్.

52


వ.

అంత.

53

దండయాత్రాసమయముల రాజవైఖరి

చ.

తెలతెల వేగ లేచి నరదేవశిఖామణి నామతీర్థమై
కల కులదైవముం గొలిచి ఘమ్మను కస్తురితావి ఠీవితోఁ
దళుకుదళుక్కున న్మినుకు దార్కొను రత్నవిభూషణాళితోఁ
గొలువుకు వచ్చుటొప్పు నిరుగోపులగట్టినవా రహో యనన్.

54


సీ.

శ్రీమంతులై మించు సామంతు లొకవంక
           నుచితమంత్రులు మంత్రు లొక్కవంక
హితచర్యులగు పురోహితవర్యు లొకవంక
           నుదిత సత్యు లమాత్యు లొక్కవంక
ఫలదాయులై నట్టి దళవాయు లొకవంక
           నుక్కు నిక్కిన శూరు లొక్కవంక
నధికారుల జయించు నధికారు లొకవంక
           నుచితమిత్రుల మిత్రు లొక్కవంక

గీ.

నొక్కవంకఁ గళావతు లొక్కవంకఁ
జామరగ్రాహిణులు గూఢచరులు గొలువఁ
దన ప్రతాపంబుఁ బారక జనము వొగడ
నిండువేడుకఁ గొలువున నుండవలయు.

55


క.

ఆయెడ జగతీనాథుం
డాయతమతి మెఱయ మంత్రులగువారలతోఁ
జేయఁదగు నట్టిపనులు ను
పాయంబులు నిశ్చయించి పతి గదలఁ దగున్.

56


చ.

అలపును వేగముం గల హయంబుల నెక్కి తనంత లేచి వా
రలు బలుకైదువుల్ నిజకరంబులఁ దాలిచి వెంటఁగొల్వఁ బ
జ్జల నవధాన మెచ్చరికె సామి యహోయని పూని సాహిణుల్
గొలువఁగఁ దేజి నెక్కి నృపకుంజరుఁ డంతట యాత్ర పోఁదగున్.

57


మ.

తనయంతేసినృపాలశేఖరులు మైత్రస్నేహసన్నాహముల్
దనరం దేరుల నెక్కి యుక్కుపొడి రాలన్ గొల్వఁగా సాహిణుల్
వెనువెంటన్ జతనం బహోయనుచు సేవింపన్ గడు న్మించి చ
క్కని సామ్రాణిపరాణి నెక్కి కదలంగా నొప్పు రా జెయ్యడన్.

58


శా.

రాజేంద్రుండు గజాశ్వసంఘములచర్య ల్గన్గొనంగా జనున్
గైజీతంబును గూట మేర్పఱచి వేడ్కం గానఁగాఁ జెల్వగున్
దేజం బాయితపాటునుం గడుఁ బ్రసిద్ధిం జెందియున్నట్టి బ
త్తేజీలం గజపఙ్క్తిఁ జూడఁదగు హానిన్ రేపులున్‌ మాపులున్.

59

సర్వావర్జనోపాయము

మ.

సులభంబౌ పొడగాన్పు గల్గి దయచేఁ జూపట్టి మందస్మితం
బులఁ జెన్నొందిన పల్కుచేఁ దగఁ బ్రియంబు ల్మాటికిం బల్కఁగా

వలయుం జీతముకంటె నెక్కుడుగ నిర్వక్రంబుగా నియ్యఁగా
వలయుం బ్రాణము లిత్తు రీ విహితమౌ వాక్యంబుచేతన్ భటుల్.

60


చ.

కరుల రథంబులందుఁ దురగంబులయం దలయోడలందుఁ దా
నరుగఁగ నేర్చి వింట నెరయం జతురత్వముఁ జెంది కార్యముల్
నిరతము నభ్యసింపఁదగు నేర్పున నీగతి నభ్యసింప దు
ష్కరమగు కార్యమైనను సుఖంబునఁ జెందు నరేంద్రుఁ డున్నతిన్.

61


మ.

కడు సన్నాహము గల్గు సేన లిరువంకం గొల్వ సన్నాహముం
బొడవుం గల్గు గజంబు నెక్కి రిపులౌ భూపాలకు ల్వంప వెం
బడి నేతెంచిన దూతతో భటతతుల్ పై మాటుగానుండ నె
క్కుడు నేర్పొందెడు మంచివాక్యముల టెక్కు ల్మీఱఁ బోవందగున్

62


గీ.

బుద్ధిచే గుణములచేతఁ బొదలు గూఢ
చారిజనములచే దూతజనముచేత
వైరిచర్యలు దెలిసి పోవలయు వారు
లేనిపతి యెందును గన్నులు లేనివాఁడు.

63


చ.

ఘనత దలిర్ప శత్రు గడిఁగాచుదొరం దన మిత్రుఁ జేసికోఁ
జనునపు డించుకించుక యొసంగుచు నాశలు చాలఁజూపియై
నను మఱి బేరమాడునెడ న్యాయము దప్పక వైరిభూములం
బనుపడి వచ్చునెట్ల పరిపాలన మొప్పఁగ మెల్పఁగాఁదగున్.

64


చ.

అనువగుదూతఁ బంపి తనయందినకార్యము సంధిచేతఁ జ
య్యన నొనరింపఁగావలయు న ట్లొనరించిన సంధిగానిచో
దనరుచుఁ గార్యభేదమగు దాన నభేదము చెంది వారిలోఁ
గినుకలు బుట్టుచుండు నది కేవలముం బతికిన్ శుభంబగున్.

65


చ.

అడవులయందు దుర్గములయందు వసించినవారిఁ ద్రోవలుం
గడులును గాచువారల ఘనంబగుసామముచేత నీగిచే

గడుఁదనియించి మించి తన కైవసమై తగఁ జేసికోఁదగున్
విడువక శత్రుభూములకు వీరలె త్రోవలు చూపఁజాలుటన్.

66


ఉ.

కారణ మొందియైన మఱి కారణమేమియు లేకయైననున్
వైరులయొద్దివారు తనవద్దకు వచ్చిన నాత్మసేవకుల్
వైరులఁ గొల్చియుండి తనవద్దకుఁ గ్రమ్మర వచ్చియున్న ధా
త్రీరమణుండు వారలచరిత్రలు లెస్స నెఱుంగఁగాఁ దగున్.

67


గీ.

పరులపై నెత్తుపతి మంత్రబలము చాలఁ
జెంది మున్నె విచారంబు సేయవలయు
బాహుబలమునకన్నను బలిమి మంత్ర
బలము దాననె యింద్రుండు గెలిచె రిపుల.

68


క.

మేలగుమతిచే సిరికై
కాలంబునఁ జెందవలయుఁ గార్యం బెపుడున్
గాలం బెడచినకార్యము
వాలాయము వచ్చుఫల మవశ్యము చెఱచున్.

69


చ.

అలరుప్రభావముం గలిగి యంచితకార్యములందు దక్షులై
మెలఁగుచు మంత్రమార్గమున మెల్కువ చాలఁగఁ జెంది యున్నతిం
జెలఁగెడు ధారుణీధవులచేష్టల సద్భుజదండమండలిన్
నిలుకడఁ జెంది యెల్లపుడు నిల్చును దైవకవల్ ధరిత్రియున్.

70


గీ.

ఆమని చెలఁగుఁ గార్తికమందునైన
జ్యేష్ఠయును మూలకార్తెయుఁ జెందువేళ
నైన మఱి చైత్రమాసంబునందునైన
దండు వెడలుట తగునండ్రు ధరణిపతికి.

71

క.

ఈరీతిఁ బగఱమీఁదట
నారూఢిన్ దండువెడలి యల నీతివిధిన్
భూరమణుఁడు వర్తించిన
వైరిసమూహముల గెలిచి వర్తిలునెందున్.

72

స్కంధావారనివేశనప్రకరణము

క.

బలిమిం దనయరిపురిచెం
తలకుం జని విడియఁదగినతావున విడియన్
వలయును బాళెము దిగునే
ర్పులుగలిగిన రాజు శత్రుభూపతులధరన్.

73


సీ.

నాల్గువాకిళ్ళచే నలువొంది చౌకమై
            ఘనమును కొంచెంబుఁగాక తనరి
యగడితలనుకోట నట్టళ్ళఁ జెలువొంది
            విరువులౌ వీథుల వినుతికెక్కి
యర్ధచంద్రునిరీతి నైనను మఱియును
            జతురస్రమైయుండు సరణినైన
నిడివిగానైనను గడు వట్రువుగనైన
            నాలోనఁ గల భూమియును నెఱింగి


గీ.

విమతుపురిచెంతఁ బాలెంబు విడియుచోట
మించు [1]నొకయగారంబు నిర్మించవలయు
సాధువులు మెచ్చ నచట నెచ్చరికె లెచ్చ
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

74


సీ.

కోటలో బలము దాకొన విడియింపుచోఁ
            గోటకు జలమున్న చోటునకును
గలుగుసందున వీథి కొలగోలమాత్రంబు
            విడిచి యచ్చట బైలుపడక నిండి

కొనియుండి చాలమించినపార్శ్వములు గల్గి
            రక్షితం బగుచును గక్షపుటము
ననువున మూలలై యట సూర్యసోమవీ
            థులు విరువులుగాఁగ నలరఁజేసి


గీ.

వాస్తుశాస్త్రక్రమంబుల వైపు దెలిసి
విమతుపురిచెంతఁ బాళెంబు విడియుచోట
నిట్లు బలముల విడియించ నెఱుఁగవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

75


క.

పాళెమునడుచక్కి మహా
మూలబలము చుట్టుఁగలిగి ముందఱ నడుమన్
మేలిమియగుభండారము
చాలఁగలుగు నగ రొనర్పఁ జను నెచ్చోటన్.

76


క.

ఇలఱేఁడు నగరిచుట్టును
బలియించఁగవలయుఁ బ్రాఁతప్రజఁ గైజీత
మ్ములఁగూటము మిత్రబల
మ్ముల శత్రుబలంబు నడవిమూఁకను వరుసన్.

77


వ.

తత్క్రమంబు.

78


సీ.

నరనాథమణి తననగరికిఁ జుట్టును
            మునుమున్నుగాఁ బ్రాఁతమూఁక నిల్పి
యాతరువాతఁ గైజీతంబు విడిపించి
            యాకడఁ గూటపుమూఁక నిల్పి
యావల మిత్రసైన్యంబుల విడియించి
            దానియవ్వల శత్రుసేన నిల్పి
యందున కవ్వల నడవిమూఁకల నిల్పి
            యావల జీతంబు లంది కొల్చి

గీ.

తొలుతఁ బనులకు వచ్చి యాప్తులును గ్రూరు
లగుచుఁ గుక్కలు గలిగినయట్టి వేఁట
కాండ్రు చుట్టును విడియింపఁగా వలయును
గ్రమము దప్పక నీతివిక్రమము మెఱయ.

79

రాజాభిరక్షణకై సైన్యావసానము

ఆ.

అధిపు నగరిచేరువందు నుండఁగఁదగు
నాప్తరక్షితంబు లగుచుఁ దనరి
పేరు గలిగినట్టి పెద్దయేనుంగులు
నధికజవము గల్గునశ్వములును.

80


క.

అంతఃపురపరిచారకు
లెంతయుఁ దమి విచ్చుఁగత్తు లేమఱక మహీ
కాంతుని గావఁగవలయును
సంతతమును జాలిరొప్పు సన్నహనమునన్.

81


క.

మేటియగు నాప్తుఁ డెక్కిన
పోటేనుఁగు జవము కలిమిఁ బొలిచిన హయముం
బాటించి నగరివాకిటి
చోటనె యెపు డుండవలయు జోక చెలంగన్.

82


క.

దళవాయి మున్నుగాఁగల
బలమం దొకకొంత యేరుపడి యత్నముతో
వెలుపటఁ జుట్టును దిరుగన్
వలయును రేలందుఁ గడు నవారితశక్తిన్.

83


క.

వేగము బలమును గలిగిన
వేగులవా రెల్లవేళ విమతులచర్యల్
బాగుగఁ దెలియుచుఁ దా మతి
వేగమె రాఁబోవవలయు విభునకుఁ దెలుపన్.

84

చ.

దళమగు తాటిక్రొవ్విరులదండలు గట్టినతోరణంబులుం
బలువగు దంచనంబులును బాణము లాదిగఁగల్గు యంత్రముల్
దళుకగు టెక్కెముల్ గలుగు ద్వారము లాప్తులఁ గావఁజేయఁగా
వలయు నృపాలశేఖరుఁ డవారితపూరితకీర్తిసారుఁడై.

85

జాగ్రదవస్థిత్యావశ్యకత

క.

పోవుచు వచ్చుచు వాకిటి
కావలివారలకు నెఱుకఁగా సకలజనుల్
పోవలయు వైరిదూతలు
భూవిభుననుమతినె యుండి పోవన్ వలయున్.

86


గీ.

రిత్తకోలాహలంబులు రిత్తహాస్య
ములును జూదంబులును బానములును మాని
సవరణల మించి యుత్సాహసహితు లగుచు
బలము లెవ్వేళఁ గనుగల్గి పరగవలయు.

87


క.

తనకోటకు వెలుపలిదెసఁ
దనబలము చరించుభూమిఁ దడవక వైరుల్
మొనసి చరియించుభూములె
జనపతి చరియింపవలయుఁ జతురుం డగుచున్.

88


వ.

అది యెట్లన్నను.

89

కంటకాదిభూదూషణము

క.

ఒక్కొక యెడఁబడు పాఁతర
లొక్కయెడన్ ముండ్లకంప లొకయెడ ముల్కుల్
మిక్కిలి గలిగించి రిపుల్
ద్రొక్కెడి చోట్లెల్లఁ జెఱుప దొరకొనవలయున్.

90

క.

తనబలములు మెలఁగుటకై
తనబడిపనివారిచేతఁ దరువులు బుట్టల్
ఘనమగు మొద్దులు శిలలున్
గనుపట్టకయుండ సమము గావింపఁదగున్.

91


వ.

అందు నుత్తమమధ్యమాధమభూములు వివరించెద.

92

ఉత్తమాదిభూభేదములు

సీ.

తనదుమూఁకలకు నెంతయు మెల్గఁగావచ్చి
            వైరిమూఁకలకు రావైపుగాని
దేశ ముత్తమమగు దేశంబు మఱియును
            బగఱకుఁ దన కొక్కభంగియైన
దేశంబు మధ్యమదేశమై చెలువొందు
            వైరిమూఁకలకు రావచ్చియుండి
తనమూఁకకెల్ల నెంతయుఁ బోవఁగారాని
            దేశంబె యధమప్రదేశ మటులఁ


గీ.

గనుక నుత్తమదేశంబె తనకు వలయు
నది దొరకకున్న మధ్యమమైన దైన
వలయు నదిగాక చెఱసాలవంటిదైన
యధమదేశంబు వలదు ధరాధిపతికి.

93


వ.

మఱియు నపజయసూచకప్రకారంబు లెట్లన్నను.

94

నిమిత్తజ్ఞానప్రకరణము - అపజయసూచకనిమిత్తములు

సీ.

గ్రహము సోఁకినలీలఁ గళవళ మొందుట
             తెవులుచేఁ బీడలఁ దవులుటయును
గారణంబులు లేక కడుభీతి నొందుట
             మంచును దుమ్మును ముంచుకొనుట

కడుదూమ్రమై దొడ్డగాని పైకొనుటయు
           నూరకె టెక్కెంబు లుర్విఁబడుట
తమలోనఁ దమకు ద్రోహములు గల్గుటయును
           వాద్యముల్ లెస్సఁగా వాఁగమియును


గీ.

మిగుల మదిలోన నూరక దిగులుపడుట
నేల యుఱుముట చుక్కలు రాలుటయును
బొగలు మంటలు గత్తులఁ బొడముటయును
గలుగు పాళెంబు విజయంబు గానదండ్రు.

95


సీ.

చాల దావట నక్క లూలఁబెట్టుటయును
           ఘనమైనతాపంబు గలుగుటయును
మ్రాఁకులపైనుండి మూఁకలుగా వచ్చి
           కాకులు గ్రద్దలు గ్రమ్ముకొనుట
క్రమ్ముకో రాజనక్షత్రంబులందును
           గ్రూరగ్రహంబులు గూడుటయును
గారణం బేమియుఁ గలుగక మద మింకి
           యేనుఁగుల్ గదలక మ్రానుపడుట


గీ.

తురగచయములు గదలక లొట్రుకొనుట
సూర్యనందనుమొండెముల్ చూడఁబడుట
నెరసి నెత్తురువానలుఁ గురియుటయును
గలుగుపాళెంబు విజయంబుఁ గానదండ్రు.

96


వ.

మఱియును జయసూచకంబు లెట్లన్నను.

97

విజయసూచకనిమిత్తములు

సీ.

తేజీలసకిలింత లోజమై చెలఁగుట
            కాంతలుఁ బురుషులు సంతసిలుట
భేరీరవంబు గంభీరమై యుండుట
            కరిబృంతహింబు లగ్గలము లగుట

పుణ్యాహమంత్రముల్ పొలుపు వహించుట
           పాటలు నాటలుఁ బ్రబలు టెందు
నీతిబాధలు లేక యింపొంది యుండుట
           సంతతోత్సాహముల్ సంఘటిలుట


గీ.

సారె జనులెల్ల విజయంబు గోరుటయును
వాన లటు గల్గి ధూళిచే నూనకుంట
గ్రహము లనుకూలగతులను గాంచుటయును
గలుగుపాళెంబు విజయంబుఁ గను నటండ్రు.

98


సీ.

మెల్లనితావులఁ జల్లగాడ్పులు గల్గి
           సంతోషములఁ జెందు జనులు గల్గి
పక్షిజాతులమంచిపల్కులు వినఁ గల్గి
           చెలఁగుచునుండు మిత్రులును గల్గి
వందిమాగధశుభవాక్యచాతురి గల్గి
           నలఁగొనుశిఖలవహ్నులఁ జెలంగి
మదధారల నెసంగు మాతంగములు గల్గి
           వలపట నక్కకూఁతలును గల్గి


ఆ. వె.

యలర నెందు దివిని నంతరిక్షమునందు
నవనితలమునందు నద్భుతముగ
నురక పొడమునట్టి యుత్పాతములు లేక
వెలయుపాళెమునకుఁ గలుగు జయము.

99


క.

పాళెంబున కపశకునమె
చాలంగాఁ గలిగెనేని జయములు దొలఁగున్
పాళెమున మంచిశకునమె
చాలంగాఁ గల్గెనేని జయముం గలుగున్.

100

క.

ఇలలోపల శకునంబులె
దెలుపును జయ మపజయంబుఁ దేటపడంగా
నిలఱేఁ డటుగన శాస్త్రము
తెలివిన్ శకునంబులెల్లఁ దెలియఁగవలయున్.

101


క.

మునుమున్ను మంచిశకునము
లనువుం గని విమలచిత్తుఁ డగుపురుషుఁడు పూ
నినకార్యము సఫలం బగు
ననుచుం బలుకుదురు ప్రాజ్ఞు లగువా రెందున్.

102


క.

బలమును దైవబలంబును
నలప్రజ్ఞయు నిశ్చయంబు యత్నమును సహా
యులకలిమి నెట్టివానికి
గలుగున్ ధర నట్టివాఁడు కడు జయ మందున్.

103


గీ.

కసవు దవసంబు నీళ్ళును గట్టియలును
జేకురకయుంట చుట్టముల్ రాకయుంట
రేలు బగలును లాచి కగ్గోలు పడుట
విడుదులకు మృత్యువగు వీని విడువవలయు.

104


క.

ఈరీతి దండు విడియుచు
సారె శుభాశుభము లిచ్చుశకునస్థితులుం
దా రెఱుఁగవలయు నృపతులు
వైరులయశుభములు దెలియవలయున్ వరుసన్.

105

ఉపాయవికల్పప్రకరణము

క.

ధృతి యుద్యోగము సత్త్వం
బతులితమతి దేవతాసహాయత గలభూ
పతి సప్తోపాయంబుల
గతు లెఱుఁగుచుఁ జొనుపవలయు గడిఁదిరిపులపైన్.

106

క.

చతురంగబలముకంటెను
బ్రతిభందగు మంత్రబలము భండారము ను
న్నతి మించుఁ గాన వీననె
యతులితగతి గెలువవలయు నహితుల నెల్లన్.

107

సప్తవిధోపాయములు

క.

ఇలలోన సామదానం
బులు భేదము మఱియు దండమును మాయోపే
క్షలు నింద్రజాల మనఁగాఁ
గలిగిన యీయే డుపాయగతు లండ్రు బుధుల్.

108


వ.

అది యెట్లన్నను దత్ప్రకారంబు గ్రమంబున వివరించెద.

109

సామస్వరూపము

సీ.

మునుపుగాఁ బ్రియమున మ్రొక్కు లొనర్చుట
            పెద్దలసుగుణముల్ పేరుకొనుట
వారిసత్కర్మముల్ వరుసతో నెన్నుట
            తొలుతటి సంబంధములు దెలుపుట
తనకుఁ జుట్టఱికంబుఁ దానె కల్పించుట
            యిరువురయుపకార మెన్నికొనుట
యన్యోన్యగుణముల నందందఁ బొగడుట
            మీఁదటిఫలములఁ దాఁ దెలుపుట


గీ.

మంచితనమునఁ గల్పుకోల్మాట లాడి
యేను నీవాఁడ నని తను నిచ్చికొనుట
యివియె సామప్రకారంబు లిట్టి వెల్ల
నెఱుకగలరాజు వేర్వేర నెఱుఁగవలయు.

110

పంచవిధసామప్రకారములు

వ.

ఇట్టి సామప్రకారంబు లన్నియునుం గూడి యైదువిధంబులై
యుండు నది యెట్లన్నను పరస్పరోపకారప్రదర్శనంబును, బర
స్పరగుణకీర్తనంబును, బరస్పరసంబంధకథనంబును, నుత్తమ
కాలఫలప్రదర్శనంబును, నేను నీవాఁడనని తను నిచ్చుకొనుట
యుంగా, మఱియు నది ప్రయోగించు తెఱం గెట్లన్నను.

111

సామప్రయోగవిధానము

గీ.

ఎలమి నిరువుర యుపకార మెంచి మించు
గుణముఁ గొనియాడి సంబంధగణన సేసి
మీఁదటిఫలంబు గనఁబల్కి మీకు నేను
దగు లటనుచును సామోక్తిఁ బలుకవలయు.

112


గీ.

అరసి బహుమాన మొనరించు నట్టికరణి
నాదరంబునఁ గనుఁగొనునట్టిసరణి
నమృతకణములు చిలుకుచున్నట్లు నేర్పు
కులుకుచుండఁగ సామంబుఁ బలుకవలయు.

113


క.

సామంబుగ నిజ మాడుట
ప్రేమం గొనియాడుటయును బ్రియ మాడుటయుం
దా మఱి ప్రార్థన సేయుట
యీమార్గము మనుజపతుల కెఱుఁగగవలయున్.

114


క.

నేమమునఁ గార్యసిద్ధికి
సామమె యొనరింపవలయు సకల మగునెడన్
సామమునఁ గార్య మగు నని
ధీమంతులు సంతతంబుఁ దెలిపెడుకతనన్.

115

క.

సుర లసురులు మును సామ
స్ఫురణన్ శరనిధి మథించి శుభ మొంది రిలన్
ద్వరితమున సామ మొల్లక
కురురాజకుమారు లవనిఁ గూలరె జడులై.

116


వ.

సామసాధ్యులకు.

117


సీ.

ఆలసుని శౌర్యము దలఁగినవానిని
            గడునుపాయంబులు చెడినవాని
క్షయముచే వ్యయముచేఁ బయనంబుచేతఁ దా
            నెందు సంతాపంబుఁ జెందువాని
బవరంబులోపలఁ బాఱిపోయినవాని
            మూర్ఖుని భయమున మునుఁగువానిఁ
బడుచువానిని ధర్మపరుఁడైనవానిని
            నతివలయందు ముందైనవాని


గీ.

చెడుగువానిని నేస్తంబుచేయువాని
మంచిమతిగల్గువాని సాధించవలయు
మంచిమాటలచేత లాలించి యెల్ల
వారిఁ దనవారిగాఁ జేయవలయుఁ బతికి.

118


క.

పలుతెఱఁగుల కార్యములకు
నిలలో సాధకములైన యిట్టియుపాయ
మ్ములలో సామమె వేళలు
దెలియుచు నొనరింపవలయు ధీమంతులకున్.

119


వ.

దాన ప్రకరణము.

120

సీ.

అధికంబు మధ్యమం బల్పంబుగా ధన
            మిచ్చినట్లనె మళ్ళ నిచ్చుటయును
దనసొమ్ములెవ్వియుఁ దా నియ్యకయె మున్నె
            కైకొన్న సమ్మతిఁ గని యలరుట
యరుదులై మించినయట్టి పదార్థంబు
            లింపు మీఱంగఁ దా నిచ్చుటయును
దా నప్పు లిచ్చిన ధనములు దక్కుగా
            నప్పణబెట్టి తా నప్పగించు


గీ.

టన్యులధనంబుఁ గైకొన నడరెనేని
యందులకు సమ్మతించి సహాయుఁ డగుట
లిట్టు లైదువిధంబుల నెనయుదాన
రీతు లెఱుఁగంగవలయును నృపవరుండు.

121


క.

భూనాథుఁడు లోభముగల
వానిన్ మఱి పేదయైనవాని నెఱుఁగుచున్
దానోపాయముచేతనె
తా నెంతయు వశులఁ జేయఁ దగు నెచ్చోటన్.

122


క.

దానవగురుఁ డింద్రునిచే
దానంబున శాంతిఁ జెందె ధర నటుగానన్
దానముననె కలహంబులు
మానుపఁగావలయు బుద్ధిమంతుల కెల్లన్.

123


క.

తనయాడుబిడ్డకును ద
ప్పొనరించినఁ జూచి కోప మొదవినశుక్రున్
మును వృషపర్వుఁడు దానం
బున మాన్చెం గాన నదియె ముఖ్యం బెందున్.

124

క.

కలహము మాన్పెడుకొఱకై
బలియున కీవలయుఁ బ్రియముఁ బల్కుచునై నా
నల దుర్యోధనుఁ డీయక
చలమునఁ గులమెల్లఁ గూల్చి సమయఁడె తానున్.

125


క.

జనపతి దానోపాయము
మునుగా సామంబు భేదమును గావింపం
జను దానముచేతను మిం
చినసామము భేద మర్థసిద్ధిం జేయున్.

126


ఆ.

తృణముపోలె నీవి నెసఁగనిసామంబు
గార్యసిద్ధి చేయఁ గాన దెందు
నీవి చూపఁడేని యిల్లాలు దనకై
రిత్తమంచిమాట బత్తిగనునె.

127


వ.

భేదోపాయప్రకరణము.

128


క.

అనురాగంబును నెయ్యం
బును జెఱుచుట చాలఁగినుకఁ బుట్టించుట జం
కెన చూపి తలఁక చేయుట
యన భేదము మూఁడుదెఱఁగులై చెలువొందున్.

129


వ.

భేదోపాయప్రయోగము.

130


క.

తను వాని కమ్ముకొనుగతిఁ
దననేర్పులు చాల మెఱసి తా హితచర్యం
దనరుచు నరి భేదింపం
జనుఁ జల్లనయైన నీళ్ళు శైలముఁబోలెన్.

131


క.

తమవారు శత్రుచే భే
దము నొందక యుండఁ జేసి తా శత్రుల భే
దముఁ జెందఁ జేయవలయున్
సమకొని తమపక్షమునకు శాంతి ఘటిల్లన్.

132

క.

జననాథుండు పురోహిత
జనులన్ మంత్రుల నమాత్యజనులను యువరా
జును భేదించం జను ని
ట్లనువుగ భేదించెనేని యరి సెడు నందున్.

133


క.

జననాథమణికి మంత్రియ
కనుఁగవ యువరా జమాత్యగణములు భుజముల్
గన వీరలయం దొకఁడై
నను భేదముఁ జెంద రిపుఁడు నాశముఁ జెందున్.

134


క.

మును బలుదెఱఁగుల నడకల
బెనుపొందినవైరికులజు భేదింపంగాఁ
జను భేద మొంది యాతఁడు
తననెలవును దానె చెఱుచు దావాగ్నిగతిన్.

135


క.

తనశత్రునిదాయాదియుఁ
దనశత్రునిచనవరియును దగ సము లిటు వీ
రిని భేదింపన్ వలయును
దనయందును భేద మొండు తగులకయుండన్.

136


చ.

చనవున మించి శత్రునెడఁ జాలఁగఁ గోపము రేఁచ మాన్ప నో
పినఁ జను భేదముం బఱచి పెంపెసఁగం దెలియంగ నొప్పు స
జ్జనుఁడును దుర్జనుం డగుట సజ్జనుఁ డైనను బూనుకార్యముల్
దనరఁగఁ జేయు దుర్జనుఁడు దా ధనకాంక్షలుఁ గూల్చు నిర్వురన్.

137


చ.

జనవిభుఁ డప్పు డించుక యొసంగుచు నాశలు చాలఁ జూపుచున్
దనరఁగ నిందు నందును ఘనంబుగ జీతముఁ జెందువారిచే
ననువునఁ జొచ్చినల్దెఱఁగులై తగుభేద్యుల నెల్లభేదముం
గన నొనరింపఁగావలయుఁ గాలము దేశముఁ దా నెఱుంగుచున్.

138

వ.

ఇట్టినాలుగుదెఱంగుల భేద్యు లెట్టివా రన్నను విభునిచేత జీతంబులు
చెందని లుబ్ధుండును, నవమానంబు చెందిన యభిమానియు,
వెఱపింపఁబడిన భీతుండును, గోపింపఁబడిన కృద్ధుండును,
ననంబరగుచుండుదురు. తత్ప్రకారంబు గ్రమంబున వివరించెద.

139


సీ.

అళుకులఁ బెట్టింప నరుగుచుండెడివాఁడు
           మిగులంగఁ బేదయై నొగులువాఁడు
పతిచేతఁ జెఱుపఁగాఁబడిన ధర్మంబును
           గామంబు నర్థంబు గలుగువాఁడు
వెలుపట రొక్కంబు గలిగినవాఁడును
           నధికభోగముఁ గోరునట్టివాఁడు
వసుధ నెంచఁగ లుబ్ధవర్గమై దనరుదు
           రిట్టివారల మార్గ మెల్ల నెఱిఁగి


గీ.

యర్థములయందు మిగులఁగ నాశఁ గొల్పి
మఱియు నందుకుఁ దగినట్టి మాట లాడి
భేద మొందించవలయును బెంపుఁ జూపి
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

140


వ.

అభిమానిప్రకారంబు.

141


సీ.

కలహంబుపైఁ గాంక్ష గలిగియుండెడువాఁడు
            సాహసవృత్తి నెసంగువాఁడు
ధనముచేఁ గులముచేఁ దనకు నీడైనవాఁ
            డెంచ లేఁడంచు గర్వించువాఁడు
పూజార్హుఁడై యుండి పూజ నొందనివాఁడు
            నేపాటిమాపైన నెడయువాఁడు
సరిగానివానితో సాటిచేసినఁ గోప
            మంది సమర్ధుఁడైనట్టివాఁడు

గీ.

వసుధలో వీరి నభిమానివర్గ మండ్రు
క్రమముతోడుత వీరిమార్గంబు లెఱిఁగి
భేద మొందించవలయును బెంపుఁ జూపి
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

142


వ.

భీతవర్గప్రకారంబు.

143


సీ.

పతితోడఁ గోపించి పగఁబెట్టుకొనువాఁడు
            పిఱికిదనంబున బెగడువాఁడు
పతిచేతఁ గోపింపఁబడియుండువాఁ డెందు
            నతనిదాయాది యైనట్టివాఁడు
తా నేరములు సేసి తలఁకుచుండెడివాఁడు
            గడునల్గి ప్రియ మాడఁబడినవాఁడు
వెలివేయఁగాఁ బడి వెతలఁ జెందినవాఁడు
            గణుతింప భీతవర్గం బటండ్రు


గీ.

వీరిమార్గంబు లెఱిఁగి వివేకి యగుచు
మఱియు నందుకుఁ దగినట్టిమాట లాడి
భేద మందించవలయును బెంపుఁ జూపి
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

144


వ.

క్రుద్ధవర్గప్రకారము.

145


సీ.

ఇయ్యంగఁదగు నర్థ మియ్యక యెంతయుఁ
           గాలంబు గడపఁగాఁ గడఁగునతఁడు
నవమాన మొందిన యభిమాని యగువాఁడు
           లేనినిందలకు లోనైనవాఁడుఁ

గానుకకై యరికట్టఁగాఁ బడువాఁడుఁ
            దనబంధువుల నొంపఁ గినియువాఁడుఁ
గారణం బేమియుఁ గలుగక ధారుణీ
            పతిచేత విడువఁగాఁ బడినవాఁడు


గీ.

వసుధలో నెంచగాఁ గ్రుద్ధవర్గ మగుదు
రిట్టివారికిఁ గోపంబు లెచ్చఁజేసి
భేద మొందించవలయును బెంపుఁ జూపి
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

146


సీ.

ఆదాయమునకునై వ్యవహార మాడఁగా
           గెలిపింతు నని తానె పిలువఁ బంచి
యోడించినను గోప మొందియుండెడువాఁడు
           పనిలేనిపని యడ్డపాటు చెంది
మనసులో నెంతయుఁ గినిసియుండెడువాఁడు
           పని గల్గి యరికట్టఁబడినవాఁడు
[2](భార్యాధనములఁ గోల్పడ్డవాడును నాత్మ
           దోషంబుచేఁ గడుదుఃఖితుఁడును)


గీ.

వసుధలో నెంచఁగాఁ గ్రుద్ధవర్గ మగుదు
రిట్టివారలఁ గోపంబు లెచ్చఁజేసి
భేద మొనరింపఁగాఁ దగుఁబెంపుఁ జూపి
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

147


ఉ.

ఈవరుసన్ విరోధియెడ నెంతయు భేదముఁ జెందఁజేసి తా
నావల వచ్చువారలకు నప్పుడ కోరిన వెల్ల నిచ్చి సం
భావన సేయఁగా వలయు మన్ననతోఁ దనయట్టివారలన్
భూవరుఁ డెందు భేదమునఁ బొందక యుండ నొనర్పఁగాఁదగున్.

148

భేదోపాయములు

క.

ఇచ్చుట యాశలు చూపుట
మచ్చిక మాటాడుటయును మన్నించుటయున్
హెచ్చినభయంబు చూపుట
నిచ్చలు భేదంబు సేయునేర్పులు జగతిన్.

149


క.

మును భేదముఁ బొరయింపుచు
దనయరిసైన్యంబుమీఁద దండ మొనర్పన్
దను దానె ఎఱుగుచుండును
ఘనముగ నుసిపరువు దినినకట్టియవోలెన్.

150


క.

బలవంతులతోఁ గలహం
బలవడ భేదమున గెలువ నగుఁ జండామ
ర్కుల భేదపఱచి దివిజులు
గెలువరె దానవుల నెల్ల క్షితి నుతియింపన్.

151


వ.

దండోపాయప్రకరణము.

152


క.

అలమటఁ బెట్టుట చంపుట
కలిగినదనమెల్ల నొడిచి కైకొనుటయుఁగా
నిల దండము మూఁడుదెఱం
గుల వెలయు నటండ్రు నీతికోవిదు లెల్లన్.

153


వ.

అందు వధరూపంబగు దండంబు ప్రకాశంబు నప్రకాశం బన
రెండుదెఱంగులై యుండు నది యెట్లన్నను.

154


క.

జగతిని జారులు చోరులు
నగువారిని దనకు శత్రులగువారి మదిం
దగ నెఱిఁగి తాఁ బ్రకాశం
బగు దండ మొనర్పఁ జెల్లు నధిపతి కెందున్.

155

క.

సేనాపతులను బురిఁగల
మానవులను దనదుసీమ మనుమానవులం
దా నొనగూర్పఁగ వలయును
దానమునకు భేదమునను ధరణీశుఁ డిలన్.

169


చ.

కలఁకలు బుట్టఁజేసి తిరుగంబడియుండుకులంబువారి చెం
తల గడినుండురాజుల వనంబుల [3](నుండెడివారి భేదపుం
జెలువున దండవైఖరిని) చిక్కగఁ జేయఁగ నొప్పునేరుపుల్
బలియఁగ నన్యులం దగునుపాయముచేఁ జను మట్టుపెట్టగన్.

170


వ.

ఇది చతురుపాయస్వరూపంబగు నింక మాయోపేక్షేంద్రజాలంబుల
ప్రకారంబులు గ్రమంబున వివరించెద.

171

మాయాప్రకారములు

సీ.

జనులు కంబములలోనను దేవతాప్రతి
            మలలోపలను జొచ్చి మెలఁగుటయును
గాంతాదిరూపముల్ గైకొనుటయు రాత్రు
            లందుఁ జీఁకటుల మహాద్భుతముగఁ
గొరవిదయ్యముల బాగున మించుటయును భే
            తాళుని చందంబుఁ దాల్చుటయును
బులుల నక్కల యెలుఁగుల రూప మొందుట
            యివి మనుజులమాయ లెంచి చూడఁ


గీ.

గామరూపంబుఁ బూను టింగలము నంప
కోలలును రాళ్ళు నీళ్ళును గురియుటయును
గాలి గట్లును మొగిలు చీకట్ల గలుగఁ
జేయుచుండుట దేవతామాయ యగును.

172

గీ.

పడఁతిరూపున మును సహ్యబలునిఁ జంపె
మహిని భీముండు మానవమాయచేత
నలుఁడు ప్రచ్ఛన్నరూపుఁడై కొలిచె దేవ
మాయఁగై కొని ఋతువర్ణమనుజవిభుని.

173


గీ.

అవని నన్యాయమును బోరు వ్యసనములును
నడరుచుండఁ బ్రవర్తించు నట్టివాని
నరసి మాన్పక యుండిన నగు నుపేక్ష
యిదియు మూఁడుదెఱంగులై యిటుల వెలయు.

174


సీ.

కామాంధుఁడై ముందు గానక గర్వించి
            ద్రౌపదిపై కాంక్ష దనరుసింహ
బలుని భీముఁడు రేయి పట్టి వధింపుచో
            విరటుఁ డుపేక్షించి విడుచుటయును
మునుపు హిడింబుఁ దా మోహించి భీమును
            వరియించి యతనిపై వాంఛఁ జేసి
తనతోడఁబుట్టిన దనుజు హిడింబుని
            నురక యుపేక్షించి యుండుటయును


గీ.

ననఁగ నీగతి నన్యాయమైన యెడల
వ్యసనములయెడ జగడంబు వచ్చునెడల
నగు నుపేక్షింపఁ దనవారినైన నెందు
నీతిమార్గం బెఱిగిననృపవరుండు.

175

ఇంద్రజాలప్రకారము

సీ.

ఘనముగా మాయచే గట్టులు చీఁకట్లు
            బెనువాన లగ్నిఁగల్పించుటయును
దవ్వుల నున్నతధ్వజములు గలిగిన
            సేనలఁ గన్పడఁ జేయుటయును

దునకలు మొండెముల్ దుండంబులై పడి
             సొరిగిన మూఁకలఁ జూపుటయును
నడరి సముద్రంబు లటుముంచుకైవడిఁ
             బెల్లుఁగా వెల్లిఁ గల్పించుటయును


గీ.

ననఁగఁ గల యింద్రజాలంబు లద్భుతముగ
వైరిరాజులు భయ మందవలసి నేర్పుఁ
దనర నొనరించవలయు నుదారలీల
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

176


గీ.

దైవమాయావిలాసంబు దడవు నిలుచు
నింద్రజాలవిలాసంబు లెల్ల నపుడె
గానుపించును నామీఁదఁ గానరాక
పోవు నివి దెలియందగు భూమివిభుఁడు.

177


ఉ.

నీతివిధిజ్ఞుఁడైన ధరుణీపతి యీగతి నీయుపాయముల్
చాతురితోడ శత్రువులసైన్యమునందును నాత్మసైన్యమం
దాతతరీతిఁ జేయఁదగు నాగతిగాక యుపాయశూన్యుఁడై
యేతఱి నూరకున్నయెడ నెందును నంధుఁ డనంగఁ జేడ్పడున్.

178


క.

అనలములోన నుండి తనరారుసువర్ణము బట్టుకారునం
గొని బిగఁబట్టినందునకు గొబ్బున జారక చిక్కుమాడ్కి శ
త్రునియెడ నున్నసంపదయు రూఢిమెయిం దగు నీయుపాయవ
ర్తనమునఁ బూని భూవిభుఁడు దా బిగఁబట్టినఁ జిక్కుఁ గ్రక్కునన్.

179


ఉ.

శ్రీరఘురామపాదసరసీరుహభక్తినియుక్తమానసో
దారధరాధురావహనదక్షిణ దక్షిణబాహుదండవి
స్తారయశస్సరోవరలసన్నవనీరజకోరకాకృతి
స్ఫారసరోజజాండనయచారవిచక్షణ భద్రలక్షణా.

180

క.

విమతహరణార్థయాత్రా
క్రమకౌశల విజయశకునగతినిర్ణయభా
గ్విమలమతి సారపటువి
క్రమ సప్తోపాయచతుర ప్రఖ్యాతజయా.

181


తోటకం.

పటుధాప్రతిభాభరణాభరణా
చటువాక్చణనజ్జనతాభినుతా
ఘటితాంచితలక్షణలక్ష్యరసో
త్కట కావ్యకళాకరణాదరణా.

182


గద్యము :-

ఇది శ్రీమన్మదనగోపాలవరప్రసాదలబ్ధసారసారస్వత
భారద్వాజసగోత్ర జక్కరాజ యెఱ్ఱనామాత్యపుత్ర సుకవిజన
విధేయ శ్రీరామకృష్ణభక్తివైభవబాగదేయ వేంకటనామధేయ
ప్రణీతంబైన కామందకనీతిశాస్త్రంబను మహాప్రబంధంబునందు
యాత్రాభియోక్తృదర్శనప్రకారంబును, స్కంధావారనివేశనిమిత్త
జ్ఞానంబును, సప్తోపాయవికల్పంబు నున్నది సప్తమాశ్వాసము.




  1. నొక్కయరాబు
  2. (.................)
  3. (...................)