ఆంధ్రకామందకము/షష్ఠాశ్వాసము

ఆంధ్రకామందకము

షష్ఠాశ్వాసము

క.

శ్రీదశరథనృపనందన
పాదాబ్జస్మరణకరణపటుమానసస
మ్మోదితసజ్జనవిదితన
యాదిక కొండ్రాజువెంకటాద్రినరేంద్రా.

1


వ.

అవధరింపుము.

2

ఉత్సాహప్రశంసాప్రకరణము

ఉ.

శ్రీరమణీయుఁడై నృపతిశేఖరుఁ డన్నిట బుద్ధిమంతుఁడై
చారులచర్యచే నెపుడు శత్రులబల్మి యెఱింగి యెంతయుం
గౌరవ మెంచ దూతలముఖంబునఁ గార్యము గానిపిమ్మటన్
వైరుల ఖేదపెట్టుచు నవారితలీలల దండు పోఁ దగున్.

3


క.

సమకొనుప్రయత్నమును స
త్త్వము చెందుచు సూక్ష్మధారఁ దగి నిల్కడయై
యమరినమతి ఫలసిద్ధిం
గ్రమమునఁ గను నరణి యగ్నిఁ గనుచందమునన్.

4


ఉ.

జేగురుఱాలఁ గుందనముఁ జెందినమాడ్కి దధి న్మథించినన్
వేగమె వెన్నపుట్టుసరణిన్ వరబుద్ధిసమేతయత్నసం
యోగము గల్గి నిల్కడల నొందుచు నుండెడు నట్టి మంచియు
ద్యోగముచేత నెల్లపుడు నొందు ఫలంబులు నిశ్చయంబుగన్.

5

క.

అల యుత్సాహము బుద్ధియుఁ
జెలఁగగ నుద్యోగి యైనక్షితిపతి యిలలో
పల సిరులకు నిలుకడ యగు
జలములకును టెంకియైన జలనిధివోలెన్.

6


క.

జలములచేఁ బాలితమగు
జలజినిగతి బుద్ధిచేత సంపదఁ బ్రోవన్
వలయును యుత్నోత్సాహ
మ్ములచే నది యెపుడు ప్రబలముగఁ జేయఁదగున్.

7


మ.

ఇల నుత్సాహగుణంబునం బొదలి తా నెవ్వేళలన్ బుద్ధిచే
మెలఁగం జాలినయట్టి రాజువలన న్మేలౌ సిరుల్‌ వాసి పో
కలరు న్మేనులతోడ నీడ లెడబాయం జాలకున్నట్టిలీ
లల విస్తారముఁ జెందుచుండు నవి చాల న్నిక్కి పెంపెక్కుచున్.

8


క.

అలయక వ్యసనములకుఁ గడుఁ
దలఁగుచు నుత్సాహమతులఁ దనరెడువిభునిన్
బలుసిరులు తామె చెందున్
జలనిధిలో నదులు చెందుచందం బందన్.

9


క.

జనపతి మతిఁ గలిగియు దా
ననిశము వ్యసనములచేత నలసుండైనన్
దనసిరులు దన్ను విడుచును
వనితలు లేపంబులేనివానిం బోలెన్.

10


మ.

ఘనమౌ కట్టియచేత నగ్ని బలియంగాఁ జేయుచందంబునన్
దనయుత్సాహముచేత సత్త్వ మభివృద్ధంబై కనం జేయఁగాఁ
జను నిద్ధారుణి నట్లకా విలసితోత్సాహంబు నిత్యంబు జెం
దిన యాదుర్బలుఁడున్ సిరిం గని సముద్దీపించుఁ జంచద్గతిన్.

11

మ.

తలఁపన్ సంపద నెల్ల ధూర్తయగు కాంతంబోలె భూజాని ని
చ్చలుఁ దాఁ బౌరుషయుక్తుఁడై యనుభవించంగోరి యత్నంబు భూ
స్థలిఁ జెందం దగు నిట్లుగాక మఱి యుత్సాహంబుతోఁ బాయుచున్
వల దెవ్వేళ నపుంసకుండుబలె నుండంగా మహీభర్తకున్.

12


క.

అందంద ధూర్తయై తగు
మందగమనఁ గూడునట్లు మఱి సిరి దగుఁ బో
యెందు నల సింహవృత్తిన్
ముందల పట్టీడ్చి తెచ్చి ముదమును జెందున్.

13


చ.

ధళధళమంచు మించులను దార్కొను సారకిరీటరత్నపం
క్తులఁ దులలేనిచిత్రములతోఁ దగువైరిశిరంబులందు ని
చ్చలుఁ జలమెచ్చఁ బాద మవిషాదముగా నిడకుండెనేని కే
వలవలమానమానసుఁ డవశ్యము దా శుభ మంద నేర్చునే.

14


క.

పసగల యుద్యోగముచే
వెస గొలిపెడు చిత్త మనెడియేనుఁగుచే ని
వ్వసుమతిఁ బరులను దరువుల
వెస గడపక నృపతి కెందు విభవము గలదే.

15


చ.

చెనకినవైరిపైఁ జికిలిచేసిన భాసిలు పెద్దకత్తి దూ
సిన జనియించు చాయలు విచిత్రములై మదహస్తిహస్తఖే
లన కరదండయుగ్మమున లావునఁ బట్టినఁ జిక్కుఁగాక మిం
చిన ఘనరాజ్యలక్ష్మి దనచేతికి నూఱక చిక్కిదక్కునే.

16


ఉ.

ఉన్నతమై చెలంగు పద మొందఁ దలంచినయట్టివాఁడు దా
నున్నతమై చెలంగు పద మొందుచు నుండును, గాక నీచమై
యున్నపదంబుఁ గోరుకొనుచుండెడినీచుఁడు చెందు నీచమై
యున్నపదంబుఁ దాఁ బడుట నొందెడు శంక దొలంక నెల్లచోన్.

17

మ.

తనకంటెన్ బొడవైనయేనుఁగులమీఁదన్ విక్రమం బొప్పఁ జెం
గన సింగంబు పదంబుఁ బెట్టుగతి రాజాగ్రేసరుం డెల్లచోఁ
దనయుత్సాహముచేత విక్రమముచేత న్మించ నత్యున్నతిన్
ఘనమైనట్టిపదంబుఁ గైకొను ధరాకాంతుల్ నుతుల్ సేయఁగన్.

18


క.

భయ మెడలిన పా మొరులకు
భయముగఁ దనపడగఁ జూపు బాగునఁ బతియున్
భయమునఁ బొరయనివాఁడై
నయగతిఁ దేజంబుఁ జూప నాయం బెందున్.

19


వ.

ఇది యుత్సాహప్రకరణం బింక స్వామ్యాదిసప్తాంగంబులకుఁ
గల ప్రయోజనంబులును, వ్యసనంబులునుం గ్రమంబున
వివరించెద నందు రాజప్రయోజన మెట్లనిన.

20

ప్రకృతికర్మప్రకరణము - రాజచర్య

సీ.

విద్యలన్నియు లెస్స విని యర్థము లెఱింగి
          వర్ణాశ్రమంబుల వరుసఁ బ్రోచి
శస్త్రశాస్త్రంబులచందముల్ గనుఁగొని
          యని సేయునేర్పుల నభ్యసించి
యలవుమై నెపుడు వాహ్యాళి వెళ్ళగ నోపి
          కార్యపద్ధతుల సంగతులు దెలిసి
రథములఁ గరులఁ బోరగ నేర్చి యెంతయు
          బాహుయుద్ధమురీతి పదిలపఱచి


ఆ.

మాయ లెఱిఁగి పరుల మనసులు గనుగొని
కైదువుల పరీక్షఁ గనఁగఁ జాలి
సకలజనులు మెచ్చ జయపెట్ట మెలఁగుట
రాజచర్య లివి ధరాతలమున.

21

సీ.

మంచివారికినెల్ల మంచివాఁ డగుటయు
            ధూర్తులయెడఁ గడు ధూ ర్తగుటయు
సామదానంబులచందంబు భేదంబు
            దండం బుపేక్షయుఁ దగ నెఱుగుట
మంత్రవిచారంబు మఱవక సేయుట
            మంత్రమార్గమున సమ్మతి మెలఁగుట
మంత్రంబు రక్షించి మంత్రస్థిరుం డౌట
            దుష్టజనంబుఁ బోఁ దోలుటయును


గీ.

మఱియు దళవాయు లధికార్లు మంత్రివరు ల
మాత్యులుఁ బురోహితాదులు నిత్యలీల
మెలఁగుగతు లన్నియును లెస్స దెలియుటయును
రాజు చరియించుచర్య ధరాతలమున.

22


సీ.

అరసి యమాత్యాదు లై నట్టి సప్తాంగ
            మందలివ్యసనంబు లడఁచుటయును
గోపమందినవారి కోపంబు మాన్చుట
            గురువు చెప్పినబుద్ధిఁ దిరుగుటయును
బూజార్హులగువారిఁ బూజింప నేర్చుట
            ధర్మాసనము వెట్టి తప్పకుంట
రాజ్యబాధకులను బ్రహరించుటయు బంట్లు
            జీతముల్ చెందుట చెందకుంట


గీ.

చేసినవి సేయనివి పరీక్షించి యుంట
యెపుడు పేదరికంబున నెనయువారిఁ
గలిమిగలయట్టివారిని దెలియుటయును
రాజు చరియించుచర్య ధరాతలమున.

23

సీ.

మధ్యమోదాసీనమానవేశుల మార్గ
             మరసి వారల సంధియందుటయును
వచ్చువారిని బోవువారి నెఱుంగుట
             హితులఁ గూర్చుట వైరితతి నడఁచుట
యాండ్రబిడ్డల లెస్స యరసి రక్షించుట
             నలుదిక్కులకును దూతలఁ బనుచుట
తనకు జీవనములై తగు గనుల్ పనులును
             గరులును గృషులాది గాఁగ గల్గు


గీ.

నట్టి వన్నియుఁ జేకూర్చి యలరుటయును
దుష్టులగునట్టివారలఁ ద్రోయుటయును
మంచివారలఁ జేపట్టి మించుటయును
రాజు చరియించుచర్య ధరాతలమున.

24


సీ.

సకలజంతువుల హింసలు చేయకుండుట
            యెందు నధర్మంబుఁ జెందమియును
మంచికార్యము లొనరించగాఁ బూనుట
            దుష్టవాక్యములెల్లఁ ద్రోచియుంట
యియ్యంగఁ దగుచోట నియ్యంగ నేర్చుట
            పుచ్చుకోఁ దగుచోటఁ బుచ్చుకొనుట
దండించఁ దగనిచో దండించకుండుట
            దండార్హులగువారిఁ జెండుటయును


గీ.

దెలియఁదగినవి తెలియుట, తెలియఁదగని
యర్థములు విడుచుటయు, నిరర్థకములు
మాను టర్థంబుగలయవి పూనుటయును
రాజు చరియించుచర్య ధరాతలమున.

25

సీ.

అరిఁగోర్ల నెపుడు న్యాయంబుగాఁ గొనుటయు
             నెఱిఁగి న్యాయంబుగా నిచ్చుటయును
దనప్రధానజనంబు ఘనముగాఁ బ్రోచుట
             విడువగాఁ దగువారి విడుచుటయును
వైరంబు లడగించి వర్తించుటయు బంట్ల
             తోడి విరుద్ధంబుఁ ద్రోయు టెందు
నెఱుఁగకుండిన యర్థ మెఱుఁగఁగా నేర్చుట
             యెఱిఁగి యర్థము నిశ్చయించుటయును


గీ.

సకలకార్యంబులందును జతురుఁ డగుచుఁ
బూనిసేయుచు నుండుట, బూనినట్టి
పనులఁ గడవెళ్ళగాఁ జేసి పరగుటయును
రాజు చరియించుచర్య ధరాతలమున.

26


సీ.

నీతి మించఁగఁ జెందనిది చెందఁగోరుట
             చెందిన దభివృద్ధి చేసికొనుట
యభివృద్ధి చెందినయర్థంబు శాస్త్రోక్త
             మగురీతి సత్పాత్రమందు నిడుట
మఱియు నధర్మముల్ మాన్చుట యనునీతి
             విడువ కెవ్వేళల నడచు టెందు
నుపకారయోగ్యులై యుండెడువారికి
             నుపకారములు సేయుచుండుటయును


గీ.

ధర్మ మెప్పుడు ధనముగా దాఁచికొనుట
యెంచఁదగుఁ గీర్తి మించి వర్తించుటయును
దైవమును బ్రాపు దాపుగాఁ దలఁచికొనుట
రాజు చరియించుచర్య ధరాతలమున.

27

వ.

అమాత్యప్రయోజనము.

28

మంత్రిచర్య

సీ.

ఆదాయములు గల్గు హరువుఁ గల్పించుట
           యెఱిఁగి వెచ్చంబు సేయించుటయును
పైకొని పగవారి రాకుండఁ జేయుట
           క్షితిపతి నెపుడుఁ బోషించుటయును
దండనీతియును మంత్రంబు నెఱుంగుట
           యెఱిఁగి మంత్రఫలంబు నెనయుటయును
వ్యసనముల్ రాకుండ వర్తింప నేర్చుట
           లెస్సగా భూమిఁ గాలించుటయును


గీ.

మీఁదట ఫలంబు గలుగఁ దా మెలఁగి చెలఁగు
టాదిగాఁ గల్గియుండెడునట్టి వెల్ల
మంత్రిజనములపను లండ్రు మహిఁ దలంప
నిట్టి మార్గంబు నరవరుఁ డెఱుఁగవలయు.

29


వ.

రాష్ట్ర ప్రయోజనము.

30

రాష్ట్రచర్య

క.

బలమును భండారము ధన
ములు వాహనములును ధాన్యములు దృణకాష్టం
బులు మొదలగువస్తుతతుల్
గలిగించుట రాష్ట్రమునకుఁ గల పను లరయన్.

31


వ.

దుర్గప్రయోజనము.

32

దుర్గచర్య

సీ.

ఆపద తఱిఁ బ్రజ కాశ్రయం బగుటయు
            భండారమున కున్కిప ట్టగుటయు

నఖిలదేశంబులయందు నుండెడివార
             లేయెడ నిలుకడ నెనయుటయును
బరులకుఁ బోట్లాట బాగుగాకుండుట
             ఘనమైనవిజయంబు గనఁగలుగుట
శత్రుల మిత్రుల సమకూర్చఁ గలుగుట
             బలముల రక్షించఁ గలుగుటయును


గీ.

గడిదొరలచేత మఱి పాలెగాండ్రచేతఁ
బీడఁ బొరయక యెందును బెంపుఁగనుట
మొదలుగాఁగల్గు నివి దుర్గమునకు బనులు
నృపతి యీమార్గముల నెల్ల నెఱుఁగవలయు.

33


వ.

బలప్రయోజనము.

34

బలచర్య

సీ.

విమతులఁ జెండాడి విజయంబుఁ గనుటయు
           మిత్రులఁ జేకూర్చి మెలఁగుటయును
జగతి నెంతేనియు సాధింపఁగలుగుట
           ధనముల నార్జించి తనరుటయును
దూరకార్యముల నెందును వేగచేయుట
           చెందినదాని రక్షించుకొనుట
నిజబలతతుల నెన్నికమీఱఁ గూర్చుట
           పరచక్రములఁ గీడుపఱచకుండు


గీ.

టాదిగాఁ గల్గుచుండెడు నట్టి వెల్ల
ప్రాజ్ఞులగువారు బలములపను లటందు
రిట్టి మార్గంబు లెల్లఁ దా నెఱుఁగవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

35

వ.

మిత్రప్రయోజనము.

36

సుహృచ్చర్య

సీ.

పగవారలను మట్టుపడియుండఁ జేయుట
            మంచిమిత్రులఁ బ్రబలించుటయును
భండారములచేత బలములచేతను
            క్షితిచేతఁ బ్రాణంబుచేతనైన
నిల నుపకారములే చాలఁ జేయుట
            మిగులనెయ్యంబుతో మించుటయును
గణుతింపఁ బ్రత్యుపకారంబుఁ గోరక
            మంచికార్యములు సాధించుకొనుట


గీ.

యాపదలయందు మిగుల సహాయుఁడగుట
సంపదలు చెందియుండిన సంతసిలుట
యరయ మిత్రుని పనులండ్రు ధరణినాథుఁ
డిట్టి రాజ్యాంగముల పనులెఱుఁగవలయు.

37


వ.

వ్యసనములకు.

38

ప్రకృతవ్యసనములు

ఆ.

ఎందుచేత శుభము లెప్పుడు చెడిపోవు
నదియ తలఁప వ్యసన మనఁగఁ బరగు
వ్యసనియైనవాఁడు వెస నధోగతిఁ బడు
నటులఁగాన వ్యసన మడఁప వలయు.

39


క.

దైవంబును మానుషమును
దైవము మానుషము రెండు దగులుటచే సం
భావితమగు వ్యసనము తా
భూవరుఁ డిది మాన్చి దండు పోవఁగ వలయున్.

40

క.

జలమును దెవులును మారియు
నల దుర్భిక్షంబు చిచ్చు ననునై దుతెఱం
గుల వెలయు నెందుదైవిక
ము లైనవ్యసనంబు లితరములు మానుషముల్.

41


క.

పౌరుషమున శాంతులచే
సారె విధుఁడు దైవికవ్యసన ముడుపఁ దగున్
బౌరుషముచేత నీతివి
చారముచే మానుషవ్యసన ముడుపఁదగున్.

42


వ.

రాజవ్యసనము.

43


క.

అతినిష్ఠురమగుమాటయు
నతిదండము వేఁట పాన మతివయ జూదం
బతిఘనమగుదుర్వ్యయమును
క్షితి నివి వ్యసనంబు లండ్రు క్షితిపతి కెందున్.

44


గీ.

నిరత ముద్యోగవంతుఁడై నీతి నలరు
రాజు రాజ్యాంగముల నెల్లఁ బ్రబలఁజేయు
నటులఁగా కెందు వ్యసనార్తుఁ డయ్యెనేని
తనదు రాజ్యాంగములనెల్ల తలఁకఁజేయు.

45


క.

అల ధర్మార్థంబుల నా
కులుఁ డగుచో మనసు దొట్రుకొని చెదరినచో
నిలఱేనికి సన్మంతులు
దెలుపఁగఁదగు రాజచర్య ధీరత చెందన్.

46


వ.

మంత్రివ్యసనము.

47

క.

అలసత జాడ్యము గర్వము
గలహము దెచ్చుట ప్రమాదగతి యుద్ధతియున్
బలువగు సప్తవ్యసనం
బులు మంత్రుల కెందు వ్యసనములు ధరలోనన్.

48


క.

తనమంత్రిజనము వ్యసనము
గనినయెడ న్విభుఁడు శక్తిఁ గలిగినవాఁ డ
య్యును ఱెక్కలు విఱిగిన పులుఁ
గనగాఁ బొడవై నపదవి నందికయుండున్.

49


వ.

భండారవ్యసనము.

50


ఉ.

దూరమునందె యుండుటయు దొంగలచేఁ బడిపోవు టెంతయుం
దీరఁగ వెచ్చమౌట చెడదింటయుఁ బెక్కగుచోట్లమన్కి నిం
డారగ గూడబెట్టమి యనాదరభావముతోడ నున్కి భం
డారమునందు నుండు వ్యసనమ్ము లగున్ ధరణీతలంబునన్.

51


క.

వసుధన్ భండారమునకు
వ్యసనంబులు చెందెనేని యందగు పనులుం
బొసఁగవు గన భండారము
వ్యసనము మాన్చంగవలె నవశ్యము పతికిన్.

52


క.

ధర భండారమె మూలము
నరపతి కని నీతిపరు లనంగా వినుటన్
దొర యెప్పుడు భండారము
గరిమ మెయిం బ్రబలుచుండగాఁ జేయఁదగున్.

53


వ.

రాష్ట్రవ్యసనము.

54


చ.

ఎలుకలు చిల్కలు న్మిడుత బెచ్చగువానలు వానలేమి దొం
గలు ప్రతిమూకలుం జనవు గల్గినవారల బాధ శత్రుమూఁ

కలు బసి చచ్చుటల్ దెవులు గ్రమ్ముట భూపతిచేతిభంగముల్
బలువగు మారిదండుగకుఁ బట్టుటయున్ వ్యసనంబు భూమికిన్.

55


గీ.

పాశుపాల్యంబు గృషియును బణ్య మనఁగ
బరగువార్తనె ప్రజలెల్లఁ బ్రతుకుచుండ్రు
వారు వ్యసనంబు చెందిన వారు సేయు
పనులు చేకూడ వంద్రు భూపతికి నెందు.

56


వ.

దుర్గవ్యసనము.

57


క.

కసవును గట్టెలు దివసము
బస లేకుండుటయుఁ గోట పడుట యగడ్తల్
రసములు యంత్రాయుధములు
నెసఁగమి దుర్గమున కెల్ల నివి వ్యసనంబుల్.

58


క.

ధర దుర్గమునకు వ్యసనము
పరగిన దుర్గంబు పనులు పస చెడు నివి లే
కిరవగు దుర్గము గలదొర
యరులకు మిత్రులకుఁ బూజ్యుఁ డగు నెవ్వేళన్.

59


వ.

బలవ్యసనంబులు.

60


వ.

మఱియు వ్యసనయుక్తంబులగు బలంబులు పరిక్షిప్తంబును,
విమానితంబును, వ్యాధితంబును, దూరాగతంబును, బరి
క్షీణంబును, నభూయిష్ఠబలంబును, నవిక్షిప్తంబును, నంత
శ్శల్యంబును, భిన్నగర్బంబును, నపసృతంబును, బరిమృష్టంబును,
మిశ్రంబును, నుపనివిష్టంబును, శూన్యబలంబును, మిత్ర
విక్షిప్తంబును, బ్రహతాగ్రజనంబును, సస్వామిసంహితంబును,
భిన్నకూటంబును, దుష్పార్ష్ణిగ్రాహంబును, నంధంబును, విచ్ఛిన్న
వీవధాసారంబును, నుపరుద్ధంబును, నమానితంబును, శూన్య

మూలంబును, నభృతంబును, బరిశ్రాంతంబును, నవాగతంబును,
బ్రతిహతంబును, స్వవిక్షిప్తంబును, గ్రుద్ధమూలంబును, సవృత
సంప్రాప్తియు, గళత్రగర్భంబును, నాశానిర్వేదియు, దూష్య
యుక్తంబు నన నివి ముప్పదినాలుగుతెఱంగులై యుండు నందు
వ్యసనంబులు పరిహరింపరానివి యిరువదియొక్కటియును,
వ్యసనంబులు పరిహరించవచ్చునవి పదమూడునుం గలవు.
తత్ప్రకారంబు వివరించెద.

61

పరిక్షిప్తాది బలలక్షణము

సీ.

అరి చుట్టుముట్టిన నటుత్రోవఁగానక
            చిక్కియుండినఁ బరిక్షిప్తబలము
జనపతిచేఁ దిరస్కారంబు గడుఁజెంది
            మదిరోష మంద విమానితంబు
నతిరోగములచేత నలసి యేపనులకు
            నసమర్థమైనచో వ్యాధితంబు
నతిదూరగతిచేత మృతిఁజెందుగతి నా
           థావళి విడుచు దురాగతంబు


గీ.

గుఱ్ఱములు శూరులును మును గూలిపోవ
క్షీణమైయుండు నల పరిక్షీణబలము
వ్యసనమును జెంది ముడుఁగుచున్నట్టికతనఁ
బతికినప్పటి కని సేయఁ బనికిరాదు.

62


సీ.

అని సేయ నిట్టట్టు చనరాక యిఱుకున
           మెలఁగఁ గూడని యభూయిష్ఠబలము
బహుదేశముల కడపటనుండి వేళకుఁ
           జేరనేరని యవిక్షిప్తబలము

దమమూఁకలోన నెంతయు శత్రులుండిన
            నదరు నంతశ్శల్య మనుబలంబు
నన్యోన్యకలహంబు నంది యైక్యముగాని
            భిన్నగర్బంబను పేరిబలము


గీ.

నొక్కరిప్రదేశ మవ్వల నుండి చేర
ననువుగానక యుండిన నపసృతంబు
వ్యసనమును జెంది ముడుఁగుచున్నట్టి కతనఁ
బతికినప్పటి కని సేయఁ బనికిరాదు.

63


సీ.

పిఱికిపంతంబునఁ బెగడెడుదళవాయి
           నొనగూడుఁ బరిమృష్ట మనుబలంబు
విమతసైన్యము గూడి విడిసియుండుటఁ జేసి
           మించి రానేరని మిశ్రబలము
మును శత్రులసమీపములనుండి యేతెంచు
           నుపనివిష్టం బన నొప్పుబలము
తరతరంబును గొల్చి తగు ప్రాఁతమూఁకలై
           శూరత గల్గని శూన్యబలము


గీ.

నడరి మిత్రసహాయార్థ మనిపినట్టి
మిత్రవిక్షిప్త మని మొన మేటిభటులు
చాలఁ గూలినఁ బ్రహతాగ్రజనబలంబుఁ
బతికి నప్పటి కని సేయఁ బనికిరాదు.

64


సీ.

అధిపులతోఁ బాసి యాధార మెడలిన
           యస్వామిసంహిత మనెడి బలము
నధిపులు గూలిన యప్పు డొండొరులకుఁ
           గూట మొందని భిన్నకూటబలము

వెనుక శత్రులచేత వెతఁ జెందు దుష్పార్ష్ణి
            కగ్రాహ మనుపేరఁ గలబలంబు
జగడంబులోన నెచ్చరికెకాఁ డెడలిన
            నటు ముందుఁ గానని యంధబలము


గీ.

ధాస్యసంప్రాప్తి చుట్టముల్ దనకు రాక
జడియు విచ్ఛిన్నవీవధాసారబలము
వ్యసనములయందె ముడుఁగుచున్నట్టికతనఁ
బతికి నప్పటి కని సేయఁ బనికిరాదు.

65


వ.

ఇంక వ్యసనంబులు పరిహరించి యనికిం బనికివచ్చు బలంబు
లెవ్వి యనిన.

66

బలవ్యసనపరిహారవిధానము

సీ.

రిపులు మార్గము గట్ట నుపరుద్ధ మది పెర
            ద్రోవ నేతెంచిన దుర మొనర్చు
బహుమాన మొందని బల మమానిత మగు
            నది యిచ్చి మన్నించ నని యొనర్చు
నిలువఁగాఁ దాపు లేనిది శూన్యమూలమౌ
            నది తావు గల్పించ నని యొనర్చు
సభృతంబు జీతంబు నందకుండినబలం
            బదిజీత మిచ్చిన నని యొనర్చు


గీ.

నలసి యున్నఁ బరిశ్రాంత మనఁగ బరగు
నలయికలు దీర్చనదియును నని యొనర్చు
నిట్టిబలముల వ్యసనంబు లిటుల మాన్పఁ
బనికివచ్చును మగుడ భూపాలునకును.

67

సీ.

అడిగిన నీకున్న నాశచే వెతఁ జెందు
            నాశావినిర్వేది యనెడి సైన్య
మది యడిగిన దెల్ల నప్పు డొసంగిన
            నది బలంబులఁ గూర్చి యని యొనర్చు
దూష్యులతోఁ గూడ దూష్యయుక్త మటండ్రు
            తద్దూష్యులగువారిఁ దలఁగ ననిచి
యైన నాప్తులు శూరులగువారితోఁ గూర్చి
            యనికిఁ బంచిననైన నని యొనర్చు


గీ.

నధికమగునేర్పు లీరీతి నాత్మనెఱిఁగి
తనకు విజయంబు చేకూడఁ దలఁచెనేని
యిటుల బలముల వ్యసనంబు లెల్లమాన్పఁ
బనికివచ్చును మగుడి భూపాలునకును.

68


క.

బలముల వ్యసనము లీగతి
నలవునఁ దా మాన్పఁడేని యందగు పనులున్
గలుగఁగ నేరవు గావున
బలముల వ్యసనములు మాన్చు పతి జయమందున్.

69


వ.

ఇంక మిత్రవ్యసనము.

70


క.

ఇల సప్తవ్యసనంబుల
వలనం జనియించునట్టి వ్యసనంబులు వై
రులచే నొచ్చుట దైవము
వలనన్ జెడు టివ్వి మిత్రవ్యసనము లరయన్.

71


క.

మిత్రుఁడు వ్యసనము నందిన
మిత్రుఁడు చేకూర్చుపనులు మిగులగఁ జెడుఁ ద
న్మిత్రుని వ్యసనము మాన్చిన
ధాత్రీపతి యెట్టివేళఁ దా జయమందున్.

72

గీ.

ధరణి రాజ్యాంగముల యందుఁ దగులు నిట్టి
వ్యసనములు మాన్చఁగాఁ దగు నద నెఱింగి
యిటుల మాన్పక మదమున నెనయు భూమి
పాలుఁ డరిరాజుచేఁ బరాభవము సెందు.

73


వ.

ఇట్లు రాజు మొదలుగాఁ బలుకంబడిన యంగంబులకుఁ
బ్రాప్తంబులైన వ్యసనంబులలోన మొదట మొదటఁ జెప్పం
బడిన యంగంబుల వ్యసనంబులే గురుతరంబు లగుచు నుండుఁ
గావున.

74

సప్తవ్యసనవర్గప్రకరణము

క.

నరపతి దా వ్యసనంబులఁ
బొరయనిచో రాజ్యమెల్లఁ బోవగ నోపున్
నరపతి వ్యసనము చెందిన
నరయుచు రక్షింప రాజ్య మసమర్ద మగున్.

75


క.

తనసచివుని ప్రజ దుర్గం
బును భండారంబు సైన్యమును జుట్టము నెం
దును వ్యసన మందకుండగ
మనిచిన జనపతి త్రివర్గమహిమన్ జెందున్.

76


ఆ.

శాస్త్రదృష్టిలేని జననాయకుని నంధుఁ
డనుచు నంద్రు ప్రాజ్ఞులైనవారు
అంతకంటె నంధుఁ డగు చదివియును గ
ర్వమున మంచినడక వదలునతఁడు.

77


క.

జనపతి యంధుం డగుచో
ననువగు మార్గంబు మంత్రు లందింతు రిలన్
మును జదివి మత్తుఁ డైనన్
దనతోఁ గూడంగఁ బ్రకృతితతి చెడఁజేయున్.

78

క.

కావున నమాత్యమతమున
నేవలనను మెలఁగి శాస్త్రదృష్టి వెలయఁగా
దా విడువవలయు వ్యసనము
లావల ధర్మార్థహాని యడరక యుండన్.

79

సప్తవ్యసనములు

చ.

పలుకుల వెట్టి యర్థములు పారగవైచుట యెక్కు డాజ్ఞనాఁ
గలయవి క్రోధజంబులయి కన్పడుచుండు ధరాతలంబునన్
వెలఁదియు మద్యపానమును వేఁటయు జూదముఁ గామజంబులై
నలువు దలిర్చు నిట్టి వ్యసనంబులు భూపతి మానఁగాఁదగున్.

80


వ.

అది యెట్లనినను దత్ప్రకారంబు గ్రమంబున వివరించెద
వాక్పారుష్యమునకు.

81


క.

వెఱ పొసఁగి నిరర్థకమై
కఱకరి గలపలుకు బలుకగా దెవ్వరితో
మఱి పగఱను మృదువాక్యమె
మఱవక దనవారిఁ జేసి మనఁగా వలయున్.

82


క.

కారణము లేకయే వా
క్పారుష్యము వెలయుఁ గ్రోధగతిఁ బలికెడు నా
క్రూరునకు వెఱచు లోకం
బారయ మిణుగుర్లు చల్లు నగ్నింబోలెన్.

83


క.

కఱగరి బలుకును గైదువ
మెఱయుచుఁ బరమర్మభేదమే చూపినచో
గుఱుతగుఁ బ్రతాపవంతుఁడు
మఱిమఱియును దెరలికెరలి మహిఁ బగఱయగున్.

84

క.

ఇల జనులకుఁ బరుసనగాఁ
బలుకుచు వెఱపింపవలదు పతి తియ్యనిప
ల్కులె పలుకవలయు నటులం
బలికినచోఁ బేదనైనఁ బ్రజ సేవించున్.

85


క.

జగతిన్ దుర్జనసాధక
మగు నాజ్ఞయె దండ మనఁగ నగు దండంబున్
దగినయెడఁ జేయఁగాఁ దగుఁ
దగుదండము సేయఁ బతిని ధర నుతియించున్.

86


మ.

తెలియ న్వెక్కసమైన యాజ్ఞగల ధాత్రీపాలుఁ డెందుం బ్రజన్
దలఁకంజేయుఁ, దలంకుచుండు ప్రజ సంతాపంబుతో వైరులం
గలయుం, దత్ప్రజ గూడమించుసరి సంఘం బందుచేతన్‌ క్షయం
బలరుం గావున భూప్రజం దలఁకఁ జేయంగాదు భూజానికిన్.

87


క.

ప్రజలను వారించిన భూ
భుజుఁడు కడుం బ్రబలుచుండు భువి నెల్లపుడున్
ప్రజలు చెడఁ బతియుఁ జెడు నా
ప్రజలు కడుం బ్రబలఁ బతియుఁ బ్రబలుచు నుండున్.

88


క.

ఎంతటి యపరాధుల ప్రా
ణాంతకమగు నాజ్ఞ సేయు టనుచితమగు భూ
కాంతుఁడు రాజ్యముఁ జెఱచిన
హంతనె దండింపఁదగు నయస్థితి మెఱయన్.

89


వ.

అర్ధదూషణము.

90


క.

చెఱుపంగఁ దగినవారలఁ
జెఱిపెదనని కినుకఁ బ్రియముచేసిన నది తా
ధర నర్ధదూషణం బనఁ
బరగున్ నీతిజ్ఞులైన ప్రాజ్ఞులచేతన్.

91

క.

కారణము లేక కోపము
పేరినగల ధనము వెచ్చపెట్టుట కొఱగా
దారయ నాత్మ హితంబుల
నేరుపుతోఁ గోరునట్టి నృపతికి నెందున్.

92


వ.

మృగయావ్యసనము.

93


సీ.

వాహనం బెక్కుచో వచ్చిన బడలిక
            వాహనంబులఁ దోలి వడఁబడుటయు
వాహనంబులు దనవైపున రాక యొం
            డొకదిక్కుఁ జేర్చఁ జే టొదవు టెందు
నాఁకట దప్పిచే నలయుట ప్రజలకు
            నన్నపానాదిక మమరమియును
జలిగాలి యెండచేఁ గలిగినపీడలు
           ప్రతియానములచేతఁ బరగుపీడ


గీ.

కసవుచే ఱెల్లుచే వెండి యిసుకచేతఁ
జెట్లచే గట్లచే ముండ్లపట్లచేత
వేళ్ళచే నీళ్ళచే నాటవికులచేత
వెలయుపీడలు వ్యసనముల్ వేఁటలందు.

94


క.

పుట్టల మిట్టల గుట్టల
పట్టుల మఱి మోటచెట్లపట్టున నెపుడున్
బెట్టుకొను వెతలు వేఁటన్
బుట్టెడు వ్యసనంబు లండ్రు బుధు లెచ్చోటన్.

95


వ.

మఱియును.

96

సీ.

కానల నదులను గట్టుల గుహలందుఁ
             బొదలచెంతల దక్కి పొంచియుండి
కినుకతోఁ బాళెగాండ్లను దోడిదొరలను
             దను గడంగించినఁ దిగులువడుట
యెంతయుఁ గినుకతో నెడసియుండెడుఁ దన
             బలముచే దాయాదకులముచేతఁ
ద్రోవలఁ గడు మోసపోవుట మఱియును
             ద్రోవల భ్రమయుచుఁ దొట్రుపడుట


గీ.

యాది యగుదోషములు వేఁటలందు నెపుడుఁ
బొడము గావున నెప్పుడుఁ బుడమిలోన
వేఁటలాడెడితమకంబు విడువవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

97


చ.

ఎలుగులు సింగముల్ పులులు నేనుఁగులుం బెనుబాము లాదిగాఁ
గలిగినక్రూరజంతువులు గ్రమ్ము భయమ్ములు మీఱుఁ గారుచి
చ్చులు వడిఁ జుట్టికొంటయును జూపుల దిగ్భ్రమ మావహిల్లఁ దా
నలఁగుటవేఁటయందు వ్యసనంబులు రాజున కెంచి చూడఁగన్.

98


వ.

వేఁటయందు షడ్గుణములు.

99


చ.

నిలుకడ గల్గులక్ష్యములు నిల్కడలేక చలించులక్ష్యముల్
బలువిడి నేయు, టామము కఫంబును గ్రొవ్వు నడంగిపోవుటల్
మెలఁగెడువేళలన్ శ్రమము మించకయుండుట, జంతుజాతికిన్
గల భయరోషముల్ దెలియఁగల్గుట, వేఁటగుణంబు లెన్నఁగన్॥

100


వ.

ఇట్లయ్యును.

101

క.

ఇలఁ బ్రాణహారకములై
బలసినదోషములు పెక్కు ప్రాప్తించుటచేఁ
దలఁప మహావ్యసనంబై
పొలుపొందుం గాన వేఁట పోఁదగ దెందున్.

102


వ.

అయినను మఱి యొక్కతెఱంగైన సాధన మొదలైన యుచిత
క్రియలచేతనే వేఁటయందలి మంచిగుణంబులు గలుగుటకు
నుపాయంబులు గలవు గావునఁ దత్ప్రకారంబు వివరించెద.

103


సీ.

వేఁటాడగా నిచ్చ విభునకుఁ గల్గెనా
           దనపురంబునకుఁ బ్రాంతమునఁ గల్గు
మలచెంతనైన నేఱులచెంతనై నను
           దగి మృగంబుల నెందు దాఁటరాని
యగడిదఁ జుట్టిరా ననువొంది రమ్యమై
           పొదలు ముండులు గల్గు పొదలు లతలు
విషకారణములైన వృక్షబలము లేక
           జలము బచ్చికబైళ్ళు చాలఁ గల్గి


గీ.

యర్దయోజన పరిమితంబైన వెళపు
నిడుపు గల్గుచుఁ దగునట్టి యడవి యొకటి
యాప్తతతిచేత నిర్మింప నర్హ మండ్రు
వేఁట లాడెడుకొఱకు భూవిభున కెందు.

104


సీ.

కప్పుమబ్బుల యొప్పుఁ గప్పుచాయలు గల్గి
            పలుచనై కాయలుఁ బండ్లు గల్గి
భుగులు కొల్పెడి తావి పూవుగుత్తులు గల్గి
            గుఱుతు పేరెఱుగు మ్రాఁకులును గల్గి

భృంగీరసంగీతభంగీతతులు గల్గి
           శారికాకీరికాసమితి గల్గి
హరిణీకలభజాలకరిణీకులము గల్గి
           వల్లీమతల్లికావళులు గల్గి


గీ.

చాల కోఁతులు లేక మొసళ్ళు లేక
శోభితములైన కొలఁకుల చోట్లు గల్గి
మిగులఁ జెలఁగెడు వనము నిర్మింపఁజేయ
వలయు నాప్తులచేత భూవల్లభుండు.

105


సీ.

పోవఁగాఁ గొట్టిన పుట్టలు మిట్టలు
           శిలలు మొద్దులు ముండ్లచెట్లు గల్గి
నిండారఁ బూన్చిన నెఱియలు బొఱియలు
           గుంటలు గోదముల్ గొబలు గల్గి
పరిఖవెంటనె యంటి పలుదెఱంగుల తీవ
           లల్లిబిల్లిగ నిండ నల్లికొనిన
రాజితంబగు వనరాజిచేఁ జుట్టిరాఁ
           జెలువొంది వెలిని మ్రాఁకులును లేక


గీ.

మిగుల వెడలుపు చదురమై మెఱయునట్టి
భూమియును గల్గి తన శత్రుభూపతులకుఁ
జేరఁగా రాక రమ్యమై చెలఁగు వనము
బాగు సేయించవలయు భూపాలుఁ డెపుడు.

106


వ.

మఱియు నాటవికతతుల మనంబు లెఱుంగంజాలి తనకు నాప్తులుం
గ్లేశాయాససహిష్ణువులైన జనంబులచేతఁ దద్వనరక్షణంబు
సేయింపుచునుండెడి మృగయాధ్యక్షుండైన యతండు వివిధ
జాతుల మృగంబులం బట్టితెప్పించి యందు దుష్టమృగంబులైన

వానికి గోళ్ళును గోఱలును గొమ్మలునుం గొట్టించి యందు విడి
పించఁజేయవలయు నంత.

107


క.

ఇతరంబగు పని మఱువక
చతురత లివగల్గి యాప్తజనములతోడన్
బతి ప్రొద్దున వేఁటాడగ
నతిసన్నాహమున వనికి నరుగఁగవలయున్.

108


క.

జనపతి వేఁటాడగఁ ద
ద్వనసీమను జెందు నట్టితఱి నుండంగాఁ
జను నాప్తబలము ప్రాంతం
బునఁ గడు నాయత్తపాటు పొదలుచునుండన్.

109


క.

అడవుల వేఁటాడంగాఁ
దొడరెడి సద్గుణములెల్ల దొరకుం దొరకున్
బుడమిం గల్పితవనముల
యెడలనె క్రీడించు నిచ్ఛ యెసఁగినచోటన్.

110


ఆ.

వేఁటయందు నిట్టి విధము మంచిది యని
పలుకుదురు ధరిత్రిఁ బ్రాజ్ఞులెల్ల
నటులఁగాక వనికి నవనీశ్వరుండు దా
బోయరీతి వేఁట బోవరాదు.

111


వ.

జూదమునకు.

112


సీ.

ఎంత ధనంబైన నిసుమంతసేపులో
            పల నాశమౌటయుఁ బరుసదనముఁ
గోప మందుటయుఁ బల్కులచేత జగడంబు
            నాయుధంబులచేత నగు కలహము

దబ్బఱ లాడుట ధర్మముల్ చెడుటయుఁ
             జేయంగఁ దగుపనుల్ సేయలేమి
యతిలోభ మందుట యార్యుల విడచుట
             దుర్జనసంగతి దొరకుటయును


గీ.

జేటునకుఁ గారణంబులు చేకురుటయు
వైరములు చెందుటయు సిగ్గు వదలుటయును
మొదలుగాఁ గల్గు బహుదోషములను జెందు
హాళి జూదంబు లాడెడి యాతతాయి.

113


సీ.

కల యర్థములమీఁదఁ గాంక్షలు లేకుండు
            టర్థంబు లేనిచో నాశపడుట
సంతోషమును మనస్తాపంబుఁ జలమును
            గడుఁ బ్రతిక్షణమందుఁ గలుగుటయును
జలకంబు మొదలుగాఁ గలిగిన దేహర
            క్షణములయందు భోగములయందు
నాదర మించుకయైన లేకుండుట
            మెలఁగకుండుటచేతఁ గలిగినట్టి


గీ.

దుర్బలత్వంబుచేఁ జాలఁ దూలుటయును
మంచిశాస్త్రార్థముల నుపేక్షించుటయును
మొదలుగాఁ గల్గు బహుదోషములను జెందు
హాళి జూదంబు లాడెడి యాతతాయి.

114


క.

మలమూత్రనిరోధంబులఁ
గల పీడలు దప్పికొనుటఁ గల పీడలు నాఁ
కలిఁ గొనుటవలనఁ బొడమెడి
యలమటలుం జూదమాడు నతనికిఁ జెందున్.

115

సీ.

నలుఁ డేల కోల్పడి కులకాంత నడవిలో
            పల డించి తా నడబాల యయ్యె
ధర్మజుం డాలిని ధర నోడి యిలనెల్ల
            విడచి కంకుండన విరటుఁ గొల్చె
దంతవక్త్రుండును దా బలభద్రుచే
            గుఱుతుగా బండ్లూడఁగొట్టఁబడియెఁ
గుండినపుర మేలుచుండురుక్మవిభుండు
            జయము పోనాడి నాశనముఁ జెందె


గీ.

జూద మాడియె కాదె యీ జూదమెంత
వాని నైనను బ్రమయించు వాసి చెఱచు
జూదము సకలగుణములఁ జూరలాడు
జూద మెంతటివానికిఁ గాదు ధరను.

116


క.

జూద మనర్థముఁ దెచ్చుం
జూదంబున భేద మందు జుట్టఱికంబున్
జూదమున నెయ్య ముడుగున్
జూదమె పో కాని దెంచి చూడఁగఁ బతికిన్.

117


వ.

స్త్రీవ్యసనానకు.

118


సీ.

కార్యకాలంబులు గడచిపోవుటయును
           నర్థంబు ధర్మంబు నలఁచి చెడుట
యెవ్వేళ నిలువెళ్ళ నెఱుఁగని కతన స
           జ్జనులు మంత్రిజనంబు గినియుటయును
ధరణిపైఁ బక్షపాతంబునఁ జేయఁగా
           రాని కార్యంబైనఁ బూనుటయును
దాల్మి లేకుండు టెంతయుఁ గోపమందుట
           వైరంబు సాహసవర్తనంబు

ఆ.

లాదిగాఁగఁ గల్గునట్టి దోషము లెల్ల
వెలఁదివలన నెపుడుఁ గలుగుచుండు
నటులఁగాన నది మహాదోషయుక్తంబు
విభుఁడు దీనిఁ దెలిసి విడువవలయు.

119


క.

చెలువల మోములె చూచుట
కలవడి వేగిరముచెందు నల్పాత్ములకుం
గల కోర్కులెల్ల జవ్వన
ములతోడంగూడ నాశముం గనకున్నే.

120


వ.

పాపమునకు.

121


సీ.

తెలివి లేకుండుట పలుమాఱు బెగడులు
           కక్కుటయును గోక కట్టిమియును
గల్లలాడుట బందుగరిమ పోనాడుట
           తలఁపు ప్రజ్ఞయు మతి తలఁగుటయును
బనిలేనితఱి వెతఁబడుట నవ్వుటయును
           ద్రాణబాధయును దంద్రయును గనుట
సత్పురుషులతోడిసంగతి వదలుట
           దుర్జనసంగతి దొరకుటయును


గీ.

గడగడ వడంకుటయు జారిపడుట కడు న
నర్థ మొందుట స్త్రీగోష్ఠి యధికమగుట
యాదియగు దుర్గుణంబుల నందుచుండు
మద్యపానంబుఁ దగిలిన మానవుండు.

122


క.

పానవ్యసనముఁ జెందిన
మానవుఁ డెచ్చోటనైన మదమున మెలఁగున్
బానమదంబున నెచ్చో
నైన బహిష్కార మొంది యధమతఁ జెందున్.

123

క.

భృగుసముఁడను యోగీశ్వరుఁ
డగణితమతిశాలి షడ్గుణైశ్వర్యయుతుం
డగు శుక్రుఁడుఁ బానముచేఁ
దగి మదమున శిష్యవరుని దండిగఁ ద్రావెన్.

124


క.

కులమును బలమును వేదం
బులు శాస్త్రంబులును శీలమును సంపదలుం
గలవారై నను బానం
బలవడుటనె చెడరె యాదవాంధకవృష్ణుల్.

125


క.

సిరిఁ దొలఁగఁజేయు వ్యసనము
లరయంగా నేడుతెఱఁగులై యది యెపుడున్
ధర నిది యొక్కటియె నరుఁ
జెఱచు న్మఱి యిన్నిగూడఁ జెఱచుట యరుదే.

126


క.

మగువల నెంతయుఁ దగిలినఁ
దగురీతుల మద్యపానతత్పరుఁ డైనన్
దగు కొంత వేఁట జూదము
మిగులం గీడౌట విడచి మెలఁగఁగవలయున్.

127


చ.

తలఁపఁగ మిక్కిలిన్ విషయతత్పరతన్ గలిగించు లెస్సగా
నలవడువేదశాస్త్రముల నన్నిటి జారఁగఁజేయు సద్గుణం
బులను మహత్త్వముం జెఱుచు బుద్ధియుఁ బెద్దధనంబు సంపదన్
జలనము నందఁజేయును వెసన్ వ్యసనంబులు దాఁట శక్యమే.

128


క.

వ్యసనములు గలుగు నరపతి
వసుధం బసదొఱఁగు వైరివర్గముచేతన్
వ్యసనములులేని నరపతి
యసదృశగతి మెలఁగి గెలుచు నరిసంఘములన్.

129

చ.

ఇదియిది దీనికిం దగి రహించు నటంచును గోర్కె మీఱఁగా
మదిఁ దలపోసి తాఁ బ్రకృతి మండలి సత్క్రియతోడఁ గూర్చి స
మ్మదమున నీతి రీతులనె మానవనాథుఁడు దా మెలంగినన్
వదలనిగౌరవంబునఁ ద్రివర్గముఁ జెందుఁ బ్రతాపశాలియై.

130


చ.

అనుపమదాన దానయుతహస్తిలసద్బలవాహచక్రపా
లనపటుసార సారసవిలాసవిలోకన లోకనవ్యస
ద్వినుతవిహార హారరుచివిశ్రుతకీర్తినివాస వాసవా
త్యనఘమనోజ్ఞభోగ విభవానిశ బంధురబందురక్షకా.

131


క.

దీప్తోత్సాహ మహోజ్జ్వల
సప్తాంగ గుణాగుణజ్ఞ సకలదిగంత
వ్యాప్తప్రతాప పరజల
జాప్తాన్వయరామధావనాసక్తమతీ॥

132


కవిరాజవిరాజితము.

చటుల తురంగము సంక్రమణ క్రమసైన్య విరాజితసారనయో
ద్బటపటహవ్రజి దంఢణడండణ దారుణనిస్వన దారితహృ
త్పుట మదశాత్రవ ధూప ప్రతాపజ భూరివిభాసురభూధరిత
స్ఫుటవలయాచల భూనుతసద్గుణభూషణ నిత్యవిధుత్వయుతా.

133


గద్యము.

ఇది శ్రీమన్మదనగోపాలవరప్రసాదలబ్ధసారసారస్వత
భారద్వాజసగోత్ర జక్కరాజ యెఱ్ఱనామాత్యపుత్ర సుకవిజన
విధేయ శ్రీరామకృష్ణభక్తివైభవబాగధేయ వేంకటనామధేయ
ప్రణీతంబైన కామందకనీతిశాస్త్రంబను మహాప్రబంధంబునందు
నుత్సాహప్రభుశక్తియు సప్తాంగప్రయోజనంబులుఁ దద్వ్యస
నంబులు నన్నది షష్ఠాశ్వాసము.

134