ఆంధ్రకామందకము
అష్టమాశ్వాసము
క. |
శ్రీశ్రితమందిర రఘుపతి
విశ్రుతగుణవినుతిచతుర విమలరుచియశో
మిశ్రితలోక సుధీనిక
రాశ్రయ కొండ్రాజువెంకటాద్రినరేంద్రా.
| 1
|
సేనావివరము
ఆ. వె. |
సామధానభేదసరణులు శాత్రవ
వరులయెడల నడపవలయు వరుస
నందుఁ జక్కఁగానియపుడు దండోపాయ
శక్తిఁ జూపవలయు జనవిభుండు.
| 3
|
చ. |
తనకుఁ బ్రసన్నభావమునఁ దారకలుం గ్రహముల్ చరింపుచో
వినయముతోడ దేవతల విప్రులఁ బూజలు సేసి సంతసం
బెనయఁగ నాఱుచందముల నెన్నికకెక్కుబలంబులం గ్రమం
బున నడపింపుచున్ గదలి పోఁదగు భూపతి శత్రుమీఁదటన్.
| 4
|
షడ్విధబలప్రకారము
సీ. |
కైజీతమగు మూఁకకంటెను గల్మిలే
ములకు లోనగుప్రాఁతమూఁక మేలు
కూటంబుకంటె నెక్కుడు స్వామివశమైన
జీతంబుఁ జెందు కైజీతగాండ్రు
|
|
|
మిత్రసైన్యముకంటె మేలగుఁ దనసీమ
సమసుఖం బొందు కూటములమూఁక
శత్రుసైన్యముకంటె మిత్రసైన్యము మంచి
దేకార్ధమతి నెయ్య మొనయుకతన
|
|
ఆ. |
మిగులఁ జెడుగు లగుచు మెలఁగి నిల్కడలేని
యడవిమూఁకకంటె నరయ మేలు
శత్రుసైన్య మిట్టిచందంబు బలముల
తారతమ్య మెఱుఁగఁ దగు విభుండు.
| 5
|
వ. |
అది యెట్లనినను మఱియు విభునిచేత సత్కారంబులు చెందుట,
యతనియం దనురాగంబు గలిగియుండుట, సహాలాపంబులు
గలిగి వర్తించుట, బహుకాలంబుననుండి యతనితోడంగూడి
కలిమిలేములకు సుఖదుఃఖంబులకు లోనైనవారగుటం జేసి
ప్రాఁతవారలు కైజీతంబుమూఁకలకంటెను మేలు. ఆసన్న
వర్తులై యుండుచుఁ జెప్పినపని జెప్పినట్ల సేయుచుండుకతనను
తమజీవనంబులు భూవిభునియధీనంబు లగుటం జేసి కైజీతంపు
మూఁక కూటపుమూఁక కంటెను మేలు. సమంబుగా సంతోష
రోషంబులం జెందుట విభునకు సుఖంబు గలిగినం దామును
సుఖవృత్తిఁ జెందుట, యతనిదేశంబుననే నిచ్చలు మెలంగుటం
జేసి కూటపుమూఁకలు మిత్రబలంబుకంటెను మేలు. సమంబుగా
దేశకాలంబుల నొనఁగూడి వర్తించుట, యిరువురు నేకప్రయో
జనంబున నాసక్తి మెలంగుట, పరస్పరస్నేహంబు గలుగుటం
జేసి శత్రుబలంబుకంటె మిత్రబలంబు మేలు. స్వభావంబున
ధర్మపరులై పరధనంబులయందె లోభంబు గలవారై దుర్జనులై
మాటపట్టుఁ దప్పెడివారలైన యడవిమూఁకలకంటెను దను
గొల్చు శత్రుబలంబులె మే లిదియునుం గాక.
| 6
|
సీ. |
అరిబలంబులు మఱి యాటవికులు విభు
సీమఁ దా మెప్పుడు జెఱుతు మంచు
నదను గోరుకయుండునట్టివారగుటను
దండయాత్రలు గల్గుతఱిని దెలిసి
తనవెంట వీరిఁ దోడ్కొని పోవఁగాఁ దగు
నటులఁగాకున్న రాజ్యంబు నెల్ల
జెఱుపుచుండుదు రందుచే శత్రువులకును
జయము నిశ్చయ మెట్టి సరవినైన
|
|
గీ. |
నదియుఁ గాకున్నచో భేదమైనఁ గలుగుఁ
గావునను దండయాత్రలు గదలు నపుడు
వారివెంటనె తొడుకపోవలయు నెందు
దండయాత్రావిధిజ్ఞుఁడౌ ధరణివిభుఁడు.
| 7
|
వ. |
ఇట్టి షడ్విధబలంబుల చందంబు లెఱింగి దండు గదలునప్పుడు
విభుండు దనవెంటనే తోడుకపోవుటవిధం బెట్లనినను దత్ప్రకారంబు
గ్రమంబున వివరించెద.
| 8
|
సీ. |
వ్యయమును దడవును క్షయమును గలయాత్ర
తనమూలబలముతోఁ జనగవలయుఁ
దడవును నాశంబుఁ దగులనియదియైనఁ
గైజీతములతోడఁ గదలవలయు
నరిమూఁక కడుఁగొంచెమై తడ వందని
యెడఁ గూటములతోడ నెత్తవలయుఁ
దనకు లోనై ఫలం బొనగూర్చుమిత్రుతో
సమకార్యములయందె చనఁగవలయు
|
|
గీ |
దుర్గములచెంతఁ గంటకాదులకు నెదుర
శత్రుబలములు మున్నుగాఁ జనగవలయు
|
|
|
నరులభూములఁ జొచ్చుచో నడవులందు
నాటవికసేనతోఁ జన నర్హ మండ్రు.
| 9
|
సీ. |
కడుదేవ యనురక్తి గలిగిన ప్రాఁతమూఁ
కలఁ జెంది శత్రుండు బలిసి యున్న
నతనికి సమబలంబై యుండునట్లుగా
క్షయము వ్యయంబును జాల నోర్చు
ప్రాఁతమూఁకలఁ గూడి పైనెత్తఁగాఁ దగుఁ
గడుదూరమగుఁ ద్రోవ గలదియైన
దడవువట్టెడు నట్టిదండైనఁ దనచేత
బహుమాన మొందినప్రాఁతమూఁక
|
|
గీ. |
లిలఁ గడలజెంది యాజికి నిలుచుఁగాన
ప్రాఁతమూఁకలె ఘనమైనబలముతోడ
వైరిమీఁదట దండెత్తవలయు నెందు
దండయాత్రావిధిజ్ఞుఁడౌ ధరణివిభుఁడు.
| 11
|
సీ. |
తడవు పట్టెడునట్టి దండైన మిగులంగ
దండఁగల్గినయట్టిదండునందు
బలములు బహువిధంబుల నుండు కతమున
వ్యయము క్షయం బోర్వనట్టి కతన
గమనప్రయాసము గల్గినకతమునఁ
దనప్రాఁతమూఁకలు దక్క నితర
బలములయం దెల్లఁ గలుగును భేదంబు
లటుగాన నిట్టిచో నన్యమైన
|
|
గీ. |
బలము నమ్మక నమ్మిక గలిగి కలిసి
బలిసి వర్తించు ప్రాఁతమూఁకలనె కూడి
|
|
|
వైరిమీఁదట దండెత్తవలయు నెందు
దండయాత్రావిధిజ్ఞుఁడౌ ధరణివిభుఁడు.
| 12
|
సీ. |
కదనంబులకు నోర్చుకై జీతమగుమూఁక
ఘనముగాఁ దనకును గలిగెనేని
తనప్రాఁతమూఁక లెంతయుఁ గొంచెమై బల్మి
కొనఁగూడఁగా లేక యుండెనేని
పగతు మూలబలంబు మిగులంగఁ గొంచెమై
చేవయు బలిమియుఁ జెందరేని
యతనిచేఁ గైజీత మందెడి మూఁకయు
నల్పమై యనురాగ మందెనేని
|
|
గీ. |
చాలఁ గల్గియు నని సేయఁ జాలదేని
యపుడు కైజీత మొందు సైన్యంబుఁ గూడి
వైరిమీఁదట దండెత్తవలయు నెందు
దండయాత్రావిధిజ్ఞుఁడౌ ధరణివిభుఁడు.
| 13
|
సీ. |
కడుఁదడవందక కనుపట్టు దండైన
నరయు దూరముగాని యట్టిదైన
నెవ్వేళ నమ్మిక నెనసి చేకూడుచుఁ
దనమూఁక భేదంబుఁ గనకయున్న
నసమర్థభావంబు నందుచు నరిరాజు
దన కెందు లోకువై దనరియున్న
నప్రయాసమున మంత్రాజులచే గెల్పు
దనకుఁ గల్గెడు లీలఁ దనరియున్న
|
|
గీ. |
క్షయము వ్యయమును మిగులంగఁ గలుగదేని
యపుడు కైజీతమైన సైన్యంబుతోడ
|
|
|
వైరిమీఁదట దండెత్తవలయు నెందు
దండయాత్రావిధిజ్ఞుఁడౌ ధరణివిభుఁడు.
| 14
|
సీ. |
కడు నధికంబుగాఁ గలిగిన యదియైనఁ
దనవెంటఁ దొడుకపో నొనరెనేని
చెలఁగుచు బడలికల్ చెందని యదియైన
బహుముఖంబులుగాక పరగియున్న
చేరువదండైన చేకొద్దియై కార్య
మప్రయాసంబున నగుచునున్న
శత్రుఁడు కొంచెపుసైన్యంబుతో నున్న
నేమరుపాటున నెసఁగియున్న
|
|
గీ. |
నెట్టిచోటున మోసంబు నెనయకుండు
జాడఁ గూటపుమూఁకలతోడఁ గూడి
వైరిమూఁకల దండెత్త వలయు నెందు
దండయాత్రావిధిజ్ఞుఁడౌ ధరణివిభుఁడు.
| 16
|
సీ. |
తనమిత్రసైన్యంబు ఘనమైనయదియైన
ననికిఁ దెచ్చుటకుఁ దా నర్హమైనఁ
దడవుగాకుండెడి దండైనమాత్రంబు
వలననే దాడియుఁ గలహములును
దఱచుగా గలుగక తనకుఁ జేకూడిన
కార్యంబు సమమైనఁ గలుగు ఫలము
మిత్రునధీనమై మెఱసి చేరెడిదైన
నరిసీమ చెఱిపెడు నట్టిదైనఁ
|
|
గీ. |
బగఱచేతను గానుకల్ పట్టి మగుడు
నట్టిదైనను మిత్రసైన్యంబుఁ గూడి
వైరిమీఁదట దండెత్తవలయు నెందు
దండయాత్రావిధిజ్ఞుఁడౌ ధరణివిభుఁడు.
| 18
|
సీ. |
కుక్కక్రొవ్వునుఁ బందిక్రొవ్వుఁ గోరెడు బోయ
వెసఁ గుక్కఁ బందిపై విడిచినట్లు
తనుఁ గొల్వవచ్చు శాత్రవులసైన్యంబులఁ
బగవారిపైఁ బోరఁ బంపవలయు
నదిగాక వారు బాహ్యంబైన కోపంబు
సేసినచోఁ దనచేరువలనె
నిలుపఁగాఁ దగుఁ జెంత నిలిచిన నాంతర
కోపంబు బుట్టింప గుట్టు దెలిసి
|
|
తే. |
యపుడు గనుమలలోపల నడవులందు
గలుగునల కంటకాదుల గదుమఁ బనిచి
వారిచేతనె నొప్పించవలయు నెందు
దండయాత్రావిధిజ్ఞుఁడౌ ధరణివిభుఁడు.
| 19
|
క. |
కనుమలఁ గంటకతతులం
బనివడి శోధించునపుడు బరసీమలకుం
జనునప్పు డడవిమూఁకను
దనసేనకు మునుపె పనుపఁ దగు జనపతికిన్.
| 20
|
వ. |
ఇట్లు చెప్పిన షడ్విధబలంబులును రథగజతురగపదాతులతోడం
గూడఁ బ్రత్యేకంబులుగాఁ జతురంగబలంబు లగుచునుండు.
కలసన్నాహంబుల నిదియ కోశమంత్రంబులతోడం గూడి
షడంగంబు లనం బరగుచునుండు. నిట్టిబలంబుల చందంబు
|
|
|
లిన్నియు మనంబున నిశ్చయింపుచు వైరియోధతతికిం దగినట్లు
ప్రతివ్యూహంబులు గల్పించు విజిగీషువైనరాజు దండయాత్ర
గదలందగు నందు.
| 21
|
క. |
బలముల సేనాపతియును
జెలు వలరగఁ జేయుపనులు జేయని పనులుం
దెలియం దగు వారలకుం
గల సన్నాహంబు లెఱుఁగఁగాఁ దగుఁ బతికిన్.
| 22
|
సేనాపతిప్రభావము
సీ. |
కులజుఁడై తనసీమ నెళవరియై తగి
మంత్రిసమ్మతుఁడునై మంత్ర మెఱిఁగి
దండనీతి యొకింతఁ దప్పక యుండంగఁ
జదివి ప్రయోగించుచంద మెఱిఁగి
నిజము సత్త్వము నోర్పు నిలుకడయును గల్గి
మాధుర్యగుణగణమహిమఁ జెంది
తనరుప్రభావ ముత్సాహసంపదఁ గల్గి
తను గొల్చువారి కాధార మగుచు
|
|
గీ. |
నెందు నధికుల మిత్రుల పొందుఁ గల్గి
చాల దాయాదులును బంధుజనులు గల్గి
యన్నివ్యవహారములు నేర్చి యెన్నఁగలుగు
ఘనుని దళవాయిగాఁ జేయఁ జనును బతికి.
| 24
|
సీ. |
రాజ్యాంగములకుఁ బురంబువారలకును
సమ్మతుండై మించి చాలఁ జదివి
కారణంబులు లేని కలహంబులకుఁ బోక
కలఁగక శుభకర్మకలితుఁ డగుచు
|
|
|
నెందును మోసంబుఁ జెందక శూరుఁడై
వ్యాధులఁ బొరయక త్యాగియగుచు
కడుమంచిపనిఁ బూనఁ గలిగి కాల మెఱింగి
సజ్జను లెల్లను జాల మెచ్చు
|
|
గీ. |
విక్రమముచేత నెంతయు వినుతి కెక్కి
బడలికల గెల్చి తేరుల భద్రకరుల
నశ్వముల నెక్కునేర్పుల నలరి మించు
ఘనుని దళవాయిగాఁ జేయఁ జనును బతికి.
| 25
|
సీ. |
మల్లయుద్ధములందు మఱి కైదువులఁ జేయు
జగడంబులందును జడుపు లేక
కడువేగదాఁటి పైఁబడెడు వీఁక లెఱింగి
బవరంపునేల లేర్పఱుప నేర్చి
సింహవిక్రమమునఁ జెలఁగి యాలస్యంపుఁ
బనివాఁడుఁ గాక కోపంబుఁ గలిగి
జాడ్యంబు నొందక చాల నుద్ధతి లేక
యెపుడు జనాంతరం బెఱుఁగ నేర్చి
|
|
గీ. |
కరితురగరథచయములఁ గైదువులను
గలుగు లక్షణములు లెస్సఁగా నెఱింగి
చక్కదనమునఁ జెలువొందు చతురుఁడైన
ఘనుని దళవాయిగాఁ జేయఁ జనును బతికి.
| 26
|
సీ. |
మే లెఱుంగఁగ నేర్చి చాలంగ దయఁ గల్గి
నేర్పరులను గూడి నేర్పుఁ జెంది
జోదులు ధరియించు జోక లెల్ల నెఱింగి
యన్ని యుద్ధమ్ముల యను వెఱింగి
|
|
|
జగడంపు సవరణచందంబు లెఱుఁగుచుఁ
గరులచిత్తంబులు నరులమనసు
హయములహృదయంబు లనువొంద నెఱుఁగుచు
వానిగుర్తులఁ బేరువరుస నెఱిఁగి
|
|
గీ. |
వాని బనిగొనునేర్పులు దా నెఱింగి
సకలదేశస్వభావముల్ సకలరిపులు
సకలభాషల నెఱుఁగుచు సరసుఁడైన
ఘనుని దళవాయిగాఁ జేయఁ జనును బతికి.
| 27
|
సీ. |
మఱపును వెఱపును మది నెఱుంగక రేయిఁ
జరియింపఁగా నేర్చి శకునగతుల
నరవులు దెలిసి నక్షత్రగ్రహంబుల
యస్తమయం బుదయంబు నెఱిఁగి
దిక్కులు దేశముల్ దెఱువులు నెఱుఁగుచు
వాని నెఱింగినవారి నేలి
యధికభయార్తుల కభయంబు లిచ్చి
గాలికి వాన కాఁకలికి నోర్చి
|
|
గీ. |
దప్పిదగలకు నెండకుఁ దాళఁగలిగి
మిగుల దూరంబు పయనముల్ మెలఁగ నొప్పి
పరులమూఁకలఁ జీకాకు పఱుప నేర్చు
ఘనుని దళవాయిగాఁ జేయఁ జనును బతికి.
| 28
|
సీ. |
కడు నసాధ్యంబులై కనుపట్టు పనులైన
సాధించునేర్పు నిశ్చయముఁ గల్గి
తనమూఁక విఱిగిన ననికి నిల్వఁగ నేర్చి
గగ్గోలు జగడంబుగతు లెఱింగి
|
|
|
బలములు గావించు పను లెఱుంగఁగ నేర్చి
పరుల దూతలచర్య లరయ నేర్చి
ఘనమైనయుద్యోగ మొనరించి వేగమె
యందు ఫలంబులఁ జెంద నేర్చి
|
|
గీ. |
పట్టి యీడేర్చుకొనునట్టి పనులు గల్గి
యటుల మెలఁగెడువారల నరసి నిలిపి
పరిభవంబైనయెడఁ గ్లేశపడక యుండు
ఘనుని దళవాయిగాఁ జేయ జనును బతికి.
| 29
|
ఆ. |
ఇట్టి లక్షణముల నెంతయుఁ జెలువొంది
పతిహితంబునందె భక్తి గల్గి
చెలఁగు సంపదలను జేకూర్సు ఘను దళ
వాయిఁ జేయ మెలపవలయుఁ బతికి.
| 30
|
చ. |
ఎడయక రాత్రులుం బవలు నెచ్చరికం దళవాయి యేఱులం
దడవులఁ గొండలం గడుభయంకరమై తగు దుర్గసీమఁ ద
ల్లడపడకుండునట్లుగ బలంబుల వ్యూహ మొనర్చి తానె యె
క్కుడుజతనంబునన్ మెలఁగి కూడుచు సేనలఁ గావఁగాఁదగున్.
| 31
|
ప్రయాణవ్యసనరక్షణప్రకరణము
సీ. |
మేటియౌ నొకదొర మిక్కిలి శౌర్యంబు
గలమూఁకతో మున్నుఁ గదలవలయు
రమణీసమూహంబు రాజుభండారంబు
చదలంబునడుముగాఁ జనగవలయు
వానికి రెండుపార్శ్వములందు హయములు
హయములపజ్జల నరదములును
వానిపార్శ్వంబుల నేనుగుల్ వానిపా
ర్శ్వంబుల గదియంగ వనబలంబు
|
|
గీ. |
లరుగవలయును వీరల కన్నిటికిని
వెనుక దళవాయి బడలినజనముఁ దేర్చి
కొనుచు నాయత్తపాటుతోఁ జనఁగఁ జేయ
వలయు దండెత్తునట్టి భూవల్లభుండు.
| 32
|
సీ. |
భయము ముందర గల్గఁ బటుమకరవ్యూహ
ముననైన ఱెక్కలు దనర విచ్చి
రహి మించునట్టి గృధ్రవ్యూహముననైన
వీరముఖంబైన తీరుబడిన
సూచికావ్యూహంబు సూటిచేనైనను
బలముల నడిపింప వలయుఁ దెలిసి
భయము పిఱుందనౌ పట్టున శకటరూ
పంబున మఱి పార్శ్వభయములందు
|
|
గీ. |
నలరు వజ్రాయుధమురీతి నన్నిదిశల
భయము గల్గిన సర్వతోభద్రరీతి
బలము వ్యూహంబుగాఁ బన్ని బలవిభుండు
నడువగాఁ జేయవలయు యత్నంబుతోడ.
| 33
|
సీ. |
గుహలందు నెఱులందుఁ గొండల నదిత్రోవ
నడవుల నిఱుకటమైన యెడల
బడలిన నాకొన్నఁ గడు దప్పిఁజెందినఁ
గఱవుచేఁ దెవులుచేఁ గలిగియున్న
దొంగలు మారియుఁ దోలుక తిరిగిన
నడుసు నీళ్ళును ధూళి యలముకొనినఁ
జెదరిన సందడిఁ జెందిన నిద్దుర
నందినయెదఁ గూడి హాళినున్న
|
|
గీ. |
కొంచెమైనను సవరణ గూడకున్న
గాలివానల నగ్నులఁ దూలియున్నఁ
దనదు సైన్యంబు రక్షించుకొనఁగవలయు
శత్రుసైన్యంబు లటులున్న జడుపవలయు.
| 35
|
గీ. |
దేశకాలవిశేషముల్ దెలిసి యరుల
బలము భేదంబు నందించి బలసి చెలఁగు
బలియునకుఁ గూటయుద్ధంబు గలుగదేని
యేయెడఁ బ్రకాశయుద్ధంబు చేయవలయు.
| 36
|
క. |
అడవులు గనుమలు మొదలగుఁ
గడు నిఱుకటమైనచోట్లఁ గళవళపడుచుం
డెడి శత్రుఁ దునుమవలయును
విడువక గగ్గోలు పడెడివేళలయందున్.
| 37
|
కూటయుద్ధప్రకారము
సీ. |
అహితుండు పోట్లాడ ననువైనచోటుఁ దాఁ
గైకొని యచ్చోటఁ గదలకున్న
నతనిమంత్రులు మొదలయిన వారల భేద
మొందించి యచ్చోట నునుకిఁ జెఱచి
యైన నాటవికసైన్యంబు పేరిటిత్రాళ్ళ
చేఁ జుట్టి పోరికిఁ జెదరఁదీసి
తనమూఁక విఱిగిన యనువున నలయించు
కొనివచ్చి యొకయిఱుకునకుఁ దెచ్చి
|
|
గీ. |
వలనెఱుఁగు వీరభటులకు నెలవుఁ బెట్టి
చేరి చుట్టుక జగడంబు చేసియైనఁ
గూటయుద్ధంబుచే శత్రుఁ గూల్పవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.
| 38
|
సీ. |
జనపతిముందరఁ గనుపట్టుగా నిల్చి
తన కెదు రెక్కుశాత్రవునిమీఁద
వెనుకచక్కికి మేటివీరయోధుల నంపి
పొడిపించి స్రుక్కించి కెడపియైనఁ
గాక పిఱిందిభాగంబున మొనసూపి
ముందర నలయించి మొత్తియైన
నీకటి ప్రక్కఁ దా నెదిరించి శూరుల
నవ్వలి ప్రక్కది క్కంపియైన
|
|
గీ. |
నటుల నవ్వలిపార్శ్వంబులందు మొనపి
యివ్వలికి శూరతతి నంపి యెంచియైనఁ
గూటయుద్ధంబుచే శత్రుఁ గూల్పవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.
| 39
|
సీ. |
మును చక్కి విషమమై మొనుపరాకుండిన
వెనుకటిదిక్కునఁ జెనకియైన
వెనుచక్కి మునుచక్కి మొనుపరాకుండినఁ
దొడరి ప్రక్కలఁ జేరి పొడచియైన
నదిగాక మఱి తన యడవిమూఁకల శత్రు
బలముల దూష్యులఁ బనిచి మొదట
జగడంబు చేయించి మిగులఁ దా బడలించి
సన్నమై కూఁతలు నడలియున్న
|
|
గీ. |
వైరితతిమీఁదఁ బడుచును వాహనములు
గలఁగఁ దనరౌతులను బంపి కడిమియైనఁ
గూటయుద్ధంబుచే శత్రుఁ గూల్పవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.
| 40
|
సీ. |
దూష్యుల నరిమూఁకఁ దొలుదొల్త నళికించి
విఱిగి రా నళికించి విఱిగి రనుచు
విశ్వాసమునఁ జెంది విమతు నేమరినచోఁ
దనదు బల్మి చెలంగఁ దరిమియైనఁ
బాదంబు దిగుచోటఁ బట్టణంబులచోటఁ
బైరుల నూళ్ళను బ్రజలయందు
గొల్లకాసులు చూపి గొల్లలు చాలఁగాఁ
బట్టినచోఁ జుట్టు ముట్టియైన
|
|
గీ. |
వేఁటలాడంగ నడవికి వెడలి బడలి
యుండుతఱిఁ జుట్టు ముట్టి చెండియైనఁ
గూటయుద్ధంబుచే శత్రుఁ గూల్పవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.
| 41
|
సీ. |
మునుపుగా నొకకొద్ది మూఁకల మొన సేసి
కడు గట్టి మూఁకలకడను దాఁచ
నరిమూఁక సరకుసేయక మీఱి గర్వించి
తనమూఁకపైఁ బేర్చి యని యొనర్ప
మునుపు తాదాఁచిన మూకఁచే శత్రులఁ
జేరి చుట్టుక నొంపఁజేసి యైన
నదిగాక పగవారి యావులఁ బట్టించి
వార లందుకుఁ గూయవచ్చుచోట
|
|
గీ. |
నడుమతెరువున నరికట్టి నడికియుండి
కడిమిమై చుట్టుముట్టుక పొడిచియైనఁ
గూటయుద్ధంబుచే శత్రులఁ గూల్పవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.
| 42
|
సీ. |
గగ్గోలుచే భీతి గలిగి రాత్రులయందు
నిద్రఁ గానక పగల్ నిద్రఁ జెంది
యలసి యేమఱినచో నదరిపాటుననైనఁ
బగ లెల్ల నాయత్తపాటు చెంది
బడలినచోట మాపటిజామునందైన
నడురేయిఁ గడునిద్ర దొడరువేళ
రేతిరిజగడంబురీతి దా నెఱుఁగుచుఁ
బలుజోళ్ళు కొమ్ముకత్తులును గల్గి
|
|
గీ. |
కరులచేనైన వేగంబు గలిగినట్టి
శూరతతిచేతనై నను జుట్టుముట్టి
కూటయుద్ధంబుచే శత్రుఁ గూల్పవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.
| 43
|
సీ. |
ఎండకు గాలికి నెదురెక్కి కనుమోడ్చి
సుడివడి తడఁబడుచోటనైన
నదిగాక క్షుద్రంబు లగునట్టియడవుల
మంచున మబ్బుల మలలఁ బొదల
వాఁగుల వ్రంతలఁ దీఁగెల గుంతల
ఱాల నేఱులను బోరానియిఱుకు
తెరవుల నరికట్టి తిరుగువారుచునైన
మిగులఁ దా నచ్ఛిద్రుఁ డగుచు మించి
|
|
గీ. |
యదనుఁ జేకొని పైఁబడి చదిపి యైనఁ
బదరి తనమూఁక బడలిక పడఁగనీక
కూటయుద్ధంబుచే శత్రుఁ గూల్పవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.
| 44
|
గీ. |
ప్రాణములయందుఁ గడు నాసపాటులేక
విఱిగిఁ లజ్జించి తిరిగిన వీరవరుడు
మొక్కలంబునఁ బైఁబడి మొత్తుఁగాన
మిగులవిఱిగినఁ దఱుమగాఁ దగదు పతికి.
| 45
|
గీ. |
ఇటులఁ గపటంబు జగడంబు లెఱిగెనేని
గడు ననాయాసమున గెల్పు గల్గుచుండుఁ
గాన భూమీశుఁడగువాఁడు గపటయుద్ధ
సరణిచేతనే శత్రులఁ జదుపవలయు.
| 48
|
క. |
వెచ్చము నాయము సమమై
వచ్చిన స్థానంబు మఱియు వ్యయ మధికంబై
వచ్చిన క్షయ మం దాయమె
హెచ్చిన నది వృద్ధి దీని నెఱుఁగఁగ వలయున్.
| 48
|
మ. |
దొర యుత్సాహము గల్గి మోసగతు లెందుం జెందఁగానీక యే
సరణిన్ వైరుల గెల్చునట్లు రిపులన్ సాధింతునన్ శంకఁ దా
నిరతంబున్ మది నిల్పి చారతతిచే నేర్పుల్ పగన్ శత్రులం
దరయంగాఁదగు సర్వకార్యములు నూహాపోహసన్నాహియై.
| 49
|
ఉ. |
మోసపుపోరిచే రిపులమూఁక నవశ్యము నొంచఁగా నగున్
వేసటలేక యుండుపృధివీపతి యీగతి శత్రు గెల్చుటల్
దోసము గాదు మున్నిటుల ద్రోణసుతుండును ద్రౌపదేయులం
బ్రాసముఁ బూని యేమఱినపట్టున నొంపఁడె నిద్రవేళలన్.
| 50
|
చతురంగబలప్రయోజనప్రకారము - గజకర్మ
సీ. |
దండయాత్రలను ముందరఁ గాఁగ నడచుట
వనదుర్గములు చొచ్చి చనుట మఱియుఁ
దెఱుపులు లేనిచోఁ దెఱుపులు వెట్టుట
కొలఁకుల నదుల లోఁతులును దెలిసి
బలసమూహంబుల జలముఁ దాటించుట
యసహాయగతి జయ మందుటయును
జొరరాని మూఁకలఁ జొచ్చి భేదించుట
పేర్చి వేఁగినమూఁకఁ గూర్చికొనుట
|
|
గీ. |
పొడవుల వెఱపుచూపుట పొడవులైన
కోటలును గోటవాకిళ్ళు గూల్చుటయును
జాల భండారములు మోపఁ జాలుటయును
భయము దీర్చుట గజముల పను లటండ్రు.
| 51
|
రథకర్మ
క. |
తనసేనల రక్షించుట
యనిఁ జెదరినఁ గూర్చికొనుట యరిసేనలు దా
కొనియుండిన భేదించుట
యును నరికట్టుటయు రథము లొనరించుపనుల్॥
| 52
|
అశ్వకర్మ
సీ. |
కొండలదండ దిక్కుల మార్గములయందు
విమతులమూఁకల వెదకుటయును
ధాన్యాదులను మిత్రతతుల రాఁ జేయుట
వేగంపుఁబనులు గావించుటయును
|
|
|
బరుల వెంటాడుట తిరుగుచో విఱుగుట
విఱిగియుఁ గ్రమ్మఱ వెంటఁబడుట
మునుచక్కి నడుచక్కిఁ వెనుచక్కిఁ బ్రక్కల
పొదివి పొంకమెఱింగి పొడుచుటయును
|
|
గీ. |
వైరి యచ్చాళువై మీఱి పోర జుణిఁగి
పోయి పాళెంబుపైఁ బడి పొడచుటయును
దీను లగువారిఁ దోడ్కొని తెచ్చుటయును
దాడి వెడలుట గుఱ్ఱపుదళముపనులు.
| 53
|
పదాతికర్మ
సీ. |
ఎపుడుఁ గైదువులు దా మేమఱకుండుట
త్రోవల బావుల రేవులందు
నేఱుల విడిదలయెడఁ గపటంబులు
దెలియుచుఁ దిరిగి శోధించుటయును
దృణకాష్ఠజలములు దెచ్చుచోటులయందు
మిగుల నెచ్చరికతో మెలఁగుటయును
రేలును బగలు భూపాలుఁ గాపాడుట
చెప్పిన యట్లనె చేయుటయును
|
|
గీ. |
నివియ మొదలుగఁ గలిగిన యిట్టి వెల్ల
బలము బొనరించు పను లండ్రు తెలిసి చూడ
నిటులఁ జతురంగములపను లెఱుఁగవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.
| 54
|
సీ. |
మంచిజాతియుఁ బరిమాణంబు వేగంబు
స్థానంబు వయసును సర్వములును
నిలుకడ పనులందు నేర్పును దేజంబు
చెప్పినకైవడిఁ జేయుటయును
|
|
|
ఘనతయు భద్రలక్షణముల నాయువుఁ
గలిగి యెన్నికమీఱ మెలఁగుటయును
గుఱ్ఱంబులకు నేనుఁగులకును మఱియును
గాలిమందికిని లక్షణము లెందు
|
|
గీ. |
నిటుల బలముల లక్షణం బెఱిఁగి యెపుడు
వాని వానికిఁ జేయఁగా వలయు పనుల
యందు నియమింపఁగాఁ దగు హరువు లెఱిఁగి
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.
| 55
|
గీ. |
గుంటలను మిట్టలను జెట్ల గొప్పఱాళ్ళఁ
బుట్టలను మోటుచెట్టులు బొదలు గల్గి
మెలఁగఁగా వచ్చి ముండులు గలుగదేని
కాలిమూఁకల ననిసేయు నేల యండ్రు.
| 57
|
వాజిభూమి
క. |
జలమును నడుసును నెఱియలు
గలుగక మ్రాకులును ఱాలుఁగడు లేక సమ
స్థలమై మెలఁగన్ వచ్చుచు
నలరిన గుఱ్ఱములనేల యగు నండ్రు బుధుల్.
| 58
|
రథభూమి
సీ. |
ఇసుకలు మొద్దులు నెందెందె యుండక
బలుగుండ్లు నడుసు గుంటలును లేక
చేలును మళ్ళును జెట్లుఁ దీగలు లేక
గుంతలుఁ బొదలు వాఁగులును లేక
|
|
|
నెఱియలు నొడ్డులు బొఱియ లేమియు లేక
వడి దాఁట గొరిపెతాఁకుడుల కోర్చి
కడుగట్టియై బండికండులు గలఁగక
చదరమై మిగుల విశాల మగుచు
|
|
గీ. |
నిగుడ మగుడంగఁ దగునట్టినేలలందు
నరదములు జగడముసేయ నమరుచుండు
నిట్టిజగడంపునేలల నెఱుఁగవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.
| 59
|
నాగభూమి
సీ. |
తివిచివేయఁగవచ్చుతీవియల్ గలయది
పట్టి విఱువవచ్చుచెట్టు గలది
యిసుకలు నసలును నెసఁగనియదియును
సేనల కెందు రాఁబోనియదియు
ఘనములై కనుపట్టు గట్టులు గలయది
కడు గుంట మిట్టలు గలుగునదియు
గలయంగ నుడుగువేరులు గలయదియును
ననిసేయఁ గరులకు నర్హమైన
|
|
గీ. |
నేల యదిగాక యెటువంటి నేలయైనఁ
గరుల కగు వాని కెందు నగమ్యభూమి
గలుగకుండుట గాదె నాగంబు లయ్యె
నిట్టిభూముల నరవరుఁ డెఱుఁగవలయు.
| 60
|
సీ. |
అనిమొన విఱిగినయశ్వాదిబలముల
నిలుపఁగా నోపుచు బలము రాజు
వెనుకదిక్కందు నిల్చిన ప్రతిగ్రహ మందు
రదియు నిన్నూఱువిండ్లంతదవ్వు
|
|
|
గలిగిన వెనుచక్కి నిలుకడగా నిల్చి
జగడంబు సేయింప జయము గల్గు
నటువలె లేకయ యనిసేయు నేబలం
బదియ వీఁగినబలం బనఁగ బరగు
|
|
గీ. |
నిట్లు గావున జగడంబు లెఱుఁగురాజు
వెనుకదిక్కునఁ దా నిల్చి విఱిగి వచ్చు
వారిఁ గడు నాదుకొని నిల్పవలయు నెందు
వెనుక ననిలేక పోరు గావింపరాదు.
| 61
|
వానకల్పనప్రకరణము
మ. |
కరియూధంబుల మీఁదఁ బెట్టుకొని వేగం బొప్పుతేజీల నం
దరయ న్నల్గదఁ గాపుగా నిలిపి యోగ్యంబైన యత్నంబుతో
నరనాథుం డెట నిల్చు నచ్చటనె భండారంబును న్నిల్పఁగాఁ
బరగున్ రాచఱికంబు నిల్పు నదిగా భండార మెందుం ధరన్.
| 62
|
క. |
తొలుదొలుతఁ బొడిచి గెలిచిన
భళి భళి యని పిలిచి యొసఁగఁ బతి కగు నీవుల్
గలిగిన నెవ్వఁడు బొడువఁడు
చలమునఁ బై కుఱికి శత్రుసంఘముల నిలన్.
| 63
|
సీ. |
పోరిలోఁ బగరాజుఁ బొడిచినవానికి
దాక్షిణ్య మొనరఁగా లక్షసంఖ్య
నతనికుమారుని నతనిసేనాపతి
నైనఁ జంపినవాని కందుసగము
శత్రుసేనలలోన సన్నుతి కెక్కిన
వీరుఁ జంపినఁ బదివేలమాళ్ళు
పోటేనుఁగను గడు మేటిప్రధానుని
ననిఁ గూల్చునతనికి నయిదువేలు
|
|
గీ. |
నహితుచనవరినైనను హయమునైన
వెనుకఁ దియ్యక చంపిన వెయ్యిమాళ్ళు
బంటుతలఁ గొట్టి తెచ్చిన బంటునకును
బతి యొసంగఁగఁదగు రెండు పదులమాళ్ళు.
| 64
|
క. |
పరబలముల కెదిరింపుచు
నురువడి శౌర్యంబుఁ జూపు యోధుల కెందున్
నరవరుఁ డినుమడి జీతం
బరయుచుఁ దా నియ్యవలయు నందఱు మెచ్చన్.
| 65
|
గీ. |
ధరణినాథుల కర్హమై తగినయట్టి
కరితురంగాదివస్తువుల్ గాక యన్య
వస్తువుల నాజి గెల్చి యెవ్వార లెందు
నేమి దెచ్చినఁ బతి వారి కియ్యవలయు.
| 66
|
క. |
అనిలోన గెలిచి వచ్చిన
తనభటులకుఁ దగిన వస్తుతతి నొసఁగుచు నె
మ్మనముల సంతోషమ్ములఁ
గనఁ జేయఁగవలయు ధరణికాంతుం డెపుడున్.
| 67
|
వ్యూహవికల్పప్రకరణము
సీ. |
మొనకు ముందఱ విలుమూఁకల నిల్పుచో
బారులసందున వారలకును
ధనువంతనేల యంతయు నెడఁగా నిల్పి
యచటికి మూఁడు విండ్లంతనేల
|
|
|
[1](ఒండొంటికిని నెడ నొప్పునట్టుల గుఱ్ఱ
ముల బారు నిల్పఁగావలయు దాని)
వెనుక నేనుఁగుబారులను నిల్పఁగాఁ దగు
వానికి వెనుచక్కి వరుసతోడ
|
|
గీ. |
నటుల నరదంబు బారుల నమర నిల్ప
నగు ధనుర్మాన మనఁగ నీ యవనిలోన
నైదు మూరలపొడవగు నది యెఱింగి
బారు లిటు తీర్పవలయు భూపాలవరుఁడు.
| 69
|
సీ. |
ఇట్టి వారులలోన నెడనెడ విలుకాండ్ర
కును వాజులకు నేనుఁగులకు మఱియు
నరదంబులకును బార్శ్వాంతరభూముల
క్రమ మొప్పుచుండు నొక్కటియు మూఁడు
నైదు నై దగు సంఖ్య నమరిన శమముల
యంతదవ్వుల నిల్చి యర్హ మొందు
నట్టి శమంబును నమరఁ జతుర్దశాం
గుళసంఖ్య ధరణిలోఁ దెలిసి చూడ
|
|
గీ. |
నిన్నియు నెఱింగి బారుల నిటులఁ దీర్చి
పోరగాఁదగు నిదిగాక పోరఁ దనకు
నెటులఁ బొలకంబుసందడి యెసఁగ దెటులఁ
జేరువగు నెటు లటులైనఁ బోరవలయు.
| 70
|
వ్యూహరచనాప్రకారము
వ. |
మఱియు బలంబులు దొట్రుకొనకయుండ ననేకప్రకారంబు
లెఱింగి వ్యూహంబులు బన్ని జగడంబు చేయించవలయు
నవ్విధం బెట్లనిన గజానీకంబును, రథానీకంబును, మిశ్రానీకంబు
|
|
|
నన ననీకంబులు మూఁడు దెఱుంగులై యుండు నందు గజంబులు
దొమ్మిదియును, నందొక్కగజంబునకు ముందర జగడంబు
సేయు గుఱ్ఱంబు లేనింటిచొప్పున నలువదియైదు గుఱ్ఱంబులును
నందొక్కగుఱ్ఱంబునకు ముందర జగడంబు సేయు వీరభటులు
ముగ్గురి లెక్కను నూటముప్పదియైదుగురు వీరభటులును నిట్లు
పాదసంరక్షణార్ధంబు పార్శ్వంబులయందుఁ గాచికొనియుండు
గుఱ్ఱంబులు నలువదియైదును, వీరభటులు నూటముప్పదియైదు
గురునుం గూడి తొమ్మిది గజంబులును, దొంబది గుఱ్ఱంబులును
నిన్నూటడెబ్బది సంఖ్యగల వీరభటులునుం గలయది గజానీకం
బనం దగు, నీ ప్రకారంబునఁ దొమ్మిది రథంబులును, దొంబది
గుఱ్ఱంబులును, నిన్నూటడెబ్బది సంఖ్యగల వీరభటులునుం గల
యది రథానీకం బనం దగు. తొలుదొల్త వీరభటులును, వారల
వెనుక గుఱ్ఱంబులును వాని పిఱుందన రథంబులును, వాని
వెనుదక్కి నేనుంగులునుం గలయది మిశ్రానీకం బన నొప్పు
నిట్టి యనీకసమూహంబే వ్యూహం బనం బరగు. నదియు
దండవ్యూహంబును, భోగవ్యూహంబును, మండలవ్యూహంబును
నసంహతవ్యూహంబును నన నాలుగుదెఱంగులై యుండు. మఱియు
నేతద్భేదంబులైన వ్యూహంబు లనేకంబులు గల వది యెఱింగి
వ్యూహంబులు పన్నునపు డనీకానీకమధ్యంబున నైదేసి విండ్లంత
దవ్వు గలుగఁ బన్నవలయు. నం దసంహృతవ్యూహంబున
ననీకంబులు దూరంబున నిల్చునట్లుగాఁ బన్నవలయు. నిట్టి
వ్యూహంబునకు శుక్రమతంబువార లురోభాగం బొకండును
బార్శ్వభాగంబులు రెండును, మధ్యపుచ్ఛభాగంబులు రెండునుం
గూడి పంచాంగంబులుం గల వందు రందునకుఁ దనకుంగల బలంబు
మూఁడుపాళ్ళుగ నేర్పఱచి యురోభాగంబున నొకపాలును,
బార్శ్వభాగంబుల నొకపాలును, మధ్యపుచ్ఛభాగంబుల నొక
|
|
|
వాలునుంగా నిలుపవలయునండ్రు. మఱియుఁ గొన్నిమతంబుల
వార లీ పంచాంగవ్యూహంబునకే యంగంబున కొక్కొక్క
యనీకంబు లెక్క ననీకంబు లైదింటికి ముందర జగడంబు సేయు
వార లాఱునూట డెబ్బదియైదుగురు వీరభటులును, నిన్నూట
యిరువదియైదు గుఱ్ఱంబులును, నలువదియైదేనుంగులును నిట్టులె
పాదసంరక్షణార్ధబలంబునుం గూడి వేయినిన్నూట యేబదిసంఖ్య
గల వీరభటులును, నన్నూటయేబది గుఱ్ఱంబులును, దొంబది
యేనుంగులునుం గలిగి యుండవలయు నండ్రు. వెండియు
బృహస్పతిమతంబు వార లీపంచాంగవ్యూహంబుననే రక్షభాగం
బులు రెండునుంగూడి సప్తాంగంబులం బ్రవర్తిల్లు నందు రందునకుం
గల బలంబు నాలుగుపా ళ్ళొనరించి యురోభాగంబుల నొకపాలును,
గక్షబాగంబుల నొకపాలును, పార్శ్వభాగంబుల నొకపాలును,
మధ్యపుచ్ఛబాగంబుల నొకపాలునుంగాఁ బన్ని జగడంబు
సేయించవలయు నం డ్రందు.
| 71
|
సీ. |
తమలోనఁ దాము సందడిపడి కలయక
యని యొనర్పఁగఁ దగు నదియుఁ గాక
కలిసి పోరాడ సంకులసమరం బగు
నట్టి సందడికయ్యమందు నెల్లఁ
దమయేనుఁగులదండఁ దాఁగొని జగడంబు
సేయఁగావలయు నజేయలీలఁ
దమమూఁకమీఁద గుఱ్ఱములు పైకొన్నచో
నొండొరుల్ చెదరకయుండి పోర
|
|
గీ. |
వలయు బాణంబులును దుపాకులును విండ్ల
మూఁక ముందర నిడికొని మొనకు నడచి
యెట్టి మూఁకలు బైకొన్న నట్టిమూఁక
చేతఁ బోరింపవలయును క్షితివరుండు.
| 72
|
ప్రకాశయుద్ధప్రకరణము
వ. |
సేనాంగాలకుఁ బ్రత్యేకనాయకులకు.
| 73
|
క. |
కులమున మించువారిఁ దమకుం దగులై తగువారిఁ బోరిలో
నలవడి తత్ప్రతిక్రియల నన్నియుఁ జేయ నెఱుంగువారిఁ గ్రే
వల దమమూఁకఁ గావఁగలవారల నేనుఁగు లాదియైన మూఁ
కలకును వేఱువేఱ నధికారులఁగా నియమింపఁగాఁ దగున్.
| 74
|
క. |
ఈరీతి వ్యూహములుగా
నేరుపుతోఁ బన్నినట్టి నిజబలములచే
వైరిబలంబుల మీఱి వి
దారింపఁగవలయుఁ గదిసి దళవాయి తగన్.
| 75
|
క. |
బలిమిగల వైరిబలముల
బల మినుమడి గలిగినట్టిబలములచేతన్
గెలువఁదగుఁ దెఱపి చూపని
బలముల నేనుఁగులఁ బఱపి పఱపఁగవలయున్.
| 76
|
గజబలప్రశంస
లయగ్రాహి. |
మెండగు జిరాలురముదండ బలుకేడెములు
నిండుకొను గుమ్ములును దండితలరాణుల్
గండమర బూనుచుఁ బ్రచండమదమత్తులగు
దండిమగ లేమఱక భండనములో ను
ద్దండగతి లోహమయదండములు బూనుకొని
నిండుపమజోకఁదగుచుండు పరసేనం
జెండఁ జనునందుఁ గలగుండుపడ వాద్యముల
డిండిమ డిమండిమ డిమండిమ లెసంగన్.
| 77
|
చ. |
ఘనుఁడగు మావటీఁడు మొనగాలునఁ గేలున నంకుశంబునన్
దను బురిగొల్పఁ దొండము ముదంబునఁ జాపుచు వాల మెత్తుచున్
గనుగవయుం జెవుల్ నిగుడఁగాఁ దనసేన నెఱింగి శత్రుసే
ననె నురుపాడి గెల్పు నరనాథున కిచ్చుఁగదా గజం బనిన్.
| 78
|
ఉ. |
ఏనుఁగు లున్నచోనె వసియించును శ్రీహరిరాణి సంతతం
బేనుఁగుపౌఁజు గల్గుదొర యేమిట నోటమిఁ జెందఁ డెట్టిచోఁ
గాన మదేభయూధ మధికంబుగఁ గొల్వఁగ దంతి నెక్కినం
బ్రాణముతోడి దుర్గము నృపాలకుఁ డెక్కిన యట్ల పోరిలోన్
| 79
|
చ. |
దొడరు భయప్రదేశముల దుర్గములై పడిఁ బాఱు నేఱులన్
గదవఁగ నోడలై రణముఖంబున రాక్షసులై ప్రయాణముల్
వెడల గృహంబులై మనసు వెచ్చగఁ జూడను గారణంబులై
కడుమద మెచ్చు నేనుఁగులె కా జయసాధనముల్ దలంపఁగన్.
| 80
|
చ. |
బలిమి మదంబునుం గలుగు భద్రగజంబుల రాజు శత్రుమూఁ
కల నురుపాడి చెండుగఁ గకాపిక చేసి జయించు నేనుఁగుల్
బలువుగ గల్గినన్ జయము బ్రాఁతియె కావున వానిఁ ద్రోవఁగా
వలయు నృపాలశేఖరుఁ డవశ్యముఁ దా జయలక్ష్మి మించఁగన్.
| 81
|
సీ. |
పొగడపువ్వులతావి పొదివి ధుగుల్‌కొన
వెదజల్లు సంతతమదముఁ గల్గి
దేనెవన్నియ గల్గి దీప్తమై పొడవులై
వలుదలై పొలుచు కొమ్ములును గల్గి
దొరయుచు సమములౌ తుంటి దిక్కులు గల్గి
యొద్దికై కూడి పెన్నుద్దు లనఁగ
బెరయుచుండెడునట్టి బృంహితస్వనములు
సమములై నట్టి యంగములు గల్గి
|
|
గీ. |
సకలశుభలక్షణంబులు చక్కఁదనము
చెలువు గంభీరగమనము గలిగినట్టి
భద్రగజముల నేలుభూపాలకుండు
సకలసంపదఁ జెలువొందు జనులు వొగడ.
| 82
|
చ. |
గజములు గల్గు భూవిభుఁడు గా నొకదిక్కున గాక యెల్లచో
గజములు గల్గువాఁడు ధరఁ గల్గదు కావున దంతికోటులన్
గజముల లీల సత్త్వములఁ గన్పడు బంటులఁ జాల నేలినన్
విజయము తేజమున్ సిరులు విశ్రుతకీర్తులు గల్గు భర్తకున్.
| 83
|
రథబలప్రశంస
ఉ. |
శూరత గల్గు సారథులు చొక్కపుతేజులు కింకిణీఝణ
త్కారమహారవంబు బిరుదధ్వజకోటులు మీఱఁ బోరిలో
వైరిమనోరదంబులను వానిరదంబులఁ గూల్చి పొల్చు బల్
తేరులవారు గల్గునరదేవున కెద్ది యసాధ్యమే ధరన్.
| 84
|
అశ్వబలప్రశంస
క. |
ఏటికిఁ గరు లేటికి నరు
లేటికి మఱి రథచయంబు లీధరలోనన్
నీటగు జయము లొసంగెడి
ఘోటకములె చాలఁ గలఁ గువలయపతికిన్.
| 85
|
సీ. |
నిలిచెనా యడుగులోనే నిల్చి చిత్రమై
కదలెనా బాణవేగము దెరల్చి
యనినిఁ గైదువుల సాధనకానిగతిఁ బొల్చి
దాఁటెనా లేఁడిచందం బదల్చి
|
|
|
గమకించెనా సింహగమనంబు గమకించి
యడఁగెనా తాఁబేటియనువు మించి
చుట్టెనా వేడెంబు సుడిగాడ్పు నదలించి
బెళికెనా బేడిసబెళుకు బెళికి
|
|
గీ. |
యెడమ కుడి వాగెబాగుల నెఱిఁగి తిరుగ
నిరుదెఱఁగుమోము లనఁదగి హరువు మురువు
వెఱవు నొఱవును గడుమించు నరుదుబిరుదు
నదుటు నుదుటొందు తేజి రాజార్హ మండ్రు.
| 86
|
చ. |
తలఁప నవేళలన్ మిగులఁ దాఁ దగులై తగునట్టి చుట్టమై
యల రణభూమి పేరఁదగు నంబుధి దాఁటగ మేటితేఁపమై
నలరగఁ గ్రీడల న్మెలఁగు నప్పుడు దా వెలలేని రత్నమై
జెలఁగెడు గుఱ్ఱ మేహితము సేయదు నాయకుఁ డైనవానికిన్.
| 87
|
చ. |
బలువగు కందముం బిరుదు బంగరుచాయ హసించు సంపదల్
గల పరిపూర్ణదేహము విలాసముఁ జక్కఁదనంబు నోజయుం
గళలును జెల్వు తేటతెలిగన్నులు లక్షణముం జవంబునుం
గలిగిన తేజులన్ సిరులు గైకొను భూభుజుఁ డేలఁగాఁ దగున్.
| 88
|
క. |
ఏ నరపతి గుఱ్ఱంబుల
సేనలచే మిగులఁ బ్రబలు క్షితిలో నెపుడున్
వానిది సిరి వానిది ధర
వానిదె జయలక్ష్మి కీర్తి వానిదె సుమ్మీ.
| 89
|
చ. |
ఈగతి నీతిమార్గమున నెంతయు సుస్థిరుఁడైన రాజు దా
ధీగరిమన్ వహింపుచును దిగ్విజయంబును సర్వసంపదల్
బోగము గల్మియుం గలిగి భూవిభులెల్లను జేరి కొల్వ ను
ద్యోగము లెల్లఁ జేకుర సుఖోన్నతి రాజ్యము సేయు నిచ్చలున్.
| 90
|
ఉ. |
శ్రీరఘురామపాదసరసీరుహభృంగదనూనమానసో
దార మదారివీరవరదర్పవిమర్దన దుర్దమక్రియా
స్ఫారభుజాబలాధిక విసారిత పూరితలోక సద్యశో
హారవిహారమానితమహాకరివాజివిరాజితాంగణా.
| 91
|
మంగళమహాశ్రీ. |
శ్రీమహితధామనుత సింధువృతభూస్థలివిశిష్టహితభాసిత గుణశ్రీ
కాముకకథాకృతినికాయకృతివర్జిత ప్రకాశిత నయాధిక జయశ్రీ
రామ హిమధామ శరరాజి సురరాజ తరురాజిత విశాలసుయశశ్శ్రీ
భూమరమణీయనిజభూజనసుఖప్రదప్రభుత్వయుతమంగళమహాశ్రీ
| 92
|
:-
గద్యము. |
ఇది శ్రీమన్మదనగోపాలవరప్రసాదలబ్ధసారసారస్వత
భారద్వాజసగోత్ర జక్కరాజ యెఱ్ఱనామాత్యపుత్ర సుకవిజన
విధేయ శ్రీరామకృష్ణభక్తివైభవభాగధేయ వేంకటనామధేయ
ప్రణీతంబైన కామందక నీతిశాస్త్రంబను మహాప్రబంధంబునందు
సేనావివరంబును, సేనాపతిప్రభావంబును, గూటయుద్ధప్రకారంబును,
జతురంగబలప్రయోజనంబులును, దద్భూములును, వ్యసనంబులును,
బారితోషికంబును, జతురంగబలప్రశంసము నున్నది సర్వంబు
నష్టమాశ్వాసము.
|
|
మ. |
రమణీయంబుగ శాలివాహశకవర్షంబుల్ గతంబై సహ
స్రము నేనూఱును నాఱునై వెలయఁగా బ్రౌఢిం దెనింగించి రౌ
ర మహిం దిమ్మయ వెంకటాద్రి విభుపేరన్ వేడ్కఁ గామందకీ
యము శ్రీవేంకటరామకృష్ణులు స్వభాన్వబ్దంబునన్ రూఢిగన్.
|
|
శ్రీ శ్రీ శ్రీ