ఆంధ్రకామందకము/ఉపోద్ఘాతము

ఉపోద్ఘాతము.

ఆర్యసారస్వతమున నుపవేదములలో రెండవది యర్ధవేదము అర్దసంపాదనరక్షణక్రమముల నుపదేశించునది గాన నిది యర్థవేద మనఁబరఁగు. ఇందు రాజధర్మములును అర్థార్జనరక్షణక్రమములును గలపి బ్రహ్మ లక్షయధ్వాయములుగాను, రుద్రుఁడు 50000, స్కందుఁడు 25000, ఇంద్రుఁడు 12000, వాల్మీకి 6000, బృహస్పతి 3000, శుక్రుఁడు 1000 ఆధ్యాయములుగాను గ్రంథములు రచించిరఁట. భయంకరములగు నీ పెద్దగ్రంథములు తిన్నఁగా భుజింప నవకాశము చాలని ఘనకాలమువఱకు రాక నశించిపోయినవి. వీనిని సంగ్రహించి భారద్వాజుఁడు 700 అధ్యాయములుగాను, గౌరశిరుఁ డనుముని 500 అధ్యాయములుగాను, వ్యాసులు 300 అధ్యాయములుగాను నర్థశాస్త్రములు రచించిరఁట. అవియుఁ బైవానిగతియే చెందినవి. అర్థవేదము సంగ్రహరూపముగాఁ బదునాలుగువేలశ్లోకములతో రచింపఁబడినదఁట. అందీ విషయములు నిరూపింపఁబడినవి.

 "చతుర్దశ సహస్రాణి హ్యర్థవేదః ప్రమాణతః
యత్రై వాష్టాదశాధ్యాయాః సంతి ప్రత్యక్షసిద్ధిదాః
కల్పాధ్యాయో రసాధ్యాయః ప్రయోగాధ్యాయ ఏవ చ
ధాతుధ్మానక్రియాధ్యాయో రత్నాధ్యాయ స్తథైవ చ
త్రపుసీసజయాధ్యాయో లోహాధ్యాయ స్తతఃపరమ్
మూషామృల్లోణతగరాధ్యాయో వాదజయస్తతః
హేమసంపాదనాధ్యాయః సిద్ధాధ్యాయో౽ఖిలార్థదః
మూలికాశోధనాధ్యాయః పుటాధ్యాయో మహత్తరః

నాగాభ్రచంద్రికాధ్యాయో యోగాధ్యాయో౽ర్థదాయకః
కాలపాకక్రియాధ్యాయః సింభిన్నాధ్యాయ ఏవచ
విక్రియాకరణాధ్యాయ ఏతే సర్వార్థదాయకాః"

అని యామళాష్టకతంత్రమున నున్నది.

అర్థశాస్త్ర మనునామముతోనే వీనిలో రాజనీతి ప్రధానముగాఁ జెప్పఁబడియె. శుక్ర బృహస్పతి విశాలాక్ష బాహుదంత భీష్మోద్ధప చాణక్య ప్రభృతులు విస్తరముగా రచించిన రాజనీతిశాస్త్రములలోఁ జాణక్యునికౌటిలీయముమాత్రమే మన కిప్పుడు లభించుచున్నది. బార్హస్పత్యసూత్రము లని యిటీవల ముద్రిత మైనదియు లఘుచాణక్యసూత్రము లనుగ్రంథమును సారరహితములు నాధునికములు నని మా యభిప్రాయము. బార్హస్పత్యనీతిసార మనియుఁ జాణక్యుని కౌటిలీయమునకుఁ గామందక నీతిసార మనియు గ్రంథములు గలవు.

కౌటిలీయము[1] కేవలము రాజనీతిని దెలుపును. ఇది పదునైదధికరణములుగా 180 అధ్యాయములలో రాజవిద్యావినయగృహాత్మరక్షణములును, అధ్యక్షులవిధానమును (దుర్గము, పట్టణములు, కప్పము, సుంకము, కోశము, శాసనము, గోవులు, గజాశ్వములు, భోజనశాల ముద్ర మొదలగువిషయములపై నధికారు లధ్యక్షులు). వ్యవహారస్వరూపమును దత్పరిష్కారమును, రాజ్యములో నుండునంతశ్శత్రుశోధనము, సేవకాదిపరిపాలనవిధి, ప్రజాసంపత్తును, దేహసంపత్తును, ప్రజాపురుషసేనామిత్రరక్షణవ్యసనము, దండ్రయాత్రాక్రమము, యుద్ధప్రకారము, సంఘవిధియు, బలవజ్జయోపాయక్రమము, దుర్గలాభోపాయము, ఇంద్రజాలమాయాక్రమములును వరుసగా వివరింపఁబడినవి.

దీనిపై బౌద్ధభిక్షువు ప్రభామతి యను టీకను, శంకరాచార్యులు జయమంగళను, మాధవమిశ్రయజ్వ నయచంద్రికను, భట్టస్వామి ప్రతిపదపంచికను వ్యాఖ్యానములుగా రచించిరి. వానిలోఁ గొంత కొంత భాగములు లభించుచున్నవి. భిక్షుమాధవులవ్యాఖ్యానములు మంచివి. భట్టస్వామిది హీనరచనము. అయినను ద్రవిడులును గేరళులును దమ తమ భాషలలోనికి దీని ననువదించికొనిరి.

కౌటిలీయార్థశాస్త్రముకన్నను చాక్షుషీయ మను నర్థశాస్త్రము ప్రాచీనగ్రంథము. అర్థశాస్త్రగ్రంథములలో నెల్ల మిక్కిలి చిన్నగ్రంథ మీచాక్షుషీయమే. ఇందు విషయము సూత్రరూపమునను, వాక్యరూపమునను సంగ్రహశ్లోకరూపమునను రచింపఁబడియున్నది. కొన్ని క్లిష్టస్థలములందుఁ బ్రాచీనసంప్రదాయార్థములకుఁ బూర్వపక్షానువాదదూషణరూపవిమర్శనలతోఁ గూడినసమీక్ష యను నాల్గవరూపము గూడ నున్నట్లు తెలియ నగుచున్నది. కౌటిలీయమున నీ సమీక్షారూపవిమర్శన ముండుటచే సుబోధమై చాక్షుషీయగ్రంథము నణగఁ ద్రొక్కి ప్రజాదరణమునకుఁ బాత్రమైనది. ఇట్టి సూత్రరూపరచనలు మనప్రాచీనులప్రతిభావిశేషములఁ జాటుచున్నవి. ఈ చాక్షుషీయము రాజ్యాంగములకు సంబంధించిన విషయముల నఱువదియేడింటిని గుఱించి తెలుపుచున్నది. ఇందు ప్రధమపటలము ఉద్దేశరూపమున నీ యఱువదియేడువిషయములఁ బేర్కొనుచున్నది. ద్వితీయపటలమున నఱువదివిషయములు మాత్రము లభ్యము లగుచున్నట్లు తెలియుచున్నది. మిగిలినది లుప్తమైనది. అందు ప్రథమపటల మిట్లున్నది.

శక్యమేకశరీరేణ నీతిమార్గానుసారిణా।
వ్యవసాయద్వితీయేన సర్వాం జేతుం వసుంధరామ్॥

అథాతః పురుషార్థసాధన మర్థశాస్త్రం ప్రవక్ష్యామః -
తద్యథా - 1. సప్తప్రకృతయః 2. సప్తవిధా ప్రవృత్తిః 3. సప్తవ్యస
            నాని 4. సప్తక్షమాకాలాః 5. తిస్రో విద్యాః 6. చత్వారో భోగ

సంగ్రహాః 7. త్రయో విజిగీషవః 8. చతుర్విధా రాజప్రకృతిః
9. షట్త్రింశద్గుణో రాజా 10. పంచవింశతిగుణో౽మాత్యః
11. షడ్వింశతిగుణః సేనాపతిః 12. ద్వావింశతిగుణో రాజాధ్యక్షః
13. షోడశగుణో దూతః 14. ద్వాదశగుణో సాంవత్సరికః
15. ఏకాదశగుణః పురోహితః 16. పంచాదశగుణో వైద్యః
17. నవగుణో నాగరికః 18. దశగుణో౽౦తఃపురపాలకః
19. ద్వాదశగుణం మిత్రం 20. షద్గుణా యాత్రా 21. వింశతివిధం
దుష్టలింగజ్ఞానం 22. అష్టాంగా బుద్దిః 23. అష్టాంగా సేనా
24. అష్టౌ కోశవిధానాని 25. ఏకాదశేంద్రియాణి 26. త్రివిధో
మంత్రః 17. చత్వారో మంత్రగుణాః 28. త్రివిధం మంత్రఫలం
29. పంచాంగోమంత్రః 30. సప్తవిధోమంత్రఛేదః 31. చతుర్దశ
విధ ఉపజాపః 32. పంచవిధః శత్రురుపహంతవ్యః 33. చత్వారో
నిర్యాణకాలాః 34. ద్వౌ విగ్రహకాలౌ 35. చత్వారఃసంధాకాలాః
36. ద్వౌపంచవర్గౌ 37. పంచత్రివర్గాః 38. ఏకఏకవర్గః 39. చత్వా
రోఅర్థసాధనోపాయాః 40. చతుర్విధారంభవృత్తిః 41. చతుర్వి
ధో౽ర్ధానుబంధః 42. చతుర్విధో నిచయః 43. పంచ దుర్గాణి
44. దశవిధా దుర్గసంపత్ 45. వింశతివిధం దుర్గవ్యసనం 46. పంచ
చత్వారింశద్గుణా జనపదభూమిః 47. చతుర్విధం త్యాగస్థానం
48. చతుర్విధా భృత్యసంపత్ 49. చతుర్విధా పురుషపరీక్షా 50. సప్త
విధా కార్యావిప్రతిపత్తిః 51. ద్వివిధ ఉపసర్గః 52. ద్వివిధమనుష్ఠానం
53. అష్టవిధః శత్రుః 54. ద్వాత్రింశద్గుణః షాడ్గుణ్యసముద్దేశః
55. వింశతివిధం దుష్టప్రశమనం 56. షడ్విధం బలం 57. అష్టౌ
యుద్ధాని 58. అష్టౌ సంగ్రామభూమయః 59. చతస్రో వ్యూహ
ప్రకృతయః 60. పంచ వ్యూహాః 61. సప్తదశ వ్యూహభేదాః
62. ఏకాదశానీకస్థానాని. 63. ఏకాదశసుస్థానేషు సేనా రక్షితవ్యా,
ఏతేష్వేవ స్థానేషు పరబల మభిహంతవ్యం 64. షడ్విధం విషం

65. ఏకాదశవిధః స్కంధావారనివేశః 66. చతుర్విధా బుద్ధిః
67. ద్వివిధ ఆచారః

ఇతిదాక్షుషీయే౽ర్థశాస్త్రే ప్రథమః పటలః

ఈ చాక్షుషీయమందలి విషయసంగ్రమును బట్టి కౌటిలీయాదిగ్రంథముల కిది మూల మని తెలియుచున్నది. చాక్షుషీయవిషయమే కౌటిలీయమున విపులముగ వివృతమై యున్నదని రెంటిని బరిశీలించినవారికిఁ దప్పక గోచరింపఁ గలదు.

సంస్కృతవాఙ్మయమున నర్ధశాస్త్రగ్రంథములు పెక్కు లుండెడివి. కాని దురదృష్టవశమున నవి యన్నియు నశించినవి. బ్రహ్మ, బృహస్పతి, శుక్రుఁడు, విశాలాక్షుఁడు, ఇంద్రుఁడు, మొదలగువారు రచించిన గ్రంథరాజములు కానవచ్చుటలేదు. లబ్ధములగు గ్రంథములలోఁ జాక్షుషీయ కౌటిలీయములే ప్రశస్తములు.

కౌటిలీయకర్త కౌటిల్యుఁడను నామాంతరముగల చాణక్యుఁడని పలువు రందురు. ఆ చాణక్యుఁడు మౌర్యసామ్రాజ్యచక్రవర్తియగు చంద్రగుప్తుని మంత్రియై యుండుటచేతను, చంద్రగుప్తచక్రవర్తి క్రీ. పూ. 325 నుండి 298 వఱకు రాజ్యమేలె నని యుండుటచేతను నీ కౌటిలీయము క్రీ. పూ. నాల్గవశతాబ్దపుగ్రంథ మని నుడువవచ్చును.

పదవశతాబ్దమువాఁడగు భోజుఁడును అర్ధశాస్త్రమునఁ గృషిసల్పిన ట్లతని నీతిభూషణ మనుగ్రంథము తెల్పుచున్నది. అం దర్థశాస్త్రవిషయమునంతను 1. వినయ 2. వార్తా 3. వ్యవహార 4. రక్షా 5. మంత్ర 6. ఉపాయ 7. విక్రమ 8. యుద్ధ 9. ఉపనిషత్ 10. ప్రశమస్కంధము లని పది విభాగములుగా రచించె నని తెలియుచున్నది. కాని యాగ్రంథము లభ్య మగుటలేదు.[2]

కామందక నీతిసారము

పైవిధముగఁ బరిశీలితములైన ప్రాచీనరాజనీతిమూలగ్రంథములకుఁ దరువాతఁ గౌటలీయార్థశాస్త్రమునకు సంగ్రహకారికారూపమైన కామందకనీతిసారము సంస్కృతమున వెలసినది. ఇది క్రీ. శ. 4-వ శతాబ్దమునకుఁ బూర్వముదియు 1-వ శతాబ్దమునకుఁ దర్వాతిదియు నని చరిత్రకారులు గుర్తించిరి. ఏతత్కర్త కామందకుఁడు. అతని చరిత్ర మేమియుఁ దెలియరాదు. ఈ కామందకము 36 ప్రకరణములు గలది. కౌటిలీయార్ధశాస్త్రము ననుసరించియే యిది రచితమైనను నిందుఁ గౌటిలీయమునఁ గలవిషయములు గొన్ని కానరావు. కౌటిలీయమున లేనివిషయములు నిందుఁ గొన్ని గలవు. ఈ విషయమున "రాజపుత్రుని విద్యాభ్యాసపద్ధతిని నిర్ణయించు సందర్భములో నతఁడు (కౌటిల్యుఁడు) 'అధ్యక్షులనుండి వార్తను, వక్తృప్రయోక్తలనుండి దండనీతిని నేర్చుకొనవలె' నని చెప్పియున్నాఁడు. ఇతనికి నితరగ్రంథకర్తలకుఁ గల భేద మిదియే. కామందకాదు లిట్టివ్యవహారానుభవము గలిగినవారు కారు ఇతరులు వ్రాసిన గ్రంథముల వివేకదృష్టితో విమర్శించి స్వాభిప్రాయములఁ గొన్నిటిని జేర్చి కామందకుఁడు లోనగువారు నీతిశాస్త్రముల రచించిరి. కనుకనే వారిపుస్తకములందు సందర్భానుచితములగు ప్రశంసలుకూడ నక్కడక్కడఁ గన్పడుచుండును. కౌటిల్యుఁ డట్లుగాక సందర్బోచితముగను వ్యవహారానుకూలముగను వ్రాసియున్నాఁడు."[3]

ఈ గ్రంథ మనుష్టుప్‌శ్లోకాత్మకమైనదైనను వ్యాఖ్యానిరపేక్షముగా నర్థము కానిది. దీనికి జయమంగళ యనియు, మఱొకటియు వ్యాఖ్యలు గలవు. తిరువాన్కూరు ముద్రణాలయమువారు ప్రకటించిన జయమంగళవ్యాఖ్యానముతోడి ముద్రణమే యున్నవానిలోఁ బ్రశస్తమైనది. ఇప్పటికి 100 ఏండ్లకుముందు తడకమళ్ళ వేంకటకృష్ణారాయలను గొప్ప విద్వాంసులు ఈ కామందకమునుఁ దెనుఁగుటీకతోఁ దెనుఁగులిపిలో ముద్రించిరి. తిరువాన్కూరు ముద్రణమునకును దీనికిని గొన్ని భేదము లున్నవి. కృష్ణారావుగారి తెలుఁగుటీక ప్రశస్తమైనది. వా రీపద్యకామందకము నెఱుఁగరు.

ఆంధ్రకామందకము - రాజనీతిగ్రంథములు

ఈ కామందకమును క్రీ. శ. 1400 పూర్వకాలముననే యెవ్వరో పద్యకావ్యముగాఁ దెనిఁగించిరి. అందలి పద్యములు పెక్కులు మడికి సింగన సకలనీతిసమ్మతమున నుదాహృతము లై యున్నవి. సకలనీతిసమ్మతమున మడికిసింగన యీ క్రిందివాని నాంధ్రరాజనీతిగ్రంథములను బేర్కొనినాఁడు. అవి ముద్రామాత్య పంచతంత్రీ బద్దెభూపాల చాణక్య ధౌమ్యవిదుర ధృతరాష్ట్రబలభద్ర కామందక గజాంకుశ నీతిసార నీతిభూషణ క్షేమేంద్ర భోజరాజవిభూషణ పురుషార్థసార భారత రామాయణాది మహాకావ్యంబులు పురాణేతిహాసంబులు కందనామాత్యు నీతితారావళి లోకోక్తి చాటుప్రబంధంబులును. వీనిలోఁ బెక్కుగ్రంథములు నష్టము లైనవి. సింగన ఆయాగ్రంథములలోని పద్యములను బెక్కింటిని తనగ్రంథమున నుదాహరించికొనినాఁడు. అందు బద్దెననీతి యొకటి మాత్రమే యిపుడు లభించుచున్నది. సకలనీతిసమ్మతమును బోలె శ్రీరామకృష్ణకవిగారే తొలుత నీబద్దెననీతిం బ్రకటించిరి. సకలనీతిసమ్మతమున నుదాహరింపఁబడిన ప్రాచీన కామందకపద్యములు కొన్ని యిచటఁ జూపుచున్నాఁడను.

ఉ.

స్నానవిలేపనాభరణచారుసముజ్జ్వలగాత్రుఁడై శుభ
స్నానము నాత్మదత్తవసనస్ఫుటమూర్తియు నైనదేవులన్
స్థానము సేర్చి వారి సదనంబుల కేఁగక చేయుదు న్నిజా
ధీనమనస్కుఁడై సతులతీపులు నమ్మకయున్కి యొప్పగున్.

(సకలనీతిసమ్మతము. పద్యము 288; ఆంధ్రకామందకము; అ. 3. ప. 136.)

సీ.

 గురువులఁ బ్రణమితవరభక్తియుక్తుల
        సద్బావచేష్టల సజ్జనులను
సుకృతకర్మంబుల సురల భూసురులను
        మృదులమనోవృత్తి మిత్రజనుల
బాంధవజనుల సంభ్రమచేష్టితంబులఁ
        గామినీజనములఁ బ్రేమములను
దాసజనంబులఁ దగుప్రసాదంబుల
        నితరుల దాక్షిణ్యచతురవృత్తి


గీ.

 నాత్మవశ్యులఁ గావించి యన్యకర్మ
నింద సేయక సత్కర్మనిష్ఠుఁ డగుచుఁ
జారుకారుణికత్వము సర్వలోక
మధురవాక్యము గలవాఁడు మనుజవిభుఁడు.

(స. స. పద్యము 158. అం. కా. అ. 2. ప. 57, 58)

సీ.

 భుజగము విషమును బొడఁగాంచి కూయును
          శుకభృంగరాజశారికలు వెఱచి
లలిఁ జకోరములకన్నులు విరాగము లగుఁ
          గ్రౌంచంబు చాల మదించి తిరుగు
విషదర్శనంబు గా వెసఁ జచ్చుఁ గోకిల
          గ్లాని జీవంజీవకమున కొదవు
వీనిముఖంబున వెసఁ బరీక్షితములై
          తనరిని యన్నము ల్గొనఁగవలయు


ఆ.

 జనవిభుండు గడుఁ బృషన్మయూరావళి
తద్గృహంబునం దుదారలీల
విడువవలయుఁ బెంచి వెస దానిఁ బొడఁగన్న
పాము దనకుఁ దాన పఱచుఁగాన.

(స. స. ప. 257.; అం. కా. అ. 3. ప. 38.)

సీ.

భద్రసేనుఁడు నిజపత్నియింటికిఁ జన
           నతనితోఁబుట్టువ యతనిఁ దునిమెఁ
దల్లిమంచముక్రింద నల్లన యడఁగి తాఁ
           బుత్రుండ కారూషుఁ బొడవడంచె
లాజలు విషమున నోజించి తేనియ
          యని కాశిరాజుఁ దద్వనిత యడఁచె
గరళాక్తమేఖలాఘనమణి సౌవీర
          ధూపు వైరంత్యు నూపురముచేత


గీ.

జాతుషంబగు శస్త్రంబు జడ నిడికొని
రమణి తా నొక్కరిత విదూరథుని జంపు
టెఱిఁగి నమ్మక సతియింటి కేఁగఁ జనదు
దెరలి శత్రులపయిఁ బ్రయోగింపవలయు.

(స. స. ప. 287. ఆం. కా ఆ. 3. ప. 140)

చ.

అరివరు శత్రుదుర్గమును నాతనిబందుసుహృద్విభేదమున్
బురధనసైన్యసంపదలపోఁడి మెఱుంగుట కృత్యపక్షవి
స్తరపరిసంగ్రహం బతనిజానపదాటవికంబు సాధ్యముల్
దిరమిడి యుద్ధసారము విధిజ్ఞతయ న్నివి దూతకర్మముల్.

(స. స. ప. 362. ఆం. కా. ఆ. 5. ప. 77)

సీ.

బాలుండు వృద్ధుండు పటుదీర్ఘరోగియు
         నిల నిజజ్ఞాతిబహిష్కృతుండు
భీరుకుండును గడు భీరుజనుండును
         లుబ్ధుండు మఱియును లుబ్ధజనుఁడు
సతతవిరక్తప్రకృతియైన సృపతియు
         విషయరసాసక్తవిరళమతియు
మఱియును బహుచిత్తమంత్రుండు దేవతా
         బ్రాహ్మణనిందాపరాయణుండు

గీ.

దైవహతకుండు దైవచింతనపరుండు
వ్యసనదుర్భిక్షకుఁడు బలవ్యసనపరుఁడు
లలి నదేశస్ధబాహుశాత్రవుఁడును గాల
యుక్తుఁడును సత్యధర్మవియుక్తమతియు.

(స. స. ప. 528)

క.

ఈ యిరుపదువురతోడన్
బాయక విగ్రహము సేసి పైకొనుటయు వా
రేయెడ మార్కొనక బల
శ్రీ యఱి వశవర్తు లగుచు సిరి యిత్తు రిలన్.

(స. స. ప. 527, ఆం. కా. ఆ. 4. ప. 70)

సీ.

దక్షిణానిలముఁ బ్రదక్షిణాగ్నియు నధ్వ
         సంతతోత్సాహంబు సాధువాద
చారుమంగళపారకారవంబు సుహృష్ట
         పుష్టజనంబును బొలుపు మిగుల
నతిమనోహరముగా నరసి చెప్పిన శుభ
         కలితలక్షణములు గలిగియున్న
యట్టివేలంబు ప్రఖ్యాతమై పొలుపొందు
         నతిశుభమై యుండు నధికశత్రు


ఆ.

జయము గలుగునట్టి చందంబు......
నందగ విపరీత మయ్యెనేని
యపజయంబు నొందునట్టి చందము లెల్ల
నెఱిఁగి నృపతి నిశ్చయింపవలయు.

(స. స. ప. 818. ఆం. కా. ఆ. 7. ప. 22)

ఉ.

ఒక్కటఁ గూటయుద్ధమున నుక్కఱ శత్రు వధించినన్ జయం
బెక్కుడు గల్గి పాప మొకయించుక పొందదు నిశ్చయంబు పే
రుక్కున ద్రోణసూనుఁ డుఱ కొక్కయెడ న్నడురేయి నిద్రమైఁ
జొక్కిన పాండునందనులఁ జూచి వధింపడె సౌప్తికక్రియన్.

(స. స. ప. 354. ఆం. కా. ఆ. 8. ప. 50.)

ఆంధ్రకామందక నీతిసారము — గ్రంథరచనము

ఇది ప్రాచీనకామందకమంత రసవంతము కాదేమో కాని శబ్దశుద్ధియు విషయవైశద్యమును, ఉత్తమరచనము మున్నగు సుగుణములతో నొప్పుచున్నది. ఇం దాంధ్రదేశపురాజనీతి సంప్రదాయములు కొన్ని గలవు. ఆంధ్రదేశపురాజనీతి పరిభాషాపదములు కొన్ని యచ్చటచ్చటఁ గలవు. రాజనీతిశాస్త్రపరిశోధకులు వానినెల్ల నుద్దరింపవచ్చును. రాజ్యములే పోవుచున్న యీ కాలములో నీ రాజనీతిగ్రంథములు చరిత్రకారుల శాస్త్రనిర్మాణక్రమాది చరిత్రపరిశీలనమునకేగాని రాజ్యాంగప్రయోజనమున కుపకరింపవు. కాని లోకవ్యవహారజ్ఞానము వీనివలన విశేషముగా లభింపఁగలదు.

కృతికర్త — గ్రంథరచనాకాలము

మ.

రమణీయంబుగ శాలివాహశకవర్షంబుల్ గతంబై సహ
స్రము నేనూఱును నాఱునై వెలయఁగాఁ బ్రౌఢిం దెనింగించి రౌ
ర మహిం దిమ్మయవేంకటాద్రివిభుపేరన్ వేడ్కఁ గామందకీ
యము శ్రీ వేంకటరామకృష్ణులు స్వభాన్వబ్దంబునన్ రూఢిఁగా.

అను నాశ్వాసాంతపద్యమును బట్టి యిది రామకృష్ణకవులచే రచితమని తెలియుచున్నది. కొంద ఱీగ్రంథము రామకృష్ణకవులను జంటకవులచే రచితమని యందురు గాని యందు కాధారము కానరాదు. ఆశ్వాసాంతగద్యముఁ బట్టి యది యొక్కనిపేరే యని తెలియనగును. పైపద్యమున బహువచన ముండుట పూజార్థము కావచ్చును.

కృతిపతి

ఈ కామందకకృతి నందికొనినది కొండ్రాజువెంకటాద్రిరాజు. ఈతఁ డారవీటివంశస్థుఁడగు కొండ్రాజు తిమ్మరాజు కుమారుడు. తెనాలి రామకృష్ణుని పాండురంగమాహాత్మ్యమునకుఁ గృతిపతియగు విరూరి వేదాద్రిమంత్రికి యజమానియగు పెదసంగభూపాలునకుఁ జెల్లెలికుమారుఁడు.

ఈ వెంకటాద్రి రెట్టమత మనెడిజ్యోతిషగ్రంథమునుగూడ నంకిత మందినాఁడు.

మ.

కపటారాతివిభంజనోద్ధతమతీ! కర్ణాటసింహాసనా
ధిపతిప్రాప్తరమాధురీణ! కరుణాబ్ధీ! కంతుసౌందర్య! కా
శ్యపసద్గోత్రపవిత్ర! నమ్రతరవాచానైపుణీనిర్జితా
హిప! కామందకకావ్యనాయక! కవీంద్రేష్టార్థసందాయకా!

రెట్టమతము

ఆంధ్రకామందకగ్రంథమునఁ బ్రధమాశ్వాసాంతమున

క.

శ్రీ చంచద్భట్టరు చి
క్కాచార్య వరార్య శిష్య యతులితశౌర్య
ప్రాచుర్యధుర్య గుణర
త్నాచల జయలలిత ధైర్య నయవినయనిధీ.

ఆం. కామందకము ఆ 1. ప.65.

అని వెంకటాద్రి సంబోధింపఁబడియున్నాఁడు. ఈతఁడు భట్టరు చిక్కాచార్యులకు శిష్యుఁడు. ఈ భట్టరు చిక్కాచార్యులకుఁ బలువు రాంధ్రకవులు శిష్యులుగా నుండిరి. చాతుర్వాటికామాహాత్మ్యము, ఆనందకాననమాహాత్మ్యము మొదలగు ప్రబంధములను రచించిన లింగమకుంట తిమ్మకవియు, తెనాలి రామకృష్ణకవియు నీతని శిష్యులే. ఈ విషయమును వారికృతులందలి పద్యములు తెల్పుచున్నవి.
క.

గురురాయపట్టభద్రుని
నరిహరు శ్రీరంగనాయకాంశభవున్ భ
ట్టరు చిక్కాచార్యుల మ
ద్గురులఁ దలఁచి యడుగులకు నతుల్ గావింతున్.

లింగమకుంట రామకవి

సీ.

శ్రీవైష్ణవహితుండఁ జిక్కయభట్టరు శిష్యుఁడ.

లింగమకుంట తిమ్మకవి

క.

వాక్కాంతాశ్రయభట్టరు
చిక్కాచార్యుల మహాత్ము శ్రీ గురుమూర్తిన్
నిక్కపుభక్తి భజించెద
నిక్కావ్యకళాకలాప మీడేరుటకున్.

పాండురంగమాహాత్మ్యము

ఈ వెంకటాద్రినరేంద్రుఁడు కామందక సప్తమాశ్వాసారంభమున నిట్లు సంబోధితుఁడయ్యెను.

క.

శ్రీమదహోబలనృహరి
స్వామిపునస్స్థాపనప్రశస్తజయాంకా
రామపదభక్తివరవి
ద్యామహ కొండ్రాజు వెంకటాద్రి నరేంద్రా.

ఆం. కా. 7. ఆ. ప. 1.

అని యుండుటచే నీ వెంకట్రాజు అహోబలస్వామి భక్తుఁడై యానృసింహదేవాలయము నుద్ధరింపఁ బ్రయత్నించినట్లు తెలియవచ్చుచున్నది. ఈ విషయమే రెట్టమతగ్రంథమునందును
సీ.

శ్రీమదహోబలస్వామిమహారాజ్య
          రక్షకుం డగుచు నేరాజు వెలయు
నభిరామకామందకాఖ్యసత్కావ్యర
          త్నమునకు నేరాజు నాథుఁ డయ్యె
నెరయూరిపురవరాధీశాది బహుబిరు
          దాంకుఁడై యేరాజు యశము గాంచె
జానకీనాయకచరణసంసేవన
         ప్రౌఢిచే నేరాజు ప్రబలు సిరుల


గీ.

నతఁడు కొండ్రాజు తిమ్మభూపతివరేణ్య
తనయ పెదతిమ్మరాజవతంస గర్బ
వార్ధిచంద్రుండు సత్కులవర్ధనుండు
సతతవిభవుండు వెంకటక్ష్మావిభుండు.

అని కలదు.

ఈ వెంకట్రాజు అహోబలము నుద్ధరించె ననుటకు అహోబలమహాద్వారమున శాసనప్రమాణ మున్నది.

"శుభమస్తు. శ్లో. దేవశ్రేణీశిరోరత్నం దైత్యద్విపఘటాంకుశమ్।
               జయతు శ్రీనృసింహస్య దేవదేవస్య శాసనమ్॥
స్వస్తిశ్రీ జయాభ్యుదయశాలివాహనశకవర్షంబులు 1506
అగు నేటి తారణ సం॥ వైశాఖశుద్ధ 14 శ్రీమద్రాజాధిరాజ రాజ
పరమేశ్వర శ్రీవీరప్రతాప శ్రీవీర శ్రీరంగరాయ దేవమహారాయలు
గారు పెనుగొండనగరమందు వజ్రసింహాసనారూఢులై పృథ్వీ
సాంమ్రాజ్యము చేయుచుండఁగాను శ్రీమద్వేదమార్గప్రతి

ష్ఠాపనాచార్య సర్వతంత్రోభయ వేదాంతాచార్యులయిన శ్రీ శఠ
గోపజియ్యంగారి కార్యకర్తలయిన రాచప్పగారున్ను శ్రీ అహో
బలస్థానంవారున్ను కాశ్యపగోత్ర ఆపస్తంబసూత్ర యజు
శాఖాధ్యాయులయిన సూర్యవంశోద్భవులయిన మూరురాయర
బసవశంకర గుత్తిహన్నిబ్బరగండ యెరయూరి పుర
వరాధీశ్వరులయిన శ్రీమన్మహామండలేశ్వర కొండ్రాజు
తిమ్మరాజుగారి పౌత్రులయిన తిమ్మరాజుగారి పుత్రులయిన
వేంకటరాజు దేవమహారాజులుంగారికి యిచ్చిన శిలాశాసన
క్రమ మెట్లన్నను, ప్రాక్‌బహుధాన్యనామ సంవత్సరాన నిభరామ
వారు హండేవారిని కూడుకొని సీమ యంతా రాచూరా పట్టి
అహోబలస్థలానకు వచ్చి అహోబలం అంతా పాడుసేసి అహో
బలస్థలం అయిదు ఆరుఏండ్లు తమ వశం చేసుక ఆక్రమించి
నడస్తూవున్న నిమిత్యం శ్రీ అహోబలేశ్వరులు సన్యాసం
ప్రసాదించిన ఆదిమమైన శఠగోప జియ్యంగారికి ఏడోతరమై
శ్రీ పురుషోత్తమ ఆళ్వారుల ప్రతిష్ఠ సేసి ముకుందదేవునిచేత
పూజగొని రామానుజదర్శనోద్ధారకులైన శ్రీ పరాంకుశమహాముని
శిష్యులయినటువంటి శ్రీ మచ్ఛరకోపస్వామివారిస్థలం యీతీరున
అయిననిమిత్తం శ్రీరంగరాయ దేవమహారాయుల సముఖాన తాము
మనవి చేసి మీరు యీతీరున రత్నసింహాసనారూఢులై వుండిన్ని
మీకులస్వామియైన అహోబలేశ్వరునిస్థలం తురకలు......"


ఈశాసనములోని వేంకటరాజుదేవమహారాజులుంగారు మనకామందక కృతిపతియగు వేంకటరాజే!


ముద్రణము.

తంజావూరు సరస్వతీమహలులోఁ దప్పులమయముగాఁ దాటాకుప్రతి యొకటియే కలదు. దానికి ప్రతి వ్రాయించి తత్పుస్తకశాలాధికారులు మాకుఁ బంపిరి. మక్కికి మక్కిగావ్రాసిన వ్రాత యగుటచే దానిని దిద్ది ముద్రణమున కిచ్చుటకు సాధ్యము కాదయ్యెను. అందుకై ముద్రణార్హముగా అధికపరిశ్రమమున నవీనముద్రణపులిపిరీతిచొప్పున ఛందోగణయతిభ్రంశరహితముగా వేఱొకప్రతి వ్రాయింపవలసె. ఎట్లో ప్రతి వ్రాయించి సందిగ్ధస్థలములను తంజావూరికిఁ బోయి మాతృకతో సరిచూచి దిద్ది యింకను దిద్దఁ గుదురని స్థలములను సంస్కృతమూలమును జూచి పూరించియును, అందును గుదురనిదాని నుచితరీతిని గ్రొత్తగా రచనము చేసియును గ్రంథమును బూరించితిని. తంజావూరినుండి పుస్తకము నాకు వచ్చినదాదిగా నిట్లు ముద్రిత మగునంతదాఁక జరిగిన నిర్వాహములో నాకుఁ గుడిభుజమై నాసహోద్యోగి విద్వాన్. సాహిత్యశిరోమణి, చిరంజీవి పంగనామాల బాలకృష్ణమూర్తి M. A. B. O. L. కడచిన వేసంగిసెలవులలో నా కెంతేని తోడ్పడెను. తంజావూరి సరస్వతీమహల్ పుస్తకాలయకార్యదర్శి శ్రీ యస్. గోపాలన్ B. A. B. L. గారును, నీముద్రణమును తిరుపతి రత్నాప్రెస్‌లోనే సాగించుటచే నాప్రెస్‌వారును మాకుఁ జాలఁగా ననుకూలించి యెంతేని తోడ్పడిరి. పైవారికి నే నెంతయుఁ గృతజ్ఞుఁడను.

ఈ కామందకకృతి యాంధ్రులయాదరము పడయఁగల దని, తంజావూరి సరస్వతీమహల్ లైబ్రరీలోని యముద్రితాంధ్రగ్రంథము లెల్ల సుముద్రితములై వెలయఁగల వని యాశించుచున్నాను.

తిరుపతి

1-8-50.

వేటూరి ప్రభాకరశాస్త్రి.

  1. ఇది "కౌటలీయ" మని వ్రాఁతప్రతులలో గలదు.
  2. ఇందాఁక శ్రీరామకృష్ణకవిగారు ఉపవేదములు అనుపేర రుధిరోద్గారి సం॥ ఆంధ్రపత్రికలో ప్రకటించిన వ్యాసమునుండి విషయము గ్రహింపబడెను.
  3. కౌటిలీయార్థశాస్త్రము - ఉపోద్ఘాతము — శ్రీ మామిడిపూడి వెంకటరంగయ్య ఎం. ఏ. గారు.