ఆంధ్రకామందకము/ప్రథమాశ్వాసము

ఆంధ్ర కామందకము

ప్రథమాశ్వాసము

క.

[1]అర్జున హర శరదభ్ర య
శోర్జునమతి లంక మల్లికార్జునవరజ
న్మోర్జితు నుతియింపం దగు
నర్జుననిభు లంకమల్లికార్జున విభునిన్.

1

★ ★ ★

క.

ఈ రీతిఁ బుత్రమిత్ర
శ్రీరాజితుఁ డగుచు రాజసేవితచరణాం
భోరుహుఁడై వేంకటధర
ణీరమణుఁడు వెలయు విజయనిత్యోర్జితుఁడై.

2

షష్ఠ్యంతములు

క.

ఏవం విధగుణలక్షున
కావార్ధి వసుంధరాతలాధ్యక్షునకున్
శ్రీవినుతకటాక్షునకు మ
హావైభవభోగజిత సహస్రాక్షునకున్.

3


క.

ధాటీఘనఘోటీఖుర
పాటితసమదారికోటిపక్షక్షితికిన్
లాటీవరభోటీ క
ర్నాటీ సంగీతకీర్తి నామోన్నతికిన్.

4

క.

కంధరగురుసింధురవర
బంధురతరదానసలిలపటునిర్ఝరసౌ
గంధ శ్రీసంవాసిత
సింధుతరంగునకు నయవిశిష్టాంగునకున్.

5


క.

పురహర గిరిధర శరహరి
సురకరి గురుతరలసద్యశోహారునకున్
వరనీరాకరధారా
ధర[2](వాహస్థైర్యధైర్య)తతసారునకున్.

6


క.

తెంకణచోళద్రావిడ
కొంకణభూపాలదత్తఘోటీపేటీ
సాంకవతతికిం దిమ్మయ
వెంకటజనపతికి నీతివిలసితమతికిన్.

7


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నా యొనర్పం బూనిన కామందక
నీతిశాస్త్రంబను మహాప్రబంధంబునకుం గ్రమం బెట్టిదనిన.

8


శా.

శ్రీమంత్రాఢ్యుఁడు విష్ణుగుప్తుఁడు వచశ్శ్రీ యుల్లసిల్లన్ ఘనం
బై మించంగ నొనర్చినట్టి నయశాస్త్రార్థంబు కామందకుం
డామోదంబున సంగ్రహించి నయకావ్యంబై తగన్ జేసె నీ
భూమిన్ సర్వహితంబుగా ఋజువుగా భూపాలయోగ్యంబుగాన్.

9


వ.

అవ్విధం బెట్టి దనిన.

10


క.

శ్రీమంతుఁడు గుణవంతుఁడు
ధీమంతుఁడు నైన రాజదేవుఁడు వెలయన్
దా మంతుకెక్కి యాజ్ఞన్
భూమీస్థలి నిత్యమార్గమున నిల్పె దయన్.

11

రాజప్రభావము

సీ.

అఖిలదిక్పాలురయంశముల్ దనయందె
          మిళితమై దీపించ మించురాజు
సకలవర్ణంబు లాశ్రమములు మర్యాద
          విడువకుండ నొనర్చి నడపురాజు
బలవంతు లెందు దుర్బలుల నొంచకయుండఁ
         జేసి నిచ్చలును బోషించురాజు
భువనశత్రువులను బొలియించి ప్రజలకుఁ
         జాలఁ గోరిక లీయఁ జాలు రాజు.


గీ.

పాపములు పుణ్యములు సేయు ప్రకృతు లెఱిఁగి
నిగ్రహానుగ్రహంబులు నెఱపురాజు
తాన భూభారమంతయుఁ దాల్చురాజు
ధరను బ్రత్యక్షదైవతం బరయ రాజు.

12


ఉ.

శ్రీలు చెలంగు వైభవము నెందు జయం బొనఁగూడుఁగీర్తియుం
జాలగఁ గల్గుఁ దేజము పొసంగు జగంబులు మెచ్చు నెందు భూ
పాలుఁడు సద్గుణోన్నతుల భాసిలినన్ గుణ మెచ్చుకుం దులన్
లీల వహించి కాదె ధరణీవిభుఁ డౌటయు బంటు లౌటయున్.

13


క.

అనిశము బుధసమ్మతుఁడగు
జనపతి దా హేతువగును జగ మలరించన్
గనుఁగవ కింపెసఁగెడు శశి
వననిధి నలరించి మించువైఖరి నెంచన్.

14


క.

లాలించి ధర్మగతిఁ బ్రజఁ
బాలించి మదారివీరపట్టణము బిలం
గూలించి మించురాజును
మేలెంచి విధాత యంచు మెచ్చుజగంబుల్.

15

క.

ప్రోడ యయి ప్రోచురాజును
గూడనినాఁ దెల్లజగము గొదవ వహించున్
బ్రోడయగు పీలికానిం
గూడని యల యోడజాడఁ గూడన్ జూడన్.

16


గీ.

రాజునందు మించు రక్షణంబందును
బేరములును గృషియుఁ బెంపు మీఱు
వానిఁ జెఱచు నపుడె మానవలోకంబు
బ్రతికి బ్రతుకకుండుపగిది నుండు.

17


క.

మానవపతి లోకమునకు
వానవలెం బ్రాపు దాపు వాన యుడిగినన్
దా నొకగతి మను లోకము
మానవపతిఁ గూడదేని మల్లట గుడుచున్.

18


క.

రాజు ప్రజను రక్షించును
రాజును బ్రజ ప్రబలఁజేయు రాజు ప్రబలినన్
రాజిల్లు సిరులు గావున
భూజను లెవ్వేళ రాజుఁ బూజింపఁ దగున్.

19


క.

నీతిగతిన్ వర్తించిన
భూతలపతి ధర్మకామములు నర్థము దా
నేతఱిఁ జెందుం బ్రజతో
నాతెఱఁ గెడలినను బ్రజయు నతఁడు నొగులరే.

20


క.

నహుషుఁ డధోగతిఁ బడియెన్
మహితంబగు ధర్మ మెడలి మహి జనకుఁడు దా
బహుతరసంపదఁ జెందఁడె
బహుకాలము మున్ను ధర్మపథనిశ్చలుఁడై.

21

వ.

అట్లు గావున.

22


క.

ధర్మము ముందర నిడికొని
ధార్మికుఁడగు నృపతి యర్థతతిఁ జెందఁ దగున్
ధర్మమున వెలయు రాజ్యము
ధర్మమునకు నెందు సంపదయు ఫలము గదా.

23

రాజ్య స్వరూపము

గీ.

రాజు మంత్రియు రాష్ట్రదుర్గములు కోశ
మును బలంబును జుట్టంబు ననఁగ నలరు
నంగములు గల్గు నదియె రాజ్యం బటండ్రు
దలఁప నది సత్త్వబుద్ధిచేఁ దనరుచుండు.

24


క.

అనిశము నుత్సాహంబునఁ
దనరుచు సత్త్వంబు చెంది తనబుద్ధిబలం
బున నీతి యెఱిఁగి రాజ్యం
బునకై యత్నంబు సేయఁబోలును బతికిన్.

25


క.

న్యాయమున ధనము గూడం
జేయుట యది రక్షణంబు సేయుట ప్రబలం
జేయుట సుపాత్రదానము
సేయుట యన నాల్గు గతుల క్షితిపతినడకల్.

26

నయప్రకారము

సీ.

నయము విక్రమము నున్నతిఁ జెంది యుత్సాహి
          యై సిరిఁ జెందుట కడరవలయు
నా నయమును వినయమె మూలముగ నుండు
          నా వినయమె యింద్రియములవిజయ

మది శాస్త్రనిశ్చయం బందినఁ జేకూరు
           నా శాస్త్రనిశ్చయం బందెనేని
శాస్త్రార్ధసిద్ధులు సంభవింపగఁ జేయు
           నందుచే సంపదఁ జెందు నెందు


గీ.

వినయ మందినఁ బ్రజలచే వినుతిఁ గాంచు
వినయమే సుగుణంబుల వెలయఁ జేయుఁ
గావున వినయ మెప్పుడు గలుగ వలయు
నీతిమార్గం బెఱింగిన నృపవరునకు.

27


సీ.

శాస్త్రంబు ధృతియుఁ బ్రజ్ఞయును సామర్థ్యంబుఁ
          ప్రతిభ మాటలనేర్పుఁ బ్రౌఢిమంబు
ధారణాశక్తి యుత్సాహంబుఁ గడు గట్టి
          తనము నాపదలకుఁ దాళికొనుట
పావనత్వంబుఁ బ్రభావంబు మైత్రియు
          నీగి సత్యంబు మే లెఱుఁగుటయును
శమము సత్కులమును దమము శీలంబును
          వినయంబు నయమును విక్రమంబు


గీ.

నాదిగాఁ గల సుగుణంబు లధికసంప
దలకుఁ గారణములు గాన ధరణినాథుఁ
డిట్టి సద్గుణగణముల నెనయ వలయు
దనమనంబున సిరిఁ జెందఁ దలఁచెనేని.

28

వినయప్రకారము

గీ.

మునుపుఁ దా వినయముఁ జెంది వెనుక వినయ
పరులఁగాఁ జేయవలయును నరవరుండు
దనప్రధానులఁ దనబంట్లఁ దనదుసుతులఁ
దనప్రజల నెందుఁ గ్రమముతో జనులు పొగడ.

29

క.

అనురక్తులైన మంత్రులఁ
దనరి ప్రజ న్మనుపఁజాలి తనమది శిక్షిం
చినయట్టి రాజవర్యుఁడు
ఘనమగు సిరి ననుభవింపఁగా నేర్చు నిలన్.

30

ఇంద్రియజయప్రకారము

గీ.

అరుల నొంపుచు విషయంపుటడవిలోన
బరువులెత్తెడి నింద్రియభద్రదంతి
జ్ఞాన మనుపేరఁ దగు నంకుశంబుచేత
దనకుఁ గైవసముగఁ జేసికొనఁగవలయు.

31


వ.

అది యెట్లన్నను జీవాత్మప్రయత్నంబువలన స్రక్చందన వనితా
విషయంబులనుం జెందెడికొఱకు మనంబుతోఁ గూడఁ గూడుచు
నుండు, దన్మనంబును భోగ్యవస్తువుల మీఁది లోభంబునఁ జక్షురాదీంద్రి
యంబులను జెంది వానిం బ్రేరింపుచు నుండు. నయ్యింద్రియంబులు
నయ్యర్ధంబులం గ్రహించుచు నుండు. నా జీవాత్మతోడం గూడినప్పుడు
మనంబువలననే యిట్టి ప్రవర్తన సంభవింపుచు నుండు, విజ్ఞానంబును
హృదయంబును జిత్తంబును బుద్ధియును మనఃపర్యాయంబు లనం
బరగుచుండు. నిట్టి జీవాత్మ గలుగుటకు ధర్మాధర్మంబులు నిచ్ఛా
ద్వేషంబులు సుఖదుఃఖంబులుం బ్రయత్నజ్ఞానసంస్కారంబు లనునట్టి
తొమ్మిది గుణంబులు గుఱుతు లగుచు నుండు. నయ్యింద్రియంబులకు
నర్థంబులతోడి సంబంధంబు గలిగియు నొక్కమాటున సిజ్ఞానంబులు
సంభవించకుండుట యెద్ది యదియ యణుమాత్రం బగు మనంబు గలదని
తెలుపుటకు గుఱు తగుచుండు వెండియు.

32


క.

ఎఱుఁగఁబడు నర్థములపై
గుఱియై తగఁ బొడమునట్టి కోరిక లెల్లన్
మెఱసిన మనంబుక్రియలని
నెఱవుగఁ దెలియంగ వలయు నేర్పరు లెందున్.

33

ఇంద్రియేంద్రియార్థస్వరూపము

సీ.

చెవి చర్మ మక్షులు జిహ్వయు ముక్కును
           నను నివి బుద్ధీంద్రియంబు లైదు
శబ్దంబు మఱియు స్పర్శంబు రూపంబు ర
           సము గంధ మనెడి విషయము లైదు
పాణి పాయువు గుహ్యపాదంబులును వాక్కు
           నివి యైదు దలఁపఁ గర్మేంద్రియంబు
లాదాన ముత్సర్గ మానందమును గతి
          యాలాపమును వీని కైదు క్రియలు


గీ.

దగు మనసు నాత్మ రెండు నంతఃకరణము
లగుచు నివి యప్రయత్నంబు నంది కూడ
గలుగు నీ రెంటివలన సంకల్ప మెప్పు
డిట్టి మార్గంబు నరవరుం డెఱుఁగ వలయు.

34


గీ.

తనువు బుద్ధీంద్రియంబు లర్థంబు లెందు
బాహ్యకరణంబు లనఁగ నేర్పడి తనర్చు
నవియు గలుగుట దెలియంగ నగును గోర్కి
సరణిచే నిశ్చయజ్ఞానసరణిచేత.

35


క.

ఇల బాహ్యాంతఃకరణం
బులు మెలఁగుచు నుండు యత్నములు ముందరగాఁ
గల యత్నము లుడుగుటచే
గలుగుఁ గద మనోజయమ్ము గలవారలకున్.

36


గీ.

ఇట్టు లింద్రియజయముచే నెపుడు మనసు
నాత్మయం దొనఁగూర్పుచు నాత్మహితము
నేర్పుతోఁ జేసికొనఁదగు నీతి, దుష్ట
నీతి నెఱుఁగుచు ధరణిలో నృపవరుండు.

37

ఇంద్రియనిగ్రహము లేనివానికి ఫలము

క.

లీలఁ దనమనసుఁ గెలువం
గా లేని మహీవిభుండు గడు శౌర్యముచే
వేలావలయితధరణీ
పాలుర నేరీతి గెలుచుఁ బ్రాభవ మెసగన్.

38


క.

హరియింపుచుఁ జేతలతుద
విరసములై యుండునట్టి విషయంబులచే
నరపతి బోధితుఁడై తాఁ
గరికరణిం గట్టుపడుచు గాసిం బడడే.

39


క.

వినుటయుఁ గనుటయు వాసనఁ
గొనుటయుఁ జవిఁగొనుట యంటికొనుటయు నీ యై
దును దా మొకటొకటియ ప్రా
ణిని జెఱుపఁగఁ జాలు ధారుణీస్థలియందున్.

40


వ.

అది యెట్లన్నను.

41


సీ.

కసవులు దిని శుద్ధి గని దవ్వుగా దాఁటు
           లేళ్ళు ఘంటలమ్రోఁతవల్లఁ జెడుట
దరువులఁ బెకలించు గిరివంటి కరి పెంటి
           ముట్టుచే మ్రాఁకునఁ గట్టుపడుట
దీప్తమై కనుపట్టు దీపంబుఁ గనువేడ్క
           మిడుతలు దానిపైఁ బడి మడియుట
కనరాకఁ గడు లోఁతుఁగల నీట నుండు మ
           త్స్యంబు గాలపుటెర చనిఁ బొలియుట


గీ.

మదముఁ గ్రోలంగఁబోయి బెట్టిదము లగుచు
నడరు గజముల చెవులతాఁకుడులచేతఁ

దేఁటిదాఁటులు నొగులుటల్ దెలిసి నరుఁడు
విషయములమీఁద నాసక్తి విడువ వలయు.

42


గీ.

విషసమములైన విషయముల్ వేఱువేఱ
నొనరిచి యొకటి చెఱుపఁగా నోపు మనుజుఁ
డైదు విషయంబులను జెందునట్టి మనుజుఁ
డెంచి చూడంగ నెటుల జయించి యుండు.

43


వ.

ఇ ట్లయియుండియును వెండియు.

44


శా.

చాలం గాంక్షలు మాని భూవిభుఁడు నిచ్చల్ సౌఖ్య మందం దగున్
లీలన్ వేళనె భోగ్యవస్తువులచే లేకుండినం గామినీ
జాలంబున్ సరసత్వమున్ విభవమున్ సౌందర్యమున్ శత్రుభూ
పాలోత్తంసులఁ ద్రుంచుటల్ సిరులు సంపాదించుటల్ వ్యర్థముల్.

45


గీ.

ధర్మమున నర్థ మొనరు నర్థమునఁ గామ
మలరుఁ గామంబుచేత సౌఖ్యంబు గలుగు
నట్టి ధర్మంబు నర్థంబు నడఁచి విభుఁడు
కామ మొందుట మృతినొందఁ గడఁగి కొనుట.

46

స్త్రీవిషయకామమునందలి దోషము

ఉ.

సంతస మావహింపఁగల చంద్రనిభాస్య యటన్నపేరు వి
న్నంతనె యెంతవానిహృదయంబు తరంగితమై కరంగఁగా
వింతవిలాసముం బొరయ వ్రేఁకపుగుబ్బలు మేలిచూపులుం
గుంతలముల్ జెలంగు నల కొమ్మలఁ జూచిన నేమి చెప్పఁగన్.

47


చ.

వలపుల సొంపు కెంపు జిగివన్నియ వాల్గడకన్నులం గనం
గలకల మంచు మించు మృదుగద్గదభాషలు, నేకతంపు చ
ర్యలు వెలలేని మెచ్చుల యొయారి తుటారి మిటారి యొప్పులుం
గల కలవాణి యేనరునిఁ గాఁకలఁ బెట్టదు గుట్టు ముట్టఁగన్.

48

క.

జడదారిమనసునైనన్
గడురాగముఁ జెందఁ జేయుఁ గాంతామణి యే
యెడ సంజప్రొద్దు చందురుఁ
గడురాగముఁ జెందఁజేయుకరణిన్ ధరణిన్.

49


ఉ.

ఎంతయు మందయానముల నెంచగ మించి ప్రసన్నలీలలన్
సంతస మందఁజేయఁగల చంద్రనిభాస్య లదెట్టివేళ భే
దింతురు నేర్పుతోడ నతిధీరుల నైనఁ గ్రమంబుచేత నీ
రెంతయుఁ గొండలం బలె మహీస్థలియందుఁ దలంచి చూడఁగన్.

50


గీ.

మానమును గ్రోధలోభముల్ మదగుణంబు
కామమును హర్ష మనుచుండఁ గలిగినట్టి
వైరిషడ్వర్గ మడఁపగా వలయు రాజు
వీని విడిచిన సౌఖ్యంబు వెలయుఁ గాన.

51


సీ.

ధరఁ గోరికలవల్ల దండాఖ్యుఁ డనురాజు
          మెఱయఁ గిన్కను జనమేజయుండు
నధికలోభంబున నల పురూరవుఁడును
          వాతాపి హర్షంబు వదలకుండి
మానంబువలన దశాననదైత్యుండు
          దంభోద్భవుండు మదంబువలనఁ
జెడుటయు మఱి వీని విడుచుటవలన, నా
          భాగమహీపతి పరశురాముఁ


గీ.

డంబరీషాదు లిల నేలినట్టిక్రమము
లెఱిఁగి నేర్పరియగు ధారుణీశ్వరుండు
శత్రుషడ్వర్గ మడఁచిన సంతతంబు
జనులు వినుతింప నేలు నీ జగతి నెల్ల.

52

విద్యావృద్ధసంయోగము

క.

ధర సుజనసమ్మతంబగు
చరితంబున ధర్మ మర్థసంగతినిన్ స
ద్గురు నాశ్రయించి విద్యల
నిరవుగఁ బతి చదువఁ దగు జితేంద్రియుఁ డగుచున్.

53


ఉ.

విద్యలు చెందగా వలసి వేడుకతో గురు నాశ్రయించుటన్
విద్యలు చెందు టెల్ల సరవిన్ వినయంబును బెంచుఁ బూన్కిమై
విద్యలఁ జెంది సద్వినయవృత్తిఁ జరించుట యల్ల పూభా
వోద్యతలీల నాపదల నొందక వర్థిలు నందుకై ధరన్.

54


క.

జనపతి యీగతిఁ బెద్దలఁ
గని మని సేవింప సుజనగణసమ్మతుఁడై
దనరుం గుజనులు ప్రేరే
చినయెడ నేకార్యములను జెందక యుండున్.

55


క.

సతతంబుఁ గళలఁ జెందిన
క్షితిపతి యభివృద్ధిఁ జెంది చెలఁగుచు నుండున్
సతతంబుఁ గళలఁ జెందుచు
సితపక్షమునందుఁ జెలఁగు సితకరుమాడ్కిన్.

56


వ.

అట్లు గావున.

57


క.

గురుఁ గొలువ వలయు విద్యా
గరిమను గులగురువువల్లఁ గలిగినవిద్యల్
ధర ధనము నయము దానం
బరమతములు దెలియు నందు ఫలసిద్ధి యగున్.

58


చ.

జగమునకంటె వేఱె యయి చాల స్వభావముచేత నుద్ధతిన్
దగు ధరణీపతిత్వము సదా వినయంబునఁ గూడఁ జేయఁగా

నగుఁ గడు బల్మినైన వినయంబుసుమీ నయసిద్ధి యందుఁ దా
మిగులఁ బ్రధానమై వెలసి మించు వహించు నుదంచితస్థితిన్.

59


ఉ.

ఈగతి నీతిరీతిఁ దగి యెల్లపుడున్ వినయంబుతోఁ గడున్
ధీగరిమం జెలంగు జగతీపతి దా నరదేవసేవితం
బై గణనీయ మున్నతమునై తగు శ్రీయుతమౌ పదంబు ను
ద్యోగము మించఁగాంచును మహోన్నతమేరుశిఖాగ్రముంబలెన్.

60


గీ.

అధికుఁడైన వినయ మందకుండినఁ దన
పగఱచేతఁ జిక్కుపడుచు నుండు
నల్పుఁడైన వినయ మందియుండినఁ దన
పగఱఁ గదిమి చిక్కుపఱిచి గెలుచు.

61


చ.

జనులకుఁ గొల్వఁగాఁ దగును జాలఁగ రాజు వినీతుఁడైనచో
వినయమె భూషణంబు పృథివీపతికిన్ వినయంబుఁ జెంది మె
ల్లని కరచర్య దానము విలాసము గల్గిన భద్రమూర్తియై
తనరు గజేంద్రుచందమునఁ దాఁ జెలువొందు నరేంద్రుఁ డున్నతిన్.

62


ఉ.

నీతియు విద్య గల్గు ధరణీపతికిన్ వినయంబు భూషణం
బై తగు నందువల్లఁ బ్రజ లందరు చేరుదు రందుచే రిపుల్
భీతిలి కొల్వఁజొత్తు రరిభీకరుఁడై తగెనేని సర్వధా
త్రీతల మేలు నేలుటలఁ దేజము సంపద కీర్తి చెల్వగున్.

63


శా.

శ్రీమద్రామకృపాకటాక్షకలితశ్రీయుక్త యుక్తక్రియో
ద్దామాచారవిశేష శేషవిలసద్భాషాసుదాధార ధా
రామంజుక్రమఘోటికాఖురపుటప్రక్షుణ్ణవిద్వేషవ
ద్భూమీనాయకలోక లోకవినుతాంభోజాప్తవంశాగ్రణీ.

64

క.

శ్రీ చంచద్భట్టరు చి
క్కాచార్య వరార్య శిష్య యతులితశౌర్య
ప్రాచుర్యధుర్య గుణర
త్నాచల జయలలితధైర్య నయవినయనిధీ.

65


పంచచామరము.

ధరాధరాధిరాజ రమ్యధైర్యవీర్యశౌర్యభా
సురాసురాగ నాగపూర్ణసోమదామకీర్తిమే
దురాదురానదోగ్రజన్య ధూతభీతశత్రుభూ
వరావరాంగ మంజువాక్యవైఖరీధురంధరా.

66


గద్యము:

ఇది శ్రీమన్మదనగోపాలవరప్రసాదలబ్ధ సారసారస్వత
భారద్వాజసగోత్ర జక్కరాజ యెఱ్ఱనామాత్యపుత్ర సుకవిజన
విధేయ శ్రీరామకృష్ణభక్తివైభవభాగధేయ వేంకటనామధేయ
ప్రణీతంబైన కామందకనీతిశాస్త్రంబను మహాప్రబంధంబునందు
రాజప్రభావంబును, నయవినయమనోజయప్రకారంబును విద్యా
వృద్ధసంయోగప్రచారంబును నన్నది ప్రథమాశ్వాసము.



  1. వ్రాఁతప్రతిలో నున్న యీపద్యము గ్రంథస్థ మగునో కాదో తెలియదు. లిపికారుని పద్య మేమో.
  2. (---------------)