అమ్మనుడి/సంపుటి 7/మార్చి 2021/విద్యనూ భాషనూ ప్రజాస్వామీకరించడంతోనే అభివృద్ధి

మాతృభాషలొ బొధన

డాక్టర్‌ "షేఖ్‌ మహబూబ్‌ బాషా 9160579705

డాక్టర్‌ మొహమ్మద్‌ కరీం

విద్యనూ భాషనూ ప్రజాస్వామీకరించడంతోనే అభివృద్ధి

మాతృభాషలోనే చదువులూ, పరిపాలనా తప్పని సరి; మౌలానా ఆజాద్‌


“తనలో అంతర్నిహితంగా ఉన్న శక్తులను అభివృద్ధిపరచుకొని పరిపూర్ణమానవ జీవితాన్ని జీవించేందుకై విద్యను సముపార్ణించే హక్కు ప్రతి వ్యక్తికీ వుంది. అలాంటి విద్య పౌరుల జన్మహక్కు ఈ అవకాశాన్ని పౌరులందరికీ కల్పించనంత వరకూ- రాజ్యం తన బాధ్యతల్ని నిర్వర్తించినట్లు చెప్పుకోజాలదు...ఉద్యోగ అవకాశాలతో సంబంధం లేకుండా సెకండరీ స్థాయిదాకా రాజ్యం తన పౌరులకు విద్యావకాశాలను కల్పించాలని నేను ప్రగాడంగా విశ్వనిస్తాను.” అని భారత స్వాతంత్రోద్యమ అగ్రనాయకుల్లో ఒకరైన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ అన్నారు. స్వతం త్రభారత విద్యాశాఖా మాత్యుని హోదాలో 30 'సెస్టెంబరు, 1950న ఆకాశవాణి ద్వారా ప్రసంగిస్తూ ఆయన ఈ సందేశం ఇచ్చారు. మౌలానా ఆజుద్‌గా ప్రఖ్యాతులైన మోహియుద్దీన్‌ అహ్మద్‌ భారత స్వాతంత్య్రొద్యమంలో పోషించిన మహత్తర పాత్రగూర్చి మనకు కాస్తోకూస్తో తెలుస్తున్నప్పటికీ, స్వతంత్రభారత ప్రప్రధమ విద్యాశాఖామంత్రిగా ఆయన అందించిన సేవలు దాదాపుగా మరుగున పడ్డాయి. ఈ నేపథ్యంలో మాతృభాషలో విద్యాబోధనపై వివిధ సందర్చాలలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలను పౌరులకు పరిచయం చెయ్యడమే ఈవ్యాసం ఉద్దేశం. విషయంలోకి వెళ్ళేముందు స్వతంత్ర భారత విద్యారంగానికి ఆయన అందించిన సేవలను స్థూలంగా తెలుసుకుందాం.

స్వాతంత్య్రం రాక పూర్వమే జవహర్‌లాల్‌ నెహ్రూ నాయకత్వంలో ఏర్పడ్డ తాత్మాలిక ప్రభుత్వంలో వివిధ నాయకుల ఒత్తిడి మేరకు ప్రవేశించి ఐచ్చికంగా విద్యాశాఖను స్వీకరించారు మౌలానా ఆజాద్‌. 15 జనవరి 1947 నుండి 22 ఫిబ్రవరి 1958న చనిపోయేదాకా 11 సంవత్సరాలకు పైగా కేంద్రప్రభుత్వ విద్వాశాఖామంత్రిగా పనిచేశారు. శాస్త్రీయ పరిశోధన, సాంస్కృతిక వ్యవహారాల శాఖలనూ ఆయనే నిర్వహించారు. న్వతహాగా గొప్ప దార్శనికుడూ, మహాపండితుదూ, విశ్లేషకుడూ అయిన మౌలానా ఆజాద్‌ ఈ రంగాలకు పటిష్టమైన పునాదులు వేశారు. దేశాన్ని నిజమైన 'ప్రజాస్వామీకరణకు శ్రీకారం చుట్టారు. అందుకే విద్యా సముపార్జన పేదల జన్మహక్మని నినదించిన అజాద్‌, వారికి విద్యనందించడం రాజ్యం మౌలిక బాధ్యత అన్నారు. ఈ లక్ష్య సాధన దిశగా ప్రాధమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలకు నిర్దిష్టమైన ప్రణాళికలేర్చరిచారు. ప్రజాస్వామ్య ఆదర్శాలను గ్రామీణ ప్రాంతాలదాకా తీసుకెళ్లాలని భావించి గ్రామాల్లో విద్యావకాశాల మెరుగుదలకు కృషి చేశారు. ముఖ్యంగా ప్రాధమిక విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఉచిత, నిర్బంధ ప్రాధమిక విద్యను ప్రవేశపెట్టారు. మౌలానా ఆజాద్‌ పట్టుదల కారణంగా 1947లో కేవలం రెండుకోట్లున్న విద్యాశాఖ కేటాయింపు 1957 నాటికి 30 కోట్లకు పెరిగింది. అంతస్తుల దొంతరల భారతీయ సమాజంలో తరతరాలుగా తీవ్ర వివక్షకు గురైన దళిత, వెనుకబడిన కులాలు, బలహీన వర్షాలకు చెందిన పిల్లలకు విద్యావకాశాలను కల్పించే లక్ష్యంతో ఉపకారవేతనాలందించే అధికారిక విధానానికి స్పష్టమైన రూపురేఖలనిచ్చారు. 1944లో కేవలం మూడు లక్షలే ఉన్న సదరు కేటాయింపు ఆజాద్‌ కృషి ఫలితంగా 1960 నాటికి 2.25 కోట్లకు అంటే 75 రెట్లు పెరిగింది. కేంద్ర బడ్జెట్‌లో కనీసం 10% విద్యకు కేటాయించాలని ఆయన డిమాండు చేశారు.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో తన దేశ పురోభివృద్ధిని కాంక్షించిన మౌలానా ఆజాద్‌ చేతుల్లో జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక పరిశోధనా సంస్థలూ, ప్రయోగశాలలూ ప్రాణం పోసుకున్నాయి. ఐ.ఐ.టి లూ, సి.యస్.ఐ.ఆర్‌., ఏ.ఐ.సి.టీ.ఈ., ఐ.ఐ.యస్‌- బెంగుళూరు, ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ పాలిటెక్నిక్‌ మొదలైనవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఉన్నత ప్రమాణాలు కలిగి, అంతర్జాతీయంగా పోటీపడగలిగే విదంగా యూనివర్సిటీ విద్య ఉండాలనీ, ఉపాధ్యాయుల జీతభత్యాలూ, వారి జీవన ప్రమాణాలూ మెరుగ్గా ఉండాలనీ ఆయన భావించారు. దాంతో యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ ఉనికిలోకి వచ్చింది. రాధాకృష్ణన్‌ కమిషన్‌ (1948) ఖేర్‌ కమిటి (1948), మొదలియార్‌ కమిషన్‌ (1953) లు ఆయన మార్గదర్శకత్వంలో నడిచాయి. శాస్త్రసాంకేతికాభివృద్ధి మోజులో పడి మానవీయ శాస్త్రాల్ని విస్మరించరాదని ఆయన హెచ్చించాడు. స్త్రీల అభివృద్ధిపట్ల నిర్దిష్ట అభిప్రాయాలు కలిగిన ఆజాద్‌ స్త్రీవిద్య పట్ల ప్రత్యేకదృష్టి సారించారు.

దేశప్రజల మభ్య మానసిక ఐక్యతను సారించే దిశగా విద్యావ్యవస్థను మలచదలచుకొన్న మౌలానా ఆజాద్‌ -దేశ, సాంస్కృతిక బహుళత్వంలో వివిధ సంస్కృతుల మధ్య సామరస్యంతో కూడిన అవగాహన ఉండాలని బలంగా విశ్వసించారు. పరస్సర ప్రేమ, సహనం, సౌభ్రాతృత్వం, శాంతియుత సహజీవనం, మానవ హక్కులగుర్తింపు, భిన్నత్వాల పట్ల గౌరవ మానవీయ విలువల్నీ విశ్వమానవ ఏకత్వాన్నీ బోధించే విధంగా పాఠ్యపుస్తకాలు రూపొందాలన్నారు. చిన్నప్పటినుండీ పసిమెదళ్ళలో సదరు విలువల్ని నూరిపోయాలన్నారు.

విద్యారంగానికి ఎంత గొప్ప సేవలందించాడొ సారస్వత, కళారంగాలకూ అంతే సేవలందించాడు. స్వతహాగా గొప్ప సాహితీవేత్తా, కళాపిపాసి అయిన ఆజాద్‌, సాహిత్య అకాడమీ, లలితకళా ఆకాడమీ, సంగీత నాటక అకాడమీ మొదలైన సంస్థలను స్థాపించాడు. భారతీయ వారసత్వంలో అవిభాజ్య భాగమైన సాంస్కృతిక ఆదాన-ప్రదాన క్రమాలను ప్రోత్సహిస్తూ - ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌ని స్థాపించాడు. సారస్వత, కళారంగాల్లో ఉండి ఆర్దికంగా 'కుంగదీసే పరిస్థితులున్న వారికోసం పెన్షన్‌ పథకాన్ని ఏర్పాటు చేశాడు. ఇలా ఎన్నో విధాలుగా ఆయన అమోఘమైన 'సేవలందించాడు. ఆయన జన్మదినాన్ని - 11నవంబరు -జాతీయ విద్యాదినోత్సవం'గా ప్రకటించి భారత ప్రభుత్వం గౌరవించింది.

1947 డిసెంబరు 21న మౌలానా అజాద్‌ పట్నా విశ్వవిద్యాలయ (బీహార్‌) స్నాతకోత్సవంలో ఉపన్యసించాడు. అందులో మాతృభాషలో విద్యాబోధనకు సంబంధించి తన అభిప్రాయాలను స్పష్టంచేశాడు.సంప్రదాయానికి భిన్నంగా అంటే ఇంగ్లీషులో కాకుండా తన ప్రసంగాన్ని అతడు హిందూస్టానీలో చేశాడు. భారతదేశ విశ్వవిద్యాలయాల చరిత్రలో ఒక స్నాతకోత్సవ ఉపన్యాసం ఇంగ్లీషులో కాకుండా ఒక భారతీయ భాషలో చేయడమన్నది బహుషా అదే మొదటిసారి. ఇంగ్లీషులో కాకుండా భారతీయ భాషలో ఉపన్యసిస్తున్నందుకు క్షమాపణలు కోరాల్సిన అవనరం లేదనీ, ఒక భారతీయ విశ్వవిద్యాలయంలో, భారతీయుల ముందునిలబడి, భారతీయ భాషలో మాట్లాడడం అసంజసమేమీ కాదనీ విశదం చేశాడు. నిజానికి వలసవాద విద్యావిధానం మనమీద రుద్దిన ఇంగ్లీషులో మాట్టాడినపుడే క్షమించమని అడగాల్సిన అవసరం ఉంటుందన్నారు. 'బ్రిటీషువాళ్ళు ప్రవేశపెట్టిన ఆంగ్ల్గమాధ్యమంలో విద్యాబోధన భారతీయుల జీవితానికీ, అవనరాలకూ ఖిన్నంగా ఉండిందనీ, ఫలితంగా భారతదేశంలో ప్రవేశపెట్టిన ఆధునిక విద్యావిధానం “అభారతీయం”గా వుండిందనీ తేటతెల్లం చేశాడు. వలసవాదులు ప్రవేశపెట్టిన అంగ్ల భాషామాధ్యమం కారణంగా భారతీయుల మనసులు, మేధస్సు సహాజంగా కాకుండా అసహజంగా రూపుదిద్దుకొన్నాయన్నాడు. వివిధ విషయాలు నేర్చుకోవడానికి కేటాయించాల్సిన సమయంలో అత్యధిక భాగం విదేశీ భాషను నేర్చుకోవడానికీ దానిమీద పట్టుసాధించడానికీ కేటాయించాల్సి వచ్చిందనీ సదరు విద్యావిధానం వల్ల భారతీయ భాషల అభివృద్ధి కుంటుబడిందనీ స్పష్టంగా ప్రకటించాడు. భారతదేశంలా కాకుండా ఇతర ఆసియా దేశాలైన ఈజిఫ్ల, సిరియా టర్కీ పర్షియా, చైనా, జపాన్‌ మొదలైనవి ఆధునిక విద్యను అందిపుచ్చుకున్నా యూనివర్సిటీ స్థాయిల్లో కూడా బోధనా మాధ్యమంగా మాత్రం తమ తమ మాతృభాషల్నే వినియోగించినాయనీ, తద్వారా అవి సాధించిన అభివృద్ధి మన కళ్ళముందే కన్చిస్తున్నదనీ వివరించాడు. భారతదేశ విద్యావ్యవస్థ అంగ్లేయుల చేతుల్లో కాకుండా భారతీయుల చేతుల్లో వుండి వున్నట్లైతే వారు కూడా టర్కీ జపానుల్లాగే తమ తమ మాతృభాషల్లోనే విద్యాభ్యాసం చేని ఉండేవారనీ కానీ బిటీష్‌ వలసవాదం అ అవకాశాన్ని త్రుంచివేసిందనీ అన్నారు.

ఇంగ్లీషు భాష జాతీయ జీవనంపై వేసిన ప్రభావాన్ని గూర్చి తెల్పితే అది కొన్ని విషయాల్లో చెరుపు చేసినప్పటికీ కొన్ని విషయాల్లో మంచే చేసిందనేది అందరూ గుర్తించాలన్నారు. ఇంగ్లీషు చేసిన మంచి పనుల్లో ఒకటి వివిధ భాషలు కలిగి ఉపఖండంగా ఉన్న దేశంమొత్తంలో కాశ్మీరునుండి కన్యాకుమారిదాకా ఐక్యతను సాధించి, వివిధ ప్రదేశాల ప్రాదేశిక ప్రభుత్వాల, విశ్వవిద్యాలయాల, శాసన సభల మధ్య ఒక లంకెలా పనిచేయడం. అంతర్జాతీయ స్థాయిలో కూడా మధ్యవర్తి అవసరం లేకుండానే (అనువాదకులు) భారతదేశానికి గుర్తింపూ వివిధ దేశాలతో నంబంధాలూ ఇంగ్లీషుద్వారానే యేర్చడ్డాయి. అయినప్పటికీ ఇంగ్లీషును ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, విద్యా సంస్ధల్లోనే ఎంతో కాలం కొనసాగించలేమని ఆజాద్‌ అభిప్రాయపడ్డారు. క్రమక్రమంగా భారతీయ భాషలు దాని స్థానాన్ని ఆక్రమించాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కాణించారు. తన విద్యాభ్యాసాన్ని గూర్చి వివరిస్తూ తాను ఎప్పుడేగాని ఏ ఆంగ్ల విద్యాసంస్థలోనూ చదువుకోలేదనీ, తన విద్యాభ్యాసమంతా పర్షియన్‌, అరబిక్‌లతో ఇంట్లోనే సాగిందనీ, తన సొంత ప్రయత్నం ద్వారానే ఇంగ్లీషు నేర్చుకొన్నాననీ, కాబట్టి భారతీయుల విద్యావిధానంలో ఇంగ్లీషు స్థానానికి సంబంధించి తాను నిష్పాక్షికమ్రైన అభిప్రాయాల్ని వెలిబుచ్చగలననీ వివరించారు.

భాషా సమస్య రెండు విషయాలకు సంబంధించిందనీ, ఒకటి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిందైతే యింకోటి విద్యకు సంబంధించిందనీ తెలియజేశారు ఆజాద్‌. ఆయన ప్రకారం కేంద్రప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాలు ఐదు సంవత్సరాలపాటు ఇంగ్లీషుతో పాటుగా ప్రాంతీయ భాషల్ని కూడా పాలనా వ్యవహారాల్లో ఉపయోగించాలి. ఈ ఐదేండ్లలోపు ప్రాంతీయ భాషను పాలనా భాషగా అభివృద్ధిచేసి అరో సంవత్సరం నుండే ఇంగ్లీషు స్థానంలో దాన్ని ప్రవేశపెట్టి ఇంగ్లీషును పూర్తిగా తీసివేయాలి. అంటే ఐదేండ్ల వరకు అధికారభాషలుంటాయి - ఒకటి 'ప్రాంతీయభాష, రెండోది ఇంగ్లీషు. ఆరో సంవత్సరం నుండి కేవలం ప్రాంతీయ భాషొక్కటే అధికార భాషగా చలామణీ అవుతుంది. ఇంగ్లీషు పూర్తిగా తప్పుకుంటుంది.

ఆజాద్‌ ప్రకారం ప్రాధమిక స్థాయి నుండీ విశ్వవిద్యాలయ స్థాయి వరకూ మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. ప్రాధమిక మాధ్యమిక స్థాయిల వరకు సమన్య లేదుకాని ఉన్నతవిద్యలో మాత్రం మాతృభాషలో విద్యాబోధన సవాళ్ళతోకూడుకొన్నదని అన్నారు. అయినప్పటికీ ఈ విషయంలో వెంటనే పని ప్రారంభించాలనీ ఇక్కడ కూడా ఒక ఐదు సంవత్సరాల కాలవ్యవధిని యేర్చాటు చేసుకోవాలనీ ఈ మధ్యకాలంలో ఎంతటి అభివృద్ధిని సాధించాలంటే అరో సంవత్సరంనుండి ఉన్నత విద్యకు చెందిన అన్ని శాఖల్లోనూ మాతృభాషే బోధనా మాధ్యమంగా ఉండేలా చూడాలని స్పష్టం చేశాడు. ఇలా అంటున్నామంటే మన విద్యావ్యవస్థలో ఇంగ్లీషుకు అసలెలాంటి స్థానమూ లేకుండా చేయడం కాదనీ, యూరప్‌, అమెరికాల్లో సాధించిన అభివృద్ధితో సంపర్కంలో ఉండడానికి ఇంగ్లీషు సాంగత్యం అవనరమనీ, ఇంగ్లీషు అంతర్జాతీయ భాషగా ఉంది కాబట్టి మన ప్రయోజనాలకోసమే దాన్ని ఒక ముఖ్యమైన ద్వితీయభాషగా చదువుకోవాలనీ తెలియజేశారు. (“సెలెక్టెడ్ వర్స్క్ఆఫ్‌ మౌలానా అబుల్‌ ఆజాద్‌” రవీంద్రకుమార్‌ (సంపాదకులు), సంపుటి. ౩ పుటలు 97-106).

1948 జనవరి 13న సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ 14 వ సమావేశంలో మాట్లాడుతూ “ఒక విదేశీ భాష ద్వారా విద్యనందించడం ప్రాధమికంగా తప్పు” అని నిక్కచ్చిగా అభిప్రాయపడిన మౌొలానా అజాద్‌ ఒక విదేశీ భాషద్వారా (ఇంగ్లీషుద్వారా) విద్యాభ్యాసం చేయడం ఒక మద్రాసీకి గాని, పంజాబీకి గాని, బెంగాళీకి గాని కష్టం కానపుడు ఒక భారతీయ భాషద్వారా (మాతృభాష) విద్యాభ్యాసం చేయడం వారికేవిధంగా కష్టమౌతుందని ప్రశ్నించారు. ఆంగ్లం కాకుండా ఏదేని భారతీయ భాషద్వారా విద్యాభ్యాసం చేయడంద్వారా కూడా భారతీయులు మేధోపరమైన ఐక్యతను సాధించగలరనీ, నిజానికి భారతీయ భాషల్లో విద్యాభ్యాసం చేయని పక్షంలోనే మన మేధోపరమైన ఐక్యత తప్పకుండా దెబ్బతింటుందనీ స్పష్తంగా చెప్పారు. కాబట్టి విశ్వవిద్యాలయ స్థాయి బోధన కూడా మాతృభాషా మాధ్యమంలోనే జరగాలని నొక్కివక్కాణించారు. (సంపుటి ౩పు. 113) విశ్వవిద్యాలయ స్థాయిలో బోధనా మాధ్యమ మార్పుకు సంబంధించిన విషయాన్ని చర్చించడానికి 1948 లో విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో సమావేశాన్ని యేర్పాటు చేశాడు. అందులో క్రమక్రమంగా ఇంగ్లీషుకు నుండి మాతృభాషలకు మారడానికి నిర్ణయం తీసుకోవడంతోపాటుగా ఉన్నత విద్యకు తోడ్పేడే విధంగా పారిభాషిక పదాలను తయారు చేసుకోవడానికి ఒక బోర్టును నియమించడానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. (సంపుటి. 6,పు. 233)

1951 మార్చి 15న ఆల్‌ ఇండియా కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ లెటర్స్‌ మొదటి సమావేశంలో ప్రసంగిన్తూ బ్రిటీష్‌ పరిపాలనా కాలమంతటిలోనూ యూనివర్సిటీ స్థాయిలో మాతృభాషలు బోధనామాద్యమంగా లేకపోవడంచేత వాటి అభివృద్ధి కుంటుపడిందనీ, స్వతంత్ర భారతదేశంలో వాటికి గుర్తింపూ, గౌరవం లభించాయి కాబట్టి, రాబోయే 15 సంవత్సరాలలో అవి యూనివర్సిటీ స్థాయిలో ఇంగ్లీషు స్థానాన్ని అక్రమించబోతున్నాయి కాబట్టీ ప్రభుత్వాల తోడ్పాటుతోనూ, యూనివర్సిటీ స్థాయి విద్యాబోధనతోనూ దేశీయభాషలు (మాతృభాషలు) అభివృద్ధి చెందబోతున్నాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. (సంపుటి 5,పు. 15)

ఉన్నత విద్యలో మాతృభాషా మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నాక ఈ మార్గాన్ని సులభతరం చేసుకోవడానికి పారిభాషిక పదాలను తయారు చేసుకోవాల్సిన అవసరం గూర్చి ఆలోచించారు మౌలానా ఆజాద్‌. 1948 జనవరి 16న కొత్తడిల్లీలో జరిగిన “ఆల్‌ ఇండియా ఎడ్యుకేషనల్‌ కాన్ఫరెన్స్‌లో ప్రారంభోపన్యాసం చేస్తూ పారిభాషిక పదాలు అంతర్జాతీయంగా ఆమోదం పొందినవి కాబట్టి వాటిని దేశీయభాషల్లోకి అనువదించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ కూడా దీనికి అంగీకరించిందని తెలియజేశారు. తన వాదనకు వత్తాసుగా ఈజిప్టును ఉదహరించారు. అది అరబిక్‌ నుండి పారిభాషిక పదాలను తయారుచేసుకున్నప్పటికీ తర్వాత వాటిని యథాతథంగా వాడడానికే నిశ్చయించుకొంది ఎందుకంటే పారిభాషిక పదాలు అంతర్జాతీయంగా ఆమోదించబడి ఉన్నాయి. టర్కీ ఇరాక్‌, చైనా, జపాన్‌లుకూడా ఈ పద్ధతినే అవలంబించాయని తెలిపారు. అయినప్పటికీ తత్త్వశాస్త్రం, తర్కం, గణితం, మొదలైన వాటిల్లో ప్రాచీన భారతదేశంలో వాడుకలో ఉన్న పదజాలాలను వాడాలని సలహా ఇచ్చారు. (సంపుటి3,పు. 121-122)

కానీ 1950 నాటికి పారిభాషిక పదాలను యథాతథంగా వాడాలనే ఆలోచనను ఆయన మార్చుకొన్నట్లుంది. 1950 మార్చి 15 న పార్లమెంటులో సాధారణ బడ్జెట్‌ సమావేశంలో మాట్లాడుతూ యూనివర్సిటీ స్థాయిలో మాతృభాషలో విద్యాబోధన చేయాలంటే పారిభాషిక పదాలకు సంబందించిన అదిపెద్ద సమస్యను ఎదుర్కొనాల్సి వస్తోందని వివరించారు. అందుకే హిందీకి సంబంధించినంతవరకు పారిభాషిక పదాలను తయారు చేయడానికి ఒక బోర్జును నియమించడానికి కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. సదరు బోర్జుకు పారిభాషిక పదాల నిఘంటువును తయారుచేసే బాధ్యతను అప్పగిస్తామన్నారు. దీనికోసం బడ్జెట్‌లో కొంతమొత్తం కేటాయించినట్లుకూడా తెలిపారు. వివిధ రాష్ట్రప్రభుత్వాలు కూడా తమతమ ప్రాంతీయ భాషల్లో పారిభాషిక పదాల నిఘుంటువులను తయారు చేయాలని వాంచించాయి.(సంపుటి. 4పు. 217)

భాషాపరమైన మైనారిటీల హక్కులకు సంబంధించి కూడా మౌలానా అజాద్‌కు స్పష్టమైన అభిప్రాయాలుండేవి. వారి హక్కుల పట్ల ఆయన మిక్కిలి సున్నితత్వాన్ని ప్రదర్శించాడు. ఏదేని ఒక రాష్ట్రంలో అ రాష్ట్రభాషకు భిన్నమైన మాతృభాషను కలిగి ఉండిన భాషాపరమ్లైన మైనారిటీల సమూహానికి తమ మాతృభాషలో విద్యాభ్యాసం చేసే హక్కూ అవకాశమూ ఉండాలని నొక్కిచెప్పారు మౌలానా అజాద్‌. సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో ఈ విషయానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం ప్రాధమిక స్థాయిలో కనీసం 40 మంది విద్యార్థులూ, మాధ్యమిక స్థాయిలో “తగినంతమంది” ఉంటే వారి మాతృభాషలో విద్యనందించే విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన యేర్చాట్లు చేయాలని కోరారు. 1949 ఫిబ్రవరి 25 న కేంద్రశాసన సభలో ఈ విషయానికి సంబందించి జి.యస్‌.గుహ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో భాషాపరమైన మైనారిటీలు మాతృభాషలో విద్యార్జన హక్కుకు సంబంధించిన ఉల్లంఘనలకు సంబంధించి తనకు ఫిర్యాదులందుతున్నాయని ఆవేదనతో అన్నారు. (సంపుటి. 4ఉ పు.67)

1949 ఆగష్టు 19న కొత్తడిల్లీలో జరిగిన వివిధ రాష్ట్ర ప్రభుత్వాల విద్యాశాఖామంత్రుల సమావేశంలో భాషాపరమైన మైనారిటీల మాతృభాషల్లో విద్వార్షన హక్కును గూర్చి ప్రత్యేకంగా నొక్కిచెప్పారు మౌలానా ఆజాద్‌. వివిధ రాష్ట్రాల్లో ఉన్న భాషాపరమైన మైనారిటీల మీద ఆయా రాష్ట్రాల్లోని మెజారిటీ భాషల్ని రుద్దడంగూర్చి ఆందోళన వ్యక్తం చేశారు. భాషాపరమైన మైనారిటీలు ఉపయోగించే భాషలు కూడా భారతీయ భాషలే కాబట్టి విద్యార్ధన కోసం / బోధనా మాధ్యమంగా వాటిని ఉపయోగించడంలో ఏలాంటి సమస్యా ఉండకూడదన్నారు. మన లక్ష్యం ఐక్యతను సాధించడమైనప్పటికీ ఐక్యత అనేది మెజార్టీ భాషల్ని రుద్దడం ద్వారా సాధించలేమన్నారు. అందుకే సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డు ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ కనీస సంఖ్యలో విద్యార్ధులుంటే ప్రాధమిక స్థాయిలోనూ, తగినంత మంది కోరితే మాధ్యమిక స్థాయిలోనూ విద్యాబోధన భాషాపరమైన మైనారిటీల మాతృభాషలోనే జరగాలని ఏకగ్రీవంగా తీర్మానించిందని తెలిపారు. పిల్లల మాతృభాష ఏదో వాళ్ళ తల్లిదండ్రులు తప్ప మిగిలినవారు నిర్ణయించగలరా అని ప్రశ్నించారు. కొత్తగా సంపాదించుకొన్న స్వాతంత్రం సందర్భంలో భాషా సమస్యకు సంబంధించి సంతృప్తికరమైన సమాధానాన్ని సాధించడం అత్యంత ప్రధానమైందన్న ఆజాద్‌-మాతృభాషలాంటి ప్రాధమిక విషయాలకు సంబంధించి సమస్యలు వచ్చేవిధంగా మనం ప్రవర్తిస్తే అది మన జాతిజీవనానికే ప్రమాదం కలుగజేస్తుందని హెచ్చరించారు. కాబట్టి భాషాపరమైన మైనారిటీల మాతృభాషల్లో విద్యాబోధనకు సంబంధించి విశాల హృదయంతోనూ, ఉదారంగానూ వ్యవహరించాలని ఆకాంక్షించారు. (సంపుటి. 4,పు. 118-123).

భాషాపరమైన మైనారిటీలకు వారి భాషల్లో విద్యాబోధన మాధ్యమిక స్థాయి వరకు మాత్రమే యివ్వగలమనీ, యూనివర్సిటీ విద్యకై వారు తామున్న రాష్ట్ర భాషను తప్పకుండా నేర్చుకోవాల్సిందేననీ ఖచ్చితంగా చెప్పారు మౌలానా అజాద్‌. 1949 మార్చి 18న కేంద్ర శాసనసభలో మొత్తం విద్యనంతటినీ - ప్రాధమిక స్థాయి నుండీ యూనివర్సిటీ స్థాయి వరకు - మాతృభాషలోనే ఎందుకివ్వకూడదు అని మౌలానా హజ్రత్‌ మోహాని (ఉత్తర ప్రదేశ్‌) మౌలానా ఆజాద్‌ను ప్రశ్నించాడు. ఉర్ధూ మాధ్యమంలో ఉన్నత విద్య ఎందుకివ్వకూడదనేది హజ్రజత్‌ మోహాని పరోక్ష ప్రశ్న. దీనికి సమాధానమిస్తూ మాధ్యమిక స్థాయి వరకూ అది సాధ్యమేనని, కానీ యూనివర్సిటీ విద్యమాత్రం ఒకే రాష్ట్రంలోని వివిధ భాషల్లో ఉదాహరణకు హిందీ, ఉర్లూ లేదా తెలుగు, ఉర్ధూ - యివ్వడం కుదరదని యూనివర్సిటీ విద్యమాత్రం ఒక ప్రాంతంలోని ఒకే ప్రాంతీయ భాషలో ఉండాలన్నారు. మాతృభాషలో విద్వాభ్వాసానికిసంబంధించి హజత్‌ మోహాని చాలా దూరం వెళ్ళారు. చాలా ఆదర్శంగా ఆలోచించారు. వాస్తవానికి పరిస్థితులు భిన్నంగా ఉండినాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌-భాషాపరమైన మైనారిటీల మాతృభాషలో విద్యార్దనకు సంబంధించిన హక్కును ఉల్లంఘిస్తున్నాయని తనకు అనేక ఫిర్యాదులందుతున్నాయని మౌలానా ఆజాద్‌ తెలిపారు. (ప్రాధమిక, మాధ్యమిక స్థాయిలకు సంబంధించే పరిస్థితి ఇలా ఉంటే, యూనివర్సిటీ విద్యగూర్చి ఎలా ఆలోచించగలమనేది అజాద్‌ వాదన.) ఈ విషయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తోందని, త్వరలోనే వివిధ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. (సంపుటి. 4,పు. 85)

స్వాతంత్య్రం సిద్దించాక దేశంలోని వివిధ వ్యవస్థలను ముఖ్యంగా విద్య, సాంస్కృతిక రంగాలను నిర్వలసీకరించడంలో వలస భావాలనుండి విముక్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు మౌలానా ఆజాద్‌. అంటే జాతీయ పునాదిపై సదరు రంగాలను గట్టిగా రూపుదిద్దాలనుకున్నారు. భారత దేశ విద్య, అందులోనూ మాతృభాషలో విద్య స్త్రీ విద్య, మైనారిటీల విద్య పట్ల మౌలానా ఆజాద్‌ ప్రదర్శించిన క్రాంతదర్శిత్యం ద్యోతకమవుతుంది. ఎందుకంటే ఆయన లేవనెత్తిన అనేక ప్రశ్నలకు ఆయనే సూచించిన సమాధానాల సాధన దేశంలో కొనసాగుతూనే ఉంది. ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయగల అంశాల్లో విద్య ప్రాణసమానమైందని గుర్తించాడు అజాద్‌. ఏకకాలంలో విద్యను ప్రజాస్వామీకరించడం విద్యలో భాషను ప్రజాస్వామీకరించడాలను పరమ లక్ష్యాలుగా గుర్తించాడాయన. సాంకేతిక విద్య బలాన్ని పరిగణించాడు. సామాజిక శాస్త్రాల ఆత్మిక సౌందర్యాన్ని విస్మరించలేదు. విద్యకు సాంస్కృతిక రంగాలతో ఉన్న భావసారూప్యతను నిలబెట్ట దలచాడు. ఆంగ్లం దేశంలో వివిధ భాషల 'ప్రజల మధ్య భావ సంశయాన్ని అనుసంధానం చేస్తే దాన్ని గౌరవిస్తూనే దేశభాషల అభివృద్దిద్వారా వాటి ఆత్మగౌరవాన్ని దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని నిలబెట్టటానికి పూనిక వహించాడు. వర్తమాన దేశ విద్యా వ్యవస్థ సాగుతున్న దిశలో సాధించిన విజయాలు మౌలానా ఆజాద్‌ ప్రారంభించినవేనని, ఎదుర్కొంటున్న అపజయాలు, సవాళ్ళు ఆయన దృక్పధాన్ని సాకారం చేసుకోవడంలో మనం మిగుల్చుకున్న వైఫల్వాలేనని ఆయన ప్రతిపాదనలు రుజువు చేస్తున్నాయి.

డాక్టర్‌ షేఖ్‌. మహబూబ్‌ బాషా మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్జూ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగంలో సహాయ ఆచార్యులు డాక్టర్‌ మొహమ్మద్‌ కరీం రిసెర్చ్‌ అసిస్టెంట్‌, ఐ.క్వూ.ఏ.సీ., మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ