అమ్మనుడి/సంపుటి 7/మార్చి 2021/వాక్య విశ్లేషణ - యంత్రానువాదం

యంత్రానువాదం

డా॥ ఎ. చంద్రశేఖరరావు 9949605141

వాక్య విశ్లేషణ - యంత్రానువాదం

భాషానిర్మాణం బహుక్షిష్టమైనది. మనుషులలో గుర్తింపగల భేదాలున్నట్లుగానే వారి భాషలోగూడ భేదాలుంటాయి. ఐతే ఇతను మనిషి అని గుర్తించగల సామాన్య లక్షణాలున్నట్లుగానే ఇది ఫలానా భాష అని గుర్తించడానికి ఆయాభాషలకు కొన్ని సామాన్య లక్షణాలుంటాయి. అవే వ్యాకరణాంశాలు. చెప్పేవాడిభాష వినేవాడిభాష ఒకటైతేనే పరస్పరం అర్థం చేసుకోగలరు. అంటే వారిద్దరికీ వారి వ్యవహార భాషలోని పద, పదాంశాల అర్థం, వాటి ప్రయోగం తెలిసుండాలి. కంప్యూటర్‌ ద్వారా వాక్యవిశ్లేషణ చేస్తున్నామంటే దానికి ముందుగానే ఒక భాష తెలిసుండాలి కదా. అది దాని భాషాకోశంలో వుంటుంది.

భాషాకోశ నిర్మాణం : భాషా వ్యవహర్త భాష ద్వారా భావాన్ని ఏవిధంగా అర్ధం చేసుకొంటున్నాడొ అదేవిధంగా యంత్రం భాషను అర్ధం చేసుకొంటుంది. వ్యవహర్త భాషను అర్థంచేసుకోవాలంటే ఆ భాషలోని పదాల అర్ధాలు, వాక్యనిర్మాణం, భాషా సంప్రదాయం తెలుసుకోవాలి. యంత్రానికి మాతృభాష వుండదు కాబట్టి మనం దానికి ఒక భాషను నేర్పాలి. భాషా విశ్లేషణం, పద, పదాంశాల ప్రయోగం గూడ నేర్పాలి. ఒక భాషలోని పద, పదాంశాలను గుర్తించాలంటే కంప్యూటరుకు ఆ భాష తెలిసుండాలి. అది దాని మూలభాష (source language) మూలభాషలోని పదాలకు సరైన అర్ధాన్నిచ్చే ఒక నిఘంటువు యంత్రానికి అందుబాటులో (Access) వుండాలి. ఒక పదానికి ఒకే అర్ధం ఉన్నట్లుగా నిఘంటువును తయారుచేసుకోవడం మంచిది. ఉదాహరణకి coming. come అన్న పదాలకు ఒకే అర్ధం వుంది. coming అన్న పదాన్ని కంప్యూటర్‌ com, ing, అంటూ విభజిస్తుంది. com అన్న పదం సాధారణ నిఘంటువులో వుండదు. అలాగే running అన్న మాటను తీసుకొంటే కంప్యూటర్‌ runn, ing. అంటూ విభజిస్తుంది. runn అన్న పదం నిఘంటువులో వుండదు. కాబట్టి యంత్రానువాదం కోసం ప్రత్యేకమైన నిఘంటువు తయారు చేసుకోవాలి. దానిలో ధాతువు, ప్రకృతి, ప్రత్యయాలు రాసి వుండాలి. come, com, run runn, ing కూడా వుండాలి. విశ్లేషణ ద్వారా వేరుచేయబడిన పదాల వర్గీకరణ చాల అవసరం. పదాలను భాషాభాగాలుగా వర్గీకరించడం మాత్రమే చాలదు. నామవాచకమైతే అది 1.జీవియా? నిర్జీవియా? జంతువా? వృక్షమా? ఆడా? మగా? మొదలైన వివరాలు వుండాలి. “ఇది కుక్క" అన్న వాక్యాన్ని విశ్లేషిస్తే వాక్యం = సర్వనామం (Ph) + నామం (N) అని కంప్యూటర్‌ గ్రహిస్తుంది. దీనిని తెరపై చూడగలం. కాని ఈ వాక్యం కంప్యూటర్‌ అర్ధం చేసుకొందా? “కుక్క” అన్న పదం నాచవాచకం అని దానికి తెలుసు. “ఇది” అన్నా “అది” అన్నా దానికి సర్వనామమే. కాబట్టీ వేరొక భాషలో అర్దం అడగాలి. పిల్లడు ఇంగ్లీషులో కథ చదువుతుంటే “అర్ధం అయిందా? అని అడుగుతాం కదా? “అయింది” అని వాడంటే “ఏదీ తెలుగులో (మాతృభాష) చెప్పు.” అంటాం కదా? విశ్లేషణే కాదు వెరిఫికేషన్‌ గూడ అవసరం. అనువాదం కోసం కంప్యూటరుకు అనేక భాషలు నేర్చవలసి వుంటుంది. మన ఆజ్జననునరించి కంప్యూటర్‌ మూలభాషను గ్రహిస్తుంది.

మూలభాషనే విశ్లేషిస్తుంది. నిఘంటువు ఆధారంగా మూలభాషా పదాలను లక్ష్యభాషలోకి (target language) అనువదించడం జరుగుతుంది.

యాంత్రిక విశ్లేషణ : కంప్యూటరు కీ బోర్డు ద్వారా విషయాన్ని అందిస్తున్నాం కాబట్టి, వ్రాతద్వారా వ్యక్తం చేసే భాష గురించి మాత్రమే ప్రస్తావించడం జరుగుతుంది. కంప్యూటర్‌కు అందించే భాష అన్వయ క్షిష్టత లేకుండా వుండాలి. అర్థ సందిగ్ధతకు తావులేనివిధంగా వుండాలి. వాక్యాలు దోషరహితంగా ఉండాలి. రాతలో ఐతే సాధారణంగా వ్యాకరణ దోషాలుండవు, కాని వాక్యంలో వాక్యం కలిసిపోయి వుంటే విశ్లేషణ కష్టమౌతుంది. అంతేగాదు పెద్దవాక్యాలలో దోషాలున్నాయో లేవో కూడ గుర్తించలేం. అందుచేత చిన్నచిన్న వాక్యాలు రాయడం మేలు.

విశ్లేషణ విధానం : విశ్లేషణలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం అవలంభించవచ్చు. నాపద్ధతి- ముందుగా మూల భాషలోని వాక్యాన్ని గుర్తించడం. వాక్యం భాషలోని అర్ధయుక్తమైన కనిష్ట ప్రమాణం కాబట్టి వాక్యం పూర్తయిన తరవాత మాత్రమే భావాన్ని గ్రహించగలిగే వీలుంది. వ్రాతలో వాక్యాంతాన్ని (.) (?) (!) వంటి చిహ్నాల ద్వారా గుర్తించవచ్చు. అందుచేత కంప్యూటరుకు మేపే భాషలో విరామచిహ్నాలు వాడాలి. తరువాత భాషలోని వాక్యాన్ని విశ్లేషించుకోవాలి. అందుకోసం వాక్యంలోని పదాలను గుర్తించాలి. రాతలో పదాల మధ్య ఖాళీ ఉంచుతాం కాబట్టి, ఈ ఖాళీని ఆధారం చేసుకొని కంప్యూటర్‌ వాక్యంలోని ఒకొక్క పదాన్ని వేరుచేస్తుంది. మనం చదువుకొన్నట్లే కంప్యూటర్‌ కూడ అక్షరం అక్షరం చదువుకొంటూ పోతుంది. భాషలోని పదం నిఘంటువులో కనిపించిన వెంటనే దాని అర్ధాన్ని గ్రహించి రెండవ పదానికి పోతుంది. భారతీయ భాషలలో పదం ప్రత్యయంతో కూడి వుంటుంది. కాబట్టి ప్రకృతి ప్రత్యయ విభాగం చేయవలసి వుంటుంది. ఇంగ్లీషులో అయితే ప్రత్యయాలు (prepositions, post positions) నామవాచకంతో కలిసి వుండవు. ఆ భాషలో రెంటి మద్య ఖాళీ వుంటుంది. ఒక వాక్యాన్ని విడగొట్టి అందులోని పదాల అమరిక, పదాలలోని పదాంశాల అమరిక, వాటి మథ్య గల నంబంథం తెలుసుకోవచ్చు. పదాన్ని ప్రకృతి, ప్రత్యయ విభాగం చెయ్యకుండా మొత్తం పదం యొక్క అర్ధాన్ని గ్రహించాలనుకొంటే పెద్ద నిఘంటువును తయారు చేసుకోవాలి. ఏ భాషలోనైనా నామపదాలు, క్రియాపదాలు అధిక సంఖ్యలో వుంటాయి. ప్రత్యయాలు తక్కువ సంఖ్యలో వుంటాయి. ప్రకృతి ప్రత్యయాలను కలిపి ఒకే పదంగా రాస్తే పదాల సంఖ్య పెరిగిపోతుంది. వాటి సంఖ్య ఎంత వుంటుందంటే - ప్రకృతి పదాల సంఖ్యను ప్రత్యయ పదాల సంఖ్యచే గుణించగా వచ్చిన లబ్దంతో సమానంగా వుంటుంది. అందుచేత ప్రకృతి ప్రత్యయ విభాగం తప్పనిసరి. కంప్యూటర్‌ వాక్యాన్ని పదాలుగాను, పదాలను పదాంశాలుగాను విభజించి వాటి అర్థాలను ప్రత్యేకమైన పదకోశం (నిఘంటువు) నుండి గ్రహిస్తుంది. (నా కంప్యూటర్‌ వ్యాకరణార్దాన్నీ నైఘంటుకార్దాన్నీ వేరు వేరు చోట్ల నుండి గ్రహిస్తుంది. అందుకోసం నేను ఒక ప్రత్వేకమైన నిఘంటువును (పదకోశం) తయారు చేసుకొంటున్నాను. )

విశ్లేషణలో ఎదురయ్యే సమస్యలు : ఒక్కో భాషలో ఒక్కో సమస్య వుంటుంది. నామపదాలు ప్రత్యయాలతో కలిసేటప్పుడు అనేక సంధి మార్పులు జరుగుతాయి. అందుచేత ధాతు రూపాలు, ప్రకృతి రూపాలు, సంధిరూపాలు వేరు వేరుగ నిఘంటువులో రాసుకొని గ్రహించవలసి వుంటుంది. క్రియాపదంలో ధాతువుకు కాలబోథక, పురుషబోధక, వచన బోధక ప్రత్యయాలు అతుక్కొని వుంటాయి. వాటిని వేరుచేయగలిగే సరైన మార్గం వెతుక్కోవాలి.

కంప్యూటర్‌ భాష ఇంగ్లీషు అనుకొందాం. “going” అన్న పదానికి అర్ధం వెదుకుతూ “go” వచ్చేసరికి అర్ధం గ్రహిస్తుంది. తరువాత “ing " ప్రత్యయం యొక్క వ్యాకరణార్థం గ్రహిస్తుంది. మరొక పదం “good" తీసుకొందాం. “go” పూర్తికాగానే అర్ధం గ్రహించడం జరిగిపోతుంది. “od” కి అర్థం దొరకదు. తెలుగులో కూడ ఇటువంటి పదాలుంటాయి. “దేశముదురు” అన్న పదంలో “దేశము” పూర్తికాగానే అర్ధం గ్రహించడం జరిగిపోతుంది. “దురు "కి అర్ధం దొరకదు. “దేశ ముదురు” అని రాస్తే సమస్య లేదు. కాని సమాసాన్ని కలిపి రాస్తారు. పదాలమధ్య ఖాళీ ఉంచడంలో ఒక పద్ధతి లేదు. “నా పుస్తకము, నాయొక్క పుస్తకము, నా యొక్క పుస్తకము” అన్నా అర్ధం మారదు. “ఆమెపుస్తకం...” (her book), పదాల మధ్య ఖాళీ లేదు. వాక్యం పూర్తికాలేదు. “ఆమె పుస్తకం.” (She is a book) పదాల మధ్య ఖాళీ ఉంది. ఇక్కడ వాక్యావసానాన్ని సూచించే గుర్తు(.) వుంది. ఖాళీ వుంటే ఒక అర్థం, ఖాళీ లేకపోతే ఇంకొక అర్థం వస్తుంది. “అతను పుస్తకం” (he is a book). ఇక్కడ (.) గుర్తు వున్నా లేకపోయినా అర్థం మారదు. “అతని పుస్తకం” “అతనిపుస్తకం” (his book) ఖాళీ వుంచినా లేకపోయినా అర్ధం మారదు. “అతను” కి 'అతని ' అనే ఔజపవిభక్తిక రూపం వుంది. “ఆమె” కు లేదు. అందుచేత “అతని” తో చిక్కులు లేవు. “ఆమెతో” నే చిక్కులు. అలాగే “ఆయన” తో గూడ చిక్కులే. ఔపవిభక్తిక రూపాలు లేనిచోట్ల ఇటువంటి చిక్కులు వస్తాయి.

మనభాషలలో సంధిరూపాలు ఎక్కువ. కాబట్టి ముందుగా సంధులను విడదీసి పదాలను గ్రహించాలి. ఇది క్లిష్టసమస్య. “అయ్యవసరము” అన్న సమాసాన్ని 60 శాతం పైగా డిగ్రీ చదువుతున్న విద్యార్థులు “అయ్య + వసరము” అనే విడదీశారు. వారికి “అయ్య” తెలుసు. (గ్రామాలలో ఈ పదం వాడుకలో వుంది.


కంప్యూటర్‌ కి ముందుగా ఈ పదం తెలిసుంటే అది కూడ ఇలాగే విడదీస్తుంది. అలాగే తెలుగునుండి ఇంగ్లీషులోకి అనువదించే సందర్భాలలో గూడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఉదాహరణకు “కుక్కపిల్ల " అన్న సమాసానికి 'కుక్క ' కీ అర్ధం వుంటుంది. 'పిల్ల ' కీ అర్ధం వుంటుంది. వెరసి ఇంగ్లీషులో “dog child" అనువాదంగా వస్తుంది. ఇంగ్లీషులో “కుక్కపిల్ల” కు “pup” అన్న ఒక పదంవుంది. కాబట్టి పదాలకు వేరుగాను, సమాసాలకు వేరుగాను అర్ధాలు రాసుకోవాలి.

వాక్య విశ్లేషణం : ఇంతవరకు పదవిశ్లేషణ గురించి మాత్రమే తెలుసుకొన్నాం. ఇప్పుడు వాక్యవిశ్లేషణ గురించి ఆలోచిద్దాం. వాక్యాలలో సామాన్యవాక్యాలు, సంక్షిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు వుంటాయి. సామాన్యవాక్యాలలో కర్తర్ధక వాక్యాలు, కర్మార్థక వాక్యాలే కాకుండా - భావార్థక వాక్యాలు, మధ్యార్దక (Middle) వాక్యాలు ఉంటాయి. వీటిని గుర్తించి అర్థం చేసుకోగలిగే సామర్థ్యం యంత్రానికి వుండాలి. వాక్యంలోని పదాలను భాషాభాగాలుగా గుర్తించడమేగాదు వాటి పనిగూడ తెలియాలి. అంటే వాక్యంలో ఆపడం ఉద్దేశ్యమో (Subject) విధేయమో(Predicate) తెలియాలి. కర్త్హ కర్మ క్రియలు తెలియాలి. అందుకోనం భాషా సంప్రదాయం తెలియాలి. ఇంగ్లీషులాటి భాషలలో వాక్యంలోని పదాల స్థానాన్ని బట్టి కర్త, కర్మలను నిర్ణయిస్తాం. తెలుగు, సంస్కృతం వంటి కొన్ని భాషలలో 'ప్రత్యయాన్నిబట్టి కర్త, కర్మలను గుర్తించవచ్చు. తెలుగులో “రాముడు రావణుని చంపెను “రావణుని రాముడు చంపెను” అన్నా అర్దం మారదు. కాని ఇంగ్లీషులో "Rama killed Raana" అనడానికి బదులుగా "Raana killed Rama“ అంటే అర్థం మారిపోతుంది. వాక్యం వ్యాకరణ యుక్తంగానే వుంది. ఇంగ్లీషులో వాక్యంలో పదాల స్థానాన్ని బట్టి కర్త, కర్మల నిర్ణయం జరుగుతుంది. ఈ విషయం యంత్రానికి తెలియాలి. అనువాదంలో ఇటువంటి మార్పులు చెయ్యవలసి వుంటుంది.

ఇప్పుడు యంత్రానికి ఇంగ్లీషు భాషలోని పదాలు, అవి ఏ వర్గానికి చెందినవో ఆ వివరాలు, ఆ భాష యొక్క వ్యాకరణం మొదలైనవి తెలుసు. ఇంగ్లీషులోని "You killed he” అన్న ఈ వాక్యాన్ని కంప్యూటర్‌ కు మేపితే దానికి అర్ధం కాదు. మనకు జవాబు రాదు. ఎందుకంటే ఇంగ్లీషు వాక్యంలో తప్పుంది. కర్మ “he” కాదు. “him” వుండాలి. భాషకు సంబంధించిన సమస్త విషయాలు కంప్యూటర్‌ మనస్సులో నిక్షిప్తమై వుంటాయి. ఇది కంప్యూటర్‌ యొక్క జ్ఞానం. కంప్యూటర్‌ యొక్క ఈ జ్ఞానాన్ని మనం అనువాదానికి నియోగించుకోవచ్చు. అనువాదంలో కర్త కర్త గాను, కర్మ కర్మ గాను అనువదించవలసి వుంటుంది. దీనికి నిఘంటువు సహాయపడదు.

“ఈ పుస్తకం చదువు” “అందరికీ చదువు కావాలి” అన్న వాక్యాలలో మొదటి వాక్యంలో 'చదువు ' క్రియ. రెండవ వాక్యంలో 'చదువు ' నామవాచకం. “This is a book" This book is good అన్న వాక్యాలలోనీ మొదటి మాటకు రెండు అర్థాలు ఉన్నాయి. మొదటి వాక్యంలోని "This" పురుషబోధక సర్వనామం, ఉద్దేశ్యం (Subject) రెండవ వాక్యంలోని "This” నిర్దేశ సర్వనామం, ఉద్దేశ్యం (Subject). మొదటి వాక్యంలో book విధేయము (Predicate). రెండవ వాక్యంలో book ఆఖ్యాతము (Subject). ఈ భేదం కంప్యూటర్‌ గుర్తించ గలగాలి. వ్యక్తి నామాలను గూడ గుర్తించ గలగాలి. ఈ ప్రక్రియలో లోపం ఎక్కడైనా జరిగితే దానిని తెలుసుకోడానికి వాక్య విశ్లేషణ తోడ్పడాలి.

'అనువాదం : మూలభాషలోని వాక్యాన్ని లక్ష్యభాషలోనికి అనువాదం చెయ్యాలి. కంప్యూటర్‌ మూలభాషలోని పదాలను లక్ష్యభాషలోకి వరునగా అనువదిస్తుంది, కాని వాక్యనిర్మాణం మూలభాషలో వుంటుంది. ఒక భాషలో వున్న వాక్యనిర్మాణం వేరొక భాషలో వుండకపోవచ్చూ. అందుచేత యంత్రానికి మూలభాష లక్ష్యభాషల వాక్యనిర్మాణాలు తెలియాలి. అంతేకాదు భాషా సంప్రదాయం తెలియాలి. అనువదింపబడిన పదాలను లక్ష్యభాషా నిర్మాణానికి అనుగుణంగా అమర్చుకోవాలి. లక్ష్యభాష యొక్క నుడికారం తెలిసుండాలి. అంతేగాదు తన వ్యాకరణ పరిజ్ఞానాన్ని అనువర్తింపచేయగల సామర్ధ్యం కూడ వుండాలి. “ఈ దుకాణం దగ్గర నాకు కొంచం పనివుంది” అన్న వాక్యాన్ని “ఇస్‌ దుకాన్‌ కె పాస్‌ తోడా కామ్‌ హై” అనడాన్ని హిందీ మాతృభాషా వ్యవహర్తలు తప్పు పడతారు. “ఇస్‌ దుకాన్‌ పర్‌(మీద) తోడా కామ్‌ హై” అనాలంటారు. అనువాదకుడికి నుడికారం తెలిసుండాలి. “I am hungry” అన్న ఇంగ్లీషులోని కర్తర్ధక వాక్యాన్ని తెలుగులో భావార్థక వాక్యంగా “నాకు ఆకలిగా వుంది” అని అనువదించాలి. ఇక్కడ “నాకు” కర్తా? కర్మా? “నేను రాయికి తగిలాను” అనడానికి బదులుగా తెలుగువాళ్ళం “నాకు రాయి తగిలింది” అని అంటున్నాం. కర్తను పరోక్ష కర్మను చేసి రాయిమీద నేరం మోపుతున్నాం కదా!

“This is a good book” అన్న వాక్యానికి అనువాదం “ఇది మంచి పుస్తకం”. “This book is good” అన్న వాక్యాన్ని తెలుగు భాషా వ్యాకరణాన్ని అనుసరించి “ఈ పుస్తకం మంచి+ది” అని అనువదించాలి. “am a man. You are a man” అన్న వాక్యాలను “నేను మనిషి+ని, నువ్వు మనీషి+వి” అని అనువదించాలి. “నేను మనిషి. నువ్వు మనిషి" అనడం తెలుగు సంప్రదాయం కాదు.

వాక్యాలలోని పదాలస్థానం మార్చడమే కాదు ఒక పదంలోని పదాంశాలను గూడ వెనుక ముందు చేయవలసి వుంటుంది. తెలుగులో "నా పుస్తకం" అన్న సమాసంలో 'నా' అన్న సంబంథబోధక సర్వనామం తరవాత నామవాచకం వస్తుంది. చాలా భాషలలో ఇలాగే వుంటుంది. సవరభాషలో దీనికి విరుద్దంగా నామవాచకం తరవాత సంబంధబోధక సర్వనామం వస్తుంది. సవరభాషలో “కంబొ న్‌” కంబోల్‌ + ఇన్‌ ("పుస్తకంనా” పుస్తకం +నా)” అనాలి. మన భాషలలో విశేషణం తరువాత విశేష్యం వస్తుంది. సవర భాషలో విశేష్యం తరువాత విశేషణం వస్తుంది. “ఒసి” వ “పిల్లపసి” అంటే “పసిపిల్ల” అని అర్థం. సవర భాషలో విశేషణానికీ నామవాచకానికీ మధ్య ఖాళీ వుంచకూడదు.

“నేను ఆంధ్రప్రదేశ్‌ నుండి వచ్చాను” అన్న వాక్యాన్ని “నాన్‌ ఆంధ్రప్రదేశ్‌ ఇల్‌ ఇరుందు వందేన్‌” అంటే తమిళుడు ఒప్పుకోడు. “నాన్‌ ఆంధ్రప్రదేశత్తు ఇల్‌ ఇరుందు వందేన్‌” అనాలంటాడు. “ఆంధప్రదేశ్‌ అన్న హిందీ పదాన్ని 'ఆంధప్రదేశ+ము ' గా మార్చుకోవాలి. తరువాత తమిళ ప్రత్యయం 'ఇల్‌ 'ముందున్న “ము” 'త్తు ' గా మారుతుంది అన్న తమిళ సంధి సూత్రాన్ని అనువర్తింప జేసుకోవాలి. అంటే మన కంప్యూటర్‌కి ఉభయ భాషల వ్యాకరణం పూర్తిగా రావాలన్నమాట.

కంప్యూటర్‌ ద్వారా అనువాదం చేసేటప్పుడు కొన్ని కొన్ని అనిష్టరూపాలు ఉత్పన్నం అవుతుండడం చూస్తూనే వున్నాం. తప్పు ఎక్కడ జరిగిందో తెలియాలంటే కంప్యూటర్‌ అనువాదం చేసే విధానం తెలియాలి. మూలభాషలోని వాక్యం లక్ష్యభాషగా వెలువడే ముందు కంప్యూటర్‌ గర్భంలో జరిగే ఈ రూపవిక్రియను కనిపెట్టి సవరించుకొంటే అనువాదంలో అనిష్టరూపాలు వెలువడవు.

వాక్యమే పూర్తి అర్థం ఇస్తుంది కాబట్టి వాక్యం పూర్తయినంతవరకు అర్థం అగోచరం. అందుచేత వాక్యం పూర్తిగా రాసిన తరవాత “ట్రాన్స్‌లేట్ ' అన్న కమాండ్‌ మీట నొక్కగానే నా కంప్యూటర్‌లో అనువాద విధానం ప్రారంభం ఔతుంది. ఈ కార్యక్రమమంతా పూర్తయిన తరువాత కంప్యూటర్‌ తెరపై మనకు అనువాదం కనిపిస్తుంది. కంప్యూటర్‌ ప్రోగ్రాం ఏదీ పరిపూర్ణం కాదు. ఒక వెర్షన్‌ తరువాత దానిని అభివృద్ధి చేస్తూ మరొక వెర్షన్‌ వస్తుంది. నిత్యం పరిశోధన చేస్తూనే వుండాలి.

సంచారి బుర్రకథ ఈరమ్మ (జీవితచరిత్ర)

వెల: రు. 80/-

రచయిత: డా. నింగప్ప ముదేనూరు (కన్నడమూలం)

రంగనాథ రామచంద్రరావు (అనువాదం)

ప్రతులకు: ఛాయా రిసోర్సెస్‌ సెంటర్‌, హైదరాబాదు. ఫోన్‌: 9848023384 www.amazon.in నుండి కూడా పొందవచ్చు.


కన్నడ తోటలో విరిసిన ఎందరో తెలుగు కళాకారులలో ఒకరు బుర్రకథ ఈరమ్మ. బుడగ జంగాలు అనబడే ఒక ఆదిమకులానికి చెందిన ఈరమ్మ తన సంచార జీవితంలో కర్దాటకాంధ్రలో బుర్రకథ చెప్పడంలో పేరు గడించింది. ప్రజాదరణతోపాటు, ఎన్నో పురస్మారాలను పొందింది. ప్రతిష్టాత్మకమైన “కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారాన్ని, హంపి కన్నడ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటునూ ఆమె పొందింది. ఈరమ్మ చరిత్రను కన్నడంలో డా.నింగప్ప ముదేనూరు రచించగా రంగనాథరామచంద్రరావు తెలుగులోకి అనువదించారు. అమ్మనుడిలో ధారావాహికగా వెలువడింది.