అమ్మనుడి/సంపుటి 7/మార్చి 2021/మాతృభాషా విద్యామాధ్యమం - దేశ ఆర్థికాభివృద్ధి

విద్యామాద్యమం

జె.డి.ప్రభాకర్‌ 8500227185

మాతృభాషా విద్యామాధ్యమం - దేశ ఆర్థికాభివృద్ధి


దేశ ఆర్థిక ప్రగతి దేశంలో ఉన్న వనరుల వినియోగం, దానికి కావలసిన నైపుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. శ్రామికుల నైపుణ్యాలను మెరుగుపరిచే నాణ్యమైన విద్యతో అది సాధ్యపడుతుంది. మనిషిచేసే ఏ పనికి అయినా మూలం జ్ఞానమే. మానవుడు సంఘజీవిగా ఎదుగుతున్న క్రమంలో అనుభవంలో నుంచి తాను చేస్తున్న పనిని మెరుగు పరుచుకుంటూ సంపద సృష్టి మొదలుపెట్టాడు.పనికి నైపుణ్యాన్ని జోడిస్తూ పనిని ఆధునీకరించాడు. దాని ఫలితమే నేడు కోకొల్లలుగా వెలసిన పరిశ్రమలు, సేవా సంస్థలు మొదలగునవి. దాని కారణంగానే నేటి చదువులు కూడా నైపుణ్యాలను తీర్చిదిద్దే దిశగా మలచడం జరిగింది. దేశంలో ఆరోగ్య రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, వ్యవసాయం ఇలా ఏ రంగం అయినా పఠిష్టంగా ఉండాలంటే నాణ్యమైన విద్యను అభ్యసించిన వారు వాటిలో పనిచేస్తూ వుండాలి. మానవాభివృద్దిని ఎటువంటి ప్రమాణాలతో కొలిచినప్పటికి వాటన్నిటా ఉమ్మడిగా కనిపించేది-మనిషి సంపాదించిన జ్ఞానము. అభివృద్ధి నాణ్యమైన విద్యతోనే సాధ్యపడుతుంది. విద్యార్థి దశ నుండే పాఠ్యపుస్తకాల ద్వారా వాటిని అభ్యసిస్తూ ప్రగతి దిశగా ప్రయాణించాలని నూతన విద్యావిధానం 2020లో కూడా చేర్చడం జరిగింది. విద్యారంగంలో భాష క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. జూలై 29, 2020న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన జాతీయవిద్యావిధానం(NEP) పాఠశాలల్లో బోధనా మాధ్యమం సాధ్యమైన చోట 5వ తరగతి వరకు- ప్రాధాన్యంగా 8వ తరగతి వరకు- మాతృభాష లేదా స్టానిక లేదా ప్రాంతీయ భాష ఉంటుందని తెలిపింది. అలాగే కాలానుగుణంగా ప్రభుత్వం కూడా విద్యపై జాతీయ స్థూల ఆదాయం (GDP) పెంచుతూ వస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం 2014లో నుండి ఇప్పటివరకు 3.8 శాతం GDP భాగాన్ని 4.6 శాతం GDP భాగానికి పెంచి విద్వారంగాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తోంది. ప్రభుత్వం విద్వారంగంపై ఖర్చు పెట్టడమే కాకుండా అందులో ఉపయోగించే భాష కొరకు కూడా ఖర్చు పెడుతూంది.

విద్యావిభాగం(రెవెన్యూఖాతా)ద్వారా రంగాలవారీగా విద్యపై ఖర్చు.

కేంద్రం మరియు రాష్ట్రాలు/యుటిలు శాతం వాటాతో 2017-18 (రూ. కోటి)

మూలం: మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం 2017-2018 నివేదిక

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమికవిద్య పైన ఎక్కువ దృష్టి కేంద్రీకరించి 48.87 శాతం ఖర్చు పెట్టారని తెలిపారు. మాధ్యమిక విద్యకు ౩1.16 శాతం, విశ్వవిద్యాలయాలు మరియు ఉన్నత విద్యకై 12.80 శాతం, సాంకేతిక విద్యకు 5.78 శాతం ఖర్చు చేసినట్టు వెల్లడించారు.

సమాజంలో ప్రజల ఆర్థిక అసమానతలకు, నిరుద్యోగానికి, పేదరికానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ అందులో విద్యా మాధ్యమం ముఖ్యమైనది. ఇంగ్లీష్‌ మీడియం సమాజంలో ఆర్థిక అసమానతలకు దారితీస్తుంది. అటువంటి చదువులు చదవక స్థామతకు నోచుకోక నిరక్షరాస్యతా, నిరుద్యోగం 'పెరుగుతాయి. మనిషి జీవితంలో ఆహ్వానించదగని విషయాలు చోటు చేసుకున్నప్పుడు మూలాల్లోకి వెళ్లి సమస్యను పరిష్మరించాల్సి ఉంటుంది. పిల్లలకి ప్రాథమిక, మాధ్యమికవిద్య తమ జీవితంలో మూలంగా నిలుస్తుంది. తల్లి ఒడిలో ఏ భాష నేర్చుకుంటాడో, చుట్టూ సమాజం ఏ భాషలో వ్యవహరిస్తుందో ఆ భాషలోనే ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య ఉండాలి. చిన్ననాటి నుండే నాణ్యమైన విద్యను అందించాలి. ఈ విధంగా మాతృభాషలోనే విద్యను అభ్యసింప చేసినప్పుడు ఆలోచన విధానంలో సృజనాత్మకతను

అలవర్చుకున్నాడు. ఆక్స్‌ఫర్డ్‌ యూనీవర్సిటీ జరిపిన సర్వేలో మాతృభాష మాధ్యమంలో చదివిన విద్యార్థులు పరాయి భాష మాధ్యమంలో


మూలం: మానవవనరుల అభివృద్ది మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం 2017-2018 నివేదిక.

చదివిన విద్యార్థులకంటే చదవడంలోనూ, రాయడంలోనూ, ఆలోచనా విధానంలోనూ ఎక్కువ సృజనాత్మకత కలిగి ఉన్నారని తెలిపారు.

మాతృభాష విద్యామాధ్యమ ప్రయోజనాలు:

  • విద్వకు ఖర్చు తక్కువ అవుతుంది
  • తక్కువ సమయంలోనే ఎక్కువ విషయాలు నేర్చుకోవచ్చు
  • ఇంటి భాష- బడి భాష అనే అడ్డుగోడలు ఉండవు
  • పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకుంటారు
  • గ్రహణ శక్తి పెరుగుతుంది
  • తరగతి గదిలో చురుకుగా పాల్గొంటారు
  • ప్రశ్నించే తత్వం పెరుగుతుంది
  • సృజనాత్మకత పెరుగుతుంది
  • బడి మానేసే వారి సంఖ్య తగ్గుతుంది

'యువతకు పారిశ్రామిక శిక్షణా మాధ్యమ భాషా

ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశాలలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. ౩56 మిలియన్ల యువత కలిగిన దేశం ఆర్థికంగా ఇంకా వెనుకబాటులోనే ఉంది. పారిశ్రామిక వెలుగుబాటతో మానవ అభివృద్ది విషయాలలో ఇప్పటికీ అభివృద్ది చెందుతున్న దేశంగానే మిగిలిపోయింది. దేశానికి బలం అని చాటే విధంగా నేటి యువత పారిశ్రామిక రంగంలో దూసుకుపోవాలని కేంద్ర ప్రభుత్వం 'మేక్‌ ఇన్‌ ఇండియా” ద్వారా యువతను పారిశ్రామిక పరంగా ప్రోత్సహిస్తున్నారు. దీని ద్వారా 2025 నాటికి పారిశ్రామిక రంగంలో 25% జాతీయ స్తూల ఉత్పత్తి(GDP) పెరిగే ఈ విధంగా లక్ష్యాన్ని రూపొందించారు. మన దేశంలో గ్రామీణ పట్టణ యువతకు కావాల్సిన శిక్షణనిస్తూ... వస్తుఉత్పత్తి, పర్విశమల నిర్మాణం, వాటి అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అదేవిధంగా “స్కిల్‌ ఇండియా” 'పేరుతో 40 కోట్ల మంది యువతకి, మహిళలకి శిక్షణ ఇచ్చి 2022 నాటికల్లా నైపుణ్యం గల యువతను, మహిళలను తయారుచేయాలని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. అయితే యువత, మహిళలు నైపుణ్యాన్ని నేర్చుకోవాలన్న పనికి కావాల్సిన అవగాహన కలగాలన్నాా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా శిక్షణ పాఠ్యాంశాలు స్థానిక భాషలో ఉండాలి. గ్రామీణ పేద మధ్యతరగతి యువకులకు నైపుణ్యత కేవలం వారి స్థానిక భాషలతోనే సాధ్యపడుతుంది. స్కిల్‌ ఇండియాలో ఉన్న వివిధ విభాగాలు మరియు శిక్షణ కార్యక్రమాలు స్థానిక భాషల్లో లేకపోవడం వలన అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కష్టమవుతుంది. కాబట్టి స్థానిక భాషల ప్రాముఖ్యతను తెలుసుకుని శిక్షణ కార్యక్రమాలను, పుస్తకాలు స్థానిక భాషల్లోకి అనువదించినట్లయితే దేశ ఆర్థికాఖివృద్ది మరింత వేగంగా జరుగడానికి అవకాశం ఉంటుంది.

దేశంలో ఉన్న ప్రతి రంగానికి కేంద్ర బిందువు పాఠశాలలే. ప్రాథమికవిద్య దేశ భవిష్యత్తుకి ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టీ పిల్లలకు ప్రాథమిక విద్యను 8వ తరగతి వరకు మాతృభాషలోనే అందించడం ఉత్తమం. నూతన విద్యావిధానం కూడా అన్ని భాషలకు, సంస్కృతులకు సమాన న్యాయం అందించేలా ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలకు మంచి వసతులు కలిగిస్తూ నాణ్యమైన విద్యను మాతృభాష అందించడానికి కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చిత్తశుద్దితో పని చేయాలి. విద్వారంగానికి జాతీయ స్తూల ఉత్పత్తిలో 4.6 శాతం నుండి 6 శాతానికి పెంచాలని విద్యావేత్తలు ప్రతిపాదించినట్టుగా కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలి. విద్యపై పెట్టే పెట్టుబడితో దేశానికి ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించుకోగలము. శిక్షణ మాధ్యమంలోనూ స్థానిక భాషల పాత్రను గుర్తెరిగి, అమలుపరిచినట్టయితే దేశంలో యువత నైపుణ్యతతో మరింత బలోపేతమయ్యి దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుగా నిలుస్తారు. మాతృభాష విద్యామాధ్యమమే దేశ అర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది.

ఈ వ్యాసరచయిత పరిశోధక విద్యార్ధి, హైదరాబాదు విశ్వవిద్యాలయం.