అమ్మనుడి/సంపుటి 7/మార్చి 2021/కొత్తమాటల పుట్టింపు

కొత్తమాట

స.వెం.రమేశ్‌

కొత్తమాటల పుట్టింపు

5


“అన్నయ్యా, నువ్వేమో తెలుగుమాటలకు గూటాలు ఉండవు, ఉండకూడదు అంటావు. అయితే అన్ని ఆకికల్లోనూ అందరూ, ముప్పై, నలబై, ఏబై,డెబ్సై,తొంబై అనే మాటలకు గూటలను పెట్టే రాస్తున్నారే! ఇవి తెలుగుమాటలు కావా, లేకుంటే కావాలనే తప్పుగా రాస్తున్నారా?” అడిగినాడు చిన్నయ్య.

“నాకు కూడా చాన్నాళ్లుగా అరగలి(సందేహం) ఇది. ఇవి తెలుగు మాటలే. మూడుపదులు ముప్పది. అదే ముప్పయి అయింది. 'పది 'లో 'ప 'కు గూటం లేదుకదా. ముప్పయి, నలబయి, ఏబయి, డెబ్బయి, ఎనబయి, తొంబయిలలో ఎలా వచ్చిందో!” నారాయణ కూడా అడిగాడు.

“అబ్బాయిలూ చెపుతాను వినండి. మీకేకాదు, తెలుగు వ్రాతలు నేర్చుకొన్నప్పటి నుండి నాకు కూడా అరగలే ఇది. కొన్నేళ్ల కిందట జరిగిన ముచ్చటను చెప్పాలి ఇక్కడ. ఏడాది నాకు సరిగా గురుతు లేదు కానీ తెలుగు తెలివరులు, తెలుగునుడికి కూడా చెన్నుడి(క్లాసికల్‌ లాంగ్వేజ్‌) గుర్తింపు ఇవ్వాలని గట్టిగా అడుగుతున్న నాళ్లు అవి. మైసూరులో బారతనుడుల నట్ట తెట్టువ(సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌) నుండి నాకూ మా బాబాయికీ పిలుపు వస్తే బయలుదేరి వెళ్లినాం”

“బాబాయి అంటే అమ్మనుడి ఆకిక కూర్పరి సామల రమేష్‌బాబుగారే కదా” నడుమన దూరి అడిగినాడు చిన్నయ్య.

“అవును ఆయనే. అప్పుడు ఆకికపేరు అమ్మనుడి కాదు, నడుస్తున్న చరిత్ర అని ఉండేది. మేమిద్దరమూ నుడివరులం కాము. కానీ తెలుగు ఎదుగుదల మీద అక్మర ఉన్నవాళ్లం. అందుకే కావచ్చు మాకు కూడా పిలుపువచ్చింది. మునివావు వేళకు మైసూరుకు వెళ్లినాం. మాకు ఒక విడిదిలులో ఒక గదిని చూపించినారు. పైకి పోసుకొని(స్నానమాడి), ఉడుపులు మార్చుకొని, విడిదిలు బయటకు వచ్చినాం. చక్కని పచ్చికబయలులో చల్లగా కూర్చుని ముచ్చట్లాడుకొంటున్నారు ఏడెనిమిదిమంది పెద్దలు. అందరూ తెలుగువారే. అందరూ నుడివరు(బాషావేత్త)లే. మేము వెళ్లి వాళ్లతో కలిసినాం. నాకేమో కాస్త జంకుజంకుగా ఉంది. ఎందుకంటే నుడెసిది(బాషాశాస్త్రం)లో తలపండిన వాళ్లు వాళ్లంతా. ఏం మాట్లాడితే ఏం చిక్కు వస్తుందో అని మెదలకుండా కూర్చునున్నాను. వారిలో నేనెరిగిన వారు ముగ్గురున్నారు. బాబాయి నోరు విప్పినారు. ముప్పయి, నలబయి వంటి తెలుగుమాటలకు గూటాలు పెట్టడం తప్పుకాదా అని అడిగేసినారు...”

“ఏమయింది ఆనక? నువ్వు అడిగుంటే మారాడకపోయి ఉండవచ్చు. పెద్దాయనే అడిగేసినారు కదా, ఏదో ఒకటి చెప్పుండాలే” తమిగా అడిగినాడు చిన్నయ్య, నడుమన దూరి.

“అవును చిన్నయ్యా, నువ్వన్నది నిక్మమే. ఆ మాటను నేను అడిగి ఉంటే పట్టించుకాని ఉండరు. నన్నేమిటి, పెద్దాయననే పట్టించుకోలేదు కాసేపు. ఇంకా నొప్పి కొద్దిగానైనా సలుపుతూవే ఉంది నన్ను ఇప్పటికీ. అంచల గుంపులోకి రెండు కాకుల వెళితే ఊరుకొంటాయా, చీదరించుకొంటాయి, పొడిచి తరుముతాయి. కానీ వెళ్లింది కాకులు కాదు, పదునైన గోళ్లూ ముక్కులూ ఉన్న గ్రద్దలు. తరుమలేక పట్టించుకోనట్లు ఊరుకొన్నాయి...”

“అన్నయ్యా, వెక్కసం మాటలాడవద్గని నన్ను ఎప్పుడూ కసరుతుంటావు. నువ్వు ఇలా మాట్లాడుతున్నావేమిటి?” అన్నాడు చిన్నయ్య.

“చిన్నయ్యా, నడుమన దూరకు. అన్నయ్యను మాట్లాడనీ. ఇంకా ఎన్నాళ్లని ఈ తలవంపుల్ని దాచిపెట్టుకాని ఉంటాడు. బయటపెట్టనీ. అన్నయ్యవి వెక్కసపు మాటలు కావు. నొప్పితో పలుకుతున్న పలుకులు. చెప్పనీ ఊరకుండు” అన్నాడు నారాయణ.

“సరే అన్నయ్యా, నడుమన దూరను. ఇంతకీ ఏమయిందో చెప్పు” అడిగినాడు చిన్నయ్య.

“కాసేవు పట్టించుకోనట్లు ఉండి, వారిలో ఒకరు, “అవి రూడి(వాడుక) అయిపోయిన మాటలండీ, వాటిని ఇప్పుడేమీ చేయలేం” అన్నారు. “ఏదో చేయాలని కాదండీ, అలా వాడడం సరయినదేనా” అన్నారు బాబాయి. 'సరయినదే. అది తెలియాలంటే, మీకు 'ద్రావిడనుడులన్నిటి గురించీ కొంతయినా తెలిసుండాలి. నుడెసిదిని సుంతయినా చదివుండాలి. తమిళంలో ముప్పదు, నాప్పదు అనే మాటల్లో 'ప్‌ ' వినిపిస్తుంది కదా. అదే పెద్దుసురు(మహాప్రాణం)గా మారింది తెలుగులో. దానిని గూటం అనకూడదండీ అని తేల్చేసినారు. ఇంకొక పెద్ద. నేను ఊరుకోలేక, 'మరి ఐంబదు, ఎళువదు, ఎంబదు, తొన్నూరులలో “ప్" లేదు కదండీ. ఏబయి, డెబ్బయి, ఎనబయి, తొంబయిలకు గూటాలు ఎందుకొచ్చినాయి?” అని అడిగినాను. వారి మోము నల్లబడింది. ఇంకొక పెద్ద కల్పించుకొని, 'తినేసి పడుకోవాలి కదా లేవండి ' అంటూ ముగించేసినారు. పొగరుతో చెప్పుతున్నది కాదు నారాయణా. ద్రావిడనుడులు అన్నిటి గురించీ కొంతయినా తెలిసుండాలి అని, తమిళాన్ని ఆనుగా తెచ్చుకొన్న పెద్దకంటే, నాకే ఎక్కువ తమిళం తెలుసు. అది వారికి అప్పటికి తెలియదు అంతే. ఇటువంటి పట్టనితనాలూ పక్కకు తోసివేయడాలూ పిలిచి గొడవ పెట్టుకోవడాలూ చాలా చేసినారు నాపట్ల కొందరు. ముందుముందు మరికొన్ని చెప్పుకొందాంలే” అంటూ మారాడినాను.

“ఇంతకీ ఆ ముగ్గురిపేర్లు చెప్పనేలేదు అన్నయ్యా నువ్వు” అడిగినాడు చిన్నయ్య,

“అక్కరలేదు చిన్నయ్యా, చెప్పాలనుకొని ఉంటే అన్నయ్యే చెప్పేవాడు కదా” అన్నాడు నారాయణ.

“అవును చిన్నయ్యా, వాళ్లు ముగ్గురూ నిక్కంగానే చాలా గొప్పవారు. తెలుగునుడికి ఎంతో ఉడిగం చేసినారు. పేర్లు అచ్చుకు ఎక్కించి అగదుచేయడం పాడి కాదు” అన్నాను.

అది సరే అన్నయ్యా, ముప్పై, నలవై, ఏభై...లకు గూటాలను పెట్టాలనా వద్దా?” గురుతు చేసినాడు చిన్నయ్య

“పెట్టకూడదు చిన్నయ్యా. పెట్టనే పెట్టకూడదు. అన్ని నుడులలో ఉన్నట్లే తెలుగులోనూ అలవు(ప్రామాణిక)నుడి, నెలవు(మాండలిక) నుడి ఉన్నాయి కదా. నెలవునుడిలో కూడా కుదురు(కులం)నుడి విడిగా ఉంటుంది కదా. అలాంటి ఒక కుదురునుడిలోనివే పై సడులు. పారు(బ్రాహ్మణుల) నోళ్లలో మట్టుకే ఉండే నెలవునుడిని అలవునుడిగా మార్చేసినారు తెలివరులు. ఎవరు చేసినా తప్పుతప్పే. చదువుకొన్న పారులలో తప్ప మరొకరిలో ఈ సడులు వినబడవు. వాళ్లు కూడా రాసేటప్పుడు గూటాలను తగిలించి ముప్పయి నలబయిలను రాయడం ముమ్మాటికీ తప్పే. నెలవునుడిలో కతలూ కట్టురలూ రాసుకొనేటప్పుడు రాయవచ్చు కానీ, ఎసిదిని రాసేటపుడూ ఆకికల్లో అలవునుడిలో రాసేటపుడూ గూటాలను పెట్టకూడదు కాక పెట్టకూడదు. అలవునుడిలో ఒడ్లు, అడ్లు అని రాయకూడదు, వడ్లు అనే రాయాలి. సిన్న సెంబు అని రాయకూడదు, చిన్న చెంబు అనే రాయాలి. ఇక్కడ కూడా అంతే, ముప్పయి, నలుబయి, ఏబయి, డెబ్బయి, ఎనబయి, తొంబయి అనే రాయాలి. గూటాలతో రాయకూడదు" చెప్పినాను.

“బాగుందన్నయ్యా, తెలుగుమాటలకు గూటాలను తగిలించకూడదని తెలుసుకొన్నాం. ఏదయినా ఒక చేర్పును గురించి చెప్పన్నయ్యా” అన్నాడు నారాయణ.

“అన్నయ్యా, ఈయన ఎవరో, ముద్రణాలయం అనే పెరమాటకు అచ్చుగుడి అనే తెలుగుమాటను వాడినారు చూడు” అన్నాడు చిన్నయ్య,

“బాగానే ఉంది కానీ, గుడికి మారుగా ఏదయినా చేర్పును కలిపి పొందించి ఉంటే ఇంకా బాగుండేది. కార్యాలయాన్ని పనిగుడి అంటే బాగుంటుందా?” అన్నాడు నారాయణ.

“నువ్వన్నది నిక్మమే నారాయణా. చేర్చు అనేది, కుదురుకు అంటుకొనేదిగా కంటే కలనిపోయేదిగా ఉంటే మరింత చిన్నమాటలను పొందించవచ్చు. పైగా గుడి అంటూనే అందరికీ వేలుపు వెలసిన చోటుగా మట్టుకే తోస్తుంది. తెలుగులో “ఇలు అనే మాట ఉంది. “ఇల్లు అని ఈమాటకు తెల్లం. ఈమాటను నన్నయ కూడా వాడినారు. గుడి అంటే కూడా ఇల్లు అనే కదా తెల్లం. గుడికి తెన్నాటి(ఇప్పటి తమిళనాటి) తెలుగుమాట కోయిలు. కళింగ తెలుగులో కోవెల. కో అంటే వేలుపు. వేలుపు ఉండే ఇలు కాబట్టి కోయిలు అయింది. ఈ “ఇలు” ను చేర్చుగా చేసుకొని కొత్తమాటలను పుట్టించవచ్చు” అంటూ మొదలిడినాను.

1. అగవు+ఇలు = అగవిలు ఆఫీస్‌ (కార్యాలయం అంటున్నారు. అగవు అంటే పని)
2. అచ్చు+ఇలు = అచ్చిలు ప్రింటింగ్‌ ప్రెస్‌.(ముద్రణాలయం).
3. అడకు+ఇలు = అడకిలు బ్యాంక్‌. (అడకు అంటే దాచి ఉంచి కావాలసినపుడు తిరిగితీసుకోవడం. తెన్నాటి తెలుగుమాట ఇది).
4. అరుగు+ఇలు = అరుగిలు ఆడిటోరియం.(రంగమండపం అంటున్నారు).
5. ఉచ్చ+ఇలు = యూరినల్స్‌. (మూత్రశాల అంటున్నారు. దాదాపు రెండువేల ఏళ్ల కిందట, ఇక్ష్వాకుదొరలు, నాగార్జునకొండ దగ్గర ఒక పలుచడువిలును నెలకొల్పినారు. అక్కడ యూరినల్స్‌కు “ఉచ్చకుటి” అని రాతిపలకను చెక్కించి పెట్టినారు)
6. ఎరుక +ఇలు = ఎరుకిలు అకాదెమీ.(ఎరుక అంటే జ్ఞానం)
7 ఎస+ఇలు = ఎసిలు/ఎసగిలు మ్యూజిక్‌ తియేటర్‌. (ఎస అంటే సంగీతం. తెన్నాటి మాట)
8. కనబరుచు+ఇలు = కనబరపిలు ఎగ్జిబిషన్‌ (ప్రదర్శనశాల అంటున్నారు. ).
9. కాల్చు+ఇలు = కాల్చిలు క్రిమెటోరియం.
10. కూడు +ఇలు = కూటిలు రెస్తారెంట్‌.(బోజనశాల అంటున్నారు.)
11. కోగు +ఇలు = కోగిలు బార్బర్‌షాప్‌/సెలూన్‌.(క్షౌరశాల అంటున్నారు. కోగు=గొరుగు.)
12. కోలు +ఇలు = కోలిలు పోలీస్‌స్టేషన్‌. (రక్షకబట నిలయం అంటున్నారు. కోలు=కావలి; కోలుకారు=పోలీస్‌)
13. గూడు+ఇలు = గూటిలు డార్మెటరీ.
14. చదువు+ఇలు = చదువిలు కాలేజ్‌.(కళాశాల అంటున్నారు)
15. చలిదాపు+ఇలు = చలిదాపిలు కోల్డ్‌స్టోరేజ్‌.(శీతలగిడ్డంగి అంటున్నారు)
16. చలువ+ఇలు = చలువిలు లాండ్రీ.
17. తగవు+ఇలు = తగవిలు కోర్ట్‌. (న్యాయస్తానం అంటున్నారు. తగువు = న్యాయం)
18. తమ్మ+ఇలు = తమ్మిలు పాన్‌బూత్‌.
19. తానేగి+ఇలు =. తానేగిలు ఆటోస్ట్రాండ్.(తానేగి అంటే ఆటోరిక్షా)
20. తెరాట+ఇలు. = తెరాటిలు సినిమా తియేటర్‌.(చలనచిత్ర మందిరం అంటున్నారు)
21. తేనీరు+ఇలు = తేనీరిలు టీస్టాల్‌.
22. దంచు+ఇలు = దంపిలు ఫ్లోర్‌ మిల్‌.
23. దొంతి+ఇలు = దొంతిలు అపార్ట్‌మెంట్‌.
24. నట్టువ+ఇలు = నట్టువిలు నాట్యమందిరం.
25. ననుపు+ఇలు = ననుపిలు ఫ్యాక్టరీ.(కార్మాగారం అంటున్నారు. ననుపు=వృత్తి)
26. నారు+ఇలు = నర్సరీ.
27. నిలవ +ఇలు = నిలవిలు గోడౌన్‌.(గోదాము అంటున్నారు.)
28.నోయి+ఇలు = నోయిలు లైబ్రరీ. ((గ్రందాలయం అంటున్నారు. నోయి=గ్రందం. ఇది తెన్నాటి తెలుగుమాట)
29, పట్టేగి+ఇలు = పట్టేగిలు రైల్వేస్టేషన్‌. (దూమశకట నిలయం అంటున్నారు. పట్టేగి=టైన్‌)
30. పలుకు +ఇలు = పలుకిలు టెలీఫోన్‌ బూత్‌.
౩1. పలుచదువు+ఇలు = పలుచదువిలు యూనివర్సిటీ. (విశ్వవిద్యాలయం అంటున్నారు.)
32. పాలు +ఇలు =. పాలిలు మిల్మ్‌బూత్‌.
33. పేరేగి +ఇలు = పేరేగిలు బస్‌స్టేషన్‌.
౩4. మంట+ఇలు = మంటిలు ఫైర్‌స్టేషన్‌. (అగ్నిమాపక కేంద్రం అంటున్నారు).
35.మనుము +ఇలు = మనుమిలు జూ.(జంతుప్రదర్శనశాల అంటున్నారు. మనుము= జంతువు.తెన్నాటి తెలుగుమాట)
36. మరుగు+ఇలు = మరుగిలు టాయ్‌లెట్‌ (శౌచాలయం అంటున్నారు)
37. మిను+ఇలు = మిన్నిలు కరంటు ఆఫీస్‌. (విద్యుత్‌ కార్యాలయం అంటున్నారు)
38. వసతి+ఇలు = వసతిలు హోటెల్‌/ లాడ్జ్ (విశ్రాంతి గృహం అంటున్నారు)
39. విరుగు+ఇలు = విరుగిలు హాస్పిటల్‌. (వైద్యశాల అంటున్నారు. విరుగు = చికిత్స/ వైద్యం)
40. వేచు+ఇలు =. వేచిలు వెయిటింగ్‌ రూమ్‌
41. వేలిమి+ఇలు = వేలిమిలు యజ్ఞశాల (వేలిమి=యజ్ఞం)
42. సంత +ఇలు = సంతిలు షాపింగ్‌మాల్‌


“అన్నయ్యా, నువ్వేమో నన్ను అందరితో అణకువగా ఉండుమంటావు. తెలుగును ఎవరన్నా అలకువగా మాట్లాడితే అణచుకోవడం నావల్ల కావడం లేదు” అంటూ వచ్చినాడు చిన్నయ్య.

చిన్నయ్య గురించి తెలిసిందేగా! నవ్వుతూ “అణచుకొమ్మని చెప్పలేదు చిన్నయ్యా, గట్టిగానే ఎదురుకోవాలి. అయితే ఆ ఎదురుకోవడంలో దురుసుతనమూ వెక్కసమూ ఉండకూడదు, ఇంతకీ ఏమయింది?” అన్నాను.

“ఆఁ, ఎవడో గొట్టంగాడు, తెలుగుదేముంది, సంసుక్రుతపు కాలిగోటికి చాలదు మీ తెలుగు అన్నాడు. నాకు మండిపోయి చెడామడా కడిగిపారేసినాను” అన్నాడు.

"చూడు చిన్నయ్యా, మనచుట్టూ వేలమంది తెలివరులు, సంసుక్రుతం అనేది వేలుపునుడి అనీ అది మందినోటినుండి పుట్టినది కాదు అనీ నమ్ముతుంటారు. వాళ్లందరూ తెలిసో తెలియకో తెలుగును చిన్నచూపు చూస్తుంటారు. అలాంటి చదువులే చదివి వచ్చినారు వాళ్లంతా. అది తప్పు, అన్ని నుడులూ గొప్పవే అని చెపుతున్నవాళ్లం పదులలెక్కలో కుడా లేము. కాబట్టీ మనం గట్టిగా ఎదురుకోవలసిందే. అంతేకానీ దూకుడుగా కడిగిపారేయకూడదు. అది సరేకానీ, నువ్వు వస్తూ వస్తూ మంచి చేర్చును వెంట పెట్టుకొని వచ్చినావు తెలుసా” అన్నాను.

“చేర్పునేమిటి, నేను వెంటపెట్టుకొని రావడమేమిటి, నువ్వంటున్నది నాకేమీ ఎరుకపడడం లేదు అన్నయ్యా” చిన్నయ్య అన్నాడు.

“వస్తూ నువ్వు పలికిన పలుకుల్లో అణకువ, అలకువ అనే రెండుమాటలు ఉన్నాయి కదా. ఆ రెండింటిలో 'ఉవ ' అనే చేర్పు ఉంది చూడు” చెప్పినాను.

“నాకు ఎంతో ఎలమి(సంతోషం)గా ఉందన్నయ్యా, నాకు తెలియకుండానే, నేను కూడా ఒక చేర్చును వాడినాను అన్నాడు చిన్నయ్య.

“నువ్వే కాదు చిన్నయ్యా, తెలుగువాళ్లం అందరమూ వాడుతున్నవాటినే, మనం విడదీసి విడమరచి చెపుతున్నాం. నమ్రత, అపక్వం, న్యూనత, సంకోచం, కోపం, నివాసస్తలం, స్తిరత్వం, ప్రయత్నం, జ్ఞానం, ఇవన్నీ ససుక్రువు మాటలు. పేరనికలు(నామవాచకాలు). వీటికి తెలుగుమాటలు లేవా అంటే ఉన్నాయి. అణకువ, అఱుకువ, అలకువ, అళుకువ, అలుకువ, ఉనుకువ, ఉంకువ, ఊకువ, ఎఱుకువలు వరనగా-ఆ తెలుగుమాటలు. ఇవన్నీ తెలుగు నుడిగంటులలో ఉన్నవే. బడిపొత్తాలలో, ఆకికలలో తెలుగుమాటలు కాక పెరమాటలనే వాడడం వలన తెలుగు నెన్నొడి మరుగున పడిపోయింది. ఉన్న నెన్నొడిని వాడడం లేదు. కొత్త నెన్నొడిని పుట్టించుకోవడం లేదు. ఇక తెలుగు ఎలా ఎదుగుతుంది? పై తొమ్మిది మాటలలోనూ 'ఉవ 'అనే చేర్పుఉంది. ఈ చేర్చును అగవనిక (కియావాచకా)లకు చేర్చితే పై పేరనికలు ఏర్పడినాయి. అణగు, అఱుగు, అలగు, అళుకు, అలుగు, ఉనుకు, ఉంకు, ఊకు, ఎఱుగు అనేవి ఆ అగవనికలు. ఇటువంటి అగవనికలను ఏరుకాని, వాటికి 'ఉవ 'ను చేర్చితే కొత్తమాటలు పుడుతాయి. మచ్చుకు కొన్నిటిని పుట్టిదాం పట్టు” అని మొదలుపెట్టినాను.

1. అంకు+ఉవ అంకువ లాబం అంకు=లభించు.
2. అగు+ఉవ అకువ ప్రాప్తం అగు=ప్రాప్తించు.
3. అడకు+ఉవ అడకువ గోప్యత అడకు=దాచు.
4. అడుకు+ఉవ అడుకువ శ్రేణి అడుకు =పేర్చు.
5. అదుకు+ఉవ అదుకువ ఏకాగత అదుకు =లగ్నంచేయు.
6. అనగు+ఉవ అనకువ సంపర్మం అనగు=కలయు.
7. అరుగు+ఉవ అరుకువ ప్రయాణం అరుగు =వెడలు.
8. అవుకు+ఉవ అవుకువ సంకోచం అవుకు=వెనుదీయు.
9. ఆగు+ఉవ ఆకువ విరమణ ఆగు=విరమించు.
10. ఇంకు+ఉవ ఇంకువ నష్టం ఇంకు =నష్టపోవు.
11. ఇగ్గు+ఉవ ఇక్కువ ఉద్వాసన ఇగ్గు=ఉద్వాసనచేయు.
12.ఇడుగు+ఉవ ఇడుకువ వికాసం ఇడుగు=వికసించు.
13. ఇనుకు+ఉవ ఇనుకువ శుష్కం ఇనుకు =శుష్కించు.
14. ఇరుగు+ఉవ ఇరుకువ అంతర్జ్బూతం ఇరుగు =ఇముడు.
15. ఇలుగు+ఉవ ఇలుకువ మరణం ఇలుగు =మరణించు.
16. ఈగు+ఉవ ఈకువ ప్రవేశం ఈగు= ప్రవేశించు.
17. ఉడుగు+ఉవ ఉడుకువ త్యాగం ఉడుగు =త్యజించు.
18. ఉతుకు+ఉవ ఉతుకువ తాడనం ఉతుకు=బాదు.
19. ఉదుకు+ఉవ ఉదుకువ నాశనం ఉదుకు=నశింపచేయు.
20. ఉబుకు+ఉవ ఉబుకువ సంతోషం ఉబుకు =సంతోషించు.
21. ఉరుకు+ఉవ ఉరుకువ లంగనం ఉరుకు=లంగించు.


శ్రద్దాంజలి

శ్రీ గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి కనుమరుగు

బళ్ళారి. ప్రాంత తెలుగు సాహిత్యాభిమానులకు అత్యంత అప్తుడు, ఆత్మీయుడు, సన్నిహిత స్నేహబాంథవుడు, తెలుగు సాహితీసింధువు, తెలుగు కన్నడ భాషాసాహిత్యాల సేతువు - శ్రీ గుత్తి(జోళదరాశి)చంద్రశేఖరరెడ్డి గారు. “దేశభాషలందు తెలుగులెస్న” అని చాటి చెప్పిన, శ్రీకృష్ణ డేవరాయలనినా, రాయలవారు అభిమానించిన తెలుగుభాష అనినా, చంద్రశేఖరరెడ్డిగారికి ఎనలేని అభిమానం. చంద్రశేఖరరెడ్డి గారు పుట్టింది, బళ్ళారికి దగ్గరలోనే ఉన్న జోళదరాశి అనే ఊరిలో. తండ్రి నారాయణరెడ్డిగారు కూడా తెలుగు అభిమాని. తండ్రినుంచి తెలుగు అభిమానాన్ని తెలుగు ఆవేశాన్ని పుణికి పుచ్చుకున్న తనయుడు రెడ్డిగారు.

బళ్ళారిలో ఎల్లప్పుడూ తెలుగు కనిపిస్తూ వినిపిస్తూ ఉండాలి. బళ్ళారి తెలుగు కనుమరుగు కాకూడదు, అని ఎప్పుడూ ఆరాటపడుతుండేవారు రెడ్డిగారు. బళ్ళారిలోనూ కర్నాటకలోనూ తెలుగు రెండవ అధికార భాషగా గుర్తింపు పొందాలని, అందుకు తెలుగు కన్నడ ప్రభుత్వాలు రెండూ పూనుకోవాలని, తను పాలుపంచుకున్న వేదికలమీదంతా ఘోషించేవారు వీరు.

బళ్ళారిలోని రాఘవ స్మారక సమితి, ఆంధ్రకళాసమితి, బళ్ళారి కల్చరల్‌ అసోసియేషన్‌, తెలుగు సంస్కృత సమితి మొదలైన సంస్థలలో సన్నిహిత సంబంథాలను చివరివరకూ కొనసాగించారు. తండ్రిగారి పేరుతో “గుత్తి నారాయణరెడ్డి స్మారక పురస్కారం”ను ఏర్పాటు చేసి, ప్రతి ఏడాదీ, తెలుగురాష్ట్రాలకు బయట ఉండి తెలుగుకు సేవ చేస్తున్న వారిని గుర్తించి, జోళదరాశికి పిలిపించి, పురస్మారంతో గౌరవించేవారు.

హైదరాబాద్‌లో కుదురుకొన్నా ఆయన మనసు ఎల్లప్పుడూ బళ్ళారి చుట్టూ తిరుగుతుందేది. ఆరోగ్యం సహకరించకపోయినా చివరిదినాలలో ఆయన బళ్ళారికి వచ్చారు. అఖండ బళ్ళారి జిల్లా పోరాట ఉద్యమాల్లో పాల్గొన్నారు. కాళ్లు సహకరించకపోయినా వేదికలెక్కారు. గొంతు సహకరించకపోయినా చైతన్యాన్ని రగులుకొల్పే ఉపన్వాసాలనిచ్చారు. చివరిరోజున కొనవూపిరిదాకా బళ్ళారి తెలుగు గురించి కలవరిస్తూ, తెలుగు పలుకులను పలుకుతూ కనుమూశారు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా, చారిత్రక పరిశోధకుడిగా, అనువాద రచయితగా, నటుడిగా తెలుగన్నడ భాషాసాహిత్యాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయాలు.

“మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నడాంబకు మంగళారతులు” అంటూ ఉపన్యాసాన్ని మొదలు పెట్టే చంద్రశేఖరరెడ్డిగారి గొంతు, బళ్ళారిలో,కర్ణాటకలో, తెలుగువాళ్లు ఉన్నంతకాలమూ వినిపిస్తూనే ఉంటుంది. తెలుగును వదలిపెట్టవద్దని మా వెంటవడుతూనే ఉంటుంది.

కె.సురేంద్రబాబు, విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు, బళ్ళారి


22. ఉఱుకు +ఉవ ఉఱుకువ ఉద్గారం ఉఱుకు=ఉద్గతమగు.
23. ఉలుకు +ఉవ ఉలుకువ అసూయ ఉలుకు=అసూయపడు.
24. ఉసుగు+ఉవ ఉసుకువ సంగర్షణ ఉసుగు=నలుగు.
25. ఎదుగు +ఉవ ఎదుకువ అబ్యుదయం.
26. ఎమకు +ఉవ ఎమకువ శోదన ఎమకు=శోదించు.
27. ఎఱగు+ఉవ ఎఱకువ నమస్మారం ఎజగు=నమస్మరించు.
28. ఎసగు+ఉవ ఎసకువ విజ్బంబణం ఎసగు=విజ్బంభించు.
29. ఏకు +ఉవ ఏకువ శాపం ఏకు =తిట్టు.
30. ఒగ్గు+ఉవ ఒక్కువ వ్వాప్తి ఒగ్గు =వ్యాపించు.
31. ఒడుకు+ఉవ ఒడుకువ హాజరు ఒడుకు =ప్రవేశపెట్టు.
32. ఒదుగు+ఉవ ఒదుకువ విదేయత ఒదుగు=విదేయుడగు.
33. ఒరగు+ఉవ ఒరకువ శిదిలం ఒరగు =శిదిలమగు.
౩4. ఒలుకు+ఉవ ఒలుకువ స్రావం ఒలుకు=స్రవించు.
35. ఒసగు+ఉవ ఒసకువ అంకితం ఒసగు =అర్పించు.

“ఉవతో నూర్లమాటలను పుట్టించవచ్చు. అయితే అగవనికలకు మట్టుకే ఉవను చేర్చాలా అనే అరగలి వస్తుంది. పై మాటలన్నీ అగవనికలే కదా. పేరనికలకు కూడా ఉవను చేర్చవచ్చు అనడానికి కొన్ని మచ్చులు కనబడుతున్నాయి. వేగు+ఉవ = వేకువ; పెక్కు+ఉవ= పెక్కువ ; టెక్కు+ఉవ = టెక్కువ వంటివి. ఒక మచ్చు దొరికినా మనం అల్లుకుపోవాలి. చిక్కు+ఉవ= చిక్కువ = క్లిష్టం; ముక్కు + ఉవ = ముక్కువ = అనునాసికం వంటి మరిన్ని మాటలను పుట్టించవచ్చు ఈ ఉవతో” అని ముగించినాను.

(తరువాయి వచ్చే సంచికలో...)



తెలగువారందరూ తమ రోజువారీ వ్వవహారాలను తెలుగులో జరుపుకోగలగాలి. “కలగాలి” అంటే రెండు అర్థాలు: ఒకటి, తెలుగులో జరుపుకోవాలి అని ఎవరూ శాసించకుండానే, స్వచ్చందంగా (ప్రజలు అనుకొని జరుపుకోవడం. రెండు, అందుకు తగ్గ పరిస్థితులు, సదుపాయాలు మనకు మనం కల్సించుకోవడం.