అమ్మనుడి/సంపుటి 4/జూలై 2018/పెద్ద బొంకూర్ శాతవాహన స్థావరం
పెద్దబొంకూరు శాతవాహన స్థావరం
తెలంగాణ పురావస్తు శాఖ తవ్వకాలలో బయల్పడిన చారిత్రక యుగపు ఆనవాళ్ళు
శాతవాహన స్థావరమైన పెద్దబొంకూర్‌లో గత మూడు నెలలపాటు జరిగిన పురావస్తు తవ్వకాలు చరిత్రకారులను ఆశ్చర్య పరుస్తుంది చారిత్రక యుగపు ఆనవాళ్ళు ఇక్కడ 920 వరకు దొరికాయి ఈ తవ్వకాలను పరిశీలించిన తెలంగాణా పురావస్తుశాఖ సంచాలకురాలు శ్రీమతి విశాలాచ్చి మాట్లాడుతూ, తెలంగాణా క్రీస్తుపూర్వం నుండే సంపన్న ప్రాంతంగా విరాజిల్లినట్లు ఇక్కడ తవ్వకాలలో బయల్పడిన ఆవశేషాలు తెలియజేస్తున్నాయని అన్నారు. జూన్ 8వ తేదీన ఆమె పెద్దబొంకూర్ స్థావరాన్ని సందర్శించి తవ్వకాలలో దొరికిన వివిధ వస్తువులను గూర్చి విలేఖరులతో మాట్లాడారు. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో జరిగిన తవ్వకాలపట్ల ఆమె తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాలో, హైదరాబాద్ - రామగుండం స్టేట్ హైవే మార్గంలో, పెద్దపల్లికి సమీపంలో ఈ స్థావరం ఉంది. 1967, 68, 1973 - 74లలో ఇక్కడ పురావస్తు శాఖవారు తవ్వకాలు జరిపించారు ఇక్కడ 70 ఎకరాలలో ఈ శాతవాహన స్థావరం ఉంది. గతంలో జరిపిన తవ్వకాల స్థలంలో కాక, ఉత్తరం వైపున తవ్వకాలు జరిపారు. ప్రస్తుతం 25 కందకాలను తవ్వి, సుమారు 3 నుండి 4 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిపారు. తెలంగాణలో పలుచోట్ల ఇటీవలి కాలంలో తవ్వకాలు జరిపామని, సముద్రతీరము వ్యాపారాలు ఇక్కడి సమీపంలోని గోదావరి నది ప్రవాహాల ద్వారా జరిగాయని, కర్ణమామిడి, సిద్దిపేట, నల్గొండ జిల్లాలలో జరిగిన తవ్వకాలలో ఆదిమానవుడి అవశేషాలతోపాటు, రోమన్ రాజుల కాలపు బంగారు పూత నాణాలు దొరికాయని విశాలాచ్చి అన్నారు. సుమారు 22 లక్షల రూపాయలు ఈ తవ్వకాలకు కేటాయించామని అన్నారు. సుమారు రెండు వేల ఏండ్ల కిందటి అనేక వస్తువులు బయటపడ్డాయి. వివిధ రంగుల్లో కుండ పెంకులైతే బస్తాలు బస్తాలుగా దొరికాయి. రోమన్ దేశపు చక్రవర్తుల నాణేలు దొరకడం వల్ల తెలంగాణా ప్రాంతము, క్రీస్తు పూర్వం రెండు నుండి, క్రీస్తు శకం నాలుగు వరకు 4 శతాబ్దాల పాటు, రాజుల యుద్ధాలు, ఎలాంటి గొడవలు లేకుండా ప్రజలు సుఖశాంతులతో ఉండటం వల్ల, తెలంగాణా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా, సుసంపన్నంగా విరాజిల్లినట్లుగా అంచనా వేయవచ్చునని చెప్పారు. ఇక్కడ గతంలో జరిగిన తవ్వకాలలో పూర్వ శాతవాహనులు, శాతవాహనుల కాలపు రాగి, సీసపు, పంచ్ మార్క్ నాణాలు దొరికాయి. ఇవి రోమన్ చక్రవర్తులు, మౌర్యులు, శాతవాహన రాజుల కాలపు నాణాలు దొరికాయి. ప్రజలు విలువైన ఆభరణాలతో పాటుగా, విదేశీ సముద్ర వాణిజ్యానికి ఆసక్తి చూపారని అన్నారు. రోమన్ చక్రవర్తుల కాలానికి చెందిన టైబీరియన్ వెండి నాణెం ఈ తవ్వకాలలో దొరికిందని, ఇది చెప్పుకోదగ్గ విషయమని అన్నారు. లోహపు పనిముట్లు, మట్టిబొమ్మలు, అచ్చు ముద్రికలు, ఎముకతో చేశిన పాచిక, పలు రకాల సీసపు గాజులు, పిప్శాన్ పూసలు, శంఖు గాజులు వివిధ రకాల నాణేలు దొరికాయి. వీటితో పాటుగా చదరంగపు పావులు, ఇనుప మేకులు, చిరు కత్తులు, ఆవు కొమ్ము గల బొమ్మ లభ్యమయ్యాయి. 90 రోజులపాటు జరిగిన తవ్వకాలను వర్షాకాలం రావడం వల్ల నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ దొరికిన వస్తువులను హైదరాబాద్ మ్యూజియానికి తరలించి, భద్రపరిచి, పరిశోధనలు చేయనున్నట్లు తెలిపారు.
పూర్వ కరీంనగర్ జిల్లా ప్రాంతం తొలి శాతవాహన రాజులకు ముఖ్యమైన పరిపాలనకేంద్రం, వెల్గటూర్ మండలంలోని కోటి లింగాలలో 1979 - 1980, 1983 - 1984 లలో ఉమ్మడి రాష్ట్ర పురావస్తు శాఖవారు నిర్వహించిన తవ్వకాలలో పూర్వ శాతవాహనులు, తొలి శాతవాహన రాజుల కాలపు ఎన్నెన్నో అంశాలు వెలుగులోకి వచ్చాయి. అంతకు ముందు గుంటూరు జిల్లా అమరావతి - ధాన్య కటకాన్నే తెలుగునాట శాతవాహన స్థావరంగా పరిగణించే వారు. ఎగువన ఉన్న మహారాష్ట్రలోని పైఠాన్ (ప్రతిష్టానపురం) ను శాతవాహన స్థావరంగా గుర్తించారు. 1976లో ధర్మపురికి చెందిన తపాల ఉద్యోగి సంగనభట్ల నరహరి శర్మ కోటిలింగాలలో శాతవాహనులకు చెందిన దుబ్బ నాణాలను కనుక్కోవడంతో, తొలి శాతవాహనులు, పూర్వ శాతవాహనుల స్థావరంగా కోటిలింగాల తెలంగాణా ప్రాంతము ప్రసిద్ధి కెక్కింది. ఇక్కడ రెండు వేల ఏళ్లకు పూర్వమైన మట్టి కోటను కనుగొన్నారు అంతేకాక ఇక్కడ పొలాలలో శాతవాహనుల కాలం నాటి ఇటుక బావులను కనుగొన్నారు రాష్ట్ర పురావస్తుశాఖకు చెందిన ప్రముఖ పురాతత్వవేత్తలు డా॥ పి .వి. పరబ్రహ్మశాస్త్రి, డా॥వి. వి. క్రిష్ణశాస్త్రి , డా॥ఎన్. ఎస్. రామచంద్రమూర్తితో సహా ప్రముఖ పురాతన నాణాల పరిశోధకులు డా॥దేమె రాజిరెడ్డి తదితరులు కోటిలింగాల, ధూళికట్ట, పెద్దబొంకూర్ స్థావరాలలో దొరికిన నాణాలపై పరిశోధన చేసి ఎన్నెన్నో అంశాలను వెలుగులోకి తెచ్చారు. ప్రాక్
చరిత్రకారులు ఠాకూర్ రాజారాం సింగ్ పెద్దపల్లి ప్రాంతంలోని యితర శాతవాహన స్థావరాలైన ధూళికట్ట పెద్ద బొంకూర్‌లను వెలుగులోకి తెచ్చారు. ధూళికట్టలో క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్తూపం బయటపడింది. ఈ స్తూపం అమరావతికన్న వంద ఏళ్లకు పూర్వమైనదని అంచనా వేశారు. దీనికి పది కిలోమీటర్ల దూరంలో వున్న పెద్దబొంకూర్లో శాతవాహనుల గ్రామీణ స్థావరం బయటపడింది. తెలంగాణా ప్రాచీన చరిత్రకు ఉమ్మడిరాష్ట్రంలో సరైన న్యాయం జరుగలేదు. పెద్దబొంకూర్‌లో శాతవాహన స్థావరంలో 70 ఎకరాల భూమిని గుర్తించి, సేకరించారు. కోటిలింగాల ధూళికట్ట మొదలగు శాతవాహన స్థావరాలతో సమానంగా పెద్దబొంకూర్ శాతవాహన స్థావరం కూడా ముఖ్యమైనదని తెలంగాణా రాష్ట్ర పురావస్తుశాఖ గుర్తించింది. 1968 నుండి 1974 వరకు ఉమ్మడి రాష్ట్ర పురావస్తుశాఖ ఇక్కడ పాక్షికంగా తవ్వకాలను నిర్వహించింది.
హుస్సేమియా వాగు తీరంలో వున్న, ఈ స్థావరంలో ఒక రైతుకు పొలంలో శాతవాహనుల కాలంనాటి నాణెముల కుండ దొరికింది. ఈ కొండలో 22 వేలకు పైగా నాణాలువున్నాయి. 1968 - 74 మధ్య యిక్కడ తొలిసారిగా జరిపిన తవ్వకాలలో శాతవాహనుల కాలంనాటి మూడు ఇటుక కట్టడాలు, ఇటుకతో కట్టిన 22 చేదబావులు, మట్టి గాజులతో నిర్మించిన ఒక బావి బయటపడింది. రెండు టంకశాలలు, మురుగు కాలువల ఆనవాళ్ళు, బయటపడ్డాయి. శాతవాహనులు, మౌర్యులు రోమన్ చక్రవర్తుల కాలమునకు చెందిన రాగి నాణెములు, సీసపు నాణెములు, పంచ్ మార్క్ నాణెములు దొరికాయి. ఆ కాలములో వాడుకలోకి ఉపయోగించిన లోహపు పనిముట్లు ,అబ్బురపరిచే రీతిలో మట్టి బొమ్మలు, అచ్చు ముద్రికలు, రాతిపూసలు లభించాయి. ఇవన్నీ క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి మొదలుకొని క్రీస్తుశకం 2 వ శతాబ్దమునకు చెందినవిగా గుర్తించారు.
ధూళికట్ట బౌద్ధస్తూపం వద్ద 1972 - 75 లో జరిగిన పురావస్తు తవ్వకాలలో శాతకర్ణి కుమారుడు పులుమావి వేయించిన వెంది నాణెం బయటపడింది. రోమన్ రాజుల నాణాలు ఇక్కడ దొరకడంతో శాతవాహనులకు సముద్ర వ్యాపారాలు బాగా ఉండేవని తెలుస్తున్నది. గోదావరి నదిలో పడవలు బంగాళాఖాతం సముద్రం వరకు నడిపి, విదేశాలతో సముద్ర వ్యాపారం చేసే వారిని తెలుస్తున్నది.
కోటిలింగాల తవ్వకాలలో శాతవాహనుల పూర్వ రాజులైన గోబద, నారన, కంవాయసిరి, సమగోప మొదలైన రాజుల నాణాలు కూడ దొరికాయి మహాతలవర, మహాసేనాపతి, శబక వంటి సామంత రాజులకు చెందిన నాణాలు కూడా యిక్కడి తవ్వకాలలో బయటపడ్డాయి ఉమ్మడి తెలుగు రాష్ట్రం నుండి వేరుపడి, తెలంగాణా వచ్చాక 2015 - 2017 సంవత్సరాల మధ్య సిద్ధిపేట సమీపంలోని పుల్లూరుగ్రామంలో జరిపిన తవ్వకాలలో బృహత్ శిలాయుగపు సమాధులలో మానవ అవశేషాలు బయటపడ్డాయి నర్మెట్ట గ్రామంలో కూడా సమాధిపై పేర్చిన బండ మూతరాయి బయటపడింది. పాలమాకుల గ్రామంలో కూడా ఇలాంటి బృహత్ శిలా సమాధులే బయటపడ్డాయి. గోదావరి తీరంలోని కోటిలింగాల ఆవలవైపు వున్న మంచిర్యాల జిల్లాలోని కర్ణమామిడిలో 2017 లో తెలంగాణా పురావస్తుశాఖ వారు, పాక్షికంగా తవ్వకాలను నిర్వహించారు. వర్షాకాలం రావడం వల్ల నెలరోజులకు పైగా జరిపిన ఈ తవ్వకాలను అర్ధాంతరంగా నిలిపివేసినట్టు సమాచారం .
పెద్దబొంకూర్ శాతవాహన స్థావరంలో 48 యేంద్ల కింద నిలిపి వేసిన తవ్వకాలను, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కొనసాగించడానికి తెలంగాణా పురావస్తు శాఖ అధికారులు ముందుకు రావడం పట్ల, తెలంగాణా చరిత్రకారులు తమ హర్షామోదాలను వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని ఆర్కియాలజజి శాఖ సుమారు 22 లక్షలతో ఒక్క తెలంగాణాలోని పెద్దబొంకూర్లోనే, ఒక్కచోటనే తవ్వకాలు చేపట్టడానికి అనుమతి మంజూరు చేయడం గమనించాలి.
ఫిబ్రవరి 22న పెద్దబొంకూర్లో పురావస్తు తవ్వకాలకు, తెలంగాణా పురావస్తు శాఖ సంచాలకురాలు శ్రీమతి విశాలాచ్చి శ్రీకారం చుట్టారు. పురావస్తు శాఖ ఉప సంచాలకులు డి. రాములు నాయక్ ఆధ్వర్యంలో, విశ్రాంత పురావస్తు అధికారులు ఎస్. ఎస్. రంగాచార్యులు, భానుమూర్తిలతో కూడిన పదిమంది అధికారుల బృందం ఈ పురావస్తు తవ్వకాలను పర్యవేక్షిస్తున్నారు. అధికారుల బృందంలో కరీంనగర్ ఇంచార్జి అధికారిణి శ్రీమతి మాధవి, నాగరాజు తదితరులు ఉన్నారు. ప్రతిరోజు సగటుగా 30 మంది కూలీలు ఇక్కడ పనులు చేస్తూ కనిపించారు. ప్రస్తుతం పెద్దబొంకూర్లో గతంలో బయల్పడిన ఇటుక కట్టడానికి ఉత్తరంగా కల ప్రాంతాన్ని ఎంచుకొని, అందులో ఒక డివిజన్‌గా ఏర్పాటుచేసుకొని 5. 5 మీటర్ల విస్తీర్ణంలో 25 పరికెలుగా (త్రెంచులు) గా విభజించారు. యిందులో ఆరు పరికెల్లో త్రవ్వకాలు జరిపి నెల రోజుల్లో కొంత మేరకు సత్ఫలితాలను సాధించగలిగారు. వీటిలో చాలావరకు, తొలి చారిత్రిక యుగపు ఆనవాళ్ళు, దాదాపు 30 నుండి 60 సెంటీమీటర్ల లోతుగల మట్టి పొరలలో బయటపడ్డాయి. మట్టి పూసలు, శంఖముతో చేసిన పూసలు, ముల్లాపు పూసలు, పచ్చటి బంగారు రేకులతో చేసిన పూసలు, క్రిస్టల్, గాజు, షెలబ్రీడ్స్, కార్నిలియలన్ పూసలు, ఎముకలతో చేసిన చదరంగపు పాచికలు, చిన్నపాటి రింగ్ మట్టి పాత్రలు, కొలత పావులు, దుప్పి లేదా జింక కొమ్ము మొదలగునవి ఈ తవ్వకాలలో బయట పడ్డాయి. ముఖ్యంగా ఈ చారిత్రిక తవ్వకాలలో మొట్ట మొదటిగా ముత్యాల పూసలు లభించటం మొదటిసారని పురావస్తు అధికారులు చెప్పారు. లోగడ ఇలాంటివి ఎక్కడ లభించలేదని, రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకురాలు శ్రీమతి విశాలాచ్చి చెప్పారు. యిక్కడ దొరికిన ఒక నాణెం, పూర్వ శాతవాహనులైన గోబద కాలానికి చెందినది కావచ్చునని ఆమె అన్నారు. గోబద కాలానికి చెందిన నాణాలు కోటిలింగాల తవ్వకాలలో దొరికిన విషయం గమనార్హం. పెద్దబొంకూర్‌లో దొరికిన ఎరుపు, నలుపు మట్టి పాత్రలు, పెంకులు, వివిధ రకాలైన లొహపు పనిముట్లు బయటపడటాన్ని గమనించవచ్చు. పెద్దబొంకూర్ తొలి తవ్వకాలలో కమ్మరి కొలిమి కూడా కనుక్కున్నారు.
హెరిటేజ్ సిటీ / సైట్‌గా అభివృద్ధి
పెద్దపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని పెద్దబొంకూర్ స్థావరాన్ని హెరిటేజ్ సైట్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ 70 ఎకరాల స్థావరంలోనే సైట్ మ్యూజియం ఏర్పాటు చేసి, జిల్లా పురావస్తు శాఖ కార్యాలయాన్ని ప్రారంభించే యోచనని పరిశీలిస్తామని విలేకరులతో పురావస్తు సంచాలకురాలు విశాలాక్షి తెలిపారు. అంతేగాక ఈ స్థావరంలోని 70 ఎకరాల భూమి, దురాక్రమణలకు గురి కాకుండా చుట్టూ కంచె వేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు ఈ స్థావరంలోని కట్టడాలు, చారిత్రిక ఇటుక బావులను ప్రజా ప్రదర్శనకు ఉంచుతామని అన్నారు. పెద్దబొంకూర్ తవ్వకాలు సత్ఫలితాలు ఇచ్చాయని అన్నారు. ఇంతేకాక సమీపంలో వున్న ధూలికట్ట బౌద్ధ స్థావరం వద్ద ఆగిపోయిన తవ్వకాలను త్వరలో ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. ఇందులకై శాస్త్రీయ సర్వే నిర్వహించదలచామని అన్నారు. క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దంలో గ్రీకు రాయబారి మెగస్తనీస్ చెప్పినట్లుగా శాతవాహనులకున్న 30 దుర్గాలలో కోటిలింగాల, ధూళికట్టతోపాటు, పెద్దబొంకూర్ స్థావరం కూడా ఒకటై ఉండవచ్చునని పురావస్తు శాఖాధికారులు భావిస్తున్నారు.
ఈ 70 ఎకరాల స్థావరం చుట్టు కంచె వేయడానికి 14వ కేంద్ర ఆర్థిక సంఘం 1.20 కోట్ల రూపాయలను మంజూరు చేసింది అట్టి నిధులను కేంద్రం విడుదల చేయలేదు. ఈ 70 ఎకరాలలో 30 ఎకరాల స్థలం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించినట్లు వస్తున్న వార్తల పట్ల ఈ ప్రాంత చరిత్రకారులు తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ స్థలాన్ని కాపాడాలని కోరుతూ చరిత్రకారులు డా॥ మలయశ్రీ, సాహితీ కారులు డా॥ కాలువ మల్లయ్య, బాలసాని రాజయ్య, అల్లం వీరయ్య ఆధ్వర్యంలో నలుపు రచయితల సంఘం రచయితలు 20 మంది పెద్దబొంకూర్, ధూళికట్ట స్థూపాల వద్ద ఫ్లెక్సీలను పట్టుకొని తమ నిరసనలను తెలుపుతూ జూన్ 24న ప్రదర్శన చేశారు.
ఆ 70 ఎకరాల స్థలాన్నీ ఆర్కియాలజీ శాఖవారికి కేటాయించి జిల్లా ఆర్కియాలజీ కార్యాలయాన్ని మ్యూజియం ఎగ్జిబిషన్ హాలుతోబాటు జిల్లా టూరిజం కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చరిత్రకారులు కోరుతున్నారు
అ