అమ్మనుడి/సంపుటి 4/జూలై 2018/గురువుకి తగిన శిష్యుడు

గురువుకి తగిన శిష్యుడు

గిడుగు పిడుగైతే ఆయన శిష్యుడు తాపీ ధర్మారావు ఆయనకు ఏ మాత్రం తగ్గని శిష్యుడు పర్లాకిమిడిలో కాలేజీలో చదివేటప్పుడు ఒకరోజున ధర్మారావుగారి ముఖంమీద బొట్టు కనిపించకపోవడంతో కోపగించుకుని ఆయన మొఖం చూడకుండా తన కుర్చీని గోడవైపుకి తిప్పుకుని పాఠం చెప్పేరు గురువుగారు. ఆ తర్వాత ఆయనకు ధర్మారావుగారే ముఖ్య శిష్యుడయ్యాడు. అతని వైపే చూస్తూ పాఠం చెప్పేవారు.

ధర్మారావుగారు రామ్మూర్తిగారి వ్యవహారిక భాషా వాదం మీద ధ్వజం ఎత్తారు. కాలేజీలో ఆయనకు శిష్యుడు. ఆయన జ్ఞానాన్ని, దీక్షని, వాదన, ప్రతిభని బాగా ఎరిగున్నవాడు. ఇవన్నీ ఆలోచించి ఒక చిన్న పద్య రూపంతో 'చంపకమాల'తో ఆయన్ని ఎదుర్కోడానికి సిద్ధమయ్యారు ధర్మారావుగారు. గ్రాంథికాన్ని బలపరుస్తూ గురువుగారి వాదనని తిరగకొడుతూ చంపకమాల రాసారు.

గురజాడ అభ్యుదయం దిశగా సాగడానికి శ్రమించారు. సాహిత్యరంగంలో యథాపూర్వ స్థితికోసం పెనుగులాడే అభివృద్ధి నిరోధకుల భావాలపై గురజాడ కత్తికట్టి ఎదుర్కొన్నారు. కన్నుమూసే దాకా గురజాడ కలం దించలేదు.

'సంకెళ్ళను ప్రేమించే వాళ్ళు దాన్ని - అనగా గ్రాంథిక భాషను ఆరాధిస్తారు. కాగా నా మటుకు నా మాతృభాష సజీవమైన తెలుగు 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌' అనిపించుకున్న మన ఈ తెలుగుతో మన సుఖాల్ని దుఃఖాల్ని వెల్లడించడానికి మనం ఎవరం సిగ్గు పడలేదు కానీ కాగితం మీద పెట్టడానికి మనలో కొంత మంది బిడియపడుతున్నారు', అంటూ అప్పటి స్థితిని ముఖం మీద కొట్టినట్టు చెప్పారు గురజాడ.

ఈ రంగంలో గ్రాంథికవాదులు మొరటుతనం, తెలుగుభాష పెరగడానికి వీలు లేకుండా మతిమీద మేకులు కొట్టింది. ఇక చిన్నయసూరిలాంటి వారైతే ఉక్కు చట్రాలనే బిగించారు. దీనిని గ్రహించారు ధర్మారావు.

అలాగే గురజాడ సాహిత్య సృజన గిడుగుకి లక్ష్యంగా కనిపించింది. దాంతో వ్యవహారిక భాషోద్యమం చేయాలనిపించింది ధర్మారావుగారికి. అంతే ధర్మారావుగారు పాత కొత్తలకు పూల వంతెన వెయ్యాలి, ఆయన దృఢమైన వ్యక్తే కానీ తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నప్పుడు, మార్చుకోవడానికి వెనుదీయలేదు. సంస్కరణ భావాలు పుష్కలంగా ఉన్న ధర్మారావుగారు కుమారుని కులాంతర వివాహాన్ని మనసార సమర్థించారు. ఆ జంటకు చివరి వరకు అండగా నిలిచారు. కోడలు తాపీ రాజమ్మ బ్రాహ్మణ యువతి. ఆయన ఆమెతో 'అమ్మా నేను బ్రాహ్మణ వ్యతిరేకిని ఏ మాత్రం కాను, ఆధిపత్య భావజాలాలకు మాత్రమే వ్యతిరేకిని' అని చెప్పారు.

న్యాయం కోసం ఎవరినైనా ఎదిరించగల దిట్ట ఆయన. తమ భావాల్ని ఎదుటి వారికి సౌమ్యంగా ఖచ్చితంగా చెప్పే కరకుతనం ఆయనది. శత్రుత్వంతో సమీపించినవారినైనా మిత్రులుగా మార్చే సరళతర ప్రవర్తన ఆయనది.

ఏ విషయాన్నీ కోపంగా, గట్టిగా చెప్పేవారు కాదు. ఎంతో నిదానంగా మాట్లాడడం ఆయన ప్రత్యేకత. ఈ ధర్మాలన్నీ సమపాళ్లల్లో పోత పోసిన వ్యక్తి తాపీ ధర్మారావు. తాపీవారికి పసితనం నుంచి తెలుగు సాహిత్యం అన్నా, విషయ జిజ్ఞాస అన్నా ఆసక్తి, అభిరుచి ఉండేవి. కానీ నాయన నరసింగరావుగారు డాక్టరు. ఆంగ్లం అంటేనే ఇష్టం. ఆయనకి తమ పిల్లలు ఆంగ్లం బాగా చదివి గొప్ప వాళ్ళై పెద్దపెద్ద సర్కారు ఉద్యోగాలు చేయాలని ఆయన ఆశయం.

తెలుగు చదివితే ధర్మారావుగారిని తిట్టేవారు ఆయన తండ్రి. నాయనగారు మేడ మీదకు తీసుకు వెళ్లే వరకు ఏ ఇంగ్లీష్ పుస్తకమో చదువుతున్నట్లు ధర్మారావుగారు నటించి, తర్వాత తెలుగులో పద్యాలు రాసుకునేవారు.

నాయనగారి పలుకుబడినిబట్టి తలచుకుంటే ధర్మారావుగారికి గొప్ప సర్కారు ఉద్యోగమే దొరికేది. కానీ ఆయనకది ఇష్టం లేదు. ఉన్నంతలో ఉపాధ్యాయ వృత్తే ఉత్తమం అని కళ్ళికోట రాజా కళాశాలలో లెక్కల మాష్టారుగా చేరారు. అప్పుడే కొందరు మిత్రులతో కలిసి 'వేగుచుక్క' గ్రంథమాలని స్థాపించారు (1910 - 1911), విజ్ఞాన చంద్రిక గ్రంథమాల, ఆంధ్ర భాషాభి వర్దిని సభ, తాకని విషయాలపై ఆంధ్ర వాఙ్మయ చరిత్రను 'తెలుగనెడు కాంత' స్వీయ చరిత్ర రూపంలో 'ఉషఃకాలము' అనే పేరుతో ప్రకటించారు. మొదటి డిటెక్టివ్ నవల 'వాడే - వీడు'. మొదటి ఆంధ్రచరిత్ర నాటకం 'ప్రేమము' మొదలైన గ్రంథాలు వెలువరించారు.

1911 ఉగాది సంచికలో (ఆంధ్రపత్రిక ) 'ఆంధ్రులకు ఒక మనవి' అన్న వ్యాసం ప్రచురితమైంది. అదే వారి తొలి రచన.

గిడుగు రామ్మూర్తి పంతులుగారు తమ మిత్రుడు గురజాడ మరణానంతరం 20 సంవత్సరాలు తమ ప్రసంగాలతో ప్రజలలోకి జనం మాట్లాడే భాష యొక్క ప్రాధాన్యతని తీసుకెళ్ళి, దానిని ఒక భాషోద్యమంగా కొనసాగించారు. ఆయన శిష్యులు ధర్మారావుగారు పుస్తకాలు, పత్రికలు, సినిమాల ద్వారా మాట్లాడే భాషని విశేషంగా ప్రజల్లోకి తీసుకెళ్ళారు.

'ధర్మారావుగారు ఏనాటివాడో - తొలి నుంచి నలుగురు నడిచే దారిలో కాకుండా కొత్త దారులకోసం వెతికారు. అటు పాశ్చాత్య సాహితీ సంస్కృతులను, ఇటు జాతీయ సారస్వత సభ్యతను చక్కగా జీర్ణించుకొని, అధునిక దృక్పథంతో అపూర్వ రచనా సంవిధానంతో తన తావు తాను చూనుకుని, తన గొంతు తను వినిపిస్తూ, విసిష్ట వ్యక్తిత్వం వెలార్చిన మనిషి ఆయన.

నవ్యాతి నవ్య దృష్టితో నమాలోచించగల ధీశాలి. తెలుగు దిన వత్రికలల్లో తొలిసారిగా వ్యావహారిక భాషని ప్రవేశపెట్టిన సాహసి కూడా ఆయనే: అన్నారు విద్వాన్‌ విశ్చంగారు.

ఆయనకు ఎందరో శిష్యులు. అందరూ అదే తోవ పట్టారు.

గిడుగు వారి తర్వాత వ్యావహారిక భాషకి పెద్ద పీట వేసిన వారు ధర్మారావుగారు. సంపాదకుడిగా పత్రికల్లో వ్యావహారిక భాషకి పెద్దపీట వేయడమే కాకుండా చలనచిత్రాల వైపు ఆయన దృష్టి సారించడం మన అదృష్టం. మొట్టమొదట స్క్రీన్‌ప్లే రాయడం తెలియజెప్పినవారు ఆయనే. మనం బయట రాసే దానికీ సినిమాలకి కావల్సిన శిల్పానికి తేడా ఉందని గుర్తించి చెప్పారు. అలాగే సినిమాల్లో చక్కని వ్యావహారిక భాషనే వాడారు. ఈ కారణాల వల్ల వ్యావహారిక భాషకి ఎంతో మేలు జరిగింది. ధర్మారావుగారు జీవితాంతం వరకు తను నమ్మిన ధర్మాలనే మన అందరికీ అర్ధమయ్యే భాషలో చూపిస్తూ సాగారు. గిడుగువారి చివరి రోజులలో చెన్నైకు తీసుకు వెళ్లినప్పుడు, ఆయన కోరిక మీదట గూడవల్లి రామబ్రహ్మంగారి కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో గిడుగు రామ్మూర్తిగారు చేసిన ప్రసంగం శాశ్వతంగా గుర్తుండిపోతుంది. “యూనివర్సిటీలున్నూ ప్రభుత్వ విద్యాశాఖ వారున్ను మాత్రం ఇంకా అనుగ్రహించలేదు. 25 సంవత్సరముల క్రిందట ఈ రెండు నంస్థలవారున్నూ వాడుక భాషను గ్రహించవలెనని చూసినప్పుడు నా వాదం తెలుగువారు గ్రహించకపోవడం చేత అలజడి ఎక్కువయినది. అందుచేత ఆ నంస్ధలవారు దానిని గ్రహించలేదు. ఇప్పుడు తెలుగువారు నా వాదనను గ్రహించిన వారుగనుక , ఆ సంస్థలవారు గ్రహించి ఆమోదించేటట్లున్నూ. ఆచరణలో పెట్టేటట్లున్నూ చేయవలసిన భారం మీది. ఆ పని మీకప్పగించి నేను విరమిస్తున్నాను - సెలవు” అని తన కట్టకడపటి సందేశంగా ఆయన చెప్పారు.

ఆ సందేశాన్ని అందిపుచ్చుకుని తాపీ ధర్మారావుగారు చేసిన కృషి అనితర సాధ్యమైనది. వేంకటేశ్వర యూనివర్సిటీలో కమిటీ సభ్యుడుగా - వ్యవహారిక భాషను ఆమోదింపజేసే కృషిలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు.

అంతేకాదు 'ఏది రాతో ఏది రోతో వివరిస్తూ 'కొత్తపాళీ'లో ఆయన రాసిన కవిత రచయితలందరికీ మార్గదర్శకంగాఉండిపోయింది. “చదివిన విన్నా జనులందరికీ చక్కగ తెలిసితె రాతా/మెదడు చించుకొని నిఘంటులన్నీ వెదికించిందే రోతా” “వాడుక మాటల వల్లనే భావాల్‌ ప్రకటించిందే రాతా/పాడు ముష్టితో పెద్ద సమాసాల్‌ వాడిందైతే రోతా” “చిన్న మాటలనె గొప్పభావములు చెప్పగలిగితే రాతా / మిన్ను విరిగినట్లు ధ్వనించి భావం సున్న చుట్టితే రోతా” (పూర్తి పాఠం అమ్మనుడి పత్రిక జూన్‌ 2018 -17వ పుటలో చూడండి)

ఆ కవితతో పాటే కొత్తపాళీలోనే ఆయన తన సందేశాన్ని ఈ విధంగా కవితాబద్ధం చేశారు. “గొంతులో ఒక అగ్ని కొత్తగా రగిలింది / తంత్రులన్నీ ఒక్క పుంతలో పడ్డాయి / ఇంతింత అనరాని వింతబల మొచ్చింది / స్వార్ధగానము మానరా / ఓ కవీ సార్ధకానికి వూనరా / ప్రజల కవివై గొంతు రగిలించి పాడితే బక్కడొక్కలు రేగి ప్రణయమారుత మట్లు తక్కువెక్కువలెల్ల ఒక్క దెబ్బను కూల్చి లోకాల నూగించవా ఓ కవీ శోకాల తొలగించవా"

ప్రజాస్వామ్యం, ప్రగతి ఆయన కోరుకున్న మార్గాలు. భాషలో ప్రజాస్వామ్యాన్ని ఆధునిక యుగ లక్షణంగా నమ్మి పత్రికా సినీ మాధ్యమాల్లో దానిని పూర్తిగా అమలు చేసి ప్రజలగొంతుకు బలాన్ని పెంచారాయన. అదే ఆయన జీవన సందేశం. అదే ఆయన మరణ వాఙ్మూలం.


ఇంటిభాష

పాఠశాల భాష కావాలి

పిల్లలు చదువులో రాణించాలంటే విద్యాబోధన పరాయిభాషలో కంటే సొంతభాషలోనే జరగాలి. విద్యార్థికి మాతృభాషలో బోధన జరిగితే సబ్జెక్టు ఎక్కువ అర్ధం అవుతుంది. అమ్మ చేతి స్పర్శలాగా, సొంత ఊరు ఓదార్పులాగా, నివసిస్తున్న ఇంటినీడలాగా, మాతృభాష పిల్లల గుండెను తాకు తుంది. అటువంటి ప్రసార మాధ్యమం ద్వారా సబ్జెక్ట్‌ చెప్పగలిగితే విద్యార్థికి అర్ధం అవుతుంది. ఇందుకు భిన్నంగా మరో భాష ద్వారా విద్యాబోధన జరిగితే కృత్రిమ మార్గాన్ని ఎంచుకున్నట్లే,

విద్యాహక్కు (రైట్‌ టు ఎడ్యుకేషన్‌) కింద విద్యార్థులకు విద్యా సౌకర్యం కల్పిస్తున్నాం కాని, వాస్తవ విజ్ఞానార్జనకు కావలసిన పునాది ఇవ్వలేక పోవడానికి బోధనా భాష అవరోధంగా నిలుస్తోంది. దీన్ని గుర్తించిన అన్ని దేశాలు ప్రాథమిక విద్యాభ్యాసాన్ని మాతృభాషలో చేస్తుంటే మనం ఇంగ్రీష్‌ను ఆశ్రయించాం. అయితే ఇంగ్లీష్‌ నేర్చుకోవడాన్ని విస్మరించమనడం ఇక్కడ ఉద్దేశం కాదు. ఇంగ్రీషును ఒక భాషగా బోధించవచ్చు. ఆ నైపుణ్యాన్ని ఎంతైనా మెరుగు పర్చవచ్చు, కానీ భావనల రూప కల్పన దశలో మాత్రం బోధన ఇంటిభాషలోనే ఉండాలి. ఇటలీ, ఫ్రాన్స్‌ల్లో జరుగుతున్నదదే. ఇంగ్రీష్‌ను కేవలం నాలుగేళ్ళు మాత్రమే బోధిస్తారు. అయితే విద్యార్థి ఆ భాషలోనూ రాణిస్తున్నాడు. మౌలిక భావనల విషయంలోనూ పటిష్టమవుతున్నాడు.

ప్రాథమిక విద్యాభ్యాసం ఇంటిభాషలో జరిగిన తర్వాత ఉన్నత విద్యకు చేరిన దశలో బోధన విద్యార్థి స్వేచ్చకే వదిలేయవచ్చు. విద్యార్థికి జ్ఞానం వచ్చిన దశ కావడంతో అతడికి ఆసక్తి గల భాషను ఎంచుకుంటాడు.