అమ్మనుడి/సంపుటి 4/జూలై 2018/నేరెళ్ళ వేణుమాధవ్
గొప్ప ధ్వనిఅనుకరణ కళాకారుడు తెలుగువారి కీర్తి కిరీటం
నేరెళ్ళ వేణుమాధవ్
భాషలోని వివిధ పలుకుబళ్ళను యాసలను సామెతలను, జోక్స్‌ను ఆయన ప్రదర్శించే విధానం తెలుగు భాషలోని అనేక వైవిధ్యాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడేది. ఆయనకు తెలుగంటే విపరీతమైన అభిమానం ఉండేది ఎన్ని మాండలికాలున్నా ఎన్ని యాసలున్నా తెలుగుభాష ఒక్కటే అనే వాస్తవాన్ని ఆయన అనేకసార్లు చెబుతుండేవాడు.
జూన్ 19 మంగళవారం నాడు 11-30 గంటలకు విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్‌గా ప్రసిద్ధుడైన నేరెళ్ళ వేణుమాధవ్‌గారు వరంగల్‌లో తన స్వగృహంలో చివరిశ్వాస విడిచాడన్న వార్త విన్నప్పుడు వరంగల్ నగర ప్రజలంతా తమ కుటుంబంలోని ఒక ఆత్మబంధువే ఈ లోకం లోంచి శాశ్వతంగా వెళ్లిపోయాడని దుఃఖించారు.
నేరెళ్ళ వేణుమాధవ్‌తో నాకు 40 యేళ్ళ స్నేహం ఉంది 1958లో నేను వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో మొదటిసారి ఆయన మిమిక్రీ ప్రదర్శనను చూశాను. ఆనాటి నుండే నేనాయనకు అభిమానినైపోయాను 1966లో నేను నల్లగొండ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న రోజుల్లో నేనాయన్ను ఆ కాలేజీలో జరిగే వార్షికోత్సవానికి ఆహ్వానించాను. అప్పుడాయనతో ఒకరోజంతా గడిపే అవకాశం కల్గింది అప్పట్నించే నాకాయనతో స్నేహం ప్రారంభమైంది ఆ స్నేహం క్రమంగా బలపడ్తూ వచ్చింది 1982లో నేను వరంగల్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యాక మేమిద్దరం తరచూ కలుసుకునేవాళ్ళం 2001లో ఆయన 'నేరెళ్ళ వేణుమాధవ్ కల్చరల్ ట్రస్టు' అనే సంస్థను స్థాపించినప్పుడు దానికాయన అధ్యక్షుడయ్యాడు నాకు చాలా ఆశ్చర్యం కల్గించిన విషయమేమి టంటే ఆ ట్రస్టుకు నన్ను ప్రధాన కార్యదర్శిగా నియమించటం. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా కార్యదర్శిగా నియమించండి అని నేనెంత పోరాడిన "ఆయన మీరే ఉండాల"ని పట్టుబట్టారు ఆయన మాటను నేను కాదనలేక నేను నేరెళ్ళ వేణుమాధవ్ కల్చరల్ ట్రస్టులో శాశ్వత సభ్యుడుగానూ ప్రధాన కార్యదర్శిగానూ ఉండటానికి అంగీకరించాను.
నేరెళ్ళ వేణుమాధవ్ కల్చరల్ ట్రస్టు యేర్పడినప్పట్నించి ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు నాడు - అంటే డిసెంబర్ 28 నాడు వరంగల్‌లో పెద్ద కార్యక్రమం జరుగుతుంది భారతదేశమంతా ఆరోజును "మిమిక్రీ డే"గా జరుపుకుంటారు దేశవ్యాప్తంగా ఉన్న మిమిక్రీ కళాకారులంతా ఆరోజు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు అప్పుడప్పుడే మిమిక్రీ నేర్చుకుంటున్న ఔత్సాహిక కళాకారులకు మిమిక్రీ పోటీలు నిర్వహిస్తారు అలాగే ఆరోజు సాహిత్యం సంగీతం చిత్రలేఖనం రంగస్థలం లాంటి లలితకళల్లో విశేష కృషి చేసిన ఉద్దండులకు 10 వేల నగదుతో ఘనంగా సన్మానం చేస్తారు ఇలా ప్రతి డిసెంబర్ 28 నాడు వరంగల్ నగరంలో రోజంతా - ఉదయం నుండి రాత్రి పదిగంటల వరకు మిమిక్రీ సంబరాలు జరుగుతాయి వేణుమాధవ్‌కు కొన్ని వేలమంది శిష్యులున్నారు. మిమిక్రీ శ్రీనివాస్, ఆంథోనిరాజ్, హరికిషన్, జానీలీవర్, జూనియర్ వేణుమాధవ్ లాంటి ఎందరో లబ్ధప్రతిష్టులైన మిమిక్రీ కళాకారులు డిసెంబర్ 28 నాడు తప్పనిసరిగా వరంగల్‌కొచ్చి వేణుమాధవ్ పుట్టినరోజు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటారు
మిమిక్రీ కళాకారుడుగా వేణుమాధవ్ ప్రపంచమంతా మూడుసార్లు తిరిగొచ్చాడు ఎన్నో దేశాల్లో ఆయన తన మిమిక్రీ ప్రదర్శనలతో శ్రోతలను ఉర్రూతలూగిస్తూ నవ్వుల్లో ముంచెత్తేవాడు ఆయన మన తెలుగునాడులో మిమిక్రీ ప్రదర్శనలిచ్చినప్పుడు తెలుగుభాష ఎంత తియ్యని బాషో ఉదాహరణలతో చెబుతుండేవాడు
ఆయన ఎన్నోసార్లు పోతన భాగవతంలోని సప్తమ స్కంధంలో ప్రహ్లాద చరిత్రలోని ఒక ఘట్టాన్ని పోతన ఎలా వర్ణించాడో చాలా అద్భుతంగా, వింటున్నవాళ్ళను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ చెప్పేవాడు. ఆ ఘట్టం యేమిటంటే హిరణ్యకశిపుడిని నరసింహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి వధించిన ఘట్టం హిరణ్య కశిపుడు స్తంభాన్ని తన గదతో ఢీకొట్టినప్పుడు ఆస్తంభం బ్రద్దలై దాంట్లోంచి చాలా భయంకర రూపంలో నరసింహుడు బయటకొచ్చి హిరణ్యకశిపుడిని వధించిన ఘట్టాన్ని పోతన్న ఇలా వర్ణించాడు
"ఇట్లు దానవేంద్రుండు, పరిగ్రహ్యమాణ వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును, రోషానల జఘన్యమాన విజ్ఞాన వినయుండును, వినయ గాంభీర్యధైర్య జేగీయమాన హృదయుండును, హృదయ చాంచల్య మానవతామసుండును రామసగుణ చంక్రమ్యమాణ సైర్యుండునునై, విస్రంభంబున హుంకరించి, బాలుని ధిక్కరించి, హరినిందుజూపుమని, కనత్కనక మణిమయకర కరణక్రీంకార శబ్దపూర్వకంబుగా దిగ్ధతిదంత భేదన పాటన ప్రశస్తంబగు హస్తంబున సభామండప స్తంభంబు వ్రేసిన వ్రేటు తొడన దశదిశలును మిణుగురులు సెదఱజిటిలి పెటిలిపడి..."
ఇలా ఈ వర్ణన రెండు పేజీల పర్యంతం సాగుతుంది ఈ రెండు పేజీల అతికష్టమైన ఈ పోతన్న తెలుగును వేణుమాధవ్ మొత్తం తన కంచుకంఠంతో చదివి వినిపించేవాడు
ఈ తెలుగును గ్రాంథికమని మనం రోజూ రేడియోలోనూ, వార్తాపత్రికల్లోనూ వినే, చదివే తెలుగును వ్యావహారికమని పల్లెటూళ్లలో గ్రామీణులు మాట్లాడే తెలుగును గ్రామ్యమని - ఇలా తెలుగును ఎన్ని రకాలుగా మాట్లాడవచ్చో ఆయన వివరించి చెప్పేవాడు గ్రామ్యాన్నే మనం మాండలికం అంటాం
మాండలికానికి ఉదాహరణగా వేణుమాధవ్ ఒక జోక్ చెప్పేవాడు.
ఒకసారి అప్పట్లో, అంటే 1956లో ఆంధ్రప్రదేశ్ యేర్పడిన కొత్తల్లో తెలంగాణకు చెందిన కె.వి.రంగారెడ్డి అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి దగ్గరకు వెళ్ళి "యేం సంజీవరెడ్డి! నాకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతివి?" అని అడిగాడట అప్పుడు సంజీవరెడ్డి "నీ వెనక జనం లేరు గదప్పా!" అన్నాట్ట. అప్పుడు కె. వి. రంగారెడ్డి "నువ్వు నాకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆళ్ళే వస్తరు" అన్నాట్ట. కె. వి. రంగారెడ్డి గొంతును, సంజీవరెడ్డి గొంతును అనుకరిస్తూ వేణుమాధవ్ ఈ జోక్ చెప్పినప్పుడు జనమంతా గొల్లున నవ్వేవారు. కె. వి. రంగారెడ్డి గొంతులోని తెలంగాణ యాసను, సంజీవరెడ్డి గొంతులోని రాయలసీమ యాసను, వేణుమాధవ్ చాలా అద్భుతంగా ధ్వనింపజేసేవాడు
శిష్టవ్యావహారిక భాషకు ఉదాహరణగా సినిమాల్లో నటీనటులు మాట్లాడే సంభాషణల్ని ఉదాహరణలుగా చెప్పేవాడు. ఎన్. టి. రామారావు, నాగేశ్వరరావు మాట్లాడుకున్నప్పుడు వినిపించే తెలుగును ఆయన వ్యవహారిక భాషకు ఉదాహరణగా చెప్పేవాడు. ఇలా చెణుకులను, భాషలోని వివిధ పలుకుబళ్ళను, యాసలను, సామెతలను, జోక్స్‌ను ఆయన ప్రదర్శించే విధానం తెలుగు భాషలోని అనేక వైవిధ్యాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడేది. ఆయనకు తెలుగంటే విపరీతమైన అభిమానం ఉండేది. ఎన్ని మాండలికాలున్నా, ఎన్ని యాసలున్నా తెలుగుభాష ఒక్కటే అనే వాస్తవాన్ని ఆయన అనేకసార్లు చెబుతూండేవాడు.
కళకు ప్రాంతీయ భేదాలు ఉండకూడదని కళ అనేది ప్రపంచ ప్రజలందర్నీ యేకం చేయ్యాలని అంటుండేవాడు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి (UNO) జనరల్ అసెంబ్లీలో మిమిక్రీ ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్
అక్కినేని నాగేశ్వరరావు అనేకమార్లు మా సినిమా హీరోలకంటే వేణుమాధవ్ ఎన్నో రెట్లు గొప్పవాడు అని చెబుతుండేవాడు. ఎందుకంటే "సినిమా హీరోకు మేకప్ వేసే వాడుంటాడు. డైలాగ్స్ రాసేవాడుంటాడు, ఇంకా ఎంతో మందుంటారు. కానీ వేణుమాధవ్ ఒక్కడే మిమిక్రీ కళను ప్రదర్శిస్తూ వేలమంది సినిమావాళ్ళను మనముందుంచుతాడు" అంటాడు ఏ. ఎన్. ఆర్
వేణుమాధవ్‌కు స్నేహితులంటే ఎంతో ఇష్టం ఆయనకున్న ముగ్గురు స్నేహితులు - సి. నా.రె, మిక్కిలినేని, గుమ్మడి - తనతో కలుపుకుని ఈ నల్గుర్ని "ఇష్టచతుష్టయం" అనేవారుట. వీళ్ళు నల్గురు అనేకసార్లు కలుసుకొని ఒకరికొకరు తోడునీడగా ఉండేవారు.
నన్నూ వేణుమాధవ్ చాలా అభిమానించేవాడు. ఒకసారి ఆయన హైదరాబాద్‌లో మోకాలు ఆపరేషన్ (Knee Replacement Operation) చేయించుకుని వరంగల్‌కు తిరిగొస్తూ తన ఇంటికి వెళ్లకుండానే "నవీన్‌ను కలిసిపోవాల"ని మా ఇంటికొచ్చి గంటసేపు కూర్చొని వెళ్లాడు. నాల్గు రోజులు కనిపించకపోతే "నవీన్ గారూ! ఎలా ఉన్నారు?" అంటూ పలకరించేవాడు నాకొచ్చిన అవార్డులన్నీ మీకూ వస్తాయి" అంటుండేవాడు. ఆ మహా కళాకారుడికి నా జోహార్లు. నా జీవితంలో ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేరు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
అ
ఇక తెలుగు వెబ్‌సైట్లకు గూగుల్ యాడ్స్ సపోర్ట్
ప్రజాదరణ పొందిన తెలుగు వెబ్‌సైట్లకు ఇక గూగుల్స్ యాడ్‌వర్డ్స్, గూగుల్ యాడ్‌సెన్స్ మద్దతుతో ప్రకటనలు లభించనున్నాయి. దీంతో తెలుగు పబ్లిషర్లు, ప్రకటనకర్తలు ఇంటర్నెట్‌లో అసంఖ్యాకంగా ఉన్న తెలుగు వారికి చేరువకావచ్చు. 'గూగుల్ ఫర్ తెలుగు' పేరుతో 27 - 6 - 18న జరిగిన ఒక కార్యక్రమంలో కంపెనీ ఆగ్నేయాసియా భారత మార్కెట్ల వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ మాట్లాడారు. 'ఇంటర్నెట్‌లో భారతీయభాషల కంటెంట్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది ఇది రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగు వెబ్‌సైట్లు బ్లాగులకు కూడా ప్రకటనల ఆదాయం సమకూర్చేందుకు గూగుల్ యాడ్‌వర్డ్స్ గూగుల్ యాడ్‌సెన్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాం' అన్నారు.
గత 18 నెలల్లో నెట్ వినియోగదారుల సంఖ్య భారత్‌లో పెరిగినంత వేగంగా మరెక్కడా పెరగలేదన్నారు. ప్రస్తుతం కొత్తగా ఇంటర్నెట్ వినియోగిస్తున్న ప్రతి పదిమందిలో తొమ్మిది మంది భారతీయ భాషల్లోనే నెట్ చూస్తున్నట్టు ఆనందన్ చెప్పారు. 2021 నాటికి యాభై కోట్ల మందికి పైగా నెట్ వినియోగదారులు భారతీయ భాషల్లో నెట్ వినియోగిస్తున్నారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రతి భారతీయుడికి ఇంటర్నెట్ చేరువ చేయాలన్నదే గూగుల్ లక్ష్యమన్నారు. ఆదాయం లేకపోవడంతో ప్రస్తుతం తెలుగులో సరైన కంటెంట్ అందుబాటులో లేకపోవడమే పెద్ద సమస్యగా ఉందన్నారు గూగుల్స్ యాడ్ వర్డ్స్, గూగుల్ యాడ్‌సెన్స్ టూల్స్‌తో ఈ లోటు తీరుతుందన్నారు.
ప్రస్తుతం దేశంలో ఆన్‌లైన్ ప్రకటన మార్కెట్ రూ 10,000 కోట్లు ఉంటే అందులో డిజిటల్ ప్రకటన మార్కెట్ వాటా ఐదుశాతం మాత్రమేనని గూగుల్ ఇండియా మార్కెటింగ్ సొల్యూషన్స్ డైరెక్టర్ షాలిని గిరీష్ చెప్పారు. 2021 నాటికి ఆన్‌లైన్ యాడ్స్ మార్కెట్ సుమారు రూ 29,250 కోట్లకు చేరుతుందన్నారు. అందులో డిజిటల్ ప్రకటనల వాటా 35 శాతం వరకు ఉంటుందని చెప్పారు. భారతీయ భాషల్లో హిందీ తర్వాత తెలుగులో ఎక్కువమంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. (ఆంధ్రజ్యోతి 28 - 6 - 2018)