అభినయదర్పణము/ప్రథమాశ్వాసము

అభినయదర్పణము

ప్రథమాశ్వాసము

ఉ.

శ్రీకరమై చెలంగు సరసీరుహమిత్త్రుని పాదపద్మముల్
సేకొని వందనంబులను జేసి ముదంబున యాజ్ఞవల్క్యులం
[1]బ్రాకట మొందఁగాను మఱి ప్రార్థనచేసి ముదంబు మీఱఁగా
నైకవిధాల నామహుని నారసి యేఁ ప్రణమిల్లి గొల్చెదన్.

1


ఉ.

శ్రీ విలసిల్లుపార్వతికిఁ జెన్నుగఁ బుత్రుఁడుగా జనించి యా
భావజుభావ మై దనరి భక్తులపాలిటి పారిజాతమై
యీవగ నెల్లలోకముల నేలెడి యా గణనాథు కెప్పుడున్
సేవ యొనర్చెదన్ మిగులఁ జిత్తములో నను బాయ కుండఁగన్.

2


చ.

సరసిజనాభ! దేవమునిసన్నుత! మాధవ! భక్తపోషణా!
పరమదయానిధీ! పతితపావన! పన్నగతల్ప! కేశవా!
కరివరదాప్రమేయ! భవఖండన! యో జగదీశ! కావవే
మురహరి! వాసుదేవ! యఘమోచన! కస్తురిరంగనాయకా!

3


ఉ.

శారద! నిన్ను గొల్చెదను సారెకు, నా మనవాలకింపవే
నారదుఁ గన్నతల్లి! కృప నాయెడ నుంచి వరంబు లియ్యవే
నీరజనేత్రి! విద్యలకు నీవె గదా మఱి వేల్పు ధాత్రిలోఁ
గూరిమి మీఱఁ గొల్చెదను, గోర్కెలొసంగు మదంబ! వేఁడెదన్.

4


క.

ధరలోన రామచంద్రుని
చరితము గావ్యంబుగాను సల్పి జగంబుల్
వెరగందఁ జేయు మౌనిని
నిరవుగ భజియింతు నేను నింపుగ ధాత్రిన్.

5

క.

సకలపురాణంబులు నిలఁ
బ్రకటంబుగఁ జేసి, మిగుల భారత కథయున్,
రకముగఁ దెల్పిన మౌనికి
నిఁక నే వందన మొనర్తు నింపలరంగన్.

6


గీ.

పరఁగ నల కాళిదాసుని బాణు నెలమి
దండి భవభూతి మాఘుల మెండుగాను
ధరను సజ్జనులగు వారి కరుణఁ గోరి
సరస సత్కవులను నేను సన్నుతింతు.

7


గీ.

అవని భాగవతోత్తముఁ డనఁగఁ బరఁగు
పొంకముగఁ జాల బమ్మెర పోతరాజు
సొరిది శ్రీనాథుఁ దిక్కన సోమయాజి
భాస్కరుని సన్నుతింతును బాగు మీఱ.

8


క.

ఎలమి నిరక్షరకుక్షులఁ
బలుమఱు నే ధిక్కరించి ప్రభవ మొప్పం
జెలు వొందఁ గృతియుఁ జెప్పెద
సలలితసత్కవులు సూచి సన్నుతి సలుపన్.

9


సీ.

సరవి లింగమగుంట శంకరనారనా
              ర్యునకుఁ బౌత్రుఁడ నయి దనరువాఁడ
ననువుగా మృత్యుంజయార్యుపుత్రుండ నై
              నిరతంబుఁ గీర్తిచే నెగడువాఁడఁ
బరమపావనుఁ డైన కరిరాజవరదుని
              వరముచే జనియించి పరఁగువాఁడ
ననువుగఁ జెలు వొందు యాజ్ఞవల్కాచార్యు
              కరుణకుఁ బాత్రమై మెఱయువాఁడ.


గీ.

నమరఁ గాశ్యపగోత్రజుఁ డైనవాఁడఁ
జేరి హరిదాసులకు సేవ చేయువాఁడ
నవనిఁ గవి మాతృభూత నామాన్వితుఁడుగఁ
జెలగువాఁడను శ్రీహరి గొలుచువాఁడ.

10

వ.

అని యిట్లు కమలమిత్రుఁ డైన మార్తాండునికి వందనంబు గావించి, మదీయ కులాచార్యులైన యాజ్ఞవల్కులకు బ్రణమిల్లి, గణనాధునిం బూజించి, యిష్టదేవతాప్రార్థనంబు సేసి, భారతిని బ్రణుతించి, యాదికవీంద్రులైన వాల్మీకివ్యాసాదిమునీంద్రులం బ్రస్తుతించి, వరకవికాళిదాసాదులన్ సన్నుతించి, యాంధ్రకవిపితామహులైన బమ్మెరపోతరాజు, శ్రీనాథులం గొనియాడి, కుకవితిరస్కారంబునుం జేసి, మదీయవంశావలంబులన్ సన్నుతించి, యొకానొక ప్రబంధంబు రచియింపంబూని యున్న యవసరంబున, నొక్కనాడు మదీయస్వప్నంబున,

11


సీ.

నీలమేఘము వంటి నెమ్మేను గలవాఁడుఁ
              డంబైన పీతాంబరంబువాఁడు
నీరజారిని గేరునెమ్మోము గలవాఁడుఁ
              గరమున శంఖచక్రములవాఁడుఁ
గస్తూరితిలకంబు సిస్తు మీఱినవాఁడుఁ
              గమలంబులను గెల్చు కనులవాఁడు
శ్రీవత్సకౌస్తుభాంచిత వక్షుఁడగువాఁడుఁ
              బక్షివాహనుఁ డయి పరఁగువాఁడు


గీ.

చెలఁగి యొకనాఁడు స్వప్నమం దెలమి వచ్చి
యెనసి యభినయదర్పణం బనఁగ నిలను
ఘనప్రబంధము నొక్కటి గరిమ మీఱఁ
బూని రచియింపు మనుచును నానతిచ్చె.

12


సీ.

శ్రీకరగుణహార! శ్రితజనమందార!
              హరి! వాసుదేవ! మహానుభావ!
చారుమోహనగాత్ర! సన్మునిస్తుతిపాత్ర!
              యినకోటిసంకాశ! యిందిరేశ!
గోవర్ధనోద్ధార! గోబృందపరివార!
              భావనాసంచార! భవవిదూర!
యరవిందలోచన! యఘభయమోచన!
              పంకజాసననుత! భవ్యచరిత!

గీ.

వరద! యచ్యుత! గోవింద! హరి! ముకుంద!
భక్తజనపోష! మృదుభాష! పరమపురుష!
సరసగుణహార! శ్రీరంగపురవిహార!
రాక్షసవిరామ!కస్తూరిరంగధామ!

13

షష్ట్యంతములు

క.

కమలాప్తతేజునకు నా
కమలాసనవందితునకు గమలాపతికిం
గమలారివదనునకు మఱి
కమలజదళ నేత్రునకుఁ గరివరదునకున్.

14


క.

కువలయదళనిభనేత్రుకుఁ
గువలయదళగాత్రునకును గుణశీలునకుం
గువలయపరిపాలునకును
గువలయనాథునకు మదనగోపాలునకున్.

15


క.

హరిసుత పరిపాలునకును
హరివైరితురంగునకును హరివదనునకున్
హరిధరునిమిత్రునకు నా
హరిరూపముఁ దాల్చినట్టి హరిరంగనికిన్.

16


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగ నా యొనర్పఁబూనిన యభినయదర్పణంబను మహాప్రబంధమునకు లక్ష్యలక్షణంబు లెట్టి వనిన.

17


గీ.

ధరను విలసిల్లునభినయదర్పణంబు
గరిమ నిది పద్యకావ్యంబు గా నొనర్తు
సరవి మీఱంగఁ గరుణింపు, సన్నుతాంగ!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

18


సీ.

చెలు వొంద గీతంబు చెన్ను మీఱఁగఁ బాడి
              యర్థంబుఁ గరముల నమర బట్టి
పరఁగఁ గన్నులయందు భావంబుఁ దగ నుంచి
              పదములఁ దాళంబు బరగదీర్చి

హస్తంబు పొడచూపునచట దృష్టియు నుంచి
              మఱి దృష్టి గలచోట మనసు నిల్పి
మనసు నిల్పినయెడ నెనయ భావము నుంచి
              భావంబుతో రసం బలరఁజేసి


గీ.

యెలమి నివియెల్ల నొక్క టై మెలఁగుచుండ
నట్టిదే సూడ నిలలోన నభినయంబు
నెనసి భరతజ్ఞు లిది మెత్తు రింపు మీఱ
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

19


వ.

ఇట్లు, ఋగ్యజుస్సామవేదంబులచేత బోధింపబడిన నాట్యశాస్త్రంబు బ్రహ్మదేవుం డను భరతజ్ఞునివలన గంధర్వులు నప్సరస్త్రీగణంబులు బోధింపఁబడినవార లైరి. వారలచేత దేవలోకంబున నీ భరతశాస్త్రార్థంబు విశదమై గనఁబడుచుండె. నంత.

20


చ.

సరగున నొక్కనాఁ డలరి శంభుడు మిక్కిలి ప్రేమతోడుతం
జెలువుగ నాట్యశాస్త్రమును జెన్నుగఁ బార్వతిదేవి కొప్పుగం
బలుమరు బోధచేయుచును భావములన్ వివరించునంత, నా
నెలఁత ముదంబు జెందె, మఱి నిక్కము, గస్తురిరంగనాయకా!

21


ఉ.

అంతట, నార్యధాత్రిఁ గల యా మునిసంఘముతోడఁ బ్రేముడిన్
వింతగ నాట్యశాస్త్రమును వేమఱు భావము [2]వీడఁ దెల్పినన్,
సంతస మంది యా మునులు సారెకు నార్యకు మ్రొక్కి వార ల
త్యంత వినోదయుక్తులయి రంబుజలోచన! రంగనాయకా!

22


గీ.

నాట్యశాస్త్రంబు మునులు [3]సౌరాట్యదేశ
స్త్రీలకును దెల్ప, వారిచేఁ జెలువు మీఱి
సకలదేశంబు లందెల్ల సాగి మహిని
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

23

గీ.

అలరు నీ నాట్యశాస్త్రంబు నరసి యజుఁడు
వెలయ మఱి దాని మహిమలు విశదముగను
దెలియఁ బల్కెను జగమెల్లఁ దేటపడఁగ
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

24


సీ.

తనరు నీ నాట్యశాస్త్రం బభ్యసించినఁ
              బొలుపొంద సంపద ల్వొందియుండుఁ
బరఁగను సౌఖ్యంబుఁ బ్రౌఢత్వమును జెంది
              ధర నుదారంబుగా మెఱయుచుండుఁ
బలుమాఱు సత్కీర్తి వడసి సంతస మొంది
              యెలమి సద్గుణముల వెలసియుండు
స్థిరధైర్యమునఁ జాలఁ జె న్నొంది మిగులను
              జెలఁగి సుజ్ఞాని యై వెలుగుచుండు


గీ.

ఖేదములు లేక నెమ్మది మోద మలర
నొనరి యేవేళ సద్గోష్టి నెనసియుండు
ననుచుఁ బల్కిన నా ధాత ఘనత మీఱ
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

25


గీ.

నారదాదిమునీంద్రు లీ నాట్యశాస్త్ర
మందుఁ జిత్తంబులను నుంచి యద్భుతముగ
నెనసి యానందపరులయి రింపు మీఱ
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

26

సభాలక్షణము

గీ.

తనరు సభ యను నల కల్పతరువునకును
శ్రుతులు శాఖలు, శాస్త్రముల్ సొరిది విరులు
చెలఁగు, విద్వాంసు లల తుమ్మెదలుగఁ బరఁగు,
రాక్షసవిరామ! కస్తురి రంగధామ!

27

సభాసప్తాంగలక్షణములు

గీ.

కవులు విద్వాంసులును బట్లు గాయకు లితి
హాసహాస్యపురాణజ్ఞు లలరి యెలమి

వెలయ సభకును సప్తాంగములును నివియె
రాక్షసవిరామ! కస్తురి రంగధామ!

28

సభాపతిలక్షణము

సీ.

శ్రీమంతుఁడై చాలఁ జెన్నొంది ధీరుఁడై
              వితరణశీలుఁ డై వెలయువాఁడు
గానవిద్య దెలిసి ఘనకీర్తి శాలి యై
              సరససద్గుణములఁ బరఁగువాఁడు
నిరు వొంద సత్కవిహృదయంబు లరయుచు
              ధాతయై మిక్కిలి తనరువాఁడు
భావజ్ఞుఁ డనఁగను బరమదయాళుఁ డై
              మఱియు సర్వజ్ఞుఁ డై మెఱయువాఁడు


గీ.

నెలమి శృంగారలీలల మెలఁగువాఁడు
నెనసి సౌందర్యవంతుఁ డై దనరువాఁడు
నిల సభాపతి యనఁగను వెలయువాఁడు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

29

నాట్యప్రశంస

క.

మెఱయు సభాపతి ముందఱ
సరవిగ నాట్యంబు నవరసంబులుఁ దొలఁకన్
మఱి సత్కవి సన్నుతముగ
గరిమను సలుపంగవలయుఁ గస్తురిరంగా!

నాట్యవినియోగము

చ.

ఇరవుగ నుత్సవాదులను నింపుగఁ బట్టము గట్టువేళలం
బరఁగ వివాహవేళ మఱి బాగుగ శోభనవేళలందునున్
మెఱయ గృహప్రవేశమున మేల్మిని బుత్రుడు గల్గువేళలన్
సరవిగ నాట్యమున్ సలుప సంతసమొప్పును, రంగనాయకా!

31

రంగపూజ

చ.

చెలఁగుచు రంగపూజ మఱి సేయక దేవళమందు నైనఁ దాఁ
బలుమఱుఁ [4]బట్నమం దయినఁ బాటిగ నాట్యము లోలి సల్పుచో
నెలమిని నాస్థలంబులకు నెప్పుడు నగ్నినిరోధ మంచునన్
వెలఁయగ శాస్త్రముల్ పలుకు వేమఱుఁ గస్తురిరంగనాయకా!

32

రంగపూజాయంత్రలక్షణము

సీ.

నాల్గుకోణంబులు నయ మొప్పఁగా వ్రాసి
              మొనసి యా నాలుగుమూలలందు
బాగుగా నాలుగు పద్మంబులను వ్రాసి
              వశముగా నాలుగు దిశలయందుఁ
బ్రక్కకు రెండేసిపద్మంబులును గాను
              జెలఁగ నెన్మిదిపద్మములను వ్రాసి
యందు మధ్యంబున ననువుగా వృత్తాలు
              మఱి మూడు గుంపుగాఁ బరఁగ వ్రాసి


గీ.

సొరిది వృత్తాలచుట్టును సొంపు మీఱ
వరుసఁ జతురంబుగా గీఁత వ్రాయఁగాను
జాలు నది రంగయంత్ర మై, మేలు దనరు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

33

రంగపూజాయంత్రాధిదేవతలు

సీ.

పరగఁ దూర్పునను దిక్పాలకు లాగ్నేయ
              మందంగ దేవత ల్పొందుగాను
యమదిశయందును నలరఁ ద్రిమూర్తులు
              నైరృతియందు వినాయకుండు
వరుణభాగంబున మఱి షణ్ముఖుండును
              వాయుదిక్కున క్షేత్రపాలకుండు
నుత్తరదిక్కున నొగి నాందిదేవతల్
              సప్తమాతృకలు నీశానమునను

గీ.

జెలఁగి యధిదేవతలు గాను జెలువు మీఱి
యలచతుర్వింశ దేవతల్ వెలసి మిగుల
నలరియుండుదు రీ రంగయంత్రమునకు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

34

రంగపూజాద్రవ్యములు

సీ.

గణనాథునికి మంచిగరికె [5]సమర్పణ
              శ్రీషణ్ముఖునకు [6]నక్షింతలొప్ప
నిల క్షేత్రపాలున కిం పొంద జాజులు
              దిలలును నల నాందిదేవతలకు
సరవి మీఱంగను సప్తమాతృకలకుఁ
              గూరిమి యగు జపాకుసుమములును
సరగఁ ద్రిమూర్త్యాది సకలదేవతలకు
              మల్లెలు మొల్లలు మంచివిరులు


గీ.

నెనసి యీరీతి వారి కర్చన మొనర్చి
వెలయుఫలముల నైవేద్యములను సల్పి
వందనంబుల నొనరింపవలయుఁ జుమ్ము!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

35

భూమ్యుద్భవలక్షణము

సీ.

సరవిగా నంబరశబ్దంబువలనను
              వాయువు పుట్టెను వరుసగాను
సరగ నవ్వాయుసంస్పర్శంబువలనను
              బొలు పొందఁ దేజంబు గలిగె నంతఁ
గూర్మిఁ [7]దేజసత్త్వగుణమువలనఁ జాల
              నొప్పుగఁ నటు ధాత్రి యుద్భవించెఁ

గీ.

[8]బంచశత్కోటియోజనపరిమిత మది
పరఁగ బంగారువర్ణ[9]మై పరిఢవిల్లు
సరసగుణహార! శ్రీరంగపురవిహార!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

36

భూమిలక్షణము

క.

చెలఁగ సుభద్రయు భద్రక
తుల లేనటువంటి పూర్ణధూమ్ర యనంగా
నిల మఱి నాలుగునిధములు
గలిగియు శోభిల్లుచుండుఁ గస్తురిరంగా!

37

సుభద్రాభూమిలక్షణము

సీ.

నయ మొప్ప ధాత్రియు నాల్గుకోణంబు లై
              వైపుగా బంగారు వర్ణ మమరి
ప్రియ మొందఁగ లకారబీజసంయుక్త మై
              పరమేష్ఠి దేవతై పరఁగుచుండు
సరవిని మఱి చరాచరములు ధరియించి
              తగ సమస్తమున కాధార మగుచు
సలలితంబుగఁ బంచశత్కోటియోజన
              విస్తీర్ణముం గల్గి వేడ్క మీఱ


గీ.

గరిమ నాధారశక్తి గాఁ గమఠ మమరి
యష్టదిగ్దంతులను బైని నలరఁగాను
బరఁగ శేషునిపైని సుభద్ర మెఱసె
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

38

భద్రకాభూమిలక్షణము

గీ.

సరగ మఱి విష్ణుశక్తిచే శంఖవర్ణ
మొదవి నవరత్నమయముగా ముదము మీఱి

భద్రక యనెడియాధాత్రి పరఁగుచుండు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

39

పూర్ణాభూమిలక్షణము

గీ.

వెలసి శంకరుశక్తిచే నలరి మిగుల
రక్తవర్ణంబునున్ బహురత్నములను
గలిగి శోభిల్లి పూర్ణయుం జెలువు మీఱు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

40

ధూమ్రాభూమిలక్షణము

చ.

పరఁగఁ ద్రిమూర్తిశక్తియును బచ్చనివర్ణముఁ గల్గి ధాత్రియున్
గరిమను నారికేళక్రముకంబులు వృక్షము లెల్లఁ బర్వఁగా
నిరవుగ భూసురోత్తములు నెల్లెడలన్ వసియింప మిక్కిలిం
బరఁగును ధూమ్ర యీవగను బాగుగఁ గస్తురిరంగనాయకా!

41

తాళలక్షణము

గీ.

అంబరంబున నల తకారంబు పుట్టె
ధారుణిని నుద్భవించె ళకార మెలమి
దనరి యీ రెండునుం గూడిఁ దాళ మయ్యె
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

42

తకార ళకారములకు స్వరూపదేవతలు

క.

పరఁగఁ దకారమె యీశుం
డరయ ళ కారంబె శక్తి యా శివశక్తుల్
పరఁగఁగ, వారల కూటమి
గరిమను దాళంబు నయ్యెఁ గస్తురిరంగా!

43

తాళాధిదేవతలు

గీ.

అల తకారంబునకు వేల్పుఁ దపనుఁ డయ్యెఁ,
గోరి శశి దేవతయ్యె ళ కారమునకు,
నిలను దాళంబునకు వేల్పు లినుఁడు శశియు,
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

44

తాండవనృత్యలక్షణము

గీ.

అల తకారంబె తాండవ మయ్యె మిగుల
మఱి ళ కారంబె నృత్యమై మహిని వెలసె
దనర నీ రెండుఁ గూడినఁ దాళ మయ్యె
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

నట్టువులక్షణము

సీ.

సారజ్ఞుఁడై నాట్యచర్యుఁడు నై నృత్య
              శిక్షయందలి నేర్పు చెలఁగువాఁడు
సూళాదిసంకీర్ణ తాళాదుల నెఱింగి
              భావజ్ఞుఁ డగుచును బరఁగువాఁడు
హస్తభేదంబులు నల మండలాదులు
              నంగరేఖలుఁ దెల్పి యలరువాఁడు
గాయకుఁ డై తాను ఘనకీర్తిశాలి యై
              కాలనిర్ణయములు గలుగువాఁడు


గీ.

మఱి నవరసములు నెఱింగి మెఱయువాఁడు
బండితుం డన సుగుణి యై ప్రబలువాఁడు
ధరను నట్టువు గాఁ జెల్లుఁ దగవు గాను
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

46

నట్టువున కంగదేవతలు

క.

విను బాహుమూల వాణియు
ననువుగ నదె బాహుమధ్యమం దిందిర దా
నెనయఁ గరాగ్రమునన్ మృడ
ఘన వామకరంబునందుఁ గస్తురిరంగా!

47


క.

మఱి బాహుమూల బ్రహ్మయు
హరువుగ నా బాహుమధ్యమందున హరియుం
బరఁగఁ గరాగ్రం బీశుఁడు,
గరిమను దక్షిణకరానఁ గస్తురిరంగా!

48

గాయకుని లక్షణము

క.

ఎలమి స్వరజ్ఞానంబును
సరవి లయజ్ఞానమును సుశారీరంబున్
గలపండితుఁడై ధైర్యముఁ
గలవాఁడగు గాయకుండు, కస్తురిరంగా!

49

పాత్రలక్షణము

సీ.

సరసిజనేత్రియై సౌందర్యశాలియై
              చెండ్లను గెల్చు పాలిండ్లతోను
సరవిగా రత్నభూషణములు ధరియించి
              చిఱునవ్వు మోమునఁ జెలువు మీఱఁ
గాలనిర్ణయములు గలిగి భావ మెఱింగి
              గాననృత్యములందు ఘనత మీఱి
నవరసచాతుర్యనయమును సంపద
              దగువిలాసమును శాంతంబు గల్గి


గీ.

కూర్మి దాతృత్వమును గల్గి గుణము గల్గి
మెలఁత తొలకరిమెఱుపు నెమ్మేనితోడఁ
జెలఁగునది పాత్ర యనఁ జెల్లు, శ్రీనుతాంగ!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

50

పాత్రదశప్రాణములు

చ.

నిరతము రూపు రేకలును నిల్కడ వేగముఁ గల్గి కాంతియుం
బరఁగఁగ దృష్టిభేదమును బాటయు వాగ్జరి గల్గి మిక్కిలిన్
అరుదుగ సంతసం, బొదవి యంతట వేసటలేక యుండుటల్
[10]బరువిడి యీ పదిం జెలికిఁ బ్రాణము, గస్తురిరంగనాయకా!

51

పాత్రాంగదేవతాలక్షణము

సీ.

బ్రహ్మరంధ్రానకుఁ బరఁగ సదాశివుల్
              ఫాలంబునకు క్షేత్రపాలకుండు

సరవి గంఠానకు శాస్త్రాయనీశక్తి
              యెలమి వక్షంబునం దీశ్వరుండుఁ
బరఁగఁగా గౌనందుఁ బరమేష్ఠి విష్ణువుఁ
              గనుఁజూపులకును శృంగారరసము
నుదరంబునందున నొనరంగా గణపతి
              గర నాభియందును దార లమర!


గీ.

వరుణ వాయువు లూరులవైపుగాను
దరుణినెమ్మోమునందు సుధాకరుండు
నంగదేవత లివి పాత్ర కనువుగాను
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

52


సీ.

బాహుమూలంబునఁ బరమేష్ఠి యాబాహు
              మధ్యమందునను శ్రీమాధవుండు
ఘనముగా బంధమందున నుమాపతియుఁ గ
              రాగ్రమందునను బార్వతియుఁ దనరె
నదె బాహుదండంబునందుఁ ద్రిమూర్తులు
              గోవిందుఁ డమరె నంగుష్ఠమందుఁ
దగె షణ్ముఖుండును దర్జనియందునఁ
              బరఁగె మధ్యమున భాస్కరుండు


గీ.

మారుతుఁ డనామికందు నమరెఁ గనిష్ఠ
కందు గురువును గరతలమందు శశియు
నలరెదరు పాత్రకున్ వామహ స్తమునను
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

53


సీ.

భుజమూలమున ధాత్రి భుజమధ్యమున వాణి
              బాహుదండంబునఁ బార్వతియును
మణిబంధమున రవి మఱి కరాగ్రం బింద్రుఁ
              డంగుష్ఠమునను దా నంగజుండు
తర్జనియందునఁ దనరఁ బావకుఁడును
              గరిమ మధ్యమునను గమలభవుఁడు
నరయ ననామిక కంబర మే వేల్పు
              దగఁ గనిష్ఠికకు గంధర్వు లరయ

గీ.

నెలమిఁ గరతలమందున నిద్ధరయును
నమరి పాత్రకు దక్షిణహ స్తమునను,
వెలసియుందురు వేల్పులు వేడ్క మీఱ
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

54

పాత్రగమనలక్షణము

క.

హరిహంసదంతిలావక
వరశిఖి కుక్కుట బకాదివరగమనములున్
నిరతంబు దెలిసి పాత్రయు
గరిమను వెలయంగవలయుఁ గస్తురిరంగా!

55

నేత్రభేదలక్షణము

క.

[11]ఆలోకితావలోకిత
జాలప్రలోకిత[12]విలోక [13]సమసాచియునున్
ఉల్లోకి తానువృత్తముఁ
గా లలి నేత్రములు చెలఁగుఁ గస్తురిరంగా!

56

శిరోభేదలక్షణము

వ.

ఇఁక, నాకంపితంబును, నుద్వాహితంబును, నధోముఖంబును, బరాఙ్ముఖపరావృత్తంబును, లోలనాలోళితంబును, నంచితంబును, బరివాహితంబును నను నీతొమ్మిది విధములును బాత్రకు [14]శిరోభేదంబు లనంబరఁగుచుండు.

57

ఆకంపితశిరోలక్షణము

క.

ఆకాశభూములకు శిర
మేకముగాఁ గదలలేని యెలమిని దానిన్
ఆకంపితశిర మందురు
కాకాసురదనుజభంగ! గస్తురిరంగా!

58

ఉద్వాహితశిరోలక్షణము

క.

పరఁగను నూర్ధ్వముఖంబుగ
శిరమును గదలించియున్నఁ జెన్నుగ నదియున్
మఱి యుద్వాహితశిర మని
గరిమను జెలువొందుచుండుఁ గస్తురిరంగా!

59

అధోముఖశిరోలక్షణము

క.

చెలఁగ నధోముఖముగ శిల
మెలమి గదలించియున్న నిలలోపలనున్
వెలయ నధోముఖశిర మౌఁ
గలుషాపహ! దనుజభంగ! కస్తురిరంగా!

60

పరాఙ్ముఖశిరోలక్షణము

క.

తనరగఁ బార్శ్వముగా శిర
మెనయఁగఁ గదలించియున్న నింపుగా నదియుం
బొనరఁ బరాఙ్ముఖశిర మని
ఘనముగఁ జెలువొందుచుండుఁ గస్తురిరంగా!

61

పరావృత్తశిరోలక్షణము

క.

మెడ యొఱగఁజేసి శిరమును
నడరఁగఁ గదలించియున్న నది ధారుణిలోఁ
దొడరుఁ బరావృత్తం బని
కడువడి శిర మిందుఁ బరఁగుఁ గస్తురిరంగా!

62

లోలనాశిలోలక్షణము

క.

చెలువుగ శిరమును నెదురుగఁ
బలుమఱు గదలించియున్నఁ బంకజనేత్రా!
అల లోలనశిర మౌ నది
కలుషాపహ! దనుజభంగ! కస్తురిరంగా!

63

[15]లోళితశిరోలక్షణము

క.

వలయాకారముగా శిర
మెలమిని గదలించియున్న నిరవుగ ధరలోఁ
జెలువుగ లోళితశిర మౌఁ
గలుషాపహ! దనుజభంగ! కస్తురిరంగా!

64

అంచితశిరోలక్షణము

క.

భుజమందు శిరము గదలిన
నిజముగ నంచితశిరం బని యెదరు భువిలో
సుజనావన! భవమోచన!
గజభయహర! దనుజభంగ! కస్తురిరంగా!

65

పరివాహితశిరోలక్షణము

క.

ఒనరఁగ శిరమును మిక్కిలి
మొనసెడున ట్లుభయపార్శ్వములఁ గదలింపన్
విను పరివాహితశిర మౌ
ఘనసన్నిభ! వరశుభాంగ! కస్తురిరంగా!

66

మేళలక్షణము

చ.

చెలువుగ వామభాగమునఁ జేరి మృదంగము నుండ, నంతటం
బలుమఱు దాళధారి మఱి బాగుగ దక్షిణభాగమందునన్
వెలయఁగ, గాయకుండు ముఖవీణెయునున్ శ్రుతివారలందఱున్
నెలఁతకు వెన్కనుండవలె, నిక్కము, కస్తురిరంగనాయకా!

67

నృత్యలక్షణము

క.

శిరమును నేత్రముఁ గరములు
నిరవుగఁ బాదములుఁ గూడి యెలమిని నొకటై
బరువునఁ గదలిన మది మఱి
గరిమను నర్తన మటండ్రు, కస్తురిరంగా!

68

పంచచామరము

మురాసురాదిదైత్యభంగ! మోహనాంగ! కేశవా!
పురారిమిత్త్ర! శ్రీకళత్ర! పుండరీకవందితా!
సరోజనేత్ర! సచ్చరిత్ర! సామజేంద్రపాలకా!
ధరాధినాధ! దేవరాజతాపసాభినందితా!

69

గద్యము
ఇది వాసుదేవకరుణాకటాక్షవీక్షణాకలితశృంగారరసప్రధానసంగీతసాహిత్యభరతశాస్త్రవిద్యాపారంగత శ్రీమద్యాజ్ఞవల్క్యాచార్యపదార
విందమరందబిందుసందోహపానతుందిలమిళిందీభూతనిజాంతరంగ శ్రీమృత్యుంజయార్యపుత్ర కాశ్యపగోత్రపవిత్ర
సుజనవిధేయ లింగముగుంట మాతృభూతనామధేయ ప్రణీతం బయిన యభినయదర్పణం
బను మహాప్రబంధమునందు, సభాలక్షణంబును, సభాపతిలక్షణంబును, భూమి
లక్షణంబును, దాళలక్షణంబును, ధాత్రిలక్షణంబును, గాయకలక్షణం
బును, బాత్రలక్షణంబును, బాత్రదశప్రాణలక్షణంబును, బాత్రాం
గదేవతాలక్షణంబును, బాత్రగమనలక్షణంబును, నేత్ర
భేదశిరోభేదలక్షణంబును, మేళలక్షణంబును,
నృత్యలక్షణంబును, నిన్నియుం గల
ప్రథమాశ్వాసము70

  1. ‘ప్రాకట్య’ మనుటకు బదులుగా వాడఁబడినది.
  2. వీడు=విశదమగు
  3. సౌరాట్యదేశము = సౌరాష్ట్రదేశము. సురాట్యము=దేవతలచేఁ దిరుగఁదగినది. సురాట్యమే 'సౌరాట్యము'. ఈవ్యుత్పత్తితో 'సౌరాష్ట్రము'నే 'సౌరాట్యము'గాఁ గవి వ్యవహరించినట్లు గానవచ్చుచున్నది.
  4. పట్నము పట్టనశబ్దమున కేర్పడిన వికృతి
  5. ఈపదము గణనాథుకు మంచి గరికె సమర్పణ; శ్రీషణ్ముఖునకు అక్షింతలు (ఒప్పన్) సమర్పణ — అను రీతిని బ్రతివాక్యమునకు సంబంధించును.
  6. 'అక్షతములు' అను శబ్దమునుండి యేర్పడిన వికృతి (చూ. రుక్మాం. 4,89)
  7. ‘ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ’ అని యుపనిషత్తు.
  8. ‘పంచాశత్కోటి’ అనుటకు ‘పంచశత్కోటి’ అనుట కవి ప్రమాదము.
  9. కలిగి
  10. బరువిడి=లాఘవము
  11. “సమమలోకితం సాచీ ప్రలోకితనిమీలితే| ఉల్లోకితానువృత్తేచ తథాచైవావలోకితమ్|| ఇత్యష్టదృష్టిభేదాస్తు కీర్తితా భరతాగమే” అభి 108 శ్లో. వీని లశ్రణములు అభి 109-120.
  12. విలోకము=విశేషముతోఁ గూడినచూపు; నిమీలితము కాఁదగును. “దృష్టేరర్థవికాసే నిమీలితా దృష్టిరీరితా” అభి 116 శ్లో
  13. సమాహారద్వంద్వము
  14. ఈ శిరోభేదంబులకు వినియోగముఁగూఁడఁ జెప్పబడినది. అభి 59 శ్లో.
  15. ‘ఆలోలితశిర’ మనియు దీనికి వ్యవహారము. “మండలాకారవద్భ్రాన్త మాలోకితశిరోభవేత్” (అభి 62) లోలితమునకు గ్రంథాంతరమందు లక్షణము వేఱుగాఁ జెప్పఁబడినది. “శిరస్స్యాల్లోలితం గర్వాధిక్యాచ్ఛిదిలలోచనమ్” (అభి 95)