అభినయదర్పణము/తొలిపలుకు

తొలిపలుకు

ఆంధ్రభాషయందు సంగీతలక్షణగ్రంథములు చాలయరుదు. అందును ఛందోబద్ధములైన పద్యకావ్యములుగా వెలువడినవి చాలవఱకు లేవనియే చెప్పనగును. అట్టిలోపము నీ గ్రంథము దీర్చిన దనుటకు సందియము లేదు. లక్షణగ్రంథములు ఛందోబద్ధములంగా రచించుట యెంతటివారికిని జాలఁ గష్టసాధ్యము. ఎట్టికవులకైనను లక్షణము ఛందోరూపమునఁ బొందుపఱుపవలసివచ్చినప్పుడు వ్యర్థపదముల ననేకముల యతిప్రాసాదులకై యుపయోగించుకొనకతప్పదు. అదియే యీ గ్రంథరచనయందును జాలవఱకు సాగినది. అట్టిది లక్షణగ్రంథములయం దొకదోషముగా నెంచి యాక్షేపింపవీలుపడదు. ఇదిగాక 'అపిమాషం మషంకుర్యా చ్ఛనదోభఙ్గంనకారయే' తనురీతిని గొన్నిపట్ల నీకవి ఛందోయతిప్రాసములకై కొన్నిపదములసైతము తాఱుమాఱు చేయక తప్పినది కాది. అవియే 'ఊర్ధ్వధోముఖము, పంచశత్కోటియోజనము, వరహావతారము' మొదలగునవి. ఈతని కవనమందుఁ జక్కనిధారాశుద్ధి గాననగును. ఈ ప్రబంధము స్వప్నమందుఁ దనకు సాక్షాత్కరించిన శ్రీవాసుదేవుని యాజ్ఞానుసారము గవి రచించినట్లు గ్రంథారంభమునఁ జెప్పియున్నాఁడు. ఇది మూఁడాశ్వాసములతోఁ గూడిన ప్రబంధము. ఇందు మొదటి యాశ్వాసమునఁ బ్రార్థనాదికము, భూలోకమునకు భరతశాస్త్ర మవతరించిన విధము, మునుముందు నాట్యమునకు వలసిన రంగనటన పాత్రాదిలక్షణములు ప్రధానముగా జెప్పఁబడినవి. ద్వితీయ తృతీయాశ్వాసములలో నభినయహస్లక్షణములు, వాని వినియోగములు పేర్కొనఁబడినవి. 'అభినయదర్పణ' మను నీ పేరితోనే సంస్కృతమునఁ గూడ నొకగ్రంథముగలదు. ఇది భరతార్ణవమునుండి సంగ్రహింపఁబడినది. దీనిని మనప్రబంధము గొంత యనుసరించినను దానికిని దీనికి బలుతావులలో భేదమును జాలఁ గలదు. దీనిని దానిని బరిశీలించిచూచిన నేదియో యొకమాతృకను రెండును నాధారముఁగాఁ గొని కొన్ని కొన్ని మార్పులతో భిన్నమార్గములయందు వెలువడినవని తోఁచెడిని. గ్రంథారంభమునందలి సుకవిస్తుతి స్వప్నషష్ఠ్యంతాదులును, నాశ్వాసాంతమందలి వృత్తవ్యత్యాసాదులును, విషయవిన్యాసమందలి క్రమపరిపుష్టి యను దీని నొకచక్కనిప్రబంధముగాఁ జేసినవి. సం. అభినయదర్పణమున నిట్టివేవియుఁ గానరావు. ఈ ప్రబంధమును వ్రాసిన కవి(కవి) మాతృభూతయ్య. కాశ్యపగోత్రుఁడు. ఇతని తండ్రి మృత్యుంజయార్యుఁడు. తాత నారనార్యుఁడు. ఇంటి పేరు లింగముగుంటవారు. యాజ్ఞవల్క్యచార్యు లీతని గురుదేవులు. ఇతఁడు కరిరాజవరదుని వరముచే జనియించిన పరమభాగవతోత్తముఁడు. సంగీత సాహిత్య భరతశాస్త్ర విద్యాపారంగతుఁడు. కవులలోఁ బోతనభక్తుఁ డగుటచేఁ గాఁబోలు నీతనిమన్నన కెక్కువగా నాతఁడు పాత్రమాయెను. అతనివలెనే యీతఁడును దనగ్రంథము నరాంకితము చేయక శ్రీరంగధామునకే గృతియొసఁగినాఁడు. ఈతఁ డందఱకంటెను మునుముందు సూర్యభగవానుని స్తుతించి గురుదేవులగు యాజ్ఞవల్క్యుల నుతించినాడు. ఇష్ట దైవతము కంటెను మునుముందు దన గురుపాదులఁ బ్రస్తుతించుటంబట్టి యీతని గురుభక్తి యనన్యాదృశమనిపించెడిని. మాతృభూతయ్యయను నాతఁడు కుంతలాంబ పైఁ గొన్నిగీర్తనల రచించెను. అవి నేఁడు మన కుపలబ్ధము లగుచున్నవి. పరిశోధింప నాతఁడు నీతఁడు నొకఁడే యనుటకుఁ గొన్ని నిదర్శనము లగపడును. కుంతలాంబ తిరుశిరపల్లియందలి పరమదైవము. శ్రీరంగమున కిది చాలసమీపప్రదేశము. శ్రీరంగధామునకే యీతఁడును దన గ్రంథము నంకితము చేసియున్నాడు. కావున నీకవి శ్రీరంగసమిపనివాసి గానోపును. ఇతఁడు బమ్మెరపోతన శ్రీనాథుల స్తుతించి, యాంధ్రకవిపితామహాదుల స్తుతింపమి యీతని కాలమున కంతగా వారు ప్రాచీనులు గామియే కారణమనిపించెడిని. ఇది గాక, పదములు, కీర్తనలు మొదలగునవి రఘునాథరాయల కాలమునుండియే విస్తారముగాఁ బెంపొందియుండుటంజేసి, కీర్తనలు రచియించిన యితఁడు పదునేడు పదునెన్మిది శతాబ్దులలోనివాఁ డనిపించెడిని. కవి మాతృభూతయ్య యనునతఁడు పారిజాతాపహరణమును యక్షగానముఁగా వ్రాసినట్లును గలదు. ప్రతాపసింహుని దా నాశ్రయించియున్న ట్లాతఁడు చెప్పికొనియున్నాఁడు. ఈతని కాతనికిఁ జాల విధములఁ బోలికలున్నవి. ఇతఁడు కాశ్యపగోత్రుండు, ఆతఁడు శాండిల్యగోత్రుఁడు. ఈవ్యత్యాసము మాత్రము గానవచ్చెడిని, అది వ్రాయసకాండ్రదోషమని యంగీకరించిననాఁడు ప్రతాపసింహునిబట్టి యీతనికాలము పదునేడవ శతాబ్దియనిస, ప్రమాణముగానిరూపింపవచ్చును. ఈ కవికాలాదుల నింతకంటే నిర్ధారింప నవకాశము లంతగాఁ గాన్పింపవు.

ఈ యభినయశాస్త్రము వేదములనుండి యవతరిల్లినది. దానిని బ్రహ్మ గంధర్వులకు నప్పరస్త్రీలకుఁ బ్రప్రథమమున బోధించినాఁడు. వారిమూలమున దేవలోకమందంతటను నది వ్యాప్తి చెందినది. అటుతరువాతఁ గైలాసమున నొకప్పుడు పార్వతికి శివుఁడు దీనిని బోధింపగా నామె భూలోకమందలి ఋషులకు దీనిని దెల్పెను. వారు సౌరాష్ట్రదేశమునందలి స్త్రీలకు దీనిని గఱపిరి. ఇట్లు క్రమక్రమముగా భూలోకమున దేశదేశములకు నిది వ్యాపించినది.

ఈయభినయశాస్త్రము నాట్యశాస్త్రమున కెల్లఁ దలమానిక. కేవలము హస్తవిన్యాసాదులమూలమును నెట్టి భావములనైనను హృదయగతములఁగాఁ జేయుట దీనియందలి యొకవిశిష్టత. ఇది యొకయసాధారణ శిల్పకలావిన్యాసము. ఇట్టిది భారతీయుల యసామాన్యప్రభావిశేషములఁ జాటిచెప్పు నొకశాస్త్రరాజ మనుటకు సంశయింపఁ బని లేదు. ఈశాస్త్రగ్రంథమును దెనుఁగున నొకప్రబంధముగా నవతరింపఁజేసిన యీకవితల్లజునకుఁ గలకాల మాంధ్రలోకము కృతజ్ఞతము గాకతీఱదు. గ్రంథము చిన్నదియేయైనను దీనివలని ప్రయోజనము చాలగొప్పదియే! ఇట్టి గ్రంథరాజమును దాటియాకులలో చూర్ణముఁ గానీయక యుద్ధరించి ప్రచురించిన ప్రాచ్యభాండాగారమువారు మన కెంతయుఁ బ్రశంసాపాత్రులు.