పన్నా

క. ఇప్పుడు నయ్యుత్తమసతి| నప్పురమున నొప్పువార లతిముద మెదలం
   జొప్పడ గీర్తనసేయుదు| రిప్పరసున నుండవలదె యింతులు పుడమిన్.
[చింతామణి.]

మేవాడదేశపు రాజగు సంగ్రామశింహుడు మృతుడయినవెనుక నాతని పుత్రులు ముగ్గురిలో నిరువురు స్వల్పకాలమే రాజ్యము పాలించి పరలోకమున కేగిరి. మూడవవాడగు ఉదయసింహు డైదేండ్లప్రాయము కలవాడయి దాదిపోషణలోనే యుండెను. ఈతని దాదిపేరు పన్నా. ఈ పన్నాకు రాజధాత్రిత్వము వంశపరంపరగా వచ్చుచుండెను. ఈమె సుగుణములు మిగుల విలువగలవని తెలుపునటుల గాబోలును నవరత్నములలోని దగు * (పన్నా పచ్చ) యని తలిదండ్రులామెకు బేరిడిరి. పన్నా వారిడిన నామమునకు దగు గుణవతి యయ్యెను.

సంగ్రామసింహుని పుత్రు లిరువురును స్వర్గస్థులైనపిదప, నుదయసింహుపేర పృథివీరాజునకు దాసీపుత్రుడగు బనబీరుడు రాజ్యము నడుపునట్లేర్పాటు చేయబడెను. బనబీరుని జన్మమువలెనే గుణమును నీచమైనదియేగాన, వాడు తాననర్హుడయినను,


  • ఈమె పేరు ఒకానొక తెలుగు గ్రంథకారుడు మోతి (ముత్యము) యని వ్రాసినాడుగాని యందు కాధారమేమియు రాజపుతానా చరిత్రమునందు గానరాలేదు. అదృష్టవశమున దనకు రాజ్యమును రాజపాలకత్వమును దొరకుటకు సంతసించి యుండక, రాజ్యము తనకే శాశ్వతముగానుండు నుపాయము విచారింపసాగెను. ఇట్లు విచారింపగా రాజపుత్రుని నెటులయిన జంపక తనకు రాజ్యము దొరకదని వాడు తెలిసికొని, యెవ్వరికి నెరుకపడకుండ తానే యా పనిని జేయ నిశ్చయించుకొనెను. ఆ నీచుడు తనకృత్యమించుక బైలపడిన యెడల రజపూతు సరదార్లు తనను దెగజూతురని యెరిగినవాడుకాన, పైకి మిగుల సత్ర్పవర్తనగలవానివలె నగుపడు చుండెను. రాజపుత్రుని నెటులయిన దానుజంపి యాద్రోహమితరులపై నిడి సరదార్ల సమ్మతిచే దానేరాజగు నుపాయము నాతడు యోచింపుచుండెను.

బనబీరుని మనమునందిట్టి ద్రోహము కలదని యేరికిని సంశయమయినను రాకుండెను. గాని యిట్టి పాపవిచారము బైలపడకుండుట దుస్తరముగాన నాతని దుష్టవిచారమంతయు సమీపమునందుండు మంగలివా డొకడు తెలిసికొనెను. వాడును పన్నావలెనే ప్రభు భక్తుడు. వానికి బనబీరుని పరిపాలనమే యసమ్మతము బనబీరుడు తన దుష్టత్వ మెంత గుప్తముగా నుంచినను, పరమేశ్వరుడు ఆ పాపమున కంతకును నీ మంగలివాని నొకనిని సాక్షిగా నియమించెను. బనబీరుడే సమయమునం దేమియాలోచన చేసినను బహు యుక్తులచే నీ మంగలి యప్పుడే దానిని గనిపెట్టుచుండెను.

ఇట్లుండగా నొకనాటిరేయి రాజనగరమునం దంతటను నిశ్చలముగానున్న సమయమున, పన్నా రాజపుత్రుని వానితో సమవయస్కుడగు తన పుత్రుని నిదురపుచ్చి తాను సమీపమున నేదో కుట్టుకొనుచు కూర్చుండెను. ఇంతలో ద్వారమావల నేమో కాలుచప్పుడు వినవచ్చినందున నాదాది లేచి చూచెను. అప్పుడు పైని జెప్పబడిన మంగలివాడు మిగుల నాతురతతో వచ్చుటగని, పన్నా "నీవింత తొందరగావచ్చి పిచ్చివానివలె నాతురడవయ్యెదవేమి? యేదియేని యప్రియమా? యని యడిగెను. అందుకా నా పితుడు "అవును మిగుల ఘాతకాబోవుచున్నది. ఇంక నొక గడియ కాబనబీరుడు రాజపుత్రుని జంప నిట కేతెంచెను." ఈ వాక్యములు చెవిని సోకగానే పన్నా దేహము ఝుల్లుమన నొక యూర్ధ్వశ్వాసను విడిచి యిట్లనియె. "నే నిన్నిదినములు వచ్చునని భీతిల్లుచుండినదే నేడు ప్రాప్తమయ్యెను. ఆదుష్టునిపై నా కిదివరకే యనుమాన ముండెను. కాని నే నాడుదాననగుటచే నేమిచేయుటకు జాలకుంటిని. ఏది యెటులైనను నిప్పుడు రాజపుత్రుని రక్షించుట మన కర్తవ్యము" అందుకా మంగలి "యది బహుదుర్ఘటము. అయినను నీకేదేని యాలోచన దోచినచో త్వరగా జెప్పుము. నీవెట్టి కార్యము చెప్పినను నేను నిర్వహింపగలను" అనెను. తదనంతరము పన్నా యొకించుక విచారించి "రాజపుత్రుని నొకానొక సుస్థలమునకు గొనిపోవుదమ"ని చెప్పెను. "అట్లు చేయుటకు వీలులేదు. నే డే బాలకులను రాజనగరు వెలుపలికి గొనిపోకుండ పాపాత్ముడు కట్టడి చేసెను." పన్నా అటులైన నీ రాజపుత్రుని నొక తట్టలో బెట్టి పైన పెంట బోసి నీ కిచ్చెదను. నీవు దానిని గొనిచని సురక్షితమగుచోట నుంచు నంతలో నేనచటికి వత్తును." మంగలి "బనబీరు డింతలో నిచటికి రాగలడు. వచ్చువర కిచట రాజపుత్రుడు లేకుండెనేని తక్షణము చారులచే వెతకించి పిల్లని చెప్పించును. అటులైన రాజపుత్రుని ప్రాణములను మనము కాపాడనేరము." పన్నా కొంచెము యోచించి మిగుల గాంభీర్యముగా "ఇందు కంతగా విచారింప నేల? వా డిచటికి వచ్చినయెడల రాజపుత్రు డిచట లేడనుమాటనే వానికి దెలియనియ్యను. రాజబాలుని నగలను, బట్టలను నా బిడ్డనికి నలంకరించి యా పక్కమీదనే పరుండ బెట్టెదను! నాపుత్రుని మరణమువలన మేవాడదేశపురాజును, మా ప్రభుడును నగు నీ బాలుడు రక్షింపబడును. కాన నా కదియే పరమ సమ్మతము" పన్నా దృడ నిశ్చయముగా బలికిన వాక్యములనువిని, యా నాపితుడు మిగుల నాశ్చర్యముతో నేమియు ననక నిలువబడి యుండెను. ఇంతలో పన్నా రాజపుత్రుని నొక తట్టలో నునిచి, పైన పుల్లాకులు, పెంట మొదలయినవి పోసి, యాతట్ట త్వరగా గొనిచెనమని యా సేవకుని తొందరపరుపసాగెను. దీని నంతను గని పన్నా ధైర్యమునకును, రాజభక్తికి వింతపడి దానియం దధికదయగలవాడై యాభృత్యుడు "పన్నా! నీవింత సాహసకార్య మేల చేసెదవు? ఇంకను నీ మనంబునం దించుక విచారింపుము," పన్నా! "విచారింప వలసిన దేమున్నది? నా కర్తవ్యము నేను చేయుటకు దగిన విచారము చేసినాను. నీవిట్టి యాటంకములనే చెప్పుచు నిచట నాలస్యము సేయకు." ఎంతచెప్పినను పన్నా వినదని తెలిసికొని తా నాలస్యము చేసిన రాజపుత్రుని ప్రాణము దక్కదని యెరిగిన వాడగుటచే వాడా తట్టను నెత్తిన నిడికొని రాజనగరు వెలుపలి కరిగెను. పన్నాదాయియు రాజపుత్రుని యలంకారములను తన పుత్రునకు నలంకరించి, వానిని రాజబాలుని పాన్పుపై నిదురబుచ్చెను. ఇటులా రాజభక్తిగల యువతి తన పుత్రుడు నిదురింపుచుండ తానా పక్క సమీపమునందుండి బనబీరుని రాకకై నిరీక్షింపుచుండెను. ఇంతలో నా కాలస్వరూపుడచటికి వచ్చి మిగుల దయగలవానివలె రాజపుత్రుని దేహము స్వస్థముగా నున్నదాయని పన్నానడిగి, వానిని జూచెదనని పక్క యొద్ది కరిగెను. ఆ ప్రకారమచటి కరిగి, వాడు నిదురింపు చున్నవా రెవ్వరని విచారింపక నా యర్భకుని పొట్టలో కత్తి పొడిచి పారి పోయెను. వాడట్లు పొడవగా నా బాలుడొక కేక వేసి ప్రాణములు విడిచెను. ఆ కేక రాజభవనమునం దంతటను వినబడి జనుల నందరిని లేపెను.

ఆ కేక విన్నతోడనే రాజభవనమునందలి వారంద రచటికి వచ్చిరి. వారు వచ్చి చూచునప్పటికి రాజపుత్రుని దేహ మంతయు రక్తమయమయి, యా బాలుడు ప్రాణములనువిడచి యుండెను. పన్నా దాయి యాబాలుని సమీపముననే దేహము తెలియక పడియుండెను. చచ్చినవాడు రాజపుత్రుడేయనితోచుటచే జనులందరు మిగుల దుఖించిరి. పన్నా సేదదేరినపిదప రాజపుత్రుని జంపినవా రెవ్వరని యడుగగా "నొక నల్లటి పురుషుడెవడో చంపెన"ని చెప్పెను. రాజపుత్రుని జంపిన వారెవ్వరోయని యనేకు లూహించిరి. కాని సాక్షులు లేనందున దానిని నిశ్చయింపలేకుండిరి. పన్నాదాయి యచటనుండి వెడలి రాజకుమారుని దాచినస్థలమునకరిగి యాబాలుడు ప్రౌడుడగువరకు నాతనిని పోషించెను. ఈ సంగతి యంతయు రజపూతులకు దెలియగా వారు ఉదయసింహుడు పెరిగినపిదప బనబీరుని దేశము వెడలగొట్టి ఉదయసింహునినే రాజునుగా స్వీకరించిరి. ఇట్లొక రాజభక్తిగల యువతివలన సంగ్రామ సింహుని వంశము నిలిచెను. అనేక ప్రజలను గాపాడు ప్రభువు బ్రతికెను. కాన నట్టి యువతికీర్తి భరతఖండమునందంతటను నిండియుండుట వింతగాదు. ఉదయ సింహుడు పన్నాను తల్లినిగా భావించి పూజింపుచుండెను.


_______